11, జనవరి 2021, సోమవారం

అమెరికాలో పోయిన ఉద్యోగాలు ఎప్పటి కొచ్చేను?

 

అమెరికాలో పోయిన ఉద్యోగాలు ఎప్పటి కొచ్చేను?

BLS అమెరికా డిసెంబర్ ఉద్యోగ నివేదిక జనవరి 8 న విడుదలయింది. దాని ప్రకారం డిసెంబర్ లో 1,40,000 పోయాయి. కొందరు ఆర్థికవేత్తలు 70,000 వస్తాయని చెప్పారు. కానీ  అంచనా తప్పింది. గడచిన 8 నెలల్లో ఉద్యోగాలు పోవడం ఇదే మొదటిసారి. నాలుగో త్రైమాస్యంలో 8.5% ఆర్థికవృద్ధి అంచనా ఉన్నప్పటికీ, ఉద్యోగాలకు దెబ్బతగిలింది. దీర్ఘకాల నిరుద్యోగులు (27 వారాలు, అంతకుమించి ఉద్యోగంలో లేనివాళ్లు) 27,000  మంది పెరిగి, మొత్తం 39,56,000 మందయ్యారు. కోవిడ్ కి ముందు ఫిబ్రవరిలో 11,02,000 .అప్పటితో పోలిస్తే 28,54,000 మంది ఎక్కువ.

ఎక్కువ ఉద్యోగాలు పోయిన రంగాలు

ఎక్కువ దెబ్బతగిలింది ఆతిధ్యరంగానికి.. ఈ రంగంలో దాదాపు 5 లక్షల మందికి  పనులు పోయాయి.

 బార్లలో , రెష్టారెంట్లలో 3,72,000 పోయాయి. 2020 జనవరి నించీ ఆతిధ్య రంగంలో 39 లక్షలు పోయాయి.

ప్రయివేట్ విద్యా రంగంలో 63,000 .

 ప్రభుత్వ ఉద్యోగాలు 45,000 ,

 ఇతర సర్వీసుల్లో 22 ,000 పోయాయి.

ఉద్యోగాలు వచ్చిన రంగాలు

అలాగని అన్నిరంగాల్లోనూ పోలేదు. కొన్ని రంగాల్లో వచ్చాయి కూడా.

ప్రొఫెషనల్ సర్వీసుల్లో, బిజినెస్ సర్వీసుల్లో 1,61,000,

 రిటైల్ రంగంలో 1,21,000,

 నిర్మాణ రంగంలో 51,000,

రవాణా రంగంలో 47,000

ఆరోగ్య సంరక్షణ రంగంలో 39,000,

టోకు వర్తక రంగంలో 25,000 వచ్చాయి.

కోవిడ్  మొదలయ్యాక పోయిన ఉద్యోగాలు

మార్చ్ లో     8,70,000

 ఏప్రిల్ లో 2,06,87,000 

డిసెంబర్ లో 1,40,000

3 నెలల్లో  పోయినవి మొత్తం -   2,16,97,000

7 నెలల్లో వచ్చిన ఉద్యోగాలు

 మే         26,99,000

జూన్         47,91,000

జులై          17,34,000

ఆగస్ట్         14,89,000

సెప్టెంబర్     6,72,000

అక్టోబర్      6,54,000

నవంబర్    3,36,000

వచ్చిన ఉద్యోగాలు మొత్తం – 1,23,75,000

ఇంకారావలసినవి

 మార్చ్,  ఏప్రిల్, డిసెంబర్ 3 నెలల్లో  పోయినవి మొత్తం -    2,16,97,000

 7 నెలల్లో వచ్చిన మొత్తం              –                                 1,23,75,000

కొరవ రావలసినవి-                                  -                         93,22,000

కోవిడ్ కి ముందుస్థాయి రావాలంటే  93,22,000 ఉద్యోగాలు రావాలి.

ఇన్ని రావడానికి పట్టే  కాలం

ఒక సంవత్సరంలో రావాలంటే నెలనెలా 7.75 లక్షలు  రావాల్సి ఉంటుంది. అన్నన్ని వస్తాయని ఆశించలేము. 4 లక్షల చొప్పున వచ్చినా, నెల తక్కువగా  రెండేళ్లు పడుతుంది. 2.5 లక్షల చొప్పున వస్తే, 3 ఏళ్ళు. ఏమైనా  ఒకటి రెండేళ్లలో పోయిన ఉద్యోగాలన్నీ వచ్చే సూచనలు  కనబడడం లేదు.

మరి నవంబర్ దాకా బాగానే వచ్చాయి కదా? 7 నెలల్లో1,23,75,000 నెలల్లో వచ్చినప్పుడు 93,22,000 రావడానికి అయిదారు నెలలు చాలుకదా! అనిపించవచ్చు.

కానీ అందుకు  అవకాశమే లేదు. ఆ 7 నెలల సగటు 17,68,000 లెక్కన అన్ని నెలల్లోనూ రావడం సాధ్యం అవదు. ఎందుకంటే, 7 నెలల్లో కూడా అన్నో, అంతకు మించో వచ్చింది,  3 నెలల్లోనే. మిగిలిన 4 నెలల సగటు 7,88 ,000.

సెప్టెంబర్ నించీ ఊపుతగ్గింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్  3  నెలల సగటు 5,54,000. డిసెంబర్లో ఉద్యోగాలు పోయాయి.

పోయింది ఒక్క నెలలోనే కదా. వచ్చే నెలల్లో రావచ్చు, అంటే రావచ్చు. కానీ కావలసినన్ని వస్తాయా?  మార్చ్ లో, ఏప్రిల్ లో  పెద్దస్థాయిలో  వ్యాపారాలు మూతబడ్డాయి. అయితే  మే, జూన్ లలో తిరిగి ఒక స్థాయిలో తెరుచుకున్నాయి. కనక  ఆ రెండు నెలల్లో  బాగా వచ్చాయి. ఆతర్వాత కూడా వచ్చాయి గాని అంత ఎక్కువ రాలేదు. రాబోయే నెలల పరిస్థితి చెప్పలేము. కానీ భారీ సంఖ్యలో వస్తాయని మాత్రం అనుకోలేము.    

కోవిడ్  కి ముందు స్థాయి ఎప్పటికొస్తుందో అంచనా వెయ్యడం కష్టం అని వేరే చెప్పక్కర్లేదు.

2020 ఫిబ్రవరి నించీ 2 కోట్లా 25   లక్షలమందికి కోవిడ్  సోకింది. వాళ్లలో 378,204 మంది మరణించారు. కొత్త సంవత్సరం పది  రోజుల్లో 28,895  మంది చనిపోయారు. జనవరి 8 వతేదీన  24  గంటల్లో 306,449 మందికి సోకింది.    ఒక్క రోజూ  ఇంతమందికి సోకలేదు 3,969 మంది చనిపోయారు. 7 వ తేదీన 4245  మంది చనిపోయారు. దానివల్ల ఏ  ఒక్క రోజూ ఇంతమంది చనిపోలేదు.  దీన్ని బట్టి 10  నెలల తర్వాత కూడా  పరిస్థితి కంట్రోల్ లోకి రాకపోగా, తీవ్రం అవుతున్నట్లు తేలుతుంది. BLS ప్రకారం డిసెంబర్లో యజమానులు మూసినందువల్లనో, కోవిడ్ వల్లనో  1,58,00,000 మంది పనులకు పోలేకపోయారు. నవంబర్ కంటే డిసెంబర్లో 10 లక్షల మంది ఎక్కువ. మరి పరిస్థితులు ఎలా చక్కబడతాయి? రికవరీ ఎలా వీలవుతుంది?

ఎకానమీ ఎత్తుకోవాలంటే ముందు అందరికీ టీకా పడాలి. టీకా అందరికీ అందేసరికి ఎంతకాలం పడుతుందో! ఈ కార్యక్రమం ఎంత వేగంగా జరుగుతుందో, ఎప్పటికి పూర్తయి ఫలితాలనిస్తుందో మరి!

ఉద్యోగాలు రావాలంటే

·         ముందు కోవిడ్ కంట్రోల్ కావాలి.

·         వాక్సిన్ వెయ్యడం త్వరగా పూర్తి అవాలి.

·         అలాగే ఉద్దీపన భారీగా ఉండాలి . ఇప్పుడిచ్చే 900  బిలియన్ డాలర్లు చాలవు. సరిపోయేటంత ఇవ్వాలి. కానీ అలా ఇస్తే జనం పనుల్లోకి రారు అనేది కార్పొరేట్ల వాదన. పాలకవర్గాల అభిప్రాయమూ అదే. 

ప్రభుత్వ ఉద్దీపన అవసరం. లేకుంటే, మిలియన్ల మందికి పొడిగించిన భృతి మార్చ్ తో ముగిసి పోతుంది. కాబట్టి దాన్ని కొనసాగించడానికి కొత్త ఉద్దీపన కావాలి. అంతే కాదు  ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎంత అవసరమైతే అంత ఇవ్వాలి. అనుభవాన్నిబట్టి,  ప్రభుత్వం అలా ఇస్తుందని అనుకోలేము. కాబట్టి పోయిన ఉద్యోగాలు అన్నీ త్వరలో రావు.

గత మాంద్యాల అనుభవాలు

గత అనుభవాలు ఈసారీ అలాగే అవుతుందేమో అనే భయం కలిగిస్తున్నాయి.1981-82 మాంద్యం లో పొయిన ఉద్యోగాలన్ని వచ్చిపనియీడు వాళ్ళకీ వచ్చి అంటే (జాబ్స్ గాప్) పూడేసరికి 41 నెలలు పట్టింది. 1990 మాంద్యానికి 51 నెలలు పట్టింది. 2001 మాంద్యం సంగతికొస్తే 2007 చివరలో మహామాంద్యం ఏర్పడేనాటికి కూడా పూడలేదు. 2008 మహామాంద్యం 86 లక్షలా 63 వేలు  పోయాయి. అవి తిరిగి వచ్చేసరికి 2014 మే వచ్చింది  అంటే 5 ఏళ్ళు పట్టింది.

ఇప్పుడూ అలాగే జరుగుతుంది అనలేముకాని అంత త్వరగా రావని మాత్రం గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉద్యోగాలు పోవడం ఈ నెలతో ఆగుతాయని లేదు. ఆగి, మళ్ళీ రావడం మొదలయిన నెలకు ఎన్ని వస్తాయో చెప్ప లేము. అన్నీ వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు పట్టడం ఖాయం.