7, జులై 2017, శుక్రవారం

8.మారకం -కాపిటల్ మొదటి భాగం, రెండో ఆధ్యాయం





8, జులై 2017, గురువారం


8.మారకం
శ్రమ ఉత్పాదితంలో ఉపయోగపు విలువా మారకం విలువా ఉత్పత్తిలోనే ఉంటాయి- అయితే నిద్రాణంగా. ఉపయోగపు విలువగా ఉండడం వేరు, అవడం వేరు. ఎందుకంటే ఉత్పత్తిదారునికి అది ఉపయోగపు విలువ కాదు. ఇతరులకు ఉపయోగపు విలువ విలువ అయినప్పుడే అది సరుకు. దానికున్న ఉపయోగపు విలువ ఇతరులకు  ఉపయోగపు విలువగా అవాలి. అంటే అది ఇతరులచేతికి చేరాలి.అందువల్ల సరుకు ఉపయోగపుఇప్పటికింకా విలువ అవాల్సి ఉంది”-క్రిటిక్.42
అందుకు  మారకం అవసరం.
మరొకవైపు,సరుకులలో ఎంతో కొంత శ్రమ ఇమిడి ఉంటుంది. అంటే సరుకులకి  విలువ ఉంటుంది. అది వాస్తవం కావాలి. మారకం విలువ అవాలి. ఎందుకంటే,
 “సరుకు ఉనికిలోకి వచ్చేటప్పుడు ప్రత్యేక తరహా వ్యష్టి శ్రమకాలం యొక్క పాదార్దీకరణ మాత్రమే,అది సాధారణ శ్రమ కాలం కాదు. ఆవిధంగా సరుకు తక్షణ మారక విలువ కాదు. అప్పటికింకా మారకం విలువగా అవాల్సి ఉంది.” క్రిటిక్.43
అందుకు మారకం తప్పనిసరి.
సరుకుల విలువ ఎందుకు వాస్తవీకరించబడాలి?ఉత్పత్తిలో వ్యయమైన శ్రమ కాలంగా విలువ అప్పటికే ఉన్నదికదా! ఇదీ ప్రశ్న.
సమాధానం:ఈ సరుకుల్ని ఉత్పత్తి చేసిన శ్రమ వ్యష్టి శ్రమ.దానికి సమాజ ఆమోదం లేదు.అందుకుమారకం  అవసరం. వాస్తవీకరణ అనేది మారక ప్రక్రియ: “మారక ప్రక్రియలో మాత్రమే  అది వాస్తవం అవుతుంది”- క్రిటిక్ శ్రమ ఉత్పాదితాలు ఉపయోగపు విలువలుగా అవాలన్నా, మారకంవిలువలుగా అవాలన్నా మారకప్రక్రియ అవసరం. ఉపయోగపు విలువగా అవడం అనే దాంతో మారకం విలువగా అవడం అనేది ముడివడి ఉంది అని తెలుసుకున్నాం.
సంక్షిప్తంగా: సరుకు ఉపయోగపు విలువగా ఉండడం వేరు, అది ఉపయోగపు విలువగా అవడం వేరు. అవడం అనేది మారక ప్రక్రియలో జరుగుతుంది. ఉత్పత్తిదారుడుకి తన సరుకు ఉపయోగపు విలువ కాదు. ఇతరులకు ఉపయోగపు విలువ. ఉత్పత్తిదారుని అధీనంలో ఉన్నంతకాలం అది ఉపయోగపు విలువగా ఉంటుంది. కాని ఇతరులచేతిలో పడితేనే అది ఉపయోగపు విలువగా అవుతుంది.
నిజంగా సరుకులో ఉన్న  ఉపయోగపువిలువ వినియోగదారుని చేతికి చిక్కినప్పుడే అది వాస్తవమైన ఉపయోగపు విలువ అవుతుంది.
అలాగే విలువ విషయం కూడా: సరుకులో శ్రమ కాలం ఉంటుంది. అది వ్యష్టి శ్రమ కాలం. అది సమాజ శ్రమలో భాగం అయితేనే, మారకం విలువగా అవుతుంది.
అంటే ఉత్పత్తి అయినప్పుడు సరుకులో ఉపయోగపు విలువా విలువా నిజంగానే ఉంటాయి.అయితే అవి వాస్తవీకరించబడాలి. అందుకు మారక ప్రక్రియ తప్పనిసరి. ఆకారణంగా మారకం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
కాపిటల్ మొదటి అధ్యాయం తొలి విభాగం  ఉపయోగపువిలువనీ, మారకం విలువనీ వేరువేరుగా చర్చిస్తుంది. రెండో విభాగం ఉపయోగపు విలువ, మారకం విలువల సంబంధాన్ని చర్చిస్తుంది. సరుకు లోపల ఇవి రెండూ ఒకదానితో ఒకటి సంబంధంలోకి రావు. ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి.
అది ఇతర సరుకులతో సంబంధంలో మాత్రమే సరుకు గనక.ఈ సంబంధాన్ని అది చూపుతుంది. ఈ సంబంధం కేవలం సైద్ధాంతికం మాత్రమే కాకుండా, ఆచరణాత్మకం కూడా అయినప్పుడు  మారక ప్రక్రియని చేరుకుంటాం.
కాపిటల్ మొదటి కూర్పు తొలి చాప్టర్  ‘సరుకు’  చివరి మాటలు :
“ సరుకు రెండు వ్యతిరేక అంశాలయిన  ఉపయోగపు విలువ, మారకం విలువల తక్షణ ఐక్యత. కనుక సరుకు తక్షణ వైరుధ్యం. ఇంతదాకా ఉపయోగపు విలువ వైపునించి ఒకసారీ, మారకం విలువ వైపునించి మరొకసారీ విశ్లేషణాత్మకంగా చూశాం. అలా కాకుండా మొత్తంగా ఇతర సరుకులతో వాస్తవ సంబంధంలో పెట్టీ పెట్టగానే, ఈవైరుధ్యం అభివృద్ధి అయితీరాలి. సరుకులు ఒకదానితో మరొకదాని  వాస్తవ సంబంధమే వాటి మారక ప్రక్రియ.” –1st ఎడిషన్ .35
మారకం అంటే ఏమిటి?
ఉత్పత్తిదారులు ఉత్పత్తిలో విడివిడిగా, ఎవరికివారుగా  ఉంటారు. వారివారి సరుకులు ఉత్పత్తిచేస్తారు. మారకంలో ఒకరితో ఒకరు సంబంధంలోకి వస్తారు. వ్యక్తిగత ఆస్తి భావన వాళ్ళని విడివిడిగా ఉంచుతుంది, ఒప్పందం కలుపుతుంది.
ఎందుకంటే, ఉత్పత్తయ్యాక సరుకులు మారకం కావాలి. వాటి విలువ సిద్దించేది మారకంలోనే. అందుకు సరుకులు మార్కెట్ కి పోవాలి. సరుకులు వస్తువులు. వాటంతటవి మార్కెట్ లోకి పోలేవు. ఒకదానితో ఒకటి బేరసారాలు సాగించి, మారకం కాలేవు. పైగా ఎవరి సరుకులు వారి స్వాధీనంలో ఉంటాయి. ఎవరి సరుకులకు వారు ప్రతినిధులుగా ఉంటారు.  అవి మారకం కావాలంటే, వాటి సొంతదార్లు వాటిని తేవాలి. ఒకరితో ఒకరు సంబంధంలోకి రావాలి.
ఉదాహరణకి, జల్లెళ్ళు తీసుకొని వాటి ఓనర్ వస్తాడు. చేంతాళ్ళు మరొకడు పట్టుకొస్తాడు. ఒకరికివి ఒకరికి అవసరమైతే, ఎన్ని జల్లెళ్ళకి ఎన్ని చెంతాళ్లో బేరం మొదలవుతుంది. ఇద్దరికీ ఇష్టమయితే బేరం తెగుతుంది.ఒక ఒప్పందానికి వస్తారు.
                               2 చేంతాళ్ళు = 7 జల్లెళ్ళు అనుకుందాం.
వాళ్ళిద్దరి  అంగీకారంతో మాత్రమే అవి మారతాయి. కనక వాళ్ళు ఒకళ్ళనోకళ్ళు ప్రైవేట్ ఒనర్లుగా గుర్తించాల్సి ఉంటుంది. ఎవరి సరుకుల మీద వారికి   హక్కులున్నట్లు అంగీకరించాల్సి వస్తుంది. లేకుంటే, వాళ్ళమధ్య ఒప్పందం(contract) సాధ్యం కాదు.  అంటే, సరుకుల సొంత దార్ల మధ్య సామాజిక సంబంధం అవసరం.
ఒప్పందం
 ఏ  సరుకునయినా సొంతదారుడి ఇష్టం లేకుండా మరొకడు తీసుకోలేడు. ఇందుకు కారణం సమాజం, సరుకుకాదు. సరుకుల్ని సంబంధంలో పెట్టాలంటే, సొంతదార్లయిన వ్యక్తులు సంబంధంలోకి రావాలి. ఈ సంబంధం ఒక ఒప్పందం ద్వారా వ్యక్తం అవుతుంది. ఆ ఒప్పందం  అభివృద్ధి చెందిన న్యాయ వ్యవస్థలో భాగం అవచ్చు, అవకపోవచ్చు. అయినా అది ఇరువురి ఇష్టం మీద ఏర్పడ్డ సంబంధం. వాళ్ళ ఆర్ధిక సంబంధానికి అది కేవలం ప్రతిబింబం మాత్రమే.అటువంటి ప్రతి ఒక్క చర్యలోనూ విషయాన్ని నిర్ణయించేది ఈ ఆర్ధిక సంబంధమే.
ముందు వర్తకం,తర్వాత చట్టం
వాగ్నర్ ని తప్పుబడుతూ మార్క్స్ :“వాగ్నర్ కి చట్టం ముందు, ఆతర్వాత వర్తకం వస్తుంది; వాస్తవానికి, అటుదిటూ ఇటుదటూ. మొదట వర్తకం ఉంటుంది, దాన్నించి చట్టవ్యవస్థ వృద్ధి చెందుతుంది. సరుకుల చలామణీని  విశ్లేషించినప్పుడు, అభివృద్ధి చెందిన వస్తుమార్పిడిలో పాల్గొన్నవారు ఒకరినొకరు సమానులుగా ఒప్పుకున్నారు, వాళ్ళు మార్చుకునే వస్తువులు ఎవరివి వారివే అని  అంగీకరించారు. మారకంలో మాత్రమే ఏర్పడే ఈ వాస్తవ సంబంధం తర్వాత కాలంలో ఒప్పందం అనే చట్టరూపం పొందింది. అయితే ఈరూపం దాని సారాన్ని, మారకాన్ని  ఏర్పరచదు. అలాగే, అందులోని వ్యక్తుల సంబంధాన్నికూడా  ఏర్పరచదు.
కాగా వాగ్నర్ : వర్తకం ద్వారా వస్తువులు పొందడానికి  ఒక చట్ట వ్యవస్థ,  వర్తకం జరగడానికి ఆధారమైన చట్టవ్యవస్థ ముందుగా ఉండాలి  అంటాడు “-Marx Engels collected works. Volume 24 p553-554
వ్యక్తిగత ఆస్తి హక్కు
సరుకుల సమాజంలో వ్యక్తిగత ఆస్తి హక్కు అవసరం. ఉత్పత్తిదారుడికి  తన వస్తువులపైన సంపూర్ణమైన హక్కు ఉండాలి. అలాగే వాటిని పరుల పరం చెయ్యగల హక్కు కూడా ఉండాలి.
మారకం జరగడానికి ఈహక్కు అనివార్యం. ప్రైవేట్ ఆస్తికి సంబంధించి బదిలీచేయ్యగల హక్కు అనే అంశం మారక చర్య కి అవసరం. కనుక ఈహక్కుల బదిలీకి సంబంధించి పరస్పరం అంగీకరించిన ఒక ఒప్పందం తప్పనిసరి. సరుకు ఉత్పత్తిదారులు స్వేచగల, స్వతంత్రులైన ఆర్ధిక ఏజెంట్లు. కనుక వారు ఒప్పందం చేసుకోగలరు.
Marx Engels collected works. Volume 24 p553-554
చట్ట పరిధిలో వాళ్ళ విడి తనం వ్యక్తిగత ఆస్తి వ్యవస్థలో ప్రతిబింబిస్తుంది. వాళ్ళ కలయిక ఒప్పందం అనే చట్టబద్ధత (institution)లో ప్రతిబింబిస్తుంది. వీటికితోడు వ్యక్తిస్వేచ్చ కలిసి చట్ట సంస్థ కి వెన్నెముక అవుతుంది.
ఒప్పందాలు సరుకు సొంతదార్ల ఇష్టాయిష్టాల మీద  ఆధారపడి జరుగుతాయి. ఎవరికీ వారుగా ఉత్పత్తిచేసే సమాజంలో  వారిని కలిపే లింకు మారకం మాత్రమే.
ఎవరి సరుకులకి వారు ప్రతినిధులు. అందువల్ల, ఒకళ్ళకొకళ్ళు సరుకుల సొంతదార్లు గా ఉంటారు
ఎవరి సరుకు వారికి తక్షణ ఉపయోగపు విలువ కాదు. అయి వుంటే వాటిని మార్కెట్ కి తేరు. జల్లెళ్ళ చేసినవానికి వాటితో అక్కర లేదు. తాళ్ళ సొంతదారుకి తాళ్ళతో పనిలేదు. పనివుంటే, వాళ్ళు వాటిని మార్కెట్ లో పెట్టరన్నది స్పష్టమే. అంటే ఎవరి సరుకులు వారికి ఉపయోగపు విలువలు కావు. అవి ఇతరులకేగాని ఉత్పత్తిదారులకు ఉపయోగపు విలువలు కావు.
మరి జల్లెళ్ళ వానికి వాటి ఉపయోగపు విలువ ఏమిటి?
తనకు ఉపయోగపువిలువలు కాని వాటిని ఇచ్చి, తనకు ఉపయోగపు విలువలయిన సరుకుల్ని ఇతరులనిమ్చి తీసుకుంటాడు. ఇక్కడ  జల్లెల్లిచ్చి తాళ్ళు తీసుకుంటాడు.జల్లెళ్ళు అతనికి మారక సాధనాలుగా ఉపయోగపడతాయి. అదే అతనికి వాటి ఉపయోగపు విలువ.
అరిస్టాటిల్ ఏమన్నాడో చెబుతాడు మార్క్స్ ఫుట్ నోట్ లో: “ప్రతి వస్తువూ ద్వంద్వ ప్రయోజనం గలదే... ఒకటి ఆవస్తువుకి ప్రత్యేకమైనది, రెండోది అలా కానిది. చెప్పుల్ని తోడుక్కోవచ్చు, మరొక (సరుకుతో) మార్చుకోవచ్చు. రెండూ చెప్పుల ఉపయోగాలే. ఎందుకంటే, తనకి అవసరమైన అన్నానికో , డబ్బుకో చెప్పుల్ని మార్చుకునే వాడు కూడా చెప్పుల్ని చెప్పులు గానే ఉపయోగిస్తాడు. అయితే సహజ పద్ధతిలో కాదు. ఎందుకంటే అవి మారకం కోసం తయారు చేసినవి కావు.”
తనకు ఉపయోగంలేని సరుకుల్ని ఇచ్చి, కావలసిన వాటిని తీసుకోడానికే  ఎవరైనా ఇష్టపడతారు.
దీన్ని బట్టి:
సరుకులు వాటి ఒనర్లకు ఉపయోగపు విలువలు కావు. 
వాటి ఓనర్లు కానివారికి, అంటే ఇతరులకు ఉపయోగపు విలువలు.
అందువల్ల సరుకులు చేతులు మారి తీ రాల్సిందే. ఇలా సరుకులు  చేతులు మారడమే మారకం
వైరుధ్యం
మారకం సరుకుల్ని విలువలుగా సంబంధంలో పెడుతుంది. విలువలుగా సిద్ధింప జేస్తుంది.అందువల్ల సరుకులు ఉపయోగపు విలువలుగా సిద్ధించాలంటే, ముందు విలువలుగా సిద్ధించాలి.
మరొక పక్క, అవి విలువలుగా సిద్ధించాలంటే, ముందు అవి ఉపయోగపు విలువలుగా కనబడాలి. వాటి ఉత్పత్తికి వ్యయమైన శ్రమ  ఇతరులకు ఉపయోగపడేదా లేదా? ఆ శ్రమ ఉత్పాదితం ఇతరుల కోర్కెల్ని తీర్చగలదా లేదా ? అనేది వాటి మారక చర్య వల్ల మాత్రమే రుజువవుతుంది.
ఒకనికి పరుపు కావాలంటే, దాని విలువ పరుపు ఉత్పత్తిదారునికి మరొక సరుకు రూపంలో  చేరాలి. విలువలుగా సిద్ధించడం అంటే అదే.
ఉపయోగపు విలువలు గా కనబడక పొతే ఎవ్వరూ వాటిని మారకం చేసుకోరు. అంటే అవి విలువలుగా సిద్ధించవు. ఇనప కర్రు వచ్చాక రాగి కర్రు ఉపయోగపు విలువగా కనబడదు.అది మారకం కాదు. కనుక చేసిన శ్రమ ఇతరులకు ప్రయోజనకరమైన రూపంలో ఉంటేనే సఫలమవుతుంది. ఆ  శ్రమ ఉత్పాదితం ఇతరుల కోర్కెలు తీర్చగలిగినదో , కాదో తేలేది  మారకచర్యలో మాత్రమే.
సరుకులు ఉపయోగపు విలువలుగా సిద్ధించాలంటే, ముందు విలువలుగా సిద్ధించాలి. 
ఒక సరుకు విలువగా సిద్ధించాలంటే రెండు షరతులు నేరవేరాలి:
1.ఆ సరుకులో చేరే శ్రమ సామాజికంగా అవసరం అయిన శ్రమ అయి ఉండాలి.
2.ఆ సరుకు ఇతరులకు అవసరమైనదై ఉండాలి.
అంటే, నాసరుకు నీకు ప్రయోజనకరంగా ఉండడం అనేది నీసరుకుని నేను మారకంలో పొందగలగడానికి షరతు. వేరేవిధంగా చెబితే, మనం ఒక వలయంలో ఉన్నాం.ఏమంటే, సరుకుల మారకానికి షరతు సరుకుల మారకం.అంటే వలయంలో పడ్డాం.వాటి మారకం మాత్రమే  ఆశ్రమ ఇతరులకు ప్రయోజనకరమయిందో  కాదో, ఆశ్రమ ఉత్పాదితం ఇతరుల అవసరాల్ని తీరుస్తుందో లేదో  రుజువు చెయ్యగలదు. మారకానికి ఏదయితే షరతో అది మారకంలోనే రుజువవుతుంది.
మారక ప్రక్రియలోని వైరుధ్యాలు.
1.ప్రైవేటు లావాదేవీ- సామాజిక ప్రక్రియా
ఏ సరుకు సొంత దారుడైనా తన కోర్కెలు  తీర్చే ఇతరుల వస్తువులతో మాత్రమే  తన సొంత సరుకుని  మారకంలో వదులుకుంటాడు. ఇలా చూస్తే , అతనికి మారకం అనేది ఒక  ప్రైవేటు లావాదేవీ మాత్రమే. మరొకపక్క, తన సరుకుల్ని విలువలుగా సిద్ధింపజేసుకోవాలి అనుకుంటాడు. అంటే తన సరుకు విలువ ఎంతో, అంత విలువ వున్న సరుకుతో మార్చుకోవాలని కోరుకుంటాడు- తనసరుకు  ఇతర సరుకుల ఒనర్లకు  ఉపయోగ కరమైనదైనా, కాకున్నా. ఈదృష్టితో చూస్తే ,  అతనికి  మారకం సాధారణ స్వభావం ఉన్న  సామాజిక ప్రక్రియ.” అయితే ఒకే ప్రక్రియ సరుకు సొంతదార్లందరికీ ఏక కాలంలో అటు పూర్తిగా  ప్రైవేటుదీ , ఇటు పూర్తిగా  సామాజికమైనదీ, సాధారణమైనదీ  కాజాలదు.”
మారక లావాదేవీకి ప్రైవేట్ కోణం కూడా ఉంటుంది. ఎందుకంటే, సరుకులో  ఉత్పత్తిదారుడు నింపిన శ్రమకి ఫలితం పొందుతాడా పొందడా అనేదాన్ని మారక లావాదేవీ నిర్ణయిస్తుంది గనక. ఇక తన సరుక్కి బదులుగా తీసుకున్న సరుకు తనకు ఉపయోగకరమైనదా, కాదా అనేది ముఖ్యం. ఉపయోగకరమైనది కాకపొతే, ఉత్పత్తిదారుని శ్రమ సామాజికంగా ధృవపడినా, ఉపయోగపు విలువ  పొందాలనే అతని లక్ష్యం నెరవేరదు. మారకం యొక్క ఈ ప్రైవేట్ కోణం సరుకు ఉత్పత్తిదారుని దృక్పధంగా ఉంటుంది.
తీసుకుంటున్న సరుకుకి సంబంధించి, మారక ప్రక్రియ పూర్తిగా వ్యక్తిగత ప్రక్రియ. సరుకు యజమాని ఎవ్వరినీ సంప్రతించాల్సిన అగత్యం లేదు. తాను  ఎంచుకునే ఉపయోగపు విలువ గురించి ఏ సామాజిక ఒత్తిళ్ళూ ఉండవు. అతను మారకంలో  ఇచ్చే సరుకుకి సంబంధించి అతని అంచనా ఏమంటే, దానికి తగిన సమానకం రావాలి అనేదే.

ఇక్కడ ‘విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం’ అంటాడు. ఒక సరుకు సొంతదారుడికి ప్రతి ఇతర సరుకూ తన సరుకుకి ప్రత్యేక సమానకం అనుకుంటాడు  ఫలితంగా, తనసరుకు ఇతర సరుకులు అన్నింటికీ సార్వత్రిక సమానకం అయినట్లుంటుంది. ప్రతి సొంత దారునికీ ఇదే వర్తిస్తుంది. తన జల్లెడని, చెంతాడుతో,పావు కిలో టీ పొడితో, 2 దస్తాల కాగితాలతో మారేట్లయితే, అతను ఎలా భావిస్తాడు?
జల్లెడకి చేంతాడు ఒక ప్రత్యేక సమానకం. పావు  కిలో టీ పొడి మరొక ప్రత్యేక సమానకం. 2 దస్తాల
కాగితాలు వేరొక ప్రత్యేక సమానకం.ఇలా ఎన్నైనా ఉండవచ్చు.
జల్లెడ =1 చేంతాడు
       = పావు  కిలో టీ పొడి
        = 2 దస్తాల కాగితాలు
జల్లెడకి ప్రతిదీ ప్రత్యేక సమానకం.
వాటివైపునించి చూస్తే
  1 చేంతాడు             =1 జల్లెడ
   పావు  కిలో టీ పొడి=1 జల్లెడ
  2 దస్తాల కాగితాలు= 1 జల్లెడ
ప్రతిదానికీ జల్లెడ సాధారణ  సమానకం.
ప్రతి సరుకు సొంత దారునికీ ఇదే వర్తిస్తుంది.
తనసరుకు సాధారణ సమానకం అనిపిస్తుంది. ఇతరుల సరుకులు దేనికది తన సరుక్కి  ప్రత్యేక సమానకం అయినట్లుంటుంది. ఎవరికి  వారు  తమసరుకే సాధారణ సమానకం అనుకుంటారు. అందువల్ల, ఏ సరుకూ స్వతహాగా సాధారణ సమానకం కాదు.ఫలితంలో సాధారణ రూపం సరుకులకు లేదు. అలాగే వాటి విలువ పరిమాణాన్ని పోల్చే ఆరూపం సరుకులకు లేదు. అందువల్ల, అవి ఒకదానికొకటి సరుకులుగా తారసపడలేవు.కేవలం ఉత్పాదితాలుగా, ఉపయోగపువిలువలుగా మాత్రమే తటస్థపడగలవు.
 కనుక వాస్తవానికి సార్వత్రిక సమానకంగా వ్యవహరించే సరుకంటూ ఉండదు, సరుకుల సాపేక్ష విలువ సాధారణ రూపం కలిగివుండదు. ఏ రూపంలో అయితే సరుకులు విలువలుగా సమపరచడానికి  వీలై, వాటి విలువల పరిమాణాల్ని  సరిపోల్చడానికి వీలవుతుందో ఆ సాధారణ రూపాన్ని కలిగి ఉండదు.అందువల్ల ఆ  మేరకు అవి సరుకులుగా ఒకదానికొకటి తలపడవు. ఉత్పాదితాలుగా, ఉపయోగపు విలువలుగా మాత్రమే తలపడతాయి.
అయితే సార్వత్రిక సమానకం ఎలా ఏర్పడుతుంది?
ఏ సరుకూ స్వతహాగా సాధారణ సమానకం కాదని తేలింది. కనుక ఒక ప్రత్యేక సరుకు సామాజిక చర్య ద్వారా మాత్రమే సాధారణ సమానకం కాగలుగుతుంది.
సార్వత్రిక సమానకంగా ఏదో ఒక ఇతర సరుకుతో సరిపోల్చుకుని మాత్రమే, సొంతదార్లు తమ సరుకుల్ని విలువలుగా సంబంధంలో పెట్టగలరు. సరుకు విశ్లేషణలో ఈవిషయం చూశాము. అయితే సామాజిక చర్యద్వారా తప్ప ఒక ప్రత్యేక సరుకు సార్వత్రిక సమానకం కాజాలదు. అన్ని ఇతర సరుకుల సామాజిక చర్య ఒక ప్రత్యేక సరుకులో తమవిలువల్ని వ్యక్తం చేసి ఆసరుకుని వేరుపరుస్తాయి. ఈ సామాజిక చర్య ద్వారా సార్వత్రిక సమానకంగా వ్యవహరించడం దాని  విశిష్ట  విధి అవుతుంది. ఆవిధంగా అది డబ్బు అవుతుంది.
మారక ప్రక్రియలో వేర్వేరు శ్రమ ఉత్పాదితాలు ఒకదానికొకటి సమపరచ బడతాయి. ఆవిధంగా ఆచరణద్వారా సరుకులుగా మారతాయి. ఈ మారకాల పరంపరలో అవసరం వల్ల డబ్బు ఏర్పడింది. సరుకుల వైవిధ్యమూ, సంఖ్యా పెరిగింది. ఆకారణంగా విలువా ఉపయోగపు విలువా ఒకదానితో ఒకటి అంతకంతకూ మరింతగా వైరుధ్యంలోకోచ్చాయి. వ్యాపార అవసరాలకు  ఈవైరుధ్యం యొక్క బాహ్య వ్యక్తీకరణ అవసరమైంది. ఆ అవసరం విలువకు స్వతంత్ర రూపం నిర్దారణకు ప్రేరేపించి, సరుకులు సరుకులుగానూ, డబ్బుగానూ విడివడే వరకూ విశ్రమించదు. ఉత్పాదితాలు సరుకులుగా మారడం ఎంత వేగంగా జరుగుతుందో అంతే  వేగంగా ఒక ప్రత్యేక సరుకు డబ్బుగా మారడమూ జరుగుతుంది.-కాపిటల్.90
దీన్నించి పేటీ బూర్జువా సోషలిజం  తెలివితేటలు అంచనా వెయ్యచ్చు అంటాడు ఫుట్ నొట్ లో: పెటీ బూర్జువా సోషలిజం సరుకుల ఉత్పత్తిని శాశ్వతంగా ఉంచుతూనే, డబ్బుకీ సరుకులకీ మధ్య వైరుధ్యాన్ని రూపుమాపాలనుకున్నది. పర్యవసానంగా డబ్బు ఈవైరుధ్యం మూలంగా ఉన్నది, కనుక డబ్బునే రద్దు చెయ్యడం లక్షంగా పెట్టుకున్నది. పోపు లేకుండా కాథలిక్ మతాన్ని నిలబెట్టడంవంటిదే ఇది.
ఇక్కడ విషయం ఏమంటే :ఈ వైరుద్యం సరుకుది. సరుకులున్నంతవరకూ డబ్బు రద్దు సాధ్యం కాదు.
ఆచరణలో ఈవైరుధ్యం పోవాలంటే, దాని రెండు ద్రువాలూ  రెండు భిన్న సరుకులకి చేరాలి: ఉపయోగపు విలువకి ప్రతినిధిగా మామూలు సరుకు, విలువకు ప్రతినిధిగా డబ్బు సరుకు.  


***********
వస్తుమార్పిడిలో ఉన్న సందిగ్ధతలు
సరుకు యజమాని తన వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరే విధంగా మారకాలు చేసుకోవాలి  అనుకుంటాడు. అందుకు ఆ యజమానికి  అడ్డంకులు ఏర్పడతాయి. ఇవి వ్యక్తి  స్థాయిలోపరిష్కారం అయ్యేవి కావు. సరుకుల నించి డబ్బుని వేరుపరచే సామాజిక చర్య దాని పరిష్కారానికి ఒక ఆధారాన్ని ఏర్పరుస్తుంది.
ఆ సామాజిక చర్య చరిత్రలో ఎలా జరిగింది?
మారకం అనేది ఎకానమీ ఉపరితలంపైన జరిగే చర్య.  సరుకు మారకం యొక్క వైరుధ్యాల పరిష్కారానికి సామాజిక చర్య అవసరం. ఈచర్య ఎప్పుడు మొదలయిందో తెలుసుకోడానికి సరుకు రూపం యొక్క చరిత్రలోకి పోతాడు. సరుకు రూపం సరుకు ఉత్పత్తితో పాటు క్రమంగా రూపుదిద్దుకుంది.
మొదట్లో వస్తువు వస్తువుతో మారేది. అదే వస్తు మారకం.వస్తు మార్పిడికి అవసరమైన పరిస్థితులు
వస్తుమార్పిడి విలువ సాపేక్ష వ్యక్తీకరణ యొక్క ప్రాధమిక రూపాన్ని ఒక విషయంలో 
పొందుతుంది , మరొక విషయంలో పొందదు.
ఆ రూపం ఇది:
సరుకు  A = y సరుకు B. x, y లు పరిమాణాలకు సంకేతాలు. A,B లు వస్తువులకు సంకేతాలు
20 గజాల బట్ట = 1 కోటు
ప్రత్యక్ష వస్తుమార్పిడి రూపం ఇది:
ఉపయోగపు విలువ  A = y ఉపయోగపు విలువ B
ఈసందర్భంలో  బట్టా, కోటూ ఇప్పటికింకా సరుకులు కావు. వస్తుమార్పిడి ద్వారా మాత్రమే అవి సరుకులవుతాయి. ఒక ప్రయోజనకర వస్తువు మారకం విలువని సంతరించుకునే తొలి అడుగు ఎప్పుడు వేస్తుందంటే: ఆవస్తువు సొంతదారునికి అది ఉపయోగపు విలువ కానిదయినప్పుడు. అలా ఎప్పుడు జరుగుతుందంటే: ఏదయినా  వస్తువు తన వాడకానికి పోను మిగులుగా ఉన్నప్పుడు.
ఒకడు నాలుగు బానలు చేసాడు. రెండు అతనికి కావాలి. అంటే రెండు మిగులు ఉన్నాయి. అవి అతనికి ఉపయోగపు విలువలు కావు.కనుక ఇతరులకివ్వగలడు. అయితే అతనికి అవి మారక సాధనాలు. అంతే విలువగాలిగిన, తనకు ఉపయోగపు విలువ ఉన్న ఇతర సరుకుల్ని తీసుకొని మాత్రమే వాటిని ఇవ్వడానికి ఇష్టపడతాడు.
వస్తువులు మనిషికి బయట ఉంటాయి. కనుక పరాధీనం చెయ్యవచ్చు. ఒకరి వస్తువులు ఒకరికి పరస్పరం  పరాధీనం చెయ్యాలంటే, ఆవస్తువుల సొంతదార్లని  ప్రైవేట్ ఒనర్లుగా, స్వతంత్ర వ్యక్తులుగా ఒకర్నొకరు గుర్తించాలి. ఇది తప్పనిసరి. అప్పుడు మాత్రమే వస్తు మార్పిడి సాధ్యమవుతుంది.
దీన్ని బట్టి ఆస్థి వ్యక్తి గతం అయితేనే వస్తు మార్పిడికి భూమిక ఏర్పడుతుంది. అయితే ఆది నుండీ ఆస్థి వ్యక్తిగతం కాదు. ఆదిమ సమాజాల్లో ఆస్థి సభ్యులందరిది, ఉమ్మడిది.
అయితే అలా వస్తువుల సొంతదార్లుగా ఉండడం అనే పరిస్థితి ఆస్తి ఉమ్మడిగావున్న  ప్రాచీన సమాజాల్లో ఉండదు –ఆసమాజ రూపం పితృస్వామిక కుటుంబం కావచ్చు,ప్రాచీన భారత తెగలు కావచ్చు,లేక పెరూవియన్ ఇంకా (Inca)రాజ్యం కావచ్చు. ఏదయినా, అక్కడ  ఉత్పాదితాలు సమాజ సభ్యులందరివీ. ఉమ్మడివి. ఏ ఒక్కరూ వాటికి ఓనర్లు కాదు. కనుక ఏ సభ్యుడూ వాటిని పరాధీనం చెయ్యలేడు. అలాంటి సమాజాల్లోపల వస్తుమార్పిడికి ఆస్కారం ఉండదు.
వాటికి పునాది ఉమ్మడి ఆస్తి, వ్యక్తిగత ఆస్తి కాదు.
మరి వస్తుమార్పిడి ఎలా ఎక్కడ మొదలయింది?
ఉమ్మడి ఆస్థి ఉన్న సమాజాల లోపల మారకానికి అవకాశమే లేదన్నది స్పష్టమే. దీన్ని బట్టి అలాంటి సమాజాల వెలుపల జరగవచ్చు. ఒక సమాజం మరొక సమాజంతో కలిసే చోట్లలో, సరిహద్దుల్లో  సరుకుల మారకం ఆరంభం అయింది. సమాజాలతో కావచ్చు, సమాజ సభ్యులతో కావచ్చు. అలా మారకాలు సమాజాల మధ్య మొదలయ్యాయి.ఒక సమాజం బయట సంబంధాల్లో ఉత్పాదితాలు మారకం జరిగి సరుకులవుతాయి. అలా అయిన తర్వాత త్వర త్వరగా సమాజం లోపల సైతం మారకాలు జరిగి సరుకులవుతాయి.
మారక నిష్పత్తి మొదట యాదృచ్చికం
మారకం జరుగుతుందా లేదా అనేది కూడా యాదృచ్చికమే.
మొదట మొదట సరుకులు మారే నిష్పత్తులు యాదృచ్చికంగా ఉంటాయి. ఉదాహరణకి ఒక మేకకి ఎన్ని గొడ్డళ్ళు అనేది ప్రతి చోటా ఒకటే ఉండదు. ఒకే చోటయినా ప్రతిసారీ ఒకే నిష్పత్తిలో మారవు. నిష్పత్తులు మారతాయి. అందుకే నిష్పత్తులు యాదృచ్చికం.ఒక గొర్రెకి ఒకసారి 3 బరిసెలు రావచ్చు. మరొక సారి నాలుగు, ఇంకోసారి రెండే రావచ్చు.అంతేకాదు ఒకప్పుడు రెంటికీ మారకమే జరగక పోవచ్చు. కాలానిబట్టే కాదు. ప్రదేశం మారినా ఈనిష్పత్తి  మారవచ్చు. అడపాదడపా మారకాలు జరిగే సందర్భాల్లో మారకం యాదృచ్చికమే.
అవి అసలు మారడానికి కారణం: వాటి ఓనర్లు వాటిని పరాధీనం చెయ్యాలి అనుకోవడమే.
యాదృచ్చికత ఎలా పోతుంది 
కాలక్రమంలో ఇతరులు ఉత్పత్తిచేసిన వస్తువులకోసం అవసరం అధికమవుతుంది. మారకాలు పదేపదే జరుగుతాయి. అందువల్ల ఆసామాజిక చర్య అలవాటుగా జరిగే చర్య అవుతుంది. కాలం గడిచేకొద్దీ  శ్రమ ఉత్పాదితాల్లో కొంతభాగం మారకం కోసం తయారై తీరుతుంది. ఆక్షణం నుండీ వాడకం కోసం ఒక వస్తువు ప్రయోజనానికీ , మారకం కోసం  ఒక వస్తువు ప్రయోజనానికీ తేడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దాని ఉపయోగపు విలువ  మారకం విలువ నుండి విడివడి పోతుంది. వేరొకవైపు, అవి మారే పరిమాణాత్మక నిష్పత్తులు వాటి ఉత్పత్తిని బట్టి ఉంటాయి/మీద ఆధారపడతాయి. అలవాటు వాటిని నిర్దిష్ట పరిమాణాలు గల విలువలుగా ముద్రవేస్తుంది.
ప్రత్యక్ష వస్తు మార్పిడిలో  ప్రతిసరుకూ దాని ఓనర్ కి నేరుగా  మారక సాధనం. ఇతరులందరికీ  అది సమానకం(equivalent) - ఉపయోగపు విలువ కలిగివున్న మేరకు. అందువల్ల ఈదశలో మారకమయ్యే  వస్తువులు వాటి ఉపయోగపు విలువనుండి స్వతంత్రమైన  విలువ రూపాన్ని తీసుకోవు.అంటే  మారకం చేసుకునే వాళ్ళ సొంత అవసరాలకు భిన్నంగా  స్వతంత్రమైన  విలువరూపాన్ని పొందవు.
ఉదాహరణకి, ఒకడు ఒక బుట్ట ఇచ్చి రెండు  దుత్తలు  తీసుకుంటున్నాడనుకుందాం. అతను తన బుట్టను మారక సాధనంగా భావిస్తాడు. దుత్తలు  ఉపయోగపు విలువలు గానే ఉంటాయి. అవి అతని దృష్టిలో విలువలు కావు. కనుక విలువ రూపం పొందవు. ప్రత్యక్ష వస్తుమార్పిడిలో పరిస్థితి ఇది.
అయితే, మారకం అయ్యే సరుకుల సంఖ్యా, వైవిధ్యమూ పెరిగేకొద్దీ విలువ రూపం అవసరం కూడా పెరుగుతుంది. ఈ సమస్యా, దాని పరిష్కార సాధనమూ ఒకేసారి తలెత్తుతాయి.వేర్వేరు సరుకుల సొంతదార్లకు చెంది మారకం కాగల సరుకుల్ని విలువలుగా ఒకేఒక సరుక్కి సమపరచకుండా  భిన్న సరుకుల ఓనర్లు వాళ్ళ సరుకుల్ని ఒక ప్రత్యేక సరుకుతో సమపరచి, భారీ స్థాయిలో మార్చుకోలేరు.అటువంటి ప్రత్యేక సరుకు ఇతర అన్ని సరుకులకు సమానకం అవుతుంది.అది పరిమిత పరిధిలోనయినా సాధారణ సమానకం స్వభావం  పొందుతుంది. ఈ స్వభావం దాన్ని తెచ్చిన క్షణభంగురమైన సామాజిక చర్యలతోపాటు వస్తుంది,పోతుంది. ఒకప్పుడు ఒకసరుక్కీ,మరొకప్పుడు మరొక సరుక్కీ ఈస్వభావం వస్తుంది.పోతుంది.తాత్కాలికంగా ఉంటుంది. అయితే, మారకాల వృద్ధయ్యేకొద్దీ ఏదో ఒక ప్రత్యేక సరుకుకి ఆరూపం అంటుకుంటుంది. డబ్బురూపం తీసుకుని స్పటికీకృతం అవుతుంది.అంటే డబ్బు రూపం దానికి స్థిరపడుతుందన్నమాట.
డబ్బు గా స్థిరత్వం పొందే/నిలబడ గలిగే  సరుకు ఏది? ఏ రకం సరుక్కి డబ్బురూపం అబ్బుతుంది?
ఇది  మొదట్లో యాదృచ్చికమైన విషయమే. అయినప్పటికీ, నిర్ణయాత్మక ప్రభావం నేరపే పరిస్థితులు రెండు ఉన్నాయి:
1. బయట నుంచి మారకంలోకి వచ్చే ముఖ్యమైన వస్తువులకు డబ్బురూపం అబ్బవచ్చు.
2. తెగ ఆస్తిలో పరాధీనం చెయ్యడానికి వీలైన అత్యంత ప్రయోజనకరమైన  దానికి అబ్బవచ్చు. ఉదాహరణకి పశువులకు. ఎందుకంటే వీటిని పరాధీనం చెయ్యడం తేలిక.
డబ్బురూపాన్ని మొదట అభివృద్ధి చేసినది సంచార జాతులు. కారణం వాళ్లకి ఉన్నవన్నీ చరాస్తులే. పరాధీనం చెయ్యడానికి వీలున్నవే. అంతేకాదు, ఒకచోట నించి మరొకచోటికి వెళుతూ ఉంటారు కనక  వాళ్ళు పరాయి తెగలతో తరచుగా కలుస్తుంటారు. అలాంటి జీవన విధానం వాళ్ళ వాళ్ళ సరుకుల మారకాన్ని ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది.
డబ్బుగా వ్యవహరించిన సరుకులు
మనిషి తరచుగా మనిషినే బానిస రూపంలో డబ్బుగా వాడాడు. కానీ భూమిని వాడలేదు. అలా భూమిని డబ్బుగా వాడాలనే ఆలోచన బాగా అభివృద్ధి చెందిన బూర్జువా సమాజంలో మాత్రమే కలుగుతుంది. ఆ ఆలోచన 17 వ శతాబ్దం చివరి మూడో భాగంలో ప్రారంభమైంది. జాతీయ స్థాయిలో అమలు చేసే తొలి ప్రయత్నం ఒక శతాబ్దం తర్వాత, ఫ్రెంచ్ బూర్జువా విప్లవ కాలంలో జరిగింది.
మారకం స్థానిక బంధాల్ని క్రమంగా తెంచుకుంటుంది. సరుకుల విలువ, అనిర్దిష్ట మానవ శ్రమ ఆకారంలోకి అంతకంతకూ విస్తరిస్తుంది. ఇవి ఏ స్తాయిలో జరుగుతాయో అదే స్తాయిలో సార్వత్రిక సమానకంగా వ్యవహరించడానికి ప్రకృతి సిద్ధంగా అనువైన సరుకులకు డబ్బుస్వభావం కలుగుతుంది. ఆ సరుకులే విలువైన లోహాలు.
వెండి బంగారాలు
“ బంగారమూ, వెండీ ప్రకృతి సిద్ధంగా డబ్బు కానప్పటికీ, డబ్బు ప్రకృతి సిద్ధంగా బంగారమూ, వెండీ.”-అనేది నిజమే. ఈ వాస్తవం ఈ లోహాల భౌతిక ధర్మాలు డబ్బు విధులకి (function)సరిగ్గా సరిపోవడం ద్వారా బయటపడుతుంది. డబ్బుగా వ్యహరించడానికి అనువైన  భౌతిక ధర్మాలు వీటికి ఉండడమే కారణం. ఇంతదాకా మనకి డబ్బు విధుల్లో ఒక్కటి మాత్రమే తెలుసు. అదేమంటే: సరుకుల విలువ వ్యక్తపరిచే రూపంగా ఉండడం. లేక, సరుకుల విలువల పరిమాణాలు సామాజికంగా ఏ పదార్ధంలో వ్యక్తమవుతాయో ఆపదార్ధం గా ఉపకరించడం.
అందుకు ఆపదార్ధంలో ఏ ముక్కని నమూనాగా తీసికున్నా ఏ తేడా లేకుండా ఒకే రకంగా ఉండాలి.విలువలో తేడా కేవలం పరిమాణంలోనే కనుక డబ్బుసరుకు పరిమాణాత్మక తేడా సాధ్యం కావాలి. అంటే, విభజించే వీలుండాలి. అలాగే కలిపే వీలూ ఉండాలి. బంగారానికీ, వెండికీ   ఈ ధర్మాలు ప్రకృతి సిద్ధంగానే ఉన్నాయి.
డబ్బు-ద్వంద్వ ఉపయోగపు విలువ
డబ్బుగా వుండే సరుకు ద్వంద్వ ఉపయోగపు విలువను సంతరించుకుంటుంది. ఒక సరుకుగా దానికుండే ఉపయోగపువిలువ దానికి ఉంటుంది. ఉదాహరణకు, బంగారం బోలుపళ్ళలో నింపడానికి, ఆభరణాలకూ ఉపయోగ పడుతుంది. ఆప్రత్యేక ఉపయోగపువిలువతో పాటు లాంచన ప్రాయమైన ఉపయోగపువిలువ ని పొందుతుంది. ఆ లాంచన ప్రాయమైన ఉపయోగపువిలువ ఏమిటంటే: డబ్బుగా వ్యవహరించడమే. ఈ  ఉపయోగపువిలువ సామాజిక చర్య వల్ల ఏర్పడుతుంది. దాని ప్రకృతి ధర్మాలవల్ల ఏర్పడ్డది కాదు.
అన్ని ఇతర సరుకులూ డబ్బుకి ప్రత్యేక సమానకాలు. డబ్బు వాటన్నిటికీ సార్వత్రిక సమానకం. అందువల్ల, ఆ ఇతరసరుకులు ఈ సార్వత్రిక సమానకానికి ప్రత్యేక సరుకులుగా ఉంటాయి.
4 ,డబ్బుకి సంబంధించి పొరపాటు అభిప్రాయాలూ, డబ్బు మార్మిక స్వభావమూ 
డబ్బు రూపం అనేది అన్ని ఇతర సరుకుల మధ్య ఉండే విలువ సంబంధాల్ని ప్రతిబింబించే ఒకే ఒక సరుకు. అని గ్రహించాం. అప్పటికే ఉన్న ఒకసరుకు డబ్బయింది. అంతే కాని ఈసరుకు  కొత్తది కాదు. ఇతర సరుకుల మధ్య ఉండే విలువ సంబంధాల్ని ప్రతిబింబించే ప్రత్యేక లక్షణం దానికి మాత్రమే ఉంది. మిగిలిన వాటికి లేదు. కనుక డబ్బుకూడా ఒక సరుకే అని తెలిసిన విషయమే.అయితే డబ్బుని పూర్తిగా అభివృద్ధిచెందిన ఆకారంతో విశ్లేషణ మొదలెట్టిన వారికి కొత్త ఆవిష్కరణ. సరుకుతో మొదలుపెట్టినట్లయితే అది కొత్త విషయం కాదని ముందే తెలుస్తుంది.
అలా కాకుండా డబ్బుతో ప్రారంభించినందువల్ల వారికి కొన్ని పొరపాటు అభిప్రాయాలు కలిగాయి.మార్కెట్ కార్యకలాపాలు ఆచరణలో అవాస్తవ చైతన్యం కలిగించాయి.
1.డబ్బు విలువ ఉహత్మకమైనది

డబ్బులోకి మారిన సరుకుకి మారక చర్య ఇచ్చేది దాని విలువని కాదు, దానిప్రత్యేక విలువ రూపాన్ని.అది అప్పటికే కలిగివున్న విలువయొక్క ప్రత్యేక రూపాన్ని. ఈరెంటి  మధ్య గందరగోళంలో పడి / భిన్నమైన ఈరెంటినీ గందరగోళ పరచి కొందరు రచయితల వెండి బంగారాల విలువ ఊహాత్మకం అని పొరబడ్డారు.అలా వాళ్ళు తప్పుదోవ పట్టారు.
బంగారం, వెండి డబ్బుకాక ముందే  లోహాలుగా విలువగలవి- గాలియాని.లాక్ (Locke) వెండికి సార్వత్రిక త్రిక ఆమోదం ...ఉహాత్మక విలువను ఇచ్చింది అన్నాడు.
డబ్బు కాకముందే వెండిబంగారాలకు లోహాలుగా విలువ వుంది- అని గాలియానీ సరిగాచేప్పాడు. లాక్ తప్పుచేప్పాడు: వెండికి డబ్బుకి ఉండాల్సిన లక్షణాలు ఉన్నందున, మానవుల సార్వత్రిక అంగీకారం వెండికి ఊహాత్మక విలువను ఇచ్చింది.

మారక ప్రక్రియ ఒక సరుకుని సార్వత్రిక సమానకంగా ఎంపిక చేస్తుంది. ఈ ఎంపిక ప్రక్రియ సార్వత్రిక సమానకానికి విలువని ఏర్పరచదు. ప్రత్యేకమైన విలువ రూపాన్నిస్తుంది. అప్పటి నించి ఆ విలువ రూపం ఆ ఉపయోగపు విలువతోనే సహచర్యం చేస్తుంది .
ఈ రెండు లక్షణాల మధ్య గందరగోళం కొందరు రచయితల్నితప్పుదోవ/ అపమార్గం పట్టించింది. వారు వెండిబంగారాల విలువ ఉహాత్మకమైనదిగా భావించారు. ప్రత్యేకమైన విలువ రూపం వాటికి విలువనిస్తుంది అనుకున్నారు. లాక్ (Locke) వెండికి సార్వత్రిక త్రిక ఆమోదం ...ఉహాత్మక విలువను ఇచ్చింది అన్నాడు.గాలియాని సరిగా చెప్పాడు: బంగారం, వెండి డబ్బుకాక ముందే  లోహాలుగా విలువగలవి- గాలియాని.
2.డబ్బు కేవలం చిహ్నం మాత్రమే.
డబ్బు సరుకుల చిహ్నం Forbonnais-(1722 -1800) అన్నాడు- ఫుట్ నోట్.. ఒక చిహ్నంగా డబ్బు సరుకులకి ఆకర్షితమవుతుంది.). డబ్బు ఒకవస్తువుకి చిహ్నం. దానికి ప్రతినిధిగా ఉంటుందిఅన్నాడు 1767 లో (Montesquieu). ఆర్ధిక వేత్తలకంటే ముందే లాయర్లు డబ్బు చిహ్నం మాత్రమే అనీ, విలువైన లోహాల విలువ ఊహాత్మకమనీ చెప్పారు.రాజుల అధికారానికి సేవచేస్తూ వారు నాణేల విలువని తగ్గించే అధికారం రాజుకు ఉన్నదని ప్రచారం చేశారు. రోమన్ చట్టం ప్రకారం డబ్బుని సరుకుగా చూడడం నిషేధం. డబ్బు విలువని  రాజశాసనం  నిర్ణయిస్తుంది
లే ట్రాస్నే: డబ్బు కేవలం చిహ్నం కాదు, ఎందుకంటే దానికదే సంపద. అది విలువలకి ప్రాతినిధ్యం  వహించదు. అది వాటి సమానకం.

కొన్ని చర్యలలో  డబ్బు బదులు  దాని చిహ్నాలని వాడవచ్చు అనే వాస్తవం మరొక పొరపాటు అభిప్రాయానికి తావిచ్చింది.ఏమంటే: డబ్బు దానికదే కేవలం చిహ్నం మాత్రమే.
పెళ్లి ఉంగరం ఒక చిహ్నం. అది దానినించి స్వతంత్రంగా ఉండే ఒక సంబంధాన్ని తెలిపే చిహ్నం. బంగారు నాణెం విలువ యొక్క  చిహ్నం కాదు. దానికదే విలువ.
3.డబ్బు మనిషి ఆలోచన వల్ల  ఏర్పడ్డది  అనేది మూడో పొరపాటు అభిప్రాయం. అంటే, డబ్బు మనిషి కావాలని చేసినది.
సామాజిక సంబంధాల్ని మనిషి ఆలోచన ఫలితాలు అనడం తప్పు.
మారకాల అభివృద్ధిలో తప్పనిసరై  ఏర్పడ్డది.
విలువ స్వభావాన్ని చర్చించాక పరిమాణాన్ని చర్చిస్తాడు-ఈ చాప్టర్ చివరి 3 పేరాలు దీనికి సంబంధించినవే.  చలామణీలో డబ్బు విలువ పరిమాణం ఎలా వ్యక్తమవుతుంది/ తన్ను తానూ ఎలా వ్యక్తం చేసుకుంటుంది?.
ఒక సరుకు సమానక రూపం, ఆసరుకు విలువ పరిమాణాన్ని తెలియ జెయ్యదు.బంగారం డబ్బని తెలిసినా, అది తెలియడం వల్ల, 10 పౌన్ల బంగారం విలువ ఎంతో తెలియదు. బంగారం కూడా తనవిలువని ఇతరసరుకుల రీత్యా మాత్రమే వ్యక్తంచేయ్యగలదు. దాని సొంత విలువ దాని ఉత్పత్తికి అవసరమైన శ్రమ కాలం చేత నిర్ణయం అవుతుంది; ఆవిలువ అంటే శ్రమ కాలం ఇమిడివున్న మరొక సరుకు పరిమాణంలో వ్యక్తీకరణ పొందుతుంది. ఇక్కడ ఉన్న {(ఫుట్ నోట్)   : ఒకడొక బుషెల్ ధాన్యాన్ని ఎంత కాలంలో పండించ గలడో, అంటే కాలంలో పేరూ గనులనుండి ఒక ఔన్సు వెండి తేగలిగితే ఒకటి మరొకదాని సహజ ధర. సులువుగా తవ్వగల కొత్త గనుల నుండి అతను ఇంతకు ముందు ఔన్సు తెచ్చిన కాలంలోనే 2 ఔన్సుల వెండి తెస్తే, బుషెల్ ధాన్యం అంతకు ముందు 5 షిల్లింగుల వద్ద ఎంత చౌకో, ఇప్పుడు 10 షిల్లింగుల వద్ద అంతే చౌక.-పెట్టీ} బంగారం సాపేక్ష విలువకు పరిమాణాత్మక నిర్ణయం అది ఉత్పత్తయిన చోట బార్టర్ ద్వారా జరుగుతుంది. అది డబ్బుగా చలామణీ లోకి వచ్చేటప్పటికే దాని విలువ నిర్ణయమై ఉంటుంది. 17 వ శతాబ్దం చివరి దశాబ్దంలో డబ్బూ  ఒక సరుకే అని తెలిసింది. అయితే విశ్లేషణలో ఈగ్రహింపు  పసిదశ మాత్రమే. డబ్బుకూడా సరుకే అని గ్రహించడంలో చిక్కేమీ లేదు. ఉన్న చిక్కంతా ఒక సరుకు ఎలా, ఎందుకు, దేనిద్వారా డబ్బు అవుతుందో తెలుసుకోవడంలో ఉంది.
మనం ఇప్పటికే ఒక విషయాన్ని గమనించాం. ఏమంటే, అత్యంత ప్రాధమిక విలువ వ్యక్తీకరణ                  ( x commodity A = ycommodity B)లో ఏ వస్తువు  మరొక వస్తువు  విలువ పరిమాణానికి ప్రతినిధిగా ఉంటుందో ఆవస్తువు సమానక రూపాన్ని కలిగి ఉంటుంది. ఈ సంబంధంతో నిమిత్తం లేకుండానే, ఆరూపం ఆవస్తువుకు ఉన్నట్లు అగపడుతుంది. అంటే, అది దానికి ప్రకృతి ప్రసాదించిన  సామాజిక ధర్మం అయినట్లు  కనబడుతుంది. అలాగని ఇంతకుముందే గమనించాం. ఇలా తప్పుగా కనబడడాన్ని కడదాకా అనుసరించాం.అంటే,సార్వత్రిక సమానక రూపం ఒక ప్రత్యేక సరుకు శరీర రూపంతో మమేకం  identify అయ్యేదాకా,డబ్బురూపం లోకి  crystallizeఅయ్యేదాకా. ఏమి జరుగుతున్నట్లు  కనబడుతుంది?
అన్ని ఇతర సరుకులూ తమ విలువల్ని బంగారంలో వ్యక్తం చెయ్యడం వాళ్ళ బంగారం డబ్బు అయినట్లుగా కాకుండా, అందుకు వ్యతిరేక దిశలో బంగారం డబ్బు అయినందువల్లనే అన్ని ఇతర సరుకులూ బంగారంలో తమ విలువల్ని వ్యక్తం చేస్తున్నట్లు అగపడుతుంది. ఈ ప్రక్రియలో ఉన్న మధ్యంతర దశలన్నీఫలితంలో  అదృశ్యమవుతాయి. వాటి జాడే ఉండదు. ఒకసరుకు డబ్బు కావడంలో ఉన్న దశలన్నీ జాడైనా లేకుండా మాయమవుతాయి. తమ చొరవ /ప్రమేయమేమీ లేకుండానే,  తమ విలువ తమతోనే ఉన్న మరొక సరుకులో అప్పటికే వ్యక్తం చేస్తునట్లు  కనబడుతుంది. ఈ సరుకులు వెండీ, బంగారమూ. అవి భూగర్భం నుండి బయటకు రాగానే, సమస్త మానవ శ్రమకీ  ప్రత్యక్ష అవతారాలుగా ఉంటాయి. అందువల్లే  డబ్బు ఇంద్రజాలం. మనం పరిశీలిస్తున్న సమాజంలో సామాజిక ఉత్పత్తిప్రక్రియ లో మనుషుల ప్రవర్తన కేవలం విడివిడి వ్యక్తుల ప్రవర్తన (atomic)గా ఉంటుంది.. అందువల్ల ఉత్పత్తిలో ఒకరితో ఒకరి సంబంధాలు వాళ్ళ నియంత్రణకు లొంగని, ఉద్దేశపూర్వక వ్యష్టి చర్యకు లోబడని భౌతిక స్వభావాన్ని  పొందుతాయి. ఉత్పాదితాలు సరుకుల రూపం తీసుకోవడం ద్వారా ఈవాస్తవాలు మొదట బయటపడతాయి. సరుకు ఉత్పత్తిదారుల సమాజం క్రమబద్ధమైన  అభివృద్ధి ఒక విశిష్ట() సరుకు మీద డబ్బు స్వభావాన్ని ఎలా ముద్రిస్తుందో చూశాం. అందువల్ల, డబ్బు మన ముందు పెట్టిన చిక్కు ప్రశ్న (riddle), సరుకులు లేవనెత్తిన చిక్కు ప్రశ్నే.ఇప్పుడు మిరుమిట్లుగొలిపే/కళ్ళుచేదిరే రూపంలో మీదిమీదికి వస్తున్నది. అంతకు మించి మరేమీ లేదు.

 డబ్బుగురించీ,  డబ్బు విధుల గురించీ వచ్చే పోస్ట్ లో 

21, జూన్ 2017, బుధవారం


7.సరుకుల మార్మికతా, దాని రహస్యమూ

7. సరుకుల మార్మికతా, దాని రహస్యమూ

            సరుకుల సమాజంలో ఉత్పత్తిదారుల మధ్య ఉండే సంబంధాలు వాళ్ళ ఉత్పాదితాల మధ్య సంబంధాలుగా                           వాళ్లకు అగపడతాయి. ఇలా కనబడడమే సరుకుల  మార్మికత.

సమాజంలో ఎవరికివారు ఇతరులతో సంబంధం లేకుండా వేర్వేరు  వస్తువులు ఉత్పత్తి చేస్తారు. ఒకరు దారం తీస్తారు. మరొకరు బట్ట నేస్తారు. ఇంకొకరు కుండలు చేస్తారు. వేరొకరు నాగళ్ళు చెక్కుతారు. ఇలా శ్రమ విభజన వుంటుంది. ఒకరివి ఒకరికి అవసరం. కనుక ఆయా వ్యక్తులు సంబంధంలోకి వస్తారు. అయితే ఉత్పత్తి జరిగేటప్పుడు కాదు. వస్తువులు తయారయ్యాక మార్కెట్లో కలుస్తారు. మారకాలు జరుగుతాయి.
నాగలికీ, 5 కుండలకీ మారకం జరిగిందనుకుందాం.ఇది వ్యక్తులమధ్య సామాజిక సంబంధం.కాని ఉత్పత్తిదారులకి అది నాగలికీ,కుండలకీ మధ్య సంబంధంగా కనబడుతుంది.నాగలి చెయ్యడానికి పట్టిన స్రమకాలం, కుండ చెయ్యడానికి పట్టిన శ్రమ కాలానికి 5 రెట్లు. వాటిని చేసిన శ్రమలు భిన్నమైనప్పటికీ, అనిర్దిష్ట మానవశ్రమ గా వాటిలో ఉన్నది ఒకేరకమైనది.కనుక భిన్న పరిమాణాల్లో సమానమవుతాయి. మారతాయి.
అయితే అన్ని రకాల శ్రమలు అనిర్దిష్టమానవ శ్రమగా ఒకటే అనేవిషయం ఉత్పాదకులు నేరుగా గ్రహించలేరు. మారుతున్నది సరుకులు కనుక వాటి విలువలు సమానమైనట్లు భావిస్తారు. నాగలివిలువ  కుండవిలువకి 5 రెట్లు అనీ,వాటికి స్వతహాగా విలువ వున్నదనీ అనిపిస్తుంది. మారకం ఆ విలువల వల్ల  జరిగినట్లుంది. వ్యక్తుల సామాజిక సంబంధాలు వస్తువుల మధ్య సామాజిక సంబంధాలుగా వాళ్లకి అగపడతాయి. ఇలా కనబడడమే సరుకుల  మార్మికత.
************

జర్మన్ భాషలో Fetischcharakter అనేమాట ఉపయోగించాడు మార్క్స్. ఇంగ్లిష్ అనువాదకులు  fetishism అనీ, fetishistic character తర్జుమా చేశారు. తెలుగులో సంకేతారాధన అనీ, భూతశక్తి అనీ, సరుకుల పూజ అనీ, మాయ అనీ అన్నారు. పేరు ఏదయినా ఇదొక భావన (concept). దీనికి నిఘంటువులో వుండే అర్ధం సరిపోదు.పారిభాషిక పదం కనుక ఇక్కడ  ప్రత్యేకార్ధం వుంటుంది.
ఫెటిషిజం  అంటే నిఘంటువు అర్ధం:
ఒక వస్తువుకి అతీత శక్తులు ఉన్నాయనుకొనో , ఆవస్తువుని ఏదో మానవాతీత శక్తి ఆవహించిందనుకొనో దాన్ని పూజించడం. తాయెత్తులు, జ్వరం తాళ్ళు , వశీకరణ ఉంగరాలు మొదలయినవి..చెట్టుకి ముడుపుగాడితే  కోరికలు తీరతాయి అనుకోవడం  . ఇలాంటివి.
మార్క్స్ వాడిన అర్ధం:
“సరుకులో మానవ శ్రమ యొక్క సామాజిక స్వభావం వాళ్లకి వాళ్ళ  ఉత్పాదితాల  మీద ముద్రించిన వస్తుగత స్వభావంగా కనిపిస్తుంది.అంటే,ఉత్పాదితాల కున్న వస్తుగత ధర్మంగా కనిపిస్తుంది;మొత్తం శ్రమతో వాళ్ళ సంబంధం  వాళ్ళ వాళ్ళ మధ్య సంబంధంగా కాకుండా, వాళ్ళ శ్రమ ఉత్పాదితాల మధ్య సామాజిక సంబంధంగా కనబడుతుంది.”-
“మనుషుల మధ్య సామాజిక సంబంధం వాళ్ళ దృష్టిలో వస్తువుల మధ్య సంబంధం రూపం తీసుకుంటుంది .”
“దీన్నే నేను Fetishism అంటాను.” –అన్నాడు.
***************

ఇదేదో పైపై విషయం కాదు. మార్క్స్ సిద్ధాంతపునాదికి ఒక  కీలకమైన విషయం. ఆయన ఆర్ధక సంక్షోభ భావనతో నేరుగా ముడివడి వున్నఅంశం.సందర్భం వచ్చినప్పుడు ఆవిషయం లోతుగా పరిశీలించవచ్చు.
ఈ భావన కాపిటల్ ౩ సంపుటాల్లోనూ,అదనపు విలువ సిద్ధాంతాలలోనూ  ఉంటుంది.
మార్మికత అనేది భ్రమ కాదు. ఉనికిలో వున్నవిషయం  కనుకనే మార్మికత అనేది  చైతన్యంలో చేరుతుంది.ఈ ‘సామాజిక ఉనికి’ సరుకు ఉత్పత్తి, సరుకు ఉత్పత్తి మాత్రమే. ”అవి నిజంగా ఎలాగో అలాగే,   (as what they really are)అంటే  మనుషుల మధ్య పాదార్ధిక సంబందాలుగానూ, వస్తువుల మధ్య సామాజిక సంబందాలుగానూ కనబడతాయి.”-78
నిజానికి ఏవస్తువుకీ స్వతస్సిద్ధంగా విలువ ఉండదు. కాని సరుకులకి స్వయం సిద్ధంగా  విలువ ఉన్నట్లు కనబడుతుంది. ఇదే  మార్మికత.
సరుకులుగా ఉత్పత్తి అయ్యీఅవగానే శ్రమ ఉత్పాదితాలకు ఇది అంటుకుంటుంది.
సరుకుల ఉత్పత్తి అభివృద్ధితోపాటు ఇదీ వృద్ధవుతుంది. 
డబ్బు అమల్లోకి రాగానే  సరకుల మార్మికత, డబ్బు మార్మికత రూపం తీసుకుంటుంది.బంగారంతో ఎవస్తువునైనా కొనవచ్చు. ప్రజల దృష్టికి ఇది బంగారానికున్న సహజ లక్షణంగా అగపడుతుంది. కాని నిజానికది సామాజిక సంబంధాల వాళ్ళ ఏర్పడింది. సామాజిక లక్షణం.
సరుకుల ఉత్పత్తి కొనసాగినంతకాలమూ సరుకుల మార్మికత సాగుతుంది. సరుకుల ఉత్పత్తి అంతరిస్తేనే మార్మికత అంతర్ధానం  అవుతుంది.

**************
సరుకుల  ఉత్పత్తి
సరుకు ఉపయోగపువిలువ, విలువల సమ్మేళనం. రైతు ధాన్యం పండించి వాడు కోవచ్చు, మరొకడు పీటలు చేసి ఉపయోగించు కోవచ్చు అలా ఎవరు చేసినవి వారో,కుటుంబ సభ్యులో ఉపయోగించుకుంటే అవి ఉపయోగపు విలువలు. విలువలు కావు. ఇతరులకు మారకం లేకుండా వాడుకోడానికి చేసి ఇచ్చిన వస్తువులు కూడా విలువలు కావు. కనుక అవేవీ  సరుకులు కావు.
స్వీయ ఉపయోగార్ధం ఉత్పత్తిచేసిన వస్తువులు కేవలం ఉపయోగపు విలువలు.
ఇతరులకోసం  అంటే సమాజంకోసం తయారుచేసి వాటిని  వస్తువులతోనో, డబ్బుతోనో మారకం చేస్తే అవి విలువలు. ఉపయోగపు విలువా విలువా కలసినవి.కనుక  అవి సరుకులు.
స్వీయ ఉపయోగార్ధం కాకుండా, మారకం కోసం ఉత్పత్తి చెయ్యడమే సరుకుల ఉత్పత్తి.
తాను  చేసుకున్న వస్తువులను మాత్రమే వాడుకున్న కాలం ఉన్నమాట నిజమే. కాని అదిపోయి దీర్ఘకాలం  గడిచింది. పైగాఅలాంటి పరిస్థితుల్లో, ఒకరు చేసినవి మరోకరు వాడుకోక తప్పదు. అంటే, ఒకరి శ్రమని  ఒకరు ఉపయోగించుకుంటారు. వ్యష్టి శ్రమ సామాజికం అవుతుంది. ప్రతి మనిషి శ్రమా సామాజిక శ్రమ మొత్తంలో చిన్న  భాగం అవుతుంది.  ఎవరి శ్రమ ఉత్పాదితాలు వారివే. కనక మరోకరి శ్రమ ఉత్పాదితంతో మారకం చేసుకుంటారు.  ఇది వ్యక్తులమధ్య సామాజిక సంబంధం. అయినా వాళ్లకి  అది వస్తువుల మధ్య సామాజిక సంబంధంగా కనబడుతుంది. ఇలా కనబడదాన్నే మార్క్స్ మార్మికత అంటాడు.
ఒకతను మంచాలు  చేస్తాడు. మరొకతను నులక పేనుతాడు. మంచం చేసిన వానికి నులక కావాలి. నులక పేనిన వానికి మంచం కావాలి. మార్కెట్ కొచ్చి నప్పుడు మారకం చేసుకుంటారు. దర్జీ చొక్కాలు కుడతాడు. నేతగాడు శాలువాలు నేస్తాడు. నేతగాడికి చొక్కా కావాలి. దర్జీకి  శాలువా అవసరంలేదు. కనుక నేతగాడు సలువాలు వేరేవారికి అమ్మి ఆడబబ్బులోనించి  కొంతిచ్చి చొక్కా కొనుక్కుంటాడు. మిగిలిన డబ్బుతో కావలసినవి కొంటాడు. అలాగే దర్జీ చొక్కాలు అమ్మి వచ్చిన డబ్బు బెట్టి అవసరమైనవి కొనుక్కుంటాడు.
కనుక వాళ్లకి వాళ్ళ మధ్య సంబంధాలుగా కాకుండా, సరుకులకీ సరుకులకీ  మధ్య సంబంధంగా, వస్తువుల మధ్య సంబంధంగా కనబడుతుంది. ఇదే శ్రమ ఉత్పాదితం సరుకు రూపం ఎత్తగానే దానికి అంటుకునే మార్మికత.
అందువల్లమార్మికత సరుకుల ఉత్పత్తి నించి విడదీయ జాలనిది.
సరుకు ఉత్పత్తితోనే మార్మికత తలెత్తిందని స్పష్టం చేశాడు.
***************
సరుకు కాగానే మార్మికత ఎక్కడనించి  వస్తుంది? 
పైకి సరుకు తేలికగా తెలిసేదే అనిపిస్తుంది. తీరా విశ్లేషిస్తే, అదేదో మార్మికమైనదిగా, నిగూఢమైనదిగా తేలుతుంది. సరుకు ఉపయోగపు విలువా, విలువా అని తెలుసు. సరుకు మార్మిక స్వభావం ఎందులో ఉంది?
A. ఉపయోగపు విలువలో ఉన్నదా?
సరుకు ఉపయోగపు విలువ అయినమేరకు
1.అది తన ధర్మాల ద్వారా మనిషి అవసరాలను తీరుస్తుంది.
2.ఆ ధర్మాలు మానవ శ్రమ వల్ల ఏర్పడినవి .
ఉదాహరణ:అడ్డం కట్టుకోవాలంటే, తడిక అవసరం. నీళ్ళు చేదాలంటే చేంతాడు కావాలి. అవి రెండూ రెండు వేర్వేరు  అవసరాలను తీరుస్తాయి. రెండూ మానవ శ్రమ వల్ల తయారైనవే.
ప్రకృతిలో లభించిన వెదురు బొంగులు చీల్చి తడిక అల్లుతారు. నారతో చేంతాడు పేనుతారు.అంటే, ప్రకృతి ఉత్పాదితాలకు(బొంగులు,నార) మనిషి తన శ్రమను జోడించి వాటి రూపాలను మారుస్తాడు.ఇది స్పష్టమే. మనిషి ప్రకృతి లో దొరికే వస్తువుని తన శ్రమతో ఉపయోగపడే  వస్తువుగా మారుస్తాడు. ఈ విషయం తలియడంలో చిక్కేమీ లేదు.
“ప్రకృతి కొయ్యని సమకూరుస్తుంది. మనిషి తన శ్రమతో దాన్ని ముక్కలుగా కోసి తనకు ఉపయోగపడే టేబుల్ చేస్తాడు . టేబుల్ గా చెయ్యడం వల్ల కొయ్య రూపం మారింది. అయినా, అది కొయ్యగానే ఉంటుంది.”
అందువల్ల సరుకు ఉపయోగపు విలువకు సంబంధించి గ్రహించలేనిది ఏదీ లేదు. ఇందులో నిగూఢత లేనే లేదు. ప్రతిదీ స్పష్టంఅయినదే, ఇంద్రియగ్రాహ్యమైనదే. కనుక సరుకు మార్మికత ఉపయోగపు విలువలో లేదు.
B.పోనీ  విలువని నిర్ణయించే అంశాల్లో ఉన్నదా? అంటే లేదంటాడు.
ఎందు కంటే, మొదటిది, ప్రయోజనకర శ్రమలు భిన్నమైనవే,అయినప్పటికీ అవన్నీ మనిషి భౌతిక చర్యలే, అలాంటి  ప్రతి చర్యా ,దాని రూపం ఎదయినకావచ్చు,సారంశం లో  మనిషి మెదడూ, నరాలూ కండరాలూ వగయిరాల వ్యయమే.
రెండు, విలువ పరిమాణాన్ని నిర్ణయించేది ఆశ్రమ వ్యయ వ్యవధి లేక శ్రమ పరిమాణం. దీనికి సంబంధించి గుణానికీ, పరిమాణానికీ తేడా ఉన్నదనేది స్పష్టమే. అన్ని సమాజాల్లోనూ జీవనాధార సాధనాలని ఉత్పత్తి చేసేందుకు పట్టే శ్రమ కాలం పట్ల మనుషులకు ఆసక్తి ఉంది. అయితే అన్ని అభివృద్ధి దశల్లో ఒకే స్థాయిలో కాదు కాక పోయినా.
చివరగా, మనుషులు ఒకరికోరకొకరు పనిచేస్తుంటే, వాళ్ళ శ్రమ సామాజికరూపం తీసుకుంటుంది.
ఇవన్నీ స్పష్టంగా బోధపడేవే. అన్ని సమాజాల్లోనూ ఉన్నవే.
“విలువ నిర్ణాయకాల సారం నించి కూడా మార్మికత ఉత్పన్నం కాదు” అంటాడు. సరుకుల మార్మిక స్వభావం వాటి ఉపయోగపు విలువనుండి  పుట్టలేదు, విలువను నిర్ణయించే అంశాల నుండీ పుట్టలేదు.
C. కావలసినవన్నీ తయారుచేసుకుని తామే  వాడుకున్న కాలం ఉంది, గాని అది ఏనాడో పోయింది. ఒకరుచేసినవి ఒకరు ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకరి శ్రమను మరొకరు పరస్పరం వాడుకోవడం అవసరమయింది. శ్రమ సామాజికం అయింది. ఉత్పత్తిదారుల మధ్య సంబందాలు ఉండి  తీరాలి.
ఇందులోనూ మార్మికత లేదు.
మార్మికత శ్రమ విభజననుండి తలెత్తిందా?అంటే అదీ కాదు. సరుకుల ఉత్పత్తి లేకముందు  కూడా శ్రమవిభజన ఉంది. దీన్నిబట్టి, మార్మికత శ్రమ విభజననుండి తలెత్తలేదని స్పష్టమవుతుంది.
***************
మరి ఈ మార్మికత ఎక్కడ నించి పుట్టింది ?
”శ్రమ ఉత్పాదితం సరుకు రూపం తీసుకోగానే దానికి మార్మిక స్వభావం ఎక్కడ నించి వస్తుంది? ” అని ప్రశ్నించి ,
“స్పష్టంగా సరుకు రూపం నించే” అంటాడు.
“అయితే ఆ టేబుల్ సరుకుగా వచ్చిందా, అదేదో ఇంద్రియాతీతమైన వస్తువుగా అయిపోతుంది. కాళ్ళ మీద  నిలబడడమేకాదు,ఇతర సరుకులతో సంబంధంలో తలమీదా  నిలబడుతుంది “అంటాడు.
విశ్లేషణ లో తేలిన విషయాలు సరుకు ఉత్పత్తిదారులకు వేరేవిధంగా కనబడతాయి.
అన్ని రకాల మానవ శ్రమలూ సమానమే,అనే విషయం విశ్లేషణలో తేలింది. అయితే అది  వస్తుగతంగా ఆశ్రమల ఉత్పాదితాలన్నీ విలువలు కావడం గా వ్యక్తం అవుతుంది. సరుకులుగా మార్కెట్ కి వచ్చాక అవన్నీ విలువలు. కనుక గుణాత్మకంగా సమానమైనవి. విశ్లేషణలో అన్నిరకాల శ్రమలూ సమానమే అని తేలిన విషయం మార్కెట్లో అన్ని సరుకులూ విలువలుగా సమానం అని వ్యక్తమవుతుంది. సరుకు ఉత్పత్తి దారులకు అలాగే తెలుస్తుంది.
శ్రమ శక్తి వ్యయానికి కొలబద్ద శ్రమ శక్తి వ్యవధి.అంటే, ఎంత సేపు ఆ శ్రమ జరిగింది?అనేది. అయితే అది వస్తుగతంగా శ్రమ ఉత్పాదితాల విలువ  పరిమాణం రూపం తీసుకుంటుంది. ఉదాహరణకి,టేబుల్ తయారీకి 4 గంటల శ్రమ పడితే, దాని విలువ పరిమాణం  200 రూపాయలుగా వ్యక్తం అవుతుంది.
ఒకరికొరకొకరు శ్రమ చెయ్యడంలో  శ్రమ సామాజిక స్వభావం ఉంటుంది. అయితే ఇక్కడ ఉత్పత్తిదారుల సామాజిక  సంబంధాలు వాళ్ళ ఉత్పాదితాల మధ్య సంబంధాల రూపం తీసుకుంటాయి.
సరుకు అందువల్ల నిగూఢమైన వస్తువు: సరుకులో మానవ శ్రమ యొక్క సామాజిక స్వభావం వాళ్లకి వాళ్ళ  ఉత్పాదితాల  మీద ముద్రించిన వస్తుగత స్వభావంగా కనిపిస్తుంది.అంటే,ఉత్పాదితాల కున్న వస్తుగత ధర్మంగా కనిపిస్తుంది;మొత్తం శ్రమతో వాళ్ళ సంబంధం  వాళ్ళ వాళ్ళ మధ్య సంబంధంగా కాకుండా, వాళ్ళ శ్రమ ఉత్పాదితాల మధ్య సామాజిక సంబంధంగా కనబడుతుంది.” శ్రమ ఉత్పాదితాలు సరుకులయ్యేది ఈ కారణంగానే.” సరుకులు సామాజిక వస్తువులు, వేటి  లక్షణాలయితే ఏక కాలంలో గోచరంగానూ అ గోచరంగానూ ఉంటాయో ఆ సామాజిక వస్తువులు, సరుకులు.
అదే విధంగా ఒక వస్తువునుంచి  వచ్చే కాంతి మన కంటి నరంయొక్క ఉద్రిక్తత గా మనకి తట్టదు ; కంటి బయట వున్న దేనిదో వస్తుగత రూపంగా తడుతుంది.
అయితే చూడడంలో ప్రతి సందర్భంలోనూ కాంతి ఒక వస్తువు నించి  మరొక వస్తువుకు అంటే, బయటవున్న వస్తువు నించి కంటికి ప్రసరిస్తుంది. ఇక్కడ భౌతిక వస్తువుల మధ్య భౌతిక సంబంధం వున్నది. అయితే సరుకుల విషయం వేరు. సరుకులుగా వస్తువుల మనుగడా, వాటిపై సరుకులముద్రవేసే శ్రమ ఉత్పాదితాల విలువ సంబంధమూ, వాటి భౌతిక ధర్మాలకు సంబంధించినవి కానే కావు. మానవుల మధ్య నిర్దిష్టమైన సామాజిక సంబంధం ఉంది. వాళ్ళ దృష్టికి వస్తువులమధ్య సంబంధం రూపాన్ని(విచిత్రమైన రూపాన్ని) తీసుకునే సామాజిక సంబంధం అది.
దీనికి పోలిక కావాలంటే మత  ప్రపంచంలోకి పోవాల్సిందే. అందులో మనిషి మెదడు సృష్టించిన వాళ్ళు ప్రాణం వున్న స్వతంత్ర వ్యక్తులుగా కనబడతారు.ఒకరితో ఒకరు సంబంధంలోకి వస్తారు. అంతే కాదు, మానవ జాతితో కూడా సంబంధంలోకొస్తారు.
అలాగే సరుకుల ప్రపంచంలో మనిషి చేతులతో చేసిన సరుకులు కూడా. సరుకులుగా ఉత్పత్తి అయ్యీ కాగానే శ్రమ ఉత్పాదితాలకు ఈ మార్మికత  అంటుకుంటుంది. అందువల్ల అది సరుకుల ఉత్పత్తి నించి విడివడదు. మార్మికతకీ సరుకుల ఉత్పత్తికీ విడగొట్టలేని సంబంధం ఉంది.

సరుకుల మార్మికతకి  మూలం సరుకుల్ని ఉత్పత్తి చేసిన శ్రమ యొక్క ప్రత్యేక సామాజిక స్వభావంలో ఉంది-అని ఇప్పటికే మన విశ్లేషణ తేల్చింది.కాపిటల్.1.77
ఒకరితో ఒకరు సంబంధం లేకుండా విడివిడిగా ఉత్పత్తిచేసే ప్రైవేటు వ్యక్తుల,లేక బృందాల శ్రమ ఉత్పాదితాలు అయినందువల్లే ప్రయోజనకర వస్తువులు సరుకులవుతాయి. అందరు  ప్రైవేటు వ్యక్తుల శ్రమ మొత్తం కలిసి  సమాజపు శ్రమ అవుతుంది. ఉత్పత్తిదారులు వాళ్ళ వాళ్ళ ఉత్పాదితాల్ని మారకం చేసుకునేదాకా ఒకరితో ఒకరు సంబంధంలోకి రారు. ఆకారణంగా ప్రతి ఉత్పత్తిదారుని శ్రమ యొక్కవిశిష్ట  సామాజిక స్వభావం మారకంలో తప్ప బయట పడదు. వ్యక్తి శ్రమ సమాజ శ్రమలో భాగంగా ఎప్పుడు తెలుస్తుందంటే, మారకచర్య ప్రత్యక్షంగా ఉత్పాదితాల మధ్యా, పరోక్షంగా వాటిద్వారా ఉత్పాదకుల మధ్యా  ఏర్పరచే సంబంధాల ద్వారా మాత్రమే నిర్ధారణవుతుంది. అందువల్ల ఆవుత్పాదకులకి ఒకరి శ్రమని మిగతా వారి శ్రమతో కలిపే సంబంధాలు, వ్యక్తుల మధ్య ప్రత్యక్ష  సామాజిక సంబంధాలుగా కనబడవు. అవి నిజంగా ఎలాగో అలాగే, అంటే  మనుషుల మధ్య పాదార్ధిక సంబందాలుగానూ, వస్తువుల మధ్య సామాజిక సంబందాలుగానూ కనబడతాయి. మారకం అయినందువల్లనే, ప్రయోజనకర వస్తువులుగా వాటి వివిధ రూపాలకు భిన్నంగా , శ్రమ ఉత్పాదితాలు విలువలుగా ఒకేరకమైన సామాజిక హోదా ని పొందుతాయి. ఉపయోగపు విలువగానూ,విలువగానూ ఒక ఉత్పాదితం విభజన ఎప్పుడు ముఖ్యం అవుతుందంటే, ప్రయోజనకర వస్తువులు మారకం కోసమే ఉత్పత్తయ్యే స్తాయికి మారకం విస్తరించినప్పుడు, విలువలుగా వాటి స్వభావాన్ని ముందుగా ఉత్పత్తిలోనే లెక్కలోకి తీసుతీసుకోవలసి వచ్చినప్పుడు.ఆక్షణం నించీ వ్యక్తి ఉత్పత్తిదారునిశ్రమ సామాజికంగా ద్వంద్వ స్వభావాన్ని సంతరించుకుంటుంది.ఒకవైపు, నిర్దిష్టమైన ప్రయోజనకర శ్రమ గా అది ఒక నిర్దిష్ట సామాజికఅవసరాన్ని తీర్చాలి. ఉదాహరణకి కుండలు చేసే శ్రమ ఒక నిర్దిష్ట ప్రయోజనకర శ్రమ. సమాజానికి కుండలు అవసరం. ఆ అవసరాన్ని ఆశ్రమ తీరుస్తుంది. సామాజిక శ్రమ విభజనలో ఒక శాఖగా తన స్థానాన్ని పొందుతుంది.
మరొకపక్క , అది ఆశ్రమ చేసే వాని వివిధ కోర్కెలనూ తీర్చగలదు. అంటే కుండలకు మారుగా తనకు కావలసిన వస్తువులు తీసుకోగలదు. మిగతా అందరి శ్రమ తోనూ సమాన హోదా సాధిస్తుంది.సమాజ శ్రమలో భాగం అయినట్లు రుజువవుతుంది. భిన్న రకాల శ్రమల సమానత్వం వాటి అసమానత్వాల నించి అనిర్దిష్టీ కరించిన ఫలితం. లేక వాటి ఉమ్మడి విభాజకం  అంటే మానవ శ్రమ శక్తి వ్యయం  లేక అనిర్దిష్ట మానవ శ్రమకి దించడం ద్వారా మాత్రమే  సాధ్యం.  వ్యక్తి  శ్రమ యొక్క సామాజిక ద్వంద్వ స్వభావం అతని మనస్సులో ప్రతిఫలించినప్పుడు అతనికి  ఎలా కనబడుతుంది? రోజువారి అనుభవంలో ఉత్పత్తుల మారకం ద్వారా ఆశ్రమ మీద ముద్రపడిన రూపాలలో మాత్రమే. ఈ విధంగా తన సొంత శ్రమ సమాజానికి ఉపయోగ పడే స్వభావం కలిగివున్నది అనేది ఒక షరతు రూపం తీసుకుంటుంది. ఏమంటే ఉత్పాదితం కేవలం ప్రయోజనకరం అయినది కావడమే కాదు. ఇతరులకు ఉపయోగపడేదై ఉండాలి. అతని ప్రత్యేక శ్రమ అన్ని ఇతర రకాల శ్రమలతో సమానమైనది అనే సామాజిక స్వభావం ఏరూపం తీసుకుంటుందంటే: భౌతికంగా  భిన్నమైన అన్ని శ్రమ ఉత్పాదితాలకూ ఒక ఉమ్మడి లక్షణం ఉంది.అదే విలువ కలిగి వుండడం  కాపిటల్ 1.77-78
మన శ్రమ ఉత్పాదితాల్ని విలువలుగా సంబంధంలో కి తెచ్చామంటే, వాటిలో  ఒకేరకమైన మానవ శ్రమ ఉన్నదని తెలిసి కాదు. అందుకు భిన్నంగా మారకం ద్వారా మన ఉత్పాదితాల్ని సమపరుచు కున్నప్పుడల్లా, ఆచర్యలో వాటికోసం చేసిన భిన్న రకాల శ్రమల్నీ మానవ శ్రమగా సమపరుస్తున్నాం.ఇలా చేస్తున్నామని మనకు తెలియదు, అయినా చేస్తాం.గాలియానీ,  విలువ ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం అన్నాడు. వస్తువుల మధ్య సంబంధంగా వ్యక్తమయ్యే సంబంధం అనేమాటలు కలిపి ఉండాల్సింది అన్నాడు మార్క్స్- కాపిటల్ 1 .79 .
అందువల్ల, విలువ తనేమిటో వర్ణించే చీటీ మొహానికి అంటించుకొని తిరగదు. పైగా విలువే ప్రతి ఉత్పాదితాన్నీ  సామాజిక చిత్రలిపిగా (social hieroglyphic)  మారుస్తుంది. ఆతర్వాత మనసొంత సామాజిక ఉత్పాదితాల వెనక వున్నరహస్యాన్ని గ్రహించడానికి,  దాన్నిచదివే  ప్రయత్నం చేస్తాం.డీకోడ్ (decode) చేస్తాం.
*************.
విలువ అనేది పైకి తలిసేది కాదు,కనుక విలువ శాస్త్రీయ విశ్లేషణకు వస్తువయింది.
ఆర్ధికవేత్తలు శ్రమ నించి విలువ వస్తుంది అని కనుక్కున్నారు.ఇదొక గొప్ప ఆవిష్కరణ. అయితే అంతకు ముందు లాగానేఈ ఆవిష్కరణ తర్వాత కూడా శ్రమ సామాజిక స్వభావం శ్రమ ఉత్పాదితాల వస్తుగత స్వభావంగానే కనిపించడం ఆగలేదు.అలా  కనిపించేట్లు చేసే మంచుపొరని ఈ ఆవిష్కరణ తొలగించలేక పోయింది.
ఎందువల్ల?
సరుకుల ఉత్పత్తి అనే ప్రత్యేక రూపాన్ని పరిశీలిస్తున్నాం.ఎవరికీ వారు స్వతంత్రంగా ఉత్పత్తిచేస్తారు.ఈ ప్రైవేట్ శ్రమ యొక్క సామాజిక స్వభావం ప్రతిశ్రమా మానవ శ్రమగా సమానమే అనేదాంట్లో  ఉంటుంది. అయితే ఇది ఉత్పాదితంలో విలువ రూపం తీసుకుంటుంది. ఈ వాస్తవం  ఉత్పత్తిదారులకు నిత్యమైనట్లూ, సత్యమైనట్లూ కనబడుతుంది- ఈ ఆవిష్కరణ తర్వాతకూడా. ఈ ఆవిష్కరణమార్మికత పట్టుని  సడలించలేక పోయింది.ఎలాగంటే, “గాలి(air)లో  భాగాలైన  చాలా వాయువులని (gases)సైన్స్ కనుగొన్నాక  కూడా, దానికదిగా వాతావరణం మారకుండా ఉన్నట్లే.”
మారకం చేసుకునేటప్పుడు ఉత్పత్తిదారుల ఆలోచనంతా తమ సరుకుకి ఇతర సరుకులు ఎంత పరిమాణంలో వస్తాయనేదానిమీద ఉంటుంది. ఏ నిష్పత్తిలో ఆ ఉత్పదితాలు మారగలగుతాయి?
ఈ మారక నిష్పత్తులు అలవాటువల్ల ఒకింత స్తిరత్వంపొందుతాయి. అప్పుడు ఆనిష్పత్తులు ఉత్పాదితాల స్వభావం నించే వచ్చినట్లు కనబడతాయి. ఉదాహరణకి ఒక టన్ను ఇనుమూ రెండు ఔన్సుల బంగారమూ ప్రకృతి సిద్ధంగానే సమాన విలువ గలవిగా కనిపిస్తాయి. ఇది ఎంత సహజంగా కనిపిస్తుందంటే: బంగారమూ, ఇనుమూ  వేర్వేరు భౌతిక, రసాయన ధర్మాలు కలిగి ఉన్నప్పటికీ, ఒక పౌను బంగారమూ, ఒక పౌను ఇనుమూ సమాన బరువుని కలిగివున్నంత సహజంగా . విలువ ఉండడం అనే స్వభావం ఒకసారి సరుకులమీద పడితే, ఆస్వభావం విలువ పరిమాణాలుగా చర్యలు ప్రతి చర్యలు జరగడం మూలంగా స్థిరపడుతుంది . ఈ పరిమాణాలు మారుతుంటాయి. ఉత్పాదకుల సంకల్పంతోగానీ,ముందు చూపుతో గానీ, చర్యతోగానీ ఎటువంటి సంబంధమూ లేకుండానే మారుతుంటాయి. వాళ్లకి వాళ్ళ సామాజిక చర్య వస్తువుల చర్య రూపం తీసుకుంటుంది. ఉత్పత్తిదారుల చేత పాలించ బడే బదులు, ఆసరుకులే వాళ్ళని పాలిస్తున్నట్లుంటుంది.
మార్కెట్లో సరుకులు యజమాని చెప్పినట్లుండవు. యధేచ్చగా వ్యవహరిస్తాయి. ఒకరోజు ఒక కలం 5 పెన్సిళ్ళతో మారవచ్చు. ఇంకోరోజు 8 రావచ్చు. మరో రోజు 3 రావచ్చు. ఒకసారి అసలు మారక పోవచ్చు.మార్కెట్లో నడిచే ఈ యాదృచ్చికమైన పరిస్థితి మూలంగా  సరుకుకి స్వయంసిద్ధంగా  విలువ వున్నదనిపిస్తుంది. ఉత్పత్తి యొక్క సామాజిక సంబంధాలను ఉత్పాదకులు గ్రహించరు.వస్తువులమధ్య సంబంధాలను మాత్రమే  గమనిస్తారు. వస్తువుల మధ్య సంబంధాల మాటున వ్యక్తుల సామాజిక సంబంధాలు మరుగున పడిపోతాయి.
************
ఒకరితో ఒకరు సంబంధం లేకుండా,స్వతంత్రంగా,అయినా అభివృద్ధిచెందిన సామాజిక శ్రమ విభజన శాఖలుగా, నిర్వహించబడే అన్ని రకాల ప్రైవేటు శ్రమలూ సమాజానికి కావలసినట్లుగా పరిమాణాత్మక నిష్పత్తులుగా దిగుతాయి. ఎందుకు? అన్ని యాదృచ్చికమైన,ఒడిదుడుకులున్న  సరుకుల మారక సంబంధాల నడుమ వాటి ఉత్పత్తికి పట్టిన సామాజికంగా అవసరమైన శ్రమ కాలం శాసించగల ప్రకృతి నియమం లాగా బలవంతంగా నిర్ధారణ అవుతుంది. అదే విధంగా ఒక ఇల్లు మన కళ్ళెదుట  కూలినప్పుడు భూమ్యాకర్షణ నియమం నిరూపితమవుతుంది. అందువల్ల శ్రమ కాలం ద్వారా శ్రమ పరిమాణం నిర్ణయం అనేది ఒక రహస్యం.సరుకుల సాపేక్ష విలువలలో పైకి కనపడే నిర్ణయం వెనక దాగిన రహస్యం.  దాని ఆవిష్కరణ ఉత్పాదితాల విలువ పరిమాణ నిర్ణయం  కేవలం యాదృచ్చికమైనదిగా కనబడదాన్ని పూర్తిగా పోగొట్టినప్పటికీ, ఆనిర్ణయం జరిగే విధానాన్ని ఏ విధంగానూ మార్చలేదు.
సమాజ జీవిత రూపాల గురించిన మనిషి ఆలోచనలూ, తత్ఫలితంగా ఆరూపాలగురించిన మనిషి  శాస్త్రీయ విశ్లేషణా వాస్తవ చారిత్రిక అభివృద్ధికి నేరుగా వ్యతిరేక దిశలో సాగుతాయి. అతనిముందు సిద్ధంగావున్న అభివృద్ధి ప్రక్రియ యొక్క ఫలితాలతో అతను మొదలుబెడతాడు.
 ఉత్పాదితాలను సరుకులుగా ముద్రవేసే లక్షణాల స్థిరీకరణ సరుకుల చలామణీ కి ముందుగా వుండి తీరాలి. ఆలక్షణాలు సహజమైన,స్వయం స్పష్టమైన సమాజ జీవిత రూపాలయొక్క స్థిరత్వాన్ని అప్పటికే పొందాయి.మనిషి వాటి చారిత్రక స్వభావాన్నిగ్రహించే ప్రయత్నం చెయ్యకుండా, వాటి అర్ధాన్ని తెలుసుకునే యత్నం చేశాడు. ఎందుకంటే,అతని దృష్టిలో ఆలక్షణాలు మారేవి కావు. కనుకనే వాటి అర్ధం వైపు దృష్టి పెట్టాడు. ఫలితంగా  సరుకుల ధరల విశ్లేషణ ఒక్కటే విలువ పరిమాణం యొక్క నిర్ధారణకు లీడ్ చేసింది.అన్ని సరుకులూ డబ్బులో ఉమ్మడిగా వ్యక్తం కావడం విలువలుగా వాటి లక్షణాల  నిర్ధారణకు లీడ్ చేసింది. ప్రైవేట్ శ్రమ యొక్క సామాజిక స్వభావాన్నీ,వ్యష్టి ఉత్పత్తిదారుల మధ్య సామాజిక సంబందాల్నీ  బయటపెట్టే బదులు, దాచి పెట్టింది , సరుకుల అంతిమ రూపమైన డబ్బు రూపమే.  కోట్లో బూట్లో బట్టతో, అది అనిర్దిష్ట మానవ శ్రమ అవతారం అయినందువల్ల,  సంబంధంలో ఉన్నాయని అన్నప్పుడు అసంబద్ధత  స్వయంస్పష్టమే . అయినాగాని,బూట్ల, కోట్ల ఉత్పత్తిదారులు వాళ్ళ వస్తువుల్ని సార్వత్రిక సమానకంగా బట్టతో పో ల్చినప్పుడు,లేక  బంగారంతోనో, వెండితోనో పోల్చినప్పుడు, అవి వారి సొంత ప్రైవేట్ శ్రమకీ,సమాజం యొక్క శ్రమకీ ఉన్న సంబంధాన్ని అదే అసంబద్ధ రూపంలో వ్యక్తం చేస్తాయి
బూర్జువా ఎకానమీ యొక్క భావాభివర్గాలు అటువంటి(అసంబద్ధ) రూపాలతో ఉంటాయి. అవి సమాజ అంగీకారంతోచారిత్రకంగా నిర్దిష్ట మైన ఒక ఉత్పత్తి అంటే సరుకుల ఉత్పత్తి  విధానం యొక్క పరిస్థితుల్నీ,సంబందాల్నీవ్యక్త పరుస్తాయి. శ్రమ ఉత్పాదితాలు సరుకులు గా ఉన్నంతకాలం వాటిని  ఆవహించి ఉండే సరుకుల మొత్తం నిగూఢతా, ఇంద్రజాలం ఇతర ఉత్పత్తి విధానాలను చేరగానే అదృశ్యం అవుతాయి.
***********
మార్మికత లేని ఉత్పత్తి గురించి చెప్పడానికి మార్క్స్ రాబిన్సన్ క్రూసో ని ఉదాహరిస్తాడు.
1.రాబిన్సన్ ఉత్పత్తి.ఒక దీవిలో ఒక్కడే చిక్కుకుంటాడు.ఇంకెవ్వరూ ఉండరు. అతనికి ఎక్కువ కోర్కెలు కాపోయినా, కొన్నైనా తీర్చుకోవాలి. ఒంటరివాడు గనక తన అవసరాలు తీర్చే వస్తువుల్ని తనే ఏర్పరచుకోక తప్పదు.కనక రకరకాల పనులు చేశాడు. ఇల్లు కట్టాడు. చుట్టూ కంచె  వేశాడు. పనిముట్లు,ఫర్నిచర్ చేసుకున్నాడు. జంతువుల్ని వేటాడేవాడు.బార్లీ పండించేవాడు.కుండలు చెయ్యడానికీ,మేకలు పెంచడానికీ అలవాటు పడ్డాడు. బుట్టలల్లాడు.చిన్న పడవ చేసుకున్నాడు.చేపలు పట్టడం అలవరచుకున్నాడు. “ అతని పనిలో ఎంత వైవిధ్యం ఉన్నా,ఆశ్రమ రూపం ఏదయినా అంతా తన ఒక్కడి శ్రమే అని, దాని భిన్న రూపాలేననీ  అతనికి తెలుసు. అవసరాన్ని బట్టి తన కాలాన్నివివిధ పనులకు కేటాయించేవాడు.
ఆతను తన stock-book లో తనవైన  ప్రయోజనకర వస్తువుల జాబితా రాశాడు.వాటి తయారీకి అవసరపడే చర్యల గురించి రాశాడు. నిర్దిష్ట  పరిమాణాల్లో ఆవస్తువుళ తయారీకి సగటున ఎంత సమయం పడుతుందో రాశాడు. రాబిన్సన్ కీ, ఆస్తిఅయిన అతని శ్రమతో తయారుచేసుకున్న  వస్తువులకీ ఉన్న అన్ని సంబంధాలూ చాలా సరళ మైనవి, స్పష్టమైనవి. అయినా ఆసంబంధాలలో విలువ నిర్ణయానికి కావలసిన వన్నీఉన్నాయి
2.అర్ధబానిసల ఉత్పత్తి . రాబిన్సన్ నించి మధ్యయుగాల ఐరోపాకి మరలుతాడు. అక్కడ ఉన్నది స్వతంత్రుడైన వ్యక్తికాడు. అందరూ ఆధారపడినవారే.- అర్ధబానిసలూ-ప్రభువులూ (serfs and lords),సామంతులూ-సామ్రాట్లూ,( vassals and suzerains)సామాన్యుడూ-మతాధికారీ (laymen and clergy). శ్రమా, శ్రమ ఉత్పాదితాలూ వాస్తవ రూపానికి భిన్నమైన రూపాల్ని  తీసుకోవాల్సిన అవసరం లేదు. సామాజిక లావాదేవీల్లో  అవి పనిరూపంలో సేవలు, పనిరూపంలో చెల్లింపులు. సరుకులు  ఉత్పత్తి ఆధారంగా ఉన్న సమాజంలో లాగా కాకుండా, ఇక్కడ శ్రమ యొక్క ప్రత్యేక ప్రాకృతిక రూపం శ్రమ యొక్క తక్షణ సామాజిక రూపం. బలవంతపు శ్రమ సరుకులుత్పత్తి చేసే శ్రమ లాగే కాలం చేత కొలవబడుతుంది; అయితే, తన యజమాని సేవలో వ్యయిస్తున్న శ్రమ నిర్దిష్ట పరిమాణంగల తనసొంత శ్రమ శక్తి  అని ప్రతి అర్ధబానిసకీ తెలుసు.
కార్వే పద్ధతిలో రైతు వారంలో కొంతకాలం(మాటవరసకి) తనపోలంలో పనిచేసుకుంటాడు. మిగిలిన రోజులు యజమాని పొలంలో తన పరికరాలతోనే పనిచేస్తాడు. ఇదంతా స్పష్టంగానే వుంటుంది. మార్మికతేమీ ఉండదు.

“మతాదిపతికి చెల్లించాల్సిన  టితీ ఆయన దీవెనలకన్నా వాస్తవమైనవి” అలాంటప్పుడు ఆ సమాజంలో  భిన్న వర్గాల ప్రజలు పోషించే పాత్రల గురించి మనం ఏమనుకున్నా, శ్రమచెయ్యడంలో వ్యక్తులమధ్య సామాజిక సంబంధాలు ప్రతి సందర్భం లోనూ  వాళ్ళ పరస్పర వ్యక్తిగత సంబంధాలు గానే కనబడతాయి. శ్రమ ఉత్పాదితాల మధ్య సామాజిక సంబంధాల ఆకృతి కింద దాగి ఉండవు.
౩.  పితృస్వామిక రైతు కుటుంబం ఉత్పత్తి .ఇది  ఉమ్మడి శ్రమ కి ఉదాహరణ. ఆ కుటుంబం ఉమ్మడిగా ధాన్యం పండిస్తుంది. పశువులు పోషిస్తుంది. దారం వడుకుతుంది. బట్టలు నేస్తుంది. దుస్తులు కుడుతుంది. ఆ ఉత్పత్తులు ఆకుటుంబం వాడుకుంటుంది. ఆభిన్నమైన వస్తువులన్నీ ఆకుటుంబం శ్రమ ఉత్పత్తులే. కాని కుటుంబ సభ్యులమధ్య అవి సరుకులు కావు. వాటిలో రూపొందిన భిన్న రకాల శ్రమలు –దున్నకం,పశు పెంపకం,వడకడం, నేయ్యడం,కుట్టడం- నేరుగా సామాజిక చర్యలే. ఎందుకంటే, అవి కుటుంబం చర్యలు.సరుకుల ఉత్పత్తి మీద ఆధారపడిన సమాజం లాగా కుటుంబంలో సద్యోజనితంగా వృద్ధయిన శ్రమ విభజన ఉంది. కుటుంబంలో పని పంపిణీ , సభ్యుల యొక్క శ్రమ కాలమూ లింగ, వయో భేదాల్ని బట్టీ ,ఋతువుల తేడాలని బట్టీ ఉంటుంది.ప్రతి సభ్యుని శ్రమ శక్తీ, మొత్తం కుటుంబ శ్రమ శక్తిలో నిర్దిష్ట భాగంగా మాత్రమేఉంటుంది. అందువల్ల,వ్యక్తి  శ్రమ శక్తి వ్యయం దాని వ్యవధి ద్వారా కొలత స్వభావ సిద్ధంగానే శ్రమ యొక్క సామాజిక స్వభావంగా కనబడుతుంది.
4.ఉమ్మడి ఉత్పత్తిసాధనాలున్న సమాజం ఉత్పత్తి. ఇక్కడ  అందరి వ్యక్తుల   శ్రమ శక్తీ సమాజపు శ్రమ శక్తి అనే  చైతన్యంతో అన్వయించ  బడుతుంది. రాబిన్సన్ శ్రమ కున్న లక్షణాలన్నీ ఇక్కడ పునరావృతమవుతాయి.అయితే ఒకొక తేడా ఉంది. అది వ్యక్తిగతం ,ఇది సామాజికం.రాబిన్సన్ ఉత్పత్తి చేసినదంతా పూర్తిగా అతని శ్రమ ఫలితమే,అతని వాడకం కోసమే. మన సమాజపు ఉత్పత్తిఉత్పత్తి అంతా సమాజపు ఉత్పత్తి. అందులో ఒక భాగం కొత్త ఉత్పత్తి సాధనాల కోసం, కనుక అది సామాజికం. అయితే మరొక భాగం సభ్యులు జీవనాదారసాధనాలుగా  వినియోగించు కుంటారు. కనుక ఈ భాగం పంపిణీ అవసరం.
పంపిణీ పధ్ధతి సమాజపు ఉత్పత్తి వ్యవస్థని బట్టీ, ఆ ఉత్పాదకుల చరిత్రకాభివ్రుద్ధి స్థాయిని బట్టీ మారుతుంటుంది.
జీవితావసర వస్తువుల్లో ప్రతి వాని వాటా  అతని శ్రమ కాలాన్ని బట్టి నిర్ణయమవుతుందని అనుకుందాం. అప్పుడు శ్రమకాలం ద్వంద్వ పాత్ర పోషిస్తుంది.జరగవలసిన భిన్న రకాల శ్రమల మధ్య  నిష్పత్తిని సమాజపు వివిధ అవసరాల నిష్పత్తి నీ  ఒక పద్ధతిప్రకారం జరిగే దాని విభజన నిర్వహిస్తుంది.
మరొకవైపు, ఉమ్మడి శ్రమలో ప్రతి వ్యక్తీ చేసిన భాగాన్ని కొలిచేందుకూ, వ్యక్తుల  వినియోగానికి కేటాయించిన ఉత్పాదితం మొత్తంలో అతని వాటా ఎంతో నిర్ణయించేందుకూ  ఉపకరిస్తుంది. వ్యష్టి ఉత్పత్తిదారుల శ్రమతోనూ, ఆ శ్రమ ఉత్పాదితాలతోనూ  వాళ్ళకున్న సామాజిక సంబంధాలు పూర్తిగా సరళ మైనవీ, తేలికగా తెలిసేవీ. ఉత్పత్తికి సంధించే కాదు, పంపిణీకి సంబంధించి కూడా.
మత  ప్రపంచం నిజ ప్రపంచానికి ప్రతిబింబం మాత్రమే.సరుకుల ఉత్పత్తి మీద ఆధారపడ్డ సమాజానికి –ఎందులో అయితే ఉత్పత్తిదారులు తమ ఉత్పాదితాలను సరుకులుగా, విలువలుగా చూడడం ద్వారా, ఒకరితో ఒకరు సంబందాల్లోకి వస్తారో ఆసమాజానికి, అంటే వాళ్ళ ప్రైవేట్ శ్రమని తేడాలేని మానవ శ్రమకి కుదిస్తారో అటువంటి సమాజానికి క్రైస్తవమతం, మరీ ప్రత్యేకించి దాని బూర్జువారూపాలైన  ప్రొటేస్టాంటిజం డీ యిజం మొదలైనవి- సరిగ్గా  సరిపోతాయి. ప్రాచీన ఆసియాటిక్  లాంటి పురాతన ఉత్పత్తి విధానాలలో ఉత్పాదితాలు సరుకులుగా మారడం అందుమూలంగా మనుషులు సరుకుల ఉత్పాదకులు గా మారడం ద్వితీయ స్థానంలో ఉండేది. ప్రాచీన గుంపు సమాజాలు  రద్దుకు చేరువవుతున్నకొద్దీ సరుకుల ఉత్పాదకులు గామారడం పెరిగింది. ప్రాచీన ప్రపంచంలో వ్యాపార జాతులు-ఇంటర్ మున్డియా లో ఉండే ఎపిక్యురస్ యొక్క దైవాల లాగానో, లేక పోలిష్ సమాజంలో మారుమూలల్లో  ఉండే యూదుల  లాగానో- అక్కడక్కడా అరుదుగా మాత్రమే ఉండేవి. ఆప్రాచీన సామాజిక ఉత్పత్తి వ్యవస్థలు ఎంతో  సరళమైనవి, పారదర్శకమైనవి. సులభంగా గ్రహించదానికి వీలైనవి. అవి ఆదిమగణ సమాజంలో మనిషి తన తోటివాళ్ళతో కలిపి ఉంచే  బొడ్డుతాడు కూడా ఊడిపోనప్పుడు, వ్యక్తిగతంగా అభివృద్ధి  పరిపక్వం చెందనప్పుడు  ఏర్పడ్డాయి. లేకపోతే, ప్రత్యక్ష బానిస సంబంధాల్లో ఏర్పడ్డాయి. శ్రమ ఉత్పాదకత తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, ఆకారణంగా,అందుకు తగినట్లుగా   మనిషికీ మనిషికీ మధ్య, మనిషికీ ప్రకృతికీ మధ్య సామాజిక సంబంధాలు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే  అవి ఏర్పడగలవు, మనుగడ సాగించ గలవు. ప్రాచీన కాలంలో ప్రకృతిని పూజించడంలోనూ, ప్రజల మతాలకు సంబంధించిన  ఇతర అంశాలలోనూ  ఈ సంకుచితత్వం ప్రతిబింబిస్తుంది.
నిజ ప్రపంచం యొక్క  మతప్రతిబింబం అదృశ్యం అవగలిగేది ఎప్పుడంటే, దైనందిన జీవితంలో ప్రకృతితోనూ, తోటి మనుషులతోనూ ఉండే ఆచరణాత్మక సంబంధాలు పూర్తిగా అర్ధం అయ్యేట్లుగానూ, తర్కబద్ధంగానూ ఉన్నప్పుడు మాత్రమే ఈమత ప్రతిబింబం అదృశ్యం అవుతుంది.
స్వేచ్చగా కలసిన మనుషులు చేసే ఉత్పత్తిగానూ, ఒక ప్లాన్  ప్రకారం వాళ్ళచే క్రమబద్ధం చెయ్యబడే వరకూ పాదార్ధిక ఉత్పత్తి ప్రక్రియమీద ఆధారపడ్డ సమాజపు జీవన ప్రక్రియ, దాని మార్మిక ముసుగుని తొలగించదు.
రాజకీయ అర్ధశాస్త్రం, అసంపూర్ణంగానే అయినప్పటికీ, విలువనీ, విలువ పరిమాణాన్నీ విశ్లేషించి ఆరూపాల వెనక దాగి ఉన్న దాన్ని కనుక్కున్నది. కాని సాంప్రదాయ అర్ధశాస్త్రం విలువలోకనబడే శ్రమకీ, ఉపయోగపు విలువలోకనబడే శ్రమకీ ఉన్న తేడాని పూర్తి  స్పృహతో, స్పష్టతతో  వ్యక్తం చెయ్యలేదు. అది దాని బలహీనతల్లో ఒకటి. అయితే ఆచరణలో తేడా చూచింది.ఎందుకంటే, శ్రమని ఒకసారి పరిమాణాత్మక అంశం గానూ, మరొకసారి గుణాత్మక అంశం గానూ చూసింది. అయితే వివిధ రకాల శ్రమల్నీకేవలం పరిమాణాత్మకంగా చూసేటప్పుడు, ఆశ్రమల ఏకత్వం ,లేక సమానత ఉంటుంది. ఆకారణంగా ఆశ్రమల్ని అనిర్దిష్ట మానవ శ్రమగా దింపడం అనే అర్ధం ఇమిడి ఉంది. అయితే ఆ అర్ధశాస్త్రానికి ఈ గ్రహింపు ఇసుమంతయినా లేదు.-కాపిటల్ 1.84 ఫుట్ నోట్.

శ్రమ ద్వంద్వ స్వభావం భావన వాళ్లకు లేదు.

రాజకీయ అర్ధశాస్త్రం శ్రమ  దాని ఉత్పాదితపు విలువ చేత ఎందుకు ప్రాతినిధ్యం వహించ బడుతుంది? శ్రమ కాలం  ఆవిలువ పరిమాణం చేత ఎందుకు ప్రాతినిధ్యం వహించ బడుతుంది? అనే ప్రశ్నలు సంధించు కోలేదు.
సరుకుల విశ్లేషణ ద్వారా,ప్రత్యేకించి సరుకుల విలువ విశ్లేషణ ద్వారా సంప్రదాయ అర్ధశాస్త్రం విలువ ఏ  రూపంలో మారకం విలువ అవుతుందో ఆరూపాన్ని కనుక్కోలేక పోయింది. ఆ శాఖకు అత్యుత్తం ప్రతినిధులైన స్మిత్ రికార్డోలు సైతం విలువ రూపాన్ని అప్రధాన విషయంగా, సరుకుల స్వతస్సిద్ధ స్వభావంతో సంబంధం లేని విషయంగా చూశారు.ఇందుకు కారణం  వారు విలువ పరిమాణం మీదనే ధ్యాసపెట్టడం ఒక్కటే కాదు. ఇంకా లోతయినది. శ్రమ ఉత్పాదితపు సరుకురూపం అత్యంత అనిర్దిష్ట మైనది. అంతేకాదు,బూర్జువా సమాజంలో ఉత్పాదితం   తీసుకునే సార్వత్రిక రూపం కూడా. విలువ రూపం ఆవుత్పత్తిని  ప్రత్యేక సామాజిక ఉత్పత్తి గా ముద్ర వేస్తుంది. ఆవిధంగా ఆవుత్పత్తికి దాని ప్రత్యేక చారిత్రిక స్వభావాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు ప్రతి సమాజానికి ఇదే ఉత్పత్తి విధానం శాశ్వతమైనది, ప్రకృతి సిద్ధమైనది అనుకున్నామంటే, విలువరూపపు విశిష్ట లక్షణాన్ని  (differentia specifica) పట్టించుకోము. తత్ఫలితంగా, సరుకు రూపపు విశిష్ట లక్షణాన్నీ పట్టించుకోము. సరుకు రూపపు పరిణామాలైన డబ్బు రూపం, పెట్టుబడి రూపం వగయిరాల విశిష్ట లక్షణాల్ని  పట్టించుకోము. ఆకారణంగా విలువ పరిమాణం కొలతకి శ్రమకాలాన్నిఅంగీకరించిన ఆర్దికవేత్తలే సాధారణ సమానకం యొక్క పరిపూర్ణ రూపం అయిన డబ్బు విషయంలో వింతైన, విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
సాంప్రదాయ అర్ధశాస్త్రం అంటే: విలియం పెట్టీ కాలం నించీ బూర్జువా సమాజంలో వాస్తవ ఉత్పత్తి సంబంధాల్ని పరిశోధించిన అర్ధశాస్త్రం. ఇది పైపైన కనబడే అంశాల్ని మాత్రమే చూసే అపభ్రంశ అర్ధ శాస్త్రానికి భిన్నమైనది.శాస్త్రీయ పరిశోధనలో తేలిన విషయాల్ని వదిలిపెట్టి, బూర్జువాల ఉపయోగార్ధం వివరణలు సమకూరుస్తుంది. బూర్జువాల అభిప్రాయాల్ని క్రమబద్ధం చేసి,శాశ్వత సత్యాలుగా ప్రకటిస్తుంది. ఈ పధ్ధతి సాంప్రదాయ అర్ధశాస్త్రం అవలంబించే పద్ధతికి వ్యతిరేకమైనది.     -కాపిటల్ 1.85 ఫుట్ నోట్

ఈ సూత్రీకరణలు ఒక సామాజిక వ్యవస్థ కి చెందుతాయి. ఏవ్యవస్తలో అయితే ఉత్పత్తి ప్రక్రియ మనిషి అదుపులో ఉండే బదులు  మనిషి మీద తనే పెత్తనం చేస్తుందో ఆ వ్యవస్థకి చెందుతాయి. ఈ సూత్రీకరణలు స్వయం స్పష్ట మైన ప్రకృతి విధించిన ఆవశ్యకత లాగా బూర్జువా మనస్సుకి కనబడుతుంది. అందువల్ల చర్చి ఫాదర్లు క్రైస్తవ మతానికి ముందున్న మతాల్నిఎలా చూశారో  అలాగే  బూర్జువా రూపానికి ముందటి సామాజిక ఉత్పత్తి రూపాల్ని బూర్జువాలు చూశారు.
ఈ ఆర్దికవేత్తలకి ఒకే ఒక పధ్ధతి ఉంది. వారికి రెండురకాల సంస్థలు ఉన్నాయి- సహజమైనవి, కృత్రిమమైనవి.భూస్వామ్యం సంస్తలు కృత్రిమమైనవి, బూర్జువా సంస్తలు సహజమైనవి. ఈ విషయంలో వీళ్ళు మతతత్వవేత్తల వంటి వారే. వాళ్లకి రెండు రకాల మతాలు ఉంటాయి. వాళ్ళది కాని మతం మనుషులు సృష్టించింది, వాళ్ళ మతం ఒక్కటే దైవ సృష్టి.-.-కాపిటల్ 1.85ఫుట్ నోట్2
************
సరుకుల్లో అంతర్గతంగా ఉన్న మార్మికత ఆర్ధిక వేత్తల్ని తప్పుదోవ పట్టించింది. వాళ్ళ మధ్య విసుగు పుట్టించేటంతగా వాదోపవాదాలు నడిచాయి.మారకం విలువ  ఒక వస్తువు మీద జరిగిన శ్రమ పరిమాణాన్ని వ్యక్తంచేసే నిర్దిష్ట సామాజిక సరళి మాత్రమే. ప్రకృతికి దానితో ప్రమేయం లేదు-మారకం నడకని (course ) నిర్ధారించే  విషయంలో లేనట్లే. సరుకుల్ని  నేరుగా మారకం కోసమే ఉత్పత్తిచేసే విధానం బూర్జువా ఉత్పత్తి యొక్క అత్యంత సాధారణ మైన రూపం,పిండ రూపం. అందువల్ల అది చరిత్ర తొలి కాలంలోనే కనబడుతుంది – ఈ రోజుల్లో వున్నంత ప్రబలమైన లక్షణాలతో లేనప్పటికీ. కనుక సరుకు మార్మిక స్వభావాన్ని గమనించడం ఇప్పటికంటే తేలిక.కాని, నిర్దిష్ట రూపాలకి వచ్చేసరికి ఈ సరళంగా కనబడడం కూడా పోతుంది.
డబ్బు వ్యవస్థకి సంబంధించిన భ్రమలు( illusions) ఎక్కడనుండి ఏర్పాడ్డాయి?డబ్బుగా వ్యవరించేటప్పుడు వెండి,బంగారాలు దానికి(డబ్బు వ్యవస్థకి) ఉత్పాదకుల మధ్య సామాజిక సంబంధాలకు ప్రాతినిధ్యం వహించవు, వింత సామాజిక ధర్మాలు కలిగిన ప్రాకృతిక  వస్తువులు మాత్రమే. ఆధునిక అర్ధశాస్త్రం డబ్బు వ్యవస్థని చిన్నచూపు చూస్తుంది. ఏవగించుకుంటుంది. అది పెట్టుబడిని చూసేటప్పుడు దాని మూఢ విశ్వాసం పట్ట పగల్లా,బట్టబయలు కావడంలేదా? కౌలు సమాజం నుంచి కాకుండా, నేల నించి వస్తుంది అనుకున్న ఫిజియోక్రాట్ల భ్రమని అర్ధశాస్త్రం వదిలించుకొని ఎంతకాలం అయింది?

ముందు జరగబోయే దాన్ని ఊహించకుండానే, సరుకు రూపానికి సంబంధించిన మరొక ఉదాహరణతో తృప్తి పడదాం. సరుకులే మాట్లాడ గలిగితే అవి ఇలా చెబుతాయి: మా ఉపయోగపు విలువ మనుషులకి ఆసక్తి కలిగిస్తే కలిగించవచ్చు.వస్తువులుగా అది మాలో భాగం కాదు.వస్తువులుగా మాకు సంబంధించింది మా  విలువే.సరుకులుగా మా మధ్య జరిగే చర్య దీన్ని ధృవపరుస్తుంది. మాలో ఒకదాని దృష్టికి మరొకటి మారకం విలువ తప్ప మరేమీ కాదు.
ఇప్పుడు సరుకులు ఆర్ధికవేత్త నోటితో ఏమి చెబుతాయో విందాం:
విలువ- (అంటే మారకం విలువ) వస్తువుల ధర్మం.
సంపద (riches అంటే ఉపయోగపు విలువ) మనిషి లక్షణం
విలువకి మారకాలతో సంబంధం ఉంటుంది. సంపదకి మారకాలతో సంబంధం ఉండదు.

ఒక మనిషి సంపన్నుడు,, ఒక సమాజం సంపన్నమైనది. ఒక ముత్యం ముత్యంగా విలువైనది. ఒక వజ్రం వజ్రంగా విలువైనది..అన్న  బెయిలీమాటలు ఉటంకించి మార్క్స్ ఇలా అంటాడు:
ఇప్పటిదాకా, ఏ రసాయనవేత్తా ముత్యంలోగానీ, వజ్రంలోగానీ మారకం విలువని  కనుక్కున్నది లేదు. ఈ రసాయన అంశాన్ని కనుక్కున్నామని  విమర్శనాత్మక పరిశోధనలో నిష్ణాతులుగా ప్రత్యేకించి చెప్పుకునే  ఆవిష్కర్తలు వస్తువుల ఉపయోగపు విలువ వాటి భౌతిక ధర్మాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా వాటికి ఉంటుందని కనుక్కున్నారు.: వా టి విలువ వస్తువులుగా వాటిలో భాగంగా  ఉంటుందని కనిపెట్టారు. వాళ్ళకున్న ఈ అభిప్రాయాన్ని ధృవపరిచే ఒక ప్రత్యేక పరిస్థితి  ఏదంటే, సరుకుల ఉపయోగపు విలువ మారకం లేకుండానే సఫలీకృతం అవుతుంది-వస్తువుకీ, మనిషికీ నేరు సంబంధం ద్వారా.
వాటి విలువ మారకంలో మాత్రమే, అంటే సామాజిక ప్రక్రియ ద్వారా మాత్రమే సాఫల్యం సాధిస్తుంది.
ఇక్కడ డాగ్ బెర్రీ తన పొరుగువాడయిన సీకోల్ కి చెప్పినదాన్ని గుర్తుచేసుకోకుండా ఎవరుండగలరు?
అతను అన్నది ఇది:నలుగురికీ ప్రేమాస్పదుడు కావడం అదృష్టం, చదవ గలగడం, రాయగలగడం స్వాభావికంగా వస్తుంది”.-అంటూ మార్క్స్ ముగిస్తాడు.

ఆవిధంగా మార్క్స్ సరుకుల మార్మికత ఏమిటో, దాని మూలాలేవో లోతుగా పరిశీలించి వివరిస్తాడు. శాస్త్రీయంగా పరిశోధన చేసిన సాంప్రదాయ ఆర్ధికవేత్తలు సైతం దీని నుండి  ఎందుకు తప్పించుకోలేక పోయారో తేల్చి చెప్పాడు.ఇక పెట్టుబడి దారీ విధానానికి సమర్ధనలు చేకూర్చడమే పనిగా పెట్టుకున్నబూర్జువా ఆర్ధికవేత్తలు మార్మికతకి ఎంతగా   అంటుకుపోయారో వివరంగా చెప్పాడు.
కుగల్ మన్ కి 1871 జులై 11న రాసిన ఉత్తరంలో ఇలా రాశాడు:
“మారకచర్య ప్రత్యక్షంగా ఉత్పాదితాల మధ్యా, పరోక్షంగా ఉత్పత్తిదారుల మధ్యా ఏర్పరచే సంబంధాల ద్వారా వ్యక్తి శ్రమ సామాజిక శ్రమలో భాగంగా నిర్ధారణ అవుతుంది.” సమాజం మొత్తం  శ్రమలో, కొంత  భాగం చేసే వ్యష్టి సరుకు ఉత్పాదకులు స్వతంత్రంగానూ, విడివిడిగానూ పనిచేస్తారు.అందువల్ల “ సామాజిక శ్రమ యొక్క పరస్పర సంబంధం వ్యష్టి శ్రమ ఉత్పాదితాల ప్రైవేటు మారకంలో వ్యక్తం అవుతుంది.”-
మారకం గురించి వచ్చే పోస్ట్ లో







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి