17, జూన్ 2018, ఆదివారం

ఫాక్టరీ (కర్మాగారం)


కాపిటల్   అధ్యాయం -15
యంత్రాలూ ఆధునిక పరిశ్రమా
విభాగం -4

ఫాక్టరీ  (కర్మాగారం)
ఫాక్టరీలో యంత్రవ్యవస్థ ఉంటుంది. అది స్త్రీల శ్రమనీ, పిల్లల శ్రమనీ స్వాయత్తం చేసుకుంటుంది. తద్వారా దోపిడీ చెయ్యడానికి కావలసిన కార్మికుల సంఖ్యని పెంచుతుంది. శ్రామికుడికి ఉండే విడి సమయాన్ని,అంటే సొంత పనులకు వాడుకునే కాలాన్ని కూడా లాక్కుంటుంది – పనిదినాన్ని పొడిగించడం ద్వారా. యంత్రాల మెరుగుదల శ్రమశక్తిని అంతకంతకూ ఎక్కువ దోచుకునేందుకు సాధనంగా పనిచేస్తుంది. తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి చేయించే సాధనం అవుతుంది- శ్రమని తీవ్రతరం చేస్తుంది.
ఇప్పటికే ఈ విషయాలు తెలుసుకున్నాం.
ఇక ఇప్పుడు మొత్తంగా ఫ్యాక్టరీని చూద్దాం.
కార్మికుల మధ్య అసమానతలు
యంత్రాలు లేకుండానే నడిచే కార్ఖానా ఉత్పత్తి పనివాడి వ్యక్తిగత  సామర్ధ్యం మీదా, పనిముట్టుని వాడే అతని నేర్పు మీదా ఆధారపడి వుంటుంది. అందువల్ల కార్మికుల మధ్య అసమానతలు వుంటాయి. ఆ అసమానతల కారణంగా కార్మికుల్లో అంతస్తుల పధ్ధతి  (heirarchy) ఏర్పడుతుంది.
శ్రామికుని చేతిలోని పనిముట్టు యంత్రం లోకి చేరింది. ఇక ముడి సరుకుని యంత్రమే మలుస్తుంది. కనుక అతను అంతదాకా చేసిని పని ఇక అతనిది కాదు. అతను చేయాల్సిందల్లా, కేవలం యంత్రం చేసే పనిని పర్యవేక్షించడం మాత్రమే. అంతకుముందు చేసిన పని
శ్రామికుడు పని చేసినంత కాలం మాత్రమే  పనిముట్టు పనిచేస్తుంది. అతను పని ఆపితే పనిముట్టు పనిచెయ్యదు. అతని నేర్పుకీ, శ్రమ తీవ్రతకీ అనుగుణంగా పనిచేస్తుంది. అంటే పనిముట్టు శ్రామికుని శక్తితో ముడిబడి వుంది. యంత్రానికి పని వాని సామ్ర్ధ్యంతోగానీ, నేర్పుతో గానీ పనివుండదు. కనుక ఒక పనివాడి బదులు మరొకరిని పెట్టి నడపడానికి వీలుంది. అది చాలా తేలిక కూడా.
మునుపు పనిముట్టు శ్రామికుని చేతిలో ఉండేది. దాన్ని వాడడం అతనికి చేతకావాలి. అంటే కొంత నైపుణ్యం కావాలి. అయితే  ఇప్పుడు పనిముట్టు అతని చేతిలో నించి యంత్రంలో చేరింది.  పనిముట్టు తో పాటే దాన్ని వాడే శ్రామికుని  నైపుణ్యం కూడా యంత్రానిదయింది. కార్ఖానా ఉత్పత్తిలో సాంకేతిక పునాది అయిన శ్రమ విభజన తుడిచి పెట్టుకు పోయింది. కార్ఖానా ఉత్పత్తికి లక్షణం నిపుణ కార్మికుల దొంతర. ఇప్పుడు ఆ పునాదే పోయింది. ఇక ఇప్పటి ఆటోమాటిక్ ఫాక్టరీలో  అటువంటి నిపుణ కార్మికుల దొంతర అవసరం ఉండదు. కనుక అదీ పోతుంది. దాని స్థానంలో, ఆటోమాటిక్ ఫాక్టరీలో, యంత్రాలను చూసే వాళ్ళు  చేసే ప్రతి పనినీ ఒకే ఒక స్థాయికి తెచ్చే పోకడ ఉంటుంది. అంటే రకరకాల పనులు ఉండవు. భిన్నమైన నిపుణ పనులు ఉండవు. ప్రత్యేక పనివాళ్ళ (detail workmen) లో కృత్రిమంగా ఏర్పడ్డ తేడాలు పోతాయి. వాటి స్థానంలో వయో భేదాలూ, స్త్రీ పురుష భేదాలూ ఉంటాయి. 
ఫాక్టరీలో శ్రమ విభజన
ప్రత్యేక యంత్రాలదగ్గర, ఫాక్టరీలో వివిధ శాఖల మధ్య పనివాళ్ళ పంపిణీ గా కనబడుతుంది. ప్రతి శాఖలోనూ ఒకేచోట ఉండే ఒకేరకమైన పలు యంత్రాల దగ్గర పనిచేస్తారు. బృందాలుగా సంఘటితమై ఉండరు. కనుక వాళ్ళ సహకారం సామాన్యసహకారమే.
కార్ఖానా ఉత్పత్తిలో ఉండే బృందం ఫాక్టరీలో ఉండదు. దాని స్థానంలో మేస్త్రీ అతని కింద సహాయకులూ ఉంటారు. వ్వరిమధ్య సంబంధం ఉంటుంది. ముఖ్యమైన విభజన:
1.      యంత్రాల దగ్గర పనిచేసే వారు. వీళ్ళలో ఇంజన్ ని చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు.
2.      పనివాళ్ళకి సహాయకులు. వీళ్ళంతా పిల్లలు. కొందరు యంత్రాలకి పని జరగాల్సిన పదార్ధాలని అందిస్తుంటారు.
3.      అన్ని యంత్రాల్నీ  చూసుకుంటూ, ఎప్పటి కప్పుడు అవసరమైనప్పుడల్లా వాటిని రిపేర్ చేసే ఇంజనీర్లూ, మేకానిక్కులూ,జాయనర్లూ. వీళ్ళు కొద్దిమందే ఉంటారు. అయితే వీళ్ళు పై స్థాయి పనివాళ్ళు. కొందరు శాస్త్ర విద్య చదివిన వాళ్ళు. మిగతా వాళ్ళు ఏదో ఒక శాఖలో ప్రవీణులయినవాళ్ళు. వీళ్ళు ఫాక్టరీ పనివాళ్ళకి భిన్నమైన వాళ్ళు.వాళ్లతో కలపబడిన వాళ్ళు మాత్రమే.
ఈ శ్రమ విభజన కేవలం సాంకేతిక మైనది మాత్రమే.   
యంత్రం దగ్గర పనిచెయ్యాలంటే, శ్రామికుడు యంత్రం యొక్క నిరంతరాయమైన, ఆటోమాటిక్  కదలికలకు తగినట్లుగా తన కదలికల్ని మలుచుకోవాలి. అందుకతను చిన్నప్పటి నుంచే అలవాటు పడాల్సిఉంటుంది. తర్ఫీదు పొందాల్సి ఉంటుంది.
కార్ఖానా ఉత్పత్తిలో ఒక కార్మికుడు ఒక నిర్దిష్ట చర్య కి కట్టుబడతాడు. ఫాక్టరీలో అలా కాదు. కార్ఖానా ఉత్పత్తిలో యంత్రాలు ఆ అవసరాన్ని తోలిగిస్తాయి. కనుక కార్మికుడు జీవితాంతమూ ఒకే చర్య చేస్తాడు. కదలిక యావత్తూ యంత్రాల నుంచి మొదలవుతుంది, కాని కార్మికుని నుండి కాదు. అందువల్ల పని ఆగకుండానే, ఎప్పుడు బడితే అప్పుడు మనుషుల్ని ఒకచోటనుంచి మరొకచోటికి  మార్చవచ్చు.
యంత్రాల దగ్గర పని యువకులు త్వరగా నేర్చుకుంటారు. కనుక వాటితో పనిచెయ్యడానికి ప్రత్యేకశిక్షణ పొందిన శ్రామికులు  అవసరం లేదు. ఒక ప్రత్యేక వ్యక్తే , ఒక యంత్రం వద్ద పనిచెయ్యాలి అనేదేమీ ఉండదు.  కాబట్టి పనివాళ్ళని ఒక యంత్రం దగ్గరనుండి, మరొక యంత్రం దగ్గరకి మార్చవచ్చు. ఇక సహాయకుల పని విషయానికొస్తే, అది చాలా సులువైనది. ఆపనిని కొంతవరకూ యంత్రాల తోనే చేయించవచ్చు. విసుగు పుట్టించే మొద్దుపని చేసే వాళ్ళని ఎప్పటికప్పుడు మార్చవచ్చు.  
సాంకేతిక దృష్టితో చూస్తే, పాత శ్రమ విభజనని యంత్రాలు తోలిగించినట్లే. అయితే అది ఫాక్టరీని చుట్టుకునే వుంది.కార్ఖానాఉత్పత్తి నుంచి  సాంప్రదాయక అలవాటుగా అందింది. ఆతర్వాత అది శ్రమ శక్తిని  దోపిడీ చెయ్యడానికి పెట్టుబడికి పెద్దసాధనంగా తీర్చి దిద్దింది. ఇంతకు ముందు జీవితాంతమూ ఒకే ప్రత్యేక పనిముట్టుతో పనిచేసే నైపుణ్యం, ఇప్పుడు ఒకే యంత్రం దగ్గర జీవితాంతం పనిచేసే  నైపుణ్యం అవుతుంది.
శిక్షణ కయ్యే ఖర్చులు తగ్గుతాయి.
ఆవిధంగా అతని పునరుత్పత్తి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. దానికి తోడు, పనివాడు విధిలేక ఫాక్టరీ మీదా, పెట్టుబడిదారుడి మీదా ఆధారపడడం పూర్తవుతుంది. అన్ని చోట్లలాగే, ఇక్కడకూడా మనం ఉత్పత్తి యొక్క సామాజిక ప్రక్రియ అభివృద్ధి వల్ల పెరిగే ఉత్పాదకతకీ, ఆప్రక్రియని పెట్టుబడిదారీ దోపిడీ వల్ల  పెరిగే ఉత్పాదకతకీ తేడా గమనించాలి.
1.      చేతి వృత్తుల్లోనూ, కార్ఖానా ఉత్పత్తిలోనూ పనివాడు పనిముట్టుని వాడతాడు. ఫాక్టరీలో యంత్రమే పనివాణ్ణి వాడుతుంది.
2.      మొదటి దాంట్లో శ్రమ సాధనం(పనిముట్టు) కదలిక పనివాడి నుండి మొదలవుతాయి. రెండో దాంట్లో పనివాడు శ్రమ సాధనం (యంత్రం)యొక్క కదలికలను అనుసరించి పోవాలి.
3.      కార్ఖానా ఉత్పత్తిలో పనివాళ్ళు సజీవ యంత్రాంగంలో భాగాలు. ఫాక్టరీలో ఉండేది నిర్జీవ యంత్రాంగం, దానికి శ్రామికుడు సజీవ ఉపకరణం(living appendage) అవుతాడు.
సిసిఫస్ శ్రమ లాంటిది
పనివాడు చేసేది  పొద్దాకులూ ఒకేరకం పని. చేసిచేసి విసుగొస్తుంది. అంతులేని రొడ్డకొట్టుడు పని సిసిఫస్ శ్రమ లాంటిది.(సిసిఫస్ ఒక రాజు. మరణాన్ని మోసం చేసి శాపానికి  గురవుతాడు. ఒక పెద్ద బండని కొండపైకి నెట్టుకు పోవాలి. అయితే శిఖరం చేర్చాక ఆ బండ తిరిగి కిందికి దొర్లుతుంది. మరల పైదాకా తోసినా కింద పడుతూనే ఉంటుంది) అది ఎన్నటికీ ముగిసే పని కాదు. అలాగే ఈ పనిభారం కూడా, అలిసి పోయిన పనివాడి మీద పదేపదే తెరిపివ్వకుండా పడుతూనే ఉంటుంది.
ఇక్కడ మొలినారీ అనే ఫ్రెంచ్ స్వేచ్ఛావాణిజ్య వాది అభిప్రాయం ఫుట్ నోట్ గా ఉంది:
యంత్ర గమనాన్ని 15 గంటలపాటు గమనించే పనివాడు, ఆ 15 గంటలూ శరీర శ్రమ చేస్తే ఎంతగా అలసిపోతాడో అంతకన్నా ఎక్కువగా ఆలసిపోతాడు. ఈ నిఘా శ్రమ ఎక్కువసేపు ఉండకపోతే, అది మనస్సుకి ఎక్సరసైజ్ గా ఉపయోగకరమైంది కావచ్చు. అయితే అదే నిఘాశ్రమ మితిమించి చేస్తే, దీర్ఘకాలంలో మనస్సునీ, శరీరాన్నీ ధ్వంసం చేస్తుంది.

ఫాక్టరీ పని అలుపోచ్చేట్టు చేస్తుంది.
నాడీ వ్యవస్థకి అత్యధికమైన అలసట కలిగిస్తుంది.
కండరాల కదలికల్ని పరిమితం చేస్తుంది.
శారీరక చర్యలోనూ, బౌద్ధిక చర్యలోనూ స్వేచ్చని అణువణువూ హరించివేస్తుంది.
పని సులువు గావడంకూడా ఒక తరహా చిత్రహింస అవుతుంది. ఎందుకంటే యంత్రం కార్మికుడికి శ్రమ నుంచి స్వేచ్చ ప్రసాదించదు. సరికదా, అతనికి పనిపట్ల ఉన్న ఉత్సాహాన్నీ, ఆసక్తినీ హరించి వేస్తుంది. 
పెట్టుబడిదారీ ఉత్పత్తి శ్రమ ప్రక్రియ మాత్రమే కాదు, అదనపు విలువని ఉత్పత్తిచేసే ప్రక్రియ కూడా. అందువల్ల అన్ని పెట్టుబడిదారీ ఉత్పత్తులకీ ఒక ఉమ్మడి లక్షణం ఉంటుంది :
శ్రమ సాధనాలని వినియోగించేది శ్రామికుడు కాడు. శ్రమ సాధనాలే శ్రామికుణ్ణి వినియోగిస్తాయి. ఈ తలక్రిందులు పధ్ధతి సాంకేతికంగానూ, ప్రస్పుటంగానూ మొదటగా వాస్తవంయ్యేది ఫాక్టరీ వ్యవస్థ లోనే. దానికదే నడిచే యంత్రంగా(automaton) మారడం ద్వారా, శ్రమ ప్రక్రియలో శ్రమ సాధనం కార్మికుణ్ణి పెట్టుబడిగా - అంటే మృత శ్రమ రూపంలో- ఎదుర్కుంటుంది. మృతశ్రమ సజీవ  శ్రమ మీద పెత్తనం చెలాయిస్తుంది,  సజీవ  శ్రమని పూర్తిగా, ఏమాత్రం మిగల్చకుండా పీల్చివేస్తుంది. ఉత్పత్తికి సంబంధించిన బౌద్ధిక శక్తులు , శారీరక శ్రమ నుండి  వేరవడమూ, ఆ బౌద్ధిక శక్తులు శ్రమమీద పెట్టుబడి ఆధిపత్యశక్తి గా మారడమూ అనేది   యంత్రాల పునాదిమీద లేచిన ఆధునిక పరిశ్రమలో సంపూర్ణ మవుతుంది. విజ్ఞాన శాస్త్రం ముందు, భారీ స్థాయి భౌతిక శక్తుల ముందు, ఫాక్టరీ యంత్రాంగం రూపంలో ఉన్న శ్రమ రాశి ముందు, ప్రతి ఒక్క పనివాని ప్రత్యేక నైపుణ్యమూ వెలవెల బోతుంది, అత్యల్ప అంశంగా అదృశ్య మవుతుంది.లెక్కకు రాదు. ఆ శక్తులన్నీ, ఫాక్టరీ యంత్రాంగంతో కలిసి యజమాని శక్తి అవుతాయి.
యజమాని మనస్సులో యంత్రాలూ, తన గుత్తాధి పత్యమూ ఏకమై ఉంటాయి. తన పనివాళ్ళతో పేచీ పడ్డప్పుడు తుస్కారంగా  ఇలా వాదిస్తాడు:
వాళ్ళు చేసే పని తక్కువ రకం నిపుణ శ్రమ; అంతకన్నా సులువుగా నేర్చుకో గలిగిన పని మరొకటి లేదు; ఆ రకం శ్రమల్లో అంతకన్నా ఎక్కువ సంపాదించ గలిగిన శ్రమ లేదు; అతి తక్కువ స్థాయి ప్రవీణుడి దగ్గర కొద్దిపాటి శిక్షణతో కొద్దికాలో, పుష్కలంగా నేర్చుకునే శ్రమ మరొకటి లేదు. పనివాడి శ్రమ కన్నా, మామూలు పనివాడు ఆరునెలల్లో నేర్చుకునే అతని నైపుణ్యం కన్నా, యజమాని యంత్రాలే ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయి. – అనే విషయాల్ని ఫాక్టరీ పనివాళ్ళు జాగ్రత్తగా గుర్తు పెట్టుకుకోవాలి – అంటాడు. తన యంత్రాన్ని కోల్పోయే ప్రమాదం వచ్చినప్పుడు మరోపాట పాడతాదు. ఆవిషయం మనకు ముందుముందు తెలుస్తుంది.
క్రమశిక్షణ
పనివాడు యంత్రం కదలికలకి లోబడి పనిచెయ్యాల్సి నందువల్లా, శ్రామికులలో అన్ని వయసుల స్త్రీ పురుషులు ఉండడం వల్లా సైనిక బారక్ లో ఉండే క్రమశిక్షణ వంటిది తలెత్తుతుంది. మునుపటి తనిఖీ శ్రమ ఫాక్టరీలో పరిపూర్ణ వ్యవస్థగా వృద్ధి చెందుతుంది. పనివాళ్ళని పని చేసే వాళ్ళుగానూ,వాళ్ళు చేసేపనిని తనిఖీ చేసేవాళ్ళు గానూ వేరుచేస్తుంది. శ్రామిక సైన్యాన్ని ప్రైవేటు సైనికులుగానూ, సార్జంట్లు గానూ విభజిస్తుంది. ఆటోమాటిక్ ఫాక్టరీలో శ్రామికులని పనిపట్ల లక్ష్యం లేని అలవాట్లను వదులుకునేట్లు చెయ్యడమూ, స్వయం చాలక యంత్రాల క్రమబద్ధతతో వాళ్ళు మమేకమై  ఉండేట్లు శిక్షణ ఇవ్వడంలోనే ఉన్న ఇబ్బంది అంతా.

ఫాక్టరీలో అవసరాలకు  సరిపడే క్రమశిక్షణ నిబంధనావళి రూపొందించడం, అమలు చెయ్యడం అత్యంత కష్టమైన, దాదాపు అసాధ్యమైన పని (Herculean enterprise). అయినా ఆర్క్ రైట్ ఆపని చెయ్యగలిగాడు. క్రమశిక్షణ నెలకొల్పబడింది. బానిస మేస్త్రీ కొరడా స్థానంలోకి తనిఖీదారుని దండనల పుస్తకం వచ్చింది. శిక్షలన్నీ జరిమానాలు గానో, జీతంలో కోతలు గానో ఉంటాయి.  వీటిని అమలుచేసేవాడు (Lycurgus) యజమానికి లాభదాయకంగా ఉండేట్లు చూస్తాడు. నియమాల్నిపాటించడం వల్ల కంటే  ఉల్లఘించడంవల్ల ఎక్కువ లాభం చేకూరేట్లు చూస్తాడు.
ఫాక్టరీ వ్యవస్థలో కార్మిక వర్గ బానిసత్వం
ఇక్కడ ఎంగెల్స్ రాసిన ‘ ఇంగ్లండులో కార్మిక వర్గ పరిస్థితులు’ నుండి ఫుట్ నోట్ ఉంది:
బూర్జువా వర్గం కార్మిక వర్గాన్ని బానిసత్వంలో ఉంచడం ఫాక్టరీ వ్యవస్థలో కొట్టొచ్చినట్లు కానొస్తుంది. అంత స్పష్టంగా ఇతరత్రా,మరెక్కడా కానరాదు. అక్కడ స్వేచ్చ పూర్తిగా అంతరిస్తుంది- చట్టరీత్యానూ, వాస్తవంగానూ. పనివాడు పొద్దున్నే అయిదున్నర అయ్యేసరికి ఫాక్టరీలో ఉండాలి. కొన్ని నిముషాలు లేటయితే శిక్ష ఉంటుంది. 10 నిమిషాలు లేటయిందా, నాస్తా అయ్యేదాకా లోపలికి ప్రవేశం ఉండదు. రోజు కూలిలో నాలుగో వంతు పోతుంది. తిండీ, నిద్రా అన్నీ చెప్పినప్పుడే, ఉత్తర్వుల మేరకే. ఫాక్టరీ గంట నిరంకుసమైనది. నిద్రపోతున్న వాణ్ణి లేపుతుంది, నాస్తా చేస్తున్నా, అన్నం తింటున్నా పిలుస్తుంది.
ఇక మిల్లులో అతని పరిస్థితి ఎలా ఉంటుంది?
ఫాక్టరీలో యజమాని తన ఇష్టానుసారం నిబంధనలు పెడతాడు. ఉన్న వాటిని ఇచ్చవచ్చినట్లు మారుస్తాడు. ఎంతటి ఆర్ధంలేని వాటిని చేర్చినా కోర్టులు అనుకూలంగా ఉంటాయి. ఇలా చెబుతాయి: నీ అంతట నీవే స్వచ్చందంగా ఒడంబడిక చేసుకున్నావు. దాన్ని అమలు చేసి తీరవలసిందే.ఇక శ్రామికుడు 9 వ ఏట నించీ చనిపోయేదాకా,  ఈ మానసిక శారీరక హింసని భరిస్తూ బతకాల్సిందే.
రెండు కోర్టు తీర్పుల్ని ఉటంకిస్తాడు:
1.      1866 చివర్లో  షఫీల్డ్ లో జరిగింది. రెండేళ్ళు పనికి ఒప్పుకున్న ఒక శ్రామికుడు యజమానితో తగవు వచ్చి పని మానుకున్నాడు. అతని దగ్గర ఎత్తి పరిస్థితుల్లోనూ ఇక పనిచెయ్యనని చెప్పాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించాడని రెండు నెలల జైలుశిక్ష పడింది.

ఒకవేళ యజమాని ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, అతనిమీద సివిల్ కేసు పెట్టవచ్చు. అంతవరకే. అతనికి నష్ట పరిహారం తాలూకూ డబ్బు పడుతుంది. ఏ ఇతర ఇబ్బందీ కలగదు. మన కార్మికుడు రెండు నెలలూ జైల్లో ఉంది బయటకొచ్చాక, అతన్ని పనిలోకి రమ్మని యజమాని కోరితే రావాలి. రానంటే యజమాని మళ్ళీ కేసేస్తాడు. కార్మికుడు ఒప్పందం తప్పినందుకు శిక్ష అనుభావించాను గదా అంటాడు. అన్నా కోర్టు మళ్ళీ శిక్ష వేస్తుంది. జడ్జీలలో ఒకరైన ‘షీ’ (Mr. Shee) ఒకేతప్పుకి బతికున్నంతకాలం మళ్ళీ మళ్ళీశిక్షించడం   ‘న్యాయశాస్త్ర వైపరీత్యం’ అని బహిరంగంగా ఖండించాడు. అయినా శిక్ష తప్పలేదు. ఆ తీర్పిచ్చింది లండన్ అత్యున్నత న్యాయస్థానాల్లో ఒకటి. (నాలుగో జర్మన్ కూర్పులో ఈవాక్యాలు ఎంగెల్స్ చేర్చాడు. ఇప్పుడు ఒప్పంద ఉల్లంఘనకి యజమానిమీద పెట్టినట్లే కార్మికుని మీద కూడా సివిల్ కేసే వెయ్యాలి.)
2.       1863 చివర్లో విల్ట్ షైర్ లో జరిగింది. హారప్ అనే బట్టల ఉత్పత్తిదారుడు నేతగాళ్ళు లేటయ్యారని జీతంలో కోత పెట్టేవాడు. రెండు నిమిషాలు లేటయితే 6 పెన్నీలు, 3నిమిషాలకు 1 షిల్లింగు, 10 నిమిషాలకు ఒక షిల్లింగు 6 పెన్నీలు. ఈలెక్కన గంట ఆలస్యానికి 9 షిల్లింగులు.రోజుకి 4 పౌన్ల 10 షిల్లింగులు. వాళ్ళ వేతనాలు వారానికి 10-12 షిల్లింగులని ఎన్నడూ దాటలేదు. పని మొదలు కావాల్సి నప్పుడు విజిల్ ఊదేందుకు ఒక పిల్లవాన్ని పెట్టాడు. తరచుగా పొద్దున్నే ఆరింటికి ముందే ఊదుతుండేవాడు. విజిల్ ఆగేలోపు అందరూ రావాలి. ఇక తలుపులు మూసేస్తారు. బయట ఉన్నవాళ్ళకు జుల్మానా విధిస్తారు. కర్మాగారం ఆవరణలో గడియారం లేదు. కనక అంతా  హారప్ మాట ప్రకారం పోయే ఆ పిల్లవాడి దయ.సమ్మెకు దిగిన వాళ్ళు గడియారం పెట్టి, జుల్మానాలు హేతుబద్ధం చేస్తే పనుల్లోకి వస్తామని చెప్పారు. హారప్ 19మంది స్త్రీలనీ, బాలికల్నీ ఒప్పందాన్ని ఉల్లంఘించారని కోర్టుకి లాగాడు. కోర్టు ఒక్కొక్కరికి 6 పెన్నీల   జుల్మానా వేసింది. దానికి తోడు 2 షిల్లింగుల  6 పెన్నీలు ఖర్చులకింద చెల్లించాలని తీర్పు చెప్పింది. కోపంతో జనం కోర్టు నించీ హారప్ వెంటబడి ఛీ కొట్టారు.
ఉత్పత్తి చేసిన వసతులలో లోపాలున్నాయంటూ యజమానులు వేతనాల్లో కోత పెట్టే వాళ్ళు. ఈ అలవాటు ఇంగ్లండ్ కుండల తయారీ జిల్లాల్లో 1866 లో సార్వత్రిక సమ్మె కు దారితీసింది. Childrens’ Employment Commission నివేదికల్లో (1863-1866) పనిచేసిన వాడికి  వేతనం రాకపోవడం అటుంచి, అపరాధ నిబంధల వల్ల అతనే యజమానికిబాకీ పడ్డ సందర్భాలు కనబడతాయి.
బేకర్ అనే ఫాక్టరీ ఇన్స్పెక్టర్ చెప్పిన విషయం – ఒక పత్తి మిల్లు యజమాని తానూ నియమించిన పిల్లలకి డాక్టర్ సర్టిఫికేట్ కంటూ తలా 10 పెన్నీలు పట్టుకున్నాడు. అయితే అతను సర్టిఫికేట్ కోసం ఇచ్చింది 6 పెన్నీలే. పైగా చట్టం అనుమతించింది 3 పెన్నీలే. సాంప్రదాయం అయితే ఏమీ తీసుకోక పోవడం. ఆయజమాని మీద ఫాక్టరీ ఇన్స్పెక్టర్ కేసు పెట్టాడు.
వడకడం  నేర్చుకోడానికీ, అందులో మెళకువలు తెలుసుకొడానికీ అంటూ మరొక యజమాని ఆ పేద బాలుర నించి తలా ఒక షిల్లింగు పని చేయించుకున్నట్లు తెలిసింది అన్నాడు బెకర్.


ప్రమాదాలూ-మరణాలూ
క్రిక్కిరిసి ఉండే యంత్రాల మధ్య పనిలో అవయవాలకూ ప్ర్రాణాలకూ ప్రమాదం పొంచి ఉంటుంది. గాయపడిన వాళ్ళ, మరణించిన వాళ్ళ జాబితాలు విడుదలవుతుంటాయి.
ఫాక్టరీ చట్టాలు యంత్రాల ప్రమాదాలనించి కల్పించిన రక్షణ మంచి ప్రభావమే చూపింది.  అయితే 20 ఏళ్లుగా లేని కొత్త ప్రమాదా వకాశాలు ఇప్పుడొచ్చాయి. వాటిలో ముఖ్యమైనది యంత్రాల అధిక వేగం. చక్రాలూ, రోలర్లూ, కదుర్లూ,  కండెలూ అంతకంతకూ మరింత హెచ్చిన వేగంతో నడుస్తున్నాయి. కనుక తెగిన దారాన్ని తీసుకోవడానికి వేళ్ళు మరింత వేగంగానూ, నేర్పుతోనూ కదలాలి. ఏమాత్రం తటపటాయించినా, శ్రద్ధ తగ్గినా తెగిపోతాయి. పని తొందరగా చెయ్యాలనే ఆతృత వల్ల చాలా ప్రమాదాలు సంభవించాయి. యంత్రాలు ఆగకుండా నడవడం, దారాలూ,సరుకులూ  ఉత్పత్తి అవడం యజమానులకు ముఖ్యం. ఒక్క నిమిషం ఆగితే, ఇంధనం వృధా అవుతుంది, అంతేకాదు ఉత్పత్తి తగ్గుతుంది. జరిగిన పని పరిమాణం మీదనే దృష్టి సారించే పర్యవేక్షకులు పనివాళ్ళని, యంత్రాలని ఆడించమని  తొందర పెడతారు. యంత్రాలు ఆగకుండా ఆడుతుండడం పనివాళ్ళకు  కూడా అంటే ముఖ్యం ఎందుకంటే, కొంతమందికి సరుకుల బరువుని బట్టో, ఉరువుల సంఖ్యను బట్టో వేతన చెల్లింపు జరుగుతుంది. కనుక ఇరువురికీ-యజమానికీ, పనివాళ్ళకీ- యంత్రాలు ఆగకుండా ఆడడం ముఖ్యం.
దీని ఫలితం. అనేక ఫాక్టరీల్లో కడులుతున్నపుడు యంత్రాలని శుభ్రం చెయ్యడం నిషేధించబడింది. అయినా, అవి కదులుతున్నప్పుడే వ్యర్దాల్ని తీసెయ్యడం, చక్రాల్నీ రోలర్లనీ తుడవడం అలవాటుగా సాగుతుంది. ఈకారణంగా ఈ 6 నెలల్లో 906 ప్రమాదాలు జరిగాయి. ఈ పనికి చెల్లింపు ఉండదు.అందుకని పనివాళ్ళు వీలైనంత తొందరగా చెయ్య బోతుంటారు.- (1866 అక్టోబర్ 31 ఫాక్టరీ ఇన్స్పెక్టర్ల నివేదిక)
ఫాక్టరీ వ్యవస్థ ఉత్పత్తి సాధనాల పొదుపు నిర్బంధంగా పెంపొందేట్లు చేస్తుంది. శ్రామికుడు తన పనిలో తానుండగా, పెట్టుబడి చేతుల్లో పనివాడి జీవితానికి అవసరమైన దాన్నల్లా- గాలినీ, వెలుతురునీ, ప్రమాదాలుజరగాకుండా రక్షణనీ - పధ్ధతి ప్రకారం హరిస్తుంది. ఇక పనివాడికి సౌకర్యం కలిగించే సాధనాల హరణం గురించి వేరే చెప్పే పనే లేదు.
హార్నర్ ప్రశ్న: ఇద్దరిలో ఎవరిని పెట్టుకుంటావు?
యంత్ర ప్రమాదాలనుంచి పనివాళ్ళ రక్షణ కోసం ఫాక్టరీ చట్టంలో చేర్చిన క్లాజులకి వ్యతిరేకంగా ఇంగ్లిష్ మాన్యు ఫాక్చరర్లు ప్రచారోద్యమం పెట్టారు. మిల్లు ఓనర్లు పనివాళ్ళకి జరిగే ప్రమాదాలంటే క్షమార్హం కాని విధంగా, చులకనగా మాట్లాడతారని విన్నట్లు హార్నర్ అధికార నివేదికలో రాశాడు. ఉదాహరణకి వేలు తెగిపోతే అదేదో అల్పమైనది అనడం తనకు తెలుసు అన్నాడు. పనివాని జీవనమూ, అతని భవిష్యత్తూ అతని వేళ్ళమీద ఎంతగానో ఆధారపడి ఉంటాయి. హార్నర్ ఎవరైనా యజమాని అలా అన్నప్పుడు ఒక ప్రశ్న వేసే వాడట: మీకొక పనివాడు అవసరం అనుకోండి. ఇద్దరు వచ్చారు. అన్నిట్లో సమానులే,కాని ఒకడికి బొటనవేలో, చూపుడు వేలో లేదు, పోయింది. ఇద్దరిలో ఎవరిని పెట్టుకుంటావు?
ఈ ప్రశ్నకి జవాబిచ్చేందుకు ఏమాత్రం సందేహించేవాళ్ళు కాదు. వేలు లేనివాణ్ణి వాళ్ళెందుకు పెట్టుకుంటారు?
కర్మాగారాలు క్రౌర్యం తగ్గిన బానిస కారాగారాలు అని ఫోరియర్ అనడంలో తప్పేమీ లేదు గదా!
వచ్చే పోస్ట్: కార్మికునికీ యంత్రానికీ మధ్య ఘర్షణ




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి