17, ఆగస్టు 2018, శుక్రవారం

శ్రమశక్తి విలువ వేతనంగా మారడం


అధ్యాయం-19
శ్రమశక్తి విలువ/ధర వేతనంగా మారడం
శ్రమ శక్తి అనే కాటగరీ ఆరో అధ్యాయంలో(శ్రమశక్తి అమ్మకమూ, కొనుగోలూ) వస్తుంది. అక్కడ శ్రమ శక్తి నిర్వచనం ఉంటుంది. దాని విలువ లో ఏఏ అంశాలు ఉంటాయో  వివరణ ఉంటుంది. ఆ శ్రమ శక్తి విలువకన్న అది ఉత్పత్తిచేసే విలువ ఎక్కువ అని ఉంటుంది.
సరుకు శ్రమ కాదు, శ్రమ శక్తి - అని ఈ 19 వ అధ్యాయంలో తేలుతుంది. బూర్జువా సమాజపు ఉపరితలం మీద వేతనం అనేది శ్రమ ధర అయినట్లు కనిపిస్తుంది. అంటే కొంత  శ్రమకి చెల్లించబడిన కొంత డబ్బు అనిపిస్తుంది. ఆవిధంగా ప్రజలు శ్రమ విలువ అనీ, డబ్బులో దాన్ని శ్రమ ‘సహజ ధర’ లేక ‘అవసర ధర’  అనీ మాట్లాడుతుంటారు. మరొకపక్క, సహజధరకు పైకీ కిందికీ ఊగిసలాడే మార్కెట్ ధరల గురించి చెబుతుంటారు. శ్రమని  ధర ఉన్న సరుకుగా ఎవరైనా అనుకోవచ్చు. కాని,
వాస్తవానికి శ్రామికుడు అమ్మేది శ్రమ శక్తిని, శ్రమని కాదు. అయినా అమ్ముతున్నది శ్రమనే అనిపిస్తుంది.
సరుకు కాని శ్రమ సరుకు అని ఎందుకు అనిపిస్తుంది?
1. చేసిన శ్రమని బట్టి చెల్లింపు ఉంటుంది. చేసిన శ్రమ ఎంత అనేది, చేసిన టైమ్ ని బట్టో,  సరుకుల పరిమాణాన్నిబట్టో లెక్కకొస్తుంది. పరిస్థితుల్ని బట్టి పనిదినం పొడవు 8,10,12 గంటలుగా ఉంటుంది. పనిదినం ఇన్ని గంటలు అని కార్మికుడికి తెలుసు. కూలీ ఎంతో కూడా తెలుసు. దాన్నిబట్టి గంట శ్రమకి ఇంత అని లెక్కించుకుంటాడు. 10 గంటలు పనిచేస్తే రు.400 తీసుకునే వాడికి గంట శ్రమ విలువ రు.40 అనుకోవడం సహజమే.  చేసిన శ్రమ పరిమాణాన్ని బట్టి అతని వేతనం ఉంటుంది. కనుక తను అమ్ముతున్నది ‘శ్రమని’ అనుకుంటాడు.
2. శ్రమ చేశాకనే వేతనం వస్తుంది. మార్కెట్లో తన శ్రమశక్తిని అమ్ముకున్నాక, ఇతర సరుకులు అమ్మినవాళ్ళు పోయినట్లు, ఇంటికి వెళ్ళడం కుదరదు. పనిస్థలానికి వెళ్ళి, అక్కడ స్వయంగా ఉండి ఒప్పుకున్నన్ని  గంటలపాటు శ్రమ చేస్తాడు. అందువల్ల తన వేతన ఒప్పందంలో, తాను అమ్ముతున్నది శ్రమనే  అనుకోవడం సహజమే.  ఆవిధంగా చెల్లించే రూపం బట్టి మాత్రమే కాదు, అమ్మిన సరుకుని ఇచ్చే తీరుని బట్టి కూడా పనివాళ్ళు అమ్ముతున్నది శ్రమ శక్తిని కాకుండా, సరిగ్గా శ్రమనే అనిపిస్తుంది. అమ్మిన శ్రామికుడూ కొన్న పెట్టుబడిదారుడూ  మారకం అయిన సరుకు శ్రమ అనే అనుకుంటారు.
నాటి ఆర్ధికవేత్తలు కూడా
సరుకు శ్రమే అనుకున్నారు. “ తాను తన కార్మికుల శ్రమను కొంటున్నాననీ, డబ్బు చెల్లిస్తున్నాననీ అనుకునే పారిశ్రామికుని ఆనాటి అవగాహనను పారిశ్రామిక ఆచరణ నుండి  సాంప్రదాయిక అర్ధశాస్త్రం స్వీకరించింది” -వేతన శ్రమా పెట్టుబడీ –సం.ర 1.పే.83-84 ఆర్ధికవేత్తలు విషయాన్ని లోతుగా పరిశీలించకుండా అప్పటికి వాడుకలో ఉన్న శ్రమవిలువ అనేపదాన్ని అదే అర్ధంలో తీసుకున్నారు. ఆ ప్రకారం విశ్లేషణ కొనసాగించారు. వాళ్ళకి చిక్కేర్పడింది. 
శ్రమ సరుకయితే, విలువ ఎలా నిర్ణయమవుతుంది?
వాళ్ళు ఈపనికి పూనుకోలేదు.  ఒకవేళ పూనుకున్నా, ఇది నిర్ణయమయ్యేది కాదు. ఎందుకో చూద్దాం.
ఏసరుకు విలువనైనా నిర్ణయించేది ఏది? దానిలో ఉన్న శ్రమ. అన్నివిలువలకూ కొలమానం శ్రమ. అయినప్పుడు శ్రమ విలువని కూడా శ్రమలోనే చెప్పాలి. దీని ప్రకారం అయితే
1 గంట శ్రమ = 1 గంట శ్రమ అనాలి.
ఒకగంట శ్రమ ఒక గంట శ్రమకి సమానం అని చెబితే అర్ధం ఉండదు. అది పునరుక్తి, పైగా అర్ధరహిత వ్యక్తీకరణ. ఎందుకంటే, వస్తువులకు విలువని ఏర్పరచేది స్వయంగా విలువని కలిగి ఉండదు. శ్రమ విలువ అనేది తార్కికంగా అసాధ్యమైన విషయం
ఏ సరుకు కైనా విలువ ఉంటుంది. విలువ లేనిది ఏదీ సరుకు కాదు. పైన తేల్చినట్లు, శ్రమకి విలువ ఉండదు. కనుక శ్రమ సరుకు కాజాలదు.
మరొక విషయం.
శ్రమ సరుకుగా మార్కెట్లో అమ్మబడాలంటే, అమ్మకానికి ముందే అది సిద్ధమై ఉండాలి. మార్కెట్ కొచ్చేఇతర  సరుకులన్నీ ముందే ఉత్పత్తయినవి. శ్రమ ఉత్పత్తి కాకముందే మార్కెట్ కొస్తుంది.
తనకన్నా ముందు ఈ విషయాన్ని గమనించిన పేరుతెలియని వ్యక్తి ని కోట్ చేస్తాడు: “ శ్రమని సరుకు అన్నారంటే, అది మొదట ఉత్పత్తిచేయ్యబడి, మార్కెట్లో ఉన్న సరుకులతో మారకంకోసం మార్కెట్ కి తేబడిన సరుకు వంటిది కాదు; మార్కెట్లోకి తేబడినప్పుడే సృజించబడినది, లేదు అది సృజించబడకముందే మార్కెట్ కి తేబడింది.” -
Observations on Certain Verbal Disputes,  1821
ఈ వైరుధ్యాలని కాసేపు అలావుంచుదాం.
శ్రమ సరుకయితే అదనపు విలువ ఉండదు
శ్రమ గనక సరుకుగా మారకం అయ్యే పనయితే, దాని విలువ అది ఉత్పత్తిచేసిన విలువే. కార్మికులు తమ శ్రమకి, వాళ్ళు సృజించిన విలువకి చెల్లింపు పొందితే, అదనపు విలువ ఉండదు. పెట్టుబడిదారీ విధానమే రద్దవుతుంది.
అదనపు విలువ ఉండాలంటే కార్మికులు శ్రమ విలువకన్నా తక్కువ పొందాలి. అలా శ్రమ విలువకన్నా తక్కువ పొందితే, సమాన విలువలే మారతాయి అనే విలువ నియమమే భంగం అవుతుంది.
ఎలాగో చూద్దాం:
మొదటిది. 12 గంటల పనిదినం విలువ 6 షిల్లింగులనుకుందాం. సమానకాలే మారితే 12 గంటల శ్రమకీ శ్రామికుడు 6 షిల్లింగులు పొందుతాడు.అతని శ్రమ ధర ఉత్పాదితం ధరకి సమానం. ఈ సందర్భంలో తన శ్రమని కొన్నవానికి అదనపు విలువని ఉత్పత్తి చెయ్యడు. 6 షిల్లింగులు పెట్టుబడిలోకి పరివర్తన చెందవు. కాబట్టి, పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రాతిపదిక అంతర్ధానం అవుతుంది. అయితే  అతను శ్రమను అమ్మేదీ, అతని శ్రమ వేతన శ్రమ అయ్యేదీ ఈప్రాతిపదిక మీదనే. కాబట్టి పై సందర్భంలో అసలు పెట్టుబడిదారీ ఉత్పత్తే రద్దవుతుంది.
రెండవది.
అతను 12 గంటల శ్రమకు 6 షిల్లింగులకన్నా తక్కువ పొందుతాడు.అంటే, 12 గంటల శ్రమకన్నా తక్కువన్నమాట.అప్పుడు 12 గంటల శ్రమ 10 గంటల శ్రమకో, 6 గంటల శ్రమకో మారుతుంది. ఈ అసమాన పరిమాణాల్ని సమానం చెయ్యడం విలువనిర్ధారణని రద్దు పరుస్తుంది. అంతేకాదు,అటువంటి స్వయం వినాశక వైరుధ్యం ఒక నియమంగా రూపొందజాలదు.
కార్మికుడు  అమ్ముతున్న సరుకు శ్రమ అనుకుంటే,పెట్టుబడి దారీ విధానాన్ని వివరించలేము.అంటే అదనపు విలువ ఎలా ఉత్పత్తిని అవుతుందో చెప్పలెము. కాబట్టి శ్రమ సరుకు కాదు అని తేల్చాడు.
తక్కువ గత శ్రమ = ఎక్కువ ప్రస్తుత శ్రమ - అనేది సరికాదు
సజీవ శ్రమ X వస్తుత్వం చెందిన శ్రమ
పెట్టుబడిదారుడు ఇచ్చేది డబ్బు, అంటే చెయ్యబడిన శ్రమ. కార్మికుడు ఇచ్చేది చెయ్యబోయే శ్రమ. మారకం అవుతున్న శ్రమల రూపాల్లో తేడా ఉంది. ఇచ్చే శ్రమ రూపం వేరు, పుచ్చుకునే శ్రమ రూపం వేరు. ఒకటి సజీవ శ్రమ, రెండోది వస్తురూపంలోఉన్న శ్రమ. వస్తువులో ఇంకివున్న శ్రమ. ఈ రూప భేదాన్ని బట్టి, మారకంలో మృతశ్రమ కి మరింత సజీవ శ్రమ వస్తుంది  అనుకున్నవాళ్ళున్నారు. అప్పటికే పూర్తయిన శ్రమకీ, తదుపరి చెయ్యబోయే శ్రమకీ మారక ఒప్పందంలో పెట్టుబడిదారుడు కార్మికుడికన్నా ఎక్కువ పొందుతాడు - అంటాడు సీస్మాండీ. అలా అనుకున్నందువల్ల ఒరిగిందేమీ లేదు.
రూపంలో ఉన్న తేడా తక్కువ శ్రమ, ఎక్కువ శ్రమ, ఎక్కువ శ్రమతో మారుతుందనే అసమాన మారకాన్ని వివరించజాలదు అంటాడు మార్క్స్. రూపం మారినంతమాత్రాన పరిమాణం మారదు.శ్రమ ఒక వస్తువులో ఇంకినంతమాత్రాన అది అకస్మాత్తుగా  మరింత శ్రమ అవదు. అంతకుముందు ఎంతో, ఇప్పుడూ అంతే ఉంటుంది - కాకపోతే వేరే రూపంలో. ఐస్ ముక్కల్ని కరిగించినంత మాత్రాన వాటిలో ఉన్న నీటి పరిమాణం మారనట్లే.

పోతే, ఒక సరుకు విలువ పరిమాణాన్ని నిర్ణయించేది ఆసరుకులో వాస్తవంగా రూపొందిన శ్రమ కాదు; దాని ఉత్పత్తికి అవసరమైన సజీవశ్రమ. దీని దృష్ట్యా చూస్తే ఇది మరీ అసంబద్ధం అవుతుంది.
6 గంటల శ్రమ ఇమిడి వున్న వస్తువు, నూతన ఆవిష్కరణ వల్ల 3 గంటలలోనే తాయారయిందనుకుందాం. అప్పుడు ఆవస్తువు విలువ సగం అవుతుంది. దాని విలువే కాదు, ఆరకం వస్తువులన్నీ అంతకు ముందే తయారయినవున్న వాటి విలువ కూడా సగానికి పడిపోతుంది.మునుపు 6 గంటలుగా అవసరమున్న సామాజిక శ్రమ ఇప్పుడు 3 గంటలకు తగ్గుతుంది. ఒక సరుకు విలువ పరిమాణం నిర్ణయమయ్యేది ఆసరుకులో వాస్తవంగా ఇమిడివున్న శ్రమ పరిమాణం చేతకాదు, సామాజికంగా అవసరమైన శ్రమ పరిమాణం చేత.

శ్రమ విలువ అనేది ఒక ఊహాత్మక వ్యక్తీకరణ
డబ్బువాడితో మార్కెట్లో ఎదురుపడేది నిజానికి శ్రమ కాదు, శ్రామికుడు.అతను డబ్బువాడికి అమ్మేది శ్రమశక్తిని. అతని శ్రమ వాస్తవంగా మొదలయ్యీకాగానే, అది అప్పటికే అతనిది కాకుండా పోతుంది; అందువల్ల అతను దాన్ని ఇకపై అమ్మలేడు. శ్రమ అనేది విలువ సారమూ, కొలమానమూ, కాని శ్రమ స్వతస్సిద్ధంగా/ దానికదిగా విలువని కలిగి ఉండదు. స్వయంగా దానికి విలువ ఉండదు. హాడ్జ్ స్కిన్ అన్నట్లు “ఏకైక విలువ ప్రమాణం..సకలసంపద సృష్టికర్త అయిన శ్రమ సరుకు కాదు.”

శ్రమ విలువ అనే వ్యక్తీకరణలో విలువ భావం పూర్తిగా రూపు మాసిపోతుంది;అంతే కాదు,ఆభావమే తల్లకిందౌతుంది.  భూమి విలువ అనేది ఎంత ఊహాత్మకమో శ్రమ విలువ అనేదీ అంతే ఊహాత్మకం.
ఏమైనప్పటికీ, ఈ ఊహాత్మక వ్యక్తీకరణలు ఉత్పత్తి సంబంధాలనుండే తలెత్తుతాయి. అవి సారభూతమైన సంబంధాల గోచర రూపాల యొక్క కాటగరీలు. వస్తువులు కనబడడంలో తరచుగా తలకిందుల రూపంలో ఉంటాయని ప్రతి సైన్స్ కీ తెలుసు- ఒక్క రాజకీయ అర్ధశాస్త్రానికి తప్ప. అంటే కనబడే దానికీ,  ఆధారమైన అంతర్లీన శక్తులకీ వ్యత్యాసం ఉంటుందని అన్ని సైన్సుల భావిస్తాయి. ఆ అంతర్లీన శక్తులేవో కనుక్కునే యత్నం చేస్తాయి. అర్ధశాస్త్రం అలాకాదు వాస్తవాన్ని కాకుండా కనబడేదాన్నే సరైనదిగా భావిస్తుంది.
ఇక్కడున్న ఫుట్ నోట్  తార్కికంగా సాధ్యం కాని ఆ రూపాల్ని కూడా చర్చించాల్సిన ఆవశ్యకతని నొక్కి చెబుతుంది.ప్రౌధన్ తార్కికంగా అసాధ్యంమైన  శ్రమ విలువ అనే దాని వెనక దాగివున్న వాస్తవాన్ని గుర్తించలేదు. శ్రమ విలువ అనే వ్యక్తీకరణని కేవలం poetic licence-- అలంకారిక వ్యక్తీకరణ అన్నాడు. అంటే, నిజ ప్రపంచంలో దేనినీ సూచించనిది. అలా అనడం, వివరించబూనడం విశ్లేషణలో అసమర్ధతని చాటుతుంది అంటాడు మార్క్స్.

సరఫరా – గిరాకీ శ్రమ విలువ
సాంప్రదాయ అర్ధశాస్త్రం రోజువారీ జీవితం నించి శ్రమ ధర అనే కాటగరీని ఏ విమర్శా లేకుండానే అరువు తెచ్చుకున్నది. ఈ శ్రమ ధర ఎలా నిర్ణయమవుతుంది? అనే ప్రశ్న వేసుకుంది. సరఫరా గిరాకీల్లో మార్పు మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గుల్ని తప్ప మరేమీ వివరించ లేవు అని గ్రహించింది. సరఫరా గిరాకీలు సమంగా ఉంటే, ధరల ఊగిసలాట ఆగిపోతుంది. అప్పుడుండే ధర సహజధర. దీన్ని ఫిజియోక్రట్లు అవసర ధర అన్నారు. ఆడం స్మిత్ శ్రమ సహజ ధర అన్నాడు. అది డబ్బులో వ్యక్తమైన శ్రమ విలువ.
ఈ సహజ ధర ఎలా నిర్ణయమవుతుంది? అనేదే సమస్య.
ఈ విధంగా రాజకీయ అర్ధశాస్త్రం శ్రమయొక్క యాదృచ్చిక ధరల ద్వారా శ్రమ విలువలోకి చొచ్చుకు పోవచ్చునని ఆశించింది. అనుకుంది. ఇతర సరుకుల ధరల లాగే  శ్రమ విలువ దాని ఉత్పత్తి ఖర్చు చేత నిర్ణయమవుతుంది.
అయితే శ్రామికుని ఉత్పత్తి ఖర్చు ఎంత? అంటే, శ్రామికుని ఉత్పత్తికీ,పునరుత్పత్తికీ అయ్యే ఖర్చు ఎంత?
అర్ధశాస్త్రంలో మూల ప్రశ్న స్థానాన్ని ఈ ప్రశ్న అక్రమించింది; ఎందుకంటే, స్వయంగా శ్రమ ఉత్పత్తి ఖర్చు గురించిన అన్వేషణ వలయంలో పడి గిరగిరా తిరిగిందే గాని ముందుకు పోలేదు. ఉన్న చోటనే ఉండిపోయింది.
సాంప్రదాయ అర్ధశాస్త్రం రోజువారీ జీవితం నించి శ్రమ ధర అనే కాటగరీని అరువు తెచ్చుకున్నది.ఏ విమర్శా లేకుండానే ఈ శ్రమ ధర ఎలా నిర్ణయమవుతుంది? అనే ప్రశ్న వేసుకుంది.
సరఫరా గిరాకీల్లో మార్పు మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గుల్ని తప్ప మరేమీ వివరించ లేవు అని గ్రహించింది. సరఫరా గిరాకీలు సమంగా ఉంటే, ధరల ఊగిసలాట ఆగిపోతుంది. అప్పుడుండే ధర సహజధర. దీన్ని ఫిజియోక్రట్లు అవసర ధర అన్నారు. ఆడం స్మిత్ శ్రమ సహజ ధర అన్నాడు. అది డబ్బులో వ్యక్తమైన శ్రమ విలువ.
ఈ సహజ ధర ఎలా నిర్ణయమవుతుంది? అనేదే సమస్య.
ఈ విధంగా రాజకీయ అర్ధశాస్త్రం శ్రమయొక్క యాదృచ్చిక ధరల ద్వారా శ్రమ విలువలోకి చొచ్చుకు పోవచ్చునని అనుకుంది. ఇతర సరుకుల ధరల లాగే  శ్రమ విలువ దాని ఉత్పత్తి ఖర్చు చేత నిర్ణయమవుతుంది.
అయితే శ్రామికుని ఉత్పత్తి ఖర్చు ఎంత? అంటే, శ్రామికుని ఉత్పత్తికీ, పునరుత్పత్తికీ అయ్యే ఖర్చు ఎంత?
అర్ధశాస్త్రంలో మూల ప్రశ్న స్థానాన్ని ఈ ప్రశ్న అక్రమించింది; ఎందుకంటే, స్వయంగా శ్రమ ఉత్పత్తి ఖర్చు గురించిన అన్వేషణ వలయంలో పడి గిరగిరా తిరిగిందే గాని ముందుకు పోలేదు. ఉన్న చోటనే ఉండిపోయింది.
కాబట్టి అర్ధశాస్త్రజ్ఞులు శ్రమ విలువ అన్నది నిజానికి శ్రామికుని లో ఉండే శ్రమ శక్తి విలువ.శ్రమ శక్తి అనేది శ్రమ కాదు. రెండూ భిన్నమైనవి. ఒక యంత్రం అదిచేసే పనినుండి ఎలా భిన్నమైనదో ,శ్రమ శక్తికూడా అలాగే శ్రమ నుండి భిన్నమైనది.
శ్రమ మార్కెట్ ధరకీ, శ్రమవిలువ అనబడే దానికీ ఉండే తేడానీ, శ్రమ విలువకి లాభం రేటుతోనూ,  శ్రమతో ఉత్పత్తయిన సరుకుల విలువలకూ ఉన్న సంబంధాన్నీ అలాంటి వాటిని అధ్యయనం చెయ్యడంలో అర్ధశాస్త్రజ్ఞులు తలమునకలైనారు. వాళ్ళు ఏనాడూ తమ విశ్లేషణా క్రమం శ్రమయొక్క మార్కెట్ ధరల నించి వాళ్ళు ఊహించిన శ్రమవిలువ దాకా మాత్రమే కాక, ఈ శ్రమ విలువ శ్రమశక్తి విలువగా అయ్యేదాకా సాగినట్లు వాళ్ళు తెలుసుకోలేదు.సాంప్రదాయ అర్ధశాస్త్రం తన విశ్లేషణ ఫలితాల్ని గ్రహించలేక పోయింది; అది విమర్శ చెయ్యకుండానే శ్రమ విలువ, శ్రమ సహజ ధర వగైరా కాటగరీల్ని పరిశీలనలో ఉన్న విలువ సంబంధాన్ని వ్యక్తీకరించడానికి సరిపోయే  కాటగరీలుగా అంగీకరించింది. ఆవిధంగా అది పరిష్కారసాధ్యం కాని గందరగోళం లోకీ,వైరుధ్యంలోకీ దారి తీస్తుంది.వాటిని గురించి ముందుముందు చూస్తాం.  పైపై రూపాలను ఆరాధించే అశాస్త్రీయ ఆర్ధిక వేత్తల  డొల్లతనానికి అది కార్యకలాపాల ఆధారాన్ని చేకూరుస్తుంది. 

ఇప్పుడు శ్రమ శక్తి విలువ, శ్రమ శక్తి ధర అనేవి ఈ మారిన పరిస్థితిలో వేతనాలుగాఎలా కనిపిస్తాయో చూద్దాం.
రోజువారీ శ్రమ శక్తి విలువని లెక్కించే పద్ధతి తెలిసిందే. మామూలు పనిదినం 12 గంటలనీ, రోజు శ్రమ శక్తి విలువ 3 షిల్లింగులనీఅనుకుందాం. ఈ 3 షిల్లింగులూ 6 గంటల శ్రమ వల్ల ఏర్పడిన విలువకు డబ్బురూపం. కార్మికుడు 3 షిల్లింగులు పొందితే, అతను 12 గంటలపాటు చర్యలో ఉంచిన శ్రమశక్తి విలువని తీసుకున్నాడన్నమాట. ఇప్పుడు రోజు శ్రమశక్తి విలువని రోజు శ్రమ విలువలోనే చెబితే, ఇదిగో ఈఫార్ములా వస్తుంది: 12 గంటల శ్రమ విలువ 3 షిల్లింగులు.
ఆవిధంగా శ్రమ శక్తి విలువ శ్రమ విలువని (డబ్బులో చెబితే దాని అవసర ధరని) నిర్ణయిస్తుంది. మరొకపక్క, శ్రమ శక్తి ధర  దాని విలువకి భిన్నంగా ఉంటే, అదే తరహాలో శ్రమ ధర కూడా శ్రమ విలువ అనబడే దానికి (so-called value) భిన్నంగా ఉంటుంది.   
శ్రమ విలువ అనేది శ్రమ శక్తి విలువకి హేతువిరుద్ధమైన వ్యక్తీకరణ మాత్రమే. కనుక దాన్ని బట్టి,శ్రమ విలువ ఎప్పుడైనా సరే, అది ఉత్పత్తిచేసే విలువకన్నా తక్కువగా ఉండాలి. కారణం: పెట్టుబడిదారుడు ఎప్పుడూ శ్రమ శక్తి సొంత విలువ పునరుత్పత్తికి అవసరమయ్యే కాలం కంటే శ్రమ శక్తి ఎక్కువ కాలం పనిచేయిస్తాడు. పై ఉదాహరణలో, 12 గంటలు చర్య జరిపే/ పనిచేసే శ్రమ శక్తి విలువ 3 షిల్లింగులు. దాని పునరుత్పత్తికి 6 గంతల శ్రమ పడుతుంది. మరొకపక్క, ఆ శ్రమశక్తి ఉత్పత్తిచేసే విలువ 6 షిల్లింగులు - కారణం శ్రమ శక్తి చర్య 12 గంటలు కనక.శ్రమ శక్తి ఉత్పత్తిచేసే విలువ ఎంతనేది ఆ శ్రమ శక్తి విలువని బట్టి ఉండదు. అది చలనంలో ఉండే కాలం పొడవుని బట్టి ఉంటుంది.ఆవిధంగా తొలిచూపుకి అసంబద్ధం అనిపించే ఫలితం- 6 షిల్లింగుల విలువని ఉత్పత్తిచేసే శ్రమ 3 గంటల విలువని కలిగి ఉంటుంది -  వస్తుంది
ఒక ఉత్పాదితం మారకం విలువ అందులో ఇమిడివున్న శ్రమ కాలానికి సమానమైతే, ఒక పనిదినం మారకం విలువ ఆరోజు ఉత్పత్తయ్యే ఉత్పాదితం మొత్తానికీ సమానం అవుతుంది.అంటే వేతనం శ్రమ ఉత్పాదితానికి సమానం అయి తీరాలి.అయితే వాస్తవం అందుకు విరుద్ధంగా  ఉంది.

మరికొంత పరిశీలిద్దాం.3 షిల్లింగులతో పనిదినంలో 6 గంటలకు అంటే కొంత భాగానికి  మాత్రమే చెల్లింపు ఉన్నప్పటికీ, చెల్లింపు లేని 6 గంటలతో సహా మొత్తం 12 గంటలకు చెల్లింపు ఉన్నట్లు కనబడుతుంది. ఆవిధంగా శ్రమదినంలోని అవసర శ్రమ భాగం, అదనపు శ్రమ భాగం, చెల్లించబడిన శ్రమ, చెల్లించబడని శ్రమ  అనే విభజన ఆనవాలు లేకుండా పోతుంది. శ్రమంతా చెల్లించబడిన శ్రమ లాగే కనబడుతుంది.
కార్వే లో శ్రామికుడు తనకోసం చేసే శ్రమా, అతని యజమాని కోసం చేసే నిర్బంధ శ్రమా  స్థలకాలాల్లో వేరైనవిగా స్పష్టాతిస్పష్టంగా ఉంటుంది. బానిస శ్రమలో తనకోసం తాను చేసే శ్రమ భాగం సైతం యజమానికోసం చేసే శ్రమగా కనిపిస్తుంది. బానిస శ్రమ మొత్తం చెల్లించబడని శ్రమగా కనబడుతుంది. ఇందుకు భిన్నంగా, వేతన శ్రమలో అదనపు శ్రమ లేక చెల్లించబడని శ్రమ సైతం చెల్లించబడినట్లు అగపడుతుంది. అక్కడ ఆస్థి సంబంధం బానిసశ్రమ తనకోసం చేసే శ్రమని దాస్తుంది. ఇక్కడ డబ్బు సంబంధం వేతన శ్రామికుని యొక్క ఫలితం పొందని శ్రమని కప్పిపుచ్చుతుంది.

దీన్ని బట్టి, శ్రమ శక్తి విలువ లేక ధర వేతన రూపం లోకి లేదా  శ్రమ విలువ /శ్రమ ధర లోకి పరివర్తనచెందడానికి ఉన్న ప్రాధాన్యతని అర్ధం చేసుకోవచ్చు.
ఈ ఇంద్రియా గోచర రూపం వాస్తవ సంబంధాన్ని కప్పిపుచ్చుతుంది, కనిపించకుండా చేస్తుంది.నిజానికి దానికి వ్యతిరేకమైన సంబంధం ఉన్నట్లు చూపిస్తుంది.
ఈ రూపం  ఈక్రింది వాటికి ఆధారం అవుతుంది:
1.ధర్మానికి సంబంధించి శ్రామికుడికీ, పెట్టుబడిదారుడికీ ఉండే భావాలకీ
2.పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి సంబంధించి, వివరణ దొరకని సకలవిషయాలకీ
3.స్వేచ్చకి సంబంధించి పెట్టుబడిదారీ విధానానికున్న భ్రమలకీ
4. అశాస్త్రీయ అర్ధశాస్త్రజ్ఞులు పెట్టుబడిదారీ విధానాని సమర్ధించడనికి చెప్పే అన్ని మాయమాటలకీ, చేసే వాదనలకీ
ఈరూపమే ఆధారం.
వేతన రూపం అవసరం ఏమిటి?
వేతనం గుట్టు గ్రహించదానికి చాలా కాలం బట్టింది. కాని దాని దాని అవసరం ఏమిటో, అది ఉండడానికి కారణం ఏమిటో (raison d‘etre) తెలుసుసుకోవడం కన్నా సులువైనది వేరొకటి లేదు.
శ్రమకీ, పెట్టుబడికీ మారకం మొదట అన్ని ఇతర సరుకుల అమ్మకం కొనుగోలుల లాగే మనసుకి తోస్తుంది. ఇందులో న్యాయవేత్త చైతన్యం మహా అయితే ఒక పాదార్ధిక భేదాన్ని గుర్తిస్తుంది. ఆ భేదం సమానత్వ ఫార్ములా (equivalent formula)ద్వారా వ్యక్తమయ్యే భేదం. ఆ ఫార్ములా :
నీవు ఇవ్వడానికి, నేను ఇస్తా, నీవు ఉత్పత్తి చెయ్యడానికి నెను ఇస్తా;నీవు ఇవ్వడానికి నేను ఉత్పత్తి చేస్తా; నీవు ఉత్పత్తి చెయ్యడానికి నేను ఉత్పత్తి చేస్తా.
ఇక పోతే, మారకం విలువా, ఉపయోగపు విలువా అనేవి సరిపోల్చతగగని పరిమాణాలు.అందువల్ల, శ్రమ విలువ, శ్రమధర అనే వ్యక్తీకరణలు పత్తి విలువ, పత్తి ధర లాగే అనిపిస్తాయి. వీటికన్నా అవేమీ హేతువిరుద్ధమైన వ్యక్తీకరణలుగా అనిపించవు.
పైపెచ్చు,శ్రామికుడు శ్రమ ఇచ్చిన తర్వాతనే వేతనం ముడుతుంది. అంతిమంగా, శ్రామికుడు పెట్టుబడిదారుడికి సరఫరా చేసేది వాస్తవానికి అతని శ్రమశక్తిని కాదు, శ్రమశక్తి చర్యని; బట్టలు కుట్టడం, బూట్లు చెయ్యడం,దారం వడకడం వంటి ఏదో ఒక నిర్దిష్ట, ప్రయోజనకర శ్రమని. ఇదే శ్రమ, మరొకపక్క, విలువని సృజించే అంశం.ఆవిధంగా అది అన్ని ఇతర సరుకులకూ భిన్నమైన ఒక ధర్మాన్ని కలిగి ఉంటుంది. ఈ విషయం మామూలు బుర్రలకు ఎక్కదు. 
12 గంటల శ్రమకి 6 గంటలలో ఉత్పత్తయ్యే విలువని (3 షిల్లింగులు) మాత్రమే తీసుకునే కార్మికూడి వైపునించి చూద్దాం. వాస్తవానికి అతనికి 12 గంటల శ్రమ 3 షిల్లింగులు కొనే సాధనం.అతని శ్రమ శక్తి విలువ మారవచ్చు.అతని జీవితావసరాల విలువ 3 నించి 4 షిల్లింగులకు పెరగవచ్చు. అలాగే, 3 నించి 2 షిల్లింగులకు తగ్గవచ్చు.లేక,అతని శ్రమ శక్తి విలువ మారకుండా  అలగే ఉన్నా, సరఫరా గిరాకీల సంబంధాల్లో మార్పులు వచ్చి శ్రమ శక్తి విలువ 3 నించి 4 షిల్లింగులకు పెరగవచ్చు. అలాగే, 3 నించి 2 షిల్లింగులకు తగ్గవచ్చు.అయితే అతను ఎప్పుడూ 12 గంటల శ్రమని ఇస్తాడు.అందువల్ల తను పొందే సమానకంలో వచ్చే ప్రతి మార్పు అతనికి ఎలా కనబడుతుందంటే: తన 12 గంటల  శ్రమ విలువ లేక ధరలో వచ్చిన మార్పుగా కనబడుతుంది. ఈ పరిస్థితి  పనిదినాన్ని స్థిర పరిమాణంగా భావించిన స్మిత్ ని తప్పుదోవ పట్టించింది. ఆతప్పుదోవ ఇది: జీవితావసరాల విలువ మారినప్పటికీ, శ్రమ విలువ స్థిరంగానే ఉంటుంది; అందువల్ల, అదే పనిదినం శ్రామికుడికి ఎక్కువ డబ్బులోనో, తక్కువ డబ్బులోనో ప్రాతినిధ్యం వహించవచ్చు. ఇది స్మిత్ పొరపాటు.
ఇంకో వైపు, పెట్టుబడిదారుణ్ణి చూద్దాం. వీలైనంత తక్కువ డబ్బుకి, వీలైనంత ఎక్కువ శ్రమ పొందాలి అనుకుంటాడు.కాబట్టి ఆచరణలో అతనికి ఆసక్తి కలిగించేది ఒకే ఒక విషయం: శ్రమ శక్తి విలువకీ, శ్రమ సక్తి సృజించే విలువకీ ఉండే తేడా.అయితే అతను కొనే అన్ని సరుకుల్నీ వీలైనంత చౌకగా కొనే ప్రయత్నం చేస్తాడు. అందువల్ల అతను  మోసం వల్లా, తక్కువకి కొని, ఎక్కువకి అమ్మడం వల్లా తన లాభం వస్తుందని అనుకుంటాడు.నిజంగా శ్రమ విలువ అనేది అస్థిత్వంలో ఉనట్లయితే, ఆ శ్రమ విలువని అతను నిజంగా చెల్లించి ఉంటే, పెట్టుబడి ఎనేదే మనుగడలో ఉండేది కాదనీ, అతని డబ్బు పెట్టుబడిలోకి పరివర్తన చెంది ఉండేదే కాదనీ అతను ఎప్పటికీ తెలుసుకోలేడు.
పైగా చెల్లించ బడుతున్నది శ్రమ శక్తికి కాదు, దాని చ ర్యకి (శ్రమకి)అని రుజువు చేసే దృగ్విషయాల్ని (phenomena) వేతనాల వాస్తవ చలనం చూపెడుతుంది. ఈ అంశాల్నన్నిటినీ రెండు గ్రూపులు చెయ్యవచ్చు:
1.పనిదినం నిడివితో పాటు, మారే వేతనాలు.
ఒక యంత్రాన్ని ఒక రోజుకు వాడుకునే దానికన్నా వారం వాడుకుంటే అద్దె ఎక్కువ పడుతుంది.కనక చెల్లిసున్నది యంత్రం విలువని కాదు, దాని పని విలువని అని ఎవరైనానిర్ధారించ వచ్చు.
2. ఒకే రకంపనిచేసే వేర్వేరు కార్మికుల వేతనాల్లో వ్యష్టి (individual)పరమైన తేడా.
ఈవ్యష్టి తేడా బానిసత్వంలో స్పష్టంగా, ఏ డొంకతిరుగుడు లేకుండా  చూడగలం.మోసపోము.ఎందుకంటే, అక్కడ శ్రమ శక్తే అమ్మబడుతుంది. బానిస వ్యవస్థలో మాత్రమే సగటుని మించిన శ్రమశక్తి వల్ల కలిగే అనుకూలతా, సగటుకి తక్కువ శ్రమశక్తి వల్ల ప్రతికూలతా బానిస యజమాని మీద ప్రభావం చూపుతాయి; వేతన శ్రమ వ్యవస్థలో అవి శ్రామికుడి మీదనే ప్రభావం చూపుతాయి. ఎందువల్లనంటే, ఒక సందర్భంలో తన శ్రమ శక్తిని తానే అమ్ముకుంటాడు, మరో సందర్భంలో అతని శ్రమ శక్తిని మూడో మనిషి అమ్ముతాడు.
‘శ్రమ శక్తి విలువ’ సారం కాగా, ‘శ్రమ విలువ’ ఆసారానికి కనబడే రూపం
శ్రమ శక్తి విలువ, శ్రమ ధర అనేవి సారభూతమైన సంబంధానికి చెందినవి.వీటికి భిన్నంగా శ్రమ విలువ, శ్రమధర అనేవి ఆసారభూత సంబంధం పైకి కనపడే రూపం. ఈ రూపం అనేది  అన్ని దృగ్విషయాలకూ సంబంధించి,అవి కనబడే రూపానికీ వాటిలో దాగి వుండే సారానికీ తేడా ఉన్నట్లే, శ్రమ విలువ/ శ్రమ ధర కీ, శ్రమ శక్తి విలువ/ శ్రమ శక్తి ధర కీ తేడా ఉంటుంది. శ్రమ విలువ/ శ్రమ ధర అనేవి నేరుగా, ప్రస్తుత కాలంలో ఉన్న ఆలోచనకు అనుగుణంగా అగపడతాయి. శ్రమ శక్తి విలువ/ శ్రమ శక్తి ధర అనేవి అలా కనబడేవిషయాలు కావు. వాటిని  ముందుగా సైన్స్ కనుక్కోవాల్సి ఉంటుంది.
సాంప్రదాయ అర్ధశాస్త్రం  విషయాల వాస్తవ సంబంధాన్ని దాదాపు స్పృశించింది. కాని ఆ సంబంధాన్ని చైతన్యవంతంగా రూపొందించలేక పోయింది. అది బూర్జువా చర్మాన్ని అంటిపెట్టుకొని ఉన్నంత కాలమూ ఆ సంబంధాన్ని రూపొందించజాలదు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి