11, నవంబర్ 2018, ఆదివారం

అదనపు విలువ పెట్టుబడిగానూ,ఆదాయంగానూ విడివడడం


అధ్యాయం 24 అదనపువిలువ పెట్టుబడిలోకి మారడం
విభాగం 3. అదనపు విలువ పెట్టుబడిగానూ,ఆదాయంగానూ విడివడడం.

 కోర్కెల్ని తీర్చుకోకుండా ఉండడం అనే సిద్ధాంతం (Abstinence Theory) 


దీనికి సరిగ్గా వెనక 23 వ అధ్యాయంలో అదనపువిలువని (లేక అదనపు ఉత్పాదితాన్ని) పెట్టుబడిదారుడి వ్యక్తిగత వినియోగానికి నిధిగా మాత్రమే చూచాం. అధ్యాయంలో ఇంతదాకా అదనపువిలువని సంచయనానికి నిధిగా మాత్రమే చూచాం. అయినాగాని, అది అదీకాదు, ఇదీకాదు. కాని రెండూ కూడా. ఒక భాగం  పెట్టుబడిదారుడి సొంతానికి ఖర్చవుతుంది. రెండో భాగం పెట్టుబడిగా వినియోగించ బడుతుంది. సంచయనం జరుగుతుంది.
అదనపువిలువ రాశి  ఫలానింత అయినప్పుడు, ఒకభాగం పెద్దదయితే, మరొకభాగం చిన్నదిగా ఉంటుంది. ఉదాహరణకి 10000 అదనపువిలువలో మొదటిది 6000 అయితే,  రెండోది 4000 అవుతుంది. మొదటిది 3 వేలకు తగ్గితే, రెండోది 7 వేలకు పెరుగుతుంది. భాగాల నిష్పత్తి సంచయనం పరిమాణాన్ని నిర్ణయిస్తుంది.
సంచయనం చెయ్యడమే, అదనపు విలువని పెట్టుబడిలోకి మార్చడమే, పెట్టుబడిదారుడి లక్ష్యం
రెండు భాగాల విభజన చెసేది అదనపు విలువ సొంతదారుడే,  పెట్టుబడిదారుడే. అది అతని ఐఛ్చిక చర్య. అతను సంచయనం చేసే ఆభాగం అతను లాక్కున్నది. ఆభాగం అతను పొదుపుచేశాడని చెప్పబడుతుంది, కారణం దాన్ని అతను తినలేదు కనక. అంటే, పెట్టుబడిదారుడిగా వ్యవహరించి తన కర్తవ్యాన్ని నిర్వహించడం వల్లనే సంపదని పెంచుకుంటాడు.  
అతను రూపం పొందిన పెట్టుబడి. పెట్టుబడియొక్క ఆకారం. అలా కాకుండా పెట్టుబడిదారుడికి చరిత్రలో విలువ లేదు. లిచనోవస్కీ హాస్యోక్తిలో చెప్పాలంటే, పెట్టుబడిదారుడి అస్థిత్వానికి 'పొయ్యే కాలం రాలేదు '. అతని తాత్కాలిక అస్థిత్వానికి అవసరం పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానపు తాత్కాలిక అవసరం లో ఇమిడి ఉంది.అయితే అతను పెట్టుబడికి ఆకారం అయిన మేరకు, అతన్ని చర్యకు ప్రోత్సహించేది ఉపయోగపు విలువలు కాదు, వాటి అనుభొగమూ కాదు. మారకం విలువా, దాని పెరుగుదాలా.  విలువ విస్తరించేట్లు చెయ్యడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నందువల్ల, మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా ఉత్పత్తి కోసమే ఉత్పత్తి చేసేట్టు బలవంతపెడతాడు.ఆవిధంగా అతను సామాజిక ఉత్పాదక శక్తుల్ని బలవంతంగా అభివృద్ధి చేస్తాడు. మరొక ఉన్నత సమాజానికి పునాది వేసే భౌతిక పరిస్థితుల్నిమాత్రమే ఏర్పరుస్తాడు. సమాజంలో ప్రతి మనిషీ పూర్తిగా, స్వేఛ్చగా అభివృద్ధి చెందడం అనేది సూత్రంగా ఉంటుంది.
సంపద పట్ల పెట్టుబడిదారుడి వెర్రివ్యామోహం
పెట్టుబడి రూపంగా మాత్రమే పెట్టుబడిదారుడు గౌరవనీయుడు. ఆరూపంలో అతనికి సంపదగా  సంపద పట్ల వెర్రివ్యామోహం ఉంటుంది- లోభికి ఉన్నట్లే. అయితే లోభిలో వ్యక్తిపరంగా  ప్రత్యేక అలవాటు, పెట్టుబడిదారుడిలో సామాజిక యంత్రం ఫలితం.  ఆయంత్రానికి పెట్టుబడిదారుడు ఒక చోదక చక్రం మాత్రమే.
పోటీ పెట్టుబడిని పెంచేట్లు చేస్తుంది
అంతేకాదు,పెట్టుబడిదారీ ఉత్పత్తి అభివృద్ధి వల్ల ఒక పారిశ్రామిక సంస్థలో పెట్టబడిన పెట్టుబడి నిరంతరం పెరుగుతూ ఉండాల్సిన ఆవశ్యకత కలుగుతుంది. పోటీ పెట్టుబడిదారీ ఉత్పత్తి యొక్క అంతర్గత నియమాల్ని, బహిర్గత బలవంతపు నియమాలుగా ప్రతి వ్యష్టి పెట్టుబడిదారుడూ పట్టించుకునేట్లు చేస్తుంది. పెట్టుబడిని భద్రపరుచుకోడం కోసం, దాన్ని నిరంతరంగా పెంచేట్లు బలవంత పెడుతుంది. పెట్టుబడిని పెంచే మార్గం ఒక్కటే: క్రమంగా పెరిగే సంచయనం. అది తప్ప వేరే దారిలేదు. 
అతని చర్యలు కేవలం పెట్టుబడి చేసే కార్యకలాపాలు మాత్రమే. అందువల్ల అతని సొంత వినియోగం సంచయనం మీద దోపిడీగా లెక్కకొస్తుంది. వ్యకి వినియోగం పెరిగేకొద్దీ సంచయనానికి ఆమేరకు అవకాశం తగ్గుతుంది. సంచయనం చెయ్యడం అంటే  అతను దోపిడీ చేసే మనుషుల సంఖ్య పెరగడమే.
పెట్టుబడిదారీ ఉత్పత్తీ, సంచయనమూ, సంపద వృద్ధయ్యేకొద్దీ పెట్టుబడిదారుడు కేవలం పెట్టుబడి అవతారంగా మాత్రమే ఉండడం మానుకుంటాడు. భౌతిక సుఖాల్ని త్యజించడం అంటే తనకున్న వ్యామోహాన్ని తలచుకొని నవ్వు కుంటాడు. దాన్ని కేవలం పాత కాలం నాటి లోభి అభిప్రాయంగా భావిస్తాడు. సాంప్రదాయ పెట్టుబడిదారుడు వ్యక్తిగత వినియోగాన్ని పెట్టుబడిదారుడిగా తన చర్యకు విరుద్ధమైన పాపంగా, సంచయనాన్ని త్యజించడంగా ముద్రవేస్తాడు. ఆధునిక పెట్టుబడిదారుడు సంచయనాన్ని సుఖాన్ని త్యజించడంగా చూడగలుగుతున్నాడు.
పెట్టుబడిదారీ ఉత్పత్తి మొదలైన కాలంలో అత్యాశ, సంపన్నుడు కావాలనే కాంక్ష - రెండు అమల్లోవున్న వ్యామోహాలు.  ప్రతి కొత్త పెట్టుబడిదారుడూ దశ గుండా పయనించాల్సిందే.
ఆడంబర వ్యయం
అయితే, పెట్టుబడిదారీ ఉత్పత్తి పురోగమనం ఆనందాల లోకాన్ని సృజిస్తుంది. అంతే కాదు, ఆకస్మికంగా సంపద ఏర్పడే అనేక వనరుల్ని ముందుపెడుతుంది. పెట్టుబడి ఉండడం కంటే అప్పు ముఖ్యం అవుతుంది. అప్పు పుట్టడానికి ఆడంబర వ్యయం మంచి సాధనం. సాంప్రదాయ స్థాయి అతివ్యయం కూడా సంపద ప్రదర్శనే, ఫలితంగా పరపతికి వనరు. అభివృద్ధి ఒక స్థాయికి చేరినప్పుడు, అతివ్యయం 'దురదృష్టవంతుడైన’ పెట్టుబడిదారుడికీ వ్యాపార అవసరం అవుతుంది. పెట్టుబడి ఖర్చుల్లో ఆడంబరం చేరుతుంది.
పెట్టుబడిదారుడూ- లోభీ
పెట్టుబడిదారుడు సంపన్నుడవుతాడు - అయితే లోభి సంపన్నుడయ్యే పద్ధతిలో కాదు. లోభి తన సొంత శ్రమకీ , పరిమిత వినియోగానికీ ఉండే నిష్పత్తి వల్ల సంపన్నుడవుతాడు. అంటే ఎక్కువ శ్రమ చేస్తూ, తక్కువ వ్యయం చేయ్యడం ద్వారా అన్నమాట.
పెట్టుబడిదారుడు సంపన్నుడయ్యేది అలాకాదు. కార్మికుల  శ్రమని గుంజుకోవడం ద్వారా. ఇతరుల శ్రమని స్థాయిలో పిండుకుంటాడో, శ్రామికుల జీవితసుఖాల్ని స్థాయిలో బలవంతంగా వర్జింపచేస్తాడో ఆదేస్థాయిలో సంపన్నుడవుతాడు. భూస్వామి దుబారాలో ఉండే ఉదార లక్షణం పెట్టుబడిదారుడి దుబారాలో ఉండదు. అయినా, దానికి భిన్నంగా దాని వెనక డబ్బు పట్ల నీచమైన అత్యాశా, అత్యంత ఆరాటంతో కూడిన లెక్కలూ నక్కి ఉంటాయి. సంచయనంతో పాటు అతని ఖర్చు పెరుగుతుంటుంది. ఖర్చు సంచయనాన్నిగానీ, సంచయనం ఖర్చుని గానీ అదుపుచెయ్యకుండానే, రెండూ పెరుగుతుంటాయి.
పెట్టుబడి దారుడి హృదయంలో ఘర్షణ
  పెరుగుదలతో పాటు అదే సమయంలో అతని హృదయంలో సంచయనం పట్ల వ్యామోహానికీ, అనుభవించాలనే కాంక్షకీ మధ్య ఘర్షణ పెరుగుతుంది.
ఇక్కడ మార్క్స్ చరిత్రనించి ఒక ఉదాహరణ ఇస్తాడు. మాంచెస్టర్ లో అదనపువిలువ పెట్టుబడికీ, ఆదాయానికీ మధ్య విభజన ఎలా మారుతో వచ్చిందో తెలిపే ఉదాహరణ అది.
1795 లో ప్రచురితమైన పుస్తకంలో డాక్టర్ ఐకిన్ ఇలా చెప్పాడు: 
మాంచెస్టర్ వ్యాపారాన్ని 4 దశలుగా విభజించవచ్చు:
1.మొదటి దశ.కార్ఖానాదారులు బతుకుదెరువు కోసం కష్టపడి పనిచెయ్యక తప్పని దశ. దశలో పని నేర్చుకునే పిల్లల తలిదండ్రుల్నించి భారీగా డబ్బు వసూలు చేసి సంపన్నులయ్యారు. శిక్షణపొందే పిల్లలేమో ఆకలితో అలమటించేవాళ్ళు. మరొకపక్క సగటు లాభాలు కీతగా ఉండేవి.సంచయనం చెయ్యాలంటే, ఖర్చులు తగ్గించుకోవడం అవసరం అయ్యేది. వాళ్ళు పీనాసుల్లాగా బతికేవాళ్ళు. కనీసం పెట్టుబడిమీద వడ్డీనైనా వినియోగించుకునే వాళ్ళు కాదు.
2. రెండో దశ. కొద్దిపాటి సంపద సమకూర్చుకుంటున్న దశ. అంతకు ముందులాగే కష్టపడి పని చేశేవాళ్ళు.ఎందుకంటే, ప్రత్యక్ష దోపిడీకి శ్రమ పడల్సి ఉంటుంది. విషయం బానిసల్ని పెర్యవేక్షించే ప్రతివాడికీ తెలుసు. ఆదశలో వాళ్ళు అంతకుముందు లాగే నిరాడంబరంగా జీవించే వాళ్ళు.
3. మూడో దశ. ఆడంబరం ఆరంభమైన దశ. దేశం లోని ప్రతిమార్కెట్ కీ ఆర్డర్ల కోసం ప్రతినిధుల్ని పంపి వ్యాపారాన్ని ముందుకు నెట్టిన దశ. 1690 కి ముందు వ్యాపారంలో 3000-4000 సంపదించిన పెట్టుబడులు లేవు, ఉన్నా బహు కొద్ది మాత్రమే. ఎమైనా, అప్పట్లోనూ, కొంచెం తర్వాతా, వ్యాపారులు ముందుగా డబ్బు పొంది, కొయ్యతొ ,పూతతో ఉండే ఇళ్లకు బదులు,  ఆధునిక ఇటుక ఇళ్ళను కట్టుకున్నారు.18 శతాబ్దం తొలిభాగంలో సైతం ఒక మాంచెస్టర్ కార్ఖానాదారుడు  తన అతిధులముండు ఇంచుమించు అర లీటర్  విదేశీ ద్రాక్ష సారా పెట్టితన చుట్టుపక్కలవాళ్ళు, వ్యాఖ్యానాలు చేసి, తలలూపేటట్లు ప్రదర్శించాడు. యంత్రాలు పెరిగే ముందు కాలంలో, సాయంకాలం అందరు కార్ఖనాదారులతో కలిసినప్పుడు    కార్ఖానాదారుని ఖర్చు  ఒక గ్లాసు సార్యాయికి 6 పెన్నీలూ, పుగాకుచుట్తకు  పెన్నీ- అంతకన్నా ఏనాడూ మించేది కాదు.  యంత్రాలు పెరిగే ముందు కాలంలో, సాయంకాలం అందరు కార్ఖనాదారులతో కలిసినప్పుడు    కార్ఖానాదారుని ఖర్చు  ఒక గ్లాసు సారాయికి 6 పెన్నీలూ, పుగాకుచుట్తకు  పెన్నీ- అంతకన్నా ఏనాడూ మించేది కాదు. 1758 దాకా వ్యాపారీ తన సొంత పరివారంతో కనబడే వాడు కాదు.
4. నాలుగో దశ.18 శతాబ్దంలో చివరి 30 సంవత్సరాలు. దశలో ఖర్చులూ, ఆడంబరాలూ బాగా పెరిగాయి. ఐరోపా అంతటా వ్యాపార ప్రతినిధుల ద్వారానూ, ఇతర చర్యల ద్వారానూ వ్యాపారం విస్తరించింది.
నాలుగు దశల్ని వివరించాక మార్క్స్ ఇలా అంటాడు: ఐకిన్ గనక సమాధినుంచి లేచి వచ్చి, నేటి మాంచెస్టర్ ని చూస్తే? ఏమనేవాడో?    
పెట్టుబడియొక్క చారిత్రక కర్తవ్యం- సంచయనం చెయ్యడం
పెట్టుబడియొక్క చారిత్రక కర్తవ్యం ఏమిటో సాంప్రదాయ ఆర్ధికవేత్తలు స్పష్టంగా చెబుతారు.సామాజిక అభివృద్ధికి పెట్టుబడిదారుల్నీ కార్మికుల్నీ ఇరువురునీ ఇంజన్లుగా పరిగణిస్తారు.
కార్మికులు కష్టపడి పనిచెయ్యాలి, పెట్టుబడిదారులు సంచయనం చెయ్యాలి.
సంచయనం చెయ్యి!సంచయనం చెయ్యి!మోజస్ అదే, ప్రవక్తలూ అదే!. పొదుపు చెయ్, పొదుపుచెయ్ అంటే అదనపువిలువలో లేక అదనపు ఉత్పత్తిలో అత్యధిక భాగాన్ని తిరిగి పెట్టుబడిలోకి మార్చు అని. సంచయనం కొసమే సంచయనం, ఉత్పత్తి కోసమే ఉత్పత్తి: ఫార్ములా ద్వారా సాంప్రదాయ అర్ధశాస్త్రం బూర్జువాల చారిత్రక కర్తవ్యాన్ని వ్యక్తం చేసింది.
 జే.బి.సే సైతం ఇలా చెప్పాడు: భాగ్యవంతుల పొదుప్లు పేదలకి జరిగే నష్టం వల్ల ఏర్పడుతుంది.
సీస్మాండీ ఇలా అంటాడు: రోమన్ కార్మికుడు దాదాపు పూర్తిగా సమాజపు ఖర్చుమీద బతికాడు.. ఆధునిక సమాజం కార్మికుల నష్టం మీద, శ్రమకి చెల్లించే దాన్లో అట్టిపెట్టుకున్న దానిమీద బతుకుతున్నదని చెప్పవచ్చు. 
సాంప్రదాయ అర్ధశాస్త్రానికి కార్మికుడు అదనపు విలువని ఉత్పత్తిచేసే యంత్రం మాత్రమే; మరొకపక్క, పెట్టుబడిదారుడు, దాని దృష్టిలో అదనపు విలువని అదనపు పెట్టుబడిలోకి మార్చే యంత్రం మాత్రమే. రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడిదారుని చారిత్రక కర్తవ్యాన్ని భుజాని కెత్తుకుంది.
అదనపువిలువ భాగస్వాముల మధ్య శ్రమ విభజన
మాల్థూస్ 1820 ప్రాంతంలో ఒక శ్రమవిభజన ప్రచారం చేశాడు.ఉత్పత్తిలో నిమగ్నుడైన పెట్టుబడిదారునికి సంచయనం చేసే పనీ, అదనపు విలువలో ఇతర వాటాదార్లైన భూస్వాములకూ, ప్రభుసేవకులకూ, ఆస్థి పొందిన మతాధిపతులకూ ఖర్చుపెట్టే పనీ కేటాయించాడు. ఖర్చు చెయ్యయ్యాలనే కాంక్షనీ, సంచయనం చెయ్యాలనే వాంఛనీ వేర్వేరుగా ఉంచడం చాలా ముఖ్యమైంది - అంటాడు మాల్థూస్. 
అయితే ఎంతోకాలం నించీ సుఖంగా జీవిస్తూ, లోకానుభవం ఉన్న  పెట్టుబడిదారులు గగ్గోలు పెట్టారు. వాళ్ళ తరఫున మాట్లాడే ఆర్ధికవేత్తలకు మాల్థూస్ మాటలు నచ్చలేదు. వ్యతిరేకించారు, విమర్శించారు. రికార్డో శిష్యుల్లో ఒకడైతే, మాల్థూస్ ఎక్కువ అద్దెలూ,అధికపన్నులూ వగైరాల్ని బోధిస్తున్నాడా? దానివల్ల అనుత్పాదకమైన వినియోగాదారుల ఒత్తిడి మూలంగా పారిశ్రామికులు నిరంతరం ప్రోత్సహించబడతారు అని చెబుతున్నాడా? అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు..అయితే అటువంటి పద్ధతిలో ఉత్పత్తి ప్రోత్సహించబడడం కన్నా నిరోధించబడుతుంది. బలవంతపెడితే పనిచెయ్యగలిగిన ఎక్కువమందిని సోమరులుగా ఉంచి, ఇతరుల్ని ఒత్తి నొప్పి కలిగించడం న్యాయం కాదు- అన్నాడు.
వేతనాన్ని కనీస స్థాయికి తగ్గించడం
అయితే కార్మికుణ్ణి ' కష్టపడి పనిచేసే వాడిగా ' ఉంచేందుకు వేతనాన్ని కనీస స్థాయికి తగ్గించడం అవసరమని ఆప్రతినిధి అభిప్రాయం. అలాగే అదనపు విలువకి వనరు చెల్లింపులేని శ్రమను స్వాయత్తం చేసుకోవడమే అనే వాస్తవాన్ని అతను దాచిపెట్టడు.
అశాస్త్రీయ అర్ధశాస్త్రానికి ఆఖరి క్షణాలు
కార్మికుని నుంచి లాగిన దాన్ని సంచయనానికి అనువుగా పారిశ్రామిక పెట్టుబడి దారుడికీ, సంపన్న సోమరిపోతుకీ మధ్య పంచడం ఎలా అనే చర్చ జులై విప్లవంతో సమాప్తం అయింది. ఆతవాత కొద్ది కాలానికే లై ఆన్స్ పట్టణ కార్మికులు ప్రమాద గంట మోగించారు. ఇంగ్లండ్ లొ గ్రామీణ కార్మికులు పొలాల్లోని దొడ్లనీ, ధాన్యం కుప్పల్నీ తగలెయ్యడం మొదలు పెట్టారు.బ్రిటిష్ ఛానెల్ కి ఇవతల వైపు ఒవెన్ సిద్ధాంతమూ, అవతల వైపు సైమన్ సిద్ధాంతమూ, ఫొరియర్ సిద్ధాంతమూ వ్యాప్తిచెందడం ప్రారంభం అయింది. అశాస్త్రీయ అర్ధశాస్త్రానికి చివరి గంట మోగింది.
ఉత్పత్తికి సాధనంగా పరిగణించబడుతున్న పెట్టుబడి అనే పదానికి బదులుగా 'ఖర్చులో సంయమనం ' అనే మాటని వాడతాను అన్నాడు సీనియర్.
దాని మీద మార్క్స్ ఫుట్ నోట్ లో ఇలా అంటాడు : సీనియర్ శ్రమా లాభం అనే మాటలకు మారుగా శ్రమా కోరికల వర్జింపు అనే మాటలు వాడాడు.తన ఆదాయాన్ని పెట్టుబడిలోకి మార్చేవాడు ఎవరైనాగానీ, ఆఖర్చు తెచ్చే సుఖాన్ని వర్జించక తప్పదు.లాభాలకి మూలం పెట్టుబడి కాదు, ఉత్పాదకంగా వాడే పెట్టుబడి- సర్ జాన్ కాజనోవ్. అందుకు భిన్నంగా జాన్ స్టువర్ట్ మిల్ ఒకపక్క రికార్డో లాభ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాడు, మరొకపక్క సీనియర్ చెప్పే 'కోరికల త్యజింపు ' ఫలితాన్ని కలుపుతాడు. అతను అసంబద్ధమైన వైరుధ్యాల్లో చిక్కుకుంటాడు. గతితర్కం అంతటికీ వనరైన, హెగెల్ వైరుధ్యంలో కొట్టుమిట్టాడుతుంటాడు. ప్రతి మానవ చర్యనీ, దాని వ్యతిరేక దిశనుండి కూడా కోర్కెల వర్జింపుగా చూడవచ్చు - అనే మామూలు ఆలోచన అశాస్త్రీయ అర్ధ శాస్త్రజ్ఞుడికి తట్టదు. తినడం అనేది  ఉపవాసాన్ని త్యజించడం, నడవడం అనేది నిశ్చలంగా ఉండాడాన్ని వర్జించడం, పనిచెయ్యడం అనేది సొమరితనాన్ని  వర్జించడం, సోమరిగా ఉండడం పని చేయడాన్ని వర్జించడం వగైరా. అశాస్త్రీయ అర్ధశాస్త్ర ఆవిష్కరణల్లో ఇదొక పోటీ లేని మచ్చుతునక. ఆర్ధిక  భావాభివర్గం స్థానంలో ఇదొక భట్రాజు పదబంధం.
 త్యజింపు సిద్ధాంతం మీద విమర్శ 
ఆదిమ మానవుడు  విల్లులు చేసినప్పుడు శ్రమ చేస్తాడు, కాని అది వాంచని వర్జించడం కాదు - అంటాడు సీనియర్. ఇది వెనకటి సమాజాల్లో పెట్టుబడిదారుడి వైపునించి కోర్కెల వర్జింపు లేకుండానే శ్రమ సాధనాలు ఎలా, ఎందుకు తయారయ్యేవో వివరిస్తుంది. సమాజం ఎంతగా అభివృద్ధి అయితే, కోర్కెల వర్జింపు అంతగా అవసరమవుతుంది. అంటే,ఇతరుల శ్రమ ఫలాల్ని సొంతం చేసుకునే పరిశ్రమని నడిపే వాళ్ళ నుండి.
శ్రమ ప్రక్రియని నడపడానికి ఉన్న అన్ని షరతులూ, పెట్టుబడిదారుడికి సంబంధించి   పలు కోర్కెల వర్జింపు చర్యలుగా ఆకస్మికంగా మార్చబడతాయి. ధాన్యాన్ని మొత్తం తినకుండా, కొంత విత్తనాలుగా వాడినా -అది పెట్టుబడిదారుడి కోర్కెల త్యజింపే. ద్రాక్ష సారా పక్వం అయ్యే సమయం వచ్చినా - అది పెట్టుబడిదారుడి కోర్కెల త్యజింపే.
తన ఉత్పత్తిసాధనాల్ని- ఆవిరి యంత్రాల్నీ, పత్తినీ, రైలుమార్గాల్నీ,ఎరువునీ,గుర్రాల్నీ  వగైరాల్ని - కార్మికుణ్ణి తాత్కాలికంగా ఉపయోగించనిచ్చినప్పుడల్లా, పెట్టుబడి దారుడు తన్ను తాను కొల్లగొట్టుకుంటాడు. వేరే మాటల్లో, ఉత్పత్తి సాధనాల విలువని విలాసాలకోసం వినియోగించకుండా,వాటితో శ్రమశక్తిని ఉత్పత్తిసాధనాలకు  జోడించడం ద్వారా వాటి విలువని పెట్టుబడిగా పెంచినప్పుడల్లా, వాటి విలువల్ని విలాసాలకూ, ఇతర వస్తువులకూ ఖర్చు పెట్టుకోలేడు. సంచయనమే కాదు, పెట్టుబడిని మామూలుగా  భద్రపరచాలన్నా దాన్ని వినియోగించుకోవాలి అనే వాంఛని నిరంతరం ఎదుర్కునే యత్నం చెయ్యాలి. 
పెట్టుబడి దారులు  ఒక వర్గంగా ఈ ఫీట్ ఎలా చేస్తారు అనే రహస్యాన్ని ఇప్పటిదాకా చెప్పకుండా అశాస్త్రీయ అర్ధశాస్త్రం మొండికేసింది.  చాలు, ఆధునిక పెట్టుబడిదారుడి తనను తాను శిక్షించుకోవడం ద్వారా  (self chastisement) ద్వారా మాత్రమే ప్రపంచం బతుకుతున్నది,  ముందుకు పొతున్నది.
ప్రలోభం నించి విముక్తి
అందువల్ల, మానవజాతి మామూలు ఆదేశాలు పెట్టుబడి దారుణ్ణి ప్రలోభం (temptation) నుండి విడుదల విధిస్తాయి.  
బానిస యజమానికి సందిగ్ధస్థితి ఉండేది. తన నల్ల బానిసలనుంచి గుంజుకున్న అదనపు ఉత్పాదితాన్ని విచ్చలవిడిగా ద్రాక్ష సారా కి ఖర్చు పెట్టుకోవడమా, లేక అందులో ఒక భాగాన్ని మరింతమంది బానిసల్లోకీ, మరింత భూమిలోకీ మార్చడమా? అని. బానిస విధానం రద్దు గావడం వల్ల జార్జియా బానిస యజమాని ఆ సందిగ్ధస్థితి నించి విముక్తుడయ్యాడు .అలాగే పెట్టుబడి దారీ విధానం రద్దయితే, పెట్టుబడి దారుడు తన ప్రలోభం నుంచి, సందిగ్ధస్థితి నించి విముక్తి పొందుతాడు.
భిన్న తరహాల సమాజ ఆర్ధిక రూపాల్లో, సరళ పునరుత్పత్తి మాత్రమే కాక వివిధ స్థాయిల్లో క్రమంగా పెరిగే స్థాయిలో కూడా పునరుత్పత్తి జరుగుతుంది. ఆస్థాయిల్ని బట్టి  మరింత ఉత్పత్తవుతుంది, మరింత వినియోగమవుతుంది.ఫలితంగా మరిన్ని ఉత్పాదితాలు ఉత్పత్తిసాధనాల్లోకి మార్చ బడాల్సి వస్తుంది.ఏమైనా,కార్మికుని ఉత్పత్తిసాధనాలూ వాటితోపాటు అతని ఉత్పాదితమూ, అతని జీవితావసర సాధనాలూ పెట్టుబడి రూపంలో అతన్ని ఎదుర్కోనంతవరకూ  ప్రక్రియ పెట్టుబడి సంచయనంగా గానీ, పెట్టుబడి దారుడి కలాపంగాగానీ కనిపించదు.
పాయింట్ మీద రిచర్డ్ జోన్స్ రెండు ముఖ్య వాస్తవాల్ని దృష్టిలో ఉంచుకొని చర్చిస్తాడు.హిందూ జనాభాలో ఎక్కువ మంది తమపొలాల్లో తామే సేద్యంచేసుకునే రైతులు. వాళ్ళ ఉత్పాదితాలూ, వాళ్ళ ఉత్పత్తి సాధనాలూ, వాళ్ళ జీవితావసర సాధనాలూ ఎన్నడూ ఆదాయం నుండి పొదుపు చేయబడిన నిధి రూపం తీసుకోలేదు. ఆనిధి అంతకుముందు జరిగిన సంచయన ప్రక్రియలో  కలిసిపోయింది.
మరొకపక్క, పాత పద్ధతిని బ్రిటిష్ పాలన ప్రాంతాల్లో అత్యల్పంగా మాత్రమే భంగ పరిచిందో, అక్కడి వ్యవసాయేతర కార్మికుల్ని ధనవంతులే (magnates) నేరుగా నియమించేవాళ్ళు. వ్యవసాయ అదనపు ఉత్పాదితంలో ఒక భాగాన్ని కౌలుగా వాళ్ళు పొందేవాళ్ళు. ఉత్పాదితంలో ఒక భాగాన్ని వస్తురూపంలో ధనికులు వినియోగించుకునేవాళ్ళు. మరొక భాగాన్ని ధనికుల విలాసవస్తువులుగా కార్మికుల చేత మార్చబడేది.మిగిలిన భాగం వేతనాలుగా ఉండేవి, శ్రమ పరికరాలు శ్రామికులవే.ఇక్కడ ఉత్పత్తీ, పునరుత్పత్తీ క్రమంగా పెరిగే స్థాయిలో కోర్కెల్ని వర్జించే వాడైన పెట్టుబడి దారుడి ప్రమేయం లేకుండానే కొనసాగాయి.
వచ్చే పోస్ట్: సంచయన పరిమాణాన్ని నిర్ణయించే ఇతర అంశాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి