24, నవంబర్ 2018, శనివారం

'శ్రమనిధి 'అనబడేది



విభాగం 5. 'శ్రమనిధి 'అనబడేది
పెట్టుబడి స్థిర పరిమాణం కాదు
పెట్టుబడి స్థిర పరిమాణం కాదు - అని మన పరిశీలనలో తేలింది. అది సమాజ సంపదలో ఒక భాగం. తాజా అదనపువిలువ రెవిన్యూలోకీ, అదనపు పెట్టుబడిలోకీ నిరంతరం విడివడుతూ, మారుతూ ఉంటుంది. క్రియాత్మక పెట్టుబడి ఇవ్వబడినా, శ్రమ శక్తీ, సైన్సూ, భూమీ (మనిషితో నిమిత్తం లేకుండా ప్రకృతి సమకూర్చిన పరిస్థితులన్నీ) క్రియాత్మక పెట్టుబడిలో ఇమడ్చబడతాయి. వ్యాకోచించే శక్తులు అవుతాయి. దానికి కొన్ని పరిమితుల్లో దాని సొంత పరిమాణంతో సంబంధంలేకుండా కార్యాచరణకి అవకాశం కలిగిస్తాయి. కాబట్టి పెట్టుబడి స్థిర పరిమాణం కాదు.
అశాస్త్రీయ అర్ధ శాస్త్రజ్ఞుల శ్రమ నిధిసిద్ధాంతం
అశాస్త్రీయ అర్ధ శాస్త్రజ్ఞులుశ్రమ నిధిసిద్దాంతాన్ని ప్రవేశపెట్టి, ప్రచారం చేశారు. వేతనాలు చెల్లించడానికి ఒకస్థిర నిధి’ ఉంటుందనేది దీని సారాంశం. నియోగించబడిన కార్మికుల సంఖ్యచేత భాగిస్తే వేతనాల స్థాయి తెలుస్తుంది అని కొందరు వాదించారు.  ఇంకొందరు నిధి మొత్తాన్ని, స్థిరవేతనంతో భాగిస్తే శ్రామికుల సంఖ్య తెలుస్తుందని తేల్చారు. వాళ్ళూ వీళ్ళూ కూడా సంచయనం రేటుని నిర్ణయించే అంశాలు అన్నిటినీ విస్మరించారు - అని మార్క్ విమర్శించాడు
అశాస్త్రీయ ఆర్ధిక వేత్తలు పెట్టుబడిని నిర్దిష్ట పరిమాణంగా పరిగణంచారు. ఆవిధంగా అస్థిర పెట్టుబడి, స్థిర పరిమాణంగా వాళ్ళకి అగపడుతుంది. శ్రమనిధి అనబడేది అదే. 'ఫలానింత మొత్తం కార్మికులకి చెల్లించడానికి కేటాయించబడుతుంది - అంటారు వాళ్ళు.  కార్మికులు ఎంత ఎక్కువమంది ఉంటే, ఒక్కొక్కళ్ళ వాటా అంత తగ్గుతుంది. ఎంత తక్కువమంది ఉంటే, ఒక్కొక్కళ్ళ వాటా అంత ఎక్కువ ఉంటుంది.'
ఆవిధంగా సాంప్రదాయ అర్ధశాస్త్రం సామాజిక పెట్టుబడిని ఒక స్థిరమైన సామర్ధ్య స్థాయి గల స్థిర పరిమాణంగా భావించడానికి ఇష్టపడింది. ఇది పరిశీలన చెయ్యకుండా తేల్చిన  నిర్ధారణ (prejudice).
బెంథాం పిడివాదం
దీన్ని ఒక పిడివాదంగా మొట్టమొదట స్థాపించినవాడు జెరెమీ బెంథాం. అతనొక పసలేని పాండిత్య ప్రకర్షకుడు, ఈ పిడివాదాన్ని అనుసరించి ఉత్పత్తి ప్రక్రియ యొక్క అత్యంత సామాన్యమైన విషయాల్ని సైతం తెలుసుకోజాలం. ఉదాహరణకి, దాని ఆకస్మిక వ్యాకోచ సంకోచాలు. అంతెందుకు, అసలు సంచయనాన్ని ఊహించడమే అసాధ్యం అవుతుంది.
అర్ధశాస్త్రజ్ఞుల కట్టుకధలు
పిడివాదాన్ని బెంథాంతొ పాటు మాల్థూస్, జేంస్ మిల్, మాకుల్లాక్ మొదలైన వాళ్ళు పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించడానికి వాడుకున్నారు -. మరీ ముఖ్యంగా పెట్టుబడిలో ఒకభాగం అయిన అస్థిరపెట్టుబడిని- శ్రమశక్తిలోకి మార్చబడే భాగాన్ని- ఒక స్థిర పరిమాణంగా చూపడానికి వాడుకున్నారు. అస్థిర పెట్టుబడి భౌతికాంశంకార్మికుల జీవనాధార సాధనాల మొత్తం, లేక శ్రమనిధి అనబడేది సామాజిక సంపదలో భాగమనీ, సహజ సూత్రాలచేత నిర్ణయించబడి, మార్పు చెందనిదనీ కట్టుకధలు చెప్పారు.
కార్మికుల సంఖ్య-శ్రమ శక్తి ధర
స్థిరపెట్టుబడిగా పనిచెయ్యాల్సిన సామాజిక సంపదని చలనంలో పెట్టడానికి అంటే, దాన్ని భౌతిక రూపంలో ఉత్పత్తిసాధనాలుగా వ్యక్తంచెయ్యడానికి, ఒకనిర్దిష్ట పరిమాణంగల సజీవ శ్రమ రాసి అవసరంవుతుంది. పరిమాణం ఎంతనేది సాంకేతికంగా నిర్ణయమవుతుంది. అయితే శ్రమశక్తి పరిమాణాన్ని చలనంలో పెట్టడానికి ఎంతమంది కార్మికులు కావాలో తెలియజెయ్యదు. ఎందుకంటే, వైయక్తిక శ్రమశక్తి దోపిడీ స్థాయిని బట్టి సంఖ్య మారుతుంది. దోపిడీ స్థాయి ఎక్కువయ్యేకొద్దీ, కార్మికుల సంఖ్య తగ్గుతుంటుంది, దోపిడీ స్థాయి తగ్గే కొద్దీ కార్మికుల సంఖ్య పెరుగుతుంటుంది. అలాగే శ్రమ శక్తి ధరను కూడా తెలియజేయదు- అస్థిరమైన ఆధర యొక్క కనీస పరిమితిని మాత్రమే తెలుపుతుంది. పరిమితికూడా చాలా అస్థిరమైందే.
పిడి వాదంలోని వాస్తవాలు ఇవి:
1.ఒకపక్క, సామాజిక సంపద శ్రమ చెయ్యనివని సుఖ,భోగ సాధనాలుగానూ, ఉత్పత్తి సాధనాలుగానూ విభజించడంలో జోక్యం చేసుకునే హక్కు కార్మికునికి లేదు.
2. మరొకపక్క, అనుకూలమైన, అసాధారణ సందర్భాల్లో మాత్రమే సంపన్నుల ఆదాయం నించి శ్రమ నిధి అనబడేదాన్ని పెంచుకోగల శక్తిని కలిగి ఉంటాడు. 
శ్రమనిధి కుండే పెట్టుబడిదారీ పరిమితుల్ని సహజమైన,సామాజికమైన పరిమితులుగా చిత్రించే ప్రయత్నం పునరుక్తి తప్ప మరేమీ కాదు. ఉదాహరణకి ప్రొ.ఫాసెట్ - ఒక దేశ చలామణీ పెట్టుబడే ఆదేశ వేతననిధి. కాబట్టి, ఒక్కొక్క కార్మికుడు పొందే  సగటు వేతనాన్ని లెక్కించాలనుకుంటే, మనం ముందుగా పెట్టుబడి మొత్తాన్ని శ్రామిక జనభా సంఖ్య బెట్టి భాగించాలి.
దీని అర్ధం: వాస్తవంగా చెల్లించబడిన వైయక్తిక వేతనాల్ని ముందుగా కూడాలి. కూడగా వచ్చిన మొత్తమే శ్రమనిధి అని, భగవంతుడూ, ప్రకృతీ నిర్ణయించి ప్రసాదించిన శ్రమనిధి అని నొక్కి వక్కాణించాలి. ఆవిధంగా రాబట్టిన మొత్తాన్ని కార్మికుల సంఖ్య చేత తిరిగి భాగించాలి - సగటున ఒక్కో కార్మికుడికి ఎంతవస్తుందో తేల్చడానికి. తప్పు దోవ పట్టించడానికి ఎంత తెలివి. అసలు విషయాన్ని కప్పిపుచ్చడానికి ఎటువంటి మోసం.
అదే ధోరణిలో ఆయనిలా అంటాడు: 
ఇంగ్లండ్ లో ఏటేటా పొదుపు చేయబడిన సంపద మొత్తం రెండు భాగాలుగా విభజించబడింది; ఒక భాగం మన పరిశ్రమని నిర్వహించే నిమిత్తం నియోగించబడింది. రెండో భాగం విదేశాలకు ఎగుమతిచెయ్యబడింది... ఏటేటా పొదుపుచెయ్యబడిన సంపదలో ఒకభాగం మాత్రమే, అదీ పెద్ద భాగమేమీ కాదు, మన సొంత దేశంలో పెట్టుబడిగా పెట్టబడింది.”
సమానకం ఇవ్వకుండా ఇంగ్లండ్ కార్మికులనించి గుంజబడి, అంటే అపహరించబడి ప్రతి ఏటా కూడుతున్న అదనపు ఉత్పాదితంలో భారీభాగం ఆవిధంగా ఇంగ్లండ్ లో కాకుండా విదేశాల్లో పెట్టుబడిగా ఉపయోగించబడుతున్నది. అయితే అలా ఎగుమతిచేయబడిన అదనపు పెట్టుబడితో పాటు దైవమూ, బెంథామూ కనిపెట్టిన 'శ్రమనిధి 'లో ఒకభాగం కూడా ఎగుమతి చెయ్యబడుతుంది.  




18, నవంబర్ 2018, ఆదివారం

పెట్టుబడి సంచయన పరిమాణాన్ని నిర్ణయించే ఇతర అంశాలు


అధ్యాయం 24.  అదనపువిలువ పెట్టుబడిలోకి మారడం
విభాగం 4. పెట్టుబడి సంచయన పరిమాణాన్ని నిర్ణయించే ఇతర అంశాలు
అదనపువిలువ పెట్టుబడిగానూ, ఆదాయంగానూ విడివడే నిష్పత్తితో నిమిత్తంలేకుండా, సంచయన పరిమాణాన్ని నిర్ణయించే ఇతర అంశాలు.
1.శ్రమశక్తిని దోపిడీ చేసే స్థాయి
2.శ్రమ ఉత్పాదకత
3.నియోగించిన పెట్టుబడికీ, వినియోగమైన పెట్టుబడికీ మధ్య పెరిగే వ్యత్యాసం
4.అడ్వాన్స్ చేసిన పెట్టుబడి పరిమాణం
అదనపువిలువ పెట్టుబడిగానూ, ఆదాయంగానూ ఏనిష్పత్తిలో విభజితమవుతుందో తెలిస్తే, సంచయనమయిన పెట్టుబడి పరిమాణం స్పష్టంగా అదనపువిలువ యొక్క పరమ పరిమాణాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి ,అదనపు విలువలో 80 శాతం పెట్టుబడిలోకి మార్చబడిందనీ, 20 శాతం వినియోగించుకోబడిందనీ అనుకుందాం. అదనపు విలువ మొత్తం 3,000 పౌన్లయితే సంచయనమైన పెట్టుబడి 2,400 పౌన్లు అవుతుంది. అది 1,500 పౌన్లయితే ఇది 1,200 పౌన్లవుతుంది. కాబట్టి అదనపువిలువ రాశిని నిర్ణయించే అంశాలన్నీ సంచయనం పరిమాణాన్ని నిర్ణయించడంలో పనిచేస్తాయి. సంచయనానికి సంబంధించి, కొత్త దృక్కోణాల్ని చూపే మేరకు  అంశాలన్నిటినీ మరొకసారి సంక్షిప్తంగా చూద్దాం. 
1.శ్రమశక్తిని దోపిడీ చేసే స్థాయి
అదనపువిలువ రేటు శ్రమశక్తి దొఫిడీ స్థాయిని బట్టి ఉంటుంది అని గుర్తుబెట్టుకోవాలి. రాజకీయ అర్ధశాస్త్రం వాస్తవానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తుంది. ఎంతంటే, అప్పుడప్పుడుశ్రమ ఉత్పాదకత పెరుదుదల వల్ల కలిగే సంచయనవేగం, శ్రామికుణ్ణి దోపిడీ చేయడం వల్ల పెరిగే సంచయన్ వేగంతో సమానం చేసేటంత ప్రాధాన్యతనిస్తుంది. అదనపు విలువ ఉత్పత్తి గురించిన అధ్యాయాల్లో వేతనాలు శ్రమ శక్తి విలువకి కనీసం సమానంగానన్నా ఉన్నట్లు భావించాం. అయినప్పటికీ, ఆచరణలో    వేతనాల్ని బలవంతంగా అంతకన్నా తగ్గించడం అనేది  చాలా ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది. కాబట్టి ఇక్కడ కాసేపు ఆగి, దాన్ని గురించి ఆలోచించాలి.
వాస్తవానికి అది కొన్ని పరిమితుల్లో కార్మికుని వినియోగావసరాల నిధిని పెట్టుబడి సంచయన నిధిగా మారుస్తుంది. జాన్ స్టువర్ట్ మిల్ ఇలా అంటాడు- వేతనాలకి ఉత్పాదక శక్తి ఉండదు. అవి ఉత్పాదక శక్తి యొక్క ధరలు. వాస్తవానికి అది కొన్ని పరిమితుల్లో కార్మికుని వినియోగావసరాల నిధిని పెట్టుబడి సంచయన నిధిగా మారుస్తుంది. శ్రమతో పాటు, వేతనాలు సరుకుల ఉత్పత్తికి దోహదం చెయ్యవు- పరికరాలతో పాటు, వాటి ధర ఎలా దోహదం చెయ్యదో అలాగే. కొనకుండానే  శ్రమ లభిస్తే, వేతనాల్ని రద్దు పరచవచ్చు(Essays on Some Unsettled Questions of Political Economy,‖ Lond., 1844, p. 90.) అయితే కార్మికులు గాలి తిని బతీక గలిగితే, వాళ్ళని ధరకీ కొనడం కుదరదు. కాబట్టి గణిత భాషలో వాళ్ళ ధరకి ఒక పరిమితి సున్న. ఆసున్నాకి చేరువగా రాగలమే గాని, దాన్ని చేరడం సాధ్యం కాదు. సున్నా వైపుకి శ్రమ ధరని వెనక్కి నెట్టడమే,పెట్టుబడి యొక్క నిరంతర పోకడ, నిరంతర ధోరణి.
ఆదర్శ కార్మికులు
18 శతాబ్దానికి చెందిన ఒక రచయిత తన Essay on Trade and Commerceలో  ఇంగ్లండ్ వేతనాల్ని ఫ్రెంచ్, డచ్  వేతనాల స్థాయికి బలవంతంగా తగ్గించడమే ఇంగ్లాండ్ చారిత్రక కర్తవ్యం అన్నాడు. అదే పద్ధతిలో 1866 డిశంబర్, 1867 జనవరి The Times పత్రిక బెల్జియం గని కార్మికుల సంతోషకరమైన స్థితిని చిత్రించింది.యజమానులకోసం తాము బతకడానికి కచ్చితంగా ఎంతకావాలో అంతకన్న ఎక్కువ అడగరనీ, తీసుకోరనీ రాసింది. అలా  గనియజమానుల మనసులోని మాటల్ని ప్రచురించింది. అయితే బెల్జియం కార్మికులు ఆదర్శ కార్మికులుగా పత్రికలో గుర్తింపు పొందడానికి చాలా బాధ పడాల్సివచ్చింది. 1867 ఫిబ్రవరి మొదట్లో జవాబు దొరికింది: బెల్జియం కార్మికుల సమ్మె మెర్సియనీలో తుపాకీ తూటాలతో అణచబడింది.

ఇంగ్లిష్ పెట్టుబడిదారీ విధానం యొక్క అంతర్గత ఆత్మ రహస్యాన్ని బహిర్గతం చేశాడన్నమాట. మిగతా విషయాలతో పాటు అమాయకంగా ఇలా చెబుతాడు: మన పేదలు (కార్మికులకి బదులు అయన వాడే మాట) విలాసవంతంగా బతికేట్లయితే, శ్రమ ప్రియం అవుతుంది. కార్ఖానా దారులు అనుభవించే బ్రాందీ, జిన్, టీ, పంచదార, విదేశీ పళ్ళు, ఘాటైన బీరు,  అద్దకం బట్టలు, నశ్యం, పుగాకు వగయిరా వాడితే శ్రమ ధర పెరుగుతుంది.
అతను నార్త్ ఆంప్టన్ షైర్ కార్ఖానాదారుడు మూలగడాన్ని కోట్ చేశాడు: శ్రమ ఇంగ్లండ్ లో కంటే ఫ్రాన్స్ లో మూడో వంతు చౌక.కారణం అక్కడ పనివాళ్ళు కష్టపడి పనిచేస్తారు, వాళ్ళ తిండికీ, బట్టలకీ తక్కువ ఖర్చు చేస్తారు. వాళ్ల ముఖ్య ఆహారం బ్రెడ్, పళ్లు, ఆకులూ, దుంపలు, ఎండు చేపలు. అరుదుగా మాత్రమే మాంసం తింటారు. గోధుమలు ప్రియంగా ఉన్నప్పుడు, బహుకొద్ది బ్రెడ్ మాత్రమే తింటారు. మన వ్యాసకర్త కొన్ని మాటలు కలుపుతున్నాడు 
వాళ్ళు తాగేది నీళ్ళుగానీ, చౌకరకం సారాగానీ తాగుతారు. కాబట్టి వాళ్ళు చలాతక్కువ ఖర్చు బెడతారు.  ఇంగండ్ లో వీటిని అమలు చెయ్యడం చాలా కష్టమే. కాని ఫ్రాన్స్ లోనూ. హాలాండ్ లోనూ అమలు పరచబడ్డాయి కాబట్టి ఇక్కడకూడా అసాధ్యం కాక పోవచ్చు.
మూడో జర్మన్ ముద్రణకు నోట్: అప్పటినుండీ ప్రపంచ మార్కెట్లో స్థిరపడ్డ పోటీ వల్ల, ఈనాడు ఎంతో ముందుకు పోయాం. స్టేపిల్టన్ అనే పార్లమెంట్ సభ్యుడు ఇలా అన్నాడు: చైనా గొప్ప పారిశ్రామిక దేశంగా ఎదిగినట్లయితే, ఐరోపా కార్ఖానా జనాభా తమ పోటీ దారుల స్థాయికి దిగిపోకుండా పోటీలో ఎలా తట్టుకోగలరో నాకు తట్టడంలేదు (టైంస్, సెప్టెంబర్ 3, 1873). ఇంగ్లండ్ పెట్టుబడి దారుల కాంక్షించే లక్ష్యం ఐరోపా ఖండ వేతనాలు కానేకావు, చైనా వేతనాలు మాత్రమే.
18 శతాబ్దం చివరలోనూ, 19 శతాబ్దంతొలి పదేళ్ళలోనూ ఇంగ్లిష్ రైతులూ, భూస్వాములూ వ్యవసాయ కూలీలకు పరమ కనీస వేతనాన్ని అమలుపరిచారు - కనీసం కన్నా తక్కువ వేతన రూపంలోనూ, మిగిలినదాన్ని పేదలకి ప్రభుత్వం, చర్చ్ ఇచ్చే వాటి రూపంలోనూ ఇవ్వడంద్వారా.
అప్పటి ఒక బూర్జువా రచయిత ఇలా అన్నాడు - ఆదేశంలో రైతులు ఒక గౌరవప్రదమైన వర్గాన్ని ఏళ్ళతరబడి పేద గృహాల్లో ఆశ్రయం పొందేట్లు దిగజార్చారు. తన ఆదాయాన్ని పెంచుకుంటూనే, శ్రామికులకు ఏమాత్రం సంచయనం లేకుండా నిరోధించాడు. మన కాలంలో అదనపు విలువ ఏర్పాటులో, పెట్టుబడి సంచయన నిధి ఏర్పాటులో కార్మికుల’ వినియోగవసర నిధిని నేరుగా కాజెయ్యడం’ అనేది పోషించిన పాత్రని స్వదేశీ పరిశ్రమ చూపించింది. విషయానికి సంబంధించిన వాస్తవాల్ని తర్వాత చెబుతాము. 
పరిశ్రమ శాఖలోనైనా స్థిర పెట్టుబడిలో భాగమైన శ్రమ సాధనాలు శ్రామికుల సంఖ్యకి సరిపోయినన్ని  ఉండాలి. అయినప్పటికీ, దాని అర్ధం శ్రామికుల సంఖ్య పెరిగే నిష్పత్తిలోనే ఆస్థిర పెట్టుబడి భాగం పెరగక తప్పదు అని కాదు. ఉదాహరణకి ఒక ఫాక్టరీలో 100 మంది రోజుకి 8 గంటల చొప్పున 800 పని గంటలు అవుతాయి. పెట్టుబడి దారుడు ఈమొత్తాన్ని 1200 గంతలకు పెంచాలనుకుంటే, అతను మరొక 50 మంది కార్మికుల్ని పెట్టవచ్చు. అందుకు కొత్తకార్మికులకే కాకుండా, వాళ్ళు వాడే శ్రమ సాధనాలకోసం కూడా మరికొంత పెట్టుబడి అడ్వాన్స్ పెట్టాల్సి వస్తుంది. అలాకాకుండా, ఉన్న 100 మంది చేతనే రోజుకి 12 గంటలు పనిచేయిస్తే, ఉన్న శ్రమ సాధనాలే సరిపోతాయి. కాకపోతే అవి మరింత త్వరగా వినియోగమవుతాయి. ఆవిధంగా శ్రమ తీవ్రత వల్ల  ఏర్పడ్డ అదనపు శ్రమ (additional labour), దానికి అనుగుణంగా స్థిరపెట్టుబడిభాగాన్ని పెంచకుండానే, అదనపు ఉత్పాదితాన్నీ, అదనపు విలువని పెంపొందింపచేస్తుంది.
 వెలికితీత పరిశ్రమలు,గనులు మొదలైన వాటిలో ముడిపదార్ధాలకు పెట్టే పెట్టుబడి ఉండదు. ఈసందర్భంలో శ్రమ పదార్ధం గతశ్రమ ఉత్పాదితం కాదు. అది ప్రకృతి ఉచితంగా సమకూర్చే పదార్ధం - లోహాలూ, ఖనిజాలూ బొగ్గూ, రాళ్ళూ లాగా. పరిశ్రమల్లో స్థిర పెట్టుబడి దాదాపు పూర్తిగా శ్రమ సాధనాలే. సాధనాలు ఎక్కువ శ్రమని (ఉదాహరణకి, కార్మికుల రాత్రి పగలూ షిఫ్టుల్ని) ఇముడ్చుకోగలవు. ఇతర పరిస్థితులన్నీ స్థిరంగా  ఉన్నప్పుడు, ఉత్పాదితం రాశీ, విలువా వ్యయమైన శ్రమకి అనులోమానుపాతంలో పెరుగుతాయి. ఉత్పత్తి ఆరంభమైన తొలి రొజు లాగే, ప్రకృతీ మనిషీ  పెట్టుబడి భౌతికాంశాల సృష్టి కర్తలుగా కలిసి పనిచేస్తున్నాయి. మనిషి శ్రమ శక్తికి ఇచ్చే శ్రమని పెంచగలిగే స్వభావం ఉంటుంది. అందువల్ల స్థిరపెట్టుబడిలో పెరుగుదల లేకుండానే, సంచయనం పరిధి విస్తరించగలదు. వ్యవసాయంలో  మరిన్ని విత్తనాలూ  మరింత ఎరువూ అడ్వాన్స్ పెట్టకుండా సేద్యభూమిని పెంచడం వీలవదు. అడ్వాన్స్ ఒక సారి పెడితే, నేల  చేసే పని ఉత్పాదితం పరిమాణం మీద అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అంతకు ముందున్నంత మంది కార్మికులే చేసే ఎక్కువ శ్రమ ఆవిధంగా శ్రమసాధనాలకు కొత్త అడ్వాన్స్ కోరకుండానే, భూసారాన్ని పెంచుతుంది. తాజా పెట్టుబడి ప్రమేయం లేకుండానే, ప్రకృతి  మీద ప్రత్యక్ష మానవ చర్య మరింత సంచయనానికి మరొకమారు వనరు అయింది. 
చివరగా, వస్తు తయారీ రంగంలో శ్రమ మీద అదనపు వ్యయానికి అనుగుణమైన ముడిపదార్ధాల అదనపు వ్యయం ఉండి తీరాలి. అయితే శ్రమ సాధనాలకు అలాంటి వ్యయం అవసరం ఉండదు. వెలికితీత పరిశ్రమలూ, వ్యవసాయమూ వస్తూత్పత్తి పరిశ్రమకి ముడి పదార్ధాల్నీ, శ్రమ సాధనాల్నీ సమకూరుస్తాయి. అందువల్ల వెలికితీత పరిశ్రమా, వ్యవసాయమూ  అదనపు పెట్టుబడి అడ్వాస్ చెయ్యకుండానే అదనపు ఉత్పాదితాన్ని సృజిస్తాయి. కాబట్టి వస్తూత్పత్తి పరిశ్రమకి ప్రయోజనం కలుగుతుంది.
2. సామాజిక శ్రమ ఉత్పాదక స్థాయి.
శ్రమ ఉత్పాదకత పెరిగితే,  ఉత్పాదితాల రాసి పెరుగుతుంది. వాటిలో విలువతో పాటు  అదనపువిలువ కూడా ఇమిడిఉంటుంది. అదనపు విలువ రేటు స్థిరంగా ఉంటే, లేదూ ఒకవేళ తగ్గినా ఉత్పాదకశక్తి  పెరిగే దానికన్నా నెమ్మదిగా తగ్గుతున్నంత కాలమూ అదనపు ఉత్పాదితం రాశి పెరుగుతూ ఉంటుంది. ఉత్పాదితం అదనపు పెట్టుబడిలోకీ, ఆదాయం లోకీ విభజన ఉన్నదున్నట్లే ఉంటే, సంచయననిధి తగ్గకుండానే, పెట్టుబడిదారుడి వినియోగనిధి పెరగవచ్చు. వినియోగ నిధిని తగ్గించడం ద్వారా కూడా, సంచయన నిధి సాపేక్ష పరిమాణం పెరగవచ్చు. అదే సమయంలో సరుకులు చౌక అవడం వల్ల అంతకుముందు లాగానో, అప్పటికన్న ఎక్కువగానో వినియోగ వస్తువులు పెట్టుబడిదారుడికి లభిస్తాయి. అయితే పెరిగే శ్రమ ఉత్పాదకతతో పాటు, శ్రామికుడు కూడా చౌక అవుతాడు. అందువల్ల, నిజ వేతనాలు పెరుగుతున్నా గాని, అదనపు విలువ రేటు పెరుగుతుంది. శ్రమ ఉత్పాదకత పెరుగుదలకి అనుగుణంగా  నిజవేతనాలు పెరగవు. అందువల్ల, అదే అస్థిర పెట్టుబడి విలువ మరింత శ్రమ శక్తిని, అందువల్ల మరింత శ్రమని చలనంలో పెడుతుంది. అదే స్థిర పెట్టుబడి విలువ మరిన్ని ఉత్పత్తి సాధనాల్ని - అంటే మరిన్ని శ్రమ సాధనాల్ని, శ్రమ పదార్ధాల్ని, ఉపపదార్ధాల్ని - ఇముడ్చుకుంటుంది. అందువల్ల, స్థిర పెట్టుబడి మరింత ఉపయోగపు విలువ, విలువల ఉత్పత్తికి కావలసిన అంశాల్ని, వాటితో పాటు ఎక్కువ శ్రమని ఇముడ్చుకోగల అంశాల్నీ సరఫరా చేస్తుంది.  అందువల్ల, అదనపు పెట్టుబడి విలువ స్థిరంగా వున్నా, ఒకవేళ తగ్గుతున్నా కూడా, వేగం పెంచుతూ సంచయనం ఇంకా జరుగుతూనే ఉంటుంది. పునరుత్పత్తి స్థాయి పాదార్ధికంగా విస్తరించడమే కాక,  అదనపు విలువ ఉత్పత్తి కూడా పెరుగుతుంది - అదనపు పెట్టుబడి విలువకన్నా వేగంగా. 

శ్రమ ఉత్పాదక శక్తి పెరుగుదల ప్రభావం అప్పటికే ఉత్పత్తి ప్రక్రియలో ఉన్న మొదటి పెట్టుబడి మీద కూడా ఉంటుంది. క్రియాత్మక స్థిర పెట్టుబడిలో ఒక భాగం యంత్రాల వంటి శ్రమ సాధనాలు. అవి చాలా కాలం పాటు పనిచేస్తాయి. త్వరగా వినియోగం అవవు. కాబట్టి చాలాకాలం వాటిని మార్చాల్సిన అవసరం ఉండదు. వాటి స్థానంలో కొత్తవాటిని పెట్టాల్సిన పని ఉండదు. అయితే ప్రతి ఏడూ కొన్ని శ్రమ సాధనాలు అరిగిపోయి, పనికిరావు. పనిచేసే పరిమితిని దాటతాయి. అటువంటి వాటినే కొత్తవి తిరిగి వాటిస్థానంలో పెట్టాల్సి వస్తుంది. శ్రమ సాధనాలు వాడకం అవుతున్న సమయంలో, శ్రమ ఉత్పాదకత పెరిగితే, పాత వాటి స్థానంలో మరింత సమర్ధవంతమైన, చౌకయిన యంత్రాలూ, పరికరాలూ, ఇతర ఉపకరణాలూ పెట్టబడతాయి.( సైన్సూ, సాంకేతికతల నిరంతరాయమైన అభివృద్ధి వల్ల శ్రమ ఉత్పాదకత పెరుగుతూ పోతుంది). పాత పెట్టుబడి మరింత ఉత్పాదక రూపంలో పునరుత్పత్తి అవుతుంది.
స్థిరపెట్టుబడిలో మరొక భాగం ముడి పద్దార్ధమూ, ఉపపదార్ధాలూ. భాగం సంవత్సరం లోపే పునరుత్పత్తి చేయబడుతుంది; వ్యవసాయంలో ఉత్పత్తయ్యేవటిలో ఎక్కువ భాగం  ఉత్పత్తవడానికి సంవత్సరం పడుతుంది. అందువల్ల, కొత్తగా వచ్చే ప్రతి  మెరుగుదలా, కొత్త పెట్టుబడి పైనే కాక అప్పటికే పనిచేస్తున్న పెట్టుబడి మీద కూడా ఏక కాలంలో పనిచేస్తుంది. 
ఉదాహరణకి,దారం వడికే ఒక ఇంగ్లండ్ పనివాడూ, ఒక చైనా పనివాడూ ఒకే గంటలు, ఒక శ్రమ తీవ్రతతో పనిచేయ్యవచ్చు. అప్పుడు ఒక వారంలోఇద్దరూ సమాన విలువలు సృజిస్తారు. సమానత్వం ఉన్నాగాని, భారీ స్వయంచాలక యంత్రంతో పనిచేసే ఇంగ్లండ్  వాని వారం ఉత్పాదితం విలువకీ, రాట్నం మీద వడికే చైనావాని వారం ఉత్పాదితం విలువకీ భారీ వ్యత్యాసం ఉంటుంది. చైనావాడు పౌను పత్తి వడికే సమయంలోనే, ఇంగ్లాండ్ వాడు ఎన్నో వందల పౌన్ల పత్తి వడుకుతాడు. ఎన్నో వందల రెట్లు ఎక్కువగా వున్న పాతవిలువలమొత్తం అతని ఉత్పాదితం విలువని పెంచుతుంది. అతని ఉత్పాదితంవిలువలో పాతవిలువలు ప్రయోజనకరమైన కొత్త రూపంలో పునర్దర్శన మిస్తాయి. ఆవిధంగా అవి కొత్తగా పెట్టుబడిగా పనిచేస్తాయి.
ఫ్రెడరిక్ ఎంగెల్స్ చెప్పినట్లు: 1782 లో అంతకుముందు మూడేళ్ల ఉన్ని పంట,  పనివాళ్ళు లేక అలాగే పడివుంది. కొత్తగా యంత్రాలు వచ్చి వడకక పోయిఉంటే, ఆ పత్తి మొత్తం మూలనబడి ఉండేది.

యంత్రరూపంలో వస్తూత్వం చెంది ఉన్న శ్రమ తక్కువమంది శ్రామికులు, సాపేక్షంగా తక్కువ సజీవ శ్రమని కలిపి ఉన్నిని ఉత్పాదకంగా వినియోగించి దానికి కొత్త విలువని చేరుస్తుంది; అంతేకాకుండా, పాతవిలువని నూలు వగైరా రూపంలో భద్రపరుస్తుంది.  అదే సమయంలో అధిక ఊలు పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అందుకు అవసరమైన సాధనాల్ని సమకూర్చింది.కొత్త విలువని సృజిస్తూనే, ఉన్న పాతవిలువని భద్రపరచడం సజీవ శ్రమ యొక్క సహజ ధర్మం. అందువల్ల, దాని ఉత్పత్తిసాధనాల సమర్ధత, విస్తృతి, విలువల పెరుగుదల కారణంగా, అందువల్ల దాని ఉత్పాదకత పెరుగుదలని అనుసరించి  సంచయనం పెరగడంతో శ్రమ నిరంతరం పెరిగే పెట్టుబడి విలువని నిరంతర నూతన రూపంలో భద్రపరుస్తుంది, శాశ్వత పరుస్తుంది. శ్రమ కున్న సహజ శక్తి పెట్టుబడియొక్క శక్తిగా అగపడుతుంది - అది పెట్టుబడిలో భాగంగ కలిసి పోయిఉన్నందువల్ల. సామాజిక శ్రమ యొక్క ఉత్పాదక శక్తులు పెట్టుబడి యొక్క సహజ లక్షణాలుగా కనిపించినట్లే, పెట్టుబడిదారుడు నిరంతరం  అదనపు శ్రమని స్వాయత్తం చేసుకోవడం అనేది పెట్టుబడి యొక్క నిరంతర స్వయం విస్తరణగా కనిపించినట్లే, ఇది కూడా కనిపిస్తుంది.
సాంప్రదాయ అర్ధశాస్త్రం పునరుత్పత్తికి సంబంధించి ప్రధానమైన అంశాన్ని గ్రహించలేదు. కారణం శ్రమ ప్రక్రియ విశ్లేషణా, విలువను సృజించే ప్రక్రియ విశ్లేషణా లోపభూయిష్టంగా ఉండడమే. రికార్డో చెప్పినదాన్ని చూస్తే ఇది తేటతెల్లమవుతుంది.
సాంప్రదాయ అర్ధశాస్త్రం పునరుత్పత్తికి సంబంధించి ప్రధానమైన అంశాన్ని గ్రహించలేదు. కారణం శ్రమ ప్రక్రియ విశ్లేషణా, విలువను సృజించే ప్రక్రియ విశ్లేషణా లోపభూయిష్టంగా ఉండడమే. రికార్డో చెప్పినదాన్ని చూస్తే ఇది తేటతెల్లమవుతుంది. ఉదాహరణకి, ఆయనిలా అంటాడు: ఉత్పాదక శక్తిలో ఎటువంటి మార్పు సంభవించినా 'పదిలక్షలమంది కార్ఖానా కార్మికులు ఎల్లప్పుడూ ఒకే విలువని ఉత్పత్తిచేస్తారు.' ఇది సరైనదే,  కాని ఏపరిస్థితుల్లో? వాళ్ళ శ్రమ విస్తృతీ, తీవ్రతా స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే.
వారందరిలో ఒకే ఉత్పాదక శక్తి ఉండదు. వేర్వేరు ఉత్పాదక శక్తులుంటాయి. కాబట్టి వాళ్ళు వేర్వేరు ఉత్పత్తిసాధనాల రాశుల్ని ఉత్పాదితాలుగా మారుస్తారు.తద్వారా ఉత్పాదితాల్లో వేర్వేరు విలువ రాశుల్ని భద్రపరుస్తాయి. అలా చెయ్యకుండానికి ఆటంకం ఉండదు.అందువల్ల తయారుచెయ్యబ్డే ఉత్పాదితాల విలువలు బాగా భిన్నంగా ఉంటాయి. (రికార్డో తన కొన్ని నిర్ధారణల్లో వాస్తవాన్ని  గమనించడు).
3.నియోగించిన పెట్టుబడికీ, వినియోగమైన పెట్టుబడికీ మధ్య పెరిగే వ్యత్యాసం
 పెట్టుబడి పెరుగుదలతో నియోగమైన పెట్టుబడికీ, వినియోగమైన పెట్టుబడికీ వ్యత్యాసం పెరుగుతుంది. వేరే  మాటల్లో, భవనాలూ, యంత్రాలూ, మురుగునీటి గొట్టాలూ పనిచేసే పశువులూ వంటి శ్రమ సాధనాల విలువా, రాశీ పెరుగుతుంది. ఉత్పాదితాలకు విలువని కలపకుండానే శ్రమ సాధనాలు   నిరంతరాయంగా పునరావృతమయ్యే ఉత్పత్తి ప్రక్రియలో, ఉత్పాదితాల తయారీలో ఉపకరిస్తాయి- ప్రత్యేకమైన ప్రయోజనక ఫలితాల్ని సాధించడానికి. ఆ శ్రమ సాధనాలు ఎక్కువ కాలమో, తక్కువకాలమో పని చేస్తాయి. అయితే అవి క్రమేపీ అరిగిపోతుంటాయి. కాబట్టి తమ విలువని కొద్దికొద్దిగా కోల్పోతూ, కోల్పోయే విలువని కొంచెంకొంచెంగా ఉత్పాదితానికి బదిలీ చేస్తాయి. ఆ ఉత్పాదితాలకు విలువని కలపకుండానే ఈ శ్రమ సాధనాలు   నిరంతరాయంగా పునరావృతమయ్యే ఉత్పత్తి ప్రక్రియలో, ఉత్పాదితాల తయారీలో ఉపకరిస్తాయి- ప్రత్యేకమైన ప్రయోజనక ఫలితాల్ని సాధిస్తాయి. ఉత్పాత్తి కారకాలుగా విలువని కలపకుండానే , సంపూర్ణంగా నియోగించబడినా, పాక్షికంగా మాత్రమే వినియోగమవుతాయి. అవి ఏ నిష్పత్తిలో అయితే వినియోగమవుతాయో, అదే నిష్పత్తిలో ఉచిత సేవ చేస్తాయి. ఇంతకు ముందు మనం చూసినట్లుగా, అవి ప్రకృతి శక్తులైన నీరూ,ఆవిరీ, గాలీ, విద్యుచ్ఛక్తీ వగైరాలు ఏనిష్పత్తిలో ఉచిత సేవ  చేస్తాయో అదే నిష్పత్తిలో ఉచిత సేవ చేస్తాయి. గతశ్రమ యొక్క ఉచిత సేవని సజీవ శ్రమ పట్టుకొని జవసత్వాలతో నింపితే, సంచయనపు పెరుగుదల దశలతో పాటు ఉచిత సేవ కూడా పెరుగుతుంది.
పెట్టుబడి ముసుగులో గతశ్రమ
గత శ్రమ ఎల్లవేళలా పెట్టుబడిగా ముసుకేసుకొని ఉంటుంది. అంటే,A, B, C మొదలైనవారి శ్రమకి చెల్లించాల్సిన / పడ్డ అప్పు శ్రమచెయ్యని X ఆస్థిగా మారువేషం ధరిస్తుంది. అందువల్ల బూర్జువాలూ, రాజకీయ ఆర్ధిక వేత్తలూ మృత శ్రమ, గతశ్రమ(dead and gone labour) చేసే సేవను కీర్తిస్తారు. స్కాట్ లాండ్ మేధావి మెక్కుల్లాక్ గత శ్రమకు వడ్డీ, లాభం వంటి రూపాల్లో ప్రత్యేక పారితోషికం వచ్చితీరాలి అన్నాడు. ఉత్పత్తిసాధనాల రూపంలో  శ్రమ ప్రక్రియకు గతశ్రమ సజీవ శ్రమకు శక్తివంతమైన, నిరంతర సహాయం అందిస్తుంది.  ఆ సహాయం చెల్లించబడని శ్రమగా, కార్మికుని నుండే పరాయీకరించబడిన గత శ్రమ రూపానికి,  అంటే  పెట్టుబడిదారీ రూపానికి ఆపాదించబడింది. పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రతినిధులూ, ‘అల్పమైనవాటికి అనల్పమైన ప్రాధాన్యతనిచ్చే’ (pettifogging) వారి సిద్ధాంతకర్తలూ ఉత్పత్తి సాధనాల్ని, అవి వేసుకున్న శతృపూరిత సామాజిక ముసుగునుంచి వేరుపరచి ఆలోచించలేకపోయారు- ఒక బానిస యజమాని శ్రామికున్ని, బానిసగా ఆ శ్రామికుని స్వభావాన్నించి వేరుగా ఎలా చూడలేడో అలాగే. 
4.అడ్వాన్స్ చేసిన పెట్టుబడి పరిమాణం
శ్రమశక్తి దోపిడీ ఒకనొకస్థాయిలో ఉన్నప్పుడు, ఉత్పత్తయ్యే అదనపువిలువ ఏకకాలంలో దోపిడీ చెయ్యబడే శ్రామికుల సంఖ్యనుబట్టి నిర్ణయమవుతుంది; ఇది పెట్టుబడి పరిమాణానికి అనుగుణంగా ఉంటుంది- వేర్వేరు నిష్పత్తుల్లో అయినప్పటికీ. ఆవిధంగా వరస సంచయనాల వల్ల ఆపెట్టుబడి పెరిగేకొద్దీ, వినియోగనిధిగానూ, సంచయన నిధిగానూ విభజితమయ్యే మొత్తం విలువ మరీమరీ పెరుగుతుంది. అందువల్ల పెట్టుబడిదారుడు మరింత జాలీ జీవితం గడపగలడు, అదే సమయంలో మరింతగా 'కోర్కెల వర్జింపు ' పాటించినట్లు కనపడగలడు. చివరగా, అడ్వాన్స్ పెట్టిన పెట్టుబడి రాశి  విస్తరణతోపాటు, ఉత్పత్తి స్ప్రింగులు అన్నీ మరింత స్థితిస్థాపకతతో పనిచేస్తాయి. ఉత్పత్తి స్థాయి మరింతగా విస్తృతమవుతుంది.   
వచ్చే పోస్ట్ :శ్రామిక నిధి అనబడేది