15, జులై 2018, ఆదివారం

ఆధునిక పరిశ్రమా - వ్యవసాయమూ


మార్క్స్ కాపిటల్
అధ్యాయం -15
యంత్రాలూఆధునిక పరిశ్రమా
విభాగం -10
ఆధునిక పరిశ్రమా - వ్యవసాయమూ
ఆధునిక పరిశ్రమ వ్యవసాయంలోనూ, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంబంధాలలోనూ పెనుమార్పు తెచ్చింది. ఆ  విప్లవంగురించి తర్వాత పరిశోధించ బడుతుంది- అంటాడు మార్క్స్.అయితే ఆవిప్లవం వల్ల అప్పుడు రాబోయే ఫలితాల్లో కొన్నింటిని సూచనప్రాయంగా  ఇక్కడ చెబుతాడు.   ఫలితాలు ఇవే:

1.ఫాక్టరీ కార్మికులకి  యంత్రాలు భౌతికంగా హాని కలిగిస్తాయి. వ్యవసాయంలో చాలావరకూ అటువంటి హాని ఉండదు. అయితే అవి పనివాళ్ళని తొలిగించి, వాళ్ళ స్థానాన్ని ఆక్రమిస్తాయి. చర్యఫాక్టరీల్లోకంటే వ్యవసాయంలో తీవ్రంగా ఉంటుంది. ఉదాహరణకి, కేంబ్రిడ్జ్ కౌంటీలోనూ, సఫోక్ కౌంటీలోనూ పోయిన 20 ఏళ్ళలో (1868 వరకూ) సాగులో కొచ్చిన భూమి విస్తీర్ణం చాలా ఎక్కువ. అదే కాలంలో గ్రామీణ జనాభా తగ్గిపోయింది - సాపేక్షంగానే కాదు, నిరపేక్షంగా కూడా.

2. పై చర్యకి శ్రామికుల ప్రతిఘటన తక్కువగా ఉంటుంది. అంటే, ఫాక్టరీల్లో ఉన్నంత ఉండదు.(దీన్ని గురించి తర్వాత అంటాడు)

3. ఆధునిక పరిశ్రమ వ్యవసాయరంగం మీద మిగతా రంగాల మీద  కంటే ఎక్కువ విప్లవకర ప్రభావం చూపుతుంది.
పాతసమాజానికి రక్షా కవచం (bulwark) అయిన రైతుని నాశనం చేస్తుంది. రైతు స్థానంలో వేతన శ్రామికుణ్ణి పెడుతుంది. ఆవిధంగా సామాజిక మార్పులు రావాలన్న కాంక్ష గ్రామాల్లోకూడా పట్టణాల్లో ఉన్నంత స్థాయికి చేరుతుంది. వర్గ శతృవైరుధ్యాలు కూడా అదే స్థాయిని అందుకుంటాయి.

4. హేతు విరుద్ధమైన, పాతకాలపు వ్యవసాయ పద్ధతుల పోయి, వాటి స్థానంలో శాస్త్రీయ పద్ధతులు వస్తాయి. కార్ఖానా ఉత్పత్తి పసిదశలో దాన్నీ, వ్యవసాయాన్నీ కలిపివుంచిన పాత బంధాన్నిపెట్టుబడిదారీ ఉత్పత్తి పూర్తిగా తెంచివేస్తుంది. అయితే అదేసమయంలో, రాబోయే కాలంలో వాటి ఉన్నతమైన కలయికకి తగిన భౌతిక పరిస్థితుల్ని ఏర్పరుస్తుంది. అంటే, తాత్కాలికంగా విడిపోయి ఉన్నప్పుడు అదీ, ఇదీ రెండూ పొందిన మరింత పరిపూర్ణమైన రూపాల ప్రాతిపదిక మీద ఆరెంటి ఐక్యతకీ భౌతిక పరిస్థితుల్ని ఏర్పరుస్తుంది.  

5.పెట్టుబడి దారీ ఉత్పత్తి పెద్దపెద్ద కేంద్రాలకు జనాలను చేరుస్తుంది; పట్టణ జనాభా ప్రాబల్యాన్ని అంతకంతకూ పెంచుతుంది. పెంచి, తద్వారా ఒకపక్క, సమాజపు  చారిత్రకచోదక శక్తిని కేంద్రీకరిస్తుంది; మరొకపక్క, నేలకీ, మనిషికీ ఉండే పదార్ధప్రసరణని చెదరగొడుతుంది, చిందరవందర చేస్తుంది; అంటే, మనిషి తిండీ, గుడ్డా రూపంలో వాడుకునే నేలలో ఉండే  మూలకాల్ని తిరిగి నేలకు చేరనివ్వదు. ఆవిధంగా,  అది స్థిరమైన భూసారానికి అవసరమైన పరిస్థితుల్ని అతిక్రమిస్తుంది.

6. చర్యద్వారా ఏక కాలంలో అది పట్టణ కార్మికుని ఆరోగ్యాన్నీ, పల్లె పనివాని మేధోజీవితాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అయితే, పదార్ధ ప్రసరణ నిర్వహణకు సహజంగా వృద్ధి చెందిన పరిస్థితుల్ని తలక్రిందులు చేస్తూనే, అది సామాజిక ఉత్పత్తిని నియంత్రించే నియమంగా, ఒక వ్యవస్థగా దాన్నిమానవజాతి పూర్తి అభివృద్ధికి సరిపడే రూపంలో తిరిగి ఏర్పరచవలసిన అవసరాన్ని కలగజేస్తుంది. కార్ఖానా ఉత్పత్తిలో లాగానే, వ్యవసాయంలోనూ పెట్టుబడి ఆధిపత్యంలో ఉత్పత్తి పరివర్తన అంటేనే, అదేసమయంలో ఉత్పత్తిదారుని బలి (martyrdom) కూడా; శ్రమ సాధనం శ్రామికుణ్ణి బానిసని చెయ్యడానికీ, దోపిడీ చెయ్యడానికీ, పేదవాణ్ణి చెయ్యడానికీ ఉపయోగపడే సాధనం అవుతుంది;శ్రమ ప్రక్రియల సమ్మేళనమూ, వ్యవస్థా  కార్మికుని వైయక్తిక జీవ శక్తినీ (vitality), స్వేచ్చాస్వాతత్ర్యాల్నీ అణగదొక్కే వ్యవస్థగా మార్పుచెందుతుంది.

7. గ్రామీణ శ్రామికులు ఎక్కడెక్కడో చెల్లా చెదరై ఉండడం వల్ల వాళ్ళ ప్రతిఘటనా శక్తి విడిపోయి, తరుగుతుంది. అదే సమయంలో, పట్టణ కార్మికులు కేంద్రీకృతమై ఉన్నందువల్ల, వాళ్ళ ప్రతిఘటనా శక్తి పెరుగుతుంది.పట్టణ పరిశ్రమల్లో లాగానే, ఆధునిక వ్యవసాయంలో కూడా పెరిగిన ఉత్పదకతా, శ్రమ పరిమాణమూ శ్రమ శక్తిని వృధాచెయ్యడం వల్లా, వ్యాధిగ్రస్తం చెయ్యడం వల్లా వస్తాయి.

పెట్టుబడిదారీ వ్యవసాయంలో పురోభివృద్ధి అంటే కార్ముకుణ్ణి దోపిడీ చెయ్యడంలో వృద్ధి.
 భూసారాన్నీ  దోచుకోవడంలో వృద్ధి. భూమి సారాన్నినిర్ణీత కాలం పాటు పెంచడంలోని ప్రగతి, ఆసారానికి ఉన్న శాశ్వత మూలాధారాల్నినాశనం చయ్యడంలో ప్రగతి మాత్రమే. అమెరికా లాగా, ఏదేశమైనా దాని అభివృద్ధిని ఆధినిక పరిశ్రమ పునాదిమీద మొదలుపెట్టే కొద్దీ, విధ్వంస ప్రక్రియ త్వరత్వరగా సాగుతుంది. కాబట్టి పెట్టుబడిదారీ ఉత్పత్తి సాంకేతికతనీ, సమాజ ఉత్పత్తి ప్రక్రియల సమ్మేళన స్థాయినీ అభివృద్ధి చేస్తుంది - అయితే సకల సంపదకూ వనరులైన భూమినీ కార్మికుణ్ణీ కొల్లగొట్టడం ద్వారా మాత్రమే.

అధ్యాయం -15 యంత్రాలూఆధునిక పరిశ్రమా అయిపోయింది
వచ్చే పోస్ట్ : పరమ అదనపువిలువా – సాపేక్ష అదనపువిలువా








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి