16, డిసెంబర్ 2017, శనివారం

శ్రమ శక్తి సరుకు- అదనపువిలువసిద్ధాంతానికి ఆధారపీఠం ఇదే

      శ్రమ శక్తి సరుకు, శ్రమ కాదు మార్క్స్ ఆవిష్కరణ
          అదనపువిలువసిద్ధాంతానికి ఆధారపీఠం ఇదే
ఉత్పత్తయిన సరుకు  విలువలో ఒకభాగం శ్రామికుడికి వస్తుంది. రెండో భాగం పెట్టుబడిదారుడికి పోతుంది.
మార్క్స్ కి ముందు ఆర్దికవేత్తలకు ఈవిషయం తెలుసు. ఈ రెండో భాగం పెట్టుబడి దారుడు ఏమీ చెల్లించని  భాగం అని కూడా తెలుసు. అంతకన్నా ముందుకు పోలేకపోయారు. అంటే, చెల్లించని భాగాన్ని ఎలా స్వాధీనం చేసుకోగలరో వివరించ లేకపోయారు- వాళ్ళే ప్రతిపాదించిన విలువ నియమం ప్రాతిపదికమీద.
అప్పటికి శ్రమ సరుకనీ కార్మికుడు తన శ్రమని అమ్ముతున్నాడనీ, పెట్టుబడిదారుడు కొంటున్నాడనీ అనుకున్నారు. శ్రమ  అనేది సరుకు అనుకుని  పరిశోధనని అంతకన్నా  ముందుకు తీసుకుపోలేకపోయారు.
శ్రమే విలువకి ఏకైక వనరు అయితే ఈ రెండోభాగం కూడా శ్రామికుడికే రావాలి. కాని రావట్లేదు. పెట్టుబడి దారుడికి పోతున్నది. ఎందుకు పోతున్నదో విలువ నియమం ప్రకారం వాళ్ళు రుజువు చెయ్యలేకపోయారు. సోషలిష్టులు – ఈ పంపిణీ అన్యాయం అన్నారు. ఈ అన్యాయాన్ని రూపు మాపేందుకు మార్గాలు ఊహాత్మకంగా వెదికారు.
శ్రమ సరుకు అని ఎందుకనుకున్నారు?
శ్రమ సరుకు అయినట్లు కనిపిస్తుంది. అమ్మిన శ్రామికుడూ కొన్న పెట్టుబడిదారుడూ మారకం అయిన సరుకు శ్రమ అనుకుంటారు. ఎందుకో చూద్దాం.
1.పరిస్థితుల్ని బట్టి పనిదినం 8,10,12 గంటలుగా ఉంటుంది.
పనిదినం ఇన్ని గంటలు అని కార్మికుడికి తెలుసు. కూలీ ఎంతో కూడా తెలుసు. దాన్నిబట్టి గంట శ్రమకి ఇంత అని లెక్కించుకుంటాడు. 10 గంటలు పనిచేస్తే రు.400 తీసుకునే వాడికి గంట శ్రమ విలువ రు.40 అనుకోవడం సహజమే.  చేసిన శ్రమ పరిమాణాన్ని బట్టి అతని వేతనం ఉంటుంది. కనుక తను అమ్ముతున్నది ‘శ్రమని’ అనుకుంటాడు.
2. తను సరుకుని ఇచ్చే తీరుని బట్టికూడా అమ్ముతున్నది శ్రమని అనుకుంటాడు. శ్రమ చేశాకనే వేతనం వస్తుంది. అందువల్ల చేసిన శ్రమకి వేతనం వచ్చింది అనిపిస్తుంది. పెట్టుబడిదారుడికి ఇది సరిపోయింది.
 “ తాను తన కార్మికుల శ్రమను కొంటున్నాననీ, డబ్బు చెల్లిస్తున్నాననీ అనుకునే పారిశ్రామికుని ఆనాటి అవగాహనను పారిశ్రామిక ఆచరణ నుండి  సాంప్రదాయిక అర్ధశాస్త్రం స్వీకరించింది” -వేతన శ్రమా పెట్టుబడీ –సం.ర 1.పే.83-84.ఆర్ధికవేత్తలు విషయాన్ని లోతుగా పరిశీలించకుండా అప్పటికి వాడుకలో ఉన్న శ్రమవిలువ అనే పదాన్ని అదే అర్ధంలో తీసుకున్నారు. ఆ ప్రకారం విశ్లేషణ కొనసాగించారు.వాళ్ళకి చిక్కేర్పడింది.                             శ్రమ సరుకయితే, శ్రమ విలువని నిర్ణయించాలి. వాళ్ళు ఈపనికి పూనుకోలేదు.                 
 పూనుకున్నా, ఇది నిర్ణయమయ్యేది కాదు. ఎందుకో చూద్దాం.
ఏసరుకు విలువనైనా నిర్ణయించేది ఎలా? దానిలో ఉన్న అవసర శ్రమ చేత. అన్నివిలువలకూ కొలమానం శ్రమ. అయినప్పుడు శ్రమ విలువని కూడా శ్రమలోనే చెప్పాలి. దీని ప్రకారం అయితే
1 గంట శ్రమ = 1 గంట శ్రమ అనాలి.
ఒకగంట శ్రమ ఒక గంట శ్రమకి సమానం అని చెబితే అర్ధం ఉండదు. అది పునరుక్తి, పైగా అర్ధరహిత వ్యక్తీకరణ. ఎందుకంటే, వస్తువులకు విలువని ఏర్పరచేది, స్వయంగా విలువని కలిగి ఉండదు.
“ఏకైక విలువ ప్రమాణం..సకలసంపద సృష్టికర్త అయిన శ్రమ సరుకు కాదు.” –హాడ్జ్ స్కిన్-కాపిటల్1.503 ఫుట్ నోట్.
తనకన్నా ముందు ఈ విషయాన్ని గమనించిన పేరుతెలియని వ్యక్తి ని కోట్ చేస్తాడు: “ శ్రమని సరుకు అన్నారంటే, అది మొదట ఉత్పత్తిచేయ్యబడి, మార్కెట్లో ఉన్న సరుకులతో మారకంకోసం మార్కెట్ కి తేబడిన సరుకు వంటిది కాదు; మార్కెట్లోకి తేబడినప్పుడే సృజించబడినది, లేదు అది సృజించబడకముందే మార్కెట్ కి తేబడింది.” Observations on Certain Verbal Disputes,  1821
శ్రమ సరుకుగా మార్కెట్లో అమ్మబడాలంటే, అమ్మకానికి ముందే అది ఉండాలి. శ్రామికుడు శ్రమకి స్వతంత్ర మనుగడ ఇవ్వగలిగితే అతను సరుకునే అమ్ముతాడు, శ్రమని అమ్మడు.
మార్కెట్ కొచ్చేఇతర  సరుకులన్నీ ముందే ఉత్పత్తయినవి. శ్రమ ఉత్పత్తి కాకముందే మార్కెట్ కొస్తుంది.
“శ్రమ దానికదిగా(labour as such) సరుకు కాదు.ఎందుకంటే, సరుకనేది .... వస్తువుగా అయిన శ్రమ ఒక ఉపయోగపు విలువలో చేరిన శ్రమ.”–Manuscripts of 1861-63.  

ఎంగెల్స్ కాపిటల్ 2 ముందుమాటలో ఇలా చెబుతాడు:
“ విలువ కలిగి ఉన్నది శ్రమ కాదు. విలువను సృజించే చర్యగా అది(శ్రమ) విలువని కలిగి ఉండజాలదు. గురుత్వాకర్షణ  ప్రత్యేక బరువునూ, ఉష్ణం ప్రత్యేక ఉష్ణోగ్రతనీ, విద్యుత్తు ప్రత్యేక ప్రసరణ బలాన్నీఎలా  కలిగి ఉండవో అలాగే.”- కాపిటల్ 2. పే18-19
దీన్నిబట్టి శ్రమకి విలువకట్టడం వీలుకాదు. శ్రమకి విలువ వుండదు. అది సరుకు కాదు.
సరుకు కాని శ్రమని సరుకు అనుకున్నందువల్ల సమాన విలువల మారకం మీద అదనపు విలువని రుజువు చెయ్యడం వాళ్లకి సాధ్యపడలేదు. సోషలిస్టులు అసమాన మారకాన్ని ఆశ్రయించారు. ఇరువురూ శాస్త్ర పద్ధతిని పాటించలేదు.

అప్పుడు మార్క్స్ రంగం మీదికొచ్చాడు.
సమాన విలువల మారకం జరుగుతూనే, అదనపువిలువ పెట్టుబదిదారుడికి వస్తుంది అనేదాన్ని రుజువు చేసే పని మార్క్స్ కి పడింది. పరిశోధన కొనసాగించాడు. శ్రమకు విలువ లేదు. అదిసరుకు కాదు.
సరుకు కాకపొతే శ్రమ ఏమిటి?
పెట్టుబడిదారుడు శ్రమ చేయించుకోడానికి డబ్బిస్తున్నాడు. అంటే ఎదో సరుకుని కొంటున్నాడు. ఇప్పుడు శ్రమ సరుకు కాదని తేలింది. కనుక అతను కొంటున్న సరుకు శ్రమ కాదు. కాని అది కచ్చితంగా మరేదో సరుకు. మరయితే శ్రమ ఏమిటి? అతను కొనే సరుకు యొక్క ఉపయోగపు విలువ. శ్రమ అనే ఉపయోగపు విలువ కోసం ఎదో సరుకును కొంటున్నాడు.
 పెట్టుబడిదారుడు కార్మికుని వద్ద కొంటున్న సరుకేమిటి?
పరిశోధనలో ముందడుగు వేశాడు.  థామస్ హాబ్స్ తన లెవియాథాన్ పుస్తకం (1839-44) లో రాసిన మాటలు గమనించాడు:
"ఒక మనిషి విలువ …. అన్ని యితర వస్తువుల విషయంలో లాగానే అతని ధర; అంటేఅతని శక్తిని వుపయోగించుకునేందుకు ఎంత ఇవ్వబడుతుందో అంతన్నమాట" (కాపిటల్ 1, పే. 167, ఫుట్ నోట్ 2)
“మనిషి శ్రమ ” (అంటే అతని శ్రమించేశక్తి) “కూడా, మారకంఅయ్యే సరుకే –ప్రతి ఇతర వస్తువులాగే.” (Theories of Surplus Value 1.353)  
“ఆయన తర్వాతివారు ఈ ఆవిష్కరణని గమనించలేదు” అంటాడు మార్క్స్ (వేతనం,ధరలాభం, మార్క్స్ ఎంగెల్స్ సంకలిత రచనలు, భాగం 2 పే. 46).
మార్క్స్ దాన్ని గమనించాడు.
శ్రమ అనేది చలనంలో శ్రమశక్తి. శ్రమశక్తి అనే సరుకు ఉపయోగపు విలువ.
“రికార్డో శ్రామికుడు సరుకుగా అమ్మే..., శ్రమ సామర్ధ్యానికీ, ఈ సామర్ధ్యం యొక్క ఉపయోగం అయిన శ్రమకీ మధ్య వున్నా తేడాని చూడలేదు.” అన్నాడు మార్క్స్ –Manuscripts of 1861-63.  
అయితే ఉపయోగపువిలువ  ఉన్నంత మాత్రాన ఏదీ సరుకు కాదు. విలువ కూడా ఉండాలి. సరుకు ఉపయోగపువిలువ, విలువల సమ్మేళనం. శ్రమవిలువ నిర్ణయించబడదు. కనుక అది సరుకు కాదు అని తేలింది.                                                                                                                                                              మరి శ్రమశక్తి విలువ నిర్ణయమవుతుందా?                                                                                                                 అన్ని ఇతర సరుకులకు ఉన్నట్లే దానికీవిలువ వుంది.  అన్ని ఇతర సరుకుల విలువ నిర్ణయమైనట్లే, అంటే దాని ఉత్పత్తికి అవసరమైన శ్రమ కాలం చేత, నిర్ణయమవుతుంది.
 “శ్రమశక్తి యొక్క విలువ శ్రమ శక్తిని సృష్టించడానికీ, అభివృద్ధి చెయ్యడానికీ, పోషించడానికీ, కొనసాగించడానికీ కావలసిన జీవితావసరాల విలువచేత నిర్ణయించ బడుతుంది- ‘వేతనం, ధరలాభం’, మార్క్స్ ఎంగెల్స్ సంకలిత రచనలు, భాగం 2 పే.48
ఆవిధంగానిర్వచించబడిన దాని విలువ ఆధారంగా జరిగే శ్రమశక్తి కొనుగోలూ, అమ్మకమూ విలువ నియమాన్ని వ్యతిరేకించదు.  ఎంగెల్స్ ముందుమాట– కాపిటల్ 2. పే18-19
సరుకుగా అమ్మేదీ, కొనేదీ శ్రమని కాదు, శ్రమశక్తిని  అని తేల్చాడు
1857-58 మాన్యు స్క్రిప్ట్ లో మార్క్స్ శ్రమ శక్తి అనే సరుకు విశ్లేషణ మొదలుపెట్టాడు. 1850 దశకంలోనూ తొలి1860 లలోనూ ఆయన శ్రమ సామర్ధ్యం (labour capacity) అనే మాట ముఖ్యంగా వాడాడు. అయితే కొన్ని సందర్భాల్లో శ్రమ శక్తి (labour power) అన్నాడు. కాపిటల్ మొదటి సంపుటం 6 వ విభాగంలో రెండు మాటల్నీ ఒకే అర్ధంలో వాడాడు:
” శ్రమ శక్తి అన్నా, శ్రమచేసే సామర్ధ్యం అన్నా మనిషిలో ఉన్న, ఏదయినా ఉపయోగపు విలువను ఉత్పత్తి చేసేటప్పుడు అతను వినియోగించే మానసిక శారీరక శక్తుల మొత్తం “ .....అని అర్ధం చేసుకోవాలి. అన్నాడు- cap1.167
శ్రమశక్తి సరుకు అని ఎన్నోచోట్ల చెబుతాడు.
వేతనశ్రమా- పెట్టుబడీ లో మార్క్స్ ఇలా అంటాడు: “శ్రమశక్తి అనేది ఒక సరుకు చక్కెర ఎలాగో అలాగే.”- సంకలిత రచనలు 1.పేజీ94
“శ్రమశక్తి అనేది దాని సొంతదారుడైన వేతన కార్మికుడు పెట్టుబడికి అమ్మే సరుకు.” సం. ర 1.పేజీ 95
 “శ్రమ కొనుగోలూ ..... ఈ పద్మవ్యూహం నుండి బయటకు దారి కనుక్కున్నవాడు కార్ల్ మార్క్స్ “-87
సరుకు శ్రమ కాదు శ్రమ శక్తి అని ఆవిష్కరించడం ద్వారా. కనుక మార్క్స్ అర్ధశాస్త్రానికి అదనపు విలువ సిద్ధాంతం ఆధారం. అదనపు విలువకి శ్రమశక్తి సరుకు అనేది అటువంటి ఆధారమే. కాబట్టి, శ్రమశక్తి సరుకు అనే అవగాహన మార్క్స్అర్ధశాస్త్రానికి ఆధారం.
“అత్యుత్తమ అర్ధశాస్త్రజ్ఞులు శ్రమ విలువ వద్ద బయలుదేరినంతకాలం ఏ యిబ్బంది మూలంగా దుఃఖ భాజనులయ్యారో అది మనం శ్రమశక్తి వద్ద బయలుదేరిన వెంటనే అదృశ్యమవుతుంది” ఎంగెల్స్ –ముందుమాట ‘వేతన శ్రమా పెట్టుబడీ’ –సం.ర 1.పే.89
ఎందుకంటే శ్రమ శక్తి సరుకే, అయినా విశిష్టమైన సరుకు
అన్ని ఇతర సరుకుల్లాగే శ్రమశక్తి ఒక సరుకు. కానీ విశిష్టమైన సరుకు. విలువని సృజించే సరుకు. సరిగా వాడుకుంటే తన విలువను మించిన విలువని సృజిస్తుంది. అందువల్లే అది మామూలు సరుకు కాదు, విశిష్టమైన సరుకు.
శ్రమశక్తి కూడా అన్ని సరుకుల్లాంటి సరుకే. అన్నిటిలాగే అదికూడా  ఉపయోగపువిలువ, విలువల సమ్మేళనమే. అయినా ఇది మిగిలిన సరుకులకన్నా విభిన్నమైనది, విశిష్టమైనది.డబ్బులాగే మామూలు సరుకూ, విశిష్టమైన సరుకూ. “డబ్బు విశిష్ట స్వభావం... అన్ని సరుకులూ తమకు భిన్నమైన సరుకుగా ఎన్నుకున్నందువల్ల ఏర్పడుతుంది.” శ్రమ శక్తి విశిష్ట స్వభావం “దాని ఉపయోగపువిలువ వల్ల  ఏర్పడుతుంది.”- Manuscripts of 1861-63
ఒక సరుకు ఉపయోగపు విలువ, విలువని ఉత్పత్తిచేయ్యడం అయితేనే తప్ప విలువ పెరగడం సాధ్యమవదు. అలాంటి ఉపయోగపు విలువ శ్రమ శక్తి అనే సరుకుకి మాత్రమే ఉంది. ఎందుకంటే తనవిలువని సృజించిన తర్వాతకూడా కొన్నిగంటలశ్రమ కలపగలదు, అదనపు విలువను సృజించగలదు. కనుక ఉత్పాదితాన్ని అమ్మకముందే అందులో అదనపు విలువ ఉంటుంది. అలాకానట్లయితే మారకంలో అది రాదు.
అదనపు విలువ మారకంలో రావాలంటే, మారకానికి ముందే అది ఉంది ఉండాలి- డ-స-డ ఫార్ములా లో కనబడని చర్య ఫలితం అయి ఉండాలి.- “లాభం ...మారకంలో ఏర్పడదు. అంతకు ముందే ఉండి ఉండకకపోతే ఆ లావాదేవీ తర్వాతకూడా ఉండదు.”- Capital 1.165 రాంసే 1836
పెట్టుబడిదారుడు మొదట  కొన్న సరుకుల విలువకి సమాన విలువగల డబ్బు చెల్లిస్తాడు. చివరలో  అతను అమ్మిన సరుకుకు సమాన విలువ గల డబ్బు తీసుకుంటాడు. అయితే ఈ తీసుకునే డబ్బు మొదట అతను పెట్టిన డబ్బు కంటే ఎక్కువ. ఈ ఎక్కువ మారకం వల్ల ఏర్పడింది కాదు. శ్రామికుని శ్రమ కలిసినందువల్ల. ఈ కలిసిన శ్రమ అతను చెల్లించిన శ్రమకన్నా ఎక్కువ. కలిసిన విలువలో శ్రమ శక్తి విలువకు తోడు అదనపు విలువ కూడా ఉంటుంది. అందువల్ల శ్రమశక్తి విలువ చెల్లించినా, చెల్లించకుండానే కొంత శ్రమ పెట్టుబడిదారుడికి చేరుతుంది. ఉన్నవిలువకే తన సరుకు అమ్ముతాడు. అందులో రెండు భాగాలుంటాయి: ఒకటి శ్రమశక్తి విలువ, రెండు అదనపు విలువ. వీటిలో  శ్రమ శక్తి విలువ శ్రామికునికి, అదనపు విలువ పెట్టుబడి దారునికి.
ఆవిధంగా అదనపు విలువని విలువనియమాన్ని-సమానకాల మారకాన్ని- సమన్వయపరిచాడు.
ఈ ఫీట్ ని సాధ్యపరిచింది  శ్రమ శక్తి సరుకు అనే ఆవిష్కరణే. మార్క్స్ అదనపువిలువ సిద్దాంతానికి ఈ ఆవిష్కరణ ఆధార పీఠం.  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి