19, మే 2018, శనివారం

యంత్రాలూ - వాటి అభివృద్ధీ


అధ్యాయం -15

యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా
విభాగం -1
యంత్రాల అభివృద్ధి

యంత్రాలకు ముందు
అచ్చుపనిలో యంత్రాలు రాక ముందు ఒక కొయ్య దిమ్మ  మీద  బొమ్మనో, అక్షరాలనో చెక్కి గుడ్డమీద అద్దేవారు.తర్వాత కాగితాల మీద వట్టేవారు.. పనిచేసే పనిముట్టు ఆ దిమ్మే. దాన్ని పట్టుకుని శ్రామికుడు అచ్చు వేసేవాడు. గంటకి చాలా తక్కువ కాపీలు మాత్రమే తియ్యగలడు. దీన్ని దిమ్మ అచ్చు (బ్లాక్ ప్రింటింగ్ ) అనేవారు
యంత్రాలు వచ్చాక
తర్వాత మిషన్ ప్రింటింగ్ వచ్చింది. ఒకేఒక యంత్రం ఒకమనిషి సహాయంతో గంటలో మునుపు 200 మంది చేసినంత పని చేసేది. కాలికో గుడ్డ మీద  4 రంగులు అద్దగలిగేది. ఒక శ్రామికుడు చేతి పనిముట్లతో/కొరముట్లతో రోజుకి 5 వస్తువులు చేస్తే, యంత్రంతో ఇరవయ్యో వందో చేస్తాడు. ఎన్ననేది ఆయంత్రం శక్తిని బట్టి ఉంటుంది.
యంత్రాల అభివృద్ధి
అచ్చు యంత్రాన్ని తీసుకుందాం. కాలితో తొక్కుతూ నడిపే అచ్చు యంత్రం మీద 1000 కాపీలు తీస్తాడు. ఆ యంత్రానికి మోటార్ తగిలిస్తే  మహాఅయితే 3000 కాపీలు తియ్యగలడు. అంతకు మించి తియ్యలేడు. ఎందుకంటే అక్కడ మనిషి మిషన్ కి కాగితాలు అందించాలి. అచ్చయ్యాక వెంటనే తియ్యాలి.
అంతకన్నా ఎక్కువ కాపీలు తియ్యాలంటే, అదే కాలంలో ఎక్కువ కాగితాలు పెట్టి తియ్యగలగాలి. అందుకు తగినంత వేగంగా మనిషి చేతులు ఆడవు. కాబట్టి చెయ్యి చేసే పని కూడా యంత్రంలో ఉండే పనిముట్టు చేస్తేనే, ఎక్కువ కాపీలు తియ్యడం కుదురుతుంది. అప్పుడిక మనిషి కాగితాలు పెట్టి తీసే అవసరం ఉండదు. చేతికున్న పరిమితులు యంత్రంలో ఉండే పనిముట్టుకి ఉండవు. ఇక మనిషి పని కేవలం అచ్చైన కాగితాల్ని తట్టి సరిచేయ్యడమే. ఆఫ్ సెట్ యంత్రంలో గంటకి 5 వేలు వస్తాయి. మల్టీ కలర్ ఆఫ్ సెట్ లో 4 రంగులు ఒకేసారి అచ్చవుతాయి. ట్రెడిల్ అయితే రంగు తర్వాత రంగు అచ్చెయ్యాలి. ఈపరిమితులని ఆఫ్ సెట్ అధిగమిస్తుంది. వెబ్ ఆఫ్ సెట్ ప్రింటర్ 50 వేల కాపీలు తీస్తుంది. 16 పేజీలు నాలుగు రంగుల్లో  ఒకేసారి వస్తాయి. దినపత్రిక మొత్తం 16 పేజీలు  ఒకేసారి అచ్చయి మడతబడి బయటకొస్తాయి. ఇంతకీ ఆ యంత్రం  దగ్గర ముగ్గురో నలుగురో ఉంటారు. అయితే వాళ్ళు అచ్చు పని ఏమీ చెయ్యక్కర్లేదు.
ఇందుకు ఎన్నో చర్యలు అవసరం. ఒక్కొక్కదానికి ఒక్కొక్క యంత్రంకావాలి. అయితే అవన్నీ ఒక గొలుసుగా ఈ యంత్రంలో ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటిగా అన్ని చర్యలూ జరుగుతాయి. కాబట్టి అవసరమైన పనిముట్లు మనిషి చేతిలోనించి అందులోకి వెళతాయి.
యంత్రాలు ఉత్పాదక శక్తిని పెంచుతాయి.

యంత్రం అంటే ఏమిటి?
అప్పటికున్న రెండు నిర్వచనాల్ని పరిశీలిస్తాడు మార్క్స్
మొదటి నిర్వచనం: పరికరం  అనేది సరళ యంత్రంయంత్రం అనేది సంక్లిష్ట (complex= consisting of many different and connected parts.పరికరం. ఈనిర్వచనం చెప్పేవాళ్ళు పరికరానికీ యంత్రానికీ మధ్య ,సారభూతమైన వ్యత్యాసం చూడరు. అంతేకాదు ఏతాము (లివర్)వాలుబల్లమరచీలచప్పా /కొయ్యని చీల్చేటప్పుడు మధ్యలో కొట్టే కొయ్య మేకు (wedge) వంటి వాటిని కూడా యంత్రాలనేవారు. ఆర్ధిక దృక్పధంలో ఈవివరణ విలువలేనిది. సాంకేతిక వివరణ అర్ధ శాస్త్రజ్ఞులకు సరిపోదు.
రెండో నిర్వచనం: పరికరం విషయంలో చోదకశక్తి మనిషి. యంత్రానికి చోదకశక్తి మనిషి కాకుండా, మరేదైనా- జంతువో, జలమో, గాలో మరొకటో. చోదక శక్తి ని బట్టి అది పరికరమో యంత్రమో తేలుతుంది.
దీని ప్రకారం ఎద్దులు లాగే నాగలి యంత్రం అవుతుంది. నిముషానికి 96,000 చుక్కల్ని(picks) అల్లే క్లాసేన్ మగ్గం ఒకే ఒక మనిషి ఆడిస్తాడు కనక పరికరం అవుతుంది. అంతే కాదు, ఆమగ్గం మీద చేత్తో నేస్తే అది పరికరం, దాన్నే ఆవిరితో నడిపిస్తే యంత్రం. జంతుశక్తిని వాడడం మనిషికి అనాదిగా తెలుసు. కనుక యంత్రాలతో ఉత్పత్తి, చేతివృత్తుల ఉత్పత్తికంటే ముందే ఉన్నట్లవుతుంది. కాబట్టి చోదక శక్తిని బట్టి తేడాగా చూడడం సరైనది కాదు.
మార్క్స్ వివరణ:
పూర్తిగా అభివృద్ధి చెందిన యంత్రాలలో మూడు భాగాలుంటాయి:
1.మోటార్ యంత్రాంగం (motor mechanism)
2. అందజేత యంత్రాంగం (transmitting mechanism).
3.పనిముట్టు లేదా పనిచేసే యంత్రం (tool or working machine)
మొదటిది యంత్రాన్ని చలనంలో పెడుతుంది. అది తన సొంత చలన శక్తిని ఏర్పాటు చేసుకోవచ్చు-ఆవిరి ఇంజన్, కేలోరిక్ ఇంజన్, విద్యుదయస్కాంత యంత్రం వగైరా లాగా. అలాకాక, అప్పటికే ఉన్న ప్రకృతి శక్తి నుంచి ప్రేరణ పొందవచ్చు – జలపాతం ధార నుంచి జలచక్రంలాగా, గాలి నుంచి గాలి మరలాగా.
రెండవది. అందజేసే  యంత్రాంగం. అందులో ఫ్లైవీల్స్,షాఫ్టింగు, పళ్ళ చక్రాలు, పుల్లీలు, స్ట్రాప్ లు,తాళ్ళు, రకరకాల గేరింగ్ లూ ఉంటాయి. ఈ యంత్రాంగం, కదలికల్ని సరిగా ఉండేట్లు చేస్తుంది, అవసరమైన చోట దాని రూపాన్ని మారుస్తుంది. ఉదాహరణకు సరళ చలనం నించి చక్రీయ చలనానికి మారుస్తుంది. పైకీ కిందికీ, అటుకీ ఇటుకీ కదిలిస్తుంది. పై రెండు భాగాలూ పనిచేసే యంత్రాన్ని చలనంలో పెట్టడానికే, శ్రమ పదార్ధాన్ని పట్టుకొని కోరినవిధంగా మార్చడానికే.
మూడోది. పనిముట్టు, పనిచేసే యంత్రం. ఇది మొత్తం యంత్రంలో ఒక భాగం.  18 వ శతాబ్దపు పారిశ్రామిక విప్లవం మొదలయింది దీంతోనే. ఇప్పటికీ, చేతివృత్తి ఉత్పత్తి, కార్ఖానా ఉత్పత్తి యంత్రాలతో నడిచే పరిశ్రమగా మారేటప్పుడు ఇదే ఆరంభ బిందువుగా ఉంటుంది.
మనిషి శక్తితో నడిచే యంత్రాలు
యంత్రమా కాదా అని తేల్చేది చోదక శక్తి కాదు. ఎందుకంటే మనిషి కదిలించే యంత్రాలున్నాయి. కాలితో తొక్కుతూ నడిపే అచ్చు యంత్రం, సానబట్టే యంత్రం, చెరకు రసం తీసే యంత్రం –ఉదాహరణలు
ఇది మనిషి తిప్పినప్పుడూ యంత్రమేమోటార్ తగిలించినప్పుడూ యంత్రమే .
చోదక శక్తి మనిషి నుంచి వచ్చినామరొక యంత్రం నుంచి వచ్చినా తేడా ఉండదుఅసలు పనిముట్టుని (tool properమనిషి నుంచి తీసుకొని యంత్రాంగంలో బిగించిన క్షణం నుంచీ యంత్రం అవుతుంది.
యంత్రాలు చేతివృత్తుల కాలంలోనే వచ్చాయి. వాటిని చేసింది చేతివృత్తి దారులే. అయితే వాటిని చేసే పనిని కూడా యంత్రాలే లాక్కున్నాయి. క్రమంగా చేతి పని  వాళ్ళకు  ఆ పనిలేకుండా పోయింది.
అవయవాల పరిమితిని యంత్రం అధిగమించింది.
మనిషి ఎన్ని పనిముట్లు ఏక కాలంలో వాడగలడు అనేది అతని శరీర అవయవాల సంఖ్యను బట్టి  ఉంటుంది. జర్మనీలో ఒకేపనివాడితో రెండు రాట్నాలు  వడికించాలని ప్రయత్నించారు. రెండు కాళ్ళతోనూ, రెండు చేతులతోనూ. ప్రయత్నం ఫలించలేదు. తర్వాత రెండు కండెలు వాడే తొక్కే రాట్నం వచ్చింది. అదీ విఫలమయింది.
అయితే మరొకవైపు, జెన్నీ మొదటినించీ 12-18 కండెలతొ వాడికేది. స్టాకింగ్ మగ్గం ఏక కాలంలో వేల సూదులతో కుడుతుంది. కాబట్టి ఒక యంత్రం ఏకకాలంలో పనిచేయించే పనిముట్ల సంఖ్యని శరీర అవయవాల పరిమితి నుంచి విముక్తి చేసింది.
యంత్రం చాలా  పనిముట్లని  ఇముడ్చుకుంటుంది.
యంత్రాల అభివృద్ధిలో ముఖ్యమైనది చోదకశక్తికి బదులు మరొకటి వాడడం కాదు, పనిముట్ల సంఖ్య పెంచడం.-e
రాట్నాన్ని కదిలించేది పాదం. కదురుతో దారం లాగుతూ, పురిపెడుతూ, వడికే అసలు పని చేసేది చెయ్యి.పారిశ్రామిక విప్లవం మొదట పట్టుకున్నది వృత్తిదారుని పరికరంలోని  ఈ చివరి పనిముట్టునే. చోదక శక్తిగా ఉందే పనిని ఉంచింది. దానికి తోడు యంత్రాన్ని గమనించడం, పొరపాట్లు జరిగితే తన చేతులతో సరిచెయ్యడం –అనే పనులు అదనంగా పడతాయి.
మరొకవైపు, ఎల్లప్పుడూ మనిషే సరళ (simple)చోదక శక్తిగా ఉన్న పరికరాలకు జంతువుల్నో, జలాన్నో, గాలినో చోదక శక్తిగా వాడవచ్చు. ఉదాహరణకి: ఒక మిల్లు క్రాంక్  తిప్పడం ద్వారా, పంపు కొట్టడం ద్వారా, కొలిమి గెడలు పట్టుకుని కిందికీ పైకీ ఆడించడం ద్వారా, రోకలితో దంచి పొడుం చెయ్యడం ద్వారా, మనిషి చోదక శక్తిగా ఉంటాడు.
కార్ఖానా ఉత్పత్తికి చాలాముందూ, కొంతవరకూ కార్ఖానా ఉత్పత్తి కాలం లోనూ అక్కడక్కడా ఈ పనిముట్లు యంత్రాల్లోకి పోయాయి.
1836-37 లొ డచ్ వాళ్ళు హార్లెం సరస్సులో నీటిని  పంపులతొ తోడి  పూర్తిగా కాళీ చేశారు. తేడా ఒక్కటే, వాటి పిస్టన్లని నడిపింది మనుషులు కాదు, ఆవిరి యంత్రాలు.
అయితే అందువల్ల ఉత్పత్తి విధానంలో విప్లవం (పెనుమార్పు) ఏమీ రాలేదు. ఇంగ్లండ్ లో కమ్మరి మామూలు తిత్తులకు అరుదుగా ఆవిరి యంత్రాలని కలిపారు.
అసలు పారిశ్రామిక విప్లవాన్ని తెచ్చింది ఆవిరియంత్రం కాదు. అది 17 వ శతాబ్దంలో కనిపెట్టబడింది.1780 దాకా పారిశ్రామిక విప్లవాన్ని తేలేకపోయింది. అందుకు భిన్నంగా యంత్రాల ఆవిష్కరణే ఆవిరి ఇంజన్ల రూపంలో మార్పుని అవసర పర్చింది.
మనిషి తన శ్రమ పదార్ధంమీద, పనిముట్టుతో పనిచేయకుండా, యంత్రపనిముట్టుని (implement-machine) నడిపే శక్తిగా అయిన వెంటనే చోదక శక్తి మనిషి కండరాలు కావడం యాదృచ్చికమే.అది గాలి కావచ్చు, నీరో ఆవిరో కావచ్చు .
యంత్రాలని నడపడానికి మానవేతర శక్తి త్వరగా అవసరమవుతుంది. ఎందుకంటే, యంత్రంలో ఉండే పనిముట్లని నడపడానికి మనిషి శక్తి చాలదు.
విడి యంత్రంనుంచి యంత్రవ్యవస్థదాకా
యంత్రం పారిశ్రామిక విప్లవాన్నిప్రారంభించింది. అదే ఒక పరికరాన్నిమాత్రమే వాడే పనివాడిని తొలిగించి ఆ స్థానంలో అటువంటి పరికరాల్ని ఎన్నిటినో వాడగలిగే యంత్రాంగాన్ని పెడుతుంది. ఆ యంత్రాంగం ఒకే చోదక శక్తి చేత – దాని రూపం ఏదయినా సరే - నడపబడుతుంది. యంత్రాల అభివృద్ధి గురించి చెబుతాడు. 
యంత్ర వ్యవస్థ అభివృద్ధి రెండు దశల్లో జరుగుతుంది:
యంత్రం సైజూ, అందులో ఉండే పనిముట్ల సంఖ్యా పెరిగితే దాన్ని నడపడానికి భారీ యంత్రాంగం అవసరం అవుతుంది. మనిషికి అంత శక్తి ఉండదు. అదీగాక, మనిషి ఒకే రకమైన, నిరంతరాయమైన చలనాన్ని కలిగించలేడు. అతని చేతిలోని పనిముట్టు యంత్రంలోకి వెళ్ళిపోయింది. అతనిప్పుడు కేవలం ఒక మోటార్ చేసే పనే చేస్తున్నాడు. ఆపని ప్రకృతి శక్తులకు అప్పగించవచ్చు అనేది విదితమే. 
మనుషుల బదులు వచ్చిన శక్తులు  
గుర్రాలూ, జలమూ, గాలీ, ఆవిరి ఇంజన్.
మొదటిది ఆశ్వ శక్తి. ఇది అన్నిట్లోకీ కీతాది. అధ్వాన్నమయింది. ఇందుకు గుర్రానికి బుర్ర ఉండడం కొంత కారణం. ఖరీదు ఎక్కువ ఉండడం ఇంకొంత కారణం. ఫాక్టరీలలో గుర్రాల్ని ఉపయోగించగలిగే అవకాశం చాలా పరిమితం.
అయినప్పటికీ ఆధునిక పరిశ్రమ తొలిదశలో గుర్రం విస్తారంగా ఉపయోగించబడింది. యాంత్రిక శక్తి తెలపడానికి ఆశ్విక శక్తి అనే మాట (HP)ఇప్పటికీ ఉండడమే అందుకు ఒక రుజువు. 1 HP మోటార్ 10 HP మోటార్ అనేవి అందరికీ తెలిసినవే.మోర్టాన్ ఒక్క నిమిషంలో 33వేల పౌన్ల బరువుని ఒక అడుగు ఎత్తు లేపే శక్తిని (force) ఒక ఆశ్విక శక్తి అన్నాడు. ఆవిరి యంత్రంతో దాని ఖరీదు 3 పెన్నీలు, అదే గుర్రం నుంచైతే 5 ½ పెన్నీలు. అంతేకాదు గుర్రం ఆరోగ్యంగా ఉండాలంటే 8 గంటలకన్నా ఎక్కువ పనిచేయకూడదు. ఒక ఆవిరియంత్రం చేసినంత పని చెయ్యాలంటే 66 మంది మనుషులు కావాలి. అందుకు వారికి గంటకి 15 షిల్లింగులు ఖర్చవుతుంది. ఒక గర్రం చేసే పని చేసేందుకు 32 మంది మనుషులు అవసరం. అందుకు గంటకి 8 షిల్లింగు లవుతుంది.ఆవిరియంత్రంతో అయితే సరుకుల ఉత్పత్తి చౌక.

వాయు శక్తి – ఇది స్థిరంగా ఉండేది కాదు. మనిషి నియంత్రణకు లొంగేది కాదు. అంతేకాక, ఆధునిక పరిశ్రమకు పుట్టినిల్లయిన ఇంగ్లండ్ లో కార్ఖానా ఉత్పత్తి కాలంలో ప్రధానంగా జలశక్తి వాడకంలో ఉండింది.
ఇక్కడ యంత్రాల అభివృద్ధి సైన్స్ అభివృద్ధికి ఎలా దారితీసిందో చెబుతాడు.

ఆవిరి శక్తి జల శక్తిలో ఉన్న లోపాల్ని సరిచేసింది.
ఆర్క్ రైట్ రాట్నం మిల్లు మొదటి నించీ జల శక్తి తో నడిచింది. అయినా దాంతో కొన్ని  ఇబ్బందులున్నాయి. దాన్ని పెంచాలనుకున్నా పెంచడం కుదరదు. కొన్ని ఋతువుల్లో లభించదు. అన్నిటిని మించి, అది స్థానికంగా మాత్రమే ఉంటుంది. అన్ని చోట్లా ఉండదు. ఆధునిక టర్బైన్ జలశక్తికున్న ఈ అడ్డంకుల్ని తొలగించింది.
వాట్ రెండో ఆవిరి యంత్రాన్ని కనిపెట్టాడు. అది బొగ్గునీ, నీటినీ వాడుకొని సొంతంగా శక్తిని సృష్టించుకుంటుంది.
·         ఆ శక్తి పూర్తిగా మనిషి నియంత్రణలో ఉంటుంది.
·         ఎక్కడకి బడితే అక్కడికి తీసుకుపోడానికి(mobile) వీలవుతుంది.
·         జల చక్రాలు దేశమంతటా  చెల్లాచెదరుగా ఉండేవి. ఆవిరి ఇంజన్ ఉత్పత్తిని పట్టణాల్లో కేంద్రీకరించడం సాధ్యపరిచింది. జల చక్రంలాగా ఆవిరి ఇంజన్ కి ఫలానా చోటే పెట్టాల్సిన పరిస్థితి లేదు. ఎక్కడైనా పెట్టవచ్చు.

అంతదాకా జలప్రవాహాలున్న చోటనే మిల్లులు ఉండేవి. దూరదూరంగా ఉండేవి. ఆవిరి ఇంజన్ వచ్చాక బొగ్గూ, నీరూ లభించే ప్రాంతాలల పట్టణాల్లో ఫాక్టరీలు ఏర్పడ్డాయి. అందుకే కార్ఖానా పట్టణాలకి ఆవిరి ఇంజన్ తల్లి/తండ్రి -(A. Redgrave in ―Reports of the Insp. of Fact., 30th April, 1860,‖ p. 36.)
ఆవిరి ఇంజన్  చిక్కులు తొలగించింది. మంచి  చోదక శక్తి అయింది.
వాట్ ప్రతిభ
1784లో వాట్ తన double-acting steam-engine కి పేటెంట్ తీసుకున్నప్పుడు   అది ఎదో ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం కనిపెట్టినది కాదు అన్నాడు. దాన్ని  యంత్ర పరిశ్రమలో సార్వత్రికంగా ఉపయోగించ వచ్చని చెప్పాడు. దీన్నిబట్టి వాట్ ప్రతిభని తెలుసుకోవచ్చు.
అయితే, ఆయన చెప్పిన వినియోగాలలో చాలా 50 ఏళ్లదాకా అమల్లోకి రాలేదు. ఆవిరి సుత్తె ఒక ఉదాహరణ. నౌకా యానంలో వినియోగించడం కుదరదేమో అని సందేహించాడు కూడా. అయితే  ఔల్టన్, వాట్ అనే వారు 1851 వస్తుప్రదర్సనకు భారీ సైజు స్టీమర్లకు సరిపోయే ఆవిరి ఇంజన్లను పంపించారు.
యంత్రాలు ఏవిధంగా చోదక శక్తిని అభివృద్ధి పరిచాయో చెప్పాడు. ఇప్పుడిక చోదక శక్తి అభివృద్ధి తిరిగి యంత్రాలమీద ఎలా పనిచేసిందో చెబుతాడు. అభివృద్ధి చెందిన చోదక శక్తి ఏకకాలంలో చాలా యంత్రాలని నడుపగలదు కనక, అందువల్ల యంత్ర వ్యవస్థ ఏర్పడుతుంది. ఇది యంత్రంలో మరొక భాగమైన అందజేసే యంత్రాంగాన్ని అభివృద్ధి చేస్తుంది.
యంత్ర వ్యవస్థ
చేతి పరికరాలు యంత్రంలో పనిముట్లు అయ్యీకాగానే, చోదక యంత్రాంగం కూడా మనిషి బలంతో సంబంధం తెంచుకుని స్వతంత్రమవుతుంది. ..ఒక చోదక యంత్రాంగం ఏక కాలంలో ఎన్నో యంత్రాల్ని నడుపుతుంది. ఆ యంత్రాల సంఖ్య పెరిగే కొద్దీ చోదక యంత్రాంగం కూడా పెరుగుతుంది. అందజేత యంత్రాంగం విస్తారమవుతుంది.
ఇప్పుడు మనం ఒకే రకమైన అనేక యంత్రాల సహకారాన్ని, యంత్రాల సంక్లిష్ట వ్యవస్థనుంచి వేరు పరచి చూడాలి. మొదటి సందర్భంలో ఉత్పాదితాన్ని ఒకే యంత్రం చేస్తుంది. అది మునుపు ఒక చేతి పనివాడు చేసిన వివిధ చర్యల్నీ చేస్తుంది. ఉదాహరణకి, ఒక నేతగాడు తనమగ్గంతో చేసిన పనులన్నీ చేస్తుంది. లేదా, అనేకమంది ఒకరితర్వాత ఒకరు చేసినట్లు విడివిడిగానో, కార్ఖానా వ్యవస్థలో సభ్యుల లాగానో పని చేస్తుంది.
ఉదాహరణకి కవర్ల తయారీలో ఒక పనివాడు ఫోల్డర్ తో కాగితం మడుస్తాడు. మరొకడు జిగురు పట్టిస్తాడు. మూడోవాడు మూత(flap)ని తిప్పుతాడు. నాలుగోవాడు దానిమీద ముద్ర (emboss)వేస్తాడు. అలా పనితరవాత పని వరసగా జరుగుతాయి. ఈ పనులన్నిటినీ ఒకే యంత్రం చేస్తుంది. గంటకి 3,000 కవర్లు చేస్తుంది. 1862 లండన్ వస్తు ప్రదర్శనలో పెట్టిన కాగితం సంచులు చేసే అమెరికా యంత్రం నిమిషానికి 300 తయారు చేసింది. అంటే గంటకి 18,000. ఇక్కడ మొత్తం ప్రక్రియ వివిధ పనిముట్ల కలయికతో ఉండే ఒకే యంత్రం పూర్తిచేస్తుంది. కార్ఖానా వ్యవస్థలో ఇదే మొత్తం ప్రక్రియ వేర్వేరు చర్యల వరసగా విడగొట్టబడి, నిర్వహించబడేది.
ఫాక్టరీలో – యంత్రాలు మాత్రమే వాడే వర్క్ షాప్ లో –  సామాన్య సహకారం కనబడుతుంది. కాసేపు పనివాళ్ళని పక్కనబెట్టి చూస్తే, సహకారం ఒకేచోట ఒకేతరహా యంత్రాలు కొన్ని  ఏక కాలంలో పనిచెయ్యడంగా కనబడుతుంది. ఒక నేత ఫాక్టరీలో  కొన్ని మరమగ్గాలు పక్కపక్కనే పనిచేస్తుంటాయి. కుట్టు ఫాక్టరీలో ఒకే బిల్డింగ్ లో కొన్ని కుట్టు మిషన్లు ఆడుతూ ఉంటాయి.
ఇక్కడ సాంకేతిక  ఏకత్వం ఉంటుంది. ఏమంటే, వాటిని నడిపే చోదక శక్తి ఒక్కటే. కొన్ని పనిముట్లు ఒకేయంత్రంలో అంగాలు అయినట్లే,  కొన్ని యంత్రాలు ఒకే చోదక యంత్రాంగానికి అంగాలవుతాయి.
అయినప్పటికీ, ఈ విడి విడి యంత్రాల స్థానంలో యంత్రవ్యవస్థ ఎప్పుడొస్తుంది?
శ్రమ పదార్ధం వివిధ యంత్రాల గుండా  వరస ప్రకారం పోయినప్పుడు. ఒక యంత్రానికి  మరొకయంత్రం అనుసంధానింప బడినప్పుడు. ఇక్కడ కార్ఖానా ఉత్పత్తిలో ఉండే శ్రమ విభజనవల్ల ఏర్పడే సహకారం – డిటైల్ యంత్రాల సమ్మేళనం - ఉంటుంది. వివిధ డిటైల్ శ్రామికుల ప్రత్యేక పనిముట్లు ఇప్పుడు ఒక  ప్రత్యేక యంత్రంలో ఉండే పనిముట్లుగా మారతాయి. ఉదాహరణకి ఊలు ఉత్పత్తి చేసే కార్ఖానాలో నలగ్గొట్టే వాళ్ళు, చిక్కుతీసే వాళ్ళు వడికే వాళ్ళు వగయిరా ఉంటారు. వాళ్ళు వాడే ప్రత్యేక పనిముట్లు ఇప్పుడు ప్రత్యేక యంత్రాలలో పనిముట్లుగా మారతాయి. ఆ వ్యవస్థలో ప్రతి యంత్రమూ ఒక ప్రత్యేక చర్య చేసే ప్రత్యేక అంగం అవుతుంది.
యంత్ర పరిశ్రమకి ముందు కాలంలో ఇంగ్లండ్ లో ఊలు ఉత్పత్తి ముఖ్యంగా ఉండేది. అందువల్ల 18వ శతాబ్దం ప్రధమార్ధంలో ఎక్కువ ప్రయోగాలు జరిగింది ఈ పరిశ్రమ లోనే. ఊలుని సిద్ధం చేయడం కంటే దూదిని చెయ్యడం సులువు గనక ఊలు విషయంలో అనుభవం దూదికి ఉపయోగపడింది – ఆతర్వాత యంత్రాలతో ఊలుని సిద్ధం చెయ్యడం యంత్రాలతో వడికే సరళిలోనే, నేసే సరళిలోనే అభివృద్ధి అయినట్లే.  

ఊలు తయారీలో ఊలు చిక్కు దీయడం వంటి  వేర్వేరు డిటైల్స్ ని ఫాక్టరీ వ్యవస్థలో చేర్చబడింది 1866 కి ముందు పదేళ్లకాలంలోనే. చిక్కుదీసే యంత్రం పెట్టినప్పటినుండీ అనేకమంది కార్మికులకు పని పోయింది.

చూచీ చూడగానే, ఒక తేడా స్పష్టంగా కనబడుతుంది. కార్ఖానా ఉత్పత్తిలో ప్రతి పాక్షిక చర్యనీ చేసేది శ్రామికులే – చేతిపరికరాలతో. ఒకపక్క, ప్రక్రియకి తగినట్లుగా పనివాడు తననుతాను మలుచుకుంటాడు. మరొకపక్క, అంతకుముందే ఈ ప్రక్రియ పనివానికి తగినట్లు ఏర్పడింది.  శ్రమ విభజన లోని ఈ ఆత్మాశ్రయ సూత్రం యంత్రాల ఉత్పత్తిలో ఉండదు. మొత్తం ప్రక్రియ వస్తుగతంగా, దానికదిగా పరిగణించబడుతుంది. అంటే, మనుషుల చేతులమీదగా పని నిర్వహించాబడాలి అనే సమస్యను పట్టించుకోకుండా. ప్రక్రియ దశల్లోకి విభజింపబడుతుంది. ప్రతి పాక్షిక చర్యనీ ఎలా నిర్వహించాలీ, ఆచర్యలన్నిటినీ ఒక మొత్తంగా ఎలా కలపాలీ అనేసమస్యలు యంత్రాలు , రసాయన శాస్త్రం మొదలైనవాటి సహాయంతో పరిష్కరింపబడతాయి.
ప్రతి పాక్షిక యంత్రం(detail machine) పక్క యంత్రానికి ముడి సరుకుని అందిస్తూ ఉండాలి. అలాగయితేనే, పనిజరుగుతూ ఉంటుంది.కార్ఖానా ఉత్పత్తిలోలాగానే. పాక్షిక పనివాళ్ళ సహకారం ఆ గ్రూపుల మధ్య సంఖ్యాత్మక నిష్పత్తిని ఏర్పరచినట్లే, యంత్ర వ్యవస్థలోనూ పాక్షిక యంత్రాలు, ఒకదాని మరోకదానిపైన ఆధారపడి ఉంటుంది గనక, వాటి సైజూ, సంఖ్యా, వేగమూ నిర్ణయమై ఉంటాయి. 
వివిధ రకాల విడి యంత్రాల కలయిక అయిన సమష్టి యంత్రం క్రమంగా నిర్దుష్ట మవుతుంది.
యంత్రవ్యవస్థ ఒక స్వయం చాలక చోదక సాధనం చేత నడపబడినప్పుడు, అది దానికది నడిచే భారీ యంత్రం (automaton) అవుతుంది. మొత్తం ఫాక్టరీ ఆవిరి యంత్రాలతో నడపబడుతున్నా, కొన్ని కదలికలకి మనిషి సహాయం అవసరపడుతుంది. మనిషి జోక్యం లేకుండా యంత్రం నడుస్తున్నప్పుడు, కేవలం మనిషి అక్కడ ఉండడం మాత్రమే అవసరమైనప్పుడు, స్వయం చాలిత యంత్ర వ్యవస్థ (an automatic system of machinery) ఏర్పడ్డట్లు.
పాతకాలపు జర్మన్ కాగితం తయారీ చేతి ఉత్పత్తికి ఉదాహరణ. 17 వ శతాబ్దపు హాలండ్, 18 వ శతాబ్దపు ఫ్రాన్స్ కార్ఖానా కాగితం ఉత్పత్తికి నమూనా, ఆధునిక ఇంగ్లండ్ కాగితం ఆటోమాటిక్ ఉత్పత్తికి నమూనా.
ఇక్కడ విడి యంత్రం స్థానంలో ఒక యంత్ర భూతం ఉంది. అది ఫాక్టరీలకు ఫాక్టరీలనే ఆక్రమిస్తుంది.

యంత్రాలని ఉత్పత్తిచేసే పరిశ్రమల అభివృద్ధి, యంత్రాలకు గిరాకీ
కదుర్లూ, ఆవిరింజన్లూ చెయ్యడమే పనిగా పెట్టుకున్నవాళ్ళు రాక ముందు కూడా అవి వుండేవి – దర్జీలు లేకముందు కూడా జనం బట్టలేసుకున్నట్లే. వాకాన్సన్, ఆర్క్ రైట్,  వాట్ మొదలైనవారు కనిపెట్టినవి తయారయింది కార్ఖానా ఉత్పత్తిలోనే. తయారుచేసింది అక్కడ సిద్ధంగావున్న నిపుణ కార్మికులే. కొత్తయంత్రాలు కనిపెట్టడం ఊపందుకుంది. కొత్తయంత్రాలకు గిరాకీ పెరిగింది. దాంతో యంత్రనిర్మాణ పరిశ్రమ అనేక స్వతంత్ర శాఖలుగా విడిపోయింది. ఈ కార్ఖానా ఉత్పత్తిలో శ్రమ విభజన అంతకంతకూ పెరిగి పోయింది. కనుక, ఆధునిక పరిశ్రమ యొక్క తక్షణ సాంకేతిక పునాది కార్ఖానా ఉత్పత్తిలోనే ఉన్నదాని గమనిస్తాము. కనబడుతుంది. కార్ఖానా ఉత్పత్తి యంత్రాలని ఉత్పత్తి చేసింది. ఆ యంత్రాలతోనే, ఆధునిక పరిశ్రమ చేతి వృత్తి వ్యవస్థనీ, కార్ఖానా ఉత్పత్తి వ్యవస్థనీ రద్దు చేసింది.
ఫాక్టరీ వ్యవస్థ దానికి సరిపోని పునాది మీద తలెత్తింది. అది ఒక స్థాయికి అభివృద్ధయ్యాక, ఆ పునాదిని తొలిగించి తన ఉత్పత్తి పద్ధతులకు తగిన పునాదిని ఏర్పరచుకోవాల్సి వచ్చింది. విడిగా ఉన్న యంత్రం, మానవ శక్తితోనే  నడిచినంత కాలం, దాని  మరగుజ్జు లక్షణం ఉన్నదున్నట్లే ఉంటుంది. వెనకటి చోదక శక్తులైన జంతువులు, గాలి, నీరు వంటి వాటి స్థానంలో ఆవిరియంత్రం వచ్చేదాకా యంత్ర వ్యవస్థ అనేది తగినంతగా వృద్ధి చెందదు. అదేవిధంగా అప్పటికి  యంత్రం మనిషి శక్తి మీదా, నైపుణ్యం మీదా వాళ్ళ చిన్నచిన్న పనిముట్లమీదా  ఆధారపడివుంది. అలా  ఉన్నంత కాలం  ఆధునిక పరిశ్రమ యొక్క సంపూర్ణాభివృద్ధి కుంటుబడడే ఉంటుంది. అలా తయారయ్యే యంత్రాల ఖరీదు ఎక్కువ. అదీకాక, కొత్తరంగాలకు యంత్రాలు విస్తరించే కొద్దీ యంత్రాలు చేసే పనివాళ్ళు పెరగాలి. అయితే అలాంటి పనివాళ్ళ సంఖ్య క్రమేణా, నెమ్మదిగా పెరుగుతుంది తప్ప, ఉరుకులు దుముకుల మీద పెరగదు.
అలా తయారయ్యే యంత్రాల విస్తరణని అడ్డుకునే అంశాలు:
1.అవి ఖరీదైనవి.
2. యంత్రాలుచేసే నిపుణ కార్మికులు వేగంగా తయారుకాలేరు.

దీనికి తోడు, ఆధునిక పరిశ్రమ అభివృద్ధి ఒకానొక స్థాయిని అందుకున్నప్పుడు, చేతివృత్తి, కార్ఖానా ఉత్పత్తి  సమకూర్చిన ప్రాతిపదికతో  ఆధునిక పరిశ్రమకు పొంతన కుదరదు. అంటే ఇక అక్కడనుంచీ అది అభివృద్ధి కాదు. చోదక సాధనాలసైజు, ప్రసార యంత్రాంగం సైజు, అసలు పనిముట్టు సైజు అంతకంతకూ పెరిగాయి. అవి మానవ శ్రమతో చేసిన తొలి నమూనాలకు దూరం అయ్యాయి. మారిపోయాయి. జటిలంగా ఉండేవి. క్రమబద్ధంగా పనిచేసేవి. స్వయం చాలక వ్యవస్థ నిర్దుష్టం అయింది. కొయ్య బదులు ఉష్ణాన్ని తట్టుకునే ఇనుం వంటి లోహాల్ని వాడడం పెరిగింది. పరిస్థితుల వల్ల తలెత్తిన ఈసమస్యల్ని కార్ఖానా వ్యవస్థ లోని సమష్టి శ్రామికుడు సైతం సరిగా ఎదుర్కోలేక పోయాడు. కనుక ఈ వ్యక్తిగత పరిమితులు ప్రతిచోటా ప్రతిబంధకం అయ్యాయి. ఇప్పటి హైడ్రాలిక్ ప్రెస్,  ఆధునిక మరమగ్గం, విత్తనాలు తీసే యంత్రం కార్ఖానా ఉత్పత్తిలో ఎప్పటికీ తయారయ్యేవి కావు.

ఒక పరిశ్రమ రంగంలో ఉత్పత్తి పద్ధతిలో పెనుమార్పు(radical change)వస్తే, అది  ఇతర రంగాలకు కూడా విస్తరిస్తుంది. యంత్రాలతో దారం తీసినందువల్ల యంత్రాలతో నెయ్యాల్సి వచ్చింది. ఈ రెంటి మూలంగా బట్టల్ని తెలుపు చెయ్యడానికీ, అద్దకానికీ యంత్రాల్ని అనివార్యం చేశాయి. అలాగే మరొకపక్క, పత్తి నూలు వడకడంలో వచ్చిన  పెనుమార్పు (revolution) మూలంగా పత్తి నుండి విత్తనాలు తీసే  యంత్రాన్ని జిన్ ని తయారుచేయ్యాల్సి వచ్చింది. జిన్ ని కనిపెట్టడం ద్వారానే, అవసరమైనంత దూది తయారీ వీలయింది. అంతకన్నా ఎక్కువగా, పారిశ్రామిక, వ్యావసాయిక విధానాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పు, సమాచార, రవాణా సాధనాల్లో తీవ్ర మార్పుని అవసర పరిచింది. అందుకు సరిపోయే, స్టీమర్ లూ, రైలు మార్గాలూ ,టెలిగ్రాఫ్ లూ వచ్చాయి.
అయితే భారీ సైజులో ఉండే ఇనుముని కాచి, సాగ్గొట్టడానికీ, అతకడానికీ, నరకడానికీ, తోలవదానికీ, అవసరమైన ఆకారం ఇవ్వడానికీ, భారీ యంత్రాలు కావాల్సి వచ్చింది. అలాంటి భారీ యంత్రాలని నిర్మించడానికి కార్ఖానా ఉత్పత్తి పద్ధతులు ఏమాత్రం సరిపోలేదు.
ఆసమస్య యంత్రాలతో యంత్రాల్ని నిర్మించడం ద్వారా పరిష్కారం అయింది.

అందువల్ల యంత్రాల్ని యంత్రాలతోనే నిర్మించాల్సి వచ్చింది. అలా చేశాకా, తనకొరకు తానే  యంత్రాలను తయారు చేశాకనే, యంత్ర పరిశ్రమకు తగిన సాంకేతిక ప్రాతిపదిక నిర్మితమైంది. తన కాళ్ళమీద తాను నిలబడగలిగింది. 19 వ శతాబ్ది తొలి దశాబ్దాలలోనే యంత్రాల వాడకం పెరిగింది. దాంతో యంత్రాల తయారీని క్రమంగా యంత్రాలు తమచేల్లోకి తీసుకున్నాయి. అయితే భారీ స్థాయిలో రైలు మార్గాలూ, సముద్ర స్టీమర్ లూ నిర్మించడమూ, ప్రధాన చోదక సాధనాల నిర్మాణంలో ఇప్పుడు వాడుతున్న బ్రహ్మాండమైన యంత్రాలని తాయారు చేసింది 1866 కి ముందు దశాబ్దంలోనే.
స్లైడ్ రెస్ట్

యంత్రాలని యంత్రాలతో తయారు చెయ్యాలంటే ఎంత శక్తినైనా ప్రయోగించగలిగే చోదక సాధనం కావాలి. అది పూర్తిగా అదుపులో  ఉండేది కావాలి. అలాంటి సాధనం అప్పటికే రెడీగా ఉంది. అదే ఆవిరి యంత్రం. యంత్రాల విడి భాగాలకు- కచ్చితమైన సరళ రేఖలూ, సమతలాలూ,వృత్తాలూ, స్తూపాలూ, శంఖాలూ, గోళాలూ- (ఆకారాలు) అవసరమవుతాయి. వీటిని ఉత్పత్తి చెయ్యాల్సి వస్తుంది. హెన్రీ మాడ్ స్లే 19 వ శతాబ్దం మొదట్లో స్లైడ్ రెస్ట్ కనిపెట్టి ఈ సమస్యని పరిష్కరించాడు. ఆ పరికరం అంతలోనే స్వయం చాలితం అయింది. ఈ పరికరం  మొదట లేత్ లో చేరింది. ఆ తర్వాత  కొద్ది కొద్ది  మార్పులతో ఇతర నిర్మాణ యంత్రాలకు పాకింది. ఈ పరికరం ఎదో ఒక పరికరానికి మాత్రమే ప్రత్యామ్నాయం కాదు. మొత్తం చేతికే ప్రత్యామ్నాయం. తయారు చెయ్యాల్సిన ఇనప దో, మరొకటో వస్తువుని పట్టుకొని కోసే పరికరాన్నిపూర్తిగా  నడిపిస్తుంది. ఆవిధంగా యంత్రభాగాల్ని రూపాలని తయారుచెయ్యడం సాధ్యపరిచింది. దాంతో అయినంత వేగంగా, కుదిరిగ్గా, సులువుగా, కచ్చితంగా ఎంతటి నిపుణుడి చెయ్యి అయినా చెయ్యలేదు.
యంత్రాలు నిర్మించే యంత్రాల్లో పనిముట్లు
యంత్రంలోకూడా పనిచేసే పనిముట్టు ఉంటుంది. యంత్రాలు నిర్మించే యంత్రం లో ఉండే పనిచేసే పనిముట్లని చూస్తే, అవి  భారీ స్థాయిలో ఉన్న చేతి పరికరాలే అనే విషయం తెలుస్తుంది.
·         రంధ్రాలు చేసే యంత్రంలో ఉండే పనిచేసే పనిముట్టు (operating part) ఆవిరి యంత్రంనడిపే భారీ బరమా (drill). ఈయంత్రం  లేనిదే, పెద్ద ఆవిరియంత్రాల్లోనూ, హైడ్రాలిక్ ప్రెస్ లలోనూ  ఉండే సిలెండర్లూ తయారవవు.
·          లేత్ యంత్రం కాలి లేత్ కి భారీ ప్రతి రూపం మాత్రమే.
·         కమ్మరి ఇనుముని  చిత్రిక బట్టే యంత్రం, వడ్రంగి కొయ్య పనిలో వాడేది ఎటువంటిదో అటువంటిదే.
·         లండన్ ఓడరేవుల్లో పై కొయ్య పొరల్ని కత్తిరించే సాధనం ఒక భారీ కత్తి. 
·         కత్తిరించే యంత్రం ఒక దర్జీ గుడ్డల్ని కత్తెరతో ఎంత సులువుగా కట్టిరిస్తాడో, అంట సులువుగా ఇనుముని కత్తిరిస్తుంది. అది ఒక రాక్షస కత్తెర.
·         ఆవిరి సమ్మెట మామూలు సమ్మెట తల తోనే పనిచేస్తుంది. అయితే అది తోర్(Thor) సైతం ఎత్తలేనంత  విపరీతమైన బరువు. ఈ ఆవిరి సమ్మెటల్ని కనిపెట్టినవాడు నాస్మిత్. వాటిలో ఒకటి 6 టన్నుల బరువు ఉంటుంది. 36 టన్నుల బరువున్న దాగిలి (anvil)మీద 7 అడుగుల పైన్నించి కొడుతుంది. దానికి ఒక గ్రానైట్ దిమ్మని పొడుంపొడుం చెయ్యడం పిల్లల ఆట మాత్రమే. అదే ఒక కోయ్యలోకి ఒక చీలని మెల్లమెల్లగా తట్టి సున్నితంగా దింపగలదు కూడా. లండన్ లొ తెడ్డు చక్రాల ఇరుసులు చేసే ఒక యంత్రం పేరు  తోర్. అది 16 ½ టన్నుల ఇరుసుని, ఒకకమ్మరి గుర్రపు నాడా చేసినంత సునాయాసంగా, తయారు చేస్తుంది.  
యంత్రాల రూపంలో శ్రమపరికరాలు మానవ శక్తి స్థానంలో ప్రకృతి శక్తుల్ని,  నియమం  స్థానంలో సైన్స్ వర్తింపునీ అవసరపరుస్తాయి. కార్ఖానా ఉత్పత్తిలో సామాజిక శ్రమ నిర్వహణ కేవలం వ్యక్తిపరమైనది(subjective). అది పాక్షిక కార్మికుల కలయిక. యంత్ర వ్యవస్థలో మనుగడలో ఉన్న ఉత్పత్తియొక్క భౌతిక పరిస్థితికి శ్రామికుడు కేవలం తోక అవుతాడు. మామూలు సహకారంలో, శ్రమ విభజన మీద ఆధారపడ్డ సహకారంలోకూడా, సమష్టి కార్మికుడి చేత విడి శ్రామికుడు అణచబడడం ఇంకా ఎంతోకొంత యాదృచ్చికమైనదిగా కనబడుతుంది. ఏవో కొన్నితప్ప, యంత్రాలు సమీకృత శ్రమ (associated labour) ద్వారానో, ఉమ్మడి శ్రమ( labour in common) ద్వారానో పనిచేస్తాయి. కనుక  యంత్రాల విషయంలో శ్రమ ప్రక్రియ యొక్క సహకార స్వభావం  శ్రమ సాధనమే విధించిన సాంకేతిక అవసరం.

11, మే 2018, శుక్రవారం

మార్క్స్ అదనపు విలువ సిద్ధాంతం


మార్క్స్ అదనపు విలువ సిద్ధాంతం 

2018  మే 'అరుణతార' లో వచ్చింది 
 ఆర్ధిక వేత్తలు అందరూ ఒక పొరపాటు చేశారు.  అదనపు విలువని దానికదిగా, దాని  స్వచ్చమైన రూపంలో పరిశీలించలేదు. దాని ప్రత్యేక రూపాలైన లాభంగా, అద్దెగా పరిశీలించారు.-అదనపు విలువ సిద్ధాంతాలు’ -సంపుటి 1.40 
అలా విడివిడిగా పరిశీలించినందువల్ల సిద్ధాంత పరంగా దోషాలు దొర్లాయంటాడు. అందుకే ఆయన ముందు అదనపు విలువని స్వచ్చమైన రూపంలో చూపుతాడు. 
పెట్టుబడి మొదటిభాగం ప్రచురించాక, మార్క్స్ ఎంగెల్స్ కి 1867 ఆగస్ట్ 24  ఉత్తరం రాశాడు. అందులో అదనపు విలువను దాని ప్రత్యేక రూపాలయిన లాభం, వడ్డీ, అద్దె వగైరాల నుంచి విడిగా, స్వతంత్రంగా చూడటం తన పుస్తకంలోని రెండు మంచి అంశాలలో ఒకటని అన్నాడు. 

అదనపు విలువ అంటే 
పెట్టుబడిదారుడు డబ్బుతో మార్కెట్ కోస్తాడు. పరికరాలు ముడిపదార్ధాలూ కొంటాడు. కూలికి పనివాళ్ళని పెట్టుకుంటాడు. అంటే తన డబ్బుని సరుకులుగా మారుస్తాడు. -  డబ్బు-సరుకు.  
కొయ్యని  మంచాలు చేయిస్తాడు. ఆమంచాల్ని అమ్ముతాడు. అంటే సరుకుల్ని డబ్బులోకి మారుస్తాడు- 
సరుకు-డబ్బు. 
రెండు చర్యల్నీ కలిపితే డబ్బు-సరుకు-డబ్బు.  
పెట్టినంత డబ్బే తిరిగొచ్చేదానికి ఎవ్వరూ కార్ఖానాలు తెరవరు.
మొదట పెట్టిన డబ్బుకంటే చివరలో తీసుకునే డబ్బు ఎక్కువగా ఉంటేనే డబ్బుపెట్టి పనులుచేయిస్తారు:  
డబ్బు-సరుకు-ఎక్కువ డబ్బు అతను డబ్బు పెట్టేది ఆ ఎక్కువ డబ్బు కోసమే. చివరిడబ్బు = పెట్టిన డబ్బు + పెరిగిన డబ్బు.  
అందువల్ల దీని కచ్చితమైన రూపం డ-స-డ’. ఇందులో డ’ =డ+ Δ డ. అంటే, మొదట పెట్టినది+ పెరుగుదల.
ఈ పెరుగుదలనే, అసలు విలువమీద ఎక్కువనే నేను అదనపువిలువ అంటున్నాను”- Capital 1.149 
అందువల్ల మొదట అడ్వాన్స్ చేసిన విలువ చలామణీలో చెక్కుచెదరకుండా ఉండడమే కాకుండా, తనకుతాను అదనపు విలువను కలుపుకుంటుంది, లేక తననుతాను వ్యాకోచింప చేసుకుంటుంది. దాన్ని పెట్టుబడిలోకి మార్చేది ఈచలనమే.
 చలామణీ రంగంలో పెట్టుబడి సాధారణ ఫార్ములా: డ-స-డ’ 
అదనపు విలువ ఎలా ఏర్పడుతుంది?
ఇక్కడ రెండు మారక చర్యలున్నాయి. డబ్బుతో ఇతరుల సరుకులు కొనడం ఒక చర్య. డబ్బుకి తన సరుకులు ఇతరులకి అమ్మడం మరొకచర్య. మొదటి మారక చర్య: డబ్బు-సరుకు. ఆసరుకుల విలువ ఎంతో అంత ఇస్తాడు. రెండో మారకచర్య: సరుకు-డబ్బు తన సరుకు విలువ ఎంతో అంతే పొందుతాడు. 
మరి అదనపు విలువ ఎలా ఏర్పడింది?
మారకంలో ఏర్పడుతుందా?
సరుకులు మారుతుండడం అందరికీ తెలిసిందే. ఒక చెప్పుల జత కుట్టడానికీ, రెండు  చేటలు అల్లడానికి ఒకే సమయం పడితే అవి రెండూ మారకం అవుతాయి. మారకం అవడానికి సరుకుల్లో  సమానమైన శ్రమ పరిమాణాలు ఉండాలి. అంటే అవి సమాన విలువలు కావాలి.ఇదే విలువ నియమం.
విలువని ఏర్పరచేది శ్రమే అని మార్క్స్ కి ముందున్న ఆర్ధిక వేత్తలు తేల్చారు.రెండు రకాల సరుకులు మారకం అయ్యేటప్పుడు  వాటి ఉత్పత్తికి అవసరమైన శ్రమకాలాలు లెక్కకొస్తాయి.
ఒకసరుకు ఉత్పత్తికి అవసరమైన శ్రమకాలం ఆసరుకు విలువని నిర్ణయిస్తుంది. అంతే పరిమాణంలో శ్రమ ఉన్న సరుకుతోనే 
అది మారుతుంది.ఉదాహరణకి ఒక బుట్ట అల్లడానికి 1 గంట శ్రమా, ఒక నిచ్చెన చెయ్యడానికి 3గంటల శ్రమ 
అవసరమనుకుందాం. అప్పుడు 
1 నిచ్చెన = 3 బుట్టలు  
ఆపరిమాణాల్లో అవి సమాన విలువలు. కనుక మారకం అవుతాయి. అంటే, సమాన విలువలు గల సరుకులే మారతాయి 
అనేదే ఆనియమం. దీన్ని మార్క్సుకి ముందున్న సాంప్రదాయ అర్ధశాస్త్రం నిర్ధారించింది. 
సరుకులు ఏపాళ్లలో సమానమవుతాయో తేల్చేది వాటి వాటి విలువ.
కాబట్టి సరుకు మారకంలోకి రాక ముందే విలువ నిర్ణయమవుతుంది. సరుకు విలువ అనేది చలామణీ ఫలితం కాదు, చలామణీ కి ముందు షరతు.
తేలిందేమంటే సమాన విలువలే మారతాయి, మారకంలో అదనపు విలువ రాదు - మరెక్కడనుండి వస్తుంది.
మార్క్స్ కి ముందు ఆర్ధిక వేత్తలకు ఇది అంతుపట్టలేదు.కారణం వాళ్ళు నిర్ధారించిన మారక నియమాన్ని బట్టి అదనపు విలువని వివరించడం అసాధ్యమయింది. పెట్టుబడిదారుడు కొన్న సరుకుల్లో శ్రమ శక్తి ఉంది. అది చర్య చేస్తేనే విలువ ఏర్పడుతుంది.పెట్టుబడికీ శ్రమశక్తికీ మారకం  జరుగుతుంది. ఈ మారకం కూడా మిగిలిన అన్ని సరుకుల మారకాల లాగే, సమానమారకం అయితీరాలి.ఇక్కడే ఇబ్బంది ఏర్పడింది.
రికార్డో పెట్టుబడికీ శ్రమకీ మారకం విషయంలో సమానత్వం గురించి ఆలోచించాడు. ఆయనకొక చిక్కు వచ్చింది. పెట్టుబడిదారుడు కార్మికుని శ్రమకు శ్రమవిలువ చెల్లించి చాకిరీ చేయించుకుంటున్నాడు. లాభం పొందుతున్నాడు. శ్రమవిలువ పూర్తిగా కార్మికుడికిస్తే మరి లాభం ఎక్కడనుంచి వస్తుందికార్మికునికి తక్కువ ఇస్తే సమాన విలువల మధ్య మారకం జరగలేదని అర్థం గదాశ్రమ విలువ సిద్ధాంతమే తప్పవుతుంది గదా? సమాన విలువలే మారకం కావాలి, లాభం రావాలి. శాస్త్రీయంగా దీన్ని రుజువు చెయ్యలేకపోయాడు రికార్డో. ఇదే ఆయన్ని వేధించిన సమస్య. వాస్తవానికీ సూత్రానికీ మధ్య పొంతన కుదర్చలేక పోయాడు. విలువ సిద్ధాంతాన్ని వదులుకోలేకావాస్తవంగా వస్తున్న లాభాన్ని భ్రమ అనలేకా సతమతమయ్యాడాయన. అక్కడే ఆగిపోయాడు.
రికార్డో శిష్యులు – అసమాన మారకం
సరుకుల్లో చేరిన విలువ మొత్తం కార్మికునిదే
రికార్డియన్ సోషలిష్టులు 1820, 1830 దశకాల్లో కృషి చేశారు. అదనపు విలువకి  అసమాన మారకాన్నే పునాది 
ఛేశారు. తయారైన సరుకుల్లో చేరిన విలువ మొత్తం కార్మికునికే రావాలి. అదంతా వాళ్లదే. కాని అలా రావడం లేదు. కొంత యజమానికి చేరుతున్నది. కనక అది అసమాన మారకం. ఇది రికార్డియన్ సోషలిష్టుల వాదం. రికార్డియన్ సోషలిష్టులు.  కార్మికుడు తన ఉత్పాదితం మొత్తానికీ హక్కుదారుడు అని వాదించారు. ఇది మారక నియమాన్ని తోసిపుచ్చే వాదన.
మార్క్స్ వచ్చేసరికి పరిస్థితి అది. సమాన మారకాల జరుగుతూ, అదనపు విలువ ఎలా వస్తుంది అనేది సమస్య గానే మిగిలి ఉంది.
మార్క్స్ పరిష్కారం-సమాన మారకమే
సరుకుల్లో చేరిన విలువ మొత్తం పెట్టుబడిదారుడిదే

శ్రామికుడికీ పెట్టుబడిదారుడికీ మధ్య మారకం మామూలు (సింపుల్) మారకమే; ఇద్దరిలో ప్రతి ఒక్కడూ సమానకాన్ని పొందుతాడు; ఒకరు డబ్బుపొందుతాడు, మరొకరు ఆడబ్బుకి సరిగ్గా సమానమయిన ధరగల సరుకు పొందుతాడు.- గ్రున్డ్రిస్ 
పెట్టుబడిదారుడు కొన్న సరుకుల విలువ కంటే, అమ్మిన సరుకుల విలువ ఎక్కువ. అమ్మిన సరుకు విలువ ఎవరిది?
ఉత్పాదితం ఎవరికి చెందుతుంది? కార్మికునికా,పెట్టుబడిదారునికా?
దీనికిచ్చే జవాబుని బట్టే జరిగిన మారకం సమాన మారకమో అసమాన మారకమో తేలుతుంది. 
కార్మికునిదైతే, అసమాన మారకం. ఎందుకంటే ఉత్పాదితం విలువలో కొంతభాగం పెట్టుబడిదారుడికి పోతున్నది. 
ఉత్పాదితం అతనిదే అయితే, దానివిలువంతా అతనికే రావాలి. రావడంలేదు కనక అసమాన మారకం. 
పెట్టుబడిదారునిదైతే, సమాన మారకం.మార్క్స్ ప్రకారం అది పెట్టుబడిదారునిదే. అని పలుచోట్ల చెప్పాడు. 
పెట్టుబడిదారీ స్వాయత్త విధానం సరుకు ఉత్పత్తి నియమాలను ఎంతగా తోసిపుచ్చినట్లు/ తిరస్కరిస్తున్నట్లు 
కనిపించినప్పటికీ, అది (ఆ స్వాయత్త విధానం) ఆనియమాల ఉల్లంఘన వల్లకాక, వాటి వర్తింపు వల్లనే తలెత్తింది 
అంటాడు. 

వేతనశ్రమా- పెట్టుబడీ లో: ఉత్పత్తయిన సరుకులోగానీ, దాని ధరలో గానీ అతనికి (కార్మికుడికి) ఏమీ భాగం లేదు మగ్గానికి లేనట్లే.”-సంకలిత రచనలు 1.పేజీ 95  
శ్రమ ఉత్పాదితం లేక దాని విలువ శ్రామికుడికి చెందదు.- TSV1.72 
ఉత్పాదితం పెట్టుబడిదారుడికి చెందుతుంది, శ్రామికుడికి కాదు. cap1.549 
శ్రామికులు మాత్రమే ఉత్పత్తిచేసిన అదనపు విలువ అనుచితంగా, అన్యాయంగా పెట్టుబడిదారుల వద్ద వుండి పోతుంది
అని మార్క్స్ అన్నట్లు వాగ్నర్ ఆరోపించాడు.  తాను చెప్పనిది తనకు ఆపాదించాడని  మార్జినల్ నోట్స్లో మార్క్స్ తప్పుబట్టాడు: నిజానికి, నేను దీనికి సరిగ్గా వ్యతిరేకమైనది చెప్పాను: ఏమనంటే, సరుకు ఉత్పత్తి ఒకానొక కాలంలో పెట్టుబడిదారీ సరుకు ఉత్పత్తిగా ఉంటుంది. ఈ పెట్టుబడిదారీ సరుకును నిర్దేశించే విలువ నియమం ప్రకారంఅదనపువిలువ తప్పనిసరిగా పెట్టుబడిదారునిదే అవుతుంది, కార్మికునిది కాదు.” (Marx & Engels Collected works volume 24 p.558) 

సరుకులో ఉన్న శ్రమ కార్మికునిది. అది అతనికి రాకపోతే సమాన మారకం ఎలావుతుంది?
దీన్ని రుజువు చెయ్యాల్సి ఉంది.
పెట్టుబడిదారుడు కొన్న సరుకుల విలువకన్నా అమ్మే సరుకుల విలువ ఎక్కువయితేనే గాని అదనపు విలువ సాధ్యంకాదు. సరే, కొన్నవాటి కన్నా అమ్మేవాటిలో ఎక్కువ విలువ ఎందుకుంటుంది? ఆ విలువ మారకంలో ఏర్పడదు గదా! అంటే  మారకానికి ముందే ఉండాలి. అంతకు ముందు ఏం జరిగిది? శ్రమ ప్రక్రియ జరిగింది. ముడి పదార్ధాలకి శ్రమ కలిసింది. ఉత్పత్తి జరిగింది.
చలామణీ రంగం నుంచి, ఉత్పత్తి రంగానికి 
పెట్టుబడి దారుడు కొన్న సరుకులలో, ఒక సరుకు  ఉపయోగపు విలువ, విలువని సృష్టించడం అయితేనే, అదికూడా తన విలువకన్నా ఎక్కువ విలువను సృష్టించడం అయితేనే అదనపు విలువ వస్తుంది-, సమాన విలువలే మారినా. 
అలాంటి సరుకు పెట్టుబడిదారుడికి దొరికినప్పుడే అతనికి అదనపు విలువ వస్తుంది. యీ చిక్కు సమస్య విడిపోతుంది.     మార్కెట్ లో అలాంటి సరుకు ఒకటి ఉంది. దాని ఉపయోగపు విలువ అంతా మారకపు విలువని ఉత్పత్తి చేయడమే. 

సరుకు శ్రమశక్తి, శ్రమ కాదు 

కార్మికుడు అమ్ముతున్నది శ్రమని కాదు, శ్రమశక్తిని అని మార్క్స్ నిర్ధారించాడు. శ్రమశక్తి సరుకు. శ్రమ కాదు. శ్రమ అనేది చలనంలో వున్న శ్రమశక్తి. కనుక శ్రమకి విలువ వుండదు. శ్రమశక్తి అనే మాట మార్క్సుకి ముందు వాడుకలో లేదు. శ్రమశక్తి విలువనే శ్రమవిలువ అనేవారు. మార్క్స్ ప్రకారం శ్రమకి విలువ వుండదు. ఎందుకంటే అది సరుకు కాదు. కనక శ్రమవిలువ అనేది అర్ధంలేని పదబంధం. శ్రమశక్తి ధర లేక విలువ పైకి శ్రమ ధరగా, విలువగా  కనిపిస్తుంది. 
శ్రమవిలువ దగ్గర బయలుదేరిన సాంప్రదాయ ఆర్థికవేత్తలకు యిబ్బంది ఎదురయింది. శ్రమశక్తి దగ్గర బయలుదేరితే  చిక్కు వీడిపోతుంది. శ్రమశక్తి ఒక సరుకు. అయితే అది విశిష్టమైన సరుకు. విలువను సృష్టించటం దాని ఉపయోగపు విలువ. 
పెట్టుబడిదారు కార్మికుల శ్రమను డబ్బుతో కొన్నట్లు కనబడుతుంది. వాళ్లు తమ శ్రమను డబ్బుకుగాను 
పెట్టుబడిదారుకు అమ్ముతారు. కాని యిది పైకి కనిపించేది మాత్రమే. నిజానికి వాళ్లు అమ్మేదీ, అతను కొనేదీ శ్రమశక్తిని. 
శ్రమవిలువ సిద్ధాంతం కేంద్రంగా రాజకీయ అర్థశాస్త్రాన్ని నిర్మించటానికి రికార్డో ప్రయత్నించాడు గాని కార్మికులు 
అమ్ముతున్నది శ్రమని కాదనీ శ్రమశక్తిననీ గ్రహించలేదు అంటాడు మార్క్స్. కార్మికుడు అమ్మేది సరుకులో 
ఇమిడివున్న శ్రమని కాదు, తన సొంత శ్రమ శక్తిని.”- అదనపువిలువ సిద్ధాంతాలు 1.313. 
 మార్క్స్ ప్రకారం: మారకం జరిగేది కార్మికుడి శ్రమశక్తికీ, పెట్టుబడిదారుడి డబ్బుకీ. అది సమాన విలువల మారకమే. 
శ్రమశక్తిని అమ్మాక దాని ఉపయోగపువిలువ కొన్నవాడిదే. ఎంత శ్రమజరిగినా అంతా పెట్టుబడిదారుడిదే. 
అసమాన మారకం (ఇచ్చేది తక్కువ పుచ్చుకునేది ఎక్కువ) వల్లనే పెట్టుబడిదారుడు అదనపు విలువ పొందుతాడు అని మార్క్స్ కి ముందు కొందరు భావించారు. ఆ వాదం శాస్త్రీయమైనది కాదనీ, సమాన మారకం జరుగుతూనే అదనపు విలువ ఏర్పడుతుందనీ మార్క్స్ చెప్పాడు. 
వాళ్లు అనుకున్నట్టుగా మారకం జరిగేది శ్రమకీ, పెట్టుబడికీ కాదనీ, శ్రమశక్తికీ పెట్టుబడికీ అనీ శ్రమశక్తి అనే కొత్త 
భావనను ప్రవేశపెట్టాడు. ఆ ఆధారం మీదనే అదనపు విలువని రుజువు చేశాడు.  
శ్రామికుడు అమ్మింది సరుకులో చేరిన శ్రమని కాదు, సరుకుగా శ్రమశక్తిని అనే వాస్తవం నుంచి పెట్టుబడిదారుడు 
చేసుకునే లాభం,అతను రాబట్టే అదనపువిలువ వస్తుంది. 
అప్పటికి అర్థశాస్త్రంలో లేని శ్రమశక్తి అనే భావనని ప్రవేశపెట్టాడు మార్క్స్. మారకంలో ఒకవైపు డబ్బుంటే, రెండోవైపున వున్నది శ్రమ శక్తి. శ్రమ అని అంతకు ముందువాళ్లు అనుకున్నారు. మార్క్స్ ప్రకారం శ్రమ సరుకు కాదు. ఇది తెలియకపోతే మార్క్స్ సిద్ధాంతం లోని అతి కీలకమైన విషయం తెలియనట్లే. 

శ్రమ శక్తి సరుకు, శ్రమ కాదు మార్క్స్ ఆవిష్కరణ 
          అదనపువిలువసిద్ధాంతానికి ఆధారపీఠం ఇదే 
ఉత్పత్తయిన సరుకు  విలువలో ఒకభాగం శ్రామికుడికి వస్తుంది. రెండో భాగం పెట్టుబడిదారుడికి పోతుంది. 
మార్క్స్ కి ముందు ఆర్దికవేత్తలకు ఈవిషయం తెలుసు. అప్పటికి శ్రమ సరుకనీ కార్మికుడు తన శ్రమని అమ్ముతున్నాడనీ, పెట్టుబడిదారుడు కొంటున్నాడనీ అనుకున్నారు.

శ్రమ సరుకు అని ఎందుకనుకున్నారు
శ్రమ సరుకు అయినట్లు కనిపిస్తుంది. అమ్మిన శ్రామికుడూ కొన్న పెట్టుబడిదారుడూ మారకం అయిన సరుకు శ్రమ అనుకుంటారు. ఎందుకో చూద్దాం. 1.పరిస్థితుల్ని బట్టి పనిదినం 8,10,12 గంటలుగా ఉంటుంది. 
పనిదినం ఇన్ని గంటలు అని కార్మికుడికి తెలుసు. కూలీ ఎంతో కూడా తెలుసు. దాన్నిబట్టి గంట శ్రమకి ఇంత అని 
లెక్కించుకుంటాడు. 10 గంటలు పనిచేస్తే రు.400 తీసుకునే వాడికి గంట శ్రమ విలువ రు.40 అనుకోవడం సహజమే. 
చేసిన శ్రమ పరిమాణాన్ని బట్టి అతని వేతనం ఉంటుంది. కనుక తను అమ్ముతున్నది శ్రమనిఅనుకుంటాడు. 
2. తను సరుకుని ఇచ్చే తీరుని బట్టికూడా అమ్ముతున్నది శ్రమని అనుకుంటాడు. శ్రమ చేశాకనే వేతనం వస్తుంది. అందువల్ల చేసిన శ్రమకి వేతనం వచ్చింది అనిపిస్తుంది.
ఆర్ధికవేత్తలు విషయాన్ని లోతుగా పరిశీలించకుండా అప్పటికి వాడుకలో ఉన్న శ్రమవిలువ అనేపదాన్ని అదే అర్ధంలో తీసుకున్నారు. ఆ ప్రకారం విశ్లేషణ కొనసాగించారు. వాళ్ళకి చిక్కేర్పడింది. 
శ్రమ సరుకయితే, శ్రమ విలువని నిర్ణయించాలి. వాళ్ళు ఈపనికి పూనుకోలేదు. పూనుకున్నా,ఇది నిర్ణయమయ్యేది కాదు. ఎందుకో చూద్దాం. 
శ్రమ  విలువ
పెట్టుబడికీ శ్రమకీ మారకంలో "శ్రమవిలువ దేనిచేత నిర్ణయించబడుతుంది? శ్రమచేతనే విలువ నిర్ణయించ బడుతుందనే నియమాన్ని శ్రమ అనే సరుకుకి అన్వయించినప్పుడు అర్థశాస్త్రవేత్తలు అంతర్వైరుధ్యంలో పడ్డారు. శ్రమ విలువ ఎలా నిర్ణయించబడుతుంది?  ఆ శ్రమలో వున్న అవసరశ్రమ చేత. ఒక గంట శ్రమవిలువ ఒక గంట శ్రమకు సమానం అనిమాత్రమే మనకు తెలిస్తే, దాన్నిగురించి బొత్తిగా మనకేమీ తెలియదన్నమాట. యిది మనల్ని వెంట్రుక వాసి కూడా 
గమ్యం దగ్గరకి తీసుకుపోదు; మనం ప్రదక్షిణం చేస్తూనే వుంటాం." (వేతన శ్రమ - పెట్టుబడికి ఎంగెల్స్ ప్రవేశిక
సంకలిత రచనలు-2,  పే 84-85).  
శ్రమ సృజించిన విలువనే వాళ్లు శ్రమవిలువ అనుకున్నారు. అందువల్లే, శ్రమవిలువని తేల్చే పని పెట్టుకున్నారు. అది తేలలేదు, తేలేదీ కాదు. 

ఏసరుకు విలువనైనా నిర్ణయించేది ఎలా? దానిలో ఉన్న అవసర శ్రమ చేత. అన్నివిలువలకూ కొలమానం శ్రమ. 
అయినప్పుడు శ్రమ విలువని కూడా శ్రమలోనే చెప్పాలి. దీని ప్రకారం అయితే 
1 గంట శ్రమ = 1 గంట శ్రమ అనాలి. 
ఒకగంట శ్రమ ఒక గంట శ్రమకి సమానం అని చెబితే అర్ధం ఉండదు. అది పునరుక్తి, పైగా అర్ధరహిత వ్యక్తీకరణ. 
ఎందుకంటే, వస్తువులకు విలువని ఏర్పరచేది స్వయంగా విలువని కలిగి ఉండదు.
ఎంగెల్స్ కాపిటల్ 2 ముందుమాటలో ఇలా చెబుతాడు: 
విలువ కలిగి ఉన్నది శ్రమ కాదు. విలువను సృజించే చర్యగా అది(శ్రమ) విలువని కలిగి ఉండజాలదు. గురుత్వాకర్షణ ప్రత్యేక బరువునూ, ఉష్ణం ప్రత్యేక ఉష్ణోగ్రతనీ, విద్యుత్తు ప్రత్యేక ప్రసరణ బలాన్నీఎలా  కలిగి ఉండవో అలాగే.”- కాపిటల్ 2. పే18-19 
దీన్నిబట్టి శ్రమకి విలువకట్టడం వీలుకాదు. విలువ లేనిదేదీ సరుకు కాజాలదు. కనుక శ్రమ సరుకు కాదు.
సరుకు కాని శ్రమని సరుకు అనుకున్నందువల్ల సమాన విలువల మారకం మీద అదనపు విలువని రుజువు చెయ్యడం వాళ్లకి సాధ్యపడలేదు. సోషలిస్టులు అసమాన మారకాన్ని ఆశ్రయించారు. ఇరువురూ శాస్త్ర పద్ధతిని పాటించలేదు. 
సరుకు శ్రమ కాదు, శ్రమశక్తి
సరుకు కాకపొతే శ్రమ ఏమిటి
పెట్టుబడిదారుడు శ్రమ చేయించుకోడానికి డబ్బిస్తున్నాడు. అంటే ఎదో సరుకుని కొంటున్నాడు. ఇప్పుడు శ్రమ సరుకు కాదని తేలింది. కనుక అతను కొంటున్న సరుకు శ్రమ కాదు. కాని అది కచ్చితంగా మరేదో సరుకు. మరయితే శ్రమ ఏమిటి? అతను కొనే సరుకు యొక్క ఉపయోగపు విలువ. శ్రమ అనే ఉపయోగపు విలువ కోసం ఎదో సరుకును కొంటున్నాడు. 
 పెట్టుబడిదారుడు కార్మికుని వద్ద కొంటున్న సరుకేమిటి
పరిశోధనలో ముందడుగు వేశాడు.  థామస్ హాబ్స్ తన లెవియాథాన్ పుస్తకం (1839-44) లో రాసిన మాటలు 
గమనించాడు: 
"ఒక మనిషి విలువ …. అన్ని యితర వస్తువుల విషయంలో లాగానే అతని ధర; అంటే, అతని శక్తిని 
వుపయోగించుకునేందుకు ఎంత ఇవ్వబడుతుందో అంతన్నమాట" (కాపిటల్ 1, పే. 167, ఫుట్ నోట్ 2) 
మనిషి శ్రమ ” (అంటే అతని శ్రమించేశక్తి) కూడా, మారకంఅయ్యే సరుకే ప్రతి ఇతర వస్తువులాగే.” (Theories of 
Surplus Value 1.353)  
ఆయన తర్వాతివారు ఈ ఆవిష్కరణని గమనించలేదుఅంటాడు మార్క్స్ (వేతనం,ధర, లాభం, మార్క్స్ ఎంగెల్స్ 
సంకలిత రచనలు, భాగం 2,  పే. 46). 
మార్క్స్ దాన్ని గమనించాడు. 
శ్రమ అనేది చలనంలో శ్రమశక్తి. శ్రమశక్తి అనే సరుకు ఉపయోగపు విలువ. 
రికార్డో శ్రామికుడు సరుకుగా అమ్మే..., శ్రమ సామర్ధ్యానికీ, ఈ సామర్ధ్యం యొక్క ఉపయోగం అయిన శ్రమకీ మధ్య 
వున్నా తేడాని చూడలేదు.అన్నాడు మార్క్స్ –Manuscripts of 1861-63.  
అయితే ఉపయోగపువిలువ  ఉన్నంత మాత్రాన ఏదీ సరుకు కాదు. విలువ కూడా ఉండాలి. సరుకు ఉపయోగపు విలువవిలువల సమ్మేళనం. శ్రమవిలువ నిర్ణయించబడదు. కనుక అది సరుకు కాదు అని తేలింది. 
మరి శ్రమశక్తి విలువ నిర్ణయమవుతుందా
అన్ని ఇతర సరుకులకు ఉన్నట్లే దానికీవిలువ వుంది.  అన్ని ఇతర సరుకుల విలువ నిర్ణయమైనట్లే, అంటే దాని 
ఉత్పత్తికి అవసరమైన శ్రమ కాలం చేత, నిర్ణయమవుతుంది. 
శ్రమశక్తి విలువలో చేరేవి: 
1. శ్రామికుని తిండీ, బట్టా మొదలైన జీవనాధార వస్తువుల విలువ. 
2. శ్రామికుని సాంస్కృతిక, సామాజిక అవసరాలను తీర్చే వస్తువుల విలువ. 
3. శ్రామికుని కుటుంబ సభ్యుల పోషణకు కావలసిన వస్తువుల విలువ. 
4. శ్రామికుని శిక్షణకీ, నైపుణ్య సాధనకీ అయ్యే ఖర్చు.  

 శ్రమశక్తి యొక్క విలువ శ్రమ శక్తిని సృష్టించడానికీ, అభివృద్ధి చెయ్యడానికీ, పోషించడానికీ, కొనసాగించడానికీ 
కావలసిన జీవితావసరాల విలువచేత నిర్ణయించ బడుతుంది”- ‘వేతనం, ధర, లాభం’, మార్క్స్ ఎంగెల్స్ సంకలిత 
రచనలు, భాగం 2,  పే.48 
ఆవిధంగానిర్వచించబడిన దాని విలువ ఆధారంగా జరిగే శ్రమశక్తి కొనుగోలూ, అమ్మకమూ విలువ నియమాన్ని 
వ్యతిరేకించదు.  ఎంగెల్స్ ముందుమాటకాపిటల్ 2. పే18-19 
సరుకుగా అమ్మేదీ, కొనేదీ శ్రమని కాదు, శ్రమశక్తిని  అని తేల్చాడు 
శ్రమ శక్తి అన్నా, శ్రమచేసే సామర్ధ్యం అన్నా మనిషిలో ఉన్న, ఏదయినా ఉపయోగపు విలువను ఉత్పత్తి చేసేటప్పుడు అతను వినియోగించే మానసిక శారీరక శక్తుల మొత్తం “ .....అని అర్ధం చేసుకోవాలి. అన్నాడు- cap1.167 
శ్రమశక్తి సరుకు అని ఎన్నోచోట్ల చెబుతాడు. 
వేతనశ్రమా- పెట్టుబడీ లో మార్క్స్ ఇలా అంటాడు: శ్రమశక్తి అనేది ఒక సరుకు చక్కెర ఎలాగో అలాగే.”- సంకలిత 
రచనలు 1.పేజీ94 
శ్రమశక్తి అనేది దాని సొంతదారుడైన వేతన కార్మికుడు పెట్టుబడికి అమ్మే సరుకు.సం. ర 1.పేజీ 95 
 శ్రమ కొనుగోలూ ..... ఈ పద్మవ్యూహం నుండి బయటకు దారి కనుక్కున్నవాడు కార్ల్ మార్క్స్ “- 
సరుకు శ్రమ కాదు శ్రమ శక్తి అని ఆవిష్కరించడం ద్వారా. కనుక మార్క్స్ అర్ధశాస్త్రానికి అదనపు విలువ సిద్ధాంతం 
ఆధారం. అదనపు విలువకి శ్రమశక్తి సరుకు అనేది అటువంటి ఆధారమే. కాబట్టి, శ్రమశక్తి సరుకు అనే అవగాహన 
మార్క్స్అర్ధశాస్త్రానికి ఆధారం. 
అత్యుత్తమ అర్ధశాస్త్రజ్ఞులు శ్రమ విలువ వద్ద బయలుదేరినంతకాలం ఏ యిబ్బంది మూలంగా దుఃఖ భాజనులయ్యారో 
అది మనం శ్రమశక్తి వద్ద బయలుదేరిన వెంటనే అదృశ్యమవుతుందిఎంగెల్స్ ముందుమాట వేతన శ్రమా పెట్టుబడీ’ 
సం.ర 1.పే.89 
శ్రమ శక్తి సరుకే, అయినా విశిష్టమైన సరుకు 
అన్ని ఇతర సరుకుల్లాగే శ్రమశక్తి ఒక సరుకు. కానీ విశిష్టమైన సరుకు. విలువని సృజించే సరుకు. సరిగా వాడుకుంటే తన విలువను మించిన విలువని సృజిస్తుంది.
శ్రమ శక్తి విశిష్ట స్వభావం దాని ఉపయోగపువిలువ వల్ల  ఏర్పడుతుంది.
సమాన విలువల మారకం జరుగుతూనే, అదనపువిలువ పెట్టుబడిదారుడికి వస్తుంది అనేదాన్ని రుజువు చేసే పని 
మార్క్స్ కి పడింది. పరిశోధన కొనసాగించాడు. శ్రమ సరుకు కాకపొతే, పెట్టుబడిదారుడు శ్రామికునికి డబ్బిచ్చి కొంటున్న సరుకేమిటి? కొన్న సరుకులలో ఒక సరుకు ఉపయోగపు విలువ విలువని ఉత్పత్తిచేసేది అయితేనే గాని సమస్య తీరదు.
పెట్టుబడిదారుడు మొదట  కొన్న సరుకుల విలువకి సమాన విలువగల డబ్బు చెల్లిస్తాడు. చివరలో  అతను అమ్మిన సరుకుకు సమాన విలువ గల డబ్బు తీసుకుంటాడు. అయితే ఈ తీసుకునే డబ్బు మొదట అతను పెట్టిన డబ్బు కంటే ఎక్కువ. ఈ ఎక్కువ మారకం వల్ల ఏర్పడింది కాదు. శ్రామికుని శ్రమ కలిసినందువల్ల. ఈ కలిసిన శ్రమ అతను చెల్లించిన శ్రమకన్నా ఎక్కువ. కలిసిన విలువలో శ్రమ శక్తి విలువకు తోడు అదనపు విలువ కూడా ఉంటుంది. అందువల్ల శ్రమశక్తి విలువ చెల్లించినా, చెల్లించకుండానే కొంత శ్రమ పెట్టుబడిదారుడికి చేరుతుంది. ఉన్నవిలువకే తన సరుకు అమ్ముతాడు. 
అందులో రెండు భాగాలుంటాయి: ఒకటి శ్రమశక్తి విలువ, రెండు అదనపు విలువ. వీటిలో  శ్రమ శక్తి విలువ శ్రామికునికి
అదనపు విలువ పెట్టుబడి దారునికి. 
ఆవిధంగా అదనపు విలువనీ, విలువనియమాన్ని(సమానకాల మారకాన్నీ)- సమన్వయపరిచాడు. 
ఈ ఫీట్ ని సాధ్యపరిచింది  శ్రమ శక్తి సరుకు అనే ఆవిష్కర. మార్క్స్ అదనపువిలువ సిద్దాంతానికి ఈ ఆవిష్కరణే 
ఆధార పీఠం. దీన్ని మనం పట్టుకోలేక పోతే అదనపువిలువ సిద్ధాంతం అర్ధం కానట్లే.  
*******
ఒకపెట్టుబడి దారుడు ప్రాజెక్టులు చేయించి అమ్మే కంపెనీ పెడతాడు. 50 మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లని జీతానికి నియమిస్తాడు. ఆఫీస్ లో పనిచెయ్యడానికి అవసరమైన  కంప్యూటర్లూ, ప్రింటర్లూ,స్కానర్లూ  వగయిరా సాధనాలు సమకూరుస్తాడు. ఇంటర్నెట్ ఏర్పరుస్తాడు. ప్రాజెక్టులు తయారు చేయిస్తాడు. అమ్ముతాడు. తయారీ కయిన ఖర్చులు పోను మిగిలేదే అదనపువిలువ.అది ఎంతైనా పెట్టుబడి దారుడికే చెందుతుంది.
పనిచేసే వాళ్లకి వేతనం లక్షల్లో ఉండవచ్చు. అయినా వాళ్ళు వేతనానికి పనిచేసే వాళ్ళే. వాళ్ళకీ శ్రమ తీవ్రతుంటుంది. రాత్రి పని ఉంటుంది. నిరుద్యోగం ఉంటుంది. సంక్షోభాల్లో మామూలు కార్మికులకి పనులు పోయినట్లే వాళ్ళకీ పోతాయి.తక్కువ జీతాలకి పనిచేయ్యల్సివస్తుంది. 2001 లోవచ్చిన డాట్ కాం సంక్షోభంలొ ఎందఱో  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలు పోయాయి. 2008 మహామాంద్యంలో అందరితో పాటు వాళ్ళ ఉద్యోగాలూ పోయాయి.
ఇంకో ఉదాహరణ: ఒకడు కోట్ల పెట్టుబడితో పెద్ద హాస్పిటల్ పెట్టవచ్చు. అవసరమైన సాధనాలు కొంటాడు. మంచి ఆపరేషన్ థియేటర్లు, సెంట్రల్ ఏ.సీ ఏర్పాటు చేస్తాడు.స్పెషలిస్టులైన డాక్టర్లతో వైద్యం, ఆపరేషన్లు చేయించవచ్చు. పేషంట్ల దగ్గర ఎంత వసూలు చేస్తారు అనే దానితో డాక్టర్లకు సంబంధం ఉండదు. వాళ్లకి వేతనం ఉంటుంది. అది లక్షల్లో ఉండవచ్చు. వాళ్ళ వేతనాలు పోను, సాధనాలవాటాపోను, ముడి పదార్ధాల వాటా పోను వచ్చేది అదనపు విలువ.అది పెట్టుబడి దారుడిదే.
కనక మార్క్స్ అదనపు విలువ సిద్ధాంతం ఇప్పటికీ సరయినదే. పెట్టుబడిదారీ విధానం కొనసాగినంతకాలమూ వర్తించేదే.