19, ఫిబ్రవరి 2019, మంగళవారం

పెట్టుబడిదారీ వ్యవసాయదారుని పుట్టుక


మార్క్స్ కాపిటల్     అధ్యాయం.29
పెట్టుబడిదారీ వ్యవసాయదారుని పుట్టుక
వేతన కార్మికులు ఎలా ఏర్పడ్డారో పరిశీలించాం:  బలవంతం మూలంగా  ఏర్పడ్డారు. కఠోర క్రమశిక్షణ వాళ్ళని వేతన శ్రామికులుగా మార్చింది. రాజ్యం తన సిగ్గులేకుండా చట్టలు తెచ్చీ, పోలీసు పద్ధతులు ప్రయోగించీ శ్రమ దోపిడీని హెచ్చించడం ద్వారా పెట్టుబడి సంచయనాన్ని వేగవంతం చేసింది.
ఇప్పుడిక ఒక ప్రశ్న మిగిలే ఉంది: అసలు మొదట్లో పెట్టుబడి దారులు ఎక్కడి నుండి పుట్టుకొచ్చారు?
వ్యవసాయ దారుల ఆస్తులు కొల్లగొ ట్టి వాళ్ళని గెంటివెయ్యడం  వల్ల  పెద్ద పెద్ద భూయజమానులు ఏర్పడ్డారు. అంతే. మరి పెట్టుబడి దారులు ఎలా ఏర్పడ్డారు?
 పెట్టుబడిదారీ రైతు నెమ్మదిగా పరిణామం చెందాడు. అందుకు కొన్ని  శతాబ్దాల కాలం పట్టింది.
ఇంగ్లండ్ లో పెట్టుబడిదారీ రైతు రూపొందిన క్రమం చూద్దాం:
మొదటి రూపం: బెయిలిఫ్. అతనూ ఒక అర్ధ బానిసే. రోమన్ విల్లికస్ ( పొలంపర్యవేక్షకుడు) లాంటి వాడు.
రెండో రూపం: రైతుకి భూ యజమాని విత్తనాలూ, పశువులూ,వ్యవసాయ పరికరాలూ ఇస్తాడు. ఇతని పరిస్థితికీ రైతు పరిస్థితికీ పెద్ద తేడా ఉండదు.కాకపోతే, ఇతను ఎక్కువ వేతన శ్రమని దోస్తాడు. అంతే. ఇటువంటి రైతు 14 శతాబ్దం రెండో సగంలో రూపొందాడు. బెయిలిఫ్ ని తొలిగించి స్థానం లో చేరాడు.
మూడో రూపం: తర్వాత కొద్దికాలానికే, మెటాయర్ (అర్ధ రైతు) అవుతాడు. పంట పంచుకునే వాడు అవుతాడు. భూ యజమానితోపాటు అవసరమైన విత్తనాల్నీ, పరికరాల్నీ తనభాగం తనూ  తెస్తాడు. ఒప్పందంలో అనుకున్న ప్రకారం, అతనితో పాటు పంటలో తనవంతు పంచుకుంటాడు.
 ఇంగ్లండ్ లో ఈ రూపం త్వరగా అదృశ్యం అయింది. ఆస్థానంలో పెట్టుబడిదారీ రైతు వచ్చాడు.
నాలుగో రూపం: అసలు సిసలు పెట్టుబడిదారుడు (capitalist proper). ఇతను సొంత పెట్టుబడితో వేతన శ్రామికుల్ని పెట్టి లాభం పొందుతాడు. అదనపు విలువనించి వస్తురూపంలోనో, డబ్బురూపంలోనో భూ యజమానికి కౌలు కడతాడు.
15 వ శతాబ్దంలో స్వతంత్ర రైతూ, తన సొంతం కోసమూ, వేతనం కోసమూ పనిచేసే వ్యవసాయ శ్రామికుడూ వాళ్ళ సొంత శ్రమతోనే ధనవంతులయినారు. అలా అయినంతకాలం, రైతు పరిస్థితులూ, అతని ఉత్పత్తి రంగమూ రెండూ ఒకేమాదిరి మధ్యస్థంగా ఉండేవి. 
వ్యవసాయ విప్లవమూ - దాని ప్రభావమూ
15 శతాబ్దం చివరి మూడో భాగంలో వ్యవసాయ విప్లవం ఆరంభం అయింది. దాదాపు 16 శతాబ్దం అంతా (చివరి దశబ్దం తప్ప) కొనసాగింది. ఆవిప్లవం పెట్టుబడిదారీ రైతుని వేగంగా సంపన్నుణ్ణి చేసింది. అంతే వేగంగా వ్యవసాయ ప్రజా సమూహాల్ని దరిద్రుల్ని చేసింది. అంటే, దాని ప్రభావం వల్ల శ్రామికులు ఎంతవేగంగా దరిద్రులయ్యారో, పెట్టుబడిదారీ రైతులు అంత వేగంగా ధనికులయ్యారు. 
పైకొస్తున్న పెట్టుబడిదారీ రైతుకి ఊపు నిచ్చిన అంశాలు:
1. ఉమ్మడి భూముల ఆక్రమణకు అసలు ఖర్చు లేకపోవడం
2. పశువుల మందని ఉచితంగా బాగా పెంచడానికి వీలు కలగడం
3. పశువులు భూమికి సమృద్ధిగా ఎరువుని సమకూర్చడం.
వీటికి 16 వ శతాబ్దంలో మరొక ముఖ్యమైన అంశం తోడయింది.
ఏమంటే, కౌలు కాలం ఒప్పందాలు 99 ఏళ్ళ దాకా ఉండేవి. ప్రియమైన లోహాల విలువ క్రమంగా తగ్గ్తూ వచ్చింది.అంటే డబ్బు విలువ తగ్గసాగింది. ఈ పరిస్థితి రైతులకి బంగారు పంట పండించింది.
పైన చర్చించిన అంశలతో పాటు, అది వేతనాల్ని తగ్గించింది. ఆతగ్గిన భాగం లాభాలకు కలిసింది.
ధాన్యం, ఊలు, మాంసం -ఒక్కముక్కలో , అన్ని వ్యవసాయ ఉత్పత్తుల ధరలూ పెరగటం రైతు ప్రమేయం ఏమీ లేకుండానే  అతను పెట్టిన డబ్బు పెట్టుబడిని అధికం చేసింది. అదేసమయంలో అతను ఇంకాకూడా పాతవిలువలోనే కౌలు డబ్బు కడతాడు. డబ్బు విలువ వాస్తవంగా తగ్గినప్పటికీ, అతను మొదట అనుకున్నంత డబ్బే ఇస్తాడు . ఇది అతని లాభాన్ని పెంచుతుంది.
ఆవిధంగా వాళ్ళు పెట్టుకునే కార్మికులూ, వాళ్ళు సాగుచేసుకునే పొలాల యజమానులూ నష్టపోతుండగా, వాళ్ళు మాత్రం లాభపడి,సంపన్నులైనారు. అందువల్ల అపటి పరిస్థితుల్లో, 16 వ శతాబ్దం చివరకి ఇంగ్లండ్ లో ధనిక పెట్టుబడిదారీ వ్యవసాయదారుల వర్గం ఒకటి రూపొందిందంటే ఆశ్చర్యపోనక్కర లేదు.
వచ్చే పోస్ట్: పరిశ్రమల మీద వ్యవసాయవిప్లవ ప్రభావం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి