8, ఏప్రిల్ 2017, శనివారం

మళ్ళీ పెరుగుతున్న మార్క్స్ ప్రాధాన్యత

మళ్ళీ పెరుగుతున్న మార్క్స్ ప్రాధాన్యత
2017 ఏప్రిల్ ‘వీక్షణం’ లో వచ్చింది

‘మార్క్స్ సహస్రాబ్ది మహామేధావి’ అని 1999 లో బి.బి.సి. సర్వే ప్రథమస్థానం ఇచ్చింది. లిబరల్ ఆర్థికకవేత్తలు ‘మార్క్స్ మళ్లీ వచ్చాడు’ అంటున్నారు. ఆర్థిక వృద్ధి బాగా ఉన్న వికాసకాలం (బూం)లో ఆర్థికవేత్తలకు మార్క్స్ గుర్తురాడు. ఎవరైనా గుర్తుచేసినా తేలిగ్గా తీసేస్తారు. ఆయన చెప్పినవి తప్పని తోసేస్తారు. అయితే ఆ వృద్ధి అంతలోనే అంతమై, క్షీణకాలం (బస్ట్) వెంటబడుతుంది. అలా ఆర్థిక సంక్షోభం  వచ్చినప్పుడల్లా వారికి మార్క్స్ గుర్తొస్తాడు. ఇది ప్రతిసారీ జరుగుతున్నదే. వాస్తవాన్ని అప్పుడైనా, అంతవరకైనా అంగీకరించడం సంతోషించదగిందే. కాని, వాళ్ల అంగీకారం ఎంతలోతైనదో తప్పక పరిశీలించాలి.
అమెరికా 1990 దశకంలో మంచి వృద్ధి సాధించింది. 2.2 కోట్ల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. దేశ దేశాల నుంచి పనుల కోసం అక్కడికి ఎగబడటం అందరికీ తెలిసిందే. ఐ.టి. రంగం చూపుకు అందనంత వేగంగా దూసుకుపోయింది. ఈఆర్థిక వృద్ధిని చూసి పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు ఉప్పొంగిపోయారు. ఎంతగానంటే దానికి సరికొత్త ఎకానమీ ( న్యూ ఎకానమీ) అని నామకరణం చేశారు. ఐ.టి. దీన్ని ముందుకు లాక్కు పోతుందనీ,  అదే ఎకనామీకి చోదకశక్తి అనీ సగర్వంగా ప్రకటించారు. ఉత్పాదకత పెరుగుతూనే పోతుందన్నారు. కనుక కంపెనీలు సరుకుల ధరలు పెంచకుండానే కార్మికులకు వేతనాలు పెంచుతాయనీ, తమ లాభాలు కూడా పెంచుకుంటాయనీ చెప్పారు. అంటే అందరి ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి. చేతుల్లో డబ్బులు ఆడు తుంటాయి కనుక సరుకులు ఎక్కువగా కొంటారు. దానికి తగినట్టు సరుకుల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. కంపెనీలు పెట్టుబడులు పెంచుతాయి. దాంతో ఎక్కువమందికి పనులు దొరుకుతాయి. నిరుద్యోగం తగ్గుతూ పోతుంది. ఉత్పత్తయిన సరుకులన్నీ అమ్ముడవుతుంటాయి కనుక ఎకానమీ గతంలో లాగా అప్పుడప్పుడు వెనుకడుగు వేయదు. మాంద్యాలు వచ్చే అవకాశాలు ఉండవు. వర్తక వలయాలకు ఇంతటితో మంగళం పాడినట్టే. పెట్టుబడిదారీ విధానంలోనే ఈ వలయాలు తప్పుకుంటాయి. ఈ సరికొత్త ఎకానమీ తిరుగులేనిది. వృద్ధి ఉరుకు తీయడమే కాని వెనకంజ వెయ్యదు......ఇదీ ప్రచారం..!
ఈప్రచారం సాగుతుండగానే, 2001 లో వృద్ధి ముగిసి డాట్ కాం సంక్షోభం చుట్టుకుంది. దాన్నుంచి పూర్తిగా తేరుకోకముందే 2007 చివరలో మహాసంక్షోభం వెంటబడింది. ఇప్పటికీ ఎంతోకొంత పీడిస్తూనేవుంది. మాంద్యం రాకముందు ఏమన్నారో చూద్దాం.
*********
1997-2007 కాలంలో టోనీ బ్లెయిర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి హెరాల్డ్ విల్సన్  తన విధానాలతో మాంద్యాలు నిలువరిస్తాను అన్నాడు. వికాసమూ, పతనమూ  అనే వ్యతిరేక దశలు ఉండనే వుండవు. ఉండేదంతా వృద్ధే, వికాసమే అని ఢంకా బజాయించాడు. ఏటా ఇదే సందేశం ఇచ్చేవాడు. వర్తక వలయాలను నిలువరించాననే చెప్పేవాడు.
ఇంతలోనే 2008 మహామాంద్యం ఇంగ్లండ్ ని కూడా కాటేసింది. అప్పటికి విల్సన్ ప్రధానమంత్రి (2007-2010) అయ్యాడు. తీవ్రవిమర్శకు గురయ్యాడు. చెప్పింది చెయ్యలేకపోయావు గదా అన్నప్పుడు గొంతులో వెలక్కాయ పడ్డది. నిజమే నని ఒప్పుకోక తప్పలేదు. "రాజకీయ నాయకులు పొరపాట్లు చేస్తారు. మేమూ చేశామని ఒప్పుకుంటున్నాను" అన్నాడు. కాని, చూడండి ప్రతిదేశమూ ఇదే స్థితిలో ఉంది అని తప్పుకో చూచాడు. అలాకొంత నింద ప్రపంచ ఆర్ధిక విధానం మీదికి నెట్టాడు. కాని మాంద్యాన్ని ఆపలేకపోయాడు
అక్టోబరు 2000లో ఒక ఐఎంఎఫ్‌ అధికారి అమెరికాలో వృద్ధి కొనసాగుతుందనీ, ఐరోపా ఎకానమీ విస్త రిస్తుందనీ అన్నాడు. అయితే, అమెరికా మాన్యుఫాక్చరింగ్‌ రంగం - ముఖ్యంగా టెలికమ్యూనికేషన్స్‌ రంగం, కంప్యూటర్‌ రంగం వెనుకడుగు వేసింది 2000 సెప్టెంబరులోనే. 2001 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో 'మనం మాంద్యంలో పడుతున్నామా?' అని అడిగితే గ్రీన్‌ స్పాన్‌ ముక్తసరిగా  'లేదు' అన్నాడు . అన్నాడో, లేదో మాంద్యం పట్టుకుంది. ఇదే ప్రశ్నకు 1990 సెప్టెంబరులోనూ ఇదే జవాబు చెప్పారు. అప్పటికే దేశం మాంద్యంలో ఇరుక్కుని ఉంది. వాళ్లంతా మందగింపు నుంచి బయటపడుతున్నది అంటున్నారో లేదో ఎకానమీ దిగబడి పోతున్నది. మాంద్యంలోకి జారుకుంటున్నది. ఆగస్టు చివరిలో పాల్‌ కాజ్రియేల్‌ అనే ఆర్ధికవేత్త ''మనం మాంద్యంలో లేం'' అని అన్నాడు. అంతటితో ఆగకుండా మాంద్యంలో పడబోం అని ధీమా వ్యక్తం చేశాడు. అయితే, మార్చి 2001 నుంచి అమెరికా మాంద్యంలో ఉంది అని నవంబర్‌లో ఎన్‌.బి.ఇ.ఆర్‌ అధికారికంగా ప్రకటించింది. ఎన్‌బిఇఆర్‌కి ఇక ముందు అలా ప్రకటించే పని ఉండదు అని శామ్యూల్‌సన్‌ అన్నా దానికి ఆ పని చేయక తప్పలేదు.
ఆర్థికవేత్తలు ఇలా చెప్పటం,  అలా మాంద్యాలు పట్టుకోవడం మొదటిసారేమీ కాదు. వృద్ధి ఊపుగా ఉన్నప్పుడల్లా ఇదే దరువు. 1920 దశకం చివరిలో ఇలాంటి మాటలే చెప్పారు. అలా చెపుతూ ఉండగానే ప్రపంచం ఎన్నడూ ఎరుగని మహా సంక్షోభంలో చిక్కుకుంది. అలాగే, అభివృద్ధి ఎక్కువకాలం సాగిన  60ల లోనూ, 80 ల లోనూ అదే పాట పాడారు. వాళ్లలా అనడానికీ, ఎకానమీ దిగబడటానికీ ఆట్టే కాలం పట్టలేదు. ఈ ప్రచారాలు సాగించిన వాళ్లలో ఆర్థికవేత్తలుగా పేరుపొంది నోబెల్‌ బహుమతులు తీసుకున్న రాబర్ట్‌ సోలే,  పాల్‌ శామ్యూల్‌సన్‌ కూడా ఉన్నారు. వర్తక వలయాలు ఉండవు కనుక అవి ఎప్పుడు మొదలైందీ, ఎప్పుడు ముగిసిందీ తేల్చి చెప్పే పని ఎన్ బి ఇ ఆర్  సంస్థకిక ఉండదని శామ్యూల్‌సన్‌ చమత్కరించేదాకా పోయాడు. ఇక కెనడీకి, జాన్సన్‌కు సలహాదారుగా ఉన్న ఆర్ధర్‌ ఓకున్‌ మాంద్యాలు రాకుండా చేయవచ్చనీ, వ్యాపార ఒడిదుడుకులు పాతకాలం మాటలనీ తన పుస్తకం ‘ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ప్రాస్పరిటీ’  లో రాశాడు. ఆ పుస్తకం 1969 నవంబర్‌లో పూర్తయింది. సిరా కూడా సరిగా ఆరిందో లేదో డిసెంబర్‌లో మాంద్యం మొదలయింది.
ఫలానాజాగ్రత్తలు తీసుకుంటే మాంద్యం రాదనీ, ఫలానా చర్యలు తీసుకుంటే వచ్చిన మాంద్యం పోతుందనీ పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు చెబుతుంటారు. కాని ఆ చిట్కాలేవీ ఆర్థికసంక్షోభాల్ని నిరోధించిన దాఖలాలు లేవు.
కారణం, పెట్టుబడిదారీ ఆర్థికవిధానం సంక్షోభాలతో ముడిబడి వుంటుంది. ఆ విధానాన్ని అవలంబించే దేశాలు సంక్షోభాల్లో పడి తీరవలసిందే. అందుకు ఏ దేశమూ మినహాయింపు కాదు. ఏ నమూనా మినహాయింపు కాదు .1980వ దశకంలో జపాన్‌ అద్భుతం. ఆ జపాన్‌ నమూనా మినహాయింపు అని అన్నారు.  1990 దశకంలో అది కూలిపోయింది. 1990 దశకంలో అమెరికా వెలిగింది. అంతే, అమెరికా నమూనా  అన్నారు. ఆ నమూనాను అన్ని దేశాలు సరిగా అమలుపరిస్తే ప్రపంచం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది అన్నారు. ఇంతలో ఐ.టి. బుడగపేలి మాంద్యంలో పడింది. పూర్తిగాకోలుకోకముందే  2007 చివరలో మహామాంద్యం బారినపడింది.
దీన్నిబట్టి, ఈ విధాన సమర్థకులు, ఆర్థికవేత్తలు ఎన్ని కథలు, కబుర్లు చెప్పినా పెట్టుబడిదారీ విధానంలో సంక్షోభాలు పదే పదే వస్తూనే ఉన్నాయి. అవి ఆగేవి కావు. ఆపడం ఎవరివల్లాకాదు అని మార్క్స్ అంటాడు. వచ్చినవాటిని బట్టి ఇంకావస్తాయి అనడం కాదు. సిద్ధాంతరీత్యా ఎలావచ్చి తీరతాయో చెప్పాడు.
********
దానిపాటికి దాన్ని వదిలేస్తే, మార్కెట్ సరఫరానూ గిరాకీనీ సమానం చేసి, అన్నిసమస్యల్నీ పరిష్కరిస్తుందనీ,  అధికోత్పత్తి సంక్షోభాలు చరిత్ర చెత్తడబ్బాలో పడ్డాయనీ పెట్టుబడిదారీ సమర్థకులు ప్రచారం చేశారు. పెట్టుబడిదారీ విధానంలో ఉన్న వైరుధ్యాలవల్ల అది కుప్పకూలుతుందని అనేవాళ్లు అతిగాళ్ల(cranks)నీ విమర్శించారు.
వాణిజ్యం  మీద ఇంకొన్ని ఆంక్షలు తొలగించి, పన్నులు తగ్గిస్తే ఎకానమీ మరింత వృద్ధి అవుతుందన్నారు. సంపన్నులకి పన్నులు తగ్గిస్తే, ఎకానమీ బలపడుతుందనీ, కిందివాళ్లకి ఉద్యోగాలొస్తాయనీ చెప్పారు. దీన్నే ట్రికిల్ డౌన్ థియరీ (అభివృద్ధి పైనుంచి కిందికి బొట్లుబొట్లుగా రాలిపడుతుందనే సిద్ధాంతం)  అని ఆ విధానాన్ని అనుసరించారు.
2000లో బిల్ క్లింటన్ ఇలా చెప్పాడు: జీవన ప్రమాణాల్ని పెంచడానికీ, పర్యావరణ విధ్వంసాన్ని తగ్గించ డానికీ, సంపద పంపిణీకి మంచి చోదకశక్తి  స్వేచ్చా మార్కెట్లూ, నిబంధనల అధారిత వర్తకమూ అని నిర్ద్వంద్వంగా మనం పునరుద్ఘాటించాలి.
మరి, స్వేచ్చా మార్కెట్ సమస్యల్ని పరిష్కరించిందా?
లేదు అని ఒబామాయే చెప్పాడు. అది రీగన్ హత్తుకున్న సిద్ధాంతం అనీ,  అనుకున్న ఫలితం రాలేదనీ అన్నాడు.అందుకు వ్యతిరేక ఫలితాలొచ్చాయి. అసమానతకీ, కార్పొరేట్ల అత్యాశకీ వ్యతిరేకంగా వాల్ స్ట్రీట్ ఆక్రమణ జరిగాక 2011 డిసెంబర్లో ఒసావాటొమీ లో ఇచ్చిన ఆర్థికోపన్యాసంలో  " ఇది ఏనాడూ పని చెయ్యలేదు" అన్నాడు. "అది పనిచెయ్యదు. మహాసంక్షోభం ముందు దశకంలో ప్రయత్నించినప్పుడు పనిచెయ్యలేదు.50,60 దశకాల్లో యుద్ధానంతర వికాసాన్ని తెచ్చింది అదికాదు. అలాగే పోయిన దశాబ్దంలో ప్రయత్నించినప్పుడూ ఫలితాన్నివ్వలేదు” అన్నాడు.
స్వేచ్చా వాణిజ్యానికి పట్టం కట్టారు.దేశదేశాలు కలిసి ఒప్పందాలు చేసుకున్నారు. వాటివల్ల పరస్పరం ప్రయోజనం లభిస్తుంది అన్నారు.అది అప్పటి మాట. ఇప్పుడు ఐరోపా సంఘటన నుంచి బ్రిటన్ తప్పు కోవాలని నిర్ణయించింది. పార్లమెంట్ ఆమోదించడమూ అయిపోయింది.యూనియన్లో ఉన్నందువల్ల తమదేశానికి నష్టం వాటిల్లుతున్నదని తేల్చింది.
అలాగే ఇప్పుడు ట్రంప్ నాఫ్తా ఒప్పందంవల్ల అమెరికా ఉద్యోగాలు మెక్సికోకి పోయాయని విమర్శించాడు.  ఆఒప్పందాన్ని పునస్సమీక్షిస్తానన్నాడు. ట్రాన్స్ పసిఫిక్ పార్ట్ నర్ షిప్  వాణిజ్య ఒడంబడికనుంచి తప్పుకుంటానన్నాడు. పసిఫిక్ సముద్రతీరంలో ఉన్న 12 దేశాలకు చెందిన ఒప్పందం. ఒబామా దీనికోసం కృషిచేశాడు.ఈఒప్పందం ఫలితంగా చివరకి ఈ దేశాలన్నీ ఒకే మార్కెట్ గా అవతరించాలని ఉద్దేశం.అంటే ఐరోపా యునియన్ లాగా.అయితే బ్రిటన్ యూనియన్ నించి తప్పుకోవాలని ప్రజాభిప్రాయం వచ్చింది. ట్రంప్ మొదట్నించీ అందుకు మద్దతిచ్చాడు. అందుకే బ్రిటన్ ప్రధాని థెరెసా మే శ్వేత సౌధానికి వెళ్ళి ట్రంప్ ని అభినందించింది.
నాఫ్తా ని పునస్సమీక్షిస్తానన్నాడు. ‘నాఫ్తా’ 1994 లో అమెరికా, మెక్సికో, కెనడాలు చేసుకున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందం. దానివల్ల అమెరికాలో చాలా ఉద్యోగాలు వస్తాయన్నారు. కాని 7 లక్షల ఉద్యోగాలు పోయాయని తేలింది. మెక్సికోలో కూలీ చౌక కనక అమెరికా కంపెనీలు అక్కడకు వెళ్లాయి. అమెరికన్లకు ఉద్యోగాలు పోయాయి.మాంద్యం వచ్చాక 2000 దశకంలో అమెరికాలో దీనికి వ్యతిరేకత పెరిగింది.
మెక్సికో చైనాలతో వాణిజ్యం మధ్యతరగతి ఉద్యోగాల్ని కొల్లగొడుతున్నది  అన్నాడు. ఆ దేశ సరుకులమీద దిగుమతిసుంకం పెంచుతానన్నాడు.అమెరికాలో ఉద్యోగాల్ని విదేశీయులు పొందుతున్నారు, ఆ ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి అంటున్నాడు. అందుకు, ఇప్పటికే ఎచ్ 1 బి  వీసా బిల్లు ప్రవేశపెట్టాడు.1,30,000 డాలర్ల వేతనం పొందితేనే విదేశీయులు ఉద్యోగార్హులవుతారు. ఇంతకుముందు ఆ పరిమితి 60,000 డాలర్లు. కఠినమైన నిబంధనలు విధించి విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు పొందడం కష్టతరం చేస్తున్నాడు.నిన్నటిదాకా సమర్థించిన ప్రపంచీకరణకి భిన్నంగా ఇప్పుడు జాతీయవాదాన్ని ముందుకు తెస్తున్నాడు. కారణం, అది చెప్పిన ఫలితాల్ని రాబట్టలేకపోవడమే.ఈ జాతీయవాద విధానాలూ విఫలమయ్యేవే. ఎందుకంటే, ఒకప్పుడు ఆచరించి, విఫలమైనవే కనక.
1990 లలో చైనాని పెట్టుబడిదారీ విధానం కాపాడిందన్నారు. 2008 మాంద్యం వచ్చాక పారిశ్రామిక దేశాలన్నీ వరసగా దిగబడ్డాయి.అప్పుడు చైనాయే పెట్టుబడిదారీ విధానాన్ని కాపాడాలి అన్నారు. అప్పట్లో చైనా ఊపుగా ఉండడమే అలా అనడానికి కారణం. వృద్ధిరేటు 2007 లో 14.2 శాతం. 2008 లో 9.5 కి పడింది. 2016 లో 6.7 శాతానికి దిగింది.ఆదాయ అంతారాలు పెరిగి, నిరుద్యోగం ఎక్కువయి ఎన్నో సమస్యలతో చైనా సతమత మవుతున్నది. తన్నుతాను కాపాడుకోలేక కొట్టుమిట్టాడుతున్నది. సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ అనేపేరు బెట్టుకున్నా అది పెట్టుబడి దారీ విధానమే.అందుకే చైనా ఆవిధానం లో వచ్చే ఆటుపోట్లకు గురవుతున్నది.
ఈ వాస్తవాలు గ్రహించి కొందరు మార్క్సిస్టులు కానివారుకూడా ‘మార్క్స్ తిరిగి వచ్చాడు’ అనడం మొదలుబెట్టారు.
1997 అక్టోబర్ 13 న్యూయార్కర్ లో  జాన్ కాసిడీ ది రిటర్న్ ఆఫ్ కార్ల్ మార్క్స్ అనే వ్యాసం రాశాడు. ప్రపంచీకరణ  అనే మాట ఇటీవల ప్రాచుర్యం లోకి వచ్చింది. దీని గురించి మార్క్స్ 150 ఏళ్లనాడే చెప్పాడు. పెట్టుబడిదారీ విధానం గుత్తాధిపత్యం వైపు పోతుందని చెప్పాడు. ఆయన కాలానికి అది ఎంతోదూరంలో వున్న విషయం. 21 వశతాబ్దంలో ఇదే అతి పెద్ద సమస్య కాబోతున్నది అన్నాడు కాసిడీ. మార్క్స్ వేతనాలకంటే, లాభాలు వేగంగా పెరుగుతాయనీ అందువల్ల కార్మికులు కాలం గడిచేకొద్దీ పెట్టుబడిదారులతో పోలిస్తే మరింత పేదలవుతారనీ  చెప్పాడనీ, గత రెండు దశాబ్దాలుగా ఇదే జరిగిందనీ కాసిడీ తన వ్యాసంలో రాశాడు. ద్రవ్యోల్బణాన్ని లెక్కించి చూస్తే కార్మికుల వేతనాలు 1973 స్థాయికంటే తక్కువలో వున్నాయి. లాభాలు పైపైకి పోయాయి అన్నాడు.
అయితే శ్రమే విలువకి ఏకైక వనరు అనే దానిమీద నిర్మించిన ఆయన సిద్ధాంతం అంతర్గత అసంబద్ధతలతో కూడి వుందన్నాడు కాసిడీ. లోపాలున్నాయంటూనే, పెట్టుబడిదారీ విధానం ఉన్నంతవరకూ ఆయన పుస్తకాలు చదవదగినవి  అని ముగించాడు.
కారల్‌ మార్క్స్‌ తిరిగి వచ్చాడని బ్రిటిష్‌ లేబర్‌ పార్టీ నాయకుడు జాన్‌ మెక్‌డొన్నెల్‌ అన్నాడు. మార్క్స్‌ సిద్ధాంతాలు ఇప్పుడు మళ్లీ ప్రధాన స్రవంతి ఆలోచనలుగా మారాయి, ఆయన నిర్ధారణలతో కొందరు ఏకీభవించకపోవచ్చు కానీ ఆయన విశ్లేషణలు చాలా ఆసక్తికరమైనవి అని బ్రిటిష్‌ షాడో ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్న మెడ్‌డొన్నెల్‌ లేబర్‌ పార్టీ మహాసభలో ఆర్థికరంగంపై కీలకోపన్యాసం చేస్తూ అన్నాడు సోషలిస్టు ఆర్థిక శాస్త్ర నిర్మాత అయిన కారల్‌ మార్క్స్‌ చనిపోయిన 130 సంవత్సరాల తరువాత కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చెప్పే అత్యుత్తమ విశ్లేషణ ఆయనది మినహా మరెవరిదీ లేదని మెక్‌డొన్నెల్‌ అన్నాడు. వ్యవస్థను మార్చడానికి మార్క్స్‌ చేసిన సూచనలతో అంగీకరించవచ్చు, లేకపోవచ్చు కానీ ఆయన సిద్ధాంతాలు ఇప్పటికీ ఆసక్తికరమైన విశ్లేషణలే. అందుకే అవి ప్రధాన స్రవంతి ఆలోచనలుగా మారాయి అని చెప్పాడు.-
వాటికన్ అధికారపత్రిక 2009 లో ఆదాయ అసమానతల గురించి మార్క్స్ చెప్పినదాన్ని మెచ్చుకున్న వ్యాసాన్ని ప్రచురించింది.
యు బి ఎస్ బాంక్ ఆర్థికవేత్త జార్జ్ మాగ్నస్ మార్క్స్ విశ్లేషణలో చాలా లోపాలున్నాయి అంటూనే, కంపెనీల లాభతృష్ణా, ఉత్పాదకతా, పనివాళ్లు తగ్గిఫోతూ,నిరుద్యోగ సైన్యం ఏర్పడుతుందని మార్క్స్ రాసినదాన్ని ఒప్పుకుంటాడు. అభివృద్ధిచెందిన దేశాలన్నిటిలో ఇదే పరిస్థితి అంటాడు."సంపద సమీకరణ ఒకవైపు,  అందువల్ల పేదరికం మరొకవైపు" అనేదాన్ని అంగీకరిస్తాడు.
2008 మాంద్యాన్ని ముందుగానే పసిగట్టిన రూబినీ ప్రపంచీకరణ అదుపు తప్పిందని మార్క్స్  సరిగానే వాదించాడు అన్నాడు. సంస్థలు ఉద్యోగాలు కోతపెడుతున్నాయనీ, దాంతో శ్రామికుల ఆదాయాలు పడిపోయి,  సరుకులకు సరైన గిరాకీ లేదనీ చెప్పాడు. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కలేదని అన్నాడు.అయితే మార్క్స్ చెప్పిన ప్రత్యామ్నాయం సోషలిజం మెరుగైనది కాదు అని అభిప్రాయ పడ్డాడు.
మార్క్స్ కమ్యునిజాన్ని గురించి చెప్పినవి కరెక్ట్ కాదు, కాని కాపిటలిజాన్ని గురించి చెప్పివిషయాలు కరెక్టే అన్నాడు జాన్ గ్రే అనే రాజనీతి తత్వవేత్త, ఫాల్స్ డాన్: ది డెల్యూజన్స్ ఆఫ్ గ్లోబల్ కాపిటలిజం అనే  పుస్తకంలో.   ద్రవ్య సంక్షోభం వచ్చాక, మార్క్స్ చెప్పింది రైటా అని ఆలోచించేవారు పెరిగారు అన్నాడు.  19 వశతాబ్దంలో ఎక్కువమంది జనానికి ఏమీలేదు. శ్రమని అమ్మి బతికేవారు. పెట్టుబడిదారీ విధాన సమర్థకులు ముందుముందు వాళ్లకీ ప్రయోజనం కలుగుతుందనీ, ప్రతివాళ్లూ మధ్యతరతికి చేరుకుంటారనీ చెప్పేవారన్నాడు. అయితే గత 20, 30 ఏళ్లుగా అందుకు వ్యతిరేకంగా జరుగుతున్నదన్నాడు.  పెట్టుబడిదారీ విధానం అస్థిరమైనదని, ప్రజావిప్లవం ద్వారా కమ్యునిస్ట్ విధానం వస్తుందనీ మార్క్స్ నమ్మాడు. అది మాత్రం తప్పు  అన్నాడు.
********  
వీళ్లందరూ నిరుద్యోగం పెరిగిందనీ,అసమానతలు అధికమయ్యాయనీ అనడం వరకే పరిమితం. పెట్టుబడిదారీ విధానంలోనే సమస్యలు పరిష్కరించవచ్చునంటారు. అంతేగాని అవి ఈవిధానపు  అనివార్య పర్యవసానాలు అని ఒప్పుకోరు.మార్క్స్ పేరెత్తుతారు గాని మార్క్సిజాన్ని ఒప్పుకోరు.
ఈ సమస్యలకు కారణం పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అనిగానీ, అసమానతలు పోవాలంటే ఈ ఆర్థిక విధానం స్థానంలో సోషలిస్ట్, కమ్యునిస్ట్ విధానం రావాలనీ అంగీకరించరు. ఇదే విధానం అంతిమం అనీ, దీనికి సవరణలు చెయ్యడం మినహా చెయ్యగలిగిందేమీ లేదనీ చెబుతుంటారు. మరొక మెరుగైన విధానం అంటూ ఏదీ లేదనీ, రాదనీ, సాధ్యం కాదనీ వాదిస్తారు.
పెట్టుబడిదారీ విధానమే చివరది. పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం లేదు  అంటారు. "ప్రత్యామ్నాయం లేదు" అనే మాట మొదట వాడినవాడు తత్వవేత్త హెర్ బర్ట్ స్పెన్సర్. ఆయన స్వేచ్ఛా వాణిజ్యాన్ని సమర్థించేవాడు. పెట్టుబడిదారీవిధానాన్నీ, స్వేచ్ఛా మార్కెట్లనీ విమర్శించేవాళ్లకి దీనికి (పెట్టుబడిదారీవిధానానికి) "ప్రత్యామ్నాయం లేదు" అని చెప్పేవాడు.1980 లలో బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్ (1979-1991) దాన్నొక నినాదం చేసింది. నయా ఉదారవాద విధానాలు తప్ప గత్యంతరం లేదు అని ప్రచారం చేసింది. సంక్షేమ కార్యక్రమాల్ని తగ్గించి, కొన్ని పరిశ్రమల్ని ప్రైవేటీకరించింది.కార్మికసంఘాల్ని నిర్వీర్యపరిచే ప్రయత్నాలు చేసింది.
రాజనీతి శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ ఫుకుయామా పెట్టుబడిదారీ విధానంతో పోటీ చెయ్యగల సిద్ధాంతం ఏదీ లేదన్నాడు. 1989 లో ది ఎండ్ ఆఫ్ హిస్టరీ? అనే వ్యాసం రాశాడు. పోరాటంలో పశ్చిమ ఉదార ప్రజాస్వామ్యం విజయం సాధించిందని ఉద్ఘాటించాడు. జాన్ గ్రే ఆయన్ని ప్రపంచ పెట్టుబడిదారీవిధాన తత్వవేత్త అంటూ కొనియాడాడు. దాన్ని విస్తరించి ది ఎండ్ ఆఫ్ హిస్టరీ అండ్ ది లాస్ట్ మాన్  పేరుతో 1992 లో పుస్తకం ప్రచురించాడు. 1992 లో పుస్తకం వచ్చినప్పుడు ,వ్యాసానికున్న ప్రశ్నార్ధకం లేదు. ఫుకుయామా ప్రపంచ పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యం చరిత్రకు చివరి దశ అన్నాడు.
వీళ్లందరూ కూడ గణాంకాలను బట్టి మాట్లాడతారు. సిద్ధాంతం ఉండదు.తలెత్తిన సమస్యలకి మూల కారణాలేమిటో చర్చించరు.నిరుద్యోగం పెరిగితే ఎందుకు పెరిగిందని కాకుండా, ఉద్యోగాలు రావాలి అంటారు. పెట్టుబడులు పెరిగితే, ఉద్యోగాలొస్తాయి అంటారు. తయారైన సరుకులు అమ్ముడవుతుంటే, తిరిగి ఉత్పత్తి అవసరపడుతుంది. ఉద్యోగాలు పోయాక కొనడం తగ్గుతుంది.దాంతో ఉత్పత్తీ తగ్గుతుంది.ఉన్న పరిశ్రమలకే పూర్తిగా పని ఉండదు.కొత్త పెట్టుబడులతో అవసరం ఉండదు.కనక ఇది సమస్యను తీర్చదు.
‘మళ్లీ మార్క్స్’ అనే వాళ్లంతా పెరుగుతున్న అసమానతల సమాచారాన్ని బట్టి మాట్లాడుతున్నారు.ఎందుకు పెరుగుతున్నాయో మార్క్స్ చెప్పాడు. అవి ఎలా పోతాయో కూడా చెప్పాడు.గణాంకాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి కాబట్టి ఒప్పుకుంటున్నారు.
నెమ్మదించిన ప్రపంచ ఆర్ధికవృద్ధి: ప్రపంచ ఆర్థికవృద్ధి 2016 లో 3.1శాతం. గడచిన  ఆరేళ్లలో ఇదే తక్కువ. అమెరికా వృద్ధి 2016 లో 1.6 శాతం మాత్రమే.5 ఏళ్లలో ఇదే అతితక్కువ. 2015 లో 2.6 శాతం.
పెరుగుతున్న అప్పు: అన్నిదేశాలూ అప్పులతో సతమమవుతున్నాయి.2016 డిసెంబర్ 30 న అమెరికా అప్పు దాదాపు  20(19.98) లక్షలకోట్ల డాలర్లు. ఒబామా వచ్చేటప్పటికి 10.6 లక్షలకోట్ల డాలర్లు. 9.3 లక్షలకోట్లు కొత్త అప్పు కలిపాడు.ఇంచుమించు రెట్టింపు చేశాడు.ఇంత అప్పు ఎవరి కాలంలోనూ పెరగలేదు. ఏపార్టీ అధికారంలో ఉన్నా, ఎవ్వరు అధ్యక్షుడుగా ఉన్నా, అప్పు పెరుగుతూనేవుంది.
పెరుగుతున్న నిరుద్యోగం:  2016 లో 19 కోట్ల 77 లక్షలమంది నిరుద్యోగులున్నారు.  2017 లో 34 లక్షల మంది పెరిగి, మొత్తం 20 కోట్ల 11 లక్షలమంది అవుతారు. పోనీ 2018 లో తగ్గుతారా అంటే అదీలేదు.  20 కోట్ల 38 లక్షలవుతారని అంచనా.
పనులు ఉన్నవాళ్లు  కూడ చాలామంది తక్కువస్థాయి చెయ్యాల్సివస్తుంది. భద్రత లేని  ఉద్యోగులు 140 కోట్ల మంది.  ఈ సంఖ్య ఏటా 1కోటి 10 లక్షలు  పెరుగుతుందని అంతర్జాతీయ కార్మికసంస్థ తన 2017 నివేదికలో చెప్పింది. పైగా ఏటా కోట్లాది కొత్తవాళ్లు పనియీడుకి వస్తున్నారు. వాళ్లందరికీ మంచి ఉద్యోగాలు కల్పించడం ఒక సవాలు.మంచి ఉద్యోగాలు అవునా కాదా తరవాత, అసలు అవసరమైనన్ని ఉద్యోగాలు రావడం గురించి కార్మికసంస్థ ఆందోళనలో ఉంది.
పెరుగుతున్న ఆదాయ అసమానతలు:
కాపిటల్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచురీ (2013) అనే పుస్తకంలో థామస్ పికెటీ గడచిన 250 ఏళ్లలో సంపద కేంద్రీకరణగురించీ,పంపిణీ గురించీ రాశాడు.అసమానతలు అధికమవుతున్నాయనీ, ఇంకా అవుతాయనీ చెప్పాడు. సంపద పెరిగేకొద్దీ మరింతపన్ను వెయ్యడం ద్వారా సమస్యని ఎదుర్కోవాలని సూచించాడు. పెట్టుబడిదారీ విధానానికి కట్టుబడిన  పికెటీ సోషల్ డెమాక్రట్. మార్క్సిస్టు ముద్రని ఒప్పుకోడు.
ఎనిమిది  మంది అత్యంత సంపన్నుల ఆస్తి అడుగునవున్న 360 కోట్లమందికున్న మొత్తం ఆస్తికి సమానం- అని దావోస్ సమావేశం సందర్భంగా ఆక్స్ ఫాం 16-1-2017 న విడుదలచేసిన నివేదిక యాన్ ఎకానమీ ఫర్ ది 99 పర్సెంట్  తేల్చి చెప్పింది. ధనికులకీ, పేదలకీ వ్యత్యాసం అనుకునేదానికన్నా చాలాఎక్కువగా వుందన్నది. బడా వ్యాపారులూ, మహాధనికులూ పన్నులు ఎగ్గొట్టీ, వేతనాలు తగ్గించీ,రాజకీయాల్ని తమ శక్తితో ప్రభావితం చేసీ ఈ అసమానతల్ని ఎలా పెంచుతున్నారో వివరించింది.ఇండియాలో దేశ ఆస్తిలో సగానికి పైగా పై ఒక్కశాతం మందిదే.
రాబోయే 20 ఏళ్లలో 500 మంది తమ వారసులకి 2.1 లక్షలకోట్ల డాలర్లు ఇస్తారు. ఈమొత్తం 130 కోట్ల జనాభావున్న ఇండియా స్థూలజాతీయోత్పత్తికన్నా ఎక్కువ.
1988-2011 కాలంలోఅడుగున ఉన్న 10 శాతం మందికి ఆదాయం సంవత్సరానికి 3 డాలర్లకి తక్కువ పెరిగింది.పై ఒక్క శాతానికి అంతకు 182 రెట్లు పెరిగింది.బంగ్లాదేశ్ లో ఎఫ్ టి ఎస్ ఇ – 100  సి.ఈ.ఓ.కు దుస్తుల ఫాక్టరీలో పనిచేసే 10 వేలమంది పనివాళ్లకంటే ఎక్కువ వస్తుంది.
అమెరికాలో పోయిన 30 ఏళ్లలో అడుగు 50 శాతం మందికి ఆదాయం ఏమీ పెరగలేదు.అదే కాలంలో పై ఒక్కశాతం మందికి 300 శాతం పెరిగింది.
జాతీయాదాయంలో అడుగు 50 శాతం మంది ఆదాయం 1980 లో 20శాతం ఉండేది.2014 కి 12 శాతానికి పడిపోయింది.పై ఒక్క శాతం మందికీ రెట్టింపయింది.అప్పుడు 10 శాతమయితే ఇప్పుడు 20 శాతం.వాళ్ల సంపద మొత్తం కుటుంబ సంపదలో 37 శాతం. అడుగు 50 మందికీ, అంటే 16 కోట్లమందికి ఏమీలేనట్లే (0.1 శాతం).
2013లో సగం సంపాదన 360 మంది చేతుల్లో ఉండగా, 2016లో 62 మంది చేతుల్లోకి చేరింది. రానురాను సంపదంతా కొద్దిమంది చేతుల్లోకే పయనిస్తున్నదని దీన్నిబట్టి స్పష్టంగా అర్థమౌతోంది. 1970 లోఅమెరికా సి.ఈ.ఓ. జీతం సగటు కార్మికుని జీతానికి 30 రెట్లు.2012 లో 263 రెట్లు.
2014 లో పూర్తికాలం పనిచేసే ఉద్యోగి 50,383 డాలర్లు పొందేవాడు.అయితే అది ద్రవ్యోల్బణాన్ని బట్టి చూస్తే, 1973 లో సంపాదించిన దానికన్నా 2900 డాలర్లు తక్కువ.
చెదిరిన అమెరికాకల
పేదరికంలో పుట్టినా, కష్టపడి పనిచేస్తే అమెరికాలో సంపన్నులుగా ఎదుగుతారు - ఇది అమెరికా స్వప్నం సారాంశం. కేంద్రబిందువు.
ఈఏటికంటే వచ్చే ఏడు ఎక్కువ ఆదాయం ఉంటుందనీ మెరుగైన జీవనం అందుతుందనే అమెరికా కల అనేది శ్రామికులకి పగటికలే. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది అమెరికా కలలో భాగం. అయితే, 2008 మహా మాంద్యంలో 70 లక్షలమంది ఇళ్లు పోగొట్టు కున్నారు.
1940 లలో పుట్టిన అమెరికన్లలో నూటికి 90 మంది 30 ఏళ్లవయసొచ్చేసరికి వాళ్ళ తలిదండ్రులకన్నా ఎక్కువ సంపాదించేవారు.అయితే 1980 లలో పుట్టిన వాళ్లలో నూటికి 50 మంది మాత్రమే తలిదండ్రులకన్నా మెరుగ్గా వున్నారు. తమ తల్లిదండ్రుల కంటే తక్కువ ఆదాయాలతో గడపాల్సి వస్తున్నదని అర్థమవుతోంది.  నూటికి 43 మంది పిల్లలు తక్కువ ఆదాయంఉన్న కుటుంబాలలో ఉన్నారు. ఈకుటుంబాలకు దారిద్ర్యరేఖకు రెట్టింపు లోపు ఆదాయం  ఉంటుంది. నలుగురున్న కుటుంబానికి  దారిద్ర్య రేఖ  24,036 డాలర్లు. తక్కువ ఆదాయ కుటుంబానికి 48,౦౦౦ డాలర్లు. . ఇటువంటి పిల్లలు రికవరీ మొదలైన 2009 లో కంటే 2015 కి ఒక శాతం పెరిగారు.మొత్తం ౩ కోట్ల పైచిలుకుగా ఉన్నారు. రికవరీ అన్నాక పరిస్థితి ఇది అని  నేషనల్ సెంటర్ ఫర్ చిల్డ్రన్ ఇన్ పావర్టీ  జనవరిలో వెల్లడించింది.
ప్రజా ఉద్యమాలు
మహామాంద్యం నేపథ్యంలో  చాలాదేశాలు ప్రభుత్వ వ్యయం తగ్గించాయి.సంక్షేమ చర్యలకు కోతపెట్టాయి.పెన్షన్లనూ వదలలేదు. ఈచర్యలకు వ్యతిరేకంగా ఐరోపా దేశాలలో నిరసనోద్యమాలు వెల్లువెత్తాయి.
2010 చివరలోనూ,2011 మొదట్లోనూ అరబ్ ప్రపంచం వరస నిరసనప్రదర్శనలతో అట్టుడికింది.అరబ్ వసంతంగా పేరుపొందింది. అరబ్ ప్రజలు ఎందుకు తిరగబడ్డారు? 1848 లో యూరప్ లో ఉన్న క్లిష్ట పరిస్థితుల్ని గుర్తుకుతెచ్చే ఆర్థిక ,సామాజిక పరిస్థితులు నెలకొన్నాయి.పేదరికం,పెరుగుతున్న ఆహార ధరలు,ద్రవ్యోల్బణం,మానవహక్కుల ఉల్లంఘన,అధిక నిరుద్యోగం- ప్రధానకారణాలు.అమెరికాలో మొదలై ఎన్నో దేశాలకు పాకిన ఆక్రమణ ఉద్యమాలు అలాంటివే.
2011 లో   నూరుగురిలో మీరు ఒక్కరు, మేము 99 మందిమి అని నినదించారు. 2011 సెప్టెంబర్ 11 న న్యూయార్క్ నగరంలో జుకొట్టి పార్క్ లో వాల్ స్ట్రీట్ ఆక్రమణ పేరుతో మొదలైంది.వెంట వెంటనే అమెరికాలో 600 కమ్యూనిటిలకు పాకింది.దేశదేశాలకీ వ్యాపించింది. అక్టోబర్ 9 కల్లా 82 దేశాల్లో 951 నగరాల్లో ఆక్రమణ పోరాటాలు మార్మ్రోగాయి.బడా కార్పొరేషన్లూ, ప్రపంచ ద్రవ్య విధానమూ కలిసి ఆదాయాల్ని అతి కొద్దిమందికి చేర్చటం ప్రజాస్వామ్య స్పూర్తికి వ్యతిరేకం అనే వాదన.మొదట్లో ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఉద్యమం ఉధృతమయ్యే కొద్దీ అక్టోబర్ 25 నించీ పాలకులు అణచివేతకు పూనుకున్నారు. ఆక్రమించిన ప్రాంతాల్ని బలవంతంగా ఖాళీ చేయించారు. 2011 చివరకి అన్నిచోట్ల నించీ నెట్టివేశారు. 2012 ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీ.సీ. లోనూ లండన్ లోనూ వాటిని స్వాధీనంలోకి తెచ్చుకున్నారు.
అయితే కాలం గడిచేకొద్దీ  అసమానతలు అధికమవుతున్నాయి. అభివృద్ధిచెందిన చాలా దేశాల్లో
ఈపరిస్థితులు ఒక కొసకు  చేరాయి. వీటిని పరిష్కరించేందుకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్  ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ డెవలప్ మెంట్ రిపోర్ట్ 2017లో మార్గాలు సూచించింది. సమ్మిళిత అభివృద్ధికి మంచి ఉద్యోగాలు కావాలి.మధ్యతరగతి జీవన ప్రమాణాలు పైస్థాయికి ఎదగాలి.మంచివాటిసంగతి తరవాత, అసలు ఉద్యోగాలు ఏవి?ఎక్కడ?
ఏమి కావాలో చెప్పడమే కాని , అందుకు ఏమి చెయ్యాలో వాళ్లకి అగమ్యగోచరంగా ఉంది.ఎందుకంటే అన్నిప్రయత్నాలూ ఎప్పుడో అయిపోయాయి.మళ్లీమళ్లీ అవే చేస్తే కోరుకున్న ఫలితాలు రావు అనేది స్పష్టమే.
వీరుకోరేదల్లా: ఉత్పత్తిసంబంధాలు చెక్కుచెదరకుండా, వీటిమీదనే ఆధారపడిన సంస్కరణలు; అనగా పెట్టుబడికీ వేతనశ్రమకీ మధ్యగలసంబంధాలను యేమాత్రమూ తాకని సంస్కరణలు.
మార్క్స్ ఏం చెప్పాడు?
ఉత్పత్తిలో వేతనాలవాటా తగ్గిపోతుందని చెప్పాడు. అసమానతలు పెరుగుతాయని చెప్పాడు. ఎందుకు పెరుగుతాయో చెప్పాడు
“బూర్జువాలలో పోటీ పెరగడం వల్లా, తత్ఫలితంగా యేర్పడే వాణిజ్య సంక్షోభాలవల్లా కార్మికుల వేతనాలు మరింత యెగుడుదిగుడులకు గురవుతాయి.యంత్రాలలో అంతకంతకూ వేగంగా జరిగే నిరంతరాభివృద్ధి వల్ల, వాళ్ళ జీవనాధారాలు అంతకంతకూ నమ్మకం లేనివౌతాయి.”- సంకలిత రచనలు1.54-55
"ఉత్పాదక పెట్టుబడి పెరిగేకొద్దీ, శ్రమవిభజనా, యంత్రాల వినియోగమూ విస్తరించేకొద్దీ, కార్మికులమధ్య పోటీ విస్తరిస్తుంది, వాళ్ల వేతనాలు తగ్గుతాయి.
దీనికి తోడు, సమాజపు పైపొరలకు చెందినవాళ్లు కూడా వచ్చి కార్మికవర్గంలో చేరుతారు. చిన్న పారిశ్రామికులూ, చిన్నవడ్డీజీవులూ బోలెడుమంది కార్మికవర్గశ్రేణుల్లోకి దిగదోయబడతారు; కార్మికుల చేతుల పక్కన తొందరగా తమచేతులు పైకి సాచడం కంటే వాళ్లకు చేయవలసిందేమీ లేదు.ఈవిధంగా, పనిని డిమాండు చేస్తూ పైకెత్తబడిన చేతుల అరణ్యం అంతకంతకూ దట్టమవుతుంది, ఆచేతులుమాత్రం అంతకంతకూ చిక్కిపోతాయి". వేతనశ్రమా- పెట్టుబడీ (సం.ర.1.119)
పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందేకొద్దీ అప్పుడప్పుడు మాంద్యాలు వస్తాయని మార్క్స్ చెప్పాడు. వాణిజ్య సంక్షోభాలు "వచ్చినప్పుడల్లా అంతకంతకూ మరింత ప్రమాదకరంగా, మొత్తం బూర్జువా సమాజానికే చావుబతుకుల సమస్య తెచ్చిపెడుతున్నాయి." సం.ర.1.51. మరి ఈ సంక్షోభాలను బూర్జువావర్గం యేవిధంగా అధిగమిస్తుంది అని ప్రశ్నించి ఇలా చెబుతాడు: "ఒకవైపున ఉత్పాదకశక్తుల్లో కొంతభాగాన్ని విధిలేక ధ్వంసం చేయడం ద్వారానూ, మరొకవైపున  పాతమార్కెట్లను  మరింత కట్టుదిట్టంగా దోచు కోవడం ద్వారానూ, అంటే మరింత విస్తృతమైన, మరింత విధ్వంసకరమైన సంక్షోభాలకు బాట వేయడం  ద్వారానూ,  సంక్షోభ నివారణాంశాలను తగ్గించడం ద్వారానూ అన్నమాట." సం.ర.1.52
ఈసమస్యలు ఎలా తీరతాయో కూడా మార్క్స్ చెప్పాడు.  వీటికి కారణం అయిన పెట్టుబడిదారీవిధానాన్ని అంతం చేస్తేనేగాని సమస్యలు పరిష్కారం కావు అన్నాడు.
మార్క్స్ గణాంకాలను బట్టి సిద్ధాంతం చెయ్యలేదు.పెట్టుబడిదారీ విధానాన్ని పరిశీలించాడు.శ్రమే విలువకి ఏకైక వనరు అని అప్పటికే స్థిరపడ్డ నియమాన్ని అనుసరించాడు. సరుకులో వైరుధ్యం ఉన్నదనీ, అదే ఈ విధానంలోని అన్ని వైరుధ్యాలకూ కారణమనీ ఈ విధానం కూలిపోక తప్పదనీ తేల్చాడు.
పెట్టుబడిదారీ వర్గం,అన్నిటినీ మించి, తనకే సమాధిని తవ్వే వాళ్లని  తానే తయారుచేస్తుంది అంటాడు.  “బూర్జువా వర్గ పతనమూ అనివార్యమే, కార్మికవర్గ విజయమూ అనివార్యమే.” అని నిర్ధారించాడు. సం.ర.1.58
మార్క్స్ ఏమి చెప్పాడో వివరంగా, పూర్తిగా తెలుసుకోవడం అవసరం. అందుకు కమ్యూనిస్ట్ ప్రణాళికతోపాటు, కాపిటల్ ని చదవాలి.