22, ఫిబ్రవరి 2019, శుక్రవారం

పరిశ్రమ మీద వ్యవసాయ విప్లవ ప్రభావం


మార్క్స్ కాపిటల్     విభాగం.30
పరిశ్రమ మీద వ్యవసాయ విప్లవ ప్రభావం
పారిశ్రామిక పెట్టుబడికి అంతర్గత మార్కెట్ ఏర్పడడం
భూముల ఆక్రమణకు ముందు కొందరు స్వయం పోషక వ్యవసాయదారులు తమ ఉత్పత్తుల్ని  వినియోగవస్తువులుగా చేసి. వాటిని అమ్ముకునేవాళ్ళు. ఉదా. గొర్రెల్ని పెంచి, ఊలుని దారం వడికి, బట్ట నేసి అమ్ముకునేవాళ్ళు. వాళ్ల భూముల్ని ఆక్రమించి వాళ్లని వెళ్ళగోట్టిన తర్వాత పరిస్థితి మారింది. 
భూముల ఆక్రమణ పర్యవసానాలు:
1.వ్యవసాయదారులు కూలీలుగానూ, భూ యజమానులు వ్యవసాయ పెట్టుబడిదారులుగానూ పరివర్తన చెందారు.
2.భూమితో పాటుగా ముడిపదార్ధాలు కూడా వ్యవసాయ పెట్టుబడిదారుల ఆస్థిగా మారాయి.
3.స్వతంత్ర చేతివృత్తుల ఉత్పత్తి ధ్వంసం అయింది. ఈ చాప్టర్ దృష్టి ఈ అంశం మీదే కెంద్రీకృతమైంది.
స్వయం పోషక వ్యవసాయదారులు తగ్గిపోవడం
వ్యవసాయ ప్రజల భూముల్ని లాక్కొని వాళ్లని వెళ్ళగొట్టడం - అనే కర్యక్రమం అప్పుడప్పుడూ జరిగేది. అయితే మళ్ళీ మళ్ళీ జరిగుతుండేది.పట్టణ పరిశ్రమలకు కార్మికుల సరఫరా ఉండేది. వాళ్ళు వృత్తిసంఘాలతో ఏవిధమైన సంబంధమూ లేనివాళ్ళు. ఉండేది కాదు.ఈవిషయం మనకు తెలిసిందే.  స్వయం పోషక వ్యవసాయదారుల సంఖ్య తగ్గడం, పారిశ్రమల్లో కార్మికుల సంఖ్య పెరగడానికి అనుగుణంగా జరిగేది. అంతే కాదు. సాగు పద్ధతులు మెరుగయ్యాయి. సహకారం పెరిగింది.ఉత్పత్తి సాధనాల కెంద్రీకరణ జరిగింది. మరొకపక్క వ్యవసాయ కార్మికులమీద పని ఒత్తిడి తీవ్రతరం అయింది.అంతే కాకుండా, తమకోసం పనిచేసుకునే ఉత్పత్తిరంగం అంతకంతకూ కుంచించుకు పోయింది. అందువల్ల వ్యవసాయదారుల సంఖ్య తగ్గినప్పటికీ, వాళ్ళ కమతాల్లో ఉత్పత్తి పరిమాణం అంతకు ముందు ఎంతో అంతే గానీ, అంతకు మించిగానీ ఉండేది.
జీవితావసర వస్తువులూ, ముడిపదార్ధాలూ పెట్టుబడిలో భాగాలు కావడం
వ్యవసాయ ప్రజల్లో కొంత భాగం విడుదల కావడంవల్ల, వాళ్ళు అప్పటిదాకా వాడుకున్న జీవితావసర వస్తువులు కూడా విడుదల అవుతాయి. ఇప్పుడవి అస్థిర పెట్టుబడిలోని భౌతిక అంశాలు అవుతాయి. వెళ్లగొట్టబడ్డ వ్యవసాయదారుడు జీవితావసర వస్తువుల్ని తన కొత్త యజమాని అయిన పారిశ్రామిక పెట్టుబడి దారుడి నుండి వేతనాల రూపంలో కొనుక్కొవాల్సిందే. జీవితావసర వస్తువులకు వర్తించేదే కుటుంబ వ్యవసాయం వల్ల ఉత్పత్తయ్యే పారిశ్రామిక ముడిసరుకులకూ వర్తిస్తుంది. ఉదాహరణకి, 2 ఫ్రెడరిక్ కాలంలో వెస్ట్ ఫేలియా వ్యవసాయదారుల్లో కొందరు జనుంతో దారం వడికే వాళ్ళు. వాళ్ల భూముల్ని లాక్కొని వాళ్లని తరిమివేశారు.
1.ఇప్పుడిక మిగిలిన వాళ్ళు పెద్ద వ్యవసాయదారులకింద దినకూలీలుగా మారారు. అదే సమయంలో జనుముని వడికేవీ, బట్ట నేసేవీ పెద్దపెద్ద సంస్థలు ఏర్పడ్డాయి. విడుదలయిన మనుషులు వాటిలో ఇప్పుడు కూలికి పనిచేస్తున్నారు.
2.జనుము ఇంతకుముందు ఎలాఉందో ఇప్పుడూ అలానే ఉంది. అందులో ఒక్క పొగు అయి నా మారలేదు. కాని దాని శరీరంలో కొత్త సామాజిక ఆత్మ ఆకస్మికంగా వచ్చి చేరింది. ఇప్పుడది కార్ఖానా యజమాని స్థిర పెట్టుబడిలో భాగంగా ఉంది.
3.అంతకుముందు చిన్న ఉత్పత్తిదారులు తామూ, తమకుటుంబాలూ ఉత్పత్తిచేసిన జనుముని తామే వడికే వాళ్ళు. ఇప్పుడు అది ఒక పెట్టుబడిదారుడి చేతిలో కేంద్రీకృతమై ఉంది. అతను వడకడానికీ నెయ్యడానికీ ఇతరుల్ని నియమిస్తాడు.
4. మునుపు వడకడానికి వ్యయమయిన అదనపు శ్రమ చాలా వ్యవసాయ కుటుంబాలకు ఆదాయమ అయ్యేది. ఇప్పుడు అది కొద్దిమంది పెట్టుబడి దారులకు మాత్రమే లాభం అవుతున్నది.
5.అప్పుడు దేశమంతటా చెల్లాచెదరుగా ఉన్న కదుళ్ళూ, మగ్గాలూ, ఇప్పుడు శ్రామికులతోటీ, ముడిపదార్ధాలతో కలిసి కొన్ని భారీ శ్రామిక బారకాసుల్లో కేద్రీకృతమయ్యాయి.
6.అప్పట్లో కదుళ్ళూ, మగ్గాలూ, ముడిపదార్ధాలూ వడికే వాళ్ళకీ, నేసేవాళ్ళకీ స్వతంత్ర మనుగడ సాధనాలుగా ఉండేవి. ఇప్పుడవి వాళ్ళమీద పెత్తనం చేస్తూ, వాళ్ళనుండి అదనపు శ్రమని పీల్చే సాధనాలుగా మారాయి.
 పెద్దపెద్ద కార్ఖానాల్నీ, వ్యవసాయ క్షేత్రాల్నీ చూసినప్పుడు, అవి అనేక చిన్న చిన్న ఉత్పత్తి కేంద్రాల్ని ఒక్కటిగా కూర్చడం వల్లనే, ఎందరో సన్నకారు స్వతంత్ర ఉత్పత్తిదారుల ఆస్థుల ఆక్రమించడం వల్లనే ఏర్పడ్డాయనే విషయం బోధపడదు.
స్థానిక మార్కెట్ ఏర్పడడం 
వాస్తవానికి సన్నకారు వ్యవసాయదారుల్ని వేతన కార్మికులుగానూ, వాళ్ళ జీవితావసర సాధనాల్నీ, శ్రమ సాధనాల్నీ పెట్టుబడి భౌతిక అంశాలుగా  మార్చిన సంఘటనలు, అదే సమయంలో వాటికి (జీవితావసర వస్తువులకీ, శ్రమ సాధనాలకీ) స్థానిక మార్కెట్ ని కూడా సృష్టించాయి. గతంలో వ్యవసాయదారుని కుటుంబం జీవితావసర వస్తువుల్నీ, ముడిపదార్ధాల్నీ ఉత్పత్తిచేసేది. వాటిలో ఎక్కువ భాగం ఆ కుటుంబమే వినియోగించుకునేది. అవే ముడిపదార్ధాలూ, అవే జీవితావసర వస్తువులూ ఇప్పుడు సరుకులయ్యాయి.వాటినిప్పుడు పెద్ద వ్యవసాయదారుడు మార్కెట్లో అమ్ముతాడు. కార్ఖానాల్లో అతనికి మార్కెట్ లభిస్తుంది. దారం, బట్ట,ముతక ఊలు బట్టలు - వీటి ముడిపదార్ధాలు గతంలో ప్రతి రైతు కుటుంబానికీ అందుబాటులో ఉండేవి. కుటుంబమే తనసొంత వినియోగం కోసం దారం వడికి, బట్టనేసేది. ఇప్పుడు అవి కార్ఖానా ఉత్పత్తులుగా మారాయి. ఆ వెంటనే గ్రామీణ ప్రాంతాలు ఆసరుకులకు మార్కెట్లుగా ఉపకరించాయి. అప్పట్లో సొంతానికి పనిచేసే చిన్న ఉత్పత్తిదారులు ఎంతోమంది ఉండేవాళ్ళు. వాళ్ళ ఉత్పత్తులు కోనే వాళ్ళు చెల్లాచెదరుగా ఉండేవాళ్ళు.ఇప్పుడు వాళ్ళు పారిశ్రామిక పెట్టుబడి సమకూర్చిన ఒక భారీ మార్కెట్లో కేంద్రీకృతం అయినారు.
గ్రామీణ గృహ పరిశ్రమ ధ్వంసం అవడం
ఆవిధంగా స్వయంపోషక వ్యవసాయదారుల ఆస్థి హరణమూ, వాళ్లని ఉత్పత్తి సాధనాల నుండి వేరుపరచడమూ - వీటితో పాటే గ్రామీణ గృహ పరిశ్రమ విధ్వంసం అయింది. తయారీ పరిశ్రమా, వ్యవసాయమూ వేరై పోయాయి. ఒక దేశ గ్రామీణ గృహ పరిశ్రమ విధ్వంసం మాత్రమే, ఒక దేశ అంతర్గత మార్కెట్ కి  పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం కాంక్షించే విస్తృతినీ, నిలకడనీ ఇవ్వగలుగుతుంది. అయితే అసలైన తయారీ పరిశ్రమ కాలంలో మార్పు పూర్తిగానూ, వేగంగానూ జరగలేదు. తయారీ పరిశ్రమ జాతీయ ఉత్పత్తి రంగాన్ని  పాక్షికంగా మాత్రమే జయిస్తుందనీ, దానికి పట్టణ చేతివృత్తులూ గ్రామీణ గృహ పరిశ్రమ అంతిమ ప్రాతిపదికగా ఉంటాయనీ గుర్తుంచుకోవాలి. 
చిన్న గ్రామీణుల వర్గం ఏర్పడడం
తయారీ పరిశ్రమ గనక ఒకరూపంలో వీటిని (పట్టణ చేతివృత్తుల్నీ,  గ్రామీణ గృహ పరిశ్రమనీ) కొన్ని శాఖల్లో, కొన్నిచోట్ల నాశనం చేస్తే, అవి మరలా మరొకచోట ఏర్పడతాయి.  కారణం ఒక దశ దాకా ముడిపదార్ధాల తయారీ పరిశ్రమకి అవి అవసరం. కాబట్టి అది చిన్న గ్రామీణుల వర్గాన్ని ఏర్పాటు చేస్తుంది. వాళ్ళు సేద్యాన్ని అనుబంధ వృత్తిగా అనుసరిస్తూనే, పారిశ్రామిక శ్రమని ప్రధాన వృత్తిగా పెట్టుకుంటారు. తమ పారిశ్రామిక శ్రమ ఉత్పత్తుల్ని నేరుగానో, మధ్య వర్తకుల ద్వారానో కార్ఖానా దారులకు అమ్ముతారు. అటువంటి కొత్త వర్గాన్ని తయారుచేసుకుంటుంది.
ఇంగ్లండ్ చరిత్ర విద్యార్ధిని మొదట తికమకపెట్టే కారణల్లో ప్రధానమైనది కాకున్నా, ఇదీ ఒక కారణమే. 15 శతాబ్దం చివరి మూడో భాగంలో గ్రామాల్లో పెట్టుబడి దారీ వ్యవసాయం చొచ్చుకొస్తున్నట్లూ, వ్యవసాయదారులు అంతకంతకూ అధికంగా నశించిపొతున్నట్లూ అప్పుడప్పుడూ తప్ప నిరంతరాయంగా ఫిర్యాదులు వస్తుండేవి.మరొకవైపు, వ్యవసాయదారులు కొద్ది సంఖ్యలోనే అయినా, ప్రతిసారీ హీనతర స్థితిలోనే అయినా, తిరిగి రావడాన్ని చరిత్రకారుడు గమనించాడు.
అలా జగడానికి ప్రధాన కారణం: ఇంగ్లండ్ ఒక సమయంలో ప్రధానంగా ధాన్యం పండించేది, మరొక సమయంలో ప్రధానంగా పశుపోషణ చేసేది. అలా మార్చుకుంటూ ఉండేది. ఈ మార్పులమూలంగా వ్యవసాయ విస్తీర్ణం హెచ్చుతగ్గులకు లోనౌతూ వచ్చింది.
పెట్టుబడిదారీ వ్యవసాయానికి పునాది భారీ స్థాయి పరిశ్రమ
పెట్టుబడిదారీ వ్యవసాయానికి యంత్రాల రూపంలో నిలకడైన పునాదిని   సమకూర్చేది భారీ స్థాయి పరిశ్రమ మాత్రమే. మెజారిటీ వ్యవసాయ ప్రజల భూముల్ని ఆక్రమించి, వ్యవసాయం నించి దారం తియ్యడంలోనూ, బట్ట నెయ్యడంలోనూ వేళ్ళూనుకొని ఉన్న గ్రామీణ గృహ పరిశ్రమ వేరుపడదాన్ని పూర్తి చేసేదీ భారీ పరిశ్రమే.  స్వదేశీ మార్కెట్ మొత్తాన్ని మొట్ట మొదటగా పారిశ్రామిక పెట్టుబడికి జయించి  పెట్టేదీ భారీ పరిశ్రమే.
వచ్చే పోస్ట్: పారిశ్రామిక పెట్టుబడి దారుడి పుట్టుక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి