15, సెప్టెంబర్ 2020, మంగళవారం

2.రెండో దశ- ఉత్పాదక పెట్టుబడి చర్య

 

2.రెండో దశ- ఉత్పాదక పెట్టుబడి చర్య

మొదటి దశలో  పెట్టుబడిదారుడి డబ్బు శ్రమశక్తిలోకీ, ఉత్పత్తిసాధనాల్లోకీ మారింది. దాని ఫలితం: డబ్బు రూపంలో అడ్వాన్స్ చేసిన  పెట్టుబడి విలువ యొక్క చలామణీకి అంతరాయం ఏర్పడుతుంది. డబ్బు పెట్టుబడి ఉత్పాదక పెట్టుబడిగా మారుతుంది. తద్వారా చలామణీని కొనసాగించలేని భౌతిక రూపాన్ని పొందుతుంది. ఇక అది వినియోగంలోకి, అంటే ఉత్పాదక వినియోగంలోకి పోతుంది. శ్రమశక్తి ఉపయోగం, అంటే శ్రమ, శ్రమ ప్రక్రియలో మాత్రమే కార్యరూపం దాలుస్తుంది.

పెట్టుబడి దారుడు శ్రామికుని చేత పనిచేయించుకుంటాడు. అంతేకాని, శ్రామికుణ్ణి తిరిగి అమ్మలేడు. ఎందువల్లనంటే: శ్రామికుడు శాశ్వత బానిస కాడు, పెట్టుబడిదారుడు కొన్నది ఏమిటి? కార్మికుని శ్రమని కొంతకాలంపాటు వాడుకునే హక్కుని. అంతకుమించి మరేమీ లేదు. మరొకవైపు, పెట్టుబడిదారుడు కొత్త సరుకుల్ని ఉత్పత్తిచెయ్యడానికి శ్రమశక్తి సహాయంతో ఉత్పత్తిసాధనాల్ని ఉపయోగించుకుంటాడు. అలా తప్ప మరో విధంగా శ్రమశక్తిని వినియోగించుకునే దారి అతనికి లేదు. కాబట్టి, మొదటిదశ ఫలితం: రెండోదశ అయిన ఉత్పాదక దశలోకి ప్రవేశించడమే.

ఈ చలనాన్ని డ-స (శ్ర.శ+ ఉ.సా)...ఉ.పె సూచిస్తుంది. ఇందులోచుక్కలు పెట్టుబడి చలామణీకి అంతరాయం ఏర్పడిందని సూచిస్తాయి - అయినా పెట్టుబడి చక్రీయ చలనం కొనసాగు తూనే ఉంటుంది.  ఎందుకంటే: పెట్టుబడి సరుకుల చలామణీ రంగం నించీ, ఉత్పత్తి రంగంలోకి వచ్చి చేరింది. కాబట్టి దాని చలామణీ నిలిచిపోయింది. అందువల్ల, డబ్బు పెట్టుబడి ఉత్పాదక పెట్టుబడిగా అవడం అనే మొదటిదశ, రెండో దశ అయిన ఉత్పాదక పెట్టుబడి చర్యకి ప్రవేశదశ మాత్రమే.

పెట్టుబడిదారుడు సరుకుల ఉత్పత్తిదారుడు అవుతాడు. అతని అధీనంలో ఉండే విలువలు ఏ ఉపయోగపు రూపంలో నైనా ఉండవచ్చు. అంతేకాదు,  డబ్బురూపంలో కూడా ఉండవచ్చు. అతను ఓ డబ్బు ఓనర్. డ-స చర్యలో డబ్బు ఇవ్వడం ఉంటుంది. మరి అతను డబ్బు ఓనర్ గా ఎలా ఉండగలుగుతాడు? డబ్బు ఇవ్వడం అనే చర్యలో, డబ్బు వెనక్కి తిరిగి రావడం అనే చర్యని సూచిస్తేనే కుదురుతుంది. మరి అతనికి డబ్బు తిరిగి ఎలా వస్తుంది? సరుకులు అమ్మడం ద్వారా మాత్రమే వస్తుంది. అందువల్ల పై చర్య అతణ్ణి సరుకుల ఉత్పత్తిదారుడుగా భావిస్తుంది.

పెట్టుబడిదారుడి వైపునించి: అతను డబ్బు పెట్టాడు గనక అది తిరిగి రావాలి. అందుకు, అతను సరుకులు ఉత్పత్తి చెయ్యాలి.

కార్మికుని వైపునించి: వేతన శ్రామికుడు తన శ్రమశక్తిని అమ్ముకోవడం ద్వారా మాత్రమే బతుకుతాడు. అతని శ్రమ శక్తి నిలిచి ఉండాలంటే, రోజువారీ పొషణ ఉండాలి. అందుకు అవసరమైన సరుకులు కొనాల్సి ఉంటుంది. కాబట్టి కొద్దికొద్ది సమయాల్లో వేతన చెల్లింపు జరగాలి. అలా అయితేనే శ్ర.శ - డ -స / స - డ - స చర్య మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. అందువల్ల పెట్టుబడిదారుడు  వేతన శ్రామికుణ్ణి డబ్బు పెట్టుబడిదారుడుగానూ, అతని పెట్టుబడి డబ్బు పెట్టుబడిగానూ ఎప్పుడూ కలుసుకోవాల్సిందే. మరొకపక్క, ప్రత్యక్ష ఉత్పత్తిదారులయిన వేతన శ్రామికులు  శ్ర.శ - డ -స(జీవితావసర వస్తువులు) చర్య చెయ్యాలంటే, వాళ్ళకి జీవితావసర వస్తువులు కొనుక్కోడానికి అనువైన రూపంలో, అంటే సరుకుల రూపంలో నిరంతరం తటస్థ పడాలి. అలా ఉండాలంటే, సరుకులరూపంలో ఉత్పాదితాల చలామణీ అభివృద్ధయి ఉండాలి. అలాగే ఉత్పత్తయ్యే సరుకుల పరిమాణం కూడా పెరగాలి. వేతన శ్రమతో ఉత్పత్తి సార్వత్రికమైనప్పుడు, సరుకుల ఉత్పత్తి సాధారణరూపం అవుతుంది. ఈ ఉత్పత్తి విధానం, సాధారణం అయిందంటే, సామాజిక శ్రమ విభజనని అంతకంతకూ హెచ్చు చేస్తుంది. అంటే, ఒక పెట్టుబడిదారుడు ఉత్పత్తిచేసే సరుకుల వైవిధ్యం అంతకంతకూ అధికం అవుతుంది. ఉత్పత్తిలో సంబంధంలో ఉన్న ప్రక్రియలు, స్వతంత్ర ప్రక్రియలుగా విడిపోతాయి. అందువల్ల,

డ-శ్ర.శ ఏమేరకు అభివృద్ధి చెందితే, డ-ఉ.సా కూడా అదే మేరకు అభివృద్ధి చెందుతుంది.  ప్రతి సరుకు ఉత్పత్తిదారుడూ తాను ఉత్పత్తిచెయ్యని సరుకుల్ని కొని ఉత్పత్తి ప్రక్రియలో వాడతాడు. అవన్నీ ఇతరులు స్వతంత్రంగా నిర్వహించే శాఖలలో ఉత్పత్తవుతాయి. తన సరుకుల శాఖనించి వేరుగా ఉంటాయి. తన శాఖలో వినియోగ వస్తువులుగా ప్రవేశిస్తాయి. కాబట్టి అవి కొని తీరవలసినవి. ఇతర ఉత్పత్తిదారుల ఉత్పాదితాలు సరుకులుగా ఎదురవడం ఎక్కువవుతుంది. ఏ మేరకు ఎక్కువవుతుందో, ఆమేరకు పెట్టుబడుదారుడు డబ్బుపెట్టుబడిదారుడి పాత్ర నిర్వహించవలసి వస్తుంది. అంటే, అతని పెట్టుబడి ఎక్కువ స్థాయిలో, డబ్బుపెట్టుబడిగా పనిచేయవలసివస్తుంది.

సరుకుల ఉత్పత్తి అంతా పెట్టుబడిదారీ ఉత్పత్తి అవుతుంది

మరొకవంక,  పెట్టుబడిదారీ ఉత్పత్తికి వేతన శ్రామికులు ఉండడం,  మౌలిక అవసరం. అదే సరుకు ఉత్పత్తినంతా పెట్టుబడిదారీ సరుకు ఉత్పత్తిలోకి మారుస్తుంది. ఏమేరకు పెట్టుబడిదారీ సరుకు ఉత్పత్తి అభివృద్ధి అవుతుందో, ఆమేరకు అంతకు ముందున్న అన్ని ఉత్పత్తి రూపాల్నీ అది ధ్వంసం చేస్తుంది. ఆపాత రూపాలు ముఖ్యంగా ఉత్పత్తిదారుల అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించ బడినవి. అందువల్ల, అవి తీరగా మిగిలిన ఉత్పాదితాలు మాత్రమే సరుకుల్లోకి మారేవి. పెట్టుబడిదారీ ఉత్పత్తి ముఖ్యంగా సరుకుల అమ్మకం  పైనే ఆసక్తి చూపుతుంది. మొదట, ఉత్పత్తి విధానాన్ని ప్రభావితం చేస్తున్నట్లు కనిపించకుండానే  అలాచేస్తుంది. ఉదాహరణకి, చైనా,ఇండియా, అరబ్ వంటి దేశాల పైన ప్రెపంచ పెట్టుబడిదారీ ప్రభావం అటువంటిదే. రెండో విషయం. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం వేళ్ళూనిన చోటల్లా

1.ఉత్పత్తిదారుల స్వయం ఉపాధి మీద ఆధారపడ్డ సరుకుల ఉత్పత్తినీ,

2. మిగులు ఉత్పాదితాల్ని అమ్మడం మీద  ఆధారపడ్డ సరుకుల ఉత్పత్తినీ నాశనం చేస్తుంది.

పెట్టుబడిదారీ ఉత్పత్తి, మొదట సరుకుల ఉత్పత్తిని సాధారణం చేస్తుంది. తర్వాత క్రమంగా అంచలంచెలుగా మొత్తం సరుకుల ఉత్పత్తిని పెట్టుబడిదారీ సరుకు ఉత్పత్తిలోకి మార్చివేస్తుంది.

పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ లక్షణాలు

సామాజిక ఉత్పత్తి రూపం ఏదయినప్పటికీ, శ్రామికులూ, ఉత్పత్తిసాధనాలూ ఎప్పుడూ అందులో అంశాలుగా ఉంటాయి. ఈ అంశాలు వేరుపడి ఉన్నట్లయితే, అవి స్థితిజ అంశాలు గానే ఉంటాయి. అంటే, ఉత్పత్తి జరిపే అంశాలుగా ఉండవు. ఉత్పత్తి వాస్తవంగా జరగాలంటే, అవి రెండూ జోడై తీరాలి. ఈ కలయిక జరిగే ప్రత్యేక విధానమే, సమాజ చట్రం యొక్క వివిధ శకాలను ఒకదాన్నుంచి ఇంకొకదాన్ని వేరుపరుస్తుంది. ఇప్పటి సందర్భంలో, స్వేచ్ఛాయుత శ్రామికుడు తన ఉత్పత్తిసాధనాలనుండి వేరవవడమే ఆరంభబిందువు. అవి రెండూ పెట్టుబడిదారుడి చేతుల్లో ఎలా, ఏపరిస్థితుల్లో ఏకమయ్యాయో, అంటే అతని పెట్టుబడి ఉత్పాదక రూపం పొందిందో తెలుసుకున్నాము. ఆవిధంగా ఒకచోట చేర్చబడిన అంశాలు  ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి. అందువల్ల అది పెట్టుబడి చర్య అవుతుంది. అంటే, పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ అవుతుంది. దీని స్వభావం మొదటి సంపుటంలో సంపూర్ణంగా విశ్లేషించబడింది. సరుకులు ఉత్పత్తి చేసే ప్రతి వ్యాపార సంస్థా అదేసమయంలో శ్రమశక్తిని దోపిడీ చేసే అవుతుంది. అయితేపెట్టుబడిదారీ సరుకుల ఉత్పత్తి మాత్రమే ఒక కొత్త శకాన్ని ఆరంభించే దోపిడీ విధానం అయింది.

అది చారిత్రకాభివృద్ధి క్రమంలో సామాజిక ఆర్ధిక చట్రం అంతటినీ విప్లవీకరిస్తుంది: 

1.శ్రమప్రక్రియ నిర్వహణద్వారా 

2. భారీ సాంకేతిక విస్తరణద్వారా

 వెనకటి అన్ని శకాల్నీ పొలికే  లేనంతగా అధిగమించి శిఖరస్థాయికి చేరుతుంది.  

స్థిర పెట్టుబడీ - అస్థిర పెట్టుబడీ

అడ్వాన్స్ చేసిన పెట్టుబడి విలువకు ఉత్పత్తి సాధనాలూ, శ్రమశక్తీ రూపాలు. అవి ఉత్పత్తి ప్రక్రియ జరిగేటప్పుడు, విలువనీ, అదనపువిలువనీ సృజించడంలో భిన్నమైన పాత్రలు పోషిస్తాయి. కాబట్టి అవి స్థిరపెట్టుబడిగానూ, అస్థిరపెట్టుబడిగానూ భిన్నమైనవి. మరొక విధంగా కూడా అవి భిన్నమైనవి. ఏమంటే: పెట్టుబడి దారుడి స్వాధీనంలో ఉండే, ఉత్పత్తిసాధనాలు ఉత్పత్తి ప్రక్రియ జరగనప్పుడు సైతం అతని పెట్టుబడిగానే ఉంటాయి. అయితే శ్రమశక్తి ఉత్పత్తి ప్రక్రియలో మాత్రమే పెట్టుబడిరూపం పొందుతుంది. శ్రమ శక్తి అమ్మేవాని (అంటే వేతన శ్రామికుని) చేతుల్లో సరుకు మాత్రమే. దాన్ని తాత్కాలికంగా వాడుకునేందుకు కొన్నవాని (అంటే పెట్టుబడిదారుని) చేతుల్లో మాత్రం పెట్టుబడి అవుతుంది. శ్రమశక్తి వాటిలో ఇమిడేదాక ఉత్పత్తిసాధనాలు ఉత్పాదక పెట్టుబడికి పాదార్ధిక రూపాలు గా అవవు.మానవ శ్రమశక్తి స్వభావరీత్యా పెట్టుబడి కాదు – ఉత్పత్తిసాధనాలు స్వతహాగా పెట్టుబడి కానట్లే.

ఈ విశిష్ట సామాజిక స్వభావం ఎలా వస్తుంది? చారిత్రకంగా అభివృద్ధిచెందిన నిర్దిష్ట పరిస్తితుల్లో మాత్రమే ఈ లక్షణాన్ని పొందుతుంది- అమూల్యమైన లోహాల మీద డబ్బుముద్ర పరిస్థితుల్లో పడ్డట్లే. లేక డబ్బు మీద డబ్బుపెట్టుబడి అనే ముద్ర పడినట్లే. ఉత్పాదక పెట్టుబడి, తన చర్యలు చేసేటప్పుడు, తన సొంత భాగాల్ని వినియోగించుకుంటుంది. ఎందుకంటే: వాటిని మరింత విలువైన ఉత్పాదితాల్లోకి మార్చే ఉద్దేశంతో. శ్రమశక్తి  పెట్టుబడి యొక్క పరికరాల్లో ఒకటిగా మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి, అదనపు శ్రమవల్ల ఏర్పడే అదనపువిలువ కూడా పెట్టుబడి ఫలితమే. శ్రమశక్తి యొక్క అదనపు శ్రమ పెట్టుబడి కోసం చెయ్యబడిన ఉచిత శ్రమ. విధంగా అది పెట్టుబడిదారుడికి అదనపు విలువని ఏర్పరుస్తుంది. అదనపు విలువకి అతనికి ఏమీ ఖర్చవదు. ఎందుకంటే, దీనికిగాను అతను  కార్మికునికి తిరిగి ఏమీ చెల్లించడు. కాబట్టి, ఆ ఉత్పాదితం కేవలం సరుకు మాత్రమేకాదు, అదనపువిలువని గర్భంలో పెట్టుకుని ఉన్న సరుకు. దాని విలువ ఉ.పె + అ.వి కి సమానం. సరుకు ఉత్పత్తిలో వాడిన ఉత్పాదక పెట్టుబడి విలువ + అది సృజించిన అదనపు విలువకి సమానం.

ఈ సరుకు 100 కిలోల నూలు అనుకుందాం. దాని ఉత్పత్తికి, 5000 రూపాయల ఉత్పత్తిసాధనాలూ, 2000 రూపాయల శ్రమశక్తీ పట్టాయని కూడా అనుకుందాం. వడికే ప్రక్రియలో, శ్రామికులు 5000 రూపాయల ఉత్పత్తిసాధనాల విలువని నూలుకి బదిలీ చేశారు. అదే సమయంలో వాళ్ళు తాము వ్యయించిన శ్రమశక్తితో 4000 రూపాయల కొత్త విలువని కలిపారు. కాబట్టి 100 కిలోల నూలు విలువ 9000 రూపాయలు. ఉత్పత్తిసాధనాలు 5000 + శ్రమశక్తి సృజించిన కొత్త విలువ 4000 = 9000

ఇందులోని ముఖ్యవిషయాలు క్లుప్తంగా

పెట్టుబడిదారీ ఉత్పత్తిలో పాల్గొనే అంశాలుగా ఉండే ఉత్పత్తిసాధనాలూ, శ్రమశక్తీ భిన్నమైనవి:

1. ఉత్పత్తి సాధనాలు స్థిరపెట్టుబడిగా ఉంటాయి, శ్రమశక్తి అస్థిరపెట్టుబడిగా ఉంటుంది.

2 . ఉత్పత్తి ప్రక్రియ వెలుపల కూడా ఉత్పత్తి సాధనాలు పెట్టుబడి పెట్టుబడిగానే ఉంటాయి. శ్రమశక్తి అలా ఉండదు.

భిన్నం కాని విషయాలు:

1. ఉత్పత్తి సాధనాలతో శ్రమశక్తి కలిసినప్పుడే అవి రెండూ ఉత్పాదక పెట్టుబడి అవుతాయి.

2. ఏ ఒక్కటీ స్వభావరీత్యా పెట్టుబడి కావు.

 

వచ్చే పోస్ట్:మూడో దశ సరుకు - డబ్బు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి