11, నవంబర్ 2023, శనివారం

III రవాణా ఖర్చులు

 

III రవాణా ఖర్చులు

సాధారణ నియమం: సరుకు రూపం మారేందుకు అయ్యే చలామణీ ఖర్చులు సరుక్కి విలువని కలపవు. అవి కేవలం విలువని ఒక రూపం నించి మరొకరూపానికి - డబ్బురూపం నించి సరుకురూపానికి, సరుకు రూపం నించి డబ్బురూపానికి - మార్చడానికి  అయ్యేఖర్చులు. పెట్టుబడిదారీ ఉత్పత్తిలో ఇవి వృధా ఖర్చులు. సరుకు అమ్మినప్పుడు ఇవి చేతికిరావు.

పెట్టుబడి దారుల వర్గం మొత్తం వైపునించి చూస్తే, ఈఖర్చులు అదనపు ఉత్పాదితం లేక అదనపు విలువ నించి కోసివేతే. ఒక కార్మికుడికి జీవితావసర వస్తువులు కొనుక్కోడానికి పట్టే సమయం, అతనికి పోయిన సమయం ఎట్లాగో, అట్లాగే.

అయితే రవాణా ఖర్చులు అలాంటివి కావు. చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఇక్కడ క్లుప్తంగా చెప్పాల్సి ఉంది. ఇక్కడ సరుకుల్ని వేరుపరచడం, పాక్ చెయ్యడం వంటి పనులకు అయ్యే చలామణీ ఖర్చుల వివరాల్లోకి పోవాల్సిన అవసరం లేదు.

 చలామణీలో సరుకులు ఒకచోటునించి మరొకచోటికి చేరాలి

అంటే ఉత్పత్తయిన చోటునించి వాడుకునే చోటికి రవాణా అవాలి. వినియోగదారుడి చేతికి అందాలి.  సరుకులు భౌతికంగా చోటు మారాలి. దేశ విదేశాల్లో తయారైన వస్తువులు మన మార్కెట్లలో ఉంటాయి. ఇందుకు సరుకుల భౌతిక చలనం కారణం.

భౌతిక చలనం లేకుండా కూడా సరుకుల చలామణీ జరగవచ్చు.

ఒకడు మరొకడికి అమ్మిన ఇల్లు అక్కడే ఉంటుంది.ఎక్కడికీ పోదు. పొలమూ, స్థలమూ కూడా అంతే. మారేది ఆస్తి హక్కుదారుడి పేరు మాత్రమే. * హెన్రి స్టార్చ్ (1766-1835) దీన్ని కృత్రిమ చలామణీ (fictious circulation) అన్నాడు.

సట్టా వ్యాపారంలో ఒక గోడౌన్లో ఉన్న పత్తి, దుక్క ఇనుం లాంటివి  అక్కడే ఉంటూ, అనేక మార్లు అమ్ముడవుతుంటాయి, కొనుగోలు అవుతుంటాయి. ఈ సందర్భాల్లో కదిలేది సరుకులమీద హక్కేగాని, సరుకులు కాదు.

మరొకవైపు 'ఇంకా'* అనే కొండ తెగవాళ్ళ పెద్ద  సామ్రాజ్యంలో(1438 - 1533) ఉత్పాదితం  సరుకుగా చలామణీ కాలేదు; వస్తుమార్పిడి పద్ధతిలో నైనా పంపకం లేదు. అయినప్పటికీ, రవాణా పరిశ్రమ ప్రముఖపాత్ర పోషించింది. అప్పట్లో అక్కడ మార్కెట్ వ్యవస్థ లేదు. డబ్బు తెలియదు. అయీఅ ఉత్పాత్తైన వస్తువులు అన్ని ప్రాంతాలకూ చేరాలి. అందుకోసం మంచి రవాణా సదుపాయాలు ఉండేవి.

పెట్టుబడిదారీ విధానంలో, రవాణాపరిశ్రమ చలామణీ ఖర్చులకు మూలం అయినట్లు అగుపిస్తుంది. కాని, కనపడే ఈ ప్రత్యేకరూపం సారాంశాన్ని ఇసుమంతైనా మార్చదు. అంటే రవాణా వాటి విలువకు ఏమాత్రం జతచెయ్యదు. రవాణా చార్జీ అదనంగా ఉంటుంది. అంతే. సరుకు విలువ మారదు. అంతకుముందు ఎంత ఉందో అంతే ఉంటుంది.


రవాణావల్ల సరుకుల పరిమాణాలు పెరగవు. అయితే  సరుకుల సహజ లక్షణాల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆ మార్పు, అరుదుగా తప్ప, ఆశించిన ప్రయోజనకర ఫలితం కాదు. అది అనివార్యమైన చెడుగు. ఉదాహరణకు, పళ్ళు, కూరగాయలు చెడవచ్చు. గాజు వస్తువులు పగిలిపోవచ్చు. ఇవి ఆశించిన ఫలితాలు కావు. ఆశించని చెడుగు. అలాగని అన్ని వస్తువులూ చెడవు. కొన్ని మినహాయింపులుంటాయి. ఉదాహరణకి, ఇనపసామాన్లు, స్టీల్ పాత్రలు వగయిరా.

వస్తువుల ఉపయోగపు విలువ, వినియోగంలో మాత్రమే సిద్ధిస్తుంది. వినినియోగమవాలంటే, అవి ఉత్పత్తైన చోటునించి వినియోగమయ్యే చోటుకి చేరాలి. అందుకు అదనపు ఉత్పత్తి ప్రక్రియ అవసరపడుతుంది. అదే రవాణా పరిశ్రమ. ఈ పరిశ్రమలో పెట్టిన ఉత్పాదక పెట్టుబడి రవాణా అయిన ఉత్పాదితాలకి విలువని ఏర్పరుస్తుంది - ఉత్పత్తి సాధనాల విలువనించి బదిలీ చేయడంద్వారా కొంతా, రవాణాలో జరిగిన శ్రమ కలిపిన విలువ ద్వారా కొంతా.

రవాణా ద్వారా పెరిగిన విలువలో వేతనాల భర్తీ, అదనపు విలువ భర్తీ ఉంటాయి - మొత్తం పెట్టుబడిదారీ ఉత్పత్తిలో ఉన్నట్లే. ఉదాహరణకి, 100 మంచాల రవాణాకి 2000 రూపాయల ఖర్చు అయిందనుకుందాం. ఈమొత్తం రెండు భాగాల కలయిక: 1.కార్మికుల వేతనాలు 1000 రూపాయలు

2.అదనపు విలువ 1000 రూపాయలు. 

ప్రతి ఉత్పత్తి ప్రక్రియలోనూ, శ్రమ పదార్ధాలూ, పనిముట్లూ, శ్రమశక్తీ చోటు మారుతుంటాయి

ఇందుకు మార్క్స్ రెండు ఉదారణలిస్తాడు:

1.  ఏకే గదినించి, వడికే గదిలోకి ట్రక్కులో చేరవేసే పత్తి

2.  గని అడుగు నించి పైకి తెచ్చే బొగ్గు

తయారైన వస్తువులు ఉత్పత్తైన చోటునించి, దూరంగా ఉన్న మరో చోటుకి చేర్చడం కూడ ఇలాంటిదే- కాకపోతే దీని స్థాయి పెద్దది, అంతే. అప్పుడు అవి ఉత్పత్తి రంగం నించి వినియోగరంగంలోకి ప్రవేశిస్తాయి. ఈ చలనాలు గడిస్తేనే గాని, ఉత్పాదితం వినియోగానికి రెడీ అవదు.

పైన చూపినట్లు సరుకు ఉత్పత్తికి సంబంధించిన సాధారణ నియమం వర్తిస్తుంది.ఆ నియమం ఇది: 

                  శ్రమ ఉత్పత్తిచేసే విలువకి, ఆ శ్రమ ఉత్పాదకత విలోమానుపాతంలో ఉంటుంది*

*ఒకే శ్రమ ఒకే కాలవ్యవధిలో భిన్న పరిమాణాల్లో ఉపయోగపువిలువల్ని ఉత్పత్తి చేస్తుంది. ఉత్పాదకతపెరిగితే ఎక్కువ పరిమాణంలో, తగ్గితే తక్కువ పరిమాణంలో.కాని అంతే  విలువని ఏర్పరుస్తుంది.

సాధారణంగా: శ్రమ ఉత్పాదకశక్తి పెరిగితే, ఒకవస్తువు తయారీకి పట్టే శ్రమ తగ్గి, దాని విలువ తగ్గుతుంది.అందుకు భిన్నంగా శ్రమ ఉత్పాదకశక్తి తగ్గితే, ఒకవస్తువు తయారీకి పట్టే శ్రమ పెరిగి, ఆవస్తువు విలువ పెరుగుతుంది.

ఒకసరుకు విలువ పరిమాణం ఆసరుకులో ఇమిడివున్న శ్రమ మొత్తానికి అనులోమంగానూ, ఆశ్రమ ఉత్పాదకశక్తికి విలోమంగానూ మారుతుంది. అంటే శ్రమ ఎంత పెరిగితే విలువ అంత పెరుగుతుంది.  ఉత్పాదకత ఎంత పెరిగితే సరుకు విలువ అంత తగ్గుతుంది.-Cap 1 p48

 

 ఇది రవాణా పరిశ్రమకి కూడ వర్తిస్తుంది. ఏ ఇతర పరిశ్రమకైనా వర్తిస్తుంది. కాబట్టి ఇది సాధారణ నియమం. దీనర్ధం:

ఒకానొక దూరానికి సరుకుల రవాణా ఖర్చు తగ్గితే, అంటే, రవాణాకి పట్టే సజీవ నిర్జీవ శ్రమ తగ్గితే, శ్రమ ఉత్పాదకత పెరిగినట్లు; అది పెరిగితే ఇది తగ్గినట్లు.

        మిగిలిన విషయాలన్నీ మారకుండా ఉన్నప్పుడు:

1. సరుకు విలువకు రవాణా కలిపే విలువపరిమాణం, ఆ పరిశ్రమ ఉత్పాదక శక్తికి విలోమానుపాతంలో ఉంటుంది; అంటే పరిశ్రమ ఉత్పాదకత పెరిగితే సరుకు విలువ తగ్గుతుంది. ఉత్పాదకత తగ్గితే సరుకు విలువ పెరుగుతుంది.

2. సరుకుల్ని తరలించే దూరానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే అది పెరిగితే ఇదీ పెరుగుతుంది, అది తగ్గితే ఇదీ తగ్గుతుంది.

3. రవాణావల్ల సరుకుల ధరలకు కలిసేది:

A. ఆ సరుకుల పరిమాణానికీ, బరువుకీ అనులోమానుపాతంలో ఉంటుంది. బరువూ, పరిమాణమూ పెరిగితే రవాణావల్ల సరుకులకు కలిసే విలువ పెరుగుతుంది; అవి తగ్గితే ఇదీ తగ్గుతుంది.

B. వాటి విలువకి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే వాటి విలువ పెరిగితే రవాణావల్ల సరుకులకు కలిసే విలువ తగ్గుతుంది. వాటి విలువ తగ్గితే రవాణావల్ల సరుకులకు కలిసే విలువ పెరుగుతుంది.

అయితే వీటిని సవరించే అంశాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి రవాణా విషయంలో కొద్దో గొప్పో ముఖ్యమైన ముందు జాగ్రత్తలు అవసరం. రవాణా అయ్యే వస్తువులు ఎంత బలహీనమైనవి, ఎంత త్వరగా చెడిపోతాయి, ఎంత పేలే స్వభావం ఉన్నవి వంటి అంశాల్ని బట్టి శ్రమశక్తీ, శ్రమ సాధనాలూ ఖర్చవుతాయి.

 ఈ విషయంలో ఇంగ్లిష్ రైల్వే కంపెనీలు చేసిన సరుకుల వర్గీకరణకు కొన్ని పుస్తకాలు నిండాయి.ఆ వర్గీకరణ కి ఆధారమైన సూత్రం: సరుకుల వైవిధ్యభరితమైన సహజధర్మాల్ని వాటి రవాణాకి కలిగే  చెడుగులుగా మార్చాయి. వాటిని మోసపూరితంగా అధిక చార్జీలు వసూలు చెయ్యడానికి సాకులుగా పెట్టుకున్నాయి.

ఉదాహరణ: రవాణాకోసం ఒక పెట్టెలో పట్టే గాజు సామాగ్రి మునుపు 11 పౌన్లు అయ్యేది.వాటి తయారీలో మెరుగుదలలొచ్చాకా, వాటిమీద సుంకం (duty) తొలిగించాకా, అదే గాజు సామాగ్రి 2 పౌన్లకి దిగింది. అయితే రవాణా చార్జీ అప్పుడున్నంతే ఉంది. అంతకుముందు కాలవ ద్వారా రవాణా అయినప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ ఉంది

బర్మింగ్ హాం కి 50 మైళ్ళ చుట్టులో  గాజు, ప్లంబర్లు ఉపయోగించే గాజు సామాను టన్నుకి ఇంతకుముందు  10 షిల్లింగులు రవాణా చార్జీ ఉండేది అని మాన్యుఫాక్చరర్లు చెప్పారు. ఇప్పుడు పగిలిపోయే రిస్క్  తగ్గించేందుకంటూ అంతకు మూడింతలు తీసుకుంటున్నారు.. అయితే పగిలిన సామానుకి పరిహారం ఇవ్వడానికి మాత్రం కంపెనీలు ససేమిరా అంటున్నాయి.
రవాణా ఖర్చులవల్ల వస్తువుకి కలిసే విలువ భాగం దాని విలువకి విలోమానుపాతంలో ఉంటుంది. ఈ వాస్తవం రైల్వే వాళ్ళకి వస్తువుల విలువకి అనులోమానుపాతంలో చార్జీ వేసేందుకు ప్రత్యేక ఆధారాన్ని సమకూరుస్తుంది.

టెన్నిస్ రాకెట్ రూ. 2000 దీ ఉంటుంది. రూ. 20,000 దీ ఉంటుంది. రెంటికీ రవాణా ఖర్చులో తేడా ఉండదు. అది 200 అనుకుందాం. మొదటిదాని విలువలో రవాణా ఖర్చు 10% . రెండోదాని విలువలో అది 1%  మాత్రమే. అంటే, దాని మొత్తంవిలువలో రవాణా చార్జీ శాతం తగ్గుతుంది.

పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం విడి సరుకు రవాణా చార్జీల్ని తగ్గిస్తుంది, ఎలాగంటే:  

1. రవాణా సాధనాల, వార్తా ప్రసార సాధనాల అభివృద్ధి ద్వారా. ఆవిరి ఓడలు  రాకముందు తెరచాప ఓడల్లో వారాలు పట్టే రవాణా కాలం అవి వచ్చాక రోజులకి దిగింది. వాటి వేగం బాగా పెరగడమే కారణం.

దూర ప్రాతాలకి వార్త పంపాలంటే వారాలు పట్టేది. టెలిగ్రాఫ్ మెరుగయ్యాక అదే దూరానికి   మెసేజ్ పోవడానికి కొన్ని నిమిషాల సమయమే సరిపోయేది.

సముద్రంలో ఓడలమీద అయ్యే రవాణా చార్జీలు 1950 తొ పొల్చి చూస్తే 90 శాతం తగ్గాయి. ఫొన్ చార్జీలు 20 ఏళ్ళలో ఎంత తగ్గాయో అందరికీ తెలిసిందే. తీవ్రంగా చౌక పడ్డాయి కాబట్టే  ఇండియాలో 110 కోట్ల సెల్ ఫొన్లు వాడకంలో ఉన్నాయి.

2. రవాణా సాంద్రీకరణ ద్వారా. అంటే దాని స్థాయి పెంచడం ద్వారా. పరిశ్రమలో భారీస్తాయి కంపెనీలు ఏర్పడతాయి. వాటికి చిన్నకంపెనీల కయ్యే ఖర్చులకంటే ఖర్చులు తక్కువ ఉంటాయి. అధునాతన సాధనాలని ఉపయోగిస్తాయి. కాబట్టి రవాణా చౌకబడుతుంది.

సమాజ శ్రమలో, సరుకుల రవాణాకి ఖర్చయ్యే భాగాన్ని పెంచుతుంది, ఎలాగంటే:

1.అత్యధిక ఉత్పాదితాల్ని సరుకులుగా మార్చడం ద్వారా.

వెనకటి వ్యవస్థల్లో తయారైన వస్తువుల్లో అత్యధికభాగం మారకం లేకుండానే వాడకంలోకి వచ్చేవి. అంటే అల్ప భాగం మాత్రమే సరుకులు అయ్యేవి. పెట్టుబడిదారీ విధానం అభివృద్ధయ్యేకొద్దీ,  అత్యధికభాగం ఉత్పాదితాలు సరుకులుగా మార్చబడతాయి. మారకంలోకొస్తాయి.అందువల్ల వాటి రవాణాకి అయ్యే శ్రమ పెరుగుతుంది.

2. స్థానిక మార్కెట్ల బదులు దూరప్రాంత మార్కెట్లను ఏర్పరచడం ద్వారా.

మునుపు స్థానికంగానే వాడిన ఆహార సరుకులు ఇప్పుడు వివిధ ప్రాంతాలకూ అవసరమవుతున్నాయి. వాటి రవాణా దూరాలు పెరిగాయి. దూరాన్ని బట్టి ఎక్కువ శ్రమ పడుతుంది.

సరుకుల రవాణా అంటే సరుకులు వాస్తవంగా ఒక చోటు నించి మరొక చోటుకి చేరడమే. రవాణా పరిశ్రమ ఒకపక్క, ఒక స్వతంత్ర ఉత్పత్తి రంగం. ఆవిధంగా అది ఉత్పాదక పెట్టుబడి పెట్టే వేరే రంగం. మరొకపక్క, దాని విశిష్ట లక్షణం ఏమంటే: అది చలామణీ ప్రక్రియ లోపల, చలామణీ ప్రక్రియ కొరకు ఉత్పత్తి ప్రక్రియ యొక్క కొనసాగింపుగా కనబడుతుంది.

దీంతో రెండో సంపుటంలోని 3 భాగాల్లో మొదటిది ముగిసింది.

వచ్చే పోస్ట్: రెండో భాగం 'పెట్టుబడి టర్నోవర్ ' లోని మొదటి అధ్యాయం:

        'టర్నోవర్ కాలమూ, టర్నోవర్ల సంఖ్యా'

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి