3, సెప్టెంబర్ 2015, గురువారం

అదనపు విలువ గురించి మార్క్స్ చెప్పిందేమిటి?

అదనపు విలువ గురించి మార్క్స్ చెప్పిందేమిటి?

'వీక్షణం' 2015సెప్టెంబర్ సంచికలో                                                                      ఇ యస్ బ్రహ్మచారి

“In view of the incredibly widespread nature of the distortions of Marxism, our first task is to restore the true doctrine of Marx.” -- Lenin, The State and Revolution

 

మార్క్సిజాన్ని కొందరు ‘మేధావులు’ ఇచ్ఛవచ్చినట్లు వక్రీకరిస్తున్నారు. విలువ నియమం భంగం కాకుండా మార్క్స్ అదనపు విలువని శాస్త్రీయంగా వివరించినప్పటికీ అది తప్పనేవారు ఏర్పడ్డారు – అదీ ‘మార్క్సిస్టు’ ముద్రతో. కనక అసలు మార్క్స్ ఏమిచెప్పాడో చూడాల్సిన అవసరం వుంది. మార్క్సిజానికి ఆధారం ఆయన రచనలేగదా!
పెట్టుబడి పుస్తకం లక్ష్యం “ఆధునిక సమాజపు ఆర్థిక చలన నియమాన్ని బయటపెట్టడం” అని మార్క్స్ తొలి జర్మన్ కూర్పుకి ముందుమాటలో ప్రకటించాడు. అదే అదనపువిలువ నియమం. అదనపువిలువ ఉత్పత్తే ఈ ఉత్పత్తి విధానపు అఖండ నియమం (కాపిటల్ 1 పే. 580) అని చెప్పాడు.
అదనపువిలువ సూత్రం మార్క్స్ ఆర్థిక సిద్ధాంత సౌధానికి పునాది. విలువ నియమాన్ని అనుసరించి అదనపు విలువను రుజువుచేశాడు. ఈ రెంటినీ పరిశీలించడానికే ఈవ్యాసం.
మారకాలూ- విలువా
మనచుట్టూ అనేక సరుకులున్నాయి. మార్కెట్లలో లెక్కకు మించి మారకాలు జరుగుతుంటాయి. అవన్నీ సరుకుకీ డబ్బుకీ మధ్య. డబ్బు ఏర్పడక ముందు వస్తుమార్పిడి సాగింది. ఒక శేరు జొన్నలు యిచ్చి చిన్న గిన్నెడు నూనె తెచ్చుకోవడం. ఆరెండూ సమానమని ఇరువురూ అనుకుంటేనే మారకం జరుగుతుంది. డబ్బొచ్చాక సరుకుకీ, డబ్బుకీ సరిపోవాలి.
ఒక ఇల్లు = 5 మంచాలు అనేదానికీ, 
ఒక ఇల్లు = ఫలానింత డబ్బు అనేదానికీ                                             తేడావుండదు అన్నాడు అరిస్టోటిల్.

ఇలా విలువరూపాన్ని మొదట విశ్లేషించిన వ్యక్తి ఆయనే. మారకం అయ్యాయంటే రెండూ సమానమనే. “సమానత్వం లేకుండా మారకం జరగదు. ఒకే ప్రమాణం చేత కొలవబడకుండా సమానత్వం వుండదు.” సమాన విలువలు కలిగిన సరుకులే మారకం అవుతాయి అనే విషయం అరిస్టోటిల్ కి తెలుసు. అయితే “వాస్తవంలో అలాంటి పోలికలేని వస్తువులు ఒకే ప్రమాణంతో కొలవబడడం అసాధ్యం” అన్నాడు. కనక సమానీకరణ వాటి నిజస్వభావానికి కుదరని విషయం.  పర్యవసానంగా అది వాడుకలో అవసరాలకోసం తాత్కాలిక వుపకరణం మాత్రమే. అవసరాలకోసం నీది నాకు కావాలి, అలాగే నాది నీకు కావాలి. కనక మారకం చేసుకుందాం.

రెండు భిన్న రూపాలున్న సరుకుల్లో ఉమ్మడిగా ఏదో వుంటేనే గాని దాన్ని కొలిచి సమానం చేయటం సాధ్యంకాదు. అన్ని సరుకుల్లో ఉమ్మడిగా వుండి కొలవటానికి వీలయిన అంశం ఏదో ఆయన పరిశీలనకు అందలేదు.

ఆ అంశాన్ని సాంప్రదాయక అర్థశాస్త్ర సంస్థాపకుడూ, ఆడం స్మిత్, డేవిడ్ రికార్డో, కార్ల్ మార్క్స్ ల మార్గదర్శకుడూ విలియం పెట్టీ (1623-1687) పట్టుకున్నాడు. “ఒకడు సరిగ్గా ఒక బుషెల్ ధాన్యాన్నిఉత్పత్తి చెయ్యగలిగిన కాలంలోనే, పెరూ నేలలోంచి ఒక ఔన్సు వెండిని తవ్వి లండన్ కి తీసుకురాగలిగితే, అప్పుడు ఒకటి ఇంకోదానికి సహజమైన ధర అవుతుంది" అంటూ శ్రమే విలువసారం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు (కాపిటల్ 1, పే. 95). ఆయన “సరుకుల విలువను వాటిలో యిమిడివున్న శ్రమ పరిమాణాన్ని పోల్చి నిర్ణయిస్తాడు” (థియరీస్ ఆఫ్ సర్ ప్లస్ వాల్యూ, సం. 1, పే. 355).
పేరు తెలియని ఆర్థికవేత్త ఒకరు 1739-40లో కావచ్చు, జీవితావసరాలు “...ఒకదానితో మరొకటి మారకం చేసుకోబడినప్పుడు, వాటి విలువ తప్పనిసరిగా అవసరమైన శ్రమ పరిమాణం చేత, వాటిని ఉత్పత్తి చెయ్యడంలో మామూలుగా గ్రహించబడిన శ్రమ పరిమాణంచేత నియంత్రించబడుతుంది" అన్నాడు (కాపిటల్ 1, పాదసూచిక 47).
మొట్టమొదటిసారి ఉద్దేశ్యపూర్వకంగా, స్పష్టంగా మారకపువిలువని శ్రమకాలంగా తేల్చినవ్యక్తి బెంజమిన్ ఫ్రాంక్లిన్ (1706-1790). “రాజకీయ అర్థశాస్త్రపు ప్రామిక నియమాన్ని మొదట సూత్రీకరించినవ్యక్తి... ఫ్రాంక్లిన్” “విలువయొక్క వాస్తవస్వభావాన్ని కనుగొన్నాడు" అన్నాడు మార్క్స్. వర్తకం అంటే శ్రమను శ్రమతో మారకం చేయటం తప్ప మరొకటి కాదు, కనక అన్నివస్తువుల విలువా శ్రమచేత ... న్యాయంగా కొలవబడుతుంది అన్నాడు. మారకం అవుతున్న శ్రమలలోని వ్యత్యాసాల్ని ఉపేక్షించాడు. వాటన్నిటినీ సమాన మానవ శ్రమగా కుదించే అభిప్రాయాన్ని, తెలిసి కాకున్నా, వెల్లడించాడని మార్క్స్ శ్లాఘించాడు (కాపిటల్ 1, పే. 57, పాదసూచిక 1).
శ్రమే అన్నిసరుకుల మారకంవిలువలకీ నిజమైన కొలత అన్నాడు ఆడం స్మిత్.
వేటగాళ్ల సమాజంలో ఒక బీవర్ని చంపటానికి పట్టేకాలం ఒక జింకని చంపటానికి పట్టేకాలానికి రెట్టింపు అయితే, ఒక బీవర్ కీ రెండు జింకలకీ మారకం జరుగుతుంది. తరవాతి సమాజాల్లో అలాకాదు. ధాన్యం ధరలో ఒక భాగం భూస్వామి భూమి కౌలుగా, రెండో భాగం కార్మికుల వేతనంగా, మూడోది రైతు లాభంగా ఉంటుంది. ధాన్యం ధర కౌలు, అద్దె, వేతనం, లాభంగా పరిణమిస్తుంది అంటాడు. వేతనాలూ, అద్దె, లాభమూ మూడూ మారకపువిలువకి వనరు అని స్మిత్ చెప్పాడు. దీన్ని తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ థీరీ అన్నారు. 
విలువ నియమంలో గందరగోళం
విలువ నిర్ణయం విషయంలో స్మిత్ కుదురుగా లేడు. ఆదిమ సమాజంలో ఒక విధంగానూ, ఆతర్వాత సమాజాల్లో వేరొక విధంగానూ సరుకు విలువ వుంటుందని స్మిత్ అభిప్రాయపడ్డాడు. ఆదిమసమాజాల్లో ఉత్పత్తిసాధనాలు ఉత్పత్తిదారుల చేతిలోనే వుంటాయి. కనక ఉత్పత్తయిన సరుకు విలువను శ్రమపరిమాణం నిర్ణయిస్తుంది. ఉత్పత్తి విలువలో కౌలూ, వడ్డీ, లాభమూ వుండవు. అందువల్ల ఆకాలంలో శ్రమ పరిమాణమే విలువను నిర్ణయిస్తుంది. అయితే భూస్వామ్యంలో, పెట్టుబడిదారీ విధానంలో భూస్వామీ, వడ్డీ వ్యాపారీ, పెట్టుబడిదారూ వుత్పత్తిసాధనాలకు యజమానులుగా వుంటారు. ఉత్పత్తిదారులు వాళ్లమీద ఆధారపడాలి. ఆ పరిస్థితుల్లో ఉత్పత్తయిన సరుకు విలువ శ్రమని బట్టి మాత్రమే వుండదు. దానికి కౌలూ, వడ్డీ, లాభాలూ కలుస్తాయి. దీన్నిబట్టి భూస్వాములూ పెట్టుబడిదారులూ లేని సమాజానికి వర్తించిన విలువ నియమం వాళ్లు వున్న సమాజానికి వర్తించదు.
“ఈ ధోరణి రికార్డోకి ఆమోదయోగ్యం కాలేదు.” విలువ నియమం వంటి మౌలిక నియమం, సమాజపు అభివృద్ధితో మారిపోదు. “శ్రమకాలాన్ని బట్టి విలువని నిర్ణయించటం సర్వకాలాలకూ వర్తించే సార్వత్రిక నియమం” అన్నాడు. రికార్డో అర్థశాస్త్రానికి చేసిన గొప్ప సేవ దే.
రాజకీయార్థికశాస్త్రం సైన్సుగా వృద్ధి అయ్యేకొద్దీ బూర్జువా సమాజంలో సరుకువిలువని నిర్ణయించేది ఆ సరుకు ఉత్పత్తికి అవసరమైన శ్రమకాలమేఅనే విషయాన్ని సాంప్రదాయ అర్థశాస్త్రం ఆవిష్కరించింది.
అన్ని సరుకుల ధరలూ నిరంతరం మారుతూ వుండడం పూర్వమే గమనించారు. ఆ పరిస్థితులకు, ధరలు పెరుగుతూ, తరుగుతూ వుండటానికి, ఉత్పత్తితో తరచుగా సంబంధం లేదనీ, ధరలు యాదృచ్చికంగా నిర్ణయించ బడుతున్నాయనీ అప్పట్లో భావించారు. తర్వాతి కాలంలో "యీ యెగుడు దిగుడులు దేనిచుట్టూ జరుగుతాయో ఆ స్థిరమైన కేంద్రబిందువుకోసం అన్వేషించారు. సరుకు విలువ సరుకులోవున్నట్టి, దాని వుత్పత్తికి అవసరమైనట్టి శ్రమ చేత నిర్ణయింపబడుతుందని సాంప్రదాయిక అర్ధశాస్త్రం కనుగొన్నది. యీ వివరణతో అది తృప్తిపడింది...”
యీ వివరణ అరకొర వివరణే అన్నాడు ఎంగెల్స్. శ్రమకు గల విలువను సృష్టించే గుణాన్ని సమగ్రంగా పరిశీలించిన మొదటివాడు మార్క్సేనన్నాడు. స్మిత్, రికార్డోల అభిప్రాయాలలో వున్న లోపాల్ని మార్క్స్ సవరించాడు. సమగ్రమైన, శాస్త్రీయమైన శ్రమాశ్రయ విలువ నియమాన్ని రూపొందించాడు. వారికిముందు అభివృద్ధి అయి, కాలపరీక్షకు నిలబడ్డ ప్రతి అంశాన్నీ ఇముడ్చుకున్నాడు. మార్క్స్ కాపిటల్ చదివినవారికి ఆయన తనముందువారి రచనల్ని కూలంకషంగా చదివినట్లు బోధపడుతుంది. అంతేకాదు, ఎవరు  ఎంత గౌరవానికి  అర్హులయితే అంతా ఇచ్చాడు. అదే సమయంలో వాళ్లు జవాబు చెప్పలేకపోయిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. మార్క్స్ విలువనియమాన్ని లోపరహితం చేశాడు. 

శ్రమ ద్వంద్వస్వభావం

సరుకు అనేది ఉపయోగపువిలువ, విలువల సమ్మేళనం. అలా అది ద్వందస్వభావి అయినప్పుడు, దాన్ని సృజించిన శ్రమ కూడా ద్వంద్వస్వభావం కలిగివుండాలని మార్క్స్ గ్రహించాడు. మార్క్స్ శ్రమవిలువ సిద్ధాంతంలో అనిర్దిష్టశ్రమ కేంద్ర బిందువు. నిర్దిష్ట అనిర్దిష్టశ్రమల మధ్య భేదానికి ఆయన చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. "సరుకుల్లో ఇమిడివున్న శ్రమ ద్వంద్వస్వభావమే రాజకీయ అర్థశాస్త్ర అవగాహనకి ఇరుసు” అన్నాడు (కాపిటల్ 1, పే. 49)
ఇంతకు ముందటి ఆర్థికవేత్తలు సరుకుని శ్రమకు మదింపు చేశారు. అయితే ఆ మదింపు అసంపూర్ణమైనదీ, అస్పష్టమైనదీను. సరుకును శ్రమకు మదింపు చేస్తేనే చాలదు. నిర్దిష్ట, అనిర్దిష్ట రూపాలలో, ద్వంద్వరూపంలో మదింపు చేయటం అవసరం (మార్స్క్ ఎంగెల్ ఆర్కైవ్స్ సం. 11, పే. 38 – ఉంటంకింపు: కార్ల్ మార్క్స్ గ్రేట్ డిస్కవరీ – అఫనాసియేవ్, పే. 24). సరుకులు ఉత్పత్తిచేసేటప్పుడు ఏ నిర్దిష్ట శ్రమ చేస్తున్నప్పుడయినా శారీరక,మానసిక శ్రమ వ్యయమవుతుంది. ఇది సాధారణ శ్రమ (లేబర్ ఇన్ జనరల్). ఇది సమాజంలో సార్వకాలికమైనది. ఇది కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో, సరుకుల వుత్పత్తిలో, అనిర్దిష్ట శ్రమ రూపం పొందుతుంది. ఆర్థికవేత్తలందరూ, మినహాయింపు లేకుండా, సరుకు ద్వంద్వ స్వభావం అనే మామూలు అంశం వదిలిపెట్టారు. ఉపయోగపు విలువ, మారకపు విలువ కలిగి వున్నట్లయితే ఆ సరుకు ఏ శ్రమకు ప్రతినిధిగా వుందో ఆ శ్రమ కూడా ద్వంద్వ స్వభావాన్ని కలిగివుండాలి అని ఎంగెల్స్ కి రాసిన లేఖలో మార్క్స్ అన్నాడు.
నిర్దిష్ట శ్రమ ఉపయోగకర వస్తువులను సృష్టిస్తుంది. బట్ట నేసే పనికీ, కుండలు చేసే పనికీ భేదం వుంటుంది. ఏ వస్తువు ఉత్పత్తి చెయ్యాలన్నా దానికి అనువైన నిర్దిష్ట శ్రమ అవసరం. కనక నిర్దిష్ట శ్రమలను సమానపరచటం వీలుకాదు. అవి ఒకదానితో ఒకటి విభేదిస్తాయి. నిజమే. అయితే, వాటన్నిటికీ ఒక సామాన్య గుణం వుంది. ఏ వస్తువు చేస్తున్నా, మెదడూ, కండరాలూ, నరాలూ పని చేస్తాయి. మనిషి శక్తి ఖర్చవుతుంది. సరుకులో చేరుతుంది. ఇది అన్ని సరుకుల్లోనూ వుంటుంది. సరుకు వుత్పత్తి రాకముందు కూడా ఈ శ్రమశక్తి వ్యయం వుంది. అయితే వుత్పత్తయిన వస్తువులు ఆ బృందం లోని వారే వాడుకునేవారు. అవి సరుకులు కావు. మారకం కావు. అందువల్ల, వెచ్చించిన శ్రమను మారకం కోసం పోల్చాల్సిన పనిలేదు. కాని సరుకుల వుత్పత్తీ, మారకం ఏర్పడ్డాక మాత్రం వెచ్చించిన శ్రమను పోల్చవలసి వచ్చింది. ఇది చారిత్రక ధాతువు. దీన్ని మార్క్స్ అనిర్దిష్టశ్రమ అన్నాడు. విలువని ఏర్పరచేది ఇదే. అన్నిసరుకుల్లోనూ వుండే ఉమ్మడి అంశం ఇదే. సరుకుల సమానత్వాన్ని తేల్చేది ఇదే.
ప్రతి వుత్పాదకుని శ్రమా మొత్తం సమాజపు శ్రమలో భాగం. అంటే అది సామాజిక శ్రమ. తమ వుత్పాదితాల్ని అంగట్లో అమ్మేటప్పుడు అన్ని నిర్దిష్ట శ్రమల్నీ అనిర్దిష్ట శ్రమకు కుదించాలి. అప్పుడు వారి శ్రమ సామాజిక స్వభావం తెలుస్తుంది.
ఒకే సరుకు అనేకమంది తయారుచేస్తారు. వాళ్ల పరిస్థితుల్ని బట్టి వేర్వేరు పరిమాణాల్లో శ్రమ వెచ్చిస్తారు. ఒకే రకం సరుకులకు వేరు వేరు శ్రమకాలాలు లెక్కకు రావు. అవి సామాజికంగా అవసరమైన శ్రమ కాలానికి కుదించబడతాయి.
“సామాజికంగా అవసరమైన శ్రమకాలం అంటే, ఆకాలంలో అమలులోవున్న సాధారణ పరిస్థితులలో సగటు నైపుణ్యపు ప్రమాణంతో, తీవ్రతతో ఒక వస్తువును వుత్పత్తి చేయడానికి అవసరమైన శ్రమకాలం" అని మార్క్స్ నిర్వచించాడు. సరుకు విలువని నిర్ణయించేది సామాజికంగా అవసరమైన శ్రమకాలం అని మార్క్స్ నిర్ధారించాడు.

దనపు విలువ-విలువ నియమంతో చిక్కులు

మార్క్సు పెట్టుబడిదారీ ఆర్థిక విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. ఆయనకు ముందే సాంప్రదాయిక అర్థశాస్త్రవేత్తలు శ్రమాశ్రయ విలువ సిద్ధాంతానికి పునాదులు వేశారు.
పెట్టుబడికీ శ్రమకీ మారకంలో "శ్రమవిలువ దేనిచేత నిర్ణయించబడుతుంది? శ్రమచేతనే విలువ నిర్ణయించ బడుతుందనే నియమాన్ని శ్రమ అనే సరుకుకి అన్వయించినప్పుడు అర్థశాస్త్రవేత్తలు అంతర్వైరుధ్యంలో పడ్డారు. శ్రమ విలువ ఎలా నిర్ణయించబడుతుందిఆ శ్రమలో వున్న అవసరశ్రమ చేత. ఒక గంట శ్రమవిలువ ఒక గంట శ్రమకు సమానం అనిమాత్రమే మనకు తెలిస్తే, దాన్నిగురించి బొత్తిగా మనకేమీ తెలియదన్నమాట. యిది మనల్ని వెంట్రుక వాసి కూడా గమ్యం దగ్గరకి తీసుకుపోదు; మనం ప్రదక్షిణం చేస్తూనే వుంటాం." (‘వేతన శ్రమ - పెట్టుబడి కి ఎంగెల్స్ ప్రవేశిక,  సంకలిత రచనలు-2,  పే 84-85). 
శ్రమ సృజించిన విలువనే వాళ్లు శ్రమవిలువ అనుకున్నారు. అందువల్లే, శ్రమవిలువని తేల్చే పని పెట్టుకున్నారు. అది తేలలేదు, తేలేదీ కాదు.
రికార్డో పెట్టుబడికీ శ్రమకీ మారకం విషయంలో సమానత్వం గురించి ఆలోచించాడు. ఆయనకొక చిక్కు వచ్చింది. పెట్టుబడిదారు కార్మికుని శ్రమకు శ్రమవిలువ చెల్లించి చాకిరీ చేయించుకుంటున్నాడు. లాభం పొందుతున్నాడు. శ్రమవిలువ పూర్తిగా కార్మికుడికిస్తే మరి లాభం ఎక్కడనుంచి వస్తుంది? కార్మికునికి తక్కువ ఇస్తే సమాన విలువల మధ్య మారకం జరగలేదని అర్థం గదా? శ్రమ విలువ సిద్ధాంతమే తప్పవుతుంది గదా? సమాన విలువలే మారకం కావాలి, లాభం రావాలి. శాస్త్రీయంగా దీన్ని రుజువు చెయ్యలేకపోయాడు రికార్డో. ఇదే ఆయన్ని వేధించిన సమస్య. వాస్తవానికీ సూత్రానికీ మధ్య పొంతన కుదర్చలేక పోయాడు. విలువ సిద్ధాంతాన్ని వదులుకోలేకా, వాస్తవంగా వస్తున్న లాభాన్ని భ్రమ అనలేకా సతమతమయ్యాడాయన.
రికార్డో శిష్యుడిగా జాన్ స్టువర్ట్ మిల్ (1806-1873) శ్రమనీ, పెట్టుబడినీ శ్రమయొక్క వేర్వేరు రూపాలుగా నిర్వచించాడు. "శ్రమా,పెట్టుబడీ...ఒకటి ప్రస్తుత శ్రమ...మరొకటి నిల్వపడ్డ శ్రమ" అన్నాడు. తక్షణశ్రమ తక్కువ నిల్వశ్రమతో మారకమవుతుంది అని అభిప్రాయ పడ్డాడు. అసమాన విలువల మారకం అన్నమాట. ఇది విలువ నియమాన్ని భంగపరుస్తుందని అంగీకరించడమే అన్నాడుమార్క్స్ (అదనపు విలువ సిద్ధాంతాలు-3, పే. 98-99).

శ్రమా- శ్రమశక్తీ
కార్మికుడు అమ్ముతున్నది శ్రమని కాదు, శ్రమశక్తిని అని మార్క్స్ నిర్ధారించాడు. శ్రమశక్తి సరుకు. శ్రమ కాదు. శ్రమ అనేది చలనంలో వున్న శ్రమశక్తి. కనుక శ్రమకి విలువ వుండదు. శ్రమశక్తి అనే మాట మార్క్సుకి ముందు వాడుకలో లేదు. శ్రమశక్తి విలువనే శ్రమవిలువ అనేవారు. మార్క్స్ ప్రకారం శ్రమకి విలువ వుండదు. ఎందుకంటే అది సరుకు కాదు. కనక శ్రమవిలువ అనేది అర్ధంలేని పదబంధం. శ్రమశక్తి ధర లేక విలువ పైకి శ్రమ ధరగా, విలువగా  కనిపిస్తుంది. మార్క్స్ శ్రమశక్తి విలువ అనే అర్ధంలోనే శ్రమ విలువ అనే మాట వాడాడు. కారణం ఆ మాట ప్రజల్లో విశేషమైన ప్రాచుర్యంలో ఉండటమే.
సాంప్రదాయిక అర్థశాస్త్రం పరిష్కరించలేకపోయిన సమస్యని మార్క్స్ ఎత్తుకున్నాడు. సమానవిలువలే మారకం కావాలి. అయినా లాభం రావాలి. ఈ వాస్తవ పరిస్థితి కళ్లకు కనబడుతున్నదే. కార్మికులు శ్రమ చేస్తున్నారు. బదులుగా వేతనం పొందుతున్నారు. ఇది శ్రమకీ, పెట్టుబడికీ మారకం. శ్రమచేయని పెట్టుబడిదారు లాభం పొందుతున్నాడు. శ్రమే విలువకు ఏకైక వనరు అయితే లాభం వుండకూడదు. లేదా, శ్రమకీ, పెట్టుబడికీ నిరంతరం జరుగుతున్న మారకం అసమానమయినది అయి తీరాలి. వాళ్లు కొట్టుమిట్టాడిన వైరుధ్యం ఇదే.
“అందుచేత, లాభాల సాధారణ స్వభావాన్ని వివరించడానికి, సగటున, సరుకులు తమ అసలు విలువకు అమ్ముడవుతాయనీ, వాటిని వాటి విలువకు అంటే, వాటిలో నిక్షిప్తమైన శ్రమ పరిమాణపు అనుపాతంలో అమ్మడం ద్వారా లాభం వస్తుంది అన్న సిద్ధాంతం నుండి బయలుదేరాల్సి వుంటుంది. ఈ ప్రాతిపదికపై సమస్యను వివరించలేక పోయినట్లయితే, దాన్నసలు వివరించనే లేం. నిత్యజీవితానుభవాన్ని బట్టి యిది విరోధాభాసమైన అసంగత విషయంగా కనిపిస్తుంది. కాని భూమి సూర్యునిచుట్టూ తిరగటం, భగ్గునమండే రెండు వాయువుల కలయికద్వారా నీరు ఏర్పడటం కూడా విరోధాభాసమైన విషయాలే. నిత్యజీవితానుభవరీత్యా విజ్ఞాన శాస్త్రీయ సత్యాలను పరిశీలిస్తే, నిత్యజీవితానుభవమెప్పుడూ వస్తువుల భ్రమాత్మక బాహ్యాకృతులనే చూస్తుంది కనుక, అవి ఎల్లప్పుడూ విరోధాభాసగానే  కానవస్తాయి" (మార్క్స్ ఎంగెల్స్ సంకలిత రచనలు, భాగం 2, పే. 45).
రెండురకాల చలామణీలు
డబ్బుకీ సరుకులకీ రెండురకాల చలామణీలున్నాయి. ఒకటి కొనడం కోసం అమ్మడం: గంపలమ్మి, బియ్యం కొనడం. ఇది సరుకు-డబ్బు-సరుకు. ఇక్కడ రెండు సరుకులూ భిన్నమయినవి. ఈ మారకపు ఉద్దేశం ఉపయోగపువిలువ. ఈ చర్యతో అది ఆగిపోతుంది. రెండోది అమ్మడం కోసం కొనడం. అంటే డబ్బు-సరుకు-డబ్బు. ఇక్కడ మొదటిదీ డబ్బే చివరదీ డబ్బే. గుణాత్మకంగా ఒకటే. పరిమాణంలో మాత్రమే తేడా వీలవుతుంది. సరిగ్గా పెట్టుబడిదారు ఆశించేది అదే. దీని సంకేతం డ-స-డ’. కాని సమాన విలువల మారకం ప్రాతిపదికన ఇది ఎలా సాధ్యపడుతుంది?
డ-స-డ‘  చలనం  డబ్బుని పెట్టుబడిలోకి మారుస్తుంది. డబ్బు దానికదిగా పెట్టుబడికాదు.
మొదట మదుపు పెట్టిన ధనంకంటే “సరుకునుంచి మరింత ఎక్కువ ధనాన్ని తిరిగి రాబట్టటం కోసం సరుకు రూపంలోకి మార్చబడిన ధనమే పెట్టుబడి.”
కొత్తగా రంగంలోకి (మార్కెట్లోకి) దిగే పెట్టుబడి మొదట డబ్బురూపంలోనే వుంటుంది. అది ఒక నిర్దిష్టప్రక్రియ ద్వారా పెట్టుబడిలోకి మారుతుంది. కేవలం డబ్బుకీ, పెట్టుబడి అయిన డబ్బుకీ తొలితేడా వాటి చలామణీ రూపం తప్ప మరేమీకాదు.
మొదట పెట్టిన డబ్బుకంటె చలామణీ చివరలో ఎక్కువ పొందుతాడు. ఈ ప్రక్రియ కచ్చితమైన రూపం డ-స- డ' లో  ' = డ+ Δడ= మొదట మదుపు (అడ్వాన్స్) పెట్టిన డబ్బు + పెరుగుదల. ఈ పెరుగుదలని లేక ఎక్కువని అదనపు విలువ అన్నాడు మార్క్స్. మదుపు పెట్టిన విలువ చలామణీలో అలాగే వుండి, అదనపు విలువని కూడా తనకు తాను కలుపుకుంది. ఈ చలనమే దాన్ని పెట్టుబడిలోకి మారుస్తుంది. డబ్బునుంచి సరుకుల్లోకీ, సరుకులనించి డబ్బులోకీ మారుతూ, అదేసమయంలో పరిమాణాన్ని మార్చుకుంటుంది. విలువ అనేదే ఇక్కడ క్రియాశీలమైనది. విలువ తనకు విలువను కలుపుకుంటుంది. అయితే స-డ-స వలయంలో లాగే డ-స-డ లో కూడా సరుకుల విలువల సమానత్వం అవసరమైన షరతు.
అయితే డబ్బు రెండు రూపాల్లో ఒకటి మాత్రమే. అది సరుకురూపం తీసుకుంటేనే గాని పెట్టుబడి కాదు. డ-స-డ' అనేది పెట్టుబడి సాధారణ సూత్రం.
మరి అదనం ఎక్కడినించి వస్తున్నది? సరుకుల మారకమే విలువని తేదు. కనక చలామణీలో కనబడనిది ఏదో నేపథ్యంలో జరిగి వుండాలి.
పెట్టుబడిదారు కార్మికునికి రోజుకూలీ యిచ్చి దూదినుంచి నూలు తీయిస్తాడు. దూది విలువ అలానే వుంటుంది. కాని నూలులో కొత్తగా శ్రమ కలుస్తుంది. ఆమేర విలువ పెరుగుతుంది. ఇప్పుడు నూలును దాని విలువకే అమ్ముతాడు అయినా అదనపు విలువ పొందుతాడు.
అదనపు విలువ అనే భావాన్ని ప్రవేశపెట్టినవాడు మార్క్స్. అంతకు ముందు వాళ్లు అందులోని భాగాల్ని - లాభం, వడ్డీ, భూమి అద్దె/ కౌలు - విడివిడిగా చూశారు. ఆర్థికవేత్తలందరూ ఒక పొరపాటు చేశారు. అదనపువిలువని దానికదిగా, స్వచ్చరూపంలో ఎవ్వరూ పరిశీలించలేదు. దాని ప్రత్యేకరూపాలయిన లాభంగా, అద్దెగా పరిశీలించారు (థియరీస్ ఆఫ్ సర్ ప్లస్ వాల్యూ సం. 1 పే. 40).
అదనపు విలువను దాని ప్రత్యేక రూపాలయిన లాభం, వడ్డీ, అద్దె వగైరాల నుంచి విడిగా, స్వతంత్రంగా చూడటం తన పుస్తకంలోని రెండు మంచి అంశాలలో ఒకటని పెట్టుబడి మొదటిభాగం ప్రచురించాక, ఎంగెల్స్ కి 1867 ఆగస్ట్ 24 న రాసిన ఉత్తరంలో మార్క్స్ అన్నాడు.
మార్క్సుకు ముందువాళ్లు కార్మికుడు అమ్మేది తన శ్రమని అన్నారు. ఫ్రస్తుత బూర్జువా ఆర్థికవేత్తలు దాన్నే కొనసాగిస్తున్నారు. మార్క్సు దీన్ని ఖండించాడు. అమ్మేది శ్రమను కాదు, శ్రమశక్తిని అని రుజువుచేశాడు. ఇది ఆయన శాస్త్రీయ ఘనతల్లో ఒకటి.
శ్రమవిలువ దగ్గర బయలుదేరిన సాంప్రదాయ ఆర్థికవేత్తలకు యిబ్బంది ఎదురయింది. శ్రమశక్తి దగ్గర బయలుదేరితే చిక్కు వీడిపోతుంది. శ్రమశక్తి ఒక సరుకు. అయితే అది విశిష్టమైన సరుకు. విలువను సృష్టించటం దాని ఉపయోగపు విలువ.
పెట్టుబడిదారు కార్మికుల శ్రమను డబ్బుతో కొన్నట్లు కనబడుతుంది. వాళ్లు తమ శ్రమను డబ్బుకుగాను పెట్టుబడిదారుకు అమ్ముతారు. కాని యిది పైకి కనిపించేది మాత్రమే. నిజానికి వాళ్లు అమ్మేదీ, అతను కొనేదీ శ్రమశక్తిని. శ్రమవిలువ సిద్ధాంతం కేంద్రంగా రాజకీయ అర్థశాస్త్రాన్ని నిర్మించటానికి రికార్డో ప్రయత్నించాడు గాని కార్మికులు అమ్ముతున్నది శ్రమని కాదనీ శ్రమశక్తిననీ గ్రహించలేదు అంటాడు మార్క్స్.
పెట్టుబడి సాధారణ సూత్రం డ-స-డ' లో మొదటి డబ్బు కంటే రెండోది ఎక్కువ పరిమాణం. మొదటి చర్య డబ్బుతో సరుకును కొనడం. ఈ చర్య డబ్బుని పెంచదు. రెండో చర్య సరుకుని డబ్బుకు అమ్మడం. ఇందులోనూ డబ్బు పెరగదు. మరి  చివరలో ఎక్కువ డబ్బు  ఎలా వస్తున్నది? ఇది సాధ్యం కావాలంటే మొదటి చర్యలో కొన్న సరుకు విలువకంటె రెండోచర్యలో అమ్మే సరుకు విలువ ఎక్కువై తీరాలి. ఈ విలువ పెరగడం మొదటి చర్యలో కొన్న సరుకు వల్ల జరగాలి. అదికూడా ఆ సరుకు విలువలో భాగం కాదు. అందువల్ల ఒకనిర్ధారణకు రాకతప్పదు: అదేమంటే, ఆ సరుకు విలువను సృష్టించేదై వుండాలి. అదికూడా తన విలువకంటె ఎక్కువ విలువను. అప్పుడు మాత్రమే డ-' అవుతుంది. అలాంటి విశిష్ట లక్షణం గల సరుకు లభ్యమయింది. అదే శ్రమశక్తి, పనిచేయగల సామర్ధ్యం. విలువని ఏర్పరిచే  సరుకు అదొక్కటే. అందుకే అది విలక్షణమైన సరుకు.
మరి దాని విలువ ఎలా నిర్ణయమవుతుంది? అన్ని సరుకుల విలువ లాగానే. అంటే దాని వుత్పత్తికి అవసరమయ్యే శ్రమకాలం చేత. శ్రమ శక్తి మనిషికి బయట వుండదు. సజీవ మానవుని శక్తిగా వుంటుంది. కనక అతని వుత్పత్తికి కావలసింది పోషణే. అందుకు కొంత పరిమాణంలో జీవితావసరవస్తువులు కావాలి. శ్రమశక్తి వుత్పత్తికి అవసరమయ్యే  శ్రమకాలం, ఆ జీవితావసర వస్తువుల వుత్పత్తికి అవసరమయ్యే శ్రమకాలమే. ఆ విలువ చెల్లించి ఒక రోజు శ్రమశక్తిని కొన్నా గాని, కార్మికుడు దాన్ని చేతుల్లో పెట్టలేడు. వచ్చి పనిచేస్తాడు. బట్ట నేశాడనుకుందాం. బట్టగా మారేది దారం. మగ్గం కాదు. అయినా మగ్గం లేనిదే బట్ట తయారవదు. ఇవి పాదార్థిక అంశాలు. శ్రమ మానవాంశం. రెండూ వుంటేనే శ్రమప్రక్రియ సాధ్యమవుతుంది.
శ్రమవిలువ సిద్ధాంతాన్ని పట్టుకున్న స్మిత్, రికార్డోలు కార్మికుడు అమ్ముతున్నది శ్రమ అనుకున్నారు. వాళ్ల దృష్టిలో శ్రమే సరుకు. సరుకు విలువని నిర్ణయించేది ఆ సరుకులోవున్న శ్రమే. ఆలెక్కన శ్రమలో ఇమిడివున్న శ్రమే శ్రమవిలువని నిర్ణయించాలి. ఇలా శ్రమవిలువ శ్రమే అనే వలయంలో చిక్కుకున్నారు.
అర్థశాస్త్రవేత్తలు శ్రమే సరుకు అనుకున్నారు. పెట్టుబడిదారు కార్మికుని శ్రమను కొంటున్నాడు. మారకం విలువ చెల్లించి, ఉపయోగపు విలువను పొందుతున్నాడు. అతని చేత శ్రమ చేయించి సరుకులు ఉత్పత్తి చేయిస్తున్నాడు. ఆ సరుకులు కార్మికునికి చెందవు. వాటిపై సర్వహక్కులూ పెట్టుబడిదారువే. వాటిని వాటి విలువలకే అమ్ముతున్నాడు. ఈ వాదనతో వచ్చిన చిక్కేమంటే సమాన మారకాలే జరుగుతుంటే లాభం ఎలా వస్తుంది? రాకూడదు. కాని వస్తున్నదే! అంటే శ్రమవిలువ నియమమే సరయినది కాదా?
"ఒక మనిషి విలువ...మిగతా వస్తువుల విలువ లాగ అతని ధర, అంటే, అతని శక్తిని వుపయోగించుకునేందుకు ఎంత ఇవ్వబడుతుందో అంతన్నమాట" (కాపిటల్ 1, పే. 167, పాదసూచిక 2) అని థామస్ హాబ్స్ తన లెవియాథాన్ పుస్తకం (1839-44) లో చెప్పాడు. ఆయన తర్వాతివారు ఈ ఆవిష్కరణని గమనించలేదు అంటాడు మార్క్స్ (వేతనం,ధర, లాభం, మార్క్స్ ఎంగెల్స్ సంకలిత రచనలు, భాగం 2,  పే. 46).
ఒక ఉపయోగపు విలువని ఉత్పత్తిచేసేటప్పుడు, తనలో వున్న ఏ మానసిక శారీరక సామర్ధ్యాల్ని మనిషి నియోగిస్తాడో ఆ సామర్ధ్యాల మొత్తమే శ్రమశక్తి లేక పనిచేయగల సామర్ధ్యం అని శ్రమశక్తిని నిర్వచించాడు (కాపిటల్ 1, పే. 164). అలాగే, “శ్రమశక్తి యొక్క విలువ శ్రమశక్తిని సృష్టించడానికీ, అభివృద్ధి చెయ్యడానికీ, కొనసాగించడానికీ కావలసిన జీవితావసరాల విలువ చేత నిర్ణయించబడుతుంది” అన్నాడు (సంకలిత రచనలు, భాగం 2,  పే. 48).
సమానకాలు మారకమైనా, అసమానకాలు మారకమైనా అదనపు విలువ రాదు. చలామణీ విలువను చేర్చదు. మారకం విలువను చేర్చదు. ఇవన్నీ మార్క్స్ కి ముందువాళ్లే చెప్పారు. వర్తకుని పెట్టుబడి, వడ్డీ పెట్టుబడికి విభిన్న  రూపాలు. అయితే ఇవి ఆధునిక పెట్టుబడి ప్రామాణిక రూపం  కంటే ముందునుంచే వున్నాయి. డబ్బు పెట్టుబడిలోకి మారడాన్ని సరుకుల మారకపు నియమాల పునాది మీద వివరించాలి. సమానమైనవాటి మారకం అందుకు ఆరంభ బిందువు కావాలి. డబ్బుని పెట్టుబడిలోకి మార్చాలని వచ్చిన తొలి పెట్టుబడిదారు సరుకుల్ని వాటి విలువలకే కొనాలి. వాటి విలువలకే అమ్మాలి. ప్రక్రియ చివరలో చలామణీ మొదట పెట్టిన డబ్బుకంటె ఎక్కువ డబ్బు లాగాలి. పూర్తి పెట్టుబడిదారుగా అతని అభివృద్ధి చలామణీ రంగం లోపలా, వెలుపలా జరగాలి. ఇవి సమస్య షరతులు.

మార్క్స్ వివరణ

ఇవన్నీ ఎలా నెరవేరాయో మార్క్స్ వివరించాడు. “మార్కెట్ లో ఎంతో విలక్షణమైన సరుకు ఒకటి ఉంది. దాని  ఉపయోగపు విలువ అంతా మారకపు విలువని ఉత్పత్తి చేయడమే. అలాంటి సరుకును కనుగొన్నప్పుడు మాత్రమే యీ చిక్కు సమస్య విడిపోతుంది. అలాంటి సరుకు వుంది - అదే శ్రమశక్తి. ఒక సరుకు సొంతదారు తన శ్రమతో విలువని సృజించగలడు, కాని స్వయం వర్ధమాన విలువను సృజించజాలడు. తన సరుకుకు తాజాశ్రమ కలిపి మరికొంత విలువను చేర్చగలడు. ఉదాహరణకి, తనదగ్గరున్న తోలుతో బూట్లు తయారుచెయ్యటం ద్వారా. అదే తోలులో ఇప్పుడు ఎక్కువ విలువ ఇమిడి వుంటుంది, ఎక్కువ శ్రమ ఇమిడివుంటుంది కనక. అయితే తోలు విలువ అంతకు ముందెంతో ఇప్పుడూ అంతే. అది వ్యాకోచించలేదు. బూట్లు తయారు అవుతున్నప్పుడు అదనపు విలువను చేర్చలేదు. కనక సరుకు ఉత్పత్తిదారు ఇతర సరుకు ఉత్పత్తిదారులతో సంబంధంలోకి రాకుండా, చలామణీ రంగం బయట, విలువని పెంచలేడు. ఆ కారణంగా డబ్బునిగానీ, సరుకునిగానీ పెట్టుబడిలోకి మార్చలేడు. అంటేచలామణీ వల్ల పెట్టుబడి ఉత్పత్తి సాధ్యం కాదు. చలామణీ వెలపల ఉత్పత్తవటం అసాధ్యం.
ఒక కార్మికుడి జీవితావసర వస్తువులు ఒక రోజుకు సరిపడేవి ఉత్పత్తి కావటానికి 4 గంటల సామాజిక శ్రమ పడుతుందనుకుందాం. ఆతర్వాత కూడా అతను పనిచెయ్యగలడు. మరో 4 లేక 6 గంటలు. ఇది అదనపు శ్రమ. ఆ కాలంలో తయారయిన సరుకులు యజమానివే. వాటిని అమ్మినప్పుడు అదనపు విలువ దక్కుతుంది. కార్మికుడు తన శ్రమశక్తి మారకపు విలువ పొంది, ఉపయోగపు విలువను వదులుకున్నాడు. అంటే ఒకరోజు శ్రమశక్తి ఉపయోగపు విలువ అంతా శ్రమ యజమానికి చెందుతుంది. కనక అతను రోజంతా యజమాని కొరకు శ్రమ చెయ్యాలి. ఒక రోజు శ్రమశక్తిని పోషించటానికి సగం రోజు శ్రమ మాత్రమే చాలుననే పరిస్థితి యీ శ్రమశక్తి చేత రోజంతా పని చేయించవచ్చునన్న విషయమూ, అందుచేత దానిని రోజంతా వుపయోగించడం ద్వారా సృష్టించబడే విలువ దాని రోజువారీ విలువకు రెట్టింపు అయిన విషయమూ - ఇదంతా కొనేవాని అదృష్ట విశేషమే గాని, అమ్మినవానికి జరిగిన అన్యాయం యెంతమాత్రమూ కాదు. షరతులన్నీ వర్తించాయి. అదనపు విలువ చేకూరింది. డబ్బు పెట్టుబడిగా, స్వయం వర్ధమాన విలువగా మారింది.”
పెట్టుబడిదారు అదనపు శ్రమకాలాన్ని వీలయినంత పొడిగించే యత్నం చేస్తాడు. అది అతనికి ప్రయోజనం కనక. అయితే యీ పొడిగింపు కార్మికుల ప్రయోజనాల్ని దెబ్బగొడుతుంది. వర్గ పోరాటానికి దారిపడుతుంది. మామూలు పనిదినాన్ని తేల్చటం ఇరు వర్గాల మధ్య వందల ఏళ్లపాటు సాగిన పోరాట ఫలితం.
ఆ సరుకుల ఉత్పత్తికి పట్టే కాలం 'అవసరశ్రమకాలం'. ఆ కాలంలో వ్యయమైన శ్రమ 'అవసరశ్రమ'. ఆతర్వాత కూడా కార్మికుడు పనిచేస్తాడు. ఈ రెండోభాగం 'అదనపుశ్రమకాలం'. వ్యయమైన శ్రమ 'అదనపు శ్రమ'. ఇది అదనపు విలువను ఉత్పత్తిచేస్తుంది. శ్రమప్రక్రియ చివరలో మొదటపెట్టిన డబ్బుకంటె ఎక్కువ వస్తుంది. ఆ ఎక్కువే డబ్బును పెట్టుబడిలోకి మారుస్తుంది. పెట్టుబడిలోకి మారిన డబ్బు మరల చలనంలోకొస్తుంది. ఇది అలా కొనసాగుతూనే వుంటుంది.

విలువను నిర్ణయించేది సామాజికంగా అవసరమైన శ్రమ. కార్మికుడు అమ్మేదీ, పెట్టుబడిదారు కొనేదీ శ్రమశక్తిని, శ్రమను కాదు. శ్రమ సరుకు కాదు. కనక శ్రమవిలువ అనేది అర్థంలేని మాట. సమాన విలువలు మారకం అవుతూనే అదనపువిలువ వస్తుంది. ఇవి మార్క్స్ శాస్త్రీయంగా రుజువుచేసిన విషయాలు. వీటిని తప్పన్నా, వక్రీకరించినా, అది మార్క్సిజం అవదు. మహా అయితే మరొకరిజం కావచ్చు.