21, జనవరి 2019, సోమవారం

వేతనాలు పెరగడమూ – తగ్గడమూ


25.వేతనాలు పెరగడమూ – తగ్గడమూ
ఇంతదాకా అస్థిర పెట్టుబడి పెరిగితే, కచ్చితంగా అదే అనుపాతంలో కార్మికుల సంఖ్య పెరుగుతుందనీ; తగ్గితే తగ్గుతుందనీ అనుకున్నాం.
దీనిప్రకారం 10,000 పౌన్ల అస్థిర పెట్టుబడి 100 మందిని నియమిస్తే, అస్థిర 20,000 లకు పెరిగితే కార్మికుల సంఖ్య 200 కి పెరుగుతుంది. అందుకు భిన్నంగా 5,000 కి తగ్గితే కార్మికుల సంఖ్య 50 కి తగ్గుతుంది. అలాగే కార్మికుల సంఖ్యపెరిగితే జరిగే శ్రమ పరిమాణం పెరుగుతుంది, అది తగ్గితే ఇదీ తగ్గుతుంది.
ఇక్కడ మూడు అంశాలూ సంబంధంలో ఉన్నాయి :
1.      పెట్టిన అస్థిర పెట్టుడి మొత్తం
2.      నియమితులైన కార్మికుల సంఖ్య
3.      జరిగే శ్రమ పరిమాణం
ఇప్పటిదాకా అనుకున్న దాని ప్రకారం ఈమూడు అంశాల బంధం చాలా బలమైంది; ఒకటి పెరిగితే మిగతా రెండూ పెరుగుతాయి, ఒకటి తగ్గితే మిగతావీ తగ్గుతాయి.
కాని అలా జరగక పోవచ్చుకూడా. అంటే
పెట్టిన అస్థిరపెట్టుడి మొత్తమూ, నియమించిన శ్రామికుల సంఖ్యా, జరిగిన శ్రమ మొత్తమూ కచ్చితమైన అనుపాతంలో ఉండాలి అనేదేమీ లేదు. సంచయనం పురోగమించే కొద్దీ వాటిమధ్య బంధం బలహీనపడుతుంది.
స్థిరపెట్టుబడి పెరుగుతున్నా, కార్మికుల సంఖ్య మారకుండా అంతే ఉండవచ్చు;ఒకవేళ  పడిపోయినా పడిపోవచ్చు. ఒక విడి కార్మికుడు మరింత శ్రమ ఇచ్చినప్పుడు, అందువల్ల అతని వేతనం పెరుగుతుంది- శ్రమ శక్తి ధర అంతే ఉన్నప్పటికీ లేక ఒకవేళ తగ్గినప్పటికీ. శ్రమ రాశి పెరుగుదలతో పోలిస్తే శ్రమ శక్తి ధర నెమ్మదిగా పెరుగుతున్నప్పుడు జరిగేది ఇదే.
ఈసందర్భంలో స్థిరపెట్టుబడి పెరుగుదల, మరింత శ్రమకి సూచిక అవుతుంది, కాని మరింత మంది శ్రామికులకి సూచిక అవదు.
1.పెట్టుబడిదారుడి ఉద్దేశ్యం
 శ్రమశక్తి ధర అంతే ఉన్నప్పుడు, ఎక్కువమంది శ్రామికుల నుండి కంటే, తక్కువమంది నుండే నిర్దిష్ట పరిమాణంలో శ్రమని లాగడం ప్రతి పెట్టుబడిదారుడి ఉద్దేశ్యం/అభిలాష. కార్మికులు ఎక్కువ మంది ఉన్నప్పుడు పనిలో పెట్టిన శ్రమ రాసి అనుపాతంలో పెరుగుతుందో, అదే అనుపాతంలో స్థిర పెట్టుబడిని పెంచాల్సివస్తుంది. ఉన్నవాళ్ళతోనే మరింత శ్రమచేయిస్తే ఉత్పత్తి సాధనాల్ని పెంచే అవసరం ఉండదు. అందువల్ల పెట్టుబడిదారుడు ఎక్కువమందినుండి కాకుండా, తక్కువమంది నుండే  అదేపరిమాణంలో శ్రమని లాగాలనుకుంటాడు. ఉత్పత్తి స్థాయిమరింత విస్తరించేకొద్దీ, అతని ఉద్దేశ్యం బలపడుతుంది. పెట్టుబడి సంచయనంతో పాటుగా ఉద్దేశ్యానికుండే శక్తి అంతకంతకూ  అధికమవుతుంది.
శ్రమ ఉత్పాదక శక్తి అభివృద్ధి
సంచయనానికి కారణమూ,ఫలితమూ కూడా అయిన పెట్టుబడిదారీ విధానం అభివృద్ధీ, శ్రమ ఉత్పాదక శక్తి అభివృద్ధీ అంతే అస్థిరపెట్టుబడితో మరింత శ్రమని వినియోగించుకోగలిగే అవకాశం పెట్టుబడి దారుడికి ఇస్తుంది.- ప్రతి వ్యష్టి/ వైయ్యక్తిక శ్రమశక్తినీ మరింత (విస్తృతమైన లేక తీవ్రమైన) దోపిడీ ద్వారా.
తక్కువ ధర ఉన్న శ్రామికుల్ని పెట్టడం
అంతే పెట్టుబడితో మరింత శ్రమ శక్తిని కొనగలడని తెలుసుకున్నాం. ఇదెలా సాధ్యం? నిపుణ శ్రామికుల స్థానంలో తక్కువ నిపుణుల్నీ,పురుషుల స్థామలో స్త్రీలనీ, వయోజనుల స్థానంలో పిల్లల్ని నియోగించడం ద్వారా ఇది సాధ్య పడుతుంది.
అందువల్ల సంచయన పురోగమనంతో, ఒకపక్క మరింత అస్థిరపెట్టుబడి మరింతమంది కార్మికుల్ని నియమించకుండానే మరింత శ్రమని చలనంలో పెడుతుంది. మరొకపక్క,అదే పరిమాణంగల అస్థిరపెట్టుబడి అంతే శ్రమశక్తి రాశితో వెనకటికన్న ఎక్కువ శ్రమని పనిలోపెడుతుంది. అంతిమంగా, ఉన్నతస్థాయి శ్రమశక్తుల్ని తొలిగించి నిమ్నస్థాయి వాళ్ళని మరింతమందిని నియమిస్తుంది. 
సాపేక్ష అదనపు జనాభా వేగంగా పెరగడం
కాబట్టి సాపేక్ష అదనపు జనాభా ఉత్పత్తి,అంటే శ్రామికుల్ని విడుదలచెయ్యడం అనే ప్రక్రియ సాంకేతిక విప్లవం కంటే  ఇంకా మరింత వేగంగా నడుస్తుంది. సంచయన పురోగమనం వల్ల వేగవంతం అవుతుంది. దానికి అనుగుణంగా వచ్చే అస్థిర పెట్టుబడి స్థిర పెట్టుబడితో  తగ్గుదల కంటే, సాపేక్ష అదనపు జనాభా వేగంగా పెరుగుతుంది.
విస్తృతిలోనూ, సామర్ధ్యలోనూ ఉత్పత్తిసాధనాల విస్తృతీ పెరిగేకొద్దీ, అవి తక్కువ స్థాయిలో కార్మికుల్ని నియమించే సాధనాలు అవుతాయి. పరిస్థితిశ్రమ ఉత్పాదకత పెరిగే అనుపాతంలోనే, పెట్టుబడి శ్రమ సరఫరాని, దాని గిరాకీని మించి పెంచుతుంది.  పెట్టుబడి చేసే శ్రమ సరఫరా అంటే అర్ధం ఏమిటి? యంత్రాలవల్ల పని కోల్పోయిన కార్మికుల సరఫరా.
రిజర్వ్ సైన్యం బలగం పెరుగుతుంది.
ఫనుల్లో ఉన్న వాళ్ళు చేసే అధిక శ్రమ రిజర్వ్ సైన్యాన్ని పెంచుతుంది.అందుకు విపర్యయంగా రిజర్వ్ సైన్యం పని దొరికిన కార్మికులతో పోటీ పడి వాళ్ళ మీద తీవమైన వత్తిడి తెస్తుంది.వాళ్ళని ఎక్కువ పనిచెయ్యడానికి ఒప్పుకునేటట్లూ, పెట్టుబడి ఆజ్ఞలకి కట్టుబడి లొంగి ఉండేట్లూ బలవంతపెడుతుంది.
కార్మిక వర్గంలోఒక భాగం అధిక శ్రమ మూలంగా మరొక భాగం నిర్బంధంగా కాళీగా ఉండాల్సివస్తుంది. దీనికి విపర్యమైనది అనగా ఒక భాగం అధిక శ్రమ చెయ్యడం వల్ల వ్యష్టి పెట్టుబడిదారుల్ని సంపన్నుల్ని చేస్తుంది. అదే సమయంలో సామాజిక సంచయన పురోగమనానికి అనుగుణమైన స్థాయిలో పారిశ్రామిక రిజర్వ్ సైన్యం ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది.
అనుత్పాదక శ్రామికుల్ని ఉత్పాదక కార్మికులుగా మార్చవలసిన పరిస్థితి
సాపేక్ష అదనపు జనాభా ఏర్పడడం ఎంత ముఖ్యమైన అంశమో, ఇంగ్లండ్ ని చూస్తే తెలుస్తుంది.శ్రమని పొదుపు చెయ్యడానికి దేశానికున్న సాంకేతిక సాధనాలు బ్రహ్మాండమైనవి.అయినప్పటికీ, రేప్పొద్దున శ్రమమొత్తం హేతుబద్ధమైన మొత్తానికి తగ్గితే, కార్మిక వర్గం లో వివిధ తరగతుల కార్మికులు వయోలింగ భేదాలకి అనుగుణంగా  సర్దుబాటు అయితే, అప్పుడు అందుబాటులో ఉండే కార్మిక జనాభా  ప్రస్తుత స్థాయిలో దేశ ఉత్పత్తిని సాగించడానికి సరిపోదు. ఇప్పుడు అనుత్పాదక శ్రామికులుగా ఉన్న వాళ్ళలో మెజారిటీ కార్మికుల్ని ఉత్పాదక కార్మికులుగా మార్చవలసి వస్తుంది.
వేతనాల హెచ్చుతగ్గుల్ని నిర్ణయించే అంశం
మొత్తంగా చూసినప్పుడు, వేతనాల సాధారణ చలనం (పెరగడం, తగ్గడం)పూర్తిగా పారిశ్రామిక రిజర్వ్ సైన్యం యొక్క విస్తరణ, క్షీణతల చేత నియంత్రితమవుతుంది. ఈహెచ్చుతగ్గులు తిరిగి పారిశ్రామిక వలయంలో నిర్ణాత కాల వ్యవధుల్లో వచ్చే మార్పులకి అనుగుణంగా ఉంటాయి.కాబట్టి హెచ్చుతగ్గులు కార్మిక జనాభా సంఖ్యలో వచ్చే మార్పుల చేత నిర్ణయించబడవు; కార్మిక వర్గంలో పనిలోవున్న భాగంగానూ, రిజర్వ్ సైన్యంగానూ విభజితమయ్యే వివిధ అనుపాతాల చేత నిర్ణయమవుతాయి. అదనపు జనాభా యొక్క సాపేక్ష మొత్తం పెరుగుదలని, తరుదలని బట్టి, ఒకప్పుడు పనిలో ఇముడ్చుకునే మేరనూ, మరొకప్పుడు తొలిగించే మేరనూ బట్టి. ఆమేరకు వేతనాల హెచ్చుతగ్గులు  నిర్ణయమవుతాయి.
అంటే, వేతనాలు నిర్ణయమయ్యేది, జనాభా సంఖ్యని బట్టికాదు, ఆజనాభా అంతర్నిర్మాణాన్ని బట్టి. మొత్తం జనాభాలో పనుల్లో ఉన్న జనాభాకీ, రిజర్వ్ జనాభాకీ మధ్య నిష్పత్తిని బట్టి.
వాణిజ్య వలయాల ప్రభావం
ఆధునిక పరిశ్రమలో పదేళ్ళ వలయాలూ, నిర్ణీత కాలవ్యవధుల్లో సాగే దశలూ ఉంటాయి. దశలు సంచయనం పురోగమించేకొద్దీ ఒక దశ వెంట మరొకదశ ఒక క్రమం లేకుండానూ, త్వరత్వరగానూ అనుసరిస్తాయి. ఊగిసలాటల మూలంగా సంక్లిష్టమవుతాయి. 
ఆధునిక పరిశ్రమకి తగిన నియమం ఏదంటే: మార్చిమార్చి వచ్చే విస్తరణా, క్షీణతల చేత శ్రమ సరఫరా,గిరాకీలు నిర్ణయమవుతాయి.అంటే,ఆక్షణంలో పెట్టుబడి విస్తరణ అవసరాల్ని బట్టి, శ్రమ మార్కెట్ కొన్నిసార్లు పెట్టుబడి విస్తరిస్తున్నప్పుడు సాపేక్షంగా కొరవగా ఉన్నట్లూ, ఇంకొన్ని సందర్భాల్లో పెట్టుబడి క్షీణిస్తున్నప్పుడు శ్రమ మార్కెట్ సాపేక్షంగా నిండి పొర్లుతున్నట్లూ అగపడుతుంది. ఈనియమం స్థానంలో పెట్టుబడి చలనం, జనాభా చలనం మీద ఆధారపడి ఉన్నది అనే నియమాన్ని పెట్టడం పూర్తిగా అసంబద్ధమైంది/అర్ధంపర్ధం లేనిది. దీన్ని మార్క్స్ 'ముచ్చటైన నియమం' (beautiful law) అంటాడు వ్యంగ్యంగా.
ఆర్ధికవేత్తల పిడివాదం
అయినప్పటికీ ఆర్ధికవేత్తల పిడివాదం ఇదే.వాళ్ళ ప్రకారం పెట్టుబడి సంచయనం వల్ల వేతనాలు పెరుగుతాయి.ఎక్కువ వేతనాలు శ్రామిక జనాభా వేగంగా పెరిగేట్లు   ప్రేరేపిస్తాయి.శ్రమ మార్కెట్ సరఫరా అతి అయ్యే దాకా అలా సాగుతుంది. అందువల్ల శ్రమ సరఫరాతో పొలిస్తే, పెట్టుబడి తక్కువ అవుతుంది.అప్పుడిక వేతనాలు పడిపోతాయి. నాణెంలో బొరుసు కనబడుతుంది.
వేతనాలు కార్మిక జనాభా మొత్తం మీద ఆధారపడవు.కార్మిక జనాభా అంతర్నిర్మాణం మీద ఆధారపడతాయి. దీనర్ధం: వేతనాలు పెట్టుబడి వృద్ధి అవసరాలకి అనుగుణంగా నియంత్రించబడతాయి. ఇది పెట్టుబడిని స్వతంత్ర శక్తిని చేస్తుంది. ఇందుకు భిన్నంగా వేతనాలు కార్మిక జనాభా పరమ పరిమాణం మీద ఆధారపడ్డట్లయితే,అప్పుడు పెట్టుబడి సంచయనంజనాభా పెరుగుదల మీద ఆధారపడాల్సి ఉండేది. నియమం వాస్తవాల్ని ఏమాత్రం వివరించదు / విశదపరచదు. పెట్టుబడి సంచయనం జనాభా వృద్ధిమీద ఆధారపడి ఉండేది కాదు.
వేతనాలు
పడిపోయిన కారణంగా శ్రామిక జనాభా కొద్దికొద్దిగా తగ్గిపోతుంది. అందువల్ల పెట్టుబడి మరలా వాళ్ళకి సాపేక్షంగా ఎక్కువవుతుంది. లేదా, ఇతరులు వివరించినట్లు వేతనాల తగ్గుదలా, దాన్ననుసరించే శ్రామిక దోపిడీ పెరుగుదలా తిరిగి సంచయనాన్ని పెంచుతుంది.అదే సమయంలో తక్కువ వేతనాలు కార్మిక జనాభా పెరక్కుండా నిరోధిస్తుంది. అప్పుడు మళ్ళీ శ్రమకి గిరాకీ కన్నా సరఫరా తగ్గుతుంది. దాంతో మరల వేతనాలు పెరుగుతాయి. అలా సాగిపొతుంది. అభివృద్ధి చెందిన పెట్టుబడి ఉత్పత్తికి ఇది ఎంత సొగసైన చలన విధానం!
రుజువు చూపకుండా ఇలాంటి నియమం చెయ్యడం ఎంతో అసంబద్ధమైనది.
అందుకొక ఉదాహరణ
1849- 1859 కాలంలో ఇంగ్లిష్ వ్యవసాయ జిల్లాల్లో ధాన్యం ధరలు పడిపోతున్నా వేతనాలు  కొంచెమే అయినా పెరిగాయి.ఉదాహరణకి విల్ట్ షైర్ లో వారం వేతనాలు 7 షిల్లింగుల నించి 8 కి పెరిగాయి.డోర్సెట్ షైర్ లో 7, 8 నించి 9 కి పెరిగాయి. ఇందుకు కారణం యుద్ధ అవసరాలకూ, రైల్ రోడ్లూ, ఫాక్టరీలూ, గనులూ విస్తరించడానికీ వ్యవసాయ అదనపు జనాభా భారీగా వలసపొవడమే. వేతనాలు ఎంత తక్కువగా ఉంటే, వాటిలో వచ్చే స్వల్ప పెరుగుదల వ్యక్తమయ్యే నిష్పత్తి అంత ఎక్కువగా ఉంటుంది.ఉదాహరణకి వారం వేతనం 20 షిల్లింగులయి ఉండి అది 22 కి పెరిగితే, ఆపెరుగుదల 10 శాతం. అది 7 షిల్లింగులయి ఉండి 9 కి పెరిగితే, పెరుగుదల 28 4/7శాతం.ఇది వినసొంపుగానే ఉంటుంది. ప్రతిచోటా రైతులు గగ్గోలు పెడుతున్నారు .లండన్ 'ఎకానమిస్ట్' పస్తుల వేతనాల్ని గురించి సాధారణ, గణనీయమైన పురొగమనం జరిగిందని వాగింది.
అప్పుడు రైతులు ఏం చేశారు?పిడివాది అయిన ఆర్ధికవేత్త చెప్పినట్లు గొప్ప వేతనాల ఫలితంగా వ్యవసాయ కార్మికులు బాగా పెరిగి, వేతనాలు మళ్ళీ తగ్గే దాకా వేచి ఉన్నారా? లేదు. వెంటనే మరిన్ని యంత్రాల్ని తెచ్చిపెట్టారు. ఒక్క క్షణంలో రైతులు ఆనందించే స్థాయిలో శ్రామికులు మళ్ళీ ఎక్కువై పోయారు. అక్కడ ఇప్పుడు వ్యవసాయంలో మునుపటికంటే ఎక్కువ పెట్టుబడి మరింత ఉత్పాదక రూపంలో పెట్టబడింది. దీంతో శ్రమకి గిరాకీ పడిపోయింది - సాపేక్షంగానే కాదు, పరమ రూఢంగా (absolutely) కూడా.
పైన చెప్పిన ఆర్ధిక ఊహ (fiction) వేతనాల చలనాన్ని నియంత్రించే నియమాల్నీ, వేర్వేరు ఉత్పత్తి రంగాల్లోకి శ్రామిక జనాభాని పంపిణీ చేసే నియమాల్నీ గందరగోళ పరుస్తుంది. ఉదాహరణకి,  ఏదైనా ఉత్పత్తిరంగంలో పరిస్థితులు అనుకూలించి, సంచయనం క్రియాశీలంగా ఉండవచ్చు. ఆరంగంలో లాభాలు సగటు లాభాలకంటే ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఆరంగం అదనపు పెట్టుబడిని ఆకర్షిస్తుంది. అందువల్ల శ్రమకి గిరాకీ పెరుగుతుంది,వేతనాలు పెరుగుతాయి. ఎక్కువ వేతనాలు ఎక్కువమంది కార్మికుల్ని రంగంలోకి లాగుతాయి. అయితే ఆరంగంలో శ్రమశక్తి మితిమీరేదాకానే అలా జరుగుతుంది. శ్రమశక్తి అతిగా ఆరంగంలోకి వస్తే వేతనాలు తగ్గి సగటు స్థాయికో, ఇంకా దిగువకో    పడిపోతాయి. అప్పుడిక ఆరంగంలోకి వలసరావడం నిలిచిపోతుంది. దాన్ని వదిలివెళ్ళడం మొదలవుతుంది.
వేతనాలు పెరుగుదలని అనుసరించి కార్మికులు ఎందుకు పెరుగుతారో, వేతనాలు తగ్గినప్పుడు కార్మికులు పెరిగినప్పుడు ఎందుకు వేతనాలు తగ్గుతాయో  కారణాల్ని గ్రహించినట్లు ఆర్ధికవేత్త అనుకుంటాడు.అయితే అతను నిజానికి చూసేది ఒకానొక ఉత్పత్తి రంగంలో మార్కెట్ ఒడిదుడుకుల్ని మాత్రమే; పెట్టుబడి అవసరాలు మారే కోద్దీ, దానికి తగ్గట్లు వివిధ రంగాల్లో శ్రామికుల పంపిణీని అనుసరించి వచ్చే విషయాల్ని మాత్రమే. 
శ్రమ సరఫరా
స్తంభన (stagnation)ఉన్నప్పుడూ, సగటు వికాసం ఉన్నప్పుడూ పారిశ్రామిక రిజర్వ్ సైన్యం, క్రియాశీల శ్రామిక సైన్యాన్ని దిగలాగే భారంగా ఉంటుంది. అధికోత్పత్తి కాలంలోనూ, ఆకస్మిక అభివృద్ధి సమయాల్లోనూ పారిశ్రామిక రిజర్వ్ సైన్యం అదుపులో అణిగిమణిగి ఉంటుంది. అందువల్ల  శ్రమసరఫరా-గిరాకీ నియమానికి సాపెఖ్ష అదనపు జనాభా అనేది కీలు (pivot)గా పనిచేస్తుంది. అది పెట్టుబడి ఆధిపత్యానికీ, దోపిడీ చర్యకీ పూర్తి అనుకూలంగా ఉండే పరిమితుల్లో నియమం వర్తించే కార్యరంగాన్ని పరిమితం చేస్తుంది.   
శ్రమ గిరాకీ
పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తల అసాధారణ ప్రతిభ ప్రదర్శించిన విషయానికి త్తిరిగి వెనక్కి రావాల్సిన సమయం ఆసన్నమయింది. కొత్త యంత్రాలు ప్రవేశపెట్టడం ద్వారానో, పాత యంత్రాల్ని విస్తృతపరచడం ద్వారానో అస్థిర పెట్టుబడిలో కొంత భాగం స్త్ర్హిరపెట్టుబడిలోకి మార్చబడితే, అది పెట్టుబడిని స్థిరపరిచి, అదే చర్య ద్వారా శ్రామికుల్ని విడుదల చేస్తుంది.  ఆర్ధిక వేత్త చర్యని దానికి సరిగ్గా వ్యతిరేకంగా వివరిస్తాడు- కార్మికుల కోసం పెట్టుబడిని విడుదల చేస్తుందని కపట వివరణ ఇచ్చారు. ఇప్పుడు పండితుల సిగ్గుమాలిన తనాన్ని ఎవరైనా పూర్తిగా అర్ధంచేసుకోగలుగుతారు.
విడుదల చేయబడినవాళ్ళు:
1. యంత్రాలచేత బయటకు గెంటబడిన కార్మికులు
2.భవిష్యత్తులో కార్మికులకి బదులుగా వచ్చే రాబోయే తరం వాళ్ళు
3.పాత ప్రతిపదిక మీదనే వ్యాపారం విస్తరణ వల్ల క్రమంతప్పకుండా ఇముడ్చుకోబడగల అదనపు కార్మికులు 
వీళ్ళంతా ఇప్పుడు విడుదల చెయ్యబడ్డారు.కార్యాచరణకోసం ఎదురుచూసే ప్రతి కొద్ది పెట్టుబడి కూడా వాళ్ళని అవకాశంగా తీసుకుంటుంది. అది వాళ్ళనే ఆకర్షించినా, లేక ఇతరుల్ని ఆకర్షించినా  సాధారణ శ్రమ గిరాకీ మాత్రం శూన్యం.  వీళ్ళంతా ఇప్పుడు విడుదల చెయ్యబడ్డారు.కార్యాచరణకోసం ఎదురుచూసే ప్రతి కొద్ది పెట్టుబడి కూడా వాళ్ళని అవకాశంగా తీసుకుంటుంది. అది వాళ్ళనే ఆకర్షించినా, లేక ఇతరుల్ని ఆకర్షించినా యంత్రాలు మర్కెట్లోకి ఎంతమందిని నెట్టాయో అంతమమందినే ఆకర్షిస్తే, సాధారణ శ్రమ గిరాకీ మీదప్రభావం ఏమాత్రం ఉండదు.  అంతకంటే తక్కువ మందిని నియమిస్తే, మిగులు కార్మికులు పెరుగుతారు. మార్కెట్లోకి నెట్టబడ్డ వాళ్ళకంటె మరింతమందిని నియమించితే, గిరాకీ పెరుగుతుంది- విడుదలైన వారికంటే నియమితులైనవాళ్ళు మేరకు ఎక్కువగా ఉంటే మేరకు. 
పెట్టబోయే అదనపుపెట్టుబడి శ్రమకి గిరాకీని పెంచాలి. కాని యంత్రాలు శ్రామికుల్ని తొలిగించిన మేరకు తటస్థం అవుతుంది. అంటే, పెట్టిన పెట్టిబడి పెరిగినా, దాని కి అనుగుణంగా శ్రమకి గిరాకీ పెరగకుండా ఉండే విధంగా వ్యవహారాల్ని పెట్టుబడిదారీ ఉత్పత్తి యంత్రాంగం నిర్వహిస్తుంది. కార్యకలాపాల్ని బహు చాకచక్యంగా చక్కబెట్టుకొస్తుంది. దీన్ని పెట్టుబడిదారీ సమర్ధకులు ఇలా అంటారు: ఈ పరివర్తన కాలంలో పనుల్లోనుండి నిల్వసైన్యంలోకి నెట్టబడిన కార్మికుల కష్టాలకు నష్టపరిహారం!
శ్రమ సరఫరా గిరాకీలకి ఉన్న సంబంధం
పెట్టుబడి పెరుగుదలతో శ్రమ గిరాకీ అనుగుణంగా  ఉండదు;శ్రమ సరఫరా శ్రామికవర్గ పెరుగుదలకి అనుగుణంగా ఉండదు.ఇది రెండు స్వతంత్ర శక్తులు ఒకదానిమీద ఒకటి పనిచేసే సందర్భం కాదు. అదెప్పుడూ ఒకవైపే మొగ్గు చూపుతుంది.
పెట్టుబడి రెండు వైపులా ఏకకాలంలో పనిచేస్తుంది.
ఒకవైపు,సంచయనం శ్రమకి గిరాకీ పెంచుతుంది,మరొకవిపు శ్రామికుల సరఫారాని పెంచుతుంది- వాళ్లని విడుదలచెయ్యడం ద్వారా. అదే సమయంలో నిరుద్యోగుల ఒత్తిడి, పనుల్లో ఉన్నవాళ్ళని మరింత శ్రమచేసేట్టు చేస్తుంది. అందువల్ల ఒక మేరకు, శ్రమ సరఫరాని, శ్రామికుల సరఫరాతో సంబంధం లేకుండా, స్వతంత్రంగా ఉండేట్టు చేస్తుంది. ఈ ప్రాతిపదిక మీద ఆధారపడిన శ్రమ సరఫరా గిరాకీ సూత్రం యొక్క కార్యాచరణ పెట్టుబడి నిరంకుశత్వాన్ని సంపూర్తి చేస్తుంది.  
సరఫరా గిరాకీ సూత్రం
కార్మికులు  ఎక్కువ పని చేసేకొద్దీ, ఇతరులకోసం ఎక్కువ సంపద ఉత్పత్తి చేసేకొద్దీ, వాళ్ళ శ్రమ ఉత్పాదకత పెరిగేకొద్దీ అదే మోతాదులో పెట్టుబడి స్వయం విస్తరణ సాధనంగా వాళ్ళ చర్య సైతం అంతకంతకూ ఎలా అపాయకరమైనది అవుతుందో ఆ రహస్యాన్ని కార్మికులు గ్రహించగానే; తమలో తమకున్న పోటీ స్థాయి పూర్తిగా సాపేక్ష అదనపు జనాభా ఒత్తిడిని బట్టి ఉంటుందని కనుక్కోగానే; పెట్టుబడిదారీ ఉత్పత్తి సహజ నియమం తమ వర్గం మీద కలిగించే వినాశకర ప్రభావాల్ని రూపుమాపడానికో, తగ్గించడానికో కార్మిక సంఘాల ద్వారా ఉద్యోగులకూ,నిరుద్యోగులకూ సహకారం కోసం ప్రయత్నం చెయ్యగానే; పెట్టుబడీ దాన్ని కీర్తించే అర్ధశాస్త్రమూ శాశ్వతమైనదీ,పరమ పవిత్రమైనదీ అయిన సరఫరా గిరాకీ సూత్రం అతిక్రమణకు గురయిందని గావుకేకలు పెడతాయి. ఉద్యోగుల నిరుద్యోగుల కలయిక ప్రతిదీ ఈ నియమాన్ని సరిగా పనిచేయకుండా భంగం కలిగిస్తుంది. అయితే మరోపక్క, ప్రతికూల పరిస్థితులు (ఉదాహరణకు వలసదేశాల్లో) పారిశ్రామిక రిజర్వ్ సైన్యం ఏర్పడడాన్నీ,దానితో పాటుగా పెట్టుబడిదారీ వర్గమ్మీద శ్రామికవర్గం ఆధారపడడాన్నీ అడ్డగించినట్లయితే, వెంటనే పెట్టుబడీ, దాని అర్ధశాస్తమూ సరఫరా గిరాకీ పవిత్ర సూత్రం మీద తిరుగుబాటు చేస్తాయి.దానికి అననుకూలమైన చర్యని బలాత్కార సాధనాల ద్వారానూ, రాజ్య జోక్యం(interference of the state) ద్వారానూ నిరోధించే యత్నం చేస్తుంది. 
వచ్చే పోస్ట్: సాపేక్ష అదనపు జనాభా రూపాలు 
.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి