10, సెప్టెంబర్ 2020, గురువారం

1. మొదటి దశ- డబ్బు - సరుకు

 

  డబ్బు పెట్టుబడి వలయం

1. మొదటి దశ- బ్బు - రుకు 

పెట్టుబడి దారుడు కొత్త సరుకుని ఉత్పత్తి చెయ్యడానికి, కొంత డబ్బుని సరుకులుగా మారుస్తాడు: అవి

1. శ్రమ పదార్ధాలు 2. శ్రమ సాధనాలు. రెండూ కలిస్తే ఉత్పత్తి సాధనాలు.

ఇవి లేకుంటే కొత్త సరుకు ఉత్పత్తి సాధ్యం కాదు. కాబట్టి అతను సరుకుల మార్కెట్ కి వెళ్ళి కొంత డబ్బుతో ఉత్పత్తిసాధనాల్ని కొంటాడు.   అవి ఉన్నా కూడా, శ్రమశక్తి లేకపోయినట్లయితే, ఉత్పత్తి మొదలుకాదు. కాబట్టి అతను శ్రామిక మార్కెట్ కి వెళ్ళి, మరి కొంత డబ్బుతో శ్రమశక్తిని కొంటాడు.

శ్రమశక్తిని శ్ర.  అనీ, ఉత్పత్తి సాధనాల్ని ఉ.సా  అనీ, కొనాల్సిన సరుకుల మొత్తాన్ని స  అనీ అందాం. ఇప్పుడు 

శ్ర. ఉ.సా 

శ్రమశక్తీఉత్పత్తి సాధనాలూ

ఇక్కడ డబ్బు రెండు భాగాలుగా విడివడుతుంది. ఒక భాగం శ్రమశక్తిని కొనడానికి. మరొక భాగం ఉత్పత్తి సాధనాల్ని కొనడానికి. వీటి మార్కెట్లు వేరు వేరుగా ఉంటాయి. ఒకటి సరుకుల మార్కెట్. రెండోది శ్రామిక మార్కెట్. శ్రమశక్తీ సరుకే, ఉత్పత్తిసాధనాలూ సరుకులే. అయితే శ్రమశక్తి అన్ని ఇతర సరుకులకంటే భిన్నమైనది. కారణం విలువని ఉత్పత్తిచేసే సరుకు ఇదొక్కటే. మరే ఇతర సరుకూ విలువని సృజించలేదు. కాబట్టి శ్రమశక్తీ, ఉత్పత్తిసాధనలూ గుణాత్మకంగా భిన్నమైనవి. ఈ సరుకుల గుణాత్మక విభజన పక్కనే, వాటి పరిమాణాత్మక  సంబంధం కూడా ఉంటుంది.

పరిమాణాత్మక  సంబంధం

శ్రామికునికి శ్రమశక్తి విలువ వేతన రూపంలో ముడుతుంది. ఇన్నిగంటల శ్రమకి ఇంత వేతనం అని. ఒప్పందంలో ఉన్న శ్రమమొత్తంలో అదనపుశ్రమ కూడా కలిసి ఉంటుంది. ఉదాహరణకి రోజు శ్రమశక్తి విలువ రూ. 400 అనుకుందాం. ఈ వేతనం ఒప్పందం ప్రకారం 10 గంటల శ్రమ ధర. అయితే ఆ మొత్తం వేతనాన్ని ఉత్పత్తిచెయ్యడానికి 5 గంటల శ్రమ చాలు. అంటే, వేతనం  5 గంటల శ్రమ ఉత్పాదితానికి సమానం. మిగిలిన 5 గంటలు చేసే శ్రమ అదనపు శ్రమ. అటువంటి ఒప్పందం 50 మంది పనివాళ్ళతో జరిగితే, వాళ్ళంతా కలిసి రోజులో 500 గంటలు శ్రమ చేస్తారు. అందులో సగం అంటే 250 గంటలు అదనపు శ్రమ. కొనాల్సిన ఉత్పత్తిసాధనాలు ఈ మొత్తం శ్రమని వినియోగించుకోవడానికి అవసరమైనంత పరిమాణంలో ఉండాలి. 250 పనిగంటలకే కాక, 500 గంటలకు సరిపోయేటన్ని ఉత్పత్తిసాధనాల్ని కొనాల్సి ఉంటుంది.

కాబట్టి డ-స, గుణాత్మక సంబంధాన్నే, కాక పరిమాణాత్మక సంబంధాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. పరిమాణాత్మక సంబంధం మొదట్లోనే నిర్ణయమవుతుంది - కార్మికులు చెయ్యాల్సిన అదనపు శ్రమ పరిమాణం దీన్ని నిర్ణయిస్తుంది.  

ఉదాహరణకి ఒక నూలుమిల్లులో 50 మంది కార్మికులున్నారు. వాళ్ళ మొత్తం వారం వేతనం రు. 25,000. వీళ్ళ 3000 గంటల వారం శ్రమ  నూలులోకి మారాలంటే రు.3,00,000  ఉత్పత్తి సాధనాలకు ఖర్చు చెయ్యాలి. ఆ 3000 గంటల్లో 1500 గంటలు అదనపు శ్రమ. అదనపు శ్రమ పెరిగితే ఉత్పత్తిసాధనాలకయ్యే డబ్బు భాగం పెరుగుతుంది. అదనపుశ్రమ 500 గంటలు పెరిగి 2000 గంటలయితే, 500 గంటలకు సరిపడా అంటే ఉత్పత్తిసాధనాల ఖర్చు 50,000 పెరుగుతుంది. కాబట్టి అదనపు శ్రమ ఎంత అనేదే, పరిమాణాత్మక సంబంధాన్ని నిర్ణయిస్తుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తికి, పరిమాణాత్మక సంబంధమే అత్యంత లాక్షణికమైనది.

శ్రమ పరిమాణానికి, ఉత్పత్తిసాధనాల పరిమాణం సరిగ్గా సరిపోవాలి. అవి ఏమేరకు  తగ్గితే, అదనపు శ్రమ ఆ మేరకు వృధా అవుతుంది. దాన్ని వినియోగించుకునే పెట్టుబడిదారుడి హక్కు వ్యర్ధం అవుతుంది. ఉత్పత్తిసాధనాల పరిమాణం ఎక్కువగా ఉంటే,  శ్రమ సరిపోదు. అవి కొత్త సరుకులుగా మారవు. ఉత్పత్తిలో చేరవు. వృధాగా పడుంటాయి.

ఉత్పాదక పెట్టుబడి 

డ-స చర్య పూర్తయ్యే సరికి, ఉత్పత్తిలో పెట్టే అంశాల విలువని మించిన విలువగల వస్తువుల్ని తయారు చేయగల అంశాలు అతని స్వాధీనంలో ఉంటాయి. అవి అదనపు విలువతో కూడి ఉన్నవి. అతను డబ్బు రూపంలో అడ్వాన్స్ పెట్టిన విలువ ఇప్పుడు అదనపువిలువని పుట్టించే అవతారం ఎత్తింది - సరుకుల రూపంలోనే. క్లుప్తంగా,  ఇక్కడ విలువ ఉత్పాదక పెట్టుబడి  రూపంలో ఉంది. అంటే, విలువనీ అదనపు విలువనీ సృజించే అంశం ఉన్న ఉత్పాదక పెట్టుబడి రూపం. ఈ రూపంలో ఉన్న పెట్టుబడిని ఉ.పె  అందాం.

ఇప్పుడు ఉ.పె  విలువ,  శ్ర.శ + ఉ.సా  విలువకు సమానం. శ్రమశక్తికీ, ఉత్పత్తి సాధనాలకీ మారకం అయిన డబ్బు విలువకు  సమానం. ఉ.పె   ఎంత విలువో, డబ్బు  అంతే విలువ. తేడా అల్లా అది ఉండే రూపంలోనే. అది డబ్బు రూపంలో ఉండే పెట్టుబడి విలువ  - డబ్బు పెట్టుబడి.

డ-స లేక దాని సాధారణ రూపమైన డ-స –( శ్ర.+ఉ.సా) కొనుగోళ్ళ మొత్తం, సాధారణ సరుకుల చలామణీ చర్య అనేది - పెట్టుబడి స్వతంత్ర వలయంలో ఒక దశ. అదే సమయంలో పెట్టుబడి విలువ, డబ్బు రూపం నించి ఉత్పాదక రూపానికి పరివర్తన చెందడం. ఇంకా క్లుప్తంగా: డబ్బు పెట్టుబడి ఉత్పాదక పెట్టుబడిలోకి పరివర్తన చెందడం.

డబ్బు పెట్టుబడి చేసే పనులు

పెట్టుబడి మొదట డబ్బు పెట్టుబడి రూపంలో వస్తుంది. ఆ రూపంలో అది డబ్బు చేసే పనులు చేస్తుంది:

1.  సార్వత్రిక కొనుగోలు సాధనంగా పనిచేస్తుంది. అంటే, ఏ సరుకుతోనైనా మారకం అవుతుంది.

2. సార్వత్రిక చెల్లింపు సాధనంగా పనిచేస్తుంది. శ్రమశక్తి కొనబడినప్పటికీ, వినియోగమయ్యేదాకా చెల్లించబడదు. మార్కెట్లో సరుకు రెడీగా లేనప్పుడు, ఆర్డర్ పెట్టాల్సివస్తే, డబ్బు చెల్లింపుసాధనంగా పనిచేస్తుంది. ఈ శక్తి వచ్చింది డబ్బు పెట్టుబడి పెట్టుబడి అయినందువల్ల కాదు. అది డబ్బు అయినందువల్ల. మరొకవైపు డబ్బురూపంలో పెట్టుబడి విలువ, డబ్బు చేసే చర్యలు మాత్రమే చేస్తుంది తప్ప మరే ఇతర విధులూ నెరవేర్చజాలదు.

మరైతే, డబ్బు చర్యల్ని పెట్టుబడి చర్యలుగా చేసేది ఏమిటి?

పెట్టుబడి చలనంలో ఆచర్యలు పోషించే నిర్దిష్ట పాత్ర; ఆకారణంగా ఈ చర్యలు జరిగేదశకి,పెట్టుబడి వలయపు ఇతర దశలతో ఉండే పరస్పర సంబంధం కూడా. ఉదాహరణగా ప్రస్తుత విషయాన్నే తీసుకుందాం. ఇక్కడ డబ్బు సరుకుల్లోకి మార్చబడింది. ఆ సరుకులన్నీ కలిసి ఉత్పాదకపెట్టుబడి యొక్క భౌతిక రూపానికి ప్రాతినిధ్యం వహిస్తాయి.ఈ భౌతిక రూపం ఆ సరికే పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ ఫలితాన్ని గుప్తంగా, అంతర్గతంగా ఇముడ్చుకొని ఉంటుంది.

డబ్బు పెట్టుబడి చలామణీ

డబ్బు పెట్టుబడిగా వ్యవహరించే డబ్బులో ఒక భాగం చేసే చర్యలో, పెట్టుబడిదారీ స్వభావాన్ని పోగొట్టుకుంటుంది. కాని దాని డబ్బు స్వభావాన్ని నిలబెట్టుకుంటుంది. డబ్బు పెట్టుబడి చలామణీ రెండుగా విడిపోతుంది:

1. ఉత్పత్తిసాధనాల కొనుగోలు - ఉ.సా 

2. శ్రమశక్తి కొనుగోలు - - శ్ర. 

రెండో ప్రక్రియని దానికదిగా పరిశీలిద్దాం.

శ్రమశక్తి కొనుగోలు

 డ శ్ర., శ్రమశక్తిని పెట్టుబడిదారుడు కొనడం. అది శ్రమశక్తి ఓనర్ అయిన కార్మికుడు తన శ్రమ శక్తిని అమ్మడం కూడా. ఇక్కడ మనం శ్రమ అనవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం వేతన రూపాన్ని తీసుకున్నాం కనుక. కొన్న పెట్టుబడి దారుడికి -శ్ర.శ. శ్రమశక్తి కొనుగోలు. అదే చర్య అమ్మిన కార్మికుడికి శ్ర.శ-. శ్రమశక్తి అమ్మకం. కార్మికునికి సంబంధించి, తన శ్రమశక్తి అమ్మకం తన సరుకు చలమణీ యొక్క మొదటి దశ లేక మొదటి పరివర్తన. అమ్మిన కార్మికునికి తన సరుకు డబ్బురూపం లోకి మారింది. ఆవిధంగా పొందిన డబ్బుని అతను క్రమంగా తన అవసరాలకోసం, వాడుకునే వస్తువులు కొనడం కోసం ఖర్చు పెట్టుకుంటాడు. అందువల్ల, అతని సరుకు పూర్తి చలామణీ ఇలా కనబడుతుంది: శ్ర.శ-డ-. అంటే మొదటిది శ్ర.శ- (=-) గానూ, రెండోది  -  గానూ అగపడుతుంది. అందువల్ల,  ఇది సరుకుల సరళ చలామణీ యొక్క సాధారణ రూపం -డ-. ఈ సందర్భంలో డబ్బు తాత్కాలిక చలామణీ సాధనం, కేవలం సరుకులు ఒకదానితో మరొకటి  మారకమయ్యేందుకు మధ్యవర్తి మాత్రమే.

ఉత్పాదక పెట్టుబడి గురించీ, డబ్బు పెట్టుబడి గురించీ చర్చించాక మార్క్స్ డబ్బు పెట్టుబడి ఉత్పాదక పెట్టుబడిగా పరివర్తన చెందడం గురించి చెబుతాడు.

 డబ్బు పెట్టుబడి ఉత్పాదక పెట్టుబడిగా పరివర్తన చెందడం

విలువ పెరగడానికి సంబంధించిన మేరకు, డ-శ్ర.శ  ప్రధాన చర్య; డ-ఉ.సా దానికి అనుబంధ చర్య.

డబ్బు పెట్టుబడి ఉత్పాదక పెట్టుబడిగా పరివర్తన చెందడానికి డబ్బు - శ్రమశక్తి చర్య లాక్షణికమయినది. ఎందు కంటే, డబ్బు రూపంలో అడ్వాన్స్  చెయ్యబడిన విలువ పెట్టుబడిలోకి, అదనపువిలువని ఉత్పత్తిచేసే విలువలోకి వాస్తవంగా మారడానికి, ఆ చర్య అనివార్య షరతు.

డబ్బు - ఉత్పత్తిసాధనాలు చర్య మొదటి చర్యలో (డ-శ్ర.శ) కొన్న శ్రమ మొత్తాన్ని వినియోగించుకోడానికి అవసరం. ఈ విషయాన్ని మొదటి సంపుటి, 2 వ భాగంలో 'డబ్బు పెట్టుబడి అవడం' అనే శీర్షిక కింద ఈ కోణాన్నించి  చర్చించాము.

ఇప్పుడు అదే విషయాన్ని మరొక కోణం నించి పరిశీలించాల్సి ఉంది. పెట్టుబడి తన్నుతాను వ్యక్తంచేసుకునే రూపం అయిన డబ్బు రూపానికి సంబంధించిన కోణాన్నించి చూడాలి.

శ్రమశక్తి కొనుగోలు ఒప్పందంలో ఒక షరతు

డబ్బు పెట్టుబడిలోకి రూపాంతరం చెందడానికి డ- స చర్య లాక్షణికమైనది అని గ్రహించాం. అది పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి లక్షణం గా పరిగణించబడుతూ ఉంది. కాని దానికి చెప్పే కారణాలు తప్పు. మార్క్స్ మొదట కరెక్టయిన కారణాలేవో చెబుతాడు.

శ్రమశక్తి కొనుగోలుకు సంబంధించి ఒక ఒప్పందం ఉంటుంది.

సాధారణంగా డ-శ్ర  పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి లక్షణంగా పరిగణించబడుతుంది. అందుకు కారణం పైన చెప్పింది కాదు - శ్రమశక్తి కొనుగోలు ఒప్పందంలో ఒక షరతు ఉంటుంది. శ్రమశక్తి ధరని, అంటే వేతనాన్ని భర్తీ చెయ్యడానికి సరిపోయే శ్రమకన్నా, ఎక్కువ శ్రమ చెయ్యాలన్నదే ఆ షరతు. అయితే, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి డ-శ్ర. ని లక్షణంగా పరిగణించడానికి కారణం ఒప్పందంలో ఉండే ఆ షరతు కాదు. ఎందుకంటే ,అదనపు శ్రమని అర్పించడం అనేది మదుపు పెట్టిన విలువ పెట్టుబడి అవడానికి మౌలిక షరతు.

మరేది?

అందుకు భిన్నంగా, అది అలా పరిగణించబడడానికి కారణం దాని రూపం. ఎందుకంటే, వేతన రూపంలో డబ్బు శ్రమని కొంటుంది గనక. ఈ విషయం డబ్బు వ్యవస్థకి లాక్షణిక చిహ్నంగా తీసుకోబడుతుంది.

విశిష్ట లక్షణంగా తీసుకోబడుతున్నది, ఆ రూపం యొక్క అసంబద్ధత కాదు. అందుకు భిన్నంగా, ఆ అసంబద్ధతని అసలు పట్టించుకోవడం లేదు. అసలీ అసంబద్ధత ఎక్కడ ఉంది? విలువని సృజించే అంశం అయిన శ్రమ దానికదిగా విలువని కలిగి ఉండదు అనే వాస్తవంలో ఉంది. అందువల్ల ఒక నిర్దిష్ట పరిమాణంలో ఉన్న శ్రమ ఏ విలువనూ కలిగి ఉండదు; ఆ విలువ వ్యక్తమయ్యే ధర దానికి ఉండదు. డబ్బులో దానికి సమానకమైన నిర్దిష్ట పరిమాణం అంటూ ఉండదు. వేతనాలు ఒక ప్రచ్చన్న రూపం అని మనకు తెలుసు. ఆ రూపంలో ఒక రోజు శ్రమశక్తి ధర, ఒక రోజులో ఆ శ్రమశక్తి సమర్పించే శ్రమ ధరగా కనబడుతుంది. ఆ విధంగా ఆ శ్రమశక్తి 6 గంటల శ్రమలో ఉత్పత్తి చేసిన విలువ, 12 గంటల శ్రమశక్తి చర్య విలువగా, అంటే శ్రమ విలువగా వ్యక్తీకరించబడుతుంది.

డ-స చర్య డబ్బు వ్యవస్థ అనబడే దానికి విశిష్ట లక్షణంగా, దాని ప్రధాన చిహ్నంగా పరిగణించబడుతున్నది. ఎందువల్లనంటే: అక్కడ శ్రమ దాని సొంతదారుని సరుకుగానూ, డబ్బు దాన్ని కొనేదిగానూ అగపడుతుంది- వేరే మాటల్లో, డబ్బు సంబంధం మూలంగా(అంటే మానవ చర్య కొనుగోలు అమ్మకం మూలంగా) అన్నమాట.

అయితే అప్పటికి చాలా కాలం ముందే, డబ్బు  డబ్బు పెట్టుబడిగా పరివర్తన చెందకుండానే, ఆర్థిక వ్యవస్థ సాధారణ స్వభావంలో ఏ మార్పూ లేకుండానే, డబ్బు సేవలకొనుగోలుదారుగా వచ్చింది.

డబ్బు ఏ రకం సరుకుల్లోకి మారిందనే దానితో, డబ్బుకి సంబంధం ఉండదు. అది అన్నిసరుకులకీ సార్వత్రిక సమానకం. ఆ సరుకులు ఆసరికే తమ ధరల ద్వారా ఈ విషయాల్ని తెలుపుతాయి:

1. అవి కొంత డబ్బుకి భావాత్మకంగా ప్రాతినిధ్యం వహిస్తాయి;

2. అవి డబ్బులోకి మారాలని ఆశిస్తాయి; 

3. డబ్బుతో వాటి చోటు మారే వరకూ వాటి ఓనర్లకి ఉపయోగపువిలువలుగా మారే రూపం పొందవు.

మొదట శ్రమశక్తి తన ఓనర్ సరుకుగా మార్కెట్లో దిగి, దాని అమ్మకం శ్రమకి చెల్లింపు అనే రూపం - వేతన రూపం - తీసుకుందంటే, దాని కొనుగోలూ, అమ్మకమూ ఏ ఇతర సరుకు కొనుగోలూ అమ్మకమూ వంటిదే. అందులో ఆశ్చర్య పోవాల్సింది ఏదీ లేదు. ఇక్కడ విశేష విషయం: శ్రమశక్తి అనే సరుకు కొనదగినదిగా ఉండడం కాదు, శ్రమ శక్తి సరుకు అవడం.

డబ్బు పెట్టుబడిని ఉత్పాదక పెట్టుబడిలోకి మార్చడం.  డ-స(శ్ర.+.సా) చర్య ద్వారా పెట్టుబడిదారుడు ఉత్పత్తికి సంబంధించిన భౌతికాంశాలనూ, మానవ అంశాలనూ కలుపుతాడు. తొలిసారి డబ్బు ఉత్పాదక పెట్టుబడిలోకి మార్చడానికి అతను మొదట ఉత్పత్తి సాధనాల్ని - భవనాలూ, యంత్రాలూ మొదలైనవాటిని- కొనాలి.  శ్రమశక్తిని జోడించాలంటే ముందుగా అతనికి ఉత్పత్తిసాధనాలు ఉండాలి. ఎందుకంటే, తను చెప్పినట్లు శ్రమశక్తి వ్యవహరించాలంటే, శ్రమశక్తిని జోడించడానికి ఉత్పత్తిసాధనాలు అతనిదగ్గర ఉండి తీరాలి.

 పెట్టుబడి దారుడు  విషయాన్ని చెప్పడం అలా ఉంటుంది.

కార్మికుని వైపునించి: తన శ్రమశక్తిని అమ్మి, ఉత్పత్తి సాధనాలతో దాన్ని కలిపితేనే గాని, అతని శ్రమశక్తి ఉత్పాదకంగా వినియోగం కాదు. అందువల్ల, అమ్మకముందు శ్రమశక్తి ఉనికిలో ఉంటుంది కాని, ఉత్పత్తిసాధనాలనుండి విడిగా ఉంటుంది. అలా విడిగా ఉన్నప్పుడు శ్రమశక్తి సొంతదారునికి ఉపయోగపు విలువల ఉత్పత్తికి ఉపయోగపడదు, అతను అమ్మి  బతకగలిగే సరుకుల ఉత్పత్తిలోనూ వినియోగమవదు. అయితే శ్రమశక్తి అమ్ముడయిన ఫలితంగా, అది ఉత్పత్తిసాధనాలతో కలిసిన క్షణం నించీ, కొన్నవాని ఉత్పాదక పెట్టుబడిలో భాగం అవుతుంది - ఉత్పత్తి సాధనాలలాగే.

 ఈ విషయాలు ప్రతిబింబిస్తున్న సామాజిక సంబంధాలు

డ-స చర్యలో డబ్బు ఓనరు కొనేవాడుగానూ, శ్రమశక్తి ఓనరు అమ్మేవాడుగానూ సంబంధంలోకొస్తారు. ఈ సందర్భంలో వాళ్ళు కేవలం డబ్బు సంబంధంలోకి మాత్రమే ప్రవేశిస్తారు. అయినాగాని, కొనేవాడు మొదటినించీ ఉత్పత్తిసాధనాల ఓనర్ హోదాలో కనబడతాడు. ఆ ఉత్పత్తిసాధనాలే శ్రమశక్తి ఓనర్, తన శ్రమశక్తిని ఉత్పత్తిలో వ్యయం చెయ్యడానికి భౌతిక పరిస్థితులు. అయితే అవి మరొకరి ఆస్తిగా, శ్రమశక్తి ఓనర్ కి ఎదురుగా ఉంటాయి.

వేరొకవైపు, శ్రమని అమ్మినవాడు, ఆ శ్రమని కొన్నవాని దైన, అంటే మరొకరి శ్రమశక్తిగా ఎదుర్కుంటాడు - ఈ మరొకరి శ్రమశక్తి వాస్తవంగా ఉత్పాదక పెట్టుబడి అవడానికి,  కొన్నవాడి అదుపాజ్ఞలలో ఉండేట్లు మలచబడాలి. అతని పెట్టుబడిలో ఐక్యం చెయ్యబడాలి. కొనేవాడూ, అమ్మేవాడూ ఇక్కడ ఎదురెదురుగా ఉంటారు. ఇక్కడే పెట్టుబడిదారుడికీ, వేతన శ్రామికుడికీ మధ్య వర్గసంబంధం ఉంటుంది. ఈ సంబంధం వీళ్ళిరువురూ  ఒకరికెదురుగా మరొకరు  నిలబడ్డ క్షణం నించే ఉనికిలో ఉంటుంది అనుకోవాలి. ఈ చర్య కొన్నవాడి వైపునించి డ-శ్ర.శ, అమ్మినవాని వైపునించి శ్ర.శ-డ. అది ఒక అమ్మకమూ, ఒక కొనుగోలూ - డబ్బు సంబంధం. అయితే ఆ అమ్మకం, కొనుగోలులో  కొన్నవాడు పెట్టుబడిదారుడుగానూ, అమ్మినవాడు వేతన కార్మికుడుగానూ ఉండే సంబంధం అది.

ఈ సంబంధం ఎలా ఉత్పన్నం అవుతుంది?

శ్రమశక్తి చర్య చెయ్యడానికి అవసరమైన పరిస్థితులు - జీవనాధార సాధనాలూ, ఉత్పత్తిసాధనాలూ - శ్రమశక్తి ఓనర్ నించి వేరుపడి ఉండడం వల్ల. అవి వేరొకరి అంటే కొన్నవారి ఆస్తి అయి ఉండడం వల్ల.

కాబట్టి కొనే వానిగా - అమ్మేవానిగా వాళ్ళ సంబంధానికి పెట్టుబడిదారుడు - కార్మికుడు అనే సంబంధం ముందుగా అవసరం. చలామణీ రంగంలో, మార్కెట్లో   ఎదురుపడేది కేవలం కొనేవాడూ అమ్మేవాడూ మాత్రమే కాదు, పెట్టుబడి దారుడు కొనేవాడుగానూ,  కార్మికుడు అమ్మేవాడుగానూ  ఒకరికొకరు ఎదురుపడతారు.  ఈ వేర్పాటుకి మూలం ఏమిటి అనే దాంతో  ఇక్కడ మనకి ప్రమేయం లేదు. సరుకు-శ్రమశక్తి చర్య జరిగిందంటేనే, ఈ వేర్పాటు అప్పటికే ఉనికిలో ఉన్నట్లు. ఇక్కడ ముఖ్యవిషయం ఏమంటే: డ-శ్ర డబ్బు పెట్టుబడి చర్యగా కనబడుతుందంటే, అది  డబ్బు ప్రయోజనమున్న మనిషి పనికి / సేవకి చెల్లింపు సాధనంగా కాదు; అంటే, చెల్లింపు సాధనంగా డబ్బు చర్య వల్ల కానేకాదు.

 మరైతే, డబ్బు ఈ విధంగా ఖర్చు చెయ్యడం ఎందువల్ల సాధ్యమవుతుంది?

ఎందువల్లనంటే:

1.శ్రమశక్తి ఉత్పత్తిసాధనాల నుంచి వేరుపడిపోయి ఉండడం వల్ల, శ్రమశక్తిని ఉత్పత్తిచేసే జీవనాధార సాధనాల నుంచి సైతం వేరుపడిపోయి ఉండడం వల్ల.

2. ఈ వేర్పాటు పోవాలంటే, ఉత్పత్తి సాధనాల ఓనర్ కి శ్రమశక్తి అమ్ముడు పోవడం, తప్ప మరో మార్గం లేకపోవడం

3. శ్రమశక్తి చర్య కొనేవాడికి కూడా అవసరం కావడం. కారణం  శ్రమశక్తి చర్య దాని సొంత ధరను పునరుత్పత్తి చెయ్యడానికి అవసరమైన పరిమాణానికి పరిమితమై ఉండకపోవడం. ఈ అదనం మీద అతనికి ఆసక్తి ఉండడం.

ఉత్పత్తి ప్రక్రియలో పెట్టుబడి సంబంధం చలామణీ చర్యలో వాళ్ళ వర్గసంబంధంలో, వాళ్ళిద్దరూ ఆమ్మేవాడుగా కొనేవాడుగా ఎదురుపడే భిన్నమైన మౌలిక ఆర్ధిక పరిస్థితుల్లో స్వాభావికంగా  ఉంటుంది. ఈ సంబంధాన్ని ఏర్పాటు చేసేది, దాని స్వభావరీత్యా డబ్బు కాదు; ఈ సంబంధం ఉండడమే కేవల డబ్బు చర్యని పెట్టుబడి చర్యలోకి మారడానికి అనుమతిస్తుంది.

పొరపాటు సిద్ధాంతాలు

డబ్బు పెట్టుబడి గురించి వాడుకలో 2 పొరపాటు సిద్ధాంతాలు నడుస్తున్నాయి. అవి రెండూ ఒకదానికొకటి సంబంధంలో ఉన్నవే. వాటిని మార్క్స్ ఎత్తి చూపుతాడు, విమర్శిస్తాడు.

మొదటిది: డబ్బుపెట్టుబడి హోదాలో, పెట్టుబడి విలువ  చేసే చర్యలు దాని డబ్బు రూపం వల్లనే చెయ్యగలుగుతాయి. అయితే ఆచర్యలు దాని పెట్టుబడి స్వభావం నుంచి రాబడతారు. ఇది తప్పు. ఆచర్యలు పెట్టుబడి విలువ యొక్క డబ్బు రూపం నుండి, డబ్బుగా దాని అగపడే రూపం నుండి మాత్రమే వస్తాయి.

రెండవది: దానికి భిన్నంగా, డబ్బు చర్య యొక్క ప్రత్యేక సారం అదేసమయంలో పెట్టుబడి చర్యని చేస్తుంది. అయితే ఆసారానికి మూలం డబ్బు స్వభావం అనుకుంటారు. ఇక్కడ డబ్బుని, పెట్టుబడితో గందరగోళ పరుస్తారు. డబ్బు విధి అదేసమయంలో పెట్టుబడి విధిగా చేస్తుంది. అలా చేసే డబ్బు విధి యొక్క నిర్దిష్ట సారాన్ని డబ్బు స్వభావం వల్ల అనుకుంటారు. ఇక్కడ డబ్బుని పెట్టుబడితో గందరగోళ పరుస్తున్నారు. అసలు విషయం ఏమంటే, ఈ విధి కొన్ని సామాజిక పరిస్థితుల్ని ముందుగా ఉన్నట్లు భావిస్తుంది. ఆపరిస్థితులు ఎలాంటివంటే:డ-శ్ర చర్య సూచించే పరిస్థితులవంటివి. ఆపరిస్థితులు కేవల సరుకుల చలామణీలోనూ, దానికి అనుగుణమైన డబ్బు చలామణీలోనూ ఉండనే ఉండవు.

ఉదాహరణ

బానిసల్ని అమ్మడం కొనడం కూడా సరుకుల్ని అమ్మడమూ, కొనడమే. అయితే బానిస వ్యవస్థ లేనిదే, డబ్బు బానిసల్ని కొజాలదు. మరొకవైపు, కేవలం డబ్బు ఉన్నంతమాత్రాన్నేబానిస వ్యవస్థ ఏర్పడదు.  గందరగోళం లేకుండా ఉండడానికి ఇదొక ఉదాహరణ: డబ్బు బానిసల్ని కొంటుంది, కాని డబ్బు బానిసల్ని కొనాలంటే ముందుగా బానిసవ్యవస్థ స్థిరపడి ఉండాలి.

సొంత శ్రమశక్తి అమ్మకం (సొంత శ్రమ అమ్మకం రూపంలో/ వేతన రూపంలో) ఏదో అడపాదడపా జరిగే విషయంగా కాక, సరుకుల ఉత్పత్తికి సామాజికంగా నిర్ణయాత్మకమైన ముందు షరతు అయినప్పుడు, డబ్బు పెట్టుబడి సామాజిక స్థాయిలో డ-స ( శ్ర.శ +ఉ.సా) చర్య చెయ్యవలసి వస్తుంది. ఈవాస్తవం అర్ధం: శ్రమశక్తితో ఉత్పత్తిసాధనాలకున్న వెనకటి  సంబంధాన్ని  తెంచివేసే, చారిత్రక ప్రక్రియలు జరిగిపోయాయి. ఆప్రక్రియల ఫలితం: శ్రామిక ప్రజలు ఉత్పత్తిసాధనాలు లేనివాళ్ళు అయ్యారు. అందువల్ల  శ్రామికులు కానివాళ్ళతో, ఉత్పత్తిసాధనాల ఓనర్లతో ముఖాముఖిగా నిలిచారు. వెనకటి సంబంధం, అది రద్దవక ముందు ఉన్న రూపం ఏదైనా మనకు అవసరం లేదు. శ్రామికుడు ఇతర ఉత్పత్తి సాధనాలతో పాటు తానూ ఒక ఉత్పత్తి సాధనం అయిన రూపం అయినా; అతను ఆ ఉత్పత్తిసాధనాల ఓనర్ అయిన రూపం అయినా. అది మనకి అనవసరం. 

 విధంగా  డ-స ( శ్ర.శ +ఉ.సా) వెనక ఉన్నది పంపిణీ. ఇది మామూలు అర్ధంలో పంపిణీ కాదు. అంటే వినియోగ వస్తువుల పంపిణీ కాదు. ఉత్పత్తి అంశాల పంపిణీ-  సాంద్రీకృతమైన భౌతిక అంశాలు ఒకవైపు, వాటినుంచి వేరుపడి ఏకాకియైన శ్రమశక్తి మరొకవైపు. ఉత్పాదక పెట్టుబడిలో  భౌతిక భాగం అయిన ఉత్పత్తిసాధనాలు,డ-శ్ర.శ చర్య సమాజం అంతటా సర్వసాధారణం కాక మునుపే కార్మికుడిని పెట్టుబడిగా ఎదుర్కోవాలి. పెట్టుబడిదారీ ఉత్పత్తి ఒకసారి స్థిరపడిందంటే, అది అభివృద్ధి చెందే కొద్దీ ఈ వేర్పాటుని పునరుత్పత్తి చేస్తుంది. అంతే కాదు అంతకంతకూ ఎక్కువ స్థాయిలో విస్తరింపచేస్తుంది కూడా - అది సాధారణంగా ప్రబలమయిన సామాజిక పరిస్థితి అయ్యేదాకా. అయితే  ఈ సమస్యకి మరొక పార్శ్వమూ  ఉంది. పెట్టుబడి ఏర్పడి, ఉత్పత్తిని అధీనంలోకి తెచ్చుకోవడానికి, వర్తకం ఒక నిర్దిష్ట స్థాయికి అభివృద్ధయి ఉండాలి. కాబట్టి ఇది సరుకుల చలామణీకి కూడా వర్తిస్తుంది, అందువల్ల సరుకుల ఉత్పత్తికి వర్తిస్తుంది; ఎందుకంటే, అమ్మకం కోసం సరుకులుగా ఉత్పత్తి చెయ్యబడకపోతే, ఏ వస్తువులూ సరుకుల చలామణీలో ప్రవేశించవు. అయితే, పెట్టుబడిదారీ ఉత్పత్తి దానికి పునాది అయితేనేగాని, సరుకుల ఉత్పత్తి సార్వత్రిక ఉత్పత్తి కాజాలదు.

 చారిత్రకంగా రెండు విషయాలు:

1. ఉత్పత్తి సాధనాల నించి సజీవ శ్రమశక్తి వేరుపడడం, అంతకంతకూ భారీ స్థాయిలో జరగడం.

2. సరుకుల చలామణీ, దానివల్ల సరుకుల ఉత్పత్తీ పెట్టుబడిదారీ విధానానికి ముందే ఒక మేరకు అభివృద్ధి చెంది ఉండడం, సరుకుల ఉత్పత్తి  పెట్టుబడిదారీ విధానం పునాది మీదే ప్రబలరూపంగా అవడం.

ఈ వాదనలకు ఉదాహరణగా రష్యా భూయజమానుల్ని గురించి చెబుతాడు మార్క్స్.

రైతుల విముక్తి అనబడే దాని అనంతరం, భూస్వాములు ఇప్పుడు అర్ధబానిసలతో కాకుండా, వేతన కార్మికులతో సేద్యం చేస్తున్నారు. వాళ్ళిప్పుడు రెండు కొరవల గురించి  ఫిర్యాదులు చెస్తున్నారు:

1.డబ్బు పెట్టుబడి కొరత. పంట అమ్మక ముందే, శ్రామికులకి గణనీయమైన మొత్తంలో వేతనం   చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు కావలసిన డబ్బు సరఫరా రెడీగా లేదు. కొరత ఉంది. పెట్టుబడిదారీ పునాది మీద ఉత్పత్తి నిర్వహించాలంటే, వేతనాలు చెల్లించడానికి పెట్టుబడి డబ్బురూపంలో నిరంతరం అందుబాటులో ఉండాలి.

అయితే భూస్వాములు వర్రీ కానక్కరలేదు. వేచి ఉండే వారికి, అంతా సమకూరుతుంది. కాలక్రమంలో, తగిన సమయంలో పారిశ్రామిక పెట్టుబడిదారుడికి అతని సొంత డబ్బే కాక ఇతరుల డబ్బు కూడా అందుబాటులోకి వస్తుంది.

2. శ్రామికుల కొరత. ఇది మరీ ముఖ్యమైన ఫిర్యాదు: డబ్బు ఉన్నప్పటికీ, తగినంతమంది శ్రామికుల దొరకడం లేదు. దీనికి కారణం ఏమంటే: గ్రామ కమ్యూనిటీలో ఉమ్మడి యాజమాన్యం ఉన్నందువల్ల, రష్యా వ్యవసాయ శ్రామికుడు ఉత్పత్తిసాధనాలనుంచి పూర్తిగా వేరుపడి పోలేదు. అందువల్ల అతను పూర్తి అర్ధంలో స్వతంత్ర వేతన కార్మికుడు కాడు. అయితే అటువంటి స్వతంత్ర వేతనకార్మికులు  సామాజిక స్థాయిలో (సమాజం అంతటా) ఉండడం డ-స చర్యకి, డబ్బు సరుకుల్లోకి మారే చర్యకి తప్పనిసరి షరతు. ఇది నెరవేరనిదే డ-స చర్య, డబ్బు పెట్టుబడి ఉత్పాదక పెట్టుబడిగా మారే రూపం తీసుకోదు. కాబట్టి డబ్బు పెట్టుబడి వలయం యొక్క  ఫార్ములా : డ - స....ఉ.పె ....స' -   అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ ఫార్ములా అప్పటికే బాగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ ఉత్పత్తి పునాదిమీద మాత్రమే ననేది స్వయం స్పష్టమే. ఎందువల్లంటే, అది సమాజం అంతటా వేతన కార్మికులు సరిపోయే సంఖ్యలో అందుబాటులో ఉన్నట్లు ముందుగా ఊహిస్తుంది. మనం ఇంతకు ముందే చూసినట్లు, పెట్టుబడిదారీ ఉత్పత్తి సరుకుల్నీ, అదనపు విలువనీ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు, వేతన కార్మికుల వర్గాన్ని అంతకంతకూ ఎక్కువయ్యే స్థాయిలో పునరుత్పత్తి చేస్తుంది; ప్రత్యక్ష ఉత్పత్తిదారుల్లో అధిక సంఖ్యాకుల్ని వేతనకార్మికులుగా మారుస్తుంది.

డ - స....ఉ.పె ....స' - ' కి వేతనకార్మికుల వర్గం నిరంతరాయంగా అందుబాటులో ఉండడం అనేది మొదటి షరతు. కనుక ఆ సూత్రం   ఉత్పాదకపెట్టుబడి రూపంలో పెట్టుబడి ఆసరికే ఉన్నట్లు. అందువల్ల, ఉత్పాదక పెట్టుబడి వలయం రూపం అంతర్గతంగా ఉన్నట్లు.

 వచ్చే పోస్ట్: రెండో దశ ఉత్పాదకపెట్టుబడి చర్య

 

 

4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

‘కాపిటల్’ రెండో సంపుటం - పెట్టుబడి చలామణీ ప్రక్రియ


              కాపిటల్ రెండో సంపుటంలో

      కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు

 

        పెట్టుబడి చలామణీ ప్రక్రియ

   The Process of Circulation of Capital

ఒకటో భాగం:

పెట్టుబడి రూపం మార్పులూ – వాటి వలయాలూ

­     The Metamorphoses of Capital and their Circuits

ఒకటో అధ్యాయం:

డబ్బు పెట్టుబడి వలయం (The Circuit of Money Capital)

పెట్టుబడి చలనం డబ్బుతో మొదలై, డబ్బుతో ముగుస్తుంది. వలయంగా ఉంటుంది. అది చక్రీయ చలనం.

ఈ చలనం 3 దశల్లో జరుగుతుంది- అని కాపిటల్ మొదటి సంపుటిలో ఉంటుంది. ఆదశలు వరసగా ఇవి::

మొదటి దశ: పెట్టుబడిదారుడు డబ్బుతో బయలుదేరతాడు. సరుకుల మార్కెట్ కీ,  శ్రామిక మార్కెట్ కీ, వెళతాడు. తన డబ్బుని సరుకుల్లోకి మారుస్తాడు. ఇది డబ్బు - సరుకు అనే చలామణీ చర్య.

ఉదాహరణకి, ఇనుప బీరువాలు ఉత్పత్తి చేసే పెట్టుబడిదారుడికి రేకు, తాళాలు మొదలైన శ్రమ పదార్ధాలు కావాలి. అలాగే తయారు చెయ్యడానికి కొన్ని పరికరాలు కావాలి. రెంటినీ ఉపయోగించి, బీరువాలు చేసే కార్మికులు కావాలి. రెంటినీ వేర్వేరు మార్కెట్లలో కొనాలి. ఆందుకోసం డబ్బు తీసుకొని వెళ్ళాలి. అక్కడ అతని డబ్బు సరుకుల్లోకి మారుతుంది. ఇది డబ్బు- సరుకు  అనే చలామణీ చర్య.

రెండో దశ: పెట్టుబడిదారుడు కొన్న సరుకుల్ని ఉత్పత్తిలో వినియోగిస్తాడు. పెట్టుబడిదారీ ఉత్పత్తిదారుడిగా వ్యవహరిస్తాడు. అతని పెట్టుబడి ఉత్పత్తి ప్రక్రియలోకి వెళుతుంది. బీరువాలు తయారవుతాయి.

దీని ఫలితం: ఉత్పత్తిలో ప్రవేశించిన సరుకుల విలువకంటే, ఎక్కువ విలువ ఉండే సరుకులు ఉత్పత్తి అవుతాయి. ఇది ఉత్పత్తి చర్య. చలామణీ చర్య కాదు.

మూడో దశ: ఉత్పత్తయిన కొత్త సరుకులతో, వాటిని  అమ్మేవాడుగా మార్కెట్లోకి మళ్ళీ వస్తాడు. అతని సరుకుల్ని(మన ఉదాహరణలో బీరువాల్ని) డబ్బులోకి మార్చుకుంటాడు. ఇది సరుకు – డబ్బు అనే చలామణీ చర్య. పెట్టిన డబ్బు మరింతై తిరిగి చేతికొస్తుంది.

ఆవిధంగా, పెట్టుబడి చలనం డబ్బుతో మొదలై, డబ్బుతో ముగుస్తుంది. వలయంగా ఉంటుంది.

అందుకే, డబ్బు పెట్టుబడి వలయం ఫార్ములా ఇది: డ - స....ఉ.పె ....స' - '. ఇక్కడ చుక్కలు చలామణీ ప్రక్రియకు అంతరాయాల్ని సూచిస్తాయి. మొదటి దశకూ, మూడోదశకూ మధ్య చలామణీ చర్య లేదు. 

'  - అదనపు విలువ కలిసి మరింత విలువ అయిన సరుకుకి గుర్తు.

' - అదనపు విలువ కలిసి మరింత విలువ అయిన డబ్బుకి గుర్తు

ఉ.పె - ఉత్పాదక పెట్టుబడికి గుర్తు

మొదటి సంపుటంలో ఒకటో దశ, మూడో దశ గురించిన చర్చ ఉంది - అయితే ఆ చర్చ రెండో దశ అయిన పెట్టుబడి ఉత్పత్తి ప్రక్రియని గురించి గ్రహించడానికి ఏ మేరకు అవసరమో, ఆ మేరకు మాత్రమే ఉంది. ఆ కారణంగా, పెట్టుబడి భిన్న దశల్లో తీసుకునే వివిధ రూపాల్ని పరిగణనలోకి తీసుకోలేదు. పెట్టుబడి వలయం మళ్ళీ మళ్ళీ జరిగేటప్పుడు ఒకప్పుడు తీసుకొని, మరొకప్పుడు వదిలివేసే రూపాల్ని గురించిన చర్చ అక్కడ లేదు. ఆ రూపాల గురించే ఇప్పుడు/ఇక్కడ మన చర్చ.

 మొదట ఆ రూపాల్ని వాటి స్వచ్ఛస్థితిలో చూడాలి, గ్రహించాలి.

అందుకు, ఆ రూపాల్ని ఏర్పరచడంతో ప్రమేయంలేని అన్ని అంశాల్ని వదిలి పెట్టాలి. అంటే:

1. సరుకులు వాటవాటి విలువలకే అమ్ముడవుతాయి అనుకోవాలి; అంతే కాదు

2. ఇది అంతా ఒకే పరిస్థితుల్లో జరుగుతున్నది (పరిస్థితులు మారకుండా అలానే ఉన్నాయి) అని కూడా అనుకోవాలి.

3. అదే విధంగా, ఈ వలయాల గమనంలో జరగడానికి అవకాశమున్న అన్ని మార్పుల్నీ పక్కన బెట్టాలి.

అలా అనుకుని మార్క్స్ స్వచ్ఛస్థితిలో ఆమూడు దశల్నీ వరసగా పరిశీలిస్తాడు.

వచ్చే పోస్ట్ మొదటిదశ. డబ్బు సరుకు (డ-స) 

 

 


3, సెప్టెంబర్ 2020, గురువారం

అమెరికా రికవరీ నెమ్మదిగా ఉందన్నADP సంస్థ

 

అమెరికా రికవరీ నెమ్మదిగా ఉందన్నADP సంస్థ

ADP National Employment Report ప్రకారం అమెరికా వ్యవసాయేతర ప్రైవేట్ రంగంలో  ఆగస్ట్ నెలలో 4,28,000 ఉద్యోగాలు పెరిగాయి. Dow Jones ఆర్ధిక వేత్తలు 11 లక్షలా 70 వేలు వస్తాయిని అంచనా వేశారు. ఆ అంచనాలని వాస్తవాలు అందుకోలేక పోయాయి.

 ఆర్ధిక వేత్తలు 11 లక్షలా 70 వేలు వస్తాయిని అంచనా వేశారు. ఆ అంచనాలని వాస్తవాలు అందుకోలేక పోయాయి.

కంపెనీల సైజుని బట్టి వచ్చిన ఉద్యోగాలు:

50 మంది లోపు పనివాళ్ళున్న చిన్న సంస్థల్లో -   52,000

50-500 మధ్య ఉన్న మధ్య తరగతి సంస్థల్లో  -    79,000

500-1,000 మధ్య ఉన్న పెద్ద సంస్థల్లో -              28,000

1000 మందికి మించి ఉన్న పెద్దసంస్థల్లో-        2,98,000

పెద్దసంస్థలు ఎక్కువ ఉద్యోగాలు కల్పించాయి.

సర్విస్ రంగంలో అత్యధికంగా 3,89,000 వచ్చాయి. వస్తూత్పత్తి రంగం కల్పించింది 40,000 మాత్రమే.

పోయిన ఉద్యోగాలూ - వచ్చిన ఉద్యోగాలూ

ఏప్రిల్ నెలలో 2 కోట్లా 2 లక్షలా 36 వేల ఉద్యోగాలు పోయాయి. మేలో 27 లక్షలా 60 వేల ఉద్యోగాలు పోయాయి.

జూన్లో 23 లక్షలా 69 వేలు, జులైలో 1,67,000 , ఆగస్ట్ నెలలో 4,28,000 ఉద్యోగాలు వచ్చాయి.

రికవరీ నెమ్మదిగా ఉన్నదని ఆ నివేదిక సమర్పించిన ADP సంస్థ అభిప్రాయపడింది. ఎందుకంటే: ఆ సంస్థ లెక్కల ప్రకారం

ఏప్రిల్, మే నెలల్లో పోయినవి మొత్తం -     2,29,96,000

జూన్, జులై, ఆగస్ట్ నెలల్లో వచ్చిన మొత్తం – 29,64,000

కొరవ రావలసినవి-                          2,00,32,000

పోయిన వాటిలో ఇప్పటికి వచ్చింది 7 వ వంతుకు కొంచెం ఎక్కువ అంతే. అందుకనే ఆ సంస్థ రికవరీ నెమ్మదిగా ఉన్నట్లు తేల్చింది.

BLS వ్యవసాయేతర ఉద్యోగ నివేదిక

4-9-2020 శుక్రవారం రాబోయే BLS వ్యవసాయేతర ఉద్యోగ నివేదిక,  ఆగస్ట్ లో 13 లక్షలా 20 వేల ఉద్యోగాలు వచ్చినట్లు చూపబోతున్నదని ఆర్ధికవేత్తల అంచనా. ఆ నివేదిక  మన కాలమానం ప్రకారం (IST) మన కాలమానం ప్రకారం ఇవ్వాళ సాయంత్రం 6.00 గంటలకు విడుదలవుతుంది. వివరాలు అందులో చూద్దాం.


21, మే 2020, గురువారం

పనులు పోయినప్పుడు వేరే చోటికి పోవాలని కార్మికులు - పోకుండా ఉండాలని యజమానులు

పనులు పోయినప్పుడు వేరే చోటికి పోవాలని కార్మికులు - పోకుండా ఉండాలని యజమానులు

సంక్షోభ సమయాల్లో కార్మికులకు పనులు పోతాయన్నది తెలిసిందే. అప్పుడు పనివాళ్ళు పనులున్నచోటికి పోవాలనుకుంటారు.వేరే చోటనించి వచ్చిన వాళ్ళైతే, సొంత ఊళ్ళకి పోదాం అనుకోవచ్చు. అలా వెళ్ళడం యజమానులకు ఇష్టముండదు. ఎందుకంటే మళ్ళీ ఉత్పత్తి అవసరమైనప్పుడు పనివాళ్ళు ఉండరు. పని సాగదు. పనులు లేకపోయినా వాళ్ళు అక్కడే కనిపెట్టుకొని ఉండాలి. ఉండడానికి కావలసిన ఏర్పాట్లు ఎవరికివారు చేసుకోవాలి. యజమానులు బాధ్యత తీసుకోరు. అయినా వాళ్ళని పోకుండా ఆపేదానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వాన్ని తమకు అనుకూలంగా వ్యవహరించేట్లు ఒత్తిడి చేస్తారు.
దీనికి సంబంధించి కాపిటల్ మొదటి భాగం 538-541 పేజీల్లో మార్క్స్ చరిత్ర నించి ఒక ఉదాహరణ ఇచ్చాడు. అది నూలు పనివాళ్ళకి సంబంధించింది.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అంతర్యుద్ధం వల్లా, దానివెంట వచ్చిన పత్తి కరువు వల్లా, లంకాషైర్ నగరంలో అనేకమంది నూలు పనివాళ్ళు తొలిగించబడ్డారు. వాళ్ళు వలస ప్రాంతాలకో, అమెరికా సంయుక్త రాష్ట్రాలకో వలసపోవడానికి ప్రభుత్వ సహాయం కోసమూ, స్వచ్చంద ప్రజా విరాళాల కోసమూ ఇతరులు అభ్యర్ధించడమేకాక, అసలు కార్మిక వర్గమే స్వయంగా విజ్ఞప్తులు చేసింది.
1863 మార్చ్ 24 న ది టైంస్ పత్రికలో ఎడ్మండ్ పాటర్ రాసిన ఉత్తరం పడింది. ఆయన మాంచెస్టర్ చాంబర్ ఆఫ్ కామర్స్ కి మాజీ అధ్యక్షుడు.ఆ లేఖని House of Commonsలో ‘ఉత్పాదకుల ప్రణాళిక’ అన్నారు. అలా అనడం సరైనదే. పత్తి పనివాళ్ళ సరఫరా అతిగా ఉన్నదని పనిలేని కార్మికునికి చెప్పవచ్చు. వాళ్లలో మూడో వంతు తగ్గించాలి. అలా తగ్గిస్తే మిగిలిన రెండొంతుల మందికీ సరైన డిమాండ్ ఉంటుంది...ప్రజాభిప్రాయం వలసలకి అనుకూలంగా ఉంది....యజమాని శ్రమ సరఫరా తగ్గడాన్ని ఇష్టపడడు. అది తప్పనీ, సరికాదనీ అతను అనుకుంటాడు- బహుశా న్యాయంగానే...కాని, వలసలకి సహకరించేందుకు ప్రజాధనాన్ని ఖర్చుచెయ్యాల్నివస్తే, అతనికి ఆవిషయం గురించి మాట్లాడే హక్కు, అసమ్మతి తెలిపే హక్కు ఉంటుంది.
పత్తి వర్తకం చాలా ప్రయోజనకరమైనది- అంటాడు పాటర్. ఐర్లండ్ నుంచీ,వ్యావసాయక జిల్లాలనుండి అదనపు జనాభాని ఆకర్షించింది. 1860 లో మొత్తం ఇంగ్లిష్ ఎగుమతుల్లో పదమూడింట అయిదొంతులు (5/13) పత్తి వర్తకానివే. అంత పెద్ద వర్తకం అది. కొన్ని సంవత్సరాలు గడిస్తే మళ్ళీ మార్కెట్, ప్రత్యేకించి ఇండియా మార్కెట్ విస్తరించి, పౌను పత్తి 6 పెన్నీలకే సమృద్ధిగా లభిస్తుంది అంటాడు.తర్వాత ఇలా కొనసాగిస్తాడు:
కొంత కాలానికి ఒకటి రెండు మూడేళ్ళకి సరిపోయేటంత పత్తి పండవచ్చు..అప్పుడు నాప్రశ్న: ఈ వ్యాపారం అట్టిపెట్టుకో తగిందేనా? ఈ యంత్రాంగాన్ని (జీవమున్న శ్రమ యంత్రాలు అని ఆయన భావం) అలాగే ఉంచుకోవడం తగినదేనా? దాన్ని వదులుకోవడం అత్యంత అవివేకం కాదా? అవివేకమనే నేను అనుకుంటున్నాను. పనివాళ్ళు లంకాషైర్ ఆస్తి కారనీ, యజమానుల ఆస్తీ కారనీ ఒప్పుకుంటాను. అయితే లంకాషైర్ కీ, యజమానులకీ బలం వాళ్ళే. ఒకతరం దాకా భర్తీ చెయ్యలేని మానసిక, సుశిక్షిత శక్తి వాళ్ళు.
వాళ్ళు వాడి పనిచేసే యంత్రాలనైతే, 12 నెలల్లో లాభదాయకంగా, ఇంకా మెరుగైన వాటితో భర్తీ చెయ్యవచ్చు
.
శ్రమించే శక్తిని వలసపోవడానికి ఒప్పుకుంటే, పెట్టుబడిదారుడి పరిస్థితేమిటి?

పనివాళ్ళు వలస పొవడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళు అలా కోరుకోవడం సహజమే.... తగ్గించండి.శ్రమించే శక్తి ఖర్చు వేతనాల్లో అయిదో వంతు అంటే 50 లక్షలు తగ్గించి, నూలు పరిశ్రమని కుదించి వేయండి. అలా చేస్తే, వీళ్ళ మీద ఆధారపడే చిన్న దుకాణదారులసంగతేమిటి? ఇళ్ళ అద్దెలసంగతేమిటి?....
ఇంకొంచెం ముందుకుపోయి సన్నకారు రైతు మీద, కాస్త మెరుగైన గృహయజమానిమీద..భూకామందు మీదా దీని ప్రభావాల్ని గమనించండి. ఒక దేశంలోని తయారీ కార్మికుల్లో అత్యుత్తమమైన భాగాన్ని ఎగుమతిచేసి, ఆదేశపు అత్యుత్తమ ఉత్పాదక పెట్టుబడిలో, సంపదలో కొంత భాగం విలువని ధ్వంసం చెయ్యడం కన్నా అన్నివర్గాలకూ ఆత్మహత్యా సదృశమైన సలహా ఏమైనా ఉందేమో చెప్పండి.- అని అడుగుతున్నాడు.
పాటర్ ప్రతిపాదన: ప్రత్యేక న్యాయ శాసనాలద్వారా రుణం మంజూరు చెయ్యాలి. రుణం పొందే వాళ్ళ మనోస్థైర్యాన్ని
కలిగించేందుకు, ఏదో ఒక వృత్తినో, పనినో కల్పించేందుకు అయిదారు మిలియన్ పౌన్ల రుణం, రెండుమూడేళ్లకు విస్తరించేట్లు పత్తిపండించే జిల్లాల్లో Boards of Guardians కి అనుబంధంగా ప్రత్యేక అధికారులచేత నిర్వహించబడే రుణం ఇవ్వాలి. అత్యుత్తమ శ్రామికుల్ని వదులుకోవడం కన్నా, భూకామందులకీ, యజమానులకీ హీన స్థితి ఇంకొకటి ఉంటుందా? ఇంగ్లండ్ లో పేదవాళ్ళకి సహాయం చేసే చట్టాన్ని(Poor Law) అమలు పరిచే అధికారులే Board of guardians. 1835 నుంచీ 1930 దాకా వీళ్ళు పని చేశారు. 1834 నుంచీ పేదవాళ్ళకు workhouses లో వసతి, భోజనం ఉండేవి. అందుకు బదులుగా వాళ్ళు పనిచెయ్యాలి.
పాటర్ కి The Times పత్రిక ఇలా జవాబిచ్చింది:
నూలు యజమానులకున్న అపూర్వమైన, అత్యున్నతమైన ప్రాధాన్యతతో అతను ప్రభావితుడయ్యాడు. ఎంతగానంటే, ఈ వర్గాన్ని భద్రంగా ఉంచడానికీ, వాళ్ల వృత్తిని శాశ్వతం చెయ్యడానికీ 5 లక్షల మంది కార్మికుల్నీ, వాళ్ళమీద ఆధారపడ్డ 7 లక్షల మందినీ, వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒక భారీ నైతిక శ్రమ గృహంలో నిర్బంధించి ఉంచాలని అనుకుంటున్నాడు.
ఈ వర్తకం అట్టిపెట్టుకోదగిందేనా? అని అడుగుతున్నాడు. మా జవాబు: తప్పనిసరిగా ఉంచుకోదగినదే. నీతీ, నిజాయతీ గల అన్ని మార్గాలద్వారా అట్టిపెట్టుకోదగిందే. పాటర్ చెప్పినట్లుగా, పనివాళ్ళ పునరుత్పత్తికి కొంత కాలం అవసరం కావచ్చు.కాని యంత్ర పనివాళ్ళూ పెట్టుబడిదారులూ అందుబాటులో ఉంటే చాలు ఇక మనకు ఏనాడూ అవసరపడనంత ఎక్కువమంది నిపుణుల్నితయారు చేసుకోడానికి పొదుపరులైన, కష్టపడి పనిచేసే బలాఢ్యులు కావలసినంతమంది దొరుకుతారు.
ఒకటి, రెండు, మూడు సంవత్సరాల్లో వర్తకం ఎత్తుకుంటుందని పాటర్ చెప్తున్నాడు. కార్మికుల్ని వలసపోయేందుకు ప్రోత్సహించ వద్దు అంటున్నాడు. పనివాళ్ళు వలసపోవాలనుకోవడం సహజమే అంటున్నాడు.అయితే వాళ్ళ అభీష్టం అదే అయినా, ఒకప్పటికి నూలు యజమానులు కార్మికుల్ని నియమించుకుంటారని నిరీక్షిస్తూ జాతి ఈ 5 లక్షల కార్మికుల్నీ, వాళ్ళ ఆశ్రితులు 7 లక్షల మందినీ నూలు జిల్లాల్లోనే అట్టిపెట్టుకోవాలి అనేది ఆయన ఉద్దేశం. దీని అనివార్య పర్యవసానంగా జాతి, వాళ్ళ అసంతృప్తిని బలప్రయోగంతో అణచిపెట్టాలి, దానధర్మాలతో వాళ్ళని పోషించాలి - అనికూడా ఆయన అనుకొని తీరాలి. ఇనుము, బొగ్గు, పత్తి మొదలైన వాటితో ఎట్లా వ్యవహరిస్తామో, శ్రమశక్తితో కూడా వ్యవహరించే వాళ్ళ బారినుండి శ్రమ శక్తిని రక్షించడానికి ఈ దీవుల్లోని మహత్తర ప్రజాభిప్రాయం కృషి చెయ్యాల్సిన సమయం ఆసన్నమయింది.
చివరకి ఏం జరిగింది
ఈ 'టైంస్ ' వ్యాసం ఒక చమత్కార నీతి బోధగానే ఉండిపొయింది. వాస్తవంలో పాటర్ అభిప్రాయమే ప్రజాభిప్రాయం అయింది. కార్మికుల వలస నిరోధించబడింది.వాళ్ళు శ్రమ గృహంలో, నూలు జిల్లాల్లో బందీలయ్యారు. అంతకుముందు లాగే లంకాషైర్ నూలు ఉత్పత్తిదారులకు బలం చేకూర్చే వారయ్యారు.వలస పోయేవాళ్లకి 'ఫార్థింగ్' (పెన్నీలో నాలుగోవంతు) అయినా సహాయం చెయ్యడానికి పార్లమెంట్ ఒప్పుకోలేదు. కాగా మునిసిపల్ కార్పొరేషన్లకి అధికారాలిస్తూ కొన్ని చట్టాలు చేసింది. అవి కార్మికుల్ని అర్ధాకలితో ఉంచేందుకు అనువైనవే. అంటే మామూలు వేతనాల కంటే తక్కువకి వాళ్లని దోపిడీ చెయ్యడానికి ఉపకరించేవే.
ఇందుకు భిన్నంగా మూడేళ్ళ తర్వాత పశువ్యాధి వ్యాపించినప్పుడు అదే పార్లమెంట్ సాంప్రదాయాల్ని తోసిపుచ్చి మిలియనీర్లైన భూస్వాములకు మిలియన్ల పౌన్లు నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది.వాళ్ళ రైతులు మాంసం ధర పెరిగినందువల్ల ఏమాత్రం నష్టం లేకుండానే బయటపడ్డారు.
Like
Comment
Share

8, మే 2020, శుక్రవారం

అమెరికా ఉద్యోగ సంక్షోభం


అమెరికా ఉద్యోగ సంక్షోభం
అమెరికా కార్మిక శాఖ  ఉద్యోగ నివేదిక విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో 2కోట్లా 5 లక్షల ఉద్యోగాలు పోయాయి.ఇన్ని పోవడం మహా సంక్షోభం తర్వాత ఇప్పుడే. 2008-2009 మహామాంద్యంలో పోయిన ఉద్యోగాలు మొత్తం 87 లక్షలు. అంతకు రెండింతలు మించి ఒక్క ఏప్రిల్ నెల్లోనే పోయాయి. ఇక నిరుద్యోగం రేటు : ఫెబ్రవరిలో 3.5 శాతం. ఇంత తక్కువ  50 ఏళ్ళలో ఎన్నడూ లేదు.ఇప్పుడు అమాంతం 14.7 కి పెరిగింది.ఇంత ఎక్కువ 1933 తర్వాత ఎన్నడూ లేదు. కరోనా వల్ల కంపెనీలు మూతబడడం ఇందుకు పెద్ద కారణం. అయితే ఈ ఉద్యోగాలన్నీ కంపెనీలు తెరవగానే వస్తాయన్నాడు ట్రంప్. చాలా త్వరలో అనికూడా అన్నాడు. అయితే కరోనా కేసులు 13 లక్షలు కాబోతున్నాయి.నిన్న కొత్తకేసులు దాదాపు 30 వేలు.ఇక కంపెనీలు తెరిస్తే ఉద్యోగాలు అన్నో ఇన్నో వస్తాయి. మరొకపక్క కరోనా కేసులు పెరుగుతాయి.ఈ పరిస్థితుల్లో పరిశ్రమలు ఏమేరకు పనిచేస్తాయో తెలియదు. ట్రంప్ చెప్పేది జరగదు. ఎకానమీ అంత తేలిగ్గా, వేగంగా  ఎత్తుకోదు. ఇది మహామాంద్యాన్ని మించిపోవచ్చు.ఇప్పట్లో 2020 ఫిబ్రవరి పరిస్థితి రాదు.  

5, మే 2020, మంగళవారం

కార్ల్ మార్క్స్ కాపిటల్ లో ఏం చెప్పాడు?

అనే పుస్తకాన్ని విరసం ప్రచురించింది. జనవరి 12,13 తేదీల్లో హైదరాబాద్ లో జరిగిన 50 ఏళ్ళ మహాసభల్లో చెంచయ్యగారు ఆవిష్కరించారు.

1, మే 2020, శుక్రవారం

కార్ల్ మార్క్స్ కాపిటల్ లో ఏం చెప్పాడు? - సాఫ్ట్ కాపీ

'కార్ల్ మార్క్స్ కాపిటల్ లో ఏం చెప్పాడు' - ఈ పుస్తకాన్ని విరసం ప్రచురించింది. జనవరి 12,13 తేదీల్లో హైదరాబాద్ లో జరిగిన 50 ఏళ్ళ మహాసభల్లో చెంచయ్యగారు ఆవిష్కరించారు.ఆ తర్వాత కొద్దికాలానికే లాక్ డౌన్ మొదలయ్యింది. షాపులు మూసేశారు. దూర ప్రాంతాల్లో పుస్తకలు తేలిగ్గా దొరకవు. పైగా ఈతరం వాళ్ళు చాలామంది కంప్యూటర్లలో చదవుతున్నారు. కొందరు స్మార్ట్ ఫోన్లలో కూడా చదవడానికి అలవాటుపడుతున్నారు. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని, సాఫ్ట్ కాపీని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఈ లింక్ ల ద్వారా అందుకోండి.

http://virasam.org/article.php?page=1396

https://drive.google.com/open?id=1RVzbCA4AuHDvE1y6pLO0XqGs7VjgSVAQ