9, ఏప్రిల్ 2011, శనివారం

అమ్మ పాలతో ఐస్క్రీం

అమ్మ పాలతో ఐస్క్రీం
మార్కెట్లో మరో సరుకు - ‘బేబీ గాగా
మాతృత్వపు అద్భుతమా? మహిళలపై మరో భారమా?
ఇ. ఎస్. బ్రహ్మాచారి

అమ్మ పాల ఐస్క్రీమొచ్చింది. పేరుబేబీ గాగా’. లండన్ కొవెంట్ గార్డెన్లోఐస్క్రీమిస్ట్స్ రెస్టారెంట్‌’ లో దీన్ని ఈఏడు ఫిబ్రవరి 25 నుంచీ అమ్ముతున్నారు. హాం షైర్ కి చెందిన 44 ఏళ్ళ మాట్ కానర్ దీని సృష్టికర్త. రెస్టారెంట్ని 2009 లో పెట్టాడు.అమ్మ పాలతో ఐస్క్రీం తయారుచేసి సంచలనం కలిగించాడు. ఇది "మాతృత్వపు అద్భుతం" అంటూ, దాన్ని అందరికీ అందుబాటు లోకి తెచ్చానని తన్ను తాను ప్రశంసించుకున్నాడు. నూరేళ్ళుగా ఐస్క్రీముల్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ రాలేదన్నాడు. తానిప్పుడు మహత్తర మార్పు తెచ్చానని గొప్పలుపోతున్నాడు.

తల్లి పాలలో మెడగాస్కన్వెనిలా కాయలూ (Vanilla pods), నిమ్మకాయ తోలు కోరూ (lemon zest) కలిపి చిలుకుతారు. వెయిట్రెస్ మార్టినీ (కాక్టైల్) గ్లాసులో తెచ్చి అందిస్తుంది. అందులో లిక్విడ్ నైట్రోజెన్ని సిరంజ్ ద్వారా వదులుతుంది. దాంతో ఐస్క్రీం చాలా చల్లబడుతుంది, ఎంతో మృదువవుతుంది. అందులో మూడింట రెండొంతులు తల్లిపాలూ, ఒకవంతు క్రీం ఉంటుందనీ పైన వెనిలా, చక్కెర ఉంటాయనీ కానర్ చెబుతాడు.

పాలకోసంమామ్స్ నెట్అనే తల్లుల ఫోరంలో ఆన్లైన్ ప్రకటన ఇచ్చాడు. ఇంటర్నెట్లో ప్రకటనచూచి లీడ్స్ కి చెందిన విక్టోరియా హైలీ అనే 35 ఏళ్ళ మహిళ 30 ఔన్సుల పాలు ఇచ్చింది. 10 ఔన్సుల ధర 25 డాలర్లు. ధరే హైలీని ప్రొత్సహించింది.”నా ఆస్తి ఎక్స్ ట్రా డబ్బుకోసం అమ్ముకుంటే ఏం?” అని మెట్రో అనే ఇంగ్లిష్ పత్రికని అడిగింది.

ఆస్తి సరే, ఎందుకమ్ముతున్నట్లు?

ఆస్తి అన్నదేగాని, ఎందుకు అమ్ముతుందో కూడా అప్పుడే చెప్పింది :
నామటుకు నాకు మాంద్యాన్ని తగ్గించేందుకు పనికొస్తుంది
అసలు విషయం అదే.డబ్బు అవసరం.
హైలీ ఇచ్చాక మరొక 14 మంది సిద్ధమయ్యారు. ఆతర్వాత మరో 35 మంది ఒప్పందం ఖరారుచేసుకున్నారు.
బానిస స్త్రీలు తమపిల్లలకు బదులు యజమానుల పిల్లలకు పాలివ్వాల్సి వచ్చేది. కాదంటే చంపినా చంపేస్తారు. ఈనాడు పేదరికం నుంచి ఉపశమనం పొందేందుకు తల్లులు పాలమ్ముకునేందుకు సిద్దమవుతారు. అప్పుడు ప్రాణభయంతో ,ఇప్పుడు పేదరికం భయంతో. అప్పుడూ ఇప్పుడూ అయిష్టంగానే, తమబిడ్డలకి లేకుండా చేస్తున్నమనే బాధతొనే. అయితే అలాగని చెప్పటం వీలుగాదు. అందుకే మీడియా ముందుకు రావాలనే షరతు. హైలీ ఆస్తి అమ్మితే తప్పేముంది అనడిగింది. తన బాధని చెప్పి ఉంటే ఆమెదగ్గర పాలు కొనరేమో ననే భయం. అప్పుడు యజమానులు హింసించేవాళ్ళు. ఇప్పుడాభయం లేదు. తల్లులు వాళ్ళంతట వాళ్ళే వచ్చి పాలు ఇచ్చి డబ్బుతీసుకు పోతారు.
తిన్నవాళ్ళేమంటున్నారు?

హైలీ రుచిచూచి భలేగా ఉందనీ, నోట్లొ వేసుకుంటేనే కరిగి పోయిందనీ చెప్పింది. మురిసిపోయింది. సెయింట్ లూయీకి చెందిన టాం డూలే అనే ఫైర్ మాన్ ఒకాయన అచ్చు అలాగే : ఇవ్వాళే మొదటిసారి తిన్నాను. చాలాబాగుంది. నిజంగా నోట్లో వేసుకుంటేనే కరిగి పోతున్నది అని తెగ మెచ్చుకున్నాడు. మన పిల్లలకి బాగుంటే మనకీ బాగున్నట్లే అన్నాడు కానర్.

ఏమైనా అంటాడు లాభాలు అంతటివి

30 ఔన్సుల పాలు ( 890 మిల్లి లీటర్లు ) 75 డాలర్లవుతాయి. 50 ఐస్ క్రీములవుతాయి. ఒక్కో ఐస్క్రీం ధర 14 పౌన్లు ( 25 డాలర్లు ). రూపాయల్లో అయితే వెయ్యికి పైమాటే. లెక్కన వాటిని అమ్మితే 1250 డాలర్లొస్తాయి. పాలఖర్చు పోగా మిగిలిన 1175 డాలర్లూ లాభమని కాదు. పాలతోపాటు ఇతర పదార్ధాలుంటాయి. రెస్టారెంట్ ఖర్చులూ దానికి కలుస్తాయి. మెడికల్ టెస్టులకూ డబ్బవుతుంది. అయినా భారీ లాభాలు చేకూరతాయి. ఎంతటివాళ్ళనయినా ఆకర్షించగల లాభాలు అంటే అతిశయోక్తి కాదు. ఎంతొస్తుందోననే లెక్కల్లో తలమునకలై ఉండి ఉంటాడు కానర్..
కొద్దిరోజుల్లోనే చాలా పాపులర్ అయింది. ఇంకేం ఎగిరి గెంతేశాడు.ఎందుకువెయ్యడూ? లాభాలు అంతటివి

నిషేధమూ- ఎత్తివేతా

ఇంతలో బ్రిటిష్ వాళ్ళిద్దరిచ్చిన ఫిర్యాదుతో వెస్ట్ మినిస్టర్ కౌన్సిల్ అమ్మకాలు నిలిపింది.మనుషులు తినడానికి పనికొస్తుందో లేదో చూడాలంది. మరొక మనిషి శరీర ద్రవాలతో తయారయ్యే ఆహార పదార్ధాలు వైరస్ వ్యాప్తికి దారితీయవచ్చు- ఈసందర్భంలో హెపటైటిస్ వైరస్. కౌన్సిల్ ఆఫీసర్లు దాన్నిఎత్తుకెళ్ళి ఫూడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీకి పంపించారు. తగిన పరీక్షలు చేసి. చివరకి అది సురక్షితమైనదేనని ఏజెన్సీ తేల్చి చెప్పింది.
అందులో హానిచేసే బాక్టీరియా గానీ, వైరస్ గానీ లేదని లాబ్ నుంచి మాకు వచ్చింది. మాపరిశోధన ముగిసినట్లేనని రిఛర్డ్ బ్లాక్ అనే ఫుడ్ సేటీ మేనేజర్ ప్రకటించాడు. కౌన్సిల్ నిరాటంకంగా అమ్ముకోవచ్చన్నది.
ఇకనేం, కానర్ కి అడ్డూ ఆపూ లేకుండా పోయింది. మరీ పైకెగిరి గెంతులేశాడు. ఇదీ ఆయనికి ఖర్చులేని పబ్లిసిటీ అయింది. మార్చ్ 10 నుంచీ మళ్ళీ దర్శనమిచ్చింది. దీన్నీ అవకాశంగా తీసుకున్నాడు కానర్.
కానర్ ఐస్క్రీం ని మెడికల్ గా పరీక్షించామనీ, పాస్చరైజ్ చేశామనీ, రక్త దాతకి నేషనల్ హెల్త్ సర్వీస్ ఏఏ పరీక్షలు చేస్తుందో అవన్నీ చేశామనీ అన్నాడు. పాలు ఇచ్చిన మహిళ రక్త దానానికి నమోదైన వ్యక్తి. ఆమెని మేము పరీక్షించాం, క్లినిక్ గూడా టెస్ట్ చేసింది. అలా వైరస్లు ఉండవచ్చన్న వాదనని తిప్పికొట్టాడు
మేము అన్ని పరీక్షలూ చేశామని తెలిసికూడా వెస్ట్ మినిస్టర్ కౌన్సిల్ అమ్మకాలు ఆపివేసింది. ఐస్ క్రీముల్ని ఎత్తుకెళ్ళింది. మాప్రతిష్ట దెబ్బతిన్నది. కనక మేము న్యాయపరమైన చర్య గురించి యోచిస్తున్నాము.దీని వల్ల ప్రజలకి రిస్క్ ఉన్నది అని జనానికి చెప్పేముందు, పరీక్షలు పూర్తయి నిజం తెలిసే దాకా ఆగి ఉండాల్సింది.
"మాకు తెలిసినంతవరకూ అమ్మ పాల ఐస్ క్రీం అమ్మే వ్యాపారాన్ని నిషేధించే చట్టం ఏదీ లేదు." అన్నాడు కానర్. ఇది మరింత ప్రచారాన్ని తెస్తుంది.

ఐస్క్రీం రుచికరంగా ఉంది అమ్మిన కానర్, పాలమ్మిన హైలీ అన్నారు. ఇతరులూ లొట్టలేస్తూ తిని ఉండవచ్చు.
లాబ్ పరిక్షల్లో వైరస్లు లేవని తేలి ఉండవచ్చు. ఆరోగ్యానికి హాని లేకపోవచ్చు. రుచికరంగా ఉండవచ్చు. విషయం అది కాదసలు. వీళ్ళు చెప్పనివి ఉన్నాయి. చాలాప్రధానమయినవి - అందరికీ తెలిసినవే.

ఏమిటవి?
తల్లిపాలు కానర్ అన్నట్లు మాతృత్వపు మహాద్భుతమే. అయితే అవి బిడ్డకి తాపినఫ్ఫుడు. అవే పాలని అమ్ముకోవాల్సి వస్తే అది ఆమహిళకి మహాభారం.

బిడ్డ తాగాల్సిన పాలు రుచికోసం తినే ఐస్క్రీముల్లో పొయవచ్చా? తల్లిపాల ప్రయోజనాలు ఏమిటి?
తల్లి బిడ్డకివ్వాల్సిన పాలు ఎందుకు అమ్ముతుంది? బిడ్డతాగంగా మిగిలినవా?
లేక ఆమెకి బిడ్డమిద ప్రేమలేకా? పాలివ్వాలని లేకా?
కాదు. డబ్బులేక.
ఆవిషయం హైలీ చెప్పింది. కానర్ కానీ, , కోర్టుకెక్కినలేడీ గాగాకానీ ఈఅంశాన్ని తాకి తలచలేదు. ఎందుకంటే వాళ్ళప్రయోజనాలు ఎవరివి వారివే.

పాలివ్వడం తల్లికీ బిడ్డకీ శ్రేయస్కరం

పాలివ్వడం తల్లికీ బిడ్డకీ మేలుచేస్తుంది. ఒక అంశం పోషణ. రెండోది మానసికమైంది. మొదటి దానికి ప్రత్యామ్నాయా లు ఉంటాయని కొందరంటారు. అయితే పాలిచ్చే తల్లికీ తాగే బిడ్డకీ ఆసమయంలో ఏర్పడే మానసిక బంధం నిరుపమానమైంది. మరే ప్రత్యమ్నాయమూ లేనిది. చిన్నప్పుడొచ్చే ఎన్నోవ్యాధుల్ని నిరోధించగలిగే శక్తినిచ్చే యాంటీ బాడీస్ నుంచీ పోషక పదార్ధాలవరకూ తల్లిపాలలో లభిస్తాయి. ప్రయోజనాలు అన్నీ ఇన్నని చెప్పలేం. లెక్కకందని ప్రయోజనాలు బిడ్డకు దక్కుతాయి.ఇవి మరో విధంగా రావు. బిడ్డ ఆరోగ్యం మీద ఇంత ప్రభావం చూపే తల్లి చర్య మరొకటి లేదు. పాలిచ్చేటప్పుడు తల్లిలో ఆగ్జిటాసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది తృప్తిని కలిగిస్తుందనీ, ఆదుర్దాని తగ్గిస్తుందనీ, మనస్సుకి ప్రశాంతతనీ, మహదానందాన్నీచేకూరుస్తుందనీ శాస్త్రజ్ఞులు చెబుతారు.

బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. పిల్లలకి రెండో నెలనుంచీ ఆరోనెలదాకా రోజుకి అటూఇటుగా ఒక లీటర్ తల్లి పాలు తాగుతారు. ఆతర్వాత వాళ్ళు తాగ గలిగినన్ని ఉండవు. అయినా రెండేళ్ళదాక కాసినో కూసినో ఉన్నమటుకు తాపితే చాలామంచిదని శాస్త్రజ్ఞులు చెబుతారు. ఇతరపాలూ అమ్మపాలకు సాటిరావు.

తల్లి పాలు కొని పెంచాలంటే చాలా ఖర్చు

అనివార్య పరిస్తితుల్లోనే పాలబాంకుల్లో దొరికే ఇతరులతల్లుల పాలు పట్టాలి. ఇది చాలా ఖర్చుతో కూడిన విషయం. క్రిస్టీన్ బార్టెల్స్ అనే 44 ఏళ్ళ అమెరికా మహిళ ఒక బిడ్డని దత్తు తీసుకున్నది. అతన్ని తల్లిపాలతో పెంచాలి అనుకుంది. మదర్స్ మిల్క్ బాంక్ నుంచి ఔన్స్ 3 డాలర్ల లెక్కన కొని పట్టింది. రోజుకి ఇంచుమించు 100 డాలర్లయ్యాయి. ఆటబొమ్మలకీ, దుస్తులకీ తగ్గించి పాలకి ఖర్చు పెట్టింది.అలా 9 నెలలపాటు తల్లి పాలు తప్ప మరేమీ ఇవ్వకుండా పెంచింది. మొత్తం ఖర్చు 25 వేల డాలర్లకు పైన్నే. అమెరికాలో నూటికి 25 మందికి సంవత్సరానికి మొత్తం ఆదాయమే 25 వేల డాలర్లుండదు. దీన్ని బట్టి ఆఖర్చు ఎంత భారీ స్తాయిదో ఊహించవచ్చు. అయినా అమె ఎందుకు పెట్టిందంటే ఆపాల వల్ల చేకూరే సత్ఫలితాలు అటువంటివి. అంతటివి.
బాంకుల్లో పాలని పాశ్చరైజ్ చేస్తారు. పాస్చరైజేషన్ చేస్తే యాంటీ బాడీస్ చురుకుదనం కోల్పోతాయి.

తల్లి పాలు బిడ్డ హక్కు

తల్లి పాలు బిడ్డ హక్కు అనటం పరిపాటి. అది ఆచరణలో ఉన్నది కూడా. ఇక మంచి ధర పలుకుతున్నదనే ఉద్దేశంతో పేదరికాన్ని కొంతైనా తట్టుకోటానికి పాలు బిడ్డకి తగ్గించి, అమ్ముకునే అవకాశాలున్నాయి. అలా అమ్మాల్సిందేనని కుటుంబం నుంచి వత్తిడి వచ్చినా అశ్చర్యపోనక్కరలేదు. పేదరికాన్ని కొంతైనా తట్టుకునేందుకు ఇతరుల కోసం నవమాసాలూ మోసి బిడ్డల్ని కనేందుకు సిథ్ధపడ్డట్లే ఇందుకుకూడా.

ఇవి క్రమంగా కార్పొరేట్ సంస్తల చేతుల్లోపడి దేశ దేశాల్లో కీ వ్యాపిస్తాయి అనేందుకు సందేహమే ఉండక్కర్లేదు. పాలని తమ ఇళ్ళవద్దే పంపులతో తీసి మామూలు పాలు పంపినట్లే కొరియర్ ద్వారా పంపుతారు. పాలు తీసే మెరుగైన పరికరాలు కనిపెడతారు. అమెరికాలో ఒక రీసెర్చ్ జరుగుతున్నది. మదర్స్ మిల్క్ ఐస్క్రీం కంపెనీ పాలుసేకరించే కొత్త పరికరాన్ని తయారుచేసే పనిలో తలమునకలై ఉంది. దాన్ని లోపల ధరిస్తే చాలు వాళ్ళు పనులుచేసుకుంటున్నా, ఆడుకుంటున్నా ఏమీ ఇబ్బంది కలిగించకుండా పాలు వాటంతటవే పాక్ లోకొస్తూవుంటాయి. వాటిని బాటరీ సాయంతో 6 గంటలు సురక్షితంగా నిల్వ ఉంచవచ్చు.
పాలవల్ల వ్యాధులేమైనా వ్యాప్తి చెందుతాయా? అనేదాన్నే అధికారులు పరిశీలించారు. అంతటితో వాళ్ళ పని అయిపోయింది. ప్రభుత్వం పెట్టుబడికి అమ్ముడోయింది. చట్టం విషయానికొస్తే , కానర్ సెలవిచ్చినట్లు తల్లిపాల ఐస్క్రీం ని నిషేధించే చట్టం ఏదీ లేదు.

కోర్టు కెక్కిన పాప్ సింగర్ లేడీ గాగా

అమెరికా ప్రఖ్యాత పాప్ సింగర్లేడీ గాగాతనపేరు పెట్టి తన పాపులారిటిని ఉపయోగించుకుంటున్నాడని అభ్యంతరం తెలిపింది. దాన్ని ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కానర్కి లాయర్ చేత లేఖ రాయించింది. అది ఆమె పేరు గాదనీ ప్రతి బిడ్డ నోటితో చేసే మొదటి శబ్దంగా గాఅనీ, దాన్నే పేరుగా తీసుకున్నాననీ అన్నాడు. అంతే గాని మరి దేనితోనూ ఆపేరుకు సంబంధం లేదు అని చెప్పాడు. గాగా అనే పదాన్ని అమె ఎలా తనసొంతం అనగలదు? అనాదిగా పసిబిడ్డల నోటినుంచి వచ్చే మొదటి మాటల్లో ఇది ఒకటి, " అన్నాడు.
తన ట్రేడ్ మార్కుల్ని వాడుకుంటున్నారు అంది. తనని పోలి తనని అనుకరిస్తున్న ((impersonator) మార్టినీ అనే ఆమె చేత అమ్మిస్తున్నారన్నది. ఆపార్లర్లో వేసుకునే ధగధగ మెరిసే దుస్తులు ఈమెకి సంబంధించినవి కావు అంటూ ఆమె వాదనని తోసిపుచ్చాడు.
చాలామందికి జుగుప్స కలిగిస్తున్నది అని కూడా ఆక్షేపించింది. గాగా అనేదాన్ని తొలగించకపోతే ట్రేడ్ మార్క్ భంగం కేసు వేస్తానని బెదిరించింది.లేడీ గాగా ట్రేడ్ మార్క్ కింద పేరూ, ఆమె దుస్తులూ ,పాదరక్షలూ, ఫాషన్ అంశాలూ, ఆడియో వీడియో రికార్డింగులూ నమోదయి ఉన్నాయి.అయితే ఐస్ క్రీం లాంటి ఆహారపదార్ధలు అందులో లేవు.కోర్టుకు కేసు ఒకవేళ వెళితే ఏమవుతుందో వేచి చూడాల్సిందే. మార్చ్ 4 న్యాయపరమైన చర్యలు మొదలుపెట్టింది.

కానరేం బెదరలేదు. ఇది హాస్యాస్పదమైన చర్య అని వ్యాఖ్యానించాడు. కోర్టులో పోరాడి గెలిచి చూపిస్తా నన్నాడు." ప్రపంచం లోనే అత్యంత పెద్ద సూపర్ స్టార్ ప్రపంచంలో అత్యంత చిన్న ఐస్క్రీం పార్లర్ మీద ప్రతాపం చూపుతున్నది" అన్నాడు. . కానర్ ఓడితే దాని పేరు మారుతుంది. ఐస్ క్రీం మార్కెట్లో మరోపేరుతో స్వైరవిహారం చేసేట్లు చేస్తాడు. ఆమె బెదిరించిందని కానర్ చెబుతున్నట్లు అతనిని దివాలా తీయించినా మరొక పెట్టుబడిదారుడు దీన్ని కొనసాగిస్తాడు. అంతే. యజమాని మారితే మారచ్చు కాని ఐస్ క్రీం అమ్మకాలు ఆగవు.
అంతటా అందుబాటులోకొస్తుంది

అమెరికాలో ఇది బాగా పాపులర్ అవుతుందని కానర్ గట్టి నమ్మకంతో అన్నాడు. చైన్ షాపుల్లో మొదటగా దీన్ని పెట్టింది "హోల్ ఫూడ్స్“. వాల్ మార్ట్, కాస్ట్కో, క్రోజర్ లు అనుసరించాయి. మార్చ్ లో అమెరికా అంతటా గ్రోసరీ షాపుల్లో లభిస్తుంది.
పాలు తిసే పరికరాలున్నాయి.నిల్వచేయటమూ తేలికే. ఒకచోటనుంచీ మరొకచోటకి పాలు పంపే రవాణా సౌకర్యాలకీ కొరవలేదు. కనక పరిశ్రమ విశ్వమంత విస్తరిస్తుంది. రష్యా లో తయారై, కాలిఫోర్నియాలో ఉన్నహెలికాప్టర్ స్టార్ హోటల్లో దర్శనమిస్తుంది. సముద్రంలో నిర్మించిన లాడ్జిల్లో, క్లబ్బుల్లో మెరుస్తుంది.
అయితే పాలమ్ముకున్న తల్లుల బిడ్డలకి మాత్రం పాలు పుష్కలంగా లభించవు. కొల్లలుగా దొరకాల్సిన తల్లిపాలు పరుల పాలయి పేదబిడ్డలకి అపురూపమవుతాయి. తాగినన్ని తాగి వదిలివేసే పిల్లలకి తాగటానికే దొరకక పోవచ్చు. పెద్దవాళ్ళ డబ్బుకి దక్కి, పసివాళ్ళకి చిక్కక చిక్కి పోయే పరిస్తితు లొస్తాయి. వ్యాపార ప్రకటనలు ఎడా పెడా చేసి ప్రచారం చేసుకుంటారు. అందుకు అనుగుణంగా ఫిబ్రవరి 16 ఇచ్చిన ప్రకటనలో పాలు ఇచ్చే మహిళలు మీడియా ఇంటర్వ్యూలకు రావటానికి తప్పనిసరిగా ఒప్పుకోవాలి అనే షరతు పెట్టారు.

పేద పిల్లాడికి పాలిచ్చిన నటి -సల్మాహేక్

సియారా లియోన్ పశ్చిమ ఆఫ్రికాలోని ఒక పేద దేశం.జనాభా 54 లక్షలు. ప్రపంచంలో పసిబిడ్డలూ, పిల్లలూ ఎక్కువమంది చనిపోయే దేశాల్లో మొదటి స్తానం ఆదేశానిదే. ప్రతి 5 గురిలో ఒకరు అయిదేళ్ళొచ్చేదాకా బతకరు. పసిబిడ్డల మరణాల్లో అయిదోవంతు టెటనస్ వల్ల. 2008 లో వ్యాధికి టీకాల ప్రచారంలో సల్మాహేక్ అనే మెక్సికో తార వచ్చింది. 41 ఏళ్ళ నటి, నిర్మాత, దర్శకురాలు. హాలివుడ్లో చాలా ప్రముఖురాలు. ఫ్రిదా సినిమాలో ఆమె నటనకి 2002 లోఉత్తమనటి గా నామినేషన్ పొందింది. తనకూతురు పుట్టిన రోజునే పుట్టిన నల్లజాతి పిల్లాడికి పాలిచ్చింది. తల్లిపాలు బిడ్డకి మేలు అని చాటటానికి అపని చేసింది. ఆబిడ్డడు ఆకలిగొని ఉన్నాడు. ఆదేశంలో పిల్లలకి కొన్నినెలలపాటు మాత్రమే పాలిస్తారు. తర్వాత భర్తలు ఇవ్వనివ్వరు. అక్కడి డాక్టర్లు ఆమెతో కొన్ని ప్రాంతాల్లో అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఉందని చెప్పారు. ఏమంటే పాలిచ్చే స్త్రీలతో భర్తలు కూడకూడదు. అందుకని భర్తలు త్వరగా పిల్లలకు పాలివ్వటం మానిపిస్తారు. కనక పిల్లలకి సరైన పోషణ లేదు. దాంతో పిల్లల మరణాలు ఎక్కువ. డాక్టర్లు 2 సంవత్సరాలపాటు పాలివ్వాలి అని సూచిస్తారు. అయితే వాళ్ళ ఆచారమూ, నమ్మకమూ అడ్డొస్తాయి. దీన్ని తొలగించే ఉద్దేశంతోనే ఆమె కెమేరా ముందే పిల్లగానికి పాలిచ్చింది. అప్పటికి ఆమె తన ఏడాది పాపకి పాలిస్తూనే ఉంది. తన అమ్మమ్మ మెక్సికోలో ఎవరో తెలియని బిడ్డకి పాలిచ్చి కాపాడిన సన్నివేశాన్ని గుర్తుచేసుకుంది.
క్లిప్పింగ్ ఆమెకెంతో పేరు తెచ్చింది. సినిమాలో నటన ఎంత పేరు తెచ్చిందో అంతకన్న ఎక్కువపేరు మానవత్వంతో స్పందించి చేసిన ఈచర్య తెచ్చిపెట్టింది. గంటన్నర నిడివి ఉన్న సినిమాలకన్నా కొన్ని క్షణాలు మాత్రమే ఉన్న క్లిప్పింగ్ ఎక్కువ ఆదరణ పొందింది. ప్రతిష్ట తెచ్చిపెట్టింది. ఆస్కార్ ఎవార్డ్ కి ఇదేం తక్కువ కాదు.

ఏం జరగబోతోంది

ఇది ఒక ఐస్క్రీం తో అగేది కాదు.తల్లిపాలతో ఇంకా ఎన్నో పదార్ధాలు తయారుచేస్తారు. అమ్ముకొని లాభలతో పొంగిపోతారు. కొందరు పిల్లలకి పాలు తగ్గితే ఎలా అని బాధపడుతుంటే, పిల్లలు తాగితే ఐస్క్రీముల్లోకి పాలెలా అని కానర్ లాంటివాళ్ళు ఆలొచిస్తారు. పెట్టుబడిదారులకి ప్రభుత్వాలు వంతపాడతాయి. స్వేచ్ఛా మార్కెట్ తత్వాన్ని వంట పట్టించుకున్న కుహనామేధవుల తోడ్పాటు ఉండనే ఉంది.. డబ్బిస్తే మంచీ చెడూ పట్టించుకోకుండా ప్రచారానికైనా పూనుకునే పత్రికలూ, టీ.వీ. ఛానళ్ళూ, ఇతర సాధనలూ ఉండనే ఉన్నాయి..పాలకిబదులు డబ్బొచ్చింది. సమన మారకం జరిగింది. అమ్మితేనే గదా కొనుక్కుంటున్నారు. అమ్మేవాడూ కొనేవాడూ ఒప్పుకొని మారకం జరిగింది.పాలు అటు వెళితే, తగిన డబ్బు ఇటువచ్చింది. ఇరుపక్షాల అవసరాలూ తీరాయి.ఇదీ వాళ్ళ వాదన. పేదల పిల్లలకి లేకపోతే ఏం? వాళ్ళపిల్లకుంటే సరి. తినే సంపన్నులకి అందులో పాలు ఏబిడ్డ నోటికడవయితే ఏం, రుచిగా ఉంటే సరి. ఎవరి బిడ్డలకో యంటీ బాడీస్ అందకపోతే ప్రభుత్వ అధికారులకు ఏం, తినే వాళ్ళ ఆరోగ్యం కోసం అందులో వైరస్లు లేకపోతే సరి.
పేదరికం పెదవి విప్పనివ్వదు. నోరులేని పసిబీడ్డలెలాగో,నోరున్నా పేదతల్లులూ అలాగే. వాళ్ళకై వాళ్ళు మాత్రమే దీన్ని ప్రతిఘటించలేరు.అందుకే అందరూ పూనుకోవాలి.

పిల్లల నోటికాడవి కొల్లగొట్టి లాభాల కోసం సంపన్నులకి పెట్టటం దుర్మార్గమైన చర్య. చట్టాలు లేవంటూ ప్రజాస్వామ్యం పేరుతో మార్కెట్ శక్తుల లాభరంథికి కొమ్ముగాయటం దోపిడీ ప్రభుత్వాల లక్షణం. దేశదేశాల పీడిత ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించదగ్గ విషయం. మూకుమ్మడిగా ఎదిరించి ప్రభుత్వాల మెడలు వంచి ఈఐస్క్రీం తయారీని అడ్డుకొని తల్లిపాలపై బిడ్డకున్న హక్కుని నిలబెట్టాల్సిన సమయం.
వీడియో క్లిప్పింగ్


మెచ్చుకుంటున్న కష్టమర్లనీ, కానర్నీ, వెయిట్రెస్నీ చూపుతూ బేబీ గాగా గురించిన బీ.బీ.సి వీడియో కధనం
Ice Cream made from Human Breast Milk on sale in London
http://www.youtube.com/watch?v=1zT6oPeV6YQ