1, జులై 2018, ఆదివారం

నూలు బట్టల వాణిజ్యంలో సంక్షోభాలు


          కాపిటల్   అధ్యాయం -15

యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా

విభాగం-7 ఫాక్టరీ వ్యవస్థ చేత పనివాళ్ళ గెంటివేతా - ఆకర్షణా
                   నూలు బట్టల వాణిజ్యంలో సంక్షోభాలు
         
శ్రామిక బానిసల సంఖ్య పెరగడం
యంత్రాలు చేతివృత్తులతోనూ,  కార్ఖానాఉత్పత్తి తోనూ పోటీ పడతాయి. ఆ  పోటీ, వాటిలో పనిచేసే వాళ్ళ మీద దుష్ఫలితాన్ని కలిగిస్తుంది అని ఏస్థాయి రాజకీయ ఆర్ధిక వేత్త  అయినా ఒప్పుకుంటాడు. ఫాక్టరీ పనివాడి బానిసత్వం గురించి బాధ పడతాడు. యంత్రాలు  ప్రవేసించి, అభివృద్ధి చెందిన కాలంలో పోయిన పనులు తిరిగి రావు.  దీర్ఘకాలంలో యంత్రాలు  శ్రామిక బానిసల సంఖ్యని  తగ్గించే బదులు పెంచాయి. ఫాక్టరీ వ్యవస్థ మొదట్లో వీధుల్లోకి నెట్టిన వాళ్ళ కంటే, ఇప్పుడు మరింత మంది పనివాళ్ళని ఇబ్బంది పెడుతున్నది.
ఫాక్టరీ వ్యవస్థలో ఉత్పత్తిసాధనాల పెరుగుదలా, కార్మికుల తగ్గుదలా
ఫాక్టరీ వ్యవస్థ అసాధారణంగా విస్తరించిన కొన్ని సందర్భాల్లో కార్మికుల సంఖ్య సాపేక్షంగానే కాక,  నిరపేక్షంగా కూడా తగ్గేది నిజమే.

570 ఇంగ్లిష్ సిల్క్ ఫాక్టరీలకు సంబంధించి 1860 లోనూ, 1865 లోనూ వివరాలు:
సంవత్సరం
మర మగ్గాల సంఖ్య
కదుర్ల సంఖ్య
ఆవిరి శక్తి -హార్స్ పవర్లలో
కార్మికుల సంఖ్య
1860
85,622
6,819,146
27,439,+1,390 (నీరు)
94,119
865
95,163
7,025,031
28,925,+1,445 (నీరు)
88,913

దీన్ని బట్టి 1860 - 1865 కాలంలో 9541 మగ్గాలూ 205,885 కదుర్లూ పెరిగాయి. కాని పనివాళ్ళు 2506 మంది తగ్గారు. అంటే మగ్గాలు 11 శాతమూ, కదుర్లు 3 శాతమూ పెరగ్గా, శ్రామికులు శాతం తగ్గారు.
1852 1862 కాలంలో ఉన్ని పరిశ్రమ గణనీయంగా విస్తరించింది. కాని పనివాళ్ళు ఏమాత్రం పెరగలేదు. అంత మందే ఉన్నారు. ఇది కొత్త యంత్రాలు ఏవిధంగా వెనకటి కాలాల్లో ఉన్న శ్రమని తొలిగించాయో తెలుపుతుంది.
ఉత్పత్తిసాధనాల పెరుగుదలా, కార్మికుల పెరుగుదలా
కొన్ని సందర్భాల్లో పనివాళ్ళు పెరిగినట్లు పైకి అగపడుతుంది; అది అప్పటికే ఉన్న ఫాక్టరీల విస్తరణ వల్లకాదు, అనుబంధ  పరిశ్రమల్ని క్రమంగా స్వాధీనం చేసుకున్నందు వల్ల.

ఉదాహరణ. 1838 1856 కాలంలో నూలు బట్టల పరిశ్రమలో మరమగ్గాలు పెరిగాయి. పనివాళ్ళూ పెరిగారు. ఇందుకు కారణం కేవలం ఈ శాఖ విస్తరణే.

ఉన్న ఫాక్టరీల్లో చాలామందిని తొలిగించినా, అదే శాఖలో మరిన్ని కొత్త ఫాక్టరీలు పెడితే, వాళ్ళందరినీ తిరిగి నియమించవచ్చు. కొత్తవారినీ కూడా పెట్టుకోవచ్చు. ఉదాహరణకి అప్పటికి 10 ఫాక్టరీలుండి, ఇక్కక్కదాంట్లో 50 మంది చొప్పున పనివాల్లున్నారనుకుందాం. యన్రాలు పెట్టినందువల్ల ఒక్కొక్క ఫాక్టరీకి 40 మంది సరిపోయారనీ 10 మందిని తొలిగించారానీ అనుకుందాం.మొత్తం 100 మంది తొలిగించాబడ్డారు. అయితే అదే శాఖలో విస్తరణ వల్ల కొత్తగా 5 ఫాక్టరీలు వస్తే, వాటికి 200 మంది పనివాళ్ళు కావాలి. అప్పుడు తొలిగించబడ్డ 100 మందినీ నియమించడమే కాక, కొత్తవాళ్ళని మరొక 100 మందిని పెట్టుకోవాల్సి వస్తుంది.
ఉదాహరణకి, ఇలా అనుకుందాం:
పాత విధానంలో పెట్టిన పెట్టుబడి – 500 పౌన్లు
అందులో స్థిర పెట్టుబడి – 200 పౌన్లు
అస్థిర పెట్టుబడి -300 పౌన్లు
ఒక్కక పనివానికి 1 పౌను చొప్పున 300 మంది పనిచేస్తుంటారు. ఇదంతా వారానికి.
ఇప్పుడు యంత్రాలతో ఉత్పత్తి వచ్చిందనుకుందాం.
మొత్తం పెట్టుబడి 500 పౌన్లే. ఇది మారక పోయినా, అంగ నిర్మాణం మారుతుంది. స్థిర పెరిగి, అస్థిర తగ్గుతుంది.
స్థిర పెట్టుబడి – 400 పౌన్లు
అస్థిర పెట్టుబడి -100 పౌన్లు
ఒక్కక పనివానికి 1 పౌను చొప్పున 100 మంది పనిచేస్తుంటారు.
200 మందికి పని పోతుంది..
ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారం విస్తరించి, మొత్తం పెట్టుబడి పెరిగిందనుకుందాం:
మొత్తం పెట్టుబడి – 1500 పౌన్లు. అంగ నిర్మాణం అదే పాళ్ళలో ఉంటే, 
స్థిర పెట్టుబడి – 1200 పౌన్లు
అస్థిర పెట్టుబడి -300 పౌన్లు అవుతుంది.
ఒక్కక పనివానికి 1 పౌను చొప్పున 300 మందకి పనివుంటుంది. యంత్రాలు పెట్టకముందున్నంత మందికి.
ఆ పెట్టుబడి 2000 పౌన్లకు పెరిగితే, 400 మందికి పని వుంటుంది. అయితే పనివాళ్ళ సంఖ్య 100 పెరిగింది. సాపేక్షంగా పెరిగింది – అంటే పెట్టిన పెట్టుబడికి తగినట్లుగా పెరిగింది.
అయితే పాత పద్ధతిలో అయితే 1200 మంది ఉండేవారు. కొత్త పద్ధతిలో 400 మందే ఉన్నారు. దానిప్రకారం 800 మంది తగ్గారు. అందువల్ల పనివాళ్ళ సాపేక్ష తగ్గుదల, వాస్తవ పెరుగుదలకి పొసగుతుంది/ అనుగుణంగానే  ఉంది.
పైన మనం మొత్తం పెట్టుబడి పెరుగుతున్నా, ఉత్పత్తి పరిస్థితులు అలాగే ఉన్నందువల్ల, పెట్టుబడి అంగ నిర్మాణం స్థిరంగా ఉన్నట్లే భావించాం.
అయితే ఇప్పటికే ఒక వాస్తవం మనకు తెలుసు:
యంత్రాలలో వచ్చే ప్రతి పురోగతి తోనూ, స్థిర పెట్టుబడి భాగం – యంత్రాలకూ, ముడిపదార్ధాలు వగయిరాలకు వెచ్చించే భాగం – పెరుగు తుంది; అస్థిర భాగం – శ్రమ శక్తికి వెచ్చించే  భాగం – తగ్గుతుంది.
ఇంకో విషయం కూడా మనం తెలుసుకున్నాం:
ఏ ఇతర వ్యవస్థలోనూ, ఫాక్టరీ వ్యవస్థలో లాగా అభివృద్ధి నిరంతరాయంగా సాగదు. అందులోలాగా పెట్టుబడి అంగనిర్మాణం నిరంతరం మారుతూ ఉండదు. 
ఈ మార్పులకి అడ్డంకులుంటాయి. విశ్రాంతి దశలుంటాయి. ఆ దశల్లో అప్పటికున్న సాంకేతిక పునాదిమీద ఫాక్టరీల పరిమాణాత్మక విస్తరణ మాత్రమే జరుగుతుంది.
అటువంటి కాలాల్లో పనివాళ్ళు పెరుగుతారు. ఆవిధంగా 1835 లో యునైటెడ్ కింగ్ డం లో నూలు, ఉన్ని, అల్లిక (worsted), నార (flax) సిల్కు వస్త్ర ఫాక్టరీల్లో మొత్తం పనివాళ్ళు - 354,684
అయితే 1861 లో మరమగ్గాల పనివాళ్ళే 230,654 మంది ఉన్నారు.
ఒక అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ పెరుగుదల అంట ముఖ్యమైనదేమీ కాదు. ఆ అంశం : 1838 లో చేనేత కార్మికులు, కుటుంబ సభ్యులతో కలిపి 800,000 మంది ఉన్నారు; వీళ్ళలో ఆసియా లోనూ, ఐరోపాలోనూ తొలిగించబడ్డ వారు లేరు.

ఒక పరిశ్రమ శాఖలో పాత చేతివృత్తులనూ, కార్ఖానాఉత్పత్తినీ దెబ్బతీసి ఫాక్టరీ వ్యవస్థ విస్తరిస్తున్నంత కాలం, ఫలితం ఖచ్చితమే. వేగంగా కాల్చగల తుపాకులలున్న సైన్యానికీ, విల్లంబులున్న వ్యక్తికీ ఘర్షణ జరిగితే, ఫలితం ఎంత ఖచ్చితమో ఇదే అంతే ఖచ్చితం.  
యంత్రాలు విజయం సాధించే ఈ తొలిదశ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే: ఆ గెలుపు అసాధారణ లాభాలు చేకూరేందుకు సహకరిస్తుంది.
యంత్రాలు విజయం సాధించే ఈ తొలిదశ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే: ఆ గెలుపు అసాధారణ లాభాలు చేకూరేందుకు సహకరిస్తుంది. అటువంటి లాభాలు పెట్టుబడిసంచయనాన్ని వేగిరపరుస్తాయి. అంతేకాదు, కొత్తగా వస్తున్న  పెట్టుబడిలో ఒక భాగాన్ని అనుకూలమైన ఆ శాఖలోకి ఆకర్షిస్తాయి. మొదట్లో యంత్రాలు వచ్చి, ఊపుగా కార్యకలాపాలు జరిగే  ప్రతి శాఖలోనూ ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి.
ఫాక్టరీ వ్యవస్థకు కొంత నిలదొక్కు కున్నాక, యంత్రాలతో ఉత్పత్తి సర్వ సాధారణం కాగానే, ప్రత్యేకించి దాని సాంకేతిక పునాది అయిన యంత్రాలు కూడా యంత్రాలచేత తయారవడం మొదలవగానే, బొగ్గు, ఇనుం గనుల పనులూ, లోహ పరిశ్రమలూ, రవాణా సాధనాలూ విపరీతంగా మార్పు చెందిన వెంటనే ఈ ఉత్పత్తి విధానం ఒక స్థితిస్థాపక స్వభావాన్ని, ఉరుకులు పరుగులతో విస్తరించే సామర్ధ్యాన్ని  సంతరించు కుంటుంది; ఆ దుముకులకు ముడిపదార్ధాల సరఫరా, ఉత్పాదితాల అమ్మకం తప్ప మరే అడ్డూ ఉండదు.  ఒక పక్క, యంత్రాల తక్షణ ఫలితం ముడిపదార్ధాల సరఫరా పెరగడం. ఉదాహరణకి, పత్తి జిన్ను వల్ల దూది ఉత్పత్తి పెరిగినట్లు. మరొకపక్క, యంత్రాలు ఉత్పత్తిచేసిన వస్తువులు  చౌక గనకా, మెరుగైన రవాణా సాధనాలు అందుబాట్లోకి వచ్చాయి గనకా అవి విదేశీ మార్కెట్లను జయించే ఆయుధాలవుతాయి. 
ముడిపదార్ధాలు సరఫరా చేసేదేశాలు
ఇతర దేశాల్లో చేతివృత్తుల ఉత్పత్తుల్ని నాశనం చెయ్యడం ద్వారా, యంత్రాలు ఆ దేశాల్ని బలవంతంగా తనకు ముడిపదార్ధాలు సరఫరా చేసే ప్రదేశాలుగా మారుస్తాయి. అలా ఈస్ట్ ఇండియా గ్రేట్ బ్రిటన్ కి సరఫరా కోసం ముడిపదార్ధాల్ని -పత్తి, ఉన్ని, గోగు, జనుము, నీలిమందు ల్ని– తప్పక ఉత్పత్తి చెయ్య వలసి వచ్చింది.
ఇండియానుండి గ్రేట్ బ్రిటన్ కి పత్తి ఎగుమతులు: 
1846 లో      - 34,540,143 పౌన్లు  . 1860 లో 204,141,168 పౌన్లు. 1865 లో 445,947,600 పౌన్లు.
ఉన్ని ఎగుమతులు:
1846 లో      - 4,570,581 పౌన్లు  . 1860 లో 20,214,173 పౌన్లు. 1865 లో 20,679,111 పౌన్లు.
కేప్ నుంచి గ్రేట్ బ్రిటన్ కి ఉన్ని ఎగుమతులు:
1846 లో      - 2,958,457 పౌన్లు  . 1860 లో 16,574,345 పౌన్లు. 1865 లో 29,920,623 పౌన్లు.
ఆస్ట్రేలియా నుంచి ఉన్ని ఎగుమతులు:
1846 లో      - 21,789,346 పౌన్లు . 1860 లో 59,166,616 పౌన్లు. 1865 లో 109,734,261 పౌన్లు.
అమెరికా సంయుక్త రాష్ట్రాలనుంచి పట్టి ఎగుమతులు:
1846 లో      - 401,949,393 పౌన్లు  . 1860 లో 1,115,890,608 పౌన్లు.


పై సమాచారాన్ని బట్టి ఆ 20 ఏళ్లలో గ్రేట్ బ్రిటన్ కి ముడి సరుకుల ఎగుమతులు ఎంతో వేగంగా పెరిగాయి.ఆ దేశాలు ముడిపదార్ధాలు పండించి సరఫరా చేసేవిగా ఉన్నాయి. గ్రేట్ బ్రిటన్ వాటిని పరిశ్రమల్లో వాడుకునే పారిశ్రామిక దేశంగా ఉండింది. ఆవిధంగా ఒక కొత్త అంతర్జాతీయ శ్రమ విభజన జరిగింది.
1846 లో ఆధునిక పరిశ్రమ నిరంతరం  కార్మికుల్లో కొందరిని మిగులు పనివాళ్ళుగా, అంటే అవసరానికి మించి ఉన్నవాళ్ళుగా చేస్తుంది. తద్వారా ఆధునిక పరస్రమ వేళ్ళూనుకున్న అన్ని దేశాల్లో వలసలకూ, విదేశీ కాలనీలకూ ప్రోత్సాహం ఇస్తాయి. తత్ఫలితంగా ఆయా దేశాలు మాతృదేశానికి ముడి పదార్ధాల్నిఉత్పత్తిచేసే జనావాసాలుగా (settlements) మార్చబడతాయి. ఉదాహరణకి, ఆస్ట్రేలియా ఉన్ని ఉత్పత్తిచేసే కాలనీ గా మార్చబడింది.
ఒక కొత్త, అంతర్జాతీయ శ్రమ విభజన- ఆధునిక పరిశ్రమ ప్రధాన కేంద్రాల ప్రయోజనాలకి  అనుకూలమైన అంతర్జాతీయ శ్రమ విభజన ఏర్పడింది. ప్రపంచంలో ఒకభాగాన్ని  ప్రధానంగా వ్యవసాయోత్పత్తుల్ని , మరొక భాగానికి, అంటే పారిశ్రామిక దేశాలకు సరఫరా చేసే రంగంగా మార్చివేస్తుంది. 
ఫాక్టరీ వ్యవస్థ  ఉత్పత్తి అపరిమితం
ఫాక్టరీ వ్యవస్థకు ఉరుకుల, పరుగులమీద విస్తరించే శక్తి అపరిమితంగా ఉంటుంది; ఆవ్యవస్థ ప్రపంచ మార్కెట్ల మీద ఆధారపడి నడుస్తుంది. కాబట్టి అది అతీతంగా, అపరిమితంగా ఉత్పత్తిచేస్తుంది. ఫలితంగా మార్కెట్లు సరుకులతో నిండి పోతాయి, పొంగి  పొర్లి పోతాయి. సరుకులు తగినంతగా అమ్ముడవవు. మాకెట్ కి వాటి అవసరం అంతగా ఉండదు. అందువల్ల ఉత్పత్తి కుంటుబడుతుంది.
దీన్ని బట్టి, ఆధునిక పరిశ్రమ ఈ దశల గుండా సాగుతూ ఉంటుంది:
·         ఒక మోస్తరయిన ఉత్పత్తి కార్య కలాపం (moderate activity)
·         వికాసం (prosperity)
·         అమితోత్పత్తి (over-production)
·         సంక్షోభం (crisis)
·         స్తబ్దత (stagnation)
ఈ దశలు కలిసి ఒక పారిశ్రామిక వలయం (industrial cycle) అవుతుంది. ఈ వలయాలు ఒకటి పొతే మరొకటి వరసగా ఏర్పడుతూనే ఉంటాయి. యంత్ర వ్యవస్థ మరొక రీతిలో సాగదు.
కాబట్టి, యంత్రాలు  కార్మికుల నియామకాన్నీ, తత్ఫలితంగా వాళ్ళ పరిస్థితుల్నీఅనిశ్చితి లో పడేస్తాయి. నియమిత కాల వ్యవధుల్లో ఏర్పడే వలయాల మూలంగా ప్రతిసారీ అలాంటి అనిశ్చితి మళ్ళీ మళ్ళీ ఏర్పడుతూనే ఉంటుంది. అందువల్ల కార్మికుల అనిశ్చిత పరిస్థితి మామూలు స్థితి అవుతుంది.
పెట్టుబడిదారుల మధ్య పోటీ   
వికాస కాలంలో తప్ప , మార్కెట్లో పెద్ద వాటా  కోసం పెట్టుబడిదారుల పోటీ తీవ్రంగా చెలరేగుతుంది. ఈ వాటా  ఉత్పాదితాల చౌకదనానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే, ఉత్పాదితం ఎంత చౌక అయితే అంత ఎక్కువ వాటా ఉంటుంది. కనుక తమతమ సరుకులను చౌక పరిచే ప్రయత్నం చేస్తారు. కొత్త ఉత్పాదక పద్ధతులు అవలంబిస్తారు.
శ్రమశక్తికి బదులు యంత్రాలు పెట్టడంలోనూ, పాత యంత్రాల స్థానంలో  మెరుగైన యంత్రాలు పెట్టడంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడతారు. చౌక పరచడానికి వేతనాలు తగ్గిస్తారు. ప్రతి పారిశ్రామిక వలయం లోనూ వేతనాల్ని శ్రమ శక్తి విలువకన్నా బలవంతంగా తక్కువ స్థాయికి దించుతారు.
అందువల్ల ఫాక్టరీ పనివాళ్ళు పెరగడానికి, పెట్టే పెట్టుబడి మొత్తం అంతకు మించి వేగంగా పెరగడం తప్పనిసరి షరతు. ఈ పెరుగుదల పారిశ్రామిక వలయం యొక్క ఆటు పోట్లను బట్టి ఉంటుంది. అదీగాక, ఒకప్పుడు కొత్త వాళ్ళని పెట్టుకుంటూ, ఒకప్పుడు ఉన్నవాళ్ళలో కొందరిని తొలిగిస్తూ ఉండే సాంకేతికాభివృద్ధి ఈపెరుగుదలకి నిరంతరం అంతరాయం ఏర్పరుస్తుంది.
యంత్ర పరిశ్రమలోని ఈ గుణాత్మక మార్పు నిరంతరాయంగా పనివాళ్ళ తొలిగిస్తూ ఉంటుంది; లేదా కొత్తగా నియమితులయ్యే వాళ్లకు గేట్లు మూసేస్తుంది.  కేవలం ఫాక్టరీల పరిమాణాత్మక విస్తరణ తోలిగిమ్పబడ్డ పాత పనివాల్లనే కాక, కొత్త వాళ్ళనికూడా ఇముడ్చుకుంటుంది. ఆ విధంగా పనివాళ్ళు ఎల్లవేళలా బయటకు పంపబడుతుంటారు, లోపలికి తీసుకోబడుతుంటారు. ఒక చోటు నుంచి వేరొక చోటికి తరమబడుతుంటారు. అదే సమయంలో పెట్టుకునే పనివాళ్ళ వయసులో, నైపుణ్యంలో, స్త్రీ పురుష నిష్పత్తిలో మార్పులు జారుతూ ఉంటాయి. 

ఇంగ్లిష్ వస్త్ర పరిశ్రమ గమనాన్ని పరిశీలిస్తే, ఫాక్టరీ పనివాళ్ళ పరిస్థితి వివరంగా తెలుస్తుంది.
1770 1815 కాలంలో ఈ పరిశ్రమ 5 ఏళ్ళపాటు మాత్రమే స్తబ్దంగా ఉండింది. ఆ 45 ఏళ్ల కాలంలోనూ ప్రపంచ మార్కెట్లమీదా, యంత్రాల మీదా  ఇంగ్లిష్ పెట్టుబడిదారులకు గుత్తాధిపత్యం ఉండింది.
1815 -1821 కాలంలో మాంద్యం (depression), 1822-1823 కాలంలో వికాసం (prosperity). 1824 లో కార్మిక వ్యతిరేక చట్టాల రద్దు. ప్రతిచోటా ఫాక్టరీల భారీ విస్తరణ. 1825 సంక్షోభం (crisis); 1826 విపరీతమైన కష్టాలు (great misery), ఫాక్టరీ పనివాళ్ళ మధ్య కొట్లాటలు. 1827 కొంచెం మెరుగుదల. 1828 మరమగ్గాల సంఖ్యలోనూ, ఎగుమతుల్లోనూ ఎంతో పెరుగుదల. 1829 ఎగుమతులు ప్రత్యేకించి ఇండియాకి అంతకుముందు సంవత్సరాల ఎగుమతులను మించి పోయాయి. 1830 మార్కెట్లలో సరుకులు మేటలు వేశాయి, అమిత కష్ట కాలం. 1831-1833 మాంద్యం. ఇండియా చైనాలతో ఈస్ట్ ఇండియా కంపెనీకున్న వాణిజ్య గుత్తాధిపత్యం ఉపసంహరించాబడింది. 1834 ఫాక్తరీలూ, యంత్రాలూ పెద్దఎత్తున పెరిగాయి. కార్మికుల కొరత. బీదవాళ్ళ గురించిన కొత్త చట్టాల ఫలితంగా వ్యవసాయ కూలీలు ఫాక్టరీ జిల్లాలలోకి వలసలు పెరిగాయి. పల్లెటూళ్ళలో పిల్లలు లేకుండా పోయారు. శ్వేత బానిస వర్తకం. 1835 మహా వికాసం. ఆకాలంలోనే చేనేత పనివాళ్ళు పస్తులతో పడున్నారు. 1836 మహా వికాసం. 1837 1838 మాంద్యం, సంక్షోభం. 1839 పునరుజ్జీవనం (revival). 1840 మహా మాంద్యం. కొట్లాటలు. రంగం పైకి సైన్యం. 1841 , 1842 ఫాక్టరీ పనివాళ్ళ దుర్భర దారిద్ర్యం. 1842 ధాన్యం చట్టాల రద్దు* కోసం యజమానులు ఫాక్టరీలని మూసివేయడం. వేలాదిగా లాంక్ షైర్ కీ, యార్క్ షైర్ కీ ప్రవాహంల వచ్చే పనివాళ్ళని సైన్యం వెనక్కి తరమడం. కార్మికుల నాయకుల్ని విచారణకు తీసుకురావడం.

1843 పెద్ద దీనావస్థ. 1844 పునరుజ్జీనం. 1845 గొప్ప వికాసం. 1846 మొదట మొదట కొనసాగిన వికాసం, ఆతర్వాత వెనకంజ. ధాన్యం చట్టాల రద్దు. 1847 సంక్షోభం. ‘పెద్ద రొట్టె’ (big loaf)** గౌరవార్ధం వేతానాలు 10 శాతం, ఆపైనా తగ్గింపు.

(*విదేశీ ధాన్యం దిగుమతి మీద పరిమితులూ, సుంకాలూ విధిస్తూ చేసిన చట్టాలు. 1815నించీ 1846 వరకూ అమల్లో ఉన్నాయి.దేశీయ ధాన్యం ధర ఎక్కువగా ఉండడానికి చేసిన చట్టాలు. దేశీయ  ఉత్పత్తిదారులప్రయోజనాలు పరిరక్షించదమే వీటి ఉద్దేశ్యం.వీటి వల్ల దిగుమతి గోధుమల ధరలు పెరిగాయి.రొట్టె ధరపెరిగింది.ఫాక్టరీ యజమానులు వేతనాలు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్న సమయం అది. రొట్టె ధర పెరిగినందువల్ల వాళ్ళ ప్రయత్నన్నికి ఆటంకం కలిగింది.
Anti-Corn Law League =ధాన్య చట్టాలని తొలిగించాలనే సంస్థ.ఇది 1846లో పైచేయి సాధించింది. ప్రధాని రాబర్ట్ పీల్ వీటిని రాద్దుచేసాడు. ఈ చర్య పెట్టుబడిదారులకు అనుకూలం.

**ధాన్యం విషయంలో స్వేచ్చా వాణిజ్యం వస్తే, కార్మికులకి చిన్న రొట్టె బదులు పెద్దరొట్టె లభిస్తుందని ధాన్యం చట్టాల్ని వ్యతిరేకించే  వాళ్ళు  వాదించేవారు)
1848 కొనసాగిన మాంద్యం. 1849 ఔనరుజ్జీవనం. 1850 వికాసం. 1851 ధరల తగ్గుదల, తక్కువ వేతనాలు, తరచూ సమ్మెలు. 1852 మెరుగుదల మొదలు, సమ్మెలు కొనసాగడం, విదేశీ శ్రామికులని తెస్తామని యజమానులు బెదిరించడం. 1853 ఎగుమతులు పెరగడం. 8 నెలల పాటు సమ్మె -. ప్రెస్టన్ లో పెద్ద దైన్య స్థితి. 1854 వికాసం. మేటలు వేసినమార్కెట్లు. 1855 అమెరికా సంయుక్తరాష్ట్రాల నించీ, కెనడా నించీ, ఈశాన్య మార్కెట్ల నించీ వ్యాపార వైఫల్యాల గురించి వార్తల ప్రవాహం. 1856 మహా వికాసం. 1857 సంక్షోభం. 1858 మెరుగుపడడం. 1859 మహా వికాసం. ఫ్యాక్టరీల పెరుగుదల. 1860 ఇంగ్లిష్ వస్త్ర పరిశ్రమకి  మహర్దశ. ఇండియా,ఆస్ట్రేలియా తదితర దేశాల మార్కెట్లు ఇంగ్లిష్ బట్టలతో నిండిపోవడం. ఎంతగానంటే, 1863 లో సైతం అవన్నీ పూర్తిగా అమ్ముడవలేదు. ఫ్రెంచ్ వాణిజ్య ఒడంబడిక, ఫాక్టరీలు, యంత్రాలు అపారంగా పెరగడం. 1861 కొంతకాలం కొనసాగిన వికాసం, తిరిగి తిరోగమనం. అమెరికాలో అంతర్యుద్ధం. దూది కరువు. 1862 1863 పూర్తి పతనం.
దూది కరువు చరిత్ర ముఖ్యమైంది. దాన్ని గురించి కొద్ది వివరణ అవసరం. 1860, 1861 సంవత్సరాల్లో దూదికరువు ఉత్పత్తిదారులకు కొంత అనుకూలంగా చివరి క్షణంలో వచ్చింది. 1861 లో United Kingdom లో ఉన్న  2,887 జౌళి మిల్లుల్లో చిన్నవే ఎక్కువ. ఇవి దివాలా తీశాయి. వాణిజ్య సంక్షోభంలోనైనా వాటికి ఇదే గతి పట్టి ఉండేది. అయితే అది దూది కరువు ముందే వచ్చినందువల్ల తప్పిపోయింది.
లోపం యజమానిదీ – బాధ్యత పనివాడిదీ
1882 అక్టోబర్లో 60.3 శాతం కడుర్లూ, 58 శాతం మగ్గాలూ ఆడలేదు. ఈలెక్కలు మొత్తం వస్త్ర పరిశ్రమకు సంబంధించినవి. పూర్తి కాలం పనిచేసిన మిల్లులు చాలా తక్కువ. మిగతావి అడపాదడపా పనిచేస్తుండేవి. కార్మికుల వేతనాలు తగ్గి పోయాయి. ఎందుకంటే నాసిరకం దూది వాడకం వల్ల, బరువైన జిగురు వాడడం వల్ల ఒక పనివాడు చూడగల యంత్రాల సంఖ్యా, వాటి వేగమూ  తగ్గాయి. యంత్రాల లోపాలవల్ల శ్రమ పెరిగింది. కూలి రేట్లు తగ్గాయి. ఆ పరిస్థితుల్లోకూడా  యజమానులు ఉత్పత్తుల్లో లోపాలకు శ్రామికులని బాధ్యుని చేసి వేతనాల్లో కోతలు పెట్టేవారు. అయితే నిజానికి ఆలోపాలకు కారణం కార్మికుల లోపాలు కాదు. యజమాని ఇచ్చిన నాసిరకం దూదీ, సరిగాలేని యంత్రాలూ. వీటి వల్ల పనివాళ్ళ ఆరోగ్యం దెబ్బతినేది.
కార్మికుల జబ్బులు
నాసిరకం సూరత్ దూది బేళ్ళు తెరవగానే, భరించరానంత దుర్వాసన కొడుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. కలగలిపే గదుల్లో, ఏకే గదుల్లో, చిక్కుదీసే గదుల్లో ఒకటే దుమ్మూ, ధూళీ. దగ్గొస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. సూరత్ దూదిలో ఉండే మురికి వల్ల చర్మవ్యాదులు వ్యాప్తిచెందేవి. పింజ పొట్టిగా ఉన్నందువల్ల, జిగురు ఎక్కువగా వాడేవాళ్ళు. దుమ్ము మూలంగా శ్వాస నాళాల వాచేవి (bronchitis), గొంతు మంట సర్వసాధారణం. అడ్డ పోగులు తరచుగా తెగేవి. అప్పుడు పనివాడు పోగుని కండె బెజ్జం గుండా నోటితో లాగేవాడు. దాంతో అతనికి పొట్ట తిప్పేది, అజీర్తి చేసేది.
మరొక పక్క, యజమానులు పిండికి బదులుగా వేరే పదార్ధాలు వాదే వాళ్ళు. అవి దారం బరువు పెంచేవి. 15 పౌన్ల దారం నేశాక 26 పౌన్లు తూగేది. యజమానులకి లాభదాయకంగా ఉండింది. Fortunatus‘ purse.
యజమానుల గొప్పలు
1864ఏప్రిల్ 30 నివేదికలో ఒక ఇన్స్ పెక్టర్ ఇలా రాశాడు:
ఈ వనరుని ఇప్పుడు అప్రతిష్టాకరంగా వాడుతున్నారు. 8 పౌన్ల బట్టలో 5 ¼ పౌన్ల దూదీ,  2 ¾ పౌన్ల జిగురు ఉన్నదని విన్నట్లు చెప్పాడు. ఇలాంటివి ఎగుమతి రకం బట్టలు. ఇతర రకాల బట్టల్లో సగానికి సగం జిగురు. దాన్నితాను దారానికి మాత్రమే పౌండ్ల లేక్కన ఇచ్చిన దానికన్నా తక్కువ ధరకి అమ్ముతూ కూడా, సంపన్నుడిని అవుతున్నానని పెట్టుబడిదారుడు గొప్పలు చెప్పుకోవచ్చు, చెప్పుకుంటున్నాడు కూడా. కాని కార్మికులు  మాత్రం యాతన పడాల్సి వచ్చేది.

కార్మికుల  యాతన
కార్మికుల కష్ట నష్టాలకు కారణాలు:
·         మిల్లుల్లో యజమానులు, మిల్లుల వెలపల మున్సిపాలిటీలూ చేసే ప్రయోగాలు
·         తగ్గే వేతనాలు
·         పనులు లేకపోవడం
·         అవసరాలు గడవక పోవడం
ఇవేకాదు.
దూది కరువు మొదలవగానే పనులు పోయిన కొందరు అదృష్ట హీన లయిన స్త్రీలు సమాజం వెలివేయబడ్డవాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు వాణిజ్యం తిరిగి పుంజుకుంది, పని పుష్కలంగా లభిస్తుంది. అయినప్పటికీ వాళ్ళు అలానే బతుకుతున్నారు, ఇక ముందూ  అలానే బతుకుతారేమో!
ఈ ప్రాంతంలో గడిచిన పాతికేళ్లలో, ఇప్పుడు ఎక్కువమంది లేత వెలయాళ్ళు ఉన్నారు- ఫాక్టరీ నివేదికలు, 1865 అక్టోబర్ 31.
1770-1863 కాలంలో పారిశ్రామిక దశలు
1770 1815 కాలంలో అంటే 45 ఏళ్లలో సంక్షోభమూ, స్తబ్దతా ఉన్నది కేవలం 5 ఏళ్ళుమాత్రమే; అయితే అది గుత్తాధిపత్య దశ. 1815 1863 కాలం 48 ఏళ్ళు. ఇది రెండో దశ. అందులో 20 ఏళ్ళు పునరుజీవనమూ, 28 ఏళ్ళు మాంద్యమూ, స్థబ్దతా. 1815-1830 కాలంలో ఐరోపా ఖండం తోనూ, సంయుక్త రాష్ట్రాలతోనూ పోటీ మొదలైంది. 1833 తర్వాత మానవజాతి విధ్వంసంద్వారా – ఇండియా చేనేత పనివాళ్ళను పూర్తిగా తుడిచిపెట్టడం ద్వారా- ఆసియా మార్కెట్ల విస్తరణ బలవంతంగా జరిగింది. ధాన్యం చట్టాలు రద్దయిన తర్వాత  1846 1863 కాలంలో 8 ఏళ్ళు ఒక మోస్తరు ఉత్పత్తి చర్యా, వికాసమూ కాగా 9 ఏళ్ళు మాంద్యమూ, స్తబ్దతా.
వికాసంలో సైతం శ్రామికుల బాధలు
వికాస సమయాల్లో సైతం పురుష వయోజన కార్మికుల పరిస్థితి బాగాలేదు అనడానికి రుజువుగా 1863 లో  ఫాక్టరీ కార్మికులు చేసిన ఒక విజ్ఞప్తి ఉంది. పనుల్లేక పడివున్న ఫాక్టరీ పనివాళ్ళకి  పెద్ద ఎత్తున వలసపోవడం తప్పనిసరి. దీన్నెవరూ కాదనరు.  గనక  సరైన వలస వ్యవస్థ కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు విజ్ఞప్తి చేశారు. దీన్నిబట్టి పనివాళ్ళ పరిస్థితిని అంచనా వెయ్యచ్చు.
వచ్చే పోస్ట్: ఆధునిక పరిశ్రమ తెచ్చిన విప్లవం – కార్ఖానా ఉత్పత్తిలో, చేతి వృత్తుల్లో, గృహ పరిశ్రమల్లో.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి