24, నవంబర్ 2018, శనివారం

'శ్రమనిధి 'అనబడేది



విభాగం 5. 'శ్రమనిధి 'అనబడేది
పెట్టుబడి స్థిర పరిమాణం కాదు
పెట్టుబడి స్థిర పరిమాణం కాదు - అని మన పరిశీలనలో తేలింది. అది సమాజ సంపదలో ఒక భాగం. తాజా అదనపువిలువ రెవిన్యూలోకీ, అదనపు పెట్టుబడిలోకీ నిరంతరం విడివడుతూ, మారుతూ ఉంటుంది. క్రియాత్మక పెట్టుబడి ఇవ్వబడినా, శ్రమ శక్తీ, సైన్సూ, భూమీ (మనిషితో నిమిత్తం లేకుండా ప్రకృతి సమకూర్చిన పరిస్థితులన్నీ) క్రియాత్మక పెట్టుబడిలో ఇమడ్చబడతాయి. వ్యాకోచించే శక్తులు అవుతాయి. దానికి కొన్ని పరిమితుల్లో దాని సొంత పరిమాణంతో సంబంధంలేకుండా కార్యాచరణకి అవకాశం కలిగిస్తాయి. కాబట్టి పెట్టుబడి స్థిర పరిమాణం కాదు.
అశాస్త్రీయ అర్ధ శాస్త్రజ్ఞుల శ్రమ నిధిసిద్ధాంతం
అశాస్త్రీయ అర్ధ శాస్త్రజ్ఞులుశ్రమ నిధిసిద్దాంతాన్ని ప్రవేశపెట్టి, ప్రచారం చేశారు. వేతనాలు చెల్లించడానికి ఒకస్థిర నిధి’ ఉంటుందనేది దీని సారాంశం. నియోగించబడిన కార్మికుల సంఖ్యచేత భాగిస్తే వేతనాల స్థాయి తెలుస్తుంది అని కొందరు వాదించారు.  ఇంకొందరు నిధి మొత్తాన్ని, స్థిరవేతనంతో భాగిస్తే శ్రామికుల సంఖ్య తెలుస్తుందని తేల్చారు. వాళ్ళూ వీళ్ళూ కూడా సంచయనం రేటుని నిర్ణయించే అంశాలు అన్నిటినీ విస్మరించారు - అని మార్క్ విమర్శించాడు
అశాస్త్రీయ ఆర్ధిక వేత్తలు పెట్టుబడిని నిర్దిష్ట పరిమాణంగా పరిగణంచారు. ఆవిధంగా అస్థిర పెట్టుబడి, స్థిర పరిమాణంగా వాళ్ళకి అగపడుతుంది. శ్రమనిధి అనబడేది అదే. 'ఫలానింత మొత్తం కార్మికులకి చెల్లించడానికి కేటాయించబడుతుంది - అంటారు వాళ్ళు.  కార్మికులు ఎంత ఎక్కువమంది ఉంటే, ఒక్కొక్కళ్ళ వాటా అంత తగ్గుతుంది. ఎంత తక్కువమంది ఉంటే, ఒక్కొక్కళ్ళ వాటా అంత ఎక్కువ ఉంటుంది.'
ఆవిధంగా సాంప్రదాయ అర్ధశాస్త్రం సామాజిక పెట్టుబడిని ఒక స్థిరమైన సామర్ధ్య స్థాయి గల స్థిర పరిమాణంగా భావించడానికి ఇష్టపడింది. ఇది పరిశీలన చెయ్యకుండా తేల్చిన  నిర్ధారణ (prejudice).
బెంథాం పిడివాదం
దీన్ని ఒక పిడివాదంగా మొట్టమొదట స్థాపించినవాడు జెరెమీ బెంథాం. అతనొక పసలేని పాండిత్య ప్రకర్షకుడు, ఈ పిడివాదాన్ని అనుసరించి ఉత్పత్తి ప్రక్రియ యొక్క అత్యంత సామాన్యమైన విషయాల్ని సైతం తెలుసుకోజాలం. ఉదాహరణకి, దాని ఆకస్మిక వ్యాకోచ సంకోచాలు. అంతెందుకు, అసలు సంచయనాన్ని ఊహించడమే అసాధ్యం అవుతుంది.
అర్ధశాస్త్రజ్ఞుల కట్టుకధలు
పిడివాదాన్ని బెంథాంతొ పాటు మాల్థూస్, జేంస్ మిల్, మాకుల్లాక్ మొదలైన వాళ్ళు పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించడానికి వాడుకున్నారు -. మరీ ముఖ్యంగా పెట్టుబడిలో ఒకభాగం అయిన అస్థిరపెట్టుబడిని- శ్రమశక్తిలోకి మార్చబడే భాగాన్ని- ఒక స్థిర పరిమాణంగా చూపడానికి వాడుకున్నారు. అస్థిర పెట్టుబడి భౌతికాంశంకార్మికుల జీవనాధార సాధనాల మొత్తం, లేక శ్రమనిధి అనబడేది సామాజిక సంపదలో భాగమనీ, సహజ సూత్రాలచేత నిర్ణయించబడి, మార్పు చెందనిదనీ కట్టుకధలు చెప్పారు.
కార్మికుల సంఖ్య-శ్రమ శక్తి ధర
స్థిరపెట్టుబడిగా పనిచెయ్యాల్సిన సామాజిక సంపదని చలనంలో పెట్టడానికి అంటే, దాన్ని భౌతిక రూపంలో ఉత్పత్తిసాధనాలుగా వ్యక్తంచెయ్యడానికి, ఒకనిర్దిష్ట పరిమాణంగల సజీవ శ్రమ రాసి అవసరంవుతుంది. పరిమాణం ఎంతనేది సాంకేతికంగా నిర్ణయమవుతుంది. అయితే శ్రమశక్తి పరిమాణాన్ని చలనంలో పెట్టడానికి ఎంతమంది కార్మికులు కావాలో తెలియజెయ్యదు. ఎందుకంటే, వైయక్తిక శ్రమశక్తి దోపిడీ స్థాయిని బట్టి సంఖ్య మారుతుంది. దోపిడీ స్థాయి ఎక్కువయ్యేకొద్దీ, కార్మికుల సంఖ్య తగ్గుతుంటుంది, దోపిడీ స్థాయి తగ్గే కొద్దీ కార్మికుల సంఖ్య పెరుగుతుంటుంది. అలాగే శ్రమ శక్తి ధరను కూడా తెలియజేయదు- అస్థిరమైన ఆధర యొక్క కనీస పరిమితిని మాత్రమే తెలుపుతుంది. పరిమితికూడా చాలా అస్థిరమైందే.
పిడి వాదంలోని వాస్తవాలు ఇవి:
1.ఒకపక్క, సామాజిక సంపద శ్రమ చెయ్యనివని సుఖ,భోగ సాధనాలుగానూ, ఉత్పత్తి సాధనాలుగానూ విభజించడంలో జోక్యం చేసుకునే హక్కు కార్మికునికి లేదు.
2. మరొకపక్క, అనుకూలమైన, అసాధారణ సందర్భాల్లో మాత్రమే సంపన్నుల ఆదాయం నించి శ్రమ నిధి అనబడేదాన్ని పెంచుకోగల శక్తిని కలిగి ఉంటాడు. 
శ్రమనిధి కుండే పెట్టుబడిదారీ పరిమితుల్ని సహజమైన,సామాజికమైన పరిమితులుగా చిత్రించే ప్రయత్నం పునరుక్తి తప్ప మరేమీ కాదు. ఉదాహరణకి ప్రొ.ఫాసెట్ - ఒక దేశ చలామణీ పెట్టుబడే ఆదేశ వేతననిధి. కాబట్టి, ఒక్కొక్క కార్మికుడు పొందే  సగటు వేతనాన్ని లెక్కించాలనుకుంటే, మనం ముందుగా పెట్టుబడి మొత్తాన్ని శ్రామిక జనభా సంఖ్య బెట్టి భాగించాలి.
దీని అర్ధం: వాస్తవంగా చెల్లించబడిన వైయక్తిక వేతనాల్ని ముందుగా కూడాలి. కూడగా వచ్చిన మొత్తమే శ్రమనిధి అని, భగవంతుడూ, ప్రకృతీ నిర్ణయించి ప్రసాదించిన శ్రమనిధి అని నొక్కి వక్కాణించాలి. ఆవిధంగా రాబట్టిన మొత్తాన్ని కార్మికుల సంఖ్య చేత తిరిగి భాగించాలి - సగటున ఒక్కో కార్మికుడికి ఎంతవస్తుందో తేల్చడానికి. తప్పు దోవ పట్టించడానికి ఎంత తెలివి. అసలు విషయాన్ని కప్పిపుచ్చడానికి ఎటువంటి మోసం.
అదే ధోరణిలో ఆయనిలా అంటాడు: 
ఇంగ్లండ్ లో ఏటేటా పొదుపు చేయబడిన సంపద మొత్తం రెండు భాగాలుగా విభజించబడింది; ఒక భాగం మన పరిశ్రమని నిర్వహించే నిమిత్తం నియోగించబడింది. రెండో భాగం విదేశాలకు ఎగుమతిచెయ్యబడింది... ఏటేటా పొదుపుచెయ్యబడిన సంపదలో ఒకభాగం మాత్రమే, అదీ పెద్ద భాగమేమీ కాదు, మన సొంత దేశంలో పెట్టుబడిగా పెట్టబడింది.”
సమానకం ఇవ్వకుండా ఇంగ్లండ్ కార్మికులనించి గుంజబడి, అంటే అపహరించబడి ప్రతి ఏటా కూడుతున్న అదనపు ఉత్పాదితంలో భారీభాగం ఆవిధంగా ఇంగ్లండ్ లో కాకుండా విదేశాల్లో పెట్టుబడిగా ఉపయోగించబడుతున్నది. అయితే అలా ఎగుమతిచేయబడిన అదనపు పెట్టుబడితో పాటు దైవమూ, బెంథామూ కనిపెట్టిన 'శ్రమనిధి 'లో ఒకభాగం కూడా ఎగుమతి చెయ్యబడుతుంది.  




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి