2, ఆగస్టు 2018, గురువారం

శ్రమశక్తి ధర పరిమాణంలోనూ, అదనపువిలువ పరిమాణంలోనూ మార్పులు


అధ్యాయం -17
శ్రమశక్తి ధర పరిమాణంలోనూ, అదనపువిలువ పరిమాణంలోనూ మార్పులు
చాప్టర్ అంతటా రెండు పరిస్థితులు ఉన్నట్లు భావించి ముందుకుపోతాడు మార్క్స్. అవి:
1.సరుకులు వాటి విలువలకే అమ్ముడవుతాయి.
2.శ్రమశక్తి ధర అరుదుగా దానివిలువ కన్నా ఎక్కువవుతుంది, కాని ఎన్నడూ తగ్గదు.
అవిధంగా అనుకుంటే, అదనపువిలువ సాపేక్ష పరిమాణాలూ, శ్రమ శక్తి ధరా కింది మూడు అంశాలమీద ఆధారపడి ఉంటాయి:
        పనిదినం పొడవు
        మామూలు శ్రమ తీవ్రత
        శ్రమ ఉత్పాదకత 
కాబట్టి, వేర్వేరు పరిస్థితులు ఉంటాయి.
  రెండు అంశాలైనా స్థిరంగా ఉండి, మిగిలిన మూడో అంశం మారవచ్చు.
ఒక అంశం మాత్రమే స్థిరంగా ఉండి, మిగిలిన రెండు అంశాలూ మారవచ్చు.
మొత్తం మూడు అంశాలూ ఏక కాలంలో  మారవచ్చు.
ఈమార్పుల్లో ముఖ్యమైన వాటిని మాత్రమే మార్క్స్ పరిగణనలోకి తీసుకుంటాడు.

A. పనిదినం పొడవూ, శ్రమ తీవ్రతా-  స్థిరంగా ఉండి, మూడో అంశం శ్రమ ఉత్పాదకత  మారుతున్నప్పుడు

ముందే  అనుకున్న వాటిని (assumptions) బట్టి శ్రమ శక్తి విలువా, అదనపువిలువ పరిమాణమూ  మూడు నియమాల చేత నిర్ణయమవుతాయి. నియమాలు:
మొదటి నియమం
ఒక నిర్ణీత నిడివి ఉన్న పనిరోజు ఎల్లప్పుడూ ఒకే మొత్తం విలువని ఉత్పత్తి చేస్తుంది. శ్రమ ఉత్పాదకతా,దాంతో వచ్చే ఉత్పాదితమూ, ఒక్కొక విడి సరుకు ధర ఎంతగా మారినా సరే. పైవిలువ మొత్తం ఏమాత్రం మారదు. ఉదాహరణకి, 12 గంటల పనిదినంలో ఉత్పత్తయ్యే విలువ 6 షిల్లింగులు. శ్రమ ఉత్పాదకత మారితే, ఉత్పత్తయిన సరుకుల సంఖ్య మారుతుంది. ఫలితం: 6 షిల్లింగుల విలువ మరిన్ని సరుకులకు ఎక్కువో తక్కువో పరచబడుతుంది. అంతే.  ఉదాహరణకి రోజులో 50 వస్తువులు తయారయ్యేవనీ, వాటి విలువ 500 రూపాయలనీ అనుకుందా. ఇప్పుడు ఉత్పాదకత పెరిగి అదే కాలంలో 100 ఉరువులు ఉత్పత్తయినా, 200 లో 400 లో  ఎన్ని ఉత్పత్తయినా సరే, వాటి మొత్తం విలువ 500 రూపాయలే, అది మారదు. ఒక్కొక్క ఉరువు విలువ మారుతుంది. 50 ఉరువులు తయరైనప్పుడు ఒక్కోదాని విలువ 10 రూపాయలు.100 అయితే  5 రూపాయలు. 200  అయితే 2.5 రూపాయలు, 400 అయితే 1.25 రూపాయలు.   
రెండో నియమం
  అదనపువిలువా, శ్రమ శక్తి విలువా వ్యతిరేక దిశల్లో మారతాయి. అంటే ఒకటి పెరిగితే రెండోది తగ్గుతుంది.
12 గంటల పనిదినంలో 6 షిల్లింగుల విలువ ఉత్పత్తయిందనీ, ఇందులో శ్రమ శక్తి విలువా అదనపు విలువా సమానం - చెరొక 3 షిల్లింగులు- అనీ అనుకుందాం. ఇప్పుడు ఒకటి 4 షిల్లింగులు కావాలంటే, రెండోది 2 షిల్లింగులకు  తగ్గి తీరాలి. అవి రెండూ ఏకకాలంలో పెరగడంగానీ, తగ్గడంగానీ సాధ్యం కాదు.
 
ఉత్పాదకతా అదనపు విలువా
ఉత్పాదకశక్తిలో మార్పు (దాని పెరుగుదలా/ తగ్గుదలా) దానికి వ్యతిరేక వ్యతిరేక దిశలో శ్రమ శక్తి విలువలో మార్పు తెస్తుంది. అంటే, ఉత్పాదక శక్తి పెరిగితే, శ్రమశక్తి విలువ తగ్గుతుంది. ఉత్పాదకశక్తి తగ్గితే శ్రమశక్తి విలువ పెరుగుతుంది. అదనపు విలువ కదలిక ఇందుకు భిన్నంగా ఉత్పాదకత మారే దిశలోనే మారుతుంది. అంటే ఉత్పాదకత పెరిగితే అదనపు విలువ పెరుగుతుంది. అది తగ్గితే ఇదీ తగ్గుతుంది. 12 గంటల పనిదినంలో  6 షిల్లింగుల విలువ ఉత్పత్తయితే, అది శ్రమశక్తి విలువా, అదనపువిలువా కలిసిన మొత్తం. ఒక స్థిర పరిమాణం రెండు భాగాలుగా ఉంటే, ఒకటి తగ్గనిదే రెండోది పెరగదు.ఇది స్వయం స్పష్టం.  
పైగా, శ్రమ ఉత్పాదకత పెరగకపోతే, శ్రమ శక్తి విలువ తగ్గదు, దాని ఫలితమైన అదనపువిలువ పెరగదు. శ్రమ శక్తి విలువ తగ్గితేనే,అదనపు విలువ పెరుగుతుంది.శ్రమశక్తి విలువ తగ్గాలంటే, ఉత్పాదకత పెరగాలి.
పై ఉదాహరణలో శ్రమ శక్తి విలువ 3 షిల్లింగులు. అది 2 షిల్లింగులకి దిగాలంటే,మునుపు 6 గంటల్లో ఉత్పత్తయినంత ఇప్పుడు 4 గంటల్లోనే ఉత్పత్తవాలి. అంటే, ఉత్పాదకత పెరగాలి. శ్రమ శక్తి విలువ 4 షిల్లింగులకు పెరగాలంటే, మునుపు 6 గంటల్లో ఉత్పత్తయిన జీవితావసరాల ఉత్పత్తికి ఇప్పుడు 8 గంటలు పట్టాలి. దీన్ని బట్టి,ఉత్పాదకతలో పెరుగుదల శ్రమ శక్తి విలువని తగ్గించి, అదనపువిలువని పెంచుతుంది. 
అలాగని మార్పులు ఒకే నిష్పత్తిలో జరుగుతాయని కాదు. అలా నిర్ధారించడం కుదరదు.
రికార్డో పొరపాటు
నియమాన్ని రూపొందించేటప్పుడు రికార్డో ఒక పరిస్థితిని పట్టించుకోలేదు. ఏమంటే, అదనపు విలువ పరిమాణంలో మార్పు, శ్రమ శక్తి విలువలో మార్పుని వ్యతిరేక దిశలో తెచ్చినంతమాత్రాన, అవి ఒకే నిష్పత్తిలో మారతాయి అనడం వీలవదు. నిష్పత్తికి సంబంధించిన పెరుగుదలగానీ, తగ్గుదలగానీ ఉత్పాదకతలో మార్పు రాకముందు వాటి పరిమాణాల్ని బట్టి ఉంటుంది. శ్రమ శక్తి విలువ 4 షిల్లింగులు, అదనపువిలువ 2 షిల్లింగులు లేదా అవసర శ్రమకాలం 8 గంటలు, అదనపు శ్రమ 4 గంటలు అనుకుందాం. అప్పుడు ఉత్పాదకత పెరిగి శ్రమ శక్తి విలువ 3 షిల్లింగులకు, లేక అవసరశ్రమ 6 గంటలకు తగ్గితే, అదనపువిలువ 3 షిల్లింగులకు లేక అదనపుశ్రమ 6 గంటలకు పెరుగుతుంది.ఒకే పరిమాణం ఒక షిల్లింగు లేక 2 గంటల శ్రమ ఒక దానిలో కలుస్తుంది, రెండో దాంట్లో తీసివేయబడుతుంది. అయితే పరిమాణానికి సంబంధించిన నిష్పత్తికిలో మార్పు సందర్భంలోనూ, ఈసందర్భంలోనూ వేర్వేరుగా ఉంటుంది. శ్రమశక్తి విలువ 4 షిల్లింగులనుండి 3 షిల్లింగులకి పడితే, అంటే 25% శాతం తగ్గితే, అదనపు విలువ 2 షిల్లింగులనుంచి 3 షిల్లింగులకు, అంటే 50% పెరుగుతుంది. కాబట్టి, శ్రమ ఉత్పాదకతలో మార్పువల్ల వచ్చే అదనపు విలువలో మార్పు అదనపు విలువనిచ్చే మునుపటి పనిదినం భాగం పరిమాణాన్ని బట్టి ఉంటుంది. ఆభాగం తక్కువయితే, నిష్పత్తిలో మార్పు ఎక్కువ వుంటుంది. ఆభాగం ఎక్కువయితే, నిష్పత్తిలో మార్పు తక్కువ వుంటుంది.   
మూడో నియమం
అదనపు విలువలో మార్పు (పెరుగుదల/తగ్గుదల) శ్రమ శక్తి విలువలో మార్పుకి అనుగుణంగా ఉంటుంది. కాని శ్రమ శక్తి విలువ లో మార్పుకి, అదనపు విలువలో మార్పు కారణం కాదు. శ్రమ శక్తి విలువ తగ్గితే, అదనపు విలువ పెరుగుతుంది, అది పెరిగితే ఇది తగ్గుతుంది. అవి ఒకదానికొకటి వ్యతిరేక దిశల్లో కదులుతాయి.ఇక్కడ శ్రమ శక్తి విలువ అంటే శ్రామికుల మామూలు జీవనాధార సాధనాల విలువ.ఇది స్థిరంగా ఉన్నట్లు లెక్క.
నియమం ప్రకారం అదనపు విలువ పరిమాణంలో మార్పు రావాలంటే, ముందు శ్రమ శక్తి విలువలో కదలిక రావాలి. కదలిక శ్రమ ఉత్పాదకతలో మార్పు వల్ల వస్తుంది. మార్పు పరిమితి, మారిన శ్రమ శక్తి విలువని బట్టి ఉంటుంది.
నియమం అమలైన పరిస్థితుల్లో సైతం అనుబంధ కదలికలు (subsidiary movementsఉండవచ్చు.
ఉదాహరణకి, ఉత్పాదకత పెరిగినందువల్ల శ్రమ శక్తి విలువ 4 షిల్లింగులనుండి 3 షిల్లింగులకు (లేక అవసర శ్రమకాలం 8 గంటలనించీ 6 గంటలకి) పడింది అనుకుందాం. అప్పుడు శ్రమ శక్తి ధర 3షిల్లింగుల 8 పెన్నీలకన్నా లేక  3 షి. 6పె కన్నా, లేక  3షి. 2 పె కన్నా తగ్గకపోవచ్చు. దాని ఫలితంగా అదనపు విలువ 3 షిల్లింగుల 4 పెన్నీలను మించి, లేక   3 షి 6 పె. ను మించి,3 షి 10 పె. ను మించి పెరగక పోవచ్చు. శ్రమ శక్తి ఇప్పటి కొత్త విలువ 3 షిల్లింగులు కనుక అంతకన్నా తగ్గదు. ఏమేరకు తగ్గుతుంది అనేది, ఒకవైపు తగ్గించాలని పెట్టుబడిదారుడు పెట్టే ఒత్తిడి, రెండో వైపు దాన్ని ప్రతిఘటించే శ్రామికుని ఒత్తిడి - ఈరెంటి బలాబలాల మీద ఆధారపడి ఉంటుంది.
శ్రమ శక్తి విలువని నిర్ణయించేది నిర్ణీత పరిమాణం గల జీవితావసరాల విలువ. శ్రమ ఉత్పాదకత మారితే మారేది ఆ అవసరాల విలువే, కాని వాటి రాశి కాదు.అయితే, శ్రమ శక్తి ధరలోనూ, అదనపువిలువలోనూ ఏమార్పూ లేకపోయినా, ఉత్పాదకత పెరుగుదల వల్ల, కార్మికుడూ, పెట్టుబడిదారుడూ ఇద్దరూ కూడా  మరింత ఎక్కువ పరిమాణంలో ఈ జీవితావసరాలను స్వాయత్తం చేసుకోవడం సాధ్యమే.
శ్రమ శక్తి విలువ 3 షిల్లింగులు, అవసర శ్రమకాలం 6 గంటలు, అదనపు విలువ 3 షిల్లింగులు, అదనపు శ్రమకాలం 6 గంటలు - అయినప్పుడు అవసర , అదనపు శ్రమల నిష్పత్తి మారకుండా ఉంటే, అదనపు విలువ పరిమాణంలోగానీ, శ్రమశక్తి ధర పరిమాణంలో గానీ మార్పు ఉండదు.
దాని ఫలితం ఒక్కటే : రెంటిలో అదీ ఇదీ  మునుపటికన్నా రెట్టింపు ఉపయోగపు విలువలకు ప్రతినిధ్యం వహిస్తాయి; ఉపయోగపు విలువలు మునుపటికంటే రెండింతలు చౌకవుతాయి. శ్రమ శక్తి ధరలో మార్పు రానప్పటికీ, అది దాని విలువ కంటే ఎక్కువే ఉంటుంది. అయినప్పటికీ, శ్రమశక్తి ధర ఇప్పటి కనీస స్థాయి అయిన 1 షి.6 పె.కు కాకుండా 2 షి 10పె. కో,2 షి 6 పె. కో  పడిపోతే, ఈతక్కువ ధర కూడా మునుపటికన్నా ఎక్కువ జీవితావసర వస్తువులకు  ప్రతినిధిగా ఉంటుంది.   ఈవిధంగా, శ్రమ శక్తి ధర తగ్గుతూ పోతున్నా, శ్రామికుని జీవితావసరాల రాశి పెరుగుతూ ఉండడం సాధ్యమే. అటువంటి సందర్భంలో సైతం శ్రమశక్తి విలువలో పతనం, అదనపు విలువలో దానికనుణమైన పెంపుని తెస్తుంది. ఆవిధంగా కార్మికుని స్థాయికీ, పెట్టుబడి దారుడి స్థాయికీ మధ్య ఉండే అఖాతం అంతకంతకూ వెడల్పు అవుతుంది.
రికార్డో ఈనియమాల్ని సూత్రీకరించాడు
పైన చెప్పిన మూడు నియమాల్నీ మొట్టమొదట కచ్చితంగా సూత్రీకరించిన వాడు రికార్డో. అయితే ఇక్కడ రెండు పొరపాట్లు చేశాడు.
మొదటి పొరపాటు. ఇవి వర్తించే ప్రత్యేక పరిస్థితుల్ని పెట్టుబడిదారీ ఉత్పత్తికీ సర్వ సాధారణమైన ఏకైక పరిస్థితులుగా పరిగణించాడు.ఆయనకు పనిదినం పొడవులో మార్పులుగానీ, శ్రమ తీవ్రతలో మార్పులుగానీ ఉండే మార్పులు పరిశీలించలేదు.అందువల్ల ఆయన ప్రకారం మారే అంశం ఒక్కటే. అదే శ్రమ ఉత్పాదకత.మిగిలినవి మారవు. ఇదొక పొరపాటు.
రెండో పొరపాటు. అదనపువిలువని ఒకమొత్తంగా చూడలేదు. లాభం, కౌలు వంటి అదనపు విలువ భాగాలను, దాని ప్రత్యేక రూపాల్ని దేనికదిగా చూశాడు. మొదటి పొరపాటు కన్నా ఇది ఆయన విశ్లేషణని ఎక్కువ లోప భూయిష్టం చేసింది. 'అదనపు విలువ సిద్ధాంతాలూ పుస్తకం మొదట్లోనే ఈవిషయంలో అందరూ అదే పొరపాటు చేశారంటాడు:                             ఆర్ధిక వేత్తలందరూ అదనపు విలువని దానికదిగా, స్వచ్చమైన రూపంలో పరిశీలించకుండా, దాని ప్రత్యేకరూపాలైన లాభంగానూ,కౌలుగానూ పరిశీలించి పొరపాటు చేశారు.(Theories of Surplus Value Vol 1. p.40)                          పొరపాటు ఫలితం: రికార్డో అదనపువిలువ రేటు నియమాల్నీ, లాభంరేటు నియమాల్నీ కలిపి గందరగోళపరుస్తాడు.
రికార్డో గందరగోళం
ఇదివరకే చెప్పినట్లు లాభం రేటు పెట్టిన మొత్తం పెట్టుబడితో అదనపువిలువ నిష్పత్తి. అదనపు విలువ రేటు మొత్తం పెట్టుబడిలో ఒక భాగమైన అస్థిర పెట్టుబడితో అదనపువిలువ నిష్పత్తి.
ఉదాహరణకి, మొత్తం పెట్టుబడి (C) 500 పౌన్లనీ, అందులో స్థిరభాగం (c) 400, అస్థిరభాగం (v)100 పౌన్లనీ, అదనపు విలువ (s) 100 పౌన్లనీ అనుకుందాం.
అప్పుడు, అదనపు విలువ రేటు = అదనపు విలువ/అస్థిర పెట్టుబడి = 100/100= 100%
లాభం రేటు s/v= అదనపు విలువ/మొత్తం పెట్టుబడి = 100/500 = 20%
లాభం రేటు అదనపు విలువ రేటుని ఏవిధంగానూ  ప్రభావితం చెయ్యని పరిస్థితులమీద ఆధారపడి ఉండవచ్చు.
ఒకే అదనపు రేటు ఉన్నా, ఎన్నో లాభం రేట్లు ఉండవచ్చుననీ, వేర్వేరు అదనపు విలువ రేట్లు  ఒకే లాభం రేటుని వ్యక్తం చెయ్య వచ్చనీ  3 సంపుటంలో చూపిస్తాను.
B.పనిదినమూ, శ్రమ ఉత్పాదకతా స్థిరంగా ఉండి, శ్రమ తీవ్రత మారుతూ ఉన్నప్పుడు 
మామూలు  శ్రమ తీవ్రతతో గంటకి 20 కొబ్బరికాయలు వలిస్తే, ఎక్కువ శ్రమ తీవ్రతతో 30 లేక 40 వలవ వచ్చు. అంతే కాలంలో, అంటే పనికాలం పెరగకుండానే ఎక్కువ సరుకులు ఉత్పత్తవుతాయి. ఉత్పాదకత పెరిగినా అదే ఫలితం వస్తుంది. ఏది పెరిగినా ఉత్పత్తయ్యే ఉరువులు పెరుగుతాయి.
మరి రెంటికీ తేడా ఏమిటి?
విలువ విషయం వేరు.శ్రమ తీవ్రత పెరిగినా ఒక్కొక్క సరుకు విలువ మారదు. కాని ఉత్పాదకత పెరిగి నప్పుడు ఒక్కొక్క సరుకు విలువ తగ్గుతుంది.ఉత్పాదకత తగ్గి నప్పుడు ఒక్కొక్క సరుకు విలువ పెరుగుతుంది. 

ఉత్పాదకత పెరిగిన సందర్భంలో ఒక్కొక్క ఉరువు విలువ మారుతుంది. ఎందుకంటే, అంతకు ముందు కన్నా ఇప్పుడు తక్కువ శ్రమ పడుతుంది. శ్రమ తీవ్రత పెరిగిన సందర్భంలో దాని విలువ అలానే ఉంటుంది, ఎందుకంటే, అంతకు ముందు ఎంత శ్రమ పట్టిందో, ఇప్పుడూ అంతే శ్రమ పడుతుంది. కనుక ఉరువుల సంఖ్య పెరుగుతుంది, కాని ఒక విడి ఉరువు ధరలో మార్పు రాదు. అంటే, 30 ఉరువులు బదులు 40 ఉరువులు ఉత్పత్తవుతాయి. వాటి మొత్తం ధర అప్పుడు 300 రూపాయలు ఉంటే, ఇప్పుడు 400 రూపాయలు ఉంటుంది. వాటి సంఖ్యతోపాటే ధర మొత్తమూ పెరుగుతుంది.ఉత్పాదకత పెరిగిన సందర్భంలో మునుపటి 30 ఉరువుల  విలువ ౩౦౦ రూపాయలు మరిన్ని 40 ఉరువులకు పరచబడుతుంది. కనుక మునుపు 10 రూపాయలు గావున్న ఒక్కొక్క ఉరువు ధర తగ్గి, ఇప్పుడు 7 ½
 రూపాయలు అవుతుంది.

అయితే మొత్తం విలువ మునుపు ఉన్నంతే ఉంటుంది. డబ్బు విలువ మారకపోతే మరింత డబ్బు వస్తుంది.శ్రమ తీవ్రత సమాజంలో మామూలుగా ఉన్న శ్రమ తీవ్రత స్థాయినుండి ఏమేరకు వైదొలగుతుందో దాన్ని బట్టి ఉత్పత్తయ్యే విలువ మారుతుంది.అందువల్ల ఒక నెర్ణీత పనిదినంలో ఉత్పత్తయ్యే విలువ స్థిర పరిమాణం కాదు, మారే పరిమాణం.12 గంటల పనిదినంలో మామూలు శ్రమ తీవ్రతతో ఉత్పత్తయ్యే విలువ 6 షిల్లింగులు అనుకుందాం.  శ్రమ తీవ్రత పెరిగెకొద్దీ, ఉత్పత్తయ్యె విలువ 7,8 ఇంకా మరిన్ని షిల్లింగులో కావచ్చు.
ఒక రోజు శ్రమ ఉత్పత్తి చేసే విలువ పెరిగితే?

విలువ శ్రమ శక్తి విలువగానూ, అదనపు విలువగానూ రెండు భాగాలవుతుంది.అవి రెండూ ఏకకాలంలో సమంగానో, అసమంగానో పెరుగుతాయన్నది  స్పష్టమే.అదీ ఇదీ 3 నుంచి 4 షిల్లింగులకు పెరగవచ్చు. ఇక్కడ శ్రమ శక్తి ధర పెరుగుదలని చూసి, ధర శ్రమ శక్తి విలువను మించి కచ్చితంగా పెరిగిందని చెప్పడం కుదరదు. అందుకు భిన్నంగా, ధర పెరిగి, విలువ తగ్గవచ్చు.ఇదెప్పుడు జరుగుతుంది?
శ్రమ శక్తి ధర పెరుగుదల, పెరిగిన శ్రమ తీవ్రతమూలంగా శ్రమశక్తికి ఎక్కువ అరుగూ, తరుగూ (wear and tear) ఉంటుంది. అరుగు,తరుగుల నష్టపరిహారాన్ని శ్రమ శక్తి ధరలో పెరుగుదల పూడ్చ నప్పుడు అలా జరుగుతుంది.. ఉదాహరణకి శ్రమ శక్తి ధర 6 పెన్నీలు పెరిగి, శ్రమ శక్తి అరుగుదుల 8 షిల్లింగులకు పెరిగితే ఈ ఫలితం వస్తుంది.

ఉత్పాదకతా శ్రమ తీవ్రతా రెండూ  అదనపు విలువని పెంచే సాధనాలే. ఎక్కువ ఉత్పాదకత కార్మికులు వాడే వస్తువులు తయారు చేసే శ్రమ ఉత్పదకత పెరిగితేనే, సాపేక్ష అదనపు విలువ ఏర్పడుతుంది. వాళ్ళు వాడని వస్తువులు చేసే శ్రమ ఉత్పాదకత పెరిగినా శ్రమ శక్తి విలువ మారదు. 
ఇందుకు భిన్నంగా ఎక్కువ శ్రమ తీవ్రత ఎల్లప్పుడూ  మరింత అదనపు విలువని ఇస్తుంది. ఇది మనకు తెలిసిందే.  ప్రస్తుత సందర్భంలో ఇది ర్తించదు.ఎందువల్ల?
శ్రమ కాలంలోనో,శ్రమ తీవ్రతలోనో మార్పు  అయితే, ఎల్లప్పుడూ దానికి అనుణంగా, ఉత్పత్తయిన విలువ పరిమాణంలో మార్పు వస్తుంది - ఆవిలువ చేరిన వస్తువు స్వభావంతో నిమిత్తముండదు. అదేదైనా సరే.
శ్రమ తీవ్రత అన్ని పరిశ్రమ శాఖల్లోనూ సమంగా, ఏకకాలంలోపెరిగితే, కొత్త, ఎక్కువ తీవ్రతే సమాజంలో మామూలు స్థాయి తీవ్రత అవుతుంది. కాబట్టి అదిక లెక్కలో ఉండదు.
అయినా, అప్పుడు కూడా వేర్వేరు దేశాల్లో శ్రమ తీవ్రత వేర్వేరుగా ఉంటుంది. విలువ నియమపు అంతర్జాతీయ వర్తింపుని సవరిస్తుంది. ఒక దేశంలో శ్రమ తీవ్రత ఎక్కువవుంటే, అక్కడ పనిదినం తక్కువ తీవ్రత ఉన్న దేశం పనిదినంతో పోలిస్తే, ఎక్కువ డబ్బుకి ప్రతినిధిగా ఉంటుంది.
C.  శ్రమ ఉత్పాదకతా, శ్రమ తీవ్రతా స్థిరంగా ఉండి, పనిదినం పొడవు మారితే...
ఫనిదినం నిడివిరెండు విధాలుగా మారవచ్చు.అది పెరగావచ్చు, తగ్గావచ్చు.
మనకున్న దత్తంశాల నుండి, మనం ముందుగా అనుకున్న వాటి పరిధిలో మూడు నియమాలొస్తాయి.
1.ఫనిదినంలో దాని పొడవునుకి అనుగుణంగా ఎక్కువో తక్కువో విలువని ఉత్పత్తి చేస్తుంది.ఆవిధంగా విలువ పరిమాణం అస్థిరంగా ఉంటుంది.స్థిర పరిమాణంగా ఉండదు.
2.అదనపు విలువ పరిమాణానికీ, శ్రమ శక్తి విలువ పరిమాణానికీ మధ్య సంబంధంలో మార్పు అయినా అదనపు శ్రమ యొక్క పరమ పరిమాణంలో మార్పు నుంచి, దాని పర్యవసానంగా అదనపు విలువ పరిమాణంలో మార్పు నుంచి మాత్రమే వస్తుంది.  
3. అదనపు శ్రమ పొడిగింపు శ్రమ శక్తి అరుగుదలమీద ప్రభావం నెరుపుతుంది. ప్రభావానికి ప్రతిచర్య ఫలితంగా మాత్రమే శ్రమ శక్తి పరమ విలువ మారగలదు. అందువల్ల, పరమ విలువలో మార్పయినా అదనపు విలువ పరిమాణంలో మార్పుకి ఫలితమే కాని, అందుకు  కారణం  ఎన్నటికీకాదు.

 పనిదినంపొడవు తగ్గిన సందర్భాన్ని ముందు చూస్తాడు.
పైన 1 లో చెప్పిన పరిస్థితుల్లో, పనిదినం తగ్గింపు శ్రమశక్తి విలువనీ, దాంతో పాటు అవసర శ్రమ కాలాన్నీ మార్చకుండా అలానే ఉంచుతుంది. అవసర శ్రమ కాలం పరమ పరిమాణంతో పాటు, దాని సాపేక్ష పరిమాణంకూడా పడిపోతుంది. అంటే, మారకుండా అలాగే వున్న శ్రమ శక్తి విలువతో పోలిస్తే సాపేక్షంగా అదనపు విలువ పరిమాణం  పడిపోతుంది. పెట్టుబడి దారుడి వాటా తగ్గుతుంది. ఆపరిస్థితిలో, శ్రమ శక్తి ధరని తగ్గించడం ద్వారా మాత్రమే, పెట్టుబడి దారుడు తనకు హాని జరగకుండా చూసుకోగలడు.
శ్రమ తీవ్రతా, ఉత్పాదకతా స్థిరంగా ఉంటే, శ్రమ శక్తి విలువ తగ్గించకుండా పనిదినాన్ని తగ్గిస్తే అదనపు విలువ తగ్గుతుంది. గంట వేతనం పెరుగుతుంది. అయితే ఇలాంటి పరిస్థితి రావడం చాలా అరుదు. వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంటుంది : ఉత్పాదక శక్తిలోనూ, తీవ్రతలోనూ మార్పు పనిదినం కుదింపుకి ముందుగానీ, అది జరిగీ జరగగానే గానీ వస్తుంది. ఇక్కడ ఫుట్ నోట్ : నష్టాన్ని భర్తీచేసే పరిస్థితులు ఉన్నాయి.వాటిని 10 గంటల పనిదినం అమలు మూలంగా అవి వెలుగులోకి వచ్చాయి. అంటే, పెట్టుబడి దారీ విధానం  లాభాన్ని తగ్గించే ప్రభావాల్ని తటస్థీకరించే మార్గాలు కనుక్కుంటుంది.
2. పనిదినం పొడిగింపు.అవసర శ్రమ కాలం 6 గంటలు లేక శ్రమ శక్తి విలువ 3 షిల్లింగులు, అదనపు విలువకూడా అంతే అనుకుందాం. అంటే, పనిదినం 12 గంటలు. ఉత్పత్తయ్యే విలువ 6 షిల్లింగులు. ఇప్పుడు శ్రమ శక్తి ధర అలానే వుండి, పనిదినం 2 గంటలు పెరిగితే అదనపు విలువ సాపేక్షంగానూ నిరపేక్షంగానూ కూడా పెరుగుతుంది. శ్రమ శక్తి విలువలో నిరపేక్ష మార్పు లేకున్నా,  అది సాపేక్షంగా తగ్గుతుంది.  పనిదినం పొడిగింపు.అవసర శ్రమ కాలం 6 గంటలు లేక శ్రమ శక్తి విలువ 3 షిల్లింగులు
అదనపు విలువకూడా అంతే అనుకుందాం. అంటే, పనిదినం 12 గంటలు. ఉత్పత్తయ్యే విలువ 6 షిల్లింగులు. ఇప్పుడు శ్రమ శక్తి ధర అలానే వుండి, పనిదినం 2 గంటలు పెరిగితే అదనపు విలువ సాపేక్షంగానూ నిరపేక్షంగానూ కూడా పెరుగుతుంది. శ్రమ శక్తి విలువలో నిరపేక్ష మార్పు లేకున్నా,  అది సాపేక్షంగా తగ్గుతుంది. 

1 లో ఉన్నాయనుకున్న పరిస్థితుల్లో శ్రమ శక్తి విలువ పరమ పరిమాణంలో మార్పు లేనిదే, దాని సాపేక్ష పరిమాణంలో మార్పు రాదు.అయితే అందుకు వ్యతిరేకంగా ఇక్కడ శ్రమ శక్తి విలువ సాపేక్ష  పరిమాణంలో మార్పు, పరమ అదనపు విలువ పరిమాణంలో మార్పు వల్ల వస్తుంది. ఒక రోజు శ్రమ ఉత్పత్తిచేసే విలువ, పనిరోజు పొడవుతో పాటు పెరుగుతుంది.కాబట్టి, అదనపు విలువా శ్రమశక్తి విలువా రెండూ కూడా ఏకకాలంలో పెరగవచ్చు - సమంగానో, అసమంగానో.
ఇలా ఏకకాలం లో రెండూ పెరగడం రెండు సందర్భాల్లో మాత్రమే సాధ్యం:
1. పనిదినం పొడవు వాస్తవంగా పెరిగినప్పుడు
2. పనిదినం పెంపు లేకపోయినా, శ్రమ తీవ్రత పెరిగినప్పుడు.
పనిదినం పొడవు పెరిగితే, శ్రమ శక్తి ధర నామకా మారకపోయినా, లేదూ ఒకవేళ పెరిగినా, శ్రమ శక్తి విలువకన్న తగ్గవచ్చు. ఇక్కడ ఒక్క విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. ఎమంటే:ఒక రోజు శ్రమ శక్తి విలువ ఎలా లెక్కింప బడుతుంది? దాని సాధారణ సగటు కాల పరిమాణాన్ని బట్టి.
రోజుకి కొంత శ్రమ శక్తి అరిగిపోతుంది. పనిదినం పెరిగితే, అరుగుద లా పెరుగుతుంది. నష్టాన్ని వేతనపెంపు  పరిహరించ వచ్చు.అయితే ఇది ఒక స్థాయి వరకే వీలవుతుంది. అది దాటితే అరుగుదల గుణ శ్రేణిలో  (geometrical progression) పెరుగుతుంది. అప్పుడు శ్రమశక్తి మామూలుగా పునరుత్పత్తి కావడానికీ, శ్రమ చెయ్యడానికీ తగిన ప్రతి పరిస్థితీ అణచివేయ బడుతుంది. శ్రమ శక్తి ధరా, దోపిడీ స్థాయీ  ఇక కొలవ తగిన పరిమాణాలుగా( commensurable quantities ) ఉండవు.
D.ఏకకాలంలో పొడవులోనూ, ఉత్పాదకతలోనూ తీవ్రతలోనూ మార్పులు
మూడు అంశాలూ ఒకేసారి మారుతుంటే, అనేక కలయికలు సాధ్యమవుతాయి అనేది స్పష్టమే. రెండు అంశాలు మారుతూ, మూడోది స్థిరంగా ఉండవచ్చు, లేదా ఒకేసారి మూడూ మారనూ వచ్చు. ఆమారేవి ఒకే దిశలో, ఒకే స్థాయిలో మారవచ్చు. లేదా వెర్వెరు స్థాయిల్లో, విరుద్ధ దిశల్లో నయినా మారవచ్చు; ఫలితంగా ఆయా మార్పులు ఒకదాన్నొకటి   పూర్తిగానో పాక్షికంగానో భంగం చెయ్యవచ్చు/ పరిహరించవచ్చు. అయినప్పటికీ, A,B,C లలో ఫలితాల దృస్ట్యా సాధ్యమయ్యే ప్రతి సందర్భాన్నీ విశ్లేషించడం సులభమే.  ఒక్కొక్క సారి ఒక్కొక్క అంశాన్ని అస్థిమైనదిగానూ, మిగిలిన రెంటినీ స్థిరమైనవిగానూ తాత్కాలింగా భావించి, ఏకలయిక ఫలితాన్నైనా కనుక్కోవచ్చు.
అందువల్ల, ప్రతి సందర్భాన్నీ పరిశీలించాల్సిన పనేమీ లేదు. అయితే రెండు ముఖ్యమైన సందర్భాల్ని గమనించాలి.
1.పనిదినం పొడవు పెరుగుతుండగా, తగ్గిపోతున్న శ్రమ ఉత్పాదకత
తగ్గిపొతున్న శ్రమ ఉత్పాదకత గురించి మాట్లాడటంలో మనం శ్రమ శక్తి విలువని నిర్ణయించే వస్తువుల్ని ఉత్పత్తి చేసే పరిశ్రమల్లో శ్రమ ఉత్పాదకత తగ్గుదల గురించి మాట్లాడుతున్నాం. అటువంటి తగ్గుదల, ఉదాహరణకి, భూసారం తగ్గి, ఆకారణంగా దాని ఉత్పత్తుల ధర పెరిగి ఏర్పడవచ్చు.
12 గంటల ఫనిదినంలో ఉత్పత్తయ్యే విలువ 6 షిల్లింగులనీ, అందులో సగం శ్రమశక్తి విలువ అనీ, సగం అదనపువిలువ అనీ అనుకుందాం. పరిస్థితుల్లో, భూమి ఉత్పత్తుల విలువ పెరిగి, శ్రమశక్తి ధర 3 నుంచి 4 షిల్లింగులకు పెరిగిందనుకుందాం.అంటే అవసర శ్రమకాలం 6 గంటల నుంచి 8 గంటలకు పెరుగుతుంది. పనిదినం పొడవు మారకుండా ఉంటే, అదనపు శ్రమ కాలం 6 నించి 4 గంటలకు పడిపోతుంది.అదనపు విలువ 3 నించి 2 షిల్లింగులకు దిగుతుంది. పనిదినం పొడవు 2 గంటలు (12 నించి 14 గంటలకు) పెరిగితే, అదనశ్రమ కాలం మారకుండా 6 గంటలు అలాగే ఉంటుంది.అదనపు విలువ 3 షిల్లింగులు అలాగే ఉంటుంది. అయితే, శ్రమ శక్తి విలువతో పోల్చిచూస్తే, అదనపు విలువ తగ్గుతుంది. పనిదినాన్ని 4 గంటలు (12 నించి 16 గంటలకి) పెంచితే, అదనపు విలువ,శ్రమశక్తి విలువల, అవసర శ్రమ అదనపు శ్రమల దామాషా పరిమాణాలు (proportional magnitudes), మారవు. కాని పరమ అదనపు విలువ పరమ పరిమాణం 3 నించి 4 షిల్లింగులకు, అదనపు శ్రమ పరమ పరిమాణం 6 నించి 8 గంటలకు పెరుగుతుంది. అంటే 33 1/3 శాతం పెంపు. అందువల్ల  ఉత్పాదకత తగ్గుతున్నా, అదేసమయంలో  పనిదినం పొడవు పెరుగుతుంటే అదనపు విలువ యొక్క పరమ పరిమాణం అలాగే ఉంటుంది. అయితే అదే సమయంలో దాని సాపేక్ష పరిమాణం తగ్గుతుంది; దాని సాపేక్ష పరిమాణం మారకుండా, అదేసమయంలో దాని పరమ పరిమాణం పెరగవచ్చు. పనిదిన పొడవు తగినంత పెరిగితే  రెండు అంశలూ కూడా పెరగవచ్చు. 
చరిత్ర నుంచి ఉదాహరణ
ఇందుకు మార్క్స్ చరిత్ర నుంచి ఒక ఉదాహరణ ఇస్తాడు. 1799-1815 కాలంలో ఇంగ్లండ్ లో ఆహారపదార్ధాల వంటి నిత్య జీవితావసరాల ధరలు పెరిగాయి. నామక వేతనాలు కూడా  పెరిగాయి. జీవితావసర వస్తువుల ధరలు పెరిగినంతగా పెరగలేదు.అంటే అంతకు ముందు వచ్చినన్ని సరుకులు ఇప్పుడు రావు. దీన్ని బట్టి, నిజవేతనాలు తగ్గినట్లు- నామక వేతనాలు పెరిగినా.
లాభాలు మాత్రం తగ్గలేదు. అయితే, రికార్డో, వెస్ట్ -ఇద్దరూ లాభాలు తగ్గాయని అనుకున్నారు. అందుకు కారణం- వాళ్ళుశ్రమ తీవ్రతనీ, పనిదినం పొడవునీ పట్టించుకోలేదు. లెక్కలోకి తీసుకోకుండా వదిలిపెట్టారు.
పైవాస్తవాన్ని బట్టి, రికార్దో, వెస్ట్  ఇద్దరూ వ్యవసాయంలో శ్రమ ఉత్పాదకత తగ్గడం వల్ల అదనపువిలువ రేటు తగ్గినట్లు తేల్చారు.వాస్తవంలొ లేని, వాళ్ళ ఊహలో మాత్రమే ఉన్న ఒక విషయాన్ని వేతనాల, లాభాల,కౌలుల పరిశోధనకు ఆరంభ బిందువు చేసుకున్నారు. అయితే నిజానికి ఆకాలంలో అదనపు విలువ శ్రమ తీవ్రతా, పనిదినం పొడవూ పెరిగినందువల్ల పెరిగింది - పరమంగానూ, సాపేక్షంగానూ. అది యజమానులు పనిగంటల్ని ఏ దారుణ మేరకైనా పెంచుకునే హక్కు స్థిరపడి ఉన్న కాలం; ఇక్కడ పెట్టుబడి పోగుబడి వేగవంతం అవడమూ, అక్కడేమో దుర్భర దారిద్ర్యం పెరగడమూ కాలపు ప్రత్యేక లక్షణం. మాల్థూస్ రికార్డో, వెస్ట్ లు పనిదినం పెంపునీ, శ్రమ తీవ్రతనీ లెక్కలోకి తీసుకోలేదని అన్నాడు.

2. శ్రమ తీవ్రతా, ఉత్పాదకతా పెరుగుతుండగా, పనిదినం పొడవు తగ్గడం.

శ్రమ ఉత్పాదకత పెరిగినా,తీవ్రత పెరిగినా ఒకే ఫలితం వస్తుంది. నిర్ణీత కాలంలో ఉత్పత్తయ్యే వస్తువుల మొత్తం పెరుగుతుంది. కనుక అవిరెండూ అవసర శ్రమకాలాన్ని తగ్గిస్తాయి.  కుదించడానికి వీలయ్యే అవసరశ్రమకాలం, పనిదినం యొక్క కనీస పరిమితిని నిర్ణయిస్తుంది. మొత్తం పనిదినం భాగం పొడవు వరకూ తగ్గితే, అదనపు విలువ అంతర్ధానం అవుతుంది. పరిస్థితి పెట్టుబడిదారీ హయాం లో అసాధ్యం. పెట్టుబడిదారీ ఉత్పత్తి రూపాన్ని అణగదొక్కడం ద్వారా మాత్రమే, పనిదినం పొడవు అవసర శ్రమ కాలానికి తగ్గగలదు. ఆసందర్భంలో సైతం అవసర శ్రమ కాలపు హద్దులు విస్తరిస్తాయి. ఒకపక్క, జీవితావసర సాధనాల భావన విస్తరించినందువల్ల కార్మికుడు భిన్నమైన జీవన ప్రమాణాన్ని కోరడం వల్లా; మరొకపక్క, ఇప్పుడు అదనపు శ్రమగా ఉన్నది  అప్పుడు అవసర శ్రమలో భాగంగా అవుతున్నందు వల్లా అవసర శ్రమ కాలపు పరిధి పెరుగుతుంది. అది నిల్వ(reserve fund) ఏర్పాటు చెయ్యడం కోసమూ, సంచయనంకోసమూ అని ఇక్కడ తనభావం అంటాడు మార్క్స్.
శ్రమ ఉత్పాదకత ఎంత పెరిగితే, పనిదినాన్ని అంతగా తగ్గించవచ్చు; పనిదినం తగ్గేకొద్దీ, శ్రమ తీవ్రత పెరగవచ్చు. సమాజం వైపు నించి చూస్తే, శ్రమ పొదుపు నిష్పత్తిలోనే శ్రమ ఉత్పాదకతా పెరుగుతుంది.
శ్రమ పొదుపు
శ్రమ పొదుపులో రెండు అంశాలుంటాయి: ఉత్పత్తి సాధనాల పొదుపు. శ్రమ వృధా కాకుండా చూడడం ద్వారా పొదుపు. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ఒకవైపు ప్రతి వ్యష్టి వ్యాపారంలోనూ పొదుపుని బలవంతంగా అమలు చేస్తుంది; చేస్తూనే మరొకవైపు దాని అరాచక పోటీ వ్యవస్థ చేత శ్రమ శక్తినీ, సామాజపు ఉత్పత్తిసాధనాల్నీ అత్యంత దారుణంగా దుర్వ్యయం చేస్తుంది. అసలు అవసరం లేకపొయినా, ప్రస్తుతం తప్పనిసరి అయిన అనేక పనుల్ని కల్పించే విషయం గురించి ప్రత్యేకించి ప్రస్తావించక్కర్లేదు.
శ్రమ ఉత్పాదకత తీవ్రత ఫలా నింతని ఉంటే,  వస్తువుల ఉత్పత్తికి సమాజం ఖర్చు చెయ్యాల్స్ని టైం తగ్గుతుంది. కారణంగా, వ్యక్తులకు బౌద్ధికంగానూ, సామాజికంగానూ అభివృద్ధి చెందేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది.సమాజంలో పనిచేసే శక్తి గల వాళ్ళందరికి మొత్తం పనిని అంతకంతకూ సమానంగా పంచడమూ, ఒక ప్రత్యేక వర్గం తన శ్రమ భారాన్ని సమాజం లోని మరొక పొర భుజాల మీదకు నెట్టే అధికారాన్ని అంతకంతకూ తొలిగించడమూ జరిగే కొద్దీ టైం పెరుగుతుంది. దిశలో, పనిదినం తగ్గింపుకి, శ్రమ సాధారణీకరణే తుది హద్దుని ఏర్పరుస్తుంది. పెట్టుబడిదారీ సమాజంలో ఒక వర్గానికి జీవితకాలాన్ని యావత్తూ శ్రమ కాలంలోకి మార్చడం ద్వారా,  మరొక వర్గానికి విరామ కాలం దొరుకుతుంది.

   వచ్చే పోస్ట్ : అదనపు విలువ రేటు కనుక్కోడానికి వివిధ ఫార్ములాలు  
   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి