4, అక్టోబర్ 2017, బుధవారం

నిల్వగా డబ్బు(hoarding) -కాపిటల్ 1 వ భాగం

కాపిటల్ 1  వ భాగం
౩ వ అధ్యాయం
డబ్బు లేక సరుకుల చలామణీ
విభాగం 3- డబ్బు
A. నిల్వ (hoarding)
విలువ కొలమానంగానూ, చలామణీ మాధ్యమం గానూ పనిచేసే సరుకే డబ్బు. ఆ పనులు చేసే సరుకు బంగారం(లేక వెండి). అందువల్ల బంగారమే  (లేక వెండే) డబ్బు. అది బంగారం శరీరంతో దర్శనం ఇవ్వాల్సివచ్చినప్పుడు అది డబ్బుగా పనిచేస్తుంది. అప్పుడది డబ్బు సరుకు; నిజమైన బంగారం అక్కడ ఉండాలి.
బంగారం ఉండి తీరాల్సిన అవసరం లేని పరిస్థితులు  
1.డబ్బు విలువ కొలమానంగా పనిచేస్తుంది. అందుకు బంగారం అక్కడ ఉండాల్సిన పనిలేదు. ఊహాత్మకం మాత్రమే.
ఒక సరుకు విలువని డబ్బులో చెబితే అదే దాని ధర.అలా చెప్పడానికి డబ్బుగా ఉన్నలోహమేదో తెలిస్తే చాలు.అది బంగారమయితే, 100 కిలోల జొన్నల ధర 3 గ్రాముల బంగారం. అదే వెండి అయితే 80 గ్రాముల వెండి. ఇలా చెప్పడానికి ఆ డబ్బు చేతిలో ఉండక్కర్లేదు.అది ఉహాత్మకమైనది.
2. అలాగే బంగారం చలామణీ మాధ్యమం గాపనిచేస్తుంది. అయితే ఆచర్యలో ప్రతినిధులని పెట్టగలదు.
ఇక్కడ ఊహాత్మకం వీలవదు. కాని తానే అక్కడ ఉండాల్సిన పని లేదు. తనకు బదులుగా  చిహ్నాలని (tokens) పెట్టవచ్చు. అంటే, రాగి, నికెల్ లాంటి మరొక పదార్ధమో, కాగితం నోటో ఏదో ఒక టోకెన్. అయితే అది రాజ్యం జారీ చేసినది అయి ఉండాలి. అంతే.
ఈ రెండు సందర్భాలలో బంగారం ప్రత్యక్షంగా ఉండాల్సిన పనిలేదు. కాని అది బంగారం శరీరంతో దర్శనం ఇవ్వాల్సివచ్చినప్పుడు అది డబ్బు సరుకు; నిజమైన లోహ బంగారం అక్కడ ఉండాలి.
డబ్బు విలువయొక్క ఏకైక రూపం
తన చర్య తనే చేసినా, ప్రతినిధి ద్వారాచేసినా ఆ చర్య చెయ్యడం వల్ల డబ్బు విలువయొక్క ఏకైక రూపం అవుతుంది. మరోమాటల్లో చెబితే, ఉపయోగపు విలువకు భిన్నంగా, మారకం విలువ యొక్క  మనుగడ రూపంగా ఉంటుంది. అన్ని ఇతరసరకులూ కేవలం ఉపయోగపు విలువల పాత్ర మాత్రమే పోషిస్తాయి.
అది తనచర్య చేత విలువ యొక్క ఏకైక రూపంలోకి లోకి ఘనీభవించాల్సివచ్చినప్పుడు అది  డబ్బుగా పనిచేస్తుంది. అది ఆచర్యని స్వయంగా చేసినా,లేక ప్రతినిదిద్వారా చేసినా తేడా ఉండదు. ఆవిలువరూపం ఉపయోగపు విలువకు విరుద్ధమైన  మారకం విలువయొక్క తగిన మనుగడ రూపం. ఆరూపం అన్ని ఇతర సరుకుల చేతా  ప్రాతినిధ్యం వహించబడేది.
రెండు పనులూ చేస్తేనే డబ్బవుతుంది
విలువ కొలమానంగానూ, చలామణీ సాధనంగానూ రెంటి గానూ పనిచేసే సరుకే డబ్బు. సమాజం మొదట  విలువ కొలమానంగా పనిచేసే సరుకుగా బంగారానికి హోదా ఇచ్చింది. రెండో చర్యలో దానికి  ఆచరణలో చలామణీ సాధనంగా  పట్టం గట్టింది. ఆరెండు పనులూ చేసే బంగారమే  డబ్బయింది -ఇక మరో సామాజిక చర్యతో పనిలేకుండానే. మార్క్స్ కాలంలో ఈరెండు పనులూ చేసింది బంగారమే. అందువల్ల బంగారమే డబ్బు అని తేల్చాడు.
రెంటిలో ఒక్కపనే చేస్తే సరిపోదు  
మొదటి చర్య బంగారానికి సాధారణ సమానకం హోదా కల్పించడం. రెండో చర్య అదే లోహాన్ని చలామణీ సాధనంగా వాడడం. ఇవి రెండూ రెండు భిన్నమైన చర్యలు.రెంటి కలయిక ఒక కొత్త అంశాన్ని తెచ్చింది. వీటిలో ఏఒక్కటీ ఈ కొత్త అంశాన్ని తేలేదు, తేవడానికి సరిపోదు. ఇందుకు చరిత్ర నుంచి ఉదాహరణ ఇస్తాడు:
ఇంగ్లండ్ లో వెండి డబ్బు అవలేదు.ఎందుకంటే వెండి అక్కడ విలువ కొలమనంగా లేదు, చలామణీ సాధనంగా ప్రబలంగా లేదు. అలాగే హాలండ్ లో బంగారం విలువ కొలమానం స్థానం నించి  దిగిపోగానే డబ్బు హోదా పోయింది. ఇక డబ్బుగా ఉండడం నిలిచిపోయింది.
అందువల్ల రెండు చర్యల్లో ఒకటే జరిగితే అది డబ్బు కాలేదు. రెండు చర్యలూ జరగాలి. మూడో చర్య తో పనిలేదు.
విలువ ప్రమాణం చలామణీ సాధనం- రెంటి ఐక్యతే డబ్బు.-క్రిటిక్
అయితే అటువంటి ఐక్యత ఉన్న బంగారం ఈ రెండు చర్యలతోనూ సంబంధం లేని స్వతంత్ర మనుగడ కలిగి ఉంది. విలువ కొలమానంగా పనిచేసినప్పుడు వెండి బంగారాలు అక్కడ ఉండక్కరలేదు.
చలామణీ సాధనంగా పనిచేసినప్పుడు ప్రతినిధి ద్వారా నడిపించగలదు.ఈరెంటి ఐక్యతగా పనిచేసిప్పుడు మాత్రమే స్వయంగా (తనరూపంలో)బంగారం ఉండితీరాలి.-క్రిటిక్
ఇలా బంగారం అక్కడ ఉండాల్సిన చర్యలు ఉంటాయి. వాటిగురించి చర్చ తర్వాత ఉంటుంది.
A.నిల్వ (Hoarding)
అమ్మకాలూ కొనుగోళ్ళూ ఒకదాని వెంట ఒకటిగా ఎడతెగకుండా జరుగుతూ వుంటే, డబ్బు కూడా చలనంలో ఉండగలుగుతుంది. అయితే అమ్మకం జరిగిన వెంటనే కొనుగోలు జరగాలని  లేదు. ఈరూప రెంటికీ మధ్య కొంత కాలవ్యవధి ఉండవచ్చు.అటువంటి పరిస్తితిలో, అంటే అమ్మకం అవగానే కొనుగోలు జరగకపోతే, డబ్బు చలనం  ఆగిపోతుంది. ఫ్రెంచ్ ఆర్ధికవేత్త బోయిస్ గిల్లె బర్ట్  చెప్పినట్లు, అది చలన స్థితి నుంచి  నిశ్చలస్థితికి వస్తుంది, నాణెం స్థితి నుంచి డబ్బుస్థితికి మారిపోతుంది. ఈస్థితి మార్పు ఎందుకొస్తుంది?
నాణెం ప్రతి సరుకు ఓనర్ దగ్గరా కాసేపే ఉండి, మరొకరికి వెళుతుంది. ఆవిధంగా అది చలన స్థితిలో ఉంటుంది. ఎప్పుడైతే చలన స్థితి నుంచి నిశ్చలస్థితికి వస్తుందో అప్పుడు  అమ్మినవాని  దగ్గర కొంత కాలం కదలకుండా ఉంటుంది. అప్పుడు ఆనాణెం నాణెం గా ఉండదు. కేవలం డబ్బు స్థితికొస్తుంది.e
ఒక నాణెం పదిచలనాలు చేసినా పదకొండో చలనం జరగక పొతే, అప్పుడు ఆ నాణెం ఎవరి జేబులోవుందో వారి జేబులోనే ఉంటుంది. దాన్ని వీడదు.
తన సరుకులు అమ్మాక ఇతరుల సరుకులు కొనకుండా ఉంటేనే జేబులో ఉన్నదున్నట్లే డబ్బుండడం సాధ్యం.ఈ డబ్బు సరుకు యొక్క మారిన ఆకారం. సరుకు యొక్క బంగారం స్థితి(gold-chrysalis). సరుకులు ఆవిధంగా అమ్మి ఇతరుల సరుకులు కొనడానికి కాకుండా, సరుకుల రూపాన్ని డబ్బురూపంలోకి మార్చుకోడానికి అమ్మబడతాయి.ఈ రూపంమార్పు  సరుకుల చలామణీ జరగడానికి అవసరం, అనివార్యం. సరుకులు డబ్బురూపంపోందాక అంతటితో ఆగిపోతుంది. తాత్కాలిక డబ్బురూపం పరాదీనంకాగల రూపంగా ఉండదు. ఈ డబ్బు రూపమే లక్ష్యం అవుతుంది. డబ్బు నిల్వ (hoard) అవుతుంది. అమ్మినవాడు నిల్వచేసినవాడు’ (hoarder) అవుతాడు.
సరుకుల చలామణీ తోలి దశల్లో, మిగులు ఉపయోగపు విలువలు మాత్రమే డబ్బుగా మారాయి. ఆవిధంగా వెండి బంగారాలు superfluity కి, సంపదకి, సామాజిక వ్యక్తీకరణలు అయ్యాయి. పరిమితమైన గృహావసరాల కోసం  సంప్రదాయక ఉత్పత్తివిధానం కొనసాగిన ఆసమాజాల్లో ఈ రకం నిల్వ చెయ్యడం అనేది మొదలయింది, క్రమంగా  స్థిరపడింది. ఇది సహజమైనది, సరళమైనది. కావాలని చేసినది కాదు. ఆసియా, అందునా ప్రత్యేకించి ఈస్ట్ ఇండియా ప్రజలకు సంబంధించి జరిగిందదే.
ఒక దేశంలో ఉన్న వెండి బంగారాల పరిమాణాన్ని బట్టి ధరలు నిర్ణయమవుతాయి అని (తప్పుగా)ఊహించిన వాండర్ లింట్ ఒక ప్రశ్నవేసుకున్నాడు: ఇండియా సరుకులు ఎందువల్ల అంత చౌక? ఆయనే జవాబు చెప్పాడు: హిందువులు డబ్బుని పూడ్చిపెడతారు. అందువల్ల సరుకులు చౌక. దీనర్ధం: డబ్బులో కొంత పూడ్చి పెట్టిందువల్ల, తక్కువవుతాయి. ధరల్నినిర్ణయించేది వెండి బంగారాల పరిమాణం కనుక, అవితక్కువయ్యాయి కనుక ధరలు తగ్గుతాయి. ఇదీ ఆయన వాదన.దీన్ని మార్క్స్ ఇంతకుముందే ఖండించాడు. ఇక్కడ గమనించాల్సింది డబ్బుని నిల్వ చెయ్యడం అనే అలవాటు.
1602-1734 కాలంలో హిందువులు దిగుమతయిన 15 కోట్ల పోన్ల వెండి స్టెర్లింగుల్ని పాతిపెట్టారు. 1856-1866 కాలంలో అంటే పదేళ్ళలో తనకి ఆస్ట్రేలియా బంగారం మార్చగా ఇంగ్లండ్ కి వచ్చిన వెండిలో  చైనా ఇండియా లకి  12కోట్ల పౌండ్ల వెండిని ఎగుమతి చేసింది. చైనా కి ఎగుమతైన వెండిలో అత్యధిక భాగం ఇండియాకే చేరింది.
కూడ బెట్టడానికి కారణాలు
సరుకుల ఉత్పత్తి ఇంకా  పెరిగేకొద్దీ ప్రతి ఉత్పత్తిదారుడూ సరుకు ఉత్పత్తి చేసే సమయంలో  పోషణకూ, అనుకోని అవసరాలకూ  కొంత రిజర్వ్ ఉండాల్సి వస్తుంది.హామీగా కొంత డబ్బు అవసరమవుతుంది. అందుకు ఒత్తిడి పడుతుంది.  ‘ డబ్బు....ఒక హామీ’ అని  జాన్ బెల్లర్స్ తన 1699పుస్తకంలో మాటలు కోట్ చేస్తాడు ఫుట్ నోట్ లో.
ప్రతి ఉత్పత్తిదారుడికీ నిరంతరం అవసరాల ఒత్తిడి ఉంటుంది. అందుకోసం ఇతరుల సరుకులు కొనాల్సివస్తుంది. తన సరుకుల ఉత్పత్తికీ అమ్మకానికీ టైం పడుతుంది.ఎంత సమయం అనేది పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. తన సరుకులు అమ్మేదాకా అతను తనకు కావాల్సిన సరుకులు కొనలేడు. అమ్మకపోయినా కొనగలగాలి అంటే, అంతకు ముందు అమ్మినా, ఆడబ్బుబెట్టి ఇతరుల సరుకులు కొనకుండా ఉండి ఉండాలి. అప్పుడయితేనే  అతనిదగ్గర డబ్బు ఉంటుంది. దాంతో కొనగలడు- అప్పుడు అమ్మకపోయినా.
ప్రతిచోటా వ్యక్తులు కూడబెట్టాలనే లక్ష్యంతో ఉంటారు. మరి ఈ నిల్వలు ఎలా సాధ్యం?
ప్రతివాడూ కొనకుండానే ఎలా అమ్మగలుగుతాడు? సాధారణ స్థాయిలో జరిగే ఈచర్యలో ఒక వైరుధ్యం ఉన్నట్లు కనబడుతుంది. కాని అమూల్యలోహాలు అవి ఉత్పత్తయిన చోట నేరుగా ఇతరసరుకులతో మారకం అయివున్నాయి. ఇక్కడ సరుకుల ఉత్పత్తిదారుల అమ్మకాలు ఉన్నాయి, వెండి బంగారాల ఓనర్లవైపునుండి కొనుగోళ్ళు లేకుండానే.( ఫుట్ నోట్ లో దీని వివరణ ఉంది: అమ్మకం అన్నప్పుడు వెండిబంగారాలు అప్పటికే సరుకుల పరివర్తిత/మారిన రూపం అనే అర్ధం అందులో ఇమిడి ఉంది. అంటే అప్పటికే అమ్మినదాని బదులు వచ్చినదని. బంగారం ఉత్పత్తయిన చోట ఉన్న బంగారంతో సరుకులు మారకం అయితే, అది కొనుగోలు కాదు. సరుకుల ఉత్పత్తిదారులు వాళ్ళ సరుకులు అమ్ముకున్నట్లే. వచ్చిన డబ్బుతో ఇతర సరుకులు కొన్నప్పుడు అది కొనుగోలు.ఎందుకంటే, ఆ బంగారం అతని సరుకులు అమ్మగా వచ్చినది, అతని సరుకుల మారిన రూపం.)
ఇతర ఉత్పత్తిదారులు తర్వాత కొనుగోళ్ళు  చెయ్యకుండా జరిపే అమ్మకాలు కొత్తగా ఉత్పత్తయిన అమూల్య లోహాల్నిసరుకుల ఉత్పత్తిదారులందరి మధ్యా పంపిణీ చేస్తుంది. ఈవిధంగా మారకమార్గం పొడవునా వివిధ స్థాయిల్లో వెండి బంగారు నిల్వలు పోగుపడతాయి. ఒక ప్రత్యేక సరుకు (బంగారం)రూపంలో మారకం విలువని నిల్వగా అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. ఈ అవకాశం నుంచి బంగారం పట్ల అత్యాశ పుడుతుంది. చలామణీ విస్తరణతో పాటు, డబ్బు శక్తి ఎక్కువవుతుంది. డబ్బనేది రెడీగా ఉపయోగించగలిగిన ఎప్పుడుబడితే అప్పుడు ఉపయోగపడే సంపద యొక్క సామాజిక రూపం. 1503 లోనే కొలంబస్ జమైకా నుండి రాసిన ఉత్తరంలో ఇలా అంటాడు: బంగారం అద్భుతమైనది. అది ఉన్న వాడు అతను కోరుకున్నవాతన్నిటికీ ప్రభువు. బంగారంబెట్టి ఆత్మల్నిసైతం స్వర్గానికి పంపగలడు.
ఏసరుకు బంగారం లోకి మారి, ఆబంగారం వచ్చిందో అది చెప్పాడు. కనుక ప్రతిదీ సరుకైనదీ, కానిదీ ఏదైనా బంగారం లోకి మారగలదు. ప్రతిదీ అమ్మేందుకూ, కొనేందుకూ వీలయినదే అవుతుంది. చలామణీ అనేది  అలాచేయగల పెద్దగుండం అవుతుంది. ప్రతిదీ అందులోకి విసరబడి, తిరిగి బంగారం గుళికగా బయటకొస్తుంది. ఈ అల్కెమీని* తట్టుకోగలిగినదంటూ ఏదీ లేదు; సాధువుల ఎముకలు కూడా తట్టుకొని నిలవలేవు. ఇక అంతకన్నా సున్నితమైన, మానవ వర్తకానికి అతీతమైన పవిత్ర వస్తువులు సరే, అసలు తట్టుకోలేవు.
*ఒక పదార్ధాన్ని మరొక పదార్ధంలోకి మార్చడమే ఆల్కెమీ.చౌక లోహాల్ని అమూల్య లోహాలుగా ముఖ్యంగా బంగారంలోకి మార్చడమే లక్ష్యం. మారకంలో ఎదైనాసరే బంగారమై తిరిగిరావలసిందే
ఫ్రెంచ్  రాజు మూడో హెన్రీ పురాతన మత మందిరాలలో ఉన్న స్మారక చిహ్నాలని కొల్లగొట్టి డబ్బులోకి మార్చుకున్నాడు.  గ్ర్రీసు చరిత్రలో ఫోషియన్లు చేసిన  డెల్ఫీ ఆలయ ధ్వంసం గురించి తెలిసిందే. ఫోషియన్లు పవిత్రభూమిని సాగు చేసారని క్రీ.పూ. 357 లో థీబ్స్ దేశం వారిపై భారీ ఫైన్ వేసింది. అయితే ఫోషియన్లు దాన్ని చెల్లించకుండా ఏథెన్స్ తో కలిసి  యుద్ధానికి తలపడ్డారు. డెల్ఫీ లోని అపొల్లో దేవాలయాన్ని స్వాధీనం చేసుకుని అక్కడి నిధుల్ని సైనికావసరాలకు వినియోగించారు.
సరుకుల గుణాత్మక వ్యత్యాసాలలో ప్రతిదీ, డబ్బులో అంతం అవుతుంది. అలాగే  డబ్బు ఒక పెద్ద సమవాదిగా (leveller) అన్ని తేడాలనూ అంతరింప చేస్తుంది: షేక్స్పియర్ నాటకం Timon of Athens(Act 4, Scene 3)  లోని ఈ మాటలు ఈవిషయాన్ని వివరిస్తాయి:
బంగారం? పసిమితో మెరిసిపోయే అమూల్యమైన బంగారం?
ఈమాత్రం బంగారం నలుపుని తెలుపు చేస్తుంది
తప్పుని ఒప్పు చేస్తుంది
తుచ్చమైనదాన్ని ఉత్తమమైనదిగా చేస్తుంది
ముదుసలిని యువకుడిగా చేస్తుంది
పిరికిపందని సాహసిని చేస్తుంది.....
ఈ పసుప్పచ్చని బానిస మతాల్ని కలుపుతుంది, బద్దలుకొడుతుంది
శాపగ్రస్తుల్ని దీవిస్తుంది
దొంగలకి బిరుదులూ,పాదనమస్కారాలూ, పొగడ్తలూ వచ్చేట్లు చేస్తుంది........
డబ్బుని ప్రాచీన సమాజం చెడ్డదిగా, చెడగొట్టేదిగా భావించింది.
అయితే డబ్బనేదే ఒక సరుకు. బయట ఉండే వస్తువు.కనుక అది ఏ వ్యక్తికైనా ప్రైవేట్ ఆస్థిగా ఉండగలదు. ఆవిధంగా సామాజిక శక్తి  ప్రైవేట్ వ్యక్తుల ప్రైవేట్ శక్తి అవుతుంది. ప్రాచీన సమాజం డబ్బుని ఆర్ధిక, నైతిక వ్యవస్థని చెడగొడుతుంది అని తెగనాడింది. ఉదాహరణకి,
ఏదీ డబ్బంత చెడ్డది కాదు.
అది నగరాల్ని కూలుస్తుంది.
మనుషుల్నివాళ్ళ వాళ్ళ  ఇళ్లనుంచి బయటకు వెళ్ళకొడుతుంది.
నిజాయతీ పరుల్ని సిగ్గుపడే పనులు చేసేట్లు తర్ఫీదిస్తుంది.
విలన్లు చేసేపనులు జనానికి  అలవాటు అయ్యేట్లుగా నేర్పుతుంది...... (గ్రీకు నాటక కర్త సోఫోక్లిస్ –ఏంటిగనీ నాటకంలో )
ఇందుకు భిన్నంగా  ఆధునిక సమాజం డబ్బుకోసం పరితపిస్తుంది
అయితే ఆధునిక సమాజం పసివయస్సులోనే భూగర్భం నుండి ప్లూటస్ ని జుట్టుబట్టుకొని బయటకి లాగింది. ప్లూటస్ ని రోమన్లు’ధనం ఇచ్చే దేముడి’ గా భావిస్తారు.  అత్యాశ భూగర్భంలోనించి ప్లూటో నే(ప్లూటస్ అని జర్మన్ మూలంలో ఉంది) బయటకి లాగాలని ఆశిస్తుంది.( అన్నాడు Athenaeus  అనే గ్రీకు వ్యాకర్త. అతను 2 వ శతాబ్ది చివర 3 వ శతాబ్ది మొదట జీవించాడు)
బంగారాన్ని Holy Grail గా ఆహ్వానం పలికింది. హోలీ గ్రెయిల్ అనేది శిలువ వేయబడిన జీసస్ నెత్తురు పట్టిన పాత్ర. ఆయన చివరిగా (last supper)అందులో తిన్నాడు. జీసస్ శరీరాన్ని పెట్టడానికి సమాధిని ఇచ్చిన జోసఫ్ (Joseph of Arimathea) కి ఇవ్వబడింది. ఆ నెత్తురుకి అన్ని గాయాలనూ మాన్చే శక్తి ఉంది అని మతస్తుల విశ్వాసం. దానికోసం Arthur's knights వెదికారు. కాని ఎక్కువమంది గాయాలతో తిరిగి వచ్చారు. హోలీ గ్రెయిల్ కోసం వీరులు చేసినట్లే, బంగారం కోసం ఆధునిక సమాజం విశ్వప్రయత్నం చేస్తున్నది. ధనార్జనే దాని జీవిత పరమార్ధం.
ఉపయోగపు విలువగా ఒక సరుకు ఒక ప్రత్యేక కోరికని తీరుస్తుంది. అది భౌతిక సంపదలో ఒక మౌలిక అంశం (element). అది దాని ఓనర్ యొక్క సామాజిక సంపద ఎంతో కొలుస్తుంది. ఒక ఆటవిక సరుకుల ఓనర్ కి, పశ్చిమ ఐరోపా రైతుకి కూడా విలువ అనేది విలువ రూపం ఎలాంటిదో అలాంటిదే.
అందువల్ల వెండి బంగారాల నిల్వ పెరుగుదల  అంటే అతనికి విలువ పెరుగుదలే. డబ్బు విలువ మారేది నిజమే; ఒకసారి దాని సొంత విలువలో మార్పు ఫలితంగా డబ్బు విలువ మారుతుంది. మరొకసారి ఇతర సరుకుల విలువల్లో మార్పు వల్ల డబ్బువిలువ మారుతుంది. అయితే ఈపరిస్థితి 100ఔన్సుల బంగారంలో కన్నా  200 ఔన్సుల బంగారంలొ ఎక్కువ విలువ ఉండడాన్నినివారించలేదు; మరొకవైపు, అన్ని ఇతర సరుకులయొక్క సార్వత్రిక సమానకంగా దాని లోహ రూపం కొనసాగడాన్ని, మానవ శ్రమ యొక్క తక్షణ సామాజిక అవతారంగా కొనసాగడాన్ని నిరోధించజాలదు.
కూడబెట్టాలనే కోరిక ఆరేదీ, తీరేదీ కాదు.
దాని స్వభావమే అంత. గుణాత్మక అంశంలో డబ్బు సామర్ధ్యానికి అవధులు లేవు. పాదార్ధిక సంపదకు అది సార్వత్రిక ప్రతినిధి. ఎందువల్లనంటే, డబ్బు ఎసరుకుతోనైనా నేరుగా మారగలదు కాబట్టి. అయితే అదే సమయంలో, ఎంత మొత్తం వాస్తవ డబ్బయినా పరిమితమైనదే. ఒక పరిమితి ఉన్నదే. కనుక కొనుగోలు సాధనంగా పరిమిత సామర్ధ్యం మాత్రమే ఉంటుంది.
50 వేల రూపాయలకు ఒక మోటార్ సైకిల్ వస్తుంది. ఆమొత్తానికి కారు రాదు. 3 లక్షలన్నా కావాలి. ఆమొత్తం 50 వేలకన్నా ఎక్కువే.కాని అదీ పరిమితమయినదే. దానికి విమానం రాదు. కొన్ని కోట్లవుతుంది. పెద్దమొత్తమే అయినా అదీ పరిమితమైనదే. దానికి మిసైల్ రాదు. అది ఎంత మొత్తమైనా కావచ్చుగాక, అది పరిమితమైనదే. డబ్బుకున్న పరిమాణాత్మక పరిమితులకీ, దాని గుణాత్మక అపరిమితికీ ఉన్న వైరుధ్యం కూడబెట్టేటందుకు విశ్రాంతి లేకుండా సిసిఫస్* లాగా శ్రమ చేసేట్లు ప్రేరేపిస్తుంది. అందుకు ప్రోత్సాహకంగా పనిచేస్తుంది. దండయాత్రచేసి గెలిచినవాడు (conqueror) దేశాల్ని కలుపుకుంటాడు. అతని రాజ్యం సరిహద్దులు మారతాయి. అంతటితో ఆగడు. ఆముందున్న దేశాన్ని జయించాలనుకుంటాడు. అలా గెలిచి, ఆక్రమించుకున్న దేశం సరిహద్దు తనదే. అక్కడ నిలబడి అవతల దేశం సరిహద్దుని,  ఇంకొక కొత్త సరిహద్దుని మాత్రమే చూస్తాడు. వేరేమీ చూడడు. అలాగే నిల్వదారుడు కూడా. ముందు కోటి. కూడినాక మరొక హద్దు. 10కోట్లు. తర్వాత 100కోట్లు.లక్ష కోట్లు ఇలా ఒకదాని తర్వాత మరొక హద్దు. ఆహద్దులు పరిమితులు లేనివి. అంతూపొంతూ లేనివి.
* సిసిఫస్ – గ్రీకు పురాణాల్లో కోరింథ్ రాజు. మోసగాడు. అబద్ధాలకోరు. అతిధుల్నీ, పర్యాటకుల్నీ ఆదరించకపోగా, చంపుతాడు. జినియా (xenia) ని అతిక్రమించాడు. అతిధి పట్ల స్నేహం అని జినియా కి అర్ధం.  వచ్చిన వాళ్ళని స్నేహితుల్లాగా ఆప్యాయంగా చూడాలి. దీన్ని అమలయ్యేట్లు చూసే బాధ్యత జీయస్ (Zeus)ది. అదే కాక ఎన్నో తప్పులు చేస్తాడు. అప్పుడు జీయస్ ఒక పెద్ద బండని కొండ పైచివరకి తోసుకెళ్ళమని శిక్ష వేస్తాడు. శిఖరానికి నెట్టగానే దొర్లుతూవచ్చి కింద పడుతుంది. మళ్ళీ కష్టపడి పైకి నేడతాడు. మళ్ళీ కిందికి దొర్లుతుంది. అతని శ్రమ అలాగే ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది.
అలాగే నిల్వదారుడు కూడా జీవితాంతం కూడబెడుతూనే ఉంటాడు. శ్రమ పడుతూనే ఉంటాడు. అతని ఆశ అంతులేనిది. ఎప్పటికీ తీరేది కాదు.
నిల్వ చెయ్యాలంటే
డబ్బుగా బంగారాన్ని నిల్వ ఉంచాలంటే, దాన్నిచలామణీలోకి రాకుండా ఆపాలి.అనుభోగ వస్తువుగా మారకుండా చూడాలి. అంటే ఆభరణాలుగానో, మరొక రకంగానో మార్చకుండా ఉండాలి. చలామణీ లొ ఉన్నా, అనుభోగ వస్తువుగా ఉన్నా అది నిల్వ కాదు. అందువల్ల నిల్వదారుడు తన శరీర కోర్కెల్ని త్యాగం చేస్తాడు- బంగారాన్ని ఆరాధించడం ధ్యేయంగా పెట్టుకుంటాడు. వైరాగ్య బోధలకు తగినట్లు నడుచుకుంటాడు. మరొకపక్క, చలామణీలో అతను సరుకుల రూపంలో పెట్టిన దాని కంటే, చలామణీ నుండి ఎక్కువ తిరిగి తీసుకోలేడు. ఎక్కువ ఉత్పత్తి చేస్తే, ఎక్కువ అమ్ముతాడు. అందువల్ల కఠోర శ్రమ, పొదుపు, అత్యాశ – ఇవి మూడూ అతని ముఖ్య సుగుణాలు. ఎక్కువ అమ్మడమూ,తక్కువ కొనడమూ – అతని ఆర్దికవిధానసారం.
వెర్రీ మాటలు కోట్ చేస్తాడిక్కడ: అర్ధశాస్త్ర చర్యలన్నీ తిరిగే ఇరుసులు ఇవి: ప్రతి సరుకు అమ్మేవాళ్ళ సంఖ్యని సాధ్యమైనంతగా పెంచడం, కొనేవాళ్ళ సంఖ్యని సాధ్యమైనంతగా తగ్గించడం.
వెండి బంగారు ప్రత్యక్ష నిల్వ రూపంలో ఉండడంతో పాటు, వెండి బంగారాలతో చేసిన కళాత్మక, సౌందర్యాత్మక వస్తువుల రూపంలో కూడా ఉంటాయి. పౌరసమాజపు సంపద పెరిగేకొద్దీ ఇది పెరుగుతుంది.
‘మనం సంపన్నుల మవుదాం, లేదా సంపన్నులుగా కనపడదాం’ –డిడెరాట్ ఈవిధంగా ఒకవైపు బంగారానికి నిరంతరంపెరిగే మార్కెట్ ఏర్పడుతుంది. ఇది డబ్బుగా బంగారం చర్యతో సంబంధం లేనిది. స్వతంత్రమైనది. మరొకవైపు, ద్రవ్య సరఫరాకి బయటకు కనపడని వనరు ఏర్పడుతుంది. ఈ వనరు ప్రత్యేకించి సంక్షోభసమయాల్లోనూ, సామాజిక కల్లోల కాలాల్లోనూ ఆశ్రయించబడుతుంది.
నిల్వచెయ్యడంవల్ల  ప్రయోజనాలు
లోహ చలామణీ ఉండే ఆర్ధిక వ్యవస్థలో నిల్వచెయ్యడంవల్ల  వివిధ ప్రయోజనాలు ఉంటాయి.
దాని మొదటిచర్య  వెండి, బంగారు నాణేల చలనం ఏ పరిస్థితులకు  లోబడుతుందో, ఆ పరిస్థితుల నుండి తలెత్తుతుంది. సరుకుల చలామణీ విస్తృతీ వేగాల్లోనూ, సరుకుల ధరలలోనూ అవిశ్రాంతంగా వచ్చే హెచ్చుతగ్గులతో పాటు, డబ్బు పరిమాణం కూడా ఎలా  అవిరామంగా పెరుగుతూ, తగ్గుతూ ఉంటుందో మనకు తెలిసిందే. అందువల్ల  డబ్బు మొత్తం పెరగడానికీ, తగ్గడానికీ తగినట్లు ఉండి తీరాలి. ఒకసమయంలో చలామణీ నాణెంగా వ్యవహరించడానికి డబ్బు ఆకర్షించబడాలి, మరొక సమయంలో ఎంతోకొంత కదలికలేని డబ్బుగా వ్యవహరించడానికి చలామణీ నాణెం వికర్షించ బడాలి. అంటే చలామణీ నుండి గెంటివేయ బడాలి.
వాస్తవంగా చలనంలో ఉన్న డబ్బు మొత్తం చలామణీ యొక్క ఇముడ్చుకునే శక్తికి అనుగుణంగా ఉందాలంటే, నాణెం గా అవసరమైన వెండిబంగారాల మొత్తం కంటే దేశంలో మరింత ఉండడం అవసరం. డబ్బు నిల్వ రూపం పొందడం ద్వారా ఈ షరతు నెరవేరుతుంది. చలామణీ లోకి డబ్బుని  సరఫరా చెయ్యడానికీ, అలాగే చలామణీ నుండి డబ్బుని ఉపసంహరించడానికీ ఈనిల్వలు కాల్వలుగా ఉపకరిస్తాయి. ఆవిధంగా చలామణీ గట్టు దాటి ఎప్పటికీ పొంగి పోర్లిపోదు.    
ఒక దేశం వ్యాపార నిర్వహణకి కొంత మొత్తంలో డబ్బు ఉండాలి; అది పరిస్థితుల్ని బట్టి ఒకప్పుడు ఎక్కువ ఉండాలి, మరొకప్పుడు తక్కువ ఉండాలి. డబ్బు ఎక్కువకావడం, తక్కువ కావడం అనేది దానికదే సర్దుబాటవుతుంది. రాజకీయ వేత్తల సహాయం/ జోక్యం అవసరముండదు.  డబ్బు కొరవపడితే బులియన్ కాయన్ గా ముద్రించ బడుతుంది/అవుతుంది. బులియన్ కొరవ ఏర్పడితే, నాణేలు కరిగించ బడతాయి (Sir D. North).
ఈస్ట్ ఇండియా కంపెనీలో చాలా కాలం అధికారిగా పనిచేసిన జాన్ స్టువర్ట్ మిల్ ఒక విషయం చెప్పాడు: ఇండియాలో ఇప్పటికీ వెండి ఆభరణాలు నిల్వలు చేసే చర్యలు చేస్తున్నాయి. వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వెండి నగలు బయటకు తేబడి నాణేలుగా ముద్రించబడేవి. వడ్డీ రేటు పడిపోతే తిరిగి ఆనాణేలు నగలయ్యేవి. (J. S. Mill‘s Evidence ―Reports on Bank Acts,‖ 1857, 2084.)
ఇండియాలో వెండి బంగారాల ఎగుమతి దిగుమతుల గురించి 1864 పార్లమెంటరీ పత్రం ప్రకారం,
1863 లో వాటి దిగుమతి ఎగుమతి కన్నా 19,367,764 పౌండ్లు ఎక్కువయింది. 1864 ని ఆనుకొని  ముందున్న8 ఏళ్లలో మొత్తం వెండి బంగారాల ఎగుమతుల కంటే దిగుమతులు 109,652,917 పౌండ్లు ఎక్కువ. ఈ శతాబ్దంలో ఇండియా 200,000,000 పౌండ్ల ను మించి నాణేలు ముద్రించింది.
ఆవిధంగా సిద్ధాంతపరంగా చూపిన ప్రతిదానికీ మార్క్స్ చారిత్రక దృష్టాంతాల్ని చూపించాడు.
చెల్లింపు సాధనంగా డబ్బు గురించి వచ్చే పోస్ట్ లో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి