9, ఏప్రిల్ 2018, సోమవారం

కార్ఖానాలో శ్రమ విభజనా – సమాజంలో శ్రమ విభజనా


కార్ఖానాలో శ్రమ విభజనా – సమాజంలో శ్రమ విభజనా

కార్ఖానా ఉత్పత్తి పుట్టుక, దానిలోని మామూలు  అంశాలు చూశాం. తర్వాత డిటైల్ శ్రామికుడి గురించీ, అతని పరికరాల గురించీ  తెలుసుకున్నాం. చివరగా మొత్తం యంత్రాంగాన్ని పరిశీలించాం. ఇప్పుడు కార్ఖానా ఉత్పత్తిలో శ్రమ విభజనకూ, సామాజిక శ్రమ విభజనకూ ఉన్న సంబంధాన్ని టూకీగా చూద్దాం.
నాగరిక జాతుల్లో మూడు తరహాల శ్రమవిభజన గమనించవచ్చు:
1.    సాధారణ శ్రమ విభజన (division of labour in general) - సామాజిక ఉత్పత్తి   వ్యవసాయం, పరిశ్రమలు వంటి ప్రధాన భాగాలుగా వేరుపడింది. దీన్ని సాధారణ శ్రమవిభజన అనవచ్చు.
2.      ప్రత్యేక శ్రమ విభజన (division of labour in particular) - వ్యవసాయం పరిశ్రమలు వాటిలో అవి ఉపభాగాలుగా పలుమార్లు విడిపోయాయి. ఇలా విడిపోవడాన్ని ప్రత్యేక శ్రమ విభజన అనవచ్చు.
3.      పాక్షిక/విభాగ శ్రమ విభజన (division of labour in singular or in detai) ఒక వర్క్ షాప్ లో శ్రమ విభజనని పాక్షిక శ్రమ విభజన అనవచ్చు.
ఈవిభజనకి సంబంధించి  స్కార్ బెక్ (1792-1866) మాటల్లో ఫుట్ నోట్ ఇచ్చాడు:
నాగరికత ఒక స్థాయికి చేరిన సమూహాల్లో 3 రకాల శ్రమ విభజన చూస్తాం: మొదటిదాన్ని సాధారణ శ్రమ విభజన అనవచ్చు. అది ఉత్పత్తిదారుల్నివ్యవసాయదారులుగా, వస్తూత్పత్తి దారులుగా, దుకాణదారులుగా విభజిస్తుంది. ఇవి ఆజాతి శ్రమలోని మూడు ప్రధాన శాఖలు. రెండో దాన్ని ప్రత్యేక శ్రమ విభజన అనవచ్చు. ప్రతి శాఖనూ ఉపశాఖలుగా(species) విడగొడుతుంది... మూడోది, కార్ఖానాల్లో, వర్క్ షాపుల్లో శ్రమ విభజన. దీన్ని చర్యల విభజన లేక అసలైన శ్రమ విభజన అనవచ్చు. ఇది విడివిడి చేతివృత్తుల్లో పెంపొంది, అత్యధిక కార్ఖానాల్లో, వర్క్ షాపుల్లో పాతుకుపోయింది.
శ్రమ విభజన అభివృద్ధి
వ్యవసాయమూ, వస్తూత్పత్తీ అత్యంత భిన్నమైనవి. అవి విడిపోవడంతో శ్రమ విభజన మొదలయింది. వస్తూత్పత్తిలో మరల శ్రమ విభజన వచ్చింది. కుమ్మరం, కమ్మరం, వడ్రంగం వగైరాలుగా విడిపోయాయి. తిరిగి ప్రతి ఒక్కటీ విడిపోయాయి.  అయితే దేనికది స్వతంత్ర వృత్తి. పూర్తి వస్తువు తయారవుతుంది. కార్ఖానా ఉత్పత్తి వచ్చాక, ఒక  వస్తువు చెయ్యడం ఒకరి పని కాక, పలువురి పని అయింది. చీలలు చేసే కార్ఖానాలో ఏ ఒక్కడూ పూర్తి గా చీల చేయడు. అయిదారుగురి చేతులు పడితేనే గాని చీల రెడీ కాదు. శ్రమ విభజన క్రమంగా అభివృద్ధి చెందింది.
ఫుట్ నోట్ లో స్టార్క్(1766-1835) మాటలు ఉటంకిస్తాడు మార్క్స్ : శ్రమ విభజన ఆ విభజనకి అత్యంత భిన్నమైన వృత్తుల వేర్పాటుతో మొదలై, కార్ఖానా ఉన్నట్లు ఒకే వస్తువుతయారీని  అనేకమంది మధ్య పంపకమయ్యే శ్రమ విభజనని చేరుకుంటుంది.
సమాజంలో శ్రమ విభజనకీ, కార్ఖానాలో శ్రమవిభజనకీ పోలికలూ తేడాలూ
సమాజంలో శ్రమ విభజనకీ, కార్ఖానాలో శ్రమవిభజనకీ ఉన్న ఉమ్మడి లక్షణాల్ని ముందు చెబుతాడు:.
ఒక సమాజంలో శ్రమ విభజనా, దానికి అనుగుణంగా వ్యక్తులు వేర్వేరు వృత్తులకి కట్టుబడడమూ, దానికదే అభివృద్ధి చెందుతుంది – కార్ఖానా ఉత్పత్తిలోని శ్రమ విభజనలాగానే ఇదీ  విరుద్ధ ఆరంభ బిందువులనుండి అభివృద్ధవుతుంది.
మొదటి అభివృద్ధి పధం:

తెగలో, కుటుంబంలో వయసు తేడాల వల్లా, స్త్రీ పురుష భేదాలవల్లా సహజంగానే శ్రమ విభజన ఏర్పడుతుంది. అది కేవలం శారీరక భేదాలకు అనుగుణమైన శ్రమ విభజన. తెగ విస్తరించడం వల్లనో, జనాభా పెరుదల వల్లనో, మరీ ముఖ్యంగా తెగలమధ్య ఘర్షణల మూలంగా ఒక తెగ మరొక తెగని లోబరుచుకోవడం వల్లనో ఈ విభజన తన సామాగ్రిని విస్తృత పరుస్తుంది.
రెండో అభివృద్ధి పధం:
మరొక పక్క, ఇంతకూ ముందే చెప్పినట్లు వేర్వేరు కుటుంబాలో, తెగలో,సమాజాలో కలిసిన చోట మారంకం జరిగేది. నాగరికత తొలినాళ్ళలో స్వతంత్రులుగా కలుసుకున్నది కుటుంబాలూ, తెగలూ, అంతేకాని ప్రైవేటు వ్యక్తులు కాదు. వేర్వేరు  సమాజాలకు, సహజ పరిసరాలను బట్టి వేర్వేరు జీవనాధార సాధనాలుంటాయి, వేర్వేరు ఉత్పత్తిసాధనాలు ఉంటాయి. అందువల్ల ఉత్పత్తి విధానాలూ,జీవన విధానాలూ భిన్నంగా ఉంటాయి. వాటి వాటి ఉత్పాదితాలుకూడా భిన్నభిన్నంగా ఉంటాయి. అనుకోకుండా పెరిగిన ఈ భిన్నత్వం మూలంగానే భిన్న సమాజాలు కలుసుకున్నప్పుడు  ఉత్పాదితాలు మారకం అవుతాయి. అవి సరుకులవుతాయి.
రెండు అభివృద్ధి పధాల పోలికా, సంబంధమూ
రెండో సందర్భంలో సామాజిక శ్రమ విభజన, పరస్పరం భిన్నమైన, స్వతంత్రమైన ఉత్పత్తిరంగాల మధ్య మారకం నుండి తలెత్తుతుంది. మొదటి సందర్భంలో శారీరక శ్రమ విభజన ఆరంభ బిందువు. ఇతర సమాజాలతో సరుకుల మారకం మూలంగా మొత్తం కట్టగా వున్న ప్రత్యేక అంగాలు సడలిపోయి, విడివడి పోతాయి. తర్వాత ఎంతగానో వేరవుతాయి.
అభివృద్ధి చెందినట్టీ, సరుకుల మారకం ద్వారా ఏర్పడినట్టీ, ప్రతి శ్రమవిభజనకూ ప్రాతిపదిక: పట్టణం, గ్రామం వేరవడం. మొత్తం సమాజపు ఆర్ధిక చరిత్ర ఈ వైరుధ్యం యొక్క చలనంలో క్రోడీకరించవచ్చు. ఇప్పటికైతే ఈవిషయాన్ని పక్కనబెడదాం.-అంటాడు మార్క్స్

సామాజిక శ్రమ విభజనకి జన సాంద్రత భౌతిక అవసరం
కార్ఖానా ఉత్పత్తిలో శ్రమవిభజనకి  ఎక్కువమంది  శ్రామికులు ఒకేచోట నియమితులుకావడం అనేది ముందుగా అవసరం. అలాగే సామాజిక శ్రమ విభజనకి జనసంఖ్యా, జనసాంద్రతా అవసరమైన షరతు. ఇక్కడ జనసంఖ్యా, జనసాంద్రతా అనేవి కార్ఖానా ఉత్పత్తిలో గుమికూడడం వంటివే. మార్క్స్ ఇక్కడ సాంద్రతని వివరిస్తాడు: సాంద్రత అనేది అంతో ఇంతో సాపేక్షమైనది. ఒక దేశంలో జనాభా తక్కువ ఉన్నప్పటికీ, అభివృద్ధి చెందిన రవాణాసాధనాలుండవచ్చు. మరొక దేశంలో ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ అభివృద్ధి చెందిన రవాణాసాధనాలు లేకపోవచ్చు. ఆపరిస్థితుల్లో ఆ జనాభా ఎక్కువ వున్న దేశం  కంటే జనాభా తక్కువ వున్నదేశమే ఎక్కువ సాంద్రత గల దేశంగా లేక్కకొస్తుంది. ఈ అర్ధంలో అమెరికా ఉత్తర రాష్ట్రాలు ఇండియా కంటే దట్టంగా జనం ఉన్నట్లు.
1861 తర్వాత ఇండియాలో పత్తికి డిమాండ్ పెరిగింది. అందువల్ల జనాభా దట్టంగా ఉన్న జిల్లాల్లో పత్తి ఉత్పత్తి విస్తరించింది, ఆమేరకు వరి సాగు తగ్గింది. ఒక జిల్లాలో తగ్గిన లోటు తీర్చేందుకు ఇతరజిల్లాలనుమ్చి దిగుమతి చేసుకోవాలి. అందుకు తగిన రవాణా సాధనాలు లేవు. ఫలితంగా కరువులు లొచ్చాయి. లోపభూయిష్టమైన రవాణా సాధనాలే అందుకు కారణం.
ఇలాంటి విషయాన్నే మరొకచోట చెబుతాడు:
తన ఉత్పత్తుల్ని రవాణా చేయడానికీ , మారకం చేయడానికీ సరైన  సాధనాలూ బొత్తిగా లేనందువల్ల, ఇండియాలో ఉత్పాదక శక్తులు కుంటుబడ్డాయి అనే సంగతి లోకవిదితమే. ప్రకృతి ఇచ్చిన సమృద్ధి మధ్య సమాజంలో దారిద్ర్యం ఇండియాలో కనబడ్డంతగా ఇంకెక్కడా కనబడదు. ఈవిషయం 1848 లో బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్  కమిటీ ముందు రుజువయింది:
‘ ఖాందేష్ లో పావు ధాన్యం 6-8 షిల్లింగులకు అమ్ముతున్నప్పుడు, పూనాలో 64-70 షిల్లింగులుండేది. మట్టి రోడ్లమీద బళ్ళు నడవడం సాధ్యం కాక, ఖాందేష్ నుంచి సరుకులు రాకపోవడం కారణంగా కరువుతో పూనాబజార్లలో  జనం చనిపోతున్నారు.’ ఈ కోట్ J. Dickinson's The Government of India under a Bureaucracy, pp. 81-82 లోది.
Marx & Engels Collected Works. Vol 12.p 219

ముందు సమాజంలో శ్రమవిభజన, తర్వాతనే కార్ఖానాలో శ్రమవిభజన
సరుకుల ఉత్పత్తీ, సరుకుల చలామణీ – ఇవి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి ముందు షరతులు. అలాగే కార్ఖానా ఉత్పత్తిలో శ్రమ విభజనకి  సామాజిక శ్రమవిభజన  ఒకానొక స్థాయికి అభివృద్ధి చెందడం  ముందుగా అవసరం. కార్ఖానా ఉత్పత్తిలో శ్రమ విభజన తిరిగి సామాజిక శ్రమవిభజన మీద ప్రభావం చూపుతుంది. చూపి, సామాజిక శ్రమవిభజనని మరింత హెచ్చుపరిస్తుంది. శ్రమ సాధనాల్లో వైవిధ్యం వస్తూ వుంటుంది. వాటిని తయారు చేసే పరిశ్రమలు అంతకంతకూ వేరువేరు అవుతాయి. ఉదాహరణకి, 17 వ శతాబ్దంలోనే దారపు కండె నాడెల (shuttles) తయారీ ఒక ప్రత్యేక శాఖ అయింది. ఆవిధంగా సామాజిక శ్రమ విభజన అభివృద్ధి చెందుతుంది.
అప్పటికి  ఇతర పరిశ్రమలతో కలిపి ఒక ఉత్పత్తిదారుడు నడిపే ఒక పరిశ్రమని కార్ఖానా వ్యవస్థ పట్టుకుంటే, ఈ పరిశ్రమలు వెంటనే తమ సంబంధాన్ని కోల్పోయి స్వతంత్రమవుతాయి. అది ఒక సరుకు ఉత్పత్తిలో ఒక ప్రత్యేక దశని పట్టుకుంటే, మిగిలిన దశలు అన్ని స్వతంత్ర పరిశ్రమలుగా పరివర్తన చెందుతాయి. ఒక పూర్తి సరుకు కొన్ని భాగాల్ని కలిపి కట్టిన  దయితే, ఆ డిటైల్ చర్యలు విడివడి పోవచ్చు. తిరిగి అచ్చమైన వేర్వేరు చేతివృత్తులుగా రూపొందవచ్చు. కార్ఖానా ఉత్పత్తిలో శ్రమ విభజనని సంపూర్ణపరచడంకోసం, ఒక ఉత్పత్తి శాఖ అనేక కార్ఖానా ఉత్పత్తులుగా విడగొట్టబడుతుంది. వాటిలో కొన్నిపూర్తిగా  కొత్తవి కావచ్చు. ఈ విడగొట్టబడడం అనేది, ఆ శాఖలోని ముడిపదార్ధాల వైవిధ్యాన్ని బట్టీ,ఒకే ముదిపదార్ధం తీసుకునే భిన్న రూపాల్ని బట్టీ ఉంటుంది. ఆవిధంగా 18 వ శతాబ్దం తొలి సగంలో ఒక్క ఫ్రాన్స్ లోనే 100 రకాల సిల్క్ బట్టలు నేసేవాళ్ళు. అవిగ్నాన్ (Avignon)  లో నేర్చుకునేవాడు ఒక రకానికే అంకితుడవాలి, ఏక కాలంలో మరిన్ని రకాలు నేర్చుకో కూడదు అనే చట్టం ఉండేది
ప్రాదేశిక శ్రమ విభజన
కొన్ని ప్రత్యేక ఉత్పత్తి శాఖలు కొన్నిజిల్లాల్లోని  ప్రత్యేక ప్రాంతాలకు పరిమితమవుతాయి. ఈ  ప్రాదేశిక శ్రమ విభజన, ప్రతి ప్రత్యేక అవకాశాన్నీ ఉపయోగించుకునే  కార్ఖానా విధానంలో, సరికొత్త ప్రోద్బలం పొందుతుంది.  ఉన్ని వస్త్రాల్లో నాణ్యమైనవి సోమర్ సెట్ షైర్ లోనూ, ముతకవి యార్క్ షైర్ లోనూ, పొడవాటి ఎల్స్ ఎక్సెటర్ లోనూ, సర్జీలు సుడ్బరీ లోనూ క్రేప్ లు నార్విచ్ లోనూ, నార కలిసిన ఉన్ని బట్టలు కెండాల్ లోనూ, దుప్పట్లు విట్నే లోనూ ఇంకా ఇలా ఉత్పత్తి అవుతున్నాయి.- Berkeley: ―The Querist,‖ 1751
ఇంగ్లాండ్ ఉన్ని ఉత్పత్తి ప్రత్యేక ప్రాంతాలకు కేటాయించబడ్డ  భిన్న శాఖలుగా విభజితం కాలేదు.
వలస వ్యవస్థా, ప్రపంచ మార్కెట్లూ - కార్ఖానా ఉత్పత్తి మనుగడకి అవసరమైన సాధారణ పరిస్థితుల్లో ఇవి కూడా ఉన్నాయి. ఇవి రెండూ సామాజిక శ్రమ విభజన అభివృద్ధికి సామాగ్రి సమకూరుస్తాయి. అంటే సహకరిస్తాయి.
కార్ఖానా ఉత్పత్తి లోని శ్రమ విభజనని గురించి చెప్పాక, మార్క్స్ సమాజంలో శ్రమ విభజనకీ,కార్ఖానా శ్రమవిభజనకీ తేడాలని వివరిస్తాడు. రెండు శ్రమ విభజనలకూ ఎన్నో పోలికలున్నప్పటికీ, అవి స్థాయిలోనూ స్వభావం లోనూ భిన్న మైనవి.ఒక వృత్తికి సంబంధించిన వివిధ శాఖలను కలిపే అదృశ్యబంధం ఉన్నచోట రెంటికున్న పోలిక పేచీలేకుండా స్పష్టంగా కనబడుతుంది.ఉదాహరణకి, పశుపోషకుడు తోళ్ళు(hides) తీస్తాడు, చర్మకారుడు వాటిని పదును చేసి చర్మంగా(leather) చేస్తాడు. చెప్పులు కుట్టేవాడు ఆ చర్మాన్నిబూట్లుగా చేస్తాడు. ఇక్కడ ప్రతివాడూ ఉత్పత్తిచేసిన వస్తువు అంతిమ రూపానికి ఒక మెట్టు మాత్రమే. అంతిమ రూపం ఆముగ్గురి ఉమ్మడి శ్రమ ఉత్పాదితం. దీని పక్కనే, పశుపోషకుడికీ, చర్మకారుడికీ, చెప్పులు కుట్టేవానికీ ఉత్పత్తి సాధనాలు సమకూర్చే వివిధ పరిశ్రమలు ఉండనే ఉన్నాయి.
ఈ ముగ్గురి స్వతంత్ర శ్రమల మధ్య  బంధం ఏర్పరచేది ఏమిటి?
వారి ఉత్పాదితాలు సరుకులు అనే వాస్తవమే. మరొకవైపు, కార్ఖానా ఉత్పత్తిలో శ్రమ విభజనకి లాక్షణికమైనది ఏమిటి?
విభాగ శ్రామికుడు సరుకులు ఉత్పత్తి చెయ్యడు అనే వాస్తవమే. సమాజంలో శ్రమ విభజన భిన్న పరిశ్రమల శాఖల  ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా ఏర్పడుతుంది. ఒక వర్క్ షాప్ లోని  విభాగ చర్యల మధ్య సంబంధం అనేకమంది శ్రామికుల శ్రమ శక్తిని ఒక పెట్టుబడిదారుడు కొని సంయుక్త శ్రమ శక్తిగా ఉపయోగించడం ద్వారా ఏర్పడుతుంది.
ఇక్కడ హాడ్గ్ స్కిన్ మాటలు ఫుట్ నోట్ లో ఉంటాయి:
ప్రతి పనివాడూ మొత్తం పనిలో ఎదో భాగం మాత్రమే చేస్తాడు. ఆ భాగం విలువలేనిది, ఉపయోగంలేనిది. కాబట్టి పనివాడు  ‘ ఇది నేను చేసింది, నేను ఉంచుకుంటాను’ అని అనగలిగింది ఏదీ లేదు.
సమాజంలో శ్రమ విభజనకీ, కార్ఖానా ఉత్పత్తిలో శ్రమ విభజనకీ తేడా అనుభవరీత్యా తెలిసింది. అంతర్యుద్ధకాలంలో వాషింగ్టన్లో  అన్ని పారిశ్రామిక ఉత్పత్తుల మీదా 6 శాతం పన్ను వేశారు.  ప్రశ్న:పారిశ్రామిక ఉత్పత్తి అంటే ఏమిటి? శాసన సభ సమాధానం: ఒక చేయబడినప్పుడు, అది ఉత్పత్తయినట్లు, అమ్మకానికి సిద్ధమైనప్పుడు చేయబడినట్లు. న్యూయార్క్లోనూ, ఫిలడెల్ఫియాలోనూ గొడుగుల తయారీ దారులు వాళ్ళ విదిభాగాలతోనే చేసేవాళ్ళు. అయితే గొడుగు భిన్న రకాల భాగాల కూర్పు. అయినందువల్ల క్రమక్రమంగా అవి వేర్వేరు పరిశ్రమల ఉత్పత్తులుగా విడిపోయాయి. అవన్నీ గొడుగుల కార్ఖానాలోకి వేర్వేరు సరుకులుగా వచ్చేవి. అక్కడ అవి గొడుగుగా అమర్చబడేవి. ఆవిధంగా చేసిన వస్తువుల్ని అమెరికన్లు ‘కూర్చిన వస్తువులు’ (assembled articles)అనేవారు. ఆపేరు దానికి తగినదే. ఎందుకంటే అది పన్నుల కూర్పు అవడం వల్ల. మొదట ఏభాగానికి ఆభాగం మీద 6 శాతమూ, అన్నీ కలిపాక వాటి మొత్తం ధరమీద 6శాతమూ పన్ను కలిసేది.-

ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణా- విడబడడమూ

  • ·       కార్ఖానాలో శ్రమ విభజన అంటే ఒకే పెట్టుబడి దారుడి చేతిలో ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణ ఉన్నట్లు. సమాజంలో శ్రమవిభజన అంటే ఉత్పత్తిసాధనాలు అనేకమంది స్వతంత్ర సరుకుల ఉత్పత్తిదారుల మధ్య చెల్లాచెదురుగా ఉన్నట్లు.
  • ·      కార్ఖానాలో  ఫలానా  పనికి ఫలానింత మంది పనివాళ్ళు ఉండాలనే కఠిననిబంధన ఉంటుంది. కాని సమాజంలో శ్రమవిభజనలో శ్రామికులసంఖ్యకీ, ఉత్పత్తిసాధనాలసంఖ్యకీ  నిబంధనలుండవు. యాదృ చ్ఛికతా పూర్తిగా పనిచేస్తాయి.
  • ·         భిన్న ఉత్పత్తి రంగాలు సమతూకం (equilibrium) వైపు మొగ్గుచూపేది నిజమే: ఎందుకంటే, ఒకవైపు ప్రతి సరుకు ఉత్పత్తిదారుడూ ఏదోఒక సామాజిక అవసరాన్ని తీర్చే ఉపయోగపు విలువని ఉత్పత్తి చెయ్యాల్సుంటాడు. అదే సమయంలో ఈ కోర్కెల పరిధి పరిమాణ రీత్యా భిన్న మైనవి. అయినాగాని,  వాటి నిష్పత్తుల్ని క్రమబద్ధమైన వ్యవస్థగా స్థిరపరిచే అంతః సంబంధం ఉంది. ఆ వ్యవస్థ అనుకోకుండా పెరిగే వ్యవస్థ; మరొకవైపు, సమాజానికున్న కాలంలో  ఏసరుకు ఉత్పత్తిమీద ఎంత పెట్టగలదనే విషయాన్ని సరుకుల విలువ నియమం అంతిమంగా నిర్ణయిస్తుంది. సమతుల్యత వైపు నిరంతరం మొగ్గే పోకడ,  ఈ సమతుల్యతని నిరంతరం తలక్రిందులు చేసే ప్రయత్నానికి ప్రతిచర్యగా ఉంటుంది. కార్ఖానాలో క్రమబద్ధంగా నడిచే శ్రమ విభజన, సమాజంలో శ్రమ విభజన ప్రక్రుతి విధించిన అవసరం అవుతుంది. అది ఉత్పత్తిదారుల నియమరహిత చపలచిత్తతని అదుపులో పెడుతుంటుంది. మార్కెట్ ధరల ఎగుడు దిగుళ్ళలో తెలుస్తుంది.
పెట్టుబడిదారుడి సొంత యంత్రాంగంలో భాగమైన  శ్రామికులమీద అతనికి వివాదమే లేని అధికారం ఉన్నట్లు కార్ఖానా శ్రమ విభజన తెలుపుతుంది. సమాజం లోని సరం విభజన స్వతంత్ర సరుకు ఉత్పత్తి దారుల్ని సంబంధంలో పెడుతుంది. వాళ్ళు పోటీ అనే అధికారాన్ని తప్ప మరి దేన్నీ ఒప్పుకోరు. పరస్పర ప్రయోజనాల ఒత్తిడి పెట్టే నిర్బంధాన్ని తప్ప ఇంకే అధారిటీని గుర్తించరు. జంతు ప్రపంచంలో లాగానే,అందరిమీదా అందరి యుద్ధం అనేది ప్రతి జాతి ఉనికికీ/మనుగడకీ పరిస్థితుల్ని ఇంతో అంతో కాపాడుతున్నట్లుగానే.
కార్ఖానా శ్రమవిభజనని జీవితాంతం ఒకే చిన్న చర్యకు కార్మికుడు కట్టబడి ఉండడాన్ని, పెట్టుబడికి శ్రామికుడు పూర్తిగా అధీనుడై ఉండడాన్ని బూర్జువా మనస్సు మెచ్చుకుంటుంది. ఉత్పాదకతని పెంచే నిర్మాణంగా దాన్ని కొనియాడుతుంది. ఉత్పత్తి ప్రక్రియని సామాజికంగా నియంత్రించే ప్రయత్నాన్ని ఆస్తిమీదా, స్వేచ్చమీదా, వ్యష్టి పెట్టుబడిదారుడి యదేచ్చా వర్తన మీదా దురారాక్రమణ అంటూ అదే బూర్జువా మనస్సు అంతే ఖండితంగా ఖండిస్తుంది. ఫాక్టరీ వ్యవస్థను సమర్ధించే వాళ్ళు సమాజ శ్రమ నిర్వహణని వ్యతిరేకించడం, సమాజాన్ని ఒక భారీ  కార్ఖానాలోకి మార్చే ప్రయత్నం అనడం కన్నా  గర్హనీయమైంది మరొకటి లేదు. ఎందుకంటే కార్ఖానాల్ని ఒకపక్క శ్లాఘిస్తూ మరొకపక్క సమాజాన్ని కార్ఖానాగా మార్చడాన్ని నిందించడం- ఒకదానికొకటి పొసగనివి. 
పెట్టుబడిదారీ శ్రమ విభజనా- అంతకు ముందు శ్రమ విభజనా
పెట్టుబడిదారీ ఉత్పత్తి సాగుతున్న సమాజంలో, సామాజిక శ్రమ విభజనలో అరాచాకత్వమూ, వర్క్ షాప్ శ్రమ విభజనలో     నిరంకుశత్వమూ విధిగా ఉంటాయి.  ఇందుకు భిన్నంగా, వృత్తులు  వేరుపడడం దానంతటదే అభివృద్ధి చెంది, తర్వాత కరుడుకట్టి, అంతిమంగా చట్టం ద్వారా శాశ్వతం చేయబడ్డ  మునుపటి సమాజాల్లో ఉన్నదేమంటే: ఒక వైపు, ఆమోదం పొందిన అధికారికమైన పధకాన్ని బట్టి సామాజిక శ్రమ వ్యవస్థీకరణ యొక్క నమూనాని చూస్తాం. మరొకవైపు వర్క్ షాప్ లో శ్రమ విభజన అసలు లేకపోవడమో, లేక అతి కొద్ది స్థాయిలోనో, చెదురుమదురుగానో యాదృచ్ఛికంగానో అభివృద్ధి అవడం గమనిస్తాం.
ఫుట్ నోట్: సమాజంలో శ్రమవిభజన ఎంత తక్కువగా ఉంటే, వర్క్ షాప్ లోపల శ్రమ విభజన అంత ఎక్కువగా అభివృద్ధి అవుతుంది, అంత ఎక్కువగా ఒకే వ్యక్తి అధికారానికి లోనవుతుంది. ఆవిధంగా శ్రమవిభజనకు సంబంధించి వర్క్ షాప్ లో అధికారమూ, సమాజంలో అధికారమూ ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటాయి - Karl Marx, Misère,‖ &c., pp.130-131  
మరీ పురాతన భారత కమ్యూనిటీలలో (ఒకేచోట నివశించే జన సమూహం/మనుషుల గుంపు) భూమి అందరిదీ. వ్యవసాయమూ, చేతివృత్తులూ కలిసే ఉండేవి. మార్చరాని శ్రమ విభజన ఉండేది. ఒకవేళ కొత్త కమ్యూనిటీ ఏర్పడితే అక్కడకూడా అదే శ్రమ విభజన అమలయ్యేది. ఆ కమ్యూనిటీలకు పై అంశాలు ప్రాతిపదిక. అటువంటి కమ్యూనిటీలు కొన్ని ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 100ఎకరాల నించీ ఎన్నో వేల  ఎకరాల వరకూ విస్తరించి ఉంటాయి. ప్రతిదీ తనకు కావలసిన వస్తువులన్నిటినీ ఉత్పత్తి చేసుకుంటుంది. తన ఉత్పత్తులలో ప్రధాన భాగాన్ని తనే స్వయంగా ఉపయోగించుకోవడం తప్పనిసరి.అంటే  ఆభాగం సరుకు రూపం తీసుకోదు. అందువల్ల మొత్తం భారత సమాజంలో ఉత్పత్తికి  సరుకుల మారకం ద్వారా ఏర్పడ్డ శ్రమవిభజనతో సంబంధం లేదు. అవసరాలకు పోగా ఉన్న  మిగులు మాత్రమే సరుకు అవుతుంది. అందులోనూ కొంత భాగం కౌలుకింద వస్తు రూపంలో రాజ్యానికి చేరాలి. ఈ కమ్యూనిటీల ఏర్పాటు ఇండియాలో వేర్వేరు చోట్ల వేర్వేరుగా ఉంటుంది. సాదా రూపంలోవున్నకమ్యూనిటీల్లో భూమి సాగు ఉమ్మడి గా వుంటుంది. పంట సభ్యులు అందరికీ పంపిణీ అవుతుంది. అదే సమయంలో వడకడమూ, నెయ్యడమూ ఏ కుటుంబానికి ఆ కుటుంబం అనుబంధ పరిశ్రమలుగా చేసేవి. ఒకే పనిలో నిమగ్నమయిన మామూలు జనం పక్కనే ఈ క్రింది వాళ్ళు కూడా ఉండేవాళ్ళు:
  Ø  ప్రధాన గ్రామనివాసి – న్యాయాధికారీ అతనే, పోలీసూ అతనే, పన్నువసూలుదారూ అతనే.
  Ø  లెక్కలు రాసేవాడు – దున్నకం పద్దులు చూస్తాడు, దానికి సంబంధించి ప్రతివిషయాన్నీ నమోదు చేస్తాడు.
  Ø  నేర శిక్షకుడు – నేరస్తులని శిక్షిస్తాడు, కొత్త ప్రయాణీకులకి  రక్షణ కల్పిస్తాడు. పక్క ఊరి దాకా వెంట వెళ్లి క్షేమంగా దిగబెడతాడు.
  Ø   సరిహద్దు రక్షకుడు – పొరుగు వారు జొరబడకుండా సరిహద్దులు కాపాడతాడు. 
  Ø  నీటి పర్యవేక్షకుడు – ఉమ్మడి చెరువుల నీటిని పంట సాగుకోసం పంపిణీ చేస్తాడు.
  Ø  బ్రాహ్మణుడు – మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తాడు.
  Ø  ఉపాధ్యాయుడు – పిల్లలకు ఇసుకలో రాయడం, చదవడం నేర్పుతాడు.
  Ø  పంచాంగ బ్రాహ్మణుడు / జ్యోతిష్కుడు – విత్తనాలు పెట్టడానికీ, పంట కోతకూ, అన్ని ఇతర వ్యవసాయ పనులకూ మంచిరోజులు చెప్తాడు.
  Ø  కమ్మరి , వడ్రంగి  – వ్యవసాయ పనిముట్లు చేస్తారు. చెడిపోతే బాగుచేస్తాడు
  Ø  కుమ్మరి – ఊరికి కావలసిన అన్ని మట్టి పాత్రలూ చేస్తాడు.
  Ø  మంగలి – తలపని చేస్తాడు
  Ø  చాకలి – బట్టలు ఉతుకుతాడు
  Ø  కంసాలి – వెండి ఆభరణాలు చేస్తాడు.
  Ø  కవి – అక్కడక్కడ. కొన్ని కమ్యూనిటీలలో కంసాలి పనీ, మరి  కొన్నిటిలో అధ్యాపకుడి పని చేస్తాడు.
వీళ్ళందరి ఖర్చూ కమ్యూనిటీయే పెట్టుకుంటుంది.
ఒకవేళ జనాభా పెరిగితే, కాళీగా ఉన్న నేలమీద కొత్త కమ్యూనిటీ ఏర్పడుతుంది. ఇది కూడా పాత కమ్యూనిటీ మాదిరిగానే ఉంటుంది. ఈ మొత్తం నిర్మితిలో ఒక క్రమబద్ధమైన శ్రమ విభజన కనబడుతుంది. అయితే అటువంటి విభజన కార్ఖానా ఉత్పత్తిలో అసాధ్యం. ఎందువల్లనంటే, కంసాలి, వడ్రంగి మొదలైనవాళ్ళ మార్కెట్ మారేది కాదు. మహా అయితే ఆయా గ్రామాల సైజుని బట్టి వీళ్ళు ఒకళ్ళు కాక ఇద్దరో ముగ్గురో ఉంటారు. భారతదేశం లోని  వివిధ కమ్యూనిటీల గురించి జార్జ్ కాంప్ బెల్ రచన  Modern India లో మంచి వర్ణన ఉంది –అంటాడు ఫుట్ నోట్ లో.

కమ్యూనిటీలో శ్రమ విభజనని నియంత్రించే నియమం ప్రకృతి నియమం లాగా ఎదురులేకుండా పనిచేస్తుంది. అదే సమయంలో ప్రతి వ్యష్టి వృత్తి దారుడూ - కంసాలి, వడ్రంగి మరెవరైనా కావచ్చు- తన వర్క్ షాప్ లో చేతివృత్తి చర్యలన్నిటినీ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తాడు. అయితే స్వతంత్రగానూ, తనమీద ఎవ్వరి అధికారాన్నీ గుర్తించకుండానూ నిర్వహిస్తాడు. ఈ స్వయం సమృద్ధ కమ్యూనిటీలు అదే రూపంలో తమ్ముతాము పునః సృష్టి చేసుకుంటాయి. ఎప్పుడయినా యాదృచ్ఛికంగా ధ్వంసం అయినప్పుడల్లా, తిరిగి అదే పేరుతొ, అదేచోట తిరిగి తలెత్తుతుంది. ఈ సరళతే ఆసియా గ్రామ సమాజాలు మారకపోవడానికి కీలకం. ఆసియా రాజ్యాల నిరంతర పతన,పునః స్థాపనలకు కొట్టొచ్చినట్లు భిన్నంగా ఈ సమాజాలు మారకుండా ఉంటాయి.
పాలక వంశాలు నిరంతరం మారుతున్నా, గ్రామ సమాజాలు మారవు. అందుకు కీలకం ఉంది. ఏమంటే, రాజకీయ ఆకాశంలో ఏర్పడే తుఫాను మేఘాలు సమాజపు ఆర్ధిక అంశాలను తాకలేవు.    
గిల్డు నిబంధనలు ఒక మేస్త్రీ నియమించే పనివాళ్ళ సంఖ్యని పరిమితం చేశాయి. తద్వారా అతను పెట్టుబడి దారుడు కాకుండా అడ్డుకున్నాయి. అంతే కాదు, అతను మేస్త్రీ కాని ఇతర చేతివృత్తుల్లో తన పనివాళ్ళని నియమించ కూడదు. గిల్డులకి తెలిసిన పెట్టుబడి వర్తక పెట్టుబడి మాత్రమే. అయితే వర్తక పెట్టుబడి చేతివృత్తుల్లోకి చొచ్చుకు రాకుండా పట్టుబట్టి గిల్డులు తిప్పికోట్టేవి. వర్తకుడు ఎసరుకునైనా కొనగలడు, కాని శ్రమశక్తిని సరుకుగా కొనజాలడు. ఎందుకంటే అతను ఏచేతివృత్తిలోనూ మేస్త్రీ కాడుగనక. అతను సరుకుల వ్యాపారిగా ఉన్నాడంటే, గిల్డులు అతన్ని ఉండనిచ్చినందువల్లనే. ఇంకొంత శ్రమవిభజన జరిగితే, అప్పటికున్న  గిల్డులు విడిపోయేవి, వాటి సరసన కొత్త గిల్డులు వచ్చి చేరేవి. అయితే ఇదంతా ఒకే వర్క్ షాప్ లో వివిధ చేతివృత్తులు కేంద్రీకృతం కాకుండా జరిగేది. అందువల్ల చేతివృత్తుల్ని విడగొట్టడం ద్వారా, వేరుచెయ్యడం ద్వారా, లోపరహితం చెయ్యడం ద్వారా గిల్డ్  నిర్మాణం కార్ఖానా ఉత్పత్తి మనుగడకి భౌతిక పరిస్థితుల్ని ఎంతగా దోహదం చేసినప్పటికీ, వర్క్ షాప్ లో శ్రమ విభజనకి అవకాశం ఇవ్వలేదు. 
మొత్తం మీద శ్రామికుడు తన ఉత్పత్తి సాధనాలతో  ఐక్యంగా ఉండేవాడు – నత్త తన గుల్లతో ఉన్నట్లు. అందువల్ల కార్ఖానా ఉత్పత్తికి ప్రధాన ప్రాతిపదిక – శ్రామికుణ్ణి అతని ఉత్పత్తిసాధనాలనుంచి వేరుపరచడమూ, ఆ సాధనాలని పెట్టుబడిలోకి మార్చడమూ – కొరవడి ఉంది. 
సమాజంలో శ్రమ విభజనని తెచ్చింది వర్తకపు  సరుకుల మారకం అయినా, కాకున్నా – సామాజిక శ్రమ విభజన సమాజంలో వివిధ ఆర్ధిక నిర్మాణాలకు ఉమ్మడి అయినదే. కాగా వర్క్ షాప్ లో కార్ఖానాదారుడు తెచ్చే శ్రమవిభజన కేవలం పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం యొక్క ప్రత్యేక సృష్టి.
వచ్చే పోస్ట్ : కార్ఖానా ఉత్పత్తీ – దాని పెట్టుబడిదారీ స్వభావమూ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి