5, అక్టోబర్ 2018, శుక్రవారం

పెట్టుబడి సంచయనం


కాపిటల్ మొదటి సంపుటం -7 భాగం 23
అధ్యాయం 23  పెట్టుబడి సంచయనం
'కాపిటల్ ' మొదటి సంపుటం మొత్తంలో  7 భాగం ( పెట్టుబడి సంచయనం) మకుటాయమానమైనదిగా భావిస్తారు.
పెట్టుబడి సంచయనం అంటే : అదనపు విలువని పెట్టుబడిగా నియోగించడమే, దాన్ని తిరిగి పెట్టుబడిలోకి మార్చడమే పెట్టుబడి సంచయనం.
*******
పెట్టుబడి చలామణీ
పెట్టుబడిగా వ్యవహరించబోయే డబ్బు వేసేతొలి అడుగు:  ఉత్పత్తి సాధనాల్లోకీ, శ్రమ శక్తిలోకీ మారడం. పరివర్తన మార్కెట్లో, చలామణీ రంగంలో జరుగుతుంది.  
ఆడబ్బు వేసే మలి అడుగు: ఉత్పత్తి ప్రక్రియ. ఇది ఉత్పత్తి సాధనాలు సరుకులుగా మారగానే పూర్తవుతుంది. ఆసరుకుల విలువ వాటి అంతర్భాగాల విలువకన్నా ఎక్కువ. ఎందుకంటే, వాటి విలువలో పెట్టిన పెట్టుబడి విలువకి తోడు అదనపు విలువ కూడా కలిసి ఉంటుంది.
సరుకులు చలామణీలోకి రావాలి, అమ్ముడవాలి. వాటివిలువ డబ్బులో సిద్ధించాలి. ఆడబ్బు మరలా పెట్టుబడిలోకి మారాలి. ఇలాగే మరలమరల నిరంతరాయంగా కొనసాగాలి. చక్రీయ చలనమే పెట్టుబడి చలామణీ.
సంచయనానికి ఉండాల్సిన పరిస్థితి: పెట్టుబడిదారుడు సరుకులు అమ్మి, వచ్చిన డబ్బులో పెద్దభాగాన్ని పెట్టుబడిలోకి మార్చగలగాలి. రాబోయే పేజీల్లో ముందుగా  పెట్టుబడి మామూలుగానే (the normal way)చలామణీ అవుతున్నదని అనుకుంటాం. మామూలుగానే అంటే, పెట్టుబడిదారుడికి తనసరుకుల్ని వాటి విలువకే అమ్మడంలో ఇబ్బందులేవీ లేవని; వాళ్ళకొచ్చిన అదనపువిలువని ఉత్పత్తిలో పెట్టడానికి ఆటంకాలేవీ లేవని. అందువల్ల సరుకులన్నీ విలువకే అమ్ముడవుతాయి.ఉత్పత్తి తక్కువాలేదు, ఎక్కువా లేదు. సరిపడాఉంది. సమతుల్యంగా ఉంది. గిరాకీకి సరిగ్గా సరిపోయే సరఫరా ఉంది. ఊహ సరైనదేనా? సహేతుకమైనదేనా? కానే కాదు. ఎందుకంటే సరఫరాకి సరిపోయే గిరాకీ ఉంటే సంక్షొబహానికి అవకాశం ఉండదు. కాని ఇప్పటికి ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. కారణం సరఫరాకంటే గిరాకీ తక్కువ ఉండడమే. వాస్తవంగా అవి రెండూ సమంగా లేకున్నా, ఉన్నట్లే అనుకుని ముందుకు పోతాడు. మార్క్స్ ఊహని తర్వాతి సంపుటాల్లో వదిలేస్తాడు. కాని రాబోయే 3 అధ్యాయాల్లో వాటికి గట్టిగా కట్టుబడి ఉంటాడు. ఈ ప్రక్రియ కి సంబంధించిన సవివర విశ్లేషణ 2 వ సంపుటిలో వస్తుంది.
అదనపువిలువని పంచుకోవాల్సి ఉంటుంది
అదనపువిలువని ఉత్పత్తిచేసే పెట్టుబడిదారుడు, అంటే చెల్లించబడని శ్రమని నేరుగా గుంజి సరుకుల్లో ఇమిడ్చి మొదట స్వాధీనం చేసుకుంటాడు. కాని అతడే ఆమొత్తానికి ఏకైక ఓనర్ కాదు. ఉత్పత్తిలో ఇతర క్రియలు పూర్తిచేసే ఇతర పెట్టుబడిదారులతోనూ, భూయజమానులతోనూ దాన్ని పంచుకోవాల్సి ఉంటుంది.అందువల్ల్ల అదనపువిలువ వివిధ భాగాలుగా - లాభం, వడ్డీ, వర్తక లాభం, అద్దె వగయిరాలుగా - విభజితమవుతుంది. అదనపు విలువయొక్క మారిన రూపాలు మూడో సంపుటంలో మాత్రమే చర్చకు వస్తాయని ఇక్కడ చెబుతాడు మార్క్స్.
ఇక్కడ చర్చించే విషయాలను వివరించచడంలో ఉన్నట్లుగా అనుకునే పరిస్థితుల్ని (assumptions) చెబుతాడు:
1. ఒకపక్క, పెట్టుబడిదారుడు సరుకుల్ని వాటి విలువకే అమ్ముతాడని అనుకుంటాము. చలామణీ రంగంలో ఉన్నప్పుడు పెట్టుబడి తీసుకునే కొత్త రూపాల్ని గానీ, ఈరూపాల మాటున దాగిన నిర్దిష్ట పునరుత్పత్తి పరిస్థితుల్ని గానీ పట్టించుకోము.
2. మరొకపక్క, పెట్టుబడిదారీ ఉత్పత్తిదారుణ్ణి మొత్తం అదనపు విలువకి ఓనర్ గా, అంతకన్నా మెరుగ్గా చెప్పాలంటే, దోచిన సొత్తులో భాగస్తులకు ప్రతినిధిగా పరిగణిస్తాం.
3. పైకి చెప్పని మూడో ఊహ : కొంచెం తర్వాత ఒక ఫుట్ నోట్ లో ఇది బయట పడుతుంది. ఎగుమతి వర్తకాన్ని లెక్కకి తీసుకోడు. పరిశోధనాంశాన్ని దాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితులనించి విడగొట్టాలంటే, వాణిజ్య ప్రపంచం మొత్తాన్నీ ఒకే దేశంగా చూడాలి. పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రతిచోటా నెలకొని ఉన్నదనీ, ప్రతి పారిశ్రామిక శాఖనీ పట్టుకున్నదనీ అనుకోవాలి.
ఊహల (assumptions) అర్ధం ఏమంటే, ఇక్కడ సంచయన ప్రక్రియని ప్రపంచంలో జరిగే రీతిలో చర్చించడంలేదు;మొదట అనిర్దిష్ట దృక్పధంతో (abstract point of view)- అంటే, వాస్తవ ఉత్పత్తిప్రక్రియలో కేవలం ఒక దశగా మాత్రమే పరిగణిస్తున్నాము.
మరొకపక్క, సంచయనప్రక్రియ యొక్క సరళ మౌలిక రూపం నిగూఢం అవుతుంది:
1. దాన్ని తెచ్చే చలామణీ  ప్రభావం వల్లా
 2.అదనపువిలువ విభజితమవడం వల్లా.
అందువల్ల, ప్రక్రియని కచ్చితంగా విశ్లేషించాలంటే, మనం లోపలి విషయాన్ని మరుగుపరిచే అన్ని విషయాల్నీ ప్రస్తుతం పక్కన బెట్టితీరాలి.
7 భాగం( పెట్టుబడి సంచయనం)  చదివేటప్పుడు   మార్క్స్ ఏ పరిస్థితులు ఉన్నాయనుకున్నాడో, అనుకుని ముందుకు పోయాడో, ఆ ఊహల్ని (assumptions) మనసులో పెట్టుకోవాలి. ఆయన నిర్ధారణలు  వాటిని బట్టే ఉంటాయి. అంతేగాని అవి సార్వత్రికమైనవి కావు. ఆ ఊహల్ని సడలించినా, ఎత్తివేసినా ఆనిర్ధారణలు అలాగే ఉండవు. అందుకే ఆయన ఏ ఊహలమీద అధారపడి నిర్ధారణలు చేశాడో, ఆవూహల్ని ముందుగానే చెప్పాడు.
వచ్చే పోస్ట్ : సరళ పునరుత్పత్తి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి