19, అక్టోబర్ 2017, గురువారం

డబ్బు పెట్టుబడిగా మారడం

కాపిటల్  ఒకటో సంపుటం
రెండో భాగం – ఇందులో 3 అధ్యాయాలున్నాయి:
1.డబ్బు పెట్టుబడిగా మారడం
2.పెట్టుబడి సాధారణ సూత్రంలోని వైరుధ్యాలు
3. శ్రమ శక్తి  కొనుగోలూ అమ్మకమూ
                ***        
  1. డబ్బు పెట్టుబడిగా మారడం
డబ్బు గురించీ, సరుకుల చలామణీ గురించీ మూడో చాప్టర్లో చర్చించాడు. ఇప్పుడిక నాలుగోదాంట్లో పెట్టుబడి వైపు చూస్తాడు. ముందుగా సరుకు చలామణీ నుంచి పెట్టుబడి పరివర్తనని వివరిస్తాడు. తొలి  వాక్యం లోనే క్లుప్తంగా చెబుతాడు:  
పెట్టుబడికి ఆరంభ బిందువు (starting-point) సరుకుల చలామణీయే.
పెట్టుబడి తలెత్తడానికి చారిత్రిక పునాదిని ఏర్పరచే పరిస్థితులు:
1.సరుకుల ఉత్పత్తీ
2.సరుకుల చలామణీ . దాని అభివృద్ధి చెందిన రూపం అయిన  వాణిజ్యమూ.
చారిత్రకంగా 16వ శతాబ్దంలో వాణిజ్యమూ, మార్కెట్ రెండూ ప్రపంచమంతా విస్తరించాయి. కనుక అప్పుడు ఆధునిక పెట్టుబడి చరిత్ర ఆరంభమయింది.
 సరుకుల చలామణీ యొక్క భౌతిక అంశాన్ని, అంటే వివిధ ఉపయోగపు విలువల మారకాన్ని వదిలిపెట్టి, ఆర్దికరూపాల్ని మాత్రమే చూస్తే, చలామణీ ప్రక్రియ యొక్క అంతిమ  ఫలితం డబ్బు అని గ్రహిస్తాం:
 సరుకుల చలామణీ యొక్క అంతిమ ఫలితమే (డబ్బే) పెట్టుబడి కనబడే మొదటిరూపం. 

చారిత్రకంగా చూస్తే, భూసంపదకి భిన్నంగా పెట్టుబడి అనేది మొదట అనివార్యంగా డబ్బు రూపం తీసుకుంటుంది. ‘డబ్బు సంపద’ గా కనబడుతుంది. వర్తకుడి పెట్టుబడిగా, వడ్డీ వ్యాపారి పెట్టుబడిగా కనబడుతుంది. భూసంపదతతో పెట్టుబడి ఘర్షణ డబ్బు సంపదతో మొదలవుతుంది. ఈ విషయాన్ని తెలిపే ఫుట్ నోట్ ఉంది:
భూసంపద కలిగించే  ఆధిపత్యం, దాస్యం అనే వ్యక్తి సంబంధాలమీద ఆధారపడ్డ  అధికారానికీ, డబ్బువల్ల వచ్చే వ్యక్తిగతం కాని అధికారానికీ ఉన్న తేడాని రెండు ఫ్రెంచ్ సామెతలు చక్కగా చెబుతాయి. ఆసామెతలివే:
1.ప్రభువు లేని భూమి ఉండదు. 2.డబ్బుకి యజమాని ఉండడు.
పెట్టుబడి ఆరంభ రూపం డబ్బు అని చెప్పేందుకు ప్రత్యేకంగా పెట్టుబడి పుట్టుక దాకా పోవాల్సిన పని లేదు. అది రోజూ మన కళ్ళెదుట జరుగుతున్నదే. కళ్ళకు కట్టినట్లు కనబడేదే. ప్రతి కొత్త పెట్టుబడీ మనకాలంలో కూడా డబ్బు గానే  మార్కెట్లోకి  దిగుతుంది. ఆ మార్కెట్ సరుకులది కావచ్చు, శ్రమదికావచ్చు, డబ్బుది కావచ్చు. రంగంలో కొచ్చిన ఆడబ్బు ఒక నిర్దిష్ట ప్రక్రియ ద్వారా పెట్టుబడిగా మార్చబడుతుంది.
అంటే, డబ్బు దానికదిగా పెట్టుబడి కాదు. అది పెట్టుబడి లోకి మార్చబడాలి. ఒక నిర్దిష్టమైన ప్రక్రియ ద్వారా డబ్బు పెట్టుబడి అవుతుంది.  
కేవలం డబ్బు మాత్రమే అయిన డబ్బుకీ, పెట్టుబడి అయిన డబ్బుకీ మనం గమనించగల మొదటి తేడా వాటి చలామణీ రూపంలో తేడా తప్ప మరేమీ కాదు.
స-డ-స వలయం రూపం
సరుకుల చలామణీ యొక్క అత్యంత సరళ రూపం: స-డ-స. సరుకులు డబ్బు లోకి మారడం, తిరిగి ఆడబ్బు సరుకుల్లోకి మారడం. అంటే కొనడం కోసం అమ్మడం. సరుకుల్ని అమ్మడంలో ఉద్దేశ్యం వాడకం కోసం మరొక రకం సరుకుల్ని కొనడం.
డ-స-డ వలయం రూపం 

దీని పక్కనే దీనికి భిన్నమైన రూపాన్నికూడా చూస్తాం: డ-స-డ. డబ్బుని సరుకుల్లోకి మార్చడం, సరుకుల్ని తిరిగి డబ్బులోకి మార్చడం. అంటే, అమ్మడం కోసం కొనడం. ఇక్కడ కొనడం ఉద్దేశ్యం వాడకం కాదు. ఈ రెండో సరళిలో చలామణీ అయ్యే డబ్బు పెట్టుబడిలోకి మారుతుంది, అప్పటికే స్థితిజ పెట్టుబడిగా(potentially capital) వున్న డబ్బు పెట్టుబడిగా అవుతుంది
డ-స-డ వలయాన్ని మరింత దగ్గరగా పరిశీలిస్తాడు. స-డ-స లో ఉన్నట్లే ఇందులోనూ రెండు విరుద్ధ దశలు ఉన్నాయి. మొదటిది డ-స , కొనుగోలు. డబ్బు సరుకులోకి మారుతుంది. రెండో దశ స-డ, అమ్మకం. సరుకు తిరిగి డబ్బులోకి మారుతుంది.
డబ్బుతో సరుకుతో మారి. సరుకు తిరిగి డబ్బులోకి మారుతుంది. సరుకుని కొనడం దేనికి? అమ్మడానికి. కొనడానికీ, అమ్మడానికీ రూపంలో ఉన్న తేడాని వదిలేస్తే మొత్తం చర్య సరుకుని డబ్బుతో కొనడం, తర్వాత సరుకుతో డబ్బునికొనడం.2. (2.డబ్బుతో సరుకులు కొంటారు. సరుకులతో డబ్బుని కొంటారు- Mercier de la Rivière)
ఫలితం డబ్బుతో డబ్బు మారకం అవడం, డ-డ. నేను 2 వేల పౌన్ల దూదిని 100పౌన్లకి  కొని  దాన్ని 110 పౌన్లకి అమ్మితే, నేను 100 పౌన్లను 110 పౌన్లకు మారకం చేసినట్లు.
 రెండు సమానమొత్తాల డబ్బుని 100 కి 100 పౌన్లు మారకంచేసుకోవడంలో ఉద్దేశ్యం అర్ధంలేనిది. అలా చేసుకుంటే, డ-స-డ వలయం అసంబద్ధమైనది. రెండు సమానమొత్తాల డబ్బుని 100 కి 100 పౌన్లు మారకంచేసుకోవడంలో ఉద్దేశ్యం అర్ధంలేనిది. అలా చేసుకుంటే, డ-స-డ వలయం అసంబద్ధమైనది. పీనాసి పధకం ఇంతకన్నా సింపిల్ అయినదీ, కచ్చితమైనదీ. అతను తన 100పౌన్లనూ చలామణీలో పెట్టాడు. కనుక ఏ రిస్కూ చెయ్యకుండా తనదగ్గరే ఉంచుకుంటాడు. తన దూదికి 100పౌన్లు చెల్లించిన వర్తకుడు, దాన్ని 110 పౌన్లకు అమ్మినా, లేదా 100కే పోనిచ్చినా, పోనీ 50పౌన్లకే ఇచ్చినా ప్రతి సందర్భం లోనూ అతని డబ్బు విలక్షణమైన, మౌలికమైన చలనం జరుపుతుంది. ఈ చలనం ధాన్యం అమ్మి వచ్చిన డబ్బుతో బట్టలు కొనే రైతు చేతిలో పొందే చలనానికి  భిన్నమైనది. అందువల్ల మనం డ-స-డ వలయాన్నీ, స-డ-స వలయాన్నీ వేరుపరిచే  లక్షణాల్ని ముందుగా పరిశీలించాలి. అలా చేసే క్రమంలో కేవలం  రూపంలోఉన్న భేదం వెనక ఉన్న నిజమైన భేదం దానికదే బయటపడుతుంది.

ఈ రెండు రూపాలకీ ఉన్న ఉమ్మడి అంశాలు
1.రెండు వలయాలనూ అమ్మకమూ (సరుకు-డబ్బు) కొనుగోలూ (డబ్బు-సరుకు)అనే రెండు దశలుగా విడదీయవచ్చు.
2. ప్రతి దశలోనూ సరుకూ,డబ్బూ అనే భౌతిక అంశాలే ఉంటాయి.
3.అమ్మేవాడూ, కోనేవాడూ అనే నాటక పాత్ర/వేషధారులే ఒకరికొకరు తటస్థపడతారు.
4. ప్రతి వలయమూ అవే విరుద్ధదశల ఐక్యత.
5.ఈ ఐక్యత రెండు సందర్భాల్లోనూ ముగ్గురు ఒప్పందం లోకి వచ్చే వ్యక్తుల ప్రమేయంతో ఏర్పడుతుంది. వీళ్ళలో ఒకడు కేవలం అమ్ముతారు, మరొకడు కేవలం కొంటారు, మూడో వాడు రెండూ చేస్తాడు - అంటే  అమ్ముతాడూ, కొంటాడూ.

రెండు వలయాలకూ ఉన్న తేడాలు

1.డ-స-డ వలయాన్నించి స-డ-స వలయాన్ని  మొదటగా, ముఖ్యంగా వేరుపరిచేదేమంటే : వాటిలోని రెండు దశలు తిరగబడిన క్రమంలో ఉంటాయి. డ-స-డ లో ముందు డ-స దశ, తర్వాత స-డ దశ. స-డ-స లోముందు స-డ దశ తర్వాత డ-స దశ.
2.సరళ చలామణీ (స-డ-స వలయం) అమ్మకంతో మొదలై కొనుగోలుతో ముగుస్తుంది. పెట్టుబడిగా డబ్బు చలామణీ (డ-స-డ వలయం) కొనుగోలుతో ఆరంభమై అమ్మకంతో అంతమవుతుంది.
3.స-డ-స లో ప్రారంభాంశమూ లక్షితాంశమూ రెండూ  సరుకులు. డ-స-డ విషయానికొస్తే అదీ ఇదీ డబ్బు.
4.స-డ-స లో డబ్బు జోక్యంతో చలనం ఏర్పడింది. డ-స-డ లో కదలిక సరుకు ప్రమేయంతో వచ్చింది.
5. స-డ-స చివరలో డబ్బుతో మారిన సరుకు ఉపయోగపు విలువగా ఉపకరిస్తుంది. ఆడబ్బు అంతటితో ఖర్చయి పోయినట్లే. ఇందుకు భిన్నంగా డ-స-డ లో కొనేవాడు, తర్వాత అమ్మేవాడుగా డబ్బుని తిరిగి పొందడానికే ముందు ఖర్చు చేస్తాడు. సరుకుని కొనడం ద్వారా డబ్బుని చలామణీలో పడేస్తాడు – అదే సరుకుని అమ్మడం ద్వారా డబ్బుని తిరిగి తీసుకోవడానికే. డబ్బుని పోనిస్తాడు - కాని దాన్ని తిరిగి వెనక్కి లాక్కునే  కపట ఉద్దేశ్యంతో మాత్రమే. కనుక ఆడబ్బు ఖర్చు చేయబడ లేదు, కేవలం బయానాపెట్టబడింది (advanced). అలాగని జేమ్స్ స్టువర్ట్ చెప్పిన మాటలు ఫుట్ నోట్ లొ ఉంటాయి: ఒక వస్తువుని తిరిగి అమ్మడంకోసం కొంటే ఆడబ్బు బయానా అనబడుతుంది. అలా అమ్మడానికి కాకుండా కొంటే ఆడబ్బు ఖర్చయింది అని చెప్పబడుతుంది.
6. స-డ-స లో అదేడబ్బు రెండుసార్లు తనచోటు మార్చుకుంటుంది. అమ్మినవాడు కొన్నవాడి నుండి డబ్బు పొందుతాడు. దాన్ని మరొక అమ్మేవాడి చేతులో పెడతాడు. పూర్తీ చలామణీ అమ్మిన సరుకులకు డబ్బు తీసుకోవడంతో మొదలై, కొన్న సరుకులకు చెల్లించడంతో ముగుస్తుంది.
డ-స-డ వలయంలో ఇందుకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఇందులో రెండు మార్లు చోటు మారేది డబ్బు కాదు, సరుకు. కొనేవాడు అమ్మినవాని నుండి సరుకు తీసుకొని, మరొక కొనేవాడి చేతిలో పెడతాడు.
7.సరుకుల సరళ చలామణీలో ఒకే డబ్బు రెండు సార్లు చోటు మారడం ఒకని చేతినుంచి మరొకని చేతిలోకి ఎలా పంపించగలిగిందో, అలాగే ఇక్కడ ఒకే సరుకు రెండు సార్లు చోటుమారడం డబ్బుని బయలుదేరిన చోటుకే చేరేట్లు చేస్తుంది.
 ఇలా తిరిగిరావడం అనేది సరుకుకి చేల్లించినంతకంటే ఎక్కువ డబ్బుకి అమ్మడం మీద ఆధారపడి ఉండదు. ఈ పరిస్థితి వెనక్కివచ్చే డబ్బు పరిమాణం మీద మాత్రమే ప్రభావం చూపుతుంది. కొన్నసరుకు తిరిగి అమ్ముడవగానే - వేరే మాటల్లో, డ-స-డ వలయం పూర్తి కాగానే -  ఈ ‘వెనక్కి తిరిగి రావడం’ (reflux) జరుగుతుంది. అందువల్ల, ఇక్కడ పెట్టుబడిగా డబ్బు చలామణీకీ, కేవలం డబ్బుగా డబ్బు చలామణీకీ తేడా స్పష్టంగా తెలుస్తుంది.
 సరుకు అమ్మగా వచ్చిన డబ్బుతో మరోకసరుకు కొని ఆడబ్బుని ఉపసంహరించగానే స-డ-స వలయం పూర్తవుతుంది. అయినప్పటికీ, డబ్బు దాని ఆరంభ స్థానానికి చేరుకున్నదీ అంటే , ఆ  చర్య పునరావృతం అవడం వల్ల మాత్రమే జరుగుతుంది. నేను 3పౌన్లకు ధాన్యం అమ్మి, దాన్నిబెట్టి బట్టలు కొంటే, నాకు సంబంధించి ఆడబ్బు ఖర్చియింది. అది బట్టల వర్తకుడికి చెందింది. నీనిప్పుడు మరొక పావు ధాన్యం అమ్మానంటే, మళ్ళీ నాకు డబ్బొస్తుంది. అయితే ఈ డబ్బు మొదటి లావాదేవీ వల్ల వచ్చింది కాదు. అలాంటిదే మరొక లావాదేవీ వల్ల. మళ్ళీ నేను కొత్తగా సరుకులు కొని ఈ రెండో లావాదేవీని ముగిస్తే, ఈ డబ్బు నన్ను వదలిపెట్టి వెళ్ళిపోతుంది.వలయం ముగుస్తుంది  
మరొకవైపు , డ-స-డ వలయంలో డబ్బు తిరిగి రావడం అనేది అది వ్యయమయ్యే విధానం చేత నియంత్రిత మవుతుంది. తిరిగి రావడం అనేది లేకపోతే, చర్య విఫలమైనట్లే, లేక  ప్రక్రియకి అంతరాయం ఏర్పడ్డట్లు, అది అసంపూర్ణంగా ఉన్నట్లు –ఎందు వల్లంటే: చివరి దశ (స-డ)  లేనందువల్ల.
8. స-డ-స వలయం ఒక సరుకుతో మొదలై మరొక సరుకుతో ముగుస్తుంది.ఆరెండో సరుకు చలామణీ నుంచి బయటపడి వాడకంలోకి పోతుంది.వాడకం/వాడుకోవడం (Consumption) కోర్కెలు తీర్చుకోవడం. ఒక్క ముక్కలో చెబితే,ఉపయోగపు విలువ అనేదే దీని గమ్యమూ, లక్ష్యమూ. ఇందుకు వ్యతిరేకంగా డ- స-డ వలయం డబ్బుతో మొదలై డబ్బుతో ముగుస్తుంది.అందువల్ల, దాన్ని నడిపించే ఉద్దేశ్యమూ, దాని లక్ష్యమూ కేవలం మారకంవిలువే. సరళ సరుకుల చలామణీలో రెండు చివరలా ఒకే ఆర్ధిక రూపం ఉంది. ఇరువైపులా ఉన్న  రెండూ సరుకులే. సమాన విలువగల సరుకులు. అయితే అవి గుణాత్మకంగా భిన్నమైన ఉపయోగపు విలువలు కూడా. ఉదాహరణకి,ధాన్యమూ, బట్టలూ. సమాజ శ్రమ రూపొందిన భిన్న వస్తువుల మారకం ఈ చలనానికి ఆధారం.

డ-స-డ ఇందుకు భిన్నమైనది. ఇది చూడగానే లక్ష్యం లేనిది అనిపిస్తుంది. రెండు చివరలా ఒకే ఆర్ధిక రూపం ఉంది. అది డబ్బు. అటూ డబ్బే, ఇటూ డబ్బే. కనుక అవి గుణాత్మకంగా భిన్నమైన ఉపయోగపు విలువలు  కావు. ఎందుకంటే, డబ్బనేది సరుకుల మారిన రూపం, ఏ రూపంలో అయితే వాటి ప్రత్యేక ఉపయోగపు విలువలు అదృశ్యం అవుతాయో ఆరూపం. డబ్బుకి డబ్బుని మార్చుకోవడం అర్ధం లేనిది కనుక. 100 పౌన్లని దూదిగా మార్చి, అదే దూదిని తిరిగి 100పౌన్లకి మార్చడం అంటే డబ్బుని డబ్బుకి మార్చడం అని చుట్టూ తిరుగుడుగా చెప్పడమే. దాని కోసమే దాన్ని మార్చడం. ఈ చర్య కేవలం ప్రయోజనం లేనిదిగా, అసంబద్ధమైనదిగా అగపడుతుంది.
 దీన్ని వివరించే ఫుట్ నోట్ చూద్దాం:
డబ్బుని డబ్బుతో ఎవ్వరూ మారకం చేసుకోరు.అని Mercier de la Rivière మర్కెంటలిస్టులకు చెబుతాడు. భిన్న రకాల వస్తువుల మారకమే వర్తకం. వస్తువుల భిన్నత్వం వల్లనే (వ్యాపారికా?) ప్రయోజనం చేకూరుతుంది. ఒక పౌను రొట్టెతో పౌను రొట్టెను మార్చడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. అందువల్ల డబ్బుని డబ్బుతో మార్చే జూదానికి వర్తకం భిన్నమైనది- అంటాడు థామస్ కార్పెట్(1841)
డ-డ, డబ్బు డబ్బుతో మారడం వర్తక పెట్టుబడి చలామణీ యొక్క లాక్షణిక రూపం.వర్తక పెట్టుబడికి మాత్రమే కాదు  అన్ని పెట్టుబడుల చలామణీ యొక్క  లాక్షణిక రూపం. ఈ విషయాన్ని కార్పెట్ గ్రహించలేదు. అయినప్పటికీ, ఈ రూపం జూదానికీ, ఒక రకం వర్తకం అయిన చట్టా వ్యాపారానికీ  (speculation) ఇది ఉమ్మడి రూపం అని అంగీకరించాడు. అప్పుడు మాకుల్లాక్ రంగంలోకి వచ్చాడు. అమ్మడంకోసం కొనడం అనేది చట్ట వ్యాపారమే అన్నాడు. వర్తకానికీ, చట్టావ్యాపారానికీ తేడా లేకుండా పోతుంది.- మాకుల్లాక్ (1847). అంతకు మించిన అమాయకత్వంతో/ఆమాత్రం విమర్శనా శక్తి కూడా లేని అంస్టర్ డాం పిండార్ అయిన పింటో : వ్యాపారం ఒక ఆట. బిచ్చగాళ్ళ నుంచి గెలుచుకునేది ఏదీ ఉండదు. ఎల్లవేళలా, ఒకడే అందరినించీ మొత్తం పొందితే, తిరిగి ఆట మొదలుపెట్టడానికి తనంత తానూ ఐచ్చికంగా తనకొచ్చిన లాభంలో ఎక్కువ భాగం వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది- పింటో (1771)
పిండార్ (క్రీ.పూ.522-442) ఒలంపిక్ విజేతలని కీర్తిస్తూ పాటలు రాశాడు.
పింటో : ( క్రీ.శ.1715-87) అంస్టర్ డాం కి చెందిన సంపన్న వర్తకుడు, చట్టా వ్యాపారి. తన దేశ ద్రవ్య వ్యవస్థని కీర్తిస్తూ పుస్తకాలు రాశాడు.
అందుకే పింటో ని మార్క్స్  'అంస్టర్ డాం స్టాక్ ఎక్స్చేంజ్ పిండార్ '  అన్నాడు.
అదనపు విలువ
ఒక డబ్బు మొత్తం మరొక డబ్బు మొత్తంతో తేడాగా ఉండేది దాని ‘మొత్తం’ వల్ల మాత్రమే.అంటే 100 పౌన్లకీ 110 పౌన్లకీ, తేడా ఉంది. ఇది స్పష్టమే. అదీ డబ్బే ఇదీ డబ్బే. గుణాత్మకంగా తేడా లేదు. కాని పరిమాణంలో తేడా ఉంది. డ-స-డ లో  మొదట చలామణీలో పెట్టిన దానికంటే చివరలో ఎక్కువ డబ్బు వస్తుంది. 100పౌన్లకి కొన్న దూది బహుశా తిరిగి (100+10) 110పౌన్లకి తిరిగి అమ్మబడుతుంది. అందువల్ల దీని కచ్చితమైన రూపం డ-స-డ’. ఇందులో డ’ =డ+ Δ డ. అంటే, మొదట పెట్టినది+ పెరుగుదల(increment). ఈ పెరుగుదలనే, అసలు విలువమీద ఎక్కువనే నేను అదనపువిలువ అంటున్నాను. అందువల్ల మొదట అడ్వాన్స్ చేసిన విలువ చలామణీలో చెక్కుచెదరకుండా ఉండడమే కాకుండా, తనకుతాను అదనపు విలువను కలుపుకుంటుంది, లేక తననుతాను వ్యాకోచింప చేసుకుంటుంది. దాన్ని పెట్టుబడిలోకి మార్చేది ఈచలనమే.

స-డ-స లోకూడా రెండు చివరలూ స-స. ధాన్యమూ బట్టా పరిమాణంలో తేడాగా ఉండవచ్చు. రైతు తన ధాన్యాన్ని విలువకన్నా ఎక్కువకు అమ్మవచ్చు. లేక బట్టల్ని వాటివిలువకన్నా తక్కువకి కొనవచ్చు. మరొకపక్క అతను బట్టల వర్తకుని వల్ల మోసపోనూవచ్చు. అయితే ఇప్పుడు పరిశీలిస్తున్న చలామణీ రూపంలో విలువకు సంబంధించిన అటువంటి తేడాలు యాదృచ్చికం మాత్రమే. ధాన్యమూ బట్టలూ సమానకాలు అనే వాస్తవం డ-స-డ ని చేసినట్లుగా ఈమొత్తం ప్రక్రియని అర్ధరహితం చెయ్యదు. వాటి విలువల సమానత్వం దాని మామూలు క్రమానికి(normal course) తప్పనిసరైన షరతు.
కొనడం కోసం అమ్మడం అనే చర్య ని మళ్ళీ మళ్ళీ చెయ్యడం హద్దుల్లో ఉంటుంది. ఎందుచేతనంటే, దాని లక్ష్యం వాడకం, నిర్దిష్ట కోర్కెలు తీర్చుకోవడం. ఈ లక్ష్యం చలామణీ రంగం బయట ఉంటుంది. అయితే
అమ్మడం కోసం కొన్నప్పుడు, అందుకు భిన్నంగా మనం డబ్బుతో మొదలెట్టి డబ్బుతోనే, మారకం విలువ తోనే ముగిస్తాం; ఆవిధంగా చలనం ఎప్పటికీ ముగియనిది అవుతుంది. నిస్సందేహంగా, డ’ = డ+ Δ , 100 పౌన్లు 110 పౌన్లు అవుతాయి. అయితే వాటి గుణాత్మక అంశంలో మాత్రమే చూస్తే, 110 పౌన్లు  100పౌన్ల వంటివే, డబ్బే; కాని కాని పరిమాణాత్మకంగా పరిగణిస్తే, 110 పౌన్లు  100పౌన్ల లాగే ఒక నిర్దిష్ట, పరిమితిగల విలువ మొత్తం. ఇప్పుడు ఆ 110 పౌన్లనూ డబ్బుగా ఖర్చు చేస్తే, అవి  వాటి పాత్రని నిర్వహించడం నిలిచి పోతుంది. అవి ఇక కాసేపైనా పెట్టుబడి కావు. చలామణీ నుండి ఉపసంహరించ బడడం వల్ల అవి నిల్వగా ఘనీభవిస్తాయి. ప్రపంచం ఉండే ఆఖరి రోజు(doomsday) దాకా అవి ఆస్థితిలో(నిల్వగా) అలాగే ఉన్నా ఒక్క ఫార్తింగ్ (పెన్నీ లొ 4 వ వంతు, పౌన్డులో 960 వ వంతు నాణెం) అయినా వాటికి కలవదు/జతపడదు.
విలువ పెరగడమే లక్ష్యంగా పెట్టుకుంటే, ముందటి 100 పౌన్లని పెంచిన ప్రేరణే ఇప్పటి 110 పౌన్లనీ పెంచడానికీ  ఉంటుంది. ఎందుకంటే, అదీ ఇదీ రెండూ మారకం విలువయొక్క పరిమిత వ్యక్తీకరణలే. అందువల్ల, పరిమాణం పెంచుకొని అనంతమైన సంపదకి వీలైనంత చేరువ కావాలనే కాంక్ష రెంటికీ ఉంటుంది- అప్పటి 100 కి ఎంతో, ఇప్పటి 110 కీ అంతే. క్షణంపాటు, అడ్వాన్స్  పెట్టిన 100 పౌన్లనీ చలామణీలో దానికి  కలిసిన 10 పౌన్ల అదనపు విలువ నుండి వేరుపరచి చూడవచ్చు;అయితే వెంటనే ఆతేడా కనిపించకుండా పోతుంది.  
ప్రక్రియ చివరలో ఒక చేత్తో మొదట పెట్టిన 100 పౌన్లూ, రెండో చేత్తో అదనపు విలువ 10 పౌన్లూ తీసుకోము. మామూలుగానే 110 పౌన్లనీ తీసుకుంటాం. మొదటి 100 పౌన్లూ  పెరిగే ప్రక్రియని ప్రారభించడానికి తగినవిగా ఎలాఉన్నాయో, ఈ 110 పౌన్లు కూడా అలాగే తగి ఉన్నాయి. డబ్బు చలనాన్ని ముగించేది మళ్ళీ మొదలుబెట్టడానికే.
పెట్టుబడిని మూల పెట్టుబడిగానూ, లాభంగానూ అంటే పెట్టుబడి మీద పెరుగుదలగానూ విడగొట్టవచ్చు – ఈ లాభం తక్షణమే పెట్టుబడిలోకి మార్చబడి, మూల పెట్టుబడితొ పాటు చలనంలో పెట్టబడుతుంది.- ఎంగెల్స్
పెట్టుబడి చలామణీకి పరిమితులు ఉండవు

కొనుగోలూ దాన్ని అనుసరించి వచ్చే అమ్మకమూ ముగిసే ప్రతి విడి వలయపు అంతిమ ఫలితం ఇంకొక కొత్త వలయానికి ఆరంభ బిందువుని రూపొందిస్తుంది. సరుకుల సరళచలామణీ – అంటే కొనడం కోసం అమ్మడం – చలామణీతో సంబంధం లేని ఒక లక్ష్యాన్ని, ఉపయోగపు విలువల్ని సముపార్జించడం, కోర్కెలు తీర్చుకోవడం అనేలక్ష్యాన్ని నెరవేర్చే సాధనం. ఇందుకు విరుద్ధంగా పెట్టుబడిగా డబ్బు చలామణీ దానికదే లక్ష్యం. కారణం విలువ పెరుగుదల నిరంతరం పునరావృతమయ్యే ఈ చలనం లోపల మాత్రమే జరుగుతుంది.
అందువల్ల పెట్టుబడి చలామణీకి పరిమితులు ఉండవు.
అరిస్టాటిల్ అర్ధశాస్త్రాన్ని ద్రవ్యార్జన శాస్త్రానికి ఎదురు నిలుపుతాడు. అర్ధశాస్త్రంతో(Oeconomic) మొదలు పెడతాడు. జీవన భ్రుతి సంపాదించుకునే కళ అయినంత మేరకు బతకడానికి అవసరమైన వస్తువులు సంపాదనకే అది పరిమితమవుతుంది. అలా అది ఒక కుటుంబానికో,రాజ్యానికో ఉపయోగపడుతుంది –అలాంటి ఉపయోగపు విలువలే నిజమైన సంపద. ఎందుకంటే, జీవితాన్ని సుఖమయం చేసే వస్తువుల పరిమాణం అపరిమితంగా ఉండదు. వస్తువులు సంపాదించే మరొక రకం విధానం ఉంది. దానికి ద్రవ్యార్జన (Chrematistic) అనే పేరు సరిపోతుంది. ఇందులో సంపదలకి పరిమితులు ఉండవు.   

పెట్టుబడిదారుడి లక్ష్యం
ఈ చలనాన్ని ఉద్దేశించిన ప్రతినిధిగా, డబ్బు కలవాడు పెట్టుబడిదారుడు అవుతాడు. డబ్బు బయలుదేరే చోటూ, తిరిగి వచ్చి చేరే చోటూ అతడి జేబే. డ-స-డ చలామణీ కి ప్రాతిపదిక అయిన విలువ పెరుగుదల ఆతని లక్ష్యం అవుతుంది. ఎప్పటికప్పుడు అంతకంత సంపద సొంతం చేసుకోవడమే ఆతని చర్యలకు ఏకైక లక్ష్యం  అయిన మేరకు, అతడు పెట్టుబడి దారుడుగా, అంటే మూర్తీభవించిన పెట్టుబడిగా, చైతన్యమూ, ఇచ్చా ఉన్నవాడిగా వ్యవహరిస్తాడు. ఉపయోగపువిలువలు పెట్టుబడిదారుని లక్ష్యాలుగా ఎన్నడూ భావించరాదు. అలాగే ఎదో ఒక లావాదేవీలొ వచ్చే లాభం మాత్రమే అతని లక్ష్యంకాదు. అతని లక్ష్యం: ఎన్నటికీ ముగియ కుండా  లాభంచేసుకునే నిర్విరామ ప్రక్రియే. వర్తకుడు తాను ఆర్జించిన దానిని ఏమీ కానట్లు లెక్కలోకి తీసుకోడు. అతనెప్పుడూ భవిష్యత్తునే చూస్తుంటాడు- జేనోవేసి (1765)
పెట్టుబడి దారుడూ-  పిసినారీ
సంపదకోసంఅపరిమితమైన  పేరాశ, మారకం విలువ కోసం వేట అనేది పెట్టుబడి దారుడికీ, పిసినారికీ ఇద్దరికీ ఉండేదే. పిసినారి కేవలం  పిచ్చెక్కిన పెట్టుబదిదారుడయితే, పెట్టుబడి దారుడు హేతుబద్ధమైన పిసినారి.  మారకంవిలువని అనంతంగా పెంపుచేసుకోవాలి అని ఆశించే పిసినారి తన డబ్బుని చలామణీలో పెట్టకుండా కాపాడుకుంటాడు. విజ్ఞుడైన పెట్టుబడి దారుడు డబ్బుని నిరంతరాయంగా ఎప్పటికప్పుడు కొత్తగా చలామణీలో పెట్టడం ద్వారా అదే లక్ష్యాన్ని సాధిస్తాడు.
పెట్టుబడి దారుల్నినడిపించేది లాభ కాంక్షే
లాభంకోసం ఆరని కాంక్ష పెట్టుబడి దారుల్ని నడిపిస్తుంది.-మాకుల్లాక్(1830).ఈ అభిప్రాయం ఉన్న మాకుల్లాక్ వంటి వాళ్ళని అమితోత్పత్తి వంటి సైద్ధాంతిక సమస్యలు  వచ్చినప్పుడు, అదే పెట్టుబడి దారుణ్ణి, కేవలం ఉపయోగపు విలువలే లక్ష్యంగా పెట్టుకునే నీతిమంతుడైన పౌరుడిగా  మార్చడానికి  సంశయించలేదు/సంకోచించలేదు. అతను బూట్లు, టోపీలు,గుడ్లు, కాలికో మొదలైన ఉపయోగపు విలువల కోసం తీరని ఆకలి పెంచుకుంటాడని చెప్పడానికి ఏమాత్రం వెనకాడలేదు. ‘లాభకాంక్ష’ అంటే మారకపు విలువ కోసం అని  సరిగా చెప్పినా, మరొక సందర్భంలో  ఉపయోగపు విలువల కోసం అని తప్పుగా చెప్పినందుకు వాళ్ళని  విమర్శించాడు మార్క్స్.
పెట్టుబడి అంటే డబ్బు- పెట్టుబడి అంటే సరుకులు
సరళ చలామణీలో సరుకులవిలువ స్వతంత్రరూపం, అంటే డబ్బు రూపం పొందుతుంది. ఆ సందర్భంలో వాటిమారకానికి ఉపకరిస్తుంది. ఆ చలనం తుది ఫలితంలో కనబడకుండా పోతుంది. మరొక వైపు డ-స-డ చలామణీలో డబ్బూ, సరుకూ రెండూ రెండు విలువ మనుగడ రూపాలకి ప్రాతినిధ్యం వహిస్తాయి – డబ్బు విలువ సాధారణ స్థితి (mode), సరుకు దాని ప్రత్యేక స్థితి.
పెట్టుబడిని ఏర్పరచేది పదార్ధం కాదు. పదార్ధం విలువ –J.B. సే(1817)
అది ఒకరూపంనుండి మరొకరూపానికి నిర్విరామంగా మారుతూ ఉంటుంది; తద్వారా అది లేకుండా పోదు; పోకుండా ఆటోమాటిక్ క్రియాశీల స్వభావాన్ని సంతరించుకుంటుంది . ఇప్పుడు స్వయం ప్రవర్ధమాన విలువ దాని జీవితంలో వరసగా తీసుకునే రెండు రూపాల్నీ ఒకదానితర్వాత మరొకదాన్ని చూస్తే, మనం ఈ రెండు ప్రతిపాదనల్నీ చేరుకుంటాం:
1.పెట్టుబడి అంటే డబ్బు 2.పెట్టుబడి అంటే సరుకులు.
వస్తువుల్ని తయారుచెయ్యడానికి ఉపయోగించే కరెన్సీయే..... పెట్టుబడి- నూక్లియాడ్(1855)
పెట్టుబడి అనేది సరుకులే- జేమ్స్ మిల్ (1821)
విలువ క్రియాశీలమైన అంశం
వాస్తవానికి ప్రక్రియలో విలువ క్రియాశీలమైన అంశం. ఆ ప్రక్రియలో ఒకసారి డబ్బురూపం,ఇంకోసారి సరుకురూపం అదేపనిగా తీసుకుంటూనే, అదేసమయంలో తన పరిమాణాన్ని మార్చుకుంటుంది. అది తననుండి అదనపు విలువను తోసేయ్యడం ద్వారా తన్ను తాను వేరుపరుచుకుంటుంది. వేరే మాటల్లో, తొలి విలువ తనకుతానే పెరుగుతుంది. అదనపు విలువను కలుపుకునే చలనం దాని సొంత చలనం. కనుక దాని విస్తరణ  ఆటోమాటిక్ విస్తరణ, స్వయం విస్తరణ. అది విలువ కాబట్టి, తనకు విలువను కలుపుకోగల నిగూ
ఢ స్వభావాన్నిపొందింది. అది సజీవ సంతానాన్ని కంటుంది. లేదా కనీసం బంగారు గుడ్లనైనా పెడుతుంది.

సరుకు రూపంపొందకపోతే, డబ్బు పెట్టుబడి అవదు
అటువంటి ప్రక్రియలో విలువ క్రియాశీలమైన అంశం కాబట్టీ, ఒకసారి డబ్బు రూపం ఇంకోసారి సరుకురూపం తీసుకుంటుంది కాబట్టీ, అయినా ఈ అన్ని మార్పుల గుండా తననుతాను అలానే ఉంచుకుంటూనే, పెరుగుతూ ఉంటుంది కాబట్టీ, ఏ సమయంలోనైనా దాన్ని గుర్తించడానికి  దానికి ఒక స్వతంత్ర రూపం అవసరం. అది ఈరూపాన్ని డబ్బు ఆకారంలో మాత్రమే పొందుతుంది. విలువ తన సొంత ఉత్పత్తి యొక్క ప్రతి చర్యనీ  మొదలు పెట్టేదీ, ముగించేదీ మళ్ళీ మొదలు పెట్టేదీ డబ్బురూపంలోనే. అది 100 పౌన్లుగా మదలయింది. ఇప్పుడది 110 పౌన్లు....ఇంకా అలాగే ముందుకుపోతుంది. అయితే డబ్బు రెండు విలువ రూపాల్లో ఒకటి మాత్రమే. అయితే అది ఏదో సరుకు రూపంపొందకపోతే, అది పెట్టుబడి అవదు. ఇక్కడ డబ్బు సరుకుల మధ్య నిల్వ విషయంలో ఉన్నట్లు వైరుధ్యం ఏమీ లేదు. సరుకులు ఎంత రొతగాఉన్నా, దుర్వాసన కొడుతున్నా అవి నిజంగా డబ్బే ననీ, అంతకు మించి డబ్బునించి మరింత డబ్బుని పుట్టించే అద్భుతసాధనమనీ  పెట్టుబడి దారుడికి తెలుసు.
సరళ చలామణీ (స-డ-స) లో సరుకుల విలువ మహా అయితే వాటి ఉపయోగపు విలువలతో నిమిత్తం లేని స్వతంత్ర రూపాన్ని, అంటే డబ్బు రూపాన్ని, పొందాయి; అయితే అదే సమయంలో ఇప్పుడు పెట్టుబడి చలామణీ (డ-స-డ) లో హఠాత్తుగా సొంత చలనం ఉన్న  స్వతంత్ర పదార్ధంగా ప్రత్యక్షమవుతుంది. ఎందులో అయితే సరుకులూ డబ్బూ విలువ  తీసుకుని, వదిలేసే రూపాలుగా ఉంటాయో ఆ సొంత  జీవిత ప్రక్రియ గుండా విలువ నడుస్తున్నట్లు ఉంటుంది. అంతేకాదు, కేవలం సరుకుల సంబంధాలకి ప్రాతినిధ్యం వహించడానికి బదులు అదిప్పుడు ప్రైవేటు సంబంధాలలో ప్రవేశిస్తుంది. మూల విలువగానూ, అదనపు విలువగానూ తననుండి తన్ను  తాను వేరుపరుచుకుంటుంది. అదనపు విలువ 10 పౌన్ల వల్లనే మొదట పెట్టిన 100 పౌన్లూ పెట్టుబడి అయింది. అలా అయ్యీ అవగానే తేడా లేకుండా పోతుంది. రెండూ ఒకటై 110 పౌన్లవుతుంది.
ఇప్పుడు విలువ, ప్రక్రియలో విలువ, ఆవిధంగాపెట్టుబడి అవుతుంది. చలామణీ నుండి బయటకొస్తుంది,  మళ్ళీ చలామణీలో చేరుతుంది, తన వలయం లోపల ఉన్నదాన్ని ఉంచుకుంటుంది, తన్నుతాను పెంచుకుంటుంది. పెరిగిన మొత్తంగా మళ్ళీ బయటకొస్తుంది. కొత్తగా అదేపనిని ప్రారంభం చేస్తుంది.
పెట్టుబడి శాశ్వత స్వయం వర్ధమాన  విలువ –సీస్మాండీ
డ-డ’ డబ్బుని తెచ్చే డబ్బు పెట్టుబడి –పెట్టుబడి ప్రధమ వ్యాఖ్యాతలు మర్కెంటలిస్టుల వర్ణన ఇదే.
పెట్టుబడి సాధారణ ఫార్ములా
 ‘అమ్మడం కోసం కొనడం’, మరీ కచ్చితంగా ‘ఎక్కువకి అమ్మడం కోసం కొనడం’ (డ-స-డ’) అనేది ఒక తరహా పెట్టుబడికి, వర్తకుని పెట్టుబడి (merchants capital)కి మాత్రమే ప్రత్యేకమైన రూపం అయినట్లు అగుపిస్తుంది. అయితే, పారిశ్రామిక పెట్టుబడి(industrial capital) కూడా డబ్బే, సరుకుల్లోకి మార్చబడి, సరుకుల అమ్మకం ద్వారా మరింత డబ్బులోకి తిరిగి మార్చబడే డబ్బే. కొనడానికీ అమ్మడానికీ మధ్య విరామ సమయంలో, చలామణీ రంగం బయట జరిగే సంఘటనలు ఈ చలనం రూపాన్ని ప్రభావితం చెయ్యవు. చివరగా, వడ్డీ నిచ్చే పెట్టుబడి (interest-bearing capital) విషయంలో డ-స-డ’ చలామణీ  కుదించబడినట్లు అగపడుతుంది. మధ్య దశ లేకుండా డ-డ’ అనే రూపం అవుతుంది. మరింత డబ్బు అయిన డబ్బు,తనకంటే ఎక్కువైన విలువ అన్నమాట. అందువల్ల, తొలిపరిశీలనని (prima facie) బట్టి చలామణీ రంగంలో పెట్టుబడి సాధారణ ఫార్ములా: డ-స-డ’
పెట్టుబడి సాధారణ ఫార్ములాలో వైరుధ్యాల గురించి వచ్చే పోస్ట్




6 కామెంట్‌లు:

  1. "వర్తకుడు తాను ఆర్జినదానిని ఏమీ కానట్లు లెక్కలోకి తీసుకోడు. అతనెప్పుడూ భవిష్యత్తునే చూస్తుంటాడు- జేనోవేసి (1765)" టైప్ చెయ్యటం లో కొన్ని పదాలు తప్పిపోయినట్లున్నాయండి. నేను చదివే పుస్తకం‌లో ఫుట్ నోటుగా"అప్పుడు సంపాదించిన లాభాన్ని పెట్టుబడిదారుడు తృణీకరిoచినప్పటికీ అతని దృష్టి ఎప్పుడూ భవిష్యత్తు లాభంపైనే ఉంటుంది.(ఎ.జేనోవేసి 1765" అని ఉంది.

    రిప్లయితొలగించండి
  2. "అప్పటికే స్థితిజ పెట్టుబడిగా(potentially capital) వున్న డబ్బు పెట్టుబడిగా అవుతుంది" నేను చదివే పుస్తకం‌లో ఈ వాక్యం లేదండీ. స్థితిజ పెట్టుబడి అంటే ఏమిటో కొంత వివరంగా రస్తారా?

    రిప్లయితొలగించండి
  3. నేను చదివే పుస్తకం‌లో అంతా కలిపేసి రాయటం వల్ల కొంత గందరగోళంగా ఉంది. మీరు వాటిని ఒక వరుస క్రమం‌లో అంకెలతో విడదీసి రాయటం వల్ల చదవటానికి చాలా సౌలభ్యంగా ఉంది. చాలా చక్కగా విడదీసి రాసారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. మీరు ఇంగ్లీషులో చదివి తెలుగులోకి సొంతంగా అనువదిస్తున్నారా?

    రిప్లయితొలగించండి
  5. లాక్షణిక రూపం అంటే విలక్షణ రూపం అనే అర్ధమా. నా పుస్తకం‌లో విలక్షణ రూపం అని ఉంది. మీరు చక్కగా వలయం అన్నారు. నా పుస్తకం‌లో ఆవృత్తం అని వాడారు. బాగాలేదు.

    రిప్లయితొలగించండి
  6. "పిండార్ : ( క్రీ.శ.1715-87) అంస్టర్ డాం కి చెందిన సంపన్న వర్తకుడు, చట్టా వ్యాపారి. తన దేశ ద్రవ్య వ్యవస్థని కీర్తిస్తూ పుస్తకాలు రాశాడు" నెను చదివే పుస్తకం‌లో పిండార్: (క్రీ.పూ. 522-422) ఒలింపిక్ విజేతల్ని స్తుతిస్తూ గానం జేశాడు అని ఉంది.

    రిప్లయితొలగించండి