26, జూన్ 2018, మంగళవారం

యంత్రాలు తొలిగించిన పనివాళ్ళ నష్ట పరిహారం గురించిన సిద్దాంతం


కాపిటల్   అధ్యాయం -15
యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా
విభాగం-6
యంత్రాలు తొలిగించిన పనివాళ్ళ నష్ట పరిహారం గురించిన సిద్దాంతం

యంత్రాలు పనివాళ్ళని తొలిగిస్తాయి- అనే వాస్తవాన్నిఎవ్వరూ కాదనలేరు. అయితే దీన్ని  ఒప్పుకుంటూనే బూర్జువా ఆర్ధిక వేత్తలు – జేమ్స్ మిల్, మాక్ కులోచ్, టోరెన్స్, సీనియర్, జాన్ స్టువర్ట్ మిల్ వంటి వారు - ఇలాచెబుతారు:
పనివాళ్ళని తొలిగించే యంత్రాలు తప్పనిసరిగా కొంత పెట్టుబడిని విడుదల చేస్తాయి. అలా విడుదలైన పెట్టుబడి తొలిగించబడి నంతమంది అదే తరహా పనివాళ్ళని నియమించడానికి సరిపోతుంది.
అంటే, ఒక యంత్రం 100 మందిని తొలిగించింది అనుకుందాం. అప్పుడు వాళ్ళ వేతనాలు ఎంతో అంత పెట్టుబడిని కూడా విడుదల చేస్తుంది. అది తిరిగి అలాంటి పనివాళ్ళని 100 మందిని పెట్టుకోడానికి సరిపోతుంది.  
 రికార్డో కూడా మొదట ఈ అభిప్రాయంతోనే ఉన్నాడు. అయితే తర్వాత శాస్త్రీయ నిష్పక్షపాతంతో , సత్యసంధతతో ఆ అభిప్రాయాన్ని వదులుకున్నాడు, ఖండించాడు. పై ఆర్ధికవేత్తల అభిప్రాయాన్ని మార్క్స్ తప్పని తేలుస్తాడు. ఎలాగో చూద్దాం.

ఒక తివాచీల ఫాక్టరీలో ఒక్కొక పనివాడికి 30 పౌన్లచొప్పున 100 మందిని నియంచడానికి పెట్టుబడిదారుడు 3000 పౌన్లు అస్థిరపెట్టుబడి  పెట్టాలి. వాళ్ళలో 50 మందిని తొలిగించి, మిగిలిన 50 మంది చేతా  1500 పౌన్లు ఖర్చయ్యే యంత్రాలతో పని చేయిస్తాడు అనుకుందాం. సులభంగా ఉండడం కోసం భవనాలూ బొగ్గూ వగయిరాల్ని పక్కన బెడదాం. ఏడాదిలో ఖర్చయ్యే ముడి పదార్ధం రెండు సందర్భాలలోనూ 3000 పౌన్లే అనుకుందాం.
ఈ మార్పువల్ల పెట్టుబడి ఏమైనా విడుదల అవుతుందా?
మార్పుకిముందు మొత్తం పెట్టుబడి 6000 పౌన్లు.అందులో స్థిర పెట్టుబడి 3000, అస్థిర పెట్టుబడి 3000. మార్పు తర్వాత స్థిర పెట్టుబడి 4500 (3000 ముడి పదార్ధం + 1500 యంత్రాలు);  అస్థిర పెట్టుబడి 1500. వెరసి 6000 పౌన్లు. మునుపు అస్థిర పెట్టుబడి మొత్తం పెట్టుబడిలో సగం. ఇప్పుడు నాలుగో వంతు. అంటే అప్పుడు అస్థిర భాగంగా ఉన్న మొత్తంలో కొంత భాగం (1500 పౌన్లు) స్థిర భాగానికి చేరింది. అది ఇక  శ్రమ శక్తి కొనుగోలుకి ఉపయోగపడదు. స్థిర పెట్టుబడిలో బందీ అయి ఉంటుంది. అస్థిర పెట్టుబడి స్థిర పెట్టుబడిలోకి మార్చబడింది.
అన్ని ఇతర పరిస్థితులూ మారకుండా అలాగే ఉంటే, 6000 పౌన్ల పెట్టుబడి ఇకముందు కూడా 50మందిని మించి నియమించజాలదు. యంత్రాల్లో మెరుగుదల వచ్చినప్పుడల్లా ఇంకా తక్కువమందిని నియమిస్తుంది. ఒక వేళ కొత్త యంత్రం ఖరీదు అది తొలిగించే శ్రమశక్తి ఖరీదు, పరికరాల ఖరీదు కంటే తక్కువ వుంటే, అంటే  1500 పౌన్లు కాకుండా 1000 పౌన్లే ఉంటే, 1000 పౌన్ల అస్థిర పెట్టుబడి స్థిరపెట్టుబడిగా మార్చబడి, బందీగా ఉండేది; 500 పౌన్లు విడుదలయి ఉండేది. వేతనాలు మారకుండా అలానే ఉంటే, ఆ 500 పౌన్లు తొలిగించబడ్డ 50 మందిలో 16 మందిని నియమించడానికి సరిపోతుంది. అయితే 16 మందినికూడా నియమించలేదు. కారణం: పెట్టుబడిగా వినియోగించడానికి ఈ 500 పౌన్లలో కొంత భాగం స్థిర పెట్టుబడిలోకి(ముడిసరుకులు, పరికరాలకోసం) మారాలి. మారగా, మిగిలినదానినే శ్రమ శక్తి కొనడానికి వినియోగించాలి.
కొత్త యంత్రాల తయారీకి ఎక్కువమంది మెకానిక్కులకి పనొస్తుంది. అయితే అది పనిపోయి వీధుల పాలైన తివాచీ పనివాళ్ళకి  నష్టపరిహారం అనవచ్చునా? వాటి నిర్మాణంలో అవి తొలిగించిన వాళ్ళ కంటే తక్కువమందే నియమితులవుతారు. తొలిగించబడ్డ శ్రామికుల వేతనం 1500 పౌన్లు. ఆ మొత్తం ఇప్పుడు యంత్రం రూపంలో ఈక్రింది అంశాలకి  ప్రాతినిధ్యం వహిస్తుంది:
1.      ఆ యంత్ర నిర్మాణంలో వినియోగించిన ఉత్పత్తి సాధనాల విలువ
2.      నిర్మించిన మెకానిక్కుల వేతనం
3.      యజమాని వాటాగా పోయే అదనపు విలువ.
పైగా ఆ యంత్రాలు అరిగిపోయే దాకా కొత్తవి పెట్టాల్సిన పనుండదు. కాబట్టి పెరిగిన మెకానిక్కుల్ని పనిలో ఉంచడం కోసం ఒక  కార్పెట్ మాన్యుఫాక్చరర్ తర్వాత మరొకరు పనివాళ్ళ స్థానంలో యంత్రాలను పెట్టవలసి ఉంటుంది.
పెట్టుబడిదారీ విధాన సమర్ధకులు (apologists) చెప్పేది ఇదికాదు. వాళ్ళ దృష్టిలో ఉన్నది విడుదలైన శ్రామికుల జీవితావసరాలు.
పై సందర్భంలో యంత్రాలు 50 మందిని విడుదల చేసి, వాళ్ళని నియమించుకునేందుకు ఇతరులకు అవకాశం ఇస్తాయి. అదే సమయంలో పనివాళ్ళ  వినిమయం (consumption) నుంచి 1500 పౌన్ల జీవితావసర సాధనాలని  ఉపసంహరించి, విడుదల చేస్తాయి. ఇది తెలిసిందే, కొత్తదేమీ కాదు. ఆర్ధిక పరిభాషలో దానర్ధం యంత్రాలు కార్మికుల జీవితావసరాలను విముక్తం చేస్తాయి అని. లేక జీవితావసరాలను కార్మికుణ్ణి నియమించే  పెట్టుబడిలోకి మారుస్తాయి అని.
ఈ సిద్ధాంతం అర్ధం ఏమంటే: 1500 పౌన్ల విలువచేసే జీవనాధార సాధనాలు తొలిగించబడ్డ 50 మంది శ్రమ చేత పెరుగుతూ వస్తున్న పెట్టుబడి. కనుక వాళ్లకి బలవంతపు సెలవు మొదలవగానే ఈ పెట్టుబడి వినియోగంలో ఉండదు. అదే 50 మంది శ్రమా ఉత్పాదకంగా ఎక్కడ వినియోగామవుతుందో, అక్కడ మళ్ళీ  కొత్తగా మదుపు పెట్టబడే దాకా విశ్రమించదు. అందువల్ల ఇప్పుడో, ఎప్పుడో ఆ పెట్టుబడీ కార్మికులూ మరల  కలిసి తీరాలి. అప్పటికి  నష్ట పరిహారం చెల్లింపు పూర్తి అవుతుంది. అందువల్ల యంత్రాలవల్ల తొలిగించ బడ్డ కార్మికుల బాధలు స్థిరంగా ఉండేవి కావు, తాత్కాలిక మైనవి. ఇదీ వాళ్ళ వాదన. . 
ఆ 1500 పౌన్లూ పని వాళ్లకి సరుకులు, పెట్టుబడి కాదు
తొలిగించబడ్డ పనివాళ్ళకి సంబంధించి – 1500 పౌన్ల విలువ చేసే జీవితావసర సాధనాలు ఎన్నడూ పెట్టుబడిగా లేవు. వాళ్ళు పెట్టుబడిగా ఎదుర్కున్నది దేన్నంటే, ఆ తర్వాత యంత్రాలమీద పెట్టిన 1500 పౌన్లని. మరీ జాగ్రత్తగా చూస్తే, ఈ మొత్తం (1500 పౌన్లు) తొలిగించ బడ్డ 50 మంది ఏడాదిలో ఉత్పత్తి చేసిన తివాచీల్లో ఒక భాగానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే, యజమాని నుంచి వాళ్ళ వేతనాల కింద వస్తురూపంలో కాక, డబ్బు రూపంలో అందిన భాగానికి ప్రతినిధి అన్నమాట. డబ్బు రూపంలో ఉన్న తివాచీలతో వాళ్ళు 1500 పౌన్ల విలువైన జీవితావసర వస్తువులు కొన్నారు. అందువల్ల ఆ 1500 పౌన్లూ వాళ్లకి సరుకులు, పెట్టుబడి కాదు. సరుకులకు సంబంధించి ఆ పనివాళ్ళు కొనుగోలు దారులు, వేతన శ్రామికులు కారు. యంత్రాలు వాళ్ళని కొనుగోలు సాధనం నుంచి విడుదల చేశాయి; ఈ పరిస్థితి వల్ల కొనుగోలుదారులుగా ఉన్నవాళ్ళు, కొనుగోలుదారులు కాకుండా పోయారు. ఆ కారణంగా సరుకులకు గిరాకీ తగ్గింది. ఈ తగ్గుదలని  మరొక చోట పెరుగుదల పూరించి తీరాలి. లేకుంటే, సరుకుల మార్కెట్ ధర పడిపోతుంది. ఇలాంటి స్థితి కొంతకాలం పాటు ఉంటే, ఇంకా కొనసాగితే, ఆసరుకుల ఉత్పత్తిలో ఉన్న శ్రామికులకు ఉద్వాసన మొదలవుతుంది. అంతకుముందు జీవితావసర వస్తువుల ఉత్పత్తిలో ఉన్న పెట్టుబడిలో కొంత భాగం మరొక రూపంలో పునరుత్పత్తి చెందవలసి వస్తుంది. ధరలు పడిపోతూ, పెట్టుబడి ఉన్న చోటు వదిలి వరోకచోటికి పోతూ ఉన్నప్పుడు, జీవితావసర వస్తువుల ఉత్పత్తిలో ఉన్న శ్రామికుల వంతు వస్తుంది; వాళ్ళ వేతనాల్లో కొంత భాగం నుంచి విడుదల అవుతారు. అందువల్ల, జీవితావసర సాధనాల నుంచి యంత్రాలు పనివాణ్ణి విడుదల చేసినప్పుడు, ఆ సాధనాలు అదేసమయంలో ముందుముందు అతన్ని నియమించే  పెట్టుబడిలోకి లోకి మారతాయి అని నిరూపించే బదులు, పెట్టుబడి దారీ విధాన వకాల్తాదారులు, తాము స్థిరపరుచుకున్న సరఫరా గిరాకీ సూత్రంతో (cut-and-dried law of supply and demand) ఏమి రుజువు చేస్తున్నారంటే: యంత్రాలు  అవి ప్రవేశించిన శాఖల్లోని పనివాళ్ళనే కాక, యంత్రాలు లేని శాఖల్లో పనిచేసేవాళ్ళని కూడా  బజార్లో పడేస్తాయి అని.
ఈ ఆర్ధిక వేత్తల  వాదం వాస్తవాల్ని తారుమారు చేసింది. అసలు వాస్తవాలు ఇవే:
·         యంత్రాల చేత తొలిగించబడ్డ పనివాళ్ళు శ్రమ మార్కెట్లో పడతారు. పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న శ్రామికులతో కలుస్తారు. వాళ్ళ  సంఖ్య పెంచుతారు.
·         యంత్రాల వల్ల వచ్చే ఫలితాన్ని శ్రామికులకు వచ్చే నష్టపరిహారంగా సూచించారు. అయితే అందుకు విరుద్ధంగా, అది అత్యంత భయంకరమైన శిక్ష.  అలాగని కాపిటల్ 7 వ భాగం (The Accumulation of Capital) లో తెలుస్తుంది.
·         తొలిగించ బడ్డవాళ్ళు వేరే శాఖల్లో ప్రయత్నించవచ్చు, సందేహం లేదు. పని దొరికి, వాళ్ళకీ, జీవితావసరవస్తువులకీ మళ్ళీ బంధం పడవచ్చు. అలా పడేది ఎప్పుడంటే: మదుపు పెట్టడానికి చూస్తున్న కొత్త పెట్టుబడి మధ్య వర్తిత్వం వల్లనే, కాని మునుపు వాళ్ళని పెట్టుకున్న, ఆతర్వాత యంత్రాల్లోకి మార్చబడ్డ పెట్టుబడి మధ్యవర్తిత్వం వల్ల కాదు.
·         ఒకవేళ వాళ్లకి పని దొరికినా వాళ్ళ పరిస్థితి ఎంతో దీనంగా, దయనీయంగా ఉంటుంది. శ్రమ విభజన వల్ల వికలులాయి ఉన్నారు. పాత వృత్తికి బయట వాళ్లకి విలువ ఉండదు. ఎంతగా నంటే, వాళ్లకి పరిశ్రమల్లోకి ప్రవేశం దొరకదు- ఏవో కొన్ని తక్కువ తరహా పరిశ్రమలలో తప్ప. ఈ తక్కువ రకం పరిశ్రమలలో తక్కువ కూలి ఉంటుంది. దానికి తోడు చేరే ప్రయత్నం చేసే వాళ్ళ సంఖ్య   అతిగా ఉంటుంది.
·         అదీ కాక ప్రతి పరిశ్రమ శాఖా ప్రతి ఏడాదీ కొత్త వాళ్ళని ఆకర్షిస్తుంది. ఆ కొత్త వాళ్ళ దళం నుంచి కాళీలు నింపుతుంటారు. విస్తరణకి కావలసిన వాళ్ళని తీసుకుంటుంటారు. ఒక పరిశ్రమ శాఖలో పనివాళ్ళలో కొందరిని యంత్రాలు  విడుదల చేసీ చెయ్యగానే, రిజర్వ్ లో ఉన్న వాళ్ళు కూడా పనులున్న కొత్త దారులు పడతారు. ఇతర శాఖల్లో కుదురుతారు; ఈలోగా, పాత బాధితులు అంటే ముందే తొలిగించబడ్డ వాళ్ళు ఈపరివర్తన దశలో పస్తులుంటారు, చనిపోతారు.

పనివాణ్ణి జీవితావసర వస్తువులనుండి విడుదలచేయడంలో యంత్రాల బాధ్యత లేదు. ఇది నిస్సందేహమైనది. అవి ఏ శాఖలో ప్రవేశిస్తే అక్కడి ఉత్పత్తి పెరుగుతుంది, చౌకబడుతుంది. మొదట మొదట వేరే శాఖల్లో ఉత్పత్తయ్యే జీవితావసర వస్తువుల మొత్తంలో తేడా ఉండదు. అయితే యంత్రాలు ప్రవేశించాక తొలిగించబడ్డ వాళ్ల జీవితావసరాలు అంతకు ముందు కంటే ఎక్కువ కాకున్నా, అంతే అయినా  సమాజంలో ఉంటాయి; వార్షికోత్పత్తిలో, కార్మికులు కానివాళ్ళు వృధా చేసే భాగం కాకనే ఉంటాయి.
పెట్టుబడిదారీ సమర్ధకులు ఆధార పడ్డది ఈ పాయింట్ మీదే.
యంత్రాల పెట్టుబడిదారీ వినియోగం నుండి విడదీయరాని వైరుధ్యాలూ, వైషమ్యాలూ ఉండవని వాళ్ళంటారు. ఎందుకంటే అవి స్వయంగా యంత్రాలవల్ల తలెత్తవు, పెట్టుబడిదారీ వినియోగం వల్ల మాత్రమే తలెత్తుతాయి. అందువల్ల యంత్రాలని యంత్రాలుగా ఒంటరిగా పరిగణిస్తే శ్ర్తమ గంటల్ని తగ్గిస్తాయి. అయితే పెట్టుబడి సేవలో ఉంటే, పని గంటల్ని పెంచుతాయి; అవి యంత్రాలుగా శ్రమని సులువు పరుస్తాయి, కానీ పెట్టుబడి సేవలో అవే యంత్రాలు  శ్రమని తీవ్రతరం చేస్తాయి; అవి యంత్రాలుగా ప్రకృతిశక్తులమీద మానవ విజయం, పెట్టుబడి చేతిలో అవే యంత్రాలు ప్రకృతి శక్తులకి మానవుణ్ణి బానిస చేస్తాయి; అవి యంత్రాలుగా ఉత్పత్తిదారుల సంపదని పెంచుతాయి, కానీ పెట్టుబడి సేవలో అవే యంత్రాలు  ఉత్పత్తిదారుల్ని దరిద్రులుగా చేస్తాయి. అందువల్లా, ఇతర కారణాల వల్లా బూర్జువా ఆర్ధిక వేత్త తొణుకూ బెణుకూ లేకుండా ఈ వైరుధ్యాలన్నీ వాస్తవం యొక్క బాహ్యరూపాలే కాని వాటికి వాస్తవంగా కానీ, సిద్ధాంత పరంగా కానీ మనుగడ లేదు అని వక్కాణిస్తాడు. అంతే కాకుండా, తన ప్రత్యర్ధి మూఢుడని చెబుతాడు. ఎంతటి మూఢుడంటే, యంత్రాల పెట్టుబడిదారీ వినియోగానికి వ్యతిరేకంగా  కాకుండా, అసలు యంత్రాల వినియోగానికే వ్యతిరేకంగా  వాదించేటంతటి మూఢుడని చెప్పకనే చెబుతాడు.

1.యంత్రాల పెట్టుబడిదారీ వినియోగం వల్ల తాత్కాలిక అసౌకర్యం కలుగుతుంది – అనే విషయాన్ని అతను తిరస్కరించడు.         అయితే అతని ప్రకారం యంత్ర వినియోగం పెట్టుబడి ద్వారా మాత్రమే సాధ్యం. అన్యధా  అసాధ్యం. అతని దృష్టిలో యంత్రాలు కార్మికుణ్ణి వినియోగించుకోవడమూ, కార్మికుడు యంత్రాలని వినియోగించడమూ రెండూ ఒకటే. కాబట్టి యంత్రాల పెట్టుబడిదారీ వినియోగంలోని వాస్తవ స్థితిని ఎవరైనా  బయట పెట్టారంటే, వాళ్ళు యంత్రాల వినియోగానికే వ్యతిరేకులంటూ ముద్ర వేస్తారు. సమాజాభివృద్ధికి శత్రువులంటూ నిందిస్తారు.

2. యంత్రాలు ప్రవేశించిన పరిశ్రమల్లో పనివాళ్ళు తొలిగించబడినప్పటికీ, అది ఇతర పరిశ్రమల్లో పనివాళ్ళ నియామకాన్ని పెంచవచ్చు. ఏమైనా ఈ ఫలితానికీ, నష్టపరిహార సిద్ధాంతం అనబడే దానికీ సంబంధం ఏమీ లేదు. ఒకేరకం  వస్తువుని, చేత్తో చెయ్యవచ్చు, యంత్రంతో చెయ్యవచ్చు. రెంటిలో యంత్రంతో చేసిన వస్తువు చౌక. దీన్నుంచి ఒక తిరుగులేని సూత్రాన్ని లాగగలం:
మునుపు చేతివృత్తిలోనో, కార్ఖానా లోనో తయారైన ఉత్పాదితాల మొత్తమూ, ఇప్పుడు యంత్రాలతో తయారైన ఉత్పాదితాల మొత్తమూ  సమాన మైతే, ఇప్పుడు ఖర్చయిన మొత్తం శ్రమ తగ్గినట్లు.
శ్రమ సాధనాల మీద, యంత్రాల మీద, బొగ్గు వగయిరాలమీద  వెచ్చించిన కొత్త శ్రమ ఆ యంత్రాలవాడకం వల్ల తొలిగించబడ్డ శ్రమ కంటే తప్పకుండా తక్కువగా ఉండాలి; అలా కాకపొతే ఆయంత్ర ఉత్పాదితానికి  చేత్తో చేసిన దానంత  విలువయినా కనీసంగా ఉండి తీరుతుంది. ఎక్కువ విలువైనా ఉండవచ్చు. వాస్తవానికి తక్కువమందితో యంత్రం తయారుచేసిన మొత్తం వస్తువుల  పరిమాణం , తొలిగించబడిన చేత్తోచేసిన మొత్తం వస్తువుల పరిమాణం ఎంతో అంతే ఉండదు,అంతకన్నా ఎంతో ఎక్కువ ఉంటుంది.
1 లక్ష గజాలు చేమగ్గాల మీద నేసిన నేతగాళ్ళకన్నా తక్కువమంది నేతగాళ్ళచేత మరమగ్గాలమీద 4 లక్షల గజాల బట్ట ఉత్పత్తయింది అనుకుందాం. నాలుగింతలయిన ఉత్పత్తిలో నాలుగింతల ముడి పదార్ధం ఉంటుంది. అందువల్ల ముడి పదార్ధం ఉత్పత్తి నాలుగు రెట్లు అవాలి. అయితే భవనాలు, యంత్రాలు, బొగ్గు వంటి శ్రమ సాధనాలకు సంబంధించి అలా ఉండదు.        ఒక పరిశ్రమలో యంత్రాల వాడకం పెరిగేకొద్దీ, ఉత్పత్తి సాధనాలు సమకూర్చే పరిశ్రమల్లో ఉత్పత్తి పెరగాల్సి వస్తుంది.
తద్వారా ఎంత మంది పనివాళ్ళు పెరుగుతారు అనేది పనిదినమూ, శ్రమ తీవ్రతా అలానే ఉంటే, పెట్టిన పెట్టుబడి యొక్క  అంగనిర్మాణాన్నిబట్టి ఉంటుంది – అంటే, అస్థిర పెట్టుబడితో స్థిర పెట్టుబడికి ఉన్న నిష్పత్తిని బట్టి ఉంటుంది. ఈ నిష్పత్తి తిరిగి  యంత్రాలు ఆయా శాఖల్ని ఏమేరకు పట్టుకున్నాయి, లేదా పట్టుకుంటున్నాయి అనే దాన్ని బట్టి  ఉంటుంది. ఇంగ్లీష్ ఫాక్టరీ వ్యవస్థ అభివృద్ధితో, బొగ్గు,లోహ గనుల్లో పనిచెయ్యాల్సిన గతిపట్టిన మనుషుల సంఖ్య ఎంతగానో పెరిగింది; అయితే ఇటీవల కొన్నేళ్లుగా ఆ పెరిగే వేగం కొంత తగ్గింది, ఎందువల్లంటే, గనిపనుల్ల్లో కొత్త యంత్రాలు రావడం వల్ల.  
యంత్రం నిర్మించే కొత్త పనివాడు

యంత్రంతో పాటు దాన్ని నిర్మించే పనివాడు కొత్తగా రంగం మీదికొస్తాడు. యంత్రాల ఉత్పత్తిని కూడా యంత్రం తన పట్టులోకి తెచ్చుకుంది. రోజురోజుకీ పెరిగి పోతున్నది. ఇంగ్లాండ్ వేల్స్ లో 1861 లో యంత్ర నిర్మాణ రంగలో 60,807 మంది పనిచేసేవాళ్ళు. ముడి పదార్ధానికి సంబంధించి వేగంగా పురోగమిస్తున్న నూలు పరిశ్రమ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పత్తి పంటకు ఊపు తెచ్చింది. దాంతో ఆఫ్రికా బానిస వ్యాపారం ఊపందుకుంది. సరిహద్దుల్లో ఉన్న బానిస దేశాలకు బానిసల పెంపకం ప్రధాన వ్యాపారమయింది. అమెరికాలో బానిసల లెక్క మొదటిసారి 1790 లో తీశారు. అప్పుడు 697,000 మంది ఉన్నారు. 1861 దాదాపు 40 లక్షల మందయ్యారు.  
మరోవైపు, ఇంగ్లండ్ లో ఉన్ని ఫాక్టరీలు పెరిగినందువల్ల, పంట పొలాలు క్రమంగా గొర్రెల మేపే పచ్చిక బయళ్ళుగా మారాయి. దాంతో వ్యవసాయ కార్మికుల అవసరానికి మించి ఉన్నారు. ఈ పరిస్థితి వాళ్ళని గుంపులు గుంపులుగా పట్టణాలకు తరిమివేసింది. ఐర్లాండ్ జనాభా పోయిన 20 ఏళ్లలో సగానికి పడిపోయింది. ఇప్పుడు (1867) కూడా తగ్గుతూనే ఉన్నారు. అక్కడి భూస్వాముల, ఇంగ్లిష్ ఉన్ని ఉత్పత్తిదారుల అవసరాలకు సరిగ్గా సరిపోయేటట్లు తగ్గుతున్నారు.
నేతగానికి నూలు కావాలి. అదే అతనికి శ్రమ పదార్ధం.ఆదారం ఒకే దశలో తయారవదు. పత్తి పండించే దశ, విత్తనాలు తీసే దశ, ఏకే దశ, వడికే దశ వంటి  కొన్ని దశలు గడిస్తేనే నేతగాడు నేసే శ్రమ  చెయ్యడానికి శ్రమ పదార్ధం తయారవుతుంది.
  
శ్రమ పదార్ధం (subject of labour) తయారయ్యే దశల్లో ఏ దశల్లో యంత్రాలు ప్రవేశిస్తే అ దశల్లో ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో పాటే ఆ పదార్ధాల్ని అందుకునే చేతివృత్తుల్లో, కార్ఖానాలలో  శ్రమకు గిరాకీ ఎక్కువవుతుంది. ఉదాహరణకు, యంత్రాలతో ఉత్పత్తయిన నూలు చౌక గానూ, సమృద్ధిగానూ చేమగ్గం వాళ్లకు సరఫరా అయింది. మొదట్లో అదనంగా డబ్బు వెచ్చించ కుండానే పూర్తికాలం పనిచెయ్యగలిగారు.  తదనుగుణంగా వాళ్ళ ఆదాయాలు కూడా పెరిగాయి. అందువల్ల నూలు బట్టల వృత్తి లోకి ప్రవహించారు. జెన్నీ వల్లా, త్రాజిల్ వల్లా, మ్యూల్ వల్లా  వచ్చిన 8 లక్షలమంది నేతగాళ్ళు మరమగ్గం దెబ్బకి మునిగిపోయారు.
అదే విధంగా యంత్రాలతో ఉత్పత్తయిన బట్ట సమృద్ధిగా లభించడం వల్ల దర్జీలూ, సూదితో కుట్టే స్త్రీలూ ఎక్కువమంది అవసరమయ్యారు. కనుక వాళ్ళ సంఖ్య కుట్టు యంత్రం వచ్చే దాకా పెరుగుతూనే  ఉంది.
యంత్రాలూ –శ్రమ విభజనా
యంత్రాలు ముడిపదార్ధాలనీ, మధ్యంతర ఉత్పాదితాల్నీ, శ్రమ సాధనాల్నీ అలాటి వాటిని పెంచుతాయి. వాటి ఉత్పత్తిలో అవి అదే నిష్పత్తిలో ఎన్నో శాఖలుగా విడిపోతాయి. సామాజిక ఉత్పత్తి వైవిధ్యం పెరుగుతుంది. సామాజిక శ్రమ విభజనని కార్ఖానా ఉత్పత్తి కన్నా, యంత్రోత్పత్తి ముందుకు తీసుకు పోతుంది.  ఎందుకంటే, ఫాక్టరీ వ్యవస్థ తన పట్టులో పెట్టుకున్నపరిశ్రమల్లో ఉత్పాదకతని చాలా ఎక్కువ స్థాయిలో పెంచుతుంది. 
యంత్రాలూ- విలాస వస్తువుల ఉత్పత్తీ
యంత్రాల వల్ల కలిగే తక్షణ ఫలితం : అదనపు విలువ పెరగడం, అదనపువిలువని నింపుకున్న ఉత్పాదితాల మొత్తం పెరగడం. అంటే పెట్టుబడిదారుల ఆదాయం అధికమవుతుంది. పెట్టుబడిదారులూ, వాళ్ళ మీద ఆధారపడ్డవాళ్ళూ వాడే వస్తువులు ఎక్కువగా దొరికే కొద్దీ, సమాజంలో ఈ అలాంటి వాళ్ళ తరగతి పెరుగుతుంది; దానికి తోడు, జీవితావసర వస్తువుల ఉత్పత్తి చెయ్యడానికి అవసరమయ్యే పనివాళ్ళ సంఖ్య సాపేక్షంగా తగ్గుతూ ఉంటుంది; అందువల్ల సంపద పెరిగిన వాళ్ళకి  విలాసాల కోసం కొత్తకొత్త కోర్కెలు పుట్టుకొస్తుంటాయి. ఆ కోర్కెల్ని తీర్చే సాధనాలను కూడా ఉత్పన్నం చేస్తాయి. ఆధునిక పరిశ్రమ కొత్తగా ప్రపంచ మార్కెట్లతో ఏర్పరచిన సంబంధాలు కూడా వీటికి వైవిధ్యం తెస్తాయి. అందువల్ల, విలాస వస్తువుల సంఖ్యా, వాటి  ఉత్పతీ  పెరుగుతాయి.
రవాణా పరిశ్రమల్లో శ్రామికులకి గిరాకీ
దేశీయ విలాస వస్తువులకు మరిన్ని విదేశీ వస్తువులు వస్తాయి. అంతే కాక, పెద్ద మొత్తాల్లో విదేశీ ముడిసరుకులూ , మిశ్రమ భాగాలూ (ingredients) మధ్యంతర ఉత్పాదితాలూ (intermediate products), దేశీయ పరిశ్రమల్లో ఉత్పత్తి సాధనాలుగా వాడ బడతాయి. అవి దేశ దేశాలకూ చేరాలి. కనుక రవాణా పరిశ్రమ శాఖోపశాఖలుగా చీలిపోతుంది. ఆయా శాఖల్లో  శ్రామికులకి గిరాకీ పెరుగుతుంది.
ఉత్పత్తి సాధనాల పెరుగుదలా, జీవితావసరసాధనాల పెరుగుదలా, వీటికి తోడు శ్రామికులసంఖ్య సాపేక్ష తగ్గుదలా కాలవలు, దొరువులూ సొరంగాలూ తవ్వడానికీ, వంతెనల నిర్మాణం వంటి వాటిలో  పనివాళ్ళ గిరాకీ పెంచుతాయి. అయితే ఇవి ఎప్పుడో భవిష్యత్తులో ఫలితాన్ని ఇస్తాయి.
యంత్రాల ప్రత్యక్ష ఫలితంగా గానీ, యంత్రాల వల్ల ఏర్పడే సాధారణ పారిశ్రామిక మార్పుల వల్ల గానీ, పూర్తిగా కొత్త ఉత్పత్తి శాఖలు ఏర్పడి, నూతన శ్రమ రంగాల్ని ఏర్పరచవచ్చు. అయితే  ఈ శాఖల స్థానం అత్యంత అభివృద్ధి సాధించిన దేశాల్లో సైతం ఏమాత్రమూ ముఖ్యమైంది కాదు. వాటిలో పనిదోరికే వాళ్ళ సంఖ్య, ఆపరిశ్రమలు మొరటు శారీరక శ్రమకు  కల్పించే గిరాకీని బట్టి (ప్రత్యక్ష అనులోమానుపాతంలో) ఉంటుంది. 1861 ఇంగ్లండ్, వేల్స్ జనాభా లెక్కల ప్రకారం ఇటువంటి 5 ముఖ్యమైన పరిశ్రమల్లో ఉన్న మొత్తం పనివాళ్ళు 94,145 మంది మాత్రమే.
పూర్వపు గృహ బానిసలు మళ్ళీ
ఆధునిక పరిశ్రమల్లో ఉత్పాదకత అసాధారణ స్థాయిలో ఉండడం వల్లా, అన్ని శాఖల్లో శ్రమ దోపిడీ విస్తృతీ, తీవ్రతా అధికం అవడం వల్లా – కార్మిక వర్గంలో అంతకంతకూ ఎక్కువ భాగాన్ని అనుత్పాదక పనుల్లో పెట్టడానికి వీలు కుదిరింది. ఆ కారణంగా నౌకరుల తరగతి పేరుతో పూర్వపు గృహబానిసలు పుట్టుకొస్తున్నారు. వాళ్ళలో పురుష సేవకులు, మహిళా సేవకులు, యజమానుల వెంబడి ఉండే బంట్లూ ఉంటారు.   
అంటే, అనుత్పాదక శ్రామికులు పెరుగుతారు. పూర్వపు గృహ బానిసలు మళ్ళీ పుట్టుకొస్తారు..
1861 ఇంగ్లండ్, వేల్స్ జనాభా లెక్కల ప్రకారం వస్త్ర ఫాక్టరీలలోనూ, గనుల్లోనూ పనిచేస్తున్న వాళ్ళు మొత్తం - 1,208,442
వస్త్ర ఫాక్టరీలలోనూ, లోహ పరిశ్రమల్లోనూ పనిచేస్తున్న వాళ్ళు మొత్తం - 1,039,605.
సేవకులు -1,208,648
రెండు సందర్భాలలోనూ వీళ్ళ సంఖ్య గృహబానిసల సంఖ్యా కన్నా తక్కువే. ఆహా! పెట్టుబడిదారీ విధానంలో యంత్రాల వినియోగం ఎంత అద్భుతమైనదో గదా!
వచ్చే పోస్ట్: ఫాక్టరీ వ్యవస్థ చేత పనివాళ్ళ గెంటివేతా- ఆకర్షణా
                  నూలు బట్టల పరిశ్రమలో సంక్షోభం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి