29, ఆగస్టు 2017, మంగళవారం

10.c డబ్బు- సరుకు, రెండో రూపపరివర్తన లేదా కొనుగోలు

10.C  డబ్బు- సరుకు,  రెండో రూపపరివర్తన లేదా కొనుగోలు

Second metamorphosis, or purchase

డబ్బు ఏ సరుకుతో నైనా మారకం అవుతుంది
డబ్బుకి మార్కెట్  ఎప్పుడయినా స్వాగతం పలుకుతుంది. ఎర్రతివాసీ పరిచి వుంచుతుంది.ఎందుకంటే డబ్బు  ఎలాటి పరిమితులూ, షరతులూ లేకుండా, ఏసరుకుతోనైనా అప్పటికప్పుడే మారుతుంది. అన్ని ఇతరసరుకులు రూపాంతరం చెందిన ఆకృతే డబ్బు. అది అన్ని ధరలని తిరగదిప్పి చదువుతుంది. ధరలు ఇలా ఉంటాయి:
20 గజాల బట్ట=2 ఔన్సుల బంగారం
1 కోటు =2 ఔన్సుల బంగారం
10 పౌన్ల టీ =2 ఔన్సుల బంగారంfa
40 పౌన్ల కాఫీ =2 ఔన్సుల బంగారం 
పావు ధాన్యం =2 ఔన్సుల బంగారం
అర టన్ను ఇనుం పావు ధాన్యం =2 ఔన్సుల బంగారం వగయిరా.


ధరలని తిరగదిప్పితే:

2 ఔన్సుల బంగారం /2పౌన్లు   =20 గజాల బట్ట =1 కోటు
=10 పౌన్ల టీ =40 పౌన్ల కాఫీ = పావు ధాన్యం =1/2 టన్ను ఇనుం వగయిరా 
ఆవిధంగా  డబ్బుఇతర సరుకుల శరీరాల్లో తననుతాను చిత్రించుకుంటుంది.కాబట్టి డబ్బు దేనితోనైన ఏ షరతులూ లేకుండా మారకం కాగలదు.
డబ్బుకి  ఏ వాసనా అంటదు 
డబ్బుని చూసి అది ఎలా ఒకని చేతిలోకి వచ్చిందో, ఏ సరుకు మారకంఅయినందువల్ల వచ్చిందో, చెప్పడం సాధ్యంకాదు. అది ఎక్కడ నుండి వచ్చినా, దానికి ఏ వాసనా ఉండదు. Pecunia non olet అనేది ఒక రోమన్ సామెత. దానర్ధం ‘ డబ్బుకంపు కొట్టదు’  అని.  నీరో చక్రవర్తి చనిపోయాక, క్రీ.శ 69-79 కాలంలో వెస్పాసియన్ రోమన్ చక్రవర్తిగా ఉన్నాడు. ఆదాయం పెంచడం కోసం పబ్లిక్ పాయఖానాల మీద పన్ను విధించాడు. ఆయన కొడుకు టైటస్ పాయఖానాలమీద పన్ను వెయ్యడమేమిటని  తప్పుబట్టాడు. దానికి వెస్పాసియన్ ‘ డబ్బుకంపు కొట్టదు ’ అన్నాడని  ప్రతీతి. "Money does not stink”. ఎక్కడ నుండి వచ్చినా డబ్బుకి ఏ వాసనా అంటదు. 
డబ్బు అమ్మిన సరుక్కీ, కొనబోయే సరుక్కీ రెంటికీ  ప్రతినిధే
మన చేతిలో ఉన్న డబ్బు ఎలా వచ్చింది? మన సరుకుని అమ్మితే దాని బదులు వచ్చింది. అంటే మన డబ్బు మనం అమ్మిన సరుక్కి ప్రతినిధి. అలాగే మనం ఆడబ్బుతో మరోకసరుకు కొనబోతాం. డబ్బు పోయి సరుకొస్తుంది. కొనబోయే సరుకుకి మన డబ్బు ప్రతినిధి.
ఒకవైపున అమ్మిన సరుకుకి ప్రతినిధిగా ఉంటూనే, మరొకవైపు కొనబోయే సరుకుకి కూడా ప్రతినిధిగా ఉంటుంది. అంటే,డబ్బు అమ్మిన సరుక్కీ, కొనబోయే సరుక్కీ కూడా  ప్రతినిధిగా ఉంటుంది.
 “మన చేతుల్లో ఉన్న డబ్బు మనం కొనబోయే వస్తువులకు ప్రతినిధి అయినట్లయితే, ఆడబ్బు పొందడానికి మనం అమ్మిన వస్తువులకు కూడా ప్రతినిధి అవుతుంది” - Mercier de la Rivière చెప్పాడని ఫుట్ నోట్ ఇచ్చాడు.
ఒక సరుకు అమ్మకంతో, కొన్ని కొనుగోళ్ళు  
ఒక సరుకు ఉత్పత్తిదారుడు ఆఒక్క దాన్నే మారకంలో ఇవ్వగలడు. దాన్నితరచుగా  పెద్ద మొత్తాల్లో అమ్ముతాడు. వచ్చిన డబ్బుతో అవసరమైన సరుకులు కొంటాడు. ఉదాహరణకి, ఒకడు బట్టీ పెట్టి ఇటుకలు కాలుస్తాడు. వాటిని ట్రాక్టర్ ఇంతనో, లారీ ఇంతనో అమ్ముతాడు. అతని సరుకు డబ్బులోకి పరివర్తన చెందుతుంది. దాన్ని పెట్టి కావలసిన కొన్ని సరుకులు తెస్తాడు. అంటే, ఆడబ్బుని భాగాలు చేసి అనేక కొనుగోళ్ళు చేస్తాడు. అమ్మకం ఒకటే అయినా అది అనేక కొనుగోళ్లకు దారితీస్తుంది.   
డబ్బు- సరుకు అనేది  సరుకు- డబ్బు కూడా
డ-స అంటే డబ్బుని సరుకులోకి మార్చడం- కొనడం. అదే సమయంలో అది స-డ కూడా. అంటే సరుకుని డబ్బులోకి మార్చడం- అమ్మడం. ఒక సరుకు చివరి పరివర్తన మరొక సరుకు మొదటి పరివర్తన. మన నేతగానికి సంబంధించి, బట్ట జీవితం తాను 2పౌన్లను తిరిగి మార్చిన బైబిల్ తో ముగిస్తుంది. ఒకవేళ బైబిల్ అమ్మినవాడు నేతగాడిచ్చిన 2 పౌన్లను బ్రాందీ లోకి మార్చాడు అనుకుందాం.అది డబ్బు- సరుకు, బైబిల్-డబ్బు-బ్రాందీ వలయంలో ముగింపు దశ. ఇదే బైబిల్-డబ్బు-బ్రాందీ వలయంలో తొలిదశ.సరుకూ-డబ్బూ కూడా. ఒక సరుకు తుది రూప పరివర్తన భిన్నమైన ఇతర సరుకుల తొలి రూపపరివర్తనల సమూహం అవుతుంది.    
అమ్మేవాడూ—కోనేవాడూ 
సరుకు పూర్తి రూపపరివర్తనని మొత్తంగా చూస్తే, మొదట అది ఒకదాన్నొకటి పూరించుకునే రెండువ్యతిరేక చలనాలతో(స-డ, డ-స ) ఏర్పడినట్లు అగపడుతుంది. సరుకుయొక్క ఈ రెండు విరుద్ధ రూప పరివర్తనలు ఆసరుకు ఓనర్ చేసే రెండు పరస్పర విరుద్ధ సామాజిక చర్యలవల్ల ఏర్పడతాయి. అతను చేసే ఈచర్యలు తిరిగి అతను పోషించే ఆర్ధిక పాత్రల స్వభావాన్ని ముద్రిస్తాయి.అమ్మకం జరిపేవాడుగా, అతను అమ్మకందారుడు; కోనేవాడుగా, అతను కొనుగోలుదారుడు.
సరుకు రూపమూ, డబ్బురూపమూ ఏక కాలంలో ఉంటాయి. అయితే వ్యతిరేక ద్రువాలవద్ద. అందువల్ల కొనుగోలుదారుడికి ఎదురుగా అమ్మకందారుడుంటాడు. అమ్మకందారుడికి అవతలవైపు కొనుగోలు దారుడుంటాడు.
 చలామణీలో పాల్గొనే వాని పాత్ర కూడా మారుతూ వుంటుంది
ఒకసరుకు - అంటే సరుకు నుండి డబ్బులోకి, డబ్బు నుండి వేరొక సరుకులోకి - వరసగా రెండు రూపపరివర్తనలు చెందుతున్నప్పుడు, సరుకు ఓనర్ ముందు అమ్మేవాడుగా, ఆ తర్వాత కోనేవాడుగా మారుతుంటాడు. అందువల్ల అమ్మేవాడుగానో, కోనేవాడుగానో అతని పాత్ర శాశ్వతం కాదు. స్థిరమైనది కాదు. ఒకసారి అమ్మేవాడుగా ఉంటాడు, మరోకసారి కోనేవాడవుతాడు. మొదటి దశలో అమ్మేవాడయితే, రెండో దశలో కొనేవాడవుతాడు. 
మొదటి రూప పరివర్తనలో చివరి అంశం అయిన డబ్బు,అదేసమయంలో  రెండో లావాదేవీకి  మొదటి అంశం. తొలి లావాదేవీలో అమ్మేవాడు ఆవిధంగా రెండో దాంట్లో కోనేవాడవుతాడు; ఈరెండో దాంట్లో మూడోవాడు రంగంలోకోస్తాడు.
ముగ్గురు పాత్రధారులూ నాలుగు అంచులూ  
ఒక సరుకు పూర్తి రూపపరివర్తన(సరుకు-డబ్బు-సరుకు) లోరెండు కదలికలుంటాయి: ఒకటి, సరుకు-డబ్బు; రెండు, డబ్బు-సరుకు.
ఒక సరుకు పూర్తి రూపపరివర్తనని చూస్తే, నాలుగు అంచులు కనబడతాయి, (extremes) ముగ్గురు పాత్రధారులు కనబడతారు.మొదట ఒక సరుకు డబ్బుకి ఎదురుగా వుంటుంది. ఆడబ్బు సరుకువిలువ తీసుకునే రూపం. అది నగదుగా కోనేవాని జేబులో ఉంటుంది. మొదటి రూప పరివర్తనలో చివరి అంశం అయిన డబ్బు,అదేసమయంలో  రెండో లావాదేవీకి  డబ్బు ఆరంభ అంశం. తొలి లావాదేవీలో అమ్మేవాడు ఆవిధంగా రెండో దాంట్లో కోనేవాడవుతాడు; ఈరెండో దాంట్లో మూడోవాడు రంగంలోకోస్తాడు. అతనే మరొక సరుకు అమ్మేవాడు.
ఇక్కడ ఒక ఫుట్ నోట్ ఉంది: ఒప్పందం చేసుకునే వ్యక్తులు ముగ్గురూ వుంటారు. వీళ్ళలో ఒకరు రెండు సార్లు జోక్యం చేసుకుంటారు.-లేట్రాస్నే
ఒకడు పార మరొకరికి (రెండోవానికి) అమ్మాడు. మూడో వాని దగ్గర రోట్టె కొన్నాడు. 
నాలుగు అంచుల గురించి: తొలిదశ స-డ( పార-డబ్బు) ఒక అంచున పార, రెండో అంచున డబ్బు.
రెండో దశ డ-స (డబ్బు-రొట్టె). ఒక అంచున డబ్బు,మరో అంచున రొట్టె. వెరసి నాలుగు అంచులు.
ముగ్గురు వ్యక్తులు: పార అమ్మినవాడు, పార కొన్నవాడు, రొట్టె అమ్మిన వాడు. పార అమ్మినవాడే రొట్టెకొన్నవాడు. అతను రెండు సార్లు జోక్యం చేసుకుంటాడు. 
స - డ - స వలయం (circuit)
ఒక సరుకు పూర్తి రూపపరివర్తనలో రెండు వ్యతిరేక దశలుంటాయి, ఒకటి స-డ అయితే రెండోది డ-స.ఇవి రెండూ కలిసి చక్రీయ చలనాన్ని, ఒక వలయాన్ని ఏర్పరుస్తాయి. 
వలయం ఏమంటే: సరుకు రూపం-ఆరూపాన్ని వదలడం-తిరిగి సరుకు రూపానికి రావడం.
ఇక్కడ సరుకు రెండు భిన్న అంశాల కింద కనబడుతుంది. ఆరంభంలో సరుకు దాని ఓనర్ కి ఉపయోగపు విలువ కాదు, ముగింపులో అది ఉపయోగపు విలువే. మొదట్లో అతను అమ్మిన పార అతనికి ఉపయోగపు విలువ కాదు. కాని చివరలో అతను కొన్న రొట్టె అతనికి ఉపయోగాపువిలువే. అలాగే తొలిదశలో డబ్బు సరుకు తహతహలాడుతూ  ఘనీభవించిన విలువ స్పటికం(crystal) గా కన్పిస్తుంది. రెండో దాంట్లో డబ్బు,  ఒక ఉపయోగపు విలువ చేత తొలగించ బడాల్సిన తాత్కాలిక సమానక రూపంలోకి ద్రవీభవిస్తుంది.

వలయాన్ని ఏర్పరచే రెండు రూప పరివర్తనలూ అదే సమయంలో రెండు ఇతర సరుకుల యొక్క రెండు తలక్రిందయిన (inverse), పాక్షిక రూపపరివర్తనాలు కూడా. ఒకే సరుకు ‘బట్ట’ తన పరివర్తనల వరసని మొదలెడుతుంది, మరోకసరుకు ‘గోధుమ’ రూపపరివర్తనతో ముగిస్తుంది. మొదటి దశ ‘అమ్మకం’లో బట్ట ఈరెండు పాత్రల్నీ తనరూపంలోనే పోషిస్తుంది.అయితే, అప్పుడు బంగారంలోకి మారి తన రెండో,అంతిమ పరివర్తనని పూర్తిచేస్తుంది; అదేసమయంలో మూడో సరుకు తొలి పరివర్తనకి సహకరిస్తుంది. అందుకే ఒకసరుకు ఏర్పరఛిన  వలయం (సర్కూట్) తన పరివర్తనల క్రమంలో ఇతర సరుకుల వలయాలతో విడదీసే వీలులేనివిదంగా  కలగలిసి పోతుంది. ఈ భిన్న వలయాలన్నిటి మొత్తమే సరుకుల చలామణీ. “ఈమొత్తం ప్రక్రియే సరుకుల చలామణీ”
వస్తుమార్పిడీ- చలామణీ
అలా సరుకుల చలామణీ ని చేరుకున్నాక, మార్క్స్  తిరిగి  వస్తుమార్పిడి వైపు చూస్తాడు. చలామణీ వస్తుమార్పిడి నుండి రూపంలోనే కాకుండా, సారంలోకూడా విభేదిస్తుందని నిర్ధారిస్తాడు.ఇందుకు సంఘటనల క్రమాన్ని చూస్తే సరిపోతుంది. నేతగాడు తన సరుకు బట్టని వేరొకరి సరుకు బైబిల్ తో మార్చాడు. ఈవిషయం అతనికి సంబంధించినంత  వరకే వాస్తవం. బైబిల్ అమ్మినవాడు గనక మరేదైనా డ్రింక్ ని మరింత ఇష్టపడే వాడయితే, బట్టకి బైబిల్ ని మార్చడు. అలాగే తనబట్ట గోధుమలతో మారినట్లు నేతగానికి తెలియదు. ఎందుకంటే అతని బట్ట మారింది డబ్బుతో. ఆడబ్బు ఏ సరుకు అమ్మితే  తన బట్ట కొన్నవానిచేతిలో పడ్డదో నేతవానికి తెలియదు.
బైబిల్ వాడు బట్ట కావాలనుకున్నాడు.కనకనే నేతగాడు బట్టని బైబిల్ కి మార్చగలిగాడు. బైబిల్ వాడు బ్రాందీ కావాలనుకొని ఉంటే, బట్టతో బైబిల్ మార్చాలనుకోడు.మన నేతగానికి తన ‘బట్ట’కి మారింది ‘గోధుమ’ అని ఎలా తెలియదో అలాగే.
B సరుకు A సరుకు చోట్లో చేరుతుంది. అయితే A, B లు ఒకరి సరుకుని ఒకరు మారకం చేసుకోరు. అరుదుగా అలా జరగవచ్చు. అటువంటి అసాధారణమైన లావాదేవీలు సరుకుల చలామణీ యొక్క సాధారణ పరిస్థితుల తప్పనిసరి ఫలితం కాదు.ఇక్కడ మనం, ప్రత్యక్ష వస్తుమార్పిడి నుండి విడదీయరాని స్థానిక,వ్యక్తిగత పరిధులన్నిటినీ అధిగమించి సరుకుల మారకం సామాజిక శ్రమ ఉత్పత్తుల చలామణీని అభివృద్ధి చేస్తుందో చూస్తాం.రైతు గోధుమలు అమ్మాడు, కనకనే నేతగాడు బట్టని అమ్మగలిగాడు. నేతగాడు బట్టని అమ్మాడు కనకనే మరొక వ్యక్తి బైబిల్ అమ్మగలిగాడు. అతను బైబిల్ అమ్మాడు కనకనే బ్రాందీ కొనగలిగాడు. అలా ...అలా...అలా.
సరుకుల చలామణీ ప్రత్యక్ష వస్తుమార్పిడికి భిన్నమైన బదిలీ నమూనా ఏర్పరుస్తుంది. వస్తుమార్పిడి లో B అనేవాడు గనక Aఅనేవాడి సరుకుల్నిపొందినట్లయితే, అప్పుడు A,  B సరుకుల్ని పొందుతాడు. ఒకరి సరుకులు మరొకరికి మారతాయి. చలామణీలో అలాకాదు. B అనేవాడు  A అనేవాడి సరుకుల్నిపొందుతాడు, A అనేవాడు  B అనేవాడి సరుకుల్నిపొందడు. డబ్బు పొందుతాడు. దాంతో A అనేవాడు C అనేవాడి సరుకుల్ని  పొందుతాడు....చలామణీలో తను ఇచ్చినవానిదగ్గరే తీసుకోవాలని లేదు.అప్పటికప్పుడే మారకం చేసుకోవాలనే లేదు. అక్కడికక్కడే జరగాలని లేదు.. ఆవిధంగా ప్రత్యక్ష వస్తుమార్పిడికి ఉన్న వ్యక్తిగత, స్థానిక అవరోధాల్ని చలామణీ అధిగమిస్తుంది. మరొకవైపు, ఆర్ధిక ఏ జంట్ల సామాజిక సంబంధం అదుపు లేని దవుతుంది.
ఎప్పుడూ ఎవరో ఒకరిదగ్గర డబ్బు ఉంటుంది
వస్తుమార్పిడికి లేనిదీ, చలామణీ కి ఉన్నదీ ఏమంటే చలామణీ డబ్బుని ప్రతి రంధ్రం నుంచీ చమటలాగా కారుస్తుంది. ఇది దాని రెండో లక్షణం. A, B లు ఇద్దరూ తమతమ సరుకుల్ని మారకం చేసుకుంటే, ఈ లావాదేవీలో పాల్గొన్న అన్ని సరుకులూ చలామణీ నుంచి తప్పుకున్నట్లే. చలామణీలో బైబిల్ బట్ట చోటులో చేరిన అనంతరం నేతగానికి కూడా ఈ లావాదేవీ పూర్తయింది, ఈ ఉత్పాదితాల్ని తొలిగించినట్లే కచ్చితంగా ఉంటుంది. మరొకచోట ఒక మార్పు కూడా జరిగింది: బైబిల్ అమ్మినవాని దగ్గర అంతకు ముందు లేని డబ్బు ఇప్పుడు ఉంది; బట్ట కొన్న వాని వద్ద ఇప్పుడులేని డబ్బు ఇంతకు ముందు ఉంది. ఎప్పుడూ ఎవరో ఒకరిదగ్గర డబ్బు ఉంటుంది. ఈ వాస్తవం ఎప్పటికీ అసంపూర్ణ చలామణీ ప్రక్రియలు ఉంటాయి అనే విషయాన్ని సూచిస్తుంది.  

అందువల్ల వస్తుమార్పిడి లాగా ఉపయోగపు విలువలు చేతులూ, చోట్లూ మారగానే చలామణీ ప్రక్రియ ఆగిపోదు. ఒకసరుకు రూపపరివర్తన వలయం బయటకు రాగానే డబ్బు మాయం అవదు. చలామణీలో ఇతరసరుకులు కాళీచేసిన చోట్లకి డబ్బుఎడతెగకుండా/నిరంతరం  చేరుతూనే ఉంటుంది. ఉదాహరణకి, బట్ట పూర్తి పరివర్తన బట్ట-డబ్బు-బైబిల్. ఇందులో మొదట బట్ట చలామణీ నుండి బయటపడుతుంది, దాని చోటులో  డబ్బు అడుగు పెడుతుంది. తర్వాత బైబిల్ చలామణీ నించి తప్పుకుంటుంది.ఆచోటులోకి డబ్బొస్తుంది. ఒక సరుకుని తొలగించి దాని స్తానంలోకి మరొక సరుకు వచ్చినప్పుడల్లా, డబ్బుసరుకు మరొక మూడో మనిషి చేతుల్లోకి చేరుతుంది. ఫుట్ నోట్ లో: ఇది స్వయం స్పష్టమే అయినాగాని ఆర్ధిక వేత్తలు అనేక సందర్భాలలో ఈవిషయాన్ని గమనించలేదు అంటాడు. 

సరుకుల చలామణీ లో సంక్షోభం వచ్చే అవకాశం 
అమ్మకం కొనుగోలు మధ్యన ఉన్న ఏకత్వం, ద్రువత్వం, ఐక్యతా వైరుధ్యం గురించి చర్చ నడుస్తుంది. ఈమొత్తం చర్చ ఫలితం ఏమంటే: సరుకుల చలామణీ లో సంక్షోభం వచ్చే అవకాశం ఉంటుంది.”ప్రతి కొనుగోలూ ఒక అమ్మకం, ప్రతి అమ్మకమూ ఒక కొనుగోలు కాబట్టి, సరుకుల చలామణీలో అమ్మకానికీ కొనుగోలుకీ సమతుల్యత ఉంటుంది –అనే దాన్ని మించిన పిల్లతరహా పిడివాదం మరొకటి ఉండదు. దీనర్ధం అమ్మకాల సంఖ్య కొనుగోళ్ళ సంఖ్యకు సమానం కావడం అయితే, అది చెప్పిందే చెప్పడం(tautology). ఈవాదం అభిప్రాయం ఏమంటే: అమ్మేప్రతి వాడూ కొనే వాణ్ని మార్కెట్ కి తెచ్చుకుంటాడు అని. అయితే అలా ఏం తెచ్చుకోడు. అటువంటిదేమీ జరగదు.నిజంగా అలా జరిగితే సంక్షోభానికి అవకాశం ఉండదు.
ఈ పిడివాదం చేసినవాడు జీన్ బాప్టిస్ట్ సే (1767 –1832) ఫ్రెంచ్ ఆర్ధికవేత్త, వ్యాపారవేత్త కూడా.
సరఫరాయే తన గిరాకీని ఏర్పరచుకుంటుంది. ఇది  సే (మార్కెట్ల) నియమంగా ప్రసిద్ధి చెందింది. మొత్తం సరఫరా మొత్తం గిరాకీని సృష్టించుకుంటుంది. ఉత్పత్తయిన వన్నీ వినియోగమవుతాయి- అని బ్రిటిష్ ఆర్ధికవేత్త డేవిడ్ రికార్డో(1772- 1823) పలుమార్లు చెబుతాడు.అమితోత్పత్తి సాధ్యం కాదు. సరుకులు సరుకులుతో మారతాయి-అనే ప్రతిపాదన దీనికి ఆధారం..దీని నుంచి వచ్చే నిర్ధారణ: గిరాకీ ఉత్పత్తి వల్ల  మాత్రమే నిర్ణయమవుతుంది. ఉత్పత్తీ గిరాకీ సరిగా సమంగా ఉంటాయి. - TSV2.493 సే నియమాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతాడు. సుప్రసిద్ధ బ్రిటిష్ ఆర్ధికవేత్త జేమ్స్ మిల్(1773- 1836) ఇలా చెబుతాడు: సంవత్సర ఉత్పత్తి మొత్తం అది ఎంతైనా కానీ, సంవత్సర గిరాకీ మొత్తాన్ని మించదు.అందువల్ల, ఏ దేశంలోనైనా సరుకు గిరాకీని మించిన పరిమాణంలో ఉండడం అసాధ్యం....క్రిటిక్ 96
మిల్ ఆవిధంగా చలామణీ ప్రక్రియని వస్తుమార్పిడికి కుదించడం ద్వారా సమతుల్యతని సాధిస్తాడు అని మార్క్స్ తప్పుబడతాడు.

ప్రతి అమ్మకమూ ఒక కొనుగోలే, ప్రతి కొనుగోలూ ఒన అమ్మకమే. కనుక సరుకుల చలామణీ లో అమ్మకాలకీ కొనుగోళ్ళకీ మధ్య సమతుల్యత ఉంటుందనుకోవడం ‘పిల్లతరహా పిడివాదం’. జరిగిన అమ్మకాలసంఖ్య,జరిగిన కొనుగోళ్లసంఖ్యకు సమానం అని దీని అర్ధంఅయినట్లయితే,ఇది చెప్పినదాన్నే చెప్పడం(tautology) మాత్రమే.దాని ఉద్దేశ్యం ఏమంటే: ప్రతి అమ్మకందారుడూ తనవెంట కోనుగోలుదారుణ్ణి మార్కెట్ కి తెచ్చుకుంటాడని.అయితే అది జరిగేపని కాదు.
ఈ విమర్శల తర్వాత పరిస్థితిని మరింత వివరంగా పరిశీలిస్తాడు. కొనుగోలూ అమ్మకమూ ఒకేరకమైన చర్యలు, అదే సమయంలో వ్యతిరేక ధ్రువాలు.అయితే ఇది తార్కిక వైరుధ్యం కాదు:’ఒకే రకంగా ఉండడమూ’ ‘వ్యతిరేక ధృవాలుగా ఉండడమూ’ ఇప్పుడు పాల్గోన్నవారికీ,లావాదేవీకీ విస్తరించింది/ పంపిణీ అయింది. అమ్మకమూ కొనుగోలూ ఒకే స్వభావంగల చర్య-సరుకు ఓనర్ కీ డబ్బు ఓనర్ కీ మారకం- అవుతుంది. అయస్కాంతం ధ్రువాల లాగా, ఒకరికొకరు వ్యతిరేకంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే  ఒకేరకమైన చర్య.
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒకే లావాదేవీ యొక్క రెండు వైపులుగా అమ్మకం కొనుగోళ్లను చూస్తే, ఆ లావాదేవీ అమ్మకమా కొనుగోలా అనే సందిగ్ధత(ambiguity) ఉంటుంది; అది ఒకరికి అమ్మకమూ, మరొకరికి కొనుగోలూ. లావాదేవీలో పాల్గొన్నవారి పాత్రగురించి సందిగ్ధత ఏమీ లేదు: ఒకరు అమ్మకందారుడూ, మరొకరు కొనుగోలుదారుడూ. 
రెండు చర్యల్నీ ఒకే వ్యక్తీ చేస్తే అవి ధ్రువస్వభావమూ, వ్యతిరేక స్వభావమూ ఉన్న  భిన్న చర్యలవుతాయి.  
ఇందుకు భిన్నంగా, ముందు అమ్మి తర్వాత కొనే వాడిని అనుసరిస్తే, ఏ చర్య అమ్మకమో, మరేది కొనుగోలో సందిగ్ధత ఉండదు. అవి ధ్రువ వ్యతిరేకతలు ఏర్పరుస్తాయి.ఏమైనా అతన్ని గురించి చెప్పగలిగేదంతా ఇదే: అతను అమ్మకం దారుడూ, కొనుగోలు దారుడూకూడా. అతను మొదట అమ్ముతాడు, తర్వాత కొంటాడు. చలామణీ అనే గుండం (alchemist’s retort) లోకి సరుకుని విసిరినప్పుడు, అది డబ్బుగా తిరిగి రాకపోతే ఆసరుకు నిరుపయోగమైనదని అర్ధం. అంటే దాని ఓనర్ దాన్ని అమ్మలేకపోతే, అందువల్ల కొనుగోలుదారుడు కొనలేకపోతే ఆసరుకు నిరుపయోగమైనది.  అమ్మకం కొనుగోలుల ఐక్యత తెలిపేది ఈ విషయాన్నే.
ఆసరుకు డబ్బుగా చలామణీ నుండి బయటకి రాకపోతే,అమ్మేవాడికే కాదు, ఎవ్వరికీ పనికిరాదు.
ఒక సరుకుని అంతిమంగా వినియోగదారుని చేతుల్లోకి జరిపే లావాదేవీ అదే సమయంలో ఉత్పత్తిదారుడు ఏర్పరచిన విలువ సిద్ధింపుకూడా. ఈలావాదేవీ రెండు వైపులూ – విలువ సిద్ధింపూ వినియోగదారుడు ఉపయోగపు విలువని ఏమ్చుకోవదమూ- విడదీయరాని బంధంలో ఉంటాయి.ఒకటి లేకుండా రెండోది ఉండదు. విలువలు సిద్ధించడం వీలుకాకుంటే, ఉపయోగపువిలువలు ముక్కిపోతాయి.   

ఈ ఐక్యత మరొక విషయాన్ని కూడా చెబుతుంది: మారకం జరిగినా విరామ సమయం ఏర్పడుతుంది. అది ఆసరుకు జీవితంలో ఎక్కువ కావచ్చు తక్కువా కావచ్చు. మొదటి పరివర్తన ఒకేసారి అమ్మకమూ కొనుగోలూ కావడం వల్ల, అది ఒక స్వతంత్ర ప్రక్రియ కూడా. కొన్నవాని దగ్గర  సరుకుంది, అమ్మినవాని వద్ద డబ్బుంది. అంటే మళ్ళీ ఏ క్షణంలోనైనా చలామణీ లోకి పోవడానికి రెడీగా వుండే డబ్బుంది. 
ఎవరో ఒకరు కొననిదే, ఎవరూ అమ్మలేరు. అయితే ఒకడు తన సరుకులు  అమ్మాడు  కనక ఆడబ్బుతో ఇతరుల సరుకులు  కొని తీరాలనేదేమీ లేదు.
మారకం అమ్మకం,కొనుగోలు గా విడివడడం సాధారణ వాణిజ్య సంక్షోభాలకు అవకాశాన్నిఇముడ్చుకొని ఉంటుంది-క్రిటిక్ 
ఈ చర్యల స్వతంత్రత సే నియమాన్ని చెల్లుబాటు కానివ్వదు తన సరుకుల్ని అమ్మగా వచ్చిన డబ్బుతో అప్పటికప్పుడు కొనాల్సిన అగత్యం ఏమీలేదు. ఎందుకంటే, ఆడబ్బు ఎన్నేళ్ళ తర్వాతయినా కొనుగోళ్ళు చెయ్యగలదు. సేనియమాన్ని తిరస్కరించాక, కొనుగోలు అమ్మకం రెంటి ఐక్యతా, ద్రువత్వాల గురించి చర్సిస్తాడు. అమ్మకమూ కొనుగోలూ విడదీయరాని యూనిట్ గా ఉండకపోవడం, స్తల కాలాలలో వేరు చేయబడడం  మంచిదే.
టైం కి, ప్రదేశానికి, వ్యక్తులకి వస్తుమార్పిడి  విధించిన  అన్ని పరిమితుల్నీ చలామణీ తెంచుకుంటుంది. ఈపని అది ఎలా చెయ్యగలుగుతుంది? అమ్మకం కొనుగోలు లోకి విడిపోవడంద్వారా. ప్రత్యక్ష వస్తుమార్పిడిలో ఒకరి సొంత ఉత్పాదితాన్ని పరాధీనం చెయ్యడానికీ మరొకరి ఉత్పాదితాన్ని పొందదానికీ ఉన్న ప్రత్యక్ష ఐక్యత చలామణీ లో అమ్మకం కొనుగోలు అనే విరుద్ధత లోకి విడిపోవడంద్వారా.
మార్క్స్ ఇక్కడ రెండు విషయాలు చెబుతున్నాడు:
1.అమ్మకమూ కొనుగోలూ ఐక్యతని ఏర్పరుస్తాయి.ఎందుకంటే, అవి మారకప్రక్రియ రెండుగా చీలడంవల్ల ఏర్పడతాయి గనక.
2. ఈవిడివడడం అనేది చలామణీ కాలానికీ, స్థలానికీ, వ్యక్తులకీ సంబంధించిన అన్ని పరిమితులనూ చేదించి, చొచ్చుకొనిపోతుంది. 
ఈ రెండు పాయింట్లకీ ఉన్న సంబంధం ఫ్రెంచ్ కూర్పులో ఇంకొంత స్పష్టంగా ఉంటుంది: అమ్మిన తర్వాత, అదే చోటగానీ, అదే టైం లో, అదే నేను అమ్మిన వ్యక్తివద్దనే గానీ  గానీ కొనాలనే బలవంతం నామీద ఉండదు. ఇది మంచిదే. కాని ఇలావిడివడడం  అనేదానికి లోపం కూడా  ఉంది.
సరుకు సంపూర్ణ రూపపరివర్తనలోని రెండు అనుబంధ దశలకీ –అమ్మకానికీ కొనుగోలుకీ – మధ్య విరామకాలం మరీ ఎక్కువయితే వాటి మధ్య ఉండే బంధం అంటే వాటి ఏకత్వం సంక్షోభం కలిగించడంద్వారా చాటుకుంటుంది.
అంతర్గత ఐక్యతని ఏర్పరచే రెండు అంశాల యొక్క స్వతంత్ర ప్రాతినిధ్యానికి రెండు ఫలితాలుంటాయి:
1. కాలానికీ, స్థలానికీ సంబంధించిన అన్ని పరిమితుల గుండా చలామణీని చొచ్చుకు  పోనిస్తుంది.
2.సంక్షోభాలు వచ్చే అవకాశాన్ని ఇముడ్చుకొని ఉంటుంది.
అయితే సంక్షోభాల వాస్తవికతని  చలామణీ సూత్రాలనించి రాబట్టడం కుదరదు
సరుకులోఅంతర్భూతంగా ఉపయోగపు విలువకూ, విలువకూ మధ్య వ్యతిరేకత ఉంటుంది;
 ప్రత్యక్ష సామాజిక శ్రమగా ఏకకాలంలో తననుతాను వ్యక్తపరచుకోవాల్సిన ప్రైవేట్ శ్రమకీ, సార్వత్రిక అనిర్దిష్ట శ్రమగా మాత్రమే లెక్కకొచ్చే ఒక ప్రత్యేక నిర్దిష్ట తరహా శ్రమకీ మధ్య  విరుద్ధత ఉంటుంది;
 వస్తువుల్ని వ్యక్తులుగా చూడడానికీ,వ్యక్తుల్ని వస్తువులుగా చూడడానికీ మధ్య వైరుధ్యం ఉంటుంది.
ఈ అంతర్గత వైరుధ్యం అభివృద్ధి చెందిన చలన రూపాల్ని, సరుకు రూప పరివర్తనలోని వ్యతిరేక దశలలో పొందుతుంది.
అందువల్ల ఈరూపాలు సంక్షోభాలు వచ్చేఅవకాశాన్ని ఇముడ్చుకొని ఉంటాయి. కేవలం అవకాశాన్ని మాత్రమే. అంతకెక్కువ కాదు.
అవకాశం వాస్తవం లోకి అభివృద్ధి చెందాలంటే, ఒకమొత్తం సంబంధాల పరంపర అవసరం. సరుకుల సరళ చలామణి దృష్ట్యా ఆపరంపరకి ఇప్పటికింకా ఉనికిలో లేదు. 
సంక్షోభం ఎందుకేర్పడుతుంది?
సరుకుల ఉత్పత్తిలో సరుకుని అమ్మడం అనేది తప్పనిసరి షరతు...అమ్మడం అసాద్యం అయితే, దాని ఫలితమే సంక్షోభం- అదనపు విలువ సిద్ధాంతాలు భాగం 2.509
 పెట్టుబడి దారీ విధాన సమర్ధకులు అనివార్యతని అంగీకరించరు. సమర్ధకులు వాళ్ళ పుస్తకాల ప్రకారం ఉత్పత్తి చేస్తే  సంక్షోభాలు సంభవించవంటారు. అంటే ఏవో పొరపాట్లవల్ల వస్తాయనీ, సరిదిద్దుకోగానే సర్దుకుంటాయనీ వాదిస్తారు.
సరుకు డబ్బుగా మారితీరాలి, కాని డబ్బు వెంటనే సరుకులోకి మారాల్సిన అవసరం లేదు.అందువల్ల కొనుగోలూ అమ్మకం విడిపోవచ్చు. ఈరూపం లో సంక్షోభానికి అవకాశం ఉంది. అంటే, కలిసిఉన్న,విడివడే వీలులేని అంశాలు విడదీయ బడ్డాయి, ఫలితంగా బలవంతంగా తిరిగి కలపబడ్డాయి. వాటి పొందిక వాటి పరస్పర స్వతంత్రతకి వ్యతిరేకంగా బలవంతంగా ప్రకటించ బడింది.  సంక్షోభం అనేది ఉత్పత్తిప్రక్రియలో పరస్పరం స్వతంత్రమైన అంటే విడివడిన  అంశాల ఐక్యత యొక్క బలవంతపు వక్కాణింపు తప్ప వేరేమీ కాదు. - అదనపు విలువ సిద్ధాంతాలు భాగం 2.509
అమ్మకమూ,కొనుగోలూ  ఒకదానినుండి మరొకటి విడిపోయి, ఘర్షణ పడక పొతే సంక్షోభం ఉండదు.512
సంక్షోభాల్ని తిరస్కరించడానికి, సమర్ధకులు వైరుధ్యం, ఘర్షణ ఉన్నచోట ఐక్యత ఉన్నది అని నొక్కివక్కాణిస్తారు. వాస్తవంగా ఉన్న వైరుధ్యాల్ని లేవనుకుంటారు.ఉండకూడదు అనుకుంటారు.- అదనపు విలువ సిద్ధాంతాలు భాగం 2. 513 
సంక్షోభాలకు మూలం ఎక్కడ ఉందో తేల్చి చెప్పాడు. అవి ఎదో  యాదృచ్చికంగా వచ్చిపోయేవి కావు. ఉత్పత్తిదారులు పొరపాట్ల వల్ల ఏర్పడేవికావు. పెట్టుబడిదారీ విధానంలో అనివార్యమైనవి. ఇకముందు రావు అని పలుమార్లు ప్రకటించారు. అయినా వస్తూనే ఉన్నాయి.మొదటి సార్వత్రిక సంక్షోభం మార్క్స్ కాలంలో వచ్చింది.
వాళ్ళ పుస్తకాల్ని అనుసరిస్తున్నా, ప్రభుత్వాలు అత్యుత్సాహంతో సహకరిస్తున్నా పదే పదే ఎందుకు వస్తున్నాయి?ఇందుకు మూల కారణమేదో మార్క్స్ సిద్ధాంతపరంగా తేల్చిచెప్పాడు. అమ్మకమూ,కొనుగోలూ  ఒకదానినుండి మరొకటి విడిపోయి, ఘర్షణ పడక పొతే సంక్షోభం ఉండదు- అదనపు విలువ సిద్ధాంతాలు భాగం 2.512
 అమ్మకమూ కొనుగోలూ విడివడ్డాయి.ఎందువల్ల?మారకాల అభివృద్ధికి అది అవసరం. అందువల్ల సంక్షోభాలు అనివార్యం. 
‘డబ్బు చలనం’ గురించి వచ్చే పోస్ట్  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి