21, మే 2020, గురువారం

పనులు పోయినప్పుడు వేరే చోటికి పోవాలని కార్మికులు - పోకుండా ఉండాలని యజమానులు

పనులు పోయినప్పుడు వేరే చోటికి పోవాలని కార్మికులు - పోకుండా ఉండాలని యజమానులు

సంక్షోభ సమయాల్లో కార్మికులకు పనులు పోతాయన్నది తెలిసిందే. అప్పుడు పనివాళ్ళు పనులున్నచోటికి పోవాలనుకుంటారు.వేరే చోటనించి వచ్చిన వాళ్ళైతే, సొంత ఊళ్ళకి పోదాం అనుకోవచ్చు. అలా వెళ్ళడం యజమానులకు ఇష్టముండదు. ఎందుకంటే మళ్ళీ ఉత్పత్తి అవసరమైనప్పుడు పనివాళ్ళు ఉండరు. పని సాగదు. పనులు లేకపోయినా వాళ్ళు అక్కడే కనిపెట్టుకొని ఉండాలి. ఉండడానికి కావలసిన ఏర్పాట్లు ఎవరికివారు చేసుకోవాలి. యజమానులు బాధ్యత తీసుకోరు. అయినా వాళ్ళని పోకుండా ఆపేదానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వాన్ని తమకు అనుకూలంగా వ్యవహరించేట్లు ఒత్తిడి చేస్తారు.
దీనికి సంబంధించి కాపిటల్ మొదటి భాగం 538-541 పేజీల్లో మార్క్స్ చరిత్ర నించి ఒక ఉదాహరణ ఇచ్చాడు. అది నూలు పనివాళ్ళకి సంబంధించింది.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అంతర్యుద్ధం వల్లా, దానివెంట వచ్చిన పత్తి కరువు వల్లా, లంకాషైర్ నగరంలో అనేకమంది నూలు పనివాళ్ళు తొలిగించబడ్డారు. వాళ్ళు వలస ప్రాంతాలకో, అమెరికా సంయుక్త రాష్ట్రాలకో వలసపోవడానికి ప్రభుత్వ సహాయం కోసమూ, స్వచ్చంద ప్రజా విరాళాల కోసమూ ఇతరులు అభ్యర్ధించడమేకాక, అసలు కార్మిక వర్గమే స్వయంగా విజ్ఞప్తులు చేసింది.
1863 మార్చ్ 24 న ది టైంస్ పత్రికలో ఎడ్మండ్ పాటర్ రాసిన ఉత్తరం పడింది. ఆయన మాంచెస్టర్ చాంబర్ ఆఫ్ కామర్స్ కి మాజీ అధ్యక్షుడు.ఆ లేఖని House of Commonsలో ‘ఉత్పాదకుల ప్రణాళిక’ అన్నారు. అలా అనడం సరైనదే. పత్తి పనివాళ్ళ సరఫరా అతిగా ఉన్నదని పనిలేని కార్మికునికి చెప్పవచ్చు. వాళ్లలో మూడో వంతు తగ్గించాలి. అలా తగ్గిస్తే మిగిలిన రెండొంతుల మందికీ సరైన డిమాండ్ ఉంటుంది...ప్రజాభిప్రాయం వలసలకి అనుకూలంగా ఉంది....యజమాని శ్రమ సరఫరా తగ్గడాన్ని ఇష్టపడడు. అది తప్పనీ, సరికాదనీ అతను అనుకుంటాడు- బహుశా న్యాయంగానే...కాని, వలసలకి సహకరించేందుకు ప్రజాధనాన్ని ఖర్చుచెయ్యాల్నివస్తే, అతనికి ఆవిషయం గురించి మాట్లాడే హక్కు, అసమ్మతి తెలిపే హక్కు ఉంటుంది.
పత్తి వర్తకం చాలా ప్రయోజనకరమైనది- అంటాడు పాటర్. ఐర్లండ్ నుంచీ,వ్యావసాయక జిల్లాలనుండి అదనపు జనాభాని ఆకర్షించింది. 1860 లో మొత్తం ఇంగ్లిష్ ఎగుమతుల్లో పదమూడింట అయిదొంతులు (5/13) పత్తి వర్తకానివే. అంత పెద్ద వర్తకం అది. కొన్ని సంవత్సరాలు గడిస్తే మళ్ళీ మార్కెట్, ప్రత్యేకించి ఇండియా మార్కెట్ విస్తరించి, పౌను పత్తి 6 పెన్నీలకే సమృద్ధిగా లభిస్తుంది అంటాడు.తర్వాత ఇలా కొనసాగిస్తాడు:
కొంత కాలానికి ఒకటి రెండు మూడేళ్ళకి సరిపోయేటంత పత్తి పండవచ్చు..అప్పుడు నాప్రశ్న: ఈ వ్యాపారం అట్టిపెట్టుకో తగిందేనా? ఈ యంత్రాంగాన్ని (జీవమున్న శ్రమ యంత్రాలు అని ఆయన భావం) అలాగే ఉంచుకోవడం తగినదేనా? దాన్ని వదులుకోవడం అత్యంత అవివేకం కాదా? అవివేకమనే నేను అనుకుంటున్నాను. పనివాళ్ళు లంకాషైర్ ఆస్తి కారనీ, యజమానుల ఆస్తీ కారనీ ఒప్పుకుంటాను. అయితే లంకాషైర్ కీ, యజమానులకీ బలం వాళ్ళే. ఒకతరం దాకా భర్తీ చెయ్యలేని మానసిక, సుశిక్షిత శక్తి వాళ్ళు.
వాళ్ళు వాడి పనిచేసే యంత్రాలనైతే, 12 నెలల్లో లాభదాయకంగా, ఇంకా మెరుగైన వాటితో భర్తీ చెయ్యవచ్చు
.
శ్రమించే శక్తిని వలసపోవడానికి ఒప్పుకుంటే, పెట్టుబడిదారుడి పరిస్థితేమిటి?

పనివాళ్ళు వలస పొవడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళు అలా కోరుకోవడం సహజమే.... తగ్గించండి.శ్రమించే శక్తి ఖర్చు వేతనాల్లో అయిదో వంతు అంటే 50 లక్షలు తగ్గించి, నూలు పరిశ్రమని కుదించి వేయండి. అలా చేస్తే, వీళ్ళ మీద ఆధారపడే చిన్న దుకాణదారులసంగతేమిటి? ఇళ్ళ అద్దెలసంగతేమిటి?....
ఇంకొంచెం ముందుకుపోయి సన్నకారు రైతు మీద, కాస్త మెరుగైన గృహయజమానిమీద..భూకామందు మీదా దీని ప్రభావాల్ని గమనించండి. ఒక దేశంలోని తయారీ కార్మికుల్లో అత్యుత్తమమైన భాగాన్ని ఎగుమతిచేసి, ఆదేశపు అత్యుత్తమ ఉత్పాదక పెట్టుబడిలో, సంపదలో కొంత భాగం విలువని ధ్వంసం చెయ్యడం కన్నా అన్నివర్గాలకూ ఆత్మహత్యా సదృశమైన సలహా ఏమైనా ఉందేమో చెప్పండి.- అని అడుగుతున్నాడు.
పాటర్ ప్రతిపాదన: ప్రత్యేక న్యాయ శాసనాలద్వారా రుణం మంజూరు చెయ్యాలి. రుణం పొందే వాళ్ళ మనోస్థైర్యాన్ని
కలిగించేందుకు, ఏదో ఒక వృత్తినో, పనినో కల్పించేందుకు అయిదారు మిలియన్ పౌన్ల రుణం, రెండుమూడేళ్లకు విస్తరించేట్లు పత్తిపండించే జిల్లాల్లో Boards of Guardians కి అనుబంధంగా ప్రత్యేక అధికారులచేత నిర్వహించబడే రుణం ఇవ్వాలి. అత్యుత్తమ శ్రామికుల్ని వదులుకోవడం కన్నా, భూకామందులకీ, యజమానులకీ హీన స్థితి ఇంకొకటి ఉంటుందా? ఇంగ్లండ్ లో పేదవాళ్ళకి సహాయం చేసే చట్టాన్ని(Poor Law) అమలు పరిచే అధికారులే Board of guardians. 1835 నుంచీ 1930 దాకా వీళ్ళు పని చేశారు. 1834 నుంచీ పేదవాళ్ళకు workhouses లో వసతి, భోజనం ఉండేవి. అందుకు బదులుగా వాళ్ళు పనిచెయ్యాలి.
పాటర్ కి The Times పత్రిక ఇలా జవాబిచ్చింది:
నూలు యజమానులకున్న అపూర్వమైన, అత్యున్నతమైన ప్రాధాన్యతతో అతను ప్రభావితుడయ్యాడు. ఎంతగానంటే, ఈ వర్గాన్ని భద్రంగా ఉంచడానికీ, వాళ్ల వృత్తిని శాశ్వతం చెయ్యడానికీ 5 లక్షల మంది కార్మికుల్నీ, వాళ్ళమీద ఆధారపడ్డ 7 లక్షల మందినీ, వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒక భారీ నైతిక శ్రమ గృహంలో నిర్బంధించి ఉంచాలని అనుకుంటున్నాడు.
ఈ వర్తకం అట్టిపెట్టుకోదగిందేనా? అని అడుగుతున్నాడు. మా జవాబు: తప్పనిసరిగా ఉంచుకోదగినదే. నీతీ, నిజాయతీ గల అన్ని మార్గాలద్వారా అట్టిపెట్టుకోదగిందే. పాటర్ చెప్పినట్లుగా, పనివాళ్ళ పునరుత్పత్తికి కొంత కాలం అవసరం కావచ్చు.కాని యంత్ర పనివాళ్ళూ పెట్టుబడిదారులూ అందుబాటులో ఉంటే చాలు ఇక మనకు ఏనాడూ అవసరపడనంత ఎక్కువమంది నిపుణుల్నితయారు చేసుకోడానికి పొదుపరులైన, కష్టపడి పనిచేసే బలాఢ్యులు కావలసినంతమంది దొరుకుతారు.
ఒకటి, రెండు, మూడు సంవత్సరాల్లో వర్తకం ఎత్తుకుంటుందని పాటర్ చెప్తున్నాడు. కార్మికుల్ని వలసపోయేందుకు ప్రోత్సహించ వద్దు అంటున్నాడు. పనివాళ్ళు వలసపోవాలనుకోవడం సహజమే అంటున్నాడు.అయితే వాళ్ళ అభీష్టం అదే అయినా, ఒకప్పటికి నూలు యజమానులు కార్మికుల్ని నియమించుకుంటారని నిరీక్షిస్తూ జాతి ఈ 5 లక్షల కార్మికుల్నీ, వాళ్ళ ఆశ్రితులు 7 లక్షల మందినీ నూలు జిల్లాల్లోనే అట్టిపెట్టుకోవాలి అనేది ఆయన ఉద్దేశం. దీని అనివార్య పర్యవసానంగా జాతి, వాళ్ళ అసంతృప్తిని బలప్రయోగంతో అణచిపెట్టాలి, దానధర్మాలతో వాళ్ళని పోషించాలి - అనికూడా ఆయన అనుకొని తీరాలి. ఇనుము, బొగ్గు, పత్తి మొదలైన వాటితో ఎట్లా వ్యవహరిస్తామో, శ్రమశక్తితో కూడా వ్యవహరించే వాళ్ళ బారినుండి శ్రమ శక్తిని రక్షించడానికి ఈ దీవుల్లోని మహత్తర ప్రజాభిప్రాయం కృషి చెయ్యాల్సిన సమయం ఆసన్నమయింది.
చివరకి ఏం జరిగింది
ఈ 'టైంస్ ' వ్యాసం ఒక చమత్కార నీతి బోధగానే ఉండిపొయింది. వాస్తవంలో పాటర్ అభిప్రాయమే ప్రజాభిప్రాయం అయింది. కార్మికుల వలస నిరోధించబడింది.వాళ్ళు శ్రమ గృహంలో, నూలు జిల్లాల్లో బందీలయ్యారు. అంతకుముందు లాగే లంకాషైర్ నూలు ఉత్పత్తిదారులకు బలం చేకూర్చే వారయ్యారు.వలస పోయేవాళ్లకి 'ఫార్థింగ్' (పెన్నీలో నాలుగోవంతు) అయినా సహాయం చెయ్యడానికి పార్లమెంట్ ఒప్పుకోలేదు. కాగా మునిసిపల్ కార్పొరేషన్లకి అధికారాలిస్తూ కొన్ని చట్టాలు చేసింది. అవి కార్మికుల్ని అర్ధాకలితో ఉంచేందుకు అనువైనవే. అంటే మామూలు వేతనాల కంటే తక్కువకి వాళ్లని దోపిడీ చెయ్యడానికి ఉపకరించేవే.
ఇందుకు భిన్నంగా మూడేళ్ళ తర్వాత పశువ్యాధి వ్యాపించినప్పుడు అదే పార్లమెంట్ సాంప్రదాయాల్ని తోసిపుచ్చి మిలియనీర్లైన భూస్వాములకు మిలియన్ల పౌన్లు నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది.వాళ్ళ రైతులు మాంసం ధర పెరిగినందువల్ల ఏమాత్రం నష్టం లేకుండానే బయటపడ్డారు.
Like
Comment
Share

8, మే 2020, శుక్రవారం

అమెరికా ఉద్యోగ సంక్షోభం


అమెరికా ఉద్యోగ సంక్షోభం
అమెరికా కార్మిక శాఖ  ఉద్యోగ నివేదిక విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో 2కోట్లా 5 లక్షల ఉద్యోగాలు పోయాయి.ఇన్ని పోవడం మహా సంక్షోభం తర్వాత ఇప్పుడే. 2008-2009 మహామాంద్యంలో పోయిన ఉద్యోగాలు మొత్తం 87 లక్షలు. అంతకు రెండింతలు మించి ఒక్క ఏప్రిల్ నెల్లోనే పోయాయి. ఇక నిరుద్యోగం రేటు : ఫెబ్రవరిలో 3.5 శాతం. ఇంత తక్కువ  50 ఏళ్ళలో ఎన్నడూ లేదు.ఇప్పుడు అమాంతం 14.7 కి పెరిగింది.ఇంత ఎక్కువ 1933 తర్వాత ఎన్నడూ లేదు. కరోనా వల్ల కంపెనీలు మూతబడడం ఇందుకు పెద్ద కారణం. అయితే ఈ ఉద్యోగాలన్నీ కంపెనీలు తెరవగానే వస్తాయన్నాడు ట్రంప్. చాలా త్వరలో అనికూడా అన్నాడు. అయితే కరోనా కేసులు 13 లక్షలు కాబోతున్నాయి.నిన్న కొత్తకేసులు దాదాపు 30 వేలు.ఇక కంపెనీలు తెరిస్తే ఉద్యోగాలు అన్నో ఇన్నో వస్తాయి. మరొకపక్క కరోనా కేసులు పెరుగుతాయి.ఈ పరిస్థితుల్లో పరిశ్రమలు ఏమేరకు పనిచేస్తాయో తెలియదు. ట్రంప్ చెప్పేది జరగదు. ఎకానమీ అంత తేలిగ్గా, వేగంగా  ఎత్తుకోదు. ఇది మహామాంద్యాన్ని మించిపోవచ్చు.ఇప్పట్లో 2020 ఫిబ్రవరి పరిస్థితి రాదు.  

5, మే 2020, మంగళవారం

కార్ల్ మార్క్స్ కాపిటల్ లో ఏం చెప్పాడు?

అనే పుస్తకాన్ని విరసం ప్రచురించింది. జనవరి 12,13 తేదీల్లో హైదరాబాద్ లో జరిగిన 50 ఏళ్ళ మహాసభల్లో చెంచయ్యగారు ఆవిష్కరించారు.

1, మే 2020, శుక్రవారం

కార్ల్ మార్క్స్ కాపిటల్ లో ఏం చెప్పాడు? - సాఫ్ట్ కాపీ

'కార్ల్ మార్క్స్ కాపిటల్ లో ఏం చెప్పాడు' - ఈ పుస్తకాన్ని విరసం ప్రచురించింది. జనవరి 12,13 తేదీల్లో హైదరాబాద్ లో జరిగిన 50 ఏళ్ళ మహాసభల్లో చెంచయ్యగారు ఆవిష్కరించారు.ఆ తర్వాత కొద్దికాలానికే లాక్ డౌన్ మొదలయ్యింది. షాపులు మూసేశారు. దూర ప్రాంతాల్లో పుస్తకలు తేలిగ్గా దొరకవు. పైగా ఈతరం వాళ్ళు చాలామంది కంప్యూటర్లలో చదవుతున్నారు. కొందరు స్మార్ట్ ఫోన్లలో కూడా చదవడానికి అలవాటుపడుతున్నారు. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని, సాఫ్ట్ కాపీని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఈ లింక్ ల ద్వారా అందుకోండి.

http://virasam.org/article.php?page=1396

https://drive.google.com/open?id=1RVzbCA4AuHDvE1y6pLO0XqGs7VjgSVAQ