12, జులై 2018, గురువారం

ఫాక్టరీ చట్టాలూ – ఇంగ్లండ్ లో వాటి సాధారణ విస్తరణా


 కాపిటల్   అధ్యాయం -15

యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా

విభాగం-9 
ఫాక్టరీ చట్టాలూఇంగ్లండ్ లో వాటి సాధారణ విస్తరణా
ఫాక్టరీ చట్టాల్లోని శుభ్రతకీ, విద్యకీ సంబంధించిన క్లాజులూ – ఇంగ్లండ్ లో వాటి సాధారణ విస్తరణా


ఫాక్టరీ చట్టాల ఆవశ్యకతా- పెట్టుబడిదారుల వ్యతిరేకతా  
ఫాక్టరీ చట్టాలు ఆధునిక పరిశ్రమ ఫలితంగా వచ్చాయి. క్రమంగా విస్తరించాయి. ఇంగ్లండ్ లో చట్టాలు ఎలా విస్తరించాయో చూసే ముందు, పనిగంటలకు సంబంధించిన అంశాల్ని కాకుండా, తక్కిన వాటిలో కొన్ని అంశాల్ని గమనిద్దాం.
చట్టాల్లో ఉన్న పదాల మూలంగా పెట్టుబడి దారుడు వాటినించీ తేలిగ్గా తప్పించుకోగలడు. దాన్నలా ఉంచినా, పరిశుభ్రతకి సంబంధించిన నిబంధనలు అతి కొద్ది. అవి గోడలకి సున్నం వెయ్యడం, గాలీ వెలుతురూ ఉండేట్లు చూడడం వంటివి. యంత్ర ప్రమాదాల నుంచి రక్షణకు సంబంధించిన నిబంధనలు. తమ పనివాళ్ళ అవయవాల రక్షణకి కొన్ని సాధనాలు పెట్టాలి. వాటికి  పెట్టుబడి దారులు పెట్టాల్సిన ఖర్చు స్వల్పం. అయినా యజమానులు నిబంధనల్ని  తీవ్రంగా వ్యతిరేకించారు.
పోయిన 20 ఏళ్లలో నార పరిశ్రమ బాగా విస్తరించింది. దాంతో ఐర్లండ్ లో గోగు,జనుము నుంచి నార వేరుచేసే  మిల్లులు పెరిగాయి. 1864 లో ఇవి 1800 అయ్యాయి. ప్రతి చలి కాలంలోనూ, ఆకురాలుకాలంలోనూ చిన్న రైతుల భార్యలనీ, కొడుకుల్నీ, కూతుళ్ళనీ పొలంపని నించి మిల్లుల్లో పనికి తీసుకెళ్ళేవాళ్ళు. నారని రోలర్లకు అందించాలి. వాళ్ళు  ఈపనికి  అలవాటుపడ్డ వాళ్ళు కాదు. అందువల్ల ఎన్నో ప్రమాదాలు జరిగేవి. సంఖ్యలోనూ, తీవ్రతలోనూ వాటిని దాటిన ప్రమాదాలు మొత్తం యంత్ర చరిత్రలోనే లేవు. కిల్డినాన్ వద్ద, ఒక మిల్లులో 1852 – 1856 కాలంలో ఆరుగురు చనిపోయారు. 60 మంది అవయవాలు పోగొట్టుకున్నారు. అనేక సందర్భాల్లో శరీరంలో నాలుగో వంతు తెగిపోతుంది. చనిపోవచ్చు, లేదా  చివరిదాకా  బాధతో, అశక్తతతో బతకాలి. మిల్లుల్ని చట్టం కిందికి  తీసుకొస్తే గొప్పవరం  అవుతుందని డాక్టర్ వైట్ తన నివేదికలో రాశాడు.ఈప్రమాదాల్లో, అవయవ బలుల్లో ప్రతిదాన్నీ కొన్ని షిల్లింగులు మాత్రమే ఖర్చయ్యే సాధనాలతో నివారించవచ్చు. అయితే ఆమాత్రం ఖర్చు పెట్టడం వాళ్లకి ఇష్టం ఉండదు.మిల్లుల పరిశుభ్రతకీ, పనివాళ్ళ ఆరోగ్య రక్షణకీ అవసరమైన సామాన్యపరికరాల్ని కూడా పెట్టేవారు కాదు. అందువల్ల పార్లమెంటు చట్టాలు చెయ్యాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
మట్టి పాత్రల పరిశ్రమలో 200 మించి వర్క్ షాపులకి,( కొన్నిటికి 20 ఏళ్ల పాటు కూడా) సున్నం కొట్టించి, శుభ్రంచేయించలేదు. 1864 ఫాక్టరీ చట్టం వల్ల  ఆపని మొదలుపెట్టారు. మిల్లుల్లో 27,800 మంది పనిచేస్తున్నారు. చట్టం వచ్చేదాకా, కంపు గాలి పీల్చుకునేవారు. చట్టం వచ్చాక పరిస్థితి కొంత మెరుగయింది.

 పెట్టుబడిదారీవిధానం కొంత వరకే మెరుగుదలకు అవకాశం ఇస్తుంది.
అంతకుమించి ఇవ్వదు. చట్టంలోని భాగం దీన్ని నిరూపిస్తుంది. ప్రతి వానికీ 500 ఘనపుటడుగుల స్థలం ఉండాలని డాక్టర్ల ఏకగ్రీవ అభిప్రాయం. అయితే అంత స్థలం ఉండాలని చట్టంలో పెడితే, ఒక్క దెబ్బతో సన్నకారు యజమానుల ఆస్తులు నేరుగా హరించబడతాయి. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానపు మూలానికేఅంటే  శ్రమ శక్తిని స్వేచ్చగా కొనడం, వినియోగించడం ద్వారా జరిగే పెట్టుబడి స్వయం విస్తరణకే - దెబ్బ పడుతుంది. చిన్నాపెద్దా అని కాకుండా, అన్నిపెట్టుబడుల స్వయం విస్తరణకీ ఎదురు నిలుస్తుంది. కాబట్టి 500 ఘనపుటడుగుల స్థలానికి సంబంధించిన నిబంధన ప్రతిష్టంభనలో పడింది. పారిశుధ్య శాఖాధికారులూ, ఫాక్టరీ ఇన్స్పెక్టర్లూ అంత స్థలం కచ్చితంగా అవసరమని ఒప్పుకుంటూనే, పెట్టుబడిదారులనుండి దాన్ని రాబట్టడం అసాధ్యం అని అదేపనిగా చెబుతున్నారు.
ఇక చదువు గురించిన నిబంధనలు కోరగానివి. అయినా పిల్లల్ని నియమించడానికి  వాళ్ళకి ప్రాధమిక విద్య అందిచడం తప్పనిసరి షరతు.
ఒకపూట చదువూ- ఒకపూట పనీ
చదువునీ, పనినీ కలపడమే క్లాజుల సార్ధకత. చదువు ఒక్కటే పనిగా ఉన్న విద్యార్ధులు నేర్చుకున్నంత వీళ్ళూ నేర్చుకుంటున్నారనీ, తరచూ ఎక్కువ కూడా నేరుస్తున్నారనీ ఉపాధ్యాయులు చెప్పినట్లు ఇన్స్పెక్టర్లు రాశారు. సగం కాలం చడువడం, సగం కాలం పనిచేయడం. ఒకటే  ఒకేమైన చెయ్యడం కన్నా ఒకపూట చదవడం, ఇంకోపూట పనిచెయ్యడం  పిల్లవాడి స్వభావానికి అనువుగా ఉంటుంది. రాబర్ట్ ఓవెన్ చూపినట్లు ఇలా రెంటినీ కలిపి, భవిష్యత్ విద్యకి బీజం వేసింది  ఫాక్టరీ వ్యవస్థే.
కొత్త ప్రాతిపదిక మీద శ్రమ విభజన
కార్ఖానా ఉత్పత్తిలో ప్రతి  పనివాడు జీవితాంతం ఒకేఒక పాక్షిక చేర్య చేస్తూ ఉంటాడు. అటువంటి శ్రమవిభజనని సాంకేతిక సాధనాల ద్వారా ఆధునిక పరిశ్రమ నిర్మూలించింది. అయితే అదేసమయంలో పరిశ్రమ యొక్క పెట్టుబడిదారీ స్వభావం అదే శ్రమ విభజనని మరింత వికృతరూపంలో మళ్ళీ ఏర్పాటు చేస్తుంది; అసలైన ఫాక్టరీలో పనివాణ్ణి యంత్రానికి సజీవ అనుబంధంగా(living appendage)  మార్చడం ద్వారా; ఫాక్టరీ బయట ప్రతిచోటా, కొంతవరకూ యంత్రాల్నీ, యంత్ర కార్మికుల్నీ, అప్పుడప్పుడూ వాడుకోవడం ద్వారా, కొంతవరకూ స్త్రీల శ్రమనూ, పిల్లల శ్రమనూ, అనిపుణ చౌక శ్రమనూ వాడుకోవడం ద్వారా. కొత్త ప్రాతిపదిక మీద శ్రమ విభజనని తిరిగి ఏర్పరుస్తుంది.
కార్ఖానా ఉత్పత్తిలోని శ్రమ విభజనకీ, ఆధునిక పారిశ్రామిక పద్ధతులకీ ఉన్న శత్రువైరుధ్యం(antagonism) దృఢంగా తెలుస్తుంది. ఆధునిక ఫాక్టరీల్లోనూ, కార్ఖానా ఉత్పత్తి లోనూ నియమితులైన పిల్లలలో ఎక్కువమంది చిన్నతనం నించీ చిన్నచిన్న పనులే చేస్తూ దోపిడీకి గురవుతారు. వాళ్లకి భవిష్యత్తులో కనీసం అదే చోటనయినా ఉపయోగపడే ఒక్క పనీ నేర్పించరు. ఉదాహరణకి పాత ఇంగ్లిష్ అచ్చు పని వృత్తిలో నేర్చుకునే వాళ్ళు తేలిక పనినించి, కష్టమైన పని నేర్పి  ప్రోత్సహించే పధ్ధతి ఉండేది. పూర్తి ముద్రణ పని వచ్చేదాకా అక్కడే శిక్షణ జరిగేది. వాళ్ళకందరికీ చదవడం, రాయడం రావాలి. ఇది వారి వృత్తికి అవసరం. అయితే అచ్చు యంత్రం రాగానే ఇదంతా మారిపోయింది. ఇప్పుడు రెండు రకాల పనివాళ్ళని పెట్టుకుంటున్నది:
1.  పెద్దవాళ్ళుఅక్షరాలు కూర్చిన చట్రాల్ని యంత్రంలో పెడతారు.
2. 11-17 ఏళ్లపిల్లలుయంత్రం అడుగున కాగితాలు పరచనన్నా పరుస్తారు, లేదా అచ్చయిన కాగితాల్ని దాన్నించి తియ్యనన్నా తీస్తారు.
విసుగు పుట్టించే ఈపని లండన్లో  14, 15, 16 గంటలు ఏకబిగిన చేస్తారు. తరచూ 36 గంటలుకూడా చేస్తారు. మధ్యలో తినడానికీ, విశ్రాంతికీ రెండుగంటలు విరామం ఉంటుంది, అంతే. వాళ్ళలో అనేకులకి చదవడం రాదు. సాధారణంగా వాళ్ళు పూర్తిగా పశుప్రాయులు. వాళ్ళు చేసే పనికి అర్హత పొందడానికి  ఎలాంటి బౌద్ధిక శిక్షణగానీ, నైపుణ్యంగానీ, విచక్షణాజ్ఞానం గానీ అక్కరలేదు. వేతనాలయితే, పిల్లల్లగా ఉన్నంతకాలం కొంచెం ఎక్కువే. కాని  వాళ్ళ ఎదుగుదలకి తగినట్లుగా వేతనాలు పెరగవు. ఎక్కువ వేతనం వచ్చే యంత్రనిర్వాహకుని స్థానం పొందడం అనేకమంది ఊహించనైనా లేరు. కారణం యంత్రానికి ఒక నిర్వాహకుడే ఉంటాడు. దాన్ని అంటిపెట్టుకొని ఉండే పిల్లగాళ్ళు ఇద్దరు, తరచుగా నలుగురు ఉంటారు.
17 ఏళ్ళు వచ్చీ రాగానే వాళ్ళని ముద్రణాలయాలనుంచి పంపించేస్తారు. వాళ్ళు నేరగాళ్ళలో చేరతారు. వేరే చోట్ల ప్రయత్నించినా ప్రయోజనం కలగదు. కారణం  వాళ్ళ అజ్ఞానం, పాశవికత.
ఆధునిక పరిశ్రమ అప్పటికున్న ప్రక్రియా రూపాన్నీ అంతిమ రూపం అనుకోదు.
అందువల్ల దాని సాంకేతిక ప్రాతిపదిక విప్లవాత్మకమైనది. అంటే మార్పుని ఆహ్వానిస్తుంది.  మునుపటి ఉత్పత్తి విధానాలన్నీ సనాతన మైనవి. మార్పుని ఒప్పుకోవు. ఆధునిక పరిశ్రమ నిరంతరం మార్పుని కోరుతుంది. కమ్యునిష్టు ప్రణాళికలో ఉన్న ఈ వాక్యాలు ఫుట్ నోట్ గా ఉంటాయి:
ఉత్పత్తి సాధనాలలో నిరంతరం విప్లవం తేకుండా బూర్జువా వర్గం మనలేదు; విప్లవ ఫలితంగా ఉత్పత్తి సంబందాలోనూ, తన్మూలంగా యావత్తు సామాజిక సంబంధాలలోనూ నిరంతరం విప్లవం తేకుండా బూర్జువా వర్గం మనలేదు. ఇందుకు భిన్నంగా, పాత ఉత్పత్తి విధానాలను చెక్కు చెదరకుండా  కాపాడుకోవడమే  పూర్వ యుగాలలోని సకల పారిశ్రామిక వర్గాలకూ మనడానికి మొదటి షరతు. ఉత్పత్తిలో, నిత్య విప్లవమూ, సాంఘిక పరిస్థితుల్లో నిరంతర కల్లోలమూ, అనంతమైన అనిశ్చితత్వమూ, ఆందోళనా గుణాల వల్ల బూర్జువా యుగం యితర యుగాల కంటే విలక్షణంగా ఉంది. స్థిరపడి ఘనీభవించిన సంబంధాలు అన్నీ, వాటిని అంటిపెట్టుకొని వుండే పురాతన పూజ్య అభిప్రాయాలూ, దురభిప్రాయాలు అన్నీ కొట్టుక పోయినాయి; కొత్తగా ఏర్పడే సంబంధాలు స్థిరపడక ముందే పాతబడి పనికిమాలినవి పోతున్నాయి. గట్టిదనుకున్నదంతా గాలిలో కలిసి పోతున్నది, పవిత్రమనుకున్నదంతా మైలపడి పోతున్నది. చివరకు మానవుడు భ్రమలు తొలిగించుకొని తన నిజమైన జీవన పరిస్థితులనూ, తోటి మానవులతో తనకుగల సంబంధాలనూ ఎదుర్కోక తప్పదు.”-కమ్యునిస్టు ప్రణాళిక పేజి.36 – ప్రగతి ప్రచురణాలయం
ఆధునిక పరిశ్రమ నిరంతరం మార్పులు తెస్తుంది. సాంకేతిక ప్రాతిపదికలోనే కాదు, కార్మికుని చర్యల్లో కూడా, శ్రమ ప్రక్రియ యొక్క సామాజిక సంయోగాల్లో కూడా. తద్వారా అదే సమయంలో సామాజిక శ్రమ విభజనలో మార్పులు తెస్తుంది. కార్మికుల్నీ, పెట్టుబడినీ ఒక ఉత్పత్తి శాఖ నుంచి మరొక ఉత్పత్తిశాఖకు పెద్ద ఎత్తున విరామం లేకుండా తరలిస్తూ ఉంటుంది.
అయితే ఆధునిక పరిశ్రమ దాని స్వభావ రీత్యానే శ్రమలో వైవిధ్యాన్నీ, చర్యలో దారాళతనీ, శ్రామికుల్లో సార్వత్రిక సంచార శీలతనీ తప్పనిసరి చేస్తుంది. పనివాని పరిస్థితిలో స్థిరత్వమూ, భద్రతా లేకుండా చేస్తుంది. అతని నుంచి శ్రమ సాధనాలను లాక్కొని,  జీవనాదారాలు లేకుండా చేస్తుందని భయం, అతని పాక్షిక పనిని  కూడా లేకుండా చేసి, అసలు తన అక్కరే లేకుండా చేస్తుందని భయం. పారిశ్రామిక రిజర్వ్ సైన్యం ఏర్పడడం గురించి తెలిసిందే. పనివాళ్ళు దైన్యస్థితిలో ఉంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుబడికి అందుబాటులో ఉంటారు. సామాజిక అరాచకత్వంప్రతి ఆర్ధికాభివృద్ధినీ ఒక సామాజిక ఉపద్రవంగా మారుస్తుంది. ఇది ప్రతికూల పార్శ్వం.
ఒక పక్క, ఆధునిక పరిశ్రమ పని వైవిధ్యం ప్రతిచోటా తన విధ్వంసక చర్యతో ప్రతిఘటనని ఎదుర్కునే ఒక  ప్రకృతి నియమం లాగా మీద పడుతుంది. మరొకపక్క అదే ఆధునిక పరిశ్రమ తన ఉపద్రవాల (catastrophes) ద్వారా పని వైవిధ్యాన్ని కార్మికుని అర్హతగా నెత్తిన బెడుతుంది. ఫలితంగా, అతను రకరకాల పనులూ చేయగలిగాలి. దీని ఫలితమేమంటే, అతని బహువిధ అభిరుచుల అభివృద్ధిని మౌలిక ఉత్పత్తి నియమం గా గుర్తించవలసి వస్తుంది.
నియమం వ్యవహరించే తీరుకి  అనుగుణంగా ఉత్పత్తి పద్ధతిని మలచడం సమాజానికి జీవన్మరణ సమస్య అవుతుంది.
పాక్షిక చర్య మాత్రమే జీవితాంతం చేస్తూ మనిషిలో ఒక ముక్కగా అయిపోయిన డిటైల్ కార్మికుడి స్థానంలో చాలా పనులు చేయగలిగిన శ్రామికుడు వస్తాడు. అతను ఉత్పత్తిలో   మార్పునైనా ఎదుర్కోవడానికి రెడీ గావున్న, సమగ్రాభివృద్ధి చెందిన వాడై ఉంటాడు. అతను చెసే రకరకాల పనులు అతనికి సహజ శక్తులకీ, సముపా ర్జించుకున్న శక్తులకీ స్వేచ్ఛావకాశం కలిగించే పద్ధతులు మాత్రమే. అలాంటి పనివాళ్ళు ఆధునిక పరిశ్రమకి తప్పనిసరి. లేనట్లయితే, సమాజం అంతరించి తీరుతుంది.
వృత్తి శిక్షణా పాఠశాలలు నెలకొల్పడం
విప్లవం కొసం ఇప్పటికే తొలి అడుగు పడింది.అదే వృత్తి శిక్షణా పాఠశాలలు నెలకొల్పడం. అక్కడ పనివాళ్ళ పిల్లలకు సాంకేతిక విషయాల్లో కొంత అవగాహన కల్గిస్తారు.వివిధ శ్రమ సాధనాల్ని వాడడం నేర్పిస్తారు.
అయితే, పనిని ప్రాధమిక విద్యతో కలపడం అనేది, ఫాక్టరీ చట్టం పెట్టుబడి నుండి లాగిన కొద్దిపాటి రాయితీ మాత్రమే. అయినప్పటికీ, కార్మికవర్గం అధికారం లోకి వచ్ఛాక (కచ్చితంగా వచ్చి తీరుతుంది) కార్మిక వర్గ పాఠశాలల్లో సరైన సాంకేతిక శిక్షణ తగినంత ఉంటుంది. శిక్షణ సిద్ధాంత పరమైనది గానూ, ఆచరణాత్మకమైనది గానూ ఉంటుంది. ఇందుకు సందేహం లేదు.
అలాగే అటువంటి అలజడుల తుది ఫలితం పాత శ్రమ విభజన రద్దు. అలజడులు పెట్టుబడిదారీ ఉత్పత్తి రూపానికీ,  ఆరూపానికి అనుగుణమైన కార్మికుల ఆర్ధిక స్థాయికీ బద్ధవిరుద్ధంగా ఉంటాయి. ఇందుకూ సందేహం లేదు. 
అయితే, ఒకానొక ఉత్పత్తిరూపంలో అంతర్గతంగాఉన్న  శతృపూరితవైరుధ్యాలు క్రమంగా అభివృద్ధి చెందుతాయి.వాటి  చారిత్రక అభివృద్ధి ఒక్కటే పాత ఉత్పత్తి రూపం అంతరించి కొత్త ఉత్పత్తిరూపం అవతరించడానికి ఏకైక మార్గం.
చేతివృత్తి విజ్ఞతకి పరాకాష్ట:  చెప్పులు కుట్టే వాణ్ణి కడదాకా చెప్పులు కుట్టేపనికే కట్టుబడి ఉండాలి అనేది. అపెలీస్ అనే గ్రీక్ పెయింటర్ తను వేసిన చిత్రాన్నిచెప్పులు కుట్టే మనిషి విమర్శిమ్చినప్పుడు అన్న మాటలవి. ఆమాటలిప్పుడు అర్ధం లేనివి. ఎందుకంటే, గడియారాలు చెసే జేమ్స్ వాట్ ఆవిరి ఇంజన్ కనిపెట్టాడు. దారం తీసి కండె చుట్టే యంత్రాన్ని తయారు చేసిన ఆర్క్ రైట్ తలపని చెసే మంగలి. ఆవిరి ఓడని నిర్మించిన ఫుల్టన్ బంగారం పనిచేసే కంసాలి.అప్పటినించీ ఏపని చేసేవాడు జీవితాంతం ఆపనే చెయ్యాలి అనేది అర్ధంపర్ధం లేనిది ( sheer nonsense)అని తేలిపోయింది.
ఫాక్టరీ చట్టాలూ - గృహ పరిశ్రమలూ
ఫాక్టరీ చట్టాలు మొదట ఫాక్టరీలకూ, కార్ఖానాలకూ మాత్రమే వర్తించేవి.  అలా ఉన్నంత కాలం అవి పెట్టుబడికున్న దోపిడీ చేసే హక్కులతో జోక్యంగా భావించారు. అయితే  అప్పటికి చట్టాలు  గృహ పరిశ్రమల జోలికి పోలేదు. అయితే తర్వాత్తర్వాత వాటికీ వర్తింపచెయ్యటం మొదలైంది.
ఇక్కడకొచ్చేసరికి, తలిదండ్రుల అధికారం మీద నేరు దాడిగా చూశారు. పార్లమెంట్ చాలా కాలం గృహ పరిశ్రమలకు ఫాక్టరీ చట్టాలు వర్తింపచేసేందుకు వెనకంజ వేస్తున్నట్లు నటించింది.అయితే, సాంప్రదాయ కుటుంబం యొక్క ఆర్ధిక ప్రాతిపదికని ఆధునిక పరిశ్రమ తలకిందు చేసింది. ఆవిధంగా వెనకటి కుటుంబ సంబంధాల్ని సడలించింది. వాస్తవాన్ని పార్లమెంట్ ఇక గుర్తించక తప్పలేదు. పిల్లల హక్కుల్ని ప్రకటించాల్సి వచ్చింది.
1866 లో పిల్లల నియామకం గురించి కమిషన్ తుది నివేదక వచ్చింది. అందులో ఇలా ఉంది: బాలబాలికలకు ఇతురుల నుంచి కన్నా, తలిదండ్రులనుంచే రక్షణ అవసరం. బిడ్డల శ్రమని ఎటువంటి పరిమితీ/హద్దూ పద్దూ లేకుండా వాడుకోవడం ప్రత్యేకించి గృహశ్రమలో ఉంది. పద్ధతి కనసాగుతుందంటే కారణం తలిదండ్రులు పిల్లలకు   హానికలిగించే  నిరంకుశమైన అధికారం చెలాయించడమే. అని నివేదిక తేల్చిచెప్పింది.
1866 లో పిల్లల నియామకం గురించి కమిషన్ తుది నివేదక వచ్చింది. అందులో ఇలా ఉంది: బాలబాలికలకు ఇతురుల నుంచి కన్నా, తలిదండ్రులనుంచే రక్షణ అవసరం. బిడ్డల శ్రమని ఎటువంటి హద్దూ పద్దూ లేకుండా వాడుకోవడం ప్రత్యేకించి గృహశ్రమలో ఉంది. పద్ధతి కొనసాగుతుందంటే కారణం తలిదండ్రులు పిల్లలకు   హానికలిగించే  నిరంకుశమైన అధికారం చెలాయించడమే. అని నివేదిక తేల్చిచెప్పింది. పిల్లల్ని సంపాదించే యంత్రాలుగా తయారుచేసే నిరంకుశాధికారం తలిదండ్రులకు ఉండకూడదు.
ఏదయితే వాళ్ళ శారీర దార్ఢ్యాన్ని ముందుగానే ద్వంసంచేస్తుందో, బుద్ధీ నీతీ ఉన్న మనుషుల్లో వాళ్ళ స్థానాన్ని దిగజారుస్తుందో దాన్నించి పిల్లల, యువజనుల విముక్తి సహజ హక్కుగా శాసనసభలను కోరడం న్యాయమైనదే.
ఏమైనప్పటికీ, పిల్లల శ్రమ విషయంలో పెట్టుబడిదారీ దోపిడీని సృష్టించింది మాత్రం తలిదండ్రుల అధికార దుర్వినియోగం కాదు.అందుకు విరుద్ధంగా పెట్టుబడిదారీ దోపిడీ పద్ధతే తలిదండ్రుల అధికారానికున్న ఆర్ధిక ప్రాతిపదికని తొలిగించడం ద్వారా, దాన్ని( అధికారాన్ని)చెలాయించే వైఖరిని అనర్ధక, అధికార దుర్వినియోగంగా దిగజార్చింది.
పాత కుటుంబ సంబంధాలు అంతరించడం ఎంతో భయంకరమైనదిగానూ, అసహ్య కరమైనదిగానూ కనిపిస్తుంది. అయినప్పటికీ ఆధునిక పరిశ్రమ ఉత్పత్తిప్రక్రియలో స్త్రీలకూ,యువజనులకూ, పిల్లలకూ కుటుంబానికి వెలపల ఒక ముఖ్యమైన పాత్ర కేటాయిస్తుంది. తద్వారా, కుటుంబం విషయంలోనూ, స్త్రీ పురుషులమధ్య సంబంధాల విషయంలోనూ ఇంకా ఉన్నత రూపానికి తగిన కొత్త ఆర్ధిక ప్రాతిపదికని ఏర్పరుస్తుంది. పురాతనకాలపు రోమ్, గ్రీక్,ప్రాచ్య కుటుంబ రూపాల్ని పరమమైనవిగానూ, అంతిమమైనవిగానూ భావించడం ఎంతో అసంగతం. అలాగే టు టానిక్ క్రైస్తవ కుటుంబ రూపానికి లక్షణాని ఆపాదించడం-అంటే ఆరూపం పరమమనీ అంతిమమనీ అనుకోవడం - అంతే అసంగతం. పైపెచ్చు మొత్తంగా తీసుకుని చూస్తే, చారిత్రికభివృద్ధిలో వరసగా ఉండేవి. అంతేకాదు,శ్రామిక బృందం అనేది అన్నివయస్సుల స్త్రీలూ పురుషులూ కలిసి ఏర్పడుతుంటుంది.  తగిన పరిస్థితులు వచ్చినప్పుడు అనివార్యంగా మానవాభివృద్ధికి వనరు అయి తీరాలి. అయితే,దాని పాశవిక పెట్టుబడిదారీ రూపంలో కార్మికుడు ఉన్నది పెట్టుబడి దారీ ఉత్పత్తి ప్రక్రియ కోసం, కాని  ఉత్పత్తి ప్రక్రియ ఉన్నది కార్మికుని కోసంకాదు.అందువల్ల, అది అవినీతినీ, బానిసత్వాన్నీ వ్యాపింపచేసే వనరు అవుతుంది.
ఫాక్టరీ చట్టాల్ని సాధారణీకరించడం. అన్ని రంగాలకీ  వర్తింప చెయ్యడం
యంత్రాలు మొదట ప్రవేశించిన వడికేపరిశ్రమలకీ, నేసే పరిశ్రమలకీ మాత్రమే పెట్టిన చట్టాల్నిసామాజిక ఉత్పత్తి మొత్తానికీ వర్తింప చేయ్యాల్సిన అవసరం వచ్చింది. అవసరం ఆధునిక పరిశ్రమ చారిత్రకంగా అభివృద్ధి చెందిన విధానంనుంచే పుట్టుకొచ్చింది. ఆపరిశ్రమ నేపధ్యంలో, మునుపటి ఉత్పత్తి రూపాలు - చేతివృత్తి,  కార్ఖానా , గృహ ఉత్పత్తి- పూర్తిగా మార్చబడ్డాయి.కార్ఖానాలు ఫాక్టరీ వ్యవస్థలోకి  మారుతున్నాయి.చేతివృత్తులు కార్ఖానా ఉత్పత్తులవుతున్నాయి.చివరి విషయం, చేతివృత్తి రంగాలూ, గృహ పరిశ్రమ రంగాలూ తక్కిన వాటితో పోల్చి చూస్తే  అతి తక్కువ కాలంలోనే దౌర్భాగ్య  గుహలుగా తయారయ్యాయి. అక్కడ అత్యంత అధిక స్థాయిలో పెట్టుబడిదారీ దోపిడీకి విశృంఖల స్వేచ్చ లభిస్తుంది. 
దీన్ని మరొకవైపుకి మార్చే  పరిస్థితులు
దీన్ని అవతలవైపుకి అనుకూలంగా తిప్పే పరిస్థితులు రెండున్నాయి:

·       .ఒక చోట పెట్టుబడి శాసనాలకు లోనైతే,ఇతర చోట్ల ఆనష్టాన్ని భర్తీ చెసుకునే ప్రయత్నం  చేస్తుంది -మరింత దూకుడుగా, దుందుడుకుగా
·       పోటీలో షరతులకు సంబంధించి సమానత్వం ఉండాలని గగ్గోలు పెడుతుంది. అంటే, మొత్తం శ్రమదోపిడీ పైన సమానమైన, ఒకె విధమైన అదుపు ఉండాలి.

మెసర్స్ కూక్లీ అనే బ్రస్టెల్ కంపెనీ మేకులూ గొలుసులూ చెస్తుంది.యజమానులు ఫాక్టరీ చట్టాన్ని తామే వర్తింపచేశారు. అయితే తోటి కంపెనీలు అలా చెయ్యలేదు. వాటిలో పాత పద్ధతే ఉంది. అందువల్ల  సాయంత్రం 6 గంటల తర్వాత కంపెనీ పనివాళ్ళని ఆకంపెనీలు తన్నుకుపోతున్నాయి. తాము పూర్తిగా వాడుకోవాల్సిన పనివాళ్ళ శక్తిలో కొంత ఇది హరించివేస్తుంది.కాబట్టి చట్టాలు అందరికీ సమానంగా వర్తింపచెయ్యాలి. ఇదీ వాళ్ళ వాదం.
లండన్ లో కాగితంపెట్టెలూ, సంచులూ చేసే సింప్సన్ పిల్లల నియామకం మీద కమిషన్ కి ఇలా చెప్పాడు:తన ఫాక్టరీ మూశాక కూడా, ఇతరులు పనిచేస్తూ తన ఆర్డర్లను తన్నుకు పోతున్నారేమోనని రాత్రుళ్ళు ప్రశాంతత లేకుండా పోయింది.
పోటీ పరిస్థితులగురించి కమిషన్ అభిప్ర్రాయం
కమిషన్ ఇలాచెప్పింది: చిన్న వాటిలో పనిగంటలకు పరిమితిలేనప్పుడు పెద్దవాటిలో పరిమితిపెట్టడం అన్యాయమే. అలాచెయ్యడం వల్ల పోటీ పరిస్థితులు అందరికీ ఒకేరకంగా ఉండవు. పక్షపాతంతో కూడి ఉంటాయి. అంటే చిన్న కంపెనీలకు అనుకూలంగానూ, పెద్దవాటికి ప్రతికూలంగానూ ఉంటాయి.
చివరి నివేదికలో 14 లక్షల మంది పిల్లల్నీ, స్త్రీలనీ చట్టం పరిధిలో పెట్టాలని ప్రతిపాదించింది. వీళ్ళలో సగం మంది చిన్న పరిశ్రమల్లోనూ, గృహ పనుల్లోనూ ఉన్నారు.చట్టాన్ని వర్తింపజేస్తే, పనిగంటలు తగ్గుతాయి, క్రమబద్ధంగా ఉంటాయి. రాబోయే తరానికి  చిన్నప్పుడే తలకు మించిన పని చేసి, శారీరకంగా దెబ్బతిని, క్షీణించకుండా రక్షణ కలుగుతుంది. కనీసం 13 ఏళ్ళు వచ్చే వరకూ పిల్లలకు చదువుకునే అవకాశం కలుగుతుంది. పరమ  అజ్ఞానం అంతమౌతుంది. ఇదీ  కమిషన్ అభిప్రాయం. అందువల్ల కమిషన్ చట్టాల వర్తింపుని ప్రతిపాదించింది.
పార్లమెంటులో బిల్లులు
కమిషన్ సిఫార్సులకి అనుగుణంగా బిల్లులు తయారు చేసినట్లు 1867 ఫిబ్రవరి 5 టోరీ మంత్రిమండలి రాజు ఉపన్యాసంలో ప్రకటించింది.  
1840 లోనే పిల్లల శ్రమగురించి కమిషన్ వచ్చింది.1842 ళో నివేదిక ఇచ్చింది.అది యజమానుల, తలిదండ్రుల దురాశ,స్వార్ధం, క్రూరత్వం గురించీ, పిల్లల దైన్యం, పతనం, వినాశం గురించీ భయంకమైన చిత్రాన్ని చూపించింది - అన్నాడు సీనియర్. అదంతా పాతకాలం పరిస్థితి అనుకునే అవకాశం ఉంది. కాని ఇప్పుడు కూడా అటువంటి భయంకర కృత్యాలు అంత తీవ్రంగానూ కొనసాగుతున్నాయి.
హార్డ్ విక్ లో వెలువడిన  కరపత్రం
1842 లో ఫిర్యాదు చెసిన అకృత్యాలు ఈరోజుకీ జరుగుతూనే ఉన్నయంటూ  రెండేళ్ళ క్రిదట హార్డ్ విక్ లో ఒక కరపత్రం విడుదలయింది. కరపత్రం 20 ఏళ్ళ పాటు లెక్కలోకి రాలేదు. అంటే పిల్లల ఆరోగ్యం, నీతి ఎంతగా నిర్లక్ష్యం చేయబడిందనడానికి ఇంతకన్నా ఏం రుజువు కావాలి?
1862 నివేదికని పక్కకి నెట్టడం పార్లమెంట్ కి సాధ్యం కాలేదు
అయితే ఆనాడు 1842 కమిషన్ నివేదికని పట్టించుకోనట్లు, ఈనాడు 1862 కమిషన్ నివేదికని పక్కనబెట్టడం వీలుకాలేదు.కారణం పరిస్థితులు మారిపోవడమే. 1864 లో కమిషన్ నివేదికల్లో ఒక భాగాన్ని మాత్రమే విడుదల చేసింది. చేసిందో లేదో వెంటనే, మట్టి పాత్రలు,అగ్గిపుల్లలు, అలంకరణ కాగితాలు, తూటాలు,టోపీలు,తయారుచేసే పనివాళ్ళకి జౌళి  పరిశ్రమల్లో పనివాళ్ళకున్న చట్టాలనే వర్తింపచేశారు. 1866 లో కమిషన్ పని పూర్తయింది.ఆనివేదికలో ఉన్నత్లు బిల్లులు పెట్టబోతున్నట్లు 1867 ఫిబ్రవరి 5 రాజు నోట మంత్రిమండలి ప్రకటించింది. 1867 ఆగష్టు 15 ఫాక్టరీ చట్టాల విస్తరణ చట్టమూ,21 వర్క్ షాపుల నియంత్రణ చట్టమూ పార్లమెంటు ఆమోదం పొందాయి. మొదటిది పెద్దపరిశ్రమలకూ, రెండోది చిన్న పరిశ్రమలకూ వర్తిస్తాయి.
చట్టాల అమలు పెద్ద సమస్య
పెద్ద సంస్థలకు వర్తించే మొదటి చట్టం అనేక కుటిల మినహాయింపుల వల్లనూ, పిరికితనంతో యజమానులతో కుదుర్చుకున్న రాజీల వల్లనూ వెనకడుకు వేసింది.ఇక రెండో చట్టం - వర్క్ షాపుల నియంత్రణ చట్టం - లోని వివరాలు సరిగా లేవు. పోతే దాన్ని అమలు చేసే అధికారం మునిసిపల్, స్థానిక అధికారులది.వాళ్ళు చట్టాన్ని బుట్టదాఖలు చేశారు.వాళ్ళ కిచ్చిన అధికారాన్ని 1871 లో పార్లమెంటు ఫాక్టరీ ఇన్స్పెక్టర్లకు దఖలు పరిచింది. లక్ష వర్క్ షాపుల్నీ, 300 ఇటుక బట్టీల్నీ ఇన్స్పెక్టర్ల అధికారం కిందికి తెచ్చింది. కాని అప్పటికే సిబ్బంది సరిపడా లేరు. ఉన్నవాళ్ళకి 8 మంది సహాయకులను మాత్రమే ఇచ్చి పార్లమెంటు జాగ్రత్తపడింది. 1867 నాటి చట్టాల్లో కొట్టొచ్చినట్టు కనబడేదేమంటే: ఒకవైపు, పెట్టుబడిదారీ దోపిడీ అకృత్యాలకు వ్యతిరేకంగా అసాధారణమైన స్థాయిలో చర్యలు సూత్ర రీత్యా తీసుకోవాల్సిన  ఆవశ్యకత పాలక వర్గాల పార్లమెంటుపైన పడింది.మరొకవైపు, చర్యల అమలులో సంకోచమూ, విముఖతా,ద్రోహబుద్ధీ ప్రదర్శించింది. ఫలితంగా చట్టాలు వస్తాయి,కాని వాటిని సక్రమంగా అమలుచేసే ఉద్దేశ్యం ఉండదు.
తనిఖీ సిబ్బంది తగినంత మంది  లేనందువల్ల ఫాక్టరీ చట్టం ఇప్పటికీ ఇంగ్లిష్ వర్క్ షాపుల్లో చాలా వరకూ అమలు కావడం లేదు అన్నాడు ఎంగెల్స్.
గని పరిశ్రమ
గని పరిశ్రమ తక్కిన వాటి వంటిది కాదు. ఇక్కడ భూస్వామి ప్రయోజనాలూ, పెట్టుబదిదారుడి ప్రయోజనాలూ చెట్టాపట్టాలేసుకొని ఉంటాయి. ఇదే మిగిలిన వాటినుండి ఈ పరిశ్రమని వేరు పరిచే లక్షణం. పార్లమెంటు 1842 గని తవ్వకం చట్టం తెచ్చింది. భూగర్భ పనులకు స్త్రీలనీ, పదేళ్ళ లోపు పిల్లలనీ పెట్టుకోకూడదు. ఈ ఒక్క నిబంధనతోనే చట్టం సరిపెట్టుకుంది.1860 గనుల తనిఖీ చట్టం ప్రకారం కొన్ని గంటలపాటు బడికి వెళితే తప్ప 10-12 ఏళ్ల పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు. అయితే తనిఖీ అధికారులు అతిహీనమైన సంఖ్యలో ఉన్నందువల్లా, వాళ్ళకున్న అధికారాలు అత్యంత అల్పంగా ఉన్నందువల్లా ఆ చట్టం వుండికూడా లేనట్లే అనిపించింది.  1872 చట్టం లోపభూయిష్ట మైనది. అయినా గనుల్లో పనిచేసే పిల్లల పనిగంటల్నినియంత్రించిన మొదటి  చట్టం అదే. జరిగే ప్రమాదాలకు యజమానుల్ని కొంతవరకూ బాధ్యులని చేసిన చట్టం కూడా అదే.
చట్టాలను వ్యవసాయానికి వర్తింపచేసే ప్రయత్నాలు
ఫాక్టరీ చట్టాలను సవరించి వ్యవసాయానికి కూడా అమలు చెయ్యాలని పలు ప్రయత్నాలు జరిగాయి. కాని అవన్నీ పూర్తిగా విఫలమయ్యాయి. అయినా ఆసూత్రాల్ని సర్వత్రా అన్వయింపచెయ్యాలి అనే ధోరణి ఉంది. ఈ వాస్తవాన్ని మన దృష్టికి తేవడం తన ఉద్దేశ్యం అంటాడు మార్క్స్.
ఫాక్టరీ చట్టాల్ని అన్ని పరిశ్రమలకీ విస్తరింపచెయ్యడం వల్ల ఫలితాలు
కార్మికవర్గ రక్షణ -శరీర పరంగానూ,మానసిక పరంగానూ-అనివార్యం అయింది. అయితే మరొకపక్క, వాటి విస్తరణ విడివిడిగా ఉన్న అనేక చిన్న పరిశ్రమలు, కొన్ని పెద్దస్థాయి పరిశ్రమలుగా మారడాన్ని వేగిరపరుస్తుంది; అందువల్ల అది పెట్టుబడి కేంద్రీకరణనీ,ఫాక్టరీ వ్యవస్థ యొక్క ప్రత్యేక ప్రాధాన్యతనీ వేగవంతం చేస్తుంది.పెట్టుబడి ఆధిపత్యాన్ని కొంత దాచిఉంచుతున్న ప్రాచీన రూపాల్నీ, పరివర్తన చెందుతున్న రూపాల్నీ ధ్వంసం చేస్తుంది. ధ్వంసంచేసి వాటి స్థానంలో ప్రత్యక్షమైన, బాహాటమైన పెట్టుబడి అధికారాన్ని స్థాపిస్తుంది; అయితే అలా చెయ్యడం ద్వారా అది (చట్టాల విస్తరణ) అధికారానికి  సూటి వ్యతిరేకతని కూడా సర్వ సాధారణం చేస్తుంది. ప్రతి విడి వర్క్ షాప్ లోనూ కరూపతనీ, క్రమబద్ధతనీ, నియమబద్ధతనీ, పొదుపునీ  అమలు పరుస్తుంది; అదే సమయంలో, పనిదినాన్ని పరిమితపరచడం వల్లా, క్రమబద్ధం చెయ్యడం వల్లా సాంకేతిక మెరుగుదలకు పెద్ద ప్రేరణ కలిగిస్తుంది. ప్రేరణ ద్వారా అది మొత్తంగా పెట్టుబడిదారీ ఉత్పత్తి యొక్క అరాచకత్వాన్నీ, ఉపద్రవాల్నీ, శ్రమ తీవ్రతనీ, కార్మికునితో యంత్రాల పోటీనీ పెంచుతుంది. చిన్నచిన్న పరిశ్రమల్నీ, గృహపరిశ్రమల్నీ ధ్వంసం చెయ్యడంద్వారా 'అక్కరలేని జనాభా'కి ఆఖరి ఆశ్రయాన్ని(last resort) సైతం లేకుండా ధ్వంసం చేస్తుంది. దాంతో మొత్తం సమాజ యంత్రాంగానికి మిగిలివున్న  ఏకైక రక్షణ మార్గాన్ని (safty valve) లేకుండా చేస్తుంది. భౌతిక పరిస్థితుల్నీ,సామాజిక స్థాయిలో ఉత్పత్తి ప్రక్రియల కలయికని పరిపక్వం చేస్తుంది
తద్వారా పెట్టుబడిదారీ ఉత్పత్తి రూపంలో ఉన్న వైరుధ్యాల్నీ, వైషమ్యాల్నీ పక్వానికి తెస్తుంది.అలా పక్వానికి తెచ్చి,తద్వారా నూతన సామాజం రూపొందించే అంశాలతో పాటు, పాత సమాజాన్ని బద్దలుకొట్టే శక్తుల్ని కూడా సమకూరుస్తుంది.    
వచ్చే పోస్ట్: ఆధునిక పరిశ్రమా - వ్యవసాయమూ





1 కామెంట్‌:

  1. బ్రహ్మచారిగారు చాలా కష్టపడుతున్నారు. ఇది సాధారణ స్థాయిగల వ్యక్తులకు సరళంగా అర్ధం చేసుకోవటానికి తోడ్పడుతుంది.

    రిప్లయితొలగించండి