10, మార్చి 2018, శనివారం

వృత్తి మేస్త్రీ ఉత్పత్తీ - పెట్టుబడిదారుడి ఉత్పత్తీ


వృత్తి మేస్త్రీ ఉత్పత్తీ - పెట్టుబడిదారుడి ఉత్పత్తీ

పెట్టుబడి దారుల ఉత్పత్తికి ముందు, వృత్తిమేస్త్రీల ఉత్పత్తి ఉండేది.దాన్ని వెనక్కి నెట్టి  పెట్టుబడి దారీ ఉత్పత్తి ముందుకొచ్చింది.
పెట్టుబడి దారీ ఉత్పత్తి విధానం ఎప్పుడు మొదలయినట్లు?
ఒక పెట్టుబడిదారుడు ఎక్కువమంది  శ్రామికులని పెట్టుకున్నప్పుడు; అంటే విస్తృతస్థాయిలో  శ్రమ ప్రక్రియ నిర్వహించినప్పుడు; ఫలితంగా పెద్ద పరిమాణాల్లో సరుకులు ఉత్పత్తి చేసినప్పుడు. మార్క్స్ మాటల్లో:  ఒకేకాలంలో, ఒకే చోట, ఒకే యజమానికింద ఒకే రకమైన సరుకు తయారుచెయ్యడానికి అధిక సంఖ్యలో కార్మికులు కలిసి పని చెయ్యడమే పెట్టుబడిదారీ ఉత్పత్తికి చారిత్రకంగానూ, తార్కికం గానూ  ఆరంభ బిందువు - capital 1.305
పెట్టుబడిదారీ ఉత్పత్తికి ఒకచోట, ఒక యజమాని తక్కువమంది శ్రామికుల్ని పెట్టుకొనే వాడు. ఎక్కువమందిని పెట్టుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది అనే సంగతి అతనికి తెలిసిందే గదా! మరి ఎక్కువమందిని ఎందుకు పెట్టుకోడు?

అతన్ని ఆటంకపరిచేవి ఏవైనా ఉన్నాయా?

ఆటంక పరిచేవి గిల్డులూ, వాటి నిబంధనలూ. గిల్డులంటే -వర్తకుల సంఘాలూ, వృత్తి సంఘాలూ. వాటి గురించి కొంచెం. 10,11 శతాబ్దాలలో పశ్చిమ ఐరోపా దేశాల్లో పట్టణాలు ఏర్పడసాగాయి. 14వ శతాబ్దానికల్లా ఐరోపా అంతటా పట్టణాలు దట్టంగా వ్యాపించాయి. 11-15 దశాబ్దాల ఐరోపా ప్రజల జీవనంలోని ముఖ్య మార్పులకు మధ్యయుగాల పట్టణాల ఆవిర్భావంతోనూ, వ్యాప్తితోనూ సంబంధం ఉంది. ఆపట్టణాలు ఇతరప్రాంతాలతోటీ, ఇతర దేశాలతోటీ వ్యాపారం సాగించాయి. క్రమంగా వర్తకం విస్తరించింది.
వర్తకుల సంఘాలు (merchant guilds).
వ్యాపారం లాభదాయకమే అయినా కష్టతరంగానూ, ప్రమాదకరంగానూ ఉండేది. ఇతరప్రాంతాలకు సరుకులు తీసుకుపోతుంటే, దోపిడీ దొంగల బెడద ఉండేది. కావలి వాళ్ళని పెట్టుకుని గుంపులుగా సరుకులతో వెళ్ళేవాళ్ళు. అదిగాక భూస్వాముల ప్రాంతాలూ, నదులు దాటాలంటే  వాళ్లకి ‘టోల్’ కట్టాలి. ఎందుచేతైనా బండి తిరగబడి, సరుకులు నేలమీద పడితే అవి ఆనేల సొంతదారుకి చెందేవి. సముద్రంలోమునిగిన పడవ ఒడ్డుకొస్తే సరుకులు అక్కడి భూస్వామికి దక్కేవి. వ్యాపారుల బళ్ళు లేపే దుమ్ముకి నష్టపరిహారం ఇవ్వాల్సి వచ్చేది. దొంగలనించీ, భూస్వాముల నుంచీ రక్షణకోసం సంఘాల్లో ఐక్యం అయ్యారు. ఆసంఘాలే గిల్డులు. వర్తకులు పెట్టుకున్నవి కనక  వర్తకుల సంఘాలు’(merchant guilds).

వృత్తి మేస్త్రీల సంఘాలు (craft guilds).

వర్తకుల సంఘాలు ఏర్పడ్డ అర్ధశతాబ్దం తర్వాత వృత్తిసంఘాలు వచ్చాయి. ఒక వృత్తిలో నేర్పున్న మేస్త్రీ ఒక వర్క్ షాప్ పెట్టుకుంటాడు. అతనే వృత్తిమేస్త్రీ. అలాంటి వాళ్ళు పెట్టుకున్న సంఘమే వృత్తి సంఘం(craft guild).
వృత్తి మేస్త్రీ వర్క్ షాపు 
మధ్య యుగాల్లో చిన్న చిన్న వర్క్ షాపుల్లో సరుకులు ఉత్పత్తయ్యేవి. పనిస్థలం  మేస్త్రీ ఇంటిలో ఒకచోటే. పని చేసేది చేతిపని ముట్లతోనే. అవన్నీ మేస్త్రీవే. ప్రధానమైన పనివాడు మేస్త్రీయే. అతనికి అక్కడ తయారయ్యే  వస్తువులు చేసే నైపుణ్యం ఉంటుంది. ఇద్దరినో, ముగ్గురినో పనివచ్చిన వాళ్ళని(జర్నీమెన్) కొద్ది జీతం మీద పెట్టుకుంటాడు. పని నేర్చుకునే వాళ్ళని (అప్రెన్ టిస్) చేర్చుకుంటాడు. అప్రెంటిస్ లు నేర్చుకుంటూ సహాయ పనిని చేస్తారు. వాళ్లకి జీత భత్యాలుండవు. తిండీ, బట్టా, వసతీ మేస్త్రీ బాధ్యత. అతనూ తనపనివాళ్ళతో పాటు పనిచేస్తాడు. అతనే ప్రధాన శ్రామికుడు. పనిస్తలానికీ, పనిముట్లకీ అతనే అధిపతి. తన సొంత షాపులో స్వతంత్ర శ్రామికుడు. ముడి పదార్ధాలు కొంటాడు.తయారయిన వస్తువులు అతనివే. ఇతరుల ఆర్డర్ల మీదనో, అమ్మకానికో వస్తువులు తయారుచేస్తాడు.
చేతి పనిముట్లు
తయారీ అంతా చేతితోనే, చేతి పనిముట్లతోనే. మేస్త్రీ, జర్నీమాన్ ఏ వస్తువు నైనా ఎవరికివారు మొత్తంగా చేసేవారు. ఉదాహరణకి ఒక నాగలి కర్రు చేయ్యాలి. ఎర్రగా కాలిన ఇనప ముక్కని కొలిమిలోనించి తీసేవాడు. డాకలు మీద పెట్టి కావలసిన షేప్ వచేట్లు సుత్తెతో కొట్టేవాడు. ఇదంతా పూర్తిగా తనే చేస్తాడు.
సొంత వర్క్ షాప్
కొన్ని సంవత్సరాలపాటు పని నేర్చుకున్నాక, అప్రెంటిస్ జర్నీమన్ అవుతాడు. వేతనం పొందుతాడు. సరిపడా డబ్బు కూడబెట్టుకున్నాక, సొంత వర్క్ షాప్ తెరుచుకోవచ్చు. అందుకతను తనపనితనాన్ని నిరూపించే వస్తువు (masterpiece) తనసొంత డబ్బు పెట్టి తయారుచేసి ‘గిల్డు’ మెప్పు పొందాల్సి ఉంటుంది. పొందాక, జర్నీమెన్ నీ, అప్రెంటిస్ లనీ నియమించి, సొంత వర్క్ షాప్ తెరుచుకోవచ్చు. ఎలిజబెత్ రాణీ చేసిన శాసనం ప్రకారం ఒక వృత్తి చెయ్యాలంటే ఏడేళ్ళు మేస్త్రీ దగ్గర పనిచెయ్యాలి.
వృత్తివృత్తికీ ఒక్కొక గిల్డు
అలా ఒకే వృత్తి జరిగే వర్క్ షాపులు ఒక పట్టణంలో ఎన్నో కొన్ని ఉంటాయి. ప్రతి వర్క్ షాప్ ఒనరూ ఒక మేస్త్రే. ఒకే వృత్తిలో ఉండే వర్క్ షాప్ మేస్త్రీలు సంఘటితమై వాళ్ళ ఉమ్మడి ప్రయోజనాలకోసం పెట్టుకున్న సంఘమే, వృత్తిసంఘం (craft guild) . ప్రతి పట్టణంలోనూ నేతగాళ్ళ గిల్డూ, చెప్పులు కుట్టేవాళ్ళ గిల్డూ, కుండలు చ్గేసే వాళ్ళ గిల్డూ ఇలా వృత్తి కొకటి చొప్పున గిల్డులు ఏర్పడ్డాయి.
కమ్మరం పనులు నిర్వహించే యజమానులసంఘమే కమ్మరుల వృత్తిసంఘం. ఏ వృత్తికి ఆవృత్తి సంఘం ఉండేది.
గిల్డ్ అంటే ఒకే వృత్తి చేసే వర్క్ షాప్ మేస్త్రీల సంఘం. వృత్తి మేస్త్రీల ప్రయోజనాలు కాపాడడమే ఆసంఘాల లక్ష్యం.


ప్రధానోద్దేశం పోటీ నుండి రక్షణ


గిల్డు సభ్యుల మధ్య పోటీ లేకుండా చేసేందుకు గిల్డు నిబంధనలున్నాయి. కాని వర్తకులూ, ఇతరప్రాంతాల వృత్తిదారులూ  గిల్డు సభ్యులు కారు. కనుక  ఆనిబంధనలకి నిబద్దులు కారు. 
బయట వాళ్ళని కట్టడి చెయ్యాలంటే, చట్టపరమైన హక్కు అవసరం. అటువంటి చట్టాలు చేసే అధికారం ఉన్నది మున్సిపాలిటీలకే. అందువల్ల స్థానిక సంస్థలకి డబ్బు చెల్లించేవారు. అయితే 13వ శతాబ్దం మొదటినించీ స్వయం పాలన కావాలని డిమాండ్ చేశారు. 14 వ శతాబ్దం జరిగేటప్పుడు వృత్తిసంఘాలు  వాటి అధికారుల్నీ, జూరర్లనీ నామినేట్ చేసే హక్కుని సాధించుకున్నాయి. వృత్తిని చేసుకోవడంలో గుత్తాధిపత్యాన్ని పొందాయి. గిల్డు మెంబర్లు కానివాళ్ళని కాళీ చేయించి వెళ్లగొట్టే వాళ్ళు. ఇతర పట్టణాల వృత్తిదారులూ, గ్రామీణ వృత్తిదారులూ తమ పట్టాన మార్కెట్ లో  సరుకులు అమ్మకుండా చూసేవాళ్ళు. దాంతోపాటు గిల్డులు భాగ్యవంతులైన వర్తకులతో పాటు మున్సిపల్ ప్రభుత్వ నిర్వహణలో భాగం సాధించాయి.
ఇతరులకు ప్రవేశం లేని మార్కెట్ మీద ఆధిపత్యం వహించే ఉత్పత్తిదారుడి లాభమే లక్ష్యం. ప్రతి గిల్డూ తనవృత్తిని తన సభ్యులు మాత్రమే చేసుకునే హక్కుతో ఉంటుంది. బయటవారేవ్వరినీ  ఆవృత్తికి అనుమతించదు. ఈ గుత్తాధిపత్య స్వభావాన్ని ఇంగ్లాండ్ లో ‘గిల్డా’ (gilda) అనేవారు. “ఫ్యూడల్ పారిశ్రామిక వ్యవస్థలో కొత్తవాళ్ళకు ప్రవేశం లేని వృత్తి సంఘాలకు పారిశ్రామిక ఉత్పత్తులమీద గుత్తాధిపత్యం ఉండింది.”- కమ్యూనిస్ట్ ప్రణాళిక సం.ర. 1.పేజి 46 సంఘసభ్యులకు మాత్రమే ఆ వృత్తి చేసే హక్కుంటుంది. ఇతరులు ఆసరుకుల్ని ఉత్పత్తి చెయ్యకూడదు.

నిబంధనలు

·         తాను మేస్త్రీ అయిన వృత్తిలో తప్ప మరే యితర వృత్తిలోనూ జర్నీమాన్ ని నియోగించకూడదు. ఉదాహరణకి, వడ్రంగం మేస్త్రీ నగల వర్క్ షాప్ నడపడానికి వీలుండదు. వర్తకులు ఏసరుకునీ  ఉత్పత్తి చెయ్యలేరు. వాళ్ళు ఏ వృత్తి లోనూ మేస్త్రీలు కాకపోవడమే అందుకు కారణం.ఈనిబంధన ద్వారా వర్తక పెట్టుబడి పరిశ్రమల్లోకి చొచ్చుకు రాకుండా నిరోధించ గలిగారు. “వ్యాపారి ఏసరుకునైనా కొన గలడు కాని శ్రమ శక్తిని ఒక సరుకుగా కొన జాలడు.” capital 1.339                                          ఎందుకంటే అతడు ఏచేతి వృత్తిలోనూ మేస్త్రీ కాడు. ఒకవేళ వ్యాపార పెట్టుబడి ఈ నియమాలను అతిక్రమిస్తే, వృత్తి సంఘాలు తిప్పికోట్టేవి. వర్తకుడు వృత్తిదారుల ఉత్పత్తుల బేరగాడు (dealer)గా సహనంతో మెలగడం వల్లనే అతను ఉండగలిగాడు.                                                       
“వర్తక పెట్టుబడీ, వడ్డీ పెట్టుబడీ పారిశ్రామిక పెట్టుబడిగా మారకుండా పట్టణాల్లోని గిల్డులు నిరోధించాయి.”- capital1.703  అక్కడే ఒక ఫుట్ నోట్ ఉంది: 1794 లో కూడా లీడ్స్ లోని చిన్న బట్టల ఉత్పత్తిదారులు   ఏ వర్తకుడూ తయారీ దారుడు (manufacturer) అవకుండా నిషేధించమని పార్లమెంటుకి విజ్ఞప్తి చేశారు.-(Description of the Country from 30 to 40 miles round Manchester -Dr. John Aikin)

·         ఒక మేస్త్రీ ఫలానింతమంది జర్నీమన్ లనీ, అప్రెంటిస్ లనీ మించి పెట్టుకోకూదడనే నియమం ఉంటుంది. ఎంతమందినిబడితే అంతమందిని పెట్టుకునే స్వేచ్చ ఉండదు. అది అతని ఇష్టం కాదు. ఒక మేస్త్రీ నియోగించగల పనివాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కొద్దిమంది పనివాళ్ళేఉంటారు కాబట్టి మేస్త్రీ దగ్గర ఎక్కువగా  డబ్బు కూడే అవకాశం లేదు. ఒకవేళ ఇంకొంత మందిని పనివాళ్ళని పెట్టుకునేపాటి డబ్బు ఉన్నా వృత్తిసంఘం (గిల్డు) అందుకు అనుమతించదు.ఆవిధంగా మేస్త్రీ ని పెట్టుబడిదారుడు అవకుండా గిల్డు నిబంధనలు  అడ్డుకున్నాయి capital 1.339

·         ఇంగ్లండులో రాజునుండి పొందిన గుత్తాధిపత్యానికి గిల్డులు సంవత్సరానికింతని డబ్బుకట్టేవి. పొరుగు పట్టణాల వృత్తిదారులూ, గ్రామీణ వృత్తిదారులూ తమ మార్కెట్లో సరుకులు అమ్మకుండా కట్టుదిట్టం చేసేవారు. గిల్డు సభ్యులు పట్టణంలో గస్తీ తిరిగేవారు. సర్వ సభ్య సమావేశంలో నిబంధనలు ఆమోదించేవారు. వాటిని అమలు పరిచేవారు.

·         పనివాళ్ళు ఒక మేస్త్రీ నించి మరొక మేస్త్రీ దగ్గరకు పోకూడదు. శ్రామికుడికి తన శ్రమ శక్తిని ఇచ్చవచ్చినట్లు అమ్ముకునే స్వేచ్చలేదు. అందుకు భిన్నంగా పెట్టుబడిదారీ రూపంలో  పెట్టుబడికి ముందు తన శ్రమశక్తిని అమ్ముకోగల స్వేచ్చాయుత వేతన శ్రామికుడు కావాలి. బానిసగానో, అర్ధబానిసగానో, వేరొకరి అధీనుడిగానో  వుండకూడదు. స్వేచ్చగా తన శ్రమశక్తిని ఎక్కడ మార్కెట్ ఉంటె అక్కడకు పోయి అమ్ముకోవాలంటే, వృత్తిసంఘాల regime నించి తప్పించుకోవాలి. అప్రెంటిస్ లకీ, జర్నీమెన్ కీ విధించిన నిబంధనలనుండి బయటపడాలి. గిల్డు చెప్పేదాకా జర్నీమన్ సొంత వర్క్ షాప్ తెరవజాలడు. అందువల్ల సొంత వర్క్ షాప్ పెట్టుకోవడం అతని చేతుల్లో ఉండదు.

·         ఒక వర్క్ షాపులో ఫలానిన్ని పనిముట్లు మాత్రమే ఉండాలి అనే నియమం ఉండేది. అంతకు మించి ఉండకూడదు. ఉదాహరణకి, ఒక నేత మేస్త్రీ దగ్గర ఎన్నిమగ్గాలుండవచ్చో, ఎన్నిఇతర పనిముట్లుండవచ్చో నిబంధన ఉంటుంది.
·         కొత్త పనిముట్లను ప్రవేశపెట్టకూడదు. కొన్ని సార్లు విలువైన నూతన ఆవిష్కరణల్నిగిల్డు పెద్దలు ధ్వంసం చేసేవారు. తోటివారి కంటే వేగంగానూ, చౌకగానూ సరుకులు తయారుచేసే పద్ధతులూ, పరికరాలూ వాడకూడదు. అలా వాడి మరొకరికి హాని కలిగించగూడదు. సాంకేతిక పురోగమనం స్వామిద్రోహంగా పరిగణించబడేది. పారిశ్రామిక అమరికలో పరిస్థితుల స్థిరత్వం ఆనాటి ఆదర్శం. మధ్య యుగాల్లో కొందరు ఆవిష్కర్తలు వేధింపులకి  గురయ్యారు. 1733 లో flying shuttle ని జాన్ కే కనిపెట్టాడు. గిల్దులు  ఆయన్ని వేధించాయి. చివరకతను ఫ్రాన్స్ లో సెటిల్ అవాల్సి వచ్చింది. అక్కడ దాన్ని నేతగాళ్ళకి చూపించడానికి సైతం భయపడ్డాడు తమ గుత్తాధిపత్యం దెబ్బతింటుంది కనుక, పట్టణ  గిల్డులు సాంకేతిక ప్రగతిని అడ్డుకునేవి. అధికారులు వీటి ఒత్తిడికి లొంగి నూతన ఆవిష్కరణల్ని నిలిపివేసిన సందర్భాలున్నాయి. 1397 లో కొలోన్ లో టైలర్లని ‘పిన్ను తల’ (pinheads) ఒత్తే మిషన్ వాడకుండా నిషేధం పెట్టారు. 1561 లో నూరెంబెర్గ్  నగర కౌన్సిల్ మెరుగైన స్లైడ్ రెస్ట్ లేత్ కనుగొన్న హాన్స్ స్పైచీ  అనే రాగిపని వాణ్ణి ఆటంక పరిచింది. మొదట అదే కౌన్సిల్ దాన్ని కనిపెట్టినందుకు అతనికి బహుమతిచ్చింది. ఆతర్వాత వేధించసాగింది. దాన్ని అమ్మినవాళ్ళని ఖైదు చేస్తానని బెదిరించింది. 1579 లో డాన్జిగ్ లో  రిబ్బన్ మగ్గం కనుగొన్న వానిని కౌన్సిల్ రహస్య ఆదేశంతో నీళ్ళలో ముంచారు. 1551లో బ్రిటిష్ పార్లమెంట్ ఊలు బట్ట  తయారీలో వాడే చేతి గిగ్ మిల్లులు   వాడడాన్ని నిషేధించింది. 1589 లో విలియం లీ కనిపెట్టిన కుట్టు ఫ్రేం (knitting frame) ని నేత గిల్డు (hosiers guild)వ్యతిరేకించింది. ఎంతగా అడ్డుకుందంటే, లీ బ్రిటన్ నుండి వెళ్లిపోవాల్సివచ్చింది. 1638 లో బ్రిటన్లో రాజు  రిబ్బన్ మగ్గాన్ని నిషేధించాడు.

ఆవిధంగా “ గిల్డులచే నియంత్రించబడ్డ మధ్యయుగాల చేతివృత్తుల ఉత్పత్తి  పెద్ద పెట్టుబడిదారుల ఉనికినీ, జీవితపర్యంత వేతన కార్మికుల మనుగడనీ నిరాకరించింది.”-Anti-Duhring p.183 soft 105 MECW vol 25 p136

వృత్తి మేస్త్రీ వర్క్ షాప్ కీ, పెట్టుబడి దారుడి  కార్ఖానాకి తేడా  

ఉత్పత్తి విధానానికి సంబంధించి, కార్ఖానా దాని తొలి దశల్లో గిల్డుల చేతివృత్తుల నుండి ఒక్క అంశంలో తప్ప భిన్నమైనది కాదు. ఆ ఒక్క అంశం ఏమంటే: కార్ఖానావ్యవస్థలో ఒకే వ్యష్టి పెట్టుబడి దారుడు ఎక్కువ మంది పనివాళ్ళను పెట్టుకోవచ్చు. వృత్తి సంఘాల కాలంలో అది కుదరదు.
ఉదాహరణకి, ఒక గిల్డు ముగ్గురు పనివాళ్ళని మించి నియమించరాదనే నియమం పెట్టిందనుకుందాం. 30 మందిని పెట్టుకోడానికి  10 వర్క్ షాప్ లు అవసరం. 10 మంది మేస్త్రీలు ఒక్కొక్కరు ముగ్గురేసి మందిని పెట్టుకోవాలి. అదే కార్ఖానా అయితే ఇంతమందే పనివాళ్ళు ఉండాలి  అనే నియమం లేదు. కనుక ఈ 30 మందే కాదు మరొక 300 మందినైనా ఒకే కార్ఖానాలో ఒకే వ్యక్తి నియమించుకోవచ్చు.
తొలిదశలో అక్కడా, ఇక్కడా చేతివృత్తి పనే కనక కార్ఖానాలో కేవలం కార్మికుల సంఖ్యకు పరిమితి లేకపోవడమే తేడా.
మేస్త్రీ వర్క్ షాప్ లోనూ, పెట్టుబడిదారుడి కార్ఖానాలోనూ చేతిపనే. మొదటిదాంట్లో పనివాళ్ళు అతి కొద్దిమంది. రెండోదాంట్లో ఎంతమందైనా ఉండచ్చు.
 మధ్యయుగాల చేతివృత్తి  మేస్త్రీ కున్న వర్క్ షాప్ పెద్దదయింది, అంతే”- cap1.305.

వర్క్ షాప్ లో శ్రమ విభజన లేదు-కార్ఖానాలో ఉంటుంది 

వృత్తిసంఘాల కాలంలో వర్క్ షాపు లో శ్రమ విభజన ఉండేది కాదు. మేస్త్రీ, జర్నీమాన్, వస్తువుని ఆసాంతమూ ఎవరికి వారు చేసేవారు. పరిస్థితుల వల్ల శ్రమ విభజన జరిగితే, అప్పటికున్న గిల్డులు విడిపోయేవి(capital1.338-339) ఫలితంగా గిల్డుల సంఖ్య పెరిగేది. పారిస్ లో 13 వ శతాబ్దంలో100 కు కొంచెం మించి గిల్డులు ఉండేవి.అవి 14 శతాబ్దంలో 350 కి చేరాయి. కమ్మరి సంఘం లోపల ఆయుధాలు చేసేవారూ, కవచాలు చేసేవారూ, కత్తులు చేసేవారూ ఎవరికీ వారు సొంత వృత్తిసంఘాలు పెట్టుకున్నారు. చర్మాల సంఘం నించి చెప్పులు చేసే వాళ్ళూ బెల్టులు చేసే వాళ్ళూ , సంచులు చేసేవాళ్ళూ విడిపోయి వేర్వేరు వృత్తి సంఘాలు ఏర్పరచుకున్నారు. మార్క్స్ అంటాడు: వృత్తి సంఘం  నిర్వహణ వర్క్ షాపు లోపల శ్రమ విభజనని నిరాకరిస్తుంది.-capital1.339
గిల్డు నిబంధలవల్ల ఉత్పత్తి పరిమితంగా ఉండేదన్నది స్పష్టమే. అవసరాలు పెరిగాయి

గిల్డు హక్కులు ఉత్పత్తికి సంకెళ్ళు అయ్యాయి.బూర్జువా విప్లవం దీనికి ముగింపు పలికింది.- Anti-Duhring 116
వృత్తిసంఘాల కాలంలో వర్క్ షాపులో శ్రమ విభజన ఉండదు.
శ్రమ విభజన మీద ఆధారపడిన సహకారం కార్ఖానా ఉత్పత్తి (manufacture)యొక్క విశిష్ట రూపం. ఆ కాలమంతా అది (శ్రమ విభజన మీద ఆధారపడిన సహకారం) పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ యొక్క లాక్షణిక రూపం.- Capital 1.318
వడ్డీల వల్లా, వర్తకం వల్లా ఏర్పడిన డబ్బు పెట్టుబడి పారిశ్రామిక పెట్టుబడి అవడానికి గ్రామాల్లో భూస్వామ్య రాజ్యాంగం  చేతా, పట్టణాల్లో గిల్డుల చేతా ఆటంకపరచబడ్డాయి-capital1.689.

గిల్దుల విచ్చిత్తీ -పెట్టుబడిదారీ ఉత్పత్తీ

ఈ సంకెళ్ళు భూస్వామ్యం పతనంతో పోయాయి. కొత్త కార్ఖానా దారులు నౌకాశ్రయాల దగ్గరా, పాత మునిసిపాలిటీల, వృత్తిసంఘాల పట్టులేని చోట్లా పెట్టుకున్నారు. అందువల్ల ఇంగ్లాండ్ లో కార్పోరేట్ పట్టణాలు, ఈ కొత్త పారిశ్రామిక నర్సరీలతో తీవ్రంగా పోరాడాయి.- capital1.703
డబ్బున్నవాడు ఇద్దరినో ముగ్గురినో పనివాళ్ళని పెట్టుకున్నా, బతకడానికి తనుకూడా పనిచేయాల్సి వస్తే, అతను సరైన అర్ధంలో పెట్టుబడిదారుడు కాడు, చిన్నయజమాని/ మేస్త్రీ (small master). రూపుదాల్చిన పెట్టుబడిగా వ్యవహరించ గలిగినప్పుడు అతను పెట్టుబడిదారుడు అవుతాడు- అంటే, అతని సమయాన్నంతా ప్రక్రియ నిర్వహణకీ, అజమాయిషీకి, ఉత్పాదితాల అమ్మకానికీ కేటాయించగలిగినప్పుడు; తన కార్మికులు చేసే పని చెయ్యడం మానుకోగలిగినప్పుడు.
  
ఎక్కువ మందిని పెట్టుకునేందుకు తగినంత డబ్బు ఉండాలి. పనివాడిగా బతకాలంటే, అవసర శ్రమకాలానికి సరిపడా ముడిపదార్ధాలూ, శ్రమమసాధనాలూ కావాలి. పెట్టుబడిదారుడు అదనపు శ్రమ కాలానికి కూడా వాటిని కొనాలి.
రెండో విషయం.అవసర శ్రమ 10గంటలనీ, అదనపు శ్రమ 2 గంటలనీ అనుకుందాం. పెట్టుబడిదారుడు పనిచెయ్యకుండా, బతకాలంటే, 5 గురు పనివాళ్ళని పెట్టుకోవాలి. అప్పుడు 5X2=10 గంటల అదనపు శ్రమ దక్కుతుంది. దాంతో  తానుకూడా తన బతుకుతాడు – అయితే శ్రామికుడి లాగే. పెట్టిన డబ్బు పెరగదు.
పై నిబంధనలు చూస్తే ఆనాడు ఉత్పత్తి అతి తక్కువ స్థాయిలో జరిగేది అని తేలిగ్గా తెలుస్తుంది.

పెరిగే అవసరాలకు తగినట్లు పెరగని సరుకుల ఉత్పత్తి

పట్టణ జనాభా గణనీయంగా పెరిగింది. దాంతో ఎక్కువ సరుకులు అవసరమయ్యాయి. వృత్తి మేస్త్రీల వర్క్ షాపుల్లో  ఉత్పత్తి తక్కువ స్థాయిలో ఉంటుంది గదా! అందువల్ల గిరాకీకి సరిపడే సరఫరా చేయలేకపోయాయి. అవసరాల్ని తీర్చలేకపోయాయి. ఉత్పత్తి పెరగాల్సిన పరిస్తితులు వేర్పడ్డాయి. పెరగడానికి  గిల్డునిబంధనలు ఆటంకపరిచాయి, సంకెళ్ళు అయ్యాయి. కాబట్టి గిల్డునిబంధనలు నిలబడలేకపోయాయి.అమలు కావడం అసాధ్యం అయింది.
ఇతర పట్టణాలలోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ తయారైన వస్తువులు మార్కెట్లో ప్రవేశించాయి. కూడదు అనే నిబంధన నీరుగారి పోయింది.
ఎక్కువమంది పనివాళ్ళు ఉత్పత్తిలో పాల్గొనాల్సి వచ్చింది – కొద్ది మందినే పెట్టుకోవాలి అనే గిల్డు నియమానికి కాలం చెల్లింది.
పనివాళ్ళకి డిమాండు పెరిగినందువల్ల ఒక మేస్త్రీ నించి జర్నీమన్ మరోకరిదగ్గరకు పోకూడదు అనే నియమం పట్టు తప్పింది.
ఎక్కువ మందితో పని చేయించాలంటే అస్థిర పెట్టుబడి పెరుగుతుంది. అందుకు అనుగుణంగా ఉత్పత్తి సాధనాలు పెరుగుతాయి. అంటే స్థిర పెట్టుబడి కూడా పెరుగుతుంది. పైగా వృత్తి మేస్త్రీలు చాలామంది అంతంత పెట్టుబడులు పెట్టలేరు. అందువల్ల వర్తక పెట్టుబడిని ఉత్పత్తి రంగంలోకి రాకుండా నిషేధించిన నిబంధనలూ చట్టాలూ నిర్వీర్యమై పోయాయి.
వృత్తి మేస్త్రీ వర్క్ షాప్ విధానానికి కాలం చెల్లింది. పెట్టుబడిదారుడి కార్ఖానా రావలిసిన అవసరం వచ్చింది. కార్ఖానా వెలసింది.

కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికలో ఇలా చెప్పారు:
“ఫ్యూడల్ పారిశ్రామిక వ్యవస్థలో , కొత్తవాళ్ళకు ప్రవేశంలేని వృత్తిసంఘాలకు పారిశ్రామిక ఉత్పత్తి మీద గుత్తాధిపత్యం వుండింది. కొత్త మార్కెట్ల యొక్క పెరుగుతున్న అవసరాలను ఆ వ్యవస్థ యిక ఎంతమాత్రమూ తీర్చలేకపోయింది. దాని స్థానంలో కార్ఖానా వ్యవస్థ (manufacturing system)వచ్చింది. కార్ఖానాల ద్వారా ఉత్పత్తి సాగించే మధ్యతరగతి వచ్చి వృత్తిసంఘ మేస్త్రీలను పక్కకు నెట్టివేసింది;”- మార్క్స్ ఎంగెల్స్ సంకలిత రచనలు1.46-47
కార్ఖానాల్లో పనివాళ్ళు అందరూ ఒకే పని చెయ్యడం, సరుకుని ఆసాంతమూ చెయ్యడం అనే గిల్డు నియమం పోయింది. శ్రమ విభజన ప్రవేశించింది. ప్రణాళికలో పై వాక్యాల తర్వాత:
“ప్రతి కార్ఖానాలోనూ శ్రమవిభజన ప్రవేశించడంతో వివిధ వృత్తిసంఘాల మధ్య వుండిన శ్రమ విభజన అంతరించింది. ఈలోగా మార్కెట్లు విస్తరిస్తూనే వుండినాయి, సరుకులకు గిరాకీ పెరుగుతూనే వుండింది. కార్ఖానాల ఉత్పత్తి కూడా చాలలేదు. అప్పుడు  ఆవిరి యింజన్లూ, యంత్రాలూ వచ్చిపారిశ్రామిక ఉత్పాత్తిలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చినాయి. కార్ఖానాలు కూడా పోయివాటి స్థానంలో బ్రహ్మాండమైన ఆధునిక పరిశ్రమలు వచ్చినాయి; పారిశ్రామిక మధ్యతరగతి పోయి వాళ్ళ స్థానంలో పారిశ్రామిక కోటీశ్వరులు – కార్మిక సైన్యాలమీద అధిపతులు – ఆధునిక బూర్జువాలు వచ్చినారు.”-సం.ర.-47
వృత్తిమేస్త్రీలు  ఉత్పత్తిసాదానాల అభివృద్ధిని ఆటంక కపరిచారు. పెట్టుబడి దారులు కొత్త ఆవిష్కరణల్ని ప్రోత్సహించారు. ఉత్పత్తి ఇబ్బడికిబ్బడయింది. సరుకుల డిమాండు కి తగ్గట్టు సరుకులు మార్కెట్ కొచ్చాయి. కనుక గిల్డుల ఆధిపత్యం పోయి, పెట్టుబడి దారీ ఉత్పత్తి విధానం మొదలయింది.
 ప్రణాళికలో చెప్పినట్లు : ఉత్పత్తి సాధనాలలో నిరంతరం విప్లవం తేకుండా బూర్జువా వర్గం జీవించలేదు.-సం.ర.1.48

ఉత్పత్తి సాధనాలు అభివృద్ధయ్యే కొద్దీ శ్రమ ఉత్పాదక శక్తి పెరిగింది. ఉత్పాదక శక్తి పెరుగుదలలో మూడు దశలున్నాయి.
1.సామాన్య సహకార దశ (simple cooperation)
2.కార్ఖానాల దశ (manufacture)
3. ఆధునిక పరిశ్రమ/భారీ యంత్ర పరిశ్రమల దశ (machinery and modern industry)

సహకారం గురించి వచ్చే పోస్ట్.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి