5, జులై 2018, గురువారం

కార్ఖానా ఉత్పత్తిలోనూ, చేతివృత్తుల్లోనూ, గృహ పరిశ్రమల్లోనూ ఆధునిక పరిశ్రమ తెచ్చిన విప్లవాత్మక మార్పులు



  కాపిటల్   అధ్యాయం -15

యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా


విభాగం-8 

కార్ఖానా ఉత్పత్తిలోనూ, చేతివృత్తుల్లోనూ, గృహ పరిశ్రమల్లోనూ
     ఆధునిక పరిశ్రమ తెచ్చిన విప్లవాత్మక మార్పులు

అప్పటికున్న చేతివృత్తుల్లో, కార్ఖానా ఉత్పత్తిలో, గృహ పరిశ్రమల్లో ఆధునిక పరిశ్రమ పెను మార్పులు తెచ్చింది. ఈ విభాగం ఆమార్పుల గురించే.
A. ఆధునిక పరిశ్రమ చేతివృత్తి మీదా, శ్రమ విభజనమీదా ఆధారపడ్డ సహకారాన్నిదెబ్బతీయడం
చేతి వృత్తుల పైన ఆధారపడ్డ సహకారాన్నీ, చేతి వృత్తి యొక్క శ్రమ విభజనమీద ఆధారపడ్డ  కార్ఖానా ఉత్పత్తినీ యంత్రాలు ఏవిధంగా నిర్మూలించాయో చూశాం.
మొక్కలు కత్తిరించే యంత్రం
 మొదటి రకం యంత్రాలకి మొక్కలు కత్తిరించే యంత్రం (mowing-machine) ఉదాహరణ. పంట కోసే పనివాళ్ళ మధ్య సహకారం ఉంటుంది. ఇప్పుడు ఆ సహకారం స్థానాన్నియంత్రం తీసుకుంటుంది. అంటే కోసే వాళ్ళ మధ్య ఉండే సహకారాన్ని లేకుండా చేస్తుంది.
సూదులు చేసే యంత్రం
అలాగే శ్రమ విభజనమీద ఆధారపడ్డ సహకారాన్నికూడా లేకుండా చేస్తుంది యంత్రం. దీనికి సూదులు చేసే యంత్రం మంచి ఉదాహరణ. ఆడం స్మిత్ ప్రకారం సూదుల ఉత్పత్తిలో 10 మంది తలాఒక పని పంచుకొని సహకారంతో రోజుకి 48,000 సూదులు చేస్తారు. ఇది శ్రమ విభజన మీద ఆధారపడ్డ సహకారం. యంత్రం ఈ సహకారాన్ని నిర్మూలిస్తుంది. ఒక సూదులు చేసే యంత్రం 11 గంటల పనిదినంలో 145,000 సూదులు చేస్తుంది. ఒక స్త్రీ అలాంటి యంత్రాలు నాలుగు నడపగలదు. ఒక బాలిక అయినా ఆ పని చెయ్యగలదు. అంటే రోజుకి 6 లక్షల సూదులు, వారానికి 30 లక్షల సూదులు ఒక్కతే చేస్తుందన్నమాట. పనివాళ్ళు కొంతమంది ఉంటేనే గదా సహకారం ఉండేది. ఒక్కరే ఉంటారు, గనక యంత్రం ఈ సహకారాన్ని నిర్మూలిస్తుంది.
ఆధునిక పరిశ్రమ చిన్న స్థాయి పరిశ్రమల్ని దెబ్బ తీస్తుంది
స్వల్పకాలమే అయినా, అక్కడక్కడ ఒక పరిశ్రమ చిన్నస్తాయిలో యాంత్రిక చోదకశక్తితో నడవ వచ్చు. అలా కోవెంట్రీ సిల్క్ నేతపరిశ్రమలో కుటీర ఫాక్టరీల  ప్రయోగం జరిగింది. ఇంజన్ ఉన్న  భవనం చుట్టూ మగ్గాలున్న కుటీరాలుంటాయి. ఆ మగ్గాలతో ఇంజన్ ని షాఫ్టులతో కలిపారు. ఒక్కో కుటీరంలో రెండునించీ ఆరుదాకా మగ్గాలుంటాయి. వీటికీ, అసలు ఫాక్టరీలకీ మధ్య ఘర్షణ 12 ఏళ్ళకి పైగా పాటు సాగింది. 300 కుటీర ఫాక్టరీలు సర్వనాశనం కావడంతో ఘర్షణ ముగిసింది.
చేతి వృత్తి దశనీ, కార్ఖానా ఉత్పత్తి దశనీ దాటి యంత్ర పరిశ్రమకి పరివర్తన
స్వభావరీత్యా ఒక ప్రక్రియ భారీ స్థాయి ఉత్పత్తికి సంబంధించినది కాకపోవచ్చు. అలాంటప్పుడు, మొదట చేతి వృత్తి దశనూ తర్వాత కార్ఖానా ఉత్పత్తి దశనూ గడుస్తుంది. ఈ దశలు ఫాక్టరీ దశకు చేరేందుకు స్వల్పకాలిక ఉప దశలు. ఒక వస్తువు ఉత్పత్తి ప్రక్రియల వారీగా ఉంటే, పరివర్తన పెద్ద కష్టం కాదు. కాని వస్తువు ఉత్పత్తికి  ఒకదానికొకటి సంబంధం లేని ప్రక్రియలు అవసరమైనప్పుడు, ఈ పరివర్తన క్లిష్టం అవుతుంది. ఉక్కు కలాల ఫాక్టరీలు పెట్టడానికి ఇదే పెద్ద అడ్డంకి. అయినాగాని, 15 ఏళ్ల కిందట, ఆరు వేర్వేరు ప్రక్రియల్ని స్వయంగా నిర్వహించే యంత్రం వచ్చింది.
1820 వ సంవత్సరంలో చేతివృత్తి గ్రోసు 4 పౌన్ల 4 షిల్లింగులకు సప్లై చేసింది. 1830 లో  కార్ఖానా ఉత్పత్తి 8 షిల్లింగులకు ఇచ్చింది. ఇవ్వాళ ఫాక్టరీవ్యవస్థ వ్యాపారులకి గ్రోసు 2 పెన్నీలకీ 6 పెన్నీల కీ మధ్య  అమ్ముతున్నది. 1851లో బిర్మింగ్ హాం లో గిల్లాట్ అనే పెట్టుబడిదారుడు  భారీ స్థాయిలో ఉక్కు కలాల ఫాక్టరీ  పెట్టాడు. అక్కడ ఏడాదికి 180,000,000 కలాలు తయారవుతాయి. 120 టన్నుల ఉక్కు వాడబడుతుంది. ఇప్పుడు దానిదే గుత్తాధిపత్యం. వేల మిలియన్ల (వందల కోట్ల) కలాలు ఉత్పత్తి చేస్తుంది. 1861 జనాభా లెక్కలప్రకారం అందులో పనివాళ్ళు 1428 మంది. వాళ్ళలో 5 ఏళ్ల వయసు దాటిన ఆడవాళ్ళు 1268 మంది. ఆవిధంగా ఆధునిక పరిశ్రమ ఉత్పాదకతని పెంచి, వస్తువుల్ని చౌకబరుస్తుంది. పనివాళ్ళని తగ్గిస్తుంది. చౌక శ్రమని –స్త్రీలనీ, పిల్లల్నీ- నియమిస్తుంది.
B.కార్ఖానా ఉత్పత్తి మీదా, కుటీర  పరిశ్రమల మీదా ఫాక్టరీ వ్యవస్థ ప్రభావం
ఫాక్టరీ వ్యవస్థ అభివృద్ధి అయ్యే కొద్దీ, దాన్ని వెన్నంటి వ్యవసాయంలో తీవ్ర మార్పువస్తుంది. అన్ని పారిశ్రామిక శాఖలకూ విస్తరిస్తుంది. ఉత్పత్తి స్వభావం మారిపోతుంది.
యంత్ర వ్యవస్థ చౌక శ్రమ మీద ఆధారపడుతుంది. అన్ని వయసుల స్త్రీలనీ, పిల్లల్నీ పెట్టుకుంటుంది. అనిపుణ శ్రామికుల్ని నియమిస్తుంది. భారీ స్థాయి లో సాగే ఉత్పత్తి జరిగేది ఇలాగే – యంత్రాలున్నా, లేకున్నా. కుటీర పరిశ్రమల్లోనూ ఉత్పత్తి జరిగేది ఇలాగే – పనివాళ్ళ ఇళ్ళలో అయినా, చిన్నచిన్న వర్క్ షాపుల్లో నైనా.
కుటీర పరిశ్రమలు- పాతవీ, కొత్తవీ-తేడాలు
ఈ ఆధునిక  కుటీర పరిశ్రమ అనబడేదానికీ, పాత కుటీర పరిశ్రమ పేరులో తప్ప మరే  పోలికా లేదు. పాతవి స్వతంత్ర మైన చేతివృత్తులు. రైతుల వ్యవసాయం. . అన్నిటినీ మించి అతని కుటుంబం ఉండడానికి ఇల్లు ఉన్నట్లే. అయితే ఆ పాతతరహా కుటీర పరిశ్రమ ఇప్పుడు అది ఫాక్టరీకి, కార్ఖానాకి, గోడౌన్ కీ  వెలపల ఉండే శాఖగా మారిపోతుంది. పెట్టుబడి ఫాక్టరీలలో, కార్ఖానాల్లో, గోడౌన్ లలో భారీ స్థాయిలో  ఒకేచోట కేంద్రీకృతమైన పనివాళ్ళని ప్రత్యక్ష అదుపాజ్ఞలలో నడుపుతుంది. దానితొ పాటుగా, మరొక శ్రామిక సైన్యాన్నికుటీర పరిశ్రమల్లో పరోక్షంగా నడుపుతుంది. ఈ శ్రామిక సేన దేశ మంతటా పట్టణాల్లో చెల్లాచెదరై ఉంటారు. ఇందుకు లండన్ డెర్రీ లోని మెసర్స్. టిల్లీ షర్ట్ ఫాక్టరీ ఇందుకొక ఉదాహరణ. ఇక్కడ అసలు ఫాక్టరీలో వెయ్యిమంది పనిచేస్తారు, 9 వేల మంది దేశం అంతటా వారివారి సొంత ఇళ్ళల్లో పనిచేస్తుంటారు.

అసలు ఫాక్టరీల్లో కన్నా,ఆధునిక కార్ఖానా ఉత్పత్తిలో  చౌక శ్రమ శక్తి, ఎదిగీ ఎదగని (immature) శ్రమ శక్తి నిర్లజ్జగా వాడబడుతుంది. దోపిడీ చేయబడుతుంది. ఎందుకో చెబుతాడు:
·         ఫాక్టరీ వ్యవస్థకి సాంకేతిక పునాది కండబలం స్థానంలో యంత్రాలు వాడడం, శ్రమ తేలిక అవడం. కార్ఖానా ఉత్పత్తికి సాంకేతిక ఈ పునాది దాదాపు ఉండనే ఉండదు. అంటే యంత్రాల వాడకం దాదాపు ఉండదు, శ్రమ కష్టంగా ఉంటుంది. అదే సమయంలో స్త్రీలూ, మరీ చిన్న పిల్లలూ అనే విచక్షణ లేకుండా వాళ్ళని విషపూరితమైన, హానికరమైన పదార్ధాల ప్రభావాలకు గురిచేస్తున్నారు.
·         కుటీర పరిశ్రమ అనబడే (so-called) దాంట్లో శ్రమ వాడకం మరీ సిగ్గుపడని విధంగా ఉంటుంది. ఎందుకంటే
1. పనివాళ్ళు ఒకేచోట కాకుండా చాలా చోట్ల చెల్లా చెదరై ఉండే కొద్దీ,  వాళ్లకి పెట్టుబడిని  శక్తి తగ్గిపోతుంటుంది.
2. యజమానికీ, పనివాళ్ళకీ మధ్యలో కొల్లగొట్టే పరాన్న జీవులు పరంపర ఉంటుంది
3. అదే శాఖలో ఉన్న ఫాక్టరీ వ్యవస్తతోనో, కార్ఖానా ఉత్పత్తి తోనో కుటీర పరిశ్రమ ఎల్లప్పుడూ పోటీ పడాల్సి ఉంటుంది.
4. పనివాళ్ళ లేమిడి వాళ్ళ పనికి తప్పనిసరి అవసరాలు - స్థలమూ, గాలీ, వెలుతురూ – సరిపోయేటంత లేకుండా చేస్తుంది.
5. పని సక్రమంగా దొరకదు, అంతకంతకూ పధ్ధతి లేకుండా పోతుంది.
6. ఆధునిక పరిశ్రమ వల్లా, వ్యవసాయం వల్లా తొలిగించ బడ్డ వాళ్ళు ‘మిగులు పనివాళ్ళు’ చివరకి పనికోసం వచ్చేది కుటీర పరిశ్రమల్లోకే. కాబట్టి వాటిలో పనివాళ్ళ పోటీ తారాస్థాయిని తాకుతుంటుంది.
ఫాక్టరీ వ్యవస్థలో ప్రారంభం నుంచే  ‘ఉత్పత్తి సాధనాల పొదుపు’  క్రమబద్ధంగా, ఒకపద్ధతి ప్రకారం నిర్వహించబడుతుంది. శ్రమ శక్తిని విచ్చలవిడిగా, నిర్లక్షంగా వాడుకోవడంతో పాటే, శ్రమ చెయ్యడానికి అవసరమైన పరిస్థితులు లేకుండా చేయడంతో పాటే, ఇది జరుగుతుంది. ఇప్పుడు ఒక శాఖలో  సామాజిక ఉత్పాదక శక్తి ఎంత తక్కువగా ఉంటే, ప్రక్రియల సమ్మేళనానికి సాంకేతిక పునాది ఎంత తక్కువగా ఉంటే, ఈ పొదుపు తన శత్రు పూరితమైన, హంతక స్వభావాన్నిఅంత ఎక్కువగా ఆ శాఖలో చూపిస్తుంది.
C.ఆధునిక కార్ఖానా ఉత్పత్తి
పైన చెప్పిన సూత్రాల్ని ఉదాహరణలతో వివరిస్తాడు మార్క్స్. పనిదినం అధ్యాయంలో చాలా ఉదాహరణలున్నాయి. ఇవి పాఠకులకు ఇప్పటికే తెలుసు. బిర్మింగ్ హామ్ లోనూ, ఆ చుట్టుపక్కల లోహ సామాన్ల (hardware) కార్ఖానాలున్నాయి. వాటిలో 30 వేలమంది బాలురూ, యువకులూ, 10 వేలమంది స్త్రీలూ భారమైన పనులు చేస్తున్నారు. ఇత్తడి ఫౌండరీలలో, గుండీ ఫాక్టరీల్లో, ఎనామిల్ పూతపూసే, తుప్పుపట్టకుండా జింక్ పూత పూసే, వార్నిష్ పూసే కార్ఖానాల్లో పనిచేస్తారు. తలకు మించిన పని చేయిస్తున్నందువల్ల పార్తాపత్రికలూ, పుస్తకాలూ అచ్చువేసే ఇళ్ళకి  ‘కబేళాలు’ అనే పేరొచ్చింది. సిల్క్ నేసే మగ్గాలు చేత్తో తిప్పేచోట పిల్లల చేత చచ్చేంత పని చేయిస్తారు.
ఇక గుడ్డ పేలికల్ని వేరుచేసే పని అసహ్యమైనది, అవమానపరిచేది. హీనమైన కూలి వచ్చేది. ఈ పనిలో ఇంగ్లండ్ దే అగ్రతాంబూలం. ఈ వాణిజ్యంలో  ప్రపంచ కేంద్రం. అనేక దేశాలనుంచీ పేలికలు వస్తాయి. వీటిని రకాల వారీగా వేరుచేస్తారు. వాటిని ఎరువుల్లో వాడతారు. వాటితో బొంతలు కుడతారు. కాగితం తయారీలో వాడతారు.
ఈ పనివారికి మసూచి వ్యాధి సోకుతున్నది. వీరి ద్వారా ఇతరులకు వ్యాపిస్తున్నది. మసూచి ఒక్కటే కాదు ఇతర అంటువ్యాధులుకూడా. మితం లేని, కష్టమైన, అనుచితమైన పనికి ఉదాహరణ గనులలో పని. బంగాళా పెంకుల పని, ఇటుకబట్టీల పని.
 ఇటుకల్నీ,పెంకుల్నీ ఆరబెట్టే పని
పెంకుల్నీ ఇటుకల్ని ఆరబెట్టే పని ఉదయం 4 గంటల నుంచీ రాత్రి 9 గంటలదాకా సాగుతుంది. నాలుగేళ్ల పిల్లలుకూడా ఈపనిలో ఉంటారు. పని కష్టమైనది. ఎండ నీరసం కల్గిస్తుంది. మోస్లే లో ఒక 24 ఏళ్ల యువతి రోజుకి 2000 పెంకులు చేస్తుంది.
ఆమెకు ఇద్దరు పిల్లలు మట్టి మోసుకొచ్చి ఇస్తారు. పెంకులను పేరుస్తారు. వాళ్ళు 10 టన్నుల మట్టి మోస్తారు.అదీ 30 అడుగుల లోతున్న బంకమట్టి గుంతల నించీ, జారే దారిగుండా పైకి తెస్తారు. అక్కడ నుంచీ 210 అడుగులు మోస్తారు. ఈ పనిచేసే పిల్లలు బూతులు మాట్లాడతారు.పోకిరీలవుతారు. అరాచకంగా తయారవుతారు. మగవాళ్ళతో కలిసి సారాకోట్లకు పోతారు. నైతికంగా పతనం చెందుతారు. విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ఇందుకు కారణం ఈవ్యవస్థ  చిన్నతనం నించీ అలాంటి పనిచేయించడమే.

కార్మికుల ఆరోగ్యం మీద ప్రభావం
కార్మికుల ఆరోగ్యం మీద పని గదుల దుష్ప్రభావం గురించి వేరే చెప్పక్కర్లేదు. భారమైన పనివల్లా, పారిశుధ్య లేమి వల్లా కార్మికుల జీవిటం  చిత్రహింసగా ఉంది. ఆయుష్షు తగ్గి ముందుగానే మరణిస్తున్నారు. రుజువుగా డాక్టర్ సైమన్ ఇచ్చిన పట్టికను చూడమంటాడు మార్క్స్.

D. ఆధునిక గృహ పరిశ్రమ
ఆధునిక యంత్ర పరిశ్రమ నేపధ్యంలో ఆధునిక గృహ పరిశ్రమలో దారుణ పరిస్థితుల గురించి తెలుసుకోవాలంటే, యంత్రాలతో కాకుండా, సుత్తితో చేసే  చీలల ఉత్పత్తిని చూడవలసిందే. ఇది ఇంగ్లండ్ లో  కొన్ని మారుమూల గ్రామాల్లో సాగుతున్నది. అయితే లేస్ అల్లకంనుంచీ, ధాన్యం చొప్ప/దంటు అల్లకం (straw-plaiting) పరిశ్రమల నుంచి ఉదాహరణలు చూస్తే ఇప్పటికి సరి పోతుంది. ఈ పనులు ఇంకా యంత్రాలతో జరగడం లేదు. ఫాక్టరీల్లోనూ, కార్ఖానాల్లోనూ తయారవుతున్న వాటితో పోటీ పడడం లేదు.
ఇంగ్లండ్ లేసు ఉత్పత్తిలో ఉన్న 150,000మందిలో 10,000 మంది మాత్రమె 1861ఫాక్టరీ చట్టం కిందికి వస్తారు. మిగిలిన 140,000 మంది దాదాపుగా స్త్రీలే. ట్రూమన్ తయారుచేసిన పట్టికను బట్టి క్షయ రోగులు:
1852 లో ప్రతి 45 మందిలో ఒకరు ఉండగా, అక్కడ నుండీ వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. 1856 కి ప్రతి 45 మందిలో ఒకరు, 1861 లో ప్రతి 8 మందిలో ఒకరు ఉన్నారు.
లేస్ ఉత్పత్తిలో యంత్రాల పనిని 1861 ఫాక్టరీ చట్టం కొంత పరిమితం చేసింది. కార్ఖానాల్లోనూ, గోడౌన్ల లోనూ చేసే వాళ్ళు కాకుండా, ఇళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి సంబంధించి శాఖల్లో రెండు విభాగా లున్నాయి:
1.      తుది మెరుగులు దిద్దడం (finishing). 2. సరి చెయ్యడం (mending)
మెరుగులు దిద్దే పనిలో కొన్ని ఉప విభాగాలు ఉంటాయి. ఈ పనులు యజమాను రాళ్ళ ఇళ్ళల్లో గానీ, పనివాళ్ళ ఇళ్ళలో గానీ జరుగుతాయి. యజమానురాళ్ళు కూడా పేదవాళ్ళే. వాళ్ళు కార్ఖానాదారుల నించో , గోడౌన్ ల నుంచో ఆర్డర్లు తీసుకుంటారు. గదుల సైజుని బట్టి వీలైనంత మంది స్త్రీలనూ పిల్లలనూ నియమించుకుంటారు. పిల్లల సగటు వయస్సు ఆరేళ్ళు. అయిదేళ్ళ లోపు వాళ్ళనుకూడా ఉంటారు.  మామూలుగా ఉదయం 8 నుంచీ రాత్రి 8 గంటల దాకా పని. అయితే పని ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం 6 నుంచీ నుంచీ రాత్రి 10, 11, 12  గంటల దాకా చెయ్యాలి. తినేదానికి ఒక టైం అంటూ ఉండదు. అదీ మలినమైన గదుల్లో తినాలి.
గాస్ లైట్లు ఆక్సిజన్ ని లాక్కుంటాయి.
నాటింగ్ హామ్ లో చిన్న  చిన్న గదుల్లో ఒకరినొకరు రాసుకుంటూ పనిచేస్తుంటారు. వేళ్ళకు విశ్రాంతి ఇవ్వడంగానీ, వేగం తగ్గించడంగానీ  ఎప్పుడో ఒకసారి అరుదుగా  ఉండదు. ఏదైనా ప్రశ్న వచ్చినా కళ్ళెత్తి చూడరు. క్షణమైనా వృధా అవుతుందనే భయం. పనిమీదే ధ్యాసంతా. ఏకాగ్రతతో ఉంటారు.
పని గంటలు పొడిగించే కొద్దీ, వాళ్లకి చురుకు కలిగేదానికి యజమానురాలు బెత్తం ఆడిస్తుంది. పనయ్యేసరికి విసుగు, అలుపు పుట్టి నీరసంగా ఉంటారు. వాళ్ళు చేసే పని బానిసత్వం వంటిది. ఇక ఇళ్ళల్లో స్త్రీలూ, వాళ్ళ పిల్లలూ చేసే పని పరిస్థితులు ఇంతకన్నాఅధ్వాన్నంగా ఉంటాయి.
హెర్ట్ ఫోర్డ్ షైర్ లో, ఎస్సెక్స్ లో చొప్ప అల్లకం, చొప్ప టోపీల తయారీ ఉంది. 1861లో ఆ పనిలో 40,043 మంది ఉన్నారు. 3,815 మంది పురుషులు. మిగిలిన వాళ్ళు స్త్రీలు. 14,913 మంది 20 ఏళ్ల లోపువాళ్ళు. వాళ్ళలో 7,000 పిల్లలు. నాలుగేల్ల్కే పని నేరుస్తారు. చదువంటూ ఉండదు. రాత్రి 10, 11,  12 అయ్యేదాకా పని. దంటు పోచలు తడిచేయ్యడానికి నోట్లో పెట్టుకుంటున్నందువల్ల నోళ్ళూ, వేళ్ళూ గాయపడతాయి. ఒక్కొక్కళ్ళ పనిచోటు 22 ఘనపుటడుగుల కన్నా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో 12, 14 ఏళ్ళు వచ్చేదాకా బతుకు గడుపు తారు. వారి తండ్రులు ఆర్దాకలితో దీనస్థితిలో ఉంటారు.పిల్లలనించి వీలైనంత పొందాలనుకుంటారు. అంతకు మించి ఏమీలేదు.
ఆ పిల్లలు పెరిగి పెద్దవగానే తల్లి దండ్రుల్ని వదిలి వెళ్ళిపోతారు. తల్లిదండ్రుల్ని ఏమాత్రం లెక్క చెయ్యరు, పట్టించుకోరు. ఇది సహజమయినదే. ఆవిధంగా పెరిగిన వాళ్లకు నైతికత అడుగంటి ఉంటుంది. అనేకమంది స్త్రీలకి అక్రమసంతానం ఉంది. చిన్న వయసు వాళ్లకు కూడా.
చెప్పిన పరిశ్రమల్లో కూలి అతి తక్కువ. పని ఎక్కువ. విసిగించే ఒకే రకమైన పని. రోగాలు తెచ్చే అపరిశుభ్రత. ఆధునిక గృహ పరిశ్రమల్లోనూ పనివాళ్ళ స్థితిగతులు  దారుణంగా ఉంటాయి.
E. ఆధునిక కార్ఖానా ఉత్పత్తీ, గృహపరిశ్రమా ఆధునిక యంత్ర పరిశ్రమగా మారడం.
     ఫాక్టరీ చట్టాలు  వర్తింపచెయ్యడం  ద్వారా ఈ విప్లవాన్నివేగవంతం చెయ్యడం.
స్త్రీల, పిల్లల శ్రమని దుర్వినియోగం చేయడం వల్లా, పనిచెయ్యడానికి తగిన పరిస్థితుల్ని లేకుండా చెయ్యడం వల్లా, అమిత శ్రమ, రాత్రిపని వల్లా, శ్రమ శక్తిని చౌకబరచడానికి అధిగమించరాని అవరోధాలు  ఏర్పడతాయి. ఈపద్ధతులమీద ఆధారపడ్డప్పుడు, సరుకులు చౌక బరచడానికీ, పెట్టుబడి దారీ దోపిడీకీ అలాగే ఆటంకాలు ఏర్పడతాయి. ఇందుకు చాలా సంవత్సరాల కాలం పడుతుంది. అయితే అటువంటి  పరిస్థితులు  ఏర్పడగానే, ఆధునిక కార్ఖానాలూ, గృహపరిశ్రమలూ ఆధునిక యంత్ర పరిశ్రమలుగా పరివర్తన చెందే సమయం ఆసన్నమైనట్లు.
ఇందుకు ఉదాహరణ దుస్తుల ఉత్పత్తి. చొప్ప టోపీలు చేసేవారూ, మామూలు టోపీలు చేసే వాళ్ళూ, టైలర్లూ, గ్లవ్స్ నీ, షర్టులనీ, నెక్ టై లనీ తయారు చేసే వాళ్ళూ, బూట్లు కుట్టేవాళ్ళూ ఈ పరిసరం కిందికొస్తారు. 1860 లో ఇంగ్లండ్, వేల్స్ లలో ఈపరిశ్రమలో ఉన్న స్త్రీలు 586,299 మంది. వారిలో 115,242 మంది 20 ఏళ్ల లోపు వాళ్ళు. 1861 లో 1,024,277 మంది ఉన్నారు. వ్యవసాయంలోనూ, పాసుపోషణలోనూ ఉన్నంతమంది ఉన్నారన్నమాట. యంత్రాలు తయారుచేసే అపార సరుకుల రాశి ఏమవుతుందో, అలాగే అవి విడుదలచేసే పనివాళ్ళ గుంపు ఏమవుతుందో మనకి తెయడం మొదలవుతుంది.
కట్టుకునే బట్టల్లో కొంతభాగం కార్ఖానాల్లో ఉత్పత్తవుతుంది. అలాగే  సన్నకారు చేతివృత్తుల్లోనూ కొంత తయారవుతుంది. వీళ్ళు తయారుచేసేది మునుపటిలాగా విడివిడి వినియోగదారులకోసం కాదు, కార్ఖానాలకోసం, గోడౌన్ల కోసం.ఈ పని పెద్ద ఎత్తునే జరుగుతుంది. గృహ పరిశ్రమల్లో కూడా భారీగానే వీటి ఉత్పత్తి సాగుతుంది.
వీటికి ముడిపదార్ధాల్నియంత్ర పరిశ్రమ అందిస్తుంది. చౌక పనివాళ్ళు యంత్రాలూ, అభివృద్ధయిన వ్యవసాయమూ తొలిగించిన కార్మికుల నుంచి దొరుకుతారు. పెరిగే డిమాండ్ ని తీర్చడానికి రెడీగా ఉండే పనిలేని వాళ్ళు  పెట్టుబడికి అవసరం. ఈ అవసరమే ఈ తరహా ఉత్పత్తులకు ముఖ్య  కారణం. అదనపు విలువ ఎక్కువగా రావడానికీ, సరుకులు అంతకంతకూ చౌక పడడానికీ కారణాలు: వేతనాలు అతి కీతాగా ఉండడమూ, మనిషి శరీరం భరించగలిగినంత మేరకు పనిదినాన్ని పొడిగిస్తూ పోవడమూ.
శ్రమ చౌకబడుతూ ఉండడమే నిరంతరం మార్కెట్లు, ప్రత్యేకించి ఇంగ్లిష్ వలస మార్కెట్లు విస్తరిస్తుండడానికి కారణం. అయితే చివరకు కీలక సమయం (critical point) వచ్చింది. విస్తరిస్తున్న మార్కెట్లకూ, పెట్టుబడిదారులమధ్య సాగుతున్న పోటీకీ పాశవికంగా పనిచేయించుకునే పాత విధానపు ప్రాతిపదిక  సరిపోలేదు. యంత్రాలు పెట్టాల్సిన సమయం వచ్చింది.
ఈ ఉత్పత్తి రంగంలోని – దుస్తుల తయారీ, దర్జీపనీ, బూట్ల తయారీ  కుట్టుపనీ, టోపీల తయారీ వగయిరా –ఒకే స్థాయిలో దాడి చేసిన యంత్రం కుట్టు మిషన్. ఇది నిర్ణయాత్మకమైన యంత్రం, విప్లవకరమైన యంత్రం. 
శ్రమ జీవులమీద కుట్టు మిషన్ ప్రభావం

మరీ చిన్న పిల్లల్ని వదిలేస్తారు.
గృహపరిశ్రమలోని పనివాళ్ళలో అనేకమంది పేదల్లో కెల్లా పేదలు. వాళ్ళ వేతానాలతో  పోలిస్తే, యంత్రాలతో పనిచేసే వాళ్ళ వేతనాలు ఎక్కువ. యంత్రంతో పోటీ పడే మెరుగైన చేతివృత్తి పంవాళ్ళ వేతనం తగ్గుతుంది. యంత్ర కార్మికులంతా బాలికలూ, యువతులూ. వాళ్ళు, యాంత్రిక శక్తి సహాయంతో, బరువుపనులకు పురుషులకుండే గుత్తాధిపత్యాన్ని నిర్మూలిస్తారు. మరీ ముసలి మహిళల్నీ, మరీ చిన్న పిల్లల్నీ బయటకు పంపుతారు. తిరుగులేని  పోటీ శరీరశ్రమ చేసే వాళ్ళలో బలహీనుల్ని తోక్కివేస్తుంది. ఇంగ్లండ్ లో పస్తులతో చనిపోయిన వాళ్ళ సంఖ్య కుట్టు మిషన్ విస్తరణకి అనుగుణంగా గత పదేళ్ళలో పెరుగుతూ వచ్చింది. ఈ కొత్త మహిళా కార్మికులు పాత వ్యవస్థలో చేసిన్ని గంటలు చెయ్యరు గాని, ఎక్కువ గంటలే పనిచేస్తారు. కాబట్టి వాళ్ళ పని ఆరోగ్యకరమైనది కాదు. కుట్టుమిషన్లు ఎక్కువమంది పనివాళ్ళున్న ఇరుకు గదుల్లో ఉండే కుట్టు మిషన్  అనారోగ్యాన్ని అదికం చేస్తుంది.
 ఎత్తు తక్కువ గదులు. 30. 40 మంది మిషన్లతో కుడుతుంటారు. భరించరాని సెగ ఉంటుంది. ఈ సెగకి  ఇస్త్రీ పెట్టెలని వేడిచేయ్యడం కోసం గాస్ స్టవ్ లు కొంత కారణం. ఉదయం 8 నించీ సాయంత్రం 6 గంటలవరకూ, తగుమాత్రం పని జరిగే చోట కూడా రోజుకి ముగ్గురో,నలుగురో స్పృహ కోల్పోతుంటారు –అని ఒక నివేదికలో లార్డ్ రాశాడు.
సన్నకారు ఉత్పత్తిదారులు
యంత్రాలు ఒక వ్యవస్థగా ఏర్పడేదాకా,  యంత్రాలని కొద్ది సంఖ్యలో చేతివృత్తిదారులూ, గృహపరిశ్రమలు నడిపేవారూ కూడా యంత్రాలని కొద్ది సంఖ్యలో పెట్టి ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. పెట్టుబడి నిరంతరం పెరుగుతున్నందువల్ల, మార్కెట్లు సరుకులతో నిండిపోతాయి. ఇక తమ మిషన్లు అమ్ముకోవాలని చిన్న ఉత్పత్తిదారులకు అది హెచ్చరిక. అసలు కుట్టు మిషన్ల ఉత్పత్తే అమితంగా ఉన్నందువల్ల, వాటి ఉత్పత్తిదారులు అమ్ముకోలేక, అద్దెల కిస్తుంటారు. పోటీలో సన్నకారు ఉత్పత్తిదారులు అణిగి పోతారు.
యంత్రాల నిర్మాణంలో ఎప్పటికప్పుడు మార్పులొస్తుంటాయి. అంతకంతకూ చౌకపడుతుంటాయి. పాత యంత్రాల విలువ రోజురోజుకీ తరిగిపోతూ ఉంటుంది. కనుక వాటిని పెద్ద పెట్టుదిదారులకు కారుచౌకగా అమ్ముకుంటారు. వాళ్ళు వాటిని లాభదాయకంగా వినియోగించుకో గలుగుతారు.
చోదకశక్తిగా మనిషి స్థానంలో ఆవిరి యంత్రం రావడంతో చివరిదెబ్బ తగిలింది.
ఆవిరి శక్తికి సాంకేతిక ఇబ్బందులు
ఆవిరి శక్తి వాడకానికి మొదట్లో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి:
1.      యంత్రాలకు నిలకడ ఉందేది కాదు.
2.      వేగాన్ని నియంత్రించడం కష్టం అయ్యేది.
3.      తేలిక యంత్రాలు త్వరగా అరిగి పోయేవి.
ఇలాంటివే మరికొన్ని చిక్కులు ఎదురయ్యేవి. అయితే కొద్ది కాలం లోనే వీటన్నిటినీ సవరిస్తారు, సవరించారు.
ఒకపక్క, పెద్దపెద్ద కార్ఖానాల్లో పలు యంత్రాల కేంద్రీకరణ ఆవిరిశక్తి వాడదానికి దారితీసింది. మరొకపక్క, మనిషి కండరాలతో పోటీ కార్మికులూ, యంత్రాలూ భారీ ఫాక్టరీల్లో వేగంగా కేంద్రీకృతం అయ్యేట్లు చేస్తుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ లో జరుగుతున్నదిదే. దుస్తుల ఉత్పత్తిలోనే కాదు, ఇతర ఉత్పత్తుల్లోనూ కార్ఖానా ఉత్పత్తీ, చేతివృత్తి ఉత్పత్తీ, గృహపరిస్రమ ఉత్పత్తీ ఫాక్టరీ వ్యవస్థలోకి మారిపోతున్నాయి.
స్త్రీలూ,యువతీ యువకులూ, పిల్లలూ పనిచేస్తున్న అన్ని పరిశ్రమలకూ విస్తరిస్తున్న ఫాక్టరీ చట్టాలు ఈ పారిశ్రామిక విప్లవానికి సహకరిస్తున్నాయి. పనిమొదలు,ముగింపు, విరామం – వీటి నియంత్రణ, ఒక వయసు లోపలి పిల్లల నియామకం నిషేధం, కారణంగా మరిన్ని యంత్రాలు పెట్టాల్సోచ్చింది. కండబలం బదులు ఆవిరియంత్రాల్ని వినియోగించవలసి వచ్చింది. మరొక పక్క, పనిగంటలు తగ్గినందువల్ల, ఏర్పడేనష్టాన్ని పూడ్చుకోడానికి భానాలూ, బట్టీలూ వంటి ఉమ్మడిగా వాడుకునే ఉత్పత్తిసాధనాల విస్తరణ జరుగుతుంది. అంటే ఉత్పత్తిసాధనాల కేంద్రీకరణా, దానికి తగ్గట్లుగా, కార్మికుల సమీకరణా జరుగుతాయి..
ఫాక్టరీ చట్టాలకు యజమానుల వ్యతిరేకత
యజమానులు ఫాక్టరీ చట్టాల్ని వ్యతిరేకిస్తూ ఒక అభ్యంతరం చెబుతారు. ఏమంటే ఇంతకూ ముందు స్థాయిలో ఉత్పత్తి చెయ్యాలంటే పెట్టుబడి మరింత కావాలనేదే వాళ్ళ వాదం. అయితే పనిదినానికీ, పిల్లల నియామకానికీ పెట్టే పరిమితులు పాత తరహా ఉత్పత్తి సంస్థల్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. వాటి పోటీ చేసే సత్తాకు ఏకైక పునాది చౌక శ్రమ శక్తిని పరిమితి లేకుండా దోచుకోవడమే.
అయితే పనిగంటలు నిర్ణయమై ఉన్నప్పుడు, ఫాక్టరీ వ్యవస్థ మనుగడకి కొన్ని పరిస్థితులు అవసరం. వాటిలో తప్పనిసరి అయినది: ఫలితంలో నిశ్చయత్వం. అంటే నిర్ణీత సమయంలో నిర్ణీతపరిమాణంలో సరుకులు ఉత్పత్తవడం, లేదా ప్రయోజనకర ఫలితం రావడం.
చట్టాలు పనిదినంలో విరామాలు విధిస్తాయి. ఆ సమయాల్లో తయారీ ప్రక్రియలో ఉన్న వస్తువుకి హాని కలగకూడదు ఫలితంలో నిశ్చయత్వం అంటే ఇదే.
ఫలితంలో నిశ్చయత్వాన్ని సాధించడం రసాయన ,భౌతిక ప్రక్రియల పాత్ర ఉండే పరిశ్రమల్లోకంటే – మట్టిపాత్రల పరిశ్రమ, తెల్లబరిచే పరిశ్రమ,అద్దకం పరిశ్రమ, రొట్టెలు చేసే పరిశ్రమ, అత్యధిక లోహ పరిశ్రమల  కంటే – యంత్ర పరిశ్రమలలో తేలిక. పనిగంటలకు పరిమితి లేని చోట, రాత్రిపని ఉన్నచోట ఈ ఆటంకాన్ని శాశ్వతమైన అవరోధంగా అనుకోవడం ఉంది. ఫాక్టరీ చట్టం అటువంటి శాశ్వత అవరోధాల్ని కచ్చితంగా తొలిగిస్తుంది.
అసాధ్యాల గురించి మట్టిపాత్రల కార్ఖానా దారులు పెట్టినంత గగ్గోలు మరెవ్వరూ పెట్టలేదు. అయినా 1864 లో ఈ పరిశ్రమ ఫాక్టరీ చట్టం కిందికొచ్చింది. 16 నెలల్లో అసాధ్యాలన్నీ అంతర్దానమయ్యాయి. ఈ చట్టం కారణంగా మెరుగైన పధ్ధతి వచ్చింది. ఆరబెట్ట డా నికి ప్రత్యామ్నాయంగా ఒత్తిడి పధ్ధతి ఏర్పడింది. ఆరబెట్టడానికి కొత్తగా ఇనుప కుంపట్లు నిర్మించబడ్డాయి. ఈ రెండు అంశాలూ ఈ పరిశ్రమలో ఎంతో ప్రాముఖ్యత కలవి. ఇవి తెచ్చినంత పురోగతి పోటీ పడగవి  గత శతాబ్దంలోనే లేవు. ఇవి ఇంధనాన్ని ఆదా చేశాయి కూడా. పాత్రలు  వేగంగా ఆరిపోయేట్లు చేశాయి.

మట్టిపాత్రల ఉత్పత్తి ధరలు పెరుగుతాయని చెప్పిన జోస్యాలు నిజం కాలేదు. అవి పెరగలేదు కాని ఉత్పత్తి బాగా పెరిగింది. 1865 సంవత్సరం మొత్తంలో మునుపటి మూడేళ్ళ సగటు ఎగుమతి విలువని 138,628 పౌన్లు మించిపోయింది. అగ్గిపుల్లల ఉత్పత్తిలో పిల్లలు అన్నం తినేటప్పుడు కూడా పుల్లల్ని కరిగిన భాస్వరంలో ముంచుతూ ఉండాల్సిందే, ముఖాలకి ఆవిర్లు కొడుతున్నా చెయ్యాల్సిందే- ఇది అనివార్యమైన అవసరం  అనుకునేవాళ్లు. 1864 చట్టం ప్రకారం తినేటప్పుడు పని చేయించకూడదు. కాబట్టి సమయాన్ని పొదుపు చెయ్యాల్సి వచ్చింది. ఆ అవసరం వల్ల పుల్లల్ని భాస్వర ద్రవంలో ముంచే యంత్రం తయారయింది. ఇప్పుడిక పిల్లలకు ఆవిర్లు తగలనే తగలవు.
రకరకాల లేసుల్ని  ఆరబెట్టేందుకు రకరకాల సమయాలు పడతాయనీ, అందువల్ల అన్నానికి ఒకే సమయం ఇవ్వడం వీలవదనీ యజమానులు వాదించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సాధ్యమేనని కమిషన్ సాక్ష్యాధారాలతో  తేల్చింది. అమలుకు 18 నెలల వ్యవధి ఇచ్చింది. చట్టం అయ్యీ కాగానే, యజమానులు ఫాక్టరీ చట్టాలవల్ల తమకు ఇబ్బందులేవీ కలగలేదన్నారు. అదే కాలంలో ఇంకా ఎక్కువ కూడా ఉత్పత్తి చేస్తున్నాం అనికూడా చెప్పారు. వ్యాపారానికి ఆటంకాలని వ్యాపారులు చెప్పేవన్నీ మోసాలని ఫాక్టరీ ఇన్ స్పెక్టర్లు నిర్ధారించారు.

ఆవిధంగా కార్ఖానా ఉత్పత్తి వ్యవస్థ ఫాక్టరీ వ్యవస్థలోకి మారడానికి అవసరమైన భౌతిక అంశాల్ని ఫాక్టరీ చట్టాలు పక్వానికి  తెస్తుంటాయి. అయినప్పటికీ, అదే సమయంలో వాటి మూలంగా  ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అనివార్యం అవుతుంది.
అంత పెట్టుబడి పెట్టలేని సన్నకారు యజమానులు క్షీణించడమూ, పెట్టుబడి సాంద్రీకరణా  (concentration) వేగవంతం అవుతాయి.
వచ్చేపోస్ట్: ఫాక్టరీ చట్టాల్లో క్లాజులూ- ఇంగ్లండ్ లో చట్టాల విస్తరణా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి