23, జూన్ 2018, శనివారం

కార్మికునికీ యంత్రానికీ మధ్య ఘర్షణ


కాపిటల్   అధ్యాయం -15
యంత్రాలూ ఆధునిక పరిశ్రమా
విభాగం-5
కార్మికునికీ యంత్రానికీ మధ్య ఘర్షణ
పెట్టుబడి పుట్టిన నాడే పెట్టుబడి దారుడికీ వేతన శ్రామికుడికీ ఘర్షణ ఏర్పడింది. కార్ఖానా ఉత్పత్తి దశ మొత్తంలో - ఆరంభం నుంచీ అంతం దాకా-ఈ ఘర్షణ కొనసాగింది. నతానియేల్ ఫోర్ స్టర్ అన్నట్లు యజమానులూ వాళ్ళ పనివాళ్ళూ ఎడతెగని యుద్ధంలో ఉన్నారు. యజమానుల లక్ష్యం వాళ్ళ పని వీలైనంత చౌకగా చేయించుకోవడం; అందుకోసం వాళ్ళు ఏ ఎత్తుగడకైనా వెనకాడరు. పనివాళ్ళు తమ కోర్కెల్ని తీర్చమని యజమానుల్ని ఒత్తిడి చేస్తుంటారు. అదే ఘర్షణకి కారణం. ఇరు వర్గాల ప్రయోజనాలు పరస్పర విరుద్ధమైనవి. ఏవర్గానికావర్గం తన ప్రయోజనాలు సాధించుకునే ప్రయత్నం చేస్తుంది. అదే వర్గపోరాటం. 
శ్రమ సాధనాల మీద పోరాటం
యంత్రాలు పెట్టినప్పటినుంచీ మాత్రమే, శ్రమ సాధనాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. 17 వ శతాబ్దం మొత్తంలో, యూరప్ అంతటా రిబ్బన్ మగ్గం మీద తిరుగుబాట్లు జరిగాయి. ఇది రిబ్బన్లనీ, లేసులనీ చేసే యంత్రం. దీన్ని జర్మనీలో కనిపెట్టారు.  
అది ఒకేసారి 4-6 శాల్తీలు చేస్తుంది. అయితే ఈ యంత్రం కార్మికుల పని పోగొట్టి, వాళ్ళని వీధుల్లోకి తోస్తుందని  వెనిస్ నగర మేయర్ భయపడ్డాడు. దాన్ని కనిపెట్టిన వాణ్ణి గొంతు నులిమో, నీళ్ళలో ముంచో రహస్యంగా చంపించాడు. లేడెన్ లో 1629 దాకా దీన్ని వాడలేదు; రిబ్బన్ నేతగాళ్ళు కొట్లాడినందు వల్ల, టౌన్ కౌన్సిల్ దాన్ని నిషేధించాల్సొచ్చింది. కోలోన్ లో 1676 చివర్లో నిషేధించారు. అదే సమయంలో ఇంగ్లండ్ లో ప్రవేశిస్తుండగా, అక్కడ అల్లర్లు చెలరేగాయి. 1685 లో రాజశాసనం జర్మనీ అంతటా దాని వాడకాన్ని నిషేధించింది. హాంబర్గ్ లో సెనేట్ ఆజ్ఞ మేరకు యంత్రాన్ని బహిరంగంగా భస్మం చేశారు. 6 వ చార్లెస్ చక్రవర్తి 1719 లో  1685 శాసనం అమలు కాలాన్ని పొడిగించాడు. శాక్సనీ ఎలెక్టరేట్ లో 1765 దాకా దాన్ని బాహాటంగా వాడడానికి అనుమతి లేదు. ఈ యంత్రం యూరప్ ని పునాదులదాకా ఒక కుదుపు కుదిపింది. వాస్తవానికి ఈ   యంత్రం కదురు యంత్రానికీ, మర మగ్గానికీ, ముందుది. 18 వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవానికి కూడా. ఏమీ అనుభవంలేని పిలగాడు సైతం ఆమగ్గాన్ని- దానిలో ఉండే కండెలతో - సహా ఆడించ గలడు. ఒక కడ్డీని వెనక్కీ ముందుకీ అడిస్తుంటే చాలు. మెరుగుపడిన అదే యంత్రం ఒకేసారి 40-50 శాల్తీల్ని ఉత్పత్తి చేస్తుంది.

రంపకోత యంత్రం
1630 ప్రాంతంలో డచ్ దేశస్తుడు లండన్ లో గాలి వల్ల కదిలే  రంపకోత యంత్రాన్ని  తయారుచేశాడు. అయితే అది ప్రజల ఆగ్రహానికి బలై  పోయింది. 18 వ శతాబ్దం మొదట్లో సైతం జలచోదక కోత యంత్రాల్ని ప్రజలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. పార్లమెంటు సపోర్టు ఉన్నప్పటికీ ఆ యంత్రాలు అతికష్టం మీద మాత్రమే, వ్యతిరేకతను తట్టుకొని రాగలిగాయి.
గొర్రె బొచ్చు కత్తిరించే యంత్రం
1758 లో ఎవరెట్
అనే వ్యక్తి జల శక్తితో నడిచే గొర్రె బొచ్చు కత్తిరించే యంత్రాన్ని తయారుచేశాడు. అంతే,ఒక లక్షమంది పడి దాన్ని దగ్ధం చేశారు. ఎందుకంటే, దానిమూలంగా వాళ్లకి పని లేకుండా పోయింది.
ఉన్ని చిక్కుదీసే యంత్రం
ఆర్క్ రైట్ చిక్కు తీసే యంత్రాలని కనిపెట్టాడు. అప్పటికి ఆపని మీద బతుకుతున్న 50 వేలమంది ఆ యంత్రానికి వ్యతిరేకంగా పార్లమెంటుకి పిటిషన్ పెట్టారు.

19 వ శతాబ్దం తొలి 15 సంవత్సరాల్లో,మరమగ్గం వాడకాన్ని వ్యతిరేకిస్తూ లడ్డైట్ ఉద్యమకారులు యంత్రాల్ని భారీ స్థాయిలో ధ్వంసం చేశారు. ఈ చర్య జకోబిన్ వ్యతిరేక ప్రభుత్వాలకు అత్యంత అభివృద్ధి నిరోధక చర్యలు తీసుకోడానికి, దమన కాండ చేపట్టడానికీ సాకుగా ఉపయోగపడింది.
యంత్రాలకూ, వాటిని పెట్టుబడి వినియోగించడానికీ ఉన్న తేడా ఏమిటో అప్పటికి వాళ్ళు  గ్రహించ లేదు. ఆతేడా తెలుసుకొని, కార్మికులు తమ దాడుల్ని ఉత్పత్తి సాధనాల మీద కాకుండా, వాటిని వినియోగించే విధానం మీద ఎక్కుబెట్టే సరికి కొంత సమయం పట్టింది. కొంత అనుభవం అవసరం అయింది.
యంత్రాలకూ శ్రామికులకీ పోటీ
కార్ఖానా ఉత్పత్తి కాలంలో వేతనపోరాటాలు కార్ఖానా ఉత్పత్తికి వ్యతిరేకంగా ఎక్కుపెట్ట బడినవి కావు. కాని కొత్త కార్ఖానా పెట్టడానికి వ్యతిరేకత  వచ్చేదే. అయితే అది కార్మికుల వైపునించి కాదు, వృత్తి సంఘాల వైపు నించి వచ్చేది.
అందువల్ల ఆనాటి రచయితలు శ్రమ విభజనని పనివాళ్ళ కొరత తగ్గించేదిగా చూశారు. అంతేకాని పనిలో ఉన్న వాళ్ళని తొలిగించేదిగా చూడలేదు.
శ్రమ సాధనం యంత్రం రూపం పొందగానే, శ్రామికునికి పోటీదారు అవుతుంది. రికార్డో మాటల్లో: యంత్రాలూ శ్రామికులూ ఎడతెగని పోటీలో (constant competition) ఉన్నారు.

అప్పటినుండీ పెట్టుబడి స్వయం విస్తరణ, యంత్రాల మూలంగా బతుకుతెరువు పోయిన  శ్రామికుల సంఖ్యకు అనులోమాను పాతంలో ఉంటుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థ ఈ వాస్తవం మీద ఆధారపడి ఉంటుంది: పనివాడు తన శ్రమ శక్తిని ఒక సరుకుగా అమ్ముతాడు అనేదే ఆ వాస్తవం. ఒక ప్రత్యేక పనిముట్టుని వాడే నేర్పుగా చేసి శ్రమ విభజన ఆ శ్రమ శక్తిని ప్రత్యేకపరుస్తుంది. ఎప్పుడైతే, పనిముట్టుని వాడడం యంత్రం పని/వంతు అవుతుందో, అప్పుడే శ్రామికుని శ్రమ శక్తి శక్తి ఉపయోగపు విలువతో పాటు మారకం విలువ కూడా అంతర్ధానం అవుతుంది; పనివాడు అమ్ముడుపోడు- చట్టం తీసేసిన నాణెం ఎలా చలామణీ అవడో అలాగే.
పెట్టుబడి స్వయం విస్తరణకు వారితో అక్కర లేదు. అలా యంత్రాలవల్ల అక్కర లేకుండా పోయిన శ్రామికులు పాత చేతి వృత్తుల ఉత్పత్తికీ, యంత్రాల ఉత్పత్తికీ మధ్య అసమ పోటీలో దెబ్బతింటారు. లేదా, సులభంగా అందుబాటులో ఉండే పరిశ్రమ శాఖల్లోకి వరదకడతారు. శ్రమ మార్కెట్ ని ముంచెత్తుతారు. మూగు తారు.ఫలితం: శ్రమ శక్తి ధర, దాని విలువకన్నా తగ్గిపోతుంది.
కార్మికులకి ఉరట కలిగించేందుకు పెట్టుబడిదారీ విధాన సమర్ధకులు రెండు విషయాలు చెబుతారు:
1.కార్మికుల బాధలు తాత్కాలికమే
2. ఒక ఉత్పత్తి రంగాన్ని యంత్రాలు ఆక్రమించేసరికి చాలా సమయం పడుతుంది. అందువల్ల యంత్రాల వల్ల కలిగే వినాశనం యొక్క విస్తృతీ, తీవ్రతా తగ్గే విధంగా యంత్రాలు క్రమేపీ ప్రవేశ పెట్టబడతాయి.
రెంటినీ పరిశీలిస్తే, మొదటిది రెండో దాన్ని తటస్థపరుస్తుంది - అని మనకు అర్ధమౌతుంది. యంత్రాలు ఒక పరిశ్రమని దశలవారీగా పట్టుకున్నప్పుడు, వాటితో పోటీ పడే పనివాళ్ళకి నిరంతరమైన, దీర్ఘకాలిక కష్టనష్టాల్ని కలిగిస్తాయి.

ఇంగ్లాండ్ లో చేమగ్గం పనివాళ్ళ దుస్థితి
యంత్రాలు రావడం వేగంగా  జరిగితే, దాని దుష్ప్రభావం ఉగ్రంగా ఉంటుంది. ఎక్కువమంది ప్రజలమీద ప్రభావం పడి, బాధలు పడతారు. ఇందుకు రుజువుగా  ఇంగ్లండ్ లో చేమగ్గం పనివాళ్ళు నెమ్మదిగా అంతరించిన వైనాన్ని ఉదాహహరిస్తాడు. ఇంతకన్నా భయంకరమైన విషాదం  చరిత్రలో మరొకటి లేదు. ఇది పూర్తిగావడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. చివరకి 1838లో ముగిసింది. చాలామంది ఆకలితో చనిపోయారు. చాలా కుటుంబాలు రోజుకి 2 ½ పెన్నీలతో దీర్ఘకాలం బతుకులీడ్చారు.ఇంగ్లండ్ పత్తి యంత్రాలు  ఇండియా మీద తీవ్ర ప్రభావం చూపాయి.గవర్నర్ జనరల్ నివేదిక 1834-35 లో ఇలావుంది: వాణిజ్య చరిత్రలో దీనంతటి దీనస్థితి ఇంకొకటి లేదు. నూలు బట్టల నేతగాళ్ళ ఎముకలతో ఇండియా మైదానాలు తెల్లబారు/తెలుపెక్కుతున్నాయి. ఈ ఐహిక ప్రపంచం నుంచి పంపివేయడంలో, యంత్రాలు వాళ్లకి తాత్కాలిక అసౌకర్యాన్ని కలిగించాయి, అంతే.  
ఇక మిగిలిన వాళ్ళ సంగతి. యంత్రాలు కొత్త ఉత్పత్తి రంగాలను పట్టుకుంటాయి.కనుక తాత్కాలికమన్న అసౌకర్యం వాళ్లకి  శాశ్వతం అవుతుంది. కాబట్టి, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం కార్మికునికి వ్యతిరేకంగా శ్రమ సాధనాలకీ, ఉత్పాదితానికీ ఇచ్చే స్వతంత్రంగానూ , విడిగానూ ఉండే స్వభావం యంత్రాల వల్ల పూర్తి శతృత్వంగా వృద్దిచెందింది. ఇక్కడ రికార్డో నుండి కోట్ ఉంది:  
ఒక దేశ ఆదాయం అంటే రికార్డో దృష్టిలో భూస్వాముల, పెట్టుబడిదారుల ఆదాయం, అదే దేశ సంపద. ఆ ఆదాయం పెరగడానికి ఏదైతే కారణమో, అదే అంశం జనాభాన్ని అవసరానికి మించినదిగా (redundant) చేస్తుంది. శ్రామికుల పరిస్థితిని దిగజారుస్తుంది.
ఇక్కడే యంత్రాల్ని నిరంతరం మెరుగుపరచడంలో లక్ష్యం ఏమిటో  ఆండ్రూ ఉరే మాటలు ఉటంకిస్తాడు:
పూర్తిగా మనిషి శ్రమని రద్దు చెయ్యడం. లేదా మగ పెద్దవాళ్ళ స్థానంలో స్త్రీలనీ, పిల్లల్నీ నియమించో, నిపుణ శ్రామికుల స్థానంలో అనిపుణుల్ని  నియమించో శ్రమ ధరని తగ్గించడం.
అందువల్ల శ్రామికుడు మొదట శ్రమ సాధనాలమీద తిరగబడ్డది యంత్రాలరాకతోనే.
శ్రమ సాధనం శ్రామికుణ్ణి కొత్త యంత్రాలు అప్పటికే ఉన్న చేతివృత్తులతో గానీ, కార్ఖానా ఉత్పత్తితో గానీ పోటీ కి దిగినప్పుడు ఈ ఘర్షణ బలంగా బయట పడుతుంది. అక్కడి పనివాళ్ళు యంత్రాలని వ్యతిరేకిస్తారు. ఆధునిక పరిశ్రమలో సైతం యంత్రాలలో నిరంతర మెరుగుదలా, ఆటోమాటిక్ వ్యవస్థలో అభివృద్ధీ ఇంచుమించు అటువంటి ప్రభావాన్నే చూపుతుంది. 
మెరుగైన యంత్రాల లక్ష్యం శారీరక శ్రమని తగ్గించడం, మనిషి సహాయానికి బదులు  ఇనుం సహాయంతో పని పూర్తి చెయ్యడం.
ఇంతకుముందు చేత్తో తిప్పిన వాటికి (వేరే) శక్తిని వాడడం మామూలయింది. యంత్రాలలో వచ్చే  చిన్న చిన్న మార్పుల లక్ష్యం:

  •  చోదక శక్తి పొదుపు 
  • మెరుగైన పని·        
  • అంతే సమయంలో ఎక్కువ ఉత్పత్తి       
  •   పెద్దవాళ్ళ బదులు పిల్లలయినా చెయ్యగలగడం

ఆటోమాటిక్ విధానంలో నిపుణ శ్రమ క్రమేపీ లేకుండా పోతుంది. పెద్దల బదులు పిల్లల్నీ, నిపుణుల బదులు మామూలు వాళ్ళనీ పెట్టవచ్చు. యంత్రాల వల్ల ఇటుకల ఫాక్తరీల్లో నిపుణ శ్రామికులతో అసలు అవసరం లేకుండా పోయిందని ఉరే రాసాడు. ఇంజన్ భాగాలు మునుపటికన్నామెరుగైన పరికరాలతో , తక్కువ నిపుణ శ్రమతో తయారవుతున్నాయి. ఇది వేతన రేట్లను తగ్గిస్తుంది.

యంత్రాల అభివృద్ధీ – కార్మికుల తొలగింపూ
1860తర్వాత 3ఏళ్లలో యంత్రాలు ఉరుకులమీద అభివృద్ధి అయ్యాయి. దానికి అనుగుణంగా కార్మికులు తొలగింప బడ్డారు.ఉదాహరణలు:

  1.          ఒక మాంచెస్టర్ మాన్యుఫాక్చరర్- మునుపు  చిక్కుదీసే యంత్రాలు 75 ఉండేవి.ఇప్పుడు 12 ఉన్నాయి. వాటితో అంత పనీ చేస్తున్నాం. పనివాళ్ళు 14 మంది తక్కువ.వారానికి 10 పౌన్లు వేతనాలు మిగులుతున్నాయి. దూది వృధా కావడం 10 శాతం తగ్గింది.
  2.          ఒక స్పిన్నింగ్ మిల్ లో స్పీడు పెంచడం ద్వారానూ, కొన్ని స్వయం చాలక ప్రక్రియల్ని ప్రవేసపెట్టడం ద్వారానూ ఒక విభాగంలో నాలుగో వంతు మందిని తొలిగించారు. ఇంకో విభాగంలో సగం మందిని బయటకు పంపించారు.
  3.          రెండోసారి నూలు చిక్కుదీసే యంత్రాన్నోకదాన్ని తెచ్చి, పనివాళ్ళని చాలామందిని తగ్గించారు.
  4.          మరొక మిల్లులో యంత్రాల వల్ల మూడోవంతు పనివాళ్ళకు పని పోయింది. యజమానులకి మూడోవంతు ఖర్చు తగ్గింది.
అంతా ఇదే కాదు, ఇంకా వుంది.
మా దారం వాడే తయారీ దారులు ఎక్కువ గుడ్డ తయారు చేసేవారు.. పాత యంత్రాలతో తీసిన దారంతో నేసిన బట్టకన్నా చౌకగా గిట్టేది.

ఇక్కడ యంత్రాలలో మెరుగుదలలు మొత్తం ఫలితాన్ని తెలిపే పట్టిక ఉంది. ఆఫలితం ఇది.

1861 – 1868 కాలంలో 338 దూది ఫాక్టరీలు పోయాయి. వేరే మాటల్లో చెబితే, ఆ యంత్రాలను  మించి ఉత్పత్తిచేసే యంత్రాలు కొద్ది మంది పెట్టుబడిదారుల చేతుల్లో చేరాయి. మరమగ్గాలు 20,663 తగ్గిపోయాయి. అదే కాలంలో ఉత్పత్తి పెరిగింది. కనుక పాత యంత్రాలకంటే కొత్త యంత్రాలు ఎక్కువ ఫలితాన్నిచ్చాయి. కండెలు 1,612,541 పెరిగాయి. అయితే పనివాళ్ళు 50,505 మంది
తగ్గారు. దూది సంక్షోభం వల్ల  కార్మికులకు కలిగిన తాత్కాలిక కష్ట నష్టాలు అధికమయ్యాయి. యంత్రాల మెరుగుదల వల్ల  తాత్కాలిక కష్ట నష్టాలు శాశ్వతం అయ్యాయి.

యంత్రం శ్రామికునికి  పోటీ దారు
శ్రామికుని మీద యంత్రం పైచేయి సాధించి, నిరంతరం అతడి అవసరం లేకుండా చేస్తూ ఉంటుంది. ఆవిధంగా యంత్రం అతనికి పోటీ దారు అవుతుంది. అంతేకాదు, శ్రామికుడికి హాని చేసే శక్తి కూడా.  అలాగని  పెట్టుబడి బహిరంగంగా ప్రకటిస్తుంది. దాన్ని ఉపయోగించుకుంటుంది కూడా. పెట్టుబడి నిరంకుశత్వాన్ని ఎదిరిస్తూ కార్మిక వర్గం చేసే తిరుగుబాట్లను అణచివేసేందుకు యంత్రం శక్తివంతమైన ఆయుధం.
గాస్కెల్ ప్రకారం ఆవిరి ఇంజన్ మొదట్నించీ మానవ శక్తికి శత్రువే. కొత్తగా ఏర్పడ్డ  ఫాక్టరీ వ్యవస్థకు సంక్షోభాన్ని తెచ్చిపెట్టే,  పెరుగుతున్న కార్మికుల కోర్కెల్ని అణగ తొక్కడానికి పెట్టుబడిదారుడికి వీలు కలిగించచిన శత్రువు. కార్మికుల తిరుబాట్లకు వ్యతిరేకంగా పెట్టుబడికి 1830 నుండీ  కొత్తకొత్త యంత్రాలను కనిపెట్టారు. ఆ ఆవిష్కరణల గురించి చరిత్ర రాయవచ్చు. అలాంటి వాటిలో స్వయంచాలక కదురు (self-acting mule) ప్రధాన మయింది. ఎందుకంటే, ఆటోమాటిక్ వ్యవస్థలో కొత్త శకాన్ని తెరిచింది అదే. ఇందుకు రుజువుగా ఇక్కడ  ఫుట్నోట్ పెట్టాడు మార్క్స్.
తన వర్క్ షాప్ లో సమ్మెల కారణంగా , యంత్రాలని నిర్మించేందుకు యంత్రాలు ఉపయోగించడంలో ఎంతో ముఖ్యమైన అనేక కొత్త పద్ధతుల్ని కనుగొన్నట్లు ఫెయిర్ బైర్న్ చెప్పాడు అనేదే ఆ ఫుట్ నోట్.
ఆవిరి సమ్మెటని కనిపెట్టిన నాస్మిత్ ఇంజనీర్ల దీర్ఘ సమ్మె మూలంగా 1851 లో తాను యంత్రాలకు చేసిన మెరుగుదలల గురించి ఇలా చెప్పాడు :  ఆధునిక మెరుగుదలల లక్షణం స్వయం చాలక పరికర యంత్రాలని ప్రవేశ పెట్టడమే. ఇక పనివాడు చెయ్య వలసిన దాన్ని పిల్లవాడు కూడా చెయ్యగలడు. అదేమంటే, యంత్రం చేసే సొగసైన పనిని పర్యవేక్షించడమే. తమ నిపుణత మీద ఆధారపడ్డ పనివాళ్ళని తొలిగించాను. మునుపు ఒక మెకానిక్ కి నలుగు పిల్లల్ని పెట్టాను. ఇప్పుడు పెద్ద వాళ్ళను 1500 నుంచి 750 కి తగ్గించాను. నాకు లాభాలు బాగా పెరిగాయి.
కార్మికుల ప్రతిఘటనకు  దెబ్బ
కాలికో ప్రింటింగ్ లో వాడిన యంత్రం గురించి ఉరే ఇలా అన్నాడు: పనివాళ్ళతో ఉన్న భారమైన ఒప్పందాల షరతుల నుంచి పెట్టుబడిదారులు విముక్తి కోసం సైన్స్ ని  ఆశ్రయించారు.
కొత్త కొత్త  యంత్రాల రాకతో, మెరుగుదలలతో  కార్మికుల కలిసికట్టు ప్రతిఘటన దెబ్బతిన్నది. వాళ్ళు లొంగి పోవలసి వచ్చింది.
స్వయం చాలక కదురు గురించి చెబుతూ, పెట్టుబడి సైన్స్ ని తన సేవకు వినియోగించు కున్నప్పుడు, అది పెడసరి పనివాణ్ణి  వాలుకి తెస్తుంది, అణకువ నేర్పుతుంది. ఈ మహత్తర సిద్దాంతం అప్పటికే ఉన్నప్పటీ, స్వయం చాలక కదురు యంత్రం ఆ సిద్దాంతానని ధృవపరిచింది.
ఉరే పుస్తకం(The Philosophy of Manufactures) రాసి 30 ఏళ్లయింది. అప్పటికి ఫాక్టరీ వ్యవస్థ  కొద్దిగానే అభివృద్ధి చెంది ఉంది. అయినప్పటికీ ఆరచన ఫాక్టరీ తత్వాన్ని సరిగ్గా బయట పెడుతుంది. పై సిద్ధాంతాన్ని ప్రతిపాదించాక, ఉరే కోపం కట్టలు తెంచుకుంది. ఎందుకంటే, భౌతిక-యాంత్రిక శాస్త్రం పేదల్నిల్ని పెట్టుబడిదారుడు వేధించే సాధనంగా ఉన్నదని నిందిస్తున్నారు,అందుకని. 
కార్మికులకు ఆండ్రూ ఉరే హెచ్చరిక
యంత్రాలు త్వర త్వరగా అభివృద్ధి అవడం, కార్మికవర్గాలకి  ప్రయోజనకరమో సుదీర్ఘంగా ఉపదేశించాక, వాళ్లకి ఒక హెచ్చరిక చేస్తాడు. ఏమంటే, కార్మికుల పట్టుదలవల్లా, సమ్మెలవల్లా యంత్రాల అభివృద్ధిని వేగవంతం అవుతుంది. మెరుగైన యంత్రాలు పనివాళ్ళను తగ్గిస్తాయి. కనుక ముందు చూపులేకుండా ప్రవర్తిస్తే తమని తామే నష్టపరుచుకున్న వాళ్ళవుతారు.
దీనికి కొన్ని పేజీల వెనక ఇందుకు వ్యతిరేకమైనది రాశాడు:
ఫాక్టరీ పనివాళ్ళకున్న పొరపాటు అభిప్రాయాల మూలంగా తీవ్ర ఘర్షణలూ, అంతరాయాలూ ఏర్పడుతున్నాయి. అవి లేకున్నట్లయితే ఫాక్టరీ వ్యవస్థ ఇంకా వేగంగా అభివృద్ధయ్యేది. సంబంధించిన వారందరికీ మరింత ప్రయోజనకరంగా ఉండేది అన్నాడు. అయితే మళ్ళీ ఇలా అన్నాడు: బ్రిటన్ నూలుబట్టలు ఉత్పత్తయ్యే జిల్లాల్లో, సమాజం అదృష్టం వశాత్తూ యంత్రాల మేరుగుదలలు క్రమంగా వస్తున్నాయి. మెరుగుదల వల్ల పెద్దవాళ్ళకి కొందరికి పనిపోయి, ఆదాయం తగ్గుతుంది. అయితే అది పిల్లల శ్రమకి గిరాకీ పెంచుతుంది. వాళ్ళ వేతనాల రేటు పెంచుతుంది. ఇలాంటి ఊరడింపు పలుకులు పలికే ఇతనే పిల్లల తక్కువ వేతనాల్ని సమర్ధిస్తాడు. అందుకు అతను చెప్పే కారణం : ఆపరిస్థితి  తలిదండ్రులు పిల్లల్ని మరీ పిన్న వయసులో ఫాక్తరీలకు పంపకుండా ఆపుతుంది. ఈ మొత్తం పుస్తకం కాల పరిమితి లేని పనిరోజుని సమర్ధిస్తుంది. పార్లమెంటు 13 ఎల్లా లోపు పిల్లల్ని 12 గంటల పనితో అలిసి పోయేట్లు పనిలో పెట్టకూడదు అనే చట్టాన్ని ఒప్పుకో కూడదు అంటాడు. ఉదారవాద వ్యక్తికి మధ్య యుగాల చీకటి రోజుల్ని గుర్తుకొస్తున్నాయి.
వచ్చే పోస్ట్-యంత్రాలు తొలిగించిన కార్మికులకు  నష్టపరిహారం గురించిన సిద్ధాంతం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి