13, మార్చి 2019, బుధవారం

పెట్టుబడి సంచయనపు చారిత్రక ధోరణి


మార్క్స్ కాపిటల్     అధ్యాయం.32
పెట్టుబడి సంచయనపు చారిత్రక ధోరణి
పెట్టుబడి యొక్క ఆదిమ సంచయనం, అంటే దాని చారిత్రక పుట్టుక ఏమిగా తేలింది? అది బానిసలూ, ఫ్యూడల్ దాసులూ  వేతన శ్రామికులుగా మారడంగా, అందువల్ల,  కేవలం రూపం మారడంగా తేలింది.
ఈ రూపం మార్పు కాకుండా అది ఇంకా ఏమిటి?
తక్షణ ఉత్పత్తిదారుల ఆస్తిని, బలవంతంగా ఆక్రమించే సాధనం.  అంటే సొంత దారుని శ్రమవల్ల ఎర్పడ్డ ప్రైవేట్ ఆస్థిని రద్దుచేసే సాధనం. 
ఆస్తి శ్రామికునిదా? శ్రామికుడు కానివానిదా? అనేది కీలకం.
ప్రైవేట్ ఆస్తి సామాజిక, సమష్టి ఆస్తికి విరుద్ధం అయినదిగా ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే శ్రమసాధనాలూ, శ్రమ బాహ్య పరిస్థితులూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటాయో అక్కడ.అయితే ఈ ప్రైవేట్ వ్యక్తులు శ్రామికులా లేక శ్రామికులు కానివాళ్ళా అనేదాన్ని బట్టి ప్రైవేట్ ఆస్తి  స్వభావం వేర్వేరుగా ఉంటుంది. అంటే, శ్రామికులదైతే దాని స్వభావం ఒకరకంగానూ, అదే శ్రామికులు కాని వాళ్ళదైతే దాని స్వభావం మరొక రకంగానూ ఉంటుంది. చూడగానే, ఈ రెండు కొసల నడుమ  ఎన్నో ఛాయలు కనబడతాయి. అవి మధ్యంతర దశలకు అనుగుణమైనమైనవి. సన్నకారు పరిశ్రమకి - అది వ్యవసాయమైనా, వస్తూత్పత్తి అయినా, అవిరెండూ కలిసినదైనా- దానికి ప్రాతిపదిక: ఉత్పత్తి సాధనాలు శ్రామికుని ఆస్తిగా ఉండడం. సన్నకారు పరిశ్రమ సామాజిక ఉత్పత్తి అభివృద్ధికీ, శ్రామికుని స్వేచ్చాయుత వ్యక్తిత్వ వృద్ధికీ అవసరమైన షరతు.
ఈ సన్నకారు ఉత్పత్తి విధానం బానిస విధానంలోనూ, అర్ధబానిస విధానంలోనూ, ఇతర పరాధీన విధానాల్లో కూడా ఉండడం నిజమే. అయినా అది ఎక్కడ తన శక్తినంత ప్రయోగించి విజృంభిస్తుందంటే: శ్రామికుడు తన ఉత్పత్తిసాధనాలకి ప్రైవేట్ ఓనర్ గా ఉన్నప్పుడు మాత్రమే. అంటే, తాను దున్నుకునే భూమికి రైతు ఓనర్ అయినచోట; చేతివృత్తిదారుడు తాను ఉపయోగించే పనిముట్టుకు తానే ఓనర్ అయిన చోట. అటువంటి తావున మాత్రమే సన్నకారు ఉత్పత్తి తన లాక్షణిక రూపాన్ని పొందుతుంది.
సన్నకారు ఉత్పత్తి విధానం
ఈ సన్నకారు ఉత్పత్తి విధానానికి ముందు షరతులు:
1. భూమి భాగాలు విభజించబడి పంపిణీ అయి ఉండాలి.
2.ఇతర ఉత్పత్తి సాధనాలన్నీ చెల్లాచెదురుగా ఉండాలి.
అలా ఉన్నప్పుడే సన్నకారు ఉత్పత్తి సాధ్యం అవుతుంది.అయితే అది కొన్ని అంశాల్ని యధేచ్ఛగా ముందుకుపొనివ్వదు. అది అడ్డుకునేవి:
1.సన్నకారు ఉత్పత్తి విధానం ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణని సాధ్యం కానివ్వదు.
2.అదేవిధంగా సహకారాన్ని తిరస్కరిస్తుంది.
3.ప్రతి విడి ఉత్పత్తి ప్రక్రియలోనూ శ్రమ విభజనని మినహాయిస్తుంది.
4.ప్రకృతి శక్తుల్ని సమాజం చేతుల్లోకి తీసుకోడాన్నీ, వాటి ఉత్పాదక వినియోగాన్ని సమాజం అదుపులో ఉంచుకుకోడాన్నీ ఒప్పుకోదు.
5. సామాజిక ఉత్పత్తిశక్తులు స్వేచ్చగా అభివృద్ధి అవడాన్ని మినహాయిస్తుంది.
అది సంకుచితమైన, అంతో ఇంతో ఆదిమ హద్దుల్లో నడిచే సమాజానికీ, ఉత్పత్తివ్యవస్థకీ సరిపడి ఉంటుంది. దాన్ని శాశ్వతంగా ఉంచడం సాధ్యపడదు.
సన్నకారు ఉత్పత్తి విచ్ఛిత్తి
ఒకానొక అభివృద్ధిదశలో సన్నకారు ఉత్పత్తి తననే విచ్ఛిన్నం చేసే  భౌతికసాధనాల్ని ముందుకు తెస్తుంది. ఆక్షణం నుంచీ సమాజ హృదయంలో నూతన శక్తులూ, మనోద్రేకాలూ ఏర్పడతాయి. అయితే పాత సామాజిక వ్యవస్థ వాటికి సంకెళ్ళు వేసి అణచిపెట్టి ఉంచుతుంది. అది (ఆ వ్యవస్థ) ధ్వంసం చేయబడి తీరాలి; ధ్వంసం చేయబడింది.
సన్నకారు ఉత్పత్తి ధ్వంసం కావడం, వ్యక్తులపరంగానూ, చెల్లాచెదరుగానూ ఉన్న ఉత్పత్తిసాధనాలు సమాజపరంగా కేంద్రీకృతం అవడం,  అనేకమంది మరగుజ్జు ఆస్తులు కొద్దిమంది భారీ ఆస్తిగా అవడం, భూముల నించీ, జీవ నాధార సాధనాలనించీ, శ్రమ సాధనాల నుంచీ ప్రజారాసుల్ని తప్పించే ఆస్తి హరణం-  ఈ భయంకరమైన, బాధాకరమైన ఆస్తిహరణం పెట్టుబడి చరిత్రకి నాంది.
దోపిడీ మీద ఆధారపడ్డ ప్రైవేట్ ఆస్తి
ఆస్తిహరణం ఎన్నో బలాత్కార పద్ధతుల పరంపరతో కూడి ఉంది. వాటిలో మనం ఆదిమసంచయనంలో యుగ కర్తలైన వాటిని మాత్రమే సమీక్షించాం.
సొంత శ్రమతో సంపాదించుకున్న ప్రైవేట్ ఆస్తి స్థానాన్ని,వేతన శ్రమ దోపిడీ మీద ఆధారపడ్ద పెట్టుబడిదారీ ప్రైవేట్ ఆస్తి ఆక్రమిస్తుంది.  ఈ పరివర్తన ప్రక్రియ పాత సమాజాన్ని తగినంత విచ్ఛిన్నం చేయగానే, శ్రామికులు వేతన కార్మికులుగా మారగానే, పెట్టుబడిదారీ ఉత్పత్తివిధానం తన సొంత కాళ్ళ మీద తాను నిలబడగానే - అప్పుడు శ్రమ ఇంకా మరింతగా సామాజీకరణ చెందడమూ, భూమి వగయిరా ఉత్పత్తిసాధనాలు సామాజికంగా దోపిడీ చెయ్యబడే సాధనాలుగా, అందువల్ల సమష్టి ఉత్పత్తి సాధనాలుగా మారడమూ, అలాగే ప్రైవేట్ యజమానుల ఆస్తిహరణం కొత్తరూపం తీసుకుంటాయి. 
ఆస్తి హర్తల ఆస్థి హరణం
ఇప్పుడిక జరగాల్సింది తమకోసం తాము శ్రమచేసే వాళ్ళ ఆస్తిహరణం కాదు,  అనేకమంది శ్రామికుల్ని దోచే పెట్టుబడిదారుడి ఆస్థి హరణం. ఇది పెట్టుబడిదారీ ఉత్పత్తి యొక్క అంతర్గత సూత్రాల కార్యకలాపాల చేత, పెట్టుబడి కేంద్రీకరణచేత నిర్వహించబడుతుంది. ఒక పెట్టుబడిదారుడు ఎల్లప్పుడూ ఎంతోమంది పెట్టుబడిదారుల్ని దెబ్బ తీస్తుంటాడు, స్వాహా చేస్తుంటాడు.
ఈ పరివర్తన ప్రక్రియలొని అవకాశాల్ని అన్నిటినీ లాక్కునే వాళ్ళ సంఖ్య, పెట్టుబడిదారీ కుబేరుల సంఖ్య నిరంతరం తగ్గుతూ ఉంటుంది.  దీని పక్కనే దారిద్ర్యం, పీడన, బానిసత్వం, పతనం, దోపిడీ పెరుగుతుంటాయి; అయితే వీటితో పాటే కార్మికవర్గ తిరుగుబాటు కూడా ఎక్కువవుతుంటుంది. కార్మికవర్గం ఎల్లప్పుడూ సంఖ్యాత్మకంగా పెరుగుతూ ఉంటుంది.అంతకంతకూ ఎక్కువమంది అవుతుంటారు.ఈ వర్గం పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ వల్లనే క్రమశిక్షణా, ఐక్యతా సాధించి వ్యవస్థీకృతమైన వర్గం అవుతుంది.  
పెట్టుబడి దారీ ఉత్పత్తి విధానంలో పుట్టి, ఆవిధానంతో పాటు వృద్ధిచెందిన  పెట్టుబడి గుత్తాధిపత్యం ఆఉత్పత్తి విధానానికి సంకెల అవుతుంది. ఉత్పత్తిసాధనాల కేంద్రీకరణా, శ్రమ సామాజీకరణా చివరకి ఏస్థాయికి చేరతాయంటే: అవి తమ పెట్టుబడిదారీ పై డిప్పతో/ పొరతో/ రక్షాకవచంతో (integument) పొసగని స్థితికి చేరతాయి. ఆ పై డిప్ప పగిలిపోతుంది. పెట్టుబడిదారీ ఆస్తికి చావుగంట మోగుతుంది. ఆస్తి హర్తల ఆస్తి హరించబడుతుంది. 
( The expropriators are expropriated)
అభావం అభావం చెందడం
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంతో పుట్టిన పెట్టుబడిదారీ స్వాయత్త విధానం పెట్టుబడిదారీ వ్యక్తిగత ఆస్తిని ఏర్పరుస్తుంది. ఇది సొంత దార్తుని శ్రమ వల్ల ఏర్పడిన  వ్యక్తిగత ఆస్తికి మొదటి అభావం. అయితే పెట్టుబడిదారీ ఉత్పత్తి  తన అభావాన్ని తానే తయారు చేసుకుంటుంది.తానే ఏర్పరచుకుంటుంది. ఇది ఆపశక్యంకాని సహజ ప్రక్రియ లాగా సంభవిస్తుంది.
అది ఉత్పత్తిదారుని వ్యక్తిగత అస్తిని తిరిగి ప్రతిష్టచెయ్యదు. కాని, అతనికి పెట్టుబడిదారీ యుగంలో ఆర్జనల వల్ల ఏర్పడ్డ వ్యక్తిగత ఆస్తిని ఇస్తుంది. అంటే, సహకారం మీదా, భూమిమీదా ఉత్పత్తిసాధనాలమీదా ఉండే ఉమ్మడి యాజమాన్యం మీదా ఆధారపడ్డ వ్యక్తిగత ఆస్తిని ఇస్తుంది.
ఇక్కడ రెండు ప్రక్రియలున్నాయి:
1. వ్యక్తి శ్రమ వల్ల ఏర్పడి, చెల్లాచెదరుగా ఉన్న ప్రైవేట్ ఆస్తి పెట్టుబడిదారీ ప్రైవేట్ ఆస్తిగా పరివర్తన చెందే ప్రక్రియ
2.ఆ పెట్టుబడిదారీ ఆస్తి సామాజిక ఆస్తిగా మారే ప్రక్రియ. అప్పటికే ఆచరణలో సామాజికీకృత ఉత్పత్తి మీద ఆధారపడి ఉన్న  పెట్టుబడిదారీ ప్రైవేట్ ఆస్తి సామాజిక ఆస్తిగా పరివర్తన చెందే ప్రక్రియ
రెండు ప్రక్రియలూ హింసాత్మక మైనవే. అయితే, మొదటిప్రక్రియ రెండోదానికంటే  పోల్చలేనంత మరింత దీర్ఘకాలికమైనది, మరింత హింసాత్మకమైనది, మరింత కష్టభరితమైనది. మొదటి సందర్భంలో ప్రజారాసుల ఆస్తిని కొద్దిమంది ఆక్రమణదారులు హరించడం జరిగింది. రెండో సందర్భంలో కొద్దిమంది ఆక్రమణదారుల ఆస్తిని ప్రజా రాసులు హరించడం జరుగుతుంది.
ప్రణాళికలో చెప్పిందే మరొకసారి
కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక లోని కొన్ని వాక్యాలతో ఈ చాప్టర్ ముగుస్తుంది:
పరిశ్రమ పురోగమనాన్ని ఉద్దేశ పూర్వకంగా కాకున్నా, బూర్జువా వర్గం  కొనసాగిస్తుంది. కార్మికుల్లో పోటీ వల్ల ఏర్పడే అనైక్యత స్థానంలో, పరస్పర సంబంధం వల్ల విప్లవాత్మక కలయిక వస్తుంది. అందువల్ల బూర్జువా వర్గం ఏ పునాది మీద ఉత్పత్తిచేసి, సొంతం చేసుకుంటుందో ఆ పునాదినే, ఆధునిక పరిశ్రమల అభివృద్ధి తొలిచివేస్తుంది. కాబట్టి బూర్జువా వర్గం ఉత్పత్తిచేసే వాటన్నిటిలోకీ ముఖ్యమైనది: తనని పూడ్చేందుకు గొయ్యి తవ్వే వాళ్ళు (grave-diggers).
బూర్జువావర్గ పతనం అనివార్యం. కార్మికవర్గ విజయమూ అంతే అనివార్యం….. ఇవ్వాళ బూర్జువా వర్గానికి ఎదురొడ్డి నిలబడ్డ వర్గాలన్నిటిలోకీ ఒక్క కార్మిక వర్గమే నిజమైన విప్లవకరమైన వర్గం. మిగితా వార్గాలు క్షీణించి, క్షీణించి అంతిమంగా అదృశ్యమైపోతాయి.కార్మిక వర్గం దాని ప్రత్యేక సృష్టి,ముఖ్యమైన సృష్టి.
మధ్యతరగతిలో కింది శ్రేణికి చెందినవాళ్ళు - చిన్న ఉత్పత్తిదారులూ, దుకాణదారులూ, చేతిపనివాళ్ళూ, రైతులూ – వీళ్ళందరూ బూర్జువావర్గంతో పోరాడతారు; కాని వీళ్ళ పోరాటం మధ్యతరగతిలో భాగాలుగా తమ మనుగడ నశించిపోకుండా  కాపాడుకోడానికి. అనగా వీళ్ళు విప్లవకారులు కాదు, యధాస్థితివాదులు. అంతే కాదు, అభివృద్ధి నిరోధకులు కూడా. ఎందుకంటే వీళ్ళు చరిత్ర చక్రాన్ని వెనక్కు తిప్పడానికి కృషిచేస్తారు. - Karl Marx and Friedrich Engels, “Manifest der Kommunistischen Partei,” London, 1848, pp. 9, 11.



6, మార్చి 2019, బుధవారం

పారిశ్రామిక పెట్టుబడిదారుడి పుట్టుక


  అధ్యాయం.31

పారిశ్రామిక పెట్టుబడిదారుడి పుట్టుక

వ్యవసాయ పెట్టుబడి దారుడి పుట్టుక నెమ్మదిగానూ, క్రమంగానూ జరిగిందని 29 చాప్టర్లో తెలుసుకున్నాం. అయితే పారిశ్రామిక పెట్టుబడిదారుడి పుట్టుక అలా జరగలేదు.అనేకమంది వృత్తిసంఘ మేస్త్రులూ,అంతకన్నా ఎక్కువమంది చిన్న చిన్న స్వతంత్రచేతివృత్తులవాళ్ళూ, వేతన శ్రామికులూ కూడా చిన్న పెట్టుబడి దారులుగా రూపొందారు. క్రమంగా వేతన శ్రమని దోచడం ద్వారా, దానికి అనుగుణమైన సంచయనాన్ని పెంచడంద్వారా పూర్తిస్థాయి పెట్టుబడి దారులు అయ్యారు. పెట్టుబడి దారీ ఉత్పత్తి పసిదశలో మధ్యయుగాల పట్టణాల్లో జరిగినట్లే, తరచుగా సంఘటనలు సంభవించాయి. ఆపట్టణాల్లో పారిపొయి వచ్చిన అర్ధబానిసల్లో ఎవరు యజమాని అయినారు, ఎవరు సేవకుడయ్యారు అనేది ఎవరు ముందొచ్చారు, ఎవరు వెనకొచ్చారు అనేదాన్ని బట్టి నిర్ణయమయింది. పద్ధతి నెమ్మదిగా నత్తనడకన సాగింది.
గొప్ప ఆవిష్కరలు - ప్రపంచ మార్కెట్
అయితే 15 శతాబ్దం చివర గొప్ప ఆవిష్కరణలు వచ్చాయి. అవి పెద్ద ప్రపంచ మార్కెట్ ని ఏర్పరిచాయి. మార్కెట్ యొక్క వాణిజ్య అవసరాలకి నత్తనడక ఏమాత్రం సరిపోలేదు. అయితే మధ్యయుగాలు రెండు రూపాల పెట్టుబడిని అందించాయి-
1. వడ్డీ వ్యాపారి పెట్టుబడి
2.వర్తకుని పెట్టుబడి.అవి రెండూ పెట్టుబడిదారీ ఉత్పత్తివిధానానికి పూర్వమే పెట్టుబడిగా ఉన్నాయి.
డబ్బు పెట్టుబడి పారిశ్రామిక పెట్టుబడిగా మారడానికి ఆటంకాలు
అయితే వాటి ద్వారా ఏర్పడ్డ డబ్బు పెట్టుబడి పారిశ్రామిక పెట్టుబడిగా మారకుండా గ్రామీణ ప్రాంతాలలో ఫ్యూడల్ వ్యవస్థా, పట్తణాల్లో వృత్తిసంఘవ్యవస్థా అడ్డుపడ్డాయి. 1794 లో కూడా లీడ్స్ పట్టణానికి చెందిన బట్ట ఉత్పత్తిదారులు పార్లమెంటుకి ప్రతినిధుల్ని పంపారు. వ్యాపారీ,  తయారీ దారుడు గా ఉండరాదు అని చట్టం తేవాలని కోరారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పెట్టుబడిని నిలువరించలేక పోయారు.  భూ ఆక్రమణవల్ల గ్రామీణ ప్రజలు పాక్షికంగా గ్రామాల్ని కాళీ చేసి పట్టణాలకు పారి పొవాల్సి వచ్చింది. ఫ్యూడల్ వ్యవస్థ క్రమంగా కరిగిపోసాగింది.
ఇక కొత్త కార్ఖానాలు ఓడరేవుల దగ్గరా, అప్పటి మునిసిపాలిటీల,వృత్తిసంఘాల  నియంత్రణ లేని సుదూర లోతట్టు ప్రాంతాల్లోనూ నెలకొల్పారు. అందువల్ల గ్రామీణ ఫ్యూడల్ వ్యవస్థా, పట్టణ వృత్తిసంఘ వ్వవస్థా రెండూ, డబ్బు పెట్టుబడి పారిశ్రామిక పెట్టుబడిగా మారకుండా ఎంతప్రయత్నించినా నిరోధించలేకపోయాయి. అందుకే ఇంగ్లండ్ లో కొత్త పారిశ్రామిక నారుమళ్ళతో కార్పొరేట్ పట్టణాలూ, అక్కడి వృత్తిసంఘాలూ తీవ్రంగా పోరాడాయి. అయినా పెట్టుబడిదారీ ఉత్పత్తి ముందుకు పోయింది.
పెట్టుబడి కి ఉషొదయం
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ఉదయించినట్లు సూచించిన అంశాలు:
1. అమెరికాలో వెండీ, బంగారమూ ఉన్నట్లు కనుక్కోవడం
2. ఆదివాసీ ప్రజల్ని నిర్మూలించడం, బానిసలుగా చెయ్యడం, గనుల్లో సమాధి చెయ్యడం
3.తూర్పు ఇండియా దీవుల్ని జయించడం, కొల్లగొట్టడం ప్రారంభించడం.
4.వ్యాపారం కోసం నల్లవాళ్లని వేతాడే ప్రాంతంగా ఆఫ్రికాని మార్చడం
కార్యకలాపాలే ఆదిమ సంచయనాన్ని నడిపిన ప్రధాన శక్తులు.
వాణిజ్య యుద్ధం
వీటి వెంట ఐరోపా రాజ్యాల మధ్య వాణిజ్య యుద్ధం వచ్చింది. ఆయుద్ధానికి ప్రపంచం అంతా రణస్థలం అయింది. స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం కొసం నెదర్ లాండ్స్ తిరుగుబాటు చెయ్యడంతో వాణిజ్య యుద్ధం మొదలయింది.,  ఇంగ్లండ్ దేశపు  జకోబిన్ వ్యతిరేక యుద్ధంతో అది విపరీత ప్రమాణానికి చేరింది. చైనా కి వ్యతిరేకంగా జరుగుతున్న నల్లమందు యుద్ధాలూ వగయిరా రూపాల్లో ఇప్పటికీ (1867) వాణిజ్య యుద్ధం కొనసాగుతున్నది.
ఆదిమ సంచయనాన్ని ప్రేరేపించే అంశాలు
ఆదిమ సంచయనపు భిన్న చోదక అంశాలు ఇప్పుడు అంతో ఇంతో కాలానుక్రమంలో ప్రత్యేకించి స్పెయిన్, పొర్చుగల్,హాలండ్, ఫ్రాన్స్, ఇంగ్లండ్ దేశాలకు వ్యాపిస్తాయి. ఇంగ్లండ్ లో 17 శతాబ్దం చివరలో ప్రేరక శక్తులన్నీ క్రమపద్ధతిలో కొన్ని పరిణామాలలో  ఏకమౌతాయి. పరిణామాల్లో చేరే అంశాలు:
1. వలసలు 2.జాతీయ రుణం 3.ఆధునిక పన్నుల పద్ధతి 4.రక్షణ పద్ధతి.
ఇవి కొంతవరకు పాశవిక బలప్రయోగం మీద ఆధారపడతాయి- ఉదాహరణకి వలసవ్యవస్థ.అయితే అవన్నీ రాజ్యాధికారాన్ని- సమాజం యొక్క కేంద్రీకృత, వ్యవస్థీకృత శక్తిని -  ప్రయోగిస్తాయి. ఫ్యూడల్ ఉత్పత్తివిధానాన్ని పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోకి వేగంగా మార్చేందుకూ, అందుకు పట్టే కాలాన్ని కుదించేందుకూ రాజ్య దౌర్జన్యాన్ని వినియోగిస్తాయి.               కొత్త సమాజాన్ని గర్భంలో పెట్టుకొని ఉన్న పాత సమాజానికి బలప్రయోగమే మంత్రసాని.                                                     బలప్రయోగం  తనంత తానుగా ఒక ఆర్ధిక శక్తి.
వలస వ్యవస్థ
క్రైస్తవ  వలస వ్యవస్థ గురించి ఆ మతాన్ని ప్రత్యేక అధ్యయనం చేసిన హొవిట్ అభిప్రాయం: ప్రపంచంలో ప్రతిప్రాంతంలోనూ, వాళ్ళు లొంగదీసుకున్న ప్రజా సమూహాలమీద, క్రైస్తవ జాతి సాగించిన కిరాతక అకృత్యాలూ, అత్యాచారాలూ పోలిక లేనంతటివి. ఆజాతి ఎంత భయంకరమైనదయినా, చదువులేనిదైనా, కరుణ లేనిదైనా, సిగ్గు మాలిన దయినా,   యుగంలోనూ, ఇంతటి ఘాతుకం చేసిన జాతి భూమ్మీద  మరొకటి లేదు.
హాలండ్
హాలండ్   17 శతాబ్దంలో అగ్ర పెట్టుబడిదారీ దేశంగా ఉంది. ఆ దేశపు వలస పరిపాలనా చరిత్ర ద్రోహంతో, లంచంతో, ఊచకోతతో, నీచత్వంతో నిండిపోయింది.
దేశం మనుషుల్ని దొంగిలించి జావాకి బానిసలుగా చేసిన పద్ధతి కన్నా లాక్షణిక మైనది మరొకటి లేదు. పనికోసం దొంగలకి శిక్షణ ఉండేది. దొంగా,దుబాసీ,  అమ్మేవాడూ- వ్యాపారంలో ముఖ్యమైన ఏజెంట్లు. స్థానిక ప్రభువులు ప్రధాన అమ్మకందార్లు. దొంగిలించబడ్డ యువతీయువకుల్ని పంపించే బానిస ఓడలు రెడీ అయ్యేదాకా సెలెబిస్ లో ఉన్న రహస్య నేలమాళిగల్లో పడేసేవాళ్ళు. ఒక నివేదికలో ఇలా ఉంది: మకస్సార్ అనే పట్టణం నిండా రహస్య బందిఖానాలు ఉన్నాయి. అవి ఒకదాన్ని మించి ఒకటి భయంకరమైనవి.కుటుంబాలనుండి వీడదీయబడి, దురాశకీ, నిరంకుశత్వానికీ బలిపశువులైన నిర్భాగ్యులతో క్రిక్కిరిసి ఉన్నాయి.
డచ్ వాళ్ళు
మలక్కాను పొందడానికి డచ్ వాళ్ళు పోర్చుగీసు గవర్నర్ కి లంచం ఇచ్చారు. 1641 లో గవర్నర్ వాళ్ళని పట్టణంలోకి జొరబడనిచ్చాడు. ప్రవేసిస్తూనే వాళ్ళు ఎకాయెకిన గవర్నర్ ఇంటికి వెళ్ళి ఆయాన్ని హతమార్చారు. అతను చేసిన ద్రోహానికి చెల్లించాల్సిన 21,875 పౌన్లని మిగుల్చుకున్నారు. వాళ్ళు ఎక్కడ కాలుబెడితే అక్కడల్లా విధ్వంసమే, జనక్షయమే. జావాలోని  బంజువాంగి అనే రాష్ట్రంలో 1750 లో 80.000 మంది జనం ఉండేవాళ్ళు. 1811 లొ కేవలం 18,000 మాత్రమే మిగిలి ఉన్నారు. ఎంతటి మధురమైన వర్తకమో!
ఈస్ట్ ఇండియా కంపెనీ
ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియలో రాజకీయ పరిపాలనాధికారం పొందిందని అందరికీ తెలుసు. దానికి తోడు తేయాకు వ్యాపారం పైన గుత్తాధిపత్యాన్నీ, అలాగే చైనా వ్యాపారం మొత్తం పైనా, ఐరోపా లోనికీ, వెలపలికీ జరిగే రవాణా పైనా గుత్తాధిపత్యాన్ని సాధించింది. 
ఇది అందరికీ తెలిసిందే. అయితే, అక్కడి తీరప్రాంత వర్తకమూ, ద్వీపాల మధ్య వ్యాపారమూ, దేశం లోని అంతర్గత వర్తకమూ కంపెనీ ఉన్నతోద్యొగుల గుత్తాధిపత్యం కింద ఉన్నాయి. ఉప్పు, నల్లమందు, తమలపాకులు వంటి సరుకులపైన ఉన్న గుత్తధికారాలే వాళ్ళకు   తరగని ధన గనులు. ఉద్యోగులే ధర నిర్ణయించి విచారంతో ఉన్న హిందువుల్ని ఇష్టంవచ్చినట్లు కొల్లగొట్టేవాళ్ళు. ప్రైవేట్ వ్యాపారంలో గవర్నర్ జనరల్ సైతం పాల్గొనేవాడు. ఆయనకి ఇష్టులైన వాళ్ళు అనుకూలమైన నిబంధనలతో కంట్రాక్టులు పొందేవారు. ఆనిబంధనలు ఎంత లాభసాటిగా ఉండేవంటే, వాళ్ళు శూన్యంలో సువర్ణం సృష్టించుకునే వాళ్ళు. ఒక్క రోజులోనే గొప్ప ధన నిధులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేవి. ఒక్క షిల్లింగు అయినా పెట్టుబడి పెట్టకుండానే ఆదిమ సంచయనం సాగిపోయింది. వారెన్ హేస్టింగ్స్ మీద విచారణలో ఇలాంటి ఘటనలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. ఉదాహరణకి సల్లివాన్ అనే వ్యక్తి ఇండియలో నల్లమందు జిల్లాలకు దూరంగా ఉండే ఒకచోటకి ప్రభుత్వ పని మీద పోతున్నాడు. అప్పుడు అతనికి నల్లమందు కాంట్రాక్ట్ ఇవ్వబడింది. అతను కాంట్రాక్ట్ ని 40,000 పౌన్లకి బిన్ అనే వానికి అమ్ముకున్నాడు.ఆరోజే బిన్ దాన్ని తిరిగి 60,000 పౌన్లకి మరొకరికి అమ్మేశాడు. చివరలో కొని కాంట్రాక్ట్ ని నెరవేర్చినవాడు తాను భారీ లాభం పొందానని ప్రకటించాడు.  పార్లమెంట్ ముందుంచిన ఒక లిస్టు ప్రకారం, 1757-1766 కాలమలో ఈస్ట్ ఇండియా కంపెనీ దాని ఉద్యోగులూ భారతీయులనుంచి బహుమానాల రూపంలో పొందిన మొత్తం 60 లక్షల పౌన్లు. 1769-1770 మధ్య ఇంగ్లిష్వాళ్ళు మొత్తం ధాన్యాన్ని కోనేసి, విపరీతమైన ధరలకు తప్ప అమ్మేందుకు నిరాకరించారు, తద్వారా తీవ్రమైన కరువు సృష్టించారు.  1866 లో 10 లక్షలమందికి పైగా హిందువులు ఒక్క ఒరిస్సాలోనే ఆకలితో చచ్చిపోయారు. అయినాగాని, పస్తులతో పడున్న  జనానికి అవసరమైన వస్తువుల్ని అమ్మే ధరలతో ఖజానాని నింపే ప్రయత్నం జరిగింది.
హాలండ్ వలసలూ-ప్రజల అణచివేతా
వలసవ్యవస్థ వ్యాపారాన్నీ, సముద్రయానాన్నీ పక్వదశకు తెచ్చింది. లూధర్ ' గుత్త సమాజాలు '(societies Monopolia) పెట్టుబడి కేంద్రీకరణకి శక్తివంతమైన కీళ్ళు(levers) గా ఉన్నాయి. మొగ్గతొడుగుతున్న తయారీ పరిశ్రమలకి వలస ప్రాంతాలు మార్కెట్ ని సమకూర్చాయి. మార్కెట్ పైన గుత్తాధిపత్యం  ద్వారా సంచయనాన్ని పెంచడానికి దోహదం చేశాయి. ఐరోపా బయట నగ్నదోపిడీ, బానిసీకరణ, హత్యల ద్వారా కొల్లగొట్టిన నిధులు మాతృదేశాలకు వెళ్ళాయి. అక్కడ అవి పెట్టుబడిగా మారాయి.
వలసవ్యవస్థ సంపూర్ణంగా వృద్ధిచెందిన తొలి దేశం హాలండ్.అక్కడ 1648 నాటికే వాణిజ్యంలో శిఖరాగ్రాన్ని చేరి ఉంది. ఈస్ట్ ఇండియా వర్తకమూ, ఈశాన్య ఐరోపాకీ నైరుతీ ఐరోపాకీ మధ్య వాణిజ్యమూ పూర్తిగా దాని హస్తగతమై ఉన్నాయి. దాని చేపల పరిశ్రమలూ, నౌకలూ, కార్ఖానాలూ ప్రతి ఇతర దేశపు వనరుల్నీ అధిగమించి ఉన్నాయి. దాని మొత్తం పెట్టుబడి ఇతర ఐరోపా దేశాల పెట్టుబడులన్నీ కలిసినంత పెట్టుబడి కంటే బహుశా ఎక్కువ ముఖ్యమైనదిగా వుంది. ఇంత చెప్పిన గులిచ్ 1648 నాటికి హాలండ్ ప్రజలు ఐరోపాలోని అన్నిదేశాల ప్రజలందరికన్నా ఎక్కువ చాకిరి చేసేవారనీ, మరింత పేదవాళ్ళనీ,ఎక్కువ పాశవికంగా అణచివేతకి గురయ్యారు -అనే వాస్తవాన్ని చెప్పడం మర్చిపోయినట్లుంది.
వలసవ్యవస్థ ప్రబల పాత్ర
 ఈరోజుల్లో పారిశ్రామిక ఆధిక్యత ఉంటే వాణిజ్య ఆధిక్యత ఉన్నట్లు. అసలైన కార్ఖానా కాలంలో అలాకాదు, వాణిజ్యంలో ఆధిక్యతే పారిశ్రామిక రంగంలో ప్రాబల్యాన్ని కలగజేస్తుంది.  
అందువల్లనే, అప్పట్లో వలసవ్యవస్థ అత్యంత ప్రబల పాత్ర పోషించింది.వలస వ్యవస్థ ఒక విచిత్ర దేవుడు. మొదటమొదట ఐరోపా దేవుళ్ల సరసన పీఠం వేశాడు.ఒక శుభముహుర్తాన ఆదేవుళ్ళనందర్నీ ఒక్కతొపుతో, తన్నుతో కుప్పగా కూలగొట్టాడు. మానవ జాతి ఏకైక గమ్యమూ, లక్ష్యమూ అదనపువిలువని సృష్టించడమే- అని ప్రకటించాడు.
ప్రభుత్వ రుణ వ్యవస్థ
జాతీయ రుణం మూలాలు మధ్య యుగాల్లోనే జినోవాలో, వెనిస్ లో కనబడింది. కార్ఖానా/ తయారీ పరిశ్రమ కాలంలో సాధారణంగా ఐరోపా అంతటినీ పట్టుకుంది. సముద్ర వర్తకంతోనూ, వాణిజ్య యుద్ధాలతోనూ కూడివున్న వలసవ్యవస్థ జాతీయ రుణ వ్యవస్థని బలవంతంగా పెంచే సాధనంగా(forcing house ) పనిచేసింది. ఆవిధంగా రుణవ్యవస్థ మొదట హాలండ్ లో వేళ్ళూనింది.   జాతీయ రుణాలు- అంటే, రాజ్యం యొక్క పరాయీ కరణ- ఆరాజ్యం నిరంకుశమైందైనా, రాజ్యాంగాన్ని అనుసరించేదైనా లేక రిపబ్లిక్ వంటిదైనా పెట్టుబడిదారీ యుగానికి ఆరంభ ముద్ర వేశాయి.జాతీయ ఆదాయం అనే దానిలో  ఆధునిక ప్రజల సమష్టి నిధుల్లో వాస్తవంగా ప్రవేసించే ఒకే ఒక భాగం ప్రజల జాతీయ రుణమే. కాబట్టి, ఒక జాతికి ఎంత ఎక్కువ అప్పుల్లో ఉంటే, అది అంత భాగ్యవంతమైంది అవుతుంది - అనే ఆధునిక సూత్రం ఏర్పడింది.ప్రభుత్వ రుణం అనేది పెట్టుబడికి ఒక మత విశ్వాసం అయింది. జాతీయ రుణాలు పెరిగిపోవడంతో, జాతీయ రుణం పట్ల నమ్మకం లేకపోవడం అనేది క్షమార్హంకాని దైవ నింద అయింది.
 ప్రభుత్వ రుణం ఆదిమ సంచయనానికి అత్యంత శక్తివంతమైన మీటల్లో (levers) ఒకటి. అది ఏమాత్రం పెరగకుండా పడున్న (barren) డబ్బుకి పెరిగే శక్తి నిస్తుంది, పెట్టుబడిలోకి మారుస్తుంది. దాన్ని పరిశ్రమలోనో, వడ్డీ వ్యాపారంలోనో పెడితే తప్పకుండా ఉండే చిక్కులూ, ప్రమాదాలూ ఉండవు.ప్రభుత్వానికి అప్పిచ్చే రుణదాతలు నిజానికి వాస్తవంగా ఇచ్చేదేమీ లేదు.ఎందుకంటే అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని బాండ్ల రూపంలో పొందుతారు. ప్రభుత్వ బాండ్లు వాళ్ళ చేతుల్లో అంతే మొత్తం రొక్కం ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తాయి.
1.రుణవ్యవస్థ ఆవిధంగా ఏటేటా ఒకమొత్తంలో డబ్బు తీసుకునే సోమరులు (lazy annuitants)  ఏర్పడడానికి దోహదం చేసింది.
2. డబ్బు సర్దుబాటుచేసే ద్రవ్యనిర్వాహకుల (financiers) సంపదనీ, ప్రభుత్వానికీ, జాతికీ మధ్య లావాదేవీలు నడిపే దళారీల సంపదనీ పెంపు చేసింది.
 3.అదేవిధంగా, పన్నులు కట్టే వ్యవసాయదారులకూ, వర్తకులకూ, ప్రైవేటు వస్తూత్పత్తి దారులకూ ప్రతి జాతీయ రుణంలోని గణనీయమైన భాగం ఆకాశం నుండి పడ్డ పెట్టుబడిలాగా సేవ చేసింది.
4.ఇవన్నీ కాక జాతీయ రుణం జాయంట్ స్టాక్ కంపెనీలు ఏర్పడడానికీ కారణం అయింది. చేతులు మారగల అన్నిరకాల వ్యాపారాల్నీ, ఒక్క మాటలో స్టాక్ ఎక్స్చేంజ్ జూదాన్నీ, ఆధునిక బాంక్ స్వామ్యాన్నీ(bankocracy) సృజించింది. 
జాతీయ బిరుదులు అలకరించుకొని ఉన్న పెద్దపెద్ద బాంకులు  అవి పుట్టినప్పుడు కేవలం ప్రైవేట్ సాహస వ్యాపారస్తుల (speculators) సంఘాలు మాత్రమే. వ్యాపారులు ప్రభుత్వాల పక్క నిలబడ్డారు. ప్రభుత్వాలనుండి ప్రత్యేక హక్కులు పొందారు. వాటి మూలంగా రాజ్యానికి ముందుగా డబ్బిచ్చే స్థితిలో వున్నారు.
బాంక్ ఆఫ్ ఇంగ్లండ్
బాంకుల పూర్తి అభివృద్ధి బాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఏర్పడ్డ 1694 నుంచీ మొదలైంది. బాంక్ ప్రభుత్వానికి 8 శాతం వడ్డీకి అప్పివ్వడంతో ఆరంభించింది. అదేసమయంలో, బాంక్ నోట్ల రూపంలో దాన్ని తిరిగి ప్రజలకి అప్పు ఇవ్వడం ద్వారా, అదే పెట్టుబడి నుంచి డబ్బు ముద్రించే అధికారాన్ని  పార్లమెంట్ బాంక్ కి ఇచ్చింది.  బాంక్ నోట్లని గడువు రాకముందే బిల్లులు చెల్లించడానికీ, సరుకులకి బయానా ఇవ్వడానికీ, అమూల్యలోహాల్ని కొనేందుకు ఉపయోగించుకోడానికీ బాంక్ కి అనుమతి వచ్చింది. ఆబాంకే సృజించిన రుణద్రవ్యం (credit money) ఎక్కువ కాలం గడవకముందే ఆబాంక్ రాజ్యానికి అప్పుగా ఇచ్చే నాణేలుగా రూపొందాయి. అలాగే ప్రభుత్వ రుణాలమీద రాజ్యం తరఫున వడ్డీ చెల్లించే నాణేలుగా రూపొందాయి. బాంకు చేత్తో ఇచ్చి, చేత్తో అంతకు మించి వెనక్కి పుచ్చుకున్నది. ఇదొక్కటే సరిపోలేదు. తీసుకునేటప్పుడు కూడా, బాంక్ తనిచ్చిన చివరి షిల్లింగు వరకూ జాతికి శాశ్వత రుణ ప్రదాతగా నిలిచింది. క్రమేణా, బాంక్ దేశంలోని లోహాల నిల్వలకు భాండాగారం అవడం అనివార్యమైంది. అలాగే అన్ని వాణిజ్య రుణాలకీ గురుత్వాకర్షణ కేంద్రం కావడమూ తప్పనిసరి అయింది. బాంక్ స్వాములూ, ద్రవ్య నిర్వాహకులూ, ఆస్తుల మీద వచ్చే ఆదాయంతో జీవించేవాళ్ళూ, బ్రోకర్లూ, క్లైంట్ల కోసం స్టాక్ లు కొనడం అమ్మడం చేసే స్టాక్ బ్రోకర్లూ,మొదలైనవాళ్ళు హఠాతుగా విజృంభించారు. విజృంభణ ప్రభావం సమకాలీనులమీద ఎలా ఉన్నదనేది అప్పటి రచనలు రుజువు చేశాయి.            
అంతర్జాతీయ రుణవ్యవస్థ
జాతీయ రుణంతో పాటు అంతర్జాతీయ రుణవ్యవస్థ ఏర్పడింది. అదితరచుగా ఆ జాతినో ఈ జాతినో ఆదిమ సంచయనపు వనరుల్లో ఒకదాన్ని దాచిపెడుతుంది. ఆవిధంగా వెనిస్ చొరవ్యవస్థ దుష్ట చర్యలు హాలండ్ పెట్టుబడి సంపదకి రహస్య పునాదుల్లో ఒక పునాది అయ్యాయి.ఎందుకంటే, వెనిస్ క్షీణదశలో పడ్డప్పుడు భారీ మొత్తాల్లో డబ్బుని హాలండ్ కి అప్పుగా ఇచ్చింది. అటువంటి సంబంధమే హాలండ్ కీ ఇంగ్లండ్ కీ మధ్య కూడా ఉంది. 18 శతాబ్దం మొదటికే, హాలండ్ వస్తూత్పత్తిదారులు ఎంతో వెనకబడిపోయారు. వాణిజ్యంలోనూ, పరిశ్రమలోనూ తన ప్రాబల్యాన్ని కోల్పోయింది. అందువల్ల 1701-1776 కాలంలో  హాలండ్ ముఖ్య వ్యాపార ధోరణుల్లో ఒకటి: పెట్టుబడిని అప్పుగా ఇవ్వడం, అదికూడా తనకు ప్రత్యర్ధిగా ఉన్న ఇంగ్లండ్ కి ఇవ్వడం. ఇప్పుడు ఇంగ్లండ్ కీ సంయుక్తరాష్ట్రాలకీ మధ్య అదే జరుగుతున్నది. ఎక్కడపుట్టిందో తెలియకుండా ఇవ్వాళ సంయుక్తరాష్ట్రాల్లో కనిపించే పెట్టుబడిలో అధికభాగం నిన్న ఇంగ్లండ్ లో పెట్టుబడి రూపం పొందిన పిల్లల నెత్తురే.
ఆధునిక పన్నుల వ్యవస్థ
ప్రభుత్వ ఆదాయం జాతీయ రుణానికి మద్దతుగా ఉంటుంది. ఏటా వడ్డీ వగైరాలు చెల్లించాలి. అందుకు తగినంత ఆదాయం రావాలి. అందువల్ల ఆధునిక పన్నుల వ్యవస్థ జాతీయ రుణ వ్యవస్థకి అనివార్యమైన అంశం. ప్రభుత్వం అసాధారణ ఖర్చులు పెట్టుకోడానికి  రుణాలు వసతి/అవకాశం కలిగిస్తాయి; రుణాలు పన్నుకట్టే వాళ్ళకి అప్పటికప్పుడు భారం అనిపించవు.అయితే రుణాల ఫలితంగా/పర్యవసానంగా తర్వాత కాలంలో పన్నులు పెరగడం తప్పనిసరి. మరొకపక్క, ఒకదాని తర్వాత ఒకటిగా అప్పులు చేస్తూ పోతున్నందువల్ల పన్నులు పెరుగుతుంటాయి. పన్నుల పెరుగుదల మూలంగా ప్రభుత్వం కొత్త అసాధారణ ఖర్చులకు కొత్త అప్పులు చెయ్యాల్సి వస్తుంది. బతకడానికి అత్యంత అవసరమైన వస్తువుల మీద పన్నులు వెయ్యడం ఆధునిక ద్రవ్యాదాయ వ్యవస్థకి ఇరుసుగా ఉంటుంది. ఆవిధంగా ద్రవ్యాదాయ వ్యవస్థ తనలో ధరల్ని ఆటోమాటిక్ గా పెంచే బీజాన్ని ఇముడ్చుకొని ఉంటుంది. అధికపన్నులు పడడం, ఎప్పుడో ఏదో జరిగే చెదుమదురు సంఘతన ఎంతమాత్రం కాదు.అది ఒక నియమం.
అందువల్ల మొట్ట మొదట విధానం వచ్చిన  హాలండ్ లో గొప్ప దేశభక్తుడైన డేవిట్ దీన్ని అత్యుత్తమ విధానం అంటూ కీర్తించాడు.ఎందుకంటే:
ఇది వేతన శ్రామికుణ్ణివిధేయుడుగానూ,పొదుపరిగానూ,ఒళ్ళొంచి శ్రమచేసేవానిగానూ, అధిక శ్రమభారం వహించే వాని గానూ చేస్తుంది. ఉద్దేశ్యంతోనే ఆయన అంతగా వ్యవస్థని కొనియాడాడు. అయితే వేతన కార్మికుని మీద దాని వినాశకర ప్రభావం మనకిక్కడ అంత ముఖ్యం కాదు. ఇక్కడ పట్టించుకోవాల్సింది ఏమిటంటే, దాని ( వ్యవస్థ) నుంచి వచ్చే ఫలితం అయిన బలవంతపు ఆస్తి హరణం- రైతుల, చెతివృత్తులవాళ్ళ ఆస్థి హరణం.ఒక్క ముక్కలో చెప్పాలంటే, దిగువమధ్యతగతి వాళ్ళందరి ఆస్తి హరణం.  బూర్జువా ఆర్ధికవేత్తలకు సైతం విషయంలో వేరే అభిప్రాయంలేదు. పన్నులవ్యవస్థకున్న ఆస్తి హరణపు సామర్ధ్యాన్ని, అధిక పన్నుల వ్యవస్థ అంతర్భాగాల్లో ఒకటైన సంరక్షణ వ్యవస్థ ఇంకా హైస్థాయికి తీసుకుపోతుంది.
సంరక్షణ వ్యవస్థ
  సంరక్షణ వ్యవస్థ ఒక కృత్రిమ సాధనం:
1.తయారీ పారిశ్రామికుల్ని తయారుచెయ్యడానికీ
2.స్వతంత్ర శ్రామికుల ఆస్తుల్ని బలవంతంగా హరించడానికీ
3.జాతీయ ఉత్పత్తిసాధనాల్నీ, జీవనాధార సాధనాల్నీ పెట్టుబడిగా మార్చడానికీ
4.మధ్య యుగాల ఉత్పత్తి విధానం నుంచి ఆధునిక ఉత్పత్తి విధానంలోకి పరివర్తన చెందే కాలాన్ని బలవంతంగా కుదించడానికీ
సంరక్షణ వ్యవస్థ ఒక కృత్రిమ సాధనం గా ఉండేది.
కొత్త ఆవిష్కరణ మీద ప్రత్యేక హక్కు ఎవరిది? నాదంటే నాదని ఐరోపా రాజ్యాలు ఒకదానినొకటి చీల్చిచెండాడాయి. తమలోతాము తీవంగా ఘర్షణపడ్డాయి. ఒకసారి అదనపువిలువ ఉత్పత్తిదారుల సేవ మొదలుపెట్టాక, తర్వాతంతా  రాజ్యాలు తమతమ దేశాల్లోని ప్రజల్నే పరోక్షంగా రక్షణ సుంకాలద్వారానూ, పరోక్షంగా ఎగుమతి బహుమతుల (export premiums) ద్వారానూ దోచుకున్నాయి. అలా దోచుకున్నా, అంతటితో తృప్తి చెందలేదు. తమ మీద ఆధారపడి ఉన్న దేశాల పరిశ్రమనంతా కూకటి వేళ్ళతో పెకలించివేశాయి- ఉదాహరణకి ఇంగ్లండ్ ఐరిష్ ఉన్ని పరిశ్రమని నాశనం చేసినవిధంగా.
జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్  (1619-1683) ఉదాహరణని బట్టి, ప్రక్రియ ఐరొపా ఖండంలో చాలా కుదించబడింది. ఇక్కడ ఆదిమ పారిశ్రామిక పెట్టుబడి కొంతభాగం నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచే వచ్చింది. మిరాబూ ఇలా అంటాడు:యుద్ధానికి ముందు శక్సనీ పరిశ్రామికంగా వెలగడానికి కారణం కోసం అంతదూరం పోనక్కరలేదు. రాజులు 180,000,000 అప్పులు చేశారు అనే వాస్తవాన్ని తెలుసుకుంటే సరిపోతుంది.   
 అసలు తయారీ పరిశ్రమ కాలంలో ఏర్పడ్డ అంశాలు: 
1.వలసవ్యవస్థ,
2.ప్రభుత్వ రుణాలు
3.భారీ పన్నులు
4.రక్షణ సుంకాలు వగైరా.
ఇవి ఆధునిక పరిశ్రమ శిశువుగా ఉన్న కాలంలో బ్రహ్మాండంగా వృద్ధవుతాయి.
ఆధునిక పరిశ్రమ ఆవిష్కరణ -   అమాయకుల ఊచకోత
ఆధునిక పరిశ్రమ  అమాయకుల భారీ ఊచకోతతో ఆవిష్కృతమైంది. ప్రభుత్వ నావికాదళంలోకి బలవంతంగా చేర్చినట్లే, ఫాక్టరీల్లోకి కూడా అందుకోసం నియమించిని ముఠాలు బలవంతంగా చేర్చారు. 15 శతాబ్దం ఆఖరి మూడో భాగం తనకాలం వరకూ  వ్యవసాయ ప్రజానీకాన్ని భూమినించి వెళ్ళగొట్టిన దౌర్జన్యాల్ని, భీభత్సాల్నీ ఈడెన్ పట్టించుకోలెదు.  పెట్టుబడిదారీ వ్యవసాయాన్ని స్థాపించడానికీ, సాగుభూమికీ బీడుభూమికీ మధ్య తగిన నిష్పత్తిని నెలకొల్పడానికీ వాళ్ళని వెళ్ళగొట్టే ప్రక్రియ అవసరం. అందువల్ల ఈప్రక్రియ పట్ల ఈడెన్ సంతోషంతో ఉన్నాడు. కాని కార్ఖానా దోపిడీని ఫాక్టరీ దోపిడీగా మార్చడానికి పిల్లల్ని దొంగిలించడమూ, బాల బానిసత్వమూ అవసరం- అనే విషయంలో ఈడెన్ అదే ఆర్ధిక దృష్టి చూప లేదు. ప్రజలు శ్రద్ధాగా క్రింది విషయాన్ని పరిశీలించాల్సి ఉండవచ్చు అంటాడు. అదేమంటే: తయారీ పరిశ్రమ అయినా సజావుగా సాగడానికి అవసరమైనవి:
1.పేద పిల్లలకొసం గుడిసెల్నీ, సత్రాల్నీ గాలించడం.
2. పిల్లలచేత రాత్రిపూట ఎక్కువభాగం విశ్రాంతి లేకుండా వంతులవారీగా పనిచేయించడం     
3. వేర్వేరు వయస్సుల్లో ఉన్న, వేర్వేరు మనస్తత్వాలు గల ఆడవాళ్ళనీ, మగవాళ్ళనీ ఒకచోట  చేర్చడం (ఇది భ్రష్టత్వానికీ, వ్యభిచారానికీ దారి తీస్తుంది).
అంశాల్ని కోరుకునే కార్ఖానా అయినా వ్యక్తి అనందాన్నిగానీ, సమాజ సంతోషాన్ని గానీ  పెంచుతుందా అనే విషయాన్ని ప్రజలే శ్రద్ధతో పరిశీలించాలి.- అంటాడు ఈడెన్.
భాలల బానిసత్వం - చిత్రహింస
డెర్బీషైర్,నాటింగ్ హాం షైర్ కౌంటీల్లో, మరీ ప్రత్యేకించి లంకాషైర్ కౌంటీలో కొత్తగా కనుగొన్న యంత్రాల్ని వాగుల/నదుల ఒడ్డున నిర్మితమైన పెద్ద ఫాక్టరీల్లో ఉపయోగించారు. ఎందుకంటే అక్కడైతే జలచక్రాన్ని తిప్పెందుకు కావలసిన జలధార ఉంటుంది. పట్టణాలకు దూరంగా ప్రదేశాల్లో వేల సంఖ్యలో కార్మికులు అవసరమయ్యారు; అప్పటిదాకా జనం పలచగానూ, నిస్సారంగానూ ఉన్న లంకాషైర్ కి అప్పుడు అవసరమైంది జనాభా ఒక్కటే. పిల్లల చిని చిన్ని వేళ్ళకు, చురుకైన వేళ్ళకు గిరాకీ హెచ్చింది. అందువల్ల లండన్, బెర్మింగ్ హాం తదితర చోట్ల చర్చ్ ఆద్వర్యంలో పేదలకు పనికల్పించి, పోషించే గృహాల (parish workhouses)నుంచి వాళ్ళని సేకరించే ఆచారం వెంటనే తలెత్తింది.  వేలకు వేలమంది 7-14 ఏళ్ళ నిర్భాగ్య బాలలు ఉత్తరాదికి చేర్చబడ్డారు.యజమాని వాళ్ళని ఫాక్టరీ దగ్గర్లో ఉన్న అప్రెంటిస్ గృహంలో ఉంచి,బట్టలిచ్చి, తిండి పెట్టడం ఆచ్హరం.  పనులు చూడాడానికి  పర్యవేక్షకులు ఉండేవాళ్ళు. వాళ్ళ పనల్లా పిల్లలచేత సాధ్యమైనంత ఎక్కువ పనిచేయించడమే. ఎందుకంటే, వాళ్ళ వేతనం వాళ్ళనుంచి గుంజుకున్న పని పరిమాణాన్ని బట్టి ఉంటుంది.
దాని పర్యవసానంగా కౄరత్వం నెలకొన్నది....పారిశ్రామిక ప్రాంతాల్లో, ముఖ్యంగా లంకాషైర్ కౌంటీ లో ఏపాపం హెయ్యని, ఏ తోడూలేని పిల్లలమీద అత్యంత హృదయవిదారక కౄరచర్యలు సాగాయి. ఆపిల్లల్లు యజమానులకు అప్పగించబడ్డారు. ఆ యజమానులు హింసపెట్టి, పిల్లలచేత చచ్చేటట్లు పని చేయించేవాళ్ళు...కొరడాలతో కొట్టే వాళ్ళు.సంకెళ్ళు వేసేవాళ్ళు హింసించే వాళ్ళు. అనేక సందర్భాల్లో పిల్లలు తిండిలేకపోయిఒనా, పనిలో కొరడాదెబ్బలు తినేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో బాధలు పడలేక ఆత్మహత్యలే శరణ్యం అయ్యేవి. ప్రజల చ్హూపులకి దూరంగా ఉన్న సుందరమైన లోయలు-డెర్బీషైర్,నాటింగ్ హాం షైర్,లంకాషైర్ లు-ఇప్పుడు చిత్రహింసలకీ, హత్యలకీ ఆలవాలమైన ఏకాంత ప్రదేశాలయ్యాయి.
రాత్రిపూట పని
పరిశ్రమ యజమానుల లాభాలు అతీతమయ్యాయి. అయినా వాళ్ళ దాహం తీరలేదు.ఇంకా ఎక్కువైపోయింది. అందువల్ల వాళ్ళు పరిమితిలేని లాభాలు తెచ్చిపెట్టే పద్ధతులు అవలంబించారు. రాత్రిపూట పని మొదలుపెట్టాట్టారు. ఒక జట్టు పగలంతా పనిచేసి అలసిపోయాక మరొకజట్టు చేత రాత్రంతా పనిచేయించే వాళ్ళు.పగటి జట్టు పడకలు వదలి పనికెళ్ళాక రాత్రి జట్టువాళ్ళు అవే పడకల మీద వాలేవాళ్ళు.అందువల్ల లంకాషైర్ లో పడకలు ఎప్పుడూ చల్ల బడేవి కావు.
సంచయన పద్ధతులకు మెప్పు
కార్ఖానాల కాలంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి అభివృద్ధితో ఐరొపాలో ప్రజాభిప్రాయం సిగ్గుకీ మనస్సాక్షికీ సంబంధించిన ఆఖరి అవశేషాలను సైతం కోల్పోయింది. పెట్టుబడిదారీ సంచయనానికి సాధనంగా ఉపకరించిన ప్రతి అక్రమాల్ని గురించి జాతులు గొప్పగా చెప్పుకునేవి. ఉదాహరణకి అండర్సన్ రాసిన వాణిజ్య చరిత్ర చదవండి. 1713 లో బ్రిటన్, స్పెయిన్ ల మధ్య జరిగిన ఉట్రెక్ట్ శాంతి సంధిలో  ఆసియెంటో ఒప్పందం ఒక భాగం. దాని ప్రకారం, అప్పటిదాకా ఆఫ్రికాకూ,ఇంగ్లిష్ వెస్ట్ ఇండీస్ కి మధ్య జరిగిన నీగ్రొ వ్యాపారాన్ని ఆఫ్రికాకూ, స్పానిష్ అమెరికాకూ మాధ్య కూడా సాగించే హక్కుని స్పానియార్డుల నుండి ఇంగ్లండ్ సాధించింది. ఈ చర్య ఇంగ్లిష్ వాళ్ళ రాజనీతి విజయంగా ఇంగ్లండులో గొప్పగా చెప్పుకున్నారు. ఇంగ్లండ్ ఆ ఒప్పందం ద్వారా  1743 వరకూ స్పానిష్ అమెరికాకి ఏటా 4800 మంది నీగ్రోల్ని సరఫరా చేసే హక్కు పొందింది. అదే సమయంలో అది బ్రిటిష్ స్మగ్లింగ్ వ్యాపారం మీద అధికారికంగా ముసుగువేసింది. బానిస వ్యాపారంవల్ల లివర్ పూల్ తెగ బలిసిపోయింది. ఆదిమ సంచయనం విధానం ఇదే. లివర్ పూల్ 1730 లో 15 ఓడలన్నీ, 1751 లో 53 ఓడల్నీ, 1760 లో 74 ఓడల్నీ 1770 లో 96 ఓడల్నీ 1792 లో 132 ఓడల్నీ వినియోగించింది.
బాల బానిస వ్యవస్థని ఇంగ్లండ్ లో వస్త్ర పరిశ్రమ ప్రవేశ పెట్టింది. కాగా అది సంయుక్త రాష్ట్రాల్లో పూర్వపు పితృస్వామిక బానిసత్వం వర్తక దోపిడీ వ్యవస్థగా మారడానికి ప్రోద్బలం కలిగించింది. వాస్తవానికి ఐరొపాలో ప్రచ్ఛన్నంగా ముసుగులో ఉన్న వేతన కార్మికుల బానిసత్వానికి,  కొత్త ప్రపంచంలో(అమెరికాల్లో) స్వచ్చమైన, సరళమైన బానిసత్వం ఆధార పీఠంగా కావాల్సొచ్చింది. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం యొక్క స్వాభావిక శాశ్వత నియమాల్ని ఏర్పాటు చెయ్యడానికి చాలా పెద్ద ప్రయత్నం జరగాల్సి వచ్చింది.
శ్రామికులకీ, శ్రమ పరిస్థితులకీ మధ్యవేర్పాటు ప్రక్రియ పూర్తి చెయ్యడానికి, ఒక ధృవాన సామాజిక ఉత్పత్తి సాధనాల్నీ, జీవనాధార సాధనాల్నీ పెట్టుబడిలోకి మార్చడానికీ, వ్యతిరేక ధృవాన ప్రజారాశిని వేతన కార్మికులుగా, ఆధునిక సమాజపు  ఉత్పాదితం అయిన స్వేచ్చాయుత శ్రామిక పేదలుగా మార్చడానికీ ఎంతో ప్రయత్నం జరగాల్సి వచ్చింది. మేరీ ఆంగియర్ అన్నట్లు ప్రపంచంలోకి డబ్బు ఒక చెంపమీద నెట్టుటి మరకతో వస్తే, పెట్టుబడి నఖశిఖ పర్యంతం నెత్తురూ, చీమూ కార్చుకుంటూ ప్రవేశించింది.
పెట్టుబడి లాభాన్ని-మరీ హీన లాభాన్నైతే తప్ప- తిరస్కరించదు. 10 శాతం లాభం వస్తుందంటే, పెట్టుబడి ఎక్కడికైన పోతుంది. 20 శాతం లాభం ఉంటే, ఉవ్విళ్ళూరుతుంది, ఉబలాటపడుతుంది.50 శాతం అంటే, సాహసం వస్తుంది.100 శాతం అయితే, అన్ని మానవ నియమాల్నీ కాలరాయడానికి సన్నద్ధం అవుతుంది.300 శాతం ఉన్నట్లయితే,ఎంతటి నేరానికైనా వెనకాడదు.ఏ ప్రమాదానికైనా వెనుదీయదు.దాని సొంతదారుడికి ఉరి పడుతుంది అన్నా వెనుకంజ వెయ్యదు. ఒకవేళ ఘర్షణా, అల్లకల్లోలమూ లాభం తెచ్చే పనయితే, ఆరెంటినే పెట్టుబడి ప్రొత్సహిస్తుంది.స్మగ్లింగూ, బానిస వ్యాపారమూ ఇక్కడ చెప్పిన పై విషయాల్ని బాగా రుజువు పరిచాయి. ఈసందర్భంలో T.J. డన్నింగ్ Trade Unions and Strikes లో రాసిన మాటలు ఫుట్ నోట్ లో ప్రస్తావిస్తాడు మార్క్స్.
వచ్చే పోస్ట్: పెట్టుబడి సంచయనపు చారిత్రక ధోరణి