3, ఫిబ్రవరి 2019, ఆదివారం

ఆదిమ సంచయనం


భాగం -8
ఆదిమ సంచయనం
చాప్టర్-26 ఆదిమసంచయన రహస్యం
పెట్టుబడి సంచయనం అనేది కేవలం వస్తువులు పోగుపడడమే కాదు, అంతకంతకూ పెరిగే ఒక సామాజిక సంబంధం యొక్క పునరుత్పత్తీ, విస్తరణా కూడా. పెట్టుబడిదారుడి చేతిలో పెట్టుబడి పరిమాణం పెరుగుతుంది; అంతే కాదు, దోపిడీ చేయ్యదగిన జనాభా పెరుగుతుంది; నిరుద్యోగ నిల్వ సైన్యం నుండి ఈ జనాభా సరఫరా అవుతుంది. ఈ సంపుటం చివరి భాగం 'ప్రాధమిక సంచయనం'గురించి.ఇందులో పెట్టుబడి దారీ విధానానికి దారితీసే అంశాలగురించి ఉంటుంది. అవి పెట్టుబడి దారీ విధానానికి చెందినవి కావు. అయితే దానికి ముందు ఉండాల్సిన అంశాలు. అవి లేనిదే పెట్టుబడిదారీ విధానం ఏర్పడదు. అవి పెట్టుబడిదారీ విధానానికి ముందు చరిత్రకు చెందినవి.
మొదట్లో వ్యాపార సంస్థల్ని పెట్టడానికి పెట్టుబడి దారులకి డబ్బు ఎక్కడ నుండి వచ్చిందో పరిశోధిస్తుంది. పెట్టుబడి దారీ విధానానికి అవసరమైన అంశాల ఆవిర్భావాన్ని పరిశీలిస్తుంది.ఉదాహరణకి ఉత్పత్తి సాధనాలూ, స్వేచ్చా శ్రామికులు మార్కెట్లో లభ్యమైన తీరుని వివరిస్తుంది. ఈ అంశాలన్నిటిలోనూ కార్మిక వర్గ సృష్టి అత్యంత మౌలిక మైనది.

ఈ చాప్టర్ మొదటి వాక్యం ఇప్పటిదాకా చూసిన 1-25 చాప్టర్ల సారాంశం ఉంటుంది.
ఇప్పటికి చూసిన విషయాలు:
1. డబ్బు పెట్టుబడిగా ఎలా మార్పు చెందింది?
2. పెట్టుబడి ద్వారా అదనపు విలువ ఎలా ఏర్పడింది?
3. అదనపు విలువ నుండి తిరిగి మరింత పెట్టుబడి ఎలా ఉత్పత్తయింది?
మొదటి విషయాన్ని రెండో భాగం వివరిస్తుంది. పెట్టుబడి అదనపు విలువని ఎలా ఉత్పత్తిచేస్తుందో 3-6 భాగాల్లో ఉంటుంది. ఇక 7 వ భాగం అదనపు విలువ మళ్ళీ మరింత పెట్టుబడిలోకి ఎలా మారుతుందో తేల్చి చెబుతుంది.
తార్కిక వైరుధ్యం
పెట్టుబడి సంచయనానికి అదనపు విలువ ముందు షరతు. ఎందుకంటే అదనపు విలువ అసలు పెట్టుబడికి కలవడమే సంచయనం. కాబట్టి అదనపు విలువ ముందుగా ఉంటేనే సంచయనం సాధ్యమవుతుంది. అయితే అదనపు విలువ ఉండాలంటే, ముందు పెట్టుబడిదారీ విధానం ఉనికిలో ఉండాలి. పెట్టుబడిదారీ ఉత్పత్తి ఉండాలంటే, సరుకు ఉత్పత్తి దారుల చేతుల్లో గణనీయమైన పరిమాణంలో పెట్టుబడీ, శ్రమశక్తీ ఉండాలి.
అదనపు విలువ ముందుగా ఉంటేనే గాని పెట్టుబడి సంచయనం కుదరదు. పెట్టుబడి ముందుగా ఉంటేనే గాని అదనపు విలువ ఏర్పడదు. ఒకదానికొకటి ముందు షరతు. అదుంటేగాని, ఇదుండదు, ఇదుంటేనేగాని అదుండదు. తార్కిక వైరుధ్యం ఏర్పడింది.
కాబట్టి ఇదంతా ఏదో విషవలయంలో తిరుగుతున్నట్లు కనబడుతుంది. దీన్నించి బయటబడాలంటే పెట్టుబడిదారీ సంచయనానికంటే ముందే ఆదిమ సంచయనం ఒకటి ఉంది అనుకోవాలి. స్మిత్ వెనకటి సంచయనం (previous accumulation) అన్నది దీన్నే. ఈసంచయనం పెట్టుబడిదారీ విధానపు ఫలితం కాదు, ఆవిధానానికి ఆరంభ స్థానం.
పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు చెప్పే కధ
మతశాస్త్రంలో తొలి పాపం నిర్వహించిన పాత్రనే రాజకీయ అర్ధశాస్త్రంలో ఆదిమ సంచయనం నిర్వహిస్తుంది. ఆదాం ఆపిల్ కొరికాడు, దాంతో ఆపాపం మనుష్య జాతి మొత్తం మీదా పడింది. గతంలో ఎన్నడో జరిగిన ఘటనగా చెప్పినప్పుడు, దాని మూలాన్ని వివరించనట్లుగా అనుకోవాల్సి ఉంటుంది.

 చాలాకాలం వెనక, రెండు తరహాల మనుషులు ఉండే వాళ్ళు; ఒకతరహా వాళ్ళు కష్ట పడేవాళ్ళు, తెలివైన వాళ్ళు,పైగా పొదుపరులు; రెండో తరహా వాళ్ళు సొమరిపోతులు,ఉన్నది ఖర్చు పెట్టే వాళ్ళు అంతకు మించీ ఖర్చుచేసే వాళ్ళు. చమటోడిస్తేనే మనిషికి తిండి దొరికే పరిస్థితి ఎలా వచ్చిందో తోలి పాపం కధ మనకు చెబుతుంది. అయితే తొలి ఆర్ధిక పాపం చరిత్ర మనకేం చెబుతుందంటే: ఏవిధంగానూ ఇది అవసరం లేని జనం ఉన్నారు. అంటే బకడానికి చెమట కార్చాల్సిన పని లేనివాళ్ళు ఉన్నారని అర్ధం. ఆవిషయాన్ని పట్టించుకోవద్దు!

అప్పటి నుండీ అంటే, తొలి పాపం నాటి నుండీ,అధిక సంఖ్యాకులకి ఎంత శ్రమ చేసినా,పేదరికం ఏర్పడింది.ఇప్పటిదాకా శ్రమ చేస్తూనే ఉన్నా అమ్ముకోడానికి సొంత శరీరమే తప్ప మరేమీ లేదు. పనిచెయ్యడం ఏనాడో మానుకున్నా కొద్దిమందికి సంపద ఇబ్బడి ముబ్బది గా నిరంతరం పెరుగుతున్నది. ఆస్తిని సమర్ధించే వాళ్ళు మనకు ఇలాంటి కట్టు కధలు వినిపిస్తూనే ఉన్నారు.

కొంతకాలానికి మొదటి తరహా వాళ్ళు సంపద పోగు చేసుకున్నారు. రెండో తరహా వాళ్ళు ఉన్నది పొగొట్టుకొని, అనేకమంది బతుకుదెరువుకోసం రెక్కల కష్టం తప్ప మరేమీ లేనివాళ్ళుగా మిగిలారు. అల్ప సంఖ్యాకులు ఎంతోకాలం క్రితమే పని మానుకున్నప్పటికీ సంపదని ఇబ్బడి ముబ్బడి చేసుకో గలుగుతున్నారు. ఇదీ పెట్టుబడిదారీ విధాన సమర్ధకుల కట్టు కధ, కాకమ్మ కధ.
మార్క్స్ ఈ కధని తుత్తునియలు చేస్తాడు. ఈ కధని బట్టి కష్ట పడే వాళ్ళు సంపన్నులు కావాలి. సోమరులు పేదలు అవాలి.కాని పెట్టుబడి దారీ విధానంలో దీనికి విరుద్ధంగా జరుగుతుంది. ఎప్పుడో పని మానేసిన వాళ్ళు సంపన్నులవుతుండగా,  నిరంతరం కష్టం చేసే వాళ్ళు పేదలుగా ఉన్నారు.ఇదే వాళ్ళు చెప్పేకధ పెట్టుబడిని సమర్ధించే కట్టుకధ అనడానికి నిదర్శనం.
యదార్ధ గాధ

చరిత్రలో దురాక్రమణా, బానిసీకరణా, దారి దోపిడీ, హత్యా- ఒక్కముక్కలో బలప్రయోగం  పెద్ద పాత్ర పోషించింది. అయితే ఆర్ధశాస్త్రపు సున్నిత చరిత్రలో గ్రామీణ స్వచ్ఛత ( idyllic) అనాదిగా  రాజ్యం ఏలుతున్నది. నైతికతా, శ్రమా- ఇవి రెండే ఎల్లప్పుడూ  సంపదకు సాధనాలుఅని అర్ధశాస్త్రం చెబుతుంది, ప్రచారం చేస్తుంది.
వాస్తవానికి ఆదిమ సంచయనానికి కారకాలు అర్ధశాస్త్రం చెప్పే ధర్మబద్ధ పద్ధతులు ఏమాత్రం  కావు.
ఉత్పత్తిసాధనాలూ, జీవితావసర వస్తువులూ పెట్టుబడి కానట్లే, డబ్బూ సరుకులూ వాటికవి స్వతహాగా పెట్టుబడికావు. అవి పెట్టుబడిలోకి మార్చబడాలి. అయితే ఈ మార్పు నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే జరుగుతుంది. రెండు భిన్న రకాల సరుకులున్న ఓనర్లు ఒకరికొకరు ఎదురుపడాలి; డబ్బూ, ఉత్పత్తి సాధనాలూ, జీవితావసర వస్తువులూ ఉండి, ఇతరుల శ్రమశక్తిని కొని వాటి విలువని పెంచుకోడానికి ఆతృతతో ఉన్న ఓనర్లు ఒకవైపు: స్వేచ్చాయుత శ్రామికులు,  శ్రమ అమ్మకం దార్లు మరోక వైపు. శ్రమ శక్తిని కొనేవాళ్ళు ఒకవైపు, అమ్మేవాళ్ళు మరొకవైపు.
శ్రమ శక్తిని సరుకుగా అమ్ముకోవాల్సిన పరిస్థితులు.
స్వేచ్చాయుత శ్రామికులకు రెండర్ధాల్లో స్వేచ్చ ఉంటుంది. బానిసల లాగానో, ఫ్యూడల్ దాసుల లాగానో ఉత్పత్తిసాధనాల్లో వాళ్ళు భాగం కారు. సొంత రైతులవైనట్లుగా, ఉత్పత్తి సాధనాలు వాళ్ళవి కావు. కాబట్టి వాళ్ళు సొంత ఉత్పత్తిసాధనాల నుండి స్వేచ్చ పొందిన వాళ్ళు. అవి లేనివాళ్ళు.
మార్కెట్లో రెండు ధ్రువాలుగా - కొనేవాళ్ళూ, అమ్మేవాళ్ళూ - విడిపోవడంతో, పెట్టుబడిదారీ ఉత్పత్తికి అవసరమైన మౌలిక పరిస్థితులు ఏర్పడ్డాయి.  శ్రామికులు తమ శ్రమని సిద్ధింపచెయ్యడానికి కావలసిన సాధనాల  నుండి పూర్తిగా వేరుపడాలి. వేరు పడకపోతే అసలు పెట్టుబడి దారీ ఉత్పత్తే మొదలు కాదు. పెట్టుబడి దారీ ఉత్పత్తి  మొదలైందంటే,  తనకాళ్ళమీద నిలబడీ నిలబడంగానే, ఈ వేరుపడడాన్ని కొనసాగిస్తుంది, నిరంతరం పెరిగే స్థాయిలో దీన్నిపునరుత్పత్తి చేస్తుంది.
ఈ ప్రక్రియ ఒకపక్క, ఉత్పత్తి సాధనాల్నీ, జీవితావసర వస్తువుల్నీ పెట్టుబడిలోకీ,మరొకపక్క ప్రత్యక్ష ఉత్పత్తిదారుల్ని వేతన శ్రామికుల్లోకీ మార్చి వేస్తుంది. కాబట్టి,ఆదిమ సంచయనం అనబడేది, ఉత్పత్తిదారుణ్ణి ఉత్పత్తి సాధనాలనుంచి వేరుపరిచే చారిత్రక క్రమంతప్ప ఇంకొకటి కాదు.
పెట్టుబడిదారీ సమాజపు ఆర్ధిక చట్రం  భూస్వామ్య సమాజపు ఆర్ధిక చట్రం నుంచి పుట్టి పెరిగింది. భూస్వామ్య     సమా జం విచ్ఛిన్నమవుతూ, పెట్టుబడిదారీ సమాజపు మౌలిక అంశాల్ని విడుదల చేసింది. ప్రత్యక్ష ఉత్పత్తిదారుడు, అంటే శ్రామికుడు భూమితో బంధాన్ని తెంచుకున్నాకనే, బానిసగానో,భూదాసుడుగానో, నిర్బంధ సేవకుడుగానో ఉండడం ఆగితేనే,  అతను తనను తాను అమ్ముకో గలుగుతాడు. శ్రమశక్తి అమ్మకందారుడుగా అవాలంటే, వృత్తిసంఘాల పట్టునుండి కూడా బయట పడాలి. అప్రెంటిస్ లకూ, జర్నీ మన్ లకూ ఉన్న నియమాలనుండి, శ్రమ నిబంధనల అవరోధాలనుండి విముక్తుడవాలి.
కాబట్టి,  ఉత్పత్తి దారుల్ని వేతన శ్రామికులుగా మార్చే చారిత్రక చలనం, ఒకపక్క భూస్వామ్య దోపిడీ నుండీ, గిల్డుల సంకెళ్ళ నుండీ విముక్తి లాగా అగపడుతుంది. బూర్జువా చరిత్రకారులకు ఈ పార్శ్వం మాత్రమే కనబడుతుంది. అయితే మరొకపక్క, విముకులైన వాళ్ళు తమ సొంత ఉత్పత్తి సాధనాలూ,పాత భూస్వామ్యం కల్పించిన హామీలూ కొల్లగొట్టబడిన తర్వాత మాత్రమే తమను తాము అమ్ముకోగలిగారు. వాళ్ళ  అస్థిహరణ చరిత్ర మానవ చరిత్రలో అగ్ని జ్వాలలతోనూ, రక్తధారలతోనూ రాయబడింది.
భూస్వాములమీదా,  గిల్డ్ మేస్త్రులమీదా పెట్టుబడి దారుల విజయం
పారిశ్రామిక పెట్టుబడిదారులు, సరికొత్త సర్వాధికారులు, సంపద  వనరుల ఆసాములైన  చేతివృత్తుల గిల్డ్ మేస్త్రుల్నీ, ఫ్యూడల్ ప్రభువుల్నీ కూడా తొలిగించాల్సివచ్చింది.
వాళ్ళు సామాజిక అధికారాన్ని గెలుపొందడం భూస్వాములమీదా, వాళ్ళకి మాత్రమే ఉండే విశిష్ట హక్కులమీదా, గిల్డులమీదా స్వేచ్ఛాయుతగా  ఉత్పత్తి అభివృద్ధి చెందేందుకూ,  మనిషిని మనిషి యధేచ్ఛగా దోపిడీ చేసేందుకూ వీలులేకుండా ఆ గిల్డులు వేసిన సంకెళ్ళ (విధించిన నిబంధనల) మీదా వాళ్ళు విజయవంతంగా చేసిన యుద్ధ ఫలితంగా కనబడుతుంది. ఏమైనా,  ప్రస్తుత కాలపు పరిశ్రమల వీరులు వాళ్ళకి ఏమాత్రం ప్రమేయంలేని ఘటనల్ని వాడుకొని పాతకాలపు  కత్తుల వీరుల్ని తొలిగించ గలిగారు.ఒకప్పుడు విముక్తి పొందిన రోమన్ బానిస ఎంత నీచ పద్ధతులద్వారా తన పోషకునికే  యజమానిగా ఎదిగాడో, అంత తుచ్ఛ విధానాల ద్వారా పారిశ్రామికాధిపతులూ పైకి లేచారు.
పెట్టుబడిదారీ శకం ప్రారంభం

అటు వేతనకార్మికుడూ, ఇటు పెట్టుబడిదారుడూ ఏర్పడి, అభివృద్ధి అవడానికి ఆరంభ స్థానం కార్మికుని దాస్యం.దీని పురోగమనం ఈ దాస్యం మార్పులో ఉంది.భూస్వామ్య దోపిడి  పెట్టుబడిదారీ దోపిడిగా పరివర్తన చెందడంలో ఉంది.ఈ గమనాన్ని గ్రహించడానికి మనం చరిత్రలో మరీ వెనక్కి పోనక్కర్లేదు.పెట్టుబడిదారీ విధాన మొదళ్ళు కొన్ని మధ్యధరాప్రాంత పట్టణాల్లో అక్కడక్కడా, చెదురుమదురుగా 14,15 శతాబ్దాల్లో కనిపిస్తాయి.అయితే పెట్టుబడిదారీ శకం మొదలైంది మాత్రం 16 వ శతాబ్దంలోనే.
అది కనిపించిన చోటల్లా,అప్పటికే బానిసత్వం రద్దు అమలయి చాలా కాలం అయింది. మధ్యయుగాల  అత్యున్నత వికాస ఫలితాలైన  సర్వసత్తాక పట్టణాల మనుగడ ఎంతోకాలంగా క్షీణిస్తూ ఉంది. అంటే, నూతన యుగారంభానికి,  పెట్టుబడిదారీ శకం ప్రవేశించడానికి వేళ అయిందన్నమాట.
ఆదిమ సంచయన చరిత్రలో పెట్టుబడిదారీ వర్గం రూపొందే క్రమంలో అన్ని విప్లవాలూ లివర్లుగా పనిచేశాయి.అన్నిటినీ మించి, పెద్దపెద్ద ప్రజా రాసులు అకస్మాత్తుగానూ, బలవంతంగానూ జీవితావసర వస్తువులనుండి విడగొట్టబడి, బంధం లేని స్వేచ్ఛ్హా కార్మికులుగా  శ్రమమార్కెట్లోకి నెట్టబడిన తరుణాలు పెట్టుబడిదారీ యుగాన్ని  ప్రారంభిస్తాయి. ఈమొత్తం ప్రక్రియకి ప్రాతిపదిక: వ్యవసాయ ఉత్పత్తిదారుడైన రైతు నించి భూ ఆస్థిని లాక్కొవడమే. అతనిది కాకుండా చెయ్యడమే.
ఈ ఆస్థి హరణం చరిత్ర వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా ఉంటుంది. ఈ ప్రక్రియ దశల వరస క్రమమూ, పట్టే కాలమూ కూడా భిన్న భిన్నంగా ఉంటాయి. ఒక్క ఇంగ్లండ్ లో మాత్రమే లాక్షణిక రూపంలో ఇది జరిగింది. ఆ దేశాన్నే మనం ఉదాహరణగా తీసుకుందాం.
వచ్చే పోస్ట్: ఇంగ్లండ్ లో రైతుల ఆస్థి హరణం ఎలా జరిగింది?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి