28, ఏప్రిల్ 2018, శనివారం

కమ్యూనిస్టు ప్రణాళికా – పెట్టుబడీ


కమ్యూనిస్టు ప్రణాళికా – పెట్టుబడీ
'వీక్షణం' మేనెల సంచికలో వచ్చింది 
కమ్యూనిష్టులకి ముఖ్యమైన పుస్తకాలు రెండు : ప్రణాళిక, కాపిటల్.
ప్రణాళిక మార్క్స్ ఎంగెల్స్ ఇద్దరూ కలిసి రాసింది. 1848 లో విడుదలైంది.
నేడు యూరప్ ఖండాన్ని కమ్యూనిజం అనే  బ్రహ్మరాక్షసి ఆవహించింది. దాన్ని భూస్థాపితం చేయడానికి పాత యూరప్ లోని పాలకవర్గాలన్నీ పోప్ మతాధిపతీ, జార్జ్ చక్రవర్తీ, మెటర్నిక్, గ్యూజో, ఫ్రెంచ్ రాడికల్స్, జర్మన్ సి.ఐ.డి లు కలిసిపవిత్ర కూటమిగా ఏర్పడ్డారు.ప్రభుత్వంలో అధికారం చేస్తున్న ప్రతిపార్టీ తన్ను వ్యతిరేకించే యితర పార్టీ లన్నిటినీ కమ్యూనిస్ట్ పార్టీలనేవారు. బ్రహ్మరాక్షసిగా చిత్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ముమ్మరంగా చేసేవారు. అందువల్ల
కమ్యూనిస్టులు బహిరంగంగా తమ అభిప్రాయాలను, ఆశయాలను, పోకడలను ప్రకటించ వలసిన సమయం ఏనాడో వచ్చింది. కమ్యూనిజాన్ని బ్రహ్మరాక్షసిగా చిత్రించే వారి పుక్కిటి పురాణాన్ని పటాపంచలు చేయడానికి పార్టీ తరఫున ఒక ప్రణాళికను ప్రచురించవలసిన అవసరమేర్పడింది.
కమ్యూనిస్ట్ లీగ్ (అంతర్జాతీయ కార్మిక సంఘం) ఆపనికి పూనుకుంది.
లీగ్ లక్ష్యం: బూర్జువాలను కూలదొయ్యడం, కార్మికవర్గ పాలన, వర్గవైషమ్యాల మీద నిలబడ్డ పాత బూర్జువా సమాజాన్ని రద్దుచేయ్యడం, వర్గాలు లేని, ప్రైవేటు ఆస్తి లేని సమాజాన్ని నెలకొల్పడం. - Article 1 of the Rules of the Communist League

ఈ లక్ష్య సాధనకు సకల దేశాల కార్మికులారా ఏకం కండి’ అని ప్రణాళిక పిలుపు నిస్తుంది. ఐక్యమై ఏం చెయ్యాలో స్థూలంగా చెబుతుంది.


కాపిటల్ మార్క్స్ ఒక్కడే రాసింది. అది 1867 లో విడుదలైంది.
లక్ష్యం: ఆధునిక సమాజ చలనం యొక్క ఆర్ధిక నియమాన్ని ఆవిష్కరించడం - Preface to the First German Edition (Marx 1867) .
 అదనపు విలువ ఉత్పత్తి పెట్టుబడి దారీ ఉత్పత్తి  విధానపు పరమ నియమం.”-cap1.580
ఆనియమాన్ని ఆవిష్కరించడం మార్క్స్ లక్ష్యం. దోపిడీకి ఆధారం అయిన అదనపు విలువ నియమాన్ని కనిపెట్టడమే ఆయన ఆవిష్కరణ. అదనపు విలువ సిద్ధాంతమే ఆయన ఆర్ధిక సిద్ధాంతానికి మూల స్తంభం. లెనిన్ అన్నట్లు పెట్టుబడి దారీ సమాజం సోషలిస్టు సమాజంగా పరివర్తన చెందే అనివార్యతని ఈ నియమం నుంచే  లాగుతాడు.
కాపిటల్ పెట్టుబడిదారీ విధానం ఎలా ఆవిర్భవించి, అభివృద్దిచెంది, అంతరిస్తుందో వివరంగా చెబుతుంది. అందులో కార్మికులు ఎలా దోచుకోబడతారో, పెట్టుబడి దారుడు శ్రామికుల శ్రమశక్తి నుండి వీలైనంత ఎలా దోచుకుంటాడో చూపుతాడు. దోపిడీని పెంచేందుకు, పెట్టుబడిదారులు అవలంబించే  పద్ధతుల్ని వివరిస్తాడు.
పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధి గురించి ప్రణాళిక ఇలా చెబుతుంది:
మార్కెట్లు విస్తరించేకొద్దీ గిల్డు విధానం పోయి, కార్ఖానా ఉత్పత్తి విధానం ప్రవేశించింది. అయితే మార్కెట్లు ఇంకా విస్తరించాయి. కార్ఖానా ఉత్పత్తి విధానం సరిపోలేదు. యంత్ర పరిశ్రమలు వచ్చాయి.వీటి అధిపతులే ఆధునిక పెట్టుబడి దారీ వర్గం (బూర్జువా వర్గం)
ఆధునిక యంత్ర పరిశ్రమల వల్ల సరుకుల మార్కెట్ ప్రపంచానికంతకూ విస్తరించింది. విదేశీవ్యాపారానికీ, రహదారులకూ ఎంతో ప్రోత్సాహమిచ్చింది. ఇవన్నీ తిరిగి పరిశ్రమల విస్తరణకు కారణమయ్యాయి. పరిశ్రమలూ, వ్యాపారమూ, నౌకాయానమూ, రైల్వేలూ అభివృద్ధి చెందేకొద్దీ పెట్టుబడిదారీ వర్గం కూడా అభివృద్ధి చెందినది. అని ప్రణాళిక చెబుతుంది. అయితే గిల్డు విధానం గురించీ,కార్ఖానా ఉత్పత్తి గురించీ,యంత్రాల గురించీ, యంత్ర పరిశ్రమ గురించీ కాపిటల్ లో ఏంతో వివరంగా ఉంటుంది.
ఇంతవరకూ నడిచిన సమాజపు చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే- అని ప్రణాళిక తొలివాక్యం. అయితే ఆపోరాటం ఎందుకు ఎలా ఏర్పడి అభివృద్ధి అయిందో తెలుసుకోవాలంటే కాపిటల్ చదవాల్సిందే.
అదనపు విలువ, శ్రమ శక్తి
అదనపు విలువ, శ్రమ శక్తి ఈరెండు మాటలూ ప్రణాళికలో ఉండవు. కాపిటల్ లో వీటిగురించి అధ్యాయాలకధ్యాయాలే ఉన్నాయి. ఇక అదనపు విలువ సిద్ధాంతాలు 3 సంపుటాల బృహద్గ్రంధం.
దోపిడీ అనే మాట ప్రణాళికలో వస్తుంది. అయితే అందుకు నిర్వచనం కావాలంటే కాపిటల్ చూడాల్సిందే.అదెలా జరుగుతుందో కాపిటల్ చర్చిస్తుంది.

ప్రణాళికలో ప్రత్యేకంగా ఉన్నవి
వివిధ ప్రతిపక్ష పార్టీల పట్ల కమ్యూనిష్టులు వ్యవహరించాల్సిన తీరు వివరిస్తుంది. ఇది కాపిటల్ లో ఉండదు. కార్మికులు ఐక్యమయ్యాక ఏం చెయ్యాలని మార్క్స్ అనుకున్నాడో తెలుసుకోవాలంటే ప్రణాళిక చూడాల్సిందే.
కార్మిక వర్గ విప్లవంలో మొదటి మెట్టు కార్మికవర్గం పాలక వర్గం కావడం. రాజ్యాధికారం చేపట్టాక
శ్రామిక వర్గ కర్తవ్యాలు
·         క్రమక్రమంగా పెట్టుబడిదారీ వర్గం నుంచి సమస్త పెట్టుబడినీ క్రమక్రమంగా గుంజుకోవడం.
·         ఉత్పత్తి సాధనాలన్నిటినీ ప్రభుత్వమే,అనగా పాలక వర్గంగా సంఘతితపడ్డ శ్రామిక వర్గ ప్రభుత్వమే తన చేతుల్లోకి తీసుకోవడం
·         ఉత్పత్తి శక్తుల్ని సాధ్యమైనంత వేగంగా అభివృద్దిచేయడం- సం.ర 67
ఇందుకు కొన్ని సాధారణ చర్యలు అవసరం. అయితే  ఈచర్యలు భిన్నదేశాల్లో భిన్నభిన్నంగా ఉండటం సహజమే. ఐనప్పటికీ, అత్యంత పురోగామి దేశాలకు ఈ క్రింది చర్యలు వర్తిస్తాయి.

1.భూమిని వ్యక్తుల సొంత ఆస్తిగా ఉంచుకునే పద్ధతిని రద్దుచెయ్యాలి. భూమినించి వసూలయ్యే శిస్తులను ప్రజా సౌకర్యాలకు  వినియోగించాలి.
2. ఆదాయపు పన్నును వృద్ధిక్రమానుసారంగా విధింప చెయ్యాలి. ఆదాయం హెచ్చేకొద్దీ పన్ను రేట్లను కూడా ఎక్కువ చెయ్యాలి.
3. వారసత్వపు హక్కును రద్దు చెయ్యాలి.
4. అప్పులిచ్చేహక్కు జాతీయ బాంకుకు తప్ప మరెవరికీ ఉండకూడదు.
5. రాక పోక మార్గాలనూ, తంతి, తపాలా టెలిఫోన్లు వగైరాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నిర్వహించాలి.
6. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఫ్యాక్టరీలనూ, ఉత్పత్తి సాధనాలనూ కొత్త ప్రాంతాలకు విస్తరింప చెయ్యాలి
7.బంజరు భూములన్నిటినీ సేద్యంలోకి తీసుకురావాలి.
8. ప్రజలందరూ తప్పనిసరిగా పనిచేసి తీరాలి.
9. వ్యవసాయానికీ పరిశ్రమలకూ మధ్య సమన్వయము ఉండేటట్లు చూడాలి.
10. దేశజనాభాను ఒక సక్రమ పద్ధతిని పంపకం చేయడం ద్వారా పల్లెలకూ పట్టణాలకూ మధ్య గల వ్యత్యాసాన్ని క్రమంగా రద్దు చెయ్యాలి.
11. బాల బాలికలందరికీ ప్రభుత్వ పాఠశాలల్లో  ఉచితంగా చదువు నేర్పాలి. బాల బాలికలు ఇప్పటివలే ఫ్యాక్టరీలలో పనిచేసే పద్ధతిని నిర్మూలించాలి.విద్యవిధానానికీ, పారిశ్రామికోత్పత్తికీ, అవినాభావ సంబంధం ఉండేట్లు చూడాలి.
ఇలాంటివే మరికొన్ని చర్యలు కూడా తీసుకోవటం అవసరం కావచ్చు.
కాపిటల్ అంత తేలికగా అర్ధం కాదు
ప్రణాళిక ఒక రాజకీయ పార్టీ సమావేశంలో సమర్పించిన రాజకీయ పత్రం (treatise). సాధారణ పాఠకులకు సైతం సులభంగా అర్ధమవుతుంది.
ప్రణాళిక చిన్న పుస్తకం గంటలో చదవచ్చు. కాపిటల్ 3 సంపుటాల పెద్ద పుస్తకం. సిద్ధాంత గ్రంధం. చదవడానికి చాలా సమయం పడుతుంది. పైగా ఎంతో కష్టపడిచదివే వాళ్లకు మాత్రమే అర్ధమవుతుంది.
పాఠకుడు కొత్తవిషయాన్ని నేర్చుకోడానికి సిద్ధపడిఉన్నవాడుగా  స్వతస్సిద్ధంగా ఆలోచించే వాడుగా ఉండాలి.”-కాపిటల్1.19 తొలి జర్మన్ ఎడిషన్ కి ముందు మాట.

ఎందుకు కష్టమో  ఫ్రెంచ్ ఎడిషన్ ముందుమాటలో స్థూలంగా చెప్పాడు. కాపిటల్ 1.30
ఏ సైన్స్ లో నైనా ప్రారంభం ఎప్పుడూ కష్టంగా వుంటుంది.అందువల్ల, తొలి విభాగం (సెక్షన్)అందునా, సరుకుల విశ్లేషణ ఉన్న భాగం అర్ధం కావడం అత్యంత కష్టంగా ఉంటుంది.” - కాపిటల్ 1.18 తొలి జర్మన్ ఎడిషన్ కి ముందు మాట.
కష్టంగా ఉండడానికి కారణాలు

నేను వాడిన విశ్లేషణా విధానం గతంలో అర్ధశాస్త్రానికి వాడలేదు. దాని (విశ్లేషణా విధానం) వల్లతొలి చాప్టర్లు అర్ధమవడం కష్టంగా/ జటిలంగా/ కఠినంగా ఉంటుంది. ఆయన పాటించిన విశ్లేషణా విధానాన్ని తెలుసుకొని చదివితే అర్ధం చేసుకోవచ్చు. అందుకు కొంత శ్రమపడి అవసరమైన విషయాలు నేర్చుకోవడం  అవసరం. పాఠకుడు అటువంటి వాడై ఉండాలి అంటాడు.
కాపిటల్ లో ఒకే సైన్స్  కి లాజిక్ నీ, గతితర్కాన్నీ, భౌతిక వాద జ్ఞానసిద్ధాంతాన్నీ వర్తింపచేశాడు- అన్నాడు లెనిన్ - Vol38.317
తనది గతితార్కిక పధ్ధతి కాక మరేమిటి?అని ప్రశ్నించాడు మార్క్స్- కాపిటల్ 1 .28
గతితర్కం : వైరుధ్యాలు
సరుకు ఉపయోగపు విలువ, విలువల సమ్మేళనం. అవిరెండూ విరుద్దాంశాలు. కలిసున్నంతవరకే సరుకు. విడిపోతే విలువ ఒకచోటికీ, ఉపయోగపు విలువ మరోకచోటికీ చేరతాయి.
అలా చేరకపోతే సరుకులు మేటలు వేస్తాయి. మరీ ఎక్కువయితే సంక్షోభం వస్తుంది.
పెట్టుబడి సాధారణ సూత్రం లోని వైరుధ్యాలు అనే ముఖ్యమైన అధ్యాయం ఉంది.
ప్రస్తుతం పరిశోదిస్తున్నప్రక్రియడబ్బు మరింత డబ్బు అవడంఅనేది. ఈపరిశోధన  రెండు షరతులు నెరవేర్చాలి.
1. మిత్రుడుడబ్బుసంచీఇప్పటికి లార్వా రూపంలోనే ఉన్న పెట్టుబడిదారుడు. అతను సరుకుల్ని వాటి విలువలకే కొనాలి, వాటి విలువలకే అమ్మాలి. అయినాగాని ప్రక్రియ చివరలో చలామణీలో మొదట పెట్టిన విలువ కంటే ఎక్కువ విలువని చలామణీ నుండి రాబట్టాలి.
2.అతను సీతాకోక చిలుకగా, అంటే సంపూర్ణ పెట్టుబడి దారుడుగా, వృద్ధి అవడం, చలామణీ రంగంలోనూ జరగాలి,చలామణీ రంగంలో జరగనూ కూడదు.
మార్క్స్ ముందుగా సరుకుల మారకాన్ని విశ్లేషిస్తాడు. అందులో ఆధునిక సమాజం లోని అన్ని వైరుధ్యాల్నీవిశ్లేషణ వెల్లడిస్తుంది లెనిన్ vol.38. 358-359

 పరిమాణాత్మక మార్పులు గుణాత్మక మార్పుకి దారితీయడం
మధ్యయుగాల్లో పెట్టిన గరిష్టమొత్తం కంటే  చాలా ఎక్కువ పెట్టగలిగిన సందర్భాలలోనే, డబ్బున్నవాడు పెట్టుబడిదారుడిగా అవగలడు. ఇతను అడ్వాన్స్ చేసే కనిష్ట మొత్తం వృత్తియజమాని పెట్టే గరిష్టమొత్తం కంటే ఎంతో ఎక్కువ వుంటుంది. కేవలం పరిమాణాత్మక తేడాలు ఒకస్థాయి (point) దాటితే గుణాత్మక మార్పులు అవుతాయని హెగెల్ చెప్పిన నియమం ఇక్కడ రుజువైంది.అంటాడు మార్క్స్- cap 1.292

అభావం అభావం చెందడం

ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణా, శ్రమ సామాజికీకరణా అంతిమంగా ఒక స్థాయికి చేరుకుంటాయి. ఆస్థాయివద్ద వాటికీ, వాటి పెట్టుబడిదారీ పై పెంకుకీ పొసగదు, పొత్తు కుదరదు.ఆ పెంకు బద్దలవుతుంది.పెట్టుబడిదారీ ప్రైవేటు ఆస్తికి మరణ గంట మోగుతుంది.ఆస్తి హర్తల ఆస్తి హరించబడుతుంది.-cap1.715

పెట్టుబడిదారీ ఉత్పత్తి ఫలితం అయిన పెట్టుబడిదారీ స్వాయత్త విధానం పెట్టుబడిదారీ ప్రైవేట్ ఆస్తిని ఏర్పరుస్తుంది. ఉత్పత్తిదారుని సొంత శ్రమమీద ఆధారపడ్డ వ్యష్టి ప్రైవేట్ ఆస్తికి ఇది మొదటి అభావం. అయితే, పెట్టుబడిదారీ ఉత్పత్తి తన సొంత అభావాన్ని అనివార్యంగా తెచ్చుకుంటుంది. ఇది అభావం యొక్క అభావం.ఇది ఉత్పాదకుని ప్రైవేట్ ఆస్తిని మళ్ళీ స్థాపించదు. కాని, పెట్టుబడిదారీ యుగం ఆర్జన మీద- అంటే, సహకారం మీదా, ఉమ్మడి దైన భూమిమీదా ,ఉత్పత్తి సాధనాల మీదా- ఆధారపడ్డ వ్యక్తిగత ఆస్తినిస్తుంది.-cap1.715

కాపిటల్ లో తేల్చిన విషయాలు
మార్క్స్ పూర్వులకు విలువకీ, మారకం విలువకీ తేడాలేదు. శ్రమకీ శ్రమ శక్తికీ తేడా లేదు. మారకం విలువకీ, విలువకీ ఉన్న తేడాని,  శ్రమకీ శ్రమ శక్తికీ ఉన్న తేడాని విశ్లేషించి కాపిటల్ లో తేల్చాడు.

అప్పటికి శ్రమశక్తి అనే కాటగరీ లేదు. దాని ద్వారా కాపిటల్ లో తేల్చింది ఏమిటి?  దోపిడీ ఉన్నదని కాదు. ఆవిషయం అంతకు ముందు వాళ్ళకూ తెలుసు. అందుకు కారణం అసమానమారకం అని రికార్డియన్ సోషలిస్టులు భావించారు. ఉత్పత్తయినదంతా శ్రామికులకి చెందాలి అన్నారు.
అయితే మారకం అనేది సమాన విలువల మధ్యే అనేది మారక నియమం. మారక నియమానికీ, వాస్తవానికీ పొత్తుకుదరడం లేదు.
సమాన మారకం జరుగుతూనే లాభం రావాలి. ఎలా?
పెట్టుబడిదారుడు కార్మికుని నుంచి కొంటున్నది శ్రమని కాదు, శ్రమశక్తిని అని తేల్చాడు. సమానమారకం జరుగుతూనే అదనపు విలువ ఎలా వస్తుందో రుజువు చేశాడు. అదనపు విలువ సిద్ధాంతాలు మూడు భాగాలలో అదనపు విలువ గురించి సమగ్రంగా చర్చించాడు. ఆతర్వాత కాపిటల్ రాశాడు.
కాపిటల్ చదివితే, మార్క్స్ సిద్ధాంతం మీద  పట్టు చిక్కుతుంది.

సరుకు ద్వంద్వస్వభావి. ఉపయోగపువిలువ, మారకం విలువఅనే విరుద్దాంశాలసమ్మేళనం. తదుపరి
విశ్లేషణ ద్వారా మారకం విలువ వెనక ఉన్న విలువని చూపుతాడు. విలువ వేరు, మారకం విలువ వేరు అని తేలుస్తాడు.
సరుకు కచ్చితంగా చెప్పాలంటే, ఉపయోగాపువిలువా, విలువా అంటాడు. మొదట చెప్పింది తప్పు అంటాడు.మారకంవిలువ అనేది విలువ రూపం అని స్పష్టం చేస్తాడు. విలువ రూపం అభివృద్ధిని వివరిస్తాడు.
విలువ డబ్బురూపం తీసుకునేదాకా మధ్యంతర రూపాల్ని పరిశీలిస్తాడు. డబ్బు పెట్టుబడి గామారడం, శ్రమ సక్తి కొనుగోలూ అమ్మకమూ, అదనపు విలువ ఉత్పత్తీ,సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తీ, కార్ఖానా ఉత్పత్తీ, యంత్రాలూ ఆధునిక  పరిశ్రమలూ-వీటి గురించి వివరిస్తాడు.
పనిదినం పొడిగింపు, పిల్లల్ని పనికి పెట్టుకోవడం – వంటి అదనపు విలువని పెంచుకునే అంశాలను దీర్ఘంగా చర్చిస్తాడు.
పెట్టుబడి ప్రోగుబడి,లాభం రేటు తగ్గే ధోరణి, కార్మిక వర్గం మీద పెట్టుబడి పోగుబడి ప్రభావం- పారిశ్రామిక రిజర్వ్ సైన్యం ఏర్పడడమూ,సంక్షోభాలూ రావడమూ -వగైరాల గురించి క్షుణ్ణంగా వివరిస్తాడు.
సంక్షోభాలు
పెట్టుబడిదారీ విధానంలో సంక్షోభాలు అనివార్యంగా వస్తుంటాయి. “అవి వచ్చినప్పుడల్లా అంతకంతకూ మరింత ప్రమాదకరంగా, మొత్తం బూర్జువా సమాజానికే చావు బతుకుల సమస్య తెచ్చి పెడుతున్నాయి. ఈ సంక్షోభాలు వచ్చినప్పుడల్లా, ఉత్పత్తిన సరుకుల్లోనే గాక, గతంలో సృష్టించబడిన ఉత్పాదక శక్తులలో కూడా పెద్ద భాగం నాశనం చేయబడుతుంది. గత యుగాల్లో అసంభావంగా కనిపించే ఒక అంటురోగం ఈ సంక్షోభ సమయాల్లో చెలరేగుతుంది. మితిమీరిన ఉత్పత్తి అనే అంటురోగం..”-ప్రణాళిక సం.ర.1.51
అమితోత్పత్తి ఎందుకు, ఎలా ఏర్పడుతుందో కాపిటల్ లో ఉంటుంది. సరుకు అమ్మకానికీ, కొనుగోలుకీ మధ్య విరామం మరీ ఎక్కువయితే, వాటి మధ్య ఉండే సన్నిహిత సంబంధం, వాటి ఏకత్వం సంక్షోభాన్ని ఏర్పరచడం ద్వారా నిరూపించుకుంటుంది.- cap1.115
సంక్షోభంలో సరుకులకీ వాటి విలువ రూపమయిన డబ్బుకీ మధ్య వైరుధ్యం పరమ వైరుధ్యంగా పరిణమిస్తుంది.- cap1.138
 లాభాల రేటు పడిపోయే పోకడ ఉంటుంది. పెట్టుబడి దారులు లాభాల మొత్తంపెంచడం ద్వారా దాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తారు. దీనిని సాధించడానికి వాళ్ళు మార్కెట్ పరిమాణాన్ని లెక్కలోకి తీసుకోకుండా ఉత్పత్తిని విస్తృత పరుస్తారు. అమితోత్పత్తి సంక్షోభాలు తీవ్రమయ్యే అవకాశం దీనిద్వారా ఏర్పడుతుంది.
 లాభం రేటు పడిపోయే ధోరణీ, దానికి విగుడుగా పనిచేసే ధోరణీ పెట్టుబడి దారీ విధానం లోని అంతర్వైరుధ్యాలను తీవ్ర పరుస్తాయని మార్క్స్ నిర్ధారిస్తాడు.సంక్షోభాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. అంతకంతకూ తీవ్రమవుతాయి. చివరకి అవి పెట్టుబడిదారీ ఉత్పత్తి  బలవంతపు పతనానికి దారితీస్తాయి. దాన్ని పతనంచేసే కర్త ఎవరు? కార్మిక వర్గం.
ఈ అంటురోగం వల్ల “ హఠాత్తుగా మానవ సమాజం తాత్కాలిక ఆటవిక దశలో ప్రవేశించినట్లుంటుంది; కాటకమో సర్వ విధ్వంసక యుద్ధమో వచ్చి సకల ప్రాణాధార వస్తువుల సరఫరానూ భగ్నం చేసినట్లుంటుంది. పరిశ్రమలూ వాణిజ్యమూ ధ్వంసమైనట్లు ఉంటుంది.”
ఆసంక్షోభాల్ని పెట్టుబడిదారీ వర్గం ఎలా అధిగమిస్తుంది?
  • ·         ఉత్పాదక శక్తుల్లో కొంతభాగాన్ని విధిలేక ధ్వంసం చెయ్యడం ద్వారా
  • ·         కొత్త మార్కెట్లను జయించడం ద్వారా
  • ·         పాత మార్కెట్లను మరింత కట్టుదిట్టంగా దోచుకోవడం ద్వారా

అంటే మరింత విస్తృతమైన, మరింత విధ్వంసకమైన సంక్షోభాలకు బాటవేయడం ద్వారా అన్న మాట.- ప్రణాళిక సం.ర.1.52
సంక్షోభాల గురించి కాపిటల్ 4 వ భాగం అనుకునే అదనపు విలువ సిద్ధాంతాలలో ఎన్నోచోట్ల ఉంటుంది. అవి పెట్టుబడి దారీ విధానం లోని ఏవైరుర్ధ్యాల మూలంగా వస్తాయో, ఎలా సాగుతాయో, కార్మికుల మీద వాటి ప్రభావం ఏమిటో ఎంతో వివరంగా కాపిటల్ లో ఉంటుంది.
కార్మికుడు యంత్రానికి తోక అవుతాడు ప్రణాళిక
ఎందుకో పెట్టుబడిలో వివరిస్తాడు.
కార్మికుడు యంత్రానికి తోక అయినాడు.-సం.ర.1.52
మొదట, సరుకు తయారీకి అవసరమైన ఉత్పత్తి సాధనాలు లేక పోవడం వల్ల, తన శ్రమ శక్తిని పెట్టుబడికి అమ్ముతాడు. ఇప్పుడు అదే శ్రమశక్తి పెట్టుబడికి అమ్ముడవకపోతే, అది అతనికి ఉపయోగపడదు. అమ్ముడయిన తర్వాత కార్ఖానాలో మాత్రమే పనులు చెయ్యగలుగుతాడు.  స్వతంత్రంగా ఏదీ చెయ్యలేడు. కనుక కార్ఖానా కార్మికుడు పెట్టుబడిదారుడి వర్క్ షాప్ కి తోకగా మాత్రమే తన ఉత్పాదక శక్తిని పెంచుకోగలడు.
అతడొక యంత్రానికి తోక ఐనాడు. అతనికి ఉండవలసినదల్లా పనిలో చాకచక్యం మాత్రమే గానుగెద్దు పనిలాగా అత్యంత విసుగు పుట్టించేదీ, అత్యంత సులభంగా అలవడేదీ ఐన చాకచక్యం మాత్రమే.అతడు చేయవలసిన పని బహు సులభం. దాన్ని సునాయాసంగా నేర్చుకోవచ్చు.
 నిరుద్యోగ సైన్యం
ఆధునిక పరిశ్రమలు అభివృద్ధి అయ్యేకొద్దీ కార్మికుని నైపుణ్యానికీ, శరీర బలానికీ ప్రాముఖ్యం తగ్గుతుంది....యజమానులు పురుషులను తొలగించి స్త్రీలను పనిలో పెట్టుకుంటారు.” - సం.ర.1.53
మధ్య తరగతి లోని కింది శ్రేణి వాళ్ళు చిన్నచిన్న వ్యాపారస్తులూ, దుకాణదారులూ, రిటైరైన వర్తకులూ, చేతిపనివాల్లూ, రైతులూ వీళ్ళందరూ క్రమక్రమంగా కార్మిక వర్గంలోకి దిగజారిపోతారు.”- సం.ర.53
ఆధునిక కార్మికుడు పరిశ్రమలు అభివృద్ధి అయ్యేకొద్దీ పైకి రాకుండా ఇంకా కిందికి పోతున్నాడు; కార్మిక జీవన విధానానికి కూడా అంటిపెట్టుకోకుండా దినదినానికీ యింకా అడుక్కు, యింకా లోతుకు పోతున్నాడు.
దారిద్ర్యం, పీడన బానిసత్వం,దోపిడీల పరిమాణం పెరుగుతుంది. దాంతోపాటు కార్మిక వర్గ నిరసన కూడా పెరుగుతుంది. వర్గ పోరాటం మొనదేలుతుంది. కార్మిక వర్గం ఆధునిక పరిశ్రమల అతిముఖ్య సృష్టి.
బూర్జువా వర్గం ఉత్పత్తి చేసే వాటిలోకేల్లా ముఖ్యమైనదేమంటే తనకే మారకులైన వాళ్ళు. బూర్జువా వర్గాపతనమూ అనివార్యమే, కామిక వర్గ విజయమూ అనివార్యమే.-ప్రణాళిక సం.ర.1.58
కాపిటల్లో పెట్టుబడి దారీఉత్పత్తి  పతనం గావడం ఎందుకు అనివార్యమో సిద్ధాంత పరంగారుజువు చేస్తాడు.
కమ్యూనిస్టులు రెండూ చదవాలి. పెట్టుబడి అందరూ చదవడం కుదరదు.
ఏ పార్టీ కైనా ప్రణాళిక ప్రధానమైంది. కమ్యూనిస్టులకూ అంతే. కమ్యూనిస్టుల కర్తవ్యాలేమిటో అందులో ఉంటాయి. కనక ప్రతి కమ్యూనిస్ట్ చదవాల్సి ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయం లేదు.
పెట్టుబడి అర్ధం చేసుకోవడం అంతసులభం కాదని చూశాం. పెట్టుబడి చదవ(లే)క పోయినా, అందులో విషయాన్ని తెలియజెప్పే పుస్తకాలు చాలా ఉన్నాయి. వాటిలో మార్క్స్ చెప్పింది చెప్పినట్లు రాసి ఉంటుంది. వాటిని కొంచెం తేలికగా చదువుకోవచ్చు.
లియాన్ టీవ్ రాసిన political economy – A beginner’s course అనేపుస్తకాన్నినండూరి ప్రసాదరావు గారి అనువాదం  ‘రాజకీయ అర్ధ శాస్త్రం పేరుతో’ 1947లో ప్రజాశక్తి ప్రచురణాలయం అచ్చువేసింది.
Political Economy- A condensed course ని రా.రా. అర్ధశాస్త్రం సంక్షిప్త పాఠం పేరుతొ 1978 లొ వచ్చింది. ప్రగతి ప్రచురణాలయం విడుదలచేసింది.
నికిటిన్ రాసిన Fundamentals of political economy తెలుగు అనువాదం 1967 లొ వచ్చింది..
అఫ్ నస్యేవ్ తదితరులు 1974 రాసిన The Political Economy of capitalism  ‘ పెట్టుబడిదారీ అర్ధశాస్త్రంపేరుతో రా.రా అనువాదం 1978లొ వచ్చింది.
తర్వాత మరికొన్ని పుస్తకాలోచ్చాయి. కాపిటల్ చదవడం కుదరని కమ్యూనిస్ట్ కార్యకర్తలూ,నాయకులూ వీటిని చదివి కాపిటల్ సారాన్ని గ్రహించవచ్చు. చదవగలిగినవారు కచ్చితంగా కష్టపడి అయినా కాపిటల్ చదవాలి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి