23, ఆగస్టు 2018, గురువారం

కాలం వేతనాలు (Time-Wages )


అధ్యాయం 20
కాలం వేతనాలు (Time-Wages )
వేతనాలు చాలా రూపాల్లో ఉంటాయి. వాటిలో మౌలికమైన రెండు రూపాల గురించి చాప్టర్ చర్చించింది. ఆరూపాలు:
1.కాలాన్ని బట్టి వేతనాలు
2.చేసిన వస్తువుల పరిమాణాన్ని బట్టి వేతనాలు
శ్రమ శక్తి ఎంతో కొంత కాలానికి పరిమితమై మాత్రమే అమ్మాలి. మొత్తం అమ్మితే అది బానిస వ్యవస్థ అవుతుంది.దీన్నిబట్టి, రూపం ఏదైనా, శ్రమ శక్తిని అమ్మిన కాలానికి కొలత ఉండాలి. కాలం వేతనాల్లో కొలత నేరుగా ఉంటుంది. శాల్తీ వేతనాల్లో పరోక్షంగా ఉంటుంది.
శ్రమ శక్తి అమ్మకం ఫలానింత కాలానికి అని- రోజుకనో,వారానికనో ఇలా- ఉంటుంది. కాబట్టి  'కాలం వేతనాలు' (time wages).
కాలం వేతనాలు రోజుకనో, వారానికనో చెల్లించబడతాయి.
కాలం వేతనాల గురించి కొన్ని విషయాలు:
శ్రామికుడు రోజు శ్రమకో వారం శ్రమకో పొందే డబ్బు మొత్తం నామక వేతనం (nominal wages).
నామక వేతనం నుంచిశ్రమ ధర’ వస్తుంది.
శ్రమ ధర అనేది శ్రమ విలువనుండి రాబట్టింది కాదు.అంటే దాని విలువని డబ్బులో చెప్పినందువల్ల వచ్చింది కాదు. ఎందుకంటే, శ్రమ విలువ అనేది ఉండనే ఉండదు.
శ్రమ ధర అనేది ఏమిటి? దాన్ని లెక్కించేది ఎలా?
అది శ్రమ శక్తి ధర యొక్క పరివర్తిత రూపం. దాన్ని చుట్టుతిరుగుడు పద్ధతిలో లెక్కించాలి.
రోజు సగటు శ్రమ శ్రమశక్తి ధరని రోజులో చేసిన సగటు పనిగంటల సంఖ్య చేత భాగిస్తే వచ్చేదే సగటు శ్రమ ధర. ఉదాహరణకి రోజు శ్రమ శక్తి విలువ 3 షిల్లింగులూ, అంటే 6 గంటల ఉత్పాదితం ధర అనీ, పనిదినం 12 గంటలనీ అనుకుందాం. అప్పుడు ఒక పని గంట ధర 3/12 షిల్లింగులు, అంటే 3 పెన్నీలు అవుతుంది. ఆవిధంగా లెక్కించిన గంట పనిధర శ్రమ ధరకి కొలత యూనిట్ గా ఉపకరిస్తుంది.

దీన్ని బట్టి వచ్చే విషయాలు:
1. శ్రమ ధర తగ్గుతూ ఉన్నా, వేతనాలు అలాగే స్థిరంగా ఉండవచ్చు.
ఉదాహరణకి, మామూలు పనిదినం 10 గంటలూ, రోజు శ్రమశక్తి ధర 3 షిల్లింగులూ అయితే, ఒక పనిగంట ధర 3 3/5 పెన్నీలు. పనిదినం 12 గంటలకు పెరిగితే, పనిగంట ధర 3 పెన్నీలకు తగ్గుతుంది. అదే 15 గంటలయితే, 2 2/5 పెన్నీలకు పడిపోతుంది.
గంట శ్రమ ధర తగ్గినప్పటికీ, వేతనం తగ్గదు. కారణం అది అలాగే ఉండే స్థాయిలో పనిగంటలు పెరగడమే.
2.ఇందుకు విరుద్ధంగా, శ్రమ ధర స్థిరంగా ఉన్నా, ఒకవేళ తగ్గుతూ ఉన్నా రోజువారీ/ వారం వారీ వేతనాలు పెరగవచ్చు. ఉదాహరణకి, పనిదినం 10 గంటలూ, రోజు శ్రమ శక్తి విలువ 3 షిల్లింగులూ అయితే, ఒక పనిగంట ధర 3 3/5 పెన్నీలు. వ్యాపారం పెరిగినందువల్ల, శ్రామికుడు 12 గంటలు పనిచేస్తే, శ్రమ ధర అలాగే ఉంటే,ఇప్పుడు అతని రోజు వేతనం 3 షిల్లింగుల  7 1/5 పెన్నీలకు పెరుగుతుంది- శ్రమ ధరలో ఏమాత్రం మార్పు లేకుండానే.శ్రమ విస్తృతి మారకపోయినా, శ్రమ తీవ్రత  పెరిగినా గూడా అదే ఫలితం వస్తుంది.  కాబట్టి నామ వేతనాల పెరుగుదలని మార్పులేని శ్రమధర అయినా, పడిపోతున్న శ్రమ ధర అయినా అనుసరించవచ్చు. శ్రామిక కుటుంబ పెద్ద చేసే శ్రమమొత్తానికి, కుటుంబ సభ్యుల శ్రమ కూడా కలిసి శ్రమ మొత్తం పెరిగినప్పుడు కూడా శ్రామికుని కుటుంబ ఆదాయానికి ఇదే సూత్రం వర్తిస్తుంది. అందువల్ల, నామ వేతనాలు తగ్గించకుండానే, శ్రమ ధరని తగ్గించే పద్ధతులు ఉన్నాయి.  
బడా పారిశ్రామికవేత్తలకు శ్రమ ధర యొక్క నామక పరిమాణాన్ని మార్చడమే కాక, శ్రమ ధరని ఎలా పెంచాలో, ఎలా తగ్గించాలోకూడా తెలుసు.
2.గంట వేతనమూ -పనిదినం పొడవూ

దిన వేతనం  శ్రమ శక్తి విలువ చేత నిర్ణయమవుతుంది. శ్రమ ధర దిన వేతనం నుండి రాబట్టబడుతుంది. జీవితావసర వస్తువుల విలువ 500 రూపాయయలు అయితే వేతానం 500. వేతనాన్ని బట్టి    శ్రమ ధర ఎంతో లెక్కించాలి.  వేతనానికి  పనిగంటలతో నిమిత్తం ఉండదు. శ్రమ ధర లెక్కలో పనిగంటల సంఖ్య ఒక కారణాంకం (factor). అలా అయినప్పుడు, రోజు వేతనాన్ని పనిదినం పొడవుచేత భాగిస్తే శ్రమ ధర వస్తుంది.అయితే, ఉపరితలం మీద రోజు వేతనం లెక్కకు ఆధారం శ్రమధరే కాని శ్రమ శక్తి విలువ కాదు.
ఒక సాధారణ నియమం ఏమంటే:
రోజువారీ/ వారం వారీ శ్రమ స్థిరంగా ఉంటే, అప్పుడు వేతనాలు శ్రమ ధరని బట్టి ఉంటాయి. శ్రమ ధరే శ్రమశక్తి విలువని బట్టి గానీ, లేదా దాని ధరకీ విలువకీ మధ్య ఉండే వ్యత్యాసాన్ని బట్టిగానీ మారుతూ ఉంటుంది. మరొకపక్క, శ్రమ శక్తి ధర ఫలానింతని ఉంటే, వేతనాలు శ్రమ పరిమామాణాన్ని బట్టి ఉంటాయి.
పనిగంటలు తగ్గితే వేతనం తగ్గుతుంది

పని దినం పొడవు తగ్గితే, అంటే పనిగంటలు తగ్గితే, శ్రామికుడి వేతనం తగ్గుతుంది.
కాలం వేతనాల కొలమానం ఒక పని గంట ధర. ఇది ఒక రోజు శ్రమశక్తి విలువని సగటు పనిదినంలో ఉన్న గంటల సంఖ్యచేత భాగిస్తే వచ్చేది. కాలం వేతనం పనిగంటల్ని బట్టి వచ్చేది. గంట శ్రమ ధర 50 రూపాయలయితే 8 గంటలకు 400 వస్తుంది. 6 గంటలయితే 300 వస్తుంది.
 పనిదినం 12 గంటలనీ, శ్రమ శక్తి విలువ 3 షిల్లింగులనీ (అంటే, 6 గంటల ఉత్పాదితం విలువ) అనుకుందాం. అప్పుడు, పనిగంట ధర 3 పెన్నీలు.గంటలో ఉత్పత్తయ్యే విలువ 6 పెన్నీలు. ఇప్పుడు శ్రామికుడు 12 గంటలకంటే తక్కువ కాలం 6 గంటలో 8 గంటలో నియమితుడయితే ఆగంటల్ని బట్టి అతనికి రోజుకి 1 షిల్లింగు 6 పెన్నీలో, 2 షిల్లింగులో వస్తాయి. అతను బతకడానికి అది సరిపోదు.
మన పరికల్పన (hypothesis) ప్రకారం శ్రామికుడు రోజు వేతనాన్ని ఉత్పత్తిచెయ్యడానికి 6 గంటలు పనిచెయ్యాలి. ప్రతి గంటలో సగం మాత్రమే తనకోసం, మిగతా సగం పెట్టుబడిదారుడికోసం  పనిచేస్తాడు.కాబట్టి అతను 12 గంటల కన్న తక్కువ పనిచేస్తే, 6 గంటల ఉత్పాదితం విలువ పొందడు.పోయిన అధ్యాయాల్లో అతిపని (over work) వల్ల వినాశకరమైన పర్యవసానాల్ని తెలుసుకున్నాం. ఇక్కడ చాలీ చాలని అరకొర నియామకం వల్ల శ్రామికుల బాధల కారణాల్ని తెలుసుకుంటాం..

ఒక గంట వేతనం నిర్ణయమయ్యాక, పెట్టుబడి దారుదు ఒక రోజుకో, వారానికో వేతనం చెల్లించాల్సిన పని ఉండదు. అతను ఎన్నిగంటల పనిచేయించుకో దలిస్తే, అన్ని గంటలకు మాత్రమే చెల్లించాలి. గంట వేతనం (లేక, యూనిట్ శ్రమధర కొలమానం) ఎంతో లెక్కించేందుకు మొదట ఏది ఆధారమయిందో , ఆకాలం కన్నా తక్కువ కాలానికే శ్రామికుణ్ణి పెట్టుకోవచ్చు.
యూనిట్ ని నిర్ణయించే విధానం:
రోజు శ్రమ శక్తి ధరని పనిరోజు లో ఉండే గంటల సంఖ్యబెట్టి భాగిస్తే వస్తుంది. యూనిట్ ఈనిష్పత్తి చేత నిర్ణయమవుతుంది కనుక, పనిదినం అంటే ఫలానిన్ని గంటలు అని ఉండదు. చెల్లించబడిన శ్రమకీ, చెల్లించబడని శ్రమకీ సంబంధం పోతుంది. శ్రామికుడికి జీవితావసరాలకి  అవసరమైన శ్రమకాలాన్ని అనుమతించకుండా, పెట్టుబడిదారుడు అతని శ్రమ నుండి కొంత అదనపు శ్రమని పిండుకుంటాడు. 
తన అనుకూలతని బట్టీ, ప్రయోజనాన్ని బట్టీ, తన ఇష్టాన్ని బట్టీ ఒకప్పుడు అత్యంత అధికమైన పని పెడతాడు. మరొకప్పుడు తక్కువ పని ఇస్తాడు, లేక అసలు పనే పెట్టకపోవచ్చు. అతను ఉద్యోగ క్రమాన్ని ధ్వంసం చేస్తాడు.  మామూలు శ్రమ ధర చెల్లిస్తున్నాను అనే వంకతో పనిదినాన్ని అసాధారణంగా పెంచగలడు - ఈరకమైన గంటల లెక్కన వేతనం నిర్ణయించాలని పెట్టుబడిదారులు చేసిన ప్రయత్నాన్ని లండన్ నిర్మాణరంగ కార్మికులు ప్రతిఘటించారు. 1860 లో కార్మికులు సహేతుకమైన విప్లవం చేశారు. పనిదినాన్ని చట్టబద్ధంగా పరిమితం చెయ్యడం మోసాన్ని అంతం చేస్తుంది.
అయితే యంత్రాల పోటీ వల్లా, కార్మికుల నైపుణ్యంలో మర్పుల వల్లా, పాక్షికమైన, లేదా సాధారణమైన సంక్షోభాల వల్లా ఉద్యోగాలు తగ్గడాన్ని అది నివారించ జాలదు.

ఎక్కువ పనిగంటలూ- ఓవర్ టైం వేతనం

రోజు వేతనం పెరుగుతున్నా, శ్రమధర మారకుండా అలాగే ఉంటూ గూడా, మామూలు స్థాయికన్నా తగ్గవచ్చు.ఇలా ఎప్పుడు జరుగుతుంది? ఒక గంట శ్రమకి లెక్కించిన శ్రమధర స్థిరంగా ఉండి, పనిదినం మామూలుకన్న పెరిగినప్పుడల్లా ఇదే జరుగుతుంది .
  రోజు శ్రమశక్తి విలువ/పనిదినం  అనే భిన్నంలో హారం పెరిగితే, లవం మరింత వేగంగా పెరుగుతుంది.
తన అరుగుదలమీద ఆధారపడి ఉండే శ్రమశక్తి విలువ పనికాలం పెరిగేకొద్దీ పెరుగుతుంది.పనిదినం పరిమితి లేని శాఖల్లో కాలం వేతనం సాధారణ నియమంగా ఉన్నప్పుడు మామూలు పనిదినానికి ఎదో ఒక పాయింట్ దగ్గర పరిమితి (10 గంటలు లేక 12 గంటలు) దానికదే ఏర్పడుతుంది. ఆపరిమితి దాటితే ఓవర్ టైం. అప్పుడు చేసే పనికి మామూలు పనికంటే అదనంగా ఇవ్వాలి. అయితే అది మామూలు ధరతో పోలిస్తే తరచుగా బహు కొద్ది.
ఉదాహరణకి, లేసు ఉత్పత్తిలో ఒవర్ టైం కి చెల్లించె రేటు చాలా తక్కువ - గంటకి  ½  పెన్నీ ¾  పెన్నీ నించి 2 పెన్నీల లోపు. శ్రామికులు ఎక్కువ పనిచేసినందువల్ల కోల్పోయే ఆరోగ్యానికీ, సత్తువకీ అది చాలదు. ఆలా సంపాదించిన కొద్ది డబ్బు తరచుగా అదనపు ఆహారానికి ఖర్చుచెయ్యాల్సి వచ్చేది.
ఇక్కడ వాస్తవ పనిదినం మామూలు పనిదినం గానూ, ఓవర్ టైం గానూ విభజితమైంది. మామూలు పనిదినం 10 గంటలు. ఓవర్ టైం 2 గంటలు అయిటే, వాస్తవ పనిదినం 10+2=12 గంటలు.అంటే, వాస్తవ పనిదినంలో మామూలు పనిదినం ఒక భాగంగా ఉంటుంది.  మొత్తం సంవత్సరంలో వాస్తవ పనిదినం మామూలు పనిదినం కంటే ఎక్కువగా వుంటుంది.
ఉదాహరణకి, కాగితాలకు రంగేసే పరిశ్రమ ఫాక్టరీ చట్టంకిందికి రాక ముందు,రోజు పని 10 ½ గంటలు. అది దాటితే ఓవర్ టైం. సాయంత్రం నాలుగున్నర కల్లా రోజుపని పూర్తిచెయ్యడానికి తిండికోసం కూడా పని ఆపకుండా పనిచేసేవాళ్ళు. అప్పటినించీ ఓవర్ టైం చేసే వాళ్ళు. సాయంత్రం  6 గంటలకి ముందు పని ఆపడం అరుదు. వస్తవానికి, ఏడాది పొడుగునా ఓవర్ టైం చేస్తూనే ఉండేవాళ్ళు.
మామూలు పనిదినంలో కంటే అది దాటాక వచ్చే శ్రమధర ఎక్కువ. కాబట్టి సరిపడా వేతనం పొందాలంటే ఓవర్ టైం చెయ్యలనే ఒత్తిడి అతనిమీద ఉంటుంది.

ఉదాహరణకి, స్కాట్ లాండ్ బ్లీచింగ్ పనులు 1862 లో ఫాక్టరీ చట్టం కిందికి వచ్చాయి. అంతకు ముందు ఓవర్ టైం పద్ధతి నడిచేది. మామూలు పనిదినం 10 గంటలు. దానికి రోజుకి 1 షిల్లింగు 2 పెన్నీలు. ఒవర్ టైం కి గంటకి 3 పెన్నీలు. రోజుకి మూ డు, నాలుగు గంటల ఓవర్ టైం ఉండేది. విధానం ఫలితం ఇదే: ఓవర్ టైం చెయ్యకుండా ఉంటే, వారానికి 8 షిల్లింగులు మించి రాదు. ఒవర్ టైం లేకుండా సరైన వేతనం పొందలేరు. కాబట్టి ఓవర్ టైం చేస్తారు. పైగా గంటపని ధర ఎక్కువ గనక చెయ్యకుండా ఉండలేరు.
లండన్ లో బుక్ బైండింగ్ పనిలో 14,15 ఏళ్ళ ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. ఫలానిన్ని గంటలు పనిచెయ్యాలి అనే ఒప్పండం ఉంటుంది.అయినాగాని, ప్రతినెలా చివరివారంలో రాత్రి 10,11,12  గంటలదాకానో, మర్నాడు ఒంటి గంట దాకానో పనిచేస్తారు - పెద్ద వాళ్ళైన మగవాళ్ళతో కలిసి. యజమానులు వాళ్ళని అదనపు వేతనంతోనూ, రాత్రి తిండి తోనూ ఊరిస్తారు.
పనిదినానికి చట్ట పరిమితి
పనిదినానికి సంబంధించిన చట్టపరమైన పరిమితి పెట్టుబడిదారులకు  పై సదుపాయాలను లేకుండా చేస్తుంది.
లండన్ నిర్మాణ కార్మికులు పరిస్థితిని సరిగ్గా గ్రహించారు.1860 సమ్మె, లాక్ ఔట్ కాలంలో గంటల్ని బట్టి వేతనం పద్ధతిని ఒప్పుకునేందుకు రెండు షరతులు పెట్టారు:
1. గంట పనిధరతో పాటు,  9,10 గంటల మామూలు పనిదినాన్ని నిర్ణయించాలి.10 గంటల పనిదినంలో గంట శ్రమధర 9 గంటల పనిదినంలో కంటే ఎక్కువ ఉండాలి.
2. మామూలు పనిదినం దాటితే, ప్రై గంటల్ని  ఓవర్ టైం గా పరిగణించి, గంట గంటకీ ఎక్కువ ఇవ్వాలి.అంటే మొదటి గంట కంటే రెండొ గంటకి ఎక్కువ, మూడో గంటకి రెండో గంట కంటే ఎక్కువ  అలా పెంచుతూ పోవాలి.  

మామూలు పనిగంటలు పెరిగితే, వేతనాలు తగ్గుతాయి
మామూలు పనిదినం పొడవు పెరిగేకొద్దీ వేతనాలు తగ్గుతాయి. ఈ వాస్తవం తెలిసిందే.రెడ్ గ్రేవ్ అనే ఫాక్టరీ ఇన్స్పెక్టర్ 1839-1859 మధ్య 20 సంవత్సరాల్లో 10 గంటల పనిదినం ఉన్న ఫాక్టరీల్లో వేతనాలు పెరిగాయనేఏ, 14,15 గంటలున్న ఫాక్టరీల్లో వెతనాలు తగ్గాయనీ తేల్చి చెప్పాడు
శ్రమధర స్థిరంగా వుంటే, రోజువారీ/వారంవారీ వేతనం ఖర్చయిన శ్రమ పరిమాణాన్ని బట్టి ఉంటుంది.
 ఈసూత్రాన్ని బట్టి వచ్చే  విషయాలు:
శ్రమధర ఎంత తక్కువగా ఉంటే,ఎదో కీతా సగటు వేతనం పొందడానికి కూడా, ఎక్కువ శ్రమ పరిమాణం ఉండాలి. శ్రమధర తక్కువగా ఉండడం అనేది శ్రమకాలాన్ని పొడిగించడానికి ప్రేరణగా ఉంటుంది. 
ఉదాహరణకి ఇంగ్లండ్ లో చేత్తో చీలలు చేసే వాళ్ళ శ్రమధర చాలా తక్కువగా ఉండేది. కొద్దిదైన వారం వేతనం సరిచేసుకోడానికి  15 గంటలపాటు పనిచేయాల్సి వచ్చేది.
వేతనం 11 పెన్నీల కొసం, లేక ఒక షిల్లింగు కొసం  రోజుకి 15 గంటలు కఠోరంగా పనిచేయాల్సి వచ్చేది.అది కాక పనిముట్ల అరుగుదల,కొలిమి ఖర్చు, వృధాపోయే ఇనుం -అన్నీ కలిపి 2 ½ పెన్నీలో 3 పెన్నీలో పోయేవి. స్త్రీలకు అదేపనికి వారానికి 5 షిల్లింగులు మాత్రమే.
మరొకపక్క,పనికాలం పొడిగింపు అనేది శ్రమ ధరని పడిపోయేట్లు చేస్తుంది. దాంతో పాటు రోజు/వారం వేతనం తగ్గేట్లు చేస్తుంది. శ్రమ ధర =  రోజు శ్రమశక్తి విలువ/రోజు పనిగంటల సంఖ్య  అనే సూత్రం ప్రకారం పరిహారం లేకుండా, పని దినం నిడివి పెరిగితే, శ్రమధర తగ్గుతుంది. కాలక్రమంలో  పనిదినాన్ని పొడిగించేందుకు పెట్టుబడిదారుడికి వీలుకల్పించే  పరిస్థితులే,  పెరిగిన గంటల మొత్తం ధర తగ్గేదాకా, రోజు వేతనం లేక వారం వేతనం తగ్గేదాకా   శ్రమ ధరని మొదట నామకా తగ్గించడానికి అనుమతిస్తుంది. చివరకి ఒత్తిడి పెడుతుంది. ఇక్కడ రెండు పరిస్థితులు చెబితే సరిపోతుంది:

1.ఒక మనిషి ఒకటిన్నర మనిషి పని గానీ, ఇద్దరు మనుషులంత పనిగానీ చేస్తే, శ్రమ సరఫరా పెరుగుతుంది.మార్కెట్లో శ్రమశ్రక్తి సరఫరా ఉన్నదున్నట్లే, స్థిరంగా ఉన్నప్పటికీ.ఆవిధంగా కార్మికుల మధ్య సృజించబడిన పోటీ, శ్రమ ధరని తగ్గించేందుకు పెట్టుబడిదారుడికి వీలు కలిగిస్తుంది.మరొకపక్క పడిపోతున్న శ్రమ ధర పనిదినాన్ని పొడిగించేందుకు పెట్టుబడిదారుడికి అవకాశం ఇస్తుంది.  
ఉదాహరణకి ఒక కార్మికుడు ఎక్కువ గంటలు పనిచేయ్యడానికి నిరాకరిస్తే, త్వరలో ఎంతకాలమైనా చేసే మనిషిని పెట్టుకొని, ఇతన్ని పనినిచి నెట్టేయ్యడం జరుగుతుంది. ఒకడు ఇద్దరి పని చేస్తే, లాభాలు పెరుగుతాయి. శ్రమ అదనంగా సరఫరా కావడం వల్ల శ్రమధర తగ్గడమే ఇందుకు కారణం.

2.రెండో ఉదాహరణలో మార్కెట్లో ఉత్పత్తుల సరఫరా అధికంగా ఉంటుంది. పరిస్థితిలో, అతికీతా వేతనాలతో పనిచేయించే పెట్టుబడిదారులు తమ పోటీదారులతో నెగ్గుతారు  
 చెల్లించబడని శ్రమమీద  పట్టు పెట్టుబడిదారుల మధ్య పోటీకి కారణం అవుతుంది. ఒక సరుకు ధరలో శ్రమధర ఒక భాగంగా ఉంటుంది. శ్రమ ధరలో చెల్లించబడని శ్రమధర భాగాన్ని లెక్కించక్కర్లేదు. దాన్ని కొనుగోలుదారుడికి ఇవ్వవచ్చు.పోటీకి దారితీసే తొలి అడుగు ఇదే. రెండో అడుగు: అసాధారణంగా వచ్చే ఎక్కువ అదనపు విలువలో కనీసం కొంత భాగాన్ని అమ్మకం ధరనించి మినహాయించేట్లు చెయ్యడం రెండో అడుగు. 
పోటీ  గురించి విశ్లేషణ మన సబ్జెక్ట్ లోని భాగానికి సంబంధించింది కాదు. కాబట్టి సూచనప్రాయంగా చెప్పానంటాడు మార్క్స్. అయినా ఒక క్షణం పెట్టుబడి దారుణ్ణి మాట్లాడనిద్దాం అంటాడు. బెర్మింగ్ హాం లో యజమానుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా అంటే, ఇతరత్రా అయితే వాళ్ళు చెయ్యడానికి సిగ్గుపడే పనులు యజమానులుగా చెయ్యాల్సి వస్తున్నది; అయినా అందువల్ల వాళ్ళకు ఎక్కువ డబ్బు రావడం లేదు, కొనే జనమే ప్రయోజనం పొందుతున్నారు.  
తక్కువకి అమ్మేవాళ్ళ గురించి

లండన్ లో రెండు రకాల రొట్టె ఉత్పత్తిదారులున్నారు:
1. పూర్తి ధరకి అమ్మేవాళ్ళు
2.మామూలు ధరకన్నా తక్కువకి అమ్మేవాళ్ళు.
పార్లమెంటరీ విచారణ కమిటీ ముందు పూర్తిధరకి అమ్మేవాళ్ళు తక్కువకి అమ్మే పోటీదారుల్ని దుయ్యబట్టారు.జనాన్ని మోసం చెయ్యడం ద్వారానూ, 12 గంటల వేతనానికి 18 గంటల పని లాగడం ద్వారానూ వాళ్ళు కొనసాగుతున్నారు. చెల్లించబడని శ్రమే పోటీ సాగడానికి వనరు.ఈనాటికే  అదే వనరు. రాత్రిపూట పనిని తొలిగించడ్దానికి అడ్డంకి మాశ్త బేకర్ల మధ్య పోటీయే.
రొట్టెని తక్కువకి అమ్మేవాడు పిండి ధరను బట్టి అతనికి పడ్డ ధర (cost price) కంటే తక్కువకి అమ్మాలంటే, అతను ఆనష్టాన్ని కార్మికులనుండి ఎక్కువ శ్రమని రాబట్టడం ద్వారా భర్తీ చేసుకోవాల్సిందే.
తన శ్రామికులనుండి 12 గంటల పని మాత్రమే పొందేవాణ్ణి, 18 లేక 20 గంటల పని చేయించే పక్కవాడు అమ్మకం ధర తగ్గించి దెబ్బకొడతాడు.  వాళ్ళ ఎక్కువ పనికి వేతనం చెల్లించాలని పనివాళ్ళు పట్టుబడితే, అప్పుడు పరిస్థితి సరై, చక్కబడుతుంది. తక్కువకి అమ్మేవాళ్ళు పెట్టుకునే పనివాళ్ళూ ఎక్కువమంది విదేశీయులూ, యువకులూ. వాళ్ళకి  వేతనాన్నైనా ఒప్పుకోక  తప్పదు.
కాలం వేతనాల గురించి పెట్టుబడిదారుడి వక్రమైన అభిప్రాయం
తమ దోపిడీ చేసే హక్కుని హరిస్తున్నారని పెట్టుబడిదారులు ఫిర్యాదులు చేస్తుంటారు. ఫిర్యాదులు అధ్యాయానికి సరియైన ముగింపునిస్తాయి. ఆముగింపు ఇదే : ఉపరితలం మీద ప్రతిదీ భిన్నంగా కనబడుతుంది. 

బాధతో చేసే ఫిర్యాదులు విధంగా ఉత్పత్తిసంబంధాల రూపాన్ని పెట్టుబడిదారుడి మనసులో ఎలా ప్రతిబింబిస్తాయో తెలియజేస్తాయి. మామూలు శ్రమ ధరలో చెల్లించ బడని శ్రమ కూడా కొంత ఉంటుందని అతనికి తెలియదు. చెల్లించబడని శ్రమే అతని లాభానికి మూలం అని కూడా అతను ఎరగడు. అతని దృష్టిలో అదనపు శ్రమ కాలం  అనే భావాభివర్గమే ఉండదు. ఎందుకంటే, అది మామూలు పనిదినంలో కలిసే ఉంటుందని, ఆపని దినానికి తాను వేతనం చెల్లిస్తున్నాననీ అనుకుంటాడు.  
అయితే ఓవర్ టైం అనేది అతని బుర్రలో ఉంటుంది.మామూలు శ్రమధరకి అనుగుణమైన పరిమితి దాటి పనిదినం పొడిగింపు గురించి అతనికి తెలుసు. తక్కువకి అమ్మే తన పోటీ దారుతో ముఖాముఖి లో ఓవర్ టైం కి ఎక్కువ చెల్లించాలని డిమాండ్ కూడా చెస్తాడు. అదనపు వేతనంలో సైతం, ఒక పనిగంటలో ఉన్నట్లే, చెల్లించబడని శ్రమ ఉంటుందని అతనికి తెలియదు. ఉదాహరణకి, 12 గంటల పనిదినంలో ఒక గంట ధర  అరగంట ఉత్పాదితం విలువ అయిన 3 పెన్నీలయితే, ఓవర్ టైం ధర గంటకి 4 పెన్నీలు, లేదా ఒక ఉత్పాదితం విలువలో 2/3 వంతు. పెట్టుబడిదారుడు మొదటి సందర్భంలో సగం ఉత్పాదితాన్ని, రెండో సందర్భంలోవంతునీ, ఏమీ చెల్లించకుండానే,స్వాయత్తం చేసుకుంటాడు

వచ్చే పొస్ట్: శాల్తీ వేతనాలు (piece wages)





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి