4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

‘కాపిటల్’ రెండో సంపుటం - పెట్టుబడి చలామణీ ప్రక్రియ


              కాపిటల్ రెండో సంపుటంలో

      కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు

 

        పెట్టుబడి చలామణీ ప్రక్రియ

   The Process of Circulation of Capital

ఒకటో భాగం:

పెట్టుబడి రూపం మార్పులూ – వాటి వలయాలూ

­     The Metamorphoses of Capital and their Circuits

ఒకటో అధ్యాయం:

డబ్బు పెట్టుబడి వలయం (The Circuit of Money Capital)

పెట్టుబడి చలనం డబ్బుతో మొదలై, డబ్బుతో ముగుస్తుంది. వలయంగా ఉంటుంది. అది చక్రీయ చలనం.

ఈ చలనం 3 దశల్లో జరుగుతుంది- అని కాపిటల్ మొదటి సంపుటిలో ఉంటుంది. ఆదశలు వరసగా ఇవి::

మొదటి దశ: పెట్టుబడిదారుడు డబ్బుతో బయలుదేరతాడు. సరుకుల మార్కెట్ కీ,  శ్రామిక మార్కెట్ కీ, వెళతాడు. తన డబ్బుని సరుకుల్లోకి మారుస్తాడు. ఇది డబ్బు - సరుకు అనే చలామణీ చర్య.

ఉదాహరణకి, ఇనుప బీరువాలు ఉత్పత్తి చేసే పెట్టుబడిదారుడికి రేకు, తాళాలు మొదలైన శ్రమ పదార్ధాలు కావాలి. అలాగే తయారు చెయ్యడానికి కొన్ని పరికరాలు కావాలి. రెంటినీ ఉపయోగించి, బీరువాలు చేసే కార్మికులు కావాలి. రెంటినీ వేర్వేరు మార్కెట్లలో కొనాలి. ఆందుకోసం డబ్బు తీసుకొని వెళ్ళాలి. అక్కడ అతని డబ్బు సరుకుల్లోకి మారుతుంది. ఇది డబ్బు- సరుకు  అనే చలామణీ చర్య.

రెండో దశ: పెట్టుబడిదారుడు కొన్న సరుకుల్ని ఉత్పత్తిలో వినియోగిస్తాడు. పెట్టుబడిదారీ ఉత్పత్తిదారుడిగా వ్యవహరిస్తాడు. అతని పెట్టుబడి ఉత్పత్తి ప్రక్రియలోకి వెళుతుంది. బీరువాలు తయారవుతాయి.

దీని ఫలితం: ఉత్పత్తిలో ప్రవేశించిన సరుకుల విలువకంటే, ఎక్కువ విలువ ఉండే సరుకులు ఉత్పత్తి అవుతాయి. ఇది ఉత్పత్తి చర్య. చలామణీ చర్య కాదు.

మూడో దశ: ఉత్పత్తయిన కొత్త సరుకులతో, వాటిని  అమ్మేవాడుగా మార్కెట్లోకి మళ్ళీ వస్తాడు. అతని సరుకుల్ని(మన ఉదాహరణలో బీరువాల్ని) డబ్బులోకి మార్చుకుంటాడు. ఇది సరుకు – డబ్బు అనే చలామణీ చర్య. పెట్టిన డబ్బు మరింతై తిరిగి చేతికొస్తుంది.

ఆవిధంగా, పెట్టుబడి చలనం డబ్బుతో మొదలై, డబ్బుతో ముగుస్తుంది. వలయంగా ఉంటుంది.

అందుకే, డబ్బు పెట్టుబడి వలయం ఫార్ములా ఇది: డ - స....ఉ.పె ....స' - '. ఇక్కడ చుక్కలు చలామణీ ప్రక్రియకు అంతరాయాల్ని సూచిస్తాయి. మొదటి దశకూ, మూడోదశకూ మధ్య చలామణీ చర్య లేదు. 

'  - అదనపు విలువ కలిసి మరింత విలువ అయిన సరుకుకి గుర్తు.

' - అదనపు విలువ కలిసి మరింత విలువ అయిన డబ్బుకి గుర్తు

ఉ.పె - ఉత్పాదక పెట్టుబడికి గుర్తు

మొదటి సంపుటంలో ఒకటో దశ, మూడో దశ గురించిన చర్చ ఉంది - అయితే ఆ చర్చ రెండో దశ అయిన పెట్టుబడి ఉత్పత్తి ప్రక్రియని గురించి గ్రహించడానికి ఏ మేరకు అవసరమో, ఆ మేరకు మాత్రమే ఉంది. ఆ కారణంగా, పెట్టుబడి భిన్న దశల్లో తీసుకునే వివిధ రూపాల్ని పరిగణనలోకి తీసుకోలేదు. పెట్టుబడి వలయం మళ్ళీ మళ్ళీ జరిగేటప్పుడు ఒకప్పుడు తీసుకొని, మరొకప్పుడు వదిలివేసే రూపాల్ని గురించిన చర్చ అక్కడ లేదు. ఆ రూపాల గురించే ఇప్పుడు/ఇక్కడ మన చర్చ.

 మొదట ఆ రూపాల్ని వాటి స్వచ్ఛస్థితిలో చూడాలి, గ్రహించాలి.

అందుకు, ఆ రూపాల్ని ఏర్పరచడంతో ప్రమేయంలేని అన్ని అంశాల్ని వదిలి పెట్టాలి. అంటే:

1. సరుకులు వాటవాటి విలువలకే అమ్ముడవుతాయి అనుకోవాలి; అంతే కాదు

2. ఇది అంతా ఒకే పరిస్థితుల్లో జరుగుతున్నది (పరిస్థితులు మారకుండా అలానే ఉన్నాయి) అని కూడా అనుకోవాలి.

3. అదే విధంగా, ఈ వలయాల గమనంలో జరగడానికి అవకాశమున్న అన్ని మార్పుల్నీ పక్కన బెట్టాలి.

అలా అనుకుని మార్క్స్ స్వచ్ఛస్థితిలో ఆమూడు దశల్నీ వరసగా పరిశీలిస్తాడు.

వచ్చే పోస్ట్ మొదటిదశ. డబ్బు సరుకు (డ-స) 

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి