26, అక్టోబర్ 2023, గురువారం

II. 1 సరుకు సరఫరా (స్టాకు) ఏర్పడడం

 

II. 1 సరుకు సరఫరా (స్టాకు) ఏర్పడడం

పెట్టుబడిదారుడు ఉత్పత్తిచేసిన సరుకులు అమ్ముడయి డబ్బు చేతికి రావాలి. అలా రావాలంటే, అవి వినియోగదారులకి చేరాలి. ఉత్పత్తి రంగాన్ని వదిలాక అవి చలామణీ రంగంలో పడతాయి. అయితే, ఉత్పత్తి అయ్యీ అవగానే సరుకులు అమ్ముడవవు. అందుకు ఎంతోకొంత సమయం పడుతుంది. ఆ సమయంలో  సరుకులు మార్కెట్లో ఉంటాయి - అప్పుడు సరుకులు స్టాక్ రూపంలో, సరఫరా రూపంలో ఉంటాయి.

ఒక వలయంలో పెట్టుబడి సరుకు సరఫరా రూపంలో రెండుసార్లు కనబడుతుంది:

వివరాల్లోకి పోయే ముందు ఒక ఉదాహరణ చూద్దాం:

రెడీమేడ్ షర్టులు ఉత్పత్తిచేసే పెట్టుబడిదారుణ్ణి తీసుకుందాం. మార్కెట్ కి డబ్బుతో వస్తాడు . అది డబ్బు రూపంలో ఉన్న పెట్టుబడి. డబ్బు పెట్టుబడి. ఆ డబ్బు పెట్టి, తను చెయ్యాలనుకున్న షర్టుల ఉత్పత్తికి అవసరమైన మిషన్లూ, కత్తెర్లూ, సూదులూ వంటి  మామూలు పరికరాలు, గుడ్డలూ, దారాలూ, గుండీలు, బకరం వంటి ముడిసరుకులూ కొంటాడు. అంటే పెట్టుబడి డబ్బు రూపాన్ని వదిలి, సరుకు రూపం పొందింది. ఇప్పుడిది సరుకు పెట్టుబడి. ఈ సరుకులు ఇతర పెట్టుబడిదారులు తయారు చేసినవి. అతను తయారుచేసినవి కావు. తను తయారుచెయ్యాలనుకున్న సరుకు ఉత్పత్తికి అవసరమైన సరుకులు. కొన్ని శ్రమసాధనాలూ, కొన్ని ముడిపదార్ధాలూ, కొన్ని సహాయకపదార్ధాలూ. వీటన్నిటినీ మార్కెట్లో కొనాల్సిందే. కొని షర్టులు తయారుచేయిస్తాడు. వాటిని మార్కెట్లో పెట్టి అమ్మి డబ్బు రూపంలోకి మార్చుకోవాలి.

1.ఇతరులు తయారు చేసిన సరుకుల రూపంలో పెట్టుబడిగా ఒకసారి (పై ఉదాహరణలో మిషన్లూ, బట్టలూ వగైరా)

2.తాను తయారుచేసిన కొత్తసరుకు రూపంలో పెట్టుబడిగా మరొకసారి (పై ఉదాహరణలో రెడీమేడ్ షర్టులు)

సరుకులు మార్కెట్లో రెడీగా ఉండాలి

ఉత్పత్తికి అవసరమైన సరుకులు మార్కెట్లో ఉండాలి. కాని, ఒక్కొక్కప్పుడు మార్కెట్లో రెడీగా ఉండవు. ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో ఆసరుకు తయారై వచ్చేదాకా పని ఆగిపోతుంది. ఆగకుండా సజావుగా సాగాలంటే, కొంత మొత్తంలో సరుకులు (ఉత్పత్తి సాధనాలు) మార్కెట్లో ఎప్పుడుబడితే అప్పుడు దొరకాలి. అలా దొరకాలి అంటే,  అవి మార్కెట్లో తగినంత స్టాక్ ఉండాలి.      

శ్రమశక్తి కొనుగోలు

ఉత్పత్తిసాధనాలు ఉన్నంతమాత్రాన, ఉత్పత్తి మొదలవదు. వాటిని వాడగల శ్రమశక్తి  కావాలి. దాన్నీ మార్కెట్లో కొనాలి. కార్మికులకి కూలికింద డబ్బు ఇవ్వాలి. ఈడబ్బు కార్మికుల జీవితావసర వస్తువుల విలువ రూపమే. వాళ్ళకి కావలసిన వస్తువులు కొనడానికి అవి మార్కెట్లో దొరకాలి. వాటి సరఫరా కూడా ఉండి తీరాలి.

దీన్నిబట్టి: మార్కెట్లో సరుకు సరఫరాగా ఉండాల్సినవి:

1.ఉత్పత్తి సాధనాలు

2.జీవితావసర వస్తువులు

మన ఉదాహరణకి సంబంధించి మార్కెట్లో సరుకు సరఫరాగా ఉండాల్సినవి:

1.ఉత్పత్తిసాధనాలు - మిషన్లు, కత్తెర్లూ, సూదులూ వంటి  మామూలు పరికరాలు, గుడ్డలూ, దారాలూ, గుండీలు, బకరం వంటి ముడిసరుకులూ

2.జీవితావసర వస్తువులు - టైలర్లు, సహాయకులు వాడే జీవితావసర వస్తువులు. ఆహారపదార్ధాలూ, బట్టలూ, చెప్పులూ వగయిరా.

డబ్బు రూపంలో పెట్టిన పెట్టుబడి సరుకయింది. ఇప్పుడు అది తిరిగి డబ్బు లోకి మారాల్సిన పెట్టుబడి విలువ. అందువల్ల అది ఈ క్షణంలో మార్కెట్లో సరుకు పెట్టుబడిగా పనిచేస్తుంది. అది సరుకు సరఫరాగా ఉంటుంది.

సరుకు ఎంతత్వరగా అమ్మకం జరిగితే, పునరుత్పత్తి ప్రక్రియ అంత సాఫీగా సాగుతుంది.

సరుకు డబ్బుగా మారడంలో ఆలస్యం అయితే పెట్టుబడి వలయం తదుపరి చర్యకి - పునరుత్పత్తి చర్యకి - ఆటంకం కలుగుతుంది. మరొకపక్క డబ్బు సరుకుగా మారడానికి  సంబంధించి, మార్కెట్లో ఎప్పుడూ సరుకులు ఉండడం అవసరం. పునరుత్పత్తి ప్రక్రియ సాగడానికీ, కొత్త పెట్టుబడి లేక అదనపు పెట్టుబడి పెట్టడానికి సరుకు–సరఫరా అనేది షరతు అవుతుంది.

సరుకు సరఫరా (సప్లై) కి కావలసినవి
సరుకు పెట్టుబడి మార్కెట్లో సరుకు సరఫరా గా ఉండాలంటే,

1.భవనాలూ, స్టోర్లూ, గిడ్డంగులూ అవసరం. ఇది స్థిరపెట్టుబడి.

2. సరుకుల్ని లోపల సర్ది పెట్టడానికి పనివాళ్ళుండాలి. కాపలా దారుడు ఉండాలి. వాళ్ళకి వేతనాలివ్వాలి. ఇది స్థిరపెట్టుబడి.

3. సరుకులు చెడిపోతాయి, వాతావరణ ప్రభావానికి లోనవుతాయి. వీటినించి  సరుకుల్ని కాపాడాలి. అందుకు అదనపు పెట్టుబడి పెట్టాలి. శ్రమ సాధనాలకు కొంతా, శ్రమశక్తికి కొంతా.

పై చర్యల కయ్యే ఖర్చులు ఉత్పత్తి రంగంలో పెట్టేవి కావు. ఉత్పత్తి అయ్యాక పెట్టేవి. కాబట్టి చలామణీ ఖర్చులుగా లెక్కకొస్తాయి.

 

స్టాకు పెట్టడానికి కొన్ని ఖర్చులు అవుతాయి. సరుకులు కొనడానికీ, అమ్మడానికీ అయ్యే ఖర్చులెలాంటివో, స్టాకు పెట్టడానికి అయ్యేవి కూడా అలాంటివే. ఎందుకంటే, రెండూ చలామణీ రంగంలో జరిగేవే. కాబట్టి చలామణీ ఖర్చులు.

అయితే, సరుకులు స్టాకు పెట్టడానికి అయ్యే ఖర్చులు కొనడానికీ అమ్మడానికీ అయ్యే ఖర్చుల వంటివి కావు.

వాటికి భిన్నమైనవి. ఎలాగంటే: ఇవి కొంతమేరకు సరుకుల విలువకు కలుస్తాయి. సరుకుల ధరల్ని పెంచుతాయి. అన్ని పరిస్థితుల్లోనూ, సరుకు స్టాకుని నిర్వహించడానికి పెట్టుబడీ, శ్రమశక్తీ ఉత్పత్తి ప్రక్రియ నించి ఉపసంహరించబడతాయి. దానర్ధం: కొత్త సరుకుల్ని తయారుచెయ్యడంలో పాల్గొనవు అని. అవి ఏ కొత్త విలువనూ ఏర్పరచవు అని. అయినా, ఉన్న విలువని నిలిపి ఉంచుతాయి. అలా ఉంచాలంటే, సరుకుల్ని చెడకుండా భద్రపరచాల్సి ఉంటుంది. అందువల్ల, ఆఖర్చులు తప్పవు.

రూపం మారడానికి పట్టే ఆలస్యం నించీ, దాని అవసరం నించీ మాత్రమే ఉత్పన్నం అవుతాయి. ఎందులోనంటే: వాటి లక్ష్యం విలువ రూపంలో మార్పు కాకుండా, సరుకులో ఉన్న ఉపయోగపు విలువను భద్రపరచడం కావడం. అది ఆ ఉత్పాదితాన్నే భద్రపరచడం ద్వారాతప్ప, మరే విధంగానూ సాధ్యం కాదు. ఈ ఖర్చుల వల్ల సరుకు ఉపయోగపు విలువ పెరిగేదేమీ ఉండదు. కొండొకచో తగ్గినా తగ్గవచ్చు. అయితే, ఆతగ్గుదల  పరిమితం చెయ్యబడుతుంది, అది భద్రపర్చబడుతుంది. ఇక్కడ సరుకులో ఉన్న విలువ పెరగదు; కాని కొత్త శ్రమ  కలుస్తుంది.

అయితే ఈ ఖర్చులు వినియోగదారులపైన పడతాయి. వాళ్ళు చెల్లించే ధరల్లో ప్రతిబింబిస్తాయి. దీనర్ధం: ఈ ఖర్చుల్ని చివరకి సమాజం భరిస్తుంది. భర్తీ చేస్తుంది.

అదనపు పెట్టుబడీ, శ్రమా కావాలి

వేరొక వైపు, ఇందుకు పెట్టిన పెట్టుబడి - శ్రమశక్తికి పెట్టిన భాగంతో సహా - సమాజ ఉత్పాదితం నించి భర్తీ అవాలి. అందువల్ల ఈ ఖర్చు వల్ల శ్రమ ఉత్పాదకత తగ్గితే పడే ఫలితం వంటిదే వస్తుంది.అందువల్ల, ఒక ప్రత్యేక ప్రయోజనకర ఫలితం రాబట్టాలంటే, మరింత పెట్టుబడీ, మరింత శ్రమా అవసరపడుతుంది.    అవి అనుత్పాదక మైన ఖర్చులు. 

చలామణీ ఖర్చుల కిందికి వస్తాయి

సరుకు సరఫరా ఏర్పడడానికి అవసరమయ్యే చలామణీ ఖర్చులు, ఉన్న విలువలు కేవలం సరుకు రూపం నించి డబ్బురూపానికి మారడానికి పట్టే కాలం వల్ల(అందువల్ల, సరుకుగా వచ్చిన ఉత్పాదితం, డబ్బులోకి మారి తీరాలి అనే వాస్తవం వల్ల) అవుతాయి. ఈ ఖర్చులు పూర్తిగా మొదటిరకం, అంటే అమ్మడానికీ, కొనడానికీ అయ్యే,  చలామణీ ఖర్చుల స్వభావాన్ని పంచుకుంటాయి. చలామణీ ఖర్చుల కిందికి వస్తాయి.

మరొకపక్క,  సరుకుల విలువ భద్రపరచబడుతుంది, లేక పెంచబడుతుంది- కారణం ఆ ఉత్పాదితం కొన్నిపరిస్థితులవల్ల మార్చబడింది. అందుకు అదనపు పెట్టుబడి ఖర్చయింది. ఆ ఉపయోగపు విలువలమీద మరికొంత  శ్రమ చర్య జరిగింది.కనుక విలువ పెరుగుతుంది. అయినాగాని,  సరుకుల విలువల లెక్కా, దానితో పాటు ఉండే  బుక్ కీపింగ్, కొనుగోలు అమ్మకం లావాదేవీలూ - ఉపయోగపు విలువలో ఉండే సరుకు విలువను ప్రభావితం చెయ్యవు.( అవి ఏ కొత్త విలువనూ ఏర్పరచవు) అవి కేవలం విలువ రూపానికి మాత్రమే సంబంధించినవి.

ఈ ఖర్చులు ఏ మేరకు ఏర్పడతాయి?

ఇంకా మనం ఈ ఖర్చులు ఏ మేరకు ఏర్పడతాయో పరిశోధించాలి.  వీటిని

1.సాధారణ సరుకు ఉత్పత్తి నించీ,

2.పెట్టుబడిదారీ సరుకు ఉత్పత్తి నించీ.

పరిశోధించాలి

మరొకవైపు,   ఖర్చులు  అన్ని సమాజాల ఉత్పత్తికీ ఏ మేరకు ఉమ్మడివై ఉండి, పెట్టుబడిదారీ విధానంలో మాత్రమే ప్రత్యేక రూపం పొందాయో చూడాలి.

ఆడం స్మిత్, లాలర్, సిస్మాండీ

సరుకు సరఫరా అనేది పెట్టుబడిదారీ ఉత్పత్తికి ప్రత్యేకమైనది అని ఆడం స్మిత్ (1723-1790) భావించాడు. అంటే, మిగతా ఉత్పత్తి విధానాల్లో ఉండదని.

ఇందుకు వ్యతిరేకంగా జాన్ లాలర్ (1814-1856) వంటి ఆర్థికవేత్తలు పెట్టుబడిదారీ ఉత్పత్తి అభివృద్ధి అయ్యేకొద్దీ సరుకు సరఫరా తగ్గుతూ ఉంటుందని నొక్కిచెప్పారు.

 సిస్మాండీ (1773-1842) అయితే పెట్టుబడిదారీ ఉత్పత్తికి, సరుకుసరఫరాని ఆటంకంగా పరిగణించాడు.

సరఫరా రూపాలు

వాస్తవానికి సరఫరాలు మూడు రూపాల్లో ఉంటాయి.

1.ఉత్పాదక పెట్టుబడి రూపంలో

2.వ్యక్తిగత వినియోగం కొసం ఫండ్ రూపంలో

3.సరుకు సరఫరా లేక సరుకు పెట్టుబడి రూపంలో

సరఫరా ఒక రూపంలో పెరిగినప్పుడు, మరొకరూపంలో సాపేక్షంగా తగ్గుతుంది - దాని పరిమాణం మూడు రూపాల్లోనూ ఏకకాలంలో నిరపేక్షంగా పెరిగినప్పటికీ.

ఒక విషయం స్పష్టం: ఉత్పత్తిదారుని అవసరాల కోసం ఉత్పత్తి జరిగే చోట, కొద్ది ఉత్పత్తి మాత్రమే మారకంకొసం జరుగుతుంది, అంటే సరుకురూపం తీసుకుంటుంది. పాత తరహా రైతు ఎకానమీని చూస్తే ఈ వాస్తవం తెలుస్తుంది. ఆ పరిస్థితుల్లో, ఉత్పాదితాల్లో అత్యధిక భాగం  సరుకు సరఫరా రూపం పొందవు. పొందకుండానే నేరుగా ఉత్పత్తి సాధనాల సరఫరాగానో, జీవితావసరాల సరఫరాగానో మారతాయి. ఎందుకంటే, అవి వాటి ఓనర్ చేతుల్లోనే ఉంటాయి గనక. ఈ కారణంగా స్మిత్ ఈ ఉత్పత్తి విధానం ఉన్న సమాజాల్లో సరఫరా అనేది లేదు అని ప్రకటించాడు.

స్మిత్ తప్పు

అతను సరఫరా రూపాన్ని సరఫరాతో గందరగోళ పరిచాడు. ఇప్పటిదాకా ఉన్న సమాజం అప్పటికప్పుడు సంపాదించినదే తిని  బతికిందని నమ్మాడు. Fn 7    ఇది అమాయకత్వం వల్ల ఏర్పడ్డ అపార్ధం.( సరఫరా ఉంటుంది. రూపాలు మారతాయి. స్మిత్ సరఫరా రూపాన్ని సరఫరాతో గందరగోళ పరిచాడు)

ఉత్పాదితం సరుకుగానూ, వినియోగ స్టాకు సరుకు స్టాకుగానూ మారినందువల్ల, మారిన మీదట మాత్రమే స్టాకు ఏర్పాటు (రూపం) తలెత్తిందని స్మిత్ నమ్మాడు. ఈ అభిప్రాయం తప్పు. వాస్తవం అందుకు తలకిందులుగా ఉంటుంది.

నిజమైన కారణం

ఉత్పత్తిదారుని సొంత అవసరాలకోసం జరిగే ఉత్పత్తి నించి, సరుకు ఉత్పత్తికి మారే క్రమంలో, ఈ రూపం మార్పు ఉత్పత్తిదారుల అర్ధిక వ్యవస్థలో  అత్యంత తీవ్రమైన సంక్షోభాలు తలెత్తేట్టు చేస్తుంది. ఉదాహరణకి, ఇండియాలో బాగా  పంటలు పండిన సంవత్సరాల్లో ధర లేనందువల్ల ధాన్యాన్ని ఎక్కువగా నిల్వచేసే ధోరణి ఇటీవల దాకా ఉంది.(Return. Bengal and Orissa Famine, House of Commons, 1867, I, pp. 230, 231, no. 74).

 అమెరికా అంతర్యుద్ధం మూలంగా పత్తి, నార వంటి వాటికి గిరాకీ పెరిగింది; అందువల్ల ఇండియాలో ధాన్యం పండించడం తగ్గిపోయింది. ధాన్యం ధర పెరిగింది. నిల్వ ఉన్న ధాన్యాన్ని ఉత్పత్తిదారులు అమ్మడం పెరిగింది. దీనికి తోడు, 1864-1866 మధ్య ఆస్ట్రేలియా, మెడగాస్కర్ వంటి దేశాలకు ధాన్యం  అసాధారణ స్థాయిలో ఎగుమతయింది.  1866 తీవ్ర కరువు అలా ఏర్పడింది. ఒక్క ఒరిస్సాలోనే 10 లక్షలమంది చనిపోయారు. ఆ కరువుకి   ఒక కారణం ఉన్నధాన్యం నిల్వలు అయిపోవడం అని నివేదికలు చెప్పాయి.

ఈ ఉత్పత్తి విధానం ఉన్న సమాజాల్లో సరఫరా అనేది లేదు అనుకోవడం స్మిత్ తప్పు

వివరణ: అప్పుడు ఇండియాలో పెట్టుబడిదారీ విధానం లేదు. స్మిత్ ప్రకారం ధాన్యం నిల్వలకు అవకాశం లేదు. వాస్తవం భిన్నంగా ఉంది. ఉన్న నిల్వలు కరిగిపోయాయి. ధాన్యం లేక ప్రజలు చనిపోయారు.దీన్ని బట్టి కరువుకు పూర్వం నిల్వలు ఉన్నాయి. అది పాత సమాజం. అయినా నిల్వ  ఉన్నది.

ఉత్పాదక పెట్టుబడి రూపంలో సరఫరా అనేది ఉత్పత్తిసాధనాల ఆకారంలో ఉంటుంది. ఆసాధనాలు అప్పటికే ఉత్పత్తి ప్రక్రియలో ఉంటాయి. లేదా, ఉత్పత్తిదారుని చేతిలో ఉండవచ్చు. అందువల్ల అప్పటికే ఉత్పత్తిప్రక్రియలో గుప్తంగా ఉంటాయి. గతంలోనే మనం ఒక విషయాన్ని గమనించాం: శ్రమ ఉత్పాదకత అభివృద్ధితో పాటు, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అభివృద్ధితో పాటు, బిల్డింగులూ, యంత్రాలూ వంటి ఉత్పత్తిసాధనాల మొత్తం పెరుగుతూ ఉంటుంది (పెట్టుబడి ఒకటో సంపుటం అధ్యాయం 25 విభాగం 2 లో వివరంగా ఉంటుంది). అవి శ్రమ సాధనాల రూపంలో ప్రక్రియలో ఇమిడి ఉంటాయి. వాటి చర్యని పదేపదే చేస్తాయి -ఎక్కువకాలమో, తక్కువ కాలమో. 

ఉత్పత్తిస్థాయి పెరిగేకొద్దీ, సహకారమూ,శ్రమ విభజనా, యంత్రాలూ పెరుగుతాయి. వాటితో పాటు రోజువారీ పునరుత్పత్తి ప్రక్రియలో చేరే ముడిపదార్ధాల మొత్తం పెరుగుతుంది. అలాగే సహాయకపదార్ధాల మొత్తం కూడా పెరుగుతుంది.

ఇవన్నీ ఉత్పత్తి స్థలంలో రెడీగా ఉండాలి. ఉత్పాదక పెట్టుబడి రూపంలో ఉండే ఈ సరఫరా పరిమాణం అందువల్ల నిరపేక్షంగా పెరుగుతుంది - ప్రక్రియ జరుగుతూ ఉండడానికి. ఈ సరఫరాని తిరిగి భర్తీ చెయ్యాల్సింది రోజూనా, లేక స్థిరమైన సమయాల్లోనా అనేదాన్ని పక్కన పెడితే, అక్కడ వాడే ముడిపదార్ధాల వంటి వాటి కన్నా ఎక్కువ పరిమాణంలో స్టోరై ఉండాలి. ప్రక్రియ కొనసాగడానికి దానికి తగిన పరిస్థితులు ఉండాలి. కొనడంలో ఆలస్యం జరిగి,  అంతరాయం కలగకూడదు. ఉత్పాదితం అమ్ముడయిందా లేదా అనే దానిమీద ఆధారపడకూడదు.

ఉత్పాదక పెట్టుబడి గుప్తంగా ఉండవచ్చు. లేక భిన్న నిష్పత్తుల్లో సరఫరా రూపంలో ఉండవచ్చు. ఉదాహరణకి, ఒక స్పిన్నింగ్ మిల్ ఓనర్ దగ్గర పత్తీ, బొగ్గూ నెలకి సరిపడా ఉండాలా? మూడు నెల్లకి సరిపడా ఉండాలా? రెంటికీ చాలా తేడా ఉంది. ఈ సరఫరా నిరపేక్షంగా పెరుగుతున్నా,  సాపేక్షంగా తగ్గవచ్చు. ఇది స్పష్టమే

ఇది వివిధ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితుల సారాంశం: ప్రక్రియ ఆగకుండా సాగాలంటే, అవసరమైనంత ముడిపదార్ధం  వేగంగా, క్రమబద్ధంగా, నమ్మకంగా సమకూర్చాలి. ఇవి పాటించకపోతే, సరిగా ముడిపదార్ధాలు అందకపోతే, ఉత్పాదక పెట్టుబడిలో గుప్తభాగం - అంటే, ఉత్పత్తిదారుని చేతిలో ఉత్పత్తిలో వాడాల్సిన ముడిపదార్ధాల సరఫరా - ఎక్కువయి తీరాలి. పెట్టుబడిదారీ ఉత్పత్తి అభివృద్ధి స్థాయికి, అందువల్ల సామాజిక శ్రమ  ఉత్పాదకత స్థాయికి ఈపరిస్థితులు విలోమానుపాతంలో ఉంటాయి. అందువల్ల,ఈ రూపంలోఉన్న సరఫరాకి ఇదే వర్తిస్తుంది.

ఏమైనప్పటికీ, ఇక్కడ సరఫరా తగ్గుదలగా అగపడేది, కొంతవరకు సరుకు పెట్టుబడి రూపంలో స్టాకు తగ్గుదల మాత్రమే. అంటే, సారాంశంలో అది ఒకే సరఫరా యొక్క రూపం మార్పు మాత్రమే. ఉదాహరణకు:

ఒకదేశంలో రోజూ భారీ స్థాయిలో బొగ్గు ఉత్పత్తవుతుంటే, నూలు మిల్లు ఓనరు తన నూలు ఉత్పత్తిని ఆగకుండా నడపడానికి  ఎక్కువ బొగ్గు నిల్వ పెట్టుకునే పని ఉండదు.

 రెండో విషయం: ఒక ప్రక్రియ ఉత్పాదితాన్ని మరొక ప్రక్రియలో ఉత్పత్తిసాధనంగా బదలాయ అయ్యే వేగం రవాణా, ప్రసార సాధనాల అభివృద్ధిని బట్టి ఉంటుంది. ఈ సందర్భంలో, రవాణ చౌకగా ఉండడం అనేది ఎంతోముఖ్యమైనది.

బొగ్గుని మరలమరల గని నించి మిల్లుకి రవాణా చేస్తుండాలి. రవాణా సాపేక్షంగా చౌకగా ఉంటే, ఎక్కువకాలానికి అవసరమయ్యే బొగ్గు ఎక్కువకాలం నిల్వ పెట్టుకోడానికయ్యే ఖర్చుకంటే, బొగ్గుని అంతరాయం కలగకుండా రవాణా చెయ్యడానికి ఎక్కువ ఖర్చవుతుంది.

  ఇంతదాకా పరిశీలించిన ఈరెండు పరిస్థితులూ ఉత్పత్తి ప్రక్రియనించే తలెత్తినవే.

ఇక మూడోవిషయం: అప్పుపద్ధతి అభివృద్ధి

పత్తి, బొగ్గు వంటివాటిని తిరిగి సరఫరా చెయ్యడానికి నూలు అమ్మకం మీద తక్కువగా ఆధారపడే కొద్దీ,ఈ సరఫరాలు సాపేక్షంగా కొద్దివైపోతాయి. అయినా ఉత్పత్తి ఆగకుండా సాగడానికి అవకాశం ఉంది. అప్పుపద్ధతి పెరిగితే, అమ్మకాలమీద ఆధారపడడం తగ్గుతుంది. అప్పుడు నూలు ఉత్పత్తి వెనకటిలాగే జరుగుతుంది. ఆవిధంగా, నూలు ఉత్పత్తి తయారైన నూలు అమ్మకాల ఒడిదుడుకుల మీద ఆధారపడి ఉండదు.

నాలుగో విషయం:

చాలా ముడిపదార్ధాల ఉత్పత్తికీ, కొంతవరకూ తయారైన వస్తువుల ఉత్పత్తికీ, ఎక్కువ సమయం పట్టవచ్చు. వ్యవసాయం ఉత్పత్తిచేసే ముడిపదార్ధాలకు ఇది ప్రత్యేకించి వర్తిస్తుంది.ఉత్పత్తి ఆగకుండా జరగాలంటే, కొత్త ఉత్పత్తులు వచ్చేదాకా సరిపోయే ముడిపదార్ధాలు  చేతిలో ఉండాలి. పారిశ్రామిక ఉత్పత్తిదారుడి చేతిలో వీటి నిల్వ/సరఫరా తగ్గితే, ఆనిల్వ వర్తకుడి చేతుల్లో సరుకు సరఫరా రూపంలో పెరిగినట్లే రుజువవుతుంది.

ఉదాహరణకు రవాణా అభివృద్ధి చెంది,లివర్ పూల్ దిగుమతి  గిడ్డంగుల్లో వున్న పత్తిని  మాంచెస్టర్ కి వేగంగా నౌకలమీద పంపడం వీలయింది అనుకుందాం. అప్పుడు తయారుదారుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు సరఫరాని సాపేక్షంగా కొద్ది కొద్ది పరిమాణాల్లో భర్తీ చేసుకోగలడు. ఆసందర్భంలో, లివర్ పూల్ వర్తకుల దగ్గర పత్తి సరుకు సరఫరాగా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందువల్ల అది కేవలం రూపంలో మార్పు మాత్రమే. ఈ పాయింట్ ని లాలర్, ఇతరులూ గమనించలేదు.

సామాజిక పెట్టుబడిని పరిగణిస్తే, రెండు సందర్భాల్లోనూ, అదే మొత్తం  సరఫరా రూపంలో ఉంటుంది. రవాణా అభివృద్దిచెందితే, ఒక దేశానికి ఒక సంవత్సర కాలంలో కావలసిన మొత్తం, తగ్గుతుంది. అమెరికా ఇంగ్లండ్ మధ్య ఎక్కువ  నౌకలు నడిస్తే, తగ్గిన తన పత్తి సరఫరాని ఇంగ్లండ్ భర్తీ చేసుకునే అవకాశాలు పెరుగుతాయి.అయితే అదే సమయంలో ఇంగ్లండ్ లో నిల్వగా ఉండాల్సిన సగటు పరిమాణం తగ్గుతుంది. ప్రపంచ మార్కెట్ పెరిగి తత్ఫలితంగా అదే సరుకు సరఫరా వనరులు పెరిగినా, ఇదే ఫలితం వస్తుంది. ఆ వస్తువు వేర్వేరు దేశాలనించి వేర్వేరు సమయాల్లో కొద్దికొద్ది మొత్తాల్లో సరఫరా అవుతుంది.

వచ్చే పోస్ట్: అసలైన సరుకు సరఫరా