12, అక్టోబర్ 2017, గురువారం

B. చెల్లింపు సాధనం (means of payment)

కాపిటల్ 1  వ భాగం
౩ వ అధ్యాయం
డబ్బు లేక సరుకుల చలామణీ
3 విభాగం – డబ్బు
B. చెల్లింపు సాధనం (means of payment)
ఇంతదాకా పరిశీలించిన సరుకుల చలామణీ (సరుకు-డబ్బు-సరుకు)  సరళ చలామణీ. ఇందులో విలువ రెండు ఆకారాల్లో ఉంటుంది: ఒకటి సరుకు, రెండు డబ్బు. ఒకద్రువం వద్ద సరుకు మరొక ద్రువం వద్ద డబ్బు. అవి రెండూ సమానమైనవి. వాటి ప్రతినిధులుగా వాటి ఓనర్లు కలుసుకుంటారు.ఒకరు సరుకిస్తే, మరొకరు డబ్బిస్తారు. అలాంటి లావాదేవీల్లో ఒకేచోట ఒకేకాలంలో సరుకూ,డబ్బూ ఉండాలి. అయితే సరుకు మారకానికి అలా ఉండడం తప్పనిసరి కాదు. అప్పుడు సరుకు తీసుకొని తర్వాతెప్పుడో అనుకున్న రోజుకి డబ్బివ్వవచ్చు.ఇందుకెప్పుడూ అవకాశం ఉంది.చలామణీ వృద్ధయ్యేకొద్దీ ఆ అవకాశం వాస్తవమయింది. ముందుగా సరుకులిచ్చి ఆతర్వాత వారానికో నెలకో అనుకున్న ప్రకారం డబ్బు తీసుకోవడం కూడా అమల్లోకోచ్చింది. ఇలాంటి లావాదేవీలు నిరంతరం జరుగుతున్నవే, అందరం ఎరుగున్నవే.
అలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణాలు
ఒక సరుకు ఓనర్ వేరొకరి సరుకు కొనాలంటే, ముందు తనసరుకు అమ్మాలి. అమ్మి వచ్చిన డబ్బుపెట్టి కొంటాడు. అయితే అమ్మకపోయినా కొనాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
1. ఒక సరుకు ఉత్పత్తికి తక్కువ టైం పడుతుంది, మరొకదానికి ఎక్కువ టైం పడుతుంది. ఒక సరుకు  ఉత్పత్తయ్యేచోటే  అమ్ముడవచ్చు. మరొకటి అమ్మడంకోసం మార్కెట్ కి చాలా దూరం పోవాల్సి రావచ్చు. రెండో సరుకు ఓనర్ కొనేదానికి రెడీ కాక ముందే, మొదటి సరుకు ఓనర్ అమ్మేదానికి సిద్ధంగా ఉండవచ్చు.
గడ్డపారలు చేసేవాడు గంటకొకటి చెయ్యగలడు.ఇటుకలు కాల్చేవాడికి కొన్ని వారాలు పడుతుంది. ఇటుకలవానికి గడ్డపార కావలసి వస్తే తనసరుకు ఇంకా తయారవదు. కనుక కొనడానికి డబ్బుండదు.
అందువల్ల కొనగానే డబ్బివ్వలేడు. తనసరుకు అమ్ముడయ్యేదాకా గడువు కావాలి.
2.దూరప్రాంతాల్లో అమ్మాల్సిన  సరుకులు ఉంటాయి. పోయి అమ్ముకొని వచ్చేసరికి కొంత టైం పడుతుంది. ఈలోగా తనకు కావలసిని సరుకులు కొనాలంటే చెల్లించడానికి గడువు తప్పనిసరి.
3.రైతులకి పంట సీజన్ లోనే వస్తుంది. దాన్నమ్మేదాకా కొనడానికి డబ్బుండదు. కొన్ని పంటల్ని మార్కెట్ కి తీసుకుపోవాలి. వాళ్ళు అమ్మి డబ్బిచ్చే సందర్భాలు ఉంటాయి. గడువు పెట్టుకుంటారు.
అలాంటి పరిస్థితుల్లో సరుకులు చేతులు మారతాయి. తర్వాత కొంతకాలానికి అవి డబ్బవుతాయి.
సరుకు అవసరం అవడానికీ,  కొనేందుకు డబ్బు ఉండడానికీ పొంతన ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో డబ్బు చెల్లించడం తర్వాత జరుగుతుంది- ఒప్పందం ప్రకారం.
4.మరొకపక్క, ఇల్లు లాంటి సరుకు ఉపయోగం కొంత కాలానికి, (ఒక ఏడాదికి అనుకుందాం) అమ్మవచ్చు-ఉదాహరణకి ఇల్లు. దీన్ని మామూలుగా అద్దెకివ్వడం అంటాం. ఆసరుకు ఉపయోగపు విలువని కొన్నవాడు (అద్దెకు తీసుకున్నవాడు) గడువు చివరకి గాని వాస్తవంగా  పొందలేడు. అంటే అతను చెల్లించక ముందే కొంటున్నాడు. అమ్మినవాడు ఉన్న సరుకుని అమ్ముతాడు, కొన్నవాడు డబ్బుయొక్క ప్రతినిధిగా, అదికూడా భవిష్యత్తులో ప్రతినిధిగా కొంటాడు.

రుణ దాత- రుణగ్రహీత
ఆ పరిస్థితుల్లో వాళ్ళ  పాత్రలు మారతాయి.అమ్మినవాడు అప్పిచ్చినవాడు (అంటే రుణ దాత) అవుతాడు. కొన్నవాడు అప్పు తీసుకున్నవాడు (అంటే  రుణగ్రహీత) అవుతాడు. . రుణగ్రహీత, రుణ దాత – స్వభావాలు సరళ చలామణీ నుండి తలెత్తుతాయి.
పనులుచేసేవాళ్ళకి వారం చివర్లోగాని  కూలీ రాదు.అప్పటిదాకా సరుకులు అరువు తెచ్చుకొని కూలి డబ్బులోచ్చాక చెల్లిస్తారు. డబ్బు చెల్లింపు సాధనమయింది. అది మరొక చర్య చేయవలసి వచ్చింది.
ఈసందర్భంలో సరుకుల రూప పరివర్తన ఒక కొత్త అంశంగా కనబడుతుంది. డబ్బుకి ఇంకొక పనికూడా పడుతుంది. డబ్బు చెల్లింపు సాధనం అవుతుంది
అప్పిచ్చినవాడికీ, పుచ్చుకున్న వాడికీ మధ్య సంబంధాలు మొరటుగా మారవచ్చు
.చలామణీ యొక్క ఈ మారిన రూపం కొన్నవాడికీ అమ్మినవాడికీ కొత్త రంగు వేస్తుంది. ఈ కొత్త పాత్రలు అమ్మేవాడూ, కోనేవాడూ అనే పాత పాత్రల లాగే తాత్కాలికమయినవి, ఒకపాత్ర మరోకపాత్రలోకి మారుతుంది. ఆ నటులే అటూ ఇటూ మారి పాత్రలు పోషిస్తుంటారు. అయితే ఈ వ్యతిరేకత అంత అనుకూలమైనది కాదు. గట్టిపడే అవకాశం ఉంటుంది. అప్పిచ్చినవాడికీ, పుచ్చుకున్న వాడికీ మధ్య సంబంధాలు మొరటుగా మారవచ్చు.ఇందుకు ఉదాహరణ ఫుట్ నాట్ లొ ఉండి:18 వ శతాబ్దం మొదట్లో “ ఇంగ్లండ్ వర్తకుల మధ్య  ఉన్న మొరటుదనం మరే ఇతర సమాజాల్లోనూలేదు. ప్రపంచంలో ఏఇతర దేశంలోనూలేదు”- (―An Essay on Credit and the Bankrupt Act)
సరుకుల చలామణీ ప్రమేయం లేకుండానే స్వతంత్రంగా అవే పాత్రలు రూపొందవచ్చు కూడా.
ప్రాచీన ప్రపంచంలో వర్గపోరాటాలు ముఖ్యంగా అప్పులిచ్చినవాళ్ళకీ, తీసుకున్న వాళ్ళకీ మధ్య పోటీ రూపం తీసుకున్నవే. రోమ్ లో  ఈ పోరాటాలు  అప్పుపడ్డ సామాన్యుల (plebeian debtors) వినాశనంతో ముగిసింది. వాళ్ళ స్థానంలో బానిసలొచ్చారు.
మధ్య యుగాల్లో ఫ్యూడల్ రుణగ్రస్తుల నాశనంతో పోటీ ముగిసింది.వాళ్ళ ఆర్ధిక పునాదినీ, దాని మీద ఆధారపడ్డ రాజకీయాధికారాన్నీ కూడా కోల్పోయారు. అయినా, ఈరెండు కాలాల్లోనూ అప్పు ఇచ్చినవాడికీ, తీసుకున్న వాడికీ మధ్య ఉండే సంబంధం  వర్గాల యొక్కసాధారణ ఆర్ధిక పరిస్థితుల  మధ్య ఎంతో లోతుగా ఉన్న శత్రుత్వాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుంది.

సరుకుల చలామణీకి తిరిగొద్దాం. అమ్మక ప్రక్రియలో సరుకులూ డబ్బూ సమానకాలుగా ఒకేసారి కనబడడం నిలిచి పోతుంది. మొదటి విషయం.అమ్మిన సరుకు ధర నిర్ణయంలో డబ్బు  ఇప్పుడు విలువ కొలమానంగా పనిచేస్తుంది; ఒప్పందంలో నిర్ణయమైన ధర, అప్పు తెసుకున్నవాని బాధ్యత ఎంతో కొలుస్తుంది. ఫలానా రోజుకి ఇవ్వాల్సిన మొత్తం ఎంతో  కొలుస్తుంది. అంటే ఫలానా తేదీకి ఫలానింత ఇవ్వాలని తేలుస్తుంది.
రెండోవిషయం. అది భావాత్మక కొనుగోలు సాధనంగా ఉపకరిస్తుంది.చేల్లిస్తాను అని కొన్నవాడు చేసిన వాగ్దానంలో మాత్రమే ఉండి, సరుకుని చేతులు మారేట్లు చేస్తుంది (అంటే కాని అక్కడ వాస్తవంగా డబ్బుండదు).చెల్లించాల్సిన రోజు వచ్చేదాకా, చెల్లింపు సాధనం చలామణీ లోకి రాదు. అంటే కొన్నవాని చేతిలోంచి అమ్మినవాని చేతిలోకి రాదు.
నిల్వా- చెల్లింపు సాధనమూ
ఈ మూడో చర్య గురించి వివరించేటప్పుడు మార్క్స్ నిలవనీ, చెల్లింపుసాధనాన్నీ పోలుస్తాడు.
సరుకు-డబ్బు-సరుకు  ప్రక్రియ తొలి దశసరుకు-డబ్బు ముగియగానే అంతటితో  నిలిచిపోయింది. అంటే,సరుకు మారిన రూపం అయిన  డబ్బు చలామణీ నుండి ఉపసంహరించబడింది. కాబట్టి  చలామణీ మాధ్యమం నిల్వగా మారింది. సరుకు చలామణీ నుండి వెళ్ళిపోయాక మాత్రమే,  చెల్లింపు సాధనం చలామణీలో ప్రవేశిస్తుంది.ఈ ప్రక్రియని తెచ్చేది డబ్బు కాదు. ముగించేది మాత్రం  డబ్బు. మారకం విలువ యొక్క నిరపేక్ష మనుగడ రూపంగా లేక సార్వత్రిక సరుకుగా ప్రవేశించడం ద్వారా ఈ ప్రక్రియని పూర్తిచేస్తుంది. అమ్మినవాడు తనసరుకును డబ్బుగా మార్చుకున్నాడు- ఎదో ఒక అవసరాన్ని తీర్చుకోడానికి.నిల్వదారుడు కూడా అదే చేశాడు –తన సరుకుని డబ్బు రూపంలో ఉంచడానికి. అప్పుపడ్డవాడూ చెల్లించ గలిగేందుకు అదే చేశాడు. అతను చెల్లించకపోతే, షరీఫ్ అతని వస్తువుల్ని అమ్మివేస్తాడు. సరుకుల విలువ రూపం అయిన డబ్బే ఇప్పుడు లక్ష్యమూ, పరమావధీ కూడా. అది కూడా చలామణీ ప్రక్రియనుండి తలెత్తే సామాజిక అవసరమే.
ముందు సరుకు అప్పగింత, తర్వాతే ధర చెల్లింపు
కొన్నవాడు సరుకుల్ని డబ్బులోకి మార్చేముందే డబ్బుని తిరిగి సరుకుల్లోకి మారుస్తాడు. వేరే విధంగా చెబితే, మొదటి రూప పరివర్తన లేకుండానే రెండో రూప పరివర్తనని సాధిస్తాడు.అమ్మినవాని సరుకు చలామణీ అవుతుంది. దాని ధరని పొందుతుంది.అయితే అది ఆడబ్బుమీద చట్టబద్ధమైన హక్కు రూపంలోమాత్రమే.అది డబ్బులోకి మారకముందే ఉపయోగపువిలువలోకి మారుతుంది.దాని మొదటి రూప పరివర్తన తర్వాతి కాలంలో మాత్రమే పూర్తవుతుంది.
ముందు ధర చెల్లింపు, తర్వాతే సరుకు అప్పగింత
ముందు డబ్బివ్వడం తర్వాతెప్పుడో సరుకులు పొందడం కూడా ఉంటుంది.

డబ్బు ఉపయోగపువిలువ సిద్ధించకముందే, వాస్తవంగా సరుకు అప్పగింతకు ముందే,సరుకుధర సిద్ధించవచ్చు. ముందస్తు చెల్లింపుల రూపంలో ఇది ప్రతిరోజూ నిరంతరం జరుగుతుంటుంది. ఇంగ్లిష్ ప్రభుత్వం ఇండియా రైతులనుండి నల్లమందు ఈ పద్ధతిలోనే కొనేది... రష్యాలో ఉత్పత్తుల్ని కొనడానికి విదేశీ వర్తకులు ఈవిధానాన్నిపాటించేవాళ్ళు. ఏమైనా ఈ సందర్భాలలో డబ్బు కొనుగోలు సాధనంగా పనిచేస్తుంది.... పెట్టుబడి కూడా డబ్బురూపంలో అడ్వాన్స్ చెయ్యబడుతుంది....అయితే ఈ దృక్పధం (point of view) సరళ చలామణీ పరిధిలోకి రాదు.-క్రిటిక్
చలామణీ లోకొచ్చే సరుకు కోనేవానికి ఉపయోగపువిలువ అయ్యే ముందే, అమ్మేవానికి మొదట మారకం విలువ, డబ్బు అవాలి. మారిన అమ్మకం పద్ధతిలో ఈరెండు దశలు కూడా  తారుమారవుతాయి.మొదట  కొన్నవాడికి అది ఉపయోగపువిలువ అవుతుంది.అమ్మినవానికి మారకం విలువ అవడం ఆలస్యమవుతుంది.
ఒక నిర్ణీత సమయంలో బాకీలు చెల్లించాల్సిన బాధ్యతలు అమ్ముడయిన  సరుకుల ధరల మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఆమొత్తాన్ని సిద్ధింప చెయ్యడానికి అవసరమైన బంగారం పరిమాణం మొదట చెల్లింపు సాధనంయొక్క వేగాన్ని బట్టి ఉంటుంది. ఆపరిమాణం రెండు పరిస్తితులమీద ఆధార పడుతుంది.
1. అప్పు పెట్టినవాళ్ళ, తీసుకున్నవాళ్ళ సంబంధాలు ఒక గొలుసుగా ఏర్పడతాయి. ఎలాగంటే, తనబాకీదారుడు B డబ్బివ్వగానే A దాన్ని నేరుగా తనకి అప్పిచ్చిన C చేతిలో పెడతాడు. C నించి D కి  D నించి E కి....ఇలా  పోతూనే ఉంటుంది. ఇదే గొలుసు ఏర్పడడం అంటే.
2. రెండో పరిస్థితి. బకాయీలు చెల్లించాల్సిన వేర్వేరు  గడువు రోజుల మధ్య వ్యవధులు. ఆగని చెల్లింపుల గొలుసు లేక నెమ్మదించిన మొదటి రూప పరివర్తనలు సారభూతంగా భిన్నమైనది. దీనికీ ఇంతకు ముందు మనం పరిశీలించిన పరస్పరం పెనవేసుకునే రూపపరివర్తనల పరంపరకీ తేడా ఉంది. చలామణీ మాధ్యమం చలనం వల్ల అమ్మేవాళ్ళకీ కోనేవాళ్ళకీ మధ్య సంబంధం వ్యక్తం కావడమే కాదు,ఈ సంబంధం చలామణీ లోనే ఏర్పడింది, చలామణీలో మాత్రమే మనుగడలో ఉంటుంది. అందుకు భిన్నంగా చెల్లింపు సాధనం యొక్క చలనం ఎంతోకాలం ముందు నించే ఉన్న సామాజిక సంబంధాన్ని తెలుపుతుంది.
చెల్లించాల్సిన ఒకే శేషం
ఎన్నో అమ్మకాలు ఏకకాలంలో జరుగుతాయి. పక్కపక్కనే జరుగుతాయి. ఈ వాస్తవం చలనవేగం వల్ల నాణెం ఏ మేరకు తొలగించబడుతుందో ఆమేరని పరిమిత పరుస్తుంది. మరొకపక్క, ఈ వాస్తవం చెల్లింపు సాధనాన్ని తగ్గించే కొత్త లివర్ . ఒక చోట చెల్లింపులు కేంద్రీకరించబడే నిష్పత్తిలోనే, వాటి రద్దు(liquidation) కోసం ప్రత్యేక సంస్థలూ, విధానాలూ వృద్ధి చెందుతాయి. మధ్యయుగాల్లో లియోన్స్ లో ఉన్న వేర్ మెంట్స్* అలాంటివే.(ఒక అకౌంట్ నుంచి మరోక అకౌంట్ కిమార్చే సంస్థ)Bనుంచి A కి రావాల్సిన అప్పులు, B కి C నుంచి రావాల్సిన అప్పులు, C నుంచి Aకి రావాల్సిన అప్పులు ....ఇంకా అలాంటివి అవి ఎదో మేరకు రద్దవుతాయి- ధన రుణ పరిమాణాలలాగా. ఆవిధంగా చెల్లించాల్సిన ఒకే శేషం (single balance) మిగులివుంటుంది. రద్దుల వల్ల చెల్లింపు సాధనంగా అవసరమైన డబ్బుపరిమాణం పొదుపవుతుంది. తగ్గుతుంది. కేంద్రీకృతమైన చేల్లిమ్పులమొట్టం ఎంత ఎక్కువైతే ఆమొత్తానికి సాపేక్షంగా ఈ శేషం అంత తక్కువగా ఉంటుంది, చలామణీలో చెల్లింపు సాధనం అంతే తక్కువగా వుంటుంది.
చెల్లింపు సాధనంగా డబ్బు చర్యలో వైరుధ్యం
చెల్లింపులు పరస్పరం రద్దవడం సామాజిక స్థాయిలో చెదిరితే, చెల్లించాసిన బాధ్యతలు సెటిల్ చెయ్యడానికి  అందుబాటులోఉన్నడబ్బుకంటే ఎక్కువ కావాలి : సంక్షోభం.
చెల్లింపు సాధనంగా డబ్బు చర్యలో ఒక వైరుధ్యం ఉంది. చెల్లింపులు ఒకదానికొకటి బాలెన్స్ అయినమేరకు డబ్బు ఉహాత్మకంగా కాతా  డబ్బుగా, విలువ కొలమానంగా పనిచేస్తుంది.వాస్తవంగా  చెల్లించాల్సిన మేరకు డబ్బు చలామణీ మాధ్యమంగా ఉపకరించదు. సామాజిక శ్రమ యొక్క అవతారంగా, మారకం విలువ యొక్క స్వతంత్ర మనుగడ రూపంగా, సార్వత్రిక సరుకుగా* ఉపకరిస్తుంది. పారిశ్రామిక, వాణిజ్య సంక్షోభాలలో ఉండే ద్రవ్య సంక్షోభాలు అనబడే  దశలలో ఈ వైరుధ్యం తీవ్రమౌతుంది/మొనదేలుతుంది.బద్దలవుతుంది.
ఇక్కడ చెప్పిన ద్రవ్య సంక్షోభమనేది ప్రతి సంక్షోభంలోనూ  ఒక దశ. దానికదే స్వతంత్రంగా ఏర్పడే ద్రవ్య సంక్షోభం కూడా ఉంటుంది. అది పరిశ్రమ మీదా, వ్యాపారం మీదా పరోక్షంగా ప్రభావం చూపుతుంది. ఈరెంటినీ  వేరువేరుగా గమనించాలి. వాటి భేదాల్ని స్పష్టంగా గ్రహించాలి. డబ్బు పెట్టుబడిలోనే వీటి  ఇరుసు ఉంటుంది. కనుక వాటి ప్రత్యక్ష కార్యరంగం ఆ పెట్టుబడి రంగమే, అంటే, బాంకింగ్,స్టాక్ ఎక్స్చేంజ్, ద్రవ్య రంగాలే.
అలాంటి సంక్షోభం ఎక్కడ ఏర్పడుతుంది?
 చెల్లింపుల గొలుసు అంతులేకుండా పెరిగిపోయి, ఆ చెల్లింపుల్ని సెటిల్ చెయ్యడానికి కృత్రిమ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందిన చోట మాత్రమే అలాంటి సంక్షోభం ఏర్పడుతుంది. ఏ కారణం చేతైనాగానీ, ఈ విధానం/ఏర్పాటు మరీ ఎక్కువగా అస్తవ్యస్తం అయినప్పుడు డబ్బు ఖాతా డబ్బు(money of account) అనే భావాత్మక ఆకారం నుండి అకస్మాత్తుగా, తక్షణమే నగదు (hard cash) లోకి మారుతుంది. మామూలు సరుకులేవీ ఇక దాని స్థానంలోకి రాలేవు. సరుకుల ఉపయోగపువిలువ విలువలేనిది (valueless) అవుతుంది. వాటి విలువ దాని సొంత స్వతంత్ర రూపం ముందు అదృశ్యం అవుతుంది. సంక్షోభం వచ్చే ముందు  మత్తుగొలిపే భారీ సంపదవల్ల  కలిగిన స్వయం సమృద్ధి భావనతో ఉన్న బూర్జువా డబ్బు అనేది నిష్ఫలమైన ఊహ మాత్రమే అంటాడు. సరుకులు మాత్రమే  డబ్బు. అయితే ప్రస్తుతం ప్రతిచోటా ఒకటే  కేక: డబ్బు మాత్రమే సరుకు!
అప్పు విధానం నుంచి ఆకస్మికంగా నగదు విధానానికి వెనుదిరగడం భయోత్పాతాన్నీ ఆపైన సిద్ధాంత పరమైన విపరీత భీతినీ కలిగిస్తుంది; చలామణీని నడిపే వ్యాపారులు తమ సొంత ఆర్ధిక సంబంధాలను ఆవహించిన దుర్భేద్యమైన రహస్యం(mystery) ముందు గడగడ వణికిపోతారు (Karl Marx, l.c., p. 126.)
పేదలు పనిలేక కాళీగా ఉంటారు. కారణం పనివ్వడానికి ధనవంతులదగ్గర, యచ్చాలూ, బట్టలూ ఇవ్వడానికి గతంలోలాగే భూమీ, చేతులూ ఉన్నప్పటికీ,  డబ్బు లేకపోవడం;...నిజమైన దేశ సంపద అదే, (యచ్చాలూ, బట్టలే) డబ్బుకాదు.-అని 1696 లో జాన్ బెల్లర్స్ రాసిన వాక్యాన్ని ఉటంకిస్తాడు.
లేడి తాజా నీటికోసం ఎలా   పరితపించి పోతుందో, ఏకైక సంపద రూపం అయిన  డబ్బు కోసం బూర్జువా ఆత్మ అలా పరితపిస్తుంది. ఆపరిస్తితుల్లో సంపద అంటే  ఒక్క డబ్బే.
సంక్షోభంలో సరుకులకీ, వాటి విలువ రూపం అయిన డబ్బుకీ మధ్య ఉండే వ్యతిరేకత ఎదిగి  పరమ వైరుధ్యంగా పరిణమిస్తుంది. కనుక అలాంటి సందర్భాల్లో డబ్బు కనబడే రూపం ముఖ్యం కాదు. చెల్లింపులు బంగారంలో జరిగినా, బాంక్ నోట్ల వంటి ఖాతా డబ్బులో జరిగినా డబ్బు కరువు మాత్రం కొనసాగుతుంది.

3అలాంటి పరిస్థితుల్ని వ్యాపారులు తమకనుకూలంగా వినియోగించుకుంటారు. 1839 లొ ఒక సందర్భంలో స్వార్ధపరుడైన ఒక బాంకర్ అతను కూర్చున్న డెస్క్ తెరిచి నోట్ల కట్టలు ఒక మిత్రుడికి చూపాడు. అవి 6 లక్షల పౌండ్లు అని ఆనందపడుతూ చెప్పాడు. డబ్బు చలనంలో లేకుండా ఉంచడానికి వాటిని బిగబట్టినట్లూ, అదే రోజు 3 గంటలు కొట్టాక విడుదల చేయబోతున్నట్లూ చెప్పాడు. 1864 ఏప్రిల్ అబ్జర్వర్ లో ఇలాఉంది: బాంక్ నోట్ల కొరత సృష్టించడానికి అవలంబించే సాధనాల గురించి ఆసక్తికరమైన రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి ... అలాంటి ట్రిక్కులు పన్నుతారని అనుకోవడం సందేహించదగినదే అనిపించినా, ఆ రిపోర్టు సర్వత్రా ఉన్నది కనక దాన్ని ప్రస్తావించడం నిజంగా సముచితం.  
ఒకనిర్ణీత కాలంలో చలనంలో ఉండే డబ్బుమొత్తం
చలనవేగమూ, చెల్లింపు సాధనాల చలన వేగమూ నిర్దిష్టంగా వున్నప్పుడు చలనంలో ఉండే డబ్బుమొత్తం = సిద్ధించాల్సిన ధరలమొత్తం + చెల్లించాల్సిన బాకీల మొత్తం – ఒకదాన్నొకటి రద్దుపరుచుకునే చెల్లింపులు – ఒకసారి చలామణీ సాధనంగానూ, మరొకసారి చెల్లింపు సాధనంగానూ ఉపకరించే ఒకే నాణెం చేసే సర్క్యూట్ల సంఖ్య. దీని ప్రకారం చివరికి వచ్చేదే చలనంలో ఉండే డబ్బుమొత్తం.
ఉదాహరణకి ఒకరైతు గోదుమల్ని 2పౌండ్లకి అమ్మాడు. ఆడబ్బు చలామణీ మాధ్యమంగా ఉపకరిస్తుంది.తనకు బట్టనిచ్చిన నేతగానికి చెల్లించాల్సిన రోజొచ్చినప్పుడు ఆడబ్బుని ఉపయోగితాడు. అదే 2 పౌండ్లు ఇప్పుడు చెల్లింపు సాధనంగా ఉపకరించింది. ఆ నేతగాడు ఇప్పుడు డబ్బిచ్చి బైబిల్ కొంటాడు. ఇది మళ్ళీ చలామణీ మాధ్యమంగా పనిచేస్తుంది. అలా..అలా.....
అందువల్ల, ధరలూ, చలన వేగమూ, చెల్లింపుల విస్తృతీ తెలిసినప్పటికీ, ఒక నిర్ణీత కాలంలో ఉదాహరణకి ఒకరోజులో, చలనంలో ఉన్న డబ్బు పరిమాణమూ, చలామణీ లో ఉన్న సరుకుల మొత్తమూ రెండూ ఒకటిగా ఉండవు.
ఎప్పుడో చలామణీ నుంచి ఉపసంహరించబడిన సరుకులకు ప్రతినిధిగా ఉండే డబ్బు, చలనంలో కొనసాగుతుంది. సరుకులు చలామణీ అవుతుంటాయి. కాని, వాటి సమానకం అయిన డబ్బు రాబోయే కాలంలో ఏదో రోజున మాత్రమే కనబడుతుంది. అంతదాకా రంగంలో కనబడదు. అంతేగాదు, ప్రతిరోజూ ఒప్పందం అయ్యేయ్యే అప్పులూ, అదేరోజు చెయ్యాల్సిన చెల్లింపులూ రెండూ ఒకేరకంగా కొలవడానికి వీలుకాని రాసులు (incommensurable quantities).
ఒక  రోజులో జరిగిన కొనుగోళ్ళ మొత్తం గానీ, ఒప్పందాల మొత్తంగానీ అదే రోజున చలనంలో ఉండే డబ్బు పరిమాణం మీద ప్రభావం చూపవు. కాని, అత్యధిక సందర్భాల్లో కొనుగోళ్ళ, ఒప్పందాల డబ్బు పరిమాణం తర్వాతి తేదీల్లో దగ్గరలోనో దూరంలోనో అమలయ్యే వివిధ డ్రాఫ్టుల లోకి వాటికవే రిజాల్వ్ అవుతాయి. .....ఇవ్వాళ మంజూరైన బిల్లులు, తెరిచిన అప్పులు రేపో ఎల్లుండో మంజూరయ్యే బిల్లుల, చేసే అప్పుల పరిమాణంలోగానీ, కాలవ్యవధిలో గానీ ఏ పోలికతోనూ ఉండవు. అంతేకాదు, ఇవ్వాల్టి  చాలా బిల్లులూ, అప్పులూ చెల్లించవలసిననాడే ఎప్పుడెప్పుడో తీసుకున్న బిల్లులూ అప్పులూ చెల్లించాల్సి వస్తుంది.          12 నేలలక్రితమో, ఆర్నెల్ల క్రితమో, మూణ్ణెల్ల క్రితమో, నేలక్రితమో ఏర్పడ్డ బిల్లులు తరచు కలిసి ఒకే రోజు పెద్దమొత్తం చెల్లించాల్సి రావచ్చు.- The Currency Theory Reviewed: A Letter to Scotch People. By a Banker in England, Edinburgh, 1845, pp. 29, 30 passim).

ఖాతాడబ్బు చెల్లింపు సాధనంగా డబ్బు చేసే చర్య నుండి నేరుగా తలెత్తుతుంది. కొన్న సరుకుల వల్ల  ఏర్పడిన అప్పుల పత్రాలు ఆ అప్పుల్ని ఇతరులకు బదిలీ చేయదం కోసం  చలామణీ అవుతాయి.మరొక పక్క, అప్పు వ్యవవస్థ ఏ మేరకు వృద్ధవుతుందో, ఆ మేరకు చెల్లింపు సాధనంగా డబ్బు చర్య కూడా వృద్ధవుతుంది. ఆపాత్రలో అది తనకు ప్రత్యేకమైన వివిధ రూపాలు - మారకం బిల్లులు (bills of exchange), చెక్కులు, స్థానిక నోట్లు మొదలయిన రూపాలు – తీసుకుంటుంది. ఆయారూపాల్లో అది భారీ వాణిజ్య లావాదేవీల రంగంలో సౌకర్యవంతంగా మసులుకోగలుగుతుంది. మరొకపక్క, వెండి బంగారు నాణేలు ఎక్కువగా చిల్లర వర్తక రంగానికి పరిమితం చేయ బడతాయి 
వాస్తవ వాణిజ్య లావాదేవీలకు రెడీగా ఎంత తక్కువ డబ్బు సరిపోతుందో చూపడానికి ఒక ఉదాహరణ ఇచ్చాడు. అది ఒక భారీ వ్యాపార సంస్థ  1856 సంవత్సర జమాఖర్చుల పట్టిక. ఎన్నో మిలియన్ల లావాదేవీల్ని ఒక మిలియన్ కి కుదించబడింది.                                                                           రాబడులు
గడువు తర్వాత(బాంకర్లు, వర్తకులు) చెల్లించాల్సిన బిల్లులు
£ 533,596
డిమాండ్ పై బాంకర్లు, ఇతరులూ చెల్లించాల్సిన చెక్కులు
£ 357,715
కంట్రీ నోట్లు
£     9,627
ఇంగ్లండ్ బాంక్ నోట్లు
£   68,554
బంగారం
£   28,089
వెండి, రాగి
£     1,486
పోస్ట్ ఆఫీస్ ఆర్డర్లు
£        933
మొత్తం
£ 1 ,000,000

ఈమొత్తంలోడబ్బుఒక లక్షకి కొంచెం పెచ్చు.

 చెల్లింపులు
గడువు తేదీ తర్వాత చెల్లించాల్సిన బిల్లులు
£302,674
లండన్ బాన్కర్ల చెక్కులు
£663,672
ఇంగ్లండ్ బాంక్ నోట్లు
£22,743
బంగారం
  £9,427
వెండి, రాగి
  £1 ,484
మొత్తం
£ 1 ,000,000

ఈమొత్తంలోడబ్బు 34,000 కి కొంచెం తక్కువ.
(Report/rom the Select Committee on the Bank Acts, July 1 858, p. lxxi)

చెల్లింపు సాధనంగా డబ్బు చర్య విస్తరించడం
సరుకుల ఉత్పత్తి ఒక స్థాయికి  విస్తరించినప్పుడు, సరుకుల చలామణీరంగాన్ని  దాటి, చెల్లింపు సాధనంగా డబ్బు చర్య విస్తరించడం మొదలవుతుంది. అది అన్ని ఒప్పందాలకు సార్వత్రిక విషయం అయిన సరుకు  అవుతుంది.
వర్తకం ఆదారి కి మళ్ళాక, అంటే వస్తువులకు వస్తువుల మారకం నుండి, ఇచ్చి పుచ్చుకోవడం నుండి, అమ్మడం చెల్లించడం అనే దానికి వచ్చాక, అన్ని బేరాలూ ..ఇప్పుడు ధర ప్రాతిపదిక మీద డబ్బులో చెప్పబడతాయి.(డేనియల్ డెఫో) An Essay upon Pub lick Credit, 3rd edn, London, 1710, p. 8
అద్దెలూ, పన్నులూ వంటి చెల్లింపులు వస్తుచెల్లింపుల నుండి డబ్బు చెల్లింపులలోకి మారతాయి. ఈ మార్పు సాధారణ ఉత్పత్తి పరిస్తితులమీద ఏ స్థాయిలో ఆధారపడుతుంది అనేదాన్ని సోదాహరణంగా వివరించాడు. రోమన్ సామ్రాజ్యం అన్ని వసూళ్ళనీ డబ్బులో విధించాలని ప్రయత్నించి రెండుమార్లు విఫలమయింది. (దీన్నిబట్టి ఉత్పత్తి పరిస్థితులు అక్కడ అప్పటికి పూర్తి డబ్బు చెల్లింపులకు అనుకూలంగా లేవు.)14వ  లూయీ కాలంలో ఫ్రెంచ్ రైతులు చెప్పలేనంత కష్టం బాధ అనుభవించారు. బాయిస్ గుల్లెబెర్ట్, మార్షల్ వౌబన్  మరికొందరు వాళ్ళ కష్టాల్ని అనర్గళంగా ఖండించారు. ఈకష్టాలకు కారణం పన్నుల భారం ఒక్కటే కాదు, వస్తురూపంలో చెల్లించే  పన్నుల్ని డబ్బు రూపంలో చెల్లించేవిగా మార్చడం కూడా.  .55
డబ్బు అన్నిటినీ  ఉరితీసే తలారి అయింది. ఫైనాన్స్ అనేది మరణాంకమైనసారాన్ని దింపడానికి సరుకుల్ని భయంకర పరిమాణంలో అవిరిచేసే సాధనం (alembic). డబ్బు మొత్తం మానవజాతి మీదే యుద్ధం ప్రకటిస్తుంది.- బాయిస్ గుల్లెబెర్ట్ 1843

అలాకాకుండా  ఆసియాలో పన్నులలో ఎక్కువభాగం  కౌళ్ళే. వాటిని వస్తురూపంలో చెల్లించవచ్చు. ఈవాస్తవం(కౌళ్ళవస్తురూపచెల్లింపు) ప్రకృతి పరిస్థితుల క్రమబద్ధతతో పునరుత్పత్తి అయ్యే ఉత్పత్తి పరిస్తితులమీద ఆధారపడుతుంది. ఈరకమైన చెల్లింపు ప్రాచీన ఉత్పత్తి రూపాన్ని నిర్వహించే పని  చేస్తుంది.ఆటోమన్ సామ్రాజ్యం చెక్కుచెదరకుండా ఉండడానికి ఒక కారణం ఈ చెల్లింపు విధానం కూడా.
ఐరోపా వాళ్ళు జపాన్ వాళ్ళమీద బలవంతంగా రుద్దిన విదేశీవ్యాపారం చెల్లింపులు వస్తు రూపంలో కాకుండా, డబ్బులో అయివున్నట్లయితే శ్రేష్టమైన ఆదేశవ్యవసాయం నాశనం అయ్యేది. ఆవ్యవసాయం కొనసాగే ఆర్దికపరిస్తితులు తుడిచిపెట్టుకు పోయేవి.
ప్రత్యేక చెల్లింపు దినాలు
ప్రతి దేశంలోనూ వివిధ  చెల్లింపులూ కొద్దివీ పెద్దవీ సెటిల్ చేసుకునే రోజులు అలవాటుగా ఉంటాయి. ఆరోజులు పునరుత్పత్తి చక్రంలో జరిగే ఇతర భ్రమణాలను పక్కనబెడితే, ఋతువులతో ముడిబడిన పరిస్థితుల  మీద ఆధారపడి ఉంటాయి. సరుకుల చలామణీతో నేరుగా సంబంధంలేని పన్నులు,కౌళ్ళు వగయిరా చెల్లింపుల తేదీలను అవి నియంత్రిస్తాయి/క్రమబద్ధం చేస్తాయి.ఆరోజుల్లో దేశం అంతటా చెల్లించాల్సిన వాటికి  అవసరపడే డబ్బుపరిమాణం చెల్లింపు మాధ్యమ ఎకానమీలో అప్పుడప్పుడు చిందరవందరలు కలిగిస్తుంది-కేవలం పైపైవే అయినప్పటికీ. 
ఈస్టర్ తర్వాతవచ్చే 8 వ ఆదివారం Whitsunday. దాని తర్వాత వారం Whitsuntide. 1824 సంవత్సరం ఆ వారంలో ఎడింబరో బాంక్ కి నోట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడ్డది.ఎంతగా అంటే 11గంటలకల్లా కస్టడీలో ఒక్క నోటన్నాలేదు. అప్పుకోసం అన్ని బాంకులకూ పంపారు. కాని దొరకలేదు. చాలా లావాదేవీలు కాగితం చీట్లమీద సర్దుబాటు చెయ్యబడ్డాయి. అయితే సాయంత్రం 3 గంటలయ్యేసరికి ప్రొద్దున ఇచ్చిన నోట్లన్నీ తిరిగి బాంకుల్లోపడ్డాయి. అది చేతినుండి చేతికి బదిలీ అవడమే.- స్కాట్ లాండ్ లో సగటు  బాంక్ నోట్ల చలామణీ 3మిలియన్ల స్టెర్లింగ్ లకు లోపే ఉంటుంది. అయితే సంవత్సరంలో కొన్ని చెల్లింపు రోజుల్లో బాంకర్ల చేతిలో ఉన్న 7 మిలియన్లలో ప్రతినోటూ క్రియాశీలమవుతుంది. ఆసందర్భాలలో నోట్లకి ఒకే ఒక ప్రత్యేక చర్య ఉంటుంది. ఆపని అయ్యీ అవగానే, అవి ఇచ్చిన బాంకులకే తిరిగి వస్తాయి- జాన్ ఫుల్లార్టన్ 1845
మార్క్స్ ఇక్కడ చిన్న వివరణ ఇచ్చాడు: ఫుల్లార్టన్ పుస్తకం రాసేనాటికి స్కాట్ లాండ్ లో డిపాజిట్లు తీసుకోవడానికి ఇంకా చెక్కులు రాలేదు. నోట్లే వాడేవారు.
చెల్లింపు సాధనం యొక్క చలన వేగం నియమాన్ని అనుసరించి, అన్నినిర్ణీత కాలాల చెల్లింపులకూ కావలసిన చెల్లింపు సాధనం పరిమాణం వాటి గడువుల పొడవుకి విలోమంగా/అనులోమంగా* ఉంటుంది-
*కాపిటల్ మూడోకూర్పు (1887)వరకూ విలోమం అని ఉంది. కాని నాలుగో జర్మన్ కూర్పు (1890)లో అనులోమం గా మారింది. ఆమార్పు చేసింది ఎంగెల్స్ అని అక్కడే ఉంది.
క్లుప్తంగా, కాలం ఎక్కవయితే , ఎక్కువడబ్బు కావాలి తక్కువయితే తక్కువ డబ్బు కావాలి.
వ్యాపారవసరాలకు ఏడాదికి 40 మిలియన్లు  పెంచాల్సిన  పరిస్థితి ఉంటే, 6మిలియన్లు  (బంగారం) ఆభ్రమణాలకీ, చలామణీలకీ సరిపోతుందా?
 అనే ప్రశ్నకి పెట్టీ అవును అన్నాడు. ఎలాగో లేక్కచేప్పాడు.మొత్తం ఖర్చు 4 కోట్లు కనుక భ్రమణాలు తక్కువ కాలంలో అంటే వారానికి,అంటే ప్రతి శనివారం పనివాళ్ళు కూలి తీసుకొని చెల్లించినట్లుగా జరిగితే అప్పుడు 40,000,000 నీ  52 భాగిస్తే వచ్చేమొత్తం సరిపోతుంది. అది ఒకమిలియన్ లోపే, అలాకాక కౌళ్ళు, పన్నుల విషయంలో మాదిరిగా మూన్నెల్లకో సారి భ్రమణం జరిగితే 40,000,000/4=10మిలియన్లు అవసరమవుతాయి. ఒకవేళ చెల్లింపులు వారానికీ, 13 వారాలకీ మధ్యలో అప్పుడప్పుడు జరిగితే అప్పుడు 10 మిలియన్లకీ 1 మిలియన్ కలిపి వచ్చే11 మిలియన్లలో సగం మిలియన్లు సరిపోతాయి. – విలియం పెట్టీ Political Anatomy of Ireland 1672


అప్పులు తీర్చడానికి నిల్వ అవసరం

చలామణీ సాధనంగా డబ్బు అభివృద్ధి చెందడం వల్ల  బాకీల మొత్తాల్ని గడువు తేదీలు వచ్చేటప్పటికి  కూడ 
బెట్టాల్సిన అవసరం ఏర్పడింది. సంపద సముపార్జనకి డబ్బు కూడ బెట్టడం ఒక విస్పష్ట విధానం కాగా, సమాజం పురోగామించేకొద్దీ ఆపద్దతి కనపడకుండా పోతుంది. చెల్లింపు సాధనం నిల్వలు ( reserves) ఏర్పడడం సమాజ పురోగమనంతో పాటు పెరుగుతుంది. అంటే అంతకుముందు సంపదగా డబ్బుని కూడబెట్టడం ఏర్పడి ఉంది.ఖాతా డబ్బు వచ్చాక అప్పులు తీర్చడానికి నిల్వ చెయ్యాల్సిన అవసరం ఏర్పడింది. 

ప్రపంచ డబ్బు గురించి వచ్చే పోస్ట్ 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి