6, నవంబర్ 2023, సోమవారం

II. 2. నిజమైన సరుకు సరఫరా- స్టాక్

 

II. 2. నిజమైన సరుకు సరఫరా- స్టాక్

పెట్టుబడిదారీ ఉత్పత్తిలో తయారైన వస్తువు సాధారణంగా సరుకు రూపం పొందుతుంది. ఉత్పత్తి పెరిగేకొద్దీ,  ఉత్పాదితాల్లో ఎక్కువ భాగం సరుకులు అవుతాయి.ఫలితంగా, ఉత్పత్తి అంతే పరిమాణంలో ఉన్నా, వెనకటి ఉత్పత్తి విధానాలతోగానీ, తక్కువ అభివృద్ధి చెందని పెట్టుబడిదారీ విధానంతో గానీ  పోలిస్తే, చాలా పెద్ద భాగం సరుకులు అవుతాయి. అవి ఉత్పత్తిరంగం నించి వెంటనే ఉత్పాదక వినియోగంలోకి గానీ, వ్యక్తిగత వినియోగంలోకి గానీ పోవాలి. పోనట్లయితే, కొంతకాలం  మార్కెట్లోనే ఉంటాయి. అప్పుడవి సరుకు సరఫరా (స్టాక్) రూపంలో ఉంటాయి.

పెట్టుబడిదారీ ఉత్పత్తితో పాటే, సరుకుస్టాక్ పెరుగుతుంది

ఉత్పత్తి పరిమాణం మారకుండా అంతే ఉంది అనుకున్నా, సరుకుస్టాక్ పెట్టుబడిదారీ ఉత్పత్తితో పాటే పెరుగుతుంది. కారణం: ఎక్కువ ఉత్పాదితాలు సరుకులుగా అమ్మకానికి మార్కెట్ కి వస్తాయి. స్టాకు సరుకు రూపంలో పెరుగుతుంది; ఎందుకంటే అది ఉత్పత్తికి అవసరమైన సరుకుల స్టాక్ రూపంలోనూ, వ్యకిగత వినియోగ సరుకుల స్టాకు రూపంలోనూ తగ్గుతుంది. అంటే సరుకుస్టాక్ పెరుగుతుంది.  ఇది కేవలం స్టాక్ యొక్క సామాజిక రూపంలోమార్పు మాత్రమే. అంటే, సరుకుల రూపంలో స్టాక్ ఒకవైపు పెరుగుతుంది, ఎందుకంటే మరొకవైపు ప్రత్యక్షంగా ఉత్పత్తికో, వినియోగానికో ఉద్దేశించబడ్డ రూపంలో స్టాక్ తగ్గుతుంది. అదే సమయంలో సామాజిక ఉత్పత్తి మొత్తంతో పోలిస్తే, పెరిగేది సరుకు స్టాక్ సాపేక్ష పరిమాణం మాత్రమే కాదు, దాని నిరపేక్ష పరిమాణం కూడా. అలా ఎందుకంటే,  పెట్టుబడి దారీ ఉత్పత్తి వృద్ధితో పాటు మొత్తం ఉత్పాదితం రాశి పెరుగుతుంది.

ఉత్పత్తి స్థాయి పెంపుని నిర్ణయించే అంశాలు

పెట్టుబడిదారీ ఉత్పత్తి పెరిగేకొద్దీ, 
A.ఉత్పత్తి స్థాయిని ఆ ఉత్పాదితం కొసం ఉండే డిమాండు నిర్ణయించడం అంతకంతకూ తగ్గుతూ పోతుంది. 
B. ఉత్పత్తి స్థాయిని ఈ కింది అంశాలు నిర్ణయించడం అంతకంతకూ పెరుగుతూ పోతుంది.
ఆ అంశాలు:
1. వ్యష్టి పెట్టుబడిదారుడికి అందుబాటులో ఉండే పెట్టుబడి మొత్తమూ
2. అతని పెట్టుబడికి స్వభావసిద్ధంగా ఉండే స్వయంవిస్తరణ ప్రేరణా 
3. ఉత్పత్తి ప్రక్రియ కొనసాగడం విస్తరించడం అవసరమూ 
పై అంశాలు ఉత్పత్తి స్థాయిని నిర్ణయించడం అంతకంతకూ పెరుగుతూ పోతుంది.
ఆవిధంగా ప్రతి ప్రత్యేక ఉత్పత్తి శాఖలోనూ మార్కెట్లో దొరికే ఉత్పాదితాల రాశి తప్పక పెరుగుతుంది - సరుకుల రూపంలో కొనేవాళ్ళకోసం ఎదురుచూస్తుంటుంది. ఎంతో కొంతకాలం సరుకు పెట్టుబడిగా ఉండాల్సిన పెట్టుబడి మొత్తం పెరుగుతుంది. అందువల్ల సరుకు స్టాక్ కూడా పెరుగుతుంది. 
కార్మికులకి కావలసిన జీవితావసర వస్తువుల స్టాక్
పెట్టుబడిదారీ ఉత్పత్తి పెరిగేకొద్దీ, సమాజంలో ఎక్కువమంది వేతనకార్మికులుగా, రెక్కాడితేగాని డొక్కాడని వాళ్ళుగా మారతారు. వాళ్ళు వారం వారం కూలి తీసుకొని రోజు రోజూ ఖర్చుచేస్తారు. అందువల్ల  వాళ్లకి కావలసిన జీవితావసర వస్తువులు స్టాక్ రూపంలో లభ్యం కావాలి. ఆస్టాక్ చలనంలో ఉండడానికి, వాటిలో కొంత భాగం,  చలనంలేకుండా ఉండి తీరాలి.

అలా ఉండాలంటే  ,  చలనంలేకుండా ఉండే స్టాక్ ని భద్రపరచాలి

ఉత్పత్తుల స్టాక్ సామాజిక రూపం ఏదైనా సరే, వాటిని భద్రపరచక తప్పదు. అందుకు భవనాలు, వాటిని ఉంచేవి (containers) వసతులు, కావాలి. వాటికి కొంత ఖర్చు అవుతుంది.  అవి చెడకుండా కాపాడాలి. స్టాక్ సామాజికంగా ఎంత ఎక్కువ కేంద్రీకృతమయితే, సాపేక్షంగా ఖర్చులు అంత తగ్గుతాయి. ఎందువల్లనంటే: ఖర్చులు ఎక్కువ సరుకులకు పంపిణీ అవుతాయి.

ఈ ఖర్చులు అనుత్పాదక ఖర్చులు

అవి సమాజ శ్రమలో భాగం అవుతాయి. ఆ శ్రమ వస్తువు లోచేరి ఉండవచ్చు, సజీవ శ్రమ రూపంలో ఉండవచ్చు. ఈ ఖర్చులు ఉత్పాదితం తయారీలో కలవవు. అందువల్ల అవి ఉత్పాదితం నించి తీసివేతలే. అయినా, ఈ అనుత్పాదక ఖర్చులు అవసరమైనవే. అనివార్యమైనవే. అవి సమాజ ఉత్పాదితాన్ని భద్రంగా ఉంచడానికి అయ్యే ఖర్చులు. ఇవి అన్నిసమాజాలలో ఉండేవే. సరుకు స్టాక్ రూపంలో కాకపోయినా, ఉత్పాదితం స్టాక్ రూపంలో ఏ సమాజంలోనయినా ఉండేవే.  

అమ్ముడవని సరుకుల భద్రత ఖర్చులు పెట్టుబడిదారుడికి నష్టం 

పెట్టుబడిదారుడు అమ్ముకోవాల్సిన సరుకులు అమ్ముడవకుండా స్టాక్ ఉంటే, అకాలం అంతా పెట్టుబడి స్వయం విస్తరణ ప్రక్రియ స్తంభిస్తుంది. ఈ సప్ప్లై ని భద్రపరచడానికి భవనాలకూ, ఇతర సదుపాయాలకూ ఖర్చులుంటాయి. అవి అతనికి నష్టం అవుతాయి.

అతను కొనేవానితో: నా సరుకుని 6 నెలలు అమ్మలేకపోయాను.ఆ కాలం అంతా నా పెట్టుబడి వృధా అయింది.వాటిని భద్రపచడానికి అదనంగా ఖర్చయింది.

అంటే, కొనేవాడిలా అంటాడు: నీకు నష్టం జరిగింది. నిజమే. ఇక్కడ నీ పక్కనే అమ్మేవాడు మరొకడు ఉన్నాడు. అతని సరుకులు నిన్నగాక మొన్ననే తయారయ్యాయి. నీ సరుకులు షాపు చీకుడు పట్టాయి. టైం గడిచి ఎంతోకొంత డామేజ్ అయ్యాయి.కాబట్టి  నీవు అతనికన్నా తక్కువకి అమ్మాలి. అంటూ బేరమాడతాడు. అంతకిస్తేనే కొంటాడు .                                         అమ్మే వాడు పెట్టిన అదనపు ఖర్చులతో కొనేవాడికి నిమిత్తం లేదు. అతనికైన ఖర్చులు ఇతను చెల్లించడు.

మరొక విషయం

తన సరుకు విలువ ముందుముందు పెరుగుతుందనీ, అప్పుడు అమ్ముకోవచ్చనీ అనుకొని, సరుకుని మార్కెట్లో పెట్టకపోవచ్చు. తన దగ్గరే స్టాక్ ఉంచుకోవచ్చు. అందుకు అతనికి అదనంగా ఖర్చులవుతాయి. ఆ ఖర్చుల్ని అతను రాబట్టుకుంటాడా లేదా అనేది అతని అంచనా ప్రకారం ధరలు మారాయా లేదా అనే దాన్నిబట్టి ఉంటుంది. విలువల్లో మార్పు అతని కయిన అదనపు ఖర్చుల ఫలితం కాదు. అందువల్ల ఆ ఖర్చులు సరుకుల విలువకు కలవవు. వాటిని కొనేవాడు కట్టడు.

స్తంభన లేనిస్టాక్ ఉండదు

మరొకపక్క,చలామణీరంగంలో ఆలస్యం జరగనిదే, స్టాక్ ఉండదు. పెట్టుబడి సరుకు రూపంలో ఎంతో కొంత కాలంపాటు చలామణీ రంగంలో ఉంటుంది. అలా ఉండకపోతే ఏస్టాక్ ఉండజాలదు. అందువల్ల చలామణీ రంగంలో, స్తంభన లేనిస్టాక్ ఉండదు- డబ్బు నిల్వ ఏర్పడనిదే, డబ్బు చలామణీ ఎలా ఉండదో అలాగే. కాబట్టి సరుకుస్టాక్ లేనిదే సరుకు చలామణీ ఉండదు.

పెట్టుబడిదారుడికి ఈ అవసరం స ' - ' లో ఎదురు అవకపోతే, డ-స లో ఎదురవుతుంది. తనసొంత పెట్టుబడి విషయంలో కాకపోతే, ఇతనికి ఉత్పత్తిసాధనాలూ, ఇతని పనివాళ్ళకి జీవితావసరాలూ ఉత్పత్తిచేసే ఇతర పెట్టుబడి దారుల సరుకు పెట్టుబడి విషయంలోనైనా ఎదుర్కుంటాడు. 
ఐచ్చికస్టాక్ ఏర్పాటు అసంకల్పిత స్టాక్ ఏర్పాటు

 ఉత్పత్తిదారుడే కావాలనుకుని స్టాక్ ఏర్పాటు చెయ్యవచ్చు. ఇది ఐచ్చికస్టాక్ ఏర్పాటు. అతను కావాలనుకోకపోయినా, స్టాక్ ఏర్పాటు కావచ్చు. ఎలాగంటే: చలామణీ ప్రక్రియలో పరిస్థితులవల్ల అమ్మకం జరగక, స్టాక్ ఏర్పాటు కావచ్చు. ఇది అసంకల్పిత స్టాక్ ఏర్పాటు. ఎలా జరిగినా సారాంశంలో తేడా ఉండదు అనిపిస్తుంది. అదా,ఇదా అనే దాంతో నిమిత్తం లేదు అనిపిస్తుంది. అయితే ఉత్పత్తిదారుడు కావాలని చేసే (voluntary) స్టాక్ ఏర్పాటుకీ, తను అనుకోకపోయినా, పరిస్థితులవల్ల జరిగే (involuntary) స్టాక్ ఏర్పాటుకీ మధ్య ఉండే తేడా తెలుసుకోడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

అసంకల్పితస్టాక్ ఏర్పాటు అనేది ఉత్పత్తిదారుడి ఇచ్చతో నిమిత్తంలేకుండా స్వతంత్రగా జరిగే చలామణీ స్తంభన. అది అతని సంకల్పాన్ని అడ్డుకుంటుంది. మరి ఐచ్చికస్టాక్ ఏర్పాటు లక్షణం ఏది? రెండు సందర్భాల్లోనూ అమ్మకందారుడు వీలైనంత వేగంగా వదిలించుకోవాలి అనుకుంటాడు. తన ఉత్పాదితాన్ని సరుకుగా అమ్మకానికి పెడతాడు. దాన్నతను అమ్మకంనించి ఉపసంహరించాల్సి వస్తే, అది , స్థితిజ (potential) సరుకు స్టాక్ అంశం మాత్రమే అవుతుంది కాని, వాస్తవ సరుకు స్టాక్ అంశం కాదు. అంటే, ఉత్పత్తిదారునికి సరుకు, ఎప్పటిలాగే మారకం విలువ ఇమిడి ఉన్న అంశం. ఆ విలువ సిద్దించాలంటే అది అమ్ముడయి తీరాలి. అది సరుకు రూపాన్ని వదిలి  డబ్బు రూపాన్ని పొందిన తర్వాత  మాత్రమే చర్యచెయ్యగలదు.

సరుకుల స్థబ్ధత వాటి అమ్మకానికి తప్పనిసరి పరిస్థితి

ఒక నిర్ణీత కాలంలో ఉన్న డిమాండ్ కి తగిన స్టాక్ ఉండాలి. కొనేవాళ్ళు పెరుగుతూ ఉంటారు అనే నమ్మకం ఒకటి ఉంటుంది. ఉదాహరణకి, సరుకులు ఒక రోజుకి సరిపోయే ప్రమాణంలో ఉండాలనుకుందాం. అప్పుడు సరుకుల్లో ఒక భాగం ఎప్పుడూ మార్కెట్లో సరుకు రూపంలో  ఉండాలి; మిగిలిన భాగం చలనంలో ఉండి, డబ్బులోకి మారుతూ ఉండాలి. అలా నిశ్చలంగా ఉన్న భాగం క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది- స్టాక్ స్థాయే తగ్గుతుంది గనక. అదంతా అమ్ముడయ్యే వరకూ ఇలానే జరుగుతుంది. సరుకుల అమ్మకానికి వాటి స్థబ్ధత తప్పనిసరి. వాటి పరిమాణం సగటు అమ్మకంకన్నా, సగటు గిరాకీ కన్నా ఎక్కువ ఉండి తీరాలి. లేకపోతే, ఈ సగటుల్ల్ని మించిన గిరాకీలు ఏర్పడితే వాటిని తీర్చడం వీలుకాదు. మరొక పక్క, స్టాక్ అమ్ముడవుతూ ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండాలి. ఎందుకంటే, సరుకులు అమ్ముడైనప్పుడల్లా నిల్వ తగ్గుతుంది. దాన్ని భర్తీ చెయ్యాలి. ఈ భర్తీ ఉత్పత్తినించే, సరుకులస్టాక్ నించే వస్తుంది, ఇంకెక్కడి నించో రాదు. అది విదేశాలనించి వస్తుందా, ఈదేశం నించే వస్తుందా అనేది ముఖ్యం కాదు. ఆ భర్తీ, సరుకుల పునరుత్పత్తికి పట్టే కాల వ్యవధుల్ని బట్టి ఉంటుంది. ఆ కాలం అంతా, సరుకు స్టాక్  ఉండాలి. ఇది అసలు ఉత్పత్తిదారుని చేతుల్లో ఉండదనేది వాస్తవం. టోకు వ్యాపారి నించీ, చిల్లర వర్తకుడిదాకా నిల్వచేసే వాళ్ళకి చేరుతూ ఉంటుంది. ఇది విషయం అగపడే రూపాన్ని మాత్రమే మారుస్తుంది. కాని దాని స్వభావాన్ని మార్చదు.

సమాజం దృక్పధం నించి: పై రెండు సందర్భాల్లోనూ పెట్టుబడిలో ఒక భాగం సరుకుస్టాక్ రూపంలో ఉంటుంది - సరుకులు ఉత్పాదక వినియోగంలోకో, వ్యక్తిగత వినియోగంలోకో ప్రవేశించేవరకూ.  ఉత్పత్తిదారుడు ప్రత్యక్షంగా ఉత్పత్తి మీద ఆధారపడకుండా ఉండేందుకూ, తన కొనుగోలుదార్లు నిలకడగా ఉండేట్లు చూసుకునేందుకూ, సగటు గిరాకీకి సరిపడే నిల్వ ఉంచుకోడానికి ప్రయత్నిస్తాడు.

ఉత్పత్తి కాలాలకి అనుగుణంగా కొనుగోలు కాలాలు ఏర్పడతాయి. సరుకుల స్టాకులు ఎక్కువ కాలానికో తక్కువ కాలానికో ఏర్పడతాయి- వాటిని అదేరకం కొత్త సరుకులు భర్తీ చేసేదాకా. చలామణీ ప్రక్రియ స్థిరంగానూ, నిరంతరాయంగానూ కొనసాగడానికి, పునరుత్పత్తి ప్రక్రియ - చలామణీ ప్రక్రియను కలుపుకొని ఉంటుంది - అలాంటి స్టాక్లు ఏర్పాటు అవడం వల్ల మాత్రమే రక్షణపొందుతాయి.

ఒక విషయం గుర్తుంచుకోవాలి: సరుకు ఉత్పత్తి దారుకు సంబంధించి, స ఇంకా మార్కెట్లో ఉన్నా, '- ' ప్రక్రియ జరిగిపోయి ఉండవచ్చు. ఉత్పత్తిదారుడు తన సరుకుల్ని చివరి వినియోగదారుడికి అమ్ముడయ్యేదాకా అట్టిపెట్టువాల్సి వస్తే, అతను రెండు పెట్టుబడుల్ని చలనంలో పెట్టాల్సి ఉంటుంది. ఒకటి, సరుకుల ఉత్పత్తిదారుడిగా, రెండోది వర్తకుడిగా. పోతే,సరుకుకి సంబంధించినంతవరకూ దాన్ని విడి సరుకుగా చూసినా, సమాజ పెట్టుబడిలో భాగంగా చూసినా, ఆస్టాక్ ఏర్పాటుకయ్యే ఖర్చులు ఉత్పత్తిదారుడు భరించాలా లేక  వరసలో ఉండే వర్తకులు భరించాలా అనేది అప్రస్తుతమైన అంశం.

సరుకు స్టాక్ అనేది  ఉత్పాదితం యొక్క సరుకు రూపమే తప్ప వేరొకటి కాదు.

 అది ఒక ప్రత్యేక సామాజిక ఉత్పత్తి స్థాయి వద్ద, సరుకు స్టాక్ గా ఉండనట్లయితే, ఉత్పాదక వస్తువుల స్టాక్ గానో, వినియోగ వస్తువుల స్టాక్ గానో ఉంటుంది. దాని భద్రతకయ్యే ఖర్చులు, అంటే స్టాక్ ఏర్పాటుకి అవసరమైన ఖర్చులు, ఉత్పత్తికోసం ఉన్న సమాజ నిధిని భద్రంగా ఉంచడానికో, లేక వినియోగం కోసం ఉన్న సమాజ నిధిని భద్రంగా ఉంచడానికో అయిన ఖర్చులుమాత్రమే. ఇవి అన్ని రకాల సరుకులకూ ఒకటే ఉండవు. సరుకుల్ని బట్టి మారతుంటాయి. వేరువేరుగా ఉంటాయి.  ఆ ఖర్చులవల్ల, సరుకుల విలువలో వచ్చే పెరుగుదల,  దానికి తగిన నిష్పత్తిలో ఆయా సరుకుల మధ్య పంపకం అవుతుంది. స్టాక్ ఏర్పాటుకయ్యే ఖర్చులు ఎప్పటిలాగే సమాజ సంపద నించి కోతలే - ఖర్చులు స్టాక్ ఉండడానికి అవసరమే అయినప్పటికీ.

చలామణీ స్తబ్ధత రెండు రూపాల్లో ఉంటుంది:

1. సాధారణ రూపం (normal form)

డబ్బు చలామణీకి డబ్బు నిధి ముందుగా ఉండాలి. అది తప్పనిసరి అవసరం. అలాగే. సరుకు చలామణీకి సరుకు స్టాకు ముందుగా ఉండాలి. స్టాకు లేకపోతే చలామణీ ఉండదు. స్టాకు దానికదే సరుకు చలామణీ నించి అవసరంగా తలెత్తిన రూపం. అయిన మేరకు, సాధారణం. ఆ స్తబ్ధత అనేది చలనానికే ఒక రూపం అయినందువల్ల, అది సాధారణం. సాధారణ చలామణీ స్తబ్ధత.

2. అసాధారణ రూపం (abnormal form)  

వేగంగా తయారై వచ్చే సరుకులకి నిల్వస్థలాల్లో చోటుండాలి. కొత్తగా తయారై వచ్చే సరుకుల్ని పెట్టడానికి స్టోర్లలో చోటుండాలి. అప్పటికే స్టాకు ఎక్కువ ఉంటే, వచ్చే సరుక్కి చోటుండదు. ఉన్న స్టోర్లు క్రిక్కిరుస్తాయి. సరుకులు మేటలు వేస్తాయి. సరుకులు అమ్ముడవకపోవడం వల్ల చలామణీలో ఏర్పడే స్తంభన ఇది. దీని మూలంగా సరుకు స్టాక్ పెరుగుతుంది. డబ్బు చలామణీ స్తంభిస్తే, డబ్బు నిల్వలు ఎలా పెరుగుతాయో అలాగే సరుకుల చలామణీ స్తంభిస్తే సరుకు నిల్వలు పెరుగుతాయి. ఈ పెరగడం పారిశ్రామిక పెట్టుబడిదారుడి గోడౌన్లలో జరిగినా, వర్తకుని షాపు రూముల్లో జరిగినా తేడా ఏమాత్రం ఉండదు. ఏదైనా విషయం అదే. స్టాకు పెరగడమే.

అమ్మకాలు ఆగకుండా జరుగుతూ ఉండాలంటే, ముందుగా సరుకు స్టాక్ ఉండాలి. లేకపోతే సరుకుల్లేక, అమ్మకాలు ఆగిపోతాయి. కాబట్టి స్టాక్ అనేది అమ్మకానికి ముందుగా ఉండాల్సిన అవసరం. ఈవిషయాన్ని ఇంతకుముందే తెలుసుకున్నాం.

ఇప్పటి సందర్భం అదికాదు. అమ్మకాలు లేకపోవడం, సరుకులు అమ్మడం అసాధ్యం అయినందువల్ల గోడొన్లల్లోనో, షాపుల్లోనో పడివుండడం. ఈ స్టాక్ సరుకుల్ని అమ్మడం సాధ్యంకాని దాని ఫలితం. ఖర్చులు అవే, కాని అవి పూర్తిగా రూపం నించే తలెత్తాయి. అంటే, సరుకుల్ని డబ్బులోకి మార్చే అవసరం వల్లా, ఈ పరివర్తనకి కలిగిన ఇబ్బంది వల్లా, ఏర్పడ్డాయి. కాబట్టి ఈ ఖర్చులు సరుకుల విలువలో చేరవు. చేరకపోగా అవి విలువలో కోతపడతాయి. విలువ డబ్బుగా మారేటప్పుడు విలువ తాలూకు నష్టాలు.

స్టాక్ రూపం ఏదైనా, చలామణీకి అడ్డు పడేదే

స్టాక్ కి సంబంధించి దాని సాధారణ రూపానికీ, అసాధారణ రూపానికీ రూపంలో తేడా ఉండదు; రెండూ చలామణీకి ఆడ్డుపడేవే. అందువల్ల ఈవిషయాలకు సంబంధించి గందరగోళం ఏర్పడవచ్చు. అసలు ఉత్పత్తిదారుణ్ణే ఇంకా ఎక్కువగా మోసపుచ్చవచ్చు. ఎంతగానంటే, అతను తన పెట్టుబడి చలామణీ ప్రక్రియ కొనసాగుతున్నట్లుగానూ, అది చలనంలో ఉన్నట్లుగానూ, భావించే అవకాశం ఉంది- ఎందుకంటే అవి అతని గోడౌన్ నించి వెళ్ళిపోయాయి. అయితే అవి అమ్ముడవక, వర్తకులవద్ద అతని సరుకుల చలామణీ స్తంభించి ఉండవచ్చు. అయినా తనదగ్గరనించీ పోయాయి కాబట్టి, చలామణీ ప్రక్రియ జరుగుతూనే ఉన్నదని అనుకుంటాడు.

పెరిగిన సరుకు స్టాక్ కి కారణం స్తంభించిన చలామణీ

మిగిలిన అంశాలన్నీ అలానే ఉండి, ఉత్పత్తీ పునరుత్పత్తీ పెరిగితే, అలాగే సరుకుస్టాక్ సైతం పెరుగుతుంది. అంతే వేగంగా భర్తీ అయి, ఇమిడిపోతుంది- అయితే దాని సైజు ముందుకన్నా మరింత అవుతుంది. కాబట్టి పెరిగిన సరుకు స్టాక్కి స్తంభించిన చలామణీ కారణం. అయితే  పునరుత్పత్తి ప్రక్రియ విస్తరణ అని పొరబడే అవకాశం  ఉంది. ప్రత్యేకించి,అప్పు పద్ధతి అభివృద్ధి, వాస్తవ చలనాన్ని తెలియనీకుండా కప్పి వేసినప్పుడు, ఈ పొరపాటు అవగాహనకి ఆస్కారం ఉంది.

స్టాక్ ఏర్పాటుకి ఖర్చులు:

1. ఉత్పాదితాల రాశి పరిమాణం రాశి తగ్గటం (ఉదాహరణకి, పిండిస్టాక్)

2. నాణ్యత తగ్గడం

3. స్టాక్ ని భద్రపరచడానికి అవసరమైన శ్రమకు అయ్యే ఖర్చులు

వచ్చే పోస్ట్: III రవాణా ఖర్చులు

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి