1, నవంబర్ 2017, బుధవారం

పెట్టుబడి సాధారణ సూత్రంలోని వైరుధ్యాలు

కాపిటల్  ఒకటో సంపుటం
రెండో భాగం – ఇందులో 3 అధ్యాయాలున్నాయి:
1.డబ్బు పెట్టుబడిగా మారడం
2.పెట్టుబడి సాధారణ సూత్రంలోని వైరుధ్యాలు
3. శ్రమ శక్తి  కొనుగోలూ అమ్మకమూ
*******
 పెట్టుబడి సాధారణ సూత్రంలోని వైరుధ్యాలు
విలువని మరింత విలువగా చెయ్యడమే పెట్టుబడి ఉద్దేశ్యం అని ఇంతకు ముందు అధ్యాయంలో చూశాం. అయితే అదెలా సాధ్యమో ఇంకా మనకి తెలియదు. కాని అది రోజూ మనకళ్ళముందు జరుగుతున్నదే. మన అనుభవంద్వారా తెలిసిందే.
డబ్బు పెట్టుబడిలోకి పరివర్తన చెందే చలామణీ రూపం డ-స-డ’. మొదట చలామణీలో పెట్టిన మొత్తం కంటే చివరలో ఎక్కువ మొత్తం అయ్యే చలామణీ రూపం. ఇప్పటి దాకా చేసిన పరిశీలనలు పెట్టిన డబ్బు ఎలా పెరుగుతుందో వివరించలేదు. అంతే కాక అదనపు విలువ అనేది ఏర్పడే అవకాశం ఉన్న చలామణీ రూపమే లేదని తోసిపుచ్చుతున్నట్లు కూడా అనిపిస్తుంది. ఇది సరుకుల స్వభావానికీ, విలువకీ, డబ్బుకీ, ఆఖరికి చలామణీ కి సంబంధించి ఇంతదాకా అభివృద్ధి పరచిన సూత్రాల్ని తిరస్కరిస్తుంది.
 స-డ-స లో పెరగని విలువ డ-స-డ లో ఎలా పెరిగింది?
 డ-స-డ వలయం స-డ-స వలయంనుండి ఎలా భిన్నమైనదో కిందటి అధ్యాయంలో చూశాం. రెంటిలోనూ స-డ, డ-స అనే రెండు దశలూ ఉన్నాయి. తేడా ఏమిటి? పైకే తెలుస్తూ ఉంది. స-డ-స లో ముందు స-డ దశ, తర్వాత డ-స దశ వస్తాయి. అయితే డ-స-డ లో ముందు డ-స దశ, తర్వాత   స-డ దశ వస్తాయి.అంటే, ఈ రెండు వలయాల్నీ వేరుపరుస్తున్నది ఈ దశల ముందు వెనకాల తేడాయే. కొనుగోలు, అమ్మకం వరుస తారుమారు కావడమే.ఇది కేవలం రూపంలో తేడా. ఈ రూపంలో తేడాఈ ప్రక్రియల స్వభావాన్ని మేజిక్ చేసినట్లు ఎలా మారుస్తుంది? అలాంటి వింత ఫలితాన్ని ఎలా ఇస్తుంది?
కిలో ధాన్యం - 30 రూపాయలు (స-డ);    30 రూపాయలు – 1 స్టీల్ గ్లాస్ (డ-స). పూర్తి వలయం స-డ-స
30 రూపాయలు - కిలో ధాన్యం (డ-స);  కిలో ధాన్యం - 35 రూపాయలు (స-డ). పూర్తి వలయం డ-స-డ
రెండు వలయాల్లోనూ ఉన్నది అవే రెండు దశలు. అయినాగాని రెండో వలయంలో డబ్బు ఎలా పెరిగింది. ఆ 5 రూపాయలూ ఎక్కడనించివచ్చి కలిశాయి?
పైగా ఈ మార్పు పెట్టుబడిదారుడి వరకే ఉనికిలో ఉంటుంది.మిగిలిన ఇద్దరూ అతను చేసింది స-డ-స అనిగానీ లేక డ-స-డ అనిగానీ  చెప్పలేరు. ఎందుకంటే, అది వాళ్లకి సంబంధించి కొనుగోలుగానీ అమ్మకం గానీ. అంటే. పెట్టుబడిదారుడికి మాత్రమే తాను A దగ్గర కొని B కి అమ్మినట్లు తెలుసు. మిగితా ఇద్దరికీ తెలియదు. వాళ్ళు పట్టించుకోరు కూడా. దీన్ని చూపడానికి  మార్క్స్ ఇలా వాదిస్తాడు: పెట్టుబడిదారుడు డ-స-డ  నుండి స-డ-స కు మారితే, అంటే, ముందు B కి అమ్మి ఆపైన Aనుండి కొంటే, A కి గానీ, B కి గానీ ఆ తేడా తెలియదు.
అంతేకాదు. ఈ వలయంలో పాల్గొనే  ముగ్గురిలో ఇద్దరికి ఈ ముందు వెనకలు ఉండవు. పెట్టుబడి దారుగా నేను A నుంచి  సరుకులు కొంటాను, తిరిగి B కి అమ్ముతాను. అయితే నేను మామూలు సరుకు ఓనర్ గానే B కి అమ్మాను. తర్వాత A నుంచి కొత్తగా కొంటాను. A కీ B కీ ఇద్దరికీ ఈ తేడా ఉండదు. వాళ్ళు సరుకులు కొనేవాళ్ళుగానో, అమ్మేవాళ్ళుగానో మాత్రమే ఉంటారు. A అమ్మేవాడు మాత్రమే, B కొనేవాడు మాత్రమే. అంటే, B అమ్మేవాడు కాడు, A కొనేవాడు కాడు. నేను ప్రతిసారీ, డబ్బు ఒనర్ గానో, సరుకుల ఓనర్ గానో వాళ్లకి తారసపడతాను. అంతకుమించి, రెండు రకాల లావా దేవీల్లోనూ A కి కోనేవానిగానూ, B కి అమ్మేవానిగానూ మాత్రమే తటస్థ పడతాను. ఒకరిని డబ్బుగానూ, మరొకరిని సరుకులుగానూ ఎదుర్కుంటాను. అంతేగాని, ఇద్దరిలో ఎవరికీ పెట్టుబడిగా గానీ, పెట్టుబడిదారుడిగా గానీ ఎదురుపడను. డబ్బుకో, సరుకులకో తప్ప మరి దేనికీ ప్రతినిధిగా తలపడను. నాకు సంబంధించి, A నుంచి కొనడమూ, B కి అమ్మడమూ వరుసలో భాగంగా ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది.
ఈరెండు చర్యల మధ్య ఉండే సంబంధం నాకు ఒక్కడికి మాత్రమే ఉంటుంది. B తో నా లావాదేవీ గురించి  A పట్టించుకోడు.  A తో నావ్యాపారం గురించి B పట్టించుకోడు.
అమ్మడం, కొనడం – ఈ రెంటి వరసని  తారుమారు చెయ్యడంలో ఉన్న నా ప్రజ్ఞని వారికి వివరిస్తే, ఆ వరస విషయంలో నేనే పొరబడ్డానని వారు అనవచ్చు. మొత్తం లావాదేవీ కొనుగోలుతో మొదలై అమ్మకంతో ముగియ లేదనీ, అందుకు భిన్నంగా అమ్మకంతో మొదలై కొనుగోలుతో ముగిసిందనీ వారు అనవచ్చు. నిజానికి నా మొదటి చర్య అయిన కొనుగోలు A వైపు నించి అమ్మకం, నా రెండో చర్య అయిన అమ్మకం B వైపు నించి కొనుగోలు. అంతటితో తృప్తిపడి ఆగకుండా ఇదంతా అనవసరమైనదనీ, ట్రిక్ అనీ అనవచ్చు. ఇకముందు A నేరుగా B దగ్గర కొనవచ్చనీ, B నేరుగా A కి అమ్మవచ్చనీ ప్రకటించవచ్చు. దీంతోమొత్తం లావాదేవీ ఒకే చర్యగా కుదించ బడుతుంది. అంటే, A దృష్టిలో కేవలం అమ్మకం,   B దృష్టిలో కేవలం కొనుగోలు. 
దీన్నిబట్టి స-డ-స వలయంలోనూ డ-స-డ వలయంలోనూ  అమ్మకం కోనుగోలు అనే రెండు దశలే ఉంటాయి. రెంటికీ తేడా: మొదటి దాంట్లో అమ్మకం ముందూ, కొనుగోలు తర్వాతా ఉంటాయి. రెండో దాంట్లో ముందు కొనుగోలూ, ఆతర్వాత అమ్మకం వుంటాయి. చలామణీ లో ఉన్న దశలు ముందు వెనకలు తారుమారు అవుతాయి. అంతే. అయితే ఇది సరుకుల సరళ చలామణీ రంగం నుంచి బయటకు తీసుకెళ్ళదు.
మనం చలామణీ రంగంలోనే ఉంటాం.
 గారడీ వాడు రూపాయిని  పట్టుకొని దాన్నించి మరొక రూపాయి లాగడం అందరూ ఎరిగున్నదే. ఇక్కడ జరుగుతున్న గారడీ ఏమిటి? నిజానికి వాని దగ్గర మొదట ఉన్నదీ, ఆతర్వాత ఉన్నదీ ఒక్కరూపాయే అని మనకు తెలుసు. ముందున్నదీ తర్వాతున్నదీ ఒకటే. అయితే పెట్టుబడి దారుడి దగ్గర ముందున్నదానికంటే తర్వాత ఉన్నది ఎక్కువ. అతనేమీ గారడీవాడు కాదు. అతను చేసింది గారడీ కాదు బురిడీ అంతకన్నా కాదు.
మరెలా వీలయింది?
కనుక ఇక మనం చూడాల్సింది ఒక్కటే: చలామణీలో ప్రవేశించినవాటిలో   ఏఒక్కటైనా విలువను పెంచేది  ఉందా? అంటే అదనపు విలువ ఏర్పడడాన్ని అనుమతించేది ఏదైనా ఉందా? 
చలామణీ ప్రక్రియని స్వచ్చమైన, సరళ సరుకుల మారకం రూపంలో తీసుకుంటాడు. ఇద్దరు సరుకుల ఓనర్లు ఒకరినుండి ఒకరు కొన్నప్పుడల్లా పరిస్థితి ఇదే.
డబ్బుని ఇందులోకి తెచ్చినందువల్ల వచ్చే చిక్కుల్ని తొలగించడానికి, ముందు సరుకు సరుకుతో మారి, ఆతర్వాత బాలెన్స్ లు సెటిల్ చేసేటప్పుడు డబ్బు వాడే  పరిస్థితిని చూస్తాడు, బాలెన్స్ సున్నాఅయిన పరిస్థితిని చూస్తాడు. ఎందుకంటే, డబ్బు చేతులు మారకుండా. ఇక్కడ డబ్బు కాతాడబ్బుగా పనిచేస్తుంది; సరుకుల విలువలను వాటి ధరల్లో తెలుపుతుంది. కాని పాదార్ధిక ఆకారంలో సరుకులతో తలపడదు.
ఉపయోగపు విలువ రీత్యా ఇరువురూ ప్రయోజనాలు పొందవచ్చు
ఉపయోగపు విలువకు సంబంధించి చూస్తే, అటువంటి లావాదేవీ పాల్గొనే ఇరువురూ ప్రయోజనం పొందవచ్చు. ఎలాగంటే, 
1.అవసరం లేని సరుకుల్ని ఇచ్చి అవసరం ఉన్న సరుకుల్ని తీసుకోవచ్చు. రైతు మిగిలిన ధాన్యం ఇచ్చి మంచాలు తీసుకోవచ్చు. ఎవరికి కావలసినవి వారికి దక్కాయి. పోయినవి అవసరం లేనివే. ఈలావాదేవీలో ఇద్దరూ ప్రయోజనం పొందారు.
2. ఇదొక్కటే కాదు. A ద్రాక్ష సారా అమ్ముతాడు. B నుంచి ధాన్యం కొనుక్కుంటాడు. మారకం లేకపోతే వాళ్ళిద్దరూ ఎవరికి వారు ద్రాక్ష సారా తయారు చేసుకోవాలి, ధాన్యమూ పండించుకోవాలి. ఒకే కాలంలో B కన్నా A  మరింత ద్రాక్ష సారా తయారు చేయవచ్చు. అలాగే A కన్నా B కి ఎక్కువ ధాన్యం పండించవచ్చు.
మారకం చేసుకుంటే, ఎవరికి వారు తయారుచేసుకునే వాటికంటే ఇద్దరికీ ఎక్కువ వస్తాయి. కనుక అదే మారకం విలువకు A ఎక్కువ ధాన్యం పొందవచ్చు, B మరింత ద్రాక్ష సారా పొందవచ్చు.
అందువల్ల ఉపయోగపు విలువకు సంబంధించి ఇలా చెప్పవచ్చు: మారకం అనేది ఇరువురూ ప్రయోజనం పొందే లావాదేవీ.
మారకం అనేది ఒప్పందంచేసుకునే ఇరుపక్షాలూ లాభించే లావాదేవీ - Destutt de Tracy 1826
మరింత ఉత్పాదకత అంటే. అదే సమయంలో మరిన్నివస్తువులు  (ఉపయోగపు విలువలు) ఉత్పత్తి కావడం. ఒకరు ఒక రకం సరుకు తయారీలో ఎక్కువ సామర్ధ్యం తో రెండోవానికన్నా ఎక్కువ ఉత్పత్తి చెయ్యవచ్చు. వాళ్ళ వాళ్ళ ఉత్పత్తుల్ని మారకం చేసుకుంటే  శ్రమ కాలాల రీత్యా అది సమానమే. ఉపయోగపు విలువ రీత్యా ఇరువురూ ప్రయోజనాలు పొందేది నిజమే.

కాని మారకం విలువ రీత్యా ప్రయోజనం కలగదు
మారకం విలువకు సంబంధించి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ సమానత్వం ఉంటుంది, కానీ ప్రయోజనం ఉండదు.సమృద్ధిగా ద్రాక్ష సారా ఉండి ధాన్యం లేనివాడు సమృద్ధిగా ధాన్యం ఉండి, ద్రాక్ష సారా లేని వాడితో లావావాదేవీలోకి దిగుతాడు. వాళ్ళ మధ్య మారకం జరుగుతుంది- 50 ధాన్యం, అంతే విలువైన ద్రాక్ష సారా. ఈచర్య మొదటి వానికి గానీ రెండోవానికి గానీ మారకం విలువని పెంచదు. ఎందువల్లనంటే, మారకం ద్వారా పొందిన సరుకుల విలువలు మారకానికి ముందే రెండు సరుకుల్లో ప్రతి ఒక్కటీ రెండో దానికి సమానమైన విలువతో ఉంది.- Mercier de la Rivière
దీన్ని బట్టి, డబ్బు ప్రమేయం లేకుండా, సరుకులతో సరుకులు మారితే ఉపయోగపు విలువకి సంబంధించి ఇరుపక్షాలూ ప్రయోజనంపొందవచ్చు. కాని విలువలు ఏమాత్రమూ పెరగవు.
డబ్బు ప్రమేయంతో మారకం జరిగినా ఈ పరిస్థితి అదే
రెండు సరుకుల మధ్య డబ్బుని చలామణీ సాధనంగా పెట్టి, అమ్మకాన్నీ కొనుగోలునీ రెండు వేర్వేరు చర్యలుగా విడగోట్టినా, ఈ పరిస్థితి మారదు.
రెండు విలువల్లో ఒకటి డబ్బయినా, లేదా రెండూ మామూలు సరుకులే అయినా ఏమాత్రం సంబంధం లేని విషయం- Mercier de la Rivière
సరుకు మారకంలోకి రాక ముందే విలువ నిర్ణయమవుతుంది
విలువ చలామణీలో నిర్ణయం అవదు. సరుకు చలామణీ లోకి రాకముందే ఆసరుకు విలువ ధరలో వ్యక్తమవుతుంది. అందువల్ల సరుకు విలువ అనేది చలామణీ ఫలితం కాదు, చలామణీ కి ముందు షరతు.

అంటే, చలామణీలోకి రావాలంటే, ముందు అది  విలువ ఉన్నదయి ఉండాలి.
విలువ ని నిర్ణయించేది ఒప్పందంచేసుకునే వాళ్ళు కాదు, ఒప్పందానికి ముందే విలువ నిర్ణయమై ఉంటుంది - Le Trosne

ఈ విషయాన్ని అనిర్దిష్టంగా పరిగణిస్తే, అంటే సరుకుల సరళ చలామణీకి సహజమైన నియమాల నించి రాని పరిస్తితులనన్నిటినీ మినహాయిస్తే, చలామణీలో ఒక ఉపయోపు విలువ బదులు మరొక ఉపయోగపు విలువ రావడమూ, సరుకు రూపంమారడమూ అనే రెండే ఉంటాయి. మార్క్స్ ఇక్కడ మొదటిదాన్ని పక్కనబెట్టి రెండో దానిమీద అంటే, సరుకు రూపం మారడం మీద దృష్టి సారిస్తాడు. 
ఒకే సరుకు ఓనర్ చేతిలో అదే విలువ, అంటే వస్తురూపం పొందిన (objectified) సామాజిక శ్రమ,  ఉంటుంది – మొదట సరుకు రూపంలో, తర్వాత ఆసరుకు పరివర్తన చెందిన  డబ్బు రూపంలో, అంతిమంగా ఆ డబ్బు తిరిగి పరివర్తన చెందిన సరుకు రూపంలో. ఈ రూపంలో మార్పు విలువ పరిమాణంలో మార్పు తేదు. ఈమార్పు ఎలాంటిదంటే, ఒక పౌండ్ కీ 20 షిల్లింగులకీ జరిగే మారకం వంటిది. పరిమాణం రీత్యా రెండూ ఒకటే. తేడా ఉండదు.  

అయితే ఈప్రక్రియలో సరుకు విలువ పొందే మార్పు దాని డబ్బు రూపంలో మార్పుకి మాత్రమే పరిమితం. ఈరూపం మొదట అమ్మజూపిన సరుకు ధరగా ఉంటుంది. తర్వాత అప్పటికే ధరగా వ్యక్తమైన నిజమైన డబ్బు మొత్తంగా ఉంటుంది. ఈ డబ్బు అప్పటికే  దాని ధరలో వ్యక్తమై ఉంటుంది. చివరలో ఒక సమానక సరుకు ధరగా వ్యక్తమవుతుంది. ఈ రూపంమార్పు విడిగా చూస్తే విలువ పరిమాణంలో ఏమార్పూ ఉన్నట్లు కాదు. 5 పౌన్ల నోటుని సావరిన్లుగా,అర్ధ సావరిన్లుగా, షిల్లింగులుగా మారిస్తే దాని విలువ ఎలా మారదో అలాగే. అంతే డబ్బుమరో రూపంలో ఉంది. మారింది రూపం మాత్రమే, పరిమాణం కాదు. అందువల్ల రూపం మార్పు విలువ పరిమాణం మీద ప్రభావం చూపదు.
సరుకుల చలామణీలో ఆసరుకుల విలువల రూపం మాత్రమే మారుతుంది కనక చలామణీలో తప్పనిసరిగా సమానకాల మారకమే ఉంటుంది – శుద్ధరూపం(pure form)లో ఇది జరిగితే.
అశాస్త్రీయ అర్ధశాస్త్రం (vulgar economy, which deals with appearances only)   విలువ స్వభావం గురించి ఆసక్తి లేనప్పటికీ, ఈ విషయాన్ని శుద్ధ రూపంలో పరిశీలించదలచినప్పుడు సరఫరా గిరాకీలు సమానంగా ఉన్నట్లే భావించారు.అంటే, వాటి ప్రభావం ఏమీ ఉండదని అర్ధం. దీన్నుంచి గ్రహించాల్సిన విషయం:
చలామణీ విలువకు వనరు కాదు.
అలాంటప్పుడు, మారిన ఉపయోగపువిలువలకు సంబంధించి అమ్మేవాడూ, కోనేవాడూ ఇద్దరూ కొంత ప్రయోజనం పొందవచ్చు. మారకం విలువల విషయం వేరుగా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏమంటే: ఎక్కడ సమానత్వం ఉంటే, అక్కడ లాభం(gain) ఉండదు.- Galiani
సరుకుల మారకం విలువలకు అటూఇటూ గా జరగవచ్చు
సరుకులు వాటివిలువలకు అటూ ఇటూగా ఉన్న, అంటే తేడాగా ఉన్న  ధరలకు అమ్ముడవచ్చు. అయితే అటూ ఇటూగా తేడాగా ఉండడం అనేది సరుకుల మారక నియమాల్ని తోసిపుచ్చడంగా కనబడుతుంది.
‘ఎదో ఒక బాహ్య పరిస్థితి వల్ల ఇరుపక్షాలలో ఒకరికి ప్రతికూలంగా ఉంటే, అప్పుడు సమానత్వం అతిక్రమించబడుతుంది. అయితే ఈ అతిక్రమణ ఆ బాహ్య కారణం మూలంగా  తలెత్తింది కాని స్వయంగా మారకం నుండి కాదు.’- Le Trosne
స్వచ్చమైన రూపంలో సరుకుల మారకం సమానకాల మారకమే. ఆవిధంగా మారకం విలువను పెంచే పధ్ధతి కాదు.
‘ స్వభావ రీత్యానే, మారకం సమానత్వం మీద ఆధారపడ్డ ఒప్పందం. అంటే, అది రెండు సమాన విలువల మధ్య జరుగుతుంది. సంపన్నులు అవడానికి  అది సాధనం కాదు. ఎందుకంటే, అందులో ఎంత తీసుకుంటే అంత ఇవ్వాల్సి ఉంటుంది.’- Le Trosne

ఉపయోగపు విలువనీ మారకం విలువనీ గందరగోళపరచడం                                                                      అందువల్ల అదనపు విలువకు సరుకుల చలామణీ వనరు అని చూపే ప్రయత్నాల వెనక ఉపయోగపు విలువనీ మారకం విలువనీ ఒకదానిస్తానంలో మరొకదాన్ని పెట్టడం జరుగుతుంది. అంటే రెంటినీ కలగాపులగం చేసి గందరగోళపరచడం అన్నమాట.
ఉదాహరణకి కాండిలాక్ ఇలా అంటాడు: సరుకుల మారకంలో విలువకి విలువ ఇవ్వడం నిజమే.అందుకు భిన్నంగా ఒప్పందం చేసుకున్న ఇద్దరిలో ప్రతివాడూ ప్రతి సందర్భంలోనూ ఎక్కువ విలువకు తక్కువ విలువ ఇస్తాడు.... మనం సమాన విలువలు మారకం చేసుకుంటే, ఏ ఒక్కరూ లాభం చేసుకోలేరు. అయినాగాని వారిరువురూ లాభిస్తారు,లేదా లాభించాలి. ఎందుకు? ఒక వస్తువు విలువ పూర్తిగా మన అవసరాలతో దానికున్న సంబంధాన్ని బట్టి ఉంటుంది. ఒకరికి ఎక్కువైనది, మరొకరికి తక్కువ. అలాగే ఒకరికి తక్కువైనది మరొకరికి ఎక్కువ....మన అవసరాలకు కావలసిన వస్తువుల్ని అమ్మకానికి పెడతాము అని ఊహించలేం...అవసరం లేని వస్తువుని వదులుకోవాలి అనుకుంటాం- కావలసిన వస్తువుని పొందడానికి; ఎక్కువకి తక్కువ ఇవ్వాలి అనుకుంటాం.
మారకమైన రెండు సరకుల్లో ఒకే పరిమాణం ఉన్న బంగారం విలువ ఉన్నప్పుడల్లా మారకంలో ఒక విలువని సమానమైన మరొక విలువకి ఇచ్చినట్లు అనుకోవడం సహజమే...అయితే మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అంశం ఇంకొకటి ఉంది. ఏమంటే, మనం ఇద్దరమూ మనకు అవసరానికి మించి ఉన్నదాన్ని, అవసరం ఉన్న  దానితోనే మారకం చేస్తున్నామా అన్న ప్రశ్న.’ ఇక్కడ కాండిలాక్
1. ఉపయోగపు విలువని మారకపు విలువతో గందరగోళ పరుస్తున్నాడు.
2.అంతే కాదు సరుకుల ఉత్పత్తి బాగా అభివృద్ధి చెందిన సమాజంలో ప్రతి ఉత్పత్తిదారుడూ తన జీవనాధార సాధనాలని తానే స్వయంగా ఉత్పత్తిచేస్తాడని ఊహిస్తున్నాడు.
3.తన అవసరాలకు మించి ఉన్న ఉత్పత్తులను మాత్రమే చలామణీలో పడేస్తాడని అనికుంటున్నాడు. ఇది నిజంగా పిల్లతరహా వాదన అంటాడు మార్క్స్.
కాండిలాక్ కి ఆయన మిత్రుడు లే ట్రాస్నేసరిగా జవాబు చెప్పాడు: అభివృద్ధి చెందిన సమాజంలో సరిపోయినంతకంటే  ఎక్కువ ఉండే వస్తువంటూ ఏదీ ఉండదు అన్నాడు. ఎగతాళి చేశాడు కూడా: మారకం చేసుకునే ఇద్దరూ సమాన మొత్తానికి మించి తీసుకుని, తక్కువ మొత్తాన్ని ఇస్తే, ఇద్దరికీ వచ్చేది ఒకటే.
మార్క్స్ కమెంట్: మారకం విలువ స్వభావం గురించి కాండిలాక్ కి అసలు ఒక ఐడియాయే లేదు. లేనందు వల్లే ప్రొఫెసర్ విల్ హెల్మ్ రోస్చర్ తన పిల్ల అభిప్రాయాలను సరైనవే అని చెప్పడానికి కాండిలాక్ ని ఎంచుకున్నాడు.
అయినప్పటికీ, ఆధునిక ఆర్ధికవేత్తలు ఇప్పటికీ కాండిలాక్ చేసిన వాదననే తరచుగా మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నారు. ప్రత్యేకించి, అభివృద్ధి చెందిన రూపం అయిన వాణిజ్యంలో సరుకుల మారకమే అదనపు విలువని ఉత్పత్తి చేస్తుంది అని చూపాలనుకున్నప్పుడు ఈవాదనే చేస్తున్నారు. ఉదాహరణకి,
వాణిజ్యం ... ఉత్పత్తులకు విలువని చేరుస్తుంది. ఎందుకంటే, ఉత్పత్తి చేసిన వాని చేతిలో ఉన్నప్పటి కంటే,వినియోగదారుని చేతిలో ఉన్నప్పుడు ఆ ఉత్పాదితాలకు మరింత విలువ కలిగి వుంటాయి.దీన్ని కచ్చితంగా ఉత్పాదక చర్యగా పరిగణించ వచ్చు- S. P. Newman 1835 
దీనికిమార్క్స్ ఇలా జవాబు చెప్తాడు.
కాని సరుకులకు రెండు సార్లు చెల్లింపు ఉండదు, వాటి ఉపయోగపు విలువ మూలంగా ఒకసారీ, విలువ ఉన్నందువల్ల రెండోసారీ.
ఒక సరుకు ఉపయోగపు విలువ అమ్మినవాని కంటే కొన్నవానికే ఎక్కువ సేవ చేస్తుంది, నిజమే. అయినప్పటికీ దాని మరో రూపం అయిన డబ్బు అమ్మిన వానికి ఎక్కువ సేవే చేస్తుంది. అలాకాకపోతే, అతను దాన్ని అమ్ముతాడా?
కనుక మేజోళ్ళని కొన్నవాడు వాటిని డబ్బులోకి మార్చడం ద్వారా ఉత్పత్తి చర్య చేస్తున్నాడు అని మనం చెప్పవచ్చు.

కనుక సమానకాలే మారతాయి. చలామణీ రంగంలో విలువ పెరిగే అవకాశం ఉండదు. ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయేమో! ఎంత చిన్నదాన్నైనా వదలకుండా పరిశీలించడం తప్పనిసరి. అందుకే
మార్క్స్ నిశ్చితాభిప్రాయానికి వచ్చేముందు జాగ్రత్తగా మొత్తం విషయాన్ని చూస్తాడు.
 చలామణీలో మారే సరుకులు విలువలో సమానమైనవి కావచ్చు. అసమానమైనవీ కావచ్చు. ఈరెంటిలో దేనివల్లయినా అదనపు విలువ వస్తుందేమో చూస్తాడు. సమానకాలు మారితే అదనపు విలువ రాదు.సరే.
అసమానకాల మారకం విలువని పెంచుతుందా? అదనపువిలువను తెస్తుందా?
సమాన మారకం విలువ గల సరుకులు లేదా సరుకులూ,డబ్బూ మారకం అయితే, అంటే సమానకాలు మారకం అయితే చలామణీలో పెట్టిన విలువకి మించి తిరిగి తీసుకోలేడు అన్నది స్పష్టమే. అదనపు విలువ ఏర్పడదు. స్వచ్చమైన రూపంలో చలామణీ ప్రక్రియ సమానకాల మారకాన్ని ఆశిస్తుంది. అయితే, ఆచరణలో ప్రక్రియలు శుద్ధ రూపంలో జరగవు. అందువల్ల మనం అసమానకాల మారకాన్ని ఊహిద్దాం.
అసమానకాలు మారితే, ఒక ప్రశ్న ఉదయిస్తుంది: ఎక్కువ విలువ ఇచ్చి కొనవలసిన వారెవరు? లేదా విలువకన్నా తక్కువకి అమ్మాల్సివచ్చిన వారెవరు?
భిన్న ఆర్ధిక పాత్రలు
సరుకుల మార్కెట్ కి సరుకుల ఒనర్లే వస్తారు. ఒకరిమీద ఒకరు చూపే శక్తి, కేవలం వారివారి సరుకుల శక్తి తప్ప వేరేమీ కాదు. ఆ సరుకుల పాదార్ధిక వైవిధ్యమే వాటి మారకానికి చోదకశక్తి. అంటే సరుకులు వేర్వేరు రకాలుగా ఉండడమే మారకానికి  ప్రేరణ. ఆవైవిధ్యమే అమ్మేవారినీ కోనేవారినీ ఒకరిమీద ఒకరు ఆధారపడేటట్లు చేస్తుంది. ఎందుకంటే, ఎవ్వరూ తనకు అవసరమున్న వస్తువుని కలిగి ఉండరు. ప్రతి వాడి చేతిలో ఇతరులకు కావలసిన వస్తువే ఉంటుంది. వాటి ఉపయోగపు విలువల పాదార్ధిక వైవిధ్యం కాక మరొక తేడా ఉంటుంది. వాటి సహజ రూపానికీ, పరివర్తిత రూపానికీ – అంటే సరుకులకీ, డబ్బుకీ – ఉండే తేడా. ఫలితంగా సరుకుల ఒనర్లను అమ్మేవాళ్ళు (సరుకులు కలవాళ్ళు) గానూ, కొనేవాళ్ళు(డబ్బు కలవాళ్ళు) గానూ వేరుపరచవచ్చు.
ఎవరు ఎక్కవకి అమ్మగలరు?ఎవరు తక్కువకి కొనగలరు?అనే దాన్ని ప్రయత్నిస్తాడు.e
సరుకుల ఓనర్ల  మధ్య తేడా వాళ్ళు ఉత్పత్తిచేసే ఉపయోగపు విలువలన్నా అవాలి లేదా అమ్మేవాడికీ కోనేవాడికీ ఉండే తేడా అన్నా కావాలి. అది ప్రతివాడూ తనుగాక ప్రతివాని మీదా ఆధారపడే  సమాన సంబంధం. కనుక ఉపయోగపు విలువల కుండే తేడాని మార్క్స్ కొట్టేస్తాడు.
అమ్మేవాడు  తన సరుకుల  విలువకన్నా ఎక్కువకు అమ్మగలిగితే  
కారణం తెలియని అవకాశం వచ్చి, అమ్మేవాడు  తన సరుకుల  విలువకన్నా ఎక్కువకు అమ్మగాలిగాడు  అనుకుందాం. 100విలువ గల సరుకుల్ని 110 కి అమ్మితే అతను 10 అదనపువిలువను జేబులో వేసుకుంటాడు. అయితే ఉన్న సరుకులు అమ్మాక, అతను కొనేవాడు అవుతాడు. ఇప్పుడు మూడో వాడొస్తాడు. అతను సరుకులు కలవాడు. వాటిని  అమ్మేవాడుగా మొదటి వాని వద్దకొస్తాడు. అతనికి కూడా 10 శాతం ఎక్కువకి అమ్మే ప్రత్యేక అవకాశం ఉంటుంది. మన మిత్రుడు అమ్మేవాడుగా 10 లాభం పొందింది కోనేవాడుగా పోగొట్టుకునేందుకే. ఇది స్పష్టం. తేలికగా తెలిసేదే.
ఉత్పత్తి  నామక విలువ పెరిగడం మూలంగా ..అమ్మినవాళ్ళు ధనవంతులు కాలేరు...ఎందుకంటే అమ్మేవాళ్ళుగా లాభించినదాన్ని కొనేవాళ్ళుగా కచ్చితంగా ఖర్చు పెడతారు. (―The Essential Principles of the Wealth of Nations.‖ &c., London, 1797, p. 66.)

అందరు సరుకుల ఓనర్లూ ఒకరికొకరు 10 శాతం ఎక్కువ  విలువకి అమ్మినా, వాస్తవానికి వాటి వాటి విలువలకే అమ్మితే వచ్చే ఫలితమే వస్తుంది. ఈతరహా సార్వత్రిక, నామక ధరలపెరుగుదల వల్ల వచ్చే ఫలితం ఎటువంటిదంటే:  బంగారంలో వ్యక్తమయ్యే సరుకుల విలువని వెండిలో చెబితే ఏమిటో అటువంటిదే. ధరలు పెరుగుతాయి. వాటి విలువల మధ్య ఉండే సంబంధాలు మారకుండా ఉన్నవి ఉన్నట్లే ఉంటాయి. అంటే ధరల స్థాయి పెరిగినా విలువ నిష్పత్తులు యధాతధంగా ఉంటాయి.

దీనికి సరిగ్గా వ్యతిరేకంగా ఊహిద్దాం.
కొనేవాడు సరుకుల్ని వాటి విలువ కన్నా తక్కువకి కొనగలిగితే
దీని ప్రకారం కొనేవాడు సరుకుల్ని వాటి విలువ కన్నా తక్కువకి కొనగలుగుతాడు. ఈసందర్భంలో అతనిప్పుడు అమ్మేవాడవుతాడు అని అనుకోవాల్సిన పని లేదు. కొనే ముందు అతను అమ్మినవాడే. 10 శాతం లాభించేటప్పటికే, అంతకుముందే ఆ 10 శాతం పోగొట్టుకున్నవాడే.
24లివర్ ల (ఒకప్పటి ఫ్రెంచ్ నాణెం)విలువగల ఉత్పాదితాన్ని ఒకడు 18 లివర్ లకి అమ్మాల్సొస్తే, అతను తిరిగి కొనేటప్పుడు అదే 18లివర్ లతో 24లివర్ లతో ఎంత కొనగలిగి ఉండేవాడో అంతా పొందుతాడు- Le Trosne

కనుక ఇప్పుడు అంతా  అంతకు ముందు ఎలాగుందో అలాగే, ఉన్నదున్నట్లే  ఉంటుంది.
అందువల్ల అదనపువిలువ ఏర్పడడాన్ని, తత్ఫలితంగా డబ్బు పెట్టుబడిగా మారడాన్ని సరుకులు వాటి విలువకన్నా ఎక్కువకి అమ్మబడతాయని ఊహించడం ద్వారానో, అవి వాటి విలువలకన్నా తక్కువకి కొనబడతాయని ఊహించడం ద్వారానో వివరించడం సాధ్యం కాదు.
అమ్మేవాడు తన సరుకుల ధరలను పెంచగలిగేది, ఇతర అమ్మకం దారుల సరుకులకు అతను ఎక్కువ చెల్లించేందుకు ఒప్పుకున్నప్పుడే. అదే కారణం వల్ల వినియోగదారుడు తాను  కొన్న సరుకులకు తక్కువ చెల్లించగలిగేది, తాను అమ్మే వస్తువుల ధరల తగ్గుడాలని అంగీకరిస్తేనే- మేర్సియర్ డి రివియర్

సంబంధం లేని అంశాల్ని చొప్పించినందువల్ల సమస్య సరళం అవదు. కర్నాల్ టారెన్స్ ఇదే తరహాలో చెప్పాడు: ఫలవంతమైన గిరాకీ అంటే సరుకులకి ఉత్పత్తి ఖర్చులకంటే ఎక్కువ ఇవ్వగలసత్తా, ఇవ్వాలనే ఇష్టమూ ఉండడమే- సూటి వస్తుమార్పిడి(immediate barter) ద్వారాగానీ, చుట్టుతిరుగుడు వస్తుమార్పిడి (circuitous barter)ద్వారాగానీ. 1821

చలామణీలో ఉత్పత్తిదారులూ, వినియోగదారులూ కేవలం కోనేవాళ్ళుగా, అమ్మేవాళ్ళుగా మాత్రమే ఎదురుపడతారు. ఉత్పత్తి దారులకొచ్చే అదనపువిలువకి మూలం వినియోగదారుడు సరుకులకు ఎక్కువ విలువ చెల్లించడంలో ఉంది అనడం అంటే ‘అమ్మేవాడుగా ఉత్పత్తిదారుడు ప్రియంగా అమ్మే మంచి అవకాశం కలిగి ఉన్నట్లే’ అని మరోమాటల్లో చెప్పడమే.
అమ్మేవాడు సరుకుల్ని తనన్నా  ఉత్పత్తిచేస్తాడు లేక వాటి ఉత్పత్తిదారుడుకి ప్రతినిధిగానన్నా ఉంటాడు. అయితే కొనేవాడుకూడా అమ్తకేమాత్రం తీసిపోకుండా  తనడబ్బు ప్రాతినిధ్యం వహించే సరుకులను ఉత్పత్తి చేస్తాడు, లేదా వాటి ఉత్పత్తిదారుడికి ప్రతినిధిగా ఉంటాడు.  అందువల్ల ఒక ఉత్పత్తిదారుడు మరొక ఉత్పత్తిదారుణ్ణి ఎదుర్కుంటాడు. వాళ్ళిద్దరికీ తేడా ఒకడు కొంటాడు మరొకడు అమ్ముతాడు. ఉత్పత్తిదారుడుగా సరుకుల ఓనర్  వాటిని వాటి విలువలకన్న ఎక్కువకి అమ్ముతాడనీ, వినియోగదారుడుగా వాటికి ఎక్కువ చెల్లిస్తాడనీ చేసే ఈ వాదన మనల్ని ఒక్క అడుగైనా ముందుకు తీసుకుపోదు.
 ‘ లాభాలు చెల్లించేది వినియోగదారులే అనేది కచ్చితంగా అసంబద్ధమైనది. ఎవరు వినియోగదారులు?’-జి.రాంసే 1836
ఏమీ అమ్మనివాళ్ళు ఏమీ కొనలేరు
అదనపు విలువకి మూలం నామమాత్రపు ధరల పెరుగుదలలో ఉందనీ, లేదా అమ్మేవాడికి ప్రియంగా అమ్మగల అవకాశం ఉండడంలో ఉందనీ -  తప్పుసిద్ధాంతాన్ని ఒకేమైన ప్రచారం చేసే వాళ్ళు ఏమని ఊహిస్తారంటే : అసలేమీ అమ్మకుండా కొనేవాళ్ళ వర్గం – అంటే, ఉత్పత్తి చెయ్యని వినియోగదారుల వర్గం – ఒకటి ఉన్నది . ఇది వాళ్ళ ఊహ(assumption).ఇది తప్పు.
మనం ఇంతదాకా పరిశీలించిన సరళ చలామణీ దృష్ట్యా అటువంటి వర్గం ఉనికిని వివరించడం అసాధ్యం.
పోనీ, అలాంటి వర్గం ఉందని అనుకుందాం. అటువంటి వర్గం నిరంతరాయంగా కొనుగోళ్ళకోసం వినియోగించే  డబ్బు, ఆవర్గానికి ఈవర్గానికి అంటే నిరంతరాయంగా వస్తూ ఉండాలిగదా! ఎక్కడనుండి వస్తుంది? చట్టపరమైన హక్కుగానో, బలవంతంగానో ఏమారకమూ లేకుండానే ఉచితంగా  సరుకుల ఓనర్ల జేబుల్లో నుండే పోతూ ఉండి తీరాలి. అటువంటి వర్గానికి సరుకుల్ని వాటి విలువకంటే ఎక్కువకు అమ్మడమంటే , అంతకుముందు ఊరకే ఇచ్చిన డబ్బులో కొంత భాగాన్ని మోసంతో తిరిగి రాబట్టడమే.
అమ్మిన వాళ్ళు కొనకుండా ఉంటే
అమ్మేవాళ్ళు ప్రియంగా అమ్మి, కొనేవాళ్ళ మీద లాభించడానికి ఒకే ఒక దారి ఉంది: అమ్మిన తర్వాత వాళ్ళు కొనేవాళ్ళు అవకూడదు. అంటే తమ సరుకులు అమ్ముకున్నాక, ఇతరుల సరుకులు కొనకుండా ఉండాలి. ఒకవేళ కొంటే కోనేవాడుగా ఎక్కువిచ్చి కొనాలి. వచ్చింది పోతుంది. హళ్ళికి హళ్లి. కాబట్టి అతను ప్రియంగా అమ్మి లాభం పొందాలంటే, అమ్మాక కొనకుండా ఉండాలి.దీనర్ధం వాళ్ళు కొనేవాళ్ళకి డబ్బిస్తూ ఉండాలి –అదిగూడా వాళ్ళనుంచి మారకంలో ఏమీ తీసుకోకుండానే.
ఇది కేవలం సిద్ధాంత రీత్యా ఉన్న అవకాశం మాత్రమే కాదు,ఇందుకు  చరిత్రలో ఆసియా మైనర్ (టర్కీ)
పట్టణాల ఉదాహరణ కూడా ఉంది:
ఆవిధంగా ప్రాచిన రోమ్ కి ఆసియా మైనర్ నగరాలు ఏటా కప్పం చెల్లించేవి. ఆడబ్బుతో రోమన్లు ఆనగరాల నుండి సరుకులు కొనేవారు – చాలా ప్రియంగా. ఆనగరాల వాళ్ళు మోసం చేసేవాళ్ళు. ఆరకంగా విజేతలకి తాము కట్టిన కప్పంలో కొంత డబ్బుని మోసంతో వెనక్కి రాబట్టుకునేవాళ్ళు. అయినా అందులో చివరకి మోసపోయింది ఈ నగరాలే. ఎందుకంటే వారి సరుకులకు వచ్చిన డబ్బు వారిచ్చిన కప్పంలోదే కనుక.
కనుక ధనవంతులు అవడానికి, అదనపువిలువ ఉత్పత్తి కావడానికి అది మార్గం కాదు అని తేలుతోంది.
అమ్మేవాళ్ళే కొనేవాళ్ళుగానూ, కొనేవాళ్ళే అమ్మేవాళ్ళుగానూ ఉండే సరుకుల మారకం పరిమితుల్లోనే ఉందాం.
మనకి సరిగా అర్ధమవక పోవడానికి కారణం బహుశా పాల్గొన్న వారిని  వ్యక్తులుగా కాకుండా, భావాభి వర్గాల మూర్తులుగా భావించడమేమో చూద్దాం.
మోసంచేసి ఎక్కువకి అమ్మితే విలువ పెరుగుతుందా?
ఒక వ్యక్తి  మోసంతో ఎక్కువకి అమ్మవచ్చు. A కి B నుంచీ Cనుంచీ ఎక్కువ రాబట్టే తెలివి ఉండవచ్చు. వాళ్ళు దాన్ని తిప్పికొట్టగలిగినవాళ్ళు కాకపోవచ్చు. 40 పౌన్ల విలువగల ద్రాక్ష సారాని B కి ఇచ్చి, A 50 పౌన్లవిలువగల ధాన్యాన్ని తీసుకున్నాడు అనుకుందాం. అంటే, తన 40పౌన్లనీ A 50 పౌన్లలోకి మార్చాడు. తక్కువ డబ్బుని ఎక్కువ డబ్బు చేశాడు. తన సరుకుల్ని పెట్టుబడిలోకి మార్చాడు.
ఇక్కడ ఏమనిపిస్తుంది? అదనపువిలువ చలామణీ లోనే ఏర్పడింది అనిపిస్తుంది. కనుక దీన్ని మరింత దగ్గరగా పరీక్షించాలి అంటాడు.

మారకానికి ముందు A చేతిలో 40 పౌన్ల విలువచేసే ద్రాక్ష సారా ఉంది, B చేతిలో 50 పౌన్ల విలువచేసే ధాన్యం ఉంది. మొత్తం కలిపితే 90 పౌన్లు. మారకం అయ్యాక పరిస్థితిని పరిశీలిద్దాం. ఇప్పుడు A చేతిలో 50 పౌన్ల విలువచేసే ధాన్యం ఉంటె, B చేతిలో 40 పౌన్ల విలువచేసే ద్రాక్ష సారా ఉంది. రెండూ కలిపితే 90 పౌన్లు. విలువ మొత్తం ఏమాత్రం మార్పు లేదు. అంటే, చలామణీలో అణుమాత్రమైనా విలువ పెరగలేదు అని తేలింది. ఉన్న విలువ బదిలీ అయిందే తప్ప, కొత్త విలువ ఏర్పడలేదు. మారిందల్లా, A కీ, B కీ మధ్య పంపిణీ. ఒకవైపు తగ్గిన విలువే, మరొకవైపు అదనపు విలువగా పెరిగింది; అటు మైనస్ అయినది ఇటు ప్లస్ అయింది. మారకం ముసుగు లేకుందనీ,B నించి  10 పౌన్లు A నేరుగా దొంగిలించినా ఇదే మార్పు జరిగుండేది. చలామణీలో ఉన్న విలువల మొత్తం వాటి పంపిణీలో మార్పువల్ల పెరగదన్నది స్పష్టం- ఒక యూదు రాణీ ఆన్ కాలపు చిల్లర నాణెం అయిన ఫార్తింగ్ ని గినియా అనే బంగారునాణేనికి అమ్మినా, ఆదేశం లోని అమూల్య లోహాల విలువని ఎలా పెంచలేడో అలాగే. ఒకదేశంలో పెట్టుబడిదారీ వర్గం మొత్తంగా చూసినప్పుడు తనను తాను మోసం చేసుకోలేదు.
డెస్టట్ డి ట్రేసీ ఆసంస్థ సభ్యుడైనప్పటికీ, భిన్నమైన అభిప్రాయంతో ఉన్నాడు. పారిశ్రామిక పెట్టుబడిదారులు సరుకుల్ని ఉత్పత్తి ధరకంటే ఎక్కువకి అమ్మడం ద్వారా లాభాలు చేసుకుంటారు అన్నాడు.
మార్క్స్ ప్రశ్నిస్తాడు:వాళ్ళు అమ్మేది ఎవరికి?  
మొదట వారిలోనే ఒకరికొకరు అమ్ముకుంటారు అని జవాబిస్తాడు. అంటే అదనపు విలువ ఏర్పడదు అని.
మనం ఎంత వంచినా, ఎలాతిప్పినా అంతిమ ఫలితం అదే: సమానకాలు మారినా అదనపువిలువ రాదు, అసమానకాలు మారినా అడనపువిలువ ఉండదు. ఇందుకు జె.బి. సే మాటలు కోట్ చేస్తాడు:
రెండు సమానవిలువల మారకం సమాజంలో ఉన్న విలువల మొత్తాన్నిపెంచదు,   తగ్గించదు. రెండు అసమానవిలువల మారకం సమాజంలో ఉన్న విలువల మొత్తాన్ని ఏమాత్రం  మార్చదు – అది ఒకరి సంపదనుంచి తీసినదాన్ని మరొకరి సంపదకి కలిపినప్పటికీ.
చలామణీ లేదా సరుకుల మారకం విలువను పుట్టించదు.వే లాండ్ 1843లో ఇలా రాసాడు: మారకం ఉత్పాదితాలకు ఏమాత్రం విలువనీ చేర్చదు. 
కాబట్టి సమానవిలువ మారకం ఉన్న విలువను పెంచదు. అసమాకాలమారకం కూడా కొత్త విలువను కలపదు.

అసలు సరుకుల చలామణీ కొత్తవిలువను ఏర్పరచదు.

అందువల్ల, పెట్టుబడిదారీ విధానం గురించిన పరిశోధన చరిత్రలో  పెట్టుబడికి ముందున్న రూపాలతో-వర్తక పెట్టుబడితో,వడ్డీ పెట్టుబడితో-ప్రారంభించలేము. ఎందుకంటే అవి రెండూ కొత్త విలువను చేర్చేవి కావు. అదనపు విలువను ఏర్పరచేవి కావు. అదనపు విలువను ఏర్పరిచే మూల రూపం నుండి వచ్చిన ఉత్పన్న(derived)రూపాలు. ముందు అదనపు విలువ ఏర్పడాలి. దానినుంచి వచ్చే రూపాలే వడ్డీలు , వర్తక లాభాలు. కొత్తవిలువ వచ్చే రూపాన్ని ముందు విశ్లేషించాలి. 
పెట్టుబడికి ముందున్న రూపాలు -వర్తక పెట్టుబడి, వడ్డీ పెట్టుబడి
అందువల్ల పెట్టుబడి ప్రధానరూపాన్ని (primary form)- ఏరూపంలో అయితే పెట్టుబడి ఆధునిక సమాజపు ఆర్ధిక నిర్మాణాన్ని నిర్ణయిస్తుందో ఆరూపాన్ని – విశ్లేషించేటప్పుడు మనం పెట్టుబడి యొక్క అనాదికాలపు రూపాలైన వర్తక పెట్టుబడినీ, వడ్డీ పెట్టుబడినీ  ప్రస్తావించ లేదు. అందుకు కారణం  ఇప్పుడు అర్ధమయింది.
A.వర్తక పెట్టుబడి
డ-స-డ’ రూపం, ప్రియంగా అమ్మడంకోసం కొనడం, వర్తకుని పెట్టుబడిలో శుద్ధరూపంలో ఉంటుంది. అయితే ఈమొత్తం చలనం చలామణీ రంగంలోపలే  జరుగుతుంది. ఏమయినా, కేవలం చలామణీ ఒక్కటే డబ్బుని పెట్టుబడిగా మారడాన్ని,అదనపు విలువ ఏర్పడడాన్ని వివరించడం అసాధ్యం.కనుక సమానకాలు మాత్రమే మారినంత కాలం  వర్తకుని పెట్టుబడి అసాధ్యం అయినది  అనిపిస్తుంది. సమాన విలువల మారకమే తప్పనిసరి అయితే వాణిజ్యం అసాధ్యం - G. Opdyke
వర్తక పెట్టుబడి డ-స-డ’ కి శుద్ధరూపమే.అయినా పెట్టుబడి ఫార్ములాని పరిశోధించే టప్పుడు అది మార్క్సుకి ఆరంభ బిందువు (point of departure) కాదు.
కనుక అది (వర్తకపెట్టుబడి) అమ్మే ఉత్పత్తిదారుడికీ, కొనే ఉత్పత్తిదారుడికీ మధ్యలో పరాన్నభుక్కు లాగా దూరి ఇరువురి నుంచీ వర్తకుడు పొందే ప్రయోజనం నుంచి వస్తుంది (derived). “యుద్ధం అంటే కొల్లగొట్టడం, వాణిజ్యం అంటే మోసం చెయ్యడం ” అని ఫ్రాంక్లిన్ అన్నది ఈ అర్ధంలోనే.
వర్తకపెట్టుబడి పెరగడం కేవలం సరుకుల ఉత్పత్తిదారులు చేసే మోసాలతో వివరించలేం. ఇంకేదయినా కారణం ఉండి ఉండాలి. అలాంటప్పుడు చాలా మధ్యంతర దశలు అవసరమవుతాయి. ఇప్పటికింకా ఆదశలు లేవు. ఎందుకంటే ,  మన ఊహలో ఉన్నది సరళ సరుకుల చలామణీ మాత్రమే కనుక. 
B.వడ్డీ పెట్టుబడి
వర్తక పెట్టుబడి ని గురించి చెప్పినది, వడ్డీ పెట్టుబడికి ఇంకా బాగా వర్తిస్తుంది. వర్తకపెట్టుబడిలో రెండు చివరలకూ  -అంటే మార్కెట్లోకి విసిరిన డబ్బూ, మార్కెట్ నించి తిరిగి తీసుకునే పెరిగిన డబ్బుకీ – మధ్యలో చలామణీ చలనం కనీసం ఒక కొనుగోలు, ఒక అమ్మకం అయినా ఉన్నందువల్లనే  జరుగుతాయి. అంటే వర్తకుడు సరుకులు కొంటాడు,అమ్ముతాడు. డబ్బు పెరుగుతుంది -డ-స-డ’. కాని వడ్డీవాడు సరుకులు కొనడు, అమ్మడు.కాని ఎక్కువ లాగుతాడు. మధ్యలో వడ్డీ పెట్టుబడిలో డ-స-డ’ రూపం రెండు చివరలుగా డ- డ’ గా కుదింపబడుతుంది.డబ్బు మరింత డబ్బుతో మారే రూపం అది. ఈరూపం డబ్బు స్వభావానికి సరిపడని/పొసగని రూపం. అందువల్ల, సరుకుల చలామణీ దృష్ట్యా ఈ రూపాన్ని వివరించడం వీలవదు.     
అందుకే అరిస్టాటిల్ అంటాడు: సంపద పెంచే  శాస్త్రం (chrematistics) ఒక ద్వంద్వ శాస్త్రం. ఒకభాగం వాణిజ్యానికి చెందింది, రెండోభాగం  ఆర్ధికానికి సంబంధించింది. ఈ రెండోది అవసరమైనదీ, మెచ్చదగినదీ. మొదటిది  చలామణీ మీద ఆధారపడింది.కనుక న్యాయంగా ఒప్పుకోదగింది కాదు (అది ప్రకృతి మీద ఆధారపడ్డది కాదు, పరస్పరం మోసగించు కోవడం మీద ఆధారపడ్డది). వడ్డీ వ్యాపారిని అత్యంత న్యాయంగా ద్వేషించడానికి కారణం డబ్బుఎందుకోసం ఏర్పడిందో ఆపనులకు కాకుండా తన ఆర్జనకి డబ్బు ని ఉపయోగించడం. డబ్బు సరుకుల మారకం కోసం ఏర్పడింది. అయితే వడ్డీఅంటే  డబ్బుతో మరింత డబ్బు చేసుకోవడమే. అందువల్ల దానికా పేరు. గ్రీకు భాషలో పదానికి వడ్డీ అనే అర్ధంతో పాటు బిడ్డ అనే అర్ధంకూడా ఉంది. బిడ్డలు కన్నవారిని పోలి ఉంటారు. కాని వడ్డీ అనేది డబ్బు. అందువల్ల బతుకుదెరువుకోసం చేసే పనుల్లోకల్లా అది అత్యంత ప్రకృతి విరుద్ధమైనది.’ 
ముందుముందు మన పరిశోధనలో వర్తక పెట్టుబడీ, వడ్డీ పెట్టుబడీ రెండూ మూలరూపాలు కావనీ, మూల రూపం నుంచి ఏర్పడినవనీ, అందువల్ల అవి ఉత్పన్న  రూపాల (derivative forms) నీ తెలుసుకుంటాం. అదే సమయంలో చారిత్రకంగా ఆధునిక పెట్టుబడి ప్రధాన రూపం కంటే ముందుగానే ఎందుకు కనబడ్డాయో స్పష్టమవుతుంది.
వైరుధ్యాలు ఎలా పరిష్కారం అవుతాయనేదే సమస్య.
అదనపు విలువ చలామణీ నుండి రాదు అని రుజువు చేశాం.అందువల్ల అదనపు విలువ ఏర్పడాలంటే, చలామణీలో కనబడనిది ఎదో నేపధ్యంలో జరిగి ఉండాలి.
మామూలు మార్కెట్ పరిస్థితుల్లో, లాభం  అనేది మారకం ద్వారా ఏర్పడదు. ఆ లావాదేవీకి  ముందే ఉనికిలో లేనట్లయితే ఆలావాదేవీ తర్వాతకూడా లాభం ఉనికిలో ఉండదు.- రాం సే
కాని అదనపు విలువ చలామణీలో కాకుండా మరెక్కడైనా ఏర్పడగలుగుతుందా?
చలామణీ సరుకు ఓనర్ల పరస్పర సంబంధాల మొత్తమే. అలాంటప్పుడు చలామణీ బయట అదనపువిలువ ఎలా ఏర్పడుతుంది?
చలామణీ బయట సరుకు ఓనర్ తన సరుకుతో మాత్రమే సంబంధంలో ఉంటాడు. ఆసరుకు విలువకి సంబంధించినంత వరకూ ఆసంబంధం పరిమితమైంది: ఆసరుకు నిర్దిష్టమైన సామాజిక సూత్రలచేత కొలవబడే అతని శ్రమని ఇముడ్చుకొని ఉంది.
ఈ శ్రమ మొత్తం  అతనిసరుకు విలువ పరిమాణం ద్వారా వ్యక్తమవుతుంది. ఆ విలువ కాతా డబ్బులో లేక్కకొస్తుంది. కనుక ఈమొత్తాన్నిధర వ్యక్తం చేస్తుంది. ఉదాహరణకి, 10 పౌన్లు అనుకుందాం. అయితే అతని శ్రమకి సరుకువిలువా, అవిలువకన్నా ఎక్కువైన విలువా రెండూ ఏకకాలంలో ప్రాతినిధ్యం వహించవు. ద్వంద్వ ప్రాతినిధ్యం ఉండదు. ఈ 10 పౌన్ల ధరా అదేసమయంలో దానికంటే ఎక్కువైన 11 పౌన్ల ధర కి ప్రతినిధి అవదు. సరుకు ఓనర్ తనశ్రమతో విలువని సృజించగలడు. కాని ‘వాటంతట అవే  పెరిగే విలువల ’ను సృజించజాలడు. 
అతను కొత్త శ్రమను కలపడం ద్వారా విలువని పెంచగలడు. అంటే చేతిలో ఉన్న విలువకు మరికొంత విలువ చేర్చగలడు. ఉదాహరణకి, తోలుని బూట్లు చెయ్యడం ద్వారా. అదే పదార్ధం ఇప్పుడు ఎక్కువ విలువతో ఉంది. కారణం ఎక్కువశ్రమని ఇముడ్చుకొని ఉండడమే. అయితే తోలు విలువ అంతకు ముందు ఎంతో అంతే ఉంటుంది. అది తనంతట తాను పెరగలేదు. బూట్లు చేస్తున్నప్పుడు ఆతోలు అదనపు విలువని కలుపుకొని సొంతం చేసుకోలేదు. కనుక సరుకుల ఉత్పాదకుడు చలామణీ రంగంలో ఇతర సరుకుల ఓనర్లతో సంపర్కంలోకి రాకుండా విలువని పెంచడమూ, ఫలితంగా డబ్బుని లేదా సరుకుల్ని పెట్టుబడి లోకి మార్చడమూ అసాధ్యం.
ఎవరైనా ఒక వస్తువుకి తనశ్రమ ద్వారా విలువని కలిపితే, అప్పటికే వున్నా విలువ స్వయంగా దానికది పెరిగినట్లు కాదు. ఎందు కంటే ఇక్కడ కర్త విలువ కాదు, అతని శ్రమ. విలువ తనంత తాను తనవిలువని పెంచుకున్నట్లయితే అది విలువ స్వయం విస్తరణ అవుతుంది. ఇక్కడ శ్రమ ఉన్నవిలువను పెంచింది.
అదనపు విలువ చలామణీలో ఏర్పడదు.అలాగే చలామణీ లేకుండాకూడా ఏర్పడదు. చలామణీలో పెట్టుబడి ఏర్పడడం సాధ్యం కాదు. చలామణీతో సంబంధం లేకుండా ఏర్పడడం  కూడా అంతే అసాధ్యం.                     పెట్టుబడి పుట్టుక చలామణీ లోనూ ఉండాలి, చలామణీలో ఉండనూ కూడదు.
అందువల్ల మనకి ద్వంద్వ ఫలితం వచ్చింది.

డబ్బు పెట్టుబడిలోకి పరివర్తన యొక్క అభివృద్ధి సరుకుల మారక నియమాల ప్రాతిపదికపైన జరగాలి.
అంటే ఆనియమాలకి అనుగుణంగా జరగాలి, అవి భంగం కాకూడదు. అవి అనుల్లంఘనీయ నియమాలు.
సమానకాల మారకం ఆరంభ బిందువుగా పెట్టుకుని  డబ్బు పెట్టుబడిలోకి పరివర్తన చెందడాన్ని వివరించాలి.
 ఇంతకుముందు పరిశోధనలో పాకుడు ఒక విషయం గ్తహిస్తాడు:  ఒకసరుకు విలువా ధరా ఒకటే అయినా పెట్టుబడి ఏర్పడడం సాధ్యమే అని. ఎందుకంటే, పెట్టుబడి పుట్టుకని ఆ రెంటికీ ఉన్నఏ తేడాకీ  ఆపాదించలేము. ఒకవేళ, ధరలు విలువలకు తేడాగా ఉంటే, మొదట మనం ధరల్ని విలువలకి కుదించాలి. వేరేవిధంగా చెబితే, విషయాల్ని స్వచ్చమైన రూపంలో చూడడం కోసం వాటి తేడాల్ని యాదృచ్ఛికమైనవిగా భావించాలి. చర్చిస్తున్న ప్రక్రియతో సంబంధంలేని అంశాల్నిజోక్యం చేసుకోనివ్వకూడదు. అంతేకాదు, ధరల్ని విలువలకు కుదించడం కేవలం శాస్త్రీయ ప్రక్రియ మాత్రమే కాదు, అని మనకు తెలుసు.
పొద్దాకులూ ఊగిసలాడే ధరల్లో కలిగే హెచ్చుతగ్గులు ఒకదాన్నొకటి పరిహరించుకొని, వాటినవే సగటు ధరకు దించుకుంటాయి. సగటు ధర అనేది  దాగి ఉండి వాటిని క్రమబద్ధం చేస్తుంది. అది కాలవ్యవధి కావలసిన ప్రతి చర్యలోనూ వర్తకుడికీ, ఉత్పాదకుడికీ దారిచూపే ధ్రువతార అవుతుంది. దీర్ఘకాలాన్ని తీసుకుని చూస్తే, సరుకులు ఎక్కువకో తక్కువకో కాక, వాటి సగటు ధరకే అమ్ముడవుతాయి, అని అతనికి ఎరుకే.
అందువల్ల, అతను ఈవిషయాన్ని గురించి ఈమాత్రం ఆలోచించినా,పెట్టుబడి ఏర్పడే సమస్యని ఇలా రూపొందిస్తాడు:
సరుకుల ధరలు సగటుధర చేత- అంటే అంతిమంగా సరుకుల విలువ చేత - క్రమబద్ధం అవుతాయి అని ఊహిస్తే, మనం పెట్టుబడిని ఎలా వివరించగలం?
 మార్క్స్ ఇలా అంటాడు:  అందుకే నేను అంతిమంగా అన్నాను. ఎందుకంటే, స్మిత్, రికార్డో ప్రభ్రుతులు  నమ్మినట్లుగా, సగటు ధరలు సరుకుల విలువలతో నేరుగా సమవసించవు.
ధరలూ విలువలూ సమానంగా ఉన్నాయి అనుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం.                                             వాగ్నర్ నోట్స్ లో ఈ ఊహ అంటే ఇలా అనుకోవడం ఒక శాస్త్రీయ అవసరం అన్నాడు.
మొదటి సంపుటం అంతటా ఈ ఊహ కొనసాగుతుంది: అన్ని సరుకుల ధరలూ పరిమాణాత్మకంగా వాటి విలువలకు సమానం. ఎందుకీ ఊహ చేశాడు?
ప్రస్తుతం పరిశోదిస్తున్నప్రక్రియ ‘డబ్బు మరింత డబ్బు అవడం’ అనేది. ఈపరిశోధన  రెండు షరతులు నెరవేర్చాలి.
1. మిత్రుడు ‘డబ్బుసంచీ’ ఇప్పటికి లార్వా రూపంలోనే ఉన్న పెట్టుబడిదారుడు. అతను సరుకుల్ని వాటి విలువలకే కొనాలి, వాటి విలువలకే అమ్మాలి. అయినాగాని ప్రక్రియ చివరలో చలామణీలో మొదట పెట్టిన విలువ కంటే ఎక్కువ విలువని చలామణీ నుండి రాబట్టాలి.
2.అతను సీతాకోక చిలుకగా, అంటే సంపూర్ణ పెట్టుబడి దారుడుగా, వృద్ధి అవడం, చలామణీ రంగంలోనూ జరగాలి,చలామణీ రంగంలో జరగనూ కూడదు.
ఇవీ సమస్యకున్న షరతులు. Hic Rhodus, hic salta! అనే లాటిన్ సామెతతో ముగిస్తాడు.
ఇక్కడే రోడ్స్, ఇక్కడే ఎగురు. ఈసోప్ కధలో నవ్వుపుట్టించే చివరి వాక్యం (punch line).కధలో ఒక ఆటగాడు రోడ్స్ దీవిలో అదిరిపోయేటంతగా దూకానని చెప్తాడు. నిజమేనననాదానికి  చూచిన సాక్షులుకూడా వున్నారని అంటాడు. పక్కనే ఉన్న వ్యక్తీ ఇలా అన్నాడు: మంచిదే.మళ్ళీ సాక్షులెందుకు? ఇదే రోడ్స్ అనుకో. అదేదో  ఇప్పుడే ఇక్కడే ఎగిరి చూపించు.
‘చెప్పడం కాదు చేసి చూపించాలి’
పై రెండు షరతులూ నెరవేరుస్తూనే, పెట్టుబడి దారుడు తాను పెట్టిన డబ్బుని మరింత డబ్బుగా ఎలా చేస్తాడో చూపించాలి. ఇదీ సమస్య

అదెలాచూపుతాడో, ఈ ఫీట్ ని ఎలాచేస్తాడో, సమస్యని ఎలా పరిష్కరిస్తాడో వచ్చే పోస్ట్ లో.
                                                                                        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి