1, డిసెంబర్ 2017, శుక్రవారం

సమానవిలువలే మారకమవుతున్నా, అదనపు విలువ ఎలా వస్తుంది?

సమానవిలువలే మారకమవుతున్నా, అదనపు విలువ ఎలా వస్తుంది?
ఇదీ  సమస్య.మార్క్స్ ముందు  అర్ధశాస్త్రజ్ఞులు పరిష్కరించలేక పోయిన సమస్య ఇదే.
మార్క్స్ సమస్య అదనపు విలువ ఉన్నదని కనుక్కోవడం కాదు. అంత  వరకయితే స్మిత్, రికార్డోలకు తెలుసు.
స్మిత్ :”పదార్ధాలకి కార్మికుడు కలిపే విలువ .......రెండుభాగాలవుతుంది. ఒకటి వాళ్ళ వేతనాలు చెల్లిస్తుంది, రెండోది యజమాని లాభాలు చెల్లిస్తుంది.” శ్రామికులకి చెల్లించని శ్రమే లాభాలకు వనరు. ఈ వాస్తవం చెప్పారు. అంతే. అంతకన్నా ముందుకు పోలేకపోయారు. విలువ నియమాన్ని వర్తింపజేసి అదనపు విలువని వివరించ లేకపోయారు.
ఆ విలువ నియమం ఏమిటి?
ఒకసరుకు ఉత్పత్తికి అవసరమైన శ్రమకాలం దానికి విలువని నిర్ణయిస్తుంది. అంతే పరిమాణంలో శ్రమ ఉన్న సరుకుతోనే అది మారుతుంది.ఉదాహరణకి ఒక బుట్ట అల్లడానికి 1 గంట శ్రమా, ఒక నిచ్చెన చెయ్యడానికి 3గంటల శ్రమ అవసరమనుకుందాం. అప్పుడు
1 నిచ్చెన = 3 బుట్టలు 
ఆపరిమాణాల్లో అవి సమాన విలువలు. కనుక మారకం అవుతాయి.  సమాన విలువలు గల సరుకులే మారతాయి అనేదే ఆనియమం. దీన్ని మార్క్సుకి ముందున్న సాంప్రదాయ అర్ధశాస్త్రం నిర్ధారించింది. (సాంప్రదాయ అర్ధశాస్త్రం బ్రిటన్ లో విలియం పెట్టీతో(1623-1687) మొదలై రికార్డోతో(1772-1823) ముగిసింది . ఫ్రాన్స్ లో బాయిస్ గిల్బర్ట్ (1646-1714)తో మొదలై  సిస్మాండీతో ముగిసింది. వీళ్ళ పరిశోధన  150 ఏళ్ళు మించి సాగింది. వీళ్ళుబూర్జువా సమాజంలో నిజమైన ఉత్పత్తి సంబంధాల్ని శాస్త్రీయ దృష్టితో పరిశోధించారు.వీళ్ళ అర్ధశాస్త్రాన్ని మార్క్స్  సాంప్రదాయ అర్ధశాస్త్రం అన్నాడు.)
 ఈనియమాన్ని పెట్టుబడికీ, శ్రమకీ జరిగే మారకానికి వర్తింపచేస్తే
శ్రమవిలువ పూర్తిగా కార్మికుడికిస్తే మరి లాభం ఎక్కడనుంచి వస్తుందికార్మికునికి తక్కువ ఇస్తే సమాన విలువల మధ్య మారకం జరగలేదని అర్థం గదాశ్రమ విలువ సిద్ధాంతమే తప్పవుతుంది గదా? 
స్మిత్ కుదురుగా లేడు.  ఆదిమ సమాజంలో ఒక విధంగానూఆతర్వాత సమాజాల్లో వేరొక విధంగానూ సరుకు విలువ వుంటుందని స్మిత్ అభిప్రాయపడ్డాడు. ఆదిమసమాజాల్లో ఉత్పత్తిసాధనాలు ఉత్పత్తిదారుల చేతిలోనే వుంటాయి. కనక ఉత్పత్తయిన సరుకు విలువను శ్రమపరిమాణం నిర్ణయిస్తుంది. ఉత్పత్తి విలువలో కౌలూవడ్డీలాభమూ వుండవు. అందువల్ల ఆకాలంలో శ్రమ పరిమాణమే విలువను నిర్ణయిస్తుంది. అయితే భూస్వామ్యంలోపెట్టుబడిదారీ విధానంలో భూస్వామీవడ్డీ వ్యాపారీపెట్టుబడిదారూ వుత్పత్తిసాధనాలకు యజమానులుగా వుంటారు. ఉత్పత్తిదారులు వాళ్లమీద ఆధారపడాలి. ఆ పరిస్థితుల్లో ఉత్పత్తయిన సరుకు విలువ శ్రమని బట్టి మాత్రమే వుండదు. దానికి కౌలూ, వడ్డీలాభాలూ కలుస్తాయి. దీన్నిబట్టి భూస్వాములూ పెట్టుబడిదారులూ లేని సమాజానికి వర్తించిన విలువ నియమం వాళ్లు వున్న సమాజానికి వర్తించదు.
అయితే ఈ ధోరణి రికార్డోకి ఆమోదయోగ్యం కాలేదు.విలువ నియమం వంటి మౌలిక నియమంసమాజపు అభివృద్ధితో మారిపోదు. “శ్రమకాలాన్ని బట్టి విలువని నిర్ణయించటం సర్వకాలాలకూ వర్తించే సార్వత్రిక నియమంఅన్నాడు
ఆయనకొక చిక్కు వచ్చిపడింది. పెట్టుబడిదారుడు కార్మికుని శ్రమకు శ్రమవిలువ చెల్లించి చాకిరీ చేయించుకుంటున్నాడు. లాభం పొందుతున్నాడు.
శ్రమవిలువ పూర్తిగా కార్మికుడికిస్తే పెట్టుబడిదారుడికి లాభం ఎక్కడనుంచి వస్తుంది?
 కార్మికునికి తక్కువ ఇస్తే సమాన విలువల మధ్య మారకం జరగలేదని అర్థం గదా? అప్పుడు శ్రమ విలువ సిద్ధాంతమే తప్పవుతుంది గదా? 
సమాన విలువలే మారకం కావాలి, లాభం రావాలి. శాస్త్రీయంగా దీన్ని రుజువు చెయ్యలేకపోయాడు రికార్డో. ఇదే ఆయన్ని వేధించిన సమస్య. వాస్తవానికీ సూత్రానికీ మధ్య పొంతన కుదర్చలేక పోయాడు. విలువ సిద్ధాంతాన్ని వదులుకోలేకావాస్తవంగా వస్తున్న లాభాన్ని భ్రమ అనలేకా సతమతమయ్యాడాయన.అక్కడ ఆగిపోయాడు.

స్మిత్ రికార్డోల అనుయాయులు ఈనియమాన్ని అనుసరించి లాభాన్ని వివరించ లేక పోయారు. వాళ్ళు  ఆనియమాన్నే వదులుకున్నారు.
శ్రమశక్తి మారకం అసమానం కాకపోతే పెట్టుబడిదారుడికి లాభం ఎక్కడ నుండి వస్తుంది?
అసమాన విలువల మారకం
రికార్డో శిష్యుడిగా జాన్ స్టువర్ట్ మిల్ (1806-1873) శ్రమనీపెట్టుబడినీ శ్రమయొక్క వేర్వేరు రూపాలుగా నిర్వచించాడు. "శ్రమా,పెట్టుబడీ...ఒకటి ప్రస్తుత శ్రమ...మరొకటి నిల్వపడ్డ శ్రమ" అన్నాడు. తక్షణశ్రమ తక్కువ నిల్వశ్రమతో మారకమవుతుంది అని అభిప్రాయ పడ్డాడు. అసమాన విలువల మారకం అన్నమాట. ఇది విలువ నియమాన్ని భంగపరుస్తుందని అంగీకరించడమే అన్నాడుమార్క్స్ (అదనపు విలువ సిద్ధాంతాలు-3, పే. 98-99).
రికార్డియన్ సోషలిష్టుల వాదం
రికార్డియన్ సోషలిష్టులు 1820, 1830 దశకాల్లో కృషి చేశారు. అదనపు విలువకి  అసమాన మారకాన్నే పునాది ఛేశారు.
తయారైన సరుకుల్లో చేరిన విలువ మొత్తం కార్మికునికే రావాలి. అదంతా వాళ్లదే. కాని అలా రావడం లేదు. కొంత యజమానికి చేరుతున్నది. కనక అది అసమాన మారకం. ఇది రికార్డియన్ సోషలిష్టుల వాదం. రికార్డియన్ సోషలిష్టులు కార్మికుడు తన ఉత్పాదితం మొత్తానికీ హక్కుదారుడు అని వాదించారు.
మార్క్స్ పరిష్కారం
మార్క్స్ వచ్చేసరికి పరిస్థితి అది. సమాన మారకాల జరుగుతూ, అదనపు విలువ ఎలా వస్తుంది అనేది సమస్య గానే మిగిలి ఉంది. దీనికాయన పరిష్కారం చూపాడు.
శ్రామికుడికీ పెట్టుబడిదారుడికీ మధ్య మారకం మామూలు (సింపుల్) మారకమే; ఇద్దరిలో ప్రతి ఒక్కడూ సమానకాన్ని పొందుతాడు; ఒకరు డబ్బుపొందుతాడు, మరొకరు ఆడబ్బుకి సరిగ్గా సమానమయిన ధరగల సరుకు పొందుతాడు.- గ్రున్డ్రిస్
ఉత్పాదితం ఎవరికి చెందుతుంది?కార్మికునికా,పెట్టుబడిదారునికా?దీనికిచ్చే జవాబుని బట్టే జరిగిన మారకం సమాన మారకమో అసమాన మారకమో తేలుతుంది.
కార్మికునిదైతే, అసమాన మారకం. ఎందుకంటే ఉత్పాదితం దానివిలువంతా అతనికే రావాలి. రావడం లేదు. విలువలో కొంతభాగం పెట్టుబడిదారుడికి పోతున్నది. కనక అసమాన మారకం. 
ఉత్పాదితం పెట్టుబడిదారునిదైతే, సమాన మారకం.పెట్టుబడిదారీ విధానంలో అది పెట్టుబడిదారునిదే. అని పలుచోట్ల చెప్పాడు.
పెట్టుబడిదారీ స్వాయత్త విధానం సరుకు ఉత్పత్తి నియమాలను ఎంతగా తోసిపుచ్చినట్లు/ తిరస్కరిస్తున్నట్లు కనిపించినప్పటికీ, అది (ఆ స్వాయత్త విధానం) ఆనియమాల ఉల్లంఘన వల్లకాక, వాటి వర్తింపు వల్లనే తలెత్తింది –అంటాడు.

వేతనశ్రమా- పెట్టుబడీ లో మార్క్స్ ఇలా అంటాడు: “ ఉత్పత్తయిన సరుకులోగానీ, దాని ధరలో గానీ అతనికి (కార్మికుడికి) ఏమీ భాగం లేదు – మగ్గానికి లేనట్లే.”-సంకలిత రచనలు 1.పేజీ 95 
........శ్రమ యొక్క భౌతిక పరిస్థితులు తమ వశంలో  ఉన్న  ఒక వర్గమో, కొన్ని వర్గాలో,  శ్రమశక్తి తప్పమరేమీ లేని మరొక వర్గమూ ఉన్న అన్ని ఉత్పత్తి విధానాలలో- ప్రత్యేకించి పెట్టుబడిదారీ విధానంలో-  ఇందుకు భిన్నమైనది జరుగుతుంది. శ్రమ ఉత్పాదితం లేక దాని విలువ శ్రామికుడికి చెందదు.- TSV1.72
ఉత్పాదితం పెట్టుబడిదారుడికి చెందుతుంది, శ్రామికుడికి కాదు. cap1.549
శ్రామికులు మాత్రమే ఉత్పత్తిచేసిన అదనపు విలువ అనుచితంగా, అన్యాయంగా పెట్టుబడిదారుల వద్ద వుండి పోతుందిఅని మార్క్స్ అన్నట్లు వాగ్నర్ ఆరోపించాడు తాను చెప్పనిది తనకు ఆపాదించాడని  మార్జినల్ నోట్స్ లో మార్క్స్ తప్పుబట్టాడు: నిజానికినేను దీనికి సరిగ్గా వ్యతిరేకమైనది చెప్పాను: ఏమనంటేసరుకు ఉత్పత్తి ఒకానొక కాలంలో పెట్టుబడిదారీ సరుకు ఉత్పత్తిగా ఉంటుంది. ఈ పెట్టుబడిదారీ సరుకును నిర్దేశించే విలువ నియమం ప్రకారంఅదనపువిలువ తప్పనిసరిగా పెట్టుబడిదారునిదే అవుతుందికార్మికునిది కాదు. (Marx & Engels Collected works volume 24 p.558)

అలా అయితే సమాన మారకం ఎలా అవుతుంది?
పెట్టుబడి దారుడు కొన్న సరుకులలో, ఒక సరుకు  ఉపయోగపు విలువ, విలువని సృష్టించడం అయితేనే, అదికూడా తన విలువకన్నా ఎక్కువ విలువను సృష్టించడం అయితేనే అదనపు విలువ వస్తుంది-, సమాన విలువలే మారినా. అలాంటి సరుకు పెట్టుబడిదారుడికి దొరికినప్పుడే అతనికి లాభం వస్తుంది.
 మార్కెట్ లో అలాంటి సరుకు ఒకటి ఉంది. దాని ఉపయోగపు విలువ అంతా మారకపు విలువని ఉత్పత్తి చేయడమే. అలాంటి సరుకును కనుగొన్నప్పుడు మాత్రమే యీ చిక్కు సమస్య విడిపోతుంది. అలాంటి సరుకు వుంది - అదే శ్రమశక్తి.”
ఒప్పందం చేసుకున్న వారిలో ఒకరు శ్రమశక్తిని అమ్ముతారు, మరొకరు కొంటారు.అమ్మినవాడు తన సరుకు విలువని తీసుకుంటాడు. అందుచేత, ఆసరుకు ఉపయోగపు విలువ అయిన శ్రమని కొన్నవాని పరం అవుతుంది. అప్పటికే పెట్టుబడిదారుడికి చెంది ఉన్న ఉత్పత్తిసాధనాలు, అంతగానే అతనికే చెందిన శ్రమ సహాయంతో కొత్త ఉత్పాదితం/సరుకులోకి మార్చబడతాయి. కొత్త ఉత్పాదితం కూడా అదేవిధంగా చట్టరీత్యా అతనిదే........
కొత్త ఉత్పాదితం విలువలో శ్రమశక్తి  విలువకు సమానమైనది ఉంటుంది, దానికి తోడు అదనపు విలువ కూడా ఉంటుంది. ఎందుకంటే, నిర్దిష్టకాలానికి అమ్మబడిన శ్రమ శక్తి విలువ, ఆకాలంలో అది సృజించే విలువకన్నా తక్కువ.
అయితే శ్రామికుడు శ్రమశక్తి మారకంవిలువని తీసుకున్నాడు. అందువల్ల దాని ఉపయోగపువిలువని పరాధీనం చేశాడు. ప్రతి అమ్మకం, కొనుగోలులో జరిగేదిదే.( మారకం విలువ తీసుకుంటే ఉపయోగపు విలువ ఇవ్వడం. ఉపయోగపు విలువ తీసుకుంటే మారకం విలువ ఇవ్వడం.)  
శ్రమశక్తి అనే విశిష్టమైన సరుకు శ్రమ అనే ప్రత్యేకమైన ఉపయోగపు విలువని సరఫరా చేస్తుందనేదీ, అందువల్ల విలువని ఏర్పరుస్తుందనేదీ, నిజమే. అయితే ఈవాస్తవం సరుకు ఉత్పత్తికి సంబంధించిన సాధారణ నియమాన్ని ప్రభావితం చెయ్యజాలదు. అందువల్ల వేతనాలకు అడ్వాన్స్ పెట్టిన విలువ మాత్రం కాకుండా, ఉత్పాదితంలో అదనపు విలువ వల్ల పెరిగినది కూడా కనబడుతుంది. కనబడినట్లయితే, అది అమ్మినవాడు మోసగించబడి నందువల్ల కాదు.కారణం అతను నిజంగా తన సరుకు విలువ తీసుకున్నాడు. అది కేవలం కొన్నవాడు దాన్ని వాడుకున్నందు వల్ల.
మారక నియమం కోరేది:  మారకంలో  ఇచ్చి పుచ్చుకునే సరుకుల మారకం విలువలు సమానంగా ఉండడమే. వాటి ఉపయోగపు విలువలలో తేడా ఉండడమే. మారకం లావాదేవీ ముగిశాక మొదలయ్యే  సరుకు  వాడకంతో మారక నియమానికి సంబంధం ఉండదు.
ఆవిధంగా సరుకు ఉత్పత్తి ఆర్ధిక నియమాలకూ, ఆనియమాలనుండి వచ్చిన ఆస్తి హక్కుకూ  సరిగ్గా సరిపడేటట్లుగా మొదట డబ్బు పెట్టుబడిలోకి మారడం  సాధించబడింది. అయినప్పటికీ దాని ఫలితం:
1.ఉత్పాదితం పెట్టుబడిదారుడికి చెందుతుంది, శ్రామికుడికి కాదు. cap1.549
వాళ్ళ పొరపాటు
కార్మికుడు అమ్మేది శ్రమని అనుకున్నారు. శ్రమ సృజించిన విలువ మొత్తం వాళ్లు శ్రమవిలువ అనుకున్నారు. కనుక ఆవిలువంతా కార్మికునికి చెందుతుంది అనుకున్నారు.
అమ్మింది శ్రమనే అయితే అదనపు విలువ ఉండదు.కొత్తగా ఉత్పత్తయిన విలువ అంతా శ్రామికునికి చెందుతుంది. సమాన విలువలే మారతాయి గనక శ్రమ విలువ మొత్తం అతనిదవుతుంది. పెట్టుబడిదారుడికి అదనపు విలువంటూ ఏమీ ఉండదు.
అమ్ముతున్నది శ్రమని అనుకున్నఆర్ధికవేత్తలకు వాస్తవంగా వస్తున్నలాభాల్ని- సమానవిలువలే మారతాయి అనే నియమాన్ని నిలబెడుతూ – సిద్ధాంతాన్ని రూపొందించలేక పోయారు. పక్కదారులు పట్టారు.
సరుకు శ్రమశక్తి, శ్రమ కాదు

కార్మికుడు అమ్ముతున్నది శ్రమని కాదుశ్రమశక్తిని అని మార్క్స్ నిర్ధారించాడు. శ్రమశక్తి సరుకు. శ్రమ కాదుశ్రమ అనేది చలనంలో వున్న శ్రమశక్తి. కనుక శ్రమకి విలువ వుండదు. శ్రమశక్తి అనే మాట మార్క్సుకి ముందు వాడుకలో లేదు. శ్రమశక్తి విలువనే శ్రమవిలువ అనేవారు. మార్క్స్ ప్రకారం శ్రమకి విలువ వుండదు. ఎందుకంటే అది సరుకు కాదు. కనక శ్రమవిలువ అనేది అర్ధంలేని పదబంధం. శ్రమశక్తి ధర లేక విలువ పైకి శ్రమ ధరగా, విలువగా  కనిపిస్తుంది.
శ్రమవిలువ దగ్గర బయలుదేరిన సాంప్రదాయ ఆర్థికవేత్తలకు యిబ్బంది ఎదురయింది. శ్రమశక్తి దగ్గర బయలుదేరితే చిక్కు వీడిపోతుంది. శ్రమశక్తి ఒక సరుకు. అయితే అది విశిష్టమైన సరుకు. విలువను సృష్టించటం దాని ఉపయోగపు విలువ.
పెట్టుబడిదారు కార్మికుల శ్రమను డబ్బుతో కొన్నట్లు కనబడుతుంది. వాళ్లు తమ శ్రమను డబ్బుకుగాను పెట్టుబడిదారుకు అమ్ముతారు. కాని యిది పైకి కనిపించేది మాత్రమే. నిజానికి వాళ్లు అమ్మేదీఅతను కొనేదీ శ్రమశక్తిని. శ్రమవిలువ సిద్ధాంతం కేంద్రంగా రాజకీయ అర్థశాస్త్రాన్ని నిర్మించటానికి రికార్డో ప్రయత్నించాడు గాని కార్మికులు అమ్ముతున్నది శ్రమని కాదనీ శ్రమశక్తిననీ గ్రహించలేదు అంటాడు మార్క్స్.
మార్క్స్ ప్రకారం: మారకం జరిగేది కార్మికుడి శ్రమశక్తికీపెట్టుబడిదారుడి డబ్బుకీ. అది సమాన విలువల మారకమే. శ్రమశక్తిని అమ్మాక దాని ఉపయోగపువిలువ కొన్నవాడిదే. ఎంత శ్రమజరిగినా అంతా పెట్టుబడిదారుడిదే.
అసమాన మారకం (ఇచ్చేది తక్కువ పుచ్చుకునేది ఎక్కువ) వల్లనే పెట్టుబడిదారుడు అదనపు విలువ పొందుతాడు అని మార్క్స్ కి ముందు కొందరు భావించారు. ఆ వాదం శాస్త్రీయమైనది కాదనీసమాన మారకం జరుగుతూనే అదనపు విలువ ఏర్పడుతుందనీ మార్క్స్ చెప్పాడు.
వాళ్లు అనుకున్నట్టుగా మారకం జరిగేది శ్రమకీపెట్టుబడికీ కాదనీశ్రమశక్తికీ పెట్టుబడికీ అనీ శ్రమశక్తి అనే కొత్త భావనను ప్రవేశపెట్టాడు. ఆ ఆధారం మీదనే అదనపు విలువని రుజువు చేశాడు. 
శ్రామికుడు అమ్మింది సరుకులో చేరిన శ్రమని కాదు, సరుకుగా శ్రమశక్తిని – అనే వాస్తవం నుంచి పెట్టుబడిదారుడు చేసుకునే లాభం,అతను రాబట్టే అదనపువిలువ వస్తుంది.
అప్పటికి అర్థశాస్త్రంలో లేని శ్రమశక్తి అనే భావనని ప్రవేశపెట్టాడు మార్క్స్. మారకంలో ఒకవైపు డబ్బుంటేరెండోవైపున వున్నది శ్రమ శక్తి. శ్రమ అని అంతకు ముందువాళ్లు అనుకున్నారు. మార్క్స్ ప్రకారం శ్రమ సరుకు కాదు. ఇది తెలియకపోతే మార్క్స్ సిద్ధాంతం లోని అతి కీలకమైన విషయం తెలియనట్లే.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి