29, నవంబర్ 2023, బుధవారం

టర్నోవర్ కాలమూ- టర్నోవర్ల సంఖ్యా

 

కాపిటల్  రెండో సంపుటం  రెండో భాగం

పెట్టుబడి టర్నోవర్

అధ్యాయం 7 : టర్నోవర్ కాలమూ- టర్నోవర్ల సంఖ్యా

(కాపిటల్ రెండో సంపుటంలో రెండో భాగం అతి తక్కువ చర్చించబడిన భాగం. చదవడానికి అంత సుకరంగా ఉండదు.    అయినా, ఇది ముఖ్యమైనదే. అందుకు రెండు కారణాలు ఉన్నాయి:

1. మార్క్స్ ఇందులో, పెట్టుబడి వలయం అంశాన్ని పొడిగిస్తాడు - నిశ్చల పెట్టుబడికీ, చంచల పెట్టుబడికీ (చలనంలో ఉండే పెట్టుబడికీ) తేడా ఏమిటో చెబుతాడు. ఈ తేడా వల్ల కలిగే ఫలితాల్ని తేలుస్తాడు.

2. ఇతర అర్థికవేత్తల రచనల్లో ఉన్న గందరగోళాన్ని వివరిస్తాడు)


ఒక నిర్ణీత పెట్టుబడి చలామణీ కాలమూ, ఉత్పత్తి కాలమూ రెండూ కలిస్తే టర్నోవర్ కాలం అవుతుంది.

టర్నోవర్ కాలం = చలామణీ కాలం + ఉత్పత్తి కాలం.

పెట్టుబడి మొదట ఏరూపంలో ఉందో,  అదే రూపంలోకి తిరిగి వచ్చే దాకా పట్టే సమయం అన్నమాట.

పెట్టుబడిదారీ ఉత్పత్తి లక్ష్యం:  పెట్టుబడి పెట్టి, అదనపువిలువను ఉత్పత్తిచెయ్యడమే. పెట్టుబడిగా పెట్టిన విలువ యొక్క రూపం డబ్బు అయినా ఒకటే, సరుకు అయినా ఒకటే. తేడా ఉండదు. సరుకులయితే, ఆ పెట్టుబడి విలువరూపం వాటి ధరలో ఊహాత్మక స్వతంత్రతని కలిగి ఉంటుంది. రెండుసందర్భాలలోనూ, పెట్టిన పెట్టుబడి విలువ తన చక్రీయ చలనంలో భిన్న రూపాలగుండా నడుస్తుంది. ఏరూపంలో నడుస్తున్నా, అది పెట్టుబడిగానే ఉంటుంది. అలాగని పెట్టుబడిదారుల ఖాతా పుస్తకాల్లో నమోదై ఉంటుంది.

విలువ రెండు రూపాల్లో ఉంటుంది:

1.డబ్బు

2. సరుకులు

ఏమైనా, వాస్తవానికి విలువ అనేది ప్రక్రియలో క్రియాశీలమైన అంశం. అది ప్రక్రియలో ఒకసారి డబ్బురూపాన్నీ, మరొకసారి సరుకుల రూపాన్నీ నిరంతరం తీసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో తన పరిమాణాన్ని మార్చుకుంటుంది. తననుంచి అదనపువిలువని బయటకు నెడుతూ, తన్నుతాను వేరుపరుచుకుంటుంది. మరోమాటల్లో చెప్పాలంటే, పెట్టిన విలువ పెరుగుతుంది. అదనపు విలువను కలిపే ఆ చలనం దాని సొంత/స్వయం చలనం. కాబట్టి దాని వృద్ధి స్వయంవృద్ధి. ఆటోమాటిక్ వ్యాకోచం. ఈ వృద్ధి జరగడానికి ఏ ఇతర అంశమూ కారణంగాదు. దానికదే వృద్ధవుతుంది.

డబ్బనేది విలువకున్న రెండురూపాల్లో ఒక రూపం మాత్రమే. ఏదో ఒక సరుకు రూపం తీసుకోనిదే డబ్బు పెట్టుబడి అవదు.

పెట్టుబడి వలయం రూపాలు రెండు: 1. డ...డ' రూపం     2. ఉ.పె....ఉ.పె రూపం

డ... డ' రూపం తీసుకున్నా, ఉ.పె....ఉ.పె రూపం తీసుకున్నా వాస్తవాలు ఇవే:

1. పెట్టిన విలువ పెట్టుబడిగా వ్యవహరిస్తుంది; అదనపువిలువని సృజిస్తుంది.  అదనపువిలువతో  కలిసి మొదట పెట్టిన పెట్టుబడి విలువ పెరుగుతుంది.

2.తన ప్రక్రియ అయ్యాక, అది తన తొలిరూపానికి తిరిగి వస్తుంది.  అంటే, డబ్బు రూపంలో పెడితే డబ్బుగా, సరుకురూపంలో పెడితే సరుకుగా తిరిగి వస్తుంది.

క్లుప్తంగా: పెట్టిన విలువ పెరగడమూ, పెట్టిన రూపంలోనే తిరిగిరావడమూ

1. డ... ' రూపం.   డబ్బుతో మొదలై డబ్బుతో ముగుస్తుంది. 

ఉదాహరణ: ఒక పెట్టుబడిదారుడు 1 లక్ష రూపాయల పత్తికొంటాడు.20,000 రూపాయలిచ్చి వేతన కార్మికుల్ని పెట్టి, తన పరికరాలతో దారం తయారుచేయిస్తాడు. దాని విలువ 1,40,000 రూపాయలు ఉంటుంది.అమ్మి డబ్బు చేసుకుంటాడు.

1.పెట్టిన విలువ రూపం డబ్బు. చివరకి ఆ విలువ అదే రూపంలో తిరిగి చేతికొచ్చింది.

2.పెట్టిన విలువ (1,20,000).అది 20,000 పెరిగి 1,40,000 అయింది. పెట్టుబడి స్వయంవృద్ధి చెందింది

రెండూ డ....డ' లో కొట్టొచ్చినట్టు కానొస్తాయి:

2.ఉ.పె....ఉ.పె రూపం

.పె ....స' – ' – …..పె

రెండో రూపంలో ఆరంభస్థానం ఉత్పత్తి అంశాలు. - కొంత విలువ ఉన్నసరుకులు. ఉత్పత్తి ప్రక్రియలో వాటికున్న విలువ పెరుగుతుంది. స్వయం వృద్ధి చెందుతుంది. వలయం సరుకుల రూపంలో ముగుస్తుంది. ఇందులో విలువ పెరగడమూ 

('- ') ఉంది. తొలి రూపానికి రావడమూ ఉంది. ఎందుకంటే, రెండో ఉ.పె లో పెట్టిన విలువ, మొదట్లో పెట్టిన ఉత్పత్తి అంశాల రూపంలోనే, సరుకుల రూపంలోనే ఉంటుంది.

ఉత్పత్తి పెట్టుబడిదారీ రూపంలో ఉంటే, పునరుత్పత్తి కూడా పెట్టుబడిదారీ రూపంలోనే ఉంటుంది - అని మనకు ఇంతకుముందే తెలుసు. మొదటి దానిలో శ్రమప్రక్రియ పెట్టుబడి స్వయం వృద్ధికి సాధనం అయినట్లే, రెండోదానిలో, పునరుత్పత్తిలో పెట్టుబడిగా - అంటే ముందు పెట్టిన విలువని స్వయంగా వృద్ధయ్యే విలువగా -  పునరుత్పత్తిచేసే సాధనం గా వ్యవహరిస్తుంది.

మూడు రూపాలు

(I) డ .... డ'

(II) ఉ.పె....ఉ.పె

(III)'.... '

మూడు రూపాలకీ ఉన్న తేడాలు

రెండో రూపం ఉ.పె....ఉ.పె లో పునరుత్పత్తి ప్రక్రియ ఒక వాస్తవం అని తెలుస్తుంది. మొదటి రూపం డ-డ' లో పునరుత్పత్తి ప్రక్రియ సాధ్యత గురించి తెలుస్తుంది. ఇవి రెండూ, మూడో రూపం అయిన ' - ' కి భిన్నంగా ఉంటాయి. ఎందులోనంటే: ఆ రెంటిలోనూ పెట్టిన పెట్టుబడి విలువ - అది డబ్బు రూపంలో ఉన్నా, ఉత్పత్తిలో వాడే భౌతిక అంశాల రూపంలో ఉన్నా - తిరిగి వచ్చే రూపమూ అదే. పెట్టింది డబ్బయితే డబ్బు, సరుకయితే సరుకు.

డ-డ' లో తిరిగొచ్చేది ఇలా వ్యక్తమవుతుంది:

             '= డ+డ.ఫె. 

ఆ ప్రక్రియ అదే స్థాయిలో మళ్ళీ జరిగితే, డ యే ఆరంభస్థానం అవుతుంది; డ.ఫె అందులో కలవదు. కాని డ పెట్టుబడిగా పెరిగి, అదనపువిలువని ఏర్పరచినప్పటికీ, ఆ అదనపువిలువని వదిలివేసిందని మాత్రమే చూపుతుంది.

ఉ.పె - ఉ.పె రూపంలో  ఉత్పత్తి అంశాల రూపంలో పెట్టిన పెట్టుబడి విలువ ఉ.పె. ఆరంభస్థానం. ఈ రూపం దాని స్వయం వృద్ధిని ఇముడ్చుకొని ఉంటుంది.

సామాన్య పునరుత్పత్తిలో అదే పెట్టుబడి విలువ అదే రూపంలో తిరిగి మళ్ళీ అదే ప్రక్రియని మొదలు పెడుతుంది. సంచయనం సందర్భంలో డ' లేక స'  అంత విలువ వున్న ఉ.పె', ఇప్పుడు పెరిగిన పెట్టుబడితో ప్రక్రియని పునః ప్రారంభిస్తుంది. అయితే, ఇంతకు ముందుకంటే ఎక్కువ విలువతో అయినప్పటికీ,  ప్రక్రియ  తొలిరూపంలోనే మొదలవుతుంది. మూడో రూపం అలా మొదలవదు. పెట్టుబడి విలువ, మొదట పెట్టిన పెట్టుబడి విలువగా మొదలవదు. అప్పటికే పెరిగిన విలువగా, సరుకుల రూపంలో ఉన్న  మొత్తం సంపదగా  మొదలవుతుంది. అంటే మొదట పెట్టిన పెట్టుబడి విలువ ఇప్పుడు పెట్టిన మొత్తంలో కొంత భాగం మాత్రమే. ఈ చివరి రూపం  ఈ సంపుటం లోని మూడో భాగానికి ముఖ్యమైనది. ఎందుకంటే, ఆ భాగంలో  మొత్తం సమాజపెట్టుబడి చలనంతో, విడివిడి పెట్టుబడుల చలనం యొక్క సంబంధాన్ని గురించిన చర్చ ఉంటుంది.

అయితే ఈ మూడో రూపాన్నిపెట్టుబడి టర్నోవర్ విషయంలో ఉపయోగించకూడదు.

అది ఎప్పుడూ పెట్టుబడి విలువని (డబ్బుగానో, సరుకులుగానో) అడ్వాన్స్ పెట్టడంతో మొదలవుతుంది.  ఆ విలువని, పెట్టిన రూపంలోనే తప్పనిసరిగా తిరిగి రప్పిస్తుంది. ఒకటి, రెండు వలయాల్లో:

 మొదటిది దనపువిలువ ఉత్పత్తి మీద టర్నోవర్ ప్రభావాన్ని అధ్యయనం చెయ్యడంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది.

రెండోది ఉత్పాదితాన్ని తయారుచెయ్యడం మీద టర్నోవర్ ప్రభావాన్ని అధ్యనం చెయ్యడంలో ముఖ్యంగా ఉపకరిస్తుంది.

ఆర్థికవేత్తలు భిన్న వలయాల  మధ్య భేదాల్ని స్వల్పంగా పట్టించుకున్నారు. అందువల్ల పెట్టుబడి టర్నోవర్  సంబంధంలో వాటిని విడివిడిగా పరిశీలించలేదు. వాళ్ళు డ ... డ'  రూపం మీద కేంద్రీకరించారు. కారణం: ఆ రూపం పెట్టుబడిదారుడి మీద పెత్తనం చెలాయిస్తుంది. అతను లెక్కలు రాసుకోవడంలో ఉపకరిస్తుంది - మొదట పెట్టిన డబ్బు ఖాతా డబ్బు అయినప్పటికీ.

మరికొందరేమో ఉత్పత్తి అంశాలతో మొదలుపెట్టి, ఫలితాలు తిరివచ్చేదాకా చూసి ముగిస్తారు. అంతేగాని తిరిగి వచ్చిన ఫలితం రూపాన్ని గురించి చెప్పరు. అది సరుకుల రూపంలోఉందో, డబ్బు రూపంలోఉందో చెప్పరు. ఉదాహరణకు:

అమెరికన్ మతగురువు, రచయిత S. P. Newman (1797-1842) తన Elements of Political Economy  ఆర్థిక వలయాన్ని ఇలా నిర్వచించాడు: ఉత్పత్తి అంశాల్ని పెట్టినప్పటినించీ, వాటి ఫలితం తిరిగి వచ్చే వరకూ జరిగే ఉత్పత్తి ప్రక్రియ మొత్తం. వ్యవసాయంలో  విత్తనాలు నాటడం దాని ఆరంభం, పంటకోత దాని ముగింపు (పేజి81).

ఇతర ఆర్థికవేత్తలు కొందరు మూడో రూపం ' తో మొదలెట్టారు.

ఉదాహరణకు:

స్కాట్ లాండ్ ఆర్థికవేత్త Thomas Chalmers (1780-1847) On Political Economy లో ఇలారాశాడు:

మనం ఆర్థిక చక్రం అంటామే, దానిలో వాణిజ్య ప్రపంచం తిరుగుతూ ఉంటుందని అనుకోవచ్చు. వ్యాపారచక్రం ఒక వర్తకవలయాన్ని పూర్తిచేసి,  వరస లావాదేవీలద్వారా అది ఎక్కడ మొదలైనదో తిరిగి అదే స్థానాన్ని చేరుతుంది. పెట్టుబడిదారుడు పెట్టిన విలువ తిరిగి వచ్చీరాగానే, చక్రం మళ్ళీ మొదలైంది అనవచ్చు. అప్పటినించీ పనివాళ్ళని పెట్టుకోవడం మొదలుపెడతాడు. వాళ్ళ పోషణకి వేతనాలు పంచుతాడు. సరిగా చెప్పాలంటే, దాన్ని ఎత్తే శక్తిని పంచుతాడు -వాళ్ళనించి తను వ్యాపారం చేసే వస్తువుల్ని తయారుచేయిస్తాడు.వాటిని  మార్కెట్లో పెట్టి, అమ్మి, ఆకాలంలో తానుపెట్టిన మొత్తం మదుపుకి ప్రతిఫలాన్ని పొందుతాడు. అంతటితో, ఒక  చలన సముదాయం యొక్క కక్ష్యని ముగిస్తాడు. (పేజి85)

 

ఏ ఉత్పత్తి శాఖలోనైనా సరే, పెట్టుబడి దారుడు పెట్టిన పెట్టుబడి విలువ తిరిగి అతని చేతిలో పడీపడగానే, అది మళ్ళీ అతను ఏరూపంలో పెట్టాడో అదేరూపంలో ఉంటుంది. అది  అదే ఉత్పత్తి ప్రక్రియని మళ్ళీ చెయ్యగలదు.ఆ విలువ అలాగే నిలుపుకుంటూ, అదనపు విలువను ఉత్పత్తిచెయ్యాలంటే అది ఆచర్యని పదేపదే చేస్తూనే ఉండాలి. ఒక విడి వలయం అనేది ఒక పెట్టుబడి జీవితకాలంలో నిరంతరం మళ్ళీమళ్ళీ జరిగే ఒక విభాగం. అంటే అది మళ్ళీ మళ్ళీ జరిగే చర్య నిర్ణయించే కాలవ్యవధి(period).

అందువల్ల, డ...డ' కాలం చివరలో పెట్టుబడి తిరిగి డబ్బు రూపం పొందుతుంది. అది కొత్తగా వరస రూపం మార్పుల్ని గడుస్తుంది. అందులో దాని పునరుత్పత్తి లేక స్వయం వృద్ధి ఇమిడి ఉంటుంది. ఉ.పె...ఉ.పె చివరలో పెట్టుబడి ఉత్పత్తి అంశాల రూపాన్ని తిరిగి పొందుతుంది.

అవి (ఉత్పత్తి అంశాలు) వలయం మళ్ళీ మొదలవడానికి ముందు ఉండాల్సినవి. పెట్టుబడి వలయాన్ని విడి చర్యగా కాకుండా, నియత కాలవ్యవధుల్లో జరిగే ప్రక్రియగా తీసుకుంటే, అది దాని టర్నోవర్.

అన్ని రంగాల్లోనూ ఒకటే ఉండదు.

ఈ వలయమే టర్నోవర్. ఇందుకు పట్టే మొత్తం సమయమే పెట్టుబడి టర్నోవర్ టైం. కొన్ని రంగాలలో టర్నోవర్ టైం ఎక్కువ గానూ, కొన్ని రంగాల్లో తక్కువగానూ ఉంటుంది. ఒకే రంగంలో కొందరు పెట్టుబడిదారులకు ఎక్కువగానూ, కొందరికి తక్కువగానూ ఉండవచ్చు.

టర్నోవర్ లని సంవత్సరానికి ఇన్ని అని చెప్పడం ఆనవాయితీ

 n=T/t          n అంటే టర్నోవర్ల సంఖ్య      T అంటే టైం          t అంటే ఒక టర్నోవర్ కి పట్టే టైం

ఒక టర్నోవర్ కి పట్టే టైం (t) 3 నెలలయితే, n=12/3=4. పెట్టుబడి ఏడాదిలో 4 సార్లు టర్నోవర్ అయినట్లు.

ఒకవేళ ఒక టర్నోవర్ కి పట్టే టైం(t) 18 నెలలయితే, n=12/18 = ⅔. అంటే, పెట్టుబడి టర్నోవర్లో మూడింట రెండొంతులు మాత్రమే పూర్తిచేస్తుంది. పెట్టుబడిదారుడికి, తన పెట్టుబడి టర్నోవర్ టైం అనేది, తన పెట్టుబడితో అదనపు విలువ ఉత్పత్తిచెయ్యడానికీ, దాన్ని పెట్టిన రూపంలోనే తిరిగి తీసుకోడానికీ పట్టే కాలం.

ఉత్పత్తి ప్రక్రియమీదా, స్వయం విస్తరణమీదా టర్నోవర్ ప్రభావాన్ని గురించి మరింత దగ్గరగా పరిశీలించే ముందు  రెండు కొత్త రూపాల్ని పరిశోధించాల్సి ఉంది. చలామణీ ప్రక్రియ ఫలితంగా పెట్టుబడి పొందే రూపాల్ని, పెట్టుబడి టర్నోవర్ రూపాన్ని ప్రభావితం చేసే రూపాల్ని పరిశీలించాల్సి ఉంది.

 వచ్చే పోస్ట్: నిశ్చల పెట్టుబడీ - చలామణీ అయ్యే పెట్టుబడీ

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి