14, అక్టోబర్ 2021, గురువారం

3. విలువ విశ్లేషణ

కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు?

3. విలువ విశ్లేషణ

మారకం విలువ అనేది విలువ అగపడే రూపం అని తెలుసుకున్నాక, మార్క్స్ విలువ విశ్లేషణకు పూనుకుంటాడు. విలువని ఏర్పరిచేది అనిర్దిష్ట శ్రమ అని తేలుస్తాడు. విలువ పరిమాణాన్ని నిర్ణయించేది సామాజికంగా అవసరమైన శ్రమకాలం అని నిర్ధారిస్తాడు.  

 https://youtu.be/iRyNMMQt2v8

https://www.youtube.com/watch?v=sRFhVODBaMg&t=323s


20, సెప్టెంబర్ 2021, సోమవారం

చలామణీలో అయ్యే నిజమైన ఖర్చులు

 

అధ్యాయం 6. చలామణీ ఖర్చులు

. చలామణీలో అయ్యే నిజమైన  ఖర్చులు

1. సరుకులు కొనడానికీ అమ్మడానికీ పట్టే సమయం

పెట్టుబడి సరుకు రూపం నించి డబ్బురూపం లోకీ, డబ్బురూపం నించి సరుకు రూపంలోకీ మారుతూ ఉంటుంది. పెట్టుబడిదారుడి వైపు నించి ఈ చర్యలు అమ్మడమూ, కొనడమూ. ఈ పనులకి ఎంతో కొంత కాలం పడుతుంది: అమ్మడానికి పట్టే కాలం, కొనడానికి పట్టే కాలం. ఆ కాలాల్లో పెట్టుబడిదారుడు అమ్మే వాడు గానూ, కొనేవాడుగానూ మార్కెట్లో ఉంటాడు.  మార్కెట్లో గడిపే కాలం అతని చర్యలో ముఖ్యభాగం అవుతుంది.

చలామణీలో విలువ మారదు

సరుకుల విలువలకే అమ్మకమూ, కొనుగోలూ జరుగుతాయని మనం ముందే అనుకున్నాం. కాబట్టి ఈ చర్యలు విలువ ఒక రూపానించి మరొక రూపానికి, మారడం మాత్రమే. స్థితి మార్పు మాత్రమే.

·         సరుకులు వాటి విలువలకే అమ్ముడయితే, అమ్మేవాని చేతిలోనూ, కొనేవాని చేతిలోనూ ఉన్న విలువ పరిమాణాలు మారవు. అలానే ఉంటాయి. వాటి విలువలకి అమ్ముడవకపోతే, అప్పుడు ఇద్దరి చేతుల్లో ఉన్న విలువల మొత్తం మారదు. అంతే ఉంటుంది. ఒక వైపు ప్లస్ అయినది రెండో వైపు మైనస్ అవుతుంది. ఒకని చేతిలో ఎంత  పెరిగితే, రెండోవాని చేతిలో అంత తగ్గుతుంది. కాబట్టి మొత్తం విలువ మారకుండా అంతే ఉంటుంది.

·         స-డ, డ-స రూపాంతరీకరణలు కొనేవాళ్ళకీ, అమ్మేవాళ్ళకీ జరిగే వ్యాపార లావాదేవీలు. బేరం కుదుర్చుకోడానికి కొంత సమయం పడుతుంది. ఎవరికి వాళ్ళు ఎదుటివాళ్ళకంటే ఎక్కువ పొందాలనుకుంటారు. కాబట్టి,  అటూ ఇటూ లాగడం ఎక్కువగానే ఉంటుంది. టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుంది. ఇందుకు టైం పడుతుంది, శ్రమశక్తి కూడా ఖర్చవుతుంది. అయితే ఇదేమీ విలువని సృజించడానికి కాదు. విలువని ఒక రూపం నించి మరొకరూపానికి మార్చడానికి. అందువల్ల, ఈ అవకాశాన్ని ఎక్కువ విలువ లాక్కోడానికి పరస్పరం చేసే ప్రయత్నం విషయాన్ని ఏమాత్రం  మార్చదు. ఇరుపక్కలా దురుద్దేశాల మూలంగా పెరిగే శ్రమ విలువని ఏర్పరచదు.  కోర్టులో జాప్యం జరిగినా అది దావా విలువని పెంచదుగదా. అలానే ఇదికూడ పెంచదు.

·         పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసే పెట్టుబడిదారుడు, తన ఉత్పత్తుల్ని పెద్ద స్థాయిలో అమ్మాల్సి ఉంటుంది. అప్పుడు ఉత్పత్తికి కావల్సిన సరుకుల్ని పెద్ద స్థాయిలో కొనాల్సి ఉంటుంది. ఇంతకు ముందు లాగే, కొనే కాలం గానీ, అమ్మే కాలం గానీ ఏమాత్రం విలువని సృజించదు.

·         శ్రమ విభజన వల్ల ఒక అనుత్పాదక చర్య, కొంతమంది ఏకైక వృత్తిగా మారినా, ఈ చర్య స్వభావం మారదు. అంటే అది ఉత్పాదక చర్య అవదు. అది కేవలం విలువ రూపాన్ని మార్చేందుకు మధ్యవరిగా వ్యవహరిస్తుంది. అంతే. సరుకుల రూపం మార్చే ఏజెంటు, అమ్మేవాడు, కొనేవాడుగా మాత్రమే ఉండే ఒక వర్తకుడు అనేకమంది ఉత్పత్తిదారులు అమ్మేందుకు కొనేందుకు పట్టే కాలాన్ని తన చర్యలద్వారా తగ్గిస్తాడు.తన శ్రమశక్తినీ, శ్రమ కాలాన్నీ స-డ, డ-స చర్యలకు వెచ్చిస్తాడు. అలా అతను బతుకుతాడు. మరొకరు దారం వడికీ, ఇంకొకరు మాత్రలు చేసీ పొట్ట పోసుకున్నట్లే. అతను చేసేది ఒక అవసరమైన చర్య. ఎందుకంటే పునరుత్పత్తి ప్రక్రియలో అనుత్పాదక చర్యలు ఉంటాయి.

అతని శ్రమ అనుత్పాదక శ్రమ. విలువని సృజించదు

అతను తన పక్కనున్న వాని లాగే పనిచేస్తాడు. కాని అతని శ్రమ విలువనీ సృజించదు , ఉత్పాదితాన్నీ సృజించదు. అతని శ్రమ అనుత్పాదక శ్రమ. అవసరమైనదే. అయినా అతని ప్రయోజకత్వం ఒక అనుత్పాదక చర్యని ఉత్పాదకచర్యగా మార్చడం కాదు. చర్య మార్పు ద్వారా అటువంటి పరివర్తన సాధ్యమైతే, అది అద్భుతమే.

మరి, అతని వల్ల ప్రయోజనం ఏమిటి?

సమాజం యొక్క శ్రమశక్తిలో, శ్రమ కాలంలో కొద్ది భాగం ఈ అనుత్పాదక చర్యతో ముడిబడి ఉంది. పైగా, అతను కేవలం వేతన శ్రామికుడు, బహుశా మంచి వేతనం ఉన్నవాడే అనుకుందాం. అతని జీతం ఎంతైనా, వేతన కార్మికుడిగా, పనిచేసే కాలంలో కొంత భాగం ఉచితంగా చేస్తాడు. రోజూ 8 గంటల ఉత్పాదితం విలువ పొందినా, 10 గంటలు పని చేస్తాడు. అయితే, అతను చేసే 2 గంటల అదనపు శ్రమ విలువని సృజించదు - అతని 8 గంటల అవసర శ్రమ ఎలా విలువని సృజించదో అలాగే- ఈ 8 గంటల అవసర శ్రమవల్ల అతనికి సమాజ ఉత్పాదితంలో కొంత అతనికి బదిలీ అవుతుంది. అయినప్పటికీ, అతని అదనపు శ్రమ విలువని సృజించదు, అవసరశ్రమలాగే.

మొదటి విషయం. సమాజం వైపు నించి, వెనకటి లాగా  శ్రమశక్తి కేవలం చలామణీ చర్యలో వ్యయమయింది. దాన్ని ఉత్పాదక శ్రమగా ఉపయోగించడం వీలుకాదు.

రెండో విషయం. రెండు గంటలూ అతను పనిచేసినప్పటికీ, సమాజం ఆ అదనపు శ్రమకి ఏమీ చెల్లించదు. దానివల్ల, సమాజం ఎక్కువ ఉత్పాదితాన్నిగానీ, ఎక్కువ విలువని గానీ సొంతం చేసుకోదు. అయితే చలామణీ ఖర్చులు, 5 వ వంతు – అంటే 10 గంటల నించి 8 గంటలకు - తగ్గుతాయి. సమాజం ఈ అయిదో వంతు చలామణీ ఖర్చులకు సమానకాన్ని చెల్లించదు. అయితే ఇతను గనక ఒక పెట్టుబడిదారుడు పెట్టుకున్నవాడయితే, 2 గంటలకు చెల్లింపు లేకపోవడం పెట్టుబడిదారుని చలామణీ ఖర్చుల్ని తగ్గిస్తుంది. ఆఖర్చులు అతని ఆదాయం నించి కోతపడేవే. కాబట్టి, పెట్టుబడి దారుడికి  ఇదొక ఆదాయం (positiva gain)- అనుకూలమైన అంశం. ఎందుకంటే, దాని వల్ల  పెట్టుబడి విలువ స్వయం విస్తరణకు ప్రతికూలపరిమితి (negative limit) తగ్గుతుంది. చిన్న స్వతంత్ర ఉత్పత్తిదారులు అమ్మడానికీ, కొనడానికీ వాళ్ల సొంత సమయం కొంత ఖర్చు చేస్తున్నంత కాలం, ఇది ఆ కాలం ఉత్పత్తి చర్యల మధ్య ఉండే విరామాలలో ఖర్చుచేసిన కాలంగానో, వాళ్ళ ఉత్పత్తి కాలంలో నష్టపోయిందిగానో ఉంటుంది. ఇందుకోసం ఖర్చయిన కాలం చలామణీ ఖర్చుల్లో ఒకటి. ఈ ఖర్చు మారిన విలువలకు ఏమీ కలపదు. ఇది ఆ విలువల్ని సరుకు రూపం నించి డబ్బు రూపం లోకి మార్చడానికి అయిన ఖర్చు మాత్రమే.

భారీ స్థాయిలో కొనడం అమ్మడం వల్ల పరిస్థితి స్వభావం మారదు

చలామణీ ఏజెంట్ గా పనిచేసే పెట్టుబడిదారీ సరుకుల ఉత్పత్తి దారుడు, ప్రత్యక్ష సరుకుల ఉత్పత్తి దారుడినించి భిన్నంగా ఉండేది  ఒక్క విషయంలోనే. అదేమంటే, అతను భారీ స్థాయిలో కొంటాడు, భారీ స్థాయిలో అమ్ముతాడు. అందువల్ల, అలాంటి ఏజెంట్ గా అతని విధి పెద్ద పరిమాణాల్లో ఉంటుంది. ఒకవేళ అతని వ్యాపార పరిమాణం ఒత్తిడి వల్ల ఆపని చెయ్యడానికి చలామణీ ఏజెంట్లను వేతన శ్రామికుల్ని నియమించవచ్చు. అంతమాత్రాన పరిస్థితి స్వభావం మారదు. కొంత శ్రమశక్తీ, శ్రమకాలమూ చలామణీ ప్రక్రియలో (అది కేవలం రూపం మార్పు మాత్రమే అయిన మేరకు) ఖర్చవుతుంది. అయితే అది అదనంగా పెట్టిన పట్టుబడిగా కనబడుతుంది. అస్థిర పెట్టుబడిలో కొంత కేవలం చలామణీలో పనిచేసే శ్రమశక్తిని కొనడానికి అడ్వాన్స్ చెయ్యాల్సి ఉంటుంది. ఈ అడ్వాన్స్ ఉత్పాదితాన్నిగానీ, విలువనిగానీ సృజించదు. అడ్వాన్స్ చేసిన పెట్టుబడి ఉత్పాదకంగా చర్య నెరపిన పరిమాణాల్ని అదే మేరకు తగ్గిస్తుంది. కేవలం చలామణీ ఖర్చుల్లో ఒక భాగం అవుతుంది. అంతే.

2. పద్దుల నమోదు (Book-keeping)

కొనడానికీ అమ్మడానికీ కాక పద్దులు - జమా ఖర్చులు - నమోదు చెయ్యడానికి కొంత శ్రమకాలం ఖర్చవుతుంది. అందుకు కలాలూ, సిరా,కాగితాలూ, డెస్కులూ, ఆఫీస్ సరంజామా వాడాల్సి ఉంటుంది. అంటే, పద్దుల నమోదు వస్తురూపం పొందిన శ్రమ వినియోగం అవుతుంది.అందువల్ల ఈ చర్యకి ఒకపక్క శ్రమశక్తీ, మరొక పక్క శ్రమ సాధనాలూ  కావాల్సి ఉంటుంది. అమ్మేటప్పుడు, కొనేటప్పుడు ఉండే పరిస్థితులే ఈ సందర్భంలోనూ ఉంటాయి. దాని వలయాల్లోపల ఐక్యతగా, చలనంలో ఉన్న విలువగా, ఉత్పత్తి రంగంలోనైనా, చలామణీ రంగం లోని రెండు దశల్లో దేనిలోనయినా, పెట్టుబడి ఖాతా డబ్బుగా భావాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడిదారీ సరుకుల ఉత్పత్తి దారుడి మనసులో ఉంటుంది. జమాఖర్చుల నమోదు ఈ గమనాన్ని నిశ్చయించి, నియంత్రిస్తుంది. ధరల నిర్ణయం, లేక సరుకుల ధరల లెక్కింపు ఇందులో(జమాఖర్చుల నమోదులో) ఇమిడి ఉంటుంది. ఉత్పత్తి గమనం, ప్రత్యేకించి అదనపు విలువ ఉత్పత్తి గమనం, ఊహలో ప్రతీకగా ప్రతిబింబిస్తుంది. సరుకులు కేవలం విలువ నిక్షేపాలుగా (depositories) ఉంటాయి.

పాతకాలపు రైతు పద్దుల లెక్క

పాతకాలపు రైతు వంటి వ్యష్టి ఉత్పత్తిదారుడు పద్దుల లెక్క మనసులో ఉంచుకోవచ్చు.లేక ఖర్చులు, రశీదులు చెల్లించాల్సిన తేదీలు, మొదలైన వాటిని నోట్ చేసుకోవచ్చు- ఉత్పత్తి కాలం బయట.  ఆ చర్యా దానికయిన పేపర్ వంటి పరికరాల ఖర్చూ వేరుగా ఉంటుంది. మరికొంత శ్రమ పడుతుంది- అనేది స్పష్టమే. ఇది అవసరమైనదే. అయితే అతని చర్య ఉత్పాదక వినియోగానికి అందుబాటులో ఉన్న కాలంలో కొత అవుతుంది. 

పెట్టుబడిదారుడి పద్దుల లెక్క

ఆ చర్య  పెట్టుబడిదారీ సరుకుల ఉత్పత్తిదారుడి చేతుల్లో కేంద్రీకృతమైనా అ చర్య స్వభావం మారదు. అనేకమంది చిన్న సరుకు ఉత్పత్తిదారుల చర్యగా కనబడే బదులు, ఇప్పుడు ఒక్క పెట్టుబడి దారుడి చర్యగా అగపడుతుంది. అంత మాత్రన దాని స్వభావం మారదు. అలాగే, ఉత్పాదక చర్యలో అనుబంధంగా/ తోకగా ఉన్న చర్య, స్వతంత్రులైన ఏజెంట్ల పనిగా విడిపోయి, ప్రత్యేక పనిగా అయినా చర్య స్వభావం మారదు.

ఒక అనుత్పాదక చర్య ఉత్పాదక చర్య కాజాలదు

ఒక పని స్వతంత్రమైనది కాకముందు ఉత్పాదితాల్నీ విలువనీ సృజించనిది అయి ఉంటే, ఆ తర్వాత శ్రమ విభజన వల్ల పొందిన స్వతంత్రం ఆచర్యని ఉత్పాదితాల్నీ విలువనీ సృజించే చర్యగా చెయ్యజాలదు. కొత్తగా పెట్టుబడి పెట్టేవాడు, పద్దుల నమోదుకు, రాసేవానికోసం,పరికరాలకోసం  కొంత కేటాయించాల్సి వస్తుంది. అతని పెట్టుబడి అప్పటికే నడుస్తుంటే,  అతను  పద్దులు రఏవాడికీ, గుమాస్తాలకూ ఇతర వాటికీ నిరంతరం వెచ్చించడానికి తన ఉత్పత్తిలో కొంతభాగాన్ని డబ్బులోకి మార్చ వలసి ఉంటుంది. ఆ భాగం  ఉత్పత్తి ప్రక్రియ నించి తొలిగిపోతుంది. అది చలామణీ ఖర్చులకు చెందుతుంది.మొత్తం దిగుబడిలో కోత అవుతుంది

పద్దుల నమోదు ఖర్చులకూ, సరుకులు అమ్మే కొనే ఖర్చులకూ తేడా

పద్దులనమోదు తాలూకూ ఖర్చులకీ, లెదా అనుత్పాదక శ్రమ వ్యయానికీ, మరొకపక్క కేవలం కొనడానికీ అమ్మడానికీ అయ్యే దానికీ ఒక తేడా అయితే ఉంది.కొనడానికీ అమ్మడానికీ అయ్యే శ్రమ నిర్దిష్ట ఉత్పత్తి ప్రక్రియ యొక్క నిర్దిష్ట సామాజిక రూపం నించి మాత్రమే, అది సరుకుల ఉత్పత్తి అనే వాస్తవం నించి మాత్రమే వస్తుంది.  ఉత్పత్తి ప్రక్రియ వ్యష్టి స్వభావాన్ని కోల్పోయిసమాజస్థాయిని పొందేకోద్దీ, పద్దుల నమోదు మరింత అవసరమతుంది. అందువల్ల రైతుల, సన్న చేతివృత్తుల వ్యవస్థలోని చెదురుమదురు ఉత్పత్తిలో కంటే, పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎక్కువ అవసరమవుతుంది. అలాగే  పెట్టుబడిదారీ ఉత్పత్తిలో కంటే సమష్టి ఉత్పత్తిలో మరీ మరింత అవసరం అవుతుంది. అయితే ఉత్పత్తి కేంద్రీకృతం అవుతూ,  పద్దుల నమోదు సామాజికం అయ్యేకొద్దీ, పద్దుల నమోదుకయ్యే ఖర్చులు తగ్గుతూ ఉంటాయి.

 ఇక్కడ  పరిశీలిస్తున్న అంశం కేవలం రూపాల పరివర్తన వల్ల ఏర్పడే, చలామణీ ఖర్చుల సాధారణ స్వభావం. వాటికి సంబంధించిన అన్ని రూపాల వివరాల్నీ చర్చించడం ఇక్కడ అవసరం లేదు. అయితే ఈ రూపాలు వ్యష్టి ఉత్పత్తిదారుడి విషయంలో ఇలా కనపడి అలా పోతాయి. ఏదో కనబడీ కనబడనట్లుంటాయి.అతని ఉత్పాదక చర్యలతో కలగలిసి జరుగుతుంటాయి. పెద్దగా మన దృష్టికి రావు. ఈ రూపాలు భారీ స్థాయి చలామణీ ఖర్చులుగా కొట్టొచ్చినట్లు, కళ్ళకు కట్టినట్లు కనిపించే స్థితి వస్తుంది.. ఎప్పుడంటే: ఈ చర్యలు స్వతంత్రమైనవై, బాంకుల వగైరాల ప్రత్యేక చర్య అయినప్పుడు, లేక వ్యష్టి వ్యాపారాల్లో కాషియర్ల ప్రత్యేక చర్యగా భారీ స్థాయిలో కేంద్రీకృతం అయినప్పుడు. ఈ చర్యలు డబ్బు తీసుకోడం, డబ్బివ్వడం గా మాత్రమే చూచినప్పుడు కొట్టొచ్చినట్లు కనబడతాయి.

అయితే మనం ఒక విషయం గట్టిగా గుర్తు పెట్టుకొని ఉండాలి. ఏమంటే: ఈ ఖర్చులు అగపడే రూపంలో వచ్చిన మార్పువల్ల, వాటి స్వభావంలో మార్పు రాదు.  ఈ చర్యలు డబ్బు తీసుకోడం, డబ్బివ్వడం గా మాత్రమే చూచి నప్పుడు కొట్టొచ్చినట్లు కనబడతాయ్తి. అయితే గట్టిగా గుర్తుంచుకోవాల్స్నిన విషయం: చలామణీ ఖర్చులు వాటి రూపం మారినందువల్ల, వాటి స్వభావం మారదు.

3. డబ్బు

 ఒక ఉత్పాదితం- దాన్ని సరుకుగా ఉత్పత్తి చేసినా, సరుకుగా ఉత్పత్తి చెయ్యకపోయినా - అది సంపదకి భౌతిక రూపం. అది ఒక ఉపయోగపు విలువ. వ్యక్తిగతవాడకంలోనో, ఉత్పత్తిలోనో వడడానికి ఉద్దేశించ బడింది. దానివిలువ ధరలో వ్యక్తమవుతుంది. ఈ ధర దాని ఉపయోగపు రూపాన్ని ఏమాత్రం మార్చదు. అయితే  డబ్బుగా పనిచేసే వెండి బంగారం వంటి సరుకులు చలామణీ ప్రక్రియలో ఉంటాయి. నిల్వల రూపంలో, రిజర్వ్ ఫండ్ల రూపంలో కూడా అవి ఉంటాయి. అవి చలామణీ రంగంలోనే ఉంటాయి- అయితే గుప్తంగా. పెట్టుబడిదారీ విధానంలో, ఉత్పాదితాలు సరుకుల రూపం పొందుతాయి. కాబట్టి, భారీ స్థాయిలో సరుకులు అవుతాయి. అవి డబ్బు రూపం తీసుకొని తీరాలి.

చలామణీ సాధనంగా డబ్బు పెరుగుతూ ఉండాలి

 సరుకులు పెరుగుతూ ఉంటాయి కనుక చలామణీ సాధనంగా, చెల్లింపు మాధ్యమంగా, రిజర్వ్ ఫండ్ గా పనిచేసే వెండి బంగారాలు కూడా పెరుగుతాయి.  అయితే డబ్బుగా పనిచేసే సరుకులు వ్యక్తిగత వాడకంలోకి గానీ, ఉత్పాదక వినియోగంలోకి గానీ ప్రవేశించవు. అవి కేవలం చలామణీ యంత్రంలో స్థిరరూపంలో సామాజిక శ్రమకు ప్రాతినిధ్యం వహిస్తాయి. సామాజిక సంపదలో కొంత ఈ అనుత్పాదక రూపాన్ని పొందుతుంది.

డబ్బు అరిగి పోతూ ఉంటుంది

అంతేగాక, డబ్బు అరిగి పోతూ ఉంటుంది. ఆ తరుగుకి సరిపోయే వెండి, బంగారాల్ని సమకూర్చవలసి ఉంటుంది. అందుకు సమాజడ శ్రమ, వెండి బంగారాలుగా మారాల్సి వస్తుంది. ఇందుకయ్యే ఖర్చులు పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో గణనీయంగా ఉంటాయి. అవి సాధారణ సరుకు ఉత్పత్తిలో ఉత్త ఖర్చులు. ఈ ఉత్పత్తి అభివృద్ధి అయ్యే కొద్దీ అవి పెరుగుతాయి. అవి చలామణీ ప్రక్రియకు తప్పక వదిలెయ్యాల్సిన సమాజ సంపద భాగం.


వచ్చే పోస్ట్ : నిల్వ చేసేందుకయ్యే ఖర్చులు