14, ఏప్రిల్ 2021, బుధవారం

వలయం యొక్క మూడు ఫార్ములాలు

 

 కాపిటల్ రెండో సంపుటం- అధ్యాయం 4

వలయం యొక్క మూడు ఫార్ములాలు

డబ్బు, ఉత్పత్తి, సరుకు - ఈ మూడు పెట్టుబడుల వలయాల్నీ దేనికదిగా పరిశీలించాక, ఇప్పుడు ఆ మూటినీ కలుపుతాడు. వాటి ఐక్యతని విశ్లేషిస్తాడు. పాయింట్ స్పష్టం: భిన్నమైన వలయాలు ఒకదానితో ఒకటి  పెనవేసుకొని ఉంటాయి. పరస్పర సంబంధంలో ఉండి, నిరంతర చలనంలో ఉంటాయి. ప్రతిదాని చలనమూ, అన్నిటి చలనాలకూ అవసరం. విలువ విస్తరణ  లక్ష్యం. అంటే అదనపు విలువ ఉత్పత్తి అవడమూ, అది డబ్బు అవడమూ.

మూడు ఫార్ములాలు

మొత్తం చలామణీ ప్రక్రియని మొ.చ అందాం. అప్పుడు ఈ మూడు ఫార్ములాలు ఇలా ఉంటాయి:

1. డ-స...ఉ.పె ... స'-'

2. ఉ.పె...మొ.చ...ఉ.పె

3. మొ.చ...ఉ.పె(స')

ఈ మూడు రూపాల్నీ కలిపిచూస్తే, మొత్తం ప్రక్రియ యొక్క ముందు అవసరాలన్నీ దాని ఫలితంగా వచ్చినట్లు, అంటే, ఆప్రక్రియే ఉత్పత్తిచేసినవి అయినట్లు అగపడతాయి. వాటిలో ప్రతిదీ ఆరంభస్థానంగానూ, దాటిపోతున్న స్థానంగానూ, తిరిగి చేరే స్థానంగానూ కనబడుతుంది. మొత్తం ప్రక్రియ  ఉత్పత్తి ప్రక్రియ, చలామణీ ప్రక్రియల ఐక్యతగా అగపడుతుంది.  ఉత్పత్తి ప్రక్రియ  చలామణీ ప్రక్రియకి మధ్యవర్తి అవుతుంది. చలామణీ ప్రక్రియ ఉత్పత్తి ప్రక్రియకి మధ్యవర్తి అవుతుంది.

మూడు వలయాలకీ ఉమ్మడి లక్ష్యం: విలువ స్వయం విస్తరణ, అంటే అదనపు విలువ ఉత్పత్తి అవడమూ, ఆ అదనపు విలువ డబ్బు అవడమూ.

ఒకటో ఫార్ములాలో ఈ లక్ష్యం దాని రూపంలోనే వ్యక్తమవుతుంది. రెండో రూపం ఉ.పె తో, అదనపు విలువని ఉత్పత్తిచేసే ప్రక్రియతో  మొదలవుతుంది. మూడో రూపంలో వలయం విస్తరించిన విలువతో మొదలై, కొత్తగా మరింత విస్తరించిన విలువతో ముగుస్తుంది -ఒకవేళ చలనం అదే స్థాయిలో తిరిగి జరిగినాకూడా. 

చలామణీలో ఉండాల్సిన డబ్బు

స-డ అనేది కొనేవాడికి డ-స అవుతుంది; డ-స అనేది అమ్మేవాడికి స-డ అవుతుంది. ఆమేరకు పెట్టుబడి చలనం సరుకుల సాధారణ పరివర్తనని తెలుపుతుంది. దీనితోపాటు  అభివృద్ధి చెందిన చలామణీలో ఉండాల్సిన డబ్బు మొత్తం ఎంతో తేల్చి చెప్పే సూత్రాలు కాపిటల్ మొదటి సంపుటం,మూడో అధ్యాయం రెండో విభాగంలో ఉన్నాయి. అవి ఇక్కడ వర్తిస్తాయి.

వ్యష్టి పెట్టుబడుల పరివర్తనల మధ్య సంబంధం

రూపసంబంధమైన అంశానికే అంటిపెట్టుకోకుండా, వివిధ వ్యష్టి పెట్టుబడుల పరివర్తనల మధ్య వాస్తవ సంబంధాన్ని పరిశీలిస్తే,  డబ్బు, సరుకుల రూపం మార్పు మాత్రమే ఆ సంబంధాన్ని వివరించజాలదు. ఈ సంబంధాన్ని పట్టుకోడానికి మార్క్స్, నిరంతర చలనంలో ఉన్న చక్రాన్ని పోలికగా తెస్తాడు.

ఆగకుండా తిరుగుతున్న చక్రంలో ప్రతి బిందువూ   ఆరంభ బిందువే (point of departure), అలాగే తిరిగివచ్చే  బిందువు(point of return) కూడా. చక్రం తిరగకుండా ఆపితే, ప్రతి ఆరంభ బిందువూ తిరిగివచ్చే బిందువు  కాదు. కనుక ప్రతి వ్యష్టి వలయానికీ  ఇతర వలయాలు  ముందు అవసరంగా ఉంటాయి. అంతేకాదు,  ఒక రూపంలో వలయం పునరావృతి, ఇతర రూపాల్లో చర్యతో కూడి ఉంటుంది. 

ప్రతి వ్యష్టి పారిశ్రామిక పెట్టుబడీ ఏకకాలంలో మూడు వలయాల్లోనూ ఉంటుంది. ఈ మూడు వలయాలూ నిరంతరం పక్కపక్కనే నడుస్తుంటాయి. ఉదాహరణకు  ఇప్పుడు సరుకు పెట్టుబడిగా పనిచేసే ఒక భాగం పెట్టుబడి విలువ డబ్బు పెట్టుబడిలోకి మారుతుంది. అయితే, అదే సమయంలో మరొకభాగం పెట్టుబడి ఉత్పత్తిప్రక్రియని విడిచిపెట్టి, కొత్త సరుకు పెట్టుబడిగా చలామణీలో చేరుతుంది. ఆవిధంగా స'...' వలయ రూపం ఆగకుండా కొనసాగుతుంటుంది. మిగిలిన రెండు రూపాలు కూడా అంతే. పెట్టుబడి పునరుత్పత్తి తన ప్రతి రూపంలోనూ, ప్రతిదశలోనూ నిరంతరాయమైనది - ఈ మూడు రూపాల పరివర్తన ఎలా నిరంతరాయమో అలాగే. వరసగా ఈ మూడు దశల గుండా నడవడం ఎలా నిరంతరాయమో అలాగే.  ఆవిధంగా మొత్తం వలయం తన మూడురూపాల ఐక్యత.

వివిధ దశల్లో అంతరాయాలు

పెట్టుబడి విలువ దాని మొత్తం పరిమాణంలో డబ్బు పెట్టుబడిగానో, ఉత్పాదక  పెట్టుబడిగానో, సరుకు పెట్టుబడిగానో పనిచేస్తుందని  అనుకున్నాము. ఉదాహరణకి, మొదట రూ 11,000 డబ్బు పెట్టుబడిగా ఉంది. ఆ మొత్తాన్నీఉత్పాదక  పెట్టుబడిలోకి మార్చాము. చివరకి దాన్నిరూ 12,000 విలువగల సరుకు పెట్టుబడిలోకి మార్చాము.

అది  రూ 11,000 పెట్టిన పెట్టుబడి + 1,000 అదనపు విలువ. ఇక్కడ ఏర్పడే దశలు, అన్ని అంతరాయాల్ని ఏర్పరుస్తాయి. ఉదాహరణకి, రూ 11,000  శ్రమశక్తినీ, ఉత్పత్తిసాధనాల్నీకొనకుండా, డబ్బు రూపంలోనే ఉన్నంతవరకూ, మొత్తం పెట్టుబడి డబ్బు పెట్టుబడిగానే ఉంటుంది, పనిచేస్తుంది. అది ఉత్పాదక  పెట్టుబడిలోకి మారీమారగానే, అది డబ్బుపెట్టుబడిగానూ పనిచేయదు, సరుకు పెట్టుబడిగానూ పనిచేయదు. అది డ గానో, ' గానో చలామణీదశల్లో చర్యచేయ్యడం మొదలుపెట్టగానే,  దాని చలామణీ ప్రక్రియ యావత్తూ నిలిచిపోతుంది. తత్ఫలితంగా,  ఉ.పె... ఉ.పె వలయం నియమిత కాలాల్లో జరిగే   ఉత్పాదక  పెట్టుబడి తిరిగి ఏర్పడడాన్ని తెలుపుతుంది. అంతే కాదు, దాని చర్యకి, ఉత్పత్తి ప్రక్రియకి, చలామణీ ప్రక్రియ పూరయ్యేవరకూ, అంతరాయం కలిగిందని కూడా తెలుపుతుంది. ఉత్పత్తి నిరంతరాయంగా జరిగే బదులు ఆగుతూ, ఆగుతూ జరుగుతుంటుంది. కచ్చితంగా నిర్ణయించలేని వ్యవధుల్లో మాత్రమే అది తిరిగి మొదలవుతుంటుంది - రెండు చలామణీ దశలు వేగంగా జరుగాయా, నెమ్మదిగా జరిగాయా అనేదాన్ని బట్టి.  ఉదాహరణకి, ఇది ప్రయివేట్ కొనుగోలుదారులకొసం మాత్రమే పనిచేసే  చైనా చేతివృత్తిదారుడికి వర్తిస్తుంది. కొత్త ఆర్డర్ వచ్చేవరకూ అతని ఉత్పత్తి ప్రక్రియ ఆగిపోతుంది.

చలనంలో ఉన్న ప్రతి పెట్టుబడి భాగానికి సంబంధించీ ఇదే వాస్తవం. అన్ని పెట్టుబడి భాగాలూ వరసగా ఈచలనం గుండా నడవాల్సిందే. ఈ 1,000  కిలోల నూలు ఒక వడికేవాని ఉత్పాదితం అనుకుందాం. అది మొత్తం ఉత్పత్తి  రంగాన్ని వదిలి చలామణీ రంగంలో ప్రవేశిస్తుంది. అందులో ఉన్న పెట్టుబడి విలువ అంతా  డబ్బు పెట్టుబడిలోకి మారాలి. అది డబ్బు పెట్టుబడి రూపంలో  ఉన్నంత కాలం, మరొక కొత్త  ఉత్పత్తి ప్రక్రియలో చేరజాలదు. అది మొదట చలామణీలోకి పోవాలి, ఉత్పాదక  పెట్టుబడి మూలకాలైన, శ్రమశక్తిగానూ, ఉత్పత్తి సాధనాలుగానూ మారాలి.  పెట్టుబడి వలయం   నిరంతరాయ ప్రక్రియ; ఒక దశని వెనక వదిలి, తర్వాత దశలో ప్రవేశించడం, ఒక రూపాన్ని విడనాడి మరొక రూపాన్ని పొందడం. వీటిలో ప్రతి దశా తర్వాత దశని ముందు అవసరంగా కోరుతుంది. అంతే కాదు, దాన్ని మినహాయిస్తుంది కూడా.  

పెట్టుబడి వలయం  నిరంతరాయ ప్రక్రియ

ఆగకుండా ముందుకు పోవడం  పెట్టుబడిదారీ ఉత్పత్తి విశిష్ట లక్షణం. దాని సాంకేతిక పునాది ఆ నిరంతరాయతని అవసరపరుస్తుంది- ఆస్థితిని పూర్తిగా  సాధించడం ఎల్లప్పుడూ సాధ్యం కాకపోయినా. అప్పుడు వాస్తవంగా జరిగేదేందో చూద్దాం. ఉదాహరణకి 1,000 కిలోల నూలు సరుకు పెట్టుబడిగా మార్కెట్లో కనబడుతుంది. డబ్బులోకి మారుతుంది- అది చెల్లించే మాధ్యమం అయినా సరే, ఖాతా డబ్బు అయినాసరే. దానిస్థానంలో  కొత్త పత్తి, బొగ్గూవగయిరా ఉత్పత్తి ప్రక్రియలోకొస్తాయి. అవి అప్పటికే డబ్బు రూపం నించీ, సరుకు రూపం నించీ, ఉత్పాదక  పెట్టుబడి రూపంలోకి

  మారి చర్య చెయ్యడం మొదలుపెట్టి ఉంటాయి. 1000  కిలోల నూలు డబ్బుగా తిరిగి మారే సమయంలోనే, వెనకటి 1000  కిలోల నూలు దాని రెండో చలామణీ దశలో నడుస్తుంటుంది. తిరిగి డబ్బులోకి, ఉత్పాదక  పెట్టుబడి అంశాల్లోకి మారుతూ ఉంటుంది. పెట్టుబడిలోని  భాగాలన్నీ వలయంలో వరసగా నడుస్తాయి. ఒకే సమయంలో దాని  వేర్వేరు దశల్లో ఉంటాయి. పారిశ్రామిక పెట్టుబడి దాని కక్ష్యలో ముందుకు వెళుతూ ఉంటుంది. ఆవిధంగా  ఏకకాలంలో తన అన్ని దశల లోనూ ఉంటుంది. ఆయాదశలకు అనుగుణమైన వేర్వేరు క్రియాత్మక రూపాల్లో ఉంటుంది. తొలిసారి సరుకు పెట్టుబడి నుండి డబ్బులోకి మారే పారిశ్రామిక పెట్టుబడి భాగం, '...' వలయాన్ని ప్రారంభిస్తుంది. కాగా  చలనంలో ఉండే మొత్తంగా పారిశ్రామిక పెట్టుబడి ఆ వలయం గుండా  అప్పటికే పయనించి  ఉంటుంది. ఒక చేయి అడ్వాన్స్ ఇవ్వగా, రెండో చెయ్యి దాన్ని పుచ్చుకుంటుంది. ఏదైతే  ఒకచోట  డ...డ' వలయం ఆరంభంగా ఉందో, అదే మరొకచోట దాని ముగింపుగా ఉంటుంది. ఉత్పాదక పెట్టుబడికి కూడా ఇదే వర్తిస్తుంది.

అందువల్ల, ఆగకుండా సాగిపోయే పారిశ్రామిక పెట్టుబడి వలయం, ఉత్పత్తి, చలామణీ ప్రక్రియల ఐక్యత; అంత మాత్రమే కాదు, దాని మూడు వలయాల ఐక్యత కూడా. అయితే, పెట్టుబడిలో భిన్న భాగాలూ  వలయంలో ఒక దశ నించి మరొక దశకు,ఒక క్రియాత్మక చర్య నించి మరొక క్రియాత్మక చర్యకు చేరగలిగినప్పుడు మాత్రమే  అది ఆ ఐక్యతగా ఉండగలుగుతుంది. అప్పుడు పారిశ్రామిక పెట్టుబడి ఈ భాగాలన్నిటి మొత్తం అయి ఉన్నందున, దాని వివిధ దశల్లోనూ, విధుల్లోనూ ఒకేసమయంలో ఉంటుంది. ఆ విధంగా అది ఒకేసమయంలో మూడు వలయాల్నీ వివరిస్తుంది. వేర్వేరు భాగాల వరస ఆ భాగాలు కలిసి ఉండడాన్నిబట్టి నిర్ణయమవుతుంది. అంటే, పెట్టుబడి విభజనని  బట్టి. శాఖోపశాఖలుగా విస్తరించిన  ఫాక్టరీ వ్యవస్థలో, ఉత్పాదితం దాని తయారీలోని వివిధ దశల్లో ఉంటుంది, ఉత్పత్తిలో ఒకదశనించి మరొకదశకు నిరంతరం పయనిస్తూ ఉంటుంది. వ్యష్టి పారిశ్రామిక పెట్టుబడి ఒక నిర్దిష్ట పరిమాణంలో ఉంటుంది. ఆ పరిమాణం పెట్టుబడిదారుడి వనరులను బట్టి ఉంటుంది. పైగా  ప్రతి  పారిశ్రామిక శాఖకు వనరులు కచ్చితమైన కనీస పరిమాణంలో కావాల్సి  ఉంటుంది. అందువల్ల, వ్యష్టి పెట్టుబడి  విభజన నిర్దిష్ట నిష్పత్తులలో జరగాలి. అందుబాటులో ఉన్న పెట్టుబడి పరిమాణం ఉత్పత్తి ప్రక్రియ పరిమాణాల్ని నిర్ణయిస్తుంది. ఇది తిరిగి సరుకు పెట్టుబడి పరిమాణాల్నీ, డబ్బు పెట్టుబడి పరిమాణాల్నీనిర్ణయిస్తుంది -అవి వాటి చర్యల్నిఉత్పత్తి ప్రక్రియతోపాటు సమాంతరంగా నిర్వర్తిస్తున్న మేరకు. ఉత్పత్తి నిరంతరాయతని నిర్ణయించేది కలిసి ఉండడమే. ఆయా పెట్టుబడి  భాగాలు  భిన్న దశల గుండా వరసగా చేసే  చలనం వల్లనే. కలిసి ఉండడం అనేది కేవలం ఈ వరస ఫలితం మాత్రమే. ఉదాహరణకి, ఒక భాగం అయిన స'-' కి సంబంధించి. సరుకు అమ్ముడవనట్లయితే,   వలయం లోని ఈ భాగానికి అంతరాయం కలుగుతుంది. మళ్ళీ ఆ సరుకు ఉత్పత్తికి కావలసిన ఉత్పత్తిసాధనాలు ఆ స్థానంలోకి రావడం జరగదు.ఉత్పత్తి ప్రక్రియ నించి  ' రూపంలో ఏర్పడే  తదనంతర భాగాల చర్యలు మారడానికి  వెనకటి భాగాలు అడ్డుకుంటాయి. అలా కొంతకాలం ఉంటే ఉత్పత్తి పరిమితం అవుతుంది, యావత్ ప్రక్రియా స్తంభిస్తుంది. వరసలో ప్రతి స్తంభనా  కలిసిసాగడాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. ఒక దశలో  ఏర్పడే  ప్రతి  స్తంభనా, స్తంభించిన పెట్టుబడి వలయం భాగానికే కాక, వలయం అంతటా కొద్దో గొప్పో స్తంభనకి  కారణం అవుతుంది. అంతే కాదు వ్యష్టి పెట్టుబడి మొత్తం వలయం స్తంభించేందుకు కారణం అవుతుంది.

ఈ ప్రక్రియ తన్నుతాను ప్రదర్శించుకునే తరువాత రూపం దశల వరస రూపమే. ఎందుకంటే, కొత్త దశలోకి పెట్టుబడి పరివర్తన చెందడం అనేది మరొక దశ నించి అది నిష్క్రమించడం వల్ల అవసరమవుతుంది. అందువల్ల, పెట్టుబడి క్రియాత్మక రూపాల్లో ఒకటి ప్రతి విడి వలయానికీ ఆరంభ స్థానంగానూ, తిరిగివచ్చే స్థానంగానూ ఉంటుంది. మరొకవైపు, వాస్తవానికి మొత్తం ప్రక్రియ  మూడు వలయాల ఐక్యత. అవి ప్రక్రియ నిరంతరాయత తన్నుతాను వ్యక్తపరుచుకునే మూడు భిన్న రూపాలు. ఈ మొత్తం వలయం పెట్టుబడి యొక్క ప్రతి క్రియాత్మక రూపానికీ దాని ప్రత్యేక వలయంగా దర్శనమిస్తుంది. ఈ వలయాల్లో ప్రతిదీ  మొత్తం ప్రక్రియ యొక్క నిరంతరాయ చలనానికి షరతు. ప్రతి క్రియాత్మక రూపం యొక్క చక్రీయచలనం ఇతర వాటిమీద ఆధారపడి ఉంటుంది.  మొత్తం ఉత్పత్తి ప్రక్రియకు, ప్రత్యేకించి,సామాజిక పెట్టుబడికి అది ముందు అవసరం. అది అదేసమయంలో పునరుత్పత్తి ప్రక్రియ; అందువల్ల దాని ప్రతి అంశం యొక్క వలయం. పెట్టుబడి యొక్క వివిధ భాగాలు వివిధ దశలగుండా, వివిధ క్రియాత్మక రూపాలగుండా నడుస్తాయి.  ప్రతి క్రియాత్మక రూపమూ అదే సమయంలో ఇతర క్రియాత్మక రూపాలతో తన సొంత వలయం గుండానే పయనిస్తుంది-ఎప్పుడూ పెట్టుబడి యొక్క వేరే భాగం దానిలో వ్యక్తం అయినప్పటికీ.

పెట్టుబడిలోని ఒక భాగం, నిరంతరం మారుతూ, నిరంతరం పునరుత్పత్తవుతూ డబ్బులోకి మారే సరుకు పెట్టుబడిగా ఉంటుంది; మరొక భాగం ఉత్పాదక పెట్టుబడిలోకి మారే డబ్బు పెట్టుబడిగా ఉంటుంది;మూడో భాగం  సరుకు పెట్టుబడిలోకి మారే ఉత్పాదక పెట్టుబడిగా ఉంటుంది. ఈ మూడు రూపాల నిరంతర మనుగడ మొత్తం పెట్టుబడి వలయం చేత ఈ మూడు దశల గుండా నడవడం ద్వారా వస్తుంది. అందువల్ల, పెట్టుబడి మొత్తం తన భిన్న దశలలో ఒకే సమయంలో, పక్కపక్కనే ఉంటాయి. అయితే, ప్రతి భాగమూ ఎడతెరిపి లేకుండా, వరసగా ఒక దశనించి, ఒక క్రియాత్మక రూపం నించి తదుపరి దశలోకి పోతూ ఉంటుంది. ఆవిధంగా, అన్నిట్లోనూ క్రమబద్ధంగా చర్య చేస్తుంది. కాబట్టి దాని రూపాలు  అంటే కదిలే స్థితిలో ద్రవంలా అస్థిరంగా ఉంటాయి. అవి ఏకకాలంలో జరగడానికి కారణం అవి వరసగా ఉండడమే. ప్రతి రూపమూ మరొక రూపాన్ని అనుసరిస్తుంది, దానికి ముందు కూడా ఉంటుంది. ఎందుకంటే, ఒక పెట్టుబడి భాగం తిరిగి రావడానికి, మరొక భాగం మరొక రూపానికి తిరిగి రావడం అవసరం. ప్రతి భాగమూ నిరంతరం తన సొంత వలయాన్నే నడుపుతుంది. అయితే, ఎప్పుడయినా సరే, ఈ రూపంలో ఉండేది పెట్టుబడి ఇంకొక భాగమే. ఈ ప్రత్యేక వలయాలు ఏక కాలంలో, వరసగా రూపొందే మొత్తం ప్రక్రియ యొక్క అంశాలు మాత్రమే.

మొత్తం ప్రక్రియ యొక్క నిరంతరాయత ఈ మూడు వలయాల ఐక్యత వల్ల వీలవుతుంది. మొత్తం సమాజ పెట్టుబడికి ఈనిరంతరాయత ఎల్లప్పుడూ ఉంటుంది. దాని ప్రక్రియ మూడు వలయాల ఐక్యతని ప్రదర్శిస్తుంది.

వ్యష్టి పెట్టుబడుల నిరంతరాయతకి ఆటంకం

అయితే వ్యష్టి పెట్టుబడులకు సంబంధించినంతవరకూ, పునరుత్పత్తి నిరంతరాయతకి అప్పుడప్పుడు, అంతో ఇంతో ఆటంకం కలుగుతుంది.

మొదటి విషయం. విలువ రాసులు తరచుగా వివిధకాలాల్లో, వివిధ దశల మధ్య , క్రియాత్మక రూపాల మధ్య  అసమ భాగాలుగా పంపిణీ అవుతాయి.

రెండో విషయం. ఉత్పత్తి కావాల్సిన సరుకు స్వభావాన్ని బట్టి, అందువల్ల, పెట్టుబడి పెట్టిన ప్రత్యేక ఉత్పత్తి రంగాన్ని బట్టి, ఈ భాగాలు తేడాగా పంపిణీ అయి ఉండవచ్చు.

మూడో విషయం.ఋతువుల మీద ఆధారపడే ఉత్పత్తి రంగాల్లో నిరంతరాయత కాస్తో కూస్తో విచ్చిన్నం కావచ్చు. కారణం,

1. వ్యవసాయం, చేపలు పట్టడం వంటి వాటిలో ప్రకృతి పరిస్థితులు,

2. సీజన్లో మాత్రమే పని ఉండే పరిస్థితులు.

ఫాక్టరీల్లోనూ, గనుల్లోనూ ప్రక్రియ క్రమబద్ధంగా, ఒకే పద్ధతిలో సాగుతుంది. అయితే వివిధ ఉత్పత్తి శాఖల్లో ఉండే ఈ తేడా, చలామణీ ప్రక్రియ యొక్క సాధారణ రూపాల్లో ఏ తేడానీ కలిగించదు.

పెట్టుబడి ఒక చలనం

పెట్టుబడి స్వయవిస్తృత విలువ. అది వర్గసంబంధాల్ని కలిగి ఉంటుంది.  వేతన శ్రమగా ఉండే శ్రమ మీద ఆధారపడిన నిర్దిష్ట సామాజిక స్వభావాన్ని  కలిగి ఉంటుంది. అంత మాత్రమే కాదు, అది ఒక చలనం, భిన్న దశల గుండా నడిచే ఒక వలయాన్ని చూపే ప్రక్రియ. అందువల్ల, దాన్ని చలనంగా అర్ధం చేసుకోవాలి, నిశ్చలంగా ఉన్న వస్తువుగా కాదు.

విలువ స్వతంత్ర మనుగడ పొందడాన్ని కొందరు ఒక అనిర్దిష్ట భావనగా మాత్రమే చూస్తున్నారు. వాళ్ళు  పారిశ్రామిక పెట్టుబడి చలనమే ఈ క్రియాత్మక అనిర్దిష్టత (abstraction in actu)  అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇక్కడ విలువ వివిధ రూపాలనూ, వివిధ చలనాలనూ గడుస్తుంది. తన్ను తాను నిలబెట్టుకుంటుంది/నిలకడగా ఉంచుకుంటుంది.  అదే సమయంలో విస్తరిస్తుంది, పెరుగుతుంది. మనం ఇక్కడ ప్రధానంగా ఈ చలనం రూపాన్ని మాత్రమే పట్టించుకుంటాం కనుక,  తన వలయ కాలంలో పెట్టుబడి విలువ చెందే తీవ్ర మార్పుల్ని పట్టించుకోము. విలువ మార్పులు జరిగినప్పటికీ, ఒక సంగతి స్పష్టం: పెట్టుబడి విలువ అదనపు విలువని ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించినంత వరకూ మాత్రమే పెట్టుబడిదారీ ఉత్పత్తి ఉండగలుగుతుంది. అంటే, అది తన వలయాన్ని స్వతంత్రత పొందిన విలువగా ఉంచినంతవరకు, అందువల్ల విలువలో మార్పులు అధిగమించబడి ఏదోవిధంగా సమతుల్యత వస్తున్నంత వరకు మాత్రమే పెట్టుబడిదారీ ఉత్పత్తి కొనసాగుతుంది. పెట్టుబడిదారుడు సరుకుల్నీ శ్రమనీ కొనే వాడిగానూ, సరుకుల్ని అమ్మేవాడిగానూ, ఉత్పాదక పెట్టుబడి ఓనర్ గానూ పనిచేస్తాడు. అందువల్ల   వలయాన్ని నడిపే ఒక పారిశ్రామిక పెట్టుబడిదారుడి కార్యకలాపంగా పెట్టుబడి కదలికలు అగుపిస్తాయి. సామాజిక పెట్టుబడి విలువలో పెను మార్పు కలిగినట్లయితే, వ్యష్టి పెట్టుబడిదారుని పెట్టుబడి ఆమార్పుకి లొంగిపోయి, దిగబడవచ్చు,  దెబ్బ తినవచ్చు. అతని పెట్టుబడి విలువల చలనానికి తగినట్లు సర్దుకోలేక పోవడం వల్ల అలా జరగవచ్చు. విలువలో అటువంటి పెను మార్పులు తరచుగానూ, మరింత తీవ్రంగానూ జరిగితే, కొత్త స్వతంత్ర విలువ యొక్క ఆటోమాటిక్ చలనం మరింత ఎక్కువగా సహజ ప్రక్రియ కుండే మౌలిక బలంతో చర్య చేస్తుంది- వ్యష్టి పెట్టుబడి దారుడి ముందుచూపుకీ, అంచనాకీ వ్యతిరేకంగా చర్య చేస్తుంది.    సాధారణ ఉత్పత్తి గమనం అసాధారణ ఊహాగానాలకి మరింత లోనవుతుంది.  వ్యష్టి పెట్టుబడుల మనుగడకి మరింత ప్రమాదకరం అవుతుంది. అందువల్ల, నిర్దిష్ట వ్యవధుల్లో జరిగే విలువలో పెనుమార్పులు, అవి దేన్నైతే తిరస్కరించాలో దాన్నే ధృవీకరిస్తాయి. అదేమంటే: విలువ పెట్టుబడిగా స్వతంత్ర మనుగడ పొందుతుంది. దాన్ని తన చలనం ద్వారా నిర్వహిస్తుంది, దానికి ప్రాముఖ్యత కలిగిస్తుంది.

వరస పరివర్తనలలో విలువ పరిమాణంలో మార్పు వస్తుంటుంది. ఆ మార్పుని మొదట పెట్టిన విలువతో పోల్చిచూడడం ఉంటుంది. విలువని సృజించే శక్తి, శ్రమశక్తి. విలువ స్వతంత్రం అవడం  డ-శ్ర.శ తో, అంటే శ్రమశక్తి కొనుగోలుతో, మొదలవుతుంది. ఉత్పత్తి ప్రక్రియ జరిగేటప్పుడు శ్రమశక్తి దోపిడీగా ఉనికిలోకొస్తుంది. కాబట్టి, విలువ స్వతంత్రం పొందడం అనేది ఆ వలయంలో తిరిగి కనబడదు. ఆ వలయంలో డబ్బూ, సరుకులూ ఉత్పత్తి కారకాలూ కేవలం ప్రక్రియలోఉన్న పెట్టుబడి విలువ యొక్క  మారుతూ ఉండే రూపాలు మాత్రమే; వెనకటి విలువ పరిమాణం మారిన ప్రస్తుత పెట్టుబడి విలువ పరిమాణంతో పోల్చబడుతుంది.


విలువ స్వతంత్రతని పొందడం పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి లక్షణం. అయితే బైలీ  దీనికి వ్యతిరేకంగా వాదిస్తాడు. అది కొంతమంది ఆర్ధికవేత్తల భ్రమగా భావిస్తాడు. విలువ అనేది సమకాలీన సరుకుల మధ్య సంబంధం అంటాడు. ఎందుకో చెబుతాడు: అలాంటిది మాత్రమే ఒకదానికొకటి మారకం అవడాన్ని అంగీకరిస్తుంది- అంటాడు.

భిన్న యుగాల సరుకు విలువల్ని పోల్చడాన్ని వ్యతిరేకిస్తూ అన్న మాటలవి. అలా పోల్చడం వివిధ కాలాల్లో ఒకే రకమైన సరుకుల ఉత్పత్తికి అవసరమైన శ్రమ వ్యయాన్ని పోల్చడం మాత్రమే. ప్రతి కాలంలోనూ డబ్బు విలువని స్థిరపరిచాక. ఇది ఆయన పొరపాటు అవగాహన వల్ల వచ్చింది. అదేమంటే: మారకం విలువ విలువకు సమానం అనుకున్నాడు. అంటే, విలువ రూపమే విలువ అనుకున్నాడు. తత్ఫలితంగా, సరుకులు మారకం విలువలుగా చురుకుగా చర్య చేయనట్లయితే, అవి వాస్తవంగా మారకం అవనట్లయితే, సరుకు విలువ పోల్చబడదు. ఇదీ ఆయన అభిప్రాయం. అందువల్ల,  అది తన వంటిదే అయిన మేరకు మాత్రమే, తన వలయంలోని - ఒకే సమయంలో ఉండని, ఒకదాని తర్వాత ఒకటి వరసలో జరిగే భిన్నదశల్లో, తనతో తాను  పోల్చబడిన మేరకు మాత్రమే విలువ, పెట్టుబడిగా లేక పెట్టుబడి విలువగా పనిచేస్తుంది అనే భావన ఆయనకు బొత్తిగా లేదు.

విలువ రూపాన్ని విశ్లేషించే పనిలో తలమునకలైన బహు కొద్దిమంది ఆర్ధికవేత్తల్లో బెయిలీ ఒకడు. వాళ్ళెవ్వరూ ఫలితాన్ని పట్టలేకపోయారు. కారణం:

ఒకటి, విలువ రూపాన్ని(value-form) విలువతోనే (value) గందరగోళ పరిచారు.

రెండు, ఈ సమస్య విషయంలో ఆచరణలో ఉన్న బూర్జువాల మొరటు ప్రభావంతో వాళ్ళు కేవలం పరిమాణాత్మక అంశాన్నిమాత్రమే పట్టించుకున్నారు.- Cap1 p56  fn1

వలయం ఫార్ములాని శుద్ధ రూపంలో పరిశీలించాలంటే, సరుకులు వాటివాటి విలువలకే అమ్ముడవుతాయి అని భావించినంతమాత్రాన సరిపోదు; ఇతర విషయాలు సమానంగానే ఉన్నప్పుడు అలా జరుగుతుందని కూడా భావించాలి. ఉదాహరణగా ఉ.పె...ఉ.పె రూపాన్ని తీసుకుందాం. ఉత్పత్తి ప్రక్రియలోపల ఒకానొక పెట్టుబడిదారుడి ఉత్పాదక పెట్టుబడి విలువని తరిగిపోయేట్లు చేసే సాంకేతిక విప్లవాల్ని పక్కన బెడదాం; అంతేకాకుండా, తయారైఉన్న సరుకు అంశాల విలువ పెరిగో, తరిగో పెట్టుబడి విలువలో వచ్చే మార్పు వల్ల కలిగే పరిణామాల్నికూడా పక్కన బెట్టి పరిశీలిద్దాం. ' 1000 కిలొల నూలు అనుకుందాం. అది దాని విలువకే, 12,000 కే అమ్ముడు పోయింది అనుకుందాం. అందులో, సా లో ఉన్న పెట్టుబడి విలువ అయిన 917 కిలోల నూలు విలువ 11,000 కి సమానం. ఒకవేళ దూది, బొగ్గు వగయిరాల విలువ పెరిగితే, 11,000 ఉత్పాదకపెట్టుబడి అంశల భర్తీకి సరిపోవు. అదనంగా డబ్బు పెట్టుబడి అవసరం అవుతుంది. డబ్బు పెట్టుబడి ఇరుక్కుపోతుంది. వాటి ధరలు పడిపోతే, ఇందుకు విరుద్ధంగా జరుగుతుంది. డబ్బు పెట్టుబడి విడుదలవుతుంది.విలువ సంబంధాలు స్థిరంగా ఉన్నఫ్ఫుడే, ప్రక్రియ మామూలుగా/సజావుగా సాగుతుంది; దాని గమనం మామూలుగా ఉంటుంది. వలయం మళ్ళీ మాల్లేఏ జరిగేటప్పుడు వచ్చే ఒడుదుడుకులు ఒకదాన్నొకటి సర్దుబాటు చేసుకున్న మేరకు ఈ గతిక్రమం ఇంచుమించు మామూలుగా ఉంటుంది. అయితే ఈ ఒడుదుడుకులు ఎంత ఎక్కువైతే, బయటపడేందుకు పెట్టుబడిదారుడి దగ్గర అంత ఎక్కువ డబ్బు పెట్టుబడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఉత్పత్తి ప్రక్రియా స్థాయీ, దానితోపాటు మదుపుపెట్టాల్సిన పెట్టుబడి కనీస పరిమాణం పెరిగే కొద్దీ, వాటికి మతొక పరిస్థితి కూడా కలుస్తుంది. ఆవి పారిశ్రామిక పెట్టుబడి దారుడి విధిని బడా డబ్బు పెట్టుబడి దారుల గుత్తాధిపత్యంలోకి అంతకంతకూ మారుస్తాయి. వాళ్ళు ఒంటరిగానో, కలిసికట్టుగానో వ్యవహరించవచ్చు.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏమంటే: ఉత్పత్తి అంశాల విలువలో మార్పు వచ్చినట్లయితే, ఒకవైపు డ...డ' రూపానికీ, మరొకపక్క,ఉ.పె...ఉ.పె, '...' రూపాలకీ కీ మధ్యా తేడా కనబడుతుంది.

మొదట డబ్బు పెట్టుబడిగా కనపడే కొత్త పెట్టుబడి ఫార్ములాగా డ-డ' లో ఉత్పత్తి సాధనాల (ముడి పదార్ధాలు, ఉపపదార్ధాలు వంటివి) విలువ తగ్గడం అంటే ఒక ప్రత్యేక పరిమాణంగల వ్యాపారం మొదలెట్టడానికి మునుపు అవసరమైన దానికంటే తక్కువ డబ్బు సరిపోతుందని అర్ధం. ఎందుకంటే, ఉత్పత్తి శక్తుల స్థాయి మారకుండా అలానే ఉంటే, ఒక నిర్దిష్ట పరిమాణంలో ఉన్న శ్రమశక్తి నిర్వహించగల ఉత్పత్తి ప్రక్రియ స్థాయి ఉత్పత్తి సాధనాల స్థాయిమీదా, వాటి పరిమాణం మీదా ఆధారపడి ఉంటుంది. అంతే గాని ఆ ఉత్పత్తి సాధనాల విలువ మీదాగానీ, శ్రమ శక్తి విలువ మీదగానీ ఆధారపడి ఉండదు. శ్రమ శక్తి విలువ పెట్టుబడి పెరుగుదల మీద ప్రభావం చూపుతుంది. ఇందుకు వ్యతిరేకమైన సందర్భాన్ని చూద్దాం. ఉత్పాదక పెట్టుబడి అంశాల విలువ పెరిగితే, ఒకే స్థాయి వ్యాపారాన్ని పెట్టడానికి మరింత డబ్బు పెట్టుబడి అవసరం అవుతుంది. రెండు సందర్భాలలోనూ పెట్టాల్సిన కొత్త పెట్టుబడి మాత్రమే ప్రభావితమవుతుంది. మొదటి సందర్భంలో డబ్బు పెట్టుబడి అదనం అవుతుంది. రెండో సందర్భంలో ఇరుక్కుపోతుంది.

ఉత్పాదక అంశాల విలువల్లో వచ్చే మార్పుల ప్రభావం

ధరలు తగ్గిపోతే, మూడు పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది:

1.పునరుత్పత్తి ప్రక్రియ అదే స్థాయిలో సాగవచ్చు. అలా జరిగితే, అప్పటిదాకా ఉన్న డబ్బు పెట్టుబడి విడుదల అవుతుంది, డబ్బు పెట్టుబడి కూడుతుంది, నిల్వపడుతుంది. అయితే నిజమైన సంచయనం (విస్తృతస్థాయి పునరుత్పత్తి) గానీ, అదనపువిలువ సంచయననిధి గా పరివర్తన చెందిన ఫలితంగా గానీ ఏర్పడింది కాదు;కానప్ప్నప్పటికీ డబ్బు పెట్టుబడి కూడుతుంది.

2.సాంకేతిక నిష్పత్తులు సరిపోతే, పునరుత్పత్తి ప్రక్రియ మామూలుగా జరిగే స్థాయికన్నా మరింత విస్తృత స్థాయిలో జరగవచ్చు.

3. ముడిపదార్ధాలు, వగయిరా పెద్దగా స్టాకు పడవచ్చు.

ధరలు పెరిగినట్లయితే

భర్తీ చెయ్యవలసిన అంశాల ధరలు పెరిగినట్లయితే, ఇందుకు వ్యతిరేకమైన ఫలితం వస్తుంది.

1. పునరుత్పత్తి మామూలు స్థాయిలో ఇక ఎంతమాత్రమూ జరగదు ( పనిదినం నిడివి తగ్గవచ్చు)

2. వెనకటంత పని ఉంచడానికి అదనపు డబ్బు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది (డబ్బు పెట్టుబడి ఇరుక్కుపోతుంది)

3. సంచయనం కోసం డబ్బు నిధి ఉండి ఉన్నట్లయితే, అది పాక్షికంగానో, పూర్తిగానో  పునరుత్పత్తి ప్రక్రియని విస్తరించడానికి బదులుగా పాతస్థాయిలో నడపడానికి  వినియోగించాల్సి వస్తుంది. ఇది కూడా డబ్బుపెట్టుబడి ఇరుక్కుపోవడమే అవుతుంది, కాకపోతే, ఇక్కడ అదనపు డబ్బుపెట్టుబడి బయటనించి, డబ్బు మార్కెట్ నించి వచ్చింది కాదు, పారిశ్రామిక పెట్టుబడి దారుడి వనరులనించి వచ్చినది.

ఏమైనప్పటికీ, ఉ.పె...ఉ.పె లోనూ,'...' లోనూ మార్పుచేసే పరిస్థితులు ఉండవచ్చు. ఉదాహరణకి మన నూలు మిల్లు యజమాని వద్ద పత్తి స్టాకు భారీగా ఉంటే (అతని ఉత్పాదక పెట్టుబడిలో పెద్ద భాగం పత్తి స్టాకు రూపంలో ఉంటే), పత్తి ధరలు తగ్గినప్పుడు అతని ఉత్పాదకపెట్టుబడిలో కొంత భాగం విలువ తగ్గుతుంది; అందుకు భిన్నంగా పత్తి ధరలు పెరిగితే, ఉత్పాదకపెట్టుబడిలో అదే భాగం విలువ పెరుగుతుంది. మరొకపక్క, సరుకు పెట్టుబడి రూపంలో ఉదాహరణకి, నూలు నిల్వ ఎక్కువగా ఉంటే, సరుకు పెట్టుబడిలో కొంత భాగం విలువ, పత్తి ధర తగ్గేకొద్దీ తగ్గుతుంది, పెరిగేకొద్దీ పెరుగుతుంది. అంతిమంగా, '-డ-స (శ్ర.శ+ఉ.సా) ప్రక్రియని పరిశీలిద్దాం.సరుకు పెట్టుబడి డబ్బు అవడం అంటే, '-డ చర్య స లోని అంశాల విలువ మారకముందు జరిగినట్లయితే, పెట్టుబడి మీద దాని ప్రభావం మొదటి సందర్భంలో సూచించినట్లే ఉంటుంది. అంటే, చలామణీ రెండో చర్య అయిన డ-స (శ్ర.శ+ఉ.సా) లో మాత్రమే ఉంటుంది. అటువంటి మార్పు గనక స'- డ చర్యకు ముందే జరిగినట్లయితే, అప్పుడు అన్ని ఇతర పరిస్థితులూ అలానే ఉండి, పత్తి ధర తగ్గితే దానికి అనుగుణంగా నూలు ధరా తగ్గుతుంది. అందుకు భిన్నంగా పత్తిధర పెరిగితే, నూలు ధరా పెరుగుతుంది. ఒకే ఉత్పత్తి శాఖలో పెట్టిన వివిధ వ్యష్టి పెట్టుబడుల మీద దాని ప్రభావం ఆ పెట్టుబడులు ఉన్న పరిస్థితుల్ని బట్టి  ఎంతో భిన్నభిన్నంగా ఉండవచ్చు.

చలామణీ ప్రక్రియ వ్యవధిలోనూ, చలామణీ వేగం లోనూ ఉండే తేడాలవల్ల కూడా డబ్బు పెట్టుబడి విడుదల కావచ్చు, ఇరుక్కుపోనూ వచ్చు. అయితే ఇది టర్నోవర్ మీద చర్చకి సంబంధించిన విషయం. ఇప్పుడు ఇక్కడ మన ఆసక్తి అంతా ఉత్పాదక అంశాల విలువల్లో వచ్చే మార్పులకి సంబంధించి, డ...డ' కీ, మిగిలిన రెండు వలయాలకీ స్పష్టమవుతున్న నిజమైన తేడా మీదే. చలామణీ చర్య అయిన డ-స (శ్ర.శ+ఉ.సా)లో ఉత్పత్తిసాధనాలలో పెద్దభాగం ఇంకెవరివో సరుకు పెట్టుబడిగా వ్యవహరిస్తున్నవి. అందువల్ల, అమ్మేవాని వైపునించి స'-',అంటే సరుకు పెట్టుబడి డబ్బు పెట్టుబడిలోకి మారుతుంది. అయితే ఇది పరమ నియమం కాదు. అందుకు భిన్నమైనది.

పెట్టుబడి చలామణీ ప్రక్రియలో భిన్న ఉత్పత్తి విధానాల సరుకులు

పారిశ్రామిక పెట్టుబడి చలామణీ ప్రక్రియలోపల డబ్బు గానో, లేక సరుకులుగానో చర్య చేస్తుంది. ఆప్రక్రియలో పారిశ్రామిక పెట్టుబడి వలయం డబ్బు పెట్టుబడిగానో, సరుకు పెట్టిబడిగానో, అత్యంత విభిన్న సామాజిక ఉత్పత్తి విధానాల సరుకు చలామణీలో  జొరబడుతుంది- అవి సరుకుల్ని ఉత్పత్తి చేసిన మేరకు. ఆ సరుకుల్ని ఉత్పత్తి చేసింది బానిసలా, చైనా, ఇండియా రైతులా, డచ్ ఈస్ట్ ఇండియా కమ్యూనులా, పూర్వం రష్యాలో భూ బానిసలపై అధారపడిన ప్రభుత్వ పరిశ్రమలా, లేక వేటాడే అనాగరిక తెగలా, మరేమైననా- అనేదానితో ఇక్కడ నిమిత్తం లేదు.

పారిశ్రామిక పెట్టుబడి రూపాలైన డబ్బుకూ, సరుకులకూ, అవి సరుకులుగా, డబ్బుగా ఎదురుపడతాయి. ఎదురుపడి దాని వలయంలో ప్రవేశిస్తాయి; అలానే ఆ వలయంలో ఏర్పడ్డ అదనపువిలువ, ఆదాయంగా వ్యయమైనట్లయితే, ఆ చలామణీలోనూ సరుకులుగా ప్రవేశిస్తాయి; విధంగా సరుకు పెట్టుబడి యొక్క రెండు శాఖల్లోనూ అవి  ప్రవేశిస్తాయి. అవి ఏ ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తయ్యాయి అనేదానితో ఇక్కడ నిమిత్తంలేదు. అవి మార్కెట్లో సరుకులుగా వ్యవహరిస్తాయి, సరుకులుగా పారిశ్రామిక పెట్టుబడి వలయంలోనూ, అందులో కలిసి ఉన్నఅదనపువిలువ, ఆదాయంగా వ్యయమైనట్లయితే, ఆ చలామణీలోనూ సరుకులుగా ప్రవేశిస్తాయి; ఆవిధంగా సరుకు పెట్టుబడి యొక్క రెండు శాఖల్లోనూ అవి  ప్రవేశిస్తాయి. కాబట్టి,పారిశ్రామిక పెట్టుబడి యొక్క చలామణీ ప్రక్రియని ప్రత్యేకపరిచేది: సరుకుల పుట్టుక యొక్క సావత్రిక స్వభావం, మార్కెట్ ప్రపంచ మార్కెట్ గా ఉండడం. ఇతరుల సరుకులకు ఏది వర్తిస్తుందో, అదే ఇతరుల డబ్బుకూ వర్తిస్తుంది. సరుకు పెట్టుబడి సరుకులుగా మాత్రమే డబ్బుకి ఎదురవుతాయో, అలానే డబ్బు సరుకు పెట్టుబడిసంబంధంలో కేవలం డబ్బుగానే పనిచేస్తుంది. ఇక్కడ డబ్బు ప్రపంచ డబ్బు విధుల్ని నిర్వర్తిస్తుంది.

ఇక్కడ రెండు పాయింట్లు:

1. డ-ఉ.సా పూర్తవగానే సరుకులు(ఉ.సా) సరుకులుగా ఉండవు, పారిశ్రామిక పెట్టుబడి మనుగడ రూపాల్లో ఒకటైన ఉత్పాదక పెట్టుబడి క్రియాత్మక రూపం పొందుతాయి.అందువల్ల వాటి పుట్టుక తెలియకుండా చెరిగిపోతుంది. అవి ఇకపారిశ్రామిక పెట్టుబడి మనుగరూపాలుగా,  మాత్రమే ఉంటాయి. ఏమైనప్పటికీ, ఒక విషయం ఇంకా అలానే ఉంటుంది. ఏమంటే,అవి భర్తీ అవాలంటె,అవి పునరుత్పత్తి అవాలి. ఈ మేరకు పెట్టుబడిదారీ ఆర్ధికవిధానం దాని సొంత అభివృద్ధి దశ బయట ఉన్న ఉత్పత్తి విధానాలను బట్టి ఉంటుంది. అయితే పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ధొరణి ఏమంటే: మొత్తం ఉత్పత్తిని, వీలైనంత మేరకు, సరుకు ఉత్పత్తిలోకి పరివర్తన చెందించడం.దీన్ని సాధించే ప్రధాన చోదక శక్తి ఏమంటే: కచ్చితంగా,మొత్తం ఉత్పత్తిని పెట్టుబడిదారీ చలామణీ ప్రక్రియలోకి లాక్కురావడం. అసలు అభివృద్ధి చెందిన సరుకుల ఉత్పత్తే, పెట్టుబడిదారీ సరుకు ఉత్పత్తి. పారిశ్రామిక పెట్టుబడి జొక్యం, ఈ పరివర్తనని ప్రతిచోటా పెంపొందిస్తుంది. కాని, దాంతోపాటే, ప్రత్యక్ష ఉత్పత్తిదారుల్ని వేతన శ్రామికులుగా మారుస్తుంది.

2. పారిశ్రామిక పెట్టుబడిలోకి ప్రవేశించే సరుకులు, వాటి మూలంతోనూ, అవి ఉత్పత్తయిన సామాజిక ఉత్పత్తి ప్రక్రియతోనూ నిమిత్తం లేకుండా, ఆసరికే సరుకు పెట్టుబడి రూపంలో,సరుకు వ్యాపారి లేక వర్తకుడు పెట్టుబడిగా ఉన్న పారిశ్రామిక పెట్టుబడికే ఎదురెదురవుతుంది. వర్తకుని పెట్టుబడి స్వభావరీత్యానే,అన్ని ఉత్పత్తి విధానాల్లోని సరుకులతో కూడి ఉంటుంది.

పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం భారీస్థాయి ఉత్పత్ర్తిని కోరుకుంటుంది. అంటే కాదు భారీస్థాయి అమ్మకాల్ని కూడా ఆశిస్తుంది. అందువల్ల వర్తకుడికి విక్రయించాలని భావిస్తుందే కాని, వ్యష్టి వినియోగదారుడికి అమ్మాలని అనుకోదు. ఒకవేళ వినియోగదారుడు ఉత్పద వినియోగదారుడు,పారిశ్రామిక పెట్టుబడిదారుడు అయితే,అంటే, ఒక ఉత్పత్తి శాఖ పారిశ్రామిక పెట్టుబడి వేరొక పరిశ్రమిక శాఖకు ఉత్పత్తి సాధనాల్ని సరఫరా చేస్తే, ఒక పారిశ్రామిక పెట్టుబడిదారుడు అనేకమంది ఇతర పెట్టుబడి దారులకు ఆర్డర్ల రూపంలో అమ్మదం అవుతుంది. ఈ మేరకు ప్రతి పారిశ్రామిక పెట్టుబడిదారుడూ ప్రత్యక్ష అమ్మకందారుడే, తన సొంత వర్తకుడే. అతను వర్తకుడుకి అమ్మినఫ్పుదు ఎలాగో అలాగే.

వర్తకుని పెట్టుబడి విధిగా సరుకుల వర్తకం పెట్టుబడిదారీ ఉత్పత్తికి ముందు అవసరం. అటువంటి ఉత్పత్తి అభివృద్ధి క్రమంలో సరుకుల వర్తకం అంతకంతకూ అధికమవుతుంది, అభివృద్ధి చెందుతుంది. అందువల్ల  మనం అడపాదడపా తరచకుండానే అది ఉన్నట్లుగా భావిస్తాం. ఎందుకంటే, పెట్టుబడిదారీ చలామణీ ప్రక్రియ యొక్క ప్రత్యేక అంశాల్ని ఉడాహరించడానికి అలా భావిస్తాం.అయితే ఈ ప్రక్రియ యొక్క సాధారణ విశ్లేషణలో, మనం  మధ్యలో వర్తకుడు లేఎనీ నేరు అమ్మకాన్ని ఊహిస్తాం. ఎందుకంటే, ఈ జోక్యం చలామనీ చలనం యొక్క వివిధ కోణాల్నీ మరుగున పెడుతుంది.

సిస్మాండీ ఈ విషయాన్ని అమాయకంగా ఇలా చెబుతాడు:

గణనీయమైన పెట్టుబడిని వాణిజ్యం వినియోగిస్తుంది. ఆ విషయం తొలి చూపుకి ఈ పెట్టుబడి మనం దేని చలనాన్ని చెప్పామో ఆ పెట్టుబడిలో భాగంగా అగపడదు. బట్టల వ్యాపారి కొట్లో నిల్వ ఉన్న బట్ట విలువ, ధనికుడు తనకోసం పేదవాడు పనిచేయడానికి వేతనంగా  సంవత్సర ఉత్పత్తినించి ఇచ్చే భాగానికి పూర్తిగా అన్యమైనదిగా మొదట కనబడుతుంది. అయినాగాని, ఈ పెట్టుబడి, మనం చెప్పిన పెట్టుబడిని భర్తీ చెసింది, అంతే. సంపద వృద్ధిని స్పష్టంగా అర్ధంచేసుడానికి, మనం ఆ సంపదని ఉత్పత్తి చెయ్యడంతో మొదలు పెట్టి, అదంతా వినియోగం అయ్యేవరకూ అనుసరించాం.

ఉదాహరణకి, అప్పుడు మనకి బట్టల తయారీలో వినియోగించిన పెట్టుబడి, ఎల్లప్పుడూ అదే పెట్టుబడి అని అనిపించింది; వినియోగదారుడి ఆదాయంతో అది మారకం అయింది. అది రెండు భాగాలుగా మాత్రమే విభజితమయింది: ఒకటోది, లాభం రూపంలో ఉత్పత్తిదారుడికి ఆదాయంగా ఉపకరించేది. రెండోది, కొత్త బట్ట తయారుచేసే కాలానికి వేతనం రూపంలో పనివాళ్ళకి ఆదాయంగా ఉపకరించేది.

అయితే, ఈ పెట్టుబడిలోని భిన్న భాగాలు ఒకదాన్నొకటి భర్తీ చేసినట్లయితే అది  అందరికీ అనుకూలంగా ఉంటుందనీ, ఉత్పత్తిదారుడికీ వినియోగదారుడికీ మధ్య మొత్తం చలామణీకి లక్ష ఎకూలు (అప్పటి యూరోలు) సరిపోతే, అది ఉత్పత్తిదారుడికీ, టోకు వ్యాపారికీ, చిల్లరవర్తకునికీ సమంగా విభజితం కావాలనీ త్వరలోనే తెలిసివచ్చింది. మొదటి వాడు,ఉత్పత్తిదారుడు మునుపు చేసిన పని చ్య్యడానికి పెట్టిన మొత్తం పెట్టుబడిలో మూడో వంతు పెట్టుబడి తొనే అంతపనీ చేశాడు. ఎందుకంటే, తన ఉత్పత్తి పని ముగిసీముగియగానే, వినియోగదారుని కన్నా, ఒక వర్తకుడు కొంటాడని గ్రహించాడు. మరొకపక్క, టొకు వ్యాపారి పెట్టుబడిని చిల్లరవర్తకుని పెట్టుబడి మరింత త్వరగా భర్తీ చేసింది... వేతనాలకి అడ్వాన్స్ చేసిన మొత్తాలకీ, చివరి వినియోగదారుడు చెల్లించిన కొనుగోలు ధరకీ మధ్య ఉండే తేడా ఆ పెట్టుబడుల లాభంగా పరిగణించబడింది. అది ఉత్పత్తిదారుడికీ, టోకు వ్యాపారికీ,చిల్లరవర్తకుడికీ - వాళ్ళమధ్య విధుల్ని వాళ్ళు విభజించుకున్నాక - పంపకమయింది. ఒకని బదులు ముగ్గురు వ్యక్తులూ, ఒక పెట్టుబడి బదులు అదే పెట్టుబడి మూడు భాగాలూ అయినప్పటికీ-జరిగిన పని మాత్రం అదే.

వారంతా (వర్తకులు) ఉత్పత్తికి పరోక్షంగా తోడ్పడతారు; ఎందుకంటే, ఉత్పత్తి లక్ష్యం వినియోగం అయినందువల్ల వినియోగదారునికి అందుబాట్లో వస్తువుని పెట్టేవరకూ ఉత్పత్తి పూర్తి అయినట్లుగా పరిగణించలేము.

కాపిటల్ రెండో సంపుటం అంతటా, ప్రత్యేకించి వలయాల సాధారణ రూపాలగురించిన చర్చలో,  డబ్బంటే మనకి లోహ డబ్బు అనే అర్ధం. ఇందుకు మినహాయింపులు:

1.కేవలం విలువ చిహ్నాలయిన,కొన్నిరాజ్యాల్లో మాత్రమే ప్రత్యెక వాడకంకోసం తయారైన symbolic money

2. అప్పటికింకా అభివృద్ధి చెందని పరపతి డబ్బు.

మొదటి విషయం. ఇది చరిత్ర నడిచే క్రమం. పెట్టుబడిదారీ ఉత్పత్తి తొలి యుగంలో పరపతి ఉత్పత్తి చిన్న పాత్ర మాత్రమే పోషించింది, లేదా అసలు దాని పాత్ర ఏమీ లేదు.

రెండో విషయం . ఇంతదాకా  పరపతి డబ్బు చలామణీ గురించి టూక్ తదితరులు వివరించిన విమర్శనాత్మక స్వభావంకలిగిన ప్రతిదీ, కేవలం లోహ డబ్బు తప్ప మరేమీ చలామణీలో లేకపోయినట్లయితే పరిస్థితి ఎలా ఉండేది అనే సమస్య మీదే ధ్యాస పెట్టారు, దాన్నే పదేపదే ప్రస్తావించారు. అయితే,మనం ఒక విషయం మరువ కూడదు. ఎమంటే: లోహ డబ్బు కొనుగోలు మాధ్యమంగా ఉపకరిస్తుంది. అంతే కాదు, చెల్లింపు మాధ్యమంగా కూడా పనిచేస్తుంది. తేలికగా ఉండడం కొసం, రెండో సంపుటం అంతటా దాని మొదటి క్రియాత్మక రూపంలోనే చూస్తాం. 

వ్యష్టి పారిశ్రామిక పెట్టుబడి వలయంలో భాగమైన దాని చలామణీ ప్రక్రియ, సాధారణ సూత్రాల చేత నిర్ణయమవుతుంది. ఆ సూత్రాలు కాపిటల్ ఒకటో సంపుటం మూడో ఆధ్యయంలో నిర్దేశించబడి ఉన్నాయి. డబ్బు చలామణీ వేగం అధికం అయ్యేకొద్దీ,, అందుమూలంగా ప్రతి వ్యష్టి పెట్టుబడీ దాని సరుకు లేక డబ్బు పరివర్తనల వరస గుండా మరింత వేగంగా నడిచే కొద్దీ, ఒకే మొత్తం డబ్బు ఉదాహరణకి రు.11,000 అనుకుందాం- మరిన్ని పారిశ్రామిక పెట్టుబడుల్ని (సరుకు పెట్టుబడుల రూపంలో వ్యష్టి పెట్టుబడుల్ని) చలనంలో పెడుతుంది. పారిశ్రామిక పెట్టుబడులు (సరుకు పెట్టుబడుల రూపంలో వ్యష్టి పెట్టుబడులు) మరిన్ని అవుతాయి. డబ్బు చెల్లింపు మాధ్యమంగా పనిచెయ్యడం ఎక్కువయ్యేకొద్దీ, అందుమూలంగా, మిగుళ్ళూ, లోట్లూ సర్దుబాటు చేసుకోవడం మినహా ఇంకేమీ ఉండదు. చెల్లింపుల వ్యవధులు-- ఉదాహరణకి వేతనాల చెల్లింపు -  తగ్గేకొద్దీ, ఒక మొత్తం పెట్టుబడి విలువ చలామణీకి అవసరమైన డబ్బు తగ్గుతుంది. మరొక పక్క, చలామణీ వేగమూ, అన్ని ఇతర పరిస్థితులూ అలానే ఉన్నాయి అనుకుంటే, డబ్బు పెట్టుబడిగా చలామణీ అయ్యే డబ్బు ఎంత? అనేది సరుకుల ధరల మొత్తాన్ని (సరుకుల పరిమాణం* ధర) బట్టి నిర్ణయమవుతుంది. లేక, ఒకవేళ సరుకుల విలువా, పరిమాణమూ స్థిరంగా ఉన్నట్లయితే, డబ్బు విలువ చేత నిర్ణయమవుతుంది.

సరుకుల సాధారణ చలామణీ సూత్రాల వర్తింపు

అయితే,  పెట్టుబడి చలామణీ ప్రక్రియ మామూలు చలామణీ చర్యల వరుస గా ఉన్నప్పుడు మాత్రమే, ఈ సరుకుల సాధారణ చలామణీ సూత్రాలు వర్తిస్తాయి; వ్యష్టి పారిశ్రామిక  పెట్టుబడుల వలయంలో క్రియాత్మకంగా నిర్ణీతమైన భాగాలుగా ఉన్నప్పుడు ఆ సూత్రాలు చెల్లుబాటు కావు. ఈ విషయాన్ని స్పష్టపరచడానికి చలామణీ ప్రక్రియని దాని నిరంతరాయమైన, అంతస్సంబంధంలో అధ్య్యానం చెయ్యడం ఉత్తమం, అది ఈ రెండు రూపాల్లో కనబడుతుంది: 




స-డ-స రూపంలోనైనా, డ-స-డ రూపంలోనైనా చలామణీ చర్యల వరస అయిన చలామణీ ప్రక్రియ, రెండు పరస్పర విరుద్ధ సరుకు రూపాంతరీకరణల వరసను చూపుతుంది. ఒక్కొక రూపాంతరీకరణా పరాయి సరుకు వైపునించి లేక ఆసరుకుని ఎదుర్కునే ఇతరుల డబ్బు వైపునించి విరుద్ధ రూపాంతరీకరణను ఇముడ్చుకొని ఉంటుంది. ఒక సరుకు ఓనర్ వైపునించి స-డ అనేది దాన్ని కొనేవాడికి డ-స అవుతుంది; స-డ లో సరుకు మొదటి రూపాంతరీకరణ, డబ్బుగా ముందుకొచ్చే సరుకు యొక్క రెండో రూపాంతరీకరణ; సరుకు మొదటి రూపాంతరీకరణ డ రూపంలో కనబడుతుంది;  ఇందుకు వ్యతిరేకమైనది డ-స కి వర్తిస్తుంది. పెట్టుబడిదారుడు సరుకులు అమ్మేవాడుగానూ, కొనేవాడుగానూ వ్యవహరిస్తాడు. అందువల్ల అతని పెట్టుబడి మరొకరి సరుకులకు ఎదురుగా డబ్బురూపంలో పనిచేస్తుంది.కాబట్టి,ఒక దశలో ఒకానొక సరుకు రూపాంతరీకరణ మరొక దశలో ఉన్న మరొక సరుకుతో ముడిబడి ఉందడాన్ని గురించి చెప్పినది పెట్టుబడి చలామణీకీ వర్తిస్తుంది. కాని, ఈ ఒకదానితో ఒకటి ముడిబడి ఉండడాన్నీపెట్టుబడుల రూపాంతరీకరణలు పెనవేసుకోవడాన్నీ ఒకటిగా భావించకూడదు.

మొదటి విషయం. డ-స (ఉత్పత్తి సాధనాలు) మనం ఇంతకుముందే చూసినట్లు వేర్వేరు వ్యష్టి పెట్టుబడుల  రూపాంతరీకరణల కలయికకి  కావచ్చు. ఉదాహరణకి, ఒక నూలు మిల్లు ఓనర్ సరుకు పెట్టుబడి అయిన నూలు పాక్షికంగా బొగ్గు చేత భర్తీ అయింది. ఒక భాగం పెట్టుబడి డబ్బు రూపంలో ఉండి, సరుకుల రూపంలోకి మారుతుంది.కాగా, బొగ్గు ఉత్పత్తిచేసే పెట్టుబడి దారుడి పెట్టుబడి సరుకుల రూపంలో ఉండి, అందువల్ల డబ్బులోకి మారుతుంది; ఒకే చలామణీ చర్య ఈ సందర్భంలో రెండు భిన్న ఉత్పత్తి శాఖల్లో పారిశ్రామిక పెట్టుబడుల విరుద్ధ రూపాంతరీకరణలకి ప్రతినిధిగా ఉంటుంది, అందువల్ల ఈ పెట్టుబడుల రూపాంతరీకరణల వరసలు పెనవేసుకుంటాయి. అయితే మనం  చూసినట్లు ఉత్పత్తి డబ్బు మారే సాధనాలు (ఉ.సా ) భావాభివర్గ అర్ధంలో సరుకు పెట్టుబడే కానక్కరలేదు;అంటే,పారిశ్రామిక పెట్టుబడి క్రియాత్మక రూపం అవక్కర్లేదు, పెట్టుబడి దారుడే ఉత్పత్తి చేసిందే కానక్కర్లేదు. అది ఎల్లప్పుడూ ఒకవైపు డ-స, మరొకవైపు స-డ. అయితే ఎల్లప్పుడూ పెట్టుబడుల రూపాంతరీకరణల కలయికే. అది ఎల్లప్పుడూ ఒకవైపు డ-స, మరొకవైపు స-డ. అయితే ఎల్లప్పుడూ పెట్టుబడుల రూపాంతరీకరణల కలయికే. అంతేకాదు, డ-శ్ర.శ, శ్రమశక్తి కొనుగోలు  పెట్టుబడుల రూపాంతరీకరణల కలయిక ఎన్నడూ  కాదు. ఎందుకంటే: శ్రమశక్తి శ్రామికుని సరుకు అయినప్పటికీ, పెట్టుబడిదారుడికి అమ్మేదాకా అది సరుకు కాదు. మరొక పక్క,'-'లో డ' మారినసరుకు పెట్టుబడికి ప్రాతినిధ్యం వహించాల్సిందే. శ్రమశక్తి అనే సరుకు డబ్బులో సిద్ధించడం (వేతనం) కావచ్చు, లేక ఒక స్వతంత్ర శ్రామికుని ఉత్పాదితమో,బానిస ఉత్పాదితమో, భూబానిస ఉత్పాదితమో,తెగ ఉత్పాదితమో అయి ఉండవచ్చు.

రెండో విషయం. ప్రపంచ మార్కెట్ ఉత్పత్తి అంతా పెట్టుబడిదారీ పద్ధతిలో జురుగుతున్నది అని అనుకుందాం. అప్పుడు ఒక వ్యష్టి పెట్టుబడి ప్రక్రియ వలయం లోపల క్రియాత్మకంగా నిర్ణయమైన పాత్రని పోషించే  ప్రతి రూపాంతరీకరణా  మరొక పెట్టుబడి వలయంలో దానికి తగిన వ్యతిరేక రూపాంతరీకరణగా అన్ని సందర్భాల్లోనూ ఉండాలి అనేదేమీ లేదు. ఉదాహరణకి, ఉ.పె...ఉ.పె వలయంలో స ' ని డబ్బులోకి మార్చే డ కొనేవాడికి అదనపువిలువ డబ్బు అవడం కావచ్చు (ఆ సరుకు వినియోగ వస్తువు అయితే); '...'(శ్ర.శ+ఉ.సా) లో(ఇక్కడ అప్పటికే సంచయమైన పెట్టుబడి ప్రవేశించి ఉంది) డ', ఉత్పత్తిసాధనాల్ని అమ్మేవానికి సంబంధించినంతవరకూ, అతను మదుపు పెట్టిన పెట్టుబడిని భర్తీ చేసేందుకు మాత్రమే, అతని పెట్టుబడి చలామణీలోకి ప్రవేశిస్తుంది.లేదా ఆదాయాన్ని ఖర్చుచెయ్యడానికి మళ్లించడం వల్ల అది తిరిగి చలామణీలోకి అసలు చేరనే చేరదు.

అందువల్ల, మొత్తం సామాజిక పెట్టుబడిలోని వివిధ భాగాలూ, చలామణీ ప్రక్రియలో ఒకదాన్నొకటి భర్తీ చేసుకునే సరళి, సరుకుల చలామణీలోని రూపాంతరీకరణల కలయికల - అన్ని ఇతర సరుకుల చలామణీలతో పెట్టుబడి చలామణీ చర్యలు ఉమ్మడిగా కలిగి ఉన్న కలయికల-నుండి నిర్ధారించబడదు. దానికి వేరే పరిశోధనా పద్ధటి అవసరం. ఇప్పటిదాకా, పదాల్ని పలకడంతో తృప్తిపడ్డారు. దగ్గరగా పరిశీలిస్తే, ఆపదాల్లో మొత్తం సరుకు చలామణీకి ఉమ్మడివైన రూపాంతరీకరణల కలయికల నుంచి అరువు  తెచ్చుకున్న అనిర్దిష్టమైన భావాలు తప్ప ఏమీ లేనట్లు తేటతెల్లమవుతుంది.

సహజ డబ్బు ఆర్ధిక వ్యవస్థా - పరపతి ఆర్ధిక వ్యవస్థా

అందువల్ల, పారిశ్రామిక పెట్టుబడి వలయాల అత్యంత స్పష్టమైన ప్రతేకతల్లో ఒకటి ఏమిటంటే: ఒక పక్క ఉత్పాదకపెట్టుబడిలోని అంశాలు సరుకుల మార్కెట్ నించి వస్తాయి.వాటిని సరుకులుగా  కొనాలి  నిరంతరం కొంటూ ఉండాలి; ఇంకొకపక్క, శ్రమప్రక్రియలో  ఉత్పత్తయిదాన్ని  సరుకుగా నిరతరం అమ్ముతూ ఉండాలి. ఉదాహరణగా స్కాట్ లాండ్ పల్లపు పొలాల్లో ఆధునిక వ్యవసాయదారుణ్ణి, యూరప్ లోని పాతతరహా చిన్న రైతుతో పోల్చి చూద్దాం. మొదటివాడు పండినదాన్నంతా అమ్ముతాడు.అందువల్ల ఉత్పత్తికి కావలసిన ప్రతి దాన్నీ విత్తనాలతో సహా భర్తీ చేయ్యాలి. మాకెట్లో కొనాలి. రెండోవాడూ, తన ఉత్పత్తిచేసిన వాట్లో ఎక్కువ భాగం సొంతానికి వాడుకుంటాడు. వీలైనంత తక్కువ మాత్రమే అమ్ముతాడు, కొంటాడు. సాద్యమైన మేరకు పరికరాల్నీ, బట్టల్నీ, ఇతర వస్తువుల్నీ తయారుచేసుకుంటాడు.

అందువల్ల, సహజ ఆర్ధిక వ్యవస్థ, డబ్బు ఆర్ధిక వ్యవ్స్థా, అప్పు ఆర్ధిక వ్యవస్థా  సమాజ ఉత్పత్తిలో చనం తాలూకూ లాక్షణికమైన మూడు ఆర్ధిక రూపాలుగా ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంచబడ్డాయి.

మొదటివిషయం. ఇవి మూడు రూపాలూ అభివృద్ధిలో సమానమైన దశలు కావు. పరపతి ఆర్ధిక వ్యవస్థ అనబడేది కేవలం డబ్బు ఆర్ధిక వ్యవస్థకి ఒక రూపమ్మాత్రమే. ఎందుకంటే: ఆ రెండు పదాలూ ఉత్పత్తి దారుల మధ్య విధుల్ని, లేక మారక విధానాల్ని వ్యక్తం చేస్తాయి. అభివృద్ధిచెందిన పెట్టుబడిదారీ ఉత్పత్తిలో డబ్బు ఆర్ధిక వ్యవస్థ  పరపతి ఆర్ధిక వ్యవస్థకి పునాదిగా మాత్రమే అగపడుతుంది. ఆవిధంగా ఈ రెండు వ్యవస్థలూ పెట్టుబడిదారీ ఉత్పత్తి అభివృద్ధిలో కేవలం భిన్న దశలకు మాత్రమే అనుగుణమైనవి. కాని అవి ఏవిధంగానూ సహజ ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన  స్వతంత్ర మారక రూపాలు కావు. అదే సమర్ధనతో సహజ ఆర్ధిక వ్యవస్థ యొక్క భిన్న రూపాల్ని ఆ రెండు ఆర్ధిక వ్యవస్థలకీ సమానమైనవని  ఎదురు నిలపవచ్చు.

రెండో విషయం. డబ్బు ఆర్ధికవ్యవస్థ, అప్పు ఆర్ధికవ్యవస్థ అనే రెండు భావాభివర్గాల మధ్య భేదాన్ని చూపే గుర్తు ఆర్ధికవ్యవస్థకాదు. అంటే ఉత్పత్తి ప్రక్రియ కాదు, ఆ ఆర్ధికవ్యవస్థకు అనుగుణమైన మారక విధానం, వివిధ ఉత్పత్తి దారులకు మధ్య మారక విధానం. అందువల్ల మొదటి భావాభివర్గానికి ఇదే వర్తించాలి. కాబట్టి సహజ ఆర్ధికవ్యవస్థకి బదులు, వస్తుమార్పిడి ఆర్ధికవ్యవస్థ ఉంటుంది.పెరూ లోని ఇంకా రాజ్యం వంటి పూర్తి ఏకాకి సహజ ఆర్ధికవ్యవస్థ ఈ భావాభివర్గాల్లో దేనికిందికీ రాదు.

మూడో విషయం. అన్ని రకాల సరుకు ఉత్పత్తికీ ఉమ్మడి అంశం డబ్బు ఆర్థికవ్యవస్థ. వివిధ సామాజిక ఉత్పత్తిలో తయారైనవస్తువు సరుకుగా అగపడుతుంది.కాబట్టి, పెట్టుబడిదారీ ఉత్పత్తి యొక్క విశిష్ట లక్షణాన్ని తెలిపేది ఒక వర్తకవస్తువుగా, సరుకుగా, ఉత్పాదితం ఉత్పత్తత్తయ్యే స్థాయి మాత్రమే.అందువల్ల, దాని తయారీలో వాడిన వస్తువులు తిరిగి వర్తకవస్తువులుగా,సరుకులుగా, దాన్ని ఏర్పరిచిన ఆర్థికవ్యవస్థలో ప్రవేశించాలి కనుక ప్రవేశించే స్థాయి కూడా.

  1. వాస్తవానికి, పెట్టుబడిదారీ ఉత్పత్తి, సాధారణ ఉత్పత్తి రూపంగా సరుకు ఉత్పత్తి. అది అభివృద్ధి చెందేకొద్దీ ఎక్కువవుతూ పోతుంది. అందుకు కారణం: అసలు శ్రమే ఇక్కడ ఒక సరుకుగా కనబడడమే, శ్రామికుడు తన శ్రమని, అంటే,  తన శ్రమశక్తి చర్యని అమ్ముకోవడమే. అతను తన శ్రమశక్తిని దాని విలువకే, దాని పునరుత్పత్తికయ్యే ఖర్చు నిర్నయించే విలువకే అమ్ముతాడని మనం అనుకున్నాం. శ్రమ వేతన శ్రమ అయిన మేరకు, ఉత్పత్తిదారుడు పారిశ్రామిక పెట్టుబడిదారుడు అవుతాడు. ఆ కారణంగా  ప్రత్యక్ష వ్యవసాయ ఉత్పత్తిదారుడు వేతనశ్రామికుడు అయ్యేదాకా పెట్టుబడిదారీ ఉత్పత్తి(అందువల్ల సరుకు ఉత్పత్తి) పూర్తి స్థాయిని చేరుకోదు. పెట్టుబడిదారుడూ- వేతనశ్రామికుడూ సంబంధంలో, డబ్బు సంబంధం, కొనేవాడికీ అమ్మేవాడికీ మధ్య సంబంధం ఉత్పత్తిలో ఉండే స్వాభావిక సంబంధం అవుతుంది. అయితే ఈ సంబంధానికి పునాదిగా ఉన్నది ఉత్పత్తి యొక్క సామాజిక స్వభావమేగాని, మారక పద్ధతి కాదు. ఎమైనప్పటికీ, ఏమైనప్పటికీ, ఇది బూర్జువా ఆలోచననా లకు సరిగ్గా సరిపోతుంది. ఎండుకంటే, ప్రతివాడూ చీకటి వ్యాపారం చేయ్యడంలో నిమగ్నమై ఉంటాడు. ఉత్పత్తి విధానం యొక్క స్వభావమే దానికి అనుగుణమైన మారక పద్ధతికి పునాది అని గ్రహించడు. అందుకు వ్యతిరేకంగా, ఉత్పత్తి విధానం స్వభావానికి దానికి అనుగుణమైన మారక పద్ధతే పునాది అని అనుకుంటాడు.

సరఫరా - గిరాకీ

పెట్టుబడిదారుడు చలామణీ నించి తెసుకునే విలువకంటే, తక్కువ విలువని చలామణీలో పెడతాడు. కారణం: అతను సరుకులరూపంలో చలామణీలో పెట్టే విలువకంటే ఎక్కువ విలువని సరుకులరూపంలో చలామణీ నించి తీసుకుంటాడు. అతను పెట్టుబడి అవతారంగా, పారిశ్రామిక పెట్టుబడిదారుడిగా మాత్రమే పనిచేస్తాదు. కాబట్టి,అతను సరఫరాచేసే సరుకువు విలువ, సరుకులకోరకు అతని గిరాకీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో అతని సర్ఫరా, గిరాకీ సరిపోతే, అతని పెట్టుబడి అదనపు విలువని ఏమాత్రం ఉత్పత్తి చెయ్యనట్లే. అది ఉత్పాదకపెట్టుబడిగా పనిచెయ్యనట్లే. అదనపు విలువ కలిసి పెరగకుండానే ఆ ఉత్పాదకపెట్టుబడి సరుకు పెట్టుబడిలోకి మారినట్లే. అది ఉత్పత్తి ప్రక్రియలో శ్రమశక్తి నించి సరుకులరూపంలో అదనపువిలువను లాగనట్లే. అది పెట్టుబడిగా వ్యవహరించనట్లే. పెట్టుబడిదరుడు కొన్నదానికంటే ప్రియంగా అమ్మితీరాలి. అతను కొన్న తక్కువ విలువైన సరుకుని ఉత్పత్తి ప్రక్రియ ఎక్కువ విలువైన సరుకుగా మారేట్లు చెయ్యగలిగినప్పుడు మాత్రమే, అలా చెయ్యడంలో సఫలత సాధించగలడు. అతను ప్రియంగా అమ్ముతాడు, అయితే తన సరుకు విలువకంటే ఎక్కువకి అమ్మడం వల్ల కాదు, అతని సరుకులో దానిఉత్పత్తిలో వాడిన సరుకుల విలువకంటే ఎక్కువ విలువ ఉన్నందువల్ల.

తన పెట్టుబడి విలువని విస్తరించే రేటు పెరిగే కొద్దీ,అతని సరఫరాకీ అతని గిరాకీకి మధ్య తేడా ఎక్కువవుతుంది. అంటే, అతను సరఫరా చేసే సరుకు విలువ, అతను డిమాండ్ చేసె సరుకు విలువను మించి ఉంటుంది. అతని ఉద్దేశంసరఫరా గిరాకీని సమం చెయ్యడం కాదు. వాటి మధ్య అసమానతని, తన గిరాకీ కన్న సరఫరాని ఎంత వీలైతే అంత పెంచడం.

వ్యష్టి పెట్టుబడి దారుడికి వర్తించేదే  పెట్టుబడిదారీ వర్గానికీ వర్తిస్తుంది. పెట్టుబడిదారుడికి అవసరమైన సరుకులు ఉత్పత్తి సాధనాలూ, శ్రమశక్తీ. అతని గిరాకీ ఈ రెంటికే పరిమితం. విలువ విషయానికొస్తే: ఉత్పత్తిసాధనలకోసం అతని గిరాకీ అతను పెట్టిన పెట్టుబడికంటే తక్కువ. తన పెట్టుబడి విలువ కంటే తక్కువ విలువకి ఉత్పత్తిసాధనాల్ని కొంటాడు. అందువల్ల అతను సరఫరా చేసే సరుకు పెట్టుబడి విలువ కన్నా ఇంకా తక్కువ విలువ కలిగినవి.
శ్రమశక్తి కోసం అతని గిరాకీ విషయానికోస్తే: అది విలువ దృష్ట్యా అతని మొత్తం పెట్టుబడికి, అస్థిరపెట్టుబడి ఉన్న సంబంధం చేత నిర్ణయమవుతుంది. అందువల్ల అస్థిర: మొత్తం పెట్టుబడి. తద్వారా పెట్టుబడిదారీ ఉత్పత్తిలో ఈ గిరాకీ ఉత్పత్తి సాధనాల కోసం గిరాకీ కంటే తక్కువగా పెరుగుతుంది.అతని ఉత్పత్తిసాధనాల కొనుగోలు, శ్రమశక్తి కొనుగోలును మించి పెరుగుతుంది.

సాధారణంగా శ్రామికుడు తన వేతనాన్ని జీవితావసర వస్తువ్లుగా మారుస్తాడు. అందునా సిమ్హభాగాన్ని పరమ అవసరాల్లోకి మారుస్తాడు. కాబట్టి, శ్రమశక్తి కోసం పెట్టుబడిదారుడి డిమాండు శ్రామిక వర్గానికి అవసరమైన వస్తువులకోసం ఉండే డిమాండ్ కూడా. అయితే ఈ డిమాండు అస్థిర పెట్టుబడికి సమానం. అంతకుపైన ఆవంతైనా ఉండదు. ఒకవేళ శ్రామికుడు తన వేతనంలో కొంత పొదుపుచేస్తే దాన్నతను నిల్వగా మారుస్తాడు, ఆ మేరకు కొనేవాడుగా ఉండదు. ఇక్కడ మనం అరువు సంబంధాల్ని పూర్తిగా వదిలిపెడుతున్నాం. పెట్టుబడిదారుడి డిమాండ్ కి పై పరిమితి అతని పెట్టుబడి మొత్తం,  అంటే స్థిర+అస్థిర. కాగా, అతని సరఫరా స్థిర+అస్థిర+అ.వి కి సమానం. ఫలితంగా, అతని సరుకు పెట్టుబడి 80స్థిర+20 అస్థిర+ 20 అ.వి అయినట్లయితే, అతని డిమాండ్ 80స్థిర+20 అస్థిర కి సమానం. విలువ కోణం నించి చూస్తే, అతని డిమాండ్ అతని సరఫరాలో 5 వ వంతు తక్కువ. అయినప్పటికీ, మరొకపక్క ఉత్పత్తిసాధనాలకొసం అతని డిమాండ్  ఎల్లప్పుడూ అతని పెట్టుబడి కంటే తక్కువగానే ఉంటుంది- అనే విషయాన్ని మరువకూడదు. అందువల్ల ఉత్పత్తిసాధనాల కొసం అతని డిమాండ్ విలువ, అంతే పెట్టుబడితో అవే పరిస్థితుల్లో పనిచేస్తూ, అతనికి ఉత్పత్తిసాధనాల్ని సరఫరా చేసే పెట్టుబడిదారుడు ఉత్పత్తిచేసే సరుకు విలువకన్నా తక్కువే ఉండి తీరుతుంది. సరఫరా చేసేది ఒక్క పెట్టుబడిదారుడే ఐనా, మరింతమందైనా పరిస్థితి మారదు. అతని పెట్టుబడి రు.10,000 అనుకుందాం. అందులో 800 స్థిర, 200 అస్థిర.అయితే, అందరి పెట్టుబడి దారుల మీదా అతని డిమాండ్ 800 కి సమానం. అందరూ కలిసి ప్రతి 1000 కీ 1200 విలువగల ఉత్పత్తిసాధనాల్ని సరఫరా చేస్తారు. అందరికీ లాభం రేటు ఒకటే అనుకుందాం. పర్యవసానంగా, అతని డిమాండ్ ని విలువలో  వాళ్ళ సరఫరాలో మూడింట రెండొంతులకు సమానం. కాగా అతని మొత్తం డిమాండ్ తన సరఫరాలో అయిదింట నాలుగొంతులు అవుతుంది.

ఇంకా టర్నోవర్ సమస్య పరిశోధన మిగిలే ఉన్నది. ప్ర్ట్టుబడిదారుడి మొత్తం పెట్టుబడి 50,000 అనుకుందాం. అందులో 40,000 ఫిక్స్డ్, 10,000 చర పెట్టుబడి. ఈ 1000 లో 800 స్థిర 200 అస్థిర అనుకుందాం. అతని మొత్తం పెట్టుబడి పెట్టుబడి ఏడాదికి ఒకసారి చలామణీ అవాలంటే, అతని పెట్టుబడి ఏడాదికి 5 సార్లు టర్నోవర్ అవాలి. అప్పటికి సరుకు ఉత్పాదితం 6,000 అవుతుంది. ఎంటే, అతను పెట్టిన విలువకంటే 1000 ఎక్కువ అన్నమాట. అదనపు విలువ ముందుచెప్పిన నిష్పత్తిలోనే ఉంటుంది.

5000 పెట్టిన పెట్టుబడి మొత్తం : 1000 (స్థిర+అస్థిర):20 అ.వి.

అందువల్ల ఈ తర్నోవర్ అతని మొత్తం డిమాండ్ కీ, మొత్తం సరఫరాకీ నిష్పత్తిలో ఏమీ మార్పుచెయ్యదు. మొదటిది, తరువాత దానికన్న ఐదింట ఒకవంతు తక్కువగా అలానే ఉండిపోతుంది.

అతని ఫిక్స్డ్ పెట్టుబడి పదేళ్ళలో పునరుద్ధరించబడాలి అనుకుందాం. అప్పుడు అతను ఏటా పదోవంతుని అంటే 400 నిల్వ చేస్తాడు. కాబట్టి మొదటి సంవత్సరం అనంతరం అతని వద్ద ఫిక్స్డ్ పెట్టుబడిగా 3600, డబ్బుగా 400 మిగిలి ఉంటుంది. రిపేర్లు అవసరం అయితే, అవి సగటుని దాటకుండా ఉంటే, అవి రాబోయే కాలంలో పెట్టే పెట్టుబడులు మాత్రమే, మరేమీ కావు.

ఇప్పుడు పునరుత్పత్తి గురించి. పెట్టుబడిదారుడు మొత్తం అదనపు విలువని వినియోగించుకుంటాడనీ, మొదట పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని మాత్రమే ఉత్పాదక పెట్టుబడిలోకి పరివర్తన చెందించాడనీ అనుకుందాం. అప్పుడు పెట్టుబడి దారుడి డిమాండ్ విలువ అతని సరఫరా విలువకి సమానమవుతుంది; అయితే ఇది అతని పెట్టుబడి చలనాన్ని సూచించదు. పెట్టుబడిదారుడుగా అతని డిమాండ్ (విలువపరంగా) అతని సరఫరాలో ఐదింట నాలుగొంతులకు మాత్రమే ఉంటుంది. అతను మిగిలిన ఒక వంతు పెట్టుబడిదారుడు కానివాడుగా వినియోగించుకుంటాడు. అంటే పెట్టుబడిదారుడుగా తన పెట్టుబడిని పెంచుకోడానికి కాకుండా, తన  ప్రైవేటు అవసరాలకూ, విలాసాలకూ వినియోగిస్తాడు.

శాతాల్లో చెబితే, అతని లెక్క ఇలా ఉంటుంది:

పెట్టుబడిదారుడిగా డిమాండు = 100, సరఫరా = 120

పట్టణ మనిషిగా  డిమాండు    =  20, సరఫరా =   -

               మొత్తం డిమాండు = 120, సరఫరా = 120

 

ఈ ఊహ పెట్టుబడిదారీ ఉత్పత్తి ఉనికిలో లేదు, అందువల్ల పారిశ్రామిక పెట్టుబడిదారుడే లేడు అనే ఊహకి సమానం. ఈ ఊహ వల్ల పెట్టుబడిదారీ ఉత్పత్తి సమూలంగా రద్దవుతుంది. ఎందుకంటే, ఇక్కడ ప్రేరణ శక్తిగా పనిచేస్తున్నది సొంత వినియోగమే కాని డబ్బు పెంపు చేసుకోవడం కాదు. 

అటువంటి ఊహ సాంకేతికంగాకూడా అసాధ్యమే. పెట్టుబడి దారుడు కొంత పెట్టుబడిని నిల్వగా ఉంచాలి. ఎందుకంటే: ధరల ఎగుడుదిగుళ్లను తట్టుకునేందుకూ; అమ్మెందుకూ కొనేందుకూ అనుకూలమైన సమయం వచ్చేదాక వేచి వుండగలగడానికి కూడా. అతను తన ఉత్పత్తిని విస్తరించడం కోసమూ, సాంకేతిక అభివృద్ధిని ఏర్పరచుకోడం కోసమూ పెట్టుబడిని సంచయనం చెయ్యాలి. చెయ్యాలంటే, అతను ముందుగా చలామణీ నుండి  కొంత అదనపు విలువని డబ్బురూపంలో తీసి, కూడబెతూ ఉండాలి. ఎప్పటిదాకా? తన పాత వ్యాపారాన్ని పెంచడానికో, లేక ఏదన్నా పక్క వ్యాపారం పెట్టడానికో సరిపోయేటంత అయ్యేదాకా నిల్వపెట్టాలి. కూడబెట్టడం కొనసాగుతున్నంతవరకూ, అది పెట్టుబడిదారుడి డిమాండ్ ని పెంచదు. ఆ డబ్బు చలనం లేకుండా స్తంభించి ఉంటుంది. అది సరాఫరా చేసిన సరుకులకు తీసుకున్న డబ్బుకి సమానమైన సరుకుల్ని అది మార్కెట్ నించి తిరిగి తీసుకోదు. 

ఇక్కడ పరపతిని పరిగణించడం లేదు. ఉదాహరణకి, పెట్టుబడి దారుడు కూడబెడుతున్న డబ్బుని వడ్డీ వచ్చే బాంకు కరెంట్ అకౌంట్లో చేసే డిపాజిట్లు పరపతి కిందికే వస్తాయి.