1, జూన్ 2018, శుక్రవారం

ఉత్పాదితానికి యంత్రాలు బదిలీ చేసే విలువ


అధ్యాయం -15


యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా
విభాగం -2


ఉత్పాదితానికి యంత్రాలు బదిలీ చేసే విలువ
శ్రమ ప్రక్రియకు అవసరమైన అంశాలు:
1.మానవ చర్య, అంటే శ్రమే
2. శ్రమ జరిగే పదార్ధం
3. శ్రమ చేయడానికి వాడే పనిముట్లు
2,3 అంశాల్ని(శ్రమ పదార్దాన్నీ, శ్రమ సాధనాల్నీ) కలిపి ఉత్పత్తి సాధనాలు అవుతాయి.
మానవ శ్రమ కొత్త విలువను సృజిస్తుంది.తన సొంత విలువ కన్నా ఎక్కువ విలువని సృజించగలదు. ఉత్పత్తి సాధనాలు వాటిలో ఉన్న విలువని మాత్రమే ఉత్పాదితానికి బదిలీ చేస్తాయి. అంతకన్నా ఎక్కువ విలువని కలపలేవు. ఈసంగతి మనకి ఇంతకూ ముందే తెలుసు.
విలువ బదిలీ అంటే, ఒకదానికి విలువ పోయి  మరొకదానికి చేరడమే. ఒకదానికి విలువ తగ్గి  మరొకదానికి విలువ పెరగడమే. ఒకటి పోగొట్టుకున్నదెంతో, మరొకటి పొందినది సరిగ్గా అంతే. కనుక ఉత్పత్తిసాధనాలు వాటి విలువను మించి బదిలీ చెయ్యలేవు. ఉత్పత్తి సాధనాలు శ్రమ ప్రక్రియలో ఎంత విలువని కోల్పోతాయో అంతే విలువని ఉత్పాదితానికి చేరుస్తాయి. అంతకన్నా ఎక్కువ విలువని చేర్చలేవు.
కొయ్య ఒక ఉపయోగపు విలువ. దాంతో తయారైన కుర్చీ మరొక ఉపయోగపు విలువ. ఈకొత్త ఉపయోగపు విలువ తయారీకి కొయ్య శ్రమ పదార్ధం. వడ్రంగి చేతిలోకి వచ్చేటప్పటికే దానిలో కొంత శ్రమ ఉంది- చెట్టుకొట్టే శ్రమా, కోసే శ్రమా, తీసుకొచ్చేశ్రమా. కుర్చీ చేసేందుకు పరికరాలు కావాలి. వాటిని తయారుచేసినప్పుడు వాటిలో కొంత శ్రమ చేరి ఉంటుంది. కుర్చీ చేసేటప్పుడు ఆ పరికరాలు కొంత అరుగుతాయి. అంటే వాటిలో అంతకు ముందున్న శ్రమలో ఎంతోకొంత తరిగిపోతుంది. ఈతరుగుపడ్డ శ్రమా,ఆ కొయ్యముక్కల తయారీ కయిన శ్రమా ఏమవుతాయి? కొత్త ఉపయోగపు విలువ అయిన కుర్చీకి బదిలీ అవుతాయి.విలువ పరకాయ ప్రవేశం చేస్తుంది.
శ్రమ పదార్ధం బదిలీ చెయ్యడానికీ, శ్రమ పరికరాలు బదిలీ చెయ్యడానికీ తేడా
వాడిన కొయ్య విలువ కుర్చీకి పూర్తిగా బదిలీ అవుతుంది. రంపం, బాడిశ, ఉలి తోపుడు వంటి పరికరాలవిలువ తగు మాత్రమే బదిలీ అవుతుంది. ఎందుకంటే వాటితో ఎన్నో కుర్చీలు, ఇతర వస్తువులు చెయ్యవచ్చు. అవి చేసిన అన్ని వస్తువులకీ కలిపి, వీటి విలువ బదిలీ అవుతుంది. అంటే శ్రమ పదార్ధం విలువా పూర్తిగా బదిలీ అయితే, శ్రమ సాధనాల విలువ పాక్షికంగా బదిలీ అవుతుంది.
పరికరాల స్థానంలో యంత్రాలు
చేతిపనిముట్ల స్థానంలో యంత్రాలోచ్చాయి. అవీ శ్రమ సాధనాలే. కనుక పరికరాలు ఎలా తమ విలువని ఉత్పాదితాలకు బదిలీ చేస్తాయో అదే పద్ధతిలో యంత్రాలుకూడా తమ విలువని ఉత్పాదితాలకు బదిలీ చేస్తాయి.
 తేలిందేమంటే: యంత్రం కూడా  తనకున్న విలువని బదిలీ చేస్తుంది. కొత్తవిలువని ఏర్పరచదు.
కొత్త  విలువని సృజించేది సజీవ శ్రమ ఒక్కటే.
యంత్రాలు ఉత్పాదకతను పెంచుతాయి.
చేతిపనికరాల కన్నా యంత్రాలు ఉత్పాదకతను ఇబ్బడి కిబ్బడిగా పెంచుతాయి. సహకారం వల్లా, శ్రమ విభజనవల్ల చేకూరే ఉత్పాదక శక్తులకు పెట్టుబడి పెట్టే ఖర్చేమీ ఉండదు.
అలాగే సైన్స్ కనిపెట్టిన శక్తులకూ పెట్టుబడికి ఖర్చవదు. అవి సామాజిక శ్రమ యొక్క సహజ శక్తులు.
ఉచిత బహుమతి
ఆధునిక పరిశ్రమ బ్రహ్మాండమైన భౌతిక శక్తుల్నీ, సైన్సునీ ఉత్పత్తి ప్రక్రియలో మేళవిస్తుంది. తద్వారా శ్రమ ఉత్పాదకతని అసాధారణ స్థాయికి పెంచుతుంది.
అందుకు పెట్టుబడి దారుడికి ఏమీ ఖర్చవదు. అదనికి ఊరకే వస్తుంది. ఉచిత బహుమతి. ఇతరుల శ్రమని సొంతం చేసుకున్నట్లే, ఇతరుల సైన్సుని కూడా సొంతం చేసుకుంటుంది.-ఫుట్ నోట్ 23

సైన్స్ ని వాడాలంటే తగిన వస్తువు అవసరం
శ్వాస ఆడాలంటే మనిషికి ఊపిరితిత్తులు అవసరం. అలాగే భౌతిక శక్తుల్ని ఉత్పాదకంగా వాడాలంటే మనిషి చెయ్యి చేసిన దేదైనా ఉండాలి. జలశక్తిని వాడాలంటే జలచక్రం కావాలి. ఆవిరి స్థితిస్థాపకతని ఉపయోగించుకోడానికి ఆవిరి యంత్రం కావాలి. దాని నిర్మాణం చాలా ఖర్చుతో కూడిన పని. పనిచేసే పనిముట్లు కూడా మునుపటి పరికరాలకంటే ఖరీదెక్కువ.
ఉదాహరణ ఇస్తాడు:
అయస్కాంత సూచి విద్యుత్ క్షేత్రంలో తన దారి నుండి వైదోలుగుతుంది అనే నియమాన్ని కనుగొన్నాక, అందుకోసం ఇక పైసా కూడా ఖర్చు చెయ్యాల్సిన పని ఉండదు. అలాగే ఇనుము చుట్టూ విద్యుత్ ప్రసరించినప్పుడు ఆ ఇనుముకి అయస్కాంత ధర్మం ఏర్పడుతుంది అనే నియమాన్ని ఒకసారి కనిపెట్టాక అందుకిక ఏమీ ఖర్చుండదు. అంతవరకూ ఉచితమే. కాని ఆనియమాల్ని టెలిగ్రాఫ్ మొదలైన వాటిలో వాడుకోవాలంటే, విస్తారమైన సాధనాలు తప్పనిసరి. ఆధునిక పరిశ్రమలో వాడే యంత్రాలు, చేతి వృత్తుల్లోనూ,  కార్ఖానా ఉత్పత్తి లోనూ వాడిన  పనిముట్ల కంటే ఎక్కువ విలువైనవి అనే   విషయం తేటతెల్లమే.
అవి ఖరీదవుతాయి.
అయితే అవి ఎక్కువకాలం పనిచేస్తాయి
అందువల్ల అవి ఉత్పాదితానికి పరికరం కంటే తక్కువ విలువని బదిలీ చేస్తాయి.
యంత్రాలలో శ్రమ పరిమాణం పెరిగినప్పుడు, ఆ యంత్రాలు ఉత్పాదితంలో శ్రమ పరిమాణాన్ని ఎలా తగ్గిస్తాయి?
సరుకులో ప్రస్తుత శ్రమ గత శ్రమ కలిసి ఉంటాయి.గత శ్రమ పెరగడం వల్లమాత్రమే, ప్రస్తుత శ్రమతగ్గుతుంది. మొత్తం శ్రమవ్యయం ఎందుకు తగ్గుతుందో నాలుగు కారణాలు చెబుతాడు:
1.యంత్రాలు శ్రమ ప్రక్రియలో ఎల్లప్పుడూ మొత్తంగా పాల్గొంటాయి. అయినప్పటికీ, విలువ నేర్పరచే ప్రక్రియలో మాత్రం  కొంతకొంతగా చేరతాయి. ఉదాహరణకి పది బూట్లే తయారుచెయ్యాలన్నా, యంత్రం - అది ఎంత ఖరీదైనదైనా - మొత్తం పనిచెయ్యాల్సిందే. అయినా వాటిలో చేరే విలువ ఆ యంత్రం అరుగుదల విలువ ఎంతో అంతే . యంత్రం అరుగుదల మూలంగా సగటున అది పోగొట్టుకునే  విలువ కన్నా, ఎక్కువ విలువని సరుకులకు కలపదు. అందువల్ల ఒక యంత్రం విలువకూ, ఒక నిర్దిష్ట కాలంలో ఆ యంత్రం ఉత్పాదితానికి బదిలీ చేసే విలువకీ ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
2.శ్రమ ప్రక్రియలో యంత్రం పనిచేసే కాలం అంటే జీవిత కాలం (life of the machine) ఎక్కువయ్యే కొద్దీ ఈ వ్యత్యాసం పెరుగుతుంది.
ఉదాహరణకి అది సంవత్సరానికి బదులు రెండు సంవత్సరాలు పనిచేస్తే, అది ఉత్పాదితానికి బదిలీ చేసే విలువ సగానికి తగ్గుతుంది.
3.సైన్స్ నియమాలను పాటించడం వాళ్ళ ఈ వ్యత్యాసం పనిముట్టులో కంటే యంత్రంలో ఎక్కువ. దానికి కారణం యంత్రం తయారీకి , పనిముట్టు తయారీ కంటే దృడంగా ఎక్కువకాలం మన్నే పదార్ధాన్ని వాడడమే; యంత్రం వినియోగం కచ్చితమైన శాస్త్రీయ నియమాల చేత  నియంత్రించబడడమే. ఫలితంగా యంత్రాలు ఎన్నో ఎక్కువ సరుకుల్ని ఉత్పత్తిచేస్తాయి.
యంత్ర వ్యవస్థలో ప్రధాన చోదక సాధనం ఎన్నో యంత్రాల్ని ఉమ్మడిగా నడుపుతుంది. కనుక పొదుపవుతుంది. సహకారమూ, కార్ఖానా ఉత్పత్తీ గురించి చెప్పినప్పుడు భవనాల వంటి కొన్ని ఉత్పత్తి అంశాలు ఉమ్మడిగా ఉపయోగించడం వల్ల ఏపనివాడికాపనివాడు విడి విడిగా ఉత్పత్తిసాధనాల్ని చెల్లాచెదరుగా ఉపయోగించినదానితో పోలిస్తే, పొదుపు అవుతాయనీ, అందువల్ల ఉత్పాదితాల్ని చౌక పరుస్తాయనీ మార్క్స్ నిరూపించాడు.
4.అంతిమంగా, ఒక పనిముట్టు ఉత్పత్తి రంగం కన్నా,ఒక యంత్రం ఉత్పత్తి రంగం చాలా విస్తృతంగా ఉంటుంది..
బ్లాక్ బర్న్ కి చెందిన బేన్స్ 1858 లో ఒక ఆశ్విక శక్తి  నడిపగలిగే వాటి సంఖ్యని అంచనావేసి చెప్పాడు. అవి:
·          450 మూల్ కదుర్లు
·         200 త్రాజిల్ కదుర్లు
·         40 అంగుళాల వస్త్రం నేసే 15 మగ్గాలు.
ఒక ఆశ్వ శక్తి ఖరీదూ, అది నడిపే యంత్రం  అరుగుదల ఖరీదూ ఉత్పాదితం అంతకూ పంపిణీ అవుతుంది. దీన్ని బట్టి, పై 3 సందర్భాల్లో మొదటి దాంట్లో  450 మూల్ కదుర్ల ఉత్పాదితానికీ, రెండో సందర్భంలో 200 త్రాజిల్ కదుర్ల ఉత్పదితానికీ, మూడో సందర్భంలో 15 మగ్గాల ఉత్పాదితానికీ పరుచుకుంటుంది. అంటే, ఒక పౌను దారానికైనా, ఒక గజం బట్టకైనా అరుగుదల వల్ల  బదిలీ అయ్యే విలువ అతి తక్కువ. ఆవిరి సమ్మెట విషయమైనా అంతే. దాని రోజు అరుగుదలా,బొగ్గు ఖరీదూ  ఆ సమ్మెట సాగ గొట్టే ఇనుం భారీ మొత్తానికీ పంపిణీ అవుతుంది కాబట్టి  ఒక హండ్రెడ్ వైట్ (=50.8 కిలోలు)  ఇనుంకి కొద్ది విలువ మాత్రమే కలుస్తుంది; అయితే ఆ బ్రహ్మాండమైన సాధనాన్ని చీలలు దింపడానికి వాడితే కలిసే విలువ చాలా ఎక్కువ.

ఏ యంత్రానికైనా పనిచేసే సామర్ధ్యం ఉంటుంది. ఆసామర్ధ్యం ఎంత అనేది అందులో వున్న పనిముట్ల సంఖ్యను బట్టీ, పనిముట్ల వేగాన్ని బట్టీ ఉంటుంది. ఎక్కువ వేగంగా తిరిగే కదుళ్లుంటే, ఉత్పత్తయ్యే నూలు  ఉత్పాదితం పరిమాణం ఎక్కువ వుంటుంది. అంటే  పనిముట్ల వేగం పెరిగే కొద్దీ పెరుగుతుంది. కొన్ని సమ్మెటలు నిమిషానికి 70 వేట్లు వేస్తాయి. అయితే కదుర్లు చేసే రైడర్ పేటెంట్ యంత్రం నిమిషానికి 700 దెబ్బలు వేస్తుంది. రెండో దాని ఉత్పాదితం ఎక్కువని వేరే చెప్పక్కర్లేదు.
యంత్రాలను యంత్రాలతో చేసినప్పుడు యంత్రం విలువ తగ్గుతుంది
మరొక అంశం యంత్రంవిలువ. యంత్రాలను యంత్రాలతో చేసినప్పుడు యంత్రం విలువ తగ్గుతుంది. . ఆ తగ్గుదల ఎంత అనేది, ఆ యంత్ర విస్తరణను బట్టీ, సామర్ధ్యాన్ని బట్టీ ఉంటుంది.యంత్రం ఉత్పాదితానికి తన విలువని బదిలీ చేసే రేటు ఫలానింత అని తెలిస్తే, అలా  బదిలీ అయ్యే మొత్తం యంత్రం మొత్తం విలువని బట్టి ఉంటుంది. యంత్రంలో ఎంత తక్కువ శ్రమ వుంటే, ఉత్పాదితానికి అది చేర్చే విలువ అంత తక్కువ ఉంటుంది.
యంత్రం వాళ్ళ పెరిగే ఉత్పాదకత
యంత్రం ఉత్పాదితానికి బదిలీ చేసే విలువ ఎంత తక్కువ అయితే, ఆ యంత్రం ఉత్పాదకత అంత ఎక్కువ. దాని సేవలు ప్రకృతి శక్తుల సేవలకు అంత దగ్గరవుతాయి.
ఒక యంత్రాన్ని తయారుచెయ్యడానికి ఎంత శ్రమ పట్టిందో, ఆయంత్రం వాడడం వల్ల అంతే శ్రమ ఆదా అయితే ఉత్పాదక శక్తి పెరగనట్లే. ఒక సరుకు ఉత్పత్తికి పట్టే శ్రమ పొదుపు కానట్లే. ఒక యంత్రం తయారీకి అయ్యే శ్రమకీ, ఆ యంత్రం ఆదా చేసే శ్రమకీ మధ్య తేడా ఆ యంత్రం సొంత విలుకీ, అది తొలిగించిన పనిముట్టు విలువకీ మధ్య  ఉండే తేడా మీద ఆధార పడదు. ఒక యంత్రం ఉత్పాదకత ఆ యంత్రం తొలిగించే మానవ శ్రమ శక్తి చేత కొలవబడుతుంది. ఒక యంత్రం తయారీకి వెచ్చించిన శ్రమ, ఆ కారణంగా ఉత్పాదితానికి కలిసే విలువ, ఒక పనివాడు తన పనిముట్టుతో కలిపే విలువ కన్నా తక్కువగా ఉన్నంత వరకూ, ఆతేడా యంత్రాలు వాడడానికి అనుకూలం.  అందువల్ల ఒక యంత్రం ఉత్పాదకత అది తొలిగించే మానవ శ్రమ శక్తిని బట్టి ఉంటుంది.
యంత్రం తయారీకి పట్టే శ్రమ, అది తొలిగించే శ్రమ కన్నా తక్కువగా ఉన్నప్పుడు యంత్రాన్ని పెడితే అది ఉత్పాదకతను పెంచుతుంది. ఇందుకు మార్క్స్ 4 ఉదాహరణలిస్తాడు. 
1.వడకడం.
ఒక హార్స్ పవర్ తో నడిచే సన్నాహక యంత్రాలతో సహా 450 యంత్ర కదుళ్ళకు ఇద్దరు పనివాళ్ళు కావాలని చెప్పాడు బేన్స్; 10 గంటలలో ఒక్కొక స్వయంచాలక యంత్ర కదురు 13 ఔన్సుల దారాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే 2 1/2 పనివాళ్ళు వారానికి 365 పౌన్ల దారం వాడుకుతారు. రద్దుని పక్కన బెడితే, 366 పౌన్ల దూది దారంగా మారడానికి  150 గంటలు పడుతుంది. రోజు పనిగంటలు 10 అయితే, 15 రోజులు పడుతుంది. అదే పనికి రాట్నంతో చేతి పనివాడు 13 ఔన్సుల దారాన్ని 60 గంటల్లో తీస్తాడు అనుకుంటే, 366 పౌన్ల దూది దారంగా మారడానికి 2,700 రోజులు(రోజంటే 10 పనిగంటలు) పడుతుంది.అంటే 27, 000 పనిగంటల సమయం పడుతుంది.
2.కాలికో ప్రింటింగ్
బట్టమీద ముద్రించే పని చేత్తో చేసేవాళ్ళు. అదే  దిమ్మ అచ్చు. ఆపద్ధతిలో 200 మంది చేసినంత పని, ఒక యంత్రం ఒక మనిషి లేక బాలుడి సహాయంతో చేస్తుంది.
3. విత్తనాల్నీ దూదినీ వేరు చెయ్యడం
1793 లో విట్నే కాటన్ జిన్ కనిపెట్టక ముందు ఒకపౌను విడదీయడానికి ఒక రోజు పట్టేది. జిన్ తో అయితే ఒక నీగ్రో స్త్రీ  రోజుకి 100 పౌన్లు తియ్యగలిగేది. ఆ తర్వాత జిన్ సామర్ధ్యాన్ని బాగా పెంచారు. మునుపు ఒక పౌను దూది ఉత్పత్తి ఖర్చు 50 సెంట్లు. జిన్ వచ్చాక ఆ దూదిలో చెల్లించని శ్రమ పెరిగింది. ఫలితంగా పౌను 10 సెంట్లకే అమ్మినా, మునుపు కన్నా మరింత లాభం చేకూరింది. ఇండియాలో ఈ పనికి చర్కా వాడేవాళ్ళు. అది సగం యంత్రం, సగం పరికరం. దాంతో ఒక పురుషుడు, ఒక స్త్రీ రోజుకి 28 పౌన్ల దూదిని శుభ్రం చేసేవాళ్ళు. కొన్నేళ్ళ క్రితం డాక్టర్ ఫోర్బిస్ మరొక చర్కా తయారు చేశాడు. దాంతో ఒక పురుషుడు, ఒక బాలుడు రోజుకి 250 పౌన్లు తీస్తారు. ఎద్దులో, అవిరో, నీరో వాడి దాన్ని నడిపితే కొద్దిమంది పిల్లలే సరిపోతారు. ఎద్దులు నడిపే 16 యంత్రాలు 750 మంది మనుషులు చేస్తాం పనిచేస్తాయి.
4.ఆవిరి నాగలి
66 మంది మనుషులు 15 షిల్లింగుల ఖర్చుతో ఎంతపని చేస్తారో అంతపనిని ఒక ఆవిరి నాగలి 3 పెన్నీల ఖర్చుతో చేస్తుంది. ఒక పొరపాటు అభిప్రాయాన్నిపోగొట్టేందుకు ఈ ఉదాహరణని మళ్ళీ ఇస్తున్నాడు. 15 షిల్లింగులు  66 మంది ఒక గంటలో వ్యయించిన మొత్తం శ్రమకూ డబ్బులో వ్యక్తీకరణ కాదు. అదనపు శ్రమకి అవసర శ్రమతో నిష్పత్తి 100 శాతం అయితే, 66 మంది గంటలో 30 షిల్లింగుల విలువ సృష్టించాలి- వాళ్ళ వేతనాలు 15 షిల్లింగులు అరగంట శ్రమకే ప్రతినిధి అయినప్పటికీ. అప్పుడు ఒక యంత్రం తొలిగించే 150 మంది శ్రామికుల సంవత్సర వేతనం 3000 పౌన్లు అనుకుందాం.3000 పౌన్లు యంత్రాలు లేకముందు ఈ 150 మంది తమ ఉత్పాదితానికి కలిపిన శ్రమకు ధనరూప వ్యక్తీకరణ కాదు/ శ్రమను మొత్తాన్నీ తెలియ చెయ్యదు.(అంటే ) వాళ్ళు వాళ్ళ కోసం ఖర్చుపెట్టుకున్నశ్రమ భాగానికి డబ్బులో వ్యక్తీకరణ.(అంటే అవసర శ్రమను మాత్రమే తెలియజేస్తుంది. అయితే వాళ్ళు దీనికి తోడూ అదనపు శ్రమను కూడా చేస్తారు.ఆవిరి యంత్రం సహాయంతో దున్నే మరనాగాలి ఖరీదు 3000 పౌనులు అయితే ఏమైనా అది అందులో మూర్తీభవించి వున్నా శ్రమ కంతకూ ధనరూప వ్యక్తీకరణ. ఆవిధంగా యంత్రం ఖరీదు, అది ఎంత శ్రమ శక్తికి బదులుగా ఉపయోగ పడుతుందో అంతే అయినప్పటికీ , అందులో వున్న  మానవ శ్రమ అది ప్రత్యామ్నాయంగా పనిచేసే మానవ శ్రమ కంటే ఎల్లప్పుడూ చాలా తక్కువే-చూ-పెట్టుబడి గురించి.105-06 దానికి  వాళ్ళ వేతనాలు ప్రతినిధిగా ఉంటాయి. మరొకవైపు, యంత్రం విలువ అయిన ఈ 3000 పౌన్లు ఆ యంత్రం ఉత్పత్తిలో వ్యయమైన మొత్తం శ్రమకీ ప్రాతినిధ్యం వహిస్తుంది శ్రామికుల వేతనాలకీ, పెట్టుబడిదారుడి అదనపు విలువకీ సంబంధించి పాళ్ళు ఏవైనప్పటికీ. అందువల్ల, ఒక యంత్రం ఖరీదు అది తొలిగించే శ్రమ శక్తి ఖరీదు ఎంతో అంత అయినప్పటికీ, ఆ యంత్రంలో పాదార్ధీకృతమైన శ్రమ అది తొలిగించే సజీవ శ్రమ కన్నా ఇంకా తక్కువ.
పెట్టుబడిదారులు తమ ఫాక్టరీల్లో కొత్త యంత్రాలను ఎల్లప్పుడూ పెడుతూ ఉంటారా?
యంత్రాన్ని వినియోగించాదానికయ్యే ఖర్చు, ఆయంత్రం తొలిగించే కార్మికుల వేతనాల కంటే తక్కువగా ఉంటేనే ఆ యంత్రం పెట్టుబడిదారునికి లాభకరంగా వుంటుంది. అనగా, వేతనాలు తక్కువగా వుంటే, మనుషులతోనే చేయించుకుంటారు.యంత్రాలు పెట్టరు. వేతనాలు ఎక్కువగా ఉన్నప్పుడు, యంత్రాలు ప్రవేశపెడతారు. రికార్డో అన్నట్లు వేతనాలు పెరిగేవరకూ యంత్రాలు పెద్దగా ఉపయోగించ బడవు.
ఉత్పాదితాన్ని చౌకచేసేందుకే యంత్రాన్ని వాడడంలో ఈవిధమైన పరిమితి ఉంది. ఆ యంత్రం ఎంత శ్రమనైతే తొలిగిస్తుందో, అంతకన్నా తక్కువ శ్రమని ఆ యంత్రం తయారీలో ఖర్చు అవాలి. కాని పెట్టుబడికి దాని విలువ అది ప్రత్యామ్నాయం అయ్యే శ్రమశక్తి విలువ కంటే తక్కువ అయి వుండాలి.

 ఒక చోట లాభదాయకం కాని యంత్రాలు మరొక చోట లాభదాయకం కావచ్చు.
ఇంగ్లండ్ లో లాభం తేని  యంత్రాలు అమెరికాలో లాభం తేవచ్చు. కొన్ని చట్టపరమైన నిబంధనల మూలంగా, పెట్టుబడికి ఇంతకూ ముందు లాభదాయకంగా లేని యంత్రాలు ఆకస్మికంగా ప్రత్యక్షం కావచ్చు.  ఏమైనప్పటికీ, పెట్టుబడిదారుడికి ఈ ఉపయోగం మరింత పరిమితం అయినదిగా ఉంటుంది. శ్రమకి చెల్లించే బదులు, నియోగించిన శ్రమ శక్తికి మాత్రమే చెల్లిస్తాడు; అందువల్ల యంత్రాన్ని వాడడంలో అతనికి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి యంత్రం విలువకీ, అది తొలిగించే శ్రమశక్తి విలువకీ ఉండే వ్యత్యాసాన్ని బట్టి ఉంటుంది. రోజు శ్రమ అవసర భాగం గానూ, అదనపు భాగం గానూ విభజన వేర్వేరు దేశాల్లో భిన్నంగా ఉంటుంది, ఒకే దేశంలో వేర్వేరు కాలాల్లోనూ, వేర్వేరు పరిశ్రమ శాఖల్లోనూ భిన్నంగానే ఉంటుంది. ఇంతకన్నా మరొకటి ఉంది. శ్రామికుడి వాస్తవ వేతనం ఒక్కోసారి శ్రమ శక్తి విలువకన్నా తక్కువగానూ, ఒక్కోసారి ఎక్కువగానూ ఉంటుంది. కనుక యంత్రం ధరకీ, అది తొలిగించే శ్రమ శక్తి ధరకీ మధ్య తేడా బాగా ఎక్కువా, తక్కువా అవుతుంది -  ఆయంత్రం తయారీకి పట్టే మొత్తం శ్రమకీ, అది తొలిగించే మొత్తం శ్రమకీ తేడా మారకుండా అలానే ఉన్నప్పటికీ. అయినా, పెట్టుబడిదారుడికి సరుకు ఉత్పత్తి ఖర్చుని నిర్ణయించేది మొదటి తేడా మాత్రమే. అదే పోటీ ఒత్తిడి ద్వారా అతని చర్యని ప్రభావితం చేస్తుంది. అందువల్ల, ఈరోజుల్లో ఇంగ్లండ్ లో కనిపెట్టిన యంత్రాలు అమెరికాలోమాత్రమే వాడబడుతున్నాయి.
17 శతాబ్దాలలో హాలండ్ లోమాత్రమే వాడే  యంత్రాలు  జర్మనీలో కనిపెట్టబడ్డాయి. అలాగే 18 వ శతాబ్దంలో ఫ్రాన్స్ లో కనిపెట్టిన అనేక యంత్రాలు ఇంగ్లండ్ లో మాత్రమె ఉపయోగించబడేవి. అంతకన్నా  పురాతన దేశాల్లో యంత్రాలు కొన్నిపరిశ్రమ  శాఖల్లో వాడితే, అప్పుడు ఇతర పరిశ్రమ శాఖల్లో శ్రమ అవసరానికి మించినదిగా అవుతుంది. ఎంతగానంటే, ఆశాఖల్లో వేతనాలు శ్రమ శక్తి విలువ కన్నా తగ్గుతాయి. కనుక యంత్రాల వినియోగాన్ని అడ్డుకుంటాయి. పెట్టుబడి దారుడి వైపు నుండి చూస్తే, లాభం నియోగించిన శ్రమ తగ్గుదల వల్ల కాక, చెల్లించబడిన  శ్రమ తగ్గుదల వల్ల  నుండి వస్తుంది. కాబట్టి అతని దృష్టిలో యంత్రాలని వాడడం అనవసరమూ, తరచూ అసాధ్యమూను. ఇంగ్లండ్ లో కొన్ని ఉన్ని పరిశ్రమ శాఖల్లో, ఇటీవల పిల్లల నియామకం బాగా తగ్గింది, కొన్ని సందర్భాల్లో పూర్తిగా రద్దుచెయ్య బడింది. ఎందువల్ల? ఫాక్టరీ చట్టాలు  పిల్లల్ని రెండు గ్రూపులు చేశాయి. ఒక గ్రూప్ 6 గంటలు, మరొక గ్రూప్ 4 గంటలు పనిచేసేవి. లేదా అదీ ఇదీ 5 గంటలు. అయితే ఆపిల్లల తలిదండ్రులు ‘పూర్తికాలపు పనివాళ్ళ‘ (full-timers)కన్నా తమ పిల్లల్ని  ‘సగం కాలపు పనివాళ్ళు’గా  (half-timers) అమ్మడానికి నిరాకరించారు. ఆ కారణంగా ‘సగం కాలపు పనివాళ్ళ’ స్థానంలో యంత్రాలు పెట్టబడ్డాయి.
గనుల్లో పదేళ్ళ లోపు పిల్లల పనినీ, స్త్రీల పనినీ నిషేధించక ముందు, పెట్టుబడి దారులు నగ్న మహిళలనూ,   బాలికలనూ పురుషుల పక్కనే పనిచేయించే వారు. అలా చేయించడాన్ని వాళ్ళ నీతిశాస్త్రం, ప్రత్యేకించి వాళ్ళ లెడ్జర్లూ అనుమతించాయి. ఆచట్టం వచ్చాక వాళ్ళు యంత్రాలకు మళ్ళారు/మొగ్గారు. అమెరికన్లు రాళ్ళు పగలగొట్టే యంత్రాన్ని కనిపెట్టారు. ఇంగ్లిష్ వాళ్ళు ఆ యంత్రాన్ని ఉపయోగించలేదు. ఎందుకంటే, అక్కడి చేసే అభాగ్యులు ఆపని చాలా తక్కువకి చేసేవాళ్ళు. ఎంత తక్కువకంటే, యంత్రాలతో చేస్తే పెట్టుబడిదారుడికి ఉత్పత్తి ఖర్చు ఎక్కువవుతుంది.    
వేతనాలు పెరిగేవరకూ యంత్రాలు పెద్దగా ఉపయోగించ బడవు అన్నాడు రికార్డో.
ఇంగ్లాండ్ లో ఇప్పటికీ ( అంటే కాపిటల్ రాసేనాటికి ) కాలవ పడవల్ని లాగడానికి గుర్రాల బదులు అడపాదడపా స్త్రీలని పెడుతున్నారు. కారణం, యంత్రాల్నీ, గుర్రాల్నీ నిర్వహించడానికి  ఎంత శ్రమ కావాలో తెలిసిందే, లెక్కకందేదే. అదే సమయంలో అదనపు జనాభాలో ఉన్న స్త్రీల పోషణకి కావలసిన శ్రమ అంచనాలకీ అడుగునే ఉంటుంది. అందువల్లనే, యంత్రాల దేశం అయిన ఇంగ్లండ్ లో కన్నా మరే దేశం లోనూ అలా కీతాపనులకు  మానవ శ్రమని సిగ్గులేకుండా వాడడం కనబడదు.

వచ్చే పోస్ట్:  కార్మికునిమీద యంత్రాల ప్రభావాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి