12, అక్టోబర్ 2023, గురువారం

II నిల్వ ఉంచేందుకు అయ్యే ఖర్చులు

II నిల్వ ఉంచేందుకు అయ్యే ఖర్చులు

1. విలువ రూపం మార్చడానికి మాత్రమే అయ్యే ఖర్చులు సరుకుల విలువలో చేరవు.

విలువ రెండురూపాల్లో ఉంటుంది:

1.సరుకు రూపం

2.డబ్బు రూపం.

మారక ప్రక్రియలో, సరుకు డబ్బు రూపంలోకి మారుతుంది. డబ్బు సరుకు రూపంలోకి మారుతుంది. విలువ రూపం మారడం అంటే ఇదే.  డబ్బిచ్చి సరుకు తీసుకోడం (కొనడం), సరుకిచ్చి డబ్బు తీసుకోడం (అమ్మడం) - మార్కెట్లో జరిగేది ఇదే. ఈ చర్య విలువ పరిమాణాన్ని మార్చదు. విలువ రూపాన్ని మాత్రమే మారుస్తుంది. కొనేవాడి డబ్బు సరుకవుతుంది, అమ్మేవాడి సరుకు డబ్బవుతుంది. అంతే.

ఈ చర్యలకు ఖర్చులుంటాయి. కాని అవి  అచ్చమైన చలామణీ మూలంగా అయ్యే ఖర్చులు. సరుకుల విలువలో చేరవు. కాబట్టి వాటి విలువని పెంచవు.

2. ఈ ఖర్చులు ఉత్పత్తికి సంబంధించినవి కావు. ఉత్పత్తికి ముందూ, ఉత్పత్తైన తరవాతా అయ్యే ఖర్చులు.  విలువ ఏర్పడేది ఉత్పత్తిలోనే కదా! కాబట్టి ఉత్పత్తిలో లేని ఈ ఖర్చులు విలువలో చేరవు. ఆ కారణంగా అవి పెట్టుబడిదారుడి చేతికి తిరిగి రావు. అవి పెట్టుబడినించి కోసివేతలే. అదనపువిలువనించి పెట్టే ఖర్చులే.

ఉదాహరణకి, పరుపులు తయారుచేయించే పెట్టుబడిదారుణ్ణి తీసుకుందాం. ఉత్పత్తికి ముందు ఉత్పత్తిసాధనాల్ని పెట్టుబడిదారుడు మార్కెట్లో కొంటాడు. వాటి ఖరీదు కాకుండా, వాటిని కొనే పనికి కొన్ని ఖర్చులవుతాయి. ఈ ఖర్చు 5000 అనుకుందాం. ఇది కొన్నందుకు అయిన ఖర్చు.

10 పరుపులు తయారు చేయించడానికి లక్ష రూపాయలు అయినాయి అనుకుందాం. ఇవి ఉత్పత్తి ఖర్చులు. ఉత్పత్తైన సరుకు విలువ రూ.1,40,000 అనుకుందాం.

ఉత్పత్తైన తరవాత వీటిని మార్కెట్లో అమ్మాలి. అందుకు కొంత ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు రూ.5,000 అనుకుందాం. ఇది అమ్మేందుకు అయిన ఖర్చు . ఉత్పత్తైన సరుకు విలువ రూ.1,40,000 ని విడగొడితే ఉత్పత్తి ఖర్చు రూ.1,00,000. అదనపువిలువ రూ.40,000. ఉత్పత్తైన సరుకు విలువ మొత్తం రూ.1,40,000. అమ్మగానే ఈమొత్తం తిరిగి అతని చేతిలో పడుతుంది.

కాని, కొనేందుకూ, అమ్మేందుకూ అయిన ఖర్చు 10,000 అతని చేతికి తిరిగి రాదు. ఎందుకంటే, అది ఉత్పత్తైన సరుకు విలువకు కలవదు  గనక. అచ్చమైన చలామణీ ఖర్చులు గనక.

మరి ఇది ఎక్కడనించి వస్తుంది? అదనపు విలువనించే. మరోదారి లేదు. అంటే ఈమొత్తం కలిసి రూ.1,50,000 రావు. రూ.1,40,000 మాత్రమే వస్తాయి. అంటే ఈ రూ.10,000 పెట్టుబడినించి తీసివేతే. అదనపువిలువనించి కోసివేతే.

3. మనం పరిశీలించబోయే ఖర్చులు కొనడానికో అమ్మడానికో అయ్యేవి కావు. అంటే అచ్చమైన చలామణీ ఖర్చులుకావు. స్వభావరీత్యా వాటికి భిన్నమైనవి.

ఉత్పత్తికీ, వినియోగదారుడికి చేరేదానికీ మధ్య కొంత కాలం సరుకులు నిల్వపెట్టాల్సి వస్తుంది. అందుకు కొన్ని ఖర్చులవుతాయి. ఇవి అమ్మేందుకూ కొనేందుకూ అయ్యే ఖర్చులు కాదు అనేది స్పష్టమే.అయితే ఇవి జరిగింది ఉత్పత్తిరంగంలో కాదు, చలామణీ రంగంలో. కాబట్టి చలామణీ ఖర్చుల కిందికి వస్తాయి. అయితే, ఇక్కడ అమ్మకమూ లేదు, కొనుగోలూ లేదు. అందువల్ల ఇవి చలామణీ ఖర్చులే అయినప్పటికీ అచ్చమైన చలామణీ ఖర్చులు కావు.

అవి ఉత్పత్తి ప్రక్రియలోనే ఏర్పడి, చలామణీరంగంలో కొనసాగే ఖర్చులు. అందువల్ల, వాటి ఉత్పత్తిస్వభావాన్ని చలామణీ రూపం కప్పిపెడుతుంది. అంటే వాటికి ఉత్పత్తి స్వభావం ఉన్నాగాని, చలామణీ రూపం దాన్ని కనపడనివ్వదు అని. ఈఖర్చులు ఉత్పత్తికి ఆపాదించ వలసినవి. ఎందుకంటే: అమ్ముడయ్యేదాకా వాటిని చెడకుండా అలాగే ఉంచాలి. ఉంచితేనే, ఉత్పత్తి పూర్తియినట్లు. ఈచర్య ఉత్పత్తిరంగానికి సంబంధించింది. అయితే సరుకు ఉత్పత్తిరంగాన్ని విడిచిపెట్టి  చలామణీ రంగంలో చేరాక జరుగుతుంది.

కాబట్టి చలామణీ రంగంలో జరిగినా, ఈఖర్చులు వాస్తవానికి ఉత్పత్తి ఖర్చులకి కొనసాగింపే. ఉదాహరణకి శీతలీకరణ అలాంటిది. ఆఖర్చు వల్ల సరుకుల ఉపయోగపు విలువ పెరగదు. ఇది స్పష్టమే. కాని, ఇది లేకపోతే కొన్ని సరుకులు ఎంతోకొంత చెడిపోతాయి. అందువల్ల ఈ ఖర్చులు వాటి ఉపయోగపు విలువ పోకుండా కాపాడే ఖర్చులు.

ఆవిధంగా, కొన్నిఉత్పత్తి ప్రక్రియలు చలామణీ రంగంలో కొనసాగుతాయి.. అందువల్ల చలామణీగా అగపడే దానిలో కొంత విలువ ఏర్పడుతుంది.

4.ఈ ఖర్చుల ప్రభావం వాటిని వాడుకునే సమాజానికీ, ఉత్పత్తిచేసే పెట్టుబడిదారుడికీ ఒకటిగా ఉండదు

A. సమాజం వైపునించి అవి ఉత్త ఖర్చులు కావచ్చు. ఖర్చు అనుత్పాదక శ్రమ వ్యయం మాత్రమే.  ఆ శ్రమ  సజీవ శ్రమ అయినా, వస్తువులో చేరిన శ్రమ అయినా.  

B. వ్యష్టి పెట్టుబడిదారుడి వైపునించి: ఈ ఖర్చులు అతనికి విలువని సృజించవచ్చు. ఆ విలువ అతని సరుకుల అమ్మకం ధరలకు కలవవచ్చు. నిల్వచేసేందుకయ్యే ఖర్చులూ, రవాణా ఖర్చులూ ఈకోవలోవి. ఆయా సరుకుల అమ్మకం ధరలకు కలవవచ్చు. అవి అతనికి ఆదాయవనరు అవచ్చు. జరిగింది చలామణీ రంగంలోనే అయినా, అవి ఉత్పత్తిప్రక్రియలు. వాటికి ఉత్పాదకస్వభావం ఉంటుంది, కాబట్టి వ్యష్టి పెట్టుబడిదారుడికి విలువని ఏర్పరుస్తాయి - అమ్మకం ధరలకి కలుస్తాయి. సమాజానికి సంబంధించి అవి అనుత్పాదకమైనవి అయినప్పటికీ.

5.ఈ ఖర్చులు అన్ని రంగాల్లో ఒకటిగా ఉండవు. తేడాలుంటాయి. ఒకే రంగంలోకూడా అక్కడక్కడా తేడాలుంటాయి.

సరుకు ధరలకు ఇవి కలవడం అంటే అర్ధం : వ్యష్టిపెట్టుబడి దారుడికి ఏస్థాయిలో పడతాయో, దానికి అనుగుణమైన నిష్పత్తిలో పంపిణీ అవడం అని.

పెట్టుబడిదారీ విధానంలో  విలువని కలిపే శ్రమ, అదనపు విలువను కూడా కలుపుతుంది. ఎందుకంటే: ఆ శ్రమ ఏర్పరచే విలువ ఆశ్రమ పరిమాణాన్ని బట్టి ఉంటుంది; అదనపు విలువేమో ఆ శ్రమకి  ఏమేర చెల్లిస్తాడో దాన్ని బట్టి ఉంటుంది.

అందువల్ల, సరుకుల ఉపయోగపువిలువను పెంచకుండానే, సరుకుల ధరలను పెంచే ఖర్చులు సమాజానికి దండగ ఖర్చులు. అవి సమాజానికి అనుత్పాదక ఖర్చుల కిందికి వస్తాయి. అయినా అవి వ్యష్టి పెట్టుబడిదారుడికి మాత్రం ఆదాయ వనరు అవవచ్చు.*

మరొకవైపు, అవి సరుకు ధరకు కలిపే మేరకు ఈ చలామణీ ఖర్చుల్ని సమానంగా పంపిణీ మాత్రమే చేస్తుంది. అంతమాత్రాన,  అవి వాటి అనుత్పాదక స్వభావాన్ని కోల్పోవు. ఉదాహరణకి బీమా కంపెనీలు వ్యష్టి పెట్టుబడిదారుల నష్టాల్ని పెట్టుబడిదారీ వర్గం మధ్య పంపిణీ చేస్తుంది. అయితే ఆవిధంగా సర్దుబాటు చేయబడ్డ నష్టాలు, మొత్తం సమాజ పెట్టుబడి దృష్ట్యా నష్టాలే - అంతకు ముందులాగానే.

*******

* ఉత్పాదక స్వభావం - అనుత్ఫాదక స్వభావం

అదనపు విలువ సిద్ధాంతాలు మొదటి సంపుటిలో  'ఉత్పాదకఅనుత్పాదక సిద్ధాంతాలు' పేరిట 153 పేజీలతో (152-304) ఒక అధ్యాయం ఉన్నది. 

అదే సంపుటిలో  పెట్టుబడి  ఉత్పాదకత. ఉత్పాదకఅనుత్పాదక శ్రమ పేరుతో అనుబంధం 12 ఉంది. అది 25 పేజీలు (389-413). 

వాటిలోఉత్పాదక అనుత్పాదక శ్రమల గురించిన మార్క్స్ సిద్ధాంతం వివరంగా ఉంటుంది.

చలామణీ ఖర్చుల విషయం వచ్చినప్పుడు, ఉత్పాదక అనుత్పాదక శ్రమల గురించి చెబుతాడు. కాపిటల్ ఒకటో సంపుటిలో దీన్ని ప్రస్తావన ఉంటుంది. దాన్ని రెండో సంపుటిలో పొడిగిస్తాడు. మొదటి సంపుటిలో ఉత్పాదక శ్రమని అత్యంత విస్తృత స్తాయిలో చూస్తాడు. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో దాని స్వభావాన్ని వేరుచేసి పరిశీలించడు. అంటే పరిమితార్ధంలో చూడడు.

విస్తృతస్థాయిలో చూసినప్పుడు, ఉత్పాదక శ్రమ అనేది ఏదో ఒక ప్రయోజనకర ఫలితాన్ని ఉత్పత్తిచేసే శ్రమ.     అయితే పెట్టుబడిదారీ వ్యవస్థలో అదనపు విలువని ఉత్పత్తిచేసే వేతన శ్రమ మాత్రమే ఉత్పాదక శ్రమ. చెయ్యనిది ఉత్పాదక శ్రమ కాదు. అనుత్పాదకశ్రమ. అంతే. ఇంటి అవసరాలకీఇతరులకి ఊరకే ఇవ్వడానికీ వస్తువులు చేసే శ్రమ విస్తృతార్ధంలో ఉత్పాదక శ్రమే. కాని పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పాదక శ్రమ కాదు. అనుత్పాదక శ్రమ. 

కేవలం శ్రమ ప్రక్రియ దృష్ట్యా చూస్తే, శ్రమ ఉత్పాదితంలో సిద్ధిస్తే అది ఉత్పాదక శ్రమ అనిపిస్తుంది. 

పెట్టుబడి దారీ ఉత్పత్తి దృష్ట్యా చూస్తే అదనపు విలువని ఉత్పత్తిచేసే శ్రమ మాత్రమే ఉత్పాదక శ్రమ

 డబ్బుని పెట్టుబడిగా మార్చే శ్రమ ఉత్పాదక శ్రమ(అదనపు విలువ సిద్ధాంతాలు 1.399).                       “అదనపు విలువని ఉత్పత్తి చెయ్యని శ్రమ అనుత్పాదక శ్రమ” (.వి.సి. 1.160).

ఉత్పాదక శ్రామికుడు శ్రమశక్తిని కొన్నవాడికి సరుకులు ఉత్పత్తిచేస్తాడు.” (.వి.సి. 1.160).

అనుత్పాదక శ్రామికుడు ఉపయోగపు విలువలు ఉత్పత్తిచేస్తాడు.” (.వి.సి. 1.160)

ఒకే శ్రమ పెట్టుబడిదారుడికి ఉత్పాదక శ్రమ అయి ఉండి వినియోగ దరుడికి అనుత్పాదక శ్రమ అవచ్చు.

హోటెల్ లో వంటవాళ్ళూ , వెయిటర్లూ  చేసే శ్రమ  ప్రొప్రైటర్ కి పెట్టుబడిగా మార్చబడే మేరకు ఉత్పాదక శ్రమ. వాళ్ళే గృహసేవకులుగా పనిచేసినప్పుడు, తమ సేవలతో నేను పెట్టుబడిని చేసుకోని మేరకు, ఆదాయాన్ని ఖర్చుచేసే మేరకు-అనుత్పాదక శ్రామికులు. ఏమైనప్పటికీ, వాస్తవానికి, అదే హోటెల్ లో వినియోగదారుడినైన నాకు కూడా వాళ్ళు అనుత్పాదక శ్రామికులే అదనపువిలువ సిద్ధాంతాలు ఒకటో సంపుటి పేజీ 159

పెట్టుబడిదారుల సంస్థల్లో వేతన శ్రామికులుగా పనిచేసే కళాకారులూ నటులూ,ఉపాధ్యాయులూ, డాక్టర్లూ పెట్టుబడిదారులకి అదనపు విలువని ఉత్పత్తిచేస్తారు. కాబట్టి ఉత్పాదకశ్రామికులు.  ఉదాహరణకిపెట్టుబడిదారులు నడిపే విద్యసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు సంస్థ యజమానికి వేతనశ్రామికులే కావచ్చు. ఇంగ్లండ్ లో అలాంటి విద్యా ఫాక్టరీలు చాలానే ఉన్నాయి. విద్యార్ధులకు సంబంధించి ఈ టీచర్లు ఉత్పాదక శ్రామికులు కారు. అయితే వాళ్ళ యజమానితో సంబంధంలో అదే టీచర్లు ఉత్పాదక శ్రామికులు అదనపువిలువ సిద్ధాంతాలు ఒకటో సంపుటి పేజీ 411. 

అదనపు విలువ సిద్ధాంతాలు మొదటి సంపుటిలో 'ఉత్పాదక, అనుత్పాదక సిద్ధాంతాలు పేరిట 153 పేజీలతో (152-304) ఒక అధ్యాయం (4) ఉన్నది. అదే సంపుటిలో  ' పెట్టుబడి  ఉత్పాదకత. ఉత్పాదక, అనుత్పాదక శ్రమ ' అనుబంధం 12 ఉంది. అది 25 పేజీలు (389-413)

 

*********

సరుకుల చలామణీకి అయ్యే ఖర్చులు 3 విధాలు:                                                                                                 

 1. సరుకులు కొనడానికీ, అమ్మడానికీ అయ్యేవి- అచ్చమైన చలామణీ ఖర్చులు

2. సరుకులు స్టాకు పెట్టడానికి అయ్యేవి

3. సరుకులు రవాణా చెయ్యడానికి అయ్యేవి.

అచ్చమైన చలామణీ ఖర్చులగురించి వివరంగా చూశాం. ఇక స్టాకు పెట్టడానికీ, రవాణా చెయ్యడానికి అయ్యేఖర్చులు పరిశీలించాలి.

వచ్చే పోస్ట్:  స్టాకు ఏర్పడడం

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి