25, మే 2017, గురువారం

6.విలువరూపం-2

విలువరూపం-2

సీతాకోకచిలుక క్రిమి రూపంతో  మొదలై   దశలవారీగా రూపొందుతుంది. అలాగే డబ్బుకూడా. ప్రాధమిక రూపంతో మొదలై దశలవారీగా  డబ్బురూపం పొంది జిగేల్ మంటుంది.పోయే కొద్దీ, ఉపయోపువిలువ నించి విలువ వేరుపడడం అంతకంతకూ స్పష్టమవుతుంది.ఈ మార్పు అంతర్గత వైరుధ్యాల వల్ల అనివార్యంగా జరిగేదే గాని యాదృచ్చికంగా ఏర్పడింది కాదు అనేది  మార్క్స్ గతితార్కిక తర్కం (dialectical logic)

I.ప్రాధమిక విలువ  రూపం


ప్రాధమిక రూపంలో ఒక సరుకు విలువ మరొక సరుకు ద్వారా మాత్రమే వ్యక్తం అవుతుంది. ఈ మరొక సరుకు ఏదయినా కావచ్చు- కోటో , ఇనుమో, గోధుమో మరొక సరుకో.
సమీకరణలో అటొకటి ఇటొకటి మాత్రమే ఉంటాయి- సాపేక్ష రూపంలో ఒకటీ, సమానక రూపంలో మరొకటీ.


ప్రాధమిక రూపం ఆచరణలో యాదృచ్చికంగా,ఎప్పుడో ఒకప్పుడు(అప్పుడప్పుడు/అరుదుగా)జరిగే మారకాలు శ్రమ ఉత్పత్తుల్ని సరుకులుగా మార్చేతొలి దశలో సంభవిస్తాయి.
ప్రత్యేక శ్రమ ఉత్పాదితాలు   అప్పుడప్పుడు, యాదృచ్చికంగా మారకం అయినప్పుడు ప్రాధమిక రూపం ఏర్పడింది. మొదట్లో మారకాలు తెగల మధ్య జరిగేవి.అదీ రెండు తెగలు ఒకే చోటకి వచ్చినప్పుడు; ఒకరి దగ్గర వున్న వస్తువులు మరోకరిదగ్గర లేనప్పుడు; సొంతదార్లదగ్గర అవి మిగులుగా వున్నప్పుడు; ఇరువురూ ఒకరి సరుకులు మరొకరు కావాలనుకున్నప్పుడు. ఆరెండు సరుకులూ నిర్దిష్ట పరిమాణాల్లో మారగలగడం కేవలం యాదృచ్చిక ఘటన కావచ్చు. ఇలాంటి ఘటనలు అన్ని సరుకులకూ జరిగే అవకాశాలున్నాయి.
వగయిరా మారక సంబంధాలు ఏర్పడవచ్చు. అయితే ఒకసారి జరిగాయని ప్రతిసారీ జరగాలని లేదు. ఆయ్యవస్తువులు వున్నవాళ్ళకు ఒకరివి ఒకరు మార్చుకోవాల్సిన అవసరం లేనప్పుడు మారకమే జరగదు. మారకం జరిగినా  అదే  పరిమాణంలో జరుగుతుందనీ లేదు.
ఉదాహరణకి, బానలు చేసే మనిషి ఒకబాన ఇచ్చి  2 చాటలు తీసుకున్నాడనుకుందాం. మరొకసారి చాటల మనిషి బానలకి చాటలు ఇవ్వడానికి సిద్ధమైనా, బానల మనిషికి చాటలు అవసరంలేకపోతే మారకం జరగదు.
మరొకరితో మారకం జరిగినా ఒక బానకి 2 చాటలు కాకపోవచ్చు. ౩ కావచ్చు. 2 బానలకి ౩ చాటలు కావచ్చు. నిష్పత్తి మారవచ్చు. అందుకే ప్రాధమిక రూపం  యాదృచ్చిక రూపం.
ఇక్కడ బట్ట విలువ ఒక్క కోటులో మాత్రమే తెలుస్తున్నది. ఇతర సరుకులలో తెలియదు.
అయితే మారకాలు పెరిగేకొద్దీ, ఇతరసరుకుల్లో కూడా బట్టవిలువ తెలుస్తుంది.
బట్టకి ఇక్కడ 4 విలువ వ్యక్తీకరణలున్నాయి. ఇంకా కొన్ని ఉండవచ్చు. కొన్నేమిటి, ఎన్నైనా ఉండవచ్చు.
ఆవిధంగా ఏ సరుకుకైనా ఎన్నో, ఎన్నెన్నో  ప్రాధమిక విలువ వ్యక్తీకరణలుంటాయి. అలాంటి వ్యక్తీకరణలు ఎన్ని ఉండే అవకాశం ఉంటుందంటే, ఆ సరుకు కాక ఎన్ని సరుకులు ఉంటాయో అన్ని. అందువల్ల, ఒక సరుకు విలువ వ్యక్తీకరణ అనంతగా విస్తరించగల వరుసలోకి, భిన్న ప్రాధమిక విలువల వరుసలోకి మార గలదు. అలాంటి పరిస్థితుల్లో 20  గజాల బట్టకు ఎన్నో ప్రాధమిక వ్యక్తీకరణలుంటాయి.ఆసరుకు(బట్ట) కాక ఎన్ని సరుకులు ఉంటాయో అన్ని.
సాపేక్ష విలువ స్థానంలో ఒక సరుకే ఉంటుంది.సమానకం స్థానంలో అనేకం ఉంటాయి.
మొత్తం 500 సరుకులు ఉంటే, 499 ప్రాధమిక విలువ రూపాలుంటాయి.సరుకులు ఎక్కువయ్యే కొద్దీ, ప్రాధమిక విలువ రూపాలు కూడా పెరుగుతాయి.దీన్నిబట్టి , ఒక సరుకు విలువను తెలిపే సమానకాల సంఖ్య పెరిగే వరుస కాగలదు. అంటే విస్తరించ గలదు. ఆ రూపమే

II. సంపూర్ణ విలువ రూపం/ విస్తృత విలువ రూపం

ఇలా ఉంటుంది :
20 గజాల బట్ట=1 కోటు
             =10 పౌన్ల టీ
            =40  పౌన్ల కాఫీ
             =పావు గోధుమల
             = 2 ఔన్సుల బంగారం
             =1 టన్ను ఇనుం ఇలా
బట్ట విలువ చాలా సరుకుల్లో వ్యక్తం అయింది.

అలాగే 1 కోటు విలువ ఈ రూపంలో ఇలా ఉంటుంది:
కోటు విలువ చాలా సరుకుల్లో వ్యక్తం అవుతుంది.
విస్తృత రూపం  ఒక ప్రత్యేక శ్రమ ఉత్పాదితం (ఉదాహరణకి పశువు) ఇతర అన్ని సరుకులతో, అరుదుగా కాక, అలవాటుగా మారేటప్పుడు మొదట  ఉనికిలోకి వస్తుంది. ఈ రూపం ఉపయోగపు విలువ నించి విలువని మరింత స్పష్టంగా వేరుచేస్తుంది.

§1 .విస్తృత సాపేక్ష విలువ రూపం

.ఇప్పుడు బట్ట విలువ  అన్ని ఇతర సరుకుల్లోనూ వ్యక్తమవుతుంది. ప్రతి ఇతర సరుకూ బట్ట విలువకు అద్దం  పడుతుంది/అవుతుంది. ఆవిధంగా ఇప్పుడు మాత్రమే  ఈ విలువ తేడాలేని మానవ శ్రమ జెల్లీ గా కనబడుతుంది. ఆశ్రమ కుట్టయినా, దున్నకం అయినా, గని తవ్వకం అయినా మరే దైనా ఒకటే అని అర్ధమవుతుంది. కోటులో,గోదుమల్లో, ఇనుంలో, బంగారంలో మరెందులో వస్తుత్వం చెందినా ఒకటే. కనుక దాని (విస్తృత )విలువ రూపం వల్ల  బట్ట ఇప్పుడు ఒక్క కోటుతోనే కాకుండా లోకం లోని అన్ని సరుకులతోటి సామాజిక సంబంధంలో నిలబడుతుంది. సరుకుగా అది ప్రపంచ పౌరుడు.

20 గజాల బట్ట=1 కోటు అనే మొదటి రూపంలో(ప్రాధమిక విలువ రూపంలో)  ఈ రెండు సరుకులూ నిర్దిష్ట  పరిమాణాల్లో మారతాయి అనేది కేవలం  యాదృచ్చిక ఘటన అయినా కావచ్చు.
“రెండో దాంట్లో (విస్తృత విలువ రూపంలో ) , ఇందుకు భిన్నంగా ఈ యాదృచ్చికతని  నిర్ణయించే నేపధ్యాన్ని తక్షణమే గమనిస్తాం.” బట్ట విలువ పరిమాణంలో మార్పురాదు-అది కోటులో వ్యక్తమయినా మరొకదానిలో వ్యక్తమయినా, అవి వేరు వేరు యజమానులకు చెందినవైనా. ఇద్దరు సరుకు సొంతదార్ల మధ్య యాదృచ్చిక సంబంధం అంతర్ధానం అవుతుంది. ఒక విషయం స్పష్టం అవుతుంది: “సరుకుల విలువల్ని నియంత్రించేది (regulate) సరుకుల మారకంకాదు, అందుకు భిన్నంగా సరుకుల విలువల పరిమాణాలే అవిమారే నిష్పత్తుల్ని నియంత్రిస్తాయి.”
§2. ప్రత్యేక సమానక రూపం.
కోటూ, టీ ,గోధుమలూ, ఇనుమూ వంటి ప్రతిసరుకూ  బట్ట విలువ వ్యక్తీకరణలో  సమానకంగా వ్యవహరి స్తుంది. కనుక విలువ కలిగివున్న భౌతిక వస్తువుగా , రూపుదాల్చిన విలువగా   లెక్కకొస్తుంది. ఈ సరుకుల్లో ప్రతిదాని శరీర రూపమూ ఇప్పుడు ఎన్నో ఇతర సమానకాలతో పాటు ఒక ప్రత్యేక సమానకం. అలాగే ఆయా సరుకులలో  ఇమిడి వున్న ప్రయోజనకర నిర్దిష్ట శ్రమలు ఏ తేడా లేని మానవ శ్రమ అగపడే ప్రత్యేక రూపాలుగా లెక్కకొస్తాయి.
మన ఉదాహరణలో బట్టకి సమానకాలుగా టీ,కాఫీ, గోధుమలు,బంగారం ,ఇనుం ఉన్నాయి. వీటిలో ప్రతిదీ ఒక ప్రత్యేక సమానకం.
§3. విస్తృత విలువ రూపంలో లోపాలు
ఈ రూపంలో 3 లోపాల్ని ప్రస్తావిస్తాడు.
A) సంపూర్ణత/ సమగ్రత  లేకపోవడం ఒక లోపం.బట్ట విలువ యొక్క సాపేక్ష వ్యక్తీకరణ అసంపూర్ణం. కారణం బట్టవిలువకి  ప్రతినిధిగా వుండే సరుకుల వరుస ఎన్నటికీ ముగియదు. అది ఒక గొలుసు. ఆగొలుసులో ప్రతి సరుకూ  ఒక లింకు. కొత్త సరుకు వస్తే అది మరొక లింకవుతుంది. వచ్చిన ప్రతికొత్త సరుకూ బట్ట విలువని తనలో వ్యక్తీకరిస్తూ వుంటుంది.గొలుసు పోడుగవుతూ పోతుంది.
ఒకప్పుడు లేని కర్రు, కొడవలి  వంటి ఇనప  వ్యవసాయ పరికరాలు ఇనుం కనుక్కున్నాకనే వచ్చాయి.  గడ్డ పారలూ కత్తులూ ఎన్నో వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే వున్నాయి.
బట్ట విలువ అలా వచ్చిన ప్రతిదానిలో కూడా వ్యక్తం కావాలి, ఇలా:
20 గజాల బట్ట=10 కర్రులు  
             =8 కొడవళ్ళు  
             = 3 గడ్డ పారలు
             =5 కత్తులు   
ఇక  ఈ  వరస పెరిగేదే కాని ముగిసేదికాదు. బట్ట విలువ రూపం పూర్తిగా వ్యక్తం కాదు.కొరవ ఉంటూనే ఉంటుంది.  కనుక బట్ట విలువ సాపేక్ష వ్యక్తీకరణ ఎన్నటికీ అసంపూర్ణమే,అసమగ్రమే.
B) సరళత్వం లేకపోవడం మరొక లోపం..
ఒకసరుకు విలువ వ్యక్తీకరణ ఎన్నో సరుకుల్లో వ్యక్తం అవుతుంది. ప్రతి సరుకు విలువా మిగిలిన అన్ని సరుకుల విలువల్లో తెలుస్తుంది.ఉదాహరణకి కోటు విలువ
అలాగే 50 కిలోల ఇనుం విలువ :
ఏసరుకు విలువైనా ఇలాగే అంతులేని వరస అవుతుంది.ఒక్కొక సరుకు విలువ అనేక సరుకుల్లో వ్యక్తం కావడం వల్ల సరళత లోపిస్తుంది.
విస్తృత విలువ రూపం విభిన్నమైన,  ఒకదానికొకటి సంబంధం లేని  స్వతంత్రమైన విలువ వ్యక్తీకరణలతో ఉండే రంగు రంగుల మొజాయిక్ అంటాడు.అంటే, ఒకే సరుకు యొక్క సమానకం ప్రతి చోటా, ప్రతికాలంలో ఒకటే కాదు అని.

C.ఏకరూపత లేకపోవడం. ఒకేరకంగా ఉండక పోవడం.

బట్ట విలువ కోటు  విలువకు గుణాత్మకంగా సమానం. అవి రెండూ అనిర్దిష్ట శ్రమ పేరుడు లే. కాగా, బట్ట విలువ సాపేక్ష రూపం మిగిలిన ప్రతి సరుకు విలువరూపం నుండీ భిన్నమైనదే. “ ప్రతి సరుకు సాపేక్షవిలువ
విస్తరించిన రూపంలో వ్యక్తమయితే, దాన్ననుసరించి ప్రతి సరుకు సాపేక్ష విలువ రూపం అనంతమైన విలువ వ్యక్తీకరణల వరస అవుతుంది. ఆరూపం ప్రతి ఇతర సరుకుయొక్క సాపేక్ష విలువ రూపానికీ భిన్నమైనదిగా ఉంటుంది.” భిన్న మైన అంటే, గుణాత్మకంగా భిన్నమైన అని.
ప్రతి విడి సరుకు శరీర రూపం ఎన్నోఇతర సమానక రూపాల్లో ఒక ప్రత్యేక సమానక రూపం.కనుక, (అప్పటికి) ఉనికిలో వున్న సమానక రూపాలు పరిమిత సమానక రూపాలు మాత్రమే. వాటిలో ప్రతిదీ ఇతరవాటిలో దేన్నో మినహాయిస్తుంది. చేస్తుంది.-మార్క్స్


అలాగే,ప్రతి ప్రత్యేక సరుకు సమానకంలో ఉన్న నిర్దిష్ట, ప్రయోజనకర శ్రమ మానవ శ్రమ అగపడే ఒక ప్రత్యేక రూపమే. సమగ్ర మానవ శ్రమ రూపం కాదు.
కోటు లో కుట్టు రూపంలో,ఇనుం లో గని శ్రమ రూపంలో, గోధుమల్లో వ్యవసాయ శ్రమ రూపంలో మానవ శ్రమ అగపడుతుంది. కాని సమగ్ర రూపంలో మానవ శ్రమ అగపడదు.


కోటులో ఉన్న శ్రమ మానవ శ్రమ అగపడే సమగ్ర రూపం కాదు. అది కోటులని ఉత్పత్తిచేసే మానవ శ్రమ రకం మాత్రమే.
ప్రతి సరుకు సాపేక్ష విలువ ఈ విస్తృత రూపంలో వ్యక్తమయితే, ప్రతి సరుకు సాపేక్ష విలువ రూపమూ ముగింపులేని విలువ వ్యక్తీకరణల పరంపరగా ఉంటుంది- ప్రతి ఇతర సరుకు యొక్క సాపేక్ష విలువ రూపానికీ భిన్నంగా ఉంటుంది.


విస్తారిత సాపేక్ష విలువ రూపంలోని ఈ కొరవలు దానికి అనుగుణమైన సమానక రూపంలో ప్రతిఫలిస్తాయి. విస్తృత సాపేక్ష విలువ రూపంలో లోపాలు చెప్పాక, సమానక రూపంలోని లోపాలను చెబుతాడు.ఎన్నో సమానకాలు ఉంటాయి. వీటిని ప్రత్యేక సమానకాలు అంటాడు మార్క్స్.
ఇక్కడ ప్రతి విడి సరుకు భౌతిక రూపమూ అనేక ఇతర ప్రత్యేక సమానక రూపాల పక్కన ఒక ప్రత్యేక సమానక రూపం. కనుక మొత్తంమీద సమానక రూపాలు  విడివిడిగా/దేనికదిగా(fragmentary) వుంటాయి. ప్రతిదీ మిగిలిన వాటిని మినహాయించుకుంటుంది .  
అదే విధంగా ప్రతి సరుకు సమానకంలో ఉన్న నిర్దిష్ట ప్రయోజనకర శ్రమ, మానవ శ్రమ అగపడే ప్రత్యేక రూపమే గాని, మానవశ్రమ అగపడే పరిపూర్ణ రూపం కాదు.ఈ పరిపూర్ణ రూపం అగపడే పూర్తి రూపాన్ని ఆ ప్రత్యేక రూపాలు అగపడడాన్నిపూర్తిస్థాయిలో కలిగి ఉంటుంది. కాని ఆవిధంగా అగపడే ఏకీకృత రూపాన్ని కలిగి వుండదు.
అదే విధంగా ప్రతి సరుకు సమానకంలో ఉన్న నిర్దిష్ట ప్రయోజనకర శ్రమ, ఒక ప్రత్యేక రకం శ్రమగా కనిపిస్తుంది. అందువల్ల సాధారణ మానవ శ్రమకి పూర్తి (exhaustive) ప్రతినిధిగా ప్రదర్శిటం కాదు. సాధారణ మానవ శ్రమ అనేక, ప్రత్యేక,నిర్దిష్ట రూపాల మొత్తానికి సరిపడే వ్యక్తీకరణ పొందుతుంది. అయితే ఆసందర్భంలో, అంతులేని వరుసలో దాని వ్యక్తీకరణ ఎప్పటికి అసంపూర్ణమే, ఏకత్వం లేనిదే.


విస్తారిత సాపేక్ష విలువ రూపంలోని ఈ కొరవలు, దానికి అనుగుణమైన సమానక రూపంలో ప్రతిఫలిస్తాయి.
అలాగే,ప్రతి ప్రత్యేక సరుకు సమానకంలో ఉన్న నిర్దిష్ట, ప్రయోజనకర శ్రమ మానవ శ్రమ అగపడే ఒక ప్రత్యేక రూపమే. సమగ్ర మానవ శ్రమ రూపం కాదు.
కోటు లో కుట్టు రూపంలో,ఇనుం లో గని శ్రమ రూపంలో, గోధుమల్లో వ్యవసాయ శ్రమ రూపంలో మానవ శ్రమ అగపడుతుంది.కాని సమగ్ర రూపంలో మానవ శ్రమ అగపడదు.


ఏదేమైనా, విస్తారిత సాపేక్ష విలువ రూపం ప్రాధమిక వ్యక్తీకరణల మొత్తం తప్ప మరేమీ కాదు.
20 గజాల బట్ట=1 కోటు
20 గజాల బట్ట =10 పౌన్ల టీ
20 గజాల బట్ట =40  పౌన్ల కాఫీ
20 గజాల బట్ట =పావు గోధుమలు
ఒక్కొక్కదాన్ని విడివిడిగా చూస్తే, ఇవన్నీ  ప్రాధమిక వ్యక్తీకరణలు.
వీటిని ఇలా రాయవచ్చు:
20 గజాల బట్ట=1 కోటు
                =10 పౌన్ల టీ
                =40  పౌన్ల కాఫీ
                =పావు గోధుమలు
ఇలా కలిపి  చూస్తే విస్తృత విలువ వ్యక్తీకరణ.
వీటిలో ప్రతిదానికీ అనుగుణమైన తిరగ బడిన  సమీకరణ ఉంటుంది:
1 కోటు=20 గజాల బట్ట
10 పౌన్ల టీ =20 గజాల బట్ట
40  పౌన్ల కాఫీ =20 గజాల బట్ట
పావు గోధుమలు =20 గజాల బట్ట


ఒక వ్యక్తి తన బట్టని అనేక ఇతర సరుకులతో మారకం చేసుకుంటే, దాని విలువని  ఆ ఇతర సరుకుల వరస లో వ్యక్తం చేస్తాడు.దీన్ని అనుసరించి, ఆ బట్టతో మారకం వేసిన యితర సరుకుల సొంతదార్లు వాళ్ళ సరుకుల విలువని ఒకే సరుకు లో వ్యక్తం చేస్తారు- అది బట్ట. మనం అలా ఆవరసని తిరగ దిప్పామంటే ఇదుగో ఈ సాధారణ విలువ రూపం ఏర్పడుతుంది.


III) .సాధారణ విలువ రూపం
                
§1. మారిన సాపేక్ష విలువ ఆకృతి(shape).

సాపేక్ష విలువ రూపం ఆకారం ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది. అన్ని సరుకులు తమతమ  విలువని
(1)ఒకే ఒక్క సరుకులో వ్యక్తపరుచు కుంటాయి
(2) ఐక్యంగా /కలిసికట్టుగా అంటే, ఒకే ఇతర సరుకులో
వ్యక్తపరుచు కుంటాయి.
ఈ విలువ రూపం ప్రాధమిక మైనదీ,అన్నిటికీ ఒకటే అయినదీ, అందువల్ల సాధారణ రూపం.
“వాటి విలువరూపం ప్రాధమిక మైనదీ , ఉమ్మడి  అయినదీ అంటే, సాధారణం అయినది.” –appendix
ప్రాధమిక రూపం కంటే విస్తృత విలువ రూపం ఒక సరుకు విలువని దాని ఉపయోగపు విలువ నించి మరింతగా వేరు పరుస్తుంది – కారణం కోటు విలువ కోటు భౌతిక రూపానికి భిన్నంగా, అన్ని ఆకృతుల్లో నూ చూపించబడింది. అది బట్టకూ,ఇనుముకూ, తేయాకుకీ,ఒకటేమిటి మిగిలిన అన్ని ఇతర సరుకులకూ సమం చేయబడ్డది. అయితే తనకు తాను  తప్ప. అంటే కోటు కోటుకి తప్ప. ఎందుకంటే  కోటు=కోటు అనేది విలువ వ్యక్తికరణేకాదు  అని ముందే    చూశాం. వేరొక వైపు,అన్నిటికీ ఉమ్మడియైన విలువయొక్క ఏ సాధారణ వ్యక్తీకరణ అయినా  మినహాయించ బడింది.
ఎందుకంటే,ప్రతిసరుకు విలువ సమీకరణంలోనూ, అన్ని ఇతర సరుకులూ  ఇప్పుడు సమానకాలుగా మాత్రమే  కనబడతాయి. అయితే A విలువ ప్రతి ఇతర వస్తువుతోనూ సమానం చేయబడుతుంది, కాబట్టి అన్నిటికీ ఉమ్మడిదైన సాధారణ విలువ వ్యక్తీకరణ ఉండదు.


విలువ వ్యక్తీకరణ కోసం  వేరుపరచిన ఏకైక సరుకు బట్ట. దానికి  సమానమైనవిగా వాటి విలువలకి ప్రతినిధులుగా వుంటాయి. ఇప్పుడు ప్రతి సరుకు విలువా, బట్టతో సమపరచడం ద్వారా ,తన సొంత ఉపయోగపు విలువ నించి  వేరుపడడమే కాకుండా, అన్ని ఇతర ఉపయోగపువిలువల నించి భిన్నమవుతుంది. అందువల్ల ప్రతి సరుకు విలువా అన్ని సరుకులకూ ఉమ్మడి అయినదిగా వ్యక్తమవుతుంది. ఈ రూపంలో సరుకులు మొట్టమొదటిసారి విలువలుగా సంబంధంలోకి వస్తాయి, మారకం విలువలుగా అగపడతాయి.
ఇంతకుముందు రెండు రూపాలూ ఒక్కో సరుకు విలువని మరొక్క రకం సరుకులోనో  లేక అలాంటి సరుకుల వరసలోనో వ్యక్తం చేస్తుంది. ఈ రెండు సందర్భాలలోనూ ప్రతిసరుకు ప్రత్యేక కర్తవ్యం(special business) ఏమంటే,  తన విలువకి వ్యక్తీకరణ కనుక్కోవడమే, ఈపనిని అది ఇతర (సరుకుల) సహాయం లేకుండానే చేస్తుంది. ఈ ఇతర సరుకులు మొదటిదానికి సంబంధించి సమానకాల passive పాత్ర పోషిస్తాయి.
విలువ సాధారణ రూపం అన్ని సరుకుల సంయుక్త చర్య ఫలితంగా ఏర్పడుతుంది. దానినుండి మాత్రమె ఏర్పడుతుంది. ఒకసరుకు తన విలువ యొక్క సాధారణ రూపం ఎలా పొందుతుంది?అన్ని సరుకులూ, దానితోపాటు, వాటివిలువల్ని ఒకే సమానకంలో వ్యక్తం చెయ్యడం ద్వారా.  ప్రతి కొత్త సరుకూ ఇలాగే చేసితీరాలి. సరుకులు విలువలుగా వుండడం సామాజికం. కనుక ఈ సామాజిక మనుగడ వాటి సామాజిక సంబంధాల మొత్తం ద్వారా మాత్రమే వ్యక్తం కాగలవు. తత్ఫలితంగా  వాటి విలువ రూపం సమాజం ఆమోదించిన రూపమై ఉండాలి.


సాధారణ రూపం డబ్బురూపానికి బాట వేస్తుంది. అన్ని సరుకుల విలువలూ ఒకే సరుకు రీత్యా వ్యక్తమవుతాయి. సరుకులు మారకపు విలువలుగా తొలిసారి కనబడతాయి.
ఇప్పుడు బట్ట అన్ని ఇతర రకాల సరుకులకూ ఉమ్మడి,సాధారణ విలువ ఆకృతిగా లెక్కకొస్తుంది.”కనుక ఈ విలువ రూపంలో అది సామాజిక సాధారణ రూపం పొందుతుంది.”
“ఈ సాధారణ స్వభావం ద్వారానే విలువ రూపం విలువ భావనకి సరిపోతుంది (correspond)”. విలువ రూపం సరుకులు ఒకదానికొకటి ఏ తారతమ్యమూ లేని, ఏకరీతి మానవ శ్రమ యొక్క జెల్లీ గా కనబడే రూపంగా ఉండి  తీరాలి.
ఇది ఇప్పుడు సాధ్యమయింది. ఎందుకంటే, అవన్నీ ఇప్పుడు ఏకరూప శ్రమ(same) వ్యక్తీకరణలు. ఆవిధంగా అవన్నీవిలువలుగా  గుణాత్మకంగా సమానమైనవి.అంతేకాదు,విలువలుగా వాటి పరిమాణాలు పోల్చవచ్చు. వాటి విలువల పరిమాణాల్ని ఒకే దాంట్లో,బట్టలో వ్యక్తపరచడం ద్వారా, ఆ పరిమాణాల్ని ఒకదానితో మరొకదాన్నిసరి పోల్చవచ్చు.   
ఉదాహరణకి 10 పౌన్ల టీ =20 గజాల బట్ట ,
                                      =40 పౌన్ల కాఫీ
                                      =20 గజాల బట్ట.


కాబట్టి  10 పౌన్ల టీ =40 పౌన్ల కాఫీ


ఒక పౌను టీ లో ఉన్న విలువ సారంలో, శ్రమలో  నాలుగో వంతు మాత్రమే  ఒక పౌను కాఫీలో ఉంటుంది. విలువ సాధారణ రూపం అన్నిసరుకుల్నీ ఇముడ్చుకుంటుంది. సమానకం పాత్ర పోషించేందుకు మిగిలిన సరుకుల నుండి తప్పించిన సరుకుని-ఇక్కడ బట్ట-సార్వత్రిక సమానకంగా చేస్తుంది. –కాపిటల్ 1 .72
ఇప్పుడు బట్ట శరీర రూపం అన్ని సరుకులూ ఉమ్మడిగా పొందే రూపం. కాబట్టి బట్ట అన్నిసరుకులతోనూ నేరుగా మారగలిగేది అవుతుంది. బట్ట ప్రతీ  తరహా మానవ శ్రమా  అగపడే ఆకారం అవుతుంది. ఒక ప్రత్యెక వస్తువుని, బట్టను తయారుచేసే కొందరు ప్రైవేటు వ్యక్తుల నేతశ్రమ తత్ఫలితంగా సామాజిక స్వభావాన్ని, (అంటే)అన్ని ఇతర రకాల శ్రమలతో సమానం అనే లక్షణాన్ని సంతరించుకుంటుంది. సాధారణ విలువ రూపం శ్రమ ఉత్పాదితాలన్నీ ఏ తేడా లేని మానవ శ్రమ పేరుడు లు మాత్రమే అని చెబుతుంది.

§2.మారిన  సమానకం రూపం ఆకృతి.

ప్రత్యేక సమానక రూపం సాధారణ విలువ రూపంలో ఇంకొంత అభివృధ్ధయింది. సమానకం రూపంలో ఉన్న సరుకు ఇప్పుడు సాధారణ సమానకం అయింది. అన్ని ఇతర సరుకుల విలువ రూపంగా లెక్కకురావడం ద్వారా,బట్ట భౌతికరూపం అన్ని సరుకులతో మారగల  రూపం.అందువల్ల, బట్ట భౌతిక రూపం అదే సమయంలో దాని సాధారణ సామానక రూపం.                                                                                                                         ఇతర సరుకులు అత్యంత భిన్న రకాల శ్రమల ఉత్పాదితాలు అయినప్పటికీ, ఆసరుకులన్నిటికి బట్ట వాటిలో ఉన్న శ్రమలకు అగపడే రూపంగా ఉంటుంది. ఒకే రకమైన, ఏ తేడా లేని శ్రమ మూర్తిగా లెక్కకొస్తుంది. నిర్దిష్ట శ్రమ అయిన నేత అనిర్దిష్టశ్రమగా, అంటే మానవ శ్రమ శక్తి వ్యయంగా  లెక్కకొస్తుంది.
కచ్చితంగా ఇందువల్లే, బట్టలో వున్న ప్రైవేట్ శ్రమ సాధారణ  సామాజిక రూపంలో ఉన్న శ్రమగా, అన్ని ఇతర శ్రమలతో సమానమైన రూపంలో ఉన్న శ్రమగా   లెక్కకొస్తుంది.

§3. సాపేక్షవిలువ రూపం,సమానక రూపాల పరస్పరాధారిత అభివృద్ధి

సాపేక్ష విలువ రూపం అభివృద్ధి స్థాయికి అనుగుణంగా సమానకరూపం అభివృద్ధి స్థాయి ఉంటుంది. అయితే సమానకరూపం అభివృద్ధి కేవలం సాపేక్ష విలువ రూపం అభివృద్ధియొక్క వ్యక్తీకరణ, ఫలితం మాత్రమే. అని జాగ్రత్తగా గుర్తుబెట్టుకోవాలి. చొరవ సాపేక్ష విలువ రూపం వైపునించి వుంటుంది.
సరళ సాపేక్ష విలువ రూపం  ఒక సరుకు విలువని మరొక సరుకు, ఒకే ఒక సరుకు లో తెలుపుతుంది- ఆసరుకు ఏదయినా అవచ్చు. ఆవిధంగా సరుకు తన భౌతిక రూపానికి భిన్నమైన విలువ రూపాన్ని పొందుతుంది. దాని సమానకం కూడా ఏకైక సమానకం రూపాన్ని పొందుతుంది.
ఒక సరుకు విస్తృత సాపేక్ష విలువ రూపం   ఆసరుకు విలువని మిగిలిన అన్ని సరుకుల్లో చెబుతుంది. అందువల్ల, సమానక రూపం అనేక ప్రత్యేక సమానకాల రూపం లేక  ప్రత్యేక సమానక రూపం తీసుకుంటుంది.
అంతిమంగా,సమస్త సరుకులూ దానికీ ఏకీకృత, సాధారణ,సాపేక్ష విలువ రూపం ఇచ్చుకుంటాయి-తన నించి ఒకే ఒక రకం సరుకుని, ఇతర రకాల సరుకులన్నిటి  విలువని వ్యక్తపరిచే సరుకుని, వేరు పరచడం ద్వారా. అలా చెయ్యడంద్వారా,వేరుచేసిన సరుకు సాధారణ సమానకం అవుతుంది.లేక సమానక రూపం సాధారణ సమానక రూపం అవుతుంది.

§4. సాపేక్ష విలువ రూపం  సమానక రూపాల ద్రువత్వ అభివృద్ధి.
విలువ రూపం అభివృద్ధితో పాటే, ఈ రెండురూపాల మధ్య ఉన్న  ధ్రువ వ్యతిరేకత (Polar Antagonism) వృద్ధవుతుంది. xA =yB అన్నదాంట్లో, వ్యతిరేకత వున్నది, కాని ద్రవ స్థితిలో(చలించే ) వున్నది. ఈ  సమీకరణాన్ని yB = xA గా  తిరగ దిప్పవచ్చు.
xA = yB = zC=మొదలయిన్ వాటిలో ఒక్కొకసారి ఒకే ఒక్క సరుకు మాత్రమే  తన సాపేక్ష విలువను విస్తరించగలదు. ఈ  సమీకరణ ని సాధారణ విలువ రూపంలోకి రాకుండా తిరగ తిప్ప లేం. తిరగ తిప్పామా, అది ఇక విస్తృతరూపం కాకుండా పోతుంది. సాధారణ రూపం అవుతుంది.


సాధారణ సాపేక్ష విలువ రూపంలో,  A కి ఉన్న  అన్ని సరుకులతో నేరుగా మారగల స్వభావానికీ  , నేరుగా మార లేని మిగిలిన అన్ని సరుకుల స్వభావానికీ ధ్రువ వ్యతిరేకత వున్నది.
సార్వత్రిక సమానకం ఏ సరుకయినా కావచ్చు. ఏదైనా ఒక ప్రత్యేక సరుకు సార్వత్రిక సమానకంగా సమాజ గుర్తింపు  పొందినప్పుడు, ఆసరుకే డబ్బు. అంతిమంగా ఈ ఆమోదం బంగారానికి లభించింది.  
సాపేక్ష విలువ రూపం  సమానక రూపాల ద్రువత్వ వ్యతిరేకత, లేక విడదీయ రాని పరస్పర అంతస్సంబంధమూ  అదే సమయంలో వాటి నిరంతరాయ మినహాయింపు (exclusion)- ఈ  క్రింది విషయాల్ని చెబుతాయి:
1.మరొక సరుకు వ్యతిరేక రూపంలో లేనిదే, ఏ సరుకూ ఒక రూపంలో ఉండజాలదు.
2.ఒక సరుకు ఒక రూపంలో ఉంటే, అదే సమీకరణలో / విలువ వ్యక్తీకరణ లో అదే సమయంలో మరొక రూపంలో ఉండజాలదు.
విలువ రూపం అబివృద్దికి అనుగుణంగా విలువ వ్యక్తీకరణలోని  ఈ ధ్రువ విరుద్ధత  అభివృద్ధి చెందుతుంది, దృఢ  పడుతుంది.
మొదటి రూపంలో అవి ఒకదాన్నొకటి మినహాయించుకుంటాయి.  సమీకరణాన్ని ముందునించి చదువుతామా వెనకనించా అనే దాన్ని బట్టి, అంచులలో ఉన్న  బట్టా  కోటూ  లాంటి సరుకు ఇప్పుడు సాపేక్ష రూపంలోఉంటే , మరొకసారి సమానక రూపంలో ఉంటుంది.
20 గజాల బట్ట=1 కోటు – ఇక్కడ బట్ట సాపేక్ష రూపంలోనూ , కోటు సమానకం రూపంలోనూ ఉన్నాయి.
ఇ సమీకరణాన్ని వెనకనించి చూస్తే 1 కోటు=20 గజాల బట్ట అవుతుంది. ఇక్కడ సరుకుల స్థానాలు తారుమారవుతాయి. కోటు సాపేక్ష రూపం తీసుకుంటుంది. బట్ట సమానకం పాత్ర పోషిస్తుంది.
రెండో రూపంలో ఒక రకం సరుకు ఒకేసారి తన సాపేక్ష విలువని పూర్తిగా విస్తరించగలదు. అంటే, అది ఎందుకు విస్తృత సాపేక్ష విలువ రూపం కలిగి వున్నది?ఎందుకంటే,దానికి  సంబంధించి  మిగిలిన సరుకులన్నీ సమానక రూపంలో ఉన్నాయి గనక.
చివరగా మూడో రూపంలో సమస్త సరుకులూ సాధారణ సామాజిక సాపేక్ష విలువ రూపంలో ఉన్నాయి-దానికీ సంబంధించిన సరుకులన్నీ సమానక రూపా న్నించి తొలగించబడ్డ మేరకు. విపర్యయంగా,సాధారణ సమానకంరూపంలో  వున్న సరుకు సాధారణ సాపేక్ష రూపంలో వున్న సరుకుల నించి వేరవుతుంది. బట్ట- సాధారణ సమానక రూపం  లోవున్న ఏ వస్తువైనా అదే సమయంలో సాధారణ సాపేక్ష విలువ రూపంలో పాల్గొనాల్సి వస్తే, తనకు తానే సమానకంగా వుండాల్సి వస్తుంది. అప్పుడు  
20 గజాల బట్ట = 20 గజాల బట్ట అనేదోస్తుంది. ఇదొక పునరుక్తి మాత్రమే .ఇందులో విలువా వ్యక్తం కాదు, విలువ పరిమాణమూ వ్యక్తం కాదు. సాధారణ సమానకం యొక్క విలువ వ్యక్తం కావాలంటే, ఈ మూడో రూపాన్ని తిరగ దిప్పాలి. ఇది ఆతర సరుకులతో ఉమ్మడిగా సాపేక్ష రూపాన్ని కలిగి వుండదు; దాని విలువ సాపేక్షంగా ఇతర అనంతమైన సరుకుల భౌతిక రూపాల్లో వ్యక్తం చేసుకుంటుంది. ఆవిధంగా సరుకు  విస్తృత సాపేక్ష విలువ రూపం (రెండో రూపం)ఇప్పుడు సాధారణ సమానకం గా వ్యవహరించే సరుకుయొక్క విశిష్ట సాపేక్ష విలువ రూపంగా కనబడుతుంది.
సాధారణ సమానక రూపం  ఒక విలువ రూపం. అందువల్ల, అది ఏ సరుకుకైనా సంబంధించినదే. కాని ఎప్పుడయినా సరే, అన్ని ఇతర సరుకులనించి వైదొలగడం/వేరుపడడం  ద్వారానే.
ఒకటో రూపం నించి రెండో రూపానికీ,  రెండో దాన్నించి  మూడో రూపానికీ పరిణామంలో సారభూతమైన మార్పులు సంభవించాయి.ఇందుకు భిన్నంగా మూడో దాంట్లో సమానకం గా ఉన్న బట్ట స్థానంలో  నాలుగో  రూపంలో బంగారం రావడం మినహా మార్పేమీ లేదు. బట్ట స్థానంలో బంగారం సమానకంగా వుంటుంది. అంతే. అన్ని సరుకుల లాగే బంగారం కూడా సమానకంగా, ప్రత్యేక సమానకంగా వ్యవహరించినదే. క్రమక్రమంగా కొద్దిస్తాయిలోనో,పెద్దస్తాయిలోనో సాధారణ సమానకంగా ఉన్నదే. ఈ  స్థానాన్ని బంగారం ఒక్కటే సొంతం చేసుకోగానే అది డబ్బు సరుకు అవుతుంది. దాంతో సాధారణ విలువ రూపం డబ్బు రూపంలోకి మారుతుంది.

IV. డబ్బు రూపం.

ఒక సరుకు (బట్ట ) విలువ డబ్బు గా వున్న సరుకులో(బంగారం) వ్యక్తీకరణే ధర రూపం.
కాబట్టి బట్ట ధర రూపం :
20 గజాల బట్ట = 2 ఔన్సుల బంగారం
లేక రెండు ఔన్సుల బంగారానికి రెండు పౌండ్ స్టెర్లింగ్ లు కరెన్సీ పేరు అయితే
20 గజాల బట్ట = 2 పౌండ్ స్టెర్లింగ్ లు
రేఖా చిత్రంగా చూస్తే, సరుకు విలువ డబ్బురూపంలో:

ప్రాధమిక విలువ రూపమే డబ్బు రూపం యొక్క రహస్యం.
డబ్బు రూపం దానికదిగా ఏ చిక్కూ పెట్టదు.సాధారణ సమానక రూపం నించి చూస్తే, ఈ రూపం బంగారం వంటి ఏదో ఒకప్రత్యేక  సరుకుకి అంటి పెట్టుకుంటుందని గ్రహించడానికి జుట్టు పీక్కోవాల్సిన /బుర్రబద్దలు కొట్టు కోవాల్సిన పనేమీ లేదు. సాధారణ సమానక రూపం  దాని స్వభావ రీత్యానే, అన్ని ఇతర సరుకుల నుండీ ఒక సరుకు తొలగించ బడాలి. ఇక ఈ తొలగింపు  సామాజిక ఆమోదాన్నీ , స్తిరత్వాన్నీపొందడమే నని తేలికగా తెలుసుకోవచ్చు.
“డబ్బు రూపం భావనలో కష్టమంతా సాధారణ సమానకాన్ని (మూడో రూపాన్ని ) అర్ధం చేసుకోవడం లోనే వున్నది.”  ఏమయినా, మూడో రూపం రెండో రూపంగా దానికదే resolve అవుతుంది. ఆ రెండో రూపాన్ని ఏర్పరిచే ది  మొదటి రూపమే:
20 గజాల బట్ట = 1 కోటు
లేక  x  సరుకు A = Y సరుకు B
ఇక ఇప్పుడు, ఉపయోగపు విలువ అంటే ఏమిటో, మారకం విలువ అంటే ఏమిటో తెలిస్తే, ఈ మొదటి రూపం ఏ శ్రమ ఉత్పాదితానికైనా ప్రాతినిధ్యం వహించే సరళమైన, ఏమాత్రం  అభివృద్ధి చెందని సరళి అని మనకు తెలుస్తుంది. అదే సమయంలో 20 గజాల బట్ట = 1 కోటు అనే ఈ సరళ రూపం  20 గజాల బట్ట = 2 పౌండ్ స్టెర్లింగ్ లు అనే డబ్బు రూపానికి మారడంలో ఉన్న వరస క్రమాన్ని సులువుగా గ్రహిస్తాం.
సాధారణ రూపం నించీ డబ్బు రూపానికి పరిణామం.
ఇప్పుడు బంగారం డబ్బు. అంతకు ముందు అది మామూలు సరుకు అయి ఉన్నందువల్లనే అది డబ్బు అయింది. అది ప్రాధమిక విలువ రూపంలో అటో ఇటో  ఒక వైపు వుంది. అలాగే విస్తృత విలువ రూపంలో కూడా ఆవైపో ఈ వైపో అంటే సాపేక్ష విలువ రూపంలోనో, సమానకం రూపం లోనో వుంది. అలాగే సాధారణ రూపం లో కూడా ఉండేది. క్రమంగా అది సార్వత్రిక సమానకంగా విభిన్న పరిమితుల్లో ఉపకరించింది.  ఆస్థానాన్ని తానొక్కటే సొంతం చేసుకుంది.ఇప్పుడు సార్వత్రిక సమానకం రూపం స్థానం లో బంగారం మాత్రమే కనబడుతుంది.అన్ని సరుకుల విలువ డబ్బు రూపం అయిన బంగారంలోనే వ్యక్తమవుతుంది. ఒక సరుకు విలువ డబ్బులో చెబితే అదే ధర. 20 గజాల బట్ట=2 ఔన్సుల  బంగారం  అనేది బట్ట యొక్క ధర రూపం. ఆబంగారాన్ని నాణెం గా చేస్తే 20 గజాల బట్ట=£2 .అదయినా ఇదయినా బట్ట యొక్క ధర రూపమే.
చరిత్రలో స్థల  కాల భేదాల్ని బట్టి భిన్న సరుకులు సార్వత్రిక సమానకాలుగా వ్యవహరించాయి.అంతిమంగా వాటినన్నిటినీ పక్కకు నెట్టి సమాజం  బంగారాన్నిమాత్రమే సార్వత్రిక సమానకంగా ఆమోదించింది. కనుకనే  బంగారం డబ్బు కాగలిగింది.మార్క్స్ కాపిటల్ అంతటా బంగారమే డబ్బు అనుకుని (assumption)రాశాడు.


డబ్బురూపం భావన (concept) ఏర్పరచు కోవాలంటే ఉన్న  చిక్కంతా, సార్వత్రిక సమానకాన్ని స్పష్టంగా గ్రహించడంలో ఉంది. అలాగే ఈ రూపం సాధారణ రూపానికి అవసరమైన  విపర్యయం అని తెలుసుకోవడం లోనూ (ఆచిక్కు)  ఉంది. సాధారణ రూపం విస్తృత విలువ రూపం నించి వచ్చేదే (deducible). విస్తృత రూపాన్ని ఏర్పరచే భాగాలు ప్రాధమిక రూపంలోవే. 20 గజాల బట్ట= 1 కోటు  లేక x సరుకు A =y సరుకు B. అందువల్ల ప్రాధమిక విలువ రూపమే డబ్బు రూపానికి క్రిమిరూపం అని మార్క్స్   రుజువుచేశాడు. దాని అంతర్గత వైరుధ్యాల మూలంగా ఈ రూపం అత్యున్నతమైన డబ్బురూపం లోకి ఎలా పరివర్తన చెందిందో వివరించాడు.


మారక ప్రక్రియలో వేర్వేరు శ్రమ ఉత్పాదితాలు ఒకదానికొకటి సమపరచ బడతాయి. ఆవిధంగా ఆచరణద్వారా   సరుకులుగా మారతాయి. ఈ మారకాల ప్రక్రియలో అనివార్యంగా/ఆవశ్యకంగా డబ్బు రూపొందుతుంది. మారకాల చారిత్రిక అభివృద్ధీ, విస్తృతీ, సరుకుల్లో నిద్రాణంగా /స్తబ్దంగా ఉన్నఉపయోగపు విలువకూ , విలువకూ మధ్య వున్న వైరుధ్యాన్ని వృద్ధి పరుస్తుంది. వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ వైరుధ్యానికి బాహ్య వ్యక్తీకరణ అవసరమవుతుంది. ఆ  అవసరమే విలువకు  స్వతంత్ర రూపాన్ని  ఏర్పాటు చేసేందుకు  వత్తిడి పెడుతుంది. సరుకుల్ని సరుకులుగానూ, డబ్బుగానూ పూర్తిగా విడగోట్టేదాకా విశ్రాంతి చెందదు. ఉత్పాదితాలు సరుకులుగా మారడం ఎంతవేగంగా జరుగుతుందో, అంతే వేగంగా ఒక ప్రత్యేక సరుకు డబ్బుగా మారుతుంది.- మార్క్స్ కాపిటల్ 1.90

1, మే 2017, సోమవారం

5.విలువ రూపం లేక మారకం విలువ

5.విలువ రూపం లేక మారకం విలువ

“ప్రేమవల్ల  పిచ్చెక్కిన వాళ్ళ కంటే, డబ్బు స్వభావం గురించిన ఆలోచన వల్ల వెర్రివాళ్లయిన వాళ్ళే ఎక్కువమంది” అని విలియం గ్లాడ్ స్టన్(1809-1898) బ్రిటిష్  పార్లమెంట్ లో అన్నాడు – మార్క్స్   'ఏ కంట్రిబ్యూషన్ టు ది  క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ' .64
డబ్బు అనేదేమిటి? డబ్బిస్తే ఏ వస్తువయినా ఎందుకు వస్తున్నది? మిగిలిన ఏ వస్తువుకూ  ఆశక్తి ఎందుకు లేదు? ఈ ప్రశ్నల పట్ల ఆసక్తి చూపిన వారు ఎందరో ఉన్నారు.
ఒక ఇల్లు = 5 మంచాలు అనేదానికీ
ఒక ఇల్లు = ఫలానింత డబ్బు అనేదానికీ తేడావుండదు అన్నాడు అరిస్టోటిల్.
ఒక సరుకు మరొక సరుకుతో మారినా, డబ్బుతో మారినా ఒకటే. మొదటిది ఆదిమరూపం రెండోది పూర్తిగా అభివృద్ధి  చెందిన రూపం. డబ్బు రూపం అనేది సరళరూపం యొక్క అభివృద్ధి చెందిన రూపమే అని అరిస్టోటిల్ చెప్పాడు.
అయినా గాని మానవ మేధ  2 వేల ఏళ్లకు పైగా ప్రయత్నించినా దాని మూలాన్ని పసిగట్టలేక పోయింది.-తొలి జర్మన్ కూర్పుకి ముందుమాట. కాపిటల్ 1.19
డబ్బు విశ్లేషణలో ముఖ్యమయిన ఇబ్బంది సరుకే డబ్బు పుట్టుకకి మూలం అని తెలుసుకోవడంలో వుంది. దీన్ని అధిగమించారు. ఇక మిగిలింది: డబ్బుకి ప్రత్యేకమైన రూపాన్ని స్పష్టంగా గ్రహించడమే సమస్య.-క్రిటిక్.64
17 వ శతాబ్దం చివరి  దశాబ్దాలలో డబ్బుకూడా ఒక సరుకే అని తేటతెల్లమయింది. అయితే విశ్లేషణలో ఇది శిశు దశ మాత్రమే. ఇబ్బంది డబ్బు కూడా ఒక సరుకే అని తెలుసు కోవడంలో లేదు. ఒక సరుకు ఎలా, ఎందుకు,దేనిద్వారా డబ్బయిందో కనిపెట్టడంలో ఇబ్బందంతా వుంది.- కాపిటల్ 1.95
‘ ఈ విషయం పుస్తకానికే నిర్ణయాత్మకమైనది.ఇంతదాకా ఆర్ధికవేత్తలు ఎంతో సింపుల్ అయిన పాయింట్ ని మిస్ అయ్యారు.ఆ పాయింట్ ఏమంటే,  20 గజాల బట్ట =  1 కోటు అనేది 20 గజాల బట్ట =2 పౌన్లు అనేదానికి అభివృద్ధి చెందని ప్రాతిపదిక మాత్రమే......sel cor .177
విలువని మారకం విలువలోకి మార్చే విలువరూపాన్ని సాంప్రదాయ అర్ధశాస్త్రం కనుక్కోలేక పోయింది - కాపిటల్ 1. 85  బూర్జువా ఆర్ధికవేత్తలు కనుక్కునే ప్రయత్నం చెయ్యనే లేదు. అందుకు పూనుకున్నాడు మార్క్స్:
“ ఇక్కడ మనకొక పని పడింది. డబ్బు రూపం పుట్టుకని ఆరా తీసే పని. సరుకుల విలువ సంబంధంలో ఇమిడి వున్నవిలువ వ్యక్తీకరణ ని అగపడీ అగపడని సింపుల్ అవుట్ లైన్ నించీ జిగేల్మనే డబ్బురూపందాకా ఆరా తీసే పని. ఈ పని చెయ్యడం ద్వారా,అదేసమయంలో డబ్బు మనముందుంచిన చిక్కు సమస్యని (riddle) ని పరిష్కరించిన వాళ్ళమవుతాం”-కాపిటల్ 1. 54
డబ్బిస్తే ఏ వస్తువయినా ఎందుకు వస్తున్నది? మిగిలిన ఏ వస్తువుకూ  ఆశక్తి ఎందుకు లేదు? అనేదే ఆసమస్య.
సరుకు యొక్క  డబ్బు రూపం ప్రాధమిక విలువ రూపం యొక్క అభివృద్ధి చెందిన రూపమే.
ఒక సరుకు విలువని  ఏదో ఒకే ఒక్క సరుకులో చెప్పడమే ప్రాధమిక విలువ రూపం..
1 కొడవలి =1 ఈతచాప
 1 గరిస=2 బాణాలు                  

మొదటి దాంట్లో కొడవలి విలువ ఈతచాప లో వ్యక్తమయితే, రెండో దాంట్లో గరిస విలువ బాణాల్లో  వ్యక్తమయింది.
ఈ మారక సంబంధంలో అటొక  సరుకు  ఇటొక సరుకు మాత్రమే ఉన్నాయి. ఇంతకన్నా సరళం  అయిన విలువ సంబంధం  ఉండదు. కనక ఇదే సరళ విలువ రూపం. ఇదే ప్రాధమిక మైనది.
డబ్బులో చెప్పేటప్పుడు అలాచేప్పం. దేనికదిగా చెబుతాం.
కొడవలి =రూ.200,   ఈతచాప = రూ.200,    గరిస =రూ. 500,  బాణం = రూ.250.
ఇది విలువ డబ్బు రూపం.
20 గజాల బట్ట = 1 కోటు అనేది కూడా సరళ విలువ రూపమే.ఇదొక సమీకరణం.
కనుక మొత్తం  విలువ రూపం యొక్క ఆంతర్యం/ రహస్యం ఈ సరళ  విలువ రూపం లోనే ఉండి తీరాలి. కనుక ఇబ్బంది అంతా దీని విశ్లేషణ లోనే ఉంటుంది. కనుకనే మార్క్స్ దీని వివరణకి  14 పేజీలిచ్చాడు. మిగిలిన 3 రూపాలనీ 8 పేజీల్లోనే  ముగించాడు. సరళ విలువ రూపంతో మొదలై డబ్బు రూపానికి అభివృద్ధి చెందింది.
1.ప్రాధమిక విలువ రూపం లేక యాదృచ్చిక విలువ రూపం
2.సంపూర్ణ విస్తృత విలువ రూపం లేక సంపూర్ణ విలువ రూపం
3.సాధారణ విలువ రూపం
4.డబ్బు రూపం.

ప్రాధమిక విలువ రూపం లేక యాదృచ్చిక విలువ రూపం

ఒక సరుకు విలువని  ఏదో ఒకే ఒక్క సరుకులో చెప్పడమే ప్రాధమిక విలువ రూపం..
20 గజాల బట్ట = 1 కోటు అనేది కూడా సరళ విలువ రూపమే. ఇదొక సమీకరణం.
ఒక  సమీకరణం ఏం చెబుతుంది?
రెండు వస్తువులు  సమానం అని చెబుతుంది. రెంటికీ మధ్య = ఉంటుంది.= కి ఎడమవైపుని Left Hand Side(LHS) అనీ,   = కి కుడివైపుని Right Hand Side (RHS )అనీ అంటారు.= కి ఎడమవైపున్నది కుడివైపున్నదానికి సమానం అని తెలుపుతుంది.
పై సమీకరణంలో  = కి ఎడమవైపున  20 గజాల బట్ట ఉంది.  కుడివైపు 1 కోటు ఉంది. 20 గజాల బట్ట  1 కోటు తో సమానం అని చెబుతుంది.ఇక్కడ పోలిక విలువలో. కనక ఇది విలువ సమీకరణం.
ఈ విలువ సమీకరణంలో ఇరువైపులా ఉన్నవి విలువ రూపాలే. అయితే ఒకటి విలువయొక్క  సాపేక్ష రూపం రెండోది విలువ యొక్క సమానక రూపం.
మార్క్స్ తన విలువ సమీకరణం ఎడవైపున్నదాన్ని రెలెటివ్ పోల్(సాపేక్ష ధ్రువం) అనీ కుడివైపుదాన్ని ఈక్వివలెంట్ పోల్ (సమానక ధ్రువం) అనీ అంటాడు. రెండు ధ్రువాల్లో రెండు వస్తువులు ఉంటాయి.
సాపేక్షద్రువంలో ఉన్న సరుకు తనవిలువను తెలియజేస్తుంది.
సమానక ధ్రువంలో వున్న సరుకు ఆవిలువకు ప్రతినిధిగా వుంటుంది.
పై ఉదాహరణలో  బట్ట సాపేక్షద్రువంలో వుంది. కోటు సమానక ద్రువంలో ఉంది. రెండూ విలువ రూపాలే. బట్ట సాపేక్ష రూపంలో వుంటే, కోటు సమానకం రూపంలో వుంది.
సాపేక్షంగా అంటే, మరొకదానితో పోల్చగా అని . 20గజాల  బట్ట విలువ కోటు విలువంత అని పోలికలో సాపేక్షంగా చెప్పినట్లవుతుంది..
ఈ సరళ విలువ వ్యక్తీకరణలో రెండు రకాల సరుకులున్నాయి - బట్టా, కోటూ.
బట్ట తన విలువని తెలుపుకుంటుంది  – కోటు శరీరంలో. తన విలువని మరొక సరుకులో  వ్యక్తం చేసుకునే సరుకు సాపేక్ష విలువ రూపం లో ఉంటుంది.
దీనికి భిన్నంగా రెండో సరుకు కోటు, బట్ట విలువ వ్యక్తమయ్యే వస్తువుగా ఉంటుంది. ఇది బట్టకి  సమానకంగా ఉంటుంది, అంటే సమానక రూపం లో ఉంటుంది.
మన ఉదాహరణ (20 గజాల బట్ట = 1 కోటు) లో బట్ట సాపేక్ష విలువ రూపంలో ఉంటే, కోటు సమానకం రూపంలో వుందన్నమాట.
లోతుగా విశ్లేషించకపోయినా విలువ వ్యక్తీకరణలో  ఈ క్రింది విషయాలు ఇప్పటికే స్పష్టం:
ఈ రెండు  రూపాలూ - సాపేక్ష విలువ రూపమూ, సమానక రూపమూ- దేనికదిగా విడివిడిగా ఉండవు.
ఒకదానితో ఒకటి  బంధంలో వున్నవి. విడదీయ వీలు కానివి. రెండూభిన్నమైనవే కాని  ఒకే వ్యక్తీకరణకు చెందినవి. రెండూ విలువ సంబంధంలో ముడిబడి వుంటేనే విలువ వ్యక్తీకరణ సాధ్యమవుతుంది. ఇది స్పష్టమే.
మరొకవైపు, ఇవి రెండూపరస్పర విరుద్ధమైన, ఒకదాన్నొకటి బహిష్కరించుకునే  భిన్న ధ్రువాలు.
విలువ సమీకరణంలో రెండు ధ్రువాలూ రెండు వేర్వేరు సరుకులకు కేటాయించ బడతాయి.
ఆ ధ్రువంలో ఒక రకం  సరుకు ఉంటే,  ఈ ధ్రువంలో వేరే రకం సరుకు ఉండాలి. ఎందుకంటే, బట్ట విలువ బట్టలో వ్యక్తం కాదు. 20 గజాల బట్ట = 20 గజాల బట్ట అనేది విలువ వ్యక్తీకరణ కాదు.పునరుక్తి మాత్రమే. అది కొత్తగా చెప్పేదేమీ లేదు. బట్ట విలువ వేరొకరకం సరుకులో - అంటే సాపేక్షంగా- వ్యక్తం చెయ్యడం మాత్రమే కుదురుతుంది.
బట్ట సాపేక్ష విలువ రూపంలో వుంటే, సమానకం రూపంలో మరొక సరుకు వుండి తీరాలి. ఇక్కడ కోటు ఆ సమానకం.  కోటు, బట్ట విలువని తెలుపుతుంది. అది బట్టవిలువకు సమానమైనది, ఆవిధంగా కోటు బట్టకు సమానకం రూపంలో ఉంటుంది. అదే సమయంలో కోటు సాపేక్ష రూపం లో ఉండజాలదు.
అలా ఉన్నట్లు అనిపించే సందర్భాన్ని మార్క్స్ మనముందు పెడతాడు:
బట్ట ఉత్పత్తిదారుడూ(A ) కోటు ఉత్పత్తిదారుడూ(B ) బేరం మొదలుబెడతారు.
బట్టతనికీ A  కోటతనికీ B  బేరం తెగే ముందు వాళ్ళ మాటలు:
A: 20 గజాలబట్ట రెండు కోట్లతో సమానం. 20 గజాలబట్ట= రెండు కోట్లు
B: 1 కోటు 22 గజాల బట్టకు సమానం. 1 కోటు= 22 గజాల బట్ట
కొంతసేపు బేరం ఆడాక, చివరకి కొలిక్కి వస్తారు.అప్పుడు
A: 20 గజాలబట్ట=1 కోటు. 20 గజాలబట్ట 1 కోటుకి సమానం అంటాడు
B: 1 కోటు=20 గజాలబట్ట. 1 కోటు 20 గజాల బట్టకి సమానం అంటాడు.
ఈ సందర్భంలో బట్టా కోటూ రెండూ   ఏక కాలంలో సాపేక్ష విలువ రూపంలోనూ,సమానకం రూపంలోనూ ఉన్నాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఇద్దరు వేరే వేరే  వ్యక్తులకు, రెండు వేర్వేరు విలువ వ్యక్తీకరణలకు ఏకకాలంలో జరిగింది. A కి తన బట్ట సాపేక్ష విలువ రూపంలో వుంటుంది. అవతలవాని సరుకు కోటు సమానకం రూపంలో వుంటుంది.
B  వైపు నుంచి చూస్తే,  అటుదిటుగా, ఇటుదటుగా వుంటుంది. అంటే, కోటు సాపేక్ష విలువ రూపంలో వుంటుంది, బట్ట సమానకం రూపంలో వుంటుంది.
ఆవిధంగా  ఈ సందర్భంలో కూడా ఒకే విలువ వ్యక్తీకరణలో ఒకే కాలంలో, ఒకే సరుకు ఒకేవ్యక్తి వైపునించి  ఈ రెండు రూపాలనూ  పొంద జాలదు.
సాపేక్షవిలువా, సమానకమూ అనేవి కేవలం విలువల రూపాలు మాత్రమే.
ఒకసరుకు ఏరూపం లో ఉన్నది? అనేది విలువ సమీకరణంలో  ఆసరుకు ఉన్న స్థానాన్ని బట్టి ఉంటుంది.
1)20 గజాల బట్ట = 1 కోటు అనే దాంట్లో  బట్ట సాపేక్ష రూపంలో ఉంది. కోటు( విలువేమో) సమానకంగా ఉంది.
2)1 కోటు =  20 గజాల బట్ట అనే దాంట్లో  కోటు  సాపేక్ష రూపంలో ఉంటే, బట్ట  సమానకంగా ఉంది.
సారానికి సంబంధించి రెంటికీ తేడా లేదు. కాని రూపం విషయానికొస్తే భిన్నమైనవి. అంతేకాదు పరస్పరం విరుద్ధమయినవి కూడా.
మొదటిదాంట్లో బట్టవిలువ సాపేక్షంగా వ్యక్తమయింది. కనక బట్ట సాపేక్ష రూపంలో ఉంది. కోటు విలువేమో సమానకంగా వ్యక్తమయింది.కనుక కోటు సమానకం రూపంలో వుంది.
ఇప్పుడు 20 గజాల బట్ట = 1 కోటు అనేదాన్ని తిరగ దిప్పవచ్చు. 1 కోటు =  20 గజాల బట్ట అనేది వస్తుంది, – ఇదీ  సరైన సమికరణే.
అయితే అలా తిప్పితే సరుకుల స్థానాలు మారతాయి.
కోటు సాపేక్ష రూపంలో  ఉంటుంది. బట్ట సమానకం అవుతుంది.
అందువల్ల ఒకే విలువ వ్యక్తీకరణలో ఒకేకాలంలో ఒకే సరుకు రెండు రూపాల్లోనూ  ఉండ జాలదు. ఏదో ఒకరూపంలో మాత్రమే ఉండగలదు.ఆరెండు రూపాలూ ఒకదాన్నొకటి బహిష్కరించు (exclude) కుంటాయి. దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం మాదిరిగా. ఒకే విలువ సంబంధంలో ఒకే సరుకు సాపేక్షధ్రువంలోనూ, సమానక ద్రువంలోనూ ఉండ జాలదు.
ముందుగా సాపేక్ష రూపాన్నీ, తర్వాత  సమానక రూపాన్నీ విడివిడిగా పరిశీలిస్తాడు.అప్పుడు సరళ విలువ రూపాన్ని మొత్తంగా పరిశీలిస్తాడు.
సాపేక్ష విలువ రూపం యొక్క గుణాత్మక సారం (qualitative content of the relative value-form )

భౌతిక రూపంగా, బట్ట కోటు నుండి భిన్నమైనది విలువలుగా బట్టా కోటూ ఒకలాంటివే.అదీ విలువే, ఇదీ విలువే. కనుక బట్ట కోటుతో విలువ సంబంధంలోకి రాగలదు. ఇక్కడ సమానత్వసంబంధం  విలువ సంబంధం. తన విలువని తెలిపే సరుకు యొక్క విలువ వ్యక్తీకరణ. ఉపయోగపు విలువగా, అంటే సరుకు శరీరంగా, బట్ట కోటు వంటిది కాదు. కోటుకి భిన్నమైనది. విలువగా ముందుకొ చ్చినప్పుడు ఒక సంబంధంలో వ్యక్తమవుతుంది. ఈ సంబంధంలో మరొక రకం సరుకు కోటు, బట్టకు సమం అవుతుంది, అంటే బట్టలో నూ కోటులోనూ  ఒకే సారం ఉన్నట్లు లెక్కకొస్తుంది.
అయితే తనవిలువని చెప్పుకునేది బట్ట. అది తనకి భిన్నమైన మరొక సరుకుతో సంబంధంలోకి వస్తుంది. ఈ  సంబంధం  సమానం అని తేల్చే సంబంధం. సమానత్వ సంబంధం
20 గజాల బట్ట = 1 కోటు  అనే సమీకరణానికి  మూలం: బట్ట=కోటు .
మామూలు మాటల్లో చెబితే, కోటు సారంలో బట్ట లాంటిదే. కనుక  ఒకదాన్ని మరొకదానితో  పరిమాణాత్మకంగా  సమపరచవచ్చు.
గజం బట్టలో వున్న  సారానికి 20 రెట్ల సారం కోటులో వుంది.సమపరిస్తే, 20 గజాల బట్ట= ఒకకోటు.
ఉపయోగపు విలువలుగా అయితే ఏసరుక్కి ఆ సరుకే , దేనికదే. భిన్నమైనవి.అయితే విలువలుగా సరుకులన్నీ ఒకటే. ఎందుకంటే విలువలుగా సరుకులు పేరుకున్న శ్రమే. శ్రమ పేరుడే  అన్నామంటే వాటిని అనిర్దిష్టతకి, విలువకి దించినట్లే  - మన విశ్లేషణ ద్వారా.అయితే ఈ విలువకి వాటి శరీర రూపాన్ని తప్ప మరొక రూపాన్ని ఆపాదించం.
అయితే సరుక్కీ ,మరొక సరుక్కీ విలువ సంబంధంలో ఇందుకు భిన్నంగా వుంటుంది. బట్ట తానొక విలువనంటూ ముందుకొస్తుంది, తన శరీరాన్ని  వదలి పెట్టి మరీ దూసుకొస్తుంది. ఇదంతా విలువ సంబంధంలోఉన్నప్పుడే సాధ్యం. దేనికది విడిగా వున్నప్పుడు సాధ్యమవదు. అప్పుడు శరీరరూపం తప్ప మరోకరూపం అవి తీసుకోలేవు.ఇది స్పష్టం.
మనం కోటును బట్టకు సమానకం చేశాం. తద్వారా కోటు లో రూపొందిన శ్రమనీ, బట్టలో రూపొందిన శ్రమని సమానం చేశాం అన్నమాట. కోటుని చేసింది దర్జీ శ్రమ. బట్టను చేసింది నేత శ్రమ. ఈ రెండూ గుణాత్మకంగా భిన్నమైనవి.
మరి వాటిని ఎలా సమానం చెయ్యగలం? విలువని ఏర్పరచే మేరకు రెంటినీ  అనిర్దిష్ట శ్రమకు దింపడం  ద్వారా మాత్రమే అలా చెయ్యగలం.  అనిర్దిష్ట శ్రమే  విలువ సారం.
ఇంతవరకే తెలిస్తే సరిపోదు. తెలుసుకోవాల్సిన మరొక విషయం మిగిలే వుంది. ఏమంటే,

శ్రమ దానికదే విలువ కాదు.

బట్ట విలువని  ఏర్పరచిన శ్రమా, కోటుని ఏర్పరచిన శ్రమా ఒకేరకమైన అనిర్దిష్ట మానవ శ్రమ అని తెలుసుకున్నాం. ప్రతిసరుకులోనూ ఒకేసారం ఉన్నప్పుడు, ఆసరుకులు ఏవో  పరిమాణాల్లో సమానం అవుతాయి అనీ తెలుకున్నాం.
ఇంతవరకే తెలిస్తే సరిపోదు. బట్ట విలువ ఏర్పరచిన శ్రమ స్వభావం వ్యక్తీకరణ ఒక్కటే సరిపోదు.
తెలుసుకోవాల్సింది మరొకటుంది:
అనిర్దిష్ట శ్రమ దానికదిగా విలువ కాదు. విలువంటే, ఏదైనా వస్తువులో చేరిన /రూపొందిన అనిర్దిష్ట శ్రమ.బట్టలోనూ కోటులోనూ చేరివున్న శ్రమ విలువ అవుతుంది.
బట్టని చేసిన శ్రమ కోటు చెయ్యడానికి ఉపయోగించవచ్చు.మరేదైనా తయారు చేయడానికి వాడవచ్చు.అయితే అది ఒక ఉత్పాదితంలో చేరిఉండాలి. అప్పుడే ఆ శ్రమ విలువ అవుతుంది.ఎందుకంటే శ్రమని శ్రమగా వుంచడం కుదరదు. శ్రమ దానికదిగా విలువ కాదు. ఎందుకు కాదో చెప్పాడు.
శ్రమ అంటే చలనంలో శ్రమ శక్తి, సజీవ శ్రమ విలువని ఏర్పరుస్తుంది. కాని దానికదే విలువ కాదు. శ్రమ పేరుకున్న స్థితిలో మాత్రమే  విలువ అవుతుంది. అంటే ఎదో ఒక సరుకులో రూపొంది నప్పుడు మాత్రమే శ్రమ విలువ అవుతుంది. మానవ  శ్రమ పేరుడుగా బట్ట ఒక విలువ. ఆవిలువని వ్యక్తం చెయ్యాలంటే, విలువకి వస్తుగత మనుగడ ఉన్నట్లు ఆ విలువ వ్యక్తం కావాలి. అంటే, ఆబట్టనుండి పాదార్దికంగా భిన్నమైనదిగా వ్యక్తం కావాలి. అయినాగాని బట్టకీ, అన్ని ఇతర సరుకులకీ ఉమ్మడి అయినదిగా వ్యక్తం కావాలి. సమస్య పరిష్కారం అయింది.- కాపిటల్ 1.57 -58    

విలువ సమీకరణంలొ సమానకం స్థానంలో ఉన్నప్పుడు కోటు బట్టకు గుణాత్మకంగా సమానమైనదిగా ఉంటుంది.అది విలువ కనక బట్ట వంటిదే. కోటులో విలువని తప్ప మరి దేన్నీ చూడం. దాని శరీరం విలువకి ప్రాతినిధ్యం వహిస్తుంది. అయినా, కోటు శరీరం దానికదిగా కేవలం ఒక ఉపయోగపు విలువ మాత్రమే. తానొక విలువని అని చెప్పదు. మొదట్లో మనం పట్టుకున్న బట్ట లాగే. “బట్టతో విలువ సంబంధంలో పెట్టగానే,సంబంధంలో లేనప్పటి కంటే కోటు మరింత అర్ధవంతం అవుతుందని తెలుస్తుంది.” ఎక్కువ విషయం చెబుతుంది.ఉపయోగపువిలువనే కాదు, విలువని కూడా అని. ఒకవ్యక్తి మఫ్టీలో ఉన్నప్పటికంటే యూనిఫాం లో ఉన్నప్పుడు ఎక్కువగా లెక్కకొస్తాడు , అలాగే.
కోటు ఉత్పత్తిలో మానవ శ్రమశక్తి కుట్టు రూపంలో ఖర్చయింది. అది కోటులో  నిల్వ అయింది. కోటు ఈ అంశంలో విలువ నిక్షేపం (depository of value). అయినా, ఆకోటు చీలికలయినా అది విలువ అనే విషయాన్ని   బయటపడనీయదు. బట్టతో విలువ సంబంధంలో మాత్రం కోటు కేవలం ఈ అంశ  తోనే ఉంటుంది. కనుక రూపొందిన విలువగా , విలువ అయిన శరీరంగా లెక్కకొ స్తుంది.
“A  అనేవాడు B  దృష్టిలో ప్రభువు. ‘ప్రభువు‘ B  దృష్టిలో A శరీర రూపాన్ని పొందితే  తప్పA అనేవాడు B కి ప్రభువు కాలేడు. అంతేకాక, కొత్త ప్రభువు వచ్చినప్పుడల్లా ప్రభుత రూపురేఖలూ, జుట్టూ వగయిరా అన్ని మారతాయి.”
కనుక బట్టకి కోటు సమానకంగా వున్న విలువ సమీకరణంలో కోటు విలువ రూపంగా వ్యవహరిస్తుంది. బట్ట సరుకు  విలువ కోటు సరుకు శరీర రూపంలో వ్యక్తం చెయ్యబడుతుంది.అంటే ఒక సరుకు విలువ మరొక సరుకు ఉపయోగపు విలువలో. ఉపయోగపు విలువగా బట్ట కోటు లాంటిది కాదు. కోటుకి  భిన్నమైనది. అయితే విలువగా బట్ట కోటు వంటిదే. ఆవిధంగా బట్ట తన శరీర రూపానికి భిన్నమైన విలువ రూపాన్నిపొందుతుంది .బట్ట ఒక విలువ అనే వాస్తవం (విషయం) కోటుతో దాని సమానత్వం ద్వారా వెల్లడవుతుంది-“ ఒక క్రైస్తవుని గొర్రె స్వభావం దేవుని గొర్రెతో అతని పోలికలో వెల్లడయినట్లు” -కాపిటల్ 1.58
తొలి జర్మన్ కూర్పుకి చేర్చిన అనుబంధంలో ఇలాఉంది  : కోటు ఒక వస్తువు రూపంలో దాని ఉత్పత్తికి ఖర్చయిన మానవ శ్రమ శక్తి వ్యక్తీకరణ. ఆ మేరకు అది అనిర్దిష్ట మానవ శ్రమ యొక్క జెల్లీ(jelly). ఆవిధంగా  కోటు అనేది విలువ. అలాగే బట్ట కూడా, అదే మానవ శ్రమ జెల్లీ గా అదీ  విలువే. బట్టలోను కోటు లోనూ ఉమ్మడిగా మానవశ్రమ వుంది. ఈ సంబంధంలో ఒక వస్తువుగా  కోటు, బట్టలోనూ, తనలోనూ ఉమ్మడిగా వున్న మానవ శ్రమకు ప్రతినిధిగా వుంటుంది. ఈ సంబంధంలో కోటు ‘ విలువ ఆకారంగా’ మాత్రమే లెక్కకొస్తుంది. అందువల్ల, ఈ సంబంధంలో బట్ట విలువ యొక్క రూపంగా, అంటే బట్ట విలువ ఏ రూపంలో కనపడుతుందో  ఆ ఇంద్రియాగోచర రూపంగా కోటు లెక్కకొస్తుంది.  ఆవిధంగా విలువ సంబంధం వల్ల ఒక సరుకు విలువ మరోకసరుకు ఉపయోగపు విలువలో వ్యక్తమవుతుంది.అంటే, దానికి భిన్నమైన మరొక సరుకు శరీరం ద్వారా అన్నమాట.

విలువ సంబంధంలో ఉన్న సాపేక్ష విలువ రూపం యొక్క పరిమాణాత్మక నిర్దిష్టత ( Quantitative definiteness).

విలువగా 20 గజాలబట్ట శ్రమ జెల్లీ. అంత మాత్రమే కాదు. ఆబట్టలో కొంత నిశ్చిత పరిమాణం లో శ్రమ వస్తూత్వం (objectified) చెందింది. అంతే  పరిమాణం లో కోటు లో కూడా. రెంటిలోనూ ఉన్న శ్రమ గుణాత్మకంగా ఒకటే, పరిమాణాత్మకంగానూ ఒకటే. కనుకనే సమానం అవుతాయి. 20 గజాల బట్ట = 1 కోటు అవుతుంది గాని 20 గజాల బట్ట = డజన్  కోట్లు కావు.
ఏరెండు సరుకుల విలువ సంబందానికైనా ఇది వర్తిస్తుంది.
ఉదాహరణకి 10 కిలోల టొమాటోలు, ౩ దస్తాల కాగితాలు. నిశ్చిత పరిమాణంలో ఉన్న సరుకు ఏదైనా దానిలో ఒక నిశ్చిత పరిమాణంలో మానవ శ్రమ ఇమిడి ఉంటుంది.అందువల్ల :
“ విలువ రూపం విలువనే కాక విలువ పరిమాణాన్ని కూడా వ్యక్తం చెయ్యాలి.” కాగితాల్లోను, టొమాటోల్లోనూ విలువ ఉన్నది.కనుక విలువలుగా చూస్తే, అవి గుణాత్మకంగా ఒకటే.
   టొమాటోలు = కాగితాలు
గుణాత్మకంగా సమానమైనవే. కాని అదొక్కటే చాలదు.పరిమాణాత్మక సమానత్వం ఉండాలి.
విలువ వున్నట్లు చెప్పడమే కాదు, ఎంత పరిమాణంలో ఉందో కూడా చెప్పాలి.
10 కిలోల టొమాటోల్లో ఎంత విలువ సారం ఉందో,  ౩ దస్తాల కాగితాల్లో అంటే ఉంటేనే ఆపరిమాణాల్లో రెండూ  సమానమవుతాయి.వేరే నిష్పత్తిలో  కావు.పై పరిస్థితుల్లో, అంటే
5 కిలోల టొమాటోలు= ౩ దస్తాల కాగితాలు అనేది కుదరదు. రెంటిలోనూ ఒకే సారం ఉన్నది కాని పరిమాణంలో తేడా ఉంది. 5 కిలోల టొమాటోల్లో  ౩ దస్తాల కాగితాల్లో ఉన్న సారంలో సగమే ఉంది. కనుక సమానం కావు.
20 గజాల బట్టలో విలువ సారం ఎంత ఉందో సరిగ్గా అంతే  ఒక కోటు లో ఉంది. దీనర్ధం ఆపరిమాణాల్లో ఉన్న  ఆ రెండు సరుకుల ఉత్పత్తికి ఒకేమొత్తం శ్రమ కాలం ఖర్చయిందని.

ఒక సరుకు విలువని  ఆసరుకు యొక్క  సాపేక్ష విలువ అని ఎప్పుడు అంటాం?
ఒక సరుకు విలువకి వేరొక సరుకు ప్రాతినిధ్యం వహించి వుంటే ఆ సరుకు విలువ సాపేక్షవిలువ అనబడుతుంది.  ఉదాహరణకు, 5 కిలోల టొమాటోలు= ౩ దస్తాల కాగితాలు అనప్పుడు టొమాటోల విలువకు కాగితాలు ప్రాతినిధ్యం వహించాయి. కనుక టొమాటోల విలువ  వాటి సాపేక్ష విలువ అవుతుంది.
“ ఒకసరుకు విలువ స్థిరంగా వుంటూ ,దాని సాపేక్ష విలువ మారవచ్చు. భిన్నంగా దాని విలువ మారినా, సాపేక్ష విలువ స్థిరంగా  వుండవచ్చు”
ఉత్పాదకతలో వచ్చే మార్పుల వల్ల సరుకులకు పట్టే శ్రమ కాలంలో మార్పులోస్తాయి.వాటిప్రభావం సాపేక్ష విలువ మీద ఎలావుంటుంది?

ఉత్పాదకతలో వచ్చే మార్పుల ప్రభావం

అయితే, నేతపని ఉత్పాదకతలోనో కుట్టుపని ఉత్పాదకతలోనో మార్పులు రావచ్చు. ఆయా మార్పులకి తగినట్లు 20 గజాల బట్ట ఉత్పత్తికీ 1 కోటు ఉత్పత్తికి అవసరమయ్యే శ్రమ కాలం మారుతూ ఉంటుంది.ఆ మార్పుల ప్రభావం విలువ పరిమాణం యొక్క సాపేక్ష వ్యక్తీకరణ మీద ఎలావుంటుంది?
ఇక్కడ మార్క్స్ అన్నీ అవకాశాలనూ చర్చించాడు:
1)మొదటిది.కోటు విలువ స్థిరంగా వుండగా, బట్ట విలువ మారుతున్న సందర్భం.
A )పత్తి పండే నేల నిస్సారమవుతున్నందు వల్ల – బట్ట ఉత్పత్తికి అవసరమయ్యే శ్రమకాలం రెట్టింపు అయిందనుకుందాం. అప్పుడు ఆబట్ట విలువ కూడా అంతకు ముందుకంటే రెండింతలవుతుంది.
20 గజాల బట్ట = 1  కోటు అనే సమీకరణంకి బదులు ఇప్పుడు
        20 గజాల బట్ట = 2 కోట్లు అనేదొస్తుంది.
B) దానికి భిన్నంగా, అభివృద్ధి చెందిన మగ్గాలు వచ్చినందువల్ల బట్ట ఉత్పత్తికి అవసరమయ్యే శ్రమ కాలం సగానికి తగ్గితే, బట్ట విలువ కూడా సగమవుతుంది.
దీనికి అనుగుణంగా సమీకరణం మారి
20 గజాల బట్ట = ½ కోటు అనేదొస్తుంది.                                    
ఈ మార్పు కూడా పరస్పర వ్యతిరేక కారణాల వల్ల వచ్చిందనేది స్పష్టమే.
2)బట్ట విలువ స్థిరంగా ఉండగా,కోటు విలువ మారుతున్న సందర్భం.
A) ఊలు దిగుబడి తగ్గి, కోటు ఉత్పత్తికి అవసరమయ్యే శ్రమ కాలం రెట్టింపైతే
20 గజాల బట్ట = 1 కోటు అనే దానికి మారుగా
20 గజాల బట్ట = ½  కోటు అనేదొస్తుంది.
ఇందుకు భిన్నంగా కోటు విలువ సగానికి తగ్గితే
        20 గజాల బట్ట = 2 కోట్లు అనేదొస్తుంది.
దీన్ని బట్టి: సరుకు A విలువ స్థిరంగా వుంటే,  సరుకు B లో వ్యక్తమయ్యే సాపేక్ష విలువ B విలువ పెరిగితే తగ్గుతుంది. తగ్గితే పెరుగుతుంది. సరుకు B విలువ పెరిగినా తరిగినా విలోమంగా మారుతుంది.
1,2 లో ఇచ్చిన వివిధ సందర్భాల్నీ చూస్తే, సాపేక్ష విలువల్లో వచ్చే మార్పు పరస్పర వ్యతిరేక కారణాల వల్ల ఏర్పడవచ్చు. ఎలాగంటే:
20 గజాల బట్ట = 1 కోటు అనేది,  20 గజాల బట్ట = 2 కోట్లు కావడానికి రెండు కారణాలు ఉండవచ్చు. ఒకటి, కోటు విలువ అలాగే ఉండగా, బట్ట విలువ రెండింతలు కావడం. రెండు, బట్టవిలువ అలాగే ఉండగా, కోటు విలువ సగం కావడం. సాపేక్ష విలువలో వచ్చిన ఈ మార్పు, పరస్పరం వ్యతిరేకమైన కారణాల మూలంగా వచ్చిందనేది స్పష్టమే.
అలాగే కోటు విలువ అలాగే ఉండగా, బట్ట విలువ సగానికి తగ్గినా, బట్టవిలువ అలాగే ఉండి , కోటు విలువ రెట్టింపయినా   20 గజాల బట్ట = ½  కోటు అవుతుంది.
ఈ మార్పు కూడా పరస్పర వ్యతిరేక కారణాల వల్ల వచ్చిందనేది స్పష్టమే.
3) బట్ట, కోటు వీటి ఉత్పత్తికి అవసరమయ్యే శ్రమ కాలాలు రెండూ ఒకే దిశలో, ఒకే నిష్పత్తిలో మారుతున్న సందర్భంలో, వాటి వాటి విలువల్లో మార్పులోస్తాయి. కాని,  20 గజాల బట్ట = 1 కోటు అనేది మారదు. అలానే ఉంటుంది. రెంటి విలువ్కాలు ఏక కాలంలో రెట్టింపయినా, సగమయినా ఆ సమీకరణం మారాడు. ఇది స్వయం స్పష్టం.
వాటి విలువల్లో వచ్చే మార్పు తెలియాలంటే, విలువ స్థిరంగా వున్నా మూడో సరుకుతో పోల్చాలి. బట్టని, కోటుని మాత్రమే పోల్చి చూస్తే అటువంటి మార్పు తెలియనే తెలియదు. తెలుసుకునే ఆస్కారమే ఉండదు.
ఇక్కడ మూడో వస్తువుగా 2 కుర్చీలు తీసుకుందాం.
20 గజాల బట్ట = 1 కోటు = 2 కుర్చీలు
బట్టవిలువా కోటు విలువా రెండూ రెట్టింపయితే,
20 గజాల బట్ట = 1 కోటు = 4  కుర్చీలు అనేదొస్తుంది.
రెంటి విలువా సగానికి పడిపోతే,
20 గజాల బట్ట = 1 కోటు = 1  కుర్చీ అవుతుంది.
రెండు సందర్భాలలోనూ 20 గజాల బట్ట = 1 కోటు అనేది మారదు. బట్టవిలువ సాపేక్షంగా కుర్చీలో వ్యక్తమయినప్పుడు, బట్టవిలువలో వచ్చిన మార్పు బయట పడుతుంది. కాని కోటు లో వ్యక్తమయినప్పుడు బయటపడదు.
4) బట్ట ఉత్పత్తికీ, కోటు ఉత్పత్తికీ అవసరమయ్యే శ్రమ కాలాలు ఒకే దిశలో మారుతున్నా,అసమాన స్థాయిలో ఈ మార్పు జరగవచ్చు. ఉదాహరణకి,బట్ట ఉత్పత్తికి పట్టే శ్రమ కాలం రెండు రెట్లయి, కోటు ఉత్పత్తికి పట్టే కాలం 1 ½ రెట్లు కావచ్చు.ఇంకా వేర్వేరు కాలాలు పట్టవచ్చు. ఒక సరుకు సాపేక్ష విలువలో సాధ్యమయ్యే తేడాల ప్రభావాన్ని 1,2,3 సందర్భాల్ని బట్టి తేలిగ్గా రాబట్టవచ్చు.
విలువ పరిమాణంలో వాస్తవ మార్పులు, వాటి సాపేక్ష వ్యక్తీకరణలో – సాపేక్ష విలువ పరిమాణంలో – స్పష్టంగా గానీ, సంపూర్ణంగా గానీ ప్రతిబింబించవు. ఒక సరుకు విలువ అలాగే వున్నా, దాని సాపేక్ష విలువ మారవచ్చు. దాని విలువ మారుతున్నా, సాపేక్ష విలువ అలాగే వుండనూ వచ్చు. విలువ పరిమాణాల్లోనూ, ఈ పరిమాణాల సాపేక్ష వ్యక్తీకరణ లోనూ ఒకేసారి వచ్చే వ్యత్యాసాలు అనుగుణంగా ఉండాలి అనేదేమీ లేదు.

సాపేక్ష విలువ రూపం మొత్తంగా

సాపేక్ష విలువ వ్యక్తీకరణ ద్వారా సరుకు విలువ దాని సొంత ఉపయోగపు విలువకి భిన్నమైన రూపాన్ని పొందుతుంది.
ఈ సరుకు  ఉపయోగపు రూపం (use form) ఉదాహరణకి బట్ట. అయితే అది కోటుతో సమానత్వ సంబంధంలో విలువ రూపం పొందుతుంది. ఈ సమానత్వ సంబంధం ద్వారా, దానికి(sensibly different ) భిన్నమైన మరొక సరుకు శరీరం విలువగా దాని మనుగడకు, విలువగా దాని స్వభావానికి అద్దం  అవుతుంది/పడుతుంది.ఆవిధంగా అది తన ప్రాకృతిక రూపానికి భిన్నమైన స్వతంత్రమైన విలువ రూపాన్ని పొందుతుంది.   రెండు,నిర్దిష్ట పరిమాణం గల విలువగా అది ఏ నిష్పత్తిలో మరొక సరుక్కి సమం అవుతుందో కొలవబడుతుంది.

విలువ యొక్క సమానక రూపం

మన ఉదాహరణలో కోటు సమానక రూపం లో ఉంది. బట్ట తనవిలువని కోటు ఉపయోగపు విలువలో (శరీర రూపంలో) తెలుపుతుంది. అదే సమయంలో కోటు మీద ఒక ప్రత్యేకమైన విలువ రూపాన్ని ముద్రిస్తుంది. ఆ విలువ రూపమే సమానక రూపం.
1 కళ్ళజోడు = 1 స్కూల్ బాగ్
కళ్ళజోడు తనవిలువని స్కూల్ బాగ్ లో  తెలుపుతుంది. బాగ్ ని  సమానకం చేస్తుంది.అంటే దాని మీద   సమానక రూపం  ముద్ర వేస్తుంది.
ఈ  విలువ సమీకరణంలో కళ్ళజోడు సాపేక్షవిలువ రూపంలో ఉంది. బాగ్ సమానకం రూపంలో ఉంది. కళ్ళజోడు తన  విలువని స్కూల్ బాగ్ లో తెలుపుకుంటుంది.

నేరుగా మారగలిగే రూపం

ఒక సరుకు   విలువను కలిగివున్నట్లు ఎలా బయటపడుతుంది? మరోకసరుకు  దానితో నేరుగా మారకం కాగలుగుతుంది అని చెప్పడం ద్వారా. అందువల్ల ఒక సరుకు సమానకం రూపంలో వున్నది అన్నామంటే, అది ఇతర సరుకులతో మారకం కాగలదు అంటున్నామన్నమాట.
ఒక సరుకు విలువగా అగపడే రూపంలో ఉంటేనే అది మరోకసరుకుతో మారగలుగుతుంది.అంటే దాని భౌతిక రూపం విలువ రూపంగా లేక్కకోస్తేనే. ఈ ధర్మం కోటుకి వుంటుంది-బట్టకు కోటుతో విలువ సంబంధంలో. అలా కాకపొతే, కోటు అనే వస్తువులో బట్ట విలువ వ్యక్తం కాదు.ఆకారణంగా కోటు సమానక రూపంలో వుంది అంటే అర్ధం ఇదే.విలువ సమీకరణంలో అది వున్న స్థానం  వల్ల , దాని ప్రాకృతిక రూపం మరొక సరుకు విలువ రూపంగా లెక్కకొస్తుంది. మరొక సరుకుతో తక్షణం  మారగలగే రూపాన్ని పొందుతుంది. అందువల్ల, వేరొక సరుక్కి విలువగా అగపడాలంటే, ఆసరుకు దాని ప్రాకృతిక రూపానికి భిన్న మైన రూపాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు.- Appendix to the 1st German edition of Capital, volume 1

సమానక రూపంలో(విలువ)  పరిమాణాత్మక నిర్ధారణ వుండదు

కోటు రూపంలో వున్న వస్తువు బట్టతో నేరుగా మారుతుంది. లేక బంగారం రూపంలో వున్న వస్తువు ఏదయినా అన్ని ఇతర సరుకులతో మారగలదు – ఈ వస్తువు సమానక రూపం ఏ మాత్రం పరిమాణాత్మక నిర్ధారణ కలిగి వుండదు. కలిగి వుంటుంది అనే పొరపాటు అభిప్రాయమూ వుంది. ఇందుకు కారణాలు:
1. బట్ట విలువని వ్యక్తీకరించే కోటు కూడా పరిమాణాత్మకంగా నిర్దిష్టమమైనదే. 1 కోటు ,12 కోటులు కావు లాగా.ఒకటి అనేది కోటు నిర్దిష్ట పరిమాణమే. కనుక సమానక రూపంలో పరిమాణాత్మక నిర్ధారణ వుంటుంది అనిపిస్తుంది.
ఒక కోటు 12 కోటులు కాదు. ఎందువల్ల? 20 గజాల బట్ట తన సాపేక్ష విలువ వ్యక్తీకరణలో కేవలం విలువగానే కాకుండా,అదేసమయంలో నిర్దిష్ట పరిమాణంగల విలువగా కూడా  కొలవబడుతుంది. 1 కోటు, (12 కోటులు కాదు),20 గజాలబట్టలో ఎంత శ్రమ వుందో అంటే శ్రమను కలిగి వుంది కనుకనే 20 గజాల బట్టకు సమానం. ఈ విషయానికీ, బట్టతో నేరుగా మారే  కోటు వంటి సరుకు ప్రత్యేకధర్మానికి ఏమీ  సంబంధంలేదు.
2.నిర్దిష్ట విలువ పరిమాణంగా బట్ట 20 గజాలు 1 కోటులో వ్యక్తమయితే, అప్పుడు విపర్యయంగా(conversely) ఒక కోటు విలువ పరిమాణాన్ని కూడా 20 గజాల బట్టలో చెప్పవచ్చు.
అయితే పరోక్షంగా మాత్రమే, ఈసమీకరణని తిరగదిప్పడం ద్వారా మాత్రమే. కోటు సమానకం పాత్రలో ఉన్నంతవరకు ఇది కుదరదు. సాపేక్ష విలువ రూపంలో ఉన్నప్పుడే ఇది సాధ్యం.
3. ఇదే ఫార్ములాని- 20 గజాల బట్ట = 1 కోటు,లేక  20 గజాల బట్ట  1 కోటంత –అనేదాన్ని ఇలాకూడా చెప్పవచ్చు:
20 గజాల బట్ట  1 కోటు సమానకాలు (equivalents), సమాన పరిమాణంలో వున్న విలువలు.
ఇక్కడ మనం ఏసరుకు విలువనీ, రెండో సరుకు ఉపయోగపు విలువలో వ్యక్తం చెయ్యడం లేదు.కనుక దేన్నీ సమానకం స్థానంలో వుంచడం లేదు. ఇక్కడ సమానక అంటే ‘పరిమాణంలో సమానమైన వస్తువు’ అని అర్ధం.
“కోటు బట్టకు సమానకంగా ఉంటే, కోటులు  బట్టతో నేరుగా మారకంకాగల లాక్షణిక ధర్మాన్ని పొందుతాయి. అంతమాత్రాన అవి ఏ నిష్పత్తిలో మారతాయో చెప్పినట్లు అవదు.” cap 1.....
మారక నిష్పత్తి రెండు వస్తువుల ఉత్పత్తికి సామాజికంగా అవసరమైన శ్ర మకాలాన్నిబట్టి నిర్ణయం అవుతుంది.
“బట్ట విలువ పరిమాణం ఇవ్వబడింది కనుక ఈ నిష్పత్తి కోటు విలువ పరిమాణాన్ని బట్టి ఉంటుంది. కోటు సమానకంగానూ, బట్ట సాపేక్ష విలువగానూ వ్యక్తమైనా, ఇందుకు భిన్నంగా  బట్ట  సమానకంగానూ, కోటు సాపేక్ష విలువగానూ వ్యక్తమైనా , కోటు విలువ పరిమాణం ఎప్పటిలాగే దాని ఉత్పత్తికి అవసరమైన శ్రమ కాలం చేత నిర్ణయ మవుతుంది.అందువల్ల కోటు విలువ పరిమాణం కోటు విలువ రూపం నుండి స్వతంత్రంగా వుంటుంది.” –cap 1.....
ఈ మారక సంబంధాన్ని కోటుల విలువా,బట్ట విలువా రెండూ నిర్ణయించినప్పటికీ, కోటు సమానకం రూపంలో  తేగల పరిమాణాలు కోటు విలువకు ఒక వ్యక్తీకరణ కావు.
“విలువ వ్యక్తీకరణలో కోటులు సమానకం స్థానంలో ఉంటే, వాటి విలువల పరిమాణం వ్యక్తంకావు.అంతకన్నా అవి ఒకానొక వస్తువు యొక్క నిర్దిష్ట మొత్తాలుగా లెక్కకొస్తాయి .”-cap 1...
ఈ సమీకరణలో కోటు విలువ పరిమాణం వ్యక్తం కాదు.
సమానక రూపం కోటుల పరిమాణాన్ని చెబుతుంది: 20 గజాల బట్ట 2 కోట్లో 5 కోట్లో  కాదు, ఒక్క కోటే. కోటు విలువ సగానికి పడిపోతే 20 గజాల బట్ట 2 కోటులు. దీన్ని బట్టి, కోటుల పరిమాణం ఆకోటు ల విలువ పరిమాణం యొక్క వ్యక్తీకరణ కాదా? కాదు.ఎందుకంటే,
1.” ఈ  సంబంధంలో కోటు లు ఒక వస్తువు యొక్క పరిమాణాలుగా లెక్కకొస్తాయి, కానివిలువ పరిమాణాలుగా కాదు.
40 గజాల బట్ట విలువ- ఏమిటి?2 కోటు లు. ఇక్కడ కోటు లు సమానకం పాత్ర పోషిస్తున్నాయి. అంటే బట్టకు సంబంధించి ఉపయోగాపువిలువ అయిన కోటు విలువ మూర్తి గా లెక్కకొస్తుంది. కనుక కొంత నిర్దిష్ట పరిమాణంలో ఉన్న బట్ట విలువ వ్యక్తీకరణకు ఇన్ని కోటులు అని సంఖ్య చాలు.”- cap 1...
2. “ రెండు కోటులు 40  గజాల బట్ట విలువ పరిమాణాన్ని చెప్ప గలవు .కానీ తనసొంత విలువ పరిమాణాన్ని,(అంటే) కోటుల విలువ పరిమాణాన్నిఎప్పటికీ చెప్పలేవు.”- కాపిటల్ 1.......
(ఈ విషయం ధర ప్రమాణం, విలువ కొలతల గురించి మార్క్స్ చర్చించే చోట మళ్ళీ వస్తుంది).

సమానక రూపానికున్న  ప్రత్యేకతలు

ఇక సమానక రూపానికి 3  ప్రత్యేకతలున్నాయి.
1. సరుకు భౌతికరూపం విలువరూపం అవుతుంది
2.నిర్దిష్ట శ్రమ, దానికి విరుద్ధమైన అనిర్దిష్ట శ్రమ రూపం అవుతుంది
3. ప్రైవేట్ శ్రమ సామాజిక శ్రమలో వ్యక్తం అవుతుంది.

1. ఉపయోగపు విలువ,దానికీ విరుద్ధమైన విలువ అగపడే రూపం అవుతుంది.                                                       ఈ ప్రత్యేకత మౌలికమయినది కాదు. కాకపోయినా 3  ప్రత్యేకతల లోనూ  స్పష్టమైనది.

   సరుకు భౌతికరూపం విలువరూపం అవుతుంది.

”అయితే గమనించాల్సిన విషయం, ఈ తిరగబడడం అనేది  B సరుకుకి  (కోటో, ధాన్యమో, ఇనుమో మరొకటో)మాత్రమే  సంభవిస్తుంది- మరేదో సరుకు A (బట్ట మొదలైనవి)దానితో విలువ సంబంధంలోకి వచ్చినప్పుడు మాత్రమే. అప్పుడైనా, ఈ సంబంధం పరిమితుల్లో మాత్రమే.”
విడిగా చూస్తే కోటు ఒక ప్రయోజనకర వస్తువు,ఒక ఉపయోగపు విలువ. బట్టేలాగో అలాగే. ఏసరుకూ తనకు తానే  సమానకంగా వుండజాలదు.అందువల్ల,  తన భౌతిక రూపాన్ని తనసొంత విలువ వ్యక్తీకరణగా చెయ్యలేదు. ఆకారణంగా అది మరొక సరుకును సమానకంగా సంబంధంలోకి తెచ్చి తీరాలి. అంటే,మరొక సరుకు శరీరాన్ని తనసొంత విలువ రూపంగా ఆమోదించి తీరాలి.
బట్ట విలువ కోటులో వ్యక్తం కావడమూ, ఒక చక్కర గడ్డ (sugar loaf )తనబరువుని ఇనప బరువు రాళ్ళలో వ్యక్తం చెయ్యడమూ ఒకేలాంటివి అంటాడు.(19 వ శతాబ్దం చివరిదశ దాకా చక్కర పలుకులుగా ఉండేది కాదు.ఎత్తైన గడ్డలుగా దొరికేది ఒక్కొక్క గడ్డ 3 కిలోలనించి  15 కిలోల దాకా ఉండేది. దాన్ని పలుకులుచేసే ప్రత్యెక పరికరాలు వంటిళ్లలో  ఉండేవి.) 
చక్కర గడ్డ ఒక శరీరం, దానికీ బరువు వుంటుంది.దాన్ని చూచో, తాకో దాని బరువెంతో చెప్పలేం.అందుకోసం కొన్నివేర్వేరు  ఇనుప ముక్కలు తీసుకుంటాం. వాటి బరువు ముందుగానే నిర్ణయమై వుంటుంది.(కిలో, అరకిలో, 100 గ్రాములు ఇలా) చక్కర గడ్డ భౌతిక రూపం ఎలా బరువు అగపడే రూపం కాదో, ఇనుం భౌతిక రూపం కూడా  బరువు అగపడే రూపం కాదు.(చక్కెర గడ్డలో బరువు కనబడదు కదా , అలాగే ఇనుము లో నూ కనబడదు.) అయినా, చక్కెర గడ్డ బరువు వ్యక్తం చెయ్యడానికి, దాన్ని ఇనుముతో బరువు సంబంధంలో పెడతాం.ఈ సంబంధంలో ఇనుము బరువుకు తప్ప మరి దేనికీ ప్రాతినిధ్యం వహించని వస్తువు.అందువల్ల ఇనుం పరిమాణాలు చక్కర బరువుని కొలిచేవిగా వుంటాయి.పంచదార శరీరానికి సంబంధించి అవి కేవలం  బరువు అగపడే రూపాలు మాత్రమే. చక్కెరో,మరొకటో శరీరం బరువు కనుక్కునే సంబంధంలో ప్రవేశించి నప్పుడు మాత్రమే  ఇనుం ఈ పాత్రను పోషిస్తుంది.వాటికి బరువు లేకపోతే ఈ  సంబంధంలోకి రాలేవు.ఒకటి మరొకదాని బరువు వ్యక్తం చేసేదిగా వుండలేదు. రెంటిని తక్కెడ సిబ్బెల్లో వేస్తే, బరువులుగా రెండూ ఒకలాంటివే. కనుక ఎదో నిష్పత్తిలో ఒకే బరువు తూగుతాయి. ఇక్కడ ఇనుం కేవలం బరువుకి ప్రతినిధిగా ఉన్నట్లే, మన విలువ వ్యక్తీకరణలో కోటు కేవలం విలువకి ప్రతినిధిగా వుంటుంది.
పోలిక ఇంత వరకే. చక్కెరగడ్డ బరువు వ్యక్తీకరణలో ఇనుం ఒక స్వాభావిక ధర్మానికి- రెండు వస్తువులకూ ఉమ్మడిగా ఉన్న ధర్మానికి – అంటే వాటి బరువుకి- ప్రతినిధిగా వుంది; కాని బట్ట విలువ వ్యక్తీకరణలో, కోటు స్వాభావిక ధర్మం కాని ధర్మానికి, రెంటికి వున్న ధర్మానికి, కేవలం సామాజికమైన ధర్మానికి, అంటే వాటి విలువకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
బరువు శరీర ధర్మం.భౌతిక ధర్మం. విలువ సామాజిక ధర్మం.విలువ సామాజిక మైనది అని సమానక రూపం చెప్పదు. సాపేక్ష రూపం అలాగని తెలియజేస్తుంది.

“ఒక సరుకు సాపేక్ష విలువ రూపం, ఆసరుకు విలువను వ్యక్తం చేస్తుంది - ఆసరుకు పదార్ధం నుండీ, ధర్మాలనుండీ పూర్తిగా భిన్నమైనదిగా ఉదాహరణకి, కోటు వంటిది అయినట్లుగా; అలా వ్యక్తం చేస్తుంది కనుక ఈ వ్యక్తీకరణే తన వెనక  ఎదో సామాజిక సంబంధం దాగి వున్నట్లు సూచిస్తుంది. సాపేక్ష విలువ రూపానికి సంబంధించిన విషయం ఇదీ.”-cap 1.
విలువ సాపేక్ష రూపం తానొక సామాజిక సంబంధం యొక్క వ్యక్తీకరణ అయినట్లు అదే  సూచిస్తుంది. ఎలాగంటే, అది బట్టని మరొక సరుకుతో  కోటుతో సంబంధంలో పెడుతుంది. సమానక రూపం అలాకాదు.బట్టను కొనగలిగే కోటు యొక్క ప్రాకృతిక ధర్మం అయినట్లు కనబడుతుంది. ఇప్పుడు ఎవరైనా కాదని ఇలా వాదించవచ్చు: బట్టతో మారగలగడం కోటుకి ప్రాకృతిక ధర్మం గా కనబడదు ఎందుకంటే, కోటుకి  ఈ ధర్మం బట్టతో సంబంధంలో పెట్టినప్పుడు  మాత్రమే  వుంటుంది.
సమానక రూపానికోచ్చేసరికి,సంగతంతా తారుమారుగా వుంటుంది.

సమానక రూపం మార్మికత

సమానక రూపం యొక్క సారం ఏమంటే:
కోటు తన భౌతిక రూపంతో, కోటురూపంతోనే బట్ట విలువని వ్యక్తం చేస్తుంది. కనుక ప్రకృతే కోటుకి విలువ రూపాన్నిచ్చింది- అనిపిస్తుంది. అయితే బట్టకు సమానకంగా కోటు విలువ సంబంధంలో ఉన్నంతసేపే, ఇది సరైనదిగా వుంటుంది. ఆసంబంధం బయట వుండదు. దానికీ ఆవల కోటు భౌతిక ధర్మాలలో విలువ వుండదు.
ఏమైనా ఒక వస్తువు ధర్మాలు ఇతరవస్తువులతో దాని సంబంధాల ఫలితంగా ఏర్పడేవి కావు. అలాంటి సంబంధాలలో ఆధార్మాలు తమ్ముతాము వ్యక్తం చేసుకుంటాయి. కనుక సమానక రూపం , నేరుగా మారకంకాగల దాని ధర్మం – బరువుగా ఉండడం అనే ధర్మం లాగానే – కోటుకు ప్రకృతే ఇచ్చిందనిపిస్తుంది. ఇందువల్లే సమానక రూపానికి గూఢత్వం. ఇదే సమానక రూపంలో ఉన్న మార్మికత.
దీన్ని ఎలా వివరించాలి?
నేరుగా మారకం కాగల సమాకం ధర్మం బరువు లాంటి ప్రాకృతిక ధర్మం కాదు. అది పొద్దాకులూ దానికి  ఉండేది కాదు. ఆ ప్రత్యెక విలువ సంబంధంలో మాత్రమే  దానికి  ఆధర్మం ఉంటుంది.
ఇలా వివరించాల్సి వుండగా, ఈ మార్మిక స్వభావాన్ని బూర్జువా ఆర్ధికవేత్తలు గమనించలేదు. ఈ (సమానక)రూపం సంపూర్ణంగా అభివృద్ధి చెంది డబ్బు రూపంలో ఎదురుపడే దాకా వాళ్ళు ఈ స్వభావాన్ని గమనించనే లేదు.
ఒక వస్తువు ధర్మాలు ఇతరసరుకులతో దాని సంబంధాలవల్ల ఏర్పడవు. అలాంటి సంబంధాల్లో వ్యక్తమవుతాయి. కనుక కోటు తన సమానకం రూపంవల్ల   నేరుగా మారకంకాగల ధర్మం  ప్రకృతే కలిగించినట్లు అనిపిస్తుంది. బరువుగా వుండడం, మనల్ని వెచ్చగా వుంచడం లాంటి భౌతిక ధర్మం లాగా  అనిపిస్తుంది.ఇదే, ఈ సమానక రూపం యొక్క మార్మిక స్వభావం, బూర్జువా రాజకీయ ఆర్ధికవేత్త దృష్టి నించి తప్పించుకున్నది. ఎప్పటిదాకా వాళ్ళు కనుక్కోలేదంటే, ఈ రూపం పూర్తిగా అభివృద్ధి చెంది డబ్బు రూపంలో ఎదురుపడే దాకా. అంటే సమానక రూపం యొక్క మార్మికత అతనికి తట్టనేలేదు- డబ్బు ఏర్పడే దాకా. అప్పుడు ఏం చేశాడు ? అప్పుడతను బంగారం వెండి యొక్క మార్మిక స్వభావాన్ని వివరించేందుకుకు పూనుకున్నాడు .ఒకటి కాకపొతే మరొకటి, ఎన్నో సమానకాలు ఉన్నట్లు చెప్పి సరిపెట్టారు. చరిత్రలో కాలాన్నిబట్టి వాటికన్నా తక్కువ మిరుమిట్లు గొలిపే వస్తువుల్ని ప్రత్యామ్నాలను ఏకరువు పెట్టాడు. ఏది ఎప్పుడు సమానకంగా ఉన్నదో, ఆవస్తువుల పట్టికను/జాబితాను తయారు చేశాడు.  వాటన్నిటికీ స్వతస్సిద్ధంగా నేరుగా మారగల ధర్మం  ఉన్నట్లుగా నిర్ధారించి పొరబడ్డాడు.
మారక సంబంధంలో బయటపడే దాన్ని సమానకం యొక్క భౌతిక ధర్మంగా భావించాడు.  
ఆవిధంగా  వెండి బంగారాల నిగూఢ లక్షణాన్నివివరించడానికి ప్రయత్నించాడు. అయితే 20 గజాల బట్ట = 1 కోటు లాంటి సరళ విలువ వ్యక్తీకరణ  ఇప్పటికే సమానకం రూపం  సమస్యని (riddle) పరిష్కారం కోసం మనముందు పెట్టినట్లు అతను ఎరగడు. కాపిటల్ 1 .63

2. అనిర్దిష్ట శ్రమ నిర్దిష్ట శ్రమలో వ్యక్తం అవుతుంది.

“సమానకంగా ఉండే సరుకు శరీరం ఎప్పుడూ అనిర్దిష్ట శ్రమ పాదార్ధీకరణగా(materialisation) లెక్కకొస్తుంది, అదే సమయంలో అది  ఒక ప్రత్యేక, ప్రయోజనకర నిర్దిష్ట శ్రమ ఉత్పాదితం కూడా .”-cap1.64
అందువల్ల, నిర్దిష్ట శ్రమ అనిర్దిష్ట శ్రమని వ్యక్తం చేసే మాధ్యమం (medium)అవుతుంది.
మనఉదాహరణలో కోటు ఒకవైపు అనిర్దిష్ట మానవ శ్రమ మూర్తి(embodiment) తప్ప మరేమీ కాదు. మరొకవైపు, కోటులో వాస్తవంగా ఇమిడివున్న  కుట్టుశ్రమ, ఆఅనిర్దిష్ట మానవ శ్రమ ఏరూపంలో సిద్ధిస్తుందో ఆరూపంగా మాత్రమే లెక్కకొస్తుంది.
“బట్ట విలువ వ్యక్తీకరణలో, కుట్టు శ్రమ ప్రయోజనం బట్టలు కుట్టడంలో లేదు; తక్షణమే విలువగా గుర్తించదగిన వస్తువును చెయ్యడంలో ఉంది.” అందువల్ల శ్రమ పేరుడుగా (congelation) ఉండడంలో ఆప్రయోజనం ఉంది. -బట్ట విలువలో సిద్ధించిన శ్రమకి ఏమాత్రం భిన్నం కాని శ్రమ పేరుడుగా (congelation) ఉండడంలో ఆప్రయోజనం ఉంది. అలా విలువకి అద్దం గా పనిచెయ్యాలంటే, కుట్టు శ్రమ సాధారణ మానవ శ్రమ అయిన తన అనిర్దిష్ట లక్షణాన్ని ప్రతిబింబించి తీరాలి. కుట్టుపనిలో, నేత పనిలో లాగానే మానవ శ్రమ శక్తి వ్యయమవుతుంది. కాబట్టి రెండూ మానవ శ్రమ అనే సాధారణ ధర్మాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల, విలువ ఉత్పత్తి వంటి కొన్ని సందర్భాలలో రెంటినీ ఈ ఒక్క అంశం లోనే  పరిగణించాలి. ఇందులో నిగూఢమయింది ఎదీ లేదు. ఏ మాయా మర్మం లేదు, కాని విలువ వ్యక్తీకరణలో విషయం  తలకిందులుగా వుంటుంది. ఉదాహరణకి, నేత విలువని  ఏర్పరుస్తుంది అనే వాస్తవం -నేత అయినందువల్ల కాదు,మానవ శ్రమ అయి ఉండడం వల్ల అనే వాస్తవం-ఎలా వ్యక్తం కావాలి?- నేత శ్రమని, మరొక నిర్దిష్ట శ్రమ అయిన కుట్టు శ్రమకి -  మరొకవైపు ఉంచడం ద్వారా. కోటు తన శరీర రూపంలో విలువ యొక్క ప్రత్యక్ష వ్యక్తీకరణ అయినట్లు గానే, ఇప్పుడు నిర్దిష్ట శ్రమ అయిన కుట్టు శ్రమ కూడా సాధారణ మానవ శ్రమ మూర్తిగా కనబడుతుంది.
 “బట్ట విలువ వ్యక్తీకరణలో, కోటు విలువ శరీరంగా లెక్కకొస్తుంది. అందువల్ల కోటు శరీరరూపం విలువ శరీరంగా లెక్కకొస్తుంది. అంటే, ఏ వ్యత్యాసం లేని మానవ శ్రమమూర్తిగా” అన్నమాట. అయితే కోటుని చేసిందీ, కోటుకి ఆరూపాన్ని ఇచ్చిందీ  అనిర్దిష్ట మానవ శ్రమ కానేకాదు, ప్రయోజనకర, నిర్దిష్ట తరహా శ్రమ-కుట్టు శ్రమ. సరళ విలువ రూపంలో ఒక సరుకు విలువ, మరోకరకం సరుకులో, అదీ ఒకే ఒక్క రకం సరుకులో  వ్యక్తమవాలి. ఆ మరొక సరుకు ఏది అనేది పూర్తిగా అప్రస్తుతం.బట్ట విలువ కోటులోనే కాదు, గోధుమల్లో, ఇనుంలో మరెందులోనైనా వ్యక్తం చెయ్యవచ్చు.ప్రతి సందర్భంలోనూ సమానకం బట్టకు సంబంధించి విలువ శరీరంగా, ఆకారణంగా మానవ శ్రమమూర్తిగా, లెక్కకొస్తుంది. అలాగే ప్రతి సందర్భంలోనూ సమానకం యొక్క శరీర రూపం (అది కోటో, ఇనుమో, గోదుమో ఏదయినా కావచ్చు)అనిర్దిష్ట మానవ శ్రమ మూర్తి కాదు, ఒక నిర్దిష్ట, ప్రయోజనకర శ్రమ మూర్తి,ఆకారం.ఆ శ్రమ కుట్టు పనో,పొలం పనో,గనితవ్వే పనో మరేదైనా కావచ్చు. అందువల్ల, సమానకం శరీరాన్ని(కోటుని ) ఉత్పత్తి చేసిన నిర్దిష్ట శ్రమ, విలువ వ్యక్తీకరణలో సిద్దింపు రూపంగా(form of realisation) , అగపడే రూపంగా(form of appearance), అంటే, అనిర్దిష్ట మానవ శ్రమ రూపంగా  లెక్కకు రావాలి.” ఉదాహరణకు కోటు, విలువ శరీరంగా,అందువల్ల మానవ శ్రమ ఆకృతిగా మాత్రమే లెక్కకొస్తుంది.
సమానకం అయిన కోటులో కుట్టు శ్రమ దాగి ఉంది. బట్ట విలువ వ్యక్తీకరణ లోపల ‘ఆశ్రమ’ మానవ శ్రమ కూడా అనే లక్షణాన్ని కలిగి ఉండదు. తద్భిన్నంగా మానవ శ్రమ కావడం దాని సారంగా లెక్కకొస్తుంది. కుట్టుశ్రమ అయివుండడం, ఆసారం అగపడే రూపంగా లెక్కకొస్తుంది.
ఇలా తారుమారు గావడం అనివార్యం. ఎందుకంటే, శ్రమ వుత్పాదితంలో ప్రాతినిధ్యం వహించే శ్రమ,  ఏ తారతమ్యమూ లేని మానవ శ్రమ అయిన మేరకు మాత్రమే, విలువని ఏర్పరుస్తుంది. ఆ ఉత్పాదితం విలువలో వస్తూత్వం చెందిన శ్రమ, మరొక ఉత్పాదితం విలువలో వస్తూత్వం చెందిన శ్రమకి ఏవిధంగానూ వ్యత్యాసమైనది కాదు.
అందువల్ల సమానకం రెండో ప్రత్యేకత: నిర్దిష్ట శ్రమ,దానికి విరుద్ధమైన అనిర్దిష్ట శ్రమ తననుతాను వ్యక్తం చేసుకునే రూపం అవుతుంది.


3. ప్రైవేట్ శ్రమ సామాజిక శ్రమలో వ్యక్తం అవుతుంది.

విలువ సంబంధం వ్యక్తులు తమసరుకుల విలువలు వ్యక్తం చెయ్యడానికి ఉపయోగించే సామాజిక సంబంధం.
కుట్టు శ్రమ తేడాలేని మానవ శ్రమతో మమేకం(identical) అవుతుంది. అది మరే ఇతర శ్రమవంటిదే అవుతుంది. బట్టలో రూపొందిన శ్రమ వంటిదే అవుతుంది. ఫలితంగా, ఆశ్రమ ప్రైవేట్ వ్యక్తుల శ్రమ.అయినాగాని అదే సమయంలో ఆశ్రమ స్వభావంలో సామాజికమైనదిగా వ్యవహరిస్తుంది.ఇతర సరుకులతో నేరుగా మారగల సరుకులో ఫలించడానికి ఇదే కారణం. దీంతో ఇ సమానక రూపానికి మూడో ప్రత్యేకత ఉన్నట్లవుతుంది. అదేమంటే, ప్రైవేటు వ్యక్తుల శ్రమ, దానికీ విరుద్ధమైన సామాజిక శ్రమ రూపం పొందుతుంది.
ఒకరితో ఒకరు సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉత్పత్తిచేసే  ప్రైవేటు వ్యక్తుల శ్రమ ఉతాదితాలు అయితేనే అవి సరుకులు అవుతాయి. ఒకరి ఉత్పాదితాలతో  మరొకరు అవసరాలు తీర్చు కుంటారు. ప్రైవేట్ వ్యక్తుల పరస్పర సంబంధం  వాళ్ళ వాళ్ళ  ఉత్పాదితాల మారకం ద్వారా సిద్ధిస్తుంది.  కనుక ప్రైవేట్ శ్రమ  ఉత్పాదితం – విలువ రూపం కలిగి వున్న మేరకు,అందువల్ల ఇతర ఉత్పాదితాలతో మారకం కాగల రూపం కలిగివున్న మేరకు- సామాజిక రూపం కలిగి వుంటుంది. దానికీ సామాజిక రూపం ఎప్పుడు ఉంటుందంటే, దాని శరీర రూపం  అదే సమయంలో మరొక సరుకుతో మారకం కాగల రూపం అయినప్పుడు, మరొక సరుక్కి విలువ రూపంగా లేక్కకొచ్చినప్పుడు. ఏమైనా, ఆ సరుకు విలువ సంబంధంలో  సమానకంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. మరొక సరుకుతొ మారగల రూపాన్ని కలిగి ఉన్న మేరకు , మరొక సరుక్కి విలువ శరీరంగా లెక్కకొచ్చి, సమానమైన  మేరకు, సమానకం సామాజిక రూపం పొందుతుంది. అందువల్ల, దానిలోని శ్రమ సామాజిక రూపంలో – అంటే,మరొక సరుకులో ఉన్న బ శ్రమతో సమానమైన రూపంలో –లెక్కకొస్తుంది.సరుకులు ఉత్పత్తి చేసే అన్ని శ్రమల లాగే అది ప్రైవేట్ శ్రమ అయినాగాని, అది సామాజిక రుపంలౌన్న శ్రమ. ఎందుకంటే, ఇందువల్లే అది ఇతరసరుకులతో మారకం కాగల ఉత్పాదితంలో ప్రాతినిధ్యం వహించ బడుతుంది.

సరళ విలువ రూపం మొత్తంగా

సరళ  విలువ రూపాన్నిరెండు ధృవాలుగా విడగొట్టి, సాపేక్ష సమానక రూపాల్ని విడివిడిగా గుణాత్మకం గాను, పరిమాణా త్మకం గానూ పరిశీలించిన తర్వాత ,ఇప్పుడు తిరిగి రెంటినీ  కలిపి మొత్తం మీద తన విశ్లేషణలో తేలిన విషయాల్ని చెబుతాడు.
మారకం విలువనేది  సరుకు విలువ స్వతంత్రంగా అగపడే  రూపం
“ఒకసరుకు ప్రాధమిక విలువ రూపం మరొక రకం  సరుకుతో దాని విలువ సంబంధాన్ని  లేక మారక సంబంధాన్ని వ్యక్తీకరించే  సమీకరణలో ఇమిడి ఉంటుంది.”-కాపిటల్ 1.66 విలువ గుణాత్మకంగానూ , పరిమాణాత్మకంగానూ వ్యక్తంకావాలి
1.B సరుకుతో (కోటుతో )నేరుగా మారగలగడం వల్ల A సరుకు (బట్ట) విలువ గుణాత్మకంగా వ్యక్తమవుతుంది.
2. ఫలానిన్ని  కోటు లు . ఫలానిన్నిగజాల బట్టతో మారకం కగలగడం వల్ల బట్ట విలువ పరిమాణా త్మకంగా వ్యక్తమవుతుంది.
విలువ వ్యక్తీకరణలో రెండు ద్రువాలుంటాయి,1. సాపేక్ష విలువ రూపం, 2.సమానక రూపం
“సమానకంగా వున్న సరుకు విలువ ఆకారంగా, తక్షణం మారకం కాగల శరీరంగా - మారకం విలువగా-లెక్కకొస్తుంది.
ఈ సందర్భంలో  మొదటి కూర్పులో సమానకం గురించి ఇలా అంటాడు:” సమానకంగా వ్యవహరించే సరుకు, మరొక సరుక్కి విలువ మూర్తిగా, నేరుగా మారగల వస్తువుగా, మారకం విలువగా లెక్కకొస్తుంది.”
“అందువల్ల మారకం విలువనేది  సరుకు విలువ స్వతంత్రంగా అగపడే  రూపం” అనుబంధం
స్వతంత్రంగా అంటే: దాని ఉపయోగపువిలువ నుండి స్వతంత్రంగా అని.
విలువా, మారకం విలువా  ఒకటి కాదు
అని ఇక్కడ స్పష్టంగా చెబుతాడు:
“ఈ  చాప్టర్ మొదట్లో వాడుక సరళిలో సరుకు ఉపయోగపు విలువా, మారకం విలువా అని అన్నాం.కచ్చితంగా అయితే అది తప్పు. సరుకు ఉపయోగపు విలువా,.......విలువా. ఒక సరుకు విలువ ప్రత్యేక వ్యక్తీకరణ రూపం-ఇది దాని భౌతిక రూపానికి భిన్నంగా వుంటుంది-  పొందీ పొందగానే ద్వంద్వ వస్తువుగా కనబడుతుంది. ”
 ఈ వ్యక్తీకరణ రూపమే మారకం విలువ.
ఒక సరుకు ఒంటరిగా విడిగా వున్నప్పుడు దానికి ఈ రూపం ఉండదు. అయితే మరొక రకం సరుకుతో విలువ సంబంధంలో పెట్టినప్పుడుమాత్రమే  ఈ రూపం వస్తుంది.ఈ విషయం తెలిస్తే చాలు, మనం చెప్పే పద్ధతివల్ల ప్రమాదం ఏమీ ఉండదు.అదొక క్లుప్త రూపంగా ఉపకరిస్తుంది.”
Marginal Notes on Wagnar లో సూటిగా చెప్పాడు  : “ నాకు సరుకు విలువ అనేది దాని ఉపయోగపు విలువాకాదు, మారకం విలువా కాదు.” అంటాడు.
అదే రచనలో మరొకచోట:” సరుకు ఒకవైపు ఉపయోగపు విలువ, మరొకవైపు విలువ,మారకపు విలువ కాదు.ఎందుకంటే,వ్యక్తీకరణ రూపం దాని సొంత సారం కాజాలదు.”
విలువకీ  మారకం విలువకీ వున్నా తేడా ఏమిటో స్పష్ట పరిచాడు. రాడ్ బెర్టస్ గురించి చెబుతూ  ఆయన “ మారకం విలువని విశ్లేషించివుంటే  ఈ వ్యక్తీకరణ రూపం  వెనకవున్న  విలువని పట్టుకుని వుండే వాడు.
మారకం విలువ సరుకులోపల ఉండదు, విలువ సరుకు  లోపలే ఉన్నప్పటికీ.-
మానవ శ్రమ కోటులో పేరుకొని (accumulated) వుంది.-మార్క్స్ . Human labour is therefore accumulated in it.-cap 1.58
మారకం విలువనేది  సరుకు విలువ స్వతంత్రంగా అగపడే  రూపం.
తేలిన మరొక విషయం :
“ విలువ రూపం (అంటే,ఒక సరుకు విలువ వ్యక్తీకరణ) సరుకు విలువ స్వభావం నుండే జనిస్తుంది”
విలువా విలువ పరిమాణమూ మారకం విలువ గా వాటి వ్యక్తీ కరణలో జనిస్తాయని విశ్లేషణ తెలుపలేదు. అయితే ఈ రెండో అభిప్రాయం  మర్కెంట లిష్టులకీ, వారి సిద్ధాంతాన్ని పునరిద్ధరించిన ఫెరియర్ , గలీల్ లాంటి వారికి ప్రబలంగా వుంది.
విశ్లేషణలో తేలిన మరొక విషయం:
“ ఈ సంబంధంలోపల  A (బట్ట) ఉపయోగపు విలువగా మాత్రమే లెక్కకొస్తుంది. ప్రతి సరుకులోను అంతర్గతంగా ఉపయోగపు విలువ, వలువల మధ్య ఉండే వ్యతిరేకతా,లేక తేడా, రెండు సరుకులు ఒకదానితో ఒకటి సంబంధంలో పెట్టడం  బహిరంగంగా స్పష్టపడుతుంది. ఏ సరుకు విలువ వ్యక్తమవాలో ఆసరుకు కేవలం ఉపయోగపు విలువగా మాత్రమె లెక్కకొస్తుంది. ఆవిలువ ఏ సరుకులో వ్యక్తం అవుతుందో, ఆసరుకు కేవలం మారకపు విలువగా వ్యవహరిస్తుంది. అందువల్ల ఒక సరుకు ప్రాధమిక విలువ రూపం  అనేది ఏ రూపంలో అయితే సరుకులో ఇమిడివున్న తేడా – ఉపయోగపువిలువకూ మధ్య తేడా –బయట పడుతుందో ఆప్రాధమిక రూపం.
సరళ విలువరూపం అనేది చారిత్రకంగా  శ్రమ ఉత్పాదితం సరుకుగా కనబడే ఆదిమ రూపం
అన్ని సమాజాల్లోనూ శ్రమ ఉత్పాదితం ఒక ప్రయోజనకర వస్తువు; అయితే ఒక ప్రత్యెక చారిత్రిక దశలో మాత్రమే శ్రమ ఉత్పాదితం సరుకు అవుతుంది. చారిత్రక  అభివృద్ధిక్రమంలో ఒకానొక కాలంలో మాత్రమే  ఒక ప్రయోజనకర వస్తువు ఉత్పత్తిలో వ్యయమైన శ్రమ విలువకి ప్రతినిధి అవుతుంది, శ్రమ ఉత్పాదితం సరుకుగా మారుతుంది. ఒక ప్రయోజనకర వస్తువు  ఉత్పత్తికి వ్యయించిన శ్రమ ఆ వస్తువు యొక్క ఒక వస్తుగత లక్షణంగా ate దాని విలువగా ఏ దశలో వ్యక్తమవుతుందో ఆదశలో అన్నమాట. దీని నించి  వచ్చేదేమంటే :

సరళ విలువరూపం అనేది చారిత్రకంగా  శ్రమ ఉత్పాదితం సరుకుగా కనబడే ఆదిమ రూపం కూడా.

దీని నించి  తదుపరి నిర్ధారణ వస్తుంది :సరళ విలువ రూపం అదేసమయంలో శ్రమ ఉత్పాదితం యొక్క సరళ సరుకు  రూపం అంతేకాదు, సరుకు రూపపు అభివృద్ధి విలువ రూపపు అభివృద్ధితో పాటు సాగుతుంది.
“ఇంతదాకా, ఆర్ధికవేత్తలు ఎంతో సింపుల్ అయిన పాయింట్ ని గమనించ లేదు: 20 గజాల బట్ట = 1 కోటు  అనేది 20 గజాల బట్ట =2 పౌన్లు అనేదానికి అభివృద్ధి చెందని  రూపం అనేదే  అది. ఈ రూపమే డబ్బు రూపపు రహస్యాన్ని , దానిలో  పిండ రూపంలో ఉత్పాదితం యొక్క అన్ని బూర్జువా రూపాల్ని ఇముడ్చుకొని వుంది “- Sel cor p.177 letter to Engels

సరళ విలువ రూపం సరిపోదు. అందులోని లోపాలు

కోటుతో బట్ట విలువ సంబంధంలో బట్ట భౌతిక రూపం ఉపయోగపు విలువగానూ, కోటు భౌతికరూపం  విలువరూ పంగాను(లేక మారకం విలువ ఆకారంగానూ) లెక్కకొస్తాయి. ఒక సరుకులో అంతర్గతంగా ఉపయోగపు విలువకీ విలువకీ వున్న వైరుధ్యం ఆవిధంగా బహిర్గత వ్యతిరేకత ద్వారా ప్రాతినిధ్యం పొందుతుంది. అంటే రెండు సరుకుల సంబంధంలో  ఒక సరుకు ఉపయోగపు విలువగా, మరొకటి మారకం విలువగా ధ్రువాల లాగా అవుతాయి.
సరుకు గా బట్ట ఒక ఉపయోగపు విలువా, మారకం విలువా అని నేను అన్నానంటే, అది విశ్లేషణలో వచ్చిన సరుకు స్వభావం గురించి నా జడ్జ్ మెంట్. ఇందుకు వ్యతిరేకంగా, 20 గజాల బట్ట = 1 కోటు  అనే వ్యక్తీ కరణ లో  బట్ట తానొక
1.ఉపయోగపు విలువ (బట్ట)
2. దానికి  భిన్నంగా, మారకం విలువ (కోటుకి సమానమైన ఒక వస్తువు)
3.అది (బట్ట) ఈ రెంటి ఐక్యత, ఆవిధంగా అది సరుకు.
అని చెబుతుంది.-అనుబంధం
సరుకు సరళ విలువ రూపం అందులో వున్న విరుద్దాంశాలయిన  ఉపయోగపు విలువ , విలువలు అగపడే సరళ రూపం.
ఈ సరళ రూపాన్ని మార్క్స్ కడకంటా విశ్లేషించాడు. డబ్బు రూపం దాకా అభివృద్ధి చెందే క్రమంలో ఉన్న మధ్యంతర విలువ రూపాల్ని చూపాడు.
ఇది పిండ రూపం.క్రిమి రూపం. ధర రూపం తీసుకోవడానికి వరస మార్పులు జరగాల్సి ఉంది.
ఈ వ్యక్తీకరణ రూపంలో A విలువని దాని సొంత ఉపయోగపు విలువనుండి కేవలం భిన్నమైనదిగా చూడడానికి మాత్రమే ఉపకరిస్తుంది.అందువల్ల ఇది A ని మరొక సరుకుతో సంబంధంలో పెట్టడం కన్నా ఇంకేమీ చెయ్యదు. అది A కి అన్ని ఇతరసరుకులతో  ఉండే గుణాత్మక ఎకత్వాన్నీ, పరిమాణాత్మక నిష్పత్తినీ ప్రదర్శించదు.
ఒకే సరుకు బట్టకు సమానకంగా ఒకే సరుకు కోటు వుంటుంది.
ఒక సరుక్కి ఎన్నో సమానకాలు ఉండవచ్చు
అయితే ఈ ప్రాధమిక రూపం దానంతటదే ఆటోమాటిక్ గా విస్తృత విలువ రూపం లోకి పరివర్తన చెందుతుంది. ప్రాదమిక రూపంలో ఒక సరుకు విలువ మరొక సరుకు రీత్యా మాత్రమే వ్యక్తం అవుతుంది. ఈ మరొక సరుకు ఏదయినా కావచ్చు-కోటో , ఇనుమో, గోదుమో మరొక సరుకో.
20 గజాల బట్ట = 5 కిలోల టీ పొడి
=50 కిలోల ఇనుం
= 1 సెల్ ఫోన్
= 2 జీన్స్  పాంట్లు
ఆవిధంగా ఏ సరుకుకైనా ఎన్నో ప్రాధమిక విలువ వ్యక్తీ కరణలుంటాయి. అలాంటి వ్యక్తీ కరణలు ఎన్ని ఉండే అవకాశం ఉంటుందంటే, ఆసరుకు కాక ఎన్ని సరుకులు ఉంటాయో అన్ని.ఒక సరుకువిలువ యొక్క విడి వ్యక్తీకరణ ఆవిధంగా అనంతగా విస్తరిమ్చగల వరుసలోకి మార గలదు.ఆ విలువ యొక్క భిన్న ప్రాధమిక విలువల వరుస గా  మారగలదు.
అలాంటి పరిస్థితుల్లో 20  గజాల బట్టకు ఎన్నో ప్రాధమిక వ్యక్తీకరణలుంటాయి.ఆసరుకు(బట్ట) కాక ఎన్ని సరుకులు ఉంటాయో అన్ని.
మొత్తం 500 సరుకులు ఉంటే, 499 ప్రాధమిక విలువ రూపాలుంటాయి.సరుకులు ఎక్కువయ్యే కొద్దీ, ప్రాధమిక విలువ రూపాలు కూడా పెరుగుతాయి.దీన్నిబట్టి , ఒక సరుకు విలువను తెలిపే సమానకాల సంఖ్య పెరిగే వరుస కాగలదు. అంటే విస్తరించ గలదు.
అదే విస్తృత విలువ రూపం. వచ్చే పోస్ట్ లో