27, సెప్టెంబర్ 2017, బుధవారం

C. నాణెమూ, విలువ చిహ్నాలూ

C.నాణెమూ, విలువ చిహ్నాలూ
కాపిటల్ 1  వ భాగం
౩ వ అధ్యాయం
2వ విభాగం - చలామణీ మాధ్యమం
డబ్బు లేక సరుకుల చలామణీ
C. నాణెమూ, విలువ చిహ్నాలూ
సరుకుల ధరల నిర్ణయంలో బంగారం ప్రత్యక్షంగా ఉండక్కరలేదు. సరుకుల ధరలకు ఊహాత్మక బంగారం బరువు ప్రతినిధిగా ఉంటుంది.  మార్కెట్లో ఏసరుకు కొనాలన్నా డబ్బుసరుకు  కావాలి. ఆడబ్బు సరుకు బంగారం. మార్క్స్ కాలంలో అది బంగారం లేక వెండి. మూడో ఆధ్యాయం ఆరంభం లోనే ఈ పుస్తకం అంతటా బంగారాన్ని డబ్బు సరుకుగా భావిస్తాను అని చెప్పాడు.
చలామణీలో నాణేలు తప్పనిసరి
చలామణీ సాధనంగా ఉండేటప్పుడు  నిజమైన బంగారం అక్కడ ఉండాల్సిందే. చలామణీలో ఉండే బంగారం వేర్వేరుపరిమాణాల్లో ఉండే బంగారం ముక్కలుగా ఉంటుంది. ఆముక్కలు నాణేలరూపంలో ఉంటాయి. నిర్దిష్ట ఆకారంతో, నిర్దిష్ట బరువుతో ఉండే  బంగారం ముక్కలే నాణేలు.1792లో డాలర్ వెండి నాణెం. బరువు 27గ్రాములు. 1834లో డాలర్ బంగారు నాణెం బరువు 1.5048 గ్రాములు. పౌండ్ స్టెర్లింగ్ 7.98 గ్రాములు బరువుండే బంగారు నాణెం. 1862 లో వెండి రూపాయి వచ్చింది. దాని బరువు 11.66 గ్రాములు. నాణ్యత 0.917. నాణెం వ్యాసం 30.5 మి.మీ. గుండ్రని ఆకారం. 1939 లో నాణ్యత తగ్గించారు. 1947లో వెండి బదులు నికెల్ నాణేలు ముద్రించారు.
తొలి నాణేలు లిడియా దేశానివి.క్రీ.పూ. 7వ శతాబ్దానికి చెందినవి. వెండి బంగారం మిశ్రమలోహం(ఎలెక్ట్రం)తో చేసినవి. పెద్దనాణెం బరువు 4.7గ్రాములు(Stater లోమూడోవంతు). పేరు ట్రైట్ (Trite) చిన్న చిన్న నాణేలూ ఉన్నాయి.stater ఆరోవంతు, పన్నెండో వంతు నించి 96వ వంతుదాకా ఉన్నాయి.
ఏ దేశంలో నయినా ఎక్కువ విలువగల నాణేలతోపాటు కొద్దివిలువలున్నవి కూడా ఉంటాయి. దశాంశ విధానం అమలుకు ముందు ఇంగ్లండ్ లో అతి తక్కువ విలువగల నాణెం ఫార్తింగ్. 4 ఫార్తింగుల నాణెం పెన్నీ. 12 పెన్నీల నాణెం షిల్లింగ్. 2 షిల్లింగుల నాణెం ఫ్లానిన్. అయిదు షిల్లింగుల నాణెం క్రౌన్. 20 షిల్లింగుల నాణెం పౌండ్ (సావరిన్) .21 షిల్లింగుల నాణెం గ్వినియా. పౌండ్ లో ఫార్తింగ్ 960 వ వంతు.
గతంలో ఇండియాలో రూపాయి, అర్ధరూపాయి, పావలా, బేడా, అణా అర్ధణా, కానీ, దమ్మిడీ/పైసా. అతి తక్కువ విలువైనది పైసా. 2 పైసలు అర్ధణా. 4 పైసలు అణా. రెండు అణాలు బేడ. నాలుగు అణాలు పావలా. రెండు పావలాలు అర్ధరూపాయి. 2 అర్ధరూపాయలు ఒక రూపాయి. బేడ,అర్ధణా నలచదరంగా ఉండేవి. మిగిలినవి గుండ్రంగా ఉండేవి. మధ్యలో చిల్లి ఉన్న కానీ లుండేవి. వాటిని పిల్లలు మొలతాడులో కట్టుకునేవాళ్ళు కూడా. అతి చిన్నది దమ్మిడీ.అది  రూపాయిలో 192 వ వంతు. దేశం మారితే నాణేల పేర్లూ,వాటి బరువులూ ఆకారాలూ మారతాయి. చలామణీలో ఆప్రాంత నాణేలు ఉండి తీరాల్సిందే.

నాణేల ముద్రణ కూడా రాజ్యం పనే.
నాణేలు ముద్రించే విశిష్టాధికారం రాజ్యానిదే. ధరల ప్రమాణం ఏర్పాటు లాగానే నాణేల ఏర్పాటు కూడా రాజ్యం పనే. ఫలానింత బంగారం ఒక డాలర్ అని చట్టం చెబితేనే సరిపోదు. అది చలామణీ కోసం రెడీగా ఉండాలి. అంటే అది  ముద్రణ అయి ఉండాలి. అంటే, రాజ్యం రెండు చర్యలు చేస్తుంది
1.ధరల ప్రమాణాన్ని ఏర్పరచడం. ఈ ఏర్పాటు ఒక డబ్బు యూనిట్ ఎంత బంగారానికి ప్రతినిధిగా ఉంటుందో చెబుతుంది. ఉదాహరణకి 1834లో డాలర్ బంగారు నాణెం బరువు 1.5048 గ్రాములు. 1792లో డాలర్ వెండి నాణెం. బరువు 27గ్రాములు.
2. బంగారాన్ని నాణేలు గా ముద్రిస్తుంది. యూనిట్ల పేరుతో బంగారాన్ని నాణేలుగా మారుస్తుంది.
వేర్వేరు దేశాలు వేర్వేరు నాణేల్నిఉపయోగించాయి.కారణం వేర్వేరు ధరల ప్రమాణాలు ఉండడమే. అంతర్జాతీయ బదిలీలకి, ఈ నాణేల్ని బులియన్లోకి కరగించ వలసిందే.
 సంపదపెరిగేకొద్దీ తక్కువ విలువగల లోహాలు పోయి వాటిస్థానంలో మరింత విలువగల లోహాలు నాణేలుగా వచ్చాయి. వెండి రాగిని తొలగించింది. వెండిని బంగారం తోసివేసింది. ఒకప్పుడు పౌండ్ అనేది ఒక పౌను వెండికి పెట్టిన డబ్బు పేరు. బంగారం వెండిని తొలగించగానే, పౌనులో 15 వ వంతు బంగారానికి అదే పేరు కొనసాగింది. అది బంగారం వెండి విలువల  నిష్పత్తిని బట్టి ఏర్పడింది. డబ్బు పేరుగా పౌండ్, బంగారం బరువు పేరుగా పౌండ్ వేరువేరు విషయాలయ్యాయి.
100 పౌన్ల  22 కేరెట్ల బంగారానికి 4672½ బంగారు సావరిన్లోస్తాయి. రెంటినీ త్రాసు సిబ్బెల్లో పెడితే తూకం సమంగా వుంటుంది. దీన్నిబట్టి సావరిన్ అనేది నిర్దిష్ట ఆకృతి, ముద్ర ఉన్న  బంగారం పరిమాణం మాత్రమే.-అని రుజువవుతుంది.- క్రిటిక్
నాణేలు స్థానికంగా మాత్రమే చెల్లుతాయి. సార్వత్రికంగా చెల్లవు.

నాణేలధర నిర్దారించడమూ, వాటిని ముద్రించడమూ రాజ్యం చేతిలో ఉంటుంది. ముద్రిత నాణెం స్థానిక, రాజకీయ స్వభావంతో ఉంటుంది. భిన్న జాతీయ భాషల్ని వాడుతుంది. భిన్న జాతీయ యూనోఫాం లను ధరిస్తుంది. ప్రపంచామార్కెట్లో ఆయూనిఫాంలను విప్పేస్తుంది. ఇంగ్లాండ్ లో నాణెం పౌండ్ స్టెర్లింగ్ అనే యూనిఫాం ధరిస్తుంది. అది ఇంగ్లండ్ ఎల్లల లోపల చెల్లుతుంది. ఎల్లలు దాటితే యూనిఫాం విప్పుతుంది. అంటే బంగారంగా ఉంటుంది. బంగారం డబ్బుగా ఎక్కడైనా చెల్లుతుంది. నాణేలరూపంలో ఉన్న డబ్బు ఒక కమ్యూనిటీ హద్దుల్లో మాత్రమే చెల్లుతుంది. అన్ని ప్రాంతాలలో సార్వత్రికంగా చెల్లుబాటు కాదు. రూపాయలు చైనాలో చెల్లవు. ఎన్లు ఇంగ్లండ్ లో నడవవు. ఒక్క ముక్కలో ఏదేశ నాణెమైనా ఎల్లలు దాటితే చెల్లదు.

నాణేలు చలనంలో అరుగుతాయి

నాణేలకి  చేతులు తగులుతాయి, సంచులు, పర్సులు,పెట్టెలు తగులుతాయి.అందువల్ల నాణెం ఇక్కడొక కణం (particle) అక్కడొక కణం కోల్పోతుంది. చలనాలు పెరిగేకొద్దీ అరుగుతుంది. .-క్రిటిక్
నాణేలు చలనంలో అరుగుతాయి- కొన్ని ఎక్కువగానూ, కొన్ని తక్కువగానూ.
రొట్టెలవాడు ఒకరోజు తీసుకున్న సావరిన్ ని మర్నాడు మిల్లర్ కి ఇస్తాడు. అయితే అది కచ్చితమైన సావరిన్ కాదు.అతను తీసుకున్నప్పటికంటే కొంచెం తేలికయినది.
బాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ 1848 లో హౌస్ ఆఫ్ లార్డ్స్ కమిటీ కి ఇలా చెప్పాడు: ప్రతి ఏడాదీ కొత్తగా కొన్ని సావరిన్లు చాలా తేలిక అవుతున్నాయి.ఒక సంవత్సరం సమానంగా తూగిన సావరిన్లు మరుసంవత్సరం  అరుగుదలవల్ల తగినంత బరువు కోల్పోతున్నాయి.
1809లో యూరప్ లో 38కోట్ల పౌండ్ లు ఉన్నాయి.1829 వచ్చేసరికి 20 ఏళ్లలో 1కోటీ 90లక్షల పౌండ్ లు అరుగుదలవల్ల అదృశ్యమయ్యాయి-అని జాకబ్ అంచనావేసాడు.
నాణెం ఉండాల్సిన బరువూ, ఉన్న బరువూ వేరవుతాయి
ఒకే పేరుగల భిన్న నాణేలు బరువులో తేడాలున్నందు వల్ల వాటి విలువలో తేడా ఏర్పడుతుంది. ముద్రించినప్పుడు  10 పౌండ్ నాణేలని తూస్తే అన్నీ సమంగా ఉంటాయి. చలామణీలో చేతులు  మారుతున్నాక, వాటినే తూస్తే అరిగినందువల్ల  ఒక్కొక్కటి ఒక్కక్క బరువు ఉంటుంది. ధరల ప్రమాణంగా బంగారం బరువు, చలామణీ మాధ్యమంగా బంగారం బరువు నుండి పక్కకుపోతుంది. ఆకారణంగా అది సిద్ధింపచేసే సరుకుల ధరలకు సమానకంగా ఇక  ఉండదు.
నాణెంగా దానిబరువుకీ బంగారంముక్క గా దాని బరువుకీ తేడా వస్తుంది. ‘ఇక మిగిలి ఉండేది దాని నీడ. నాణెం శరీరం ఇప్పుడు కేవలం నీడ మాత్రమే’-క్రిటిక్
magni nominis umbra  అనే లాటిన్ పదబంధాన్ని ప్రయోగించాడు. దానర్ధం  ఘనత తగ్గిన గొప్ప పేరు యొక్క నీడఅని. ఒక నాణెం ఎన్ని ఎక్కువ చలనాలు జరిపితే, అంత ఎక్కువ అరుగుతుంది. మొదట్లో ఉన్న బరువుకన్నా చలామణీవల్ల దానిబరువు తగ్గుతుంది. ఇక మిగిలేది నీడ.  నాణెం శరీరం ఇప్పుడు నీడ మాత్రమే. అయినప్పటికీ ప్రతి కొనుగోలులోనూ అమ్మకం లోనూ అది మొదట్లో ఉన్న బరువుగానే  చలామణీ అవుతుంది- సూడో సావరిన్ గా .
 “సూడో సావరిన్ చట్టబద్ధంగా బంగారు నాణెంగా పనిచేస్తుంది.”-క్రిటిక్
బరువుతగ్గినా వాటి ముఖవిలువనే అంగీకరించాలని చట్ట నియంత్రణ ఉంటుంది. అందువల్ల జనం దాన్ని వద్దనలేరు. తీసుకుంటారు.నాణెం ఉండాల్సినంత బరువు ఉండక పోయినా అంతే బరువు వున్నట్లు చలామణీ  అవుతుంది. అంటే, నాణెం ‘విలువ చిహ్నం ’(token of value)అవుతుంది.
చలామణీలో నాణేల బరువు తగ్గడం(బరువుతగ్గినా వాటి ముఖవిలువనే అంగీకరించాలని చట్ట నియంత్రణ) అనేది ధరల ప్రమాణం గానూ (అంటే, కొంత బరువున్న బంగారాన్ని నిర్ధారించి, దానికి ఒక డాలర్ అనో, ఒక పౌండ్ స్టెర్లింగ్ అనో పేరుపెట్టడం), చలామణీ సాధనంగానూ (తక్కువ బరువున్న నాణేలు కూడా పనిచెయ్యగలవు) విడివడడానికి మొదటి అడుగు.
చలామణీలో కొంచెం తక్కువ బరువున్న నాణేలు చెల్లడం, బంగారు నాణేల బదులు తక్కువ విలువున్న నాణేల్ని వాడ వచ్చు అని తెలియజెప్పింది. తక్కువ విలువున్న బంగారు నాణేల తోనే ఇది ఆగలేదు. మరింత ముందు పోయింది. బంగారు నాణేల బదులు వెండి, రాగి నాణేలు వచ్చాయి.
బంగారు నాణేల స్థానంలో తక్కువ విలువగల వెండి, రాగి నాణేలు రావడం అనేది మొదటి అడుగు మాత్రమే. తర్వాతి అడుగు అసలేవిలువా లేని వస్తువుల్నికాగితం ముక్కల వంటి వాటిని  వాడడమే.
ఇది చెప్పాక మార్క్స్ ‘మొదటి అడుగే లెక్క (matters)’ అంటాడు.
కొంచెం తక్కువ బరువున్న నాణేల్ని చలామణీ చెయ్యడమే మొదటి అడుగు. ఇది ఒక విషయాన్ని చెబుతుంది: ముఖవిలువ కన్నా తక్కువ విలువ వున్న బంగారు నాణేల్నితీసుకోడానికి జనం అబ్యంతరపెట్టరు.పెట్టలేరు. ఇక ఆపరిస్తితిలో వెండి, రాగి నాణేలూ, కాగితం డబ్బూ రావడం దాదాపు ఆటోమేటిక్.  బంగారు నాణేల నుండి కాగితం డబ్బుదాకా సాగిన ప్రయాణాన్ని వివరిస్తాడు.
నాణేల బదులు వాటి ‘చిహ్నాలు’
మొదటి అడుగు- తక్కువ బరువున్నా, నిర్ణయించిన బరువే ఉన్నట్లుగా చలామణీ అవడం.
రెండో అడుగు –బంగారానికి బదులు మరొక పదార్ధం ఏదయినా చిహ్నంగా వాడడం.

నాణేల చలనం అవి ఉండాల్సిన  (నామక) బరువునీ, నిజంగా ఉన్న బరువునీ వేరుపరుస్తుంది. ఒకవైపు లోహంముక్కలుగా, మరొకవైపు నిర్దిష్ట చర్యనిర్వహించే నాణేలుగా తేడా ఏర్పరుస్తుంది. లోహ నాణేల స్థానంలో మరేదయినా పదార్ధంతో చేసిన ‘చిహ్నాల’ని(tokens) వాడవచ్చు. అంటే నాణేల లాగే ఉపకరించే ‘గుర్తుల్ని’ (symbols) వాటికి బదులు వాడవచ్చు.నాణెం తయారయ్యేది బంగారంతో. మరేఇతర పదార్ధంతో తయారైనా అది నాణెం కాదు. నాణేనికి చిహ్నం మాత్రమే. బాంకులో  టోకెన్ ఇస్తారు. అదిస్తే దానికి బదులు డబ్బిస్తారు. మరొక బాంకులో ఇవ్వరు. ఏబంకులోనూ అది చెల్లదు. అలాంటిటోకెన్ ని ‘మార్చుకోగల టోకెన్’ అంటాం. పౌండ్ స్టెర్లింగ్ నాణెం అంటే నిర్దిష్ట  బరువున్న బంగారం. పౌండ్ స్టెర్లింగ్ నోటు అనేది  ఏమీ విలువలేని ఒక కాగితం ముక్క. అయినా ఈ కాగితంముక్క బంగారునాణెం లాగే చలామణీలో పాల్గొంటుంది. అందుకే అది చిహ్నం.

మరొకపరిస్థితి కూడా ఉంది.
1.అతి కొద్ది  బంగారాన్నీ, వెండినీ నాణేలుగా ముద్రించడం కష్టం.
2. విలువ కొలమానంగా ఆరంభంలో ఎక్కువ విలువైన లోహాల్నికాకుండా తక్కువ విలువైన లోహాల్నివాడిన పరిస్థితి ఉంది. వెండి కాకుండా రాగి, బంగారం కాకుండా వెండి. మరింత విలువైనది వచ్చే వరకూ ఈతక్కువ విలువైనదే చలామణీ అయిన పరిస్థితి ఉంది.
ఈ వాస్తవాలు బంగారు నాణేలకి ప్రత్యామ్నాయాలుగా రాగీ వెండీ చరిత్రలో పోషించిన పాత్రల్ని వివరిస్తాయి. 
నాణేలు మరీ వేగంగా చేతులు మారే ప్రాంతాల్లో అంటే, అవి మరీ ఎక్కువగా అరిగే చోట్ల, బంగారు నాణేల స్థానంలో వెండి నాణేలు, రాగి నాణేలూ వచ్చాయి. కొద్దిస్థాయి అమ్మకాలూ, కొనుగోళ్ళూ నిరంతరాయంగా సాగే చోట్ల  అలా జరుగుతుంది.  ఈ ఉపగ్రహాలు శాశ్వతంగా బంగారం స్థానంలో స్థిరపడకుండా నిరోధించేందుకు చట్టాలుంటాయి. బంగారం బదులు వాటిని ఏమేరకు అనివార్యంగా అంగీకరించాలో చట్టాలు నిర్ణయిస్తాయి.
చలామణీలో రకరకాల  నాణేలు నడిచే ప్రత్యేక దారులు, సహజంగానే ఒకదానిలోకి మరొకటి వెళ్తాయి. చిహ్నాలు బంగారంతో తోడుగా ఉంటాయి- అతిచిన్న బంగారు నాణేలయొక్క  చిల్లర భాగాలు(fractional parts)  చెల్లించడానికి;   ఒకపక్క బంగారం చిల్లర చలామణీలో(retail circulation) కి వస్తూ వుంటుంది. మరొకపక్క నిరంతరాయంగా బయటకు గెంటివేయబడుతుంది – చిహ్నాలలోకి మారడంద్వారా. ఈ విషయం గురించి  డేవిడ్ బుకానిన్ చెప్పినమాటలు  ఫుట్ నోట్లో ఉంటాయి:  

“చిల్లర చెల్లింపులకు అవసరమైన వెండి కంటే ఎక్కువ వెండి లేకపోతే, పెద్ద చెల్లింపులకు వెండిని సేకరించడం వీలవదు. ముఖ్య చెల్లింపుల్లో బంగారం వాడడం ఉన్నదంటే  చిల్లర వర్తకంలోనూ బంగారం వాడకం ఉన్నట్లే అని అర్ధం: బంగారు నాణెంఉన్నవ్యక్తి చిన్న కొనుగోళ్లకు కూడా వాటినిచ్చి కొన్న సరుకుతోపాటు తనకు రావలసిన చిల్లరని  వెండిరూపంలో  తీసుకుంటాడు; ఆవిధంగా చిల్లరవర్తకునికి చేరే అదనపు వెండి చలామణీలో చేరుతుంది. చిన్న చెల్లింపులకు సరిపడేంత వెండి- బంగారంతో పనిలేకుండా – ఉంటే, చిల్లర వర్తకుడు చిల్లర కొనుగోళ్లకు వెండినే పొందుతాడు; వెండి అతని చేతుల్లో పోగు పడుతుంది.”- డేవిడ్ బుకానిన్

చలామణీ ప్రక్రియలో ఒక ఔన్స్ నిజంగా 10 ఔన్సులంత అవచ్చు
ఈసావరిన్లు వేర్వేరుచోట్ల చలామణీలో ఉంటాయి. ప్రతిరోజూ ఎన్నో కొన్ని చలనాలు చేస్తాయి. కొన్ని సావరిన్లు ఎక్కువ చలనాలు చేస్తాయి, కొన్ని తక్కువ చేస్తాయి.ఒక ఔన్స్ బంగారం ఒక రోజులో చేసే సగటు చలనాలు 10 అయితే, 1200 ఔన్సుల బంగారం 12000 ఔన్సుల బంగారం ఎంత మొత్తం  సరుకుల ధరలను సిద్ధింప చేస్తుందో,అంత సిద్ధింప చేస్తుంది. అంటే 46,725సావరిన్లు సిద్ధింప చేసేటంత. ఔన్సు బంగారం ఎటు తిప్పినా ఎలావంచినా 10 ఔన్సులు తూగదు. అయితే ఇక్కడ చలామణీ ప్రక్రియలో ఒక ఔన్స్ నిజంగా 10 ఔన్సులంత అవుతుంది. చలామణీ ప్రక్రియలో ఒక నాణెం అదిచేసే చలనాల సంఖ్యచేత హెచ్చవేస్తే ఎంత బంగారం అవుతుందో అంతకు సమానం.ఒక నిర్దిష్ట పరిమాణంగల బంగారం ముక్కగా వాస్తవ మనుగడకు  తోడు, నాణెం అది చేసే చర్య వల్ల  నామమాత్రపు మనుగడను కూడా పొందుతుంది.ఒక సావరిన్ ఒక చలనం చేసినా, పది చలనాలు చేసినా,ప్రతి ప్రత్యేకఅమ్మకంలోనూ, కొనుగోలు లోనూ ఆ నాణెం ఒక్క సావరిన్ గా మాత్రమే పనిచేస్తుంది.- .-క్రిటిక్

వెండి, రాగి టోకెన్ లలో లోహం బరువుని రాజ్యం ఇష్టానుసారం నిర్ణయిస్తుంది
 చలనంలో అవి బంగారు నాణేల కంటే తొందరగా అరుగుతాయి. నాణెంగా బంగారం చర్య ఆబంగారం లోహ విలువకు సంబంధం లేకుండా స్వతంత్ర మైనదవుతుంది. అందువల్ల, ఎవిలువా లేని వస్తువులు- కాగితం నోట్ల వంటివి- బంగారం నాణేల స్థానంలో ఉపకరించగలవు. ఈ చిహ్న స్వభావం లోహ చిహ్నాలలో కొంత మేరకు మరుగున పడుతుంది. కాగితం డబ్బులో కొట్టొచ్చినట్లు కానొస్తుంది. వాస్తవానికి, మొదటి అడుగు మీదే మొత్తం ఆధారపడి ఉంటుంది.
ఇక్కడ ప్రస్తావిస్తున్నది బంగారంలోకి మార్చుకోడానికి వీలులేని కాగితం డబ్బు (inconvertible paper money)గురించి. అది రాజ్యం జారీచేసినదే. అనివార్యంగా చలామణీ అవుతున్నదే. కాగితం డబ్బు పుట్టుక లోహ కరెన్సీయే. మరొకపక్క, అప్పుమీద ఆధారపడ్డ డబ్బు ఇతర పరిస్తితులని తెలుపుతుంది. ఆపరిస్థితులు మన సరళ సరుకుల చలామణీ దృష్ట్యా ఇప్పటికింకా మనకి తెలియవు. అయినా ఒక విషయం గట్టిగా చెప్పగలం. ఏమంటే, చలామణీ సాధనంగా డబ్బు చర్యలో  కాగితం డబ్బుఏర్పడినట్లే, చెల్లింపు సాధనంగా డబ్బుచేసే  చర్యలో ‘అప్పుపై ఆధారపడిన డబ్బు’ సహజంగా ఏర్పడింది.  
చలామణీలో కాగితం డబ్బు ఎంత ఉండాలి?
రాజ్యం కాగితంముక్కలమీద  1 పౌండ్, 5 పౌండ్లు వగయిరా పేర్లు ముద్రించి చలామణీలో పెడుతుంది.
అవి వాస్తవంగా అంతే మొత్తం బంగారం స్థానంలో ఉన్నమేరకు, వాటిచలనం డబ్బు చలనాన్ని నియంత్రించే నియమాలకు అనుగుణంగా ఉంటుంది. కాగితం డబ్బు చలామణీకి సంబంధించిన ప్రత్యేక నియమం, ఆ కాగితం డబ్బుప్రాతినిధ్యం వహించే బంగారం నిష్పత్తి నుంచి ఏర్పడుతుంది. అటువంటి నియమం ఉంది; అది ఇదే: చిహ్నాలచేత తొలగించబడకుండా, ఎంత బంగారం వాస్తవ చలామణీ లో ఉండిఉండేదో  ఆమొత్తం బంగారం/వెండి కన్నా కాగితం డబ్బు ఎక్కువ వుండకూడదు. ఇప్పుడు చలామణీ ఇముడ్చుకోగల బంగారం పరిమాణం ఎప్పటికప్పుడు ఒక స్థాయికి అటూ ఇటూ హెచ్చుతూ,తగ్గుతూ ఉంటుంది. అయినాగాని, ఒకానొక దేశంలో చలామణీ మాధ్యమం మొత్తం  కనీస స్తాయినించి కిందికి ఎన్నటికీ పడనేపడదు. ఈకనీస స్థాయి ఎంతో, అనుభవంతో నిర్ధారించవచ్చు. ఈ కనీస మొత్తం దాని భాగాలలో మార్పులు చెందుతుంది అనే వాస్తవంగానీ, దానిలో ఉండే బంగారు ముక్కల స్థానంలో  ఎప్పటికప్పుడు కొత్తవి వస్తాయి అనే వాస్తవం కానీ దాని మొత్తంలోనూ,దాని చలామణీ సాగింపులోనూ ఏమార్పూ కలిగించదు. అందువల్ల దాని స్థానంలో కాగితం చిహ్నాలు ఉంచవచ్చు. మరొకపక్క చలామణీ కాలువలు (conduits) అన్నీఅవి ఇముడ్చుకోగల పూర్తిస్థాయిలో కాగితం డబ్బుతో ఇవ్వాళ నిండిపోతే, సరుకుల చలామణీలో ఏర్పడే ఆటుపోట్ల(fluctuati) కారణంగా రేపు ఆకాలువలు పొంగి పోర్లవచ్చు. ఇక ప్రమాణం(standard)అంటూ ఏదీ ఉండదు.
కాగితం డబ్బు కి సరైన పరిమితి: వాస్తవ చలనంలో ఉండగలిగిన బంగారు నాణేల మొత్తం ఎంతో, అంతే.
ఉదాహరణకి లక్ష పౌండ్లు బంగారు నాణేలు చలామణీలో ఉండాలి అనుకుంటే, కాగితం నోట్లయినా  లక్ష పౌండ్లు మాత్రమే ఉండాలి. అదే పరిమితి. మించి ఉండకూడదు.
 బంగారు నాణేలకి ఏనియమం వర్తిస్తుందో అదే నియమం కాగితం డబ్బుకీ వర్తిస్తుంది.
ఎక్కువకాగితం డబ్బు వుంటే ఏమవుతుంది?
ఒకవేళ కాగితం డబ్బు పరిమితిని మించితే, అది అపఖ్యాతి పాలయ్యే ప్రమాదం ఉంటుంది. దానికి తోడు సరుకుల చలామణీ నియమాల ప్రకారం ఎంత బంగారం అవసరమో, అంత బంగారానికి మాత్రమే అది (ఆకాగితం డబ్బు) ప్రాతినిధ్యం వహిస్తుంది. ఉదాహరణకు లక్షపౌండ్ల ధర గల సరుకులుంటే, చలామణీలో లక్ష పౌండ్లు నాణేలు అవసరం. వాటి చిహ్నాలైన కాగితం నోట్లయినా అంతే ఉండాలి.

అలాకాకుండా, లక్షపౌండ్ల సరుకులే  ఉండి, కాగితం డబ్బు 2 లక్షల పౌండ్లు జారీ అయ్యాయి అనుకుందాం.
అప్పుడు అంతకుముందు లక్ష పౌండ్ల నాణేలకు వచ్చిన సరుకులు ఇప్పుడు రెండులక్షల కాగితం పౌండ్లవుతాయి. అంటే, అంతకు ముందు ఒక పౌండ్ ధరగా వ్యక్తమయిన విలువలు ఇప్పుడు రెండు పౌండ్ల ధరచేత వ్యక్తమవుతాయి. పౌండ్ అనే డబ్బుపేరు  వాస్తవంగా ఔన్స్ బంగారంలో నాలుగోవంతుకి డబ్బుపేరు కాకాకుండాపోతుంది. ఎనిమిదోవంతుకు డబ్బుపేరు అవుతుంది.

ధరల ప్రమాణంగా  బంగారం చర్యలో మార్పు వల్ల  ఎలాంటి ప్రభావం ఉంటుందో, దీనివల్ల కూడా అలాంటి ప్రభావమే ఉంటుంది.
కాగితం డబ్బనేది బంగారానికి, డబ్బుకి ప్రతినిధిగా ఉండే టోకెన్ దానికీ సరుకుల విలువలకీ ఉన్న సంబంధం: సరుకుల విలువలు ఊహాత్మకంగా ఏ బంగారు పరిమాణాల్లో అయితే వ్యక్తమవుతాయో,
ఏబంగారు మొత్తాలు కాగితం చేత చిహ్నాలుగా ప్రాతినిధ్యం పొందుతాయో, అవే మొత్తాలలో సరుకుల విలువలు ఊహాత్మకంగా వ్యక్తీకరించబడతాయి. కాగితం డబ్బు (అన్ని సరుకులలాగే విలువ కలిగివున్న) బంగారానికి ఏమేరకు ప్రాతినిధ్యం వహిస్తుందో, ఆమేరకే అది విలువ చిహ్నంగా వుంటుంది.
డబ్బు చర్యల విషయంలో ఆర్ధిక వేత్తల తప్పు అభిప్రాయాలు
డబ్బు గురించి రాసిన అత్యుత్తమ రచయితలు సైతం డబ్బుచేసే భిన్న చర్యల విషయంలో చాలాఅస్పష్టతతో ఉన్నారు. ఎంత అస్పష్టతో ఫుల్లర్టన్ మాటలు స్పష్టం చేస్తాయి: మన దేశీయ మారకాలకు సంబంధించి, వెండి బంగారాలు నిర్వహించే ద్రవ్య చర్యలు అన్నీ, చట్టం వల్ల చేకూరిన కల్పితమైన/కృత్రిమమైన సాంప్రదాయకమైన  విలువ తప్ప మరే విలువా లేని, మార్చుకోడానికి వీలుకాని నోట్ల (inconvertible notes) చలామణీ ద్వారా  అంతే సమర్ధవంతంగా జరగవచ్చు-అనేది నిరాకరించరాని వాస్తవం అని విశ్వసిస్తున్నాను. ఈతరహా విలువ అంతర్గతవిలువ యొక్క అన్ని లక్ష్యాలకూ సమాధానమిచ్చేట్లు, చెయ్యబదవచ్చు. ఒక ప్రమాణం అవసరాన్ని తొలగించవచ్చు- అయితే జారీ అయ్యే నోట్ల పరిమాణాన్నితగిన పరిమితిలో ఉంచాలి.
వేరే మాటల్లో, చలామణీలో డబ్బుసరుకు స్థానంలో  విలువ చిహ్నాలు చేరగలవు కనుక విలువ కొలమానంగానూ, ధరల ప్రమాణంగానూ అది అనవసరం అని అంటున్నాడు. ఈ విషయంలో ఫుల్లర్టన్ పెద్ద పొరపాటు చేశాడు. కారణం చలామణీ సాధనం చర్యనీ, విలువ కొలమానాన్నీ వేరుగా చూడలేకపోవడమే.
అసలు విలువే లేని చిహ్నాలు బంగారం స్థానం లోకి  ఎలా రాగలుగుతాయి?
ఇప్పటికే మనం ఒక విషయాన్ని గమనించాం. ఏమంటే: ప్రత్యేకంగా  ఒక నాణెంగా పనిచేసినప్పుడు మాత్రమే, అంటే చలామణీ మాధ్యమంగా ఉన్నప్పుడు మాత్రమే చిహ్నం బంగారం స్థానంలో చేరగలదు. వేరే విధంగా చేరడం సాధ్యం అవదు. డబ్బుకి ఇదికాక చేయవలసిన ఇతర చర్యలు కూడా ఉన్నాయి. బంగారు నాణేనికి ఉన్నది, చలామణీ మాధ్యమంగా ఉండడం అనే ఒకేఒక పని మాత్రమే కాదు. అయితే అరిగిపోయినప్పటికీ చలామణీ అవుతున్న నాణేలు మాత్రం ఈఒక్క చర్యనే చేస్తాయి. ప్రతి డబ్బు ముక్కా కేవలం ఒక నాణెం,లేదా చలామణీ సాధనం- చలామణీలోఉన్నంతవరకు మాత్రమే. అయితే కాగితం డబ్బు చేత తొలగించబడే కనీస బంగారం మొత్తానికి  మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆమొత్తం ఎప్పుడూ చలామణీ పరిధిలోనే ఉంటుంది. చలామణీ మాధ్యమంగా పనిచేస్తుంటుంది. పూర్తిగా ఆపనికోసమే ఉంటుంది. స-డ-స రూపపరివర్తనలోరెండు  విరుద్ధ దశలుంటాయి. ఆ దశల్లో సరుకులు వాటి విలువ రూపాల్ని ఎదుర్కుని, వెంటనే అదృశ్యమవుతాయి. ఒక సరుకు మారకం విలువ యొక్క స్వతంత్ర మనుగడ అనేది ఇక్కడ తాత్కాలికమైన దృశ్యం మాత్రమే. ఆసరుకు స్థానంలోకి వెంటనే మరోకసరుకు వస్తుంది. అందువల్ల, డబ్బు ఒకరి చేతినించి మరొకరి చేతికి ఆగకుండా మారే ఈ ప్రక్రియలో కేవలం డబ్బుయొక్క ‘చిహ్నమనుగడ’(symbolical existence) సరిపోతుంది. అందువల్ల ఒక చిహ్నం చేత తొలగించబడగలదు.
నాణేలుగా ఉన్న మేరకు, అంటే చలామణీ మాధ్యమంగా వ్యవహరించిన మేరకు, బంగారం వెండి వాటి సొంత చిహ్నాలు అవుతాయి.  ఈ  వాస్తవాన్ని పట్టుకొని నికోలస్ బార్బన్ ప్రభుత్వాలకు డబ్బును పెంచే హక్కు అంటే, షిల్లింగ్ అనబడే వెండి పరిమాణానికి అంతకంటే ఎక్కువ పరిమాణం  ఉండే క్రౌన్ లాంటి  పేరు పెట్టవచ్చంటాడు. ఆవిధంగా అప్పులవాళ్ళకు క్రౌన్ల బదులు షిల్లింగులు ఇవ్వచ్చంటాడు. ‘పదేపదే లెక్కబెట్టడం వల్ల డబ్బు అరిగిపోయి, తేలిక అవుతుంది... బేరం ఆడేటప్పుడు జనం పట్టించుకునేది  ఆడబ్బు పేరునీ,, దాని చలామణీని. అంతేగాని వెండి పరిమాణాన్ని కాదు..ఆ లోహం మీద ప్రభుత్వానికి ఉండే  అధికారమే దాన్ని డబ్బుగా చేస్తుంది.- నికొలాస్ బార్బన్.
ఏది ఏమైనా, ఒకటి తప్పనిసరి; ఈ చిహ్నానికి తనసొంత వస్తుగత సామాజిక ఆమోదం అవసరం, ఈ కాగితం చిహ్నం బలవంతపు చలనం ద్వారా సామాజిక ఆమోదాన్ని పొందుతుంది. ఈ తప్పనిసరి రాజ్య చర్య ఆసమాజపు హద్దుల్లో ఉండే అంతర్గత చలామణీ రంగంలో మాత్రమే ప్రభావం నెరుపుతుంది. ఆపరిధిలో మాత్రమే చలామణీ మాధ్యమంగా దాని చర్యకు స్పందిస్తుంది. అంటే నాణెం అవుతుంది.
డబ్బు’ గురించి వచ్చే పోస్ట్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి