24, మే 2021, సోమవారం

5. చలామణీ కాలం

 

కాపిటల్ రెండో సంపుటం- అధ్యాయం-5

చలామణీ కాలం

పెట్టుబడి ఉత్పత్తి రంగం గుండానూ, రెండు చలామణీ దశల గుండానూ నడుస్తుంది. ప్రతిదానికీ కొంత కాలం పడుతుంది. మొదటిది ఉత్పత్తికి పట్టే కాలం. చలామణీ రంగంలో నడిచే కాలం, చలామణీ కాలం. ఈ రెండూ కలిసి వలయం చెయ్యడానికి పట్టే మొత్తం కాలం.

ఉత్పత్తి కాలం సహజంగానే శ్రమప్రక్రియ కాలాన్ని ఇముడ్చుకొని ఉంటుంది, కాని అది దానిలో ఇమిడి ఉండదు. మొదట మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి: స్థిర పెట్టుబడిలో యంత్రాల వంటి శ్రమసాధనాలూ, భవనాలూ వగైరా ఉంటాయి. అవి పూర్తిగా అరిగిపోయేదాకా శ్రమ ప్రక్రియలకి ఉపకరిస్తుంటాయి. అంటే ఒక శ్రమప్రక్రియతోనే వాటి పని అయిపోదు. అవి అరిగిపోయేదాకా ఎన్నో శ్రమప్రక్రియల్లో పాల్గొంటాయి.

శ్రమ ప్రక్రియలకి అంతరాయాలు

శ్రమప్రక్రియ అప్పుడప్పుడు ఆగవచ్చు- ఉదాహరణకు రాత్రి సమయంలో. అప్పుడు ఈ ఉత్పత్తి సాధనాల చర్య ఆగుతుంది. కాని అవి ఆ ఉత్పత్తి స్థలంలోనే ఉంటాయి. అందుకు ఆటంకం ఉండదు. పనిచేస్తున్నప్పుడూ, చెయ్యనప్పుడూ కూడా అవి అదే స్థలానికి చెందుతాయి. మరొక పక్క, పెట్టుబడిదారుడు అనుకున్నట్లు ఉత్పత్తి ప్రక్రియ కొనసాగించాలంటే, ముడి పదార్ధాల్నీ, ఉపపదార్ధాల్నీ సరఫరా చెయ్యాల్సి ఉంటుంది. అందుకు మార్కెట్లో రోజువారీ పరిణామాలమీద ఆధారపడకుండా, వాటిని రెడీగా ఉంచుకోవాలి. ముందు అనుకున్న స్థాయిలో ఉత్పత్తి ప్రక్రియను నడపడానికి నిల్వ ఉంచుకోవాలి- ఎందుకంటే అవి అవసరమైనప్పుడు మార్కెట్లో ఉండకపోవచ్చు. ఈ పదార్ధాల నిల్వ ఉత్పత్తిలో క్రమంగా మాత్రమే వినియోగమవుతుంది. కాబట్టి  పెట్టుబడి యొక్క ఉత్పత్తి కాలానికీ, అది పనిచేసే కాలానికీ వ్యత్యాసం ఉంటుంది. ఉత్పత్తి సాధనాల ఉత్పత్తి కాలం:     1. ఉత్పత్తిసాధనాలుగా పనిచేస్తూ ఆవిధంగా ఉత్పత్తి ప్రక్రియకు ఉపకరించే కాలం

2. ఆటంకాలవల్ల ఉత్పత్తి ప్రక్రియ లో కలిసి ఉన్న చర్య జరగని కాలాలు

3. అవి రిజర్వులుగా ఉన్న కాలం - అవి అప్పటికే ఉత్పాదక పెట్టుబడిగా ఉన్నాయి, కాని ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం లేదు. 

ఇంతదాకా ప్రతి సందర్భంలోనూ పరిశీలించిన తేడా: ఉత్పాదక పెట్టుబడి ఉత్పత్తిరంగంలో ఉండే కాలానికీ, అది ఉత్పత్తి ప్రక్రియలో ఉండే కాలానికీ మధ్య తేడా. అందువల్ల ఏర్పడే అంతరాయాలు.

శ్రమ ప్రక్రియకి ఉత్పత్తి ప్రక్రియ వల్ల కలిగే అంతరాయం

 

 అయితే, అసలు ఉత్పత్తి ప్రక్రియే, శ్రమప్రక్రియ అంతరాయాలకు కారణం కావచ్చు. ఎలాగంటే, మనిషి శ్రమతో నిమిత్తం లేకుండానే శ్రమపదార్ధాలు భౌతిక ప్రక్రియ చర్యలకు లోనవుతాయి. అప్పుడు శ్రమ ప్రమేయం ఉండదు. శ్రమ ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. శ్రమ పరికరాలకి పని ఉండదు. కాని ఉత్పత్తి ప్రక్రియ ఆగదు, కొనసాగుతుంది. ఆవిధంగా ఉత్పత్తి సాధనాల పని కొనసాగుతుంది. ఉదాహరణలు: విత్తిన ధాన్యం,  సెల్లార్లో పులిసే ద్రాక్ష సారా. చర్మాన్ని శుద్ధి చేసే ఫాక్టరీల వంటి చోట్ల శ్రమ పదార్ధాలు రసాయన చర్యలకు లోనవుతుంటాయి. అక్కడ కూడా ఇదే వర్తిస్తుంది. ఇక్కడ శ్రమ కాలం కంటే ఉత్పత్తి కాలం ఎక్కువ.

గుప్త ఉత్పాదక పెట్టుబడి

నూలు మిల్లులో పత్తి, బొగ్గు వంటివి ఉత్పత్తి ప్రక్రియకి అవసరం. ఇవి రెడీగా ఉండాలి. అలా వున్నవే గుప్త ఉత్పాదక పెట్టుబడిలో భాగం అవుతాయి. ఆ భాగం వస్తువుల్ని గానీ, విలువల్ని గానీ ఉత్పత్తి చెయ్యదు. అది ఊరకే ఉండే పెట్టుబడి. అయితే అది ఉత్పత్తి ప్రక్రియ నిరాటంకంగా సాగడానికి అవసరం. ఉత్పాదక నిల్వలు ఉంచడానికి అవసరమైన భవనాలూ, సామాగ్రీ, వగైరా ఉత్పత్తి ప్రక్రియకి అవసరం. అందువల్ల అవి మదుపు పెట్టిన ఉత్పాదక పెట్టుబడిలోని భాగాలు. తొలిదశలో అవి ఉత్పాదక అంశాల్ని భద్రంగా ఉంచుతాయి. ఆ విధంగా తమ విధిని నెరవేరుస్తాయి. అవి ముడి పదార్ధాల ధరకు కలిసి, వాటి ధరను పెంచుతాయి. అయితే, ఈ శ్రమలలో ఒక భాగం, మిగతా వేతన శ్రమలలో లాగే  చెల్లింపు లేనిదే. అయినా,, అది ఉత్పాదక శ్రమ, అదనపు విలువని సృజించే శ్రమ. మొత్తం ఉత్పత్తి ప్రక్రియలోని మామూలు అంతరాయాలు, అంటే ఉత్పాదక పెట్టుబడి పనిచెయ్యని విరామ కాలాలు విలువని సృజించవు, అదనపు విలువనూ సృజించవు. అందువల్లనే, పెట్టుబడిదారులకి రాత్రిపూట పని జరిపించాలనే కాంక్ష.

ఉత్పత్తి ప్రక్రియలో పదార్ధానికి సంబంధించి విరామాలు ఉంటాయి. అవి విలువని గానీ, అదనపు విలువనిగానీ ఉత్పత్తి చెయ్యవు. అయితే అవి ఉత్పాదితాన్ని ముందుకు నెడతాయి. దాని జీవితంలో భాగం అవుతాయి. ఆ ఉత్పాదితం ఆ ప్రక్రియగుండా పయనించి తీరాలి. పరికరాలూ వగయిరాల విలువ అవి పనిచేసే మొత్తం కాలానికి తగిన నిష్పత్తిలో ఉత్పాదితానికి బదిలీ అవుతుంది; ఉత్పాదితం ఈ దశకి వచ్చేది శ్రమ వల్లనే.ఈ పరికరాల వాడకం ఉత్పత్తికి అవసరం. ఉత్పాదితంలో చేరకపోయినా, తన విలువని ఉత్పాదితానికి చేర్చే పత్తి ధూళి ఎంత అవసరమో ఈ పరికరాల పని కూడా అంతే అవసరం. భవనాలూ, యంత్రాలూ మొదలైనవి గుప్తపెట్టుబడిలోని మరొక భాగం. వీటి చర్యకు ఉత్పత్తి ప్రక్రియలో క్రమబద్ధంగా వచ్చే అంతరాయాలవల్ల విరామాలు ఏర్పడతాయి. ఉత్పత్తిని పరిమితం చెయ్యడం వల్లా, సంక్షోభాలూ మొదలైనవాటి ఫలితంగా క్రమరహితంగా వచ్చే అంతరాయాలు పూర్తి నష్టాలే. గుప్త పెట్టుబడిలోని ఈ భాగం ఉత్పాదితం తయారీలో చేరదు. చేరకపోయినా, విలువని కలుపుతుంది.  ఉత్పాదితానికి శ్రమసాధనాలు కలిపే మొత్తం విలువ, వాటి సగటు జీవితకాలాన్ని బట్టి నిర్ణయమవుతుంది. అవి విలువని కోల్పోయేది, ఉపయోగపు విలువని కోల్పోవడంవల్ల - పనిచేసే కాలంలోనే కాదు,  పనిచెయ్యని కాలంలోకూడా కోల్పోతాయి.

చివరి సంగతి. శ్రమ ప్రక్రియకి ఆటంకం కలిగినా,  స్థిర పెట్టుబడి భాగం ఉత్పత్తి ప్రక్రియ ఫలితంలో కొనసాగుతుంది, ఉత్పత్తి ప్రక్రియలో తిరిగి దర్శనమిస్తుంది. ఇక్కడ ఉత్పత్తి సాధనాల్ని కొన్ని సహజ ప్రక్రియలగుండా పయనించే పరిస్థితుల్లో పెట్టింది శ్రమే. దాని ఫలితం: నిర్దిష్ట ప్రయోజనకర ప్రభావం, వాటి ఉపయోగపు విలువ రూపంలో మార్పు. శ్రమ  ఉత్పత్తిసాధనాల్ని సరిగా వినియోగించిన మేరకు,వాటి విలువని ఉత్పాదితానికి సదా బదిలీ చేస్తుంది. ఈ ఫలితాన్ని రాబట్టడానికి శ్రమ, శ్రమ సాధనాలతో శ్రమ పదార్ధం మీద నిరంతరాయంగా చర్య చేసినా ఒకటే, లేక అది కేవలం ఉత్పత్తి సాధనాలు వాటంతటవే ఆశించిన మార్పు పొందే పరిస్థితుల్ని కల్పించి తొలి ఊపు నిచ్చినా ఒకటే. తేడా ఏమీ ఉండదు.

శ్రమ జరిగే కాలం కన్నా, ఉత్పతి కాలం ఎక్కువగా ఉండడానికి కారణాలు:

1. ఉత్పత్తి సాధనాలు గుప్తపెట్టుబడిగా ఉండవచ్చు. అంటే, అప్పటికింకా ఉత్పత్తి ప్రక్రియకు  ముందు దశలో ఉండవచ్చు.

2. ఉత్పత్తి ప్రక్రియలో విరామాల మూలంగా వాటి చర్యకి ఆటంకాలు కలిగినందువల్ల కావచ్చు.

3. అసలు ఉత్పత్తి ప్రక్రియే శ్రమప్రక్రియలోఅంతరాయాల్ని అవసరపరచడం వల్ల కావచ్చు.

కారణం ఏమైనా,  పై సందర్భాల్లో ఉత్పత్తిసాధనాలు శ్రమని పీల్చుకునే చర్య చెయ్యవు. శ్రమని పీల్చుకోవు కనక అదనపుశ్రమనీ పీల్చుకోవు. కాబట్టి ఉత్పాదక పెట్టుబడి విలువ పెరగదు.

ఉత్పత్తి కాలమూ, పనిజరిగే కాలమూ దగ్గరై, సమానమయ్యేకొద్దీ ఒక నిర్ణీతకాలంలో ఒక నిర్ణీత ఉత్పాదక పెట్టుబడి ఉత్పాదకతా, విలువా విస్తరిస్తాయి. అందువల్లనే, శ్రమ జరిగే కాలంతో పోలిస్తే, ఉత్పత్తి కాలం వీలైనంత తగ్గించడం అనేది పెట్టుబడి దారీ ఉత్పత్తి ధోరణి. ఒకానొక పెట్టుబడి యొక్క ఉత్పత్తికాలం శ్రమజరిగే కాలం నించి భిన్నంగా ఉండవచ్చు. అయితే, ఉత్పత్తి కాలంలో శ్రమజరిగే కాలం కలిసి ఉంటుంది. ఈ ఎక్కువ ఉత్పత్తి ప్రక్రియకి అవసరం, షరతు. ఉత్పత్తికాలం అనేది పెట్టుబడి ఉపయోగపు విలువల్ని ఉత్పత్తిచేసి, అది విస్తరించే కాలం. అందువల్ల, అది ఉత్పాదక పెట్టుబడిగా పనిచేస్తుంది -  అది గుప్తంగా ఉన్న కాలాన్ని గానీ, తన విలువని విస్తరించకుండా ఉన్న కాలాన్ని గానీ, ఇముడ్చుకొని ఉన్నప్పటికీ.

చలామణీ రంగం లోపల పెట్టుబడి సరుకు పెట్టుబడిగా, డబ్బు పెట్టుబడిగా ఉంటుంది. సరుకు రూపం నించి డబ్బు రూపంలోకీ, డబ్బు రూపం నించి సరుకురూపంలోకీ మారుతుంటుంది. సరుకులు డబ్బులోకి మారడం అనేది అదేసమయంలో సరుకుల్లో ఉన్న అదనపు విలువ సిద్ధింపు. అలాగే డబ్బు సరుకుల్లోకి మారడం అదేసమయంలో పెట్టుబడి విలువ ఉత్పత్తి అంశాల్లోకి తిరిగి మారడం. అయితే ఇది ఈ ప్రక్రియలు చలామణీ ప్రక్రియలుగా మామూలు సరుకుల రూపాంతరీకరణ మాత్రమే అనే వాస్తవాన్ని ఏమాత్రం మారదు.

చలామణీ కాలంలో ఉత్పాదకపెట్టుబడి

ఉత్పత్తి కాలమూ, చలామణీ కాలమూ ఒకదానికొకటి వేరుపడి ఉంటాయి. చలామణీ కాలంలో  పెట్టుబడి ఉత్పాదకపెట్టుబడి చర్యలు చెయ్యదు. కాబట్టి, అది సరుకుల్నీ ఉత్పత్తి చెయ్యదు, అదనపువిలువనీ ఉత్పత్తి చెయ్యదు. వలయాన్ని దాని సరళ రూపంలో పరిశీలిస్తే, అంటే, మొత్తం పెట్టుబడి విలువ ఒకే మొత్తంగా ఒక దశనించి మరొక దశకి పయనించేటప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది: పెట్టుబడి విలువ చలామణీలో కొనసాగినంతకాలం ఉత్పత్తి ప్రక్రియకీ, అందువల్ల, పెట్టుబడి విలువ స్వయం విస్తరణకీ అంతరాయం  ఏర్పడుతుంది; ఉత్పత్తి ప్రక్రియ పునరుద్ధరణ చలామణీ కాలం ఎక్కువ తక్కువలను బట్టి వేగంగానో, నెమ్మదిగానో జరుగుతుంది. అయితే అందుకు భిన్నంగా వివిధ పెట్తుబడి భాగాలు వలయంలో ఒకదాని తర్వాత ఒకటి నడవవచ్చు. అప్పుడు మొత్తం పెట్టుబడి విలువ వలయం, దానిలోని వివిధ భాగాల వలయాల్లో వరసగా పూర్తవుతుంది. అలాజరిగితే, ఆయా భాగాలు చలామణీ రంగంలో ఎంత ఎక్కువకాలం ఉంటే, ఉత్పత్తి రంగంలో పనిచేసే భాగం తగ్గి తీరాలి అనేది స్పష్టమే. అందువల్ల,  చలామణీ  కాలం పెరగడం, తగ్గడం అనేవి ఉత్పత్తికాలం తగ్గుదల, పెరగుదల మీద వ్యతిరేక పరిమితి విధిస్తాయి.

ఒక పెట్టుబడి చలామణీ పరివర్తనలు ఆలశ్యం లేకుండా ఆలశ్యం లేకుండా జరిగేకొద్దీ, అంటే చలామణీ కాలం సున్నకి సమానమయేకొద్దీ, లేక చేరువయ్యే కొద్దీ, పెట్టుబడి అంత ఎక్కువగా పనిచేస్తుంది, దాని  ఉత్పాదకతా, విలువ స్వయం విస్తరణా పెరుగుతుంది. ఉదాహరణకి, ఒక పెట్టుబడిదారుడు సరుకుని ఇవ్వగానే డబ్బిచ్చే ఒప్పందం మీద  పనిచేశాడనుకుందాం. ఆ చెల్లింపు అతనికి ఉత్పత్తి సాధనాల రూపంలో జరగగానే, చలామణీ కాలం సున్నకు చేరువవుతుంది.

అందువల్ల, పెట్టుబడి చలామణీ కాలం దాని ఉత్పత్తి కాలం మీద పరిమితి పెడుతుంది. ఫలితంగా అదనపు విలువని ఉత్పత్తి చేసే ప్రక్రియ మీద పరిమితి పెడుతుంది. ఈ ప్రక్రియ మీద తనకి పట్టే కాలానికి తగిన నిష్పత్తిలో ఈ పరిమితి పెడుతుంది.

చలామణీ కాలం బాగా పెరగావచ్చు, తగ్గావచ్చు. కాబట్టి, అది పెట్టుబడి ఉత్పత్తి కాలాన్ని ఎన్నో స్థాయిల్లో పరిమిత పరిచే అవకాశం ఉంది.

అర్ధశాస్త్రం లోనయిన భ్రమ

అయితే అర్ధశాస్త్రం అగపడేదాన్ని మాత్రమే చూస్తుంది. అంటే: అదనపు విలువని ఏర్పరచే పెట్టుబడి ప్రక్రియ మీద చలామణీ కాలం యొక్క ప్రభావాన్ని చూస్తుంది. ఈ వ్యతిరేక ప్రభావాన్ని అనుకూల ప్రభావంగా తీసుకుంటుంది. కారణం, దాని ఫలితాలు అనుకూలమైనవి అవడమే. అర్ధశాస్త్రం ఈ పైకి అగపడే దాని పట్టుకుని వేలాడుతుంటుంది, గట్టిగా అంటిపెట్టుకొని ఉంటుంది. అందుకు కారణం: పెట్టుబడికి ఉత్పత్తి ప్రక్రియతో నిమిత్తం లేకుండానే, శ్రమ దోపిడీ లేకుండానే  స్వయం విస్తరణ చెందే వనరు - మనం తెలుసుకోలేని వనరు- ఉన్నది అనే రుజువు సమకూరుస్తున్నట్లు ఉండడమే. విస్తరణ చలామణీ రంగంలో జరుగుతున్నట్లు అనిపించడమే. చలామణీ రంగం నించి వచ్చి చేరే ఊటగా అనిపించడమే.  శాస్త్రీయ అర్ధశాస్త్రం * సైతం పైకి కనబడే దాన్ని చూచి  మోసపోయింది. ఈ భ్రమకి లోనయింది. అదెలాగో ముందుముందు తెలుసుకుంటాం.

* సాంప్రదాయ అర్థశాస్త్రం. ఇది  బ్రిటన్ లో విలియం పెట్టీ (1623-1687) తో మొదలై డేవిడ్ రికార్డో (1772-1823)తో ముగిసింది. ఫ్రాన్స్ లో బువాగిల్బేర్(1646-1714) తో మొదలై సిస్మాండీ(1773-1842) తో ముగిసింది. ఇది బూర్జువా సమాజంలో వాస్తవ ఉత్పత్తి సంబంధాల్ని పరిశీలించింది. అలాకాకుండా, పైకి కనపడే వాటిని మాత్రమే నిజమనుకున్న అర్థశాస్త్రం, అశాస్త్రీయ అర్థశాస్త్రం (vulgar economy).

ఈ భ్రమని దృఢపరిచే అంశాలు:

·         పెట్టుబడిదారులు లాభాన్ని లెక్కించే పద్ధతి. ఈ పద్ధతిలో ప్రతికూలమైనది, అనుకూలమైనదిగా కనిపిస్తుంది. ఎందులో నంటే: చలామణీ కాలాలు మాత్రమే భిన్నంగా ఉండే, వేర్వేరు రంగాల్లో పెట్టిన పెట్టుబడుల విషయంలో, ఎక్కువ చలామణీ కాలం ఎక్కువ ధరకి మూలం అవుతుంది. క్లుప్తంగా: అది లాభాలు సమం కావడానికి ఒక ఆధారం అవుతుంది.

·          చలామణీ కాలం టర్నోవర్ కాలంలో ఒక దశ. అయినా టర్నోవర్ కాలంలో ఉత్పత్తికాలం/ పునరుత్పత్తికాలం కలిసి ఉంటుంది. నిజానికి, ఉత్పత్తి కాలానికి చెందాల్సింది, చలామణీ కాలానికి చెందవలసినదిగా అగపడుతుంది.

·         సరుకులు అస్థిరపెట్టుబడిలోకి అంటే వేతనాల్లోకి మారడం అనేది అంతకు ముందు అవి డబ్బులోకి మారడం వల్ల అవసరమవుతుంది. పెట్టుబడి సంచయనం సందర్భంలో అదనపు అస్థిరపెట్టుబడి పరివర్తన చలామణీ రంగంలో లేక చలామణీ కాలంలోజరుగుతుంది. అందువల్ల, ఆవిధంగా జరిగే సంచయనం చలామణీ కాలానికి చెందినదైనట్లు అగపడుతుంది.

చలామణీ రంగంలో పెట్టుబడి రెండు వ్యతిరేక దశలగుండా నడుస్తుంది. ఒక దశ స-డ మరొకదశ డ-స. ఏదిముందు ఏదివెనక అనేది అప్రస్తుతం. కాబట్టి, చలామణీ కాలం కూడా రెండు భాగాలుగా ఉంటుంది:

1.సరుకులు డబ్బులోకి మారడానికి పట్టే కాలం

2. డబ్బు సరుకుల్లోకి మారడానికి పట్టే కాలం.

సామాన్య సరుకుల చలామణీ విశ్లేషణ నించి మనం ఇప్పటికే తెలుసుకున్నది ఏమంటే: దాని పరివర్తనలో స-డ (అమ్మకం) అత్యంత కష్టమైన చర్య. కాబట్టి, మామూలు పరిస్థితుల్లో అది చలామణీ కాలంలో ఎక్కువ భాగం ఉంటుంది.   ఎప్పుడు బడితే అప్పుడు మారగల విలువ రూపం డబ్బు. సరుకుగా, విలువ నేరుగా మారగల రూపాన్ని ముందుగా తీసుకోవాలి. కాబట్టి, డబ్బులోకి మారడం ద్వారా చర్య చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. ఏమైనా, పెట్టుబడి చలామణీ ప్రక్రియలో డ-స దశ ఉత్పాదక పెట్టుబడి అంశాల్లోకి మార్చడం ఉంటుంది. ఉత్పత్తిసాధనాలు మార్కెట్లో ఉండకపోవచ్చు. వాటిని ముందు ఉత్పత్తి చెయ్యాలి. లేదా దూరంగా ఉన్న మార్కెట్ల నించి సేకరించాల్సి ఉంటుంది.  వాటి సరఫరా సక్రమంగా ఉండక పోవచ్చు. వాటి ధరలు మారి ఉండవచ్చు. ఇలా ఇంకా ఎన్నో పరిస్థితులు ఉండవచ్చు. క్లుప్తంగా: మామూలు డ-స పరివర్తనలో గమనించలేని అనేక  పరిస్థితులు ఉంటాయి. పునరుత్పత్తి ప్రక్రియలో ఈ రెండు విధులూ ఉంటాయి. అందువల్ల, ఈ విధులు నిర్వర్తించేందుకు పెట్టుబడిదారుడు కానీ, అతని ఏజెంట్లుగా పనిచేసే వేతన శ్రామికులో ఉండడం అవసరం. దీన్ని బట్టి ఉత్పత్తి ఏజెంట్లతో చలామణీ ఏజెంట్లని గందరగోళపరచేందుకు ఆధారం ఏమీ లేదు. సరుకు పెట్టుబడి విధుల్నీ, డబ్బు పెట్టుబడి విధుల్నీ, ఉత్పాదక పెట్టుబడి విధులతో గందరగోళ పరచడానికి ఆధారం లేదో, అలాగే దీనికి కూడా అధారం లేదు. చలామణీ ఏజెంట్లకు ఉత్పత్తి ఏజెంట్ల నుంచి చెల్లింపు జరగాలి. అయితే, ఒకరి నుండి మరొకరు కొంటారు. ఒకరికి మరొకరు అమ్ముతారు. అలాంటి వాళ్ళు ఈ చర్యల ద్వారా విలువల్నిగాన్నీ, సరుకుల్నిగానీ ఉత్పత్తి చెయ్యరు. వ్యాపార భారం వల్ల వాళ్ళు ఈ కర్తవ్యాన్ని ఇతరులమీద పెట్టినా, పరిస్థితి మారదు. కొన్ని వ్యాపారాల్లో కొనేవాళ్ళకీ, అమ్మేవాళ్ళకీ, లాభాల్లో కొంత శాతం చొప్పున చెల్లింపు ఉంటుంది. వాళ్ళకి  వినియోగ దారుడి నుంచి చెల్లింపు జరుగుతుంది అని చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. ఉత్పత్తి ఏజెంట్లుగా, తమకోసం తామే సరుకుల్లో సమానకాన్ని ఉత్పత్తి చేసిన మేరకు, లేక, వారి భాగస్థులుగా చట్తపరమైన హక్కు వల్లనో, లేక వ్యకిగత సేవలవల్లనో ఉత్పత్తి ఏజెంట్ల నించి స్వాధీనం చేసుకున్న మేరకు వినియోగదారులు చెల్లిస్తారు.

సరుకులకీ, డబ్బుకీ తేడా

సరుకులకీ, డబ్బుకీ రూపంలో తేడా ఉంది. ఈ తేడాతో సంబంధం లేకుండా స-డ కీ, డ-స కీ మరొక తేడా ఉంది. అది పెట్టుబడిదారీ ఉత్పత్తి స్వభావం నించి తలెత్తిన తేడా. స-డ, డ-స లు రెండూ విలువ ఒక రూపం నించి మరొక రూపానికి మారడం మాత్రమే. అయితే స'-' అదేసమయంలో స' లో ఉన్న అదనపువిలువ డబ్బు అవడం కూడా. ఏమైనా డ-స అది కాదు. అందువల్ల అమ్మడం, కొనడం కన్నా మరింత ముఖ్యమైనది. మామూలు పరిస్థితుల్లో డ-స చర్య డ లో వ్యక్తమైన విలువ స్వయం విస్తరణకి అవసరం. కాని అది అదనపు విలువ డబ్బవడం కాదు;అది దాని ఉత్పత్తికి ముందుమాటేగాని, చివరిమాట కాదు. సరుకు ఉపయోగపు విలువగా ఉండే రూపం సరుకు పెట్టుబడి చలామణీకి స'-' కి ఖచ్చితమైన  పరిమితులు పెడుతుంది. ఉపయోగపు విలువలు స్వభావరీత్యానే, చెడిపోయి, నశిస్తాయి. కాబట్టి, అవి కొంతకాలం లోపల వ్యక్తిగతంగానో, ఉత్పాదకంగానో వినియోగమవాలి. ఆ కాలం అవి దేనికోసం ఉద్దేశించబడినవి అనేదాన్ని బట్టి ఉంటుంది. అవి ఆకాలం లోపల అమ్ముడవకపోతే, చెడిపోతాయి. ఉపయోగపు విలువ కోల్పోతాయి. ఉపయోగపు విలువ లేదు కాబట్టి, మారకం విలువకు వాహకాలుగా ఉండే లక్షణాన్ని పోగొట్టుకుంటాయి. వాటిలో ఉన్న పెట్టుబడి విలువా,  దానిలో చేరిన అదనపు విలువా రెండూ పోతాయి. ఉపయోగపు విలువలు, అయిపోగానే ఎప్పటికప్పుడు మళ్ళీ తెచ్చిపెడుతుండాలి. వాటి స్థానంలో అదే రకంవో, మరో రకంవో కొత్త ఉపయోగపు విలువల్ని తెచ్చిపెడుతుండాలి. అలా, అవి నిరంతరమైన, స్వయం విస్తరణ చెందుతున్న పెట్టుబడి విలువగా ఉంటాయి.  సరుకుల రూపంలో ఉపయోగపు విలువల అమ్మకం, తద్వారా  ఉత్పాదక వినియోగంలోకో, వ్యక్తిగత వినియోగంలోకో వాటి ప్రవేశం- ఇది వాటి పునరుత్పత్తికి సదా మరలమరల జరుగుతూ ఉండాలి. అవి  నిర్దిష్టమైన కాలం లోపల కొత్తరూపంలో మనుగడ సాగించడానికి తమ పాత రూపాన్ని మార్చుకొని తీరాలి. తన శరీరాన్ని నిరంతరం పునరుద్ధరించడం ద్వారా మాత్రమే మారకం విలువ నిలబడి ఉంటుంది. భిన్న సరుకుల ఉపయోగపు విలువలు వేర్వేరు వేగాలతో శిధలమై పోతాయి; వాటి ఉత్పత్తికీ, వినియోగానికీ మధ్య వ్యవధి కొద్దిదో, పెద్దదో కావచ్చు; అందువల్ల, అవి చెడిపోకుండా చలామణీ దశ స-డ లో సరుకుపెట్టుబడి రూపంలో కొద్ది కాలమో, ఎక్కువ కాలమో ఉండవచ్చు. సరుకులుగా ఎక్కువ కాలమో, తక్కువకాలమో చలామణీలో ఉండవచ్చు. సరుకు చెడిపోవడం సరుకు పెట్టుబడి చలామణీ కాలం మీద పరిమితి విధిస్తుంది. ఈ చలామణీ కాలానికి సంబంధించి అది పరమ పరిమితి. ఒక సరుకు ఎంత త్వరగా చెడిపోయేదైతే, అది ఉత్పత్తయ్యాక అంత త్వరగా వినియోగమవాలి, అంటే అమ్ముడవాలి. అది ఉత్పత్తయిన చోటునించి పోగల దూరం తక్కువ అవుతుంది. అందువల్ల, అది చలామణీ కాగల పరిధి ఇరుకవుతుంది. అది అమ్ముడయ్యే మార్కెట్లు మరింత స్థానిక మవుతాయి. కాబట్టి, ఒకసరుకు ఎంత త్వరగా చెడిపోయేదయితే, పెట్టుబడిదారీ ఉత్పత్తికి అంత తక్కువ అనువైన వస్తువు అవుతుంది. అటువంటి సరుకు జనసాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మాత్రమే, లేక అభివృద్ధిచెందిన రవాణా వ్యవస్థ దూరాల్ని తగ్గించిన మేరకు మాత్రమే, పెట్టుబడిదారీ ఉత్పత్తి పట్టులోకి రాగలుగుతుంది. అయితే, ఒక వస్తువు ఉత్పత్తి కొద్దిమంది చేతుల్లో, ఎక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాల్లో కేంద్రీకృతం అయతే, అది  పెద్ద బీరు కంపెనీలు, పాల డైరీలు వంటివి తయారు చేసే వస్తువులకు కూడా సాపేక్షంగా పెద్ద మార్కెట్ ని ఏర్పరచవచ్చు.